M’Cheyne Bible Reading Plan
దావీదుకు దేవుని వాగ్దానం
17 దావీదు తన కొత్త ఇంట్లో ప్రవేశించాక యాజకుడైన నాతానును పిలిచి ఇలా అన్నాడు: “చూడండి, నేను దేవదారు కలపతో నిర్మించిన ఇంటిలో వుంటున్నాను. కాని దేవుని ఒడంబడిక పెట్టె మాత్రం గుడారంలోనే వుంది! నేను దేవునికి ఒక ఆలయం నిర్మింపదలిచాను.”
2 “నీవు ఏది చేయదలచుకొంటే అది చేయవచ్చు. దేవుడు నీకు తోడై వున్నాడు” అని నాతాను దావీదుకు సమాధానమిచ్చాడు.
3 కాని ఆ రోజు రాత్రి దేవుని వాక్కు నాతానుకు వినిపించింది. 4 యెహోవా ఇలా అన్నాడు:
“నీవు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఈ విషయాలు చెప్పు: యెహోవా ఇలా అంటున్నాడు: ‘దావీదూ, నేను నివసించటానికి ఆలయం కట్టించేది నీవు కాదు. 5-6 ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టు నుండి బయటికి తీసుకొని వచ్చినప్పటి నుండి ఈనాటి వరకు నేను ఒక ఆలయంలో నివసించలేదు. ఇక్కడికీ, అక్కడికీ నేను గుడారంలో వుండి కదలి వెళ్తూనే వున్నాను. ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యేక నాయకులను నేను ఎంపిక చేస్తూ వచ్చాను. ఆ నాయకులు నా ప్రజలకు గొర్రెల కాపరులవలె వున్నారు. ఇశ్రాయేలులో నేను ఒక చోటినుండి మరియొక చోటికి వెళ్లెటప్పుడు ఆ నాయకులెవ్వరితోనూ, “మీరు నాకు దేవదారు కలపతో ఒక ఆలయాన్ని ఎందుకు కట్టలేదు?” అని నేను అనలేదు.’
7 “కనుక, ఇప్పుడు ఈ విషయాలు నా సేవకుడైన దావీదుకు చెప్పుము: సర్వశక్తిమంతుడగు యెహోవా ఏమి చెప్పుచున్నాడనగా, ‘పొలాల్లో గొర్రెల మందలను కాస్తున్న నిన్ను నేను తీసుకొన్నాను. నా ప్రజలకు నిన్ను రాజుగా చేశాను. 8 నీవు వెళ్లిన ప్రతిచోటా నేను నీతో వున్నాను. నీకు ముందుగా నేను నడిచాను. నీ శత్రువులను సంహరించాను. నిన్ను ఇప్పుడు ఈ భూమిమీద మిక్కిలి ప్రముఖ వ్యక్తిగా చేసాను. 9 ఈ ప్రదేశాన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇస్తున్నాను. వారు తమ మొక్కలను నాటుతారు. వారి చెట్లక్రింద వారు ప్రశాంతంగా కూర్చుంటారు. ఇక ఏ మాత్రం వారు అవస్థపడవలసిన అవసరం లేదు. దుష్టులెవ్వరూ ఇకమీదట పూర్వంవలె వారిని బాధించరు. 10 ప్రమాదాలు సంభవించినందువల్లనే నా ప్రజలైన ఇశ్రాయేలీయుల సంరక్షణకై నేను నాయకులను ఎంపిక చేశాను. నేనింకా నీ శత్రువులను ఓడిస్తాను.
“‘యెహోవా నీకు ఒక నివాసం ఏర్పాటు చేయునని నేను నీకు చెప్పుచున్నాను.[a] 11 నీవు చనిపోయి నీ పూర్వీకులను చేరినప్పుడు నీ సంతానాన్ని నూతన రాజుగా చేస్తాను. కొత్త రాజు నీ కుమారులలో ఒకడవుతాడు. అతని రాజ్యాన్ని నేను బలపర్చుతాను. 12 నీ కుమారుడు నాకొక ఆలయం కట్టిస్తాడు. నీ కుమారుని సంతానం సదా పరిపాలించేలా నేను చేస్తాను. 13 నేను అతనికి తండ్రిలా వుంటాను. అతను నాకు బిడ్డలా వుంటాడు. నీకు ముందు సౌలు రాజుగా వున్నాడు. సౌలుకు నా మద్దతును ఉపసంహరించుకున్నాను. కాని నీ కుమారుని మాత్రం నేను సదా ప్రేమిస్తాను 14 ఎప్పటికీ అతని అధీనంలో నా ఆలయాన్ని, ఈ రాజ్యాన్ని వుంచుతాను. అతని పాలన శాశ్వతంగా కొనసాగుతుంది!’”
