Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 2

ఆలయ, రాజగృహ నిర్మాణానికి సొలొమోను యత్నం

యెహోవా పేరు ఘనపర్చబడేలా ఆలయ నిర్మాణానికి సొలొమోను సన్నాహం చేశాడు. తన కొరకై ఒక రాజభవనాన్ని కూడ నిర్మించుకోవాలని సొలొమోను తలంచాడు. సొలొమోను డెబ్బైవేల మందిని సరుకు చేరవేయటానికి నియమించాడు. ఎనబైవేల మందిని కొండల్లో రాళ్లు కొట్టడానికి అతడు నియమించాడు. పనివాళ్ల మీద నిఘావుంచడానికి మూడువేల ఆరువందల మందిని నియమించాడు.

తరువాత సొలొమోను హీరాముకు ఒక వర్తమానం పంపాడు. హీరాము తూరు నగరపు రాజు. సొలొమోను హీరాముకు యిలా చెప్పి పంపాడు:

“నీవు నా తండ్రి దావీదుకు సహాయపడినట్లు నాకు కూడ సహాయం చెయ్యి. తను నివసించే భవన నిర్మాణానికి నీవాయనకు సరళ వృక్షాల కలపను పంపావు. నా దేవుడైన యెహోవా గౌరవార్థం నేనొక ఆలయం నిర్మింపదలిచాను. నా ప్రజలు ఆరాధించుకొనటానికి వీలుగా దానిని నా దేవునికి అంకితం చేస్తాను. యెహోవా ముందు ధూపం వేసి, ఆయన సన్నిధిని ప్రతినిత్యం పవిత్రమైన రొట్టెను నైవేద్యంగా వుంచి, బలిపీఠంపై ఉదయం, సాయంత్రం దహనబలులు అర్పిస్తూ, మేము మా దేవుని ఆరాధిస్తాము. సబ్బాతు దినాలలోను, అమావాస్య రోజులందును, మరి ఇతర ప్రత్యేక ఉత్సవ దినాలలోను, తనను ఆరాధించుమని మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞ యిచ్చాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు శాశ్వతంగా పాటించే ఒక నియమం.

“మా దేవుడు మిగిలిన దైవాలకంటె మహోన్నతుడు గనుక, ఆయనకు నేను నిర్మించే ఆలయం కూడా ఉన్నతంగా ఉంటుంది. నిజానికి మానవ మాత్రుడెవ్వడూ మా దేవునికి ఆలయం నిర్మించలేడు. పరలోక భూలోకాలే మా దేవునికి నిలయాలు కాలేనప్పుడు, నేను ఆయనకు ఆలయం నిర్మాణం చేయలేను. నేను కేవలం ఆయన సన్నిధిని ధూపం వేయటానికి ఒక పీఠం మాత్రమే నిర్మించగలను.

“కావున వెండి బంగారు పనులలోను; కంచు, ఇనుము పనులలోను నేర్పరియైన ఒక పనివానిని ఇప్పుడు నా వద్దకు పంపించు. అతడు ఊదా, నీలిరంగు తెరల పనిలో కూడా నేర్పరియై ఉండాలి. నావద్ద వున్న యూదా, యెరూషలేము శిల్పులతో కలిసి అతడు చెక్కడపు పనులు చేయగలిగి ఉండాలి. నా తండ్రియగు దావీదు ఇక్కడ ఈ మనుష్యులను ఎంపిక చేశాడు. సరళ వృక్షాల, దేవదారు వృక్షాల, చందనపు చెట్ల కలపను లెబానోను అడవుల నుండి పంపించు. లెబానోనులో చెట్లను కొట్టడంలో నీ మనుష్యులు అనుభవం కలవారని నాకు తెలుసు. నా సేవకులు నీ మనుష్యులకు సహాయపడతారు. సాధ్యమైనంత ఎక్కువ కలపను నాకు పంపించు. నేను నిర్మించబోయే ఆలయం చాల గొప్పదై, అద్భుతమైనదిగా వుంటుంది. 10 కలప నరికే పనివారికి ఆహారం నిమిత్తం నేను నాలుగు వందల గరిసెల[a] గోధుములు, నాలుగు వందల గరిసెల యవలు, ఒక లక్షా పదిహేను వేల గేలనుల (మూడు వేల ఎనిమిది వందల పడులు లేక ఇరువది వేల బాదులు) ద్రాక్షారసమును, అదే పరిమాణములో నూనెను కేటాయిస్తున్నాను.”

