M’Cheyne Bible Reading Plan
అష్షూరు రాజు హిజ్కియాను దుఃఖపెట్టుట
32 హిజ్కియా ఈ పనులన్నీ విశ్వసనీయంగా చేసిన పిమ్మట, అష్షూరు రాజైన సన్హెరీబు యూదా రాజ్యం మీదికి దండెత్తి వచ్చాడు. సన్హెరీబు అతని సైన్యంతో వచ్చి కోటలను మట్టడించి సైనిక స్థావరాలు ఏర్పాటు చేశాడు. అలా చేసి ఆ పట్టణాలను తాను జయించాలని అతడు పన్నాగం పన్నాడు. సన్హెరీబు ఆ పట్టణాలను తాను స్వయంగా గెలవాలని అనుకున్నాడు. 2 యెరూషలేముపై దాడిచేయాటానికే సన్హెరీబు వచ్చాడని హిజ్కియాకు తెలుసు. 3 అప్పుడు హిజ్కియా తన పరిపాలనాధికారులతోను, సైనికాధికారులతోను సంప్రదించాడు. వారు నగరం వెలుపల జలవనరుల నుండి నీటి ప్రవాహాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. పాలనాధికారులు, సైనికాధికారులు హిజ్కియాకు తోడ్పడ్డారు. 4 అనేకమంది ప్రజలు కలిసి జలవనరులన్నీ ఆపివేశారు. దేశం మధ్యగా ప్రవహించే కాలువకు కూడ అడ్డకట్టలు వేశారు. “అష్షూరు రాజు ఇక్కడికి వచ్చినప్పుడు అతనికి కావలసినంత నీరు ఇక్కడ దొరకదు” అని వారనుకున్నారు. 5 హిజ్కియా యెరూషలేమును బలమైన నగరంగా తీర్చిదిద్దాడు. అతడు చేసిన పని ఏమనగా: గోడలు పడిపోయిన చోటల్లా అతడు తిరిగి కట్టించాడు. అతడు గోడలమీద బురుజులు నిర్మింపజేసాడు. మొదటి గోడకు బయటగా మరో గోడను కూడ అతడు నిర్మించాడు. పాత యెరూషలేములో తూర్పు భాగాన అతడు మళ్లీ కోటలు నిర్మించాడు. అతడు అనేక ఆయుధాలను, డాళ్లను తయారు చేయించాడు. 6-7 ప్రజలను నడిపించటానికి వారిపై సైనికాధికారులను నియమించాడు. నగర ద్వారం వద్ద బహిరంగ ప్రదేశంలో అతడీ అధికారులను కలుసుకొన్నాడు. హిజ్కియా ఆ అధికారులతో మాట్లాడి, వారిని ప్రోత్సహించాడు. వారితో అతడిలా అన్నాడు. “మీరు బలంగా, ధైర్యంగా వుండండి. భయపడకండి. అష్షూరు రాజు విషయంలోగాని, అతని మహా సైన్యం విషయంలోగాని మీరు కలత చెందవద్దు. అష్షూరు వారి బలం కంటే మనవద్ద మహాశక్తి సంపద వుంది. 8 అష్షూరు రాజు వద్ద కేవలం మనుష్యల బలమే వుంది. కాని మనవద్ద యెహోవా దైవబలం వుంది. మన దేవుడు మనకు సహాయపడతాడు. మన యుద్ధాలు ఆయనే నిర్వహిస్తాడు!” ఆ విధంగా యూదా రాజైన హిజ్కియా ప్రజలను ఉత్సహపర్చి వారి ధైర్యాన్ని తట్టి లేపాడు.
9 అష్షూరు రాజైన సన్హెరీబు, అతని సైన్యం లాకీషు నగరం దగ్గరగా స్థావరం ఏర్పాటు చేసి దానిని ఓడించాలని వున్నారు. పిమ్మట యూదా రాజైన హిజ్కియా వద్దకు, యెరూషలేములో వున్న యూదా ప్రజల వద్దకు సన్హెరీబు తన సేవకులను పంపాడు. సన్హెరీబు సేవకులు హిజ్కియాకు, యెరూషలేము ప్రజలకు వర్తమానాన్ని పట్టుకు వెళ్లారు.
