Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 దినవృత్తాంతములు 11-12

ఇశ్రాయేలుకు దావీదు రాజవటం

11 ఇశ్రాయేలు ప్రజానీకం హెబ్రోను పట్టణంలో దావీదు వద్దకు వెళ్లారు. వారు దావీదుతో ఇలా అన్నారు: “మేము నీ రక్త మాంసాలను పంచుకు పుట్టిన వాళ్లం (బంధువులం). గతంలో మమ్మల్ని నీవు యుద్ధంలో నడిపించావు. సౌలు రాజుగా వున్నప్పటికీ మమ్మల్ని నడిపిన వాడవు నీవే! యెహోవా నీతో, ‘దావీదూ, ఇశ్రాయేలీయులైన నా ప్రజల కాపరివి నీవే. నా ప్రజలకు నీవు నాయకుడివవుతావు’ అని అన్నాడు.”

ఇశ్రాయేలు పెద్దలంతా హెబ్రోను పట్టణంలో దావీదు రాజువద్దకు వచ్చారు. యెహోవా సన్నిధిలో ఆ పెద్దలతో దావీదు ఒక ఒడంబడిక చేసుకొన్నాడు. పెద్దలు దావీదు తలమీద నూనె పోసి అభిషిక్తుని చేశారు. ఆ పని దావీదు ఇశ్రాయేలు రాజు అయినట్లు తెలుపుతుంది. ఇది జరుగుతుందని యెహోవా మాటయిచ్చాడు. ఈ వాగ్దానం యెహోవా సమూయేలు ద్వారా చేశాడు.

దావీదు యెరూషలేమును జయించటం

దావీదు, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి యెరూషలేముకు వెళ్లారు. ఆ కాలంలో యెరూషలేము “యెబూసు” అని పిలువబడేది. ఆ నగరంలో నివసించే ప్రజలంతా యెబూసీయులనబడేవారు. ఆ నగరవాసులు దావీదుతో, “నీవు మా నగర ప్రవేశం చేయకూడదు” అని అన్నారు. అయినప్పటికి దావీదు ఆ ప్రజలను ఓడించాడు. సీయోను కొండ[a] మీది కోటను దావీదు వశం చేసుకొన్నాడు. ఈ ప్రదేశమే దావీదు నగరమని పిలువబడింది.

“మీలో ఎవరు సైన్యాన్ని యెబూసీయుల మీదికి విజయవంతంగా నడిపిస్తారో అతడు నా సైన్యానికంతటికి ముఖ్య అధిపతి అవుతాడు” అని దావీదు ప్రకటించాడు. అది విని యోవాబు దండయాత్రకు నాయకత్వం వహించి నిర్వహించాడు. యోవాబు తండ్రిపేరు సెరూయా. యోవాబు సైన్యాధిపతయ్యాడు.

దావీదు తన నివాసం కోటలో ఏర్పరచుకొన్నాడు. అందువల్ల దానికి దావీదు నగరం అని పేరు వచ్చింది. కోట చుట్టూ దావీదు నగరాన్ని నిర్మించాడు. మిల్లో[b] నుండి బయటి ప్రాకారం వరకు అతడు నగరాన్ని నిర్మించాడు. యోవాబు ఆ నగరంలో ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయించాడు. రోజురోజుకు దావీదు గొప్పతనం పెరుగుతూ వచ్చింది. సైన్యాలకు అధిపతియైన యెహోవా దావీదుకు తోడైయున్నాడు.

దావీదు యొక్క ముగ్గురు వీర నాయకులు

10 దావీదు సైన్యంలో మహావీరులున్నారు. దావీదులాగానే వీరుకూడా శక్తిమంతులయ్యారు. ఇశ్రాయేలు ప్రజలంతా దావీదు రాజ్యానికి మంచి మద్దతు ఇచ్చారు. ఈ మహావీరులూ, ఇశ్రాయేలు ప్రజానీకం కలసి దావీదును రాజుగా చేశారు. దేవుడు ఇది జరుగుతుందని వాగ్దానం చేశాడు.

