Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 5:1-6:11

దానితో సొలొమోను యెహోవా ఆలయ నిర్మాణానికి తలపెట్టిన పనంతా పూర్తయ్యంది. తన తండ్రి దావీదు ఆలయానికిచ్చిన వస్తువులన్నిటినీ సొలొమోను ఆలయంలోకి తెచ్చాడు. వెండి బంగారాలతో చేసిన వస్తువులను, తదితర సామానులన్నిటినీ సొలొమోను లోనికి తెచ్చాడు. ఆ వస్తువులన్నిటినీ సొలొమోను ఆలయపు ఖజానాలో భద్రపర్చాడు.

పవిత్ర పెట్టె ఆలయానికి తేబడటం

ఇశ్రాయేలు పెద్దలందరిని, వంశనాయకులందరినీ ఇశ్రాయేలులో వున్న వంశపెద్దలందరినీ సొలొమోను పిలిపించాడు. వారందరినీ యెరూషలేములో సమావేశ పర్చాడు. యెహోవా ఒడంబడిక పెట్టెను దావీదు నగరం నుండి తెప్పించే ఏర్పాట్లు చేసేటందుకు సొలొమోను ఈ సమావేశం ఏర్పాటు చేశాడు. దావీదు నగరానికే సీయోను అని పేరు. ఈ సందర్భంగా ఏర్పాటైన ఒక పర్ణశాల పండుగలో ప్రజలంతా రాజైన సొలొమోనును కలిశారు. ఆ సంవత్సరం ఏడవ నెలలో ఈ విందు ఏర్పాటు చేయబడింది.

ఇశ్రాయేలు పెద్దలంతా వచ్చిన పిమ్మట లేవీయులు ఒడంబడిక పెట్టెను లేవదీశారు. పిమ్మట యాజకులు, లేవీయులు కలిసి ఒడంబడిక పెట్టెను యెరూషలేముకు మోశారు. యాజకులు, లేవీయులు సన్నిధి గుడారాన్ని, దానిలో వున్న పవిత్ర వస్తువులను యెరూషలేముకు తెచ్చారు. రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలు ఒడంబడిక పెట్టెముందు గుమికూడారు. రాజైన సొలొమోను, ఇశ్రాయేలీయులు గొర్రెలను, గిత్తలను, బలియిచ్చారు. బలి యిచ్చిన గొర్రెలు, గిత్త దూడలు ఎవ్వరూ లెక్కపెట్టలేనన్ని వున్నాయి. తరువాత యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టెను, దానికై నిర్దేశించిన స్థలానికి తీసుకొని వచ్చారు. ఆ స్థలమే ఆలయంలోని అతి పవిత్ర స్థలం. ఒడంబడిక పెట్టె అతి పవిత్ర స్థలంలో కెరూబుల రెక్కల క్రింద వుంచారు. ఒడంబడిక పెట్టె వుంచబడిన స్థలంమీద కెరూబుల రెక్కలు విప్పివున్నాయి. కెరూబులు ఒడంబడిక పెట్టెమీద, దానిని మోసే కర్రమీద నిలబడివున్నాయి. అతి పవిత్ర స్థలం ముందు నుంచి చూస్తే వాటి చివరలు కనబడేటంత పొడవుగా పెట్టెను మోసే కర్రలు వున్నాయి. కాని ఆలయం బయట నుంచి ఎవ్వరూ ఆ కర్రలను చూడలేరు. ఈనాటికీ ఆ కర్రలు అక్కడ వున్నాయి. 10 ఒడంబడిక పెట్టెలో రెండు శిలాఫలకాలు తప్ప మరేమీ లేవు. (అవి దేవుని పది ఆజ్ఞలున్న ఫలకాలు). హూరేబు పర్వతం మీద ఆ రెండు ఫలకాలను మోషే ఒడంబడిక పెట్టెలో వుంచాడు. ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా ఒక ఒడంబడిక చేసికొన్న చోటే ఈ హోరేబు. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి స్వతంత్రులై బయటకు వచ్చిన పిమ్మట జరిగింది.