11 సొలొమోనుకు సమాధానమిస్తూ, హీరాము ఒక వర్తమానాన్ని పంపాడు. ఆ వర్తమానం ఇలా వుంది:

“సొలొమోనూ, యెహోవా తన ప్రజలను ప్రేమిస్తున్నాడు. అందువల్లనే ఆయన నిన్ను వారికి రాజుగా నియమించాడు.” 12 హీరాము తన సందేశంలో ఇంకా యిలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు స్తోత్రం చేయండి! ఆయన ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. ఆయన రాజైన దావీదుకు ఒక తెలివైన కుమారుని ప్రసాదించాడు. సొలొమోనూ, నీకు తెలివి, అవగాహన వున్నాయి. నీవు యెహోవా కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నావు. నీకొరకు నీవొక రాజభవనాన్ని కూడా నిర్మింప తలపెట్టావు. 13 నేను నీ వద్దకు ఒక నైపుణ్యంగల పనివానిని పంపుతాను. అతడు రకరకాల కళలలో అభిరుచి, అనుభవం వున్నవాడు. అతని పేరు హూరాము అబీ. 14 అతని తల్లి దాను వంశస్థురాలు. అతని తండ్రి తూరు నగరవాసి. హూరాము – అబీ బంగారం, వెండి, కంచు, ఇనుము, రాతి, కలప పనులలో బహు నేర్పరి. హూరాము – అబీ ఊదా, నీలి, ఎర్రపు రంగుల వస్తువుల, ఖరీదైన వస్త్రాల పనులలో కూడ మంచి నేర్పరి. పైగా హూరాము – అబీ చెక్కడపు పనులలో కూడా నిపుణుడు. నీవు చూపిన ఏ నమూనానైనా అతడు అర్థం చేసికొని దాని ప్రకారం పనిచేయగల నేర్పరి. అతడు నీ వద్ద వున్న శిల్పులకు, కళాకారులకు సహాయకారిగా వుంటాడు. దావీదు ఏర్పరచిన కళాకారులకు కూడ సహాయపడతాడు. నీ తండ్రియగు దావీదు మాటను నేను అనుసరిస్తాను.

15 “నీవు గోధుమలు, యవలు, నూనె, ద్రాక్షారసం నాకు పంపుతానని వ్రాశావు. వాటిని నా పనివాళ్ల నిమిత్తం పంపించు. 16 లెబానోను దేశంలో మేము కలప నరుకుతాము. నీకు ఎంత కలప కావాలో అంత కలప నరుకుతాము. ఆ కలపనంతా తెప్పలుగా కట్టి యొప్పె పట్టణం మీదుగా సముద్రం మీద పంపుతాము. తరువాత ఆ కలపను నీవు యెరూషలేముకు బండ్లమీద మోయించవచ్చు.”

17 అప్పుడు సొలొమోను ఇశ్రాయేలులో నివసిస్తున్న విదేశీయులందరినీ లెక్కించాడు. ఇది దావీదు జనాభా లెక్కలు తీయించిన తరువాత జరిగింది. దావీదు సొలొమోను తండ్రి. దేశంలో ఒక లక్షా ఏబై మూడువేల ఆరువందల మంది పరదేశీయులున్నట్లు వారు కనుగొన్నారు. 18 బరువులు మోయటానికి డెబ్బై వేలమంది విదేశీయులను సొలొమోను నియమించాడు. కొండల్లో రాళ్లు చెక్కటానికి ఎనబై వేల మంది విదేశీయులను దావీదు నియమించాడు. పనివారిపై విచారణ చేయడానికి మరి మూడువేల ఆరువందల విదేశీయులను సొలొమోను ఎంపిక చేశాడు.

1 యోహాను 2

యేసు మన సహాయకుడు

బిడ్డలారా! మీరు పాపం చెయ్యకూడదని మీకు లేఖను వ్రాస్తున్నాను. ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే, మన పక్షాన తండ్రితో మాట్లాడేందుకు న్యాయవాది అయిన యేసు క్రీస్తు ఉన్నాడు. ఆయన మన పాప పరిహారార్థం బలి అయ్యాడు. మన పాపాల కోసమే కాకుండా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి పాపాలకోసం బలి అయ్యాడు.

