M’Cheyne Bible Reading Plan
ఇశ్రాయేలీయులను లెక్కించిన దావీదు పాపం
21 ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా సాతాను పనిచేస్తూవున్నాడు. ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలు తీసేటందుకు అతడు దావీదును ప్రోత్సహించాడు.[a] 2 కావున దావీదు యోవాబును, ఇతర ప్రజా నాయకులను పిలిచి ఇశ్రాయేలు ప్రజలందరినీ లెక్కపెట్టి ఎంతమంది వున్నారో చెప్పమన్నాడు. “దేశంలో బెయేర్షెబా నుండి దాను పట్టణం వరకు ప్రతి ఒక్కరినీ లెక్కపెట్టి నాకు చెప్పండి. అప్పుడు దేశ జనాభా వివరాలు నాకు తెలుస్తాయి” అని అన్నాడు.
3 కాని యోవాబు ఇలా సమాధానమిచ్చాడు: “యెహోవా తన రాజ్యాన్ని వందరెట్లు అభివృద్ధి చేయుగాక! నా ఏలినవాడా, మహారాజా! ఇశ్రాయేలు ప్రజలంతా నీ సేవకులు. ఈ పని నీవెందుకు చేయదలిచావు? దీనివల్ల నీవు ఇశ్రాయేలు ప్రజలందరినీ పాపం చేసిన నేరస్థులుగా చిత్రిస్తున్నావు!”
4 కాని రాజైన దావీదు మొండివైఖరి దాల్చాడు. రాజు చెప్పినట్లు యోవాబు చేయక తప్పలేదు. అందువల్ల యోవాబు ఇశ్రాయేలు దేశంలో ప్రజలను లెక్కిస్తూ నలుమూలలా తిరిగాడు. తరువాత యోవాబు యెరూషలేముకు తిరిగి వచ్చి 5 దేశంలో ఎంత జనాభా వున్నదీ దావీదుకు చెప్పాడు. ఇశ్రాయేలులో కత్తి పట్టగల యోధులు పదకొండు లక్షల మంది వున్నారు. యూదాలో కత్తి పట్టగల శూరులు నాలుగు లక్షల డెబ్బది వేలమంది వున్నారు. 6 లేవి, బెన్యామీను వంశీయులను మాత్రం యోవాబు లెక్కించలేదు. రాజైన దావీదు ఆజ్ఞ తనకు ఇష్టం లేనిదైనందుననే యోవాబు ఆ వంశీయులను గణించలేదు. 7 దేవుని దృష్టిలో దావీదు గొప్ప తప్పిదం చేశాడు. అందువల్ల దేవుడు ఇశ్రాయేలును శిక్షించాడు.
ఇశ్రాయేలును దేవుడు శిక్షించటం
8 పిమ్మట దేవునితో దావీదు ఇలా విన్నవించుకున్నాడు: “నేను చాలా తెలివితక్కువ పనిచేశాను. ఇశ్రాయేలు జనాభా లెక్కలు తీయించి నేను ఒక మహాపాపం చేశాను. ఇప్పుడు నీ సేవకుడనైన నా తప్పు మన్నించి నా పాపాన్ని తొలగించమని వేడుకుంటున్నాను.”
9-10 గాదు ఒక దీర్ఘదర్శి (ప్రవక్త), దావీదుకు భవిష్యత్తును చెప్పే మార్గదర్శకుడు. ఒకనాడు గాదుతో యెహోవా ఇలా అన్నాడు: “నీవు వెళ్లి దావీదుకు ఇలా చెప్పుము: ‘యెహోవా ఈ విధంగా తెలియజేస్తున్నాడు: నేను నీకు మూడు అవకాశాలు సూచిస్తున్నాను. వాటిలో నీవు ఒక దానిని ఎంపిక చేయాలి. అప్పుడు నీవు కోరిన విధంగా నిన్ను శిక్షిస్తాను.’”
11-12 ప్రవక్తయగు గాదు తరువాత దావీదు వద్దకు వెళ్లి ఈ విధంగా చెప్పాడు: “యెహోవా సెలవిచ్చునదేమనగా, ‘దావీదూ, నీకు ఏ శిక్ష కావాలో నీవే కోరుకో మూడు సంవత్సరాల కరువు పరిస్థితి, లేక నీ శత్రువులు కత్తిపట్టి మిమ్మల్ని తరుముకుంటూ రాగా మూడు నెలల పాటు మీరు వారి నుండి పారిపోవుట లేక యెహోవా మిమ్మల్ని మూడు రోజులు శిక్షకు గురిచేయుట. అనగా ఈ మూడు రోజుల్లో దేశమంతా భయంకర వ్యాధులు ప్రబలుతాయి. యెహోవా దూత దేశం నలుమూలలా తిరుగుతూ ప్రజానాశనం చేస్తాడు’. దావీదూ, దేవుడు ఇప్పుడు నన్ను పంపియున్నాడు. కావున దేవునికి నేను ఏమి సమాధానం చెప్పాలో నిర్ణయించి నీవు నాకు తప్పక తెలియజేయాలి.”
