Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 17

యూదారాజుగా యెహోషాపాతు

17 ఆసా స్థానంలో యెహోషాపాతు యూదాకు కొత్తగా రాజయ్యాడు. యెహోషాపాతు ఆసా కుమారుడు. యెహోషాపాతు యూదా రాజ్యాన్ని ఇశ్రాయేలుతో పోరాడగల శక్తిగలదిగా రూపొందించాడు. కోటలుగా మార్చబడిన పట్టణాలన్నిటిలో అతడు సైనిక స్థావరాలను ఏర్పాటు చేశాడు. యెహోషాపాతు యూదాలోను, తన తండ్రియైన ఆసా వశపర్చుకున్న ఎఫ్రాయిము పట్టణాలలోను కోటలు నిర్మించాడు.

యెహోవా యెహోషాపాతు పక్షాన వున్నాడు. ఎందువల్లనంటే, యెహోషాపాతు చిన్న వాడైనప్పటికి, తన పూర్వీకుడైన దావీదు చేసిన మంచి పనులన్నీ చేశాడు. యెహోషాపాతు బయలు విగ్రహాలను పూజించలేదు. తన పూర్వీకులు అనుసరించిన యెహోవా కోసమే యెహోషాపాతు నిరీక్షించాడు. అతడు దేవుని ఆజ్ఞలను పాటించాడు. ఇశ్రాయేలు ప్రజలు జీవించిన విధంగా అతడు జీవనాన్ని గడపలేదు. యూదాపై యెహోషాపాతును ఒక శక్తివంతమైన రాజుగా దేవుడు చేశాడు. యూదా ప్రజలంతా యెహోషాపాతుకు కానుకులు సమర్పించారు. ఆ విధంగా యెహోషాపాతుకు ఎక్కువ ధనం, గౌరవం లభించాయి. యెహోవా మార్గాల ననుసరించటానికి యెహోషాపాతు హృదయం సంతోషంతో యిష్టపడింది. అతడు ఉన్నత స్థలాలను, అషేరా దేవతా స్తంభాలను యూదా రాజ్యం నుండి తీసివేశాడు.

యెహోషాపాతు కొందరు పెద్దలను యూదా రాజ్యంలో ధర్మశాస్త్రాన్ని బోధించేందుకు పంపించాడు. అది యెహోషాపాతు పాలనలో మూడవయేట[a] జరిగింది. ఆ పెద్దలు ఎవరంటే బెన్హయీలు, ఓబద్యా, జెకర్యా, నెతనేలు, మరియు మీకాయా. ఈ పెద్దలతో పాటు యెహోషాపాతు లేవీయలను కూడ పంపాడు. ఆ లేవీయులు ఎవరంటే షెమయా, నెతన్యా, జెబద్యా, అశాహేలు, షెమిరామోతు, యెహోనాతాను, అదోనీయా, మరియు టోబీయా. యెహోషాపాతు యాజకులైన ఎలీషామా, యెహోరాములను కూడా పంపాడు. ఆ పెద్దలు, లేవీయులు, యాజకులు యూదాలో ప్రజలకు బోధించారు. వారి వద్ద యెహోవా ధర్మ శాస్త్ర గ్రంథం వుంది. వారు యూదా పట్టణాలన్నిటికీ వెళ్లి ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించారు.

10 యూదా పొరుగు రాజ్యాల వారు యెహోవాకు భయపడ్డారు. అందువల్ల వారు యెహోషాపాతుపై యుద్ధం ప్రకటించలేదు. 11 కొంతమంది ఫిలిష్తీయులు యెహోషాపాతుకు కానుకలు తెచ్చారు. వారు యెహోషాపాతుకు వెండిని కూడా తెచ్చారు. కారణమేమంటే యెహోషాపాతు చాలా శక్తివంతుడైన రాజని వారికి తెలియటమే. అరబీయులు కొందరు గొర్రెల మందలను యెహోషాపాతుకు కానుకలుగా తెచ్చారు. వారు ఏడువేల ఏడు వందల గొర్రెపొట్టేళ్ళను ఏడువేల ఏడు వందల మేకలను తెచ్చారు.