11 దావీదు సైన్యంలో మహాయోధులు ఎవరనగా:

హక్మనీయులకు చెందిన యాషాబాము ఒకడు. యాషాబాము అధికారులకు పై అధికారి.[c] అతడు తన ఈటెనుపయోగించి మూడు వందల మందిని ఎదిరించాడు. ఆ మూడువందల మందిని ఒక్క వేటుతో చంపివేశాడు.

12 దావీదు యోధులలో ఎలియాజరు మరొకడు. ఎలియాజరు తండ్రి పేరు దోదో. దోదో అహోహీయుల వంశంవాడు. ముగ్గురు మహా యోధుల్లో ఎలియాజరు ఒకడు. 13 పస్దమ్మీములో ఎలియాజరు దావీదుతో వున్నాడు. ఫిలిష్తీయులు ఆ ప్రదేశానికి యుద్ధానికి సిద్ధమై వచ్చారు. ఆ ప్రాంతంలో విరగపండిన యవల చేనువుంది. ఫిలిష్తీయులకు భయపడి ఇశ్రాయేలీయులు ఈ ప్రదేశానికి పారిపోయి వచ్చారు. 14 కాని వారా చేను మధ్యలో నిలబడి పంటను కాపాడుతూ ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని చంపివేశారు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులకు ఘనవిజయం చేకూర్చాడు.

15 ముప్పై మంది నాయకులలో ముగ్గురు దావీదు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో దావీదు అదుల్లాము గుహగల కొండ వద్ద ఉన్నాడు. అదే సమయంలో ఫిలిష్తీయుల సైనికులు కొందరు రెఫాయిము లోయలో గుడారాలు వేశారు.

16 అప్పుడు దావీదు కోటలో వున్నాడు. ఫిలిష్తీయుల సైన్యం బేత్లెహేములో దిగివుంది. 17 దావీదుకు అప్పుడు దాహం వేసింది. అతడు, “ఓహో, ఇప్పుడు నాకెవరైనా బేత్లెహేము[d] నగర ద్వారం వద్దగల బావి నీరు తాగటానికి తెచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాను!” (దావీదు నిజంగా దీనిని కోరుకోలేదు) అని అన్నాడు. 18 అప్పుడు ఆ ముగ్గురు యోధులు ఫిలిష్తీయుల సైన్యాన్ని ఛేదించుకుంటూపోయి, బేత్లెహేము నగర ద్వారంవద్ద గల బావినుండి నీరు తీసుకొన్నారు. ఆ ముగ్గురు యోధులు నీటిని తెచ్చి దావీదుకు ఇచ్చారు. కాని దావీదు ఆ నీటిని తాగ నిరాకరించాడు. ఆ నీటిని యెహోవాకి అర్పణగా పారపోశాడు. 19 దావీదు ఇలా అన్నాడు, “యెహోవా నన్ను ఈ నీటిని తాగకుండా చేయుగాక! ఈ నీటిని నేను తాగటం సరియైనది కాదు. ఎందువల్లననగా ఈ మనుష్యులు ఈ నీటిని తేవటానికి తమ ప్రాణాలను లెక్క చేయలేదు. వారు మృత్యుముఖంలో పడి బయటపడ్డారు.” అందువల్ల దావీదు ఆ నీటిని తాగలేదు. ఆ విధంగా ఆ ముగ్గురు మహాయోధులు వీరోచిత కార్యాలు సాధించారు.

దావీదు యొక్క ముగ్గురు వీరులు

20 ముగ్గురు యోధుల దళానికి యోవాబు సోదరుడు అబీషై నాయకుడు. అతడు మూడు వందల మందిని తన ఈటెతో ఎదిరించి చంపాడు. ఆ ముగ్గురు యోధుల్లాగా అబీషై కీర్తి గడించాడు. 21 కాని అతనికి మిగిలిన వారికంటె ఎక్కువ గౌరవం దక్కింది. ముగ్గురిలో ఒకడు కాకపోయినా అతడు అధిపతి అయ్యాడు.