13 అందుకు ప్రవక్తయగు గాదుతో దావీదు ఇలా అన్నాడు: “నేను ఆపదలో వున్నాను. నాకు శిక్ష విధించటానికి వేరొక మనుష్యుని నిర్ణయం నాకు అక్కరలేదు. యెహోవా దయామయుడు. కావున నన్ను ఎలా శిక్షించాలో యెహోవానే నిర్ణయించనీయుము.”
14 అప్పుడు యెహోవా ఇశ్రాయేలంతా భయంకర వ్యాధులు సోకేలా చేశాడు. దానితో డెబ్బయి వేల మంది ప్రజలు చనిపోయారు. 15 యెరూషలేమును నాశనం చేయటానికి దేవుడు ఒక దేవదూతను పంపాడు. ఆ దేవదూత యెరూషలేమును నాశనం చేయ మొదలు పెట్టినప్పుడు యెహోవా చూసి బాధపడ్డాడు. అందువల్ల ఇశ్రాయేలును నాశనం చేయకూడదని ఆయన అనుకున్నాడు. ఇశ్రాయేలును నాశనం చేస్తున్న దేవదూతతో యెహోవా. “అది చాలు! ఆపివేయి” అని అన్నాడు. యెహోవాదూత యెబూసీయుడగు[b] ఒర్నాను నూర్పిడి కళ్లం వద్ద నిలబడివున్నాడు.
16 దావీదు తలఎత్తి చూడగా యెహోవాదూత ఆకాశంలో కన్పించాడు. దేవదూత తన ఖడ్గాన్ని యెరూషలేము పైకి చాపివున్నాడు. అప్పుడు దావీదు, తదితర పెద్దలు సాష్టాంగ నమస్కారం చేశారు. దావీదు, ఇతర పెద్దలు తమ సంతాపాన్ని తెలియజేసే ప్రత్యేక దుస్తులు ధరించారు. 17 దావీదు యెహోవాతో ఇలా విన్నవించుకున్నాడు: “పాపం చేసిన వాణ్ణి నేను! జనాభా లెక్కలు తీయమని నేనే ఆజ్ఞాపించాను! నేను పొరపాటు చేశాను! కాని ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏమి నేరం చేశారు? నా దేవుడైన యెహోవా, నన్ను, నా కుటుంబాన్ని శిక్షించుము! నీ ప్రజలను నాశనం చేస్తున్న మహావ్యాధులను అరికట్టుము!”
18 అప్పుడు యెహోవాదూత ప్రవక్తయగు గాదుతో ఇలా అన్నాడు: “యెహోవాను ఆరాధించటానికి ఒక బలిపీఠం నిర్మించమని దావీదుకు చెప్పుము. యెబూసీయుడగు ఒర్నాను నూర్పిడి కళ్లం వద్దనే దావీదు ఆ బలిపీఠాన్ని నిర్మించాలి.” 19 గాదు ఆ విషయాలను దావీదుకు తెలియజేశాడు. దావీదు ఒర్నాను నూర్పిడి కళ్లం వద్దకు వెళ్లాడు.
20 ఒర్నాను గోధుమ పోతపోస్తున్నాడు. అతను తిరిగి చూసి యెహోవా దూతను గమనించాడు. ఒర్నాను నలుగురు కుమారులూ పారిపోయి దాక్కున్నారు. 21 దావీదు ఒర్నాను వద్దకు వస్తున్నాడు. ఒర్నాను తన కళ్లం వదిలి దావీదు వద్దకు వెళ్లి అతని ముందు సాష్టాంగపడ్డాడు.
22 దావీదు ఒర్నానుతో, “నీ నూర్పిడి కళ్లాన్ని నాకివ్వు. ఈ స్థలంలో యెహోవాని ఆరాధించటానికి నేనొక బలిపీఠాన్ని నిర్మిస్తాను. ఈ కళ్లాన్ని పూర్తి ధరకు నాకు అమ్మివేయి. అప్పుడు ఈ భయంకర వ్యాధులు ఆగిపోతాయి” అని చెప్పాడు.
23 ఒర్నాను దావీదుకు ఇలా సమాధానమిచ్చాడు: “ఈ నూర్పిడి కళ్లాన్ని తీసుకొనుము! నీవు నా ఏలినవాడవైన రాజువు. నీవు కోరిన విధంగా చేయుము. దహన బలులుగా సమర్పించటానికి నేను నీకు పశువులను కూడ ఇస్తాను. పీఠం మీద అగ్ని వెలిగించటానికి కళ్లంలో వేసే బల్ల చెక్కలను కూడ ఇస్తాను. ధాన్యార్పణను చెల్లించటానికి నేను గోధుమలు కూడ ఇస్తాను. నేను ఇవన్నీ నీకు ఇస్తాను!”
24 కాని దావీదు ఒర్నానుతో ఇలా అన్నాడు: “వద్దు నేను పూర్తి వెలయిచ్చే దీనిని కొనాలి. నీకు చెందినదేదీ నేను ఉచితంగా తీసుకొని యెహోవాకి ఇవ్వను. నాకు ఊరకనే వచ్చిన దానినేదీ నేను యెహోవాకి అర్పణగా చెల్లించను.”