12 యెహోషాపాతు రాను రాను చాలా బలమైన రాజుగా రూపొందాడు. అతడు యూదా రాజ్యంలో కోటలను, గిడ్డంగుల పట్టణాలను కట్టించాడు. 13 సరుకు నిల్వచేసే ఆ పట్టణాలకు నిత్యావసర, తదితర సామగ్రిని అతడు బాగా రవాణా చేశాడు. బాగా శిక్షణ పొందిన సైనికులను యెరూషలేములో యెహోషాపాతు వుంచాడు. 14 ఈ సైనికులువారి పితరుల వంశాలలో చేర్చబడినవారు. యెరూషలేములో వున్న సైనికుల వివరాలు ఏవనగా:

యూదా వంశం నుండి నియమింపబడిన వారిలో సేనాధిపతులున్నారు. అద్నా క్రింద మూడు లక్షల మంది సైనికులున్నారు.

15 యెహోహానాను రెండు లక్షల ఎనబై వేలమంది వున్న సేనకు అధిపతి.

16 అమస్యా రెండు లక్షల మంది సైనికులకు అధిపతి. అమస్యా జిఖ్రీ కుమారుడు. అతడు యెహోవా సేవకు సంతోషంతో అంకితమయ్యాడు.

17 బెన్యామీను వంశం నుండి ఎంపిక చేయబడిన సేనాధిపతుల వివరాలు.

ఎల్యాదా క్రింద విల్లంబులు, డాళ్లు పట్టగల రెండు లక్షల మంది సైనికులున్నారు. ఎల్యాదా మిక్కిలి ధైర్యశాలియైన సేనాని.

18 యెహోజాబాదు క్రింద యుద్ధ సన్నద్ధులైన లక్షా నలబై వేల మంది సైనికులున్నారు.

19 ఈ సైనికులంతా రాజైన యెహోషాపాతుకు సేవ చేశారు. రాజుకు యూదాలో వున్న అన్ని కోటలలో ఇతర సైనికులున్నారు.

ప్రకటన 6

ముద్రలు

ఆ గొఱ్ఱెపిల్ల ఆ ఏడింటిలో మొదటి ముద్రను తెరవటం చూసాను. ఆ నాలుగు ప్రాణుల్లో ఒక ప్రాణి “రా!” అని ఉరుముతూ అనటం విన్నాను. నా ముందు ఒక తెల్లటి గుఱ్ఱం కనిపించింది. దానిమీద స్వారి చేస్తున్నవాడు విల్లు పట్టుకొని ఉన్నాడు. అతనికి ఒక కిరీటం యివ్వబడింది. అతడు విజయం సాధించాలని నిర్ణయించుకొన్న వీరునిలా స్వారి చేస్తూ యుద్ధరంగానికి వెళ్ళిపోయాడు.

ఆ గొఱ్ఱెపిల్ల రెండవ ముద్రను తీసినప్పుడు రెండవ ప్రాణి “రా!” అని అనటం విన్నాను. అప్పుడు యింకొక గుఱ్ఱం వెలుపలికి వచ్చింది. అది ఎఱ్ఱటి రంగులో ఉంది. భూమ్మీద శాంతి లేకుండా చేయటానికి, మానవులు ఒకరినొకరు వధించుకొనేటట్లు చేయటానికి, దాని రౌతుకు అధికారం యివ్వబడింది. అతనికి ఒక పెద్ద ఖడ్గం యివ్వబడింది.