22 యోహోయాదా కుమారుడు బెనాయా ఒక పరాక్రమవంతుని కుమారుడు. అతడు కబ్సెయేలు వంశంవాడు. అతడు కొన్ని సాహస కార్యాలు నెరవేర్చాడు. మోయాబు దేశానికి చెందిన ఇద్దరు గొప్ప యోధులను చంపాడు. అతడు భూమిలో పెద్ద గోతిలోకి వెళ్లి అక్కడ ఒక సింహాన్ని చంపాడు. అది బాగా మంచుపడే రోజున జరిగింది. 23 ఈజిప్టుకు చెందిన బలవంతుడైన సైనికుని కూడ బెనాయా చంపాడు. ఆ మనుష్యుడు ఏడున్నర అడుగుల ఎత్తుగల వాడు. ఆ ఈజిప్టు వాని వద్ద అతి పెద్దదయిన, బరువైన ఒక ఈటె వుంది. అది నేత నేయువాని మగ్గం దోనెవలె వుంది. బెనాయా వద్ద ఒక గదలాంటి ఆయుధం మాత్రమే వుంది. కాని బెనాయా ఆ ఈజిప్టు వాని వద్ద నుండి ఈటెను లాక్కున్నాడు. దానితోనే వానిని చంపివేశాడు. 24 ఇవన్నీ యోహోయాదా కుమారుడు బెనాయా చేసిన పనులు. ముగ్గురు యోధుల్లాగా బెనాయా పేరు పొందిన వ్యక్తి అయ్యాడు. 25 ఆ ముగ్గురి యోధుల కంటె బెనాయాకు ఎక్కువ గౌరవం లభించింది. కాని అతడు ఆ ముగ్గురిలో చేర్చబడలేదు. దావీదు తన అంగరక్షకులకు అధిపతిగా బెనాయాను నియమించాడు.

ముఫ్పై మంది వీరులు

26 ముఫ్పై మంది వీరులైన సైనికులెవరనగా:

యోవాబు సోదరుడైన ఆశాహేలు.

దోదో కుమారుడైన ఎల్హానాను. ఎల్హానాను బేత్లెహేము నివాసి.

27 హరోరీయుడైన షమ్మోతు.

పెలోనీయుడైన హేలెస్సు.

28 ఇక్కీషు కుమారుడైన ఈరా. ఈరా తెకోవ పట్టణానికి చెందినవాడు.

అనాతోతీయుడైన అబీయెజెరు.

29 హుషాతీయుడైన సిబ్బెకై.

అహోహీయుడైన ఈలై.

30 నెటోపాతీయుడగు మహరై, బయనా కుమారుడగు హేలెదు.

హేలెదు కూడ నెటోపాతీయుడు.

31 రీబయి కుమారుడైన ఈతయి. ఈతయి అనేవాడు బెన్యామీను దేశంలోని గిబియా పట్టణవాసి.

పిరాతోనీయుడైన బెనాయా,

32 గాయషులోయవాడైన హురై,

అర్బాతీయుడైన అబీయేలు,

33 బహరూమీయుడైన అజ్మావెతు.

షయిల్బోనీయుడైన ఎల్యాహ్బా

34 హాషేము కుమారులు గిజోనీయుడుగు షాగే కుమారుడు యోనాతాను. యోనాతాను హరారీయుడు.

35 శాకారు కుమారుడు అహీయాము. అహీయాము హరారీయుడు.

ఊరు కుమారుడు ఎలీపాలు.

36 మెకేరాతీయుడైన హెపెరు.

పెలోనీయుడగు అహీయా.

37 కర్మెలీయుడైన హెజ్రో.

ఎజ్బయి కుమారుడైన నయరై.

38 నాతాను సోదరుడైన యోవేలు.

హగ్రీ కుమారుడగు మిబ్హారు.

39 అమ్మోనీయుడగు జెలెకు.

బెరోతీయుడగు నహరై. యోవాబు ఆయుధాలు మోసేవాడు. యోవాబు తండ్రి పేరు సెరూయా.

40 ఇత్రీయుడైన ఈరా.

ఇత్రీయుడగు గారేబు.

41 హిత్తీయుడైన ఊరియా.

అహ్లయి కుమారుడు జాబాదు.

42 షీజా కుమారుడు అదీనా. షీజా అనేవాడు రూబేనీయుడు. అదీనా రూబేను వంశంలో పెద్ద. అతను తనతోవున్న ముగ్గురు యోధులకు నాయకుడు.

43 మయకా కుమారుడు హానాను.

మిత్నీయుడైన యెహోషాపాతు.

44 ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా.