10 ఆ సేవకులు ఈ విధంగా ప్రకటించారు: “అష్షూరు రాజైన సన్హెరీబు యిలా చెప్పుచున్నాడు: యెరూషలేము ముట్టడిలో వుండగా మీరు దేనిని నమ్ముకొని ఇంకా అక్కడ వుంటున్నారు? 11 హిజ్కియా మిమ్మల్ని మూర్ఖులనుగా చేస్తున్నాడు. యెరూషలేములోనే వుండి ఆకలి దప్పులతో మాడి చనిపోయే విధంగా మీరు మోసగింపబడుతున్నారు. ‘అష్షూరు రాజు నుండి మనల్ని మన ప్రభువైన యెహోవా రక్షిస్తాడు,’ అని హిజ్కియా మీకు చెప్పుచున్నాడు. 12 హిజ్కియా తనకై తాను యెహోవా ఉన్నత స్థలాలను, బలిపీఠాలను తొలగించి వేశాడు. కాని యూదా, యెరూషలేము ప్రజలైన మీకు ఒకే బలిపీఠం మీద పూజచేసి, ధూపం వేయండని చెప్పుచున్నాడు. 13 నిజానికి నేను, నా పూర్వీకులు ఇతర దేశాల ప్రజలకు ఏమి చేసినదీ మీయందరికీ తెలిసినదే. అన్యదేశాల దేవుళ్లు వారి ప్రజలను కాపాడలేక పోయారు. నేను వారి ప్రజలను నాశనం చేయకుండా ఆ దేవుళ్లు నన్ను ఆపలేకపోయారు. 14 నా పూర్వీకులు ఆ రాజ్యలను నాశనం చేశారు. తన ప్రజలను నాశనం చేయకుండా నన్నాపగల దేవుడెవ్వడూ లేడు. కావున మీ దేవుడు నానుండి మిమ్మల్ని కాపాడగలడని మీరనుకుంటున్నారా? 15 హిజ్కియా మిమ్మల్ని మూర్ఖులను చేయటంగాని, మోసపుచ్చటంగాని చేయనీయవద్దు. మీరతనిని నమ్మవద్దు. ఎందువల్లననగా ఏ దేశపు దేవుడే గాని, ఏ రాజ్యపు దేవుడేగాని అతని ప్రజలను నానుండి నా పూర్వీకుల నుండి సురక్షితంగా వుండేలా ఎన్నడూ కాపాడలేడు. కావున మీ దేవుడు మిమ్మల్ని నాశనం చేయకుండ నన్ను ఆపుతాడని మీరు అనుకోవద్దు.”
16 ప్రభువగు యెహోవాకు, దేవుని సేవకుడగు హిజ్కియాకు వ్యతిరేకంగా అష్షూరు రాజు సేవకులు చాలా నీచంగా మాట్లడారు. 17 ఇశ్రాయేలు దేవుడగు యెహోవాను అవమానపరుస్తూ అష్షూరు రాజు లేఖలు కూడ వ్రాశాడు. ఆ లేఖలలో అష్షూరు రాజు యిలా వ్రాశాడు: “నేను అన్యదేశాల ప్రజలను నాశనం చేసేటప్పుడు వారి దేవుళ్లు నన్నాపలేకపోయారు. అలాగే హిజ్కియా దేవుడు కూడ ఆయన ప్రజలను నాశనం చేయకుండ నన్ను ఆపలేడు.” 18 తరువాత అష్షూరు రాజు సేవకులు నగర గోడమీద వున్న యెరూషలేము ప్రజలను చూసి కేకలు పెట్టి అరిచారు. గోడమీద జనాన్ని చూసి ఆ సేవకులు వారికి తెలిసేలా హెబ్రీ భాషలో తిట్టి అరిచారు. అష్షూరు రాజు సేవకులు యెరూషలేము ప్రజలను భయపెట్టేటందుకే అలా చేసారు. యెరూషలేము నగరాన్ని కైవసం చేసికోవాలనే వారలా చేసారు. 19 ప్రపంచ దేశాల ప్రజలు పూజించే దేవుళ్లపట్ల కూడ ఆ సేవకులు చెడుగా మాట్లడారు. కాని ఆ దేవుళ్లు కేవలం మనుష్యులు తమ చేతులతో చేసిన బొమ్మలు. అదేరీతిలో ఆ సేవకులు యెరూషలేము దేవునిపట్ల కూడ నీచంగా మాట్లడారు.