15 తనకు కల్గిన దైవ దర్శనాన్ని గురించి, దేవుడు చెప్పిన విషయాలన్నిటి గురించి దావీదుకు నాతాను వివరింగా చెప్పాడు.
దావీదు ప్రార్థన
16 అది విన్న రాజైన దావీదు పవిత్ర గుడారంలోకి వెళ్లి యెహోవా ముందు కూర్చున్నాడు. దావీదు ఇలా ప్రార్థన చేశాడు:
“యెహోవా దేవా, నీవు నాకు, నా కుటుంబానికి ఎంతో మేలు చేశావు! కారణం మాత్రం నాకు తెలియదు. 17 వాటన్నిటికీ మించి, భవిష్యత్తులో నా కుటుంబానికి ఏమి జరుగుతుందో కూడ నీవు నాకు తెలియపర్చావు. నన్నొక ముఖ్యమైన వ్యక్తిగా నీవు పరిగణించావు! 18 నేను ఇంతకంటే ఏమి చెప్పగలను? నీవు నాకు ఎంతో చేసావు! కేవలం నేను నీ సేవకుడను. అది నీకు తెలుసు! 19 యెహోవా, ఈ అద్భుత క్రియ నీవు నాపట్ల జరిపించావు. నీవు సంకల్పించావు గనుక నీవది చేసావు! 20 నీవంటి దేవుడు మరొక్కడు లేడు ప్రభూ! నీవు తప్ప వేరొక దేవుడు లేడు! ఈ విధంగా మరేదైవం అద్భుత కార్యాలు జరిపించినట్లు మేము వినలేదు! 21 ఇశ్రాయేలు వంటి మరో దేశం వున్నదా? లేదు! ఈ అద్భుతకార్యాలు నీవు జరిపించిన దేశం భూమి మీద ఇశ్రాయేలు ఒక్కటే. నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చి మాకు స్వేచ్ఛ కలుగజేశావు. ఆ విధంగా నీ ఘనతను చాటావు! నీ ప్రజలకు ముందుగా నీవు నడిచి అన్యులు మా కొరకు వారి రాజ్యాన్ని విడిచి పోయేలా చేశావు! 22 ఇశ్రాయేలును నీవు స్వీకరించి శాశ్వతంగా వారిని నీ ప్రజలుగా చేసుకొన్నావు. ప్రభువా, నీవు వారికి దేవుడవై యున్నావు!
23 “యెహోవా నాకు, నా కుటుంబానికి నీవు ఈ వాగ్దానం చేశావు. సదా నీ మాట నిలబెట్టుకో. దేవా! నీవు చేస్తానని చెప్పినదంతా జరిగేలా చెయ్యి! 24 నీవు నమ్మతగిన వాడవని నిరూపించు తండ్రీ! ప్రజలు నీ పేరును ఎల్లప్పుడూ గౌరవించుదురుగాక! అప్పుడు ‘సర్వశక్తుడగు యెహోవా ఇశ్రాయేలు దైవమని’ ప్రజలు అంటారు! నేను నీ సేవకుడను! దయచేసి నా కుటుంబాన్ని బలపర్చి, నీ సన్నిధిలో వర్థిల్లేలా చేయి.
25 “నా దేవా, నీవు నాకొక నివాసం ఏర్పాటు చేస్తాను అని అన్నావు. అందుచే నీ సేవకుడనైన నేను మనోధైర్యము కలిగివున్నాను. అందుచే నేను నిన్ను ఈ సంగతులను చేయమని అడుగుతున్నాను. 26 యెహోవా, నీవే దేవుడవు, ఈ మేలు చేస్తానని నీవు నాకు వాగ్దానం చేశావు. 27 యెహోవా, నా కుటుంబాన్ని దీవించటంలో నీవు చాలా ఉదారంగా వ్యవహరించావు! నీ సన్నిధిలో నా కుటుంబం సదా మెలగుతుందని నీవు అన్నావు. నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదించావు. యెహోవా, నా కుటుంబం ఎల్లవేళలా నీ ఆశీర్వాదం పొందుతుంది.”