హోతాము కుమారులు షామా, యెహీయేలు. హోతాము అరోయేరీయుడు.

45 షిమ్రీ కుమారుడు యెదీయవేలు.

తిజీయుడగు యోహా. యెదీయవేలు సోదరుడు యోహా.

46 మహవీయుడగు ఎలీయేలు.

ఎల్నయము కుమారులైన యెరీబై, యోషవ్యా. మోయాబీయుడైన ఇత్మా.

47 ఎలీయేలు, ఓబేదు, మరియు మెజోబాయా వాడైన యహశీయేలు.

దావీదుతో కలిసిన శూరులు

12 దావీదు సిక్లగు పట్టణంలో ఉన్నాడు. ఆ సమయంలో కొందరు మనుష్యులు దావీదును కలుసుకొన్నారు. దావీదు పారిపోయి సౌలుకు కనపడకుండా దాగివున్న రోజులవి. కీషు కుమారుడు సౌలు. ఈ వచ్చిన మనుష్యులు దావీదుకు యుద్ధంలో సహాయపడ్డారు. ఈ మనుష్యులు కుడి చేతితోను, ఎడమ చేతితోను బాణాలు ఒడుపుగా వేయగల నేర్పరులు. వడిసెలకూడ వారు కుడి ఎడమల తేడా లేకుండా తిప్పి రాళ్లు విసరగల సమర్థులు. వారంతా సౌలు బంధువులైన బెన్యామీనీయులు. వారెవరనగా:

అహీయెజెరు వారి నాయకుడు. వారిలో యోవాషు కూడ వున్నాడు. అహీయెజెరు, యోవాషులిద్దరూ షెమయా కుమారులు. షెమయా అనేవాడు గిబియావాడు. వారిలో ఇంకా యెజీయేలు, పెలెటు వున్నారు. యెజీయేలు, పెలెటులిరువురూ అజ్మావెతు కుమారులు. బెరాకా, అనాతోతీయుడైన యెహూ అనేవారు కూడ వారితో వున్నారు. గిబియోనీయుడైన ఇష్మయా బలపరాక్రమ సంపన్నుడు. ముప్పై మంది యోధుల్లో ఒకడు మరియు వారి నాయకుడు. యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు కూడ వున్నారు. ఎలూజై, యెరీమోతు, బెయల్యా మరియు షెమర్యా. హరీపీయుడైన షెఫట్యా. ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజేరు, యాషాబాము అనే వారు కోరహు వంశీయులు. యెరోహాము కుమారులైన యోహేలా మరియు జెబద్యా. వారు గెదోరు గ్రామానికి చెందిన వారు.

గాదీయులు

గాదీయులలో కొంతమంది ఎడారి ప్రాంతంలో కోటలో దాగివున్న దావీదును కలిశారు. వారు బాగా యుద్ధ శిక్షణ పొందిన సైనికులు. వారు డాలు పట్టి ఈటెను ఉపయోగించటంలో ఆరితేరినవారు. వారు సింహం లాంటి ముఖాలతో భయంకరంగా వుంటారు. వారు కొండల్లో జింకల్లా పరుగెత్తగలరు.

ఏజెరు గాదు సైన్యానికి అధిపతి. ఓబద్యా రెండవ ముఖ్యాధికారి. ఏలీయాబు మూడవ స్థానంలో వున్నాడు. 10 మిష్మన్నా నాల్గవ స్థానంలోను, యిర్మీయా ఐదవ స్థానంలోను వున్నారు. 11 అత్తయి ఆరవ స్థానంలోను, ఏలీయేలు ఏడవ స్థానంలోను వున్నారు. 12 యోహానాను ఎనిమిదవ స్థానంలోను, ఎల్జాబాదు తొమ్మిదవ స్థానంలోను వున్నారు. 13 యిర్మీయా పదవ స్థానంలోను, మక్బన్నయి పదకొండవ వాడుగాను వున్నారు.

14 వారు గాదీయుల సైన్యంలో అధికారులు. వారిలో అతి బలహీనుడైనవాడు కూడ కనీసం వంద మందితో పోరాడగలడు. వారిలో మిక్కిలి బలవంతుడు వేయి మంది శత్రు సైనికులను ఎదుర్కొనగలడు. 15 ఈ గాదు వంశీయులే మొదటి నెలలో యొర్దాను నదికి వరదలు వచ్చే సమయంలో లోయల్లో వుండే వారందరినీ తరిమికొట్టారు. వారా ప్రజలను తూర్పునకు, పడమరకు తరిమివేశారు.