ఆయన ఆజ్ఞల్ని మనం ఆచరిస్తే, ఆయన మనకు తెలుసుననే విశ్వాసం మనలో కలుగుతుంది. ఆయన నాకు తెలుసని అంటూ ఆయన ఆజ్ఞల్ని పాటించనివాడు అబద్ధాలాడుతున్నాడన్నమాట. అలాంటి వ్యక్తిలో సత్యం ఉండదు. యేసు ఆజ్ఞల్ని పాటించినవానిలో దేవుని ప్రేమ సంపూర్ణంగా ఉంటుంది. తద్వారా మనం ఆయనలో ఉన్నామని తెలుసుకొంటాము. యేసులో జీవిస్తున్నానని చెప్పుకొనేవాడు, ఆయనలా నడుచుకోవాలి.

మనం యితరుల్ని ప్రేమించాలని యేసు చెప్పాడు

ప్రియ మిత్రులారా! నేను మీ కోసం క్రొత్త ఆజ్ఞను వ్రాయటం లేదు. మొదటినుండి మీ దగ్గర ఉన్న పాత ఆజ్ఞనే వ్రాస్తున్నాను. మీరు విన్న సందేశమే ఈ పాత ఆజ్ఞ. అయినా, ఆ ఆజ్ఞను ఒక క్రొత్త ఆజ్ఞగా మీ కోసం వ్రాస్తున్నాను. దాని సత్యం అందరిలో కనిపిస్తోంది. చీకటి గతిస్తోంది. నిజమైన వెలుగు ప్రకాశించటం మొదలు పెట్టింది.

తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొంటూ తన సోదరుణ్ణి ద్వేషించేవాడు యింకా అంధకారంలో ఉన్నాడన్నమాట. 10 సోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో జీవిస్తాడు. అతనిలో ఏ ఆటంక కారణం ఉండదు. 11 కాని సోదరుణ్ణి ద్వేషించేవాడు అంధకారంలోనే ఉండిపోతాడు. అంటే, ఆ అంధకారంలోనే తిరుగుతూ ఉంటాడన్న మాట. చీకటి అతణ్ణి గ్రుడ్డివానిగా చేసింది కాబట్టి తానెక్కడికి వెళ్తున్నది అతనికే తెలియదు.

12 బిడ్డలారా! ఆయన పేరిట మీ పాపాలు క్షమించబడ్డాయి.
    అందుకే మీకు వ్రాస్తున్నాను!
13 వృద్ధులారా! మొదటినుండి ఉన్నవాడెవరో మీకు తెలుసు!
    అందుకే మీకు వ్రాస్తున్నాను!
యువకులారా! మీరు సాతాన్ను గెలిచారు.
    అందుకే మీకు వ్రాస్తున్నాను!
14 బిడ్డలారా! తండ్రిని మీరెరుగుదురు.
    అందుకే మీకు వ్రాస్తున్నాను.
వృద్ధులారా! మొదటినుండి ఉన్నవాణ్ణి మీరెరుగుదురు.
    అందుకే మీకు వ్రాస్తున్నాను!
యువకులారా! మీలో బలం ఉంది.
    దేవుని సందేశం మీలో జీవిస్తోంది.
మీరు సాతానును గెలిచారు.
    అందుకే మీకు వ్రాస్తున్నాను.

15 ప్రపంచాన్ని కాని, ప్రపంచంలో ఉన్నవాటిని కాని ప్రేమించకండి. అంటే, ప్రపంచాన్ని ప్రేమించే వ్యక్తిలో తండ్రి ప్రేమ ఉండదన్నమాట. 16 శారీరక వాంఛలు, కళ్ళలోని దురాశలు, ఒకడు చేసేదాన్ని బట్టి, కలిగియున్న దాన్ని బట్టి కలిగే గర్వం తండ్రికి సంబంధించినవి కావు. ఇవి ప్రపంచానికి సంబంధించినవి. 17 ఈ ప్రపంచము, దానిలో ఉన్న ఆశలు నశించిపోతాయి. కాని దైవేచ్ఛానుసారం జీవించే వ్యక్తి శాశ్వతంగా జీవిస్తాడు.