దేవుణ్ణి శరణు కోరండి
4 మీలో మీకు యుద్ధాలు, పోట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి? మీ ఆంతర్యంలోని ఆశలు మీలో యుద్ధం చేయటం వల్లనే గదా యివి జరగటం? 2 మీరు కోరుతారు. అది లభించదు. దాని కోసం మీరు చంపటానికి కూడా సిద్ధమౌతారు. మీలో అసూయ కలుగుతుంది. అయినా మీ కోరిక తీర్చుకోలేరు. మీరు పోట్లాడుతారు. యుద్ధం చేస్తారు. కాని మీరు దేవుణ్ణి అడగరు కనుక మీ కోరిక తీరదు. 3 మీరు దురుద్దేశ్యంతో అడుగుతారు. కనుక మీరు అడిగినా మీకు లభించదు. మీరు అడిగేది మీ సుఖాలకు ఖర్చు పెట్టాలని అడుగుతారు.
4 నమ్మక ద్రోహులారా! ప్రపంచంతో స్నేహం చేస్తే దేవుణ్ణి ద్వేషించినట్లని మీకు తెలియదా? ప్రపంచంతో స్నేహం చెయ్యాలనుకొన్నవాడు దేవునికి శత్రువు అవుతాడు. 5 లేఖనాల్లో ఈ విషయం వృధాగా వ్రాసారనుకుంటున్నారా? “ఆయన మనకిచ్చిన ఆత్మను[a] మనం ఆయన కోసం మాత్రమే వాడాలని చూస్తుంటాడు.” 6 దేవుడు మనపై ఎంతో అనుగ్రహం చూపుతున్నాడు. అందువల్ల లేఖనాల్లో, “దేవుడు అహంకారం కలవాళ్ళను ద్వేషిస్తాడు. వినయం కలవాళ్ళను కనికరిస్తాడు”(A) అని వ్రాయబడింది.
7 అందువల్ల దేవుని పట్ల విధేయతతో ఉండండి. సాతాన్ను ఎదిరించండి. అప్పుడు సాతాను మీనుండి పారిపోతాడు. 8 దేవుణ్ణి మీరు సమీపిస్తే దేవుడు మిమ్మల్ని సమీపిస్తాడు. పాపాత్ములారా! మీ పాపాలు కడుక్కోండి. చంచలమైన మనస్సుగల ప్రజలారా! మీ హృదయాల్ని పవిత్రం చేసుకోండి. 9 విచారించండి, దుఃఖించండి, శోకించండి. మీ నవ్వును దుఃఖంగా మార్చుకోండి. మీ ఆనందాన్ని విషాదంగా మార్చుకోండి. 10 ప్రభువు సమక్షంలో మీరు తగ్గింపు కలవారుగా ఉండండి. అప్పుడు ఆయన మిమ్మల్ని పైకిలేపుతాడు.
నీవు న్యాయాధిపతివి కావు
11 సోదరులారా! పరస్పరం దూషించుకోకండి. తన సోదరుల్ని దూషించినవాడు, లేక సోదరునిపై తీర్పు చెప్పినవాడు, ధర్మశాస్త్రాన్ని దూషించినవానిగా పరిగణింపబడతాడు. మీరు అలా చేస్తే ధర్మశాస్త్రాన్ని ఆచరించటానికి మారుగా, న్యాయాధిపతివలె ఆ ధర్మశాస్త్రంపై తీర్పు చెపుతున్నారన్నమాట. 12 ధర్మశాస్త్రాన్నిచ్చిన వాడును, న్యాయాధిపతియు ఆయనే. రక్షించగలవాడు, నాశనం చెయ్యగలవాడు ఆయనే. మరి యితర్లపై తీర్పు చెప్పటానికి నీవెవరు?