25 కావున దావీదు ఒర్నానుకు సుమారు ఆరువందల తులాల (పదిహేను పౌనులు) బంగారం ఇచ్చి ఆ స్థలం తీసుకున్నాడు. 26 యెహోవాను ఆరాధించటానికి అక్కడ దావీదు ఒక బలిపీఠం కట్టించాడు. దావీదు దహన బలులు, సమాధాన బలులు సమర్పించాడు. దావీదు యెహోవాని ప్రార్థించాడు. ఆకాశం నుండి అగ్నిని క్రిందికి పంపి యెహోవా దావీదు ప్రార్థనను ఆలకించాడు. దహనబలులు ఇచ్చే పీఠం మీదికి అగ్ని దిగింది. 27 అప్పుడు తన కత్తిని ఒరలో పెట్టుమని యెహోవా తన దూతకు ఆజ్ఞాపించాడు.
28 యెహోవా ఒర్నాను కళ్లంలో తన ప్రార్థన ఆలకించాడని దావీదు తెలుసుకొని ఆయనకు బలులు సమర్పించాడు. 29 (పవిత్ర గుడారం, దహనబలుల బలిపీఠం గిబియోనులో ఎత్తైన స్థలంలో వున్నాయి. ఇశ్రాయేలీయులు ఎడారిలో వున్నప్పుడు మోషే ఈ పవిత్ర గుడారాన్ని తయారు చేశాడు. 30 దావీదు భయపడిన కారణంగా అతను పవిత్ర గుడారంలోకి వెళ్లి దేవునితో మాట్లాడలేక పోయాడు. దావీదు యెహోవా దూతకు, అతని కత్తికి భయపడ్డాడు.)
2 అందువలన మీరు దుష్టత్వమంతటినీ, మోసమంతటినీ, వేషధారణను, అసూయను మరియు ప్రతివిధమైన దూషణను మీ నుండి తీసివేయండి. 2 అప్పుడే జన్మించిన శిశువులు పాలకోసం తహతహలాడినట్లు, మీరు కూడా దేవుని వాక్యమను పరిశుద్ధ పాల కోసం తహతహలాడండి. ఆ పాల వల్ల మీరు ఆత్మీయంగా రక్షణలో ఎదుగుతారు. 3 ప్రభువు మంచివాడని అనుభవ పూర్వకంగా మీరు తెలిసికొన్నారు.
4 మీరు సజీవమైన రాయియగు ప్రభువు వద్ధకు రండి. మానవులు ఈ సజీవమైన రాయిని తృణీకరించారు. కాని, దేవుడు ఆయన్ని అమూల్యంగా పరిగణించి ఎన్నుకొన్నాడు. 5 మీరు కూడా సజీవమైన రాళ్ళుగా ఆత్మీయమైన మందిర నిర్మాణంలో కట్టబడుచున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ఆత్మీయబలుల్ని అర్పించడానికి మీరు పవిత్ర యాజకులుగా ఎన్నుకోబడ్డారు. 6 ఎందుకంటే, ధర్మశాస్త్రంలో ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాసారు:
“అదిగో చూడు! సీయోనులో ఒక రాయి స్థాపించాను!
పునాది రాయిగా ఎన్నుకున్న అమూల్యమైన రాయి అది.
ఆయన్ని నమ్మిన వానికెవ్వనికి అవమానం ఎన్నటికి కలుగదు!”(A)
7 ఇప్పుడు నమ్మిన మీకు అది అమూల్యమైన రాయి. కాని నమ్మిన వాళ్ళకు:
“ఇల్లు కట్టేవాళ్ళు నిషేధించిన
రాయి మూలకు తలరాయి అయింది.”(B)
8 మరొక చోట యిలా వ్రాయబడి ఉంది:
“ఈ రాయి, మానవులు తొట్రుపడేటట్లు చేస్తుంది.
ఈ బండ వాళ్ళను క్రింద పడవేస్తుంది.”(C)
దైవసందేశాన్ని నిరాకరించిన వాళ్ళు తొట్రుపడతారు. వాళ్ళు దానికని నిర్ణయించబడ్డారు.
9 కాని, మీరు దేవుడు ఎన్నుకొన్న ప్రజలు, మీరు రాజవంశానికి చెందిన యాజకులు, మీరు పవిత్రమైన జనాంగము, మీరు దేవునికి సన్నిహితమైన ప్రజలు. తన ఘనతను గూర్చి చెప్పటానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అంధకారం నుండి అద్భుతమైన తన వెలుగులోకి రమ్మని ఆయన మిమ్మల్ని పిలిచాడు.
10 పూర్వం మీరు దేవుని ప్రజ కాదు.
ఇప్పుడు మీరు దేవుని ప్రజ.
పూర్వం మీకు దైవానుగ్రహం లభించలేదు.
కాని యిప్పుడు లభించింది.