11 పిమ్మట అతి పవిత్ర స్థలంలోనికి వెళ్లిన యాజకులంతా బయటకు వచ్చారు. వారంతా శుభ్రంగా వున్నారు. అప్పట్లో వారు యాజకులలో ఏ వర్గానికి చెందిన వారు అన్నది ముఖ్యంగాదు. వారంతా అతి పవిత్ర స్థలంలో నుంచి బయటికి వచ్చి తమకు తాము పరిశుద్ధులైనారు. 12 బలిపీఠానికి తూర్పు దిశలో లేవీయులకు చెందిన గాయకులంతా నిలబడ్డారు. ఆసాపు, హేమాను, యెదూతూను వర్గాలకు చెందిన గాయక బృందాల వారంతా అక్కడ వున్నారు. వారి కుమారులు, బంధువులు కూడా అక్కడ వున్నారు. లేవీ గాయకులంతా సన్నని నారతో నేసిన తెల్లని వస్త్రాలు ధరించారు. వారి చేతుల్లో పెద్ద పెద్ద తాళాలు, తంబురలు, సితారలు వున్నాయి. లేవీ గాయకులతో పాటు నూటఇరవై మంది యాజకులున్నారు. ఆ నూట ఇరవై మంది యాజకులు బూరలు ఊదారు. 13 బూరలు ఊదిన వారు, పాటలు పాడినవారు, సొంపుగా ఒక్క మనిషివలె ఊది, పాడారు. వారు యెహోవాకి స్తోత్రం చేసినప్పుడు కృతజ్ఞతలు పలికినప్పుడు ఏక కంఠంగా వినిపించింది. బూరలతోను, తాళాలతోను, ఇతర వాద్య విశేషాలతోను వారు పెద్ద శబ్దం వచ్చేలా చేశారు. వారు యిలా పాడారు:

“ప్రభువు మంచివాడు,
    దేవుని కరుణ శాశ్వత మైనది!”

అటు తర్వాత ఆలయాన్ని ఒక మేఘం ఆవరించింది. 14 ఆ మేఘంవల్ల యాజకులు తమ సేవా కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. దానికి కారణమేమనగా యెహోవా యొక్క మహిమ ఆలయాన్ని నింపివేసింది.

తరువాత సొలొమోను యిలా అన్నాడు:

“యెహోవా, నల్లని మేఘంలో
    నివసిస్తానని అన్నాడు.
ఓ ప్రభూ, నీ కొరకు ఒక ఆలయాన్ని నిర్మించాను. అది ఒక ఉన్నతమైన ఆలయం.
    శాశ్వతంగా నీవు నివసించటానికి అది నిలయం!”

సొలొమోను ప్రసంగం

సొలొమోను వెనుదిరిగి తన ముందు నిలబడిఉన్న ప్రజలందరనీ దీవించాడు. సొలొమోను యీలా అన్నాడు:

“ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం చేయండి! నా తండ్రి దావీదుకు తానేమి చేస్తానని వాగ్దానం చేశాడో, యెహోవా అదంతా నెరవేర్చినాడు. యెహోవా దేవుడు యిలా చెప్పియున్నాడు: ‘నా ప్రజలను ఈజిప్టు నుండి తీసుకొని వచ్చినప్పటినుండి ఇశ్రాయేలు వంశాలవారున్న ఏ నగరాన్నీ నాకు ఒక ఆలయాన్ని కట్టించటానికి నేను కోరుకోలేదు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నడిపించటానికి నేను ఏ వ్యక్తినీ నాయకునిగా ఎంపిక చేయలేదు. కాని ఇప్పుడు నా పేరు మీద యెరూషలేమును ఎన్నుకున్నాను. పైగా నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నడిపించటానికి దావీదును ఎంపిక చేశాను.’

“ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు నా తండ్రియగు దావీదు ఒక ఆలయాన్ని నిర్మింప గోరాడు. కాని. యెహోవా నా తండ్రితో, ‘దావీదూ, నీవు నా పేరు మీద ఒక ఆలయాన్ని నిర్మింప తలంచటం బాగానే వుంది. కాని, నీవు ఆలయాన్ని నిర్మించకూడదు. నా పేరు మీద నీ స్వంత కుమారుడు ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు’ అని చెప్పాడు. 10 యెహోవా ఏమి చేస్తానని చెప్పాడో ఇప్పుడది చేశాడు. నా తండ్రి స్థానంలో నేను కొత్త రాజును. దావీదు నా తండ్రి. ఇప్పుడు నేను ఇశ్రాయేలుకు రాజును. అదే యెహోవా చేసిన వాగ్దానం. మరి నేను ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు ఒక ఆలయాన్ని నిర్మించాను. 11 ఒడంబడిక పెట్టెను ఆలయంలో వుంచాను! ఈ ఒడంబడిక పెట్టెలోనే దేవుని పది ఆజ్ఞల రాతిపలకలు వుంచబడినవి. దేవుడు ఈ ఒడంబడికను ఇశ్రాయేలు ప్రజలతో చేసు కొన్నాడు.”

