M’Cheyne Bible Reading Plan
రెహబాము మూర్ఖంగా ప్రవర్తించటం
10 రెహబాము షెకెము పట్టణానికి వెళ్లాడు. ఎందువల్లననగా ఇశ్రాయేలు ప్రజలంతా రెహబామును రాజుగా అభిషిక్తుని చేయటానికి అక్కడికి వెళ్లారు. 2 యరొబాము అప్పుడు ఈజిప్టులో వున్నాడు. అతడు ఇంతకు పూర్వము సొలొమోను రాజుకు భయపడి పారిపోయి ఈజిప్టులో దాక్కున్నాడు. యరొబాము తండ్రిపేరు నెబాతు. రెహబాము కొత్త రాజు కాబోతున్నట్లు యరొబాము విన్నాడు. అందుకని యరొబాము ఈజిప్టునుండి తిరిగి వచ్చాడు. 3 ఇశ్రాయేలు ప్రజలు తమతో రమ్మని యరొబామును పిలిచారు.
అప్పుడు యరొబాము, ఇశ్రాయేలు ప్రజలు అంతా కలిసి రెహబాము వద్దకు వెళ్లారు. వారతనితో యీలా అన్నారు: “రెహబామూ, 4 నీ తండ్రి మాకు జీవితం కష్టమయం చేశాడు. అది మాకు మోయలేని భారమయ్యింది. నీవు మాకాబరువును తేలిక చెయ్యి. అప్పుడు నీకు మేము సేవచేస్తాము.”
5 రెహబాము వారితో “మూడు రోజుల తరువాత మళ్లీ నా వద్దకు రండి” అని అన్నాడు. అందుకని ప్రజలు వెళ్లిపోయారు.
6 రాజైన రెహబాము గతంలో తన తండ్రిగా సొలొమోను వద్ద సేవచేసిన పెద్దలను సంప్రదించాడు. “ఆ ప్రజలకు నేనేమి సమాధానం చెప్పాలని మీరు నాకు సలహా యిస్తున్నారు?” అని అడిగాడు.
7 పెద్దలు రెహబాముతో యిలా అన్నారు: “నీవు గనుక ఆ ప్రజల పట్ల దయగలిగి వుంటే, వారిని సంతోషపెట్టి మంచిమాటలు మాట్లాడితే, వారు నీకు సదా సేవ చేస్తారు.”
8 కాని రెహబాము పెద్దల సలహా పాటించలేదు. పైగా రెహబాము తనతో పెరిగి తనకు సేవచేస్తున్న తన స్నేహితులను సంప్రదించాడు. 9 రెహబాము వారితో యీలా అన్నాడు: “మీరు నాకు ఏమి సలహాయిస్తున్నారు? ఆ ప్రజలకు మనం ఎలా సమాధానం చెప్పాలి? వారు తమ పనిని తేలిక చేయమని నన్ను అడిగారు. నా తండ్రి వారిపై వుంచిన భారాన్ని తగ్గించమని వారు నన్ను కోరుతున్నారు.”
10 అప్పుడు రెహబాముతో పెరిగిన యువకులు అతనికి యిలా సలహా యిచ్చారు: “నీతో మాట్లాడిన ప్రజలకు నీవు చెప్పవలసినది యిది: ‘నీ తండ్రి మా బ్రతుకు భారం చేశాడు. అది పెద్ద బరువు మోసినట్లుగా వుంది. కాని ఆ బరువును తగ్గించమని మేము నిన్ను కోరుతున్నాము’ అని వారన్నారు గదా. కాని రెహబామూ, నీ సమాధానం యిలా వుండాలి: ‘నా చిటికెన వ్రేలు నా తండ్రి నడుముకంటె లావుగా వుంటుంది! 11 నా తండ్రి మీపై చాలా భారం వేశాడు. కాని నేను ఆ బరువును మరింత ఎక్కువ చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని కొరడాలతో కొట్టాడు. కాని నేను లోహపు కొక్కెములున్న కొరడాలతో కొట్టిస్తాను’” అని చెప్పమన్నారు.