దేవుని కోసం జీవించండి
11 ప్రియమైన సోదరులారా! ఈ ప్రపంచంలో మీరు పరదేశీయుల్లా, యాత్రికుల్లా జీవిస్తున్నారు. మీ ఆత్మలతో పోరాడుతున్న శారీరక వాంఛల్ని వదిలి వేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. 12 యూదులుకాని వాళ్ళ మధ్య నివసిస్తున్న మీరు మంచి నడవడిక గలిగి జీవించాలి. ఎందుకంటే, “దుర్మార్గులని” మిమ్మల్ని నిందిస్తున్న వాళ్ళు మీ మంచి నడవడికను చూసి దేవుడు తీర్పు చెప్పనున్న రోజు ఆయన మహిమను బట్టి ఆయన్ని స్తుతిస్తారు.
పరిపాలకుల పట్ల, అధికారుల పట్ల వినయం
13 మీరు ప్రభువు కోసం అధికారుల పట్ల విధేయతతో ఉండండి. అది సర్వాధికారమున్న చక్రవర్తి కానివ్వండి, 14 లేక, ఆ చక్రవర్తి నియమించిన రాజ్యాధికారులు కానివ్వండి. చక్రవర్తి ఈ రాజ్యాధికారుల్ని తప్పుచేసిన వాళ్ళను శిక్షించటానికి, ఒప్పు చేసిన వాళ్ళను మెచ్చుకోవటానికి పంపించాడు. 15 మీరు మంచి పనులు చేసి, అవివేకంగా మాట్లాడే మూర్ఖుల నోళ్ళను కట్టి వేయాలని దేవుని కోరిక. 16 స్వేచ్ఛగా జీవించండి. కాని ఈ స్వేచ్ఛను మీ దుష్ట స్వభావాన్ని కప్పిపుచ్చటానికి ఉపయోగించకండి. దేవుని సేవకులవలె జీవించండి. 17 అందర్నీ గౌరవించండి. తోటి విశ్వాసులైన సోదరులను ప్రేమించండి. దేవునికి భయపడండి. రాజును గౌరవించండి.
క్రీస్తు శ్రమకు మాదిరి
18 బానిసలారా! మీ యజమానులను, వాళ్ళు దయాదాక్షిణ్యాలతో మంచిగా ప్రవర్తించే యజమానులు కానివ్వండి, లేక దౌర్జన్యంతో ప్రవర్తించే యజమానులు కానివ్వండి, పూర్తిగా గౌరవిస్తూ విధేయతతో ఉండండి. 19 ఎందుకంటే, తనకు అన్యాయంగా సంభవిస్తున్న బాధల్ని దేవుణ్ణి దృష్టిలో ఉంచుకొని అనుభవించే వ్యక్తి శ్లాఘనీయుడు. 20 నీవు చేసిన తప్పులకు దెబ్బలు తిని ఓర్చుకుంటే అందులో గొప్పేమిటి? కాని మంచి చేసి కూడ బాధల్ని అనుభవించి ఓర్చుకుంటే అది దేవుని సాన్నిధ్యంలో శ్లాఘనీయమౌతుంది. 21 దేవుడు మిమ్మల్ని పిలిచింది అందు కోసమే! మీకు ఆదర్శంగా ఉండాలనీ, మీరు తన అడుగు జాడల్లో నడచుకోవాలనీ క్రీస్తు మీకోసం కష్టాలనుభవించాడు.
22 “ఆయన ఏ పాపం చేయలేదు!
ఆయన మాటల్లో ఏ మోసం కనబడలేదు!”(D)
23 వారాయన్ని అవమానించినప్పుడు ఎదురు తిరిగి మాట్లాడలేదు. కష్టాలను అనుభవించవలసి వచ్చినప్పుడు ఆయన ఎదురు తిరగలేదు. దానికి మారుగా, న్యాయంగా తీర్పు చెప్పే ఆ దేవునికి తనను తాను అర్పించుకున్నాడు. 24 ఆయన మన పాపాలను సిలువపై భరించాడు. పాపం చేస్తూ జీవించటం మానుకున్న మనం నీతిగా జీవించాలని యిలా చేసాడు. ఆయన దెబ్బల ద్వారా మన రోగాలు మాని పోయాయి. 25 ఎందుకంటే, ఇదివరలో మీరు దారి తప్పిన గొఱ్ఱెల్లా ప్రవర్తించారు. కాని యిప్పుడు మీరు, మీ ఆత్మల్ని కాపలా కాచే కాపరి, అధిపతి దగ్గరకు తిరిగి వచ్చారు.
దేవుని కరుణ యోనాకు కోపకారణమవటం
4 దేవుడు నగరాన్ని రక్షించటంపట్ల యోనా సంతోషంగా లేడు. యోనాకు కోపం వచ్చింది. 2 యోనా యెహోవాపట్ల చిరాకుతో ఇలా అన్నాడు: “ఇది జరుగుతుందని నాకు తెలుసు! నేను నా దేశంలో ఉన్నప్పుడు నన్ను ఇక్కడికి రమ్మన్నావు. ఈ దుర్మార్గపు నగరవాసులను నీవు క్షమిస్తావని నాకు అప్పుడే తెలుసు. అందువల్లనే నేను తర్షీషుకు పారిపోవటానికి నిర్ణయించుకున్నాను. నీవు దయగల దేవుడవని నాకు తెలుసు! నీవు కరుణ చూపిస్తావనీ, నీవు ప్రజలను శిక్షింపగోరవనీ నాకు తెలుసు! నీ అంతరంగం కరుణతో నిండివుందనీ నాకు తెలుసు! వీరు పాపం చేయటం మానితే, వీరిని నాశనం చేయాలనే నీ తలంపు మార్చుకుంటావనీ నాకు తెలుసు. 3 కావున యెహోవా, నన్ను చంపివేయమని నేను నిన్ను వేడుకుంటున్నాను. నేను బ్రతకటం కంటే చనిపోవటం మంచిది!”