1 యోహాను 4

ఆత్మల్ని పరిశీలించండి

ప్రియ మిత్రులారా! అన్ని ఆత్మల్ని నమ్మకండి. ఆ ఆత్మలు దేవునినుండి వచ్చాయా అన్న విషయాన్ని పరిశీలించండి. ఎందుకంటే, మోసం చేసే ప్రవక్తలు చాలామంది ఈ ప్రపంచంలోకి వచ్చారు. యేసు క్రీస్తు దేవునినుండి శరీరంతో వచ్చాడని అంగీకరించిన ప్రతీ ఆత్మ దేవునికి చెందినదని దేవుని ఆత్మద్వారా మీరు గ్రహించాలి. యేసును అంగీకరించని ప్రతి ఆత్మ దేవునినుండి రాలేదన్నమాట. అలాంటి ఆత్మ క్రీస్తు విరోధికి చెందింది. ఆ ఆత్మలు రానున్నట్లు మీరు విన్నారు. అవి అప్పుడే ప్రపంచంలోకి వచ్చాయి.

బిడ్డలారా! మీరు దేవుని సంతానం కనుక వాటిని జయించగలిగారు. పైగా మీలో ఉన్నవాడు ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళకన్నా గొప్పవాడు. క్రీస్తు విరోధులు ప్రపంచానికి చెందినవాళ్ళు. అందువల్ల వాళ్ళు ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతారు. ప్రపంచం వాళ్ళ మాటలు వింటుంది. మనం దేవునికి చెందిన వాళ్ళం. అందువల్ల దేవుణ్ణి తెలుసుకొన్నవాడు మన మాటలు వింటాడు. కాని దేవునికి చెందనివాడు మన మాటలు వినడు. దీన్నిబట్టి మనము ఏ ఆత్మ సత్యమైనదో, ఏ ఆత్మ అసత్యమైనదో తెలుసుకోగలుగుతాము.

దేవుడు ప్రేమా స్వరూపుడు

ప్రియ మిత్రులారా! ప్రేమ దేవునినుండి వస్తుంది. కనుక మనం పరస్పరం ప్రేమతో ఉందాం. ప్రేమించే వ్యక్తి దేవుని వలన జన్మిస్తాడు. అతనికి దేవుడు తెలుసు. దేవుడు ప్రేమస్వరూపం గలవాడు. ప్రేమలేనివానికి దేవుడెవరో తెలియదు. మనం కుమారునిద్వారా జీవించాలని దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ ప్రపంచంలోకి పంపి తన ప్రేమను మనకు వెల్లడి చేసాడు. 10 మనం ఆయన్ని ప్రేమిస్తున్నందుకు ఆయన ఈ పని చెయ్యలేదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, మన ప్రాయశ్చిత్తానికి బలిగా తన కుమారుణ్ణి పంపాడు. ఇదే ప్రేమ.

11 ప్రియ మిత్రులారా! దేవుడు మనల్ని యింతగా ప్రేమించాడు కనుక మనం కూడా పరస్పరం ప్రేమతో ఉండాలి. 12 దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు. మనం పరస్పరం ప్రేమతో ఉంటే దేవుడు మనలో నివసిస్తాడు. ఆయన ప్రేమ మనలో పరిపూర్ణత చెందుతుంది.