12 మూడు రోజుల తరువాత యరొబాము, ప్రజలు కలిసి రెహబాము వద్దకు వచ్చారు. “మూడు రోజులలో మీరు నా వద్దకు రండి,” అని రెహబాము చెప్పిన దానికి అనుగుణంగా వారు వెళ్లారు. 13 అప్పుడు రెహబాము రాజు వారితో అల్పబుద్ధితో మాట్లాడాడు. రెహబాము రాజు పెద్దల సలహాను పెడ చెవిని పెట్టాడు. 14 యువకులు తనకు సలహా యిచ్చిన రీతిగా రెహబాము రాజు ప్రజలతో మాట్లాడాడు. “నా తండ్రి మీ బరువు ఎక్కువ చేశాడు. కాని నేను దానిని మరింత ఎక్కువ చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని కొరడాలతో శిక్షించాడు. కాని నేను మిమ్మల్ని లోహపు కొక్కెములున్న కొరడాలతో శిక్షిస్తాను” అని అన్నాడు. 15 ఆ విధంగా రాజైన రెహబాము ప్రజల విన్నపాన్ని వినలేదు. ప్రజలగోడు అతడు వినని కారణమేమనగా, పరిస్థితులలో ఈ మార్పు దేవుడు కల్పించటమే. దేవుడే ఇది జరిపించాడు. అహీయా ద్వారా యరొబాముకు దేవుడు చెప్పించిన దానిని నిజం చేసేలా ఇది జరిగింది. అహీయా షిలోనీయుడు. యరొబాము తండ్రి పేరు నెబాతు.
16 రెహబాము రాజు తమ మనవి ఆలకించలేదని ఇశ్రాయేలు ప్రజలు అర్థం చేసుకున్నారు. అప్పుడు వారు రాజుతో యిలా అన్నారు: “మేము దావీదు కుటుంబంలో భాగస్తులమా? కాదు! యెష్షయి భూముల్లో మాకేమైనా వస్తుందా? రాదు! అందుకని ఇశ్రాయేలీయులారా, మనం మన ఇండ్లకు వెళ్లిపోదాం పదండి. దావీదు సంతతి వాడిని తన ప్రజల్ని ఏలుకో నీయండి!” తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు. 17 కాని యూదా పట్టణాలలో ఇంకా కొంతమంది ఇశ్రాయేలీయులు నివసిస్తూ వున్నారు. రెహబాము వారికి కూడ రాజుగానే వున్నాడు.
18 బలవంతంగా పని చేయించబడే జనులమీద అధికారిగా హదోరాము వున్నాడు. రెహబాము అతనిని ఇశ్రాయేలు ప్రజల వద్దకు పంపాడు. కాని ఇశ్రాయేలు ప్రజలు హదోరామును రాళ్లతో కొట్టి చంపివేశారు. దానితో రెహబాము తన రథంలోనికి దుమికి తప్పించు కున్నాడు. అతడు యెరూషలేముకు పారిపోయాడు. 19 అప్పటి నుండి ఇప్పటి వరకు ఇశ్రాయేలీయులు దావీదు కుటుంబానికి[a] వ్యతిరేకులై వున్నారు.
తొలి పలుకు
1 దేవుడు త్వరలోనే జరగనున్న వాటిని తన సేవకులకు తెలియచేయుమని యేసు క్రీస్తుకు చెప్పాడు. యేసు తన దూతను, తన భక్తుడైన యోహాను దగ్గరకు పంపి ఈ విషయాలు తెలియచేసాడు. ఈ గ్రంథంలో ఆ విషయాలు ఉన్నాయి. 2 యోహాను దేవుని సందేశాన్ని, యేసు క్రీస్తు చెప్పినదాన్ని దివ్య దర్శనంలో చూసాడు. అందులో చూసినవన్నీ చెప్పాడు. 3 ఈ దైవసందేశంలో ఉన్నవాటిని చదివేవాడు, వాటిని విని, వాటిలో వ్రాయబడినవాటిని ఆచరించేవాళ్ళు ధన్యులు. సమయం దగ్గరగానున్నది.