ఇతర సైనికులు దావీదుతో చేరటం

16 బెన్యామీను, యూదా వంశాలకు చెందిన ఇతర ప్రజలు కూడ కోటలో వున్న దావీదు వద్దకు వచ్చారు. 17 దావీదు వారిని కలిసేందుకు ఎదురు వెళ్లి, వారితో ఇలా అన్నాడు: “మీరు శాంతి భావంతో నాకు సహాయం చేయగోరి వస్తే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను! నాతో కలిసి ఉండండి. ఒకవేళ నేను ఏమీ తప్పు చేయకపోయినా మీరు నా మీద నిఘావేసి నన్ను శత్రువులకు అప్పజెప్పటానికి కనుక వస్తే, మన పూర్వీకుల దేవుడు మీరు చేసేది చూచి మిమ్మల్ని శిక్షించుగాక!”

18 అప్పుడు దేవుని ఆత్మ అమాశై మీదికి వచ్చింది. అమాశై ముప్పదిమంది వీరుల నాయకుడు. అమాశై అప్పుడు ఇలా అన్నాడు:

“ఓ దావీదూ, మేము నీవారం!
    ఓ యెష్షయి కుమారుడా, మేము నీతో వున్నాము.
శాంతి! నీకు శాంతి కలుగుగాక!
    నీకు సహాయపడే ప్రజలకు కూడ శాంతి. ఎందువల్లననగా నీ దైవం నీకు సహాయపడుతున్నాడు!”

అప్పుడు దావీదు వారికి స్వాగతం పలికి వారిని చేరదీశాడు. తన పక్షాన వారిని దళాధిపతులుగా నియమించాడు.

19 కొందరు మనష్షే వంశంలోని వారు కూడ వచ్చి దావీదు పక్షం వహించారు. అతడు ఫిలిష్తీయులతో కలిసి సౌలుపై యుద్ధానికి వెళ్లినప్పుడు వారు వచ్చి దావీదు పక్షం వహించారు. కాని దావీదు, అతని మనుష్యులు నిజానికి ఫిలిష్తీయులకు సహాయపడలేదు. దావీదు తమకు సహాయం చేసే విషయం ఫిలిష్తీయుల అధికారులు చర్చించి, పిమ్మట అతనిని పంపివేయటానికి నిశ్చయించారు. ఫిలిష్తీయుల పాలకులు ఇలా అన్నారు: “ఒకవేళ దావీదు మధ్యలో తన యజమాని సౌలు వద్దకు వెళ్లిపోతే మన తలలు తెగిపోతాయి!” 20 దావీదు సిక్లగు పట్టణానికి వెళ్లినప్పుడు అతనితో కలిసిన మనష్షీయులు ఎవరనగా: అద్నా, యోజాబాదు, మెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు మరియు జిల్లెతై. వీరిలో ప్రతి ఒక్కడూ మనష్షే వంశీయులలో వెయ్యి మందికి నాయకుడు. 21 దుష్టశక్తులను ఎదుర్కొనటంలో వారు దావీదుకు తోడ్పడ్డారు. ఈ దుష్టులు దేశం మీద పడి ప్రజలను దోచుకోసాగారు. దావీదును చేరిన మనష్షీయులంతా ధైర్యంగల సేనానులు. వారు దావీదు సైన్యంలో అధిపతులయ్యారు.

22 రోజురోజుకూ దావీదు వద్దకు వచ్చి సహాయపడేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. దానితో దావీదుకు శక్తివంతమైన ఒక మహా సైన్యం ఏర్పడింది.

హెబ్రోనులో మరికొందరు దావీదును చేరటం

23 దావీదును హెబ్రోను పట్టణంలో కలిసిన వారి వివరాలు, సంఖ్యాబలం ఈ విధంగా వున్నాయి: వారు యుద్ధ వీరులు. సౌలు సామ్రాజ్యాన్ని దావీదుకు అప్పజెప్పటానికి వచ్చారు. ఇది ఇలా జరుగుతుందని యెహోవా చెప్పియున్నాడు. వారి బలగం ఏదనగా:

24 యుద్ధానికి అర్హతగల యూదా వంశీయులు ఆరువేల ఎనిమిది వందల మంది వున్నారు. వారు డాళ్లను, ఈటెలను పట్టగల సమర్థులు.