13 ఆయన తన ఆత్మను మనకిచ్చాడు. తద్వారా మనము ఆయనలో జీవిస్తున్నామని, ఆయన మనలో జీవిస్తున్నాడని మనం తెలుసుకోగలుగుతున్నాము. 14 దేవుడు తన కుమారుణ్ణి ప్రపంచాన్ని రక్షించటానికి పంపాడు. ఆయన్ని మేము చూసాము, కాబట్టి సాక్ష్యం చెపుతున్నాము. 15 యేసు దేవుని కుమారుడని అంగీకరించినవానిలో దేవుడు నివసిస్తాడు. దేవునిలో వాడు నివసిస్తున్నాడు. 16 దేవునికి మనపట్ల ప్రేమ ఉందని మనం నమ్ముతున్నాము. ఆ ప్రేమ మనకు తెలుసు.

దేవుడే ప్రేమ. ప్రేమలో జీవించేవాడు దేవునిలో జీవిస్తాడు. దేవుడు అతనిలో జీవిస్తాడు. 17 తీర్పు చెప్పేరోజు మనం ధైర్యంతో ఉండాలని మన మధ్యనున్న ప్రేమ పరిపూర్ణం చెయ్యబడింది. ఎందుకంటే, మనమీ ప్రపంచంలో ఆయనవలె జీవిస్తున్నాము. 18 ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణత పొందిన ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది. ఎందుకంటే, భయం శిక్షకు సంబంధించింది. భయపడే వ్యక్తి ప్రేమలో పరిపూర్ణత పొందలేడు.

19 దేవుడు మనల్ని ప్రేమించినందుకు మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము. 20 “నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను” అని అంటూ తన సోదరుణ్ణి ద్వేషించేవాడు అసత్యమాడుతున్నాడన్న మాట. కనిపిస్తున్న సోదరుణ్ణి ప్రేమించలేనివాడు కనిపించని దేవుణ్ణి ప్రేమించ లేడు. 21 దేవుడు మనకీ ఆజ్ఞనిచ్చాడు: నన్ను ప్రేమించేవాడు తన సోదరుణ్ణి కూడా ప్రేమించాలి.

నహూము 3

నీనెవెకు దుర్వార్త

ఆ హంతకుల నగరానికి చాలా కీడు మూడుతుంది.
    నీనెవె నగరం అబద్ధాల పుట్ట.
ఇతర దేశాలనుండి దోచుకున్న వస్తువులతో అది నిండివుంది.
    అది వెంటాడి చంపిన అనేకమందితో అది నిండివుంది!
కొరడా ఝళిపింపుల ధ్వని,
    చక్రాల సవ్వడి, స్వారీ గుర్రాల గిట్టల ధ్వనులు,
    ఎగిరిపడే రథాల చప్పుడు నీవు వినవచ్చు!
అశ్వదళం వారు దాడి చేస్తున్నారు.
    వారి కత్తులు మెరుస్తున్నాయి.
    వారి ఈటెలు తళుక్కుమంటున్నాయి!
అక్కడ ఎంతోమంది చనిపోయారు.
    శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. శవాలు లెక్కకు మించి వున్నాయి.
    శవాలకు అడ్డంపడి ప్రజలు తొట్రిల్లుతున్నారు.
నీనెవె మూలంగా ఇవన్నీ జరిగాయి.
    తృప్తి చెందని వేశ్యలా నీనెవె ఉంది.
    ఆమె మరింతమందిని కోరుకుంది.
తనను తాను అనేక జనులకు అమ్ముకుంది.
    వారిని తన బానిసలుగా చేసుకోటానికి ఆమె తన మంత్ర విద్యలను ఉపయోగించింది.

సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు:
“నీనెవె, నీకు నేను విరోధిని.
    నీ బట్టలను నీ ముఖంమీదకి లాగుతాను.
నీ నగ్నత్వాన్ని రాజ్యాలన్నిటికీ చూపిస్తాను.
    ఆ రాజ్యాలన్నీ నీవు సిగ్గుపడటం చూస్తాయి.
నీ మీదకు మురికి వస్తువులు విసురుతాను.
    నిన్ను ఏహ్యభావంతో చూస్తాను.
    ప్రజలు నీవంక చూసి నవ్వుతారు.
నిన్ను చూసిన ప్రతి ఒక్కడూ పారిపోతాడు.
    ‘నీనెవె నాశనమయ్యింది.
    ఆమెను గురించి ఏడ్చేవారెవరు?’ అని వారు అంటారు.
నీనెవె, నిన్ను ఓదార్చే వారెవ్వరినీ నేను చూడలేనని నాకు తెలుసు.”