ఆ గొఱ్ఱెపిల్ల మూడవ ముద్రను తీసినప్పుడు మూడవ ప్రాణి “రా!” అని అనటం విన్నాను. నా ముందు ఒక నల్లటి గుఱ్ఱం కనిపించింది. దాని రౌతు చేతిలో ఒక తక్కెడ ఉంది. అప్పుడు ఆ నాలుగు ప్రాణులనుండి ఒక స్వరం, “ఒక దేనారమునకు ఒక సేరు గోధుమలు, ఒక దేనారమునకు మూడు సేర్లు యవలు; నూనెను, ద్రాక్షారసమును పాడు చేయవద్దు!” అని అనటం వినిపించింది.

ఆ గొఱ్ఱెపిల్ల నాల్గవ ముద్రను తీసినప్పుడు నాల్గవ ప్రాణి “రా!” అని అనటం విన్నాను. అక్కడ నా ముందు పాలిపోయినట్టుగా ఉన్న ఒక గుఱ్ఱం కనిపించింది. దాని రౌతు పేరు “మృత్యువు.”[a] మృత్యులోకము వానిని అనుసరిస్తూ వాని వెనుకనే ఉంది. భూమి నాల్గవ వంతుపై అతనికి అధికారం యివ్వబడింది. కత్తితో, కరువుతో, తెగులుతో, క్రూర మృగాలతో భూనివాసులను చంపటానికి అతనికి అధికారం యివ్వబడింది.

ఆ గొఱ్ఱెపిల్ల ఐదవ ముద్రను తీసినప్పుడు, వధింపబడిన ఆత్మల్ని బలిపీఠం క్రింద చూసాను. వీళ్ళు దేవుని సందేశాన్ని బోధించటంవల్ల మరియు సాక్ష్యం చెప్పటంవల్ల వధింపబడినవాళ్ళు. 10 వాళ్ళు పెద్ద స్వరంతో, “మహా ప్రభూ! నీవు పరిశుద్ధుడవు, సత్యవంతుడవు. ఈ భూమ్మీద నివసించేవాళ్ళపై తీర్పు చెప్పటానికి, మా రక్తము నిమిత్తము పగ తీర్చుకోవటానికి యింకా ఎంతకాలం పడ్తుంది?” అని అన్నారు. 11 ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ఒక తెల్లటి వస్త్రం యివ్వబడింది. “మీరు చంపబడినట్లే, మీ తోటి సేవకులు, సోదరులు చంపబడతారు. వాళ్ళ సంఖ్య ముగిసే వరకు మీరు మరికొంత కాలం కాచుకొని ఉండాలి” అని వాళ్ళకు తెలుపబడింది.

12 ఆయన ఆరవ ముద్రను విప్పుతూ ఉంటే నేను చూసాను. ఒక పెద్ద భూకంపం కలిగింది. గొఱ్ఱె బొచ్చుతో చేసిన గొంగళిలాగా, సూర్యగోళం నల్లగా మారిపోయింది. పున్నమి చంద్రబింబం ఎఱ్ఱటి రక్తంలా మారిపోయింది. 13 తీవ్రంగా గాలి వీచినప్పుడు, కాలం కాని కాలంలో కాచిన అంజూరపు పండ్లు క్రింద పడినట్లు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు భూమ్మీద పడ్డాయి. 14 ఆకాశం కాగితంలా చుట్టుకుపోయి మాయమైపోయింది. అన్ని పర్వతాలు, ద్వీపాలు స్థానం తప్పాయి.

15 అప్పుడు ఈ భూమిని పాలించే రాజులు, యువరాజులు, సైన్యాధిపతులు, శ్రీమంతులు, శక్తివంతులు, బానిసలు, బానిసలు కానివాళ్ళు గుహల్లో, పర్వతాలపై ఉన్న రాళ్ళ మధ్య దాక్కొన్నారు. 16 వాళ్ళు పర్వతాలను, రాళ్ళను పిలుస్తూ, “మాకు అడ్డంగా పడి మమ్మల్ని సింహాసనంపై కూర్చొన్నవానినుండి, ఆ గొఱ్ఱెపిల్ల కోపంనుండి కాపాడండి. 17 ఆయన ఆగ్రహం చూపించే గొప్ప దినం వచ్చింది! దాన్ని ఎవరు ఎదుర్కోగలరు?” అని అన్నారు.