25 షిమ్యోనీయులు ఏడువేల వందమంది వున్నారు. వారంతా ధైర్య సాహసాలుగల సైనికులు.

26 లేవీయులు నాలుగువేల ఆరువందల మంది వున్నారు. 27 యెహోయాదా ఆ వర్గంలో వాడు. అతడు అహరోను కుటుంబ పెద్ద. యెహోయాదాతో మూడువేల ఏడువందల మంది మనుష్యులున్నారు. 28 ఆ వర్గంలో సాదోకు కూడా వున్నాడు. అతడు మంచి ధైర్యంగల యువ సైనికుడు. అతడు తన కుటుంబీకులలో ఇరవై ఇద్దరు అధికారులతో వచ్చాడు.

29 బెన్యామీను వంశం వారు మూడువేలమంది వున్నారు. వారంతా సౌలుకు బంధువులు. అప్పటి వరకు వారిలో అధిక సంఖ్యాకులు సౌలు కుటుంబం పట్ల విశ్వాసంగా వున్నారు.

30 ఎఫ్రాయిము వంశంవారు ఇరవైవేల ఎనిమిది వందలమంది వున్నారు. వారు ధైర్యంగల సేనానులు. వారి వారి కుటుంబాలలో వారు ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు.

31 మనష్షే వంశీయులలో సగంమంది నుండి వచ్చిన వారు పద్దెనిమిదివేల మంది. వారు పేరు పేరున దావీదును రాజుగా చేయటానికి ఎంపిక చేయబడినవారు.

32 ఇశ్శాఖారు వంశీయులలో తెలివైన పెద్దలు రెండు వందల మంది. ఇశ్రాయేలుకు చేయదగిన మంచి యేదో వారు సరియైన సమయంలో గుర్తించారు. వారి బంధువులంతా వారి మాటకు కట్టుబడి వున్నారు.

33 జెబూలూనీయులు ఏబదివేల మంది వున్నారు. వారంతా అనుభవజ్ఞులైన సైనికులు. వారు రకరకాల ఆయుధాలు చేపట్టి యుద్ధానికి సిద్ధంగా వున్నారు. వారు దావీదుకు మిక్కిలి నమ్మకస్తులై వున్నారు.

34 నఫ్తాలీయుల నుండి ఒక వెయ్యిమంది అధిపతులు వచ్చారు. వారికి ముప్పది ఏడువేల మంది అనుచరులు వున్నారు. వారు ఈటెలు, డాళ్లు పట్టి వున్నారు.

35 దాను వంశం నుండి యుద్ధానికి సిద్ధంగా వున్న వారు ఇరవై ఎనిమిదివేల ఆరువందల మంది.

36 ఆషేరు వంశం నుండి కాకలు తీరిన సైనికులు యుద్ధానికి సిద్ధమై నలభై వేలమంది వచ్చారు.

37 యొర్దాను నదికి ఆవలివైపు (నదికి తూర్పు) నుండి రూబేను, గాదు, సగం మనష్షే వంశీయుల నుండి ఒక లక్షా ఇరవై వేల మంది వచ్చారు. వారంతా రకరకాల ఆయుధాలు ధరించియున్నారు.