నీనెవే, నైలు నది మీద వున్న తేబేస్[a] (నో-అమోను) నగరం కంటే నీవు మెరుగైన దానవా? కాదు! తేబేస్ చుట్టూ కూడ నీరువుంది. తేబేస్ ఆ నీటిని శత్రువుల నుండి తనను తాను కాపాడుకోటానికి వినియోగించుకొనేది. ఆమె ఆ నీటిని ఒక గోడలా కూడా వినియోగించుకొనేది! కూషీయులును, ఈజిప్టు వారును తేబేస్‌కు మంచి బలాన్నిచ్చారు. పూతు వారు, లూబీయులు ఆమెకు మద్దతు ఇచ్చారు. 10 అయినా తేబేస్ ఓడింపబడింది. ఆమె ప్రజలు పరదేశానికి బందీలుగా పట్టుకుపోబడ్డారు. ప్రతీ వీధి మూలా సైనికులు ఆమె పిల్లలను చావగొట్టారు. ముఖ్యులైన ప్రజలను ఎవరు బానిసలుగా ఉంచుకోవాలి అనే విషయంలో వారు చీట్లు వేశారు. తేబేస్‌లో ప్రముఖులైన వారందరికీ వారు సంకెళ్లు వేశారు.

11 కావున నీనెవే, నీవు కూడా తాగినవానిలా పడిపోతావు! నీవు దాగటానికి ప్రయత్నిస్తావు. శత్రువుకు దూరంగా ఒక సురక్షిత ప్రదేశం కొరకు నీవు చూస్తావు. 12 కాని నీనెవే, నీ దుర్గాలన్నీ అంజూరపు చెట్లలా ఉంటాయి. కొత్త అంజూరపు కాయలు పండుతాయి. ఒకడు వచ్చి, చెట్టును కుదుపుతాడు. అంజూరపు పండ్లు వాని నోట పడతాయి. అతడు వాటిని తింటాడు. అవి అయిపోతాయి!

13 నీనెవే, నీ ప్రజలంతా స్త్రీలవలె ఉన్నారు. శత్రు సైనికులు వారిని పట్టుకు పోవటానికి సిద్ధంగా ఉన్నారు. నీ శత్రువులు లోనికి రావటానికి అనువుగా నీ దేశపు ద్వారాలు పూర్తిగా తెరవబడి ఉన్నాయి. ద్వారాలకు అడ్డంగా వున్న కర్రపట్టీలను అగ్ని కాల్చివేసింది.

14 నీరు తెచ్చి దానిని నీ నగరం లోపల నిలువ చెయ్యి. ఎందుకంటే, శత్రు సైనికులు నీ నగరాన్ని చుట్టుముట్టుతారు. వారు ఎవ్వరినీ నగరంలోకి ఆహారాన్ని, నీటిని తీసుకు రానివ్వరు. నీ కోటలను పటిష్ఠ పర్చుకో! ఇటుకలు విస్తారంగా చేయటానికి బంక మట్టిని తీసుకొనిరా! సున్నము, గచ్చు కలుపు! ఇటుకలు చేయటానికి అచ్చులు తీసుకొనిరా! 15 నీవు ఆ పనులన్నీ చేయవచ్చు. కాని, అగ్ని నిన్ను పూర్తిగా నాశనం చేసి వేస్తుంది! మరియు కత్తి నిన్ను హతమార్చుతుంది. మిడుతల దండు వచ్చి సమస్తాన్ని తినివేసినట్లు నీ దేశం కన్పిస్తుంది.

నీనెవే, నీవు మిక్కిలిగా పెరిగావు. నీవు మిడుతల దండులా వున్నావు. 16 వివిధ ప్రాంతాలకు వెళ్లి సరుకులు కొని వ్యాపారం చేసే వర్తకులు నీకు అనేక మంది ఉన్నారు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో వారు అంతమంది ఉన్నారు! దండులా వచ్చి సర్వాన్ని తినివేసే మిడుతల్లా వారున్నారు. 17 మరియు నీ ప్రభు త్వాధికారులుకూడ మిడుతల్లా వున్నారు. చలిగా ఉన్నలరోజున రాతిగోడపై కుదురుకున్న మిడుతల్లా వారున్నారు. కాని సూర్యుడు పైకి వచ్చినప్పుడు రాళ్లు వేడెక్కగా మిడుతలు ఎగిరిపోతాయి. పైగా అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలియదు! నీ అధికారులు కూడా అలానే వుంటారు.