శుభాకాంక్షలు
4 యోహాను నుండి,
ఆసియ ప్రాంతంలో ఉన్న ఏడు సంఘాలకు,
భూత భవిష్యత్ వర్తమానకాలాల్లో ఉన్నవాడు, ఆయన సింహాసనం ముందున్న ఏడు ఆత్మలు మీకు తమ అనుగ్రహాన్ని, శాంతిని ప్రసాదించుగాక! 5 మరియు, చనిపోయి బ్రతికింపబడిన వాళ్ళలో మొదటివాడు, నిజమైన విషయాలు చెప్పేవాడు రాజులకు రాజైన యేసు క్రీస్తు మీకు అనుగ్రహం, శాంతి ప్రసాదించుగాక!
ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయనే తన రక్తంతో మనల్ని మన పాపాలనుండి రక్షించాడు. 6 మనల్ని ఒక రాజ్యంగా స్థాపించాడు. మనము ఆయన తండ్రియైన దేవుని సేవ చేయాలని మనల్ని యాజకులుగా చేసాడు. ఆయనకు చిరకాలం మహిమ శక్తి కలుగుగాక! ఆమేన్.
7 చూడు! ఆయన మేఘాలతో వస్తున్నాడు. ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది. ఆయన్ని పొడిచినవాళ్ళు[a] కూడా ఆయన్ని చూస్తారు. ప్రపంచంలోని ప్రజలందరూ ఆయన్ని చూచి భయాందోళనలతో దుఃఖిస్తారు. అలాగే జరుగుగాక! ఆమేన్.
8 భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేవాడు, సర్వశక్తి సంపన్నుడైనవాడు, మన ప్రభువైన దేవుడు “ఆదియు, అంతమును[b] నేనే” అని అన్నాడు.
9 నేను యోహానును, మీ సోదరుణ్ణి. యేసుతో పొందిన ఐక్యత వల్ల మనము ఆయన రాజ్యంలో ఒకటిగా ఉన్నాము. సహనంతో కష్టాలు అనుభవిస్తున్నాము. యేసు చెప్పిన సత్యాన్ని దేవుని సందేశాన్ని ప్రకటించటం వల్ల నన్ను వాళ్ళు పత్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉంచారు. 10 ఆదివారమునాడు నేను దేవుని ఆత్మపూర్ణుడనైయుండగా బూర ఊదినట్లు నా వెనుకనుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. 11 అది నాతో, “నీవు చూసినదాన్ని ఒక గ్రంథంగా వ్రాసి ఈ ఏడు సంఘాలకు అనగా, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయకు పంపుము” అని అన్నది.
12 నాతో మాట్లాడుతున్న స్వరం ఎవరిదో చూడాలని వెనక్కు తిరిగి చూసాను. వెనక్కు తిరిగి చూడగా ఏడు బంగారు దీపస్తంభాలు కన్పించాయి. 13 వాటి మధ్య ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన మనుష్యకుమారునిలా[c] ఉన్నాడు. ఆయన వేసుకొన్న అంగీ ఆయన పాదాల వరకు ఉంది. ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టబడివుంది. 14 ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిలా ఉన్నాయి. ఆయన వెంట్రుకల్ని మంచుతో కూడా పోల్చవచ్చు. ఆయన కళ్ళు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. 15 ఆయన పాదాలు కొలిమిలో కాలే యిత్తడిలా ఉన్నాయి. ఆయన కంఠధ్వని జల ప్రవాహం చేసే శబ్దంలా ఉంది. 16 ఆయన తన కుడి చేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకొని ఉన్నాడు. ఇరువైపులా పదునుగానున్న ఒక కత్తి ఆయన నోటి నుండి బయటకు వచ్చింది. ఆయన ముఖం దివ్యంగా ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది.