ప్రగల్భాలు చెప్పుకోకండి
13 వినండి! “ఈ రోజో లేక రేపో మేము ఈ పట్టణానికో లేక ఆ పట్టణానికో వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం గడిపి వ్యాపారం చేసి డబ్బు గడిస్తాము” అని మీరంటూ ఉంటారు. 14 అంతెందుకు, రేపేమి జరుగబోతుందో మీకు తెలియదు. మీరు కొంతసేపు కనిపించి ఆ తర్వాత మాయమైపోయే పొగమంచు లాంటి వాళ్ళు. 15 మీరు దానికి మారుగా, “ప్రభువు అనుగ్రహిస్తే మేము జీవించి యిదీ అదీ చేస్తాము” అని అనాలి. 16 మీరు గర్వంగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అలా ప్రగల్భాలు పలకటం తప్పు. 17 అందువల్ల మంచి చెయ్యటానికి నేర్చుకొన్నవాడు మంచి పనినే చెయ్యాలి. అలా చెయ్యకపోవటం పాపం అవుతుంది.
దేవుని పిలుపు—యోనా పారిపోవుట
1 అమిత్తయి కుమారుడైన యోనాతో[a] యోహోవా మాట్లాడాడు. యెహోవా ఇలా అన్నాడు: 2 “నీనెవె[b] ఒక మహానగరం. అక్కడి ప్రజలు చేస్తున్న అనేక నీచ కార్యాలను గురించి నేను విన్నాను. కనుక నీవు ఆ నగరానికి వెళ్లి, వారు చేసే చెడు పనులు మానుకోమని చెప్పు.”
3 దేవుని సలహా యోనా పాటించదలచలేదు. కనుక యెహోవాకు దూరంగా యోనా పారిపోవటానికి ప్రయత్నించాడు. యోనా యొప్పే[c] పట్టణానికి వెళ్లాడు. బహుదూరానగల తర్షీషు[d] నగరానికి వెళ్లే ఒక ఓడను యోనా చూశాడు. యోనా తన ప్రయాణానికయ్యే ఖర్చు చెల్లించి ఓడలోనికి వెళ్లాడు. తర్షీషుకు వెళ్లే ఈ ఓడలోనున్న జనంతో కలిసి యోనా ప్రయాణం చేసి, యెహోవాకు దూరంగా పారిపోదలిచాడు.
పెనుతుఫాను
4 కాని యెహోవా సముద్రంలో పెనుతుఫాను లేవదీశాడు. గాలివల్ల సముద్రం అల్లకల్లోలంగా అయింది. తుఫాను తీవ్రంగా రేగింది. ఓడ పగిలిపోవటానికి సిధ్ధమైంది. 5 ఓడ మునగకుండా అందులో ఉన్నవారు దానిని తేలిక చేయదల్చారు. అందుచేత వారు సరుకును సముద్రంలో పారవేయడం మొదలుపెట్టారు. నావికులు చాలా భయపడ్డారు. ఓడలోనున్న ప్రతీవాడు తన దేవుని ప్రార్థించసాగాడు. యోనా మాత్రం పడుకోటానికి ఓడ క్రింది భాగంలోకి వెళ్లాడు.
యోనా నిద్రపోతూ ఉన్నాడు. 6 ఓడ అధికారి యోనాను చూసి ఇలా అన్నాడు: “నిద్రలే! నీవు ఎందుకు నిద్రపోతున్నావు? నీ దేవుణ్ణి ప్రార్థించు! బహుశః నీ దైవం నీ ప్రార్థన ఆలకించి మనల్ని రక్షించవచ్చు.”
తుఫానుకు కారణం ఏమి?
7 పిమ్మట ఓడలోని మనుష్యులు ఒకరితో ఒకరు, “మనకీ కష్టాలు ఎందుకు వచ్చాయో తెలుసు కోవటానికి మనం చీట్లు వేయాలి” అని అనుకున్నారు.
అందువల్ల వారు చీట్లు వేశారు. ఈ కష్టమంతా యోనా వల్ల వచ్చినదేనని చీట్లవల్ల తెలిసింది. 8 అప్పుడు ఆ మనుష్యులు యోనాతో ఇలా అన్నారు: “మాకు ఈ కష్టమంతా నీ తప్పువల్లనే సంభవిస్తూ ఉంది! కనుక నీవు ఏమి చేశావో మాకు చెప్పు. నీవు ఏమి పని చేస్తావు? నీవు ఎక్కడనుండి వస్తున్నావు? నీది ఏ దేశం? నీ ప్రజలు ఎవరు?”