18 అష్షూరు రాజా, నీ గొర్రెల కాపరులు (నాయకులు) నిద్రకుపడ్డారు. శక్తివంతులగు ఆ మనుష్యులు నిద్రిస్తున్నారు. ఇప్పుడు నీ గొర్రెలు (ప్రజలు) పర్వతాలపై చెదిరిపోయాయి. వాటిని మరల్చుకొని వచ్చేవాడు ఎవ్వడూ లేడు. 19 నీనెవే, నీవు తీవ్రంగా దెబ్బతిన్నావు. నీ గాయాన్ని ఏదీ మాన్పలేదు. నీ వినాశాన్ని గురించి విన్న ప్రతివాడూ చప్పట్లు చరుస్తాడు. వారంతా సంతోషంగా ఉంటారు! ఎందుకంటే, నీవు ఎల్లప్పుడూ కలుగజేసిన బాధను వారంతా అనుభవించారు!

లూకా 19

జక్కయ్య

19 యేసు యెరికోను చేరి ఆ పట్టణం ద్వారా వెళ్తూవున్నాడు. ఆ గ్రామంలో జక్కయ్య అనేవాడు ఉండేవాడు. అతడు పన్నులు సేకరించేవాళ్ళలో పెద్ద అధికారి. గొప్ప ధనికుడు కూడా. జక్కయ్య యేసు ఎవరో చూడాలనుకొన్నాడు. కాని ప్రజలు గుంపులు గుంపులుగా వుండిరి అతడు పొట్టివాడు అవటంవలన యేసును చూడలేకపోయాడు. యేసు ఆ దారిలో వస్తున్నాడని తెలిసి ఆయన్ని చూడటానికి అందిరకన్నా ముందు పరుగెత్తి ఒక మెడి చెట్టెక్కి కూర్చున్నాడు.

యేసు ఆ చెట్టుదగ్గరకు వచ్చాక పైకి చూసి, “జక్కయ్యా! జక్కయ్యా! వెంటనే క్రిందికి దిగిరా! ఈ రోజు నేను నీ యింట్లో బసచెయ్యాలి!” అని అన్నాడు.

అతడు వెంటనే క్రిందికి దిగి ఆనందంతో యేసుకు స్వాగతం చెప్పాడు. ప్రజలు జరిగినదంతా చూసి, “యేసు ఒక పాపి యింట్లో బస చెయ్యటానికి వెళ్తున్నాడే!” అని గొణిగారు.

కాని జక్కయ్య ప్రభువుతో, “ప్రభూ! నేనుయిక్కడే నా ఆస్తిలో సగం పేదవాళ్ళకు యిస్తాను. నేను ఎవరినుండైనా ఏదైనా మోసం చేసి తీసుకొని ఉంటే దానికి నాలుగు రెట్లు వాళ్ళకు చెల్లిస్తాను” అని అన్నాడు.

అప్పుడు యేసు, “ఇతడు కూడా అబ్రాహాము కుమారుడు. కనుక ఈ యింటికి ఈ రోజు రక్షణ వచ్చింది. 10 మనుష్యకుమారుడు తప్పిపోయిన వాళ్ళను వెతికి రక్షించటానికి వచ్చాడు” అని అన్నాడు.

పది మీనాల ఉపమానం

(మత్తయి 25:14-30)

11 ప్రజలు ఆయన చెబుతున్న విషయాలు వింటూ ఉన్నారు. ఆయన యెరూషలేము దగ్గరగా ఉండటం వల్ల ప్రజలు దేవుని రాజ్యం రాబోతొందని అనుకున్నారు. కనుక ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: 12 “గొప్ప కుంటుంబంలో పుట్టినవాడొకడు దూర దేశానికి వెళ్ళి తన దేశానికి రాజుగా నియమింపబడ్డాక తిరిగి రావాలనుకొన్నాడు. 13 వెళ్ళేముందు తన సేవకుల్ని పది మందిని పిలిచి ఒక్కొక్కనికి ఒక మీనాయిచ్చి, ‘నేను తిరిగి వచ్చేదాకా ఈ డబ్బుతో వ్యాపారం చెయ్యండి’ అని అన్నాడు. 14 అతని ప్రజలకు అతడంటే యిష్టం ఉండేది కాదు. కనుక వాళ్ళు తమ ప్రతినిధుల్ని పంపి, ‘ఇతడు మా రాజుగా ఉండటం మాకిష్టం లేదు’ అని చెప్పనంపారు.