17 నేనాయన్ని చూసి, ప్రాణం పోయిన వానిలా ఆయన పాదాల ముందు పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నా తలపై ఉంచి, “భయపడకు. ఆదిని, అంతాన్ని నేనే!” అని అన్నాడు. 18 నేను చిరకాలం జీవించేవాణ్ణి. ఒకప్పుడు నేను మరణించి ఉంటిని. కాని యిక శాశ్వతంగా జీవించి ఉంటాను. మరణంపై నాకు అధికారం ఉంది. మృత్యులోకపు తాళంచెవులు నా దగ్గర ఉన్నాయి. 19 అందువల్ల యిప్పుడున్నవాటిని, ముందు జరుగబోయేవాటిని, నీవు చూసినవాటిని గురించి వ్రాయి. 20 నీవు నా కుడి చేతిలో చూసిన ఏడు నక్షత్రాల రహస్యము, ఏడు దీపస్తంభాల రహస్యము యిది. ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాలకు చెందిన దూతలు, ఆ ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు.
ప్రజలు జీవితాలు మార్చుకోవాలని యెహోవా అడగటం
2 సిగ్గులేని ప్రజలారా, మీ జీవితాలు మార్చుకోండి. 2 అదీ, మీరు వాడిపోయి చనిపోతున్న పుష్పంలా కాకముందే. పగటి ఎండకు ఒక పుష్పం వాడిపోతుంది, చనిపోతుంది. యెహోవా తన భయంకర కోపం చూపించినప్పుడు మీరు అలానే ఉంటారు. కనుక మీ మీద యెహోవా కోపపు రోజు వస్తుంది. మీ బతుకులు మార్చుకోండి! 3 దీనులైన సర్వజనులారా, యెహోవా దగ్గరకు రండి! ఆయన చట్టాలకు విధేయులుగా ఉండండి. మంచి పనులు చేయటం నేర్చుకోండి. వినయంగా ఉండటం నేర్చుకోండి. ఒకవేళ అప్పుడు, యెహోవా తన కోపం చూపించేవేళ, మీరు క్షేమంగా ఉంటారేమో.
ఇశ్రాయేలీయుల పొరుగువారిని యెహోవా శిక్షిస్తాడు
4 గాజాలో ఏ ఒక్కడూ విడువబడడు. అష్కెలోను నాశనం చేయబడుతుంది. మధ్యాహ్నానికల్లా అష్డోదునుండి ప్రజలు బలవంతంగా వెళ్లగొట్టబడతారు. ఎక్రోను శూన్యం అవుతుంది! 5 ఫిలిష్తీ ప్రజలారా, సముద్ర తీరంలో నివసించే ప్రజలారా, యెహోవా దగ్గరనుండి వచ్చిన ఈ సందేశం మిమ్మల్ని గూర్చిందే. కనాను దేశమా, పాలస్తీనా దేశమా, నీవు నాశనం చేయబడతావు. అక్కడ ఎవ్వరూ నివసించరు! 6 సముద్రం పక్కన ఉన్న మీ దేశం గొర్రెల కాపరులకు, వారి గొర్రెలకు బంజరు పొలాలుగా అవుతుంది. 7 అప్పుడు యూదా వారిలో శేషించిన వారికి ఆ దేశం చెందుతుంది. ఆ యూదా ప్రజలను యెహోవా జ్ఞాపకం చేసుకొంటాడు. ఆ ప్రజలు ఒక విదేశంలో బందీలుగా ఉన్నారు. కాని యెహోవా వారిని వెనుకకు తీసుకొని వస్తాడు. అప్పుడు యూదా ప్రజలు ఆ పొలాల్లో తమ గొర్రెలను గడ్డి మేయనిస్తారు. రాత్రిళ్ళు అవి అష్కెలోను ఖాళీ ఇండ్లలో పండుకొంటాయి.