9 అప్పుడు యోనా ఇలా అన్నాడు: “నేనొక హెబ్రీయుణ్ణి (యూదా జాతివాణ్ణి). పరలోక దేవుడైన యెహోవాను నేను ఆరాధిస్తాను. సముద్రాన్ని, భూమిని సృష్టించిన దేవుడు ఆయనే.”
10 తాను యెహోవానుండి పారిపోతున్నట్లు యోనా వారికి చెప్పాడు. ఇది తెలుసుకున్న ఆ మనుష్యులు చాలా భయపడిపోయారు. ఆ మనుష్యులు యోనాను, “నీ దేవునికి వ్యతిరేకంగా ఎటువంటి భయంకరమైన అపరాధం చేశావు?” అని అడిగారు.
11 గాలి, అలలు సముద్రంలో రానురాను మరింత తీవ్రమవుతున్నాయి. అందువల్ల ఆ మనుష్యులు యోనాతో, “మమ్మల్ని మేము రక్షించుకోవాలంటే ఏమిచేయాలి? సముద్రాన్ని శాంతింపచేయటానికి నీకు మేము ఏమిచేయాలి?” అని అడిగారు.
12 యోనా ఆ మనుష్యులతో ఇలా అన్నాడు: “నేను తప్పు చేశానని నాకు తెలుసు. అందువల్లనే ఈ తుఫాను సముద్రంలో చెలరేగింది. కనుక నన్ను సముద్రంలోకి తోసివెయ్యండి. సముద్రం శాంతిస్తుంది”
13 కాని ఆ మనుష్యులు యోనాను సముద్రంలోకి తోసివేయటానికి ఇష్టపడలేదు. వారు ఓడను తిరిగి ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించారు. కాని వారలా చేయలేకపోయారు. గాలి, సముద్రపు అలలు రాను రాను మరింత తీవ్రమయ్యాయి.
యోనాకు శిక్ష
14 అందువల్ల ఆ మనుష్యులు యెహోవాకు ఇలా విన్నవించుకున్నారు: “ప్రభూ! ఇతడు చేసిన చెడు కార్యాల దృష్ట్యా మేము ఈ మనుష్యుని సముద్రంలోకి తోసి వేస్తున్నాము. ఒక అమాయక వ్యక్తిని చంపిన నేరారోపణ దయచేసి మామీద వేయకు. మేము అతన్ని చంపినందుకు దయచేసి నీవు మమ్ముల్ని చనిపోయేలాగు చేయవద్దు. నీవు యెహోవావని మాకు తెలుసు. నీవు ఏది తలిస్తే అది చేస్తావు. కాని దయచేసి మాపట్ల కరుణ చూపు.”
15 పిమ్మట వారు యోనాను సముద్రంలోకి విసరివేశారు. తుఫాను ఆగిపోయింది. సముద్రం శాంతించింది! 16 ఆ మనుష్యులు ఇదంతా చూసి భయపడసాగారు. యెహోవాపట్ల వారికి భక్తి ఏర్పడింది. వారు యెహోవాకు ఒక బలి సమర్పించి, ప్రత్యేక మొక్కులు మొక్కుకొన్నారు.
17 యోనా సముద్రంలో పడగానే యోనాను మింగటానికి ఒక పెద్ద చేపను యెహోవా పంపాడు. ఆ చేప కడుపులో యోనా మూడు పగళ్లు, మూడు రాత్రులు ఉన్నాడు.
యేసు విశ్రాంతి రోజుకు ప్రభువు
(మత్తయి 12:1-8; మార్కు 2:23-28)
6 ఒక విశ్రాంతి రోజు యేసు ధాన్యపు పొలాల్లో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు కంకులు త్రుంచి వాటిని నలిపి తినటం మొదలుపెట్టారు. 2 కొందరు పరిసయ్యులు, “విశ్రాంతి రోజున చెయ్యరాని పనులు ఎందుకు చేస్తున్నారు?” అని అడిగారు.