15 “అయినా అతడు రాజుగా నియమింపబడ్డాడు. ఆ తర్వాత అతడు తన దేశానికి తిరిగి వచ్చాడు. తాను డబ్బిచ్చిన సేవకులు ఎంత సంపాదించారో కనుక్కోవటానికి వాళ్ళను పిలిపించాడు. 16 మొదటి వాడు వచ్చి, ‘ప్రభూ! మీరిచ్చిన మీనాతో మరొక పది మీనాలు సంపాదించాను’ అని అన్నాడు. 17 ‘మంచిది! నీవు మంచి సేవకుడివి. నీవు చిన్న వాటిలో కూడా ఇంత నమ్మకంగా ఉన్నందుకు పది గ్రామాలపై నీకు అదికారం ఇస్తున్నాను’ అని ఆ రాజు అన్నాడు.

18 “రెండవ వాడు వచ్చి, ‘ప్రభూ! మీరిచ్చిన మీనాతో ఐదు మీనాలు సంపాదించాను’ అని అన్నాడు. 19 ‘నిన్ను ఐదు గ్రామాలపై అధికారిగా నియమిస్తున్నాను’ అని ఆ రాజు అన్నాడు.

20 “మూడవవాడు వచ్చి, ‘ప్రభూ! ఇదిగో మీరిచ్చిన మీనా. దాన్ని నేను ఒక గుడ్డలో చుట్టి దాచి ఉంచాను. 21 మీరు చాలా కఠినాత్ములు కనుక మీరంటే నాకు భయం. మీరు మీవి కానివాటిని లాక్కుంటారు; విత్తకుండానే కోయాలంటారు’ అని అన్నాడు.

22 “ఆ రాజు, ‘ఓరి, దుర్మార్గుడా! నిన్ను శిక్షించటానికి నీ మాటలే ఉపయోగిస్తాను. నేను కఠినాత్ముడనని నీకు తెలుసునన్నమాట. నేను ఇవ్వని వాటిని లాక్కుంటానన్నమాట. విత్తనం వేయకుండా ఫలం పొందుతానన్నమాట. 23 అలాంటప్పుడు నా డబ్బు వడ్డీకి ఎందుకు యివ్వలేదు? అలా చేసివుంటే నేను తిరిగి వచ్చినప్పుడు నా డబ్బు వడ్డీతో సహా నాకు లభించేది కదా!’ అని అన్నాడు. 24 ఆ తర్వాత అక్కడ నిలుచున్న వాళ్ళతో ‘వాని నుండి ఆ మీనా తీసుకొని పదిమీనాలున్న వానికి ఇవ్వండి!’ అని అన్నాడు.

25 “‘అయ్యా! అతని దగ్గర పదిమీనాలున్నాయి కదా!’ అని వాళ్ళు అన్నారు.

26 “అతడు, ‘వున్నవానికి యింకా ఎక్కువ ఇవ్వబడుతుంది. ఏమిలేని వాని నుండి అతని దగ్గర ఉన్నవి కూడా తేసివేయబడతాయి. 27 ఇక నేను తమ రాజుగా ఉండటానికి నిరాకరించిన శత్రువుల్ని పిలుచుకు వచ్చి నా ముందు చంపండి’” అని అన్నాడు.