క్రీస్తు విరోధుల విషయంలో జాగ్రత్త

18 బిడ్డలారా! ఇది చివరి గడియ. క్రీస్తు విరోధి రానున్నాడని మీరు విన్నారు. ఇప్పటికే క్రీస్తు విరోధులు చాలా మంది వచ్చారు. తద్వారా యిది చివరి గడియ అని తెలిసింది. 19 క్రీస్తు విరోధులు మననుండి విడిపొయ్యారు. నిజానికి, వాళ్ళు మనవాళ్ళు కారు. ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళైనట్లయితే మనతోనే ఉండిపొయ్యేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోవటం, వాళ్ళలో ఎవ్వరూ మనవాళ్ళు కారని తెలుపుతోంది.

20 కాని దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. తద్వారా మీరంతా సత్యాన్ని గురించి తెలుసుకొన్నారు. 21 మీకు సత్యాన్ని గురించి తెలియదని భావించి నేను మీకు వ్రాస్తున్నాననుకోకండి. సత్యాన్ని గురించి మీకు తెలుసు. పైగా సత్యంనుండి అసత్యం బయటకు రాదు.

22 అసత్యమాడేవాడెవ్వడు? యేసే క్రీస్తు కాదని అనేవాడు. అతడే క్రీస్తు విరోధి. అలాంటి వ్యక్తి తండ్రిని, కుమారుణ్ణి నిరాకరిస్తాడు. 23 కుమారుణ్ణి నిరాకరించే వ్యక్తికి తండ్రి రక్షణ ఉండదు. కుమారుణ్ణి అంగీకరించే వ్యక్తికి తండ్రి రక్షణ తోడుగా ఉంటుంది.

24 మొదట మీరు విన్నవి మీలో ఉండిపోయేటట్లు చూసుకోండి. అప్పుడే మీరు కుమారునిలో, తండ్రిలో జీవించగలుగుతారు. 25 పైగా ఆయన మనకు నిత్యజీవం గురించి వాగ్దానం చేసాడు.

26 ఇవన్నీ మిమ్మల్ని తప్పుదారి పట్టించటానికి ప్రయత్నం చేస్తున్నవాళ్ళను గురించి వ్రాస్తున్నాను. 27 ఇక మీ విషయం అంటారా? దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. దానివల్ల కలిగిన ఫలం మీలో ఉంది. మీకెవ్వరూ బోధించవలసిన అవసరం లేదు. ఆ అభిషేకం వల్ల మీలో జ్ఞానం కలుగుతుంది. దేవుడు మీకు నిజంగా అభిషేకమిచ్చాడు. అది అసత్యం కాదు. ఆయన బోధించిన విధంగా ఆయనలో నివసించండి.

28 బిడ్డలారా! ఆయన ప్రత్యక్ష్యమైనప్పుడు మనలో ధైర్యం ఉండేటట్లు, ఆయన సమక్షంలో సిగ్గు పడకుండా ఉండేటట్లు ఆయనలో జీవిస్తూ ఉండండి. 29 ఆయన నీతిమంతుడని మీకు తెలిసి ఉంటే నీతిని అనుసరించే ప్రతి ఒక్కడూ ఆయననుండి జన్మించాడని మీరు గ్రహిస్తారు.

నహూము 1

ఎల్కోషువాడైన నహూముకు కలిగిన దర్శనాన్ని వివరించే గ్రంథం. ఇది నీనెవె నగరాన్ని గూర్చిన దుఃఖకరమైన సమాచారం.