4 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నేను ఆ ప్రజలను నాశనం చెయ్యనంత మాత్రాన నీవు కోపగించుకోవటం నీకు సమంజసమని అనుకుంటున్నావా?”
5 అయినా యోనా జరిగినదానికంతకు ఇంకా కోపంగానే ఉన్నాడు. కావున అతడు నగరం వెలుపలికి వెళ్లాడు. తూర్పు దిక్కున నగరానికి దగ్గరలో ఉన్న ఒక ప్రాంతానికి యోనా వెళ్లాడు. యోనా తన కొరకు ఒక పందిరి నిర్మించుకున్నాడు. నగరానికి ఏమవుతుందో చూద్దామని ఎదురుచూస్తూ అతడు ఆ నీడలో కూర్చున్నాడు.
సొరచెట్టు-పురుగు
6 యోనా కూర్చునివున్న పందిరి మీదికి ఒక సొరపాదును త్వరత్వరగా పాకేలా యెహోవా చేశాడు. అది యోనా కూర్చోవటానికి చల్లని వాతావరణం కల్పించింది. ఇది యోనాకు హాయిని సమకూర్చటంలో సహాయ పడింది. ఈ సొరపాదు మూలంగా యోనా చాలా సంతోషంగా ఉన్నాడు.
7 మరునాటి ఉదయం, మొక్కలో ఒక భాగాన్ని తినివేయటానికి ఒక పురుగును దేవుడు పంపాడు. ఆ పురుగు మొక్కను తినివేయటం మొదలుపెట్టగా, ఆ మొక్క చనిపోయింది.
8 మిట్టమధ్యాహ్నమయ్యే సరికి, దేవుడు తూర్పునుండి వేడిగాడ్పులు వీచేలా చేశాడు. యోనా తలమీద సూర్యుని వేడిమి ఎక్కువయ్యింది. యోనా బాగా నీరసించిపోయాడు. యోనా దేవునితో తనను చనిపోనిమ్మన్నాడు. “నేను బ్రతకటంకంటే చనిపోవటం మేలు” అని యోనా అన్నాడు.
9 కాని దేవుడు యోనాతో, “ఈ మొక్క చనిపోయినంత మాత్రాన నీవు కోపగించుకోవటం సమంజసమేనా?” అని అన్నాడు.
“అవును, నేను కోపగించుకోవటం సమంజసమే! నేను చచ్చిపోవాలనేటంత కోపంతో ఉన్నాను” అని యోనా అన్నాడు.
10 పిమ్మట యెహోవా ఇలా అన్నాడు: “ఆ మొక్కకు నీవు ఏమీ చేయలేదు! నీవు దానిని పెంచలేదు. అది రాత్రికి రాత్రి పెరిగి, మరునాడు చనిపోయింది. ఇప్పుడు నీవు ఆ మొక్కను గురించి విచారిస్తున్నావు. 11 నీవు ఒక మొక్కను గురించే కలత చెందినప్పుడు, నేను నీనెవెలాంటి ఒక మహా నగరంగురించి ఖచ్చితంగా విచారిస్తాను. ఆ నగరంలో ప్రజలు ఉన్నారు. జంతువులు అనేకంగా ఉన్నాయి. తాము తప్పు చేస్తున్నామని తెలియని ఒక లక్షా ఇరవై వేల మందికంటే ఎక్కువమంది ప్రజలు ఆ నగరంలో ఉన్నారు.”
యేసు అపోస్తలులను పంపటం
(మత్తయి 10:5-15; మార్కు 6:7-13)
9 యేసు తన పన్నెండు మంది శిష్యుల్ని సమావేశ పరిచి దయ్యాల్ని పారద్రోలటానికి, రోగాలను నయం చేయటానికి వాళ్ళకు శక్తి, అధికారము ఇచ్చాడు. 2 వాళ్ళను ప్రపంచంలోకి పంపుతూ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించుమని, రోగాలున్న వాళ్ళకు నయం చెయ్యమని వాళ్ళతో చెప్పాడు. 3 వాళ్ళతో, “ప్రయాణం చేస్తున్నప్పుడు మీ వెంట చేతి కర్రకాని, సంచికాని, ఆహారంకాని, ధనంకాని, మారు దుస్తులు కాని, యితర వస్తువులు కాని తీసుకు వెళ్ళకండి. 4 ఒక యింటికి వెళ్తే ఆ గ్రామం వదిలే దాకా ఆ యిల్లు విడిచి వెళ్ళకండి. 5 ప్రజలు మీకు స్వాగతం ఇవ్వకుంటే ఆ ఊరు వదిలి వెళ్ళే ముందు వాళ్ళు చేసిన పొరపాటు చూపటానికి మీ కాలి ధూళి దులపండి” అని అన్నాడు.