20 రాజైన హిజ్కియా మరియు ఆమోజు కుమారుడు. ప్రవక్తయునగు యెషయా ఈ సమస్య విషయంలో దేవుని ప్రార్థించారు. వారు ఆకాశంవైపు తిరిగి దేవునికి తమ గోడు కష్టాలు చెప్పుకున్నారు. 21 అప్పుడు యెహోవా తన దూత నొకనిని అష్షూరు రాజు ఉండే స్థలానికి పంపించినాడు. ఆ దేవదూత అష్షూరు సైన్యంలోని అందరు సైనికులను, నాయకులను, అధికారులను చంపివేశాడు. దానితో అష్షూరు రాజు పలాయనం చిత్తగించి తన దేశంలోగల తన ఇంటికి పోయాడు. ప్రజలు అతనిని చూసి సిగ్గుపడ్డారు. అతడు తన దేవుని ఆలయానికి వెళ్లగా అక్కడ తన స్వంత కుమారులలో కొందరు అతనిని కత్తులతో నరికి చంపివేశారు. 22 ఆ రకంగా యెహోవా హిజ్కియాను, యెరూషలేము ప్రజలను అష్షూరు రాజైన సన్హెరీబు బారినుండి, ఇతర శత్రువుల బారినుండి రక్షించాడు. యెహోవా హిజ్కియాపట్ల యెరూషలేము ప్రజలపట్ల తగిన శ్రద్ధ తీసుకొన్నాడు. 23 అనేక మంది ప్రజలు యెహోవాకు కానుకలు తీసికొని యెరూషలేముకు వచ్చారు. యూదా రాజైన హిజ్కియాకు కూడా వారు అనేక విలువైన వస్తువులు తెచ్చియిచ్చారు. అప్పటి నుండి హిజ్కియాను అన్ని దేశాల వారు గౌరవించటం మొదలు పెట్టారు.
24 ఆ రోజులలోనే హిజ్కయాకు తీవ్రంగా జబ్బుచేసి చనిపోయే స్థితిలో వున్నాడు. అతడు దేవుని ప్రార్థించాడు. యెహోవా హిజ్కియాతో మాట్లాడి, అతనికి ఒక సూచన[a] ఇచ్చినాడు. 25 కాని హిజ్కియా హృదయం గర్విపడింది. అందువల్ల అతనికి దేవుడు చేసిన మేలుకు అతడు కృతజ్ఞతలు తెలుపలేదు. ఈ కారణంవల్ల దేవుడు హిజ్కియా పట్ల మరియు యూదా, యెరూషలేము ప్రజలపట్ల కోపగించినాడు. 26 కాని హిజ్కియా, యెరూషలేము ప్రజలు మళ్లీ మనస్సు మార్చుకొనినవారై, తమ జీవితాలు మార్చుకున్నారు. వారు విదేయులై గర్వించటం మానుకున్నారు. అందువల్ల హిజ్కియా బ్రతికినంత కాలం దేవుని కోపం వారి మీదికి రాలేదు.
27 హిజ్కియా మహా భాగ్యవంతుడయ్యాడు. గొప్ప గౌరవం లభించింది. వెండి బంగారాలు, విలువైన ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు, డాళ్లు, తదితర వస్తువులు భద్రపర్చటానికి అతడు తగిన స్థానాలు ఏర్పాటు చేశాడు. 28 ధాన్యం, క్రొత్త ద్రాక్షారసం, ప్రజలు తనకు పంపిన నూనెను నిల్వచేయటానికి హిజ్కియా గిడ్డంగులు నిర్మించాడు. అన్ని రకాల పశువులశాలలు, గొఱ్ఱెలకు కొట్టములు కూడ నిర్మించాడు. 29 హిజ్కియా చాలా కొత్త పట్టణాలు నిర్మించాడు. పశుసంపద గొఱ్ఱెల మందలు ఎక్కువగా అభివృద్ధి చేశాడు. యెహోవా హిజ్కియాకు లెక్కలేనంత ఐశ్వర్యాన్ని సమకూర్చినాడు. 30 యెరూషలేములో గిహోను ఎగువ కాలువ ప్రవాహానికి అడ్డుకట్టలు వేసి, నీటిని దావీదు నగరంలో పడమటి దిశన తిన్నగా ప్రవహించేలా మళ్లించినవాడు హిజ్కియాయే. హిజ్కియా చేపట్టిన ప్రతి పనిలోను విజయం సాధించాడు.
31 ఒక పర్యాయం బబులోను పెద్దలు హిజ్కియా వద్దకు దూతలను పంపారు. అప్పుడు దేశాలలో సంభవించిన ఒక అధ్బుత సంఘటన[b] గురించి అడిగి తెలిసికొన్నారు. వారు వచ్చినప్పుడు హిజ్కియా మనస్సులో[c] ఏమున్నదో పరీక్షించి పూర్తిగా తెలిసికొనటానికి అతనిని యెహోవా ఒంటరిగా వదిలినాడు.
32 హిజ్కియా పాలనలో అతడు చేసిన ఇతర కార్యములను గురించి, అతని భక్తి కార్యక్రమాల గురించి యూదా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథం మరియు ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా దర్శనాలలో వ్రాయబడినాయి. 33 హిజ్కియా చనిపోగా అతడు తన పూర్వీకుల వద్ద సమాధి చేయబడినాడు. దావీదు పూర్వీకుల సమాధులున్న కొండమీద ప్రజలు హిజ్కియాను సమాధి చేశారు. హిజ్కియా చనిపోయినప్పుడు యూదా ప్రజలందరు, మరియు యెరూషలేములో నివసిస్తున్నవారు అతనికి ఘనంగా నివాళులర్పించారు. హిజ్కియా స్థానంలో మనష్షే కొత్త రాజయ్యాడు. మనష్షే హిజ్కియా కుమారుడు.