8 యెహోవా ఇలా అంటున్నాడు: “మోయాబు మరియు అమ్మోను ప్రజలు ఏమి చేసారో నాకు తెలుసు! ఆ ప్రజలు నా ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఆ ప్రజలు వారి స్వంత దేశాలను విశాల పరచు కొనేందుకు వారి భూమిని తీసుకొన్నారు. 9 కనుక నేను బ్రతికి ఉన్నంత నిశ్చయంగా, మోయాబు మరియు అమ్మోను ప్రజలు సొదొమ, గొమొర్రాల్లా నాశనం చేయబడతారు. నేను ఇశ్రాయేలీయుల దేవుడను, సర్వశక్తిగల యెహోవాను. ఆ దేశాలు శాశ్వతంగా సర్వనాశనం చేయబడతాయని నేను వాగ్దానం చేస్తున్నాను. వారి దేశంనిండా కలుపు మొక్కలు పెరిగి పొతాయి. వారి దేశం మృత సముద్రపు ఉప్పుచేత కప్పబడిన దేశంలా ఉంటుంది. నా ప్రజలలో శేషించినవారు ఆ దేశాన్ని, అందులో మిగిలిన వాటన్నింటినీ తీసుకొంటారు.”
10 మోయాబు మరియు అమ్మోను ప్రజలు గర్వపడి, దేవుని ప్రజలను గేళిచేసి, సర్వశక్తిగల యెహోవా ప్రజలపట్ల క్రూరంగా పవర్తించారు. వారిని అవమాన పర్చారు. కనుక వాళ్లకు అవి జరిగే తీరుతాయి. 11 ఆ ప్రజలు యెహోవాకు భయపడతారు. ఎందుకంటే యెహోవా వారి దేవతలను నాశనం చేస్తాడు గనుక. అప్పుడు దూర దేశాలన్నింటిలోని మనుష్యులందరూ యెహోవాను ఆరాధిస్తారు. 12 కూషీయులారా, దీని అర్థం మిమ్ములను, యెహోవా ఖడ్గం మీ ప్రజలను కూడా చంపుతుంది. 13 మరియు యెహోవా ఉత్తరంగా తిరిగి అష్షూరును శిక్షిస్తాడు. నీనెవెను ఆయన నాశనం చేస్తాడు-ఆ పట్టణం ఎండిన ఎడారిలా శూన్యంగా ఉంటుంది. 14 అప్పుడు గొర్రెలు, అడవి జంతువులు మాత్రమే శిథిలమైన ఆ పట్టణంలో నివసిస్తాయి. అక్కడ మిగిలిపోయిన స్తంభాలమీద గుడ్లగూబలు, కాకులు కూర్చుంటాయి. వాటి అరుపులు కిటికీలగుండా వినిపిస్తాయి. గుమ్మాలమీద కాకులు కూర్చుంటాయి. ఆ ఖాళీ ఇండ్లలో నల్ల పక్షులు కూర్చుంటాయి. 15 నీనెవె ఇప్పుడు ఎంతో గర్వంగా ఉంది. అది చాలా సంతోషంతో నిండిన పట్టణంగా ఉంది. ఆ ప్రజలు క్షేమంగా ఉన్నామని తలుస్తున్నారు. ప్రపంచమంతటిలో నీనెవె పట్టణమే మహా గొప్ప పట్టణమని వారు తలుస్తున్నారు. కాని ఆ పట్టణం నాశనం చేయబడుతుంది! అది అడవి జంతువులు పండుకొనేందుకు వెళ్లే శూన్య ప్రదేశం అవుతుంది. ఆ స్థలం ప్రక్కగా వెళ్ళే మనుష్యులు ఆ పట్టణం అంత విపరీతంగా నాశనం చేయబడటం చూసినప్పుడు వారు తలలు ఊవుతూ ఈలలు వేస్తారు.