జెకర్యా 2

యెరూషలేమును కొలవటం

నేను పైకిచూశాను. వస్తువులను కొలవటానికి ఒకడు తాడు పట్టుకుని ఉన్నట్లు చూశాను. “నీవెక్కడికి వెళ్తున్నావు?” అని అతన్ని అడిగాను.

“నేను యెరూషలేమును కొలవటానికి వెళ్తున్నాను. అది ఎంత వెడల్పు, ఎంత పొడవు వున్నదో చూడాలి” అని అతడు నాకు చెప్పాడు.

అప్పుడు నాతో మాట్లాడుతున్న దేవదూత వెళ్లిపోయాడు. మరొక దేవదూత అతనితో మాట్లాడటానికి వెళ్లాడు. అతనితో ఇలా చెప్పాడు: “పరుగున పొమ్ము. వెళ్లి ఆ యువకునితో యెరూషలేము కొలవలేనంత పెద్దగా ఉంటుందని చెప్పు. అతనికి ఈ విషయాలు చెప్పు:

‘యెరూషలేము ప్రాకారం లేని నగరంగా ఉంటుంది.
    ఎందుకంటే అక్కడ ఎంతోమంది మనుష్యులు, ఎన్నో జంతువులు నివసిస్తాయి.’
యెహోవా చెపుతున్నాడు,
‘యెరూషలేమును రక్షిస్తూ దానిచుట్టూ నేనొక అగ్ని గోడలా ఉంటాను.
    ఆ నగరానికి మహిమను కలుగజేస్తూ, నేనక్కడ నివసిస్తాను.’”

దేవుడు తన ప్రజలను ఇంటికి పిలవటం

యెహోవా చెపుతున్నాడు,
“త్వరపడు! ఉత్తర దేశం నుండి పారిపొమ్ము!
    అవును. నీ ప్రజలను ప్రతి చోటికి నేను చెదర గొట్టిన మాట నిజమే.
సీయోను ప్రజలారా! మీరు బబులోనులో బందీలయ్యారు. కాని ఇప్పుడు తప్పించుకోండి! ఆ నగరంనుండి పారిపొండి!” సర్వశక్తిమంతుడైన యెహోవా నా గురించి ఈ విషయాలు చెప్పాడు: ఆ రాజ్యాలు యుద్ధంలో నీనుండి వస్తువులు తీసుకున్నాయి.
ఆ రాజ్యాలు ఘనత సంపాదించాయి.
    కాని ఆ తరువాత యెహోవా నన్ను వారి మీదికి పంపుతాడు.
ఎందుకంటే, మీకు హాని కలిగించడమంటే, దేవుని కంటిపాపలకు హాని కలిగించడమే అవుతుంది.
    అప్పుడు ఆ రాజ్యాలు వాటి గౌరవాన్ని పొందుతాయి.
మరియు నేనా ప్రజలను బాధిస్తాను.
    వారి బానిసలు వారి ధనాన్ని తీసుకుంటారు.
బబులోను ప్రజలు నా ప్రజలను బంధించి వారిని బానిసలుగా చేశారు.
    కాని నేను వాళ్లను దెబ్బ తీస్తాను. వారు నా ప్రజలకు బానిసలవుతారు.
అప్పుడు సర్వశక్తిమంతుడైన యెహోవాయే నన్ను
    పంపినట్టు మీరు తెలుసుకుంటారు.

10 యెహోవా చెపుతున్నాడు:
“సీయోనూ, సంతోషంగా ఉండు! ఎందుకంటే, నేను వస్తున్నాను.
    మరియు నేను నీ నగరంలో నివసిస్తాను.
11 ఆ సమయంలో అనేక దేశాల ప్రజలు
    నా వద్దకు వస్తారు.
పైగా వారు నా ప్రజలవుతారు.
    నేను నీ నగరంలో నివసిస్తాను.”
సర్వశక్తిమంతుడైన యెహోవా నీ వద్దకు
    నన్ను పంపాడని నీవు తెలుసుకుంటావు.