బాబిలోను పతనము
18 ఇది జరిగిన తర్వాత పరలోకం నుండి మరొక దూత దిగి రావటం చూసాను. అతని తేజస్సు భూమిని ప్రకాశింప చేసింది. 2 అతడు బిగ్గరగా యిలా అన్నాడు:
“బాబిలోను మహానగరం
కూలిపోయింది, కూలిపోయింది.
అది అక్కడ దయ్యాలకు నివాసమైంది.
ప్రతి దురాత్మకు అది తిరుగులాడు స్థలమైంది.
ప్రతి ఏవగింపు కలిగించే అపవిత్రమైన పక్షికి
అది సంచరించు స్థలమైంది.
3 దేశాలన్నీ దాని వ్యభిచారమనే మద్యాన్ని త్రాగాయి.
దేవుని ఆగ్రహమనే మద్యాన్ని త్రాగి మత్తెక్కి పోయాయి.
భూరాజులు దాంతో వ్యభిచరించారు. ప్రపంచంలోని వర్తకులు, దాని మితి మీరిన విలాసాలతో ధనవంతులయ్యారు.”
4 ఆ తదుపరి ఇంకొక స్వరం పరలోకంలో నుండి ఈ విధంగా అనటం విన్నాను:
“నా ప్రజలారా! దానిలో నుండి బయటకు రండి.
ఎందుకంటే దాని పాపాల్లో మీరు పాలుపంచుకోరు.
అప్పుడు దానికున్న తెగుళ్ళు మీకు రావు.
5 దాని పాపాలు ఆకాశం అంత ఎత్తుగా పేరుకుపోయాయి.
దేవునికి దాని నేరాలు జ్ఞాపకం ఉన్నాయి.
6 అది యిచ్చింది తిరిగి దానికే యివ్వండి.
అది చేసిన దానికి రెండింతలు దానికి చెల్లించండి.
దాని పాత్రలో రెండింతలు ఘాటుగా ఉన్న మద్యాన్ని పొయ్యండి.
7 ఆ పట్టణం అనుభవించిన పేరు ప్రతిష్ఠలకు సమానంగా
అది అనుభవించిన సుఖాలకు సమానంగా దానికి దుఃఖాలు కలిగించి హింసించండి.
అది తన మనస్సులో, ‘నేను రాణిలా సింహాసనంపై కూర్చుంటాను.
నేను ఎన్నటికీ వితంతువును కాను.
నేను ఎన్నటికీ దుఃఖించను’ అని తనలో గర్విస్తుంది.
8 అందువల్ల చావు, దుఃఖము, కరువు,
తెగులు ఒకేరోజు వచ్చి దాన్ని బాధిస్తాయి.
దానిపై తీర్పు చెప్పే మన ప్రభువైన దేవుడు శక్తివంతుడు
కనుక దాన్ని మంటల్లో కాల్చి వేస్తాడు.
9 “దానితో వ్యభిచరించి సుఖాలనుభవించిన భూరాజులు అది మండుతున్నప్పుడు వచ్చిన పొగలు చూసి దానికోసం గుండెలు బాదుకొని దుఃఖిస్తారు. 10 దానికి జరుగుతున్న హింసను చూసి భయపడి దూరంగా నిలబడి,
‘అయ్యో! అయ్యో! మహానగరమా!
శక్తివంతమైన బాబిలోను నగరమా!
ఒకే ఒక గంటలో నీకు నాశనం వచ్చింది’
అని విలపిస్తారు.
11 “ప్రపంచంలోని వర్తకులు తమ వస్తువులు యిక మీదట కొనేవారు ఎవ్వరూ ఉండరు కనుక తమ నష్టానికి దానిమీద విలపిస్తారు. 12 వీళ్ళు బంగారు, వెండి వస్తువులు, రత్నాలు, ముత్యాలు, సున్నితమైన నార బట్టలు, ఊదారంగు వస్త్రాలు, పట్టు వస్త్రలు, ఎర్రటి రంగుగల వస్త్రాలు, దబ్బచెట్ల పలకలు, దంతంతో, మంచి చెక్కతో, కంచుతో, ఇనుముతో, చలువరాతితో చేసిన అన్ని రకాల వస్తువులు, 13 దాల్చిన చెక్క, ఓమము, అగరుబత్తులు, మంచి అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, ఒలీవ నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు, గుర్రాలు, బండ్లు, బానిసలు, మనుష్యుల శరీరాలు, ప్రాణాలు అమ్మేవాళ్ళు. 14 వాళ్ళు,
‘నీవు కోరిన ఫలము దొరకలేదు.