నీనెవె పట్ల యెహోవా కోపం

యెహోవా రోషంగల దేవుడు!
    యెహోవా నేరస్తులను శిక్షంపబోతున్నాడు.
యెహోవా తన శత్రువులను శిక్షిస్తాడు.
    ఆయన తన శత్రువులపై తన కోపాన్ని నిలుపుతాడు.
యెహోవా ఓర్పు గలవాడు.
    కాని ఆయన మిక్కిలి శక్తిమంతుడు.
యెహోవా నేరం చేసిన జనులను శిక్షిస్తాడు.
    ఆయన వారిని ఊరికే వదిలి పెట్టడు.
దుష్టజనులను శిక్షంచటానికి యెహోవా వస్తున్నాడు. ఆయన తన శక్తిని చూపటానికి సుడిగాలులను, తుఫానులను ఉపయోగిస్తాడు.
    మానవుడు నేలమీద మట్టిలో నడుస్తాడు. కాని యెహోవా మేఘాలపై నడుస్తాడు!
యెహోవా సముద్రంతో కోపంగా మాట్లాడితే, అది ఎండిపోతుంది.
    ఆయన నదులన్నీ ఇంకిపోయేలా చేస్తాడు!
బాషానులోని, కర్మెలులోని సారవంతమైన భూములన్నీ ఎండి, నశించి పోతాయి.
    లెబానోనులోని పుష్పాలన్నీ వాడి పోతాయి.
యెహోవా వస్తాడు.
    పర్వతాలన్నీ భయంతో కంపిస్తాయి.
    కొండలు కరిగిపోతాయి.
యెహోవా వస్తాడు.
    భయంతో భూమి కంపిస్తుంది.
ఈ ప్రపంచం, అందులో నివసించే
    ప్రతివాడూ భయంతో వణుకుతాడు.
యెహోవా మహాకోపం ముందు ఎవ్వరూ నిలువలేరు.
    ఆయన భయంకర కోపాన్ని ఎవ్వరూ భరించలేరు.
ఆయన కోపం అగ్నిలా దహించి వేస్తుంది.
    ఆయన రాకతో బండలు బద్దలై చెదిరిపోతాయి.
యెహోవా మంచివాడు,
    ఆపద సమయంలో తలదాచుకోటానికి ఆయన సురక్షిత స్థలం.
    ఆయనను నమ్మినవారిపట్ల ఆయన శ్రద్ధ తీసుకుంటాడు.
ఆయన తన శత్రువులను సర్వనాశనం చేస్తాడు.
    ఆయన వరదలా వారిని తుడిచి పెడతాడు.
    ఆయన తన శత్రువులను అంధకారంలోకి తరిమి వేస్తాడు.
యూదా, యెహోవాపై కుట్రలు ఎందుకు పన్నుతున్నావు?
    కాని ఆయన వారి పన్నాగాలన్నిటినీ వమ్ము చేస్తాడు.
    కష్టం రెండవసారి రాదు.
10 చిక్కుపడిన ముండ్లపొదలా
    నీ శత్రువు నాశనం చేయబడతాడు.
ఎండిన కలుపు మొక్కల్లా
    వారు వేగంగా కాలిపోతారు.

11 అష్షూరూ, నీలోనుండి ఒక మనిషి వచ్చాడు. అతడు యెహోవాకు వ్యతిరేకంగా దుష్ట పథకాలు వేశాడు.
    అతడు చెడు సలహా ఇచ్చాడు.
12 యెహోవా ఈ విషయాలు యూదాకు చెప్పాడు:
“అష్షూరు ప్రజలు పూర్తి బలం కలిగి ఉన్నారు.
    వారికి చాలామంది సైనికులున్నారు. కాని వారంతా నరికి వేయబడతారు.
    వారంతా అంతం చేయబడతారు.
నా ప్రజలారా, మీరు బాధ పడేలా చేశాను.
    కాని ఇక మిమ్మల్ని బాధపడనీయను.
13 అష్షూరు అధికారాన్నుండి ఇప్పుడు మిమ్మల్ని విడిపిస్తాను.
    మీ మెడమీదనుండి ఆ కాడిని తీసివేస్తాను.
    మిమ్మల్నిబంధించిన గొలుసులను తెంచి వేస్తాను.”

14 అష్షూరు రాజా, నీ విషయంలో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చాడు.
    “నీ పేరు పెట్టుకోటానికి నీ సంతతివారు ఉండరు.
నీ దేవుళ్ల ఆలయాలలో నెలకొల్పిన,
    చెక్కిన విగ్రహాలను, లోహపు బొమ్మలను నేను తీసివేస్తాను.
నేను నీ కొరకు నీ సమాధిని తయారు చేస్తున్నాను.
    నీవు ముఖ్యుడవు కావు!”

15 యూదా, చూడు!
    పర్వతాలమీదనుండి వస్తున్నది, అక్కడ చూడు. శుభవార్త తీసుకొని ఒక దూత ఇక్కడికి వస్తున్నాడు!
    శాంతి ఉన్నదని అతడు చెపుతున్నాడు!
యూదా, నీ ప్రత్యేక పండుగలను జరుపుకో!
    యూదా, నీవు మాట ఇచ్చిన వాటిని నెరవేర్చు.
దుష్ట జనులు మళ్లీ నీ మీద దాడి చేసి నిన్ను ఓడించలేరు!
    ఆ దుష్ట జనులందరూ నాశనం చేయబడ్డారు.