యేసు యెరూషలేము ప్రవేశించటం

(మత్తయి 21:1-11; మార్కు 11:1-11; యోహాను 12:12-19)

28 యేసు ఈ ఉపమానం చెప్పి యెరూషలేము వైపు ప్రయాణం సాగించాడు. 29-30 వాళ్ళు ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ గ్రామాలను చేరుకొన్నాక యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ, “ముందున్న గ్రామానికి వెళ్ళండి. మీరా గ్రామాన్ని ప్రవేశించగానే స్థంభానికి కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడుతుంది. దాని మీద యిదివరకు ఎవ్వరూ ఎక్కలేదు. దాన్ని విప్పి యిక్కడకు తీసుకొని రండి. 31 ఎవరైనా ‘ఎందుకు విప్పుతున్నారు?’ అని అడిగితే, ఇది ప్రభువుకు కావాలని చెప్పండి” అని అన్నాడు.

32 వాళ్ళు వెళ్ళి ఆయన చెప్పిన విధంగా గాడిద స్థంభానికి కట్టబడి ఉండటం చూసారు. 33 వాళ్ళు దాన్ని విప్పుతుండగా దాని యజమానులు వచ్చి, “గాడిదను ఎందుకు విప్పుతున్నారు?” అని అడిగారు.

34 ఇది “ప్రభువుకు కావాలి” అని వాళ్ళు సమాధానం చెప్పారు. 35 వాళ్ళు దాన్ని యేసు దగ్గరకు తీసుకు వచ్చి తమ వస్త్రాల్ని దానిపై పరిచి, దాని మీద యేసును ఎక్కించారు. 36 ఆయన వెళ్తుండగా, ప్రజలు తమ వస్త్రాల్ని దారి మీద పరిచారు.

37 ఆయన ఒలీవల కొండమీద నుండి క్రిందికి దిగే స్థలాన్ని చేరుకున్నాడు. శిష్యుల గుంపంతా తాము మహత్యాలు చూసినందుకు ఆనందంతో బిగ్గరగా యిలా దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు:

38 “‘ప్రభువు పేరిట రానున్న రాజు ధన్యుడు!’(A)

పరలోకంలో శాంతి! మహోన్నత స్థలాల్లో దేవునికి మహిమ!”

39 గుంపులో ఉన్న కొందరు పరిసయ్యులు యేసుతో, “బోధకుడా! మీ శిష్యుల్ని అదుపులో పెట్టుకో!” అని అన్నారు.

40 యేసు, “వాళ్ళు గొంతెత్తి మాట్లాడటం ఆపితే, రాళ్ళు గొంతెత్తి మాట్లాడటం మొదలు పెడతాయి” అని సమాధానం చెప్పాడు.

యేసు యెరూషలేమును చూచి యేడవటం

41-42 ఆయన యెరూషలేము సమీపిస్తూ ఆ పట్టణాన్ని చూసి ఈ విధంగా విలపించ సాగాడు: “శాంతిని స్థాపించటానికి ఏమి కావాలో నీకు ఈ రోజైనా తెలిసుంటే బాగుండేది. కాని అది నీకిప్పుడు అర్థం కాదు. 43 నీ శత్రువులు నీ చుట్టూ గోడకట్టి నాలుగు వైపులనుండి ముట్టడి చేసే రోజులు రానున్నాయి. 44 వాళ్ళు నిన్ను, నీ ప్రజల్ని నేల మట్టం చేస్తారు. దేవుని రాకను నీవు గమనించలేదు. కనుక వాళ్ళు ఒక రాయి మీద యింకొక రాయి ఉండకుండా చేస్తారు.”

యేసు ఆలయంలోనికి వెళ్ళటం

(మత్తయి 21:12-17; మార్కు 11:15-19; యోహాను 2:13-22)

45 ఆ తర్వాత ఆయన మందిరంలోకి ప్రవేశించి అక్కడ అమ్ముతున్న వ్యాపారస్తుల్ని తరిమి వేయటం మొదలు పెట్టాడు. 46 వాళ్ళతో, “నా ఆలయం ప్రార్థనా ఆలయం.(B) కాని మీరు దాన్ని ‘దొంగలు దాగుకొనే స్థలంగా’(C) మార్చారు!” అని చెప్పబడిందని అన్నాడు.

47 ఆయన ప్రతిరోజు మందిరంలో బోధిస్తూ ఉండే వాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజా నాయకులు ఆయన్ని చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. 48 కాని ప్రజలు యేసు మాటలు శ్రద్ధతో వింటూ ఉండటంవల్ల ఆయన్ని ఏ విధంగా చంపాలో వాళ్ళకు బోధపడలేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International