నీ ఐశ్వర్యము, నీ భోగము నశించిపొయ్యాయి.
అవి మళ్ళీ రావు’
అని అన్నారు.
15 “వస్తువులు అమ్మి ధనం గడించిన వర్తకులు ఆమె అనుభవిస్తున్న హింసను చూసి భయపడి దూరంగా నిలుచుంటారు. వాళ్ళు దుఃఖంతో విలపిస్తారు. 16 వాళ్ళు,
‘అయ్యో! అయ్యో! సున్నితమైన వస్త్రాల్ని,
ఊదారంగు వస్త్రాల్ని, ఎర్రటి రంగు వస్త్రాల్ని ధరించిన మహానగరమా!
బంగారుతో, రత్నాలతో, ముత్యాలతో చేసిన
నగలు ధరించిన మహానగరమా!
17 ఒకే ఒక గంటలో నీ ఐశ్వర్యమంతా నశించిపోయిందే!’
అని విలపిస్తారు.
“ప్రతి నావికాధికారి, ఓడలో ప్రయాణం చేసే ప్రతి యాత్రికుడు, నావికులు, సముద్రం ద్వారా తమ జీతం గడించి జీవించే వాళ్ళు అందరూ దూరంగా నిలబడి ఉన్నారు. 18 ఆ పట్టణం కాలుతున్నప్పుడు వచ్చే పొగలను చూసి వాళ్ళు ఆశ్చర్యంతో, ‘ఈ మహానగరమంత గొప్పగా ఏ పట్టణమైనా ఉందా?’ అని అంటారు. 19 వాళ్ళు దుఃఖంతో విలపిస్తూ, దుమ్మును నెత్తిన వేసుకొంటూ,
‘అయ్యో! అయ్యో! మహానగరమా!
సముద్రంలో ఓడ ఉన్న ప్రతి ఒక్కడూ దాని ధనంవల్ల ధనికులయ్యారే!
ఒకే ఒక గంటలో ఆమె నాశనమయ్యిందే! అని ఏడుస్తారు.
20 పరలోకమా! దాని పతనానికి ఆనందించు!
విశ్వాసులారా! అపొస్తలులారా! ప్రవక్తలారా! ఆనందించండి.
అది మీతో ప్రవర్తించిన విధానానికి దేవుడు దానికి తగిన శిక్ష విధించాడు’”
అని అంటారు.
21 అప్పుడు ఒక శక్తివంతుడైన దూత తిరుగటిరాయి వంటి పెద్దరాయిని ఎత్తి సముద్రంలో పారవేసి ఈ విధంగా అన్నాడు:
“గొప్ప శక్తితో బాబిలోను మహానగరం క్రిందికి పారవేయబడుతుంది.
అది మళ్ళీ కనిపించదు.
22 వీణను వాయించేవాళ్ళ సంగీతం, యితర వాయిద్యాలు వాయించేవాళ్ళ సంగీతం, పిల్లనగ్రోవి ఊదేవాళ్ళ సంగీతం, బూర ఊదేవాళ్ళ సంగీతం, నీలో మళ్ళీ వినిపించదు.
పని చేయగలవాడు నీలో మళ్ళీ కనిపించడు.
తిరుగటి రాయి శబ్దం మళ్ళీ నీలో వినిపించదు.
23 దీపపు కాంతి నీలో మళ్ళీ ప్రకాశించదు.
కొత్త దంపతుల మాటలు నీలో మళ్ళీ వినిపించవు.
నీ వర్తకులు ప్రపంచంలో గొప్పగా ఉన్నారు.
నీ గారడీలతో దేశాలు తప్పుదారి పట్టాయి.
24 ఆ పట్టణంలో ప్రవక్తల రక్తం, పవిత్రుల రక్తం కనిపించింది.
ప్రపంచంలో వధింపబడిన వాళ్ళందరి రక్తం, ఆ పట్టణంలో కనిపించింది.”