6 ఆ తర్వాత వాళ్ళు బయలు దేరి ప్రతి గ్రామానికి వెళ్ళారు. ప్రతిచోటా దైవ సందేశాన్ని ప్రకటించారు. రోగాలున్న వాళ్ళకు నయం చేసారు.
హేరోదు ఆందోళన
(మత్తయి 14:1-12; మార్కు 6:14-29)
7 సామంతరాజైన హేరోదు జరుగుతున్న వాటిని గురించి విని చాలా కంగారు పడ్డాడు. యోహాను బ్రతికి వచ్చాడని కొందరన్నారు. 8 ఏలీయా కనిపించాడని కొందరన్నారు. మరికొందరు పూర్వకాలం నాటి ప్రవక్తల్లో ఒకడు బ్రతికి వచ్చాడని అన్నారు. 9 కాని హేరోదు, “నేను యోహాను తల నరికించాను కదా. మరి ఎవర్ని గురించి వింటున్నాను?” అని మనస్సులో అనుకొన్నాడు. హేరోదు యేసును చూడాలని ఆతృత పడ్డాడు.
యేసు ఐదువేల మందికి పైగా భోజనం పెట్టటం
(మత్తయి 14:13-21; మార్కు 6:30-44; యోహాను 6:1-14)
10 అపొస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ యేసుతో చెప్పారు. ఆ తర్వాత యేసు అపొస్తలులను ప్రజలకు దూరంగా బేత్సయిదా అనే పట్టణానికి తన వెంట తీసుకు వెళ్ళాడు. 11 ప్రజలకు ఈ విషయం తెలిసింది. వాళ్ళు యేసును చూడటానికి అక్కడికి కూడా వెళ్ళారు. ఆయన వాళ్ళను ఆహ్వానించి దేవుని రాజ్యాన్ని గురించి చెప్పి రోగాలున్న వాళ్ళకు నయం చేశాడు.
12 సూర్యాస్తమయమౌతుండగా ఆయన వద్దకు పన్నెండు మంది అపొస్తలులు వచ్చి, “మనం ఏ మూలో ఉన్నాం. ప్రజల్ని వెళ్ళమనండి. చుట్టూ ఉన్న పల్లెలకు, గ్రామాలకు వెళ్ళి ఆహారము, విశ్రమించటానికి స్థలం చూసుకొంటారు” అని అన్నారు.
13 యేసు వాళ్ళతో, “వాళ్ళు తినటానికి మీరేదైనా ఆహారం ఇవ్వండి” అని అన్నాడు.
వాళ్ళు, “మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి. మేము వెళ్ళి వీళ్ళందరికోసం ఆహారం కోనుక్కు రావాలని మీ ఉద్దేశ్యమా?” అని అన్నారు. 14 సుమారు ఐదువేలమంది పురుషులు అక్కడ ఉన్నారు.
కాని యేసు తన శిష్యులతో, “పంక్తికి యాభైమంది చొప్పున వాళ్ళను కూర్చో బెట్టండి” అని అన్నాడు.
15 శిష్యులు ఆయన చెప్పినట్లు చేసారు. వచ్చిన వాళ్ళందరూ కూర్చున్నారు. 16 యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు తీసుకొని ఆకాశం వైపు చూసి, దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని భాగాలు చేశాడు. వాటిని తన శిష్యులకిచ్చి ప్రజలకు పంచమన్నాడు. 17 అందరూ కడుపు నిండుగా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ఆహారాన్ని పండ్రెండు గంపల నిండా నింపారు.
పేతురు యేసును క్రీస్తు అని చెప్పటం
(మత్తయి 16:13-19; మార్కు 8:27-29)
18 ఒకరోజు యేసు ఏకాంతంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన ప్రార్థించటం ముగించాక వాళ్ళతో, “ప్రజలు నేను ఎవర్నని అంటున్నారు?” అని అడిగాడు.
19 వాళ్ళు, “కొందరు బాప్తిస్మము నిచ్చే యోహాను అని అంటున్నారు. మరికొందరు పూర్వకాలం నాటి ప్రవక్త బ్రతికి వచ్చాడు అని అంటున్నారు” అని సమాధానం చెప్పారు.
20 “మీ సంగతేమిటి? మీరేమంటారు?” అని ఆయన అడిగాడు.
పేతురు, “మీరు దేవుడు పంపిన క్రీస్తు” అని సమాధానం చెప్పాడు.
21 “ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు” అని యేసు ఖండితంగా చెప్పాడు.
యేసు తన మరణాన్ని గురించి చెప్పటం
(మత్తయి 16:21-28; మార్కు 8:31–9:1)
22 ఆయన వాళ్ళతో, “మనుష్య కుమారుడు ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన్ని తిరస్కరిస్తారు. ఆయన చంపబడి మూడవ రోజున బ్రతికింపబడతాడు” అని అన్నాడు.