లూకా 17

పాపము మరియు క్షమాపణ

(మత్తయి 18:6-7, 21-22; మార్కు 9:42)

17 యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “ప్రజలు పాపం చేసే పరిస్థితులు కలుగచేసే వాళ్ళకు శిక్ష తప్పదు. ఈ అమాయకుల్లో ఏ ఒక్కడు పాపం చేసేటట్లు చేసినా శిక్ష తప్పదు. అది జరుగక ముందే అలాంటి వాని మెడకు తిరగటి రాయి కట్టి సముద్రంలో పడవేస్తే అది అతనికి మేలు చేసినట్లవుతుంది. అందువల్ల జాగ్రత్త!

“మీ సోదరుడు పాపం చేస్తే గద్దించండి. పశ్చాత్తాపం చెందితే క్షమించండి. అతడు రోజుకు ఏడుసార్లు మీ పట్ల పాపం చేసి ఏడుసార్లు మీ దగ్గరకు వచ్చి, ‘నేను పశ్చాత్తాపం చెందాను’ అని అంటే అతణ్ణి క్షమించండి.”

నీ విశ్వాసము ఎంత గొప్పది

అపొస్తలులు ప్రభువుతో, “మా విశ్వాసాన్ని గట్టి పరచండి” అని అన్నారు.

ప్రభువు అన్నాడు: “మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నాచాలు; మీరు కంబళి చెట్టుతో, ‘నీవు నీ వేర్లతో బాటు పెళ్లగింపబడి వెళ్ళి సముద్రంలో పడి అక్కడ నాటుకుపో!’ అని అంటే అది మీ మాట వింటుంది.

సేవకుని కర్తవ్యం

“మీ పొలం దున్నే సేవకుడో లేక మీ గొఱ్ఱెలు కాచే సేవకుడో ఒకడున్నాడనుకోండి. అతడు పొలం నుండి యింటికి రాగానే, ‘రా! వచ్చి కూర్చొని భోజనం చెయ్యి’ అని అతనితో అంటారా? అనరు. దీనికి మారుగా, ‘వంటవండి, దుస్తులు మార్చుకొని, నేను తిని త్రాగేదాకా పనిచేస్తూవుండు. ఆ తర్వాత నువ్వు కూడా తిని త్రాగు’ అని అంటారు. మీరు చెప్పినట్లు విన్నందుకు మీ సేవకునికి కృతజ్ఞత తెలుపుకుంటారా? 10 మీరు కూడా చెప్పిన విధంగా చేసాక ‘మేము మామూలు సేవకులము, చెప్పినట్లు చేసాము. అది మా కర్తవ్యం’ అని అనాలి.”

పదిమంది కుష్టురోగులకు నయం చెయ్యటం

11 యేసు యెరూషలేముకు ప్రయాణం సాగిస్తూ గలిలయ నుండి సమరయ పొలిమేరలకు వచ్చాడు. 12 ఒక గ్రామంలోకి వెళ్తూండగా పదిమంది కుష్టురోగులు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఆయనకు కొద్ది దూరంలో నిలుచొని, 13 “యేసు ప్రభూ! మాపై దయచూపు” అని బిగ్గరగా అన్నారు.

14 ఆయన వాళ్ళను చూసి, “వెళ్ళి యాజకులకు చూపండి” అని అన్నాడు.

వాళ్ళు వెళ్తూంటే వాళ్ళకు నయమైపోయింది. 15 వాళ్ళలో ఒకడు తనకు నయమవటం గమనించి, గొంతెత్తి దేవుణ్ణి స్తుతిస్తూ వెనక్కు వెళ్ళాడు. 16 యేసు ముందు మోకరిల్లి కృతజ్ఞత చెప్పుకున్నాడు. అతడు సమరయ వాడు. 17 యేసు, “పది మందికి నయమైంది కదా! మిగతా తొమ్మిది మంది ఏరి? 18 ఈ సమరయుడు తప్ప మరెవ్వరూ దేవుణ్ణి స్తుతించటానికి తిరిగి రాలేదా?” అని అన్నాడు. 19 ఆ తర్వాత అతనితో, “లేచి వెళ్ళు, నీ విశ్వాసమే నీకు నయం చేసింది” అని అన్నాడు.