తీర్పు రోజు
14 చూడండి. తీర్పుతీర్చటానికి యెహోవాకు ఒక రోజు ఉంది. మీరు తీసుకున్న ధనం మీ నగరంలో విభజించబడుతుంది. 2 యెరూషలేము మీదికి దేశాలన్నిటినీ నేను రప్పిస్తాను. వారు నగరాన్ని పట్టుకొని ఇండ్లన్నీ నాశనం చేస్తారు. స్త్రీలు మానభంగం చేయబడతారు. జనాభాలో సగం మంది బందీలుగా పట్టుకుపోబడతారు. కాని, మిగిలిన ప్రజలు నగరంనుండి తీసుకుపోబడరు. 3 అప్పుడు యెహోవా ఆయా దేశాలపైకి యుద్ధానికి వెళతాడు. అది నిజమైన యుద్ధం అవుతుంది. 4 ఆ సమయంలో ఆయన యెరూషలేముకు తూర్పున వున్న ఒలీవల కొండమీద నిలబడతాడు. ఒలీవల కొండ రెండుగా చీలి పోతుంది. ఆ కొండలో ఒక భాగం ఉత్తరానికి, మరొక భాగం దక్షిణానికి తిరుగుతాయి. తూర్పునుండి పడమటికి ఒక లోతైన లోయ ఏర్పడుతుంది. 5 ఆ పర్వతలోయ మీకు మరి సన్నిహితంగా రావటంతో మీరు పారిపోవటానికి ప్రయత్నిస్తారు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం వచ్చినప్పుడు మీరు పారిపోయిన రీతిగా మీరిప్పుడు పారిపోతారు. కాని, నా దేవుడైన యెహోవా వస్తాడు. ఆయనయొక్క పవిత్ర జనులందరూ ఆయనతో ఉంటారు.
6-7 అది ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజున వెలుతురుగాని, చలిగాని, మంచుగాని వుండవు. అప్పుడు పగలూ వుండదు, రాత్రీ వుండదు. అది ఎట్లాగో యెహోవా ఒక్కనికే తెలుసు. అప్పుడు మామూలుగా చీకటి పడేటప్పడు ఇంకా కొంత వెలుతురు ఉంటుంది. 8 ఆ సమయంలో యెరూషలేమునుండి నీరు ఎడతెరిపి లేకుండా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం రెండు పాయలై ఒకటి తూర్పుగా పారుతుంది. రెండవది పడమటిగా మధ్యధరా సముద్రంవైపు ప్రవహిస్తుంది. అది సంవత్సరం పొడవునా వేసవిలోను, శీతాకాలంలోను ప్రవహిస్తుంది. 9 ఆ సమయంలో యెహోవా ప్రపంచానికంతటికి రాజుగా వుంటాడు. యెహోవా ఒక్కడే. ఆయనకు పేరు ఒక్కటే. 10 అప్పుడు యెరూషలేము చుట్టూ వున్న ప్రాంతమంతా అరాబా ఎడారిలా నిర్మానుష్య మవుతుంది. గెబ నుండి దక్షిణాన రిమ్మోను వరకు దేశం ఎడారిలా మారిపోతుంది. కాని యెరూషలేము నగరమంతా బెన్యామీను ద్వారం నుండి మొదటి ద్వారం (మూల ద్వారం) వరకు, మరియు హనన్యేలు బురుజు నుండి రాజు యొక్క ద్రాక్ష గానుగల వరకు మళ్లీ నిర్మింపబడుతుంది. 11 నిషేధం తొలగింపబడుతుంది. ప్రజలు మళ్లీ అక్కడ ఇండ్లు కట్టుకుంటారు. యెరూషలేము సురక్షితంగా ఉంటుంది.
12 కాని యెరూషలేముతో యుద్ధం చేసిన దేశాలన్నిటినీ యెహోవా శిక్షిస్తాడు. ఆ మనుష్యులకు ఒక భయంకర వ్యాధి సోకేలా ఆయన చేస్తాడు. ఆ జనులు జీవించి వుండగానే వారి శరీరాలు కుళ్లిపోవటం ప్రారంభిస్తాయి. వారి కండ్లు కనుగుంటలలోనే కుళ్లిపోతాయి. నాలుక నోటిలోనే కుళ్లనారంభిస్తుంది. 13-15 ఆ భయంకర వ్యాధి శత్రు స్థావరంలో ప్రబలుతుంది. పైగా వారి గుర్రాలు, కంచర గాడిదలు, ఒంటెలు మరియు గాడిదలు కూడ ఆ భయంకర వ్యాధికి గురౌతాయి.