3 యేసు, “దావీదు తనకు, తనతో ఉన్న వాళ్ళకు ఆకలి వేసినప్పుడు ఏమిచేసాడో మీరు చదవలేదా? 4 అతడు దేవుని ఆలయంలోకి వెళ్ళాడు. అక్కడ దేవుని సన్నిధిని పెట్టిన రొట్టెలు ఉండినవి. వాటిని యాజకులు తప్ప యితర్లు తిన కూడదు. అతడు వాటిని తీసుకొని తాను తిని, తనతో ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చాడు” అని సమాధానం చెప్పాడు. 5 యేసు మళ్ళీ, “మనుష్యకుమారుడు విశ్రాంతి రోజుకు ప్రభువు!” అని అన్నాడు.
విశ్రాంతి రోజు యేసు నయం చేయటం
(మత్తయి 12:9-14; మార్కు 3:1-6)
6 మరొక విశ్రాంతి రోజు యేసు సమాజ మందిరానికి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. అక్కడ కుడి చేయి పడిపోయిన వాడొకడున్నాడు. 7 పరిసయ్యులు, శాస్త్రులు యేసును ఏదో ఒక కారణంతో నిందించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక వాళ్ళు విశ్రాంతి రోజు ఆయన ఆ చేయి పడిపోయిన వానిని నయం చేస్తాడేమోనని ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. 8 యేసుకు వాళ్ళేమాలోచిస్తున్నారో తెలుసు. ఆయన ఆ చేయి పడిపోయిన వానితో, “లేచి అందరి ముందు నిలుచో!” అని అన్నాడు. ఆ చేయి పడిపోయిన వాడు లేచి నిలుచున్నాడు. 9 ఆ తదుపరి యేసు వాళ్ళతో, “విశ్రాంతి రోజు ఏది చెయ్యటం న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నాను? ఒకరికి మేలు చేయటమా? లేక కీడు చేయటమా? ప్రాణాన్ని రక్షించటమా? లేక నాశనం చేయటమా?” అని అన్నాడు.
10 యేసు వాళ్ళ వైపు ఒకసారి చూసి, చేయి పడిపోయిన వానితో, “నీ చేయి చాపు!” అని అన్నాడు. ఆచేయి పడిపోయినవాడు యేసు చెప్పినట్లు చేశాడు. అతని చేయి పూర్తిగా నయమై పోయింది. 11 ఇది చూసి అక్కడున్నవాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు యేసును ఏమి చెయ్యాలో తమలో తాము ఆలోచించుకొన్నారు.
యేసు పన్నెండు మంది అపోస్తలుల్ని ఎన్నుకొనటం
(మత్తయి 10:1-4; మార్కు 3:13-19)
12 ఆ తర్వాత యేసు ఒక రోజు ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు. రాత్రంతా దేవుణ్ణి ప్రార్థిస్తూ గడిపాడు. 13 ఉదయం కాగానే తన శిష్యులందర్ని దగ్గరకు పిలిచి వాళ్ళలో పన్నెండు మందిని ఎన్నుకొని వాళ్ళను తన అపొస్తలులుగా నియమించాడు. వారెవరనగా,
14 సీమోను, యేసు ఇతనికి “పేతురు” అని పేరు పెట్టాడు,
అతని తమ్ముడు అంద్రెయ.
యాకోబు,
యోహాను,
ఫిలిప్పు,
బర్తొలొమయి,
15 మత్తయి,
తోమా,
అల్ఫయి కుమారుడు యాకోబు,
జెలోతె[a] అని పిలువబడే సీమోను
16 యాకోబు కుమారుడు యూదా,
యూదా ఇస్కరియోతు. (ఈ యూదా ఇస్కరియోతు మున్ముందు ద్రోహిఔతాడు).
యేసు బోధించి రోగులను నయం చేయటం
(మత్తయి 4:23-25; 5:1-12)
17 యేసు వాళ్ళతో సహా కొండ దిగి సమంగా ఉన్న స్థలంలో నిలుచున్నాడు. చాలా మంది శిష్యులు ఆయనతో ఉన్నారు. ఆయన శిష్యులే కాక యూదయ నుండి, యెరూషలేం నుండి చాలా మంది ప్రజలు వచ్చారు. సముద్ర తీరంలో ఉన్న తూరు, సీదోను పట్టణాల నుండి కూడా చాలా మంది ప్రజలు వచ్చారు. 18 ఆయన బోధనలు వినాలని ఆయన ద్వారా తమ రోగాలు బాగు చేయించుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం. దయ్యాలు పట్టి బాధపడ్తున్న వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా నయమైపోయింది. 19 ఆయన నుండి శక్తి ప్రవహించి అందరికి నయం చేస్తూవుండటం వల్ల అందరూ ఆయన్ని తాకటానికి ప్రయత్నించారు.