12 యెహోవా మళ్లీ యెరూషలేమును తన ప్రత్యేక నగరంగా ఎంపిక చేస్తాడు.
    మరియు యూదా పవిత్ర భూమిలో తన భాగంగా ఉంటుంది.
13 ప్రతి ఒక్కడూ ప్రశాంతంగా ఉండాలి!
    యెహోవా తన పవిత్ర నివాసంనుండి వస్తున్నాడు.

యోహాను 5

చిన్న కొలను దగ్గర నయం చేయటం

కొద్ది రోజుల తర్వాత యూదుల పండుగ వచ్చింది. యేసు యెరూషలేముకు వెళ్ళాడు. అక్కడ యెరూషలేములో గొఱ్ఱెల ద్వారం దగ్గర ఒక కొలను ఉండేది. దీన్ని హీబ్రూ భాషలో బేతెస్థ అని అంటారు. దీని చుట్టూ ఐదు మండపాలు ఉండేవి. చాలామంది వికలాంగులు, గ్రుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, పక్షవాత రోగులు అక్కడ వేచి ఉండేవాళ్ళు. [a] అక్కడున్న వాళ్ళలో ఒకడు ముప్పైఎనిమిది సంవత్సరాల నుండి రోగంతో బాధ పడ్తూ ఉన్నాడు. యేసు అతడక్కడ ఉండటం చూసాడు. చాలాకాలం నుండి అతడాస్థితిలో ఉన్నాడని గ్రహించి అతనితో, “నీకు నయం కావాలని ఉందా?” అని అడిగాడు.

ఆ వికలాంగుడు, “అయ్యా! నీళ్ళు కదిలినప్పుడు ఆ కోనేరులోకి దించటానికి ఎవరూ లేరు: అయినా వెళ్ళటానికి ప్రయత్నిస్తుండగానే, ఇంకొకడు నాకన్నా ముందు ఆ నీళ్ళలోకి దిగుతాడు” అని అన్నాడు.

అప్పుడు యేసు అతనితో, “లే! నీ చాప తీసుకొని నడువు!” అని అన్నాడు. అతనికి వెంటనే నయమైపోయింది. అతడు తన చాపతీసుకొని వెళ్ళిపోయాడు.

ఈ సంఘటన విశ్రాంతి రోజున జరిగింది. 10 తత్కారణంగా యూదులు కోలుకున్న వానితో, “ఇది విశ్రాంతి రోజు, ధర్మశాస్త్రం ప్రకారం నీవు చాపమోసుక వెళ్ళటానికి వీల్లేదు” అని అన్నారు.

11 కాని అతడు, “నాకు నయం చేసిన వ్యక్తి, ‘నీ చాప పట్టుకొని వెళ్ళు’ అని అన్నాడు” అని సమాధానం చెప్పాడు.

12 వాళ్ళు, “నీ చాప తీసుకొని నడవమన్న వాడెవడు?” అని అడిగారు.

13 ప్రజల గుంపు ఉండటంవల్ల యేసు అక్కడినుండి వెళ్ళిపోయాడు. కనుక తనకు నయం చేసిన వాడెవరో అతడు చూపలేక పోయాడు.

14 ఆ తర్వాత యేసు అతణ్ణి మందిరంలో కలుసుకొని, “చూడు! నీవు తిరిగి ఆరోగ్యవంతుడవు అయ్యావు. పాపాలు చెయ్యటం మానేయి. లేకపోతే ఇంతకన్నా ఎక్కువ కీడు సంభవించవచ్చు!” అని అన్నాడు.

15 ఆ తర్వాత వాడు వెళ్ళి, తనకు నయం చేసిన వ్యక్తి యేసు అని చెప్పాడు.