ఆ సమయంలో ఆ ప్రజలు యెహోవా అంటే నిజంగా భయపడతారు. వారు ఒకరి కొకరు విరోధులై, ఒకరినొకరు పట్టుకుంటారు. యూదా ప్రజలు కూడా యెరూషలేముకు విరుద్ధంగా యుద్ధం చేస్తారు. నగరం చుట్టూవున్న దేశాలనుండి వారికి ధనం లభిస్తుంది. వారికి బంగారం, వెండి, బట్టలు విస్తారంగా లభిస్తాయి. 16 యెరూషలేముపై యుద్ధానికి వచ్చినవారిలో కొంతమంది బ్రతుకుతారు. వారు ప్రతి సంవత్సరం రాజును, సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించటానికి వస్తారు. పర్ణశాలల పండుగను చేసుకోటానికి వారు వస్తారు. 17 ఈ భూమిమీద ఏ వంశంవారైనా సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించటానికి యెరూషలేముకు వెళ్ళకపోయినట్లయితే, యెహోవా వారికి వర్షాలు లేకుండా చేస్తాడు. 18 ఈజిప్టు (ఐగుప్తు) నుండి ఏ వంశంవారైనా పర్ణశాలల పండుగ జరుపుకోటానికి రాకపోయినట్లయితే, యెహోవా శత్రు దేశాలకు సంభవింపజేసిన ఆ భయంకర వ్యాధి వారికి సోకేలా చేస్తాడు. 19 పర్ణశాలల పండుగ జరుపుకోటానికి రానటువంటి ఈజిప్టుకు, మరి ఏ ఇతర దేశానికైనా అదే శిక్ష.
20 ఆ సమయంలో ప్రతిదీ దేవునికి చెందివుంటుంది. గుర్రాలమీది జీనులకు కూడ “యెహోవాకు పవిత్రమైనది” అని వ్రాసిన చీటీలు కట్టబడతాయి. బలిపీఠంవద్ద వుంచబడిన గిన్నెలవలె యెహోవా ఆలయంలో వాడబడే పాత్రలన్నీ ప్రాముఖ్యంగల వస్తువులే. 21 వాస్తవానికి యెరూషలేము, యూదాలలోగల ప్రతి పాత్రమీద “సర్వశక్తిమంతుడైన యెహోవాకు పవిత్రమైనది” అని వ్రానిన చీటి అంటించబడుతుంది. యెహోవాను ఆరాధించే ప్రతి వ్యక్తి ఆ పాత్రలలో వండి, తినగలిగినవారై ఉంటారు.
ఆ సమయంలో సర్వశక్తిమంతుడైన యెహోవా ఆలయంలో క్రయవిక్రయాలు జరిపే వ్యాపారస్తులెవ్వరూ వుండరు.
యేసు తనకోసం, తన శిష్యులకోసం ప్రార్థించటం
17 ఆ తర్వాత యేసు ఆకాశం వైపు చూసి ఈ విధంగా ప్రార్థించాడు: “తండ్రి! సమయం వచ్చింది. నీ కుమారునికి మహిమ కలిగించు. అప్పుడు కుమారుడు నీకు మహిమ కలిగిస్తాడు. 2 ప్రజలందరిపై కుమారునికి అధికారమిచ్చావు. నీవు అప్పగించిన వాళ్ళకు, ఆయన అనంత జీవితం యివ్వాలని నీ ఉద్దేశ్యం. 3 నీవు మాత్రమే నిజమైన దేవుడవు. నిన్నూ, నీవు పంపిన ‘యేసుక్రీస్తు’ను తెలుసుకోవటమే అనంత జీవితం. 4 పూర్తి చేయుమని నీవు నాకు అప్పగించిన కార్యాన్ని పూర్తిచేసి ఈ ప్రపంచంలో నీకు మహిమ కలిగించాను. 5 తండ్రీ! ఈ ప్రపంచం ఆరంభం కాక ముందు నీతో పాటు నాకు కూడా మహిమ ఉండేది. ఇప్పుడు ఆ మహిమ నీ సమక్షంలో నాకు కలిగేటట్లు చేయుము.
6 “ఈ ప్రపంచంలో నీవు నాకు అప్పగించిన వాళ్ళకు నిన్ను గురించి తెలియ చేసాను. వాళ్ళు నీ వాళ్ళు. కాని వాళ్ళను నీవు నాకు అప్పగించావు. వాళ్ళు నీ సందేశాన్ని పాటించారు. 7 నీవు నాకు ఎన్నోయిచ్చావు. అవన్నీ నాకిచ్చినావని వాళ్ళకిప్పుడు తెలిసింది. 8 ఎందుకంటే, నీవు నాకు చెప్పిన సందేశాన్ని వాళ్ళకు చెప్పాను. వాళ్ళు దాన్ని అంగీకరించారు. నేను నిజంగా నీ నుండి వచ్చానని వాళ్ళకు తెలుసు. నీవు నన్ను పంపావన్న విశ్వాసం యిప్పుడు వాళ్ళలో కలిగింది. 9 నేను వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. ప్రపంచాని కోసం ప్రార్థించటం లేదు. నీవు నాకు అప్పగించిన వాళ్ళు నీ వాళ్ళు కావాలని ప్రార్థిస్తున్నాను. 10 నావన్నీ నీవి, నీవన్నీ నావి. నా వాళ్ళ ద్వారా నాకు మహిమ కలుగుతోంది.