23 ఆ తర్వాత వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా వెంట రావాలనుకొన్నవాడు తన కోరికల్ని చంపుకొని, తన సిలువను ప్రతిరోజు మోసుకొంటూ నన్ను అనుసరించాలి. 24 తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకొన్నవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. కాని నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొంటాడు. 25 ప్రపంచాన్నంతా జయించి తనను పోగొట్టుకొని, తన జీవితాన్ని నాశనం చేసుకొంటే దానివల్ల కలిగే లాభమేమిటి? 26 నన్ను, నా సందేశాన్ని అంగీకరించటానికి సిగ్గుపడిన వాళ్ళ విషయంలో, మనుష్యకుమారుడు తన తేజస్సుతో, తండ్రి తేజస్సుతో, పవిత్రమైన దేవదూతల తేజస్సుతో వచ్చినప్పుడు సిగ్గుపడతాడు. 27 ఇది నిజం. ఇక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు దేవుని రాజ్యాన్ని చూడకుండా మరణించరు.”
యేసుని రూపాంతరం
(మత్తయి 17:1-8; మార్కు 9:2-8)
28 ఈ విధంగా చెప్పిన ఎనిమిది రోజులకు పేతురు, యోహాను, యాకోబును తన వెంట తీసుకొని ఒక కొండ మీదికి యేసు ప్రార్థించటానికి వెళ్ళాడు. 29 ఆయన ప్రార్థిస్తుండగా ఆయన ముఖతేజస్సు మారింది. ఆయన దుస్తులు తెల్లగా ప్రకాశించటం మొదలు పెట్టాయి. 30 అకస్మాత్తుగా యిద్దరు వ్యక్తులు తేజస్సుతో యేసు ముందు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడటం మొదలు పెట్టారు. వాళ్ళు మోషే, ఏలీయాలు. 31 యెరూషలేములో నెరవేర్చబడనున్న దైవేచ్ఛను గురించి, అంటే ఆయన మరణాన్ని గురించి, మాట్లాడారు. 32 పేతురు, అతని వెంటనున్న వాళ్ళు మంచి నిద్రమత్తులో ఉన్నారు. వాళ్ళకు మెలకువ వచ్చింది. వాళ్ళు లేచి యేసు తేజస్సును, ఆయనతో నిలుచొని ఉన్న ఆ యిద్దరి పురుషుల తేజస్సును చూసారు. 33 మోషే, ఏలీయాలు వెళ్తుండగా పేతురు యేసుతో, “ప్రభూ! మనము యిక్కడ ఉండటం మంచిది. మీకొకటి, మోషేకొకటి, ఏలీయా కొకటి మూడు పర్ణశాలలు వేయమంటారా?” అని అడిగాడు. పరిస్థితి అర్థం చేసుకోకుండా అతడు ఈ మాటలు అన్నాడు.
34 పేతురు ఈ మాట అంటుడగానే ఒక మేఘం వచ్చి వాళ్ళను కప్పివేసింది. వాళ్ళను ఆ మేఘం కప్పివేస్తుండగా పేతురుకు, అతనితో ఉన్న వాళ్ళకు భయం వేసింది. 35 ఆ మేఘం నుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఎన్నుకొన్నవాడు. ఆయన చెప్పినట్లు చెయ్యండి” అని వినబడింది.
36 ఆ స్వరం మాట్లాడటం ముగించాక వాళ్ళకు అక్కడ యేసు మాత్రమే కనిపించాడు. చాలా కాలందాకా శిష్యులు తాము చూసిన దాన్ని ఎవ్వరికి చెప్పలేదు.
యేసు ఒక బాలుని దయ్యంనుండి విడిపించటం
(మత్తయి 17:14-18; మార్కు 9:14-27)
37 మరుసటి రోజు వాళ్ళు కొండ దిగగానే పెద్ద ప్రజల గుంపు ఒకటి యేసును చూడటానికి అక్కడ సమావేశమైంది. 38 ఆ గుంపులో నుండి ఒకడు, “అయ్యా! వచ్చి నా కుమారుణ్ణి కటాక్షించుమని వేడు కుంటున్నాను. నాకు ఒక్కడే కుమారుడు. 39 ఒక దయ్యం అతణ్ణి ఆవరిస్తుంది. అది మీదికి రాగానే అతడు బిగ్గరగా కేకలు వేస్తాడు. అది ఆతణ్ణి క్రింద పడవేస్తుంది. అతడు వణుకుతూ నోటినుండి నురుగులు కక్కుతాడు. అది అతణ్ణి వదలటం లేదు. అతణ్ణి పూర్తిగా నాశనం చేస్తొంది. 40 ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని మీ శిష్యుల్ని వేడుకున్నాను. కాని వాళ్ళు ఆ పని చెయ్యలేక పొయ్యారు” అని అన్నాడు.
41 యేసు, “మూర్ఖతరం వారలారా! విశ్వాస హీనులారా! మీతో ఉండి ఎన్ని రోజులు సహించాలి? నీ కుమారుణ్ణి పిలుచుకురా!” అని అన్నాడు.