యేసు బ్రతికి రావటం
(మత్తయి 28:1-10; మార్కు 16:1-8; యోహాను 20:1-10)
24 ఆదివారం తెల్లవారుఝామున ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని సమాధి దగ్గరకు వెళ్ళారు. 2 సమాధికి ఉన్న రాయి త్రోసి వేయబడి ఉండటం గమనించి లోపలికి వెళ్ళి చూసారు. 3 అక్కడ వాళ్ళకు యేసు ప్రభువు దేహం కనిపించ లేదు. 4 దీన్ని గురించి వాళ్ళింకా ఆశ్చర్యపడుతుండగా అకస్మాత్తుగా యిద్దరు వ్యక్తులు ప్రత్యక్షమై వాళ్ళ ప్రక్కన నిలుచున్నారు. వాళ్ళ దుస్తులు మెరుపువలె మెరుస్తూ ఉన్నాయి. 5 భయంతో ఆ స్త్రీలు ముఖాల్ని వంచుకొన్నారు.
ఆ దేవదూతలు, “మీరు బ్రతికి ఉన్నవాని కోసం చనిపోయిన వాళ్ళ మధ్య ఎందుకు వెతుకుతున్నారు? 6-7 ఆయన బ్రతికి, యిక్కడినుండి వెళ్లిపోయాడు. ఆయన మీతో కలిసి గలిలయలో ఉన్నప్పుడు, ‘మనుష్యకుమారుడు పాపాత్ములకు అప్పగింపబడాలి; సిలువ మీద చంపబడాలి. మూడవ రోజు బ్రతికి రావాలి!’ అని అన్న విషయం మీకు జ్ఞాపకం లేదా!” అని అన్నారు. 8 అప్పుడు వాళ్ళకు ఆయన మాటలు జ్ఞాపకం వచ్చాయి.
9-10 మగ్దలేనే మరియ, యోహాన్న, యాకోబుల తల్లి మరియ, మరియు మిగతా స్త్రీలు సమాధినుండి వెళ్ళి ఈ విషయాలు ఆ పదకొండుగురికి, మిగతా వాళ్ళకు చెప్పారు. 11 ఆ స్త్రీల మాటలకు అర్థం లేదనుకొని శిష్యులు వాళ్ళ మాటలు నమ్మలేదు. 12 అయినా పేతురు లేచి ఆ సమాధి దగ్గరకు పరుగెత్తాడు. లోనికి తొంగి చూసి, కట్టబడిన వస్త్రాలు అక్కడ పడివుండటం గమనించాడు. ఏమి జరిగి ఉంటుందా? అని ఆశ్చర్యపడ్తూ వెళ్ళిపోయాడు.
ఎమ్మాయు దారి
(మార్కు 16:12-13)
13 అదే రోజు వాళ్ళలో ఇద్దరు ఎమ్మాయు అనే గ్రామానికి వెళ్తూవున్నారు. అది యెరూషలేముకు ఏడుమైళ్ళ దూరంలో ఉంది. 14 వాళ్ళు జరిగిన సంఘటనలను గురించి మాట్లాడుకొంటున్నారు. 15 వాళ్ళు ఈ విషయాన్ని గురించి చర్చిస్తూండగా యేసు స్వయంగా వచ్చి వాళ్ళతో కలిసి నడవటం మొదలు పెట్టాడు. 16 కాని తానెవ్వరో వాళ్ళను గుర్తుపట్టనివ్వలేదు. 17 యేసు వాళ్ళతో, “మీరు ఏం మాట్లాడుకొంటున్నారు?” అని అడిగాడు.
వాళ్ళు ఆగిపొయ్యారు. వాళ్ళ ముఖంల్లో దుఃఖం ఉంది. 18 వాళ్ళలో క్లెయొపా అనేవాడు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ మధ్య జరిగిన సంఘటనలు తెలుసుకోకుండా యెరూషలేములో నివసిస్తూన్న వాడివి నీవొక్కడివేనా!”