11 “నేనీ ప్రపంచంలో యిక ఉండను. కాని వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉన్నారు. నేను నీ దగ్గరకు రాబోతున్నాను. ఓ తండ్రీ! నీలో పవిత్రత ఉంది. నీవు నాకిచ్చిన, నీ నామంలో ఉన్న మహిమతో వాళ్ళను రక్షించు. అలా చేస్తే మనం ఒకటిగా ఉన్నట్లు వాళ్ళు కూడా ఒకటిగా ఉంటారు. 12 నేను వాళ్ళతో ఉన్నప్పుడు, నీవు నా కిచ్చిన నామంతో వాళ్ళను రక్షించి కాపాడాను. లేఖనాల్లో వ్రాసినవి నిజం కావటానికి నాశనం కావలసిన వాడు తప్ప మరెవ్వరూ నాశనం కాలేదు.
13 “నేను నీ దగ్గరకు వస్తున్నాను. నా ఆనందం వాళ్ళ హృదయాల్లో పూర్తిగా నిండి పోవాలని నేనీ ప్రపంచంలో ఉన్నప్పుడే ఈ విషయాలు చెబుతున్నాను. 14 నీ సందేశం నా శిష్యులకు చెప్పాను. నేను ఈ ప్రపంచానికి చెందిన వాణ్ణి కాదు. అదే విధంగా నా శిష్యులు కూడా ఈ ప్రపంచానికి చెందిన వాళ్ళు కాదు. కనుక ప్రపంచం వాళ్ళను ద్వేషిస్తుంది.
15 “వాళ్ళనీ ప్రపంచం నుండి తీసుకు వెళ్ళమని నేను ప్రార్థించటం లేదుగాని దుర్మార్గుని నుండి వాళ్ళను రక్షించుమని ప్రార్థిస్తున్నాను. 16 నేను ఏ విధంగా ఈ ప్రపంచానికి చెందనో అదే విధంగా వాళ్ళు కూడా ఈ ప్రపంచానికి చెందరు. 17 సత్యంలో వారిని పవిత్రపరచు, నీ వాక్యమే సత్యం. 18 నీవు నన్ను ఏ విధంగా పంపావో, అదే విధంగా వాళ్ళను నేను ఈ ప్రపంచంలోనికి పంపాను. 19 వాళ్ళ కోసం నన్ను నేను ప్రత్యేకపరచు కొన్నాను. వాళ్ళు కూడా నిజంగా ప్రత్యేకించబడాలని నా ఉద్దేశ్యం.
20 “నా ప్రార్థన వాళ్ళ కోనం మాత్రమే కాదు. వాళ్ళ సందేశం ద్వారా నన్ను విశ్యసించే వాళ్ళ కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. 21 తండ్రీ! నేను నీలో, నీవు నాలో ఉన్నట్లే వాళ్ళందరూ ఒకటిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నీవు నన్ను పంపినట్లు ఈ ప్రపంచం నమ్మాలంటే వాళ్ళను కూడా మనలో ఐక్యం చేయుము. 22 మనము ఒకటిగా ఉన్నట్లు వాళ్ళు కూడా ఒకటిగా ఉండాలని, నీవు నాకిచ్చిన మహిమను నేను వాళ్ళకిచ్చాను. 23 నేను వాళ్ళలో ఉన్నాను. నీవు నాలో ఉన్నావు. వాళ్ళలో సంపూర్ణమైన ఐక్యత కలిగేటట్లు చేయుము. అలా చేస్తే నీవు నన్ను పంపావని, నన్ను ప్రేమించినంతగా వాళ్ళను కూడా ప్రేమించావని ప్రపంచానికి తెలుస్తుంది.
24 “తండ్రీ! నీవు నాకు అప్పగించిన వాళ్ళు నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచం పుట్టక ముందు నుండి నన్ను ప్రేమించావు. నాకు మహిమను ఇచ్చావు. ఆ మహిమను వాళ్ళు చూడాలని నా అభిలాష. 25 నీతి స్వరూపుడవగు తండ్రీ! ప్రపంచానికి నీవెవరవో తెలియక పోయినా నీవు నాకు తెలుసు. నీవు నన్ను పంపావని వీళ్ళకు తెలుసు. 26 నీవెవరవో వాళ్ళకు తెలియచేసాను. తెలియచేస్తూ ఉంటాను. నాయందు నీకున్న ప్రేమ వాళ్ళయందు కూడా ఉండాలని, వాళ్ళలో నేను స్వయంగా ఉండాలని నా ఉద్దేశ్యం.”
© 1997 Bible League International