42 ఆ దయ్యం పట్టినవాడు వస్తూవుంటే అది అతణ్ణి నేల మీద పడవేసింది. యేసు ఆ దయ్యాన్ని వెళ్ళిపొమ్మని గద్దించి ఆ బాలునికి నయం చేశాడు. తదుపరి అతణ్ణి అతని తండ్రికి అప్పగించాడు. 43 దేవుని మహిమ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం
(మత్తయి 17:22-23; మార్కు 9:30-32)
యేసు చేసింది చూసి వాళ్ళు తమ ఆశ్చర్యం నుండి కోలుకోక ముందే యేసు తన శిష్యులతో ఈ విధంగా అన్నాడు: 44 “నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. మనుష్యకుమారుణ్ణి ఒక ద్రోహి యితర్లకు అప్పగిస్తాడు.” 45 వాళ్ళకు దీని అర్థం తెలియలేదు. వాళ్ళకు అర్థం కాకుండునట్లు రహస్యంగా ఉంచబడింది. దాన్ని గురించి అడగటానికి వాళ్ళకు ధైర్యం చాలలేదు.
దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప?
(మత్తయి 18:1-5; మార్కు 9:33-37)
46 తమలో అందరికన్నా ఎవరు గొప్ప అన్న అంశంపై శిష్యుల మధ్య ఒక వాదం మొదలైంది. 47 యేసుకు వాళ్ళ ఆలోచనలు తెలిసిపోయాయి. ఆయన ఒక చిన్న పిల్లవాణ్ణి తీసుకొని తన ప్రక్కన నిలబెట్టుకొని 48 వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా పేరిట ఈ పసివానిని అంగీకరిస్తే నన్ను అంగీకరించిన దానితో సమానము. నన్ను అంగీకరిస్తే నన్ను పంపిన వానిని అంగీకరించిన దానితో సమానము. మీలో అందరికన్నా తక్కువవాడు అందరికన్నా గొప్పవానితో సమానము.”
మీకు విరోధికానివాడు మీవాడే
(మార్కు 9:38-40)
49 యోహాను, “అయ్యా! మీ పేరుతో ఒకడు దయ్యాల్ని వదిలిస్తున్నాడు. అతడు మన వాడు కాదు. కనుక అలా చెయ్యవద్దని అడ్డగించాము” అని అన్నాడు.
50 యేసు, “అతణ్ణి ఆపకండి. నాకు వ్యతిరేకంగా ఉండని వాడు నాకు అనుకూలంగా ఉన్న వానితో సమానము” అని అన్నాడు.
విశ్వసించని గ్రామము
51 ఆయన పరలోకానికి వెళ్ళే సమయం దగ్గర పడసాగింది. యేసు యెరూషలేము వెళ్ళాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. 52 తన దూతల్ని తనకన్నా ముందు పంపాడు. వాళ్ళు ఆయన కోసం అన్నీ సిద్దం చెయ్యాలని ఒక సమరయ పల్లెకు వెళ్ళారు. 53 ఆ వూరి వాళ్ళు ఆయన యెరూషలేము వెళ్తుండటం వలన ఆయనకు స్వాగతమివ్వలేదు. 54 ఆయన శిష్యులలో యాకోబు, యోహాను యిది చూసి యేసుతో, “ప్రభూ! వాళ్ళను నాశనం చేయటానికి ఆకాశం నుండి అగ్ని రప్పించమంటారా?” అని అడిగారు.
55 యేసు వాళ్ళవైపు చూసి వాళ్ళను గద్దించాడు.[a] 56 అక్కడి నుండి వాళ్ళంతా మరొక గ్రామానికి వెళ్ళారు.
యేసును వెంబడించటం
(మత్తయి 8:19-22)
57 వాళ్ళు దారిమీద నడుస్తుండగా ఒకడు యేసుతో, “మీరు ఎక్కడికి వెళ్తే నేనక్కడికి వస్తాను” అని అన్నాడు.
58 యేసు, “నక్కలు నివసించటానికి బొరియలు ఉన్నాయి. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. కాని మనుష్యకుమారుడు తల వాల్చటానికి కూడా స్థలం లేదు” అని అన్నాడు.
59 యేసు యింకొకనితో, “నా వెంట రా!” అని అన్నాడు.
కాని అతడు, “ప్రభూ! నేను వెళ్ళి ముందు నా తండ్రిని సమాధి చేసి రానివ్వండి!” అని అన్నాడు.
60 యేసు అతనితో, “చనిపోయిన వాళ్ళ సంగతి చనిపోయినవాళ్ళు చూసుకోనీ. నీవు వెళ్ళి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించు” అని అన్నాడు.
61 ఇంకొకడు, “ప్రభూ! నేను మిమ్మల్ని అనుసరిస్తాను. కాని ముందు వెళ్ళి నాయింటి వాళ్ళకు చెప్పి రానివ్వండి” అని అన్నాడు.
62 అందుకు యేసు, “దున్నుటకు నాగల్ని పట్టుకొని వెనక్కి తిరిగేవాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాడు” అని అతనితో చెప్పాడు.
© 1997 Bible League International