19 “ఏ సంఘటనలు?” అని యేసు అడిగాడు.
వాళ్ళు, “నజరేతు నివాసియైన యేసును గురించి. ఆయన ఒక ప్రవక్త. గొప్ప విషయాలు చెప్పాడు. గొప్ప పనులు చేశాడు. ప్రజల మెప్పు, దేవుని మెప్పు పొందాడు. 20 మా ప్రధాన యాజకులు, పాలకులు, మరణ దండన విధించుమని ఆయన్ని అధికారులకు అప్పగించారు. వాళ్ళు ఆయన్ని సిలువకు వేసారు. 21 ఆయన ఇశ్రాయేలును రక్షిస్తాడని ఆశించాము.
“పైగా యివన్నీ మూడు రోజుల క్రితం జరిగాయి. 22 అంతేకాక మాతో ఉన్న కొందరు స్త్రీలు ఆశ్చర్యం కలిగించే విషయం మాకు చెప్పారు. వాళ్ళు ఈ రోజు తెల్లవారు ఝామున సమాధిదగ్గరకు వెళ్ళారు. 23 కాని, అక్కడ వాళ్ళకు యేసు దేహం కనిపించలేదు. తాము దేవ దూతల్ని చూసినట్లు, ఆ దేవదూతలు యేసు బ్రతికి వచ్చాడని చెప్పినట్లు మాకు చెప్పారు. 24 మాతో ఉన్న వాళ్ళు కొందరు సమాధి దగ్గరకు వెళ్ళి అది ఆ స్త్రీలు వర్ణించిన విధంగా ఉండటం గమనించారు. కాని అక్కడ యేసు కనిపించలేదు” అని అన్నారు.
25 యేసు వాళ్ళతో, “అజ్ఞానులారా! ప్రవక్తలు చెప్పిన విషయాలు నమ్మటానికి యింత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? 26 క్రీస్తు చనిపోయి తర్వాత కదా తేజస్సు పొందాలి!” అని అన్నాడు. 27 ఆ తదుపరి మోషే గ్రంథాలతో, ప్రవక్తల వ్రాతలతో మొదలు పెట్టి తనను గురించి లేఖనాల్లో వ్రాసినవన్నీ వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాడు.
28 వాళ్ళు వెళ్ళనున్న గ్రామం దగ్గరకు వచ్చింది. యేసు తాను యింకా ముందుకు వెళ్ళనున్న వానిలా కనిపించాడు. 29 కాని వాళ్ళు, “సాయంకాలమైంది. చీకటి కాబోతోంది. మాతో ఉండిపొండి!” అని అన్నారు. యేసు సరేనని వాళ్ళతో వాళ్ళ యింటికి వెళ్ళాడు.
30 వాళ్ళతో భోజనానికి కూర్చున్నాక ఆయన రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞత చెప్పి దాన్ని విరిచి వాళ్ళకిచ్చాడు. 31 అప్పుడు వాళ్ళ కండ్లు తెరిపించాడు. వెంటనే వాళ్ళు ఆయన్ని గుర్తించారు. కాని ఆయన అదృశ్యమయ్యాడు. 32 ఆ తర్వాత ఆ యిద్దరూ, “దారిపై నడుస్తుండగా ఆయన మాట్లాడి, లేఖనాల్లో నిజమైన అర్థాన్ని మనకు చెప్పినప్పుడు గుండెల్లో మండుతున్నట్లు అనిపించలేదా?” అని మాట్లాడుకున్నారు.
33 వాళ్ళు లేచి వెంటనే యెరూషలేము వెళ్ళారు. అక్కడ ఆ పదకొండుగురు శిష్యులు, మిగతా వాళ్ళు సమావేశమై ఉన్నారు. 34 వాళ్ళలో ఒకడు, “ఔను! ఇది నిజం. ప్రభువు బ్రతికి వచ్చి సీమోనుకు కనిపించాడు” అని అన్నాడు.