20 యేసు తన శిష్యుల వైపు చూసి ఈ విధంగా అన్నాడు:
“దీనులైన మీరు ధన్యులు.
దేవుని రాజ్యం మీది.
21 ఇప్పుడు ఆకలితో ఉన్న మీరు ధన్యులు.
మీ ఆకలి తీరుతుంది.
ఇప్పుడు దుఃఖిస్తున్న మీరు ధన్యులు.
భవిష్యత్తులో మీరు నవ్వుతారు.
22 “మనుష్యకుమారుని కారణంగా ప్రజలు మిమ్ముల్ని ద్వేషించినప్పుడు, మిమ్మల్ని దూరం చేసి అవమానించినప్పుడు, మీ పేరే హానికరమైనదని వారు భావించినప్పుడు మీరు ధన్యులౌతారు! 23 మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక యిది జరిగిన రోజు ఆనందంతో గంతులు వెయ్యండి! వీళ్ళ పూర్వీకులు కూడా ఆనాడు ప్రవక్తల పట్ల యిదే విధంగా ప్రవర్తించారు.
24 “ఓ ధనికులారా! మీకు శ్రమ తప్పదు!
మీరు అనుభవించవలసిన సుఖాన్ని యిదివరకే అనుభవించారు!
25 కడుపులు నిండిన ప్రజలారా మీకు శ్రమ తప్పదు.
మీకు ఆహారం దొరకదు!
నవ్వుతున్న ప్రజలారా! మీకు శ్రమ తప్పదు!
మీరు దుఃఖిస్తారు, శోకిస్తారు!
26 “పొగడ్తులుపొందే ప్రజలారా! మీకు శిక్ష తప్పదు! వాళ్ళ పూర్వులు యిదే విధంగా అబద్ధ ప్రవక్తల్ని పొగిడారు.
శత్రువులను ప్రేమించు
(మత్తయి 5:38-48; 7:12)
27 “కాని, నా మాటలు వినే వాళ్ళకు యిది నేను చెబుతున్నాను: మీ శత్రువుల్ని ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళకు మంచి చెయ్యండి. 28 మిమ్మల్ని దూషించే వాళ్ళను దీవించండి. మీకు కీడు చేసిన వాళ్ళకు మంచి కలగాలని ప్రార్థించండి. 29 ఒక చెంప మీద కొట్టిన వానికి రెండవ చెంప కూడా చూపండి. నీ పైకండువాను తీసికొనే వానిని నీ చొక్కాను కూడ తీసికోనివ్వు. 30 అడిగిన వాళ్ళకు యివ్వండి. మీ వస్తువుల్ని ఎవరైనా తీసుకుంటే వాటిని తిరిగి అడక్కండి. 31 ఇతర్లు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాలని మీరు ఆశిస్తారో అదేవిధంగా మీరు యితర్ల పట్ల ప్రవర్తించండి.
32 “మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను ప్రేమిస్తే అందులో గొప్పేముంది? పాపులు కూడా తమను ప్రేమించిన వాళ్ళను ప్రేమిస్తారు. 33 మీకు మంచి చేసిన వాళ్ళకు మీరు మంచి చేస్తే అందులో గొప్పేముంది? పాపులుకూడా అదే విధంగా చేస్తారు. 34 అప్పు తిరిగి చెల్లిస్తారని ఆశించి అప్పిస్తే అందులో గొప్పేముంది? తమ అప్పు పూర్తిగా చెల్లిస్తారని పాపులు కూడా తమలో తాము యిచ్చి పుచ్చుకుంటారు.
35 “మీ శత్రువుల్ని ప్రేమించండి. వాళ్ళకు మంచి చెయ్యండి. తిరిగి చెల్లిస్తారని ఆశించకుండా అప్పివ్వండి. విశ్వాస ఘాతుకుల మీద, దుర్మార్గుల మీద కూడా దేవుడు దయ చూపుతాడు. మీరు నేను చెప్పినట్లు చేస్తే సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా పరిగణిస్తాడు. మీకు గొప్ప బహుమతి లభిస్తుంది. 36 మీ తండ్రివలె మీరు కూడా దయ, ప్రేమ చూపుతూ జీవించండి.