16 యేసు విశ్రాంతి రోజున యివన్నీ చెశాడని తెలియటం వల్ల యూదులు ఆయన్ని పీడించటం మొదలు పెట్టారు. 17 యేసు వాళ్ళతో, “నా తండ్రి అన్ని వేళలా పని చేస్తాడు. అందువల్ల నేనుకూడా పని చేస్తున్నాను” అని సమాధానం చెప్పాడు.

18 ఈ కారణంగా యూదులాయన్ని చంపటానికి యింకా గట్టిగా ప్రయత్నించారు. వాళ్ళు, “అతడు విశ్రాంతి రోజును పాటించక పోవటమే కాకుండా, దేవుడు తన తండ్రి అని కూడా అంటున్నాడు. అలా చేసి తనను దేవునితో సమానం చేసుకొంటున్నాడు” అని అన్నారు.

యేసు దేవుని అధికారం కలిగియున్నాడు

19 యేసు, “ఇది నిజం. కుమారుడు ఏదీ స్వయంగా చెయ్యలేడు. తన తండ్రి చేస్తున్న దాన్ని చూసి, దాన్ని మాత్రమే కుమారుడు చెయ్యగలడు. తండ్రి ఏది చేస్తాడో, కుమారుడూ అదే చేస్తాడు. 20 తండ్రికి కుమారుని పట్ల ప్రేమ ఉంది కనుక తాను చేస్తున్నవన్నీ ఆయనకు చూపిస్తాడు. భవిష్యత్తులో ఆయనకు యింకా గొప్ప వాటిని చూపిస్తాడు. అప్పుడు మీరంతా అశ్చర్యపోతారు. 21 తండ్రి చనిపోయిన వాళ్ళను బ్రతికించినట్లే కుమారుడు కూడా తనకు యిష్టం వచ్చిన వాళ్ళకు ప్రాణం పోస్తాడు.

22 “అంతేకాదు, తండ్రి ఎవరి మీద తీర్పు చెప్పడు. తీర్పు చెప్పటానికి కుమారునికి సర్వాధికారాలు ఇచ్చాడు. 23 తండ్రిని గౌరవించినట్లు, కుమారుణ్ణి గౌరవించాలని యిలా చేసాడు. కుమారుణ్ణి గౌరవించని వాడు, ఆ కుమారుణ్ణి పంపిన తండ్రిని కూడా గౌరవించనట్లే పరిగణింపబడతాడు” అని అన్నాడు.

24 యేసు, “ఇది సత్యం. నామాటలు విని నన్ను పంపిన వానిని నమ్మువాడు అనంత జీవితం పొందుతాడు. అలాంటి వాడు శిక్షింపబడడు. అంటే అతడు చావు తప్పించుకొని జీవాన్ని పొందాడన్న మాట. 25 ఇది సత్యం. దేవుని కుమారుని స్వరం చనిపోయిన వాళ్ళు వినే కాలం రాబోతూవుంది. ఇప్పటికే వచ్చింది. ఆ స్వరం విన్నవాళ్ళు క్రొత్త జీవితాన్ని పొందుతారు. 26 ఎందుకంటే, జీవానికి తండ్రి ఏ విధంగా మూలపురుషుడో అదేవిధంగా కుమారుడు కూడా జీవానికి మూలపురుషుడు. కుమారుణ్ణి మూలపురుషుడుగా చేసింది తండ్రి! 27 కుమారుడు మానవావతారం పొందాడు కనుక తండ్రి ఆయనకు తీర్పు చెప్పే అధికారంయిచ్చాడు. ఆయన స్వరం వినే కాలం రానున్నది.

28 “ఆశ్చర్యపడకండి! సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన స్వరం వినే కాలం రానున్నది. 29 వెలుపలికి రండి! మంచి చేసిన వాళ్ళు నిరంతరం జీవించటానికి బ్రతికి వస్తారు. కీడు చేసిన వాళ్ళు నిరంతరం శిక్షింపబడటానికి బ్రతికివస్తారు.