35 ఆ తదుపరి ఆ వచ్చిన వాళ్ళు దారిపై జరిగిన సంఘటనను, యేసు రొట్టెను విరిచినప్పుడు తాము ఆయన్ని గుర్తించిన విషయము చెప్పారు.
యేసు తన శిష్యులకు కనిపించటం
(మత్తయి 28:16-20; మార్కు 16:14-18; యోహాను 20:19-23; అపొ. కా. 1:6-8)
36 వాళ్ళు ఈ విషయాన్ని గురించి యింకా మాట్లాడుతుండగా యేసు స్వయంగా వచ్చి వాళ్ళతో నిలుచుని, “శాంతి కలుగుగాక” అని అన్నాడు.
37 వాళ్ళు భూతాన్ని చూసామనుకొని వణికి భయపడిపోయారు. 38 యేసు వాళ్ళతో, “మీరెందుకు భయపడ్తున్నారు. మీకు సందేహాలు ఎందుకు కలుగుతున్నాయి? 39 నా చేతులు, కాళ్ళు చూడండి. నేనే ఆయనను. తాకి చూడండి. నాకు మాంసము, ఎముకలు ఉన్నాయి. భూతానికి అవి ఉండవు” అని అన్నాడు.
40 ఆయన ఈ మాటలు అంటూ తన చేతులు, కాళ్ళు వాళ్ళకు చూపాడు. 41 వాళ్ళకు ఆశ్చర్యము, ఆనందము కలిగాయి. వాళ్ళు నమ్మలేకపొయ్యారు. అప్పుడు యేసు, “మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా?” అని అడిగాడు. 42 వాళ్ళు ఒక కాల్చిన చేపను తెచ్చి యిచ్చారు. 43 ఆయన దాన్ని తీసుకొని వాళ్ళ సమక్షంలో తిన్నాడు.
44 ఆయన, “నేను మీతో కలిసి ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాలలో, కీర్తనలలో నన్ను గురించి వ్రాసినవన్నీ జరుగుతాయి అని చెప్పాను” అని అన్నాడు.
45 అప్పుడు వాళ్ళు లేఖనాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో వాళ్ళ కండ్లు తెరిపించాడు. 46 ఆయన వాళ్ళతో, “ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు చనిపోయి మూడవరోజున బ్రతికి వస్తాడు! 47 పశ్చాత్తాపాన్ని గురించి, పాప క్షమాపణ గురించి ఆయన పేరిట ప్రకటించటం మొదట యెరూషలేములో మొదలౌతుంది. ఆ పిదప అది అన్ని దేశాల్లో ప్రకటింపబడుతుంది. 48 మీరు వీటికి సాక్షులు. 49 నా తండ్రి వాగ్దానం చేసిన ఆయన్ని నేను పంపుతాను. కాని పరలోకం నుండి మీకు పరిశుద్ధాత్మ శక్తి లభించే దాకా ఈ పట్టణంలోనే ఉండండి” అని చెప్పాడు.
యేసు పరలోకానికి వెళ్ళటం
(మార్కు 16:19-20; అపొ. కా. 1:9-11)
50 ఆ తర్వాత వాళ్ళను అక్కడి నుండి బేతనియ దాకా తీసుకు వెళ్ళి తన చేతులెత్తి వాళ్ళను ఆశీర్వదించాడు. 51 వాళ్ళను ఆశీర్వదిస్తుండగా ఆయన వాళ్ళ నుండి దూరం చేయబడ్డాడు. ఆ తర్వాత పరలోకానికి తీసుకు వెళ్ళబడ్డాడు. 52 ఆ తర్వాత వాళ్ళాయనకు నమస్కరించి చాలా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. 53 వాళ్ళు మందిరంలో ఉండి విరామం లేకుండా దేవుని స్తుతించారు.
© 1997 Bible League International