ఇతరులను విమర్షించటంలో జాగ్రతపడుము
(మత్తయి 7:1-5)
37 “ఇతర్లపై తీర్పు చెప్పకండి. అప్పుడు ఇతర్లు మీపై తీర్పు చెప్పరు. ఇతర్లను నిందించకండి. అప్పుడు యితర్లు మిమ్మల్ని నిందించరు. ఇతరులను క్షమించండి. అప్పుడు యితర్లు మిమ్మల్ని క్షమిస్తారు. 38 ఇతర్లకు యివ్వండి, మీకివ్వబడుతుంది. అప్పుడు మీకు కొలతలు నింపి, అదిమి, కుదిల్చి ఒలికిపోతుండగా మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో యిస్తే ఆ కొలతతో మీకు లభిస్తుంది.”
39 ఆయన ఈ ఉపమానం కూడా చెప్పాడు: “ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి దారి చూపగలడా? అలా చేస్తే యిద్దరూ గోతిలో పడ్తారు కదా! 40 శిష్యుడు తన గురువుకన్నా గొప్ప కాదు. కాని శిక్ష సంపూర్ణంగా పొందిన తర్వాత అతని గురువుతో సమానమౌతాడు.
41 “నీ కంట్లోవున్న పెద్ద దూలంను నీవు చూడక నీ సోదరుని కంట్లోవున్న చిన్న నలుసును ఎందుకు చూస్తావు? 42 నీ కంట్లో దూలం పెట్టుకొని, ‘నీ కంట్లో ఉన్న నలుసును నన్ను తియ్యనివ్వు’ అని అతనితో ఏలాగు అనగలుగుతున్నావు? ఓ కపటీ! నీ కంట్లో దూలాన్ని ముందు తీసేయి. అప్పుడు నీవు బాగా చూడ కలిగి సోదరుని కంట్లో ఉన్న నలుసును ఏ విధంగా తియ్యాలో తెలుసుకుంటావు.
చెట్టు, దాని ఫలము
(మత్తయి 7:17-20; 12:34-35)
43 “మంచి చెట్టుకు చెడు పండ్లు కాయవు. అదే విధంగా చెడ్డ చెట్టుకు మంచి పండ్లు కాయవు. 44 పండ్లను బట్టి చెట్టు జాతి తెలుస్తుంది. ముండ్ల పొదల నుండి అంజూరపు పండ్లు, గోరింట పొదల నుండి ద్రాక్షాపండ్లు లభించవు. 45 మంచి వాని హృదయం మంచి గుణాలతో నిండి ఉంటుంది. కాబట్టి అతని నుండి మంచి తనమే బయటకు వస్తుంది. చెడ్డవాని హృదయం చెడు గుణాలతో నిండి ఉంటుంది. కాబట్టి అతనినుండి చెడే బయటకు వస్తుంది. మనిషి తన హృదయములో ఉన్న గుణాలను బట్టి మాట్లాడుతాడు.
తెలివిగలవాడు, తెలివిలేనివాడు
(మత్తయి 7:24-27)
46 “నేను చెప్పింది చెయ్యకుండా నన్ను ‘ప్రభూ! ప్రభూ!’ అని పిలవటం ఎందుకు? 47 నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటిని అనుసరించే వాడు ఎలాంటి వాడో చెబుతాను వినండి. 48 అలాంటి వాణ్ణి భూమి లోతుగా త్రవ్వి రాళ్ళ పునాది వేసి యిల్లు కట్టుకున్న వానితో పోల్చవచ్చు. ఇతడు తన యింటిని సక్రమమైన పద్దతిలో కట్టాడు కనుక వరదలు వచ్చి నీటి ప్రవాహం ఆ యింటిని కొట్టినా ఆ యిల్లు కూలి పోలేదు.
49 “నా మాటలు విని వాటిని అనుసరించని వాడు పునాది వేయకుండా, నేలపై ఇల్లు కట్టుకొన్న వానితో సమానము. వరదలు వచ్చాయి. ఆ నీటి ప్రవాహానికి ఆ యిల్లు కూలి నేల మట్టమైపోయింది.”
© 1997 Bible League International