30 “నేను స్వయంగా ఏదీ చెయ్యలేను. నేను దేవుడు చెప్పమన్న తీర్పు చెబుతాను. అందువలన నా తీర్పు న్యాయమైనది. నెరవేర వలసింది నాయిచ్ఛ కాదు. నేను నన్ను పంపిన వాని యిచ్ఛ నెర వేర్చటానికి వచ్చాను.

యేసు యూదా నాయకులకు ఎక్కువ చెప్పటం

31 “నా పక్షాన నేను సాక్ష్యం చెబితే దానికి విలువ ఉండదు. 32 కాని నా పక్షాన సాక్ష్యం చెప్పేవాడు మరొకాయన ఉన్నాడు. నా విషయంలో ఆయన చెప్పే సాక్ష్యానికి విలువ ఉందని నాకు తెలుసు.

33 “మీరు మీ వాళ్ళను యెహాను దగ్గరకు పంపారు. అతడు న్యాయం పక్షాన మాట్లాడాడు. 34 మానవుని సాక్ష్యం నాకు కావాలని కాదు. మీరు రక్షింపబడాలని ఈ విషయం చెబుతున్నాను. 35 యోహాను ఒక దీపంలా మండుచూ. వెలుగు నిచ్చాడు. కొంతకాలం మీరా వెలుగు ద్వారా లాభంపొంది ఆనందించారు.

36 “నా దగ్గర యోహాను సాక్ష్యాని కన్నా గొప్ప సాక్ష్యం ఉంది. పూర్తి చెయ్యమని తండ్రి నాకు అప్పగించిన కార్యాల్ని నేను పూర్తి చేస్తున్నాను. ఈ కార్యాలు తండ్రి నన్ను పంపాడని నిరూపిస్తాయి. 37 నన్ను పంపిన తండ్రి స్వయంగా నన్ను గురించి చెప్పాడు. మీరాయన స్వరం ఎన్నడూ వినలేదు. ఆయన రూపాన్ని ఎప్పుడూ చూడలేదు. 38 అంతే కాక ఆయన పంపిన వాణ్ణీ మీరు నమ్మటంలేదు. కనుక, ఆయన బోధనలు మీ మనస్సులో నివసించటంలేదు. 39 లేఖనాల ద్వారా అనంత జీవితం లభిస్తుందని మీరు వాటిని పరిశోధిస్తారు. కాని ఆ లేఖనాలే నన్ను గురించి సాక్ష్యం చెపుతున్నాయి. 40 అయినా మీరు నా దగ్గరకు వచ్చి నానుండి క్రొత్త జీవితాన్ని పొందటానికి నిరాకరిస్తున్నారు.

41 “నాకు మానవుల పొగడ్తలు అవసరం లేదు. 42 కాని మీ గురించి నాకు తెలుసు. మీకు దేవునిపట్ల ప్రేమ లేదని నాకు తెలుసు. 43 నేను నా తండ్రి పేరిటవచ్చాను. నన్ను మీరు అంగీకరించలేదు. కాని ఒక వ్యక్తి స్వయంగా తన పేరిట వస్తే అతణ్ణి మీరు అంగీకరిస్తారు. 44 మీరు పరస్పరం పొగడుకుంటారు. కాని దేవుని మెప్పు పొందాలని ప్రయత్నించరు. అలాంటప్పుడు నన్ను ఎట్లా విశ్వసించగలరు? 45 నేను మిమ్మల్ని నా తండ్రి సమక్షంలో నిందిస్తానని అనుకోకండి. మీరు ఆధారంగా చేసుకొన్న మోషే మిమ్మల్ని నిందిస్తున్నాడు. 46 మీరు మోషేను నమ్మినట్లైతే, అతడు నన్ను గురించి వ్రాసాడు కనుక మీరు నన్ను కూడా నమ్మేవాళ్ళు. 47 అతడు వ్రాసింది మీరు నమ్మనప్పుడు నేను చెప్పింది ఎట్లా నమ్మగలరు?” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International