దేవుని రాజ్యం రావటం

(మత్తయి 24:23-28, 37-41)

20 కొందరు పరిసయ్యులు, “దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది” అని అడిగారు.

యేసు, “దేవుని రాజ్యం అందరికి కనిపించేలా రాదు. 21 ‘ఇదిగో, దేవుని రాజ్యం ఇక్కడ ఉంది; అదిగో అక్కడ ఉంది’ అని ఎవరూ అనరు. ఎందుకంటే దేవుని రాజ్యం మీలో ఉంది!” అని సమాధానం చెప్పాడు.

22 ఆ తర్వాత, తన శిష్యులతో, “మనుష్యకుమారుడు మీతో ఒక్క రోజన్నా ఉండాలని మీరు తహతహలాడే సమయం వస్తుంది. కాని అలా జరగదు. 23 ప్రజలు, ‘అదిగో అక్కడ ఉన్నాడని’ కాని, లేక ‘ఇదిగో ఇక్కడున్నాడని’ కాని అంటే వాళ్ళ వెంట పరుగెత్తి వెళ్ళకండి.

24 “ఎందుకంటే మనుష్యకుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆకాశంలో ఈ చివరినుండి ఆ చివరి దాకా మెరిసే మెరుపులా ఉంటాడు. 25 కాని దానికి ముందు ఆయన ఎన్నో కష్టాలు అనుభవించాలి. ఈ తరం వాళ్ళతో తృణీకరింపబడాలి.

26 “నోవహు కాలంలో జరిగిన విధంగా మనుష్యకుమారుని కాలంలో కూడా జరుగుతుంది. 27 నోవహు నావలో ప్రవేశించేదాకా ప్రజలు తింటూ, త్రాగుతూ, వివాహాలు చేస్తూ, వివాహాలు చేసుకొంటూ గడిపారు. అతడు నావలో ప్రవేశించాక వరదలు రాగా మిగిలిన వాళ్ళందరూ నాశనమయ్యారు.

28 “లోతు కాలంలో కూడా అదేవిధంగా జరిగింది. ప్రజలు తింటూ, త్రాగుతూ, అమ్ముతూ, కొంటూ, పొలాలు సాగుచేస్తూ, ఇళ్ళు కడుతూ జీవించారు. 29 కాని లోతు సొదొమ పట్టణం వదిలి వెళ్ళిన వెంటనే ఆకాశం నుండి మంటలు, గంధకము వర్షంలా కురిసి అందర్ని నాశనం చేసింది. 30 మనుష్యకుమారుణ్ణి దేవుడు వ్యక్తం చేసిన రోజు కూడా ఇదే విధంగా జరుగుతుంది.

31 “ఆ రోజు ఇంటి కప్పు మీదనున్న వాళ్ళు తమ వస్తువులు తెచ్చుకోవటానికి ఇళ్ళలోకి వెళ్ళరాదు. అదే విధంగా పొలాల్లో ఉన్నవాళ్ళు ఏ వస్తువు కోసం ఇంటికి తిరిగి వెళ్ళరాదు. 32 లోతు భార్యను జ్ఞాపకం తెచ్చుకొండి.

33 “తన ప్రాణాన్ని కాపాడు కోవాలనుకొన్నవాడు పోగొట్టుకొంటాడు. ప్రాణం పోగొట్టుకోవటానికి సిద్దంగా ఉన్నవాడు తన ప్రాణం కాపాడుకొంటాడు. 34 ఆ రాత్రి ఒక పడక మీద ఇద్దరు నిద్రిస్తూ ఉంటే ఒకడు వదిలి వేయబడి మరొకడు తీసుకొని వెళ్ళబడతాడు. 35 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే ఒకామె తీసుకు వెళ్ళబడుతుంది, మరొకామె వదిలి వేయబడుతుంది” అని అన్నాడు. 36 [a]

37 “ఇవి ఎక్కడ సంభవిస్తాయి ప్రభూ!” అని వాళ్ళు అడిగారు.

ఆయన, “ఎక్కడ శవముంటే అక్కడ రాబందులుంటాయి” అని సమాధానం చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International