38 ఆ వచ్చిన మనుష్యులంతా పోరాట యోధులు. దావీదును ఇశ్రాయేలుకంతటికి రాజుగా చేయాలనే కృతనిశ్చయంతో ఆ వీరులందరూ హెబ్రోను పట్టణానికి వచ్చారు. మిగిలిన ఇశ్రాయేలీయులు కూడ దావీదును రాజుగా చేయటానికి ఒప్పుకున్నారు. 39 ఆ మనుష్యులంతా దావీదుతో మూడు రోజులు హెబ్రోనులో గడిపారు. వారి బంధువులంతా తగినన్ని ఆహార పదార్థాలను తయారు చేయటంతో వారు బాగా అన్నపానాదులు సేవించి కాలం గడిపారు. 40 ఇశ్శాఖారు, జెబూలూను మరియు నఫ్తాలి వంశాల వారి ఇరుగు పొరుగు వారు కూడ గాడిదలమీద, ఒంటెలమీద, కంచర గాడిదల మీద, ఎద్దుల మీద ఆహార పదార్థాలు వేసుకొని వచ్చారు. వారు కావలసినంత పిండిని, అంజూర పండ్ల భక్ష్యాలను, ఎండుద్రాక్షను, ద్రాక్షారసాన్ని, నూనెను, పశువులను, గొర్రెలను తీసుకొని వచ్చారు. ఇశ్రాయేలంతటా సంతోషం వెల్లివిరిసింది.

హెబ్రీయులకు 13

చివరి మాటలు

13 పరస్పరం సోదరుల్లా జీవించండి. తెలియనివాళ్ళకు ఆతిథ్యమివ్వండి. కొందరు యిలా చేసి తమకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యమిచ్చారు. చెరసాలల్లో ఉన్నవాళ్ళను, మీరు వాళ్ళతో సహా ఉన్నట్లు భావించి జ్ఞాపకంచేసుకోండి. అదేవిధంగా కష్టాలనుభవిస్తున్న వాళ్ళను, మీరు వాళ్ళతో సహా కష్టాలనుభవిస్తున్నట్లు భావించి జ్ఞాపకంచేసుకోండి.

వివాహాన్ని అందరూ గౌరవించాలి. వివాహపాన్పును నిష్కళంకంగా ఉంచాలి. వ్యభిచారుల్ని, వివాహితులతో లైంగిక సంబంధాలను పెట్టుకొన్నవాళ్ళను దేవుడు శిక్షిస్తాడు. ధనాశ లేకుండా జీవితాలు గడపండి. మీ దగ్గరున్నదానితో సంతృప్తి చెందండి. ఎందుకంటే దేవుడు ఈ విధంగా అన్నాడు:

“నేను నిన్ను ఎన్నటికీ విడువను
నిన్నెన్నటికీ ఒంటరివాణ్ణి చెయ్యను.”(A)

అందువల్ల మనం దృఢ విశ్వాసంతో,

“ప్రభువు నా రక్షకుడు,
    నాకే భయంలేదు.
మానవుడు నన్నేమి చెయ్యగలడు?”(B)

అని అంటున్నాము.

మీకు దైవసందేశాన్ని ఉపదేశించిన గురువుల్ని జ్ఞాపకముంచుకోండి. వాళ్ళ జీవిత విధానం వలన కలిగిన మంచిని గమనించండి. వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించండి. నిన్న, నేడు, నిరంతరం యేసు క్రీస్తు ఒకే విధంగా ఉంటాడు. ఎన్నో రకాల విచిత్రమైన బోధలు ఉన్నాయి. వాటివల్ల మోసపోకండి. దైవానుగ్రహంతో మన హృదయాలు శక్తి పొందాలి గాని ఆహారంతో కాదు. ఆహార నియమాలవల్ల వాళ్ళకు లాభం కలుగదు.

10 యూదుల గుడారంలో సేవచేసే యాజకులకు మన బలిపీఠం మీద బలి ఇచ్చినదాన్ని తినే అధికారంలేదు. 11 పాపాలకు ప్రాయశ్చిత్తంగా అర్పించటానికి ప్రధాన యాజకుడు జంతువుల రక్తాన్ని అతి పవిత్రస్థానంలోకి తీసుకు వెళ్ళేవాడు. ఆ జంతువుల దేహాల్ని శిబిరానికి ఆవలి వైపు కాల్చేవాడు. 12 మనుష్యుల్ని తన రక్తంతో పవిత్రం చెయ్యాలని యేసు నగరపు సింహద్వారానికి ఆవల మరణించాడు. 13 అందువల్ల శిబిరం వెలుపలనున్న ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన అవమానాన్ని పంచుకుందాం. 14 మనకు స్థిరమైన పట్టణం లేదు. కాని మున్ముందు రానున్న పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాము. 15 అందువల్లే మనం యేసు ద్వారా దేవుణ్ణి అన్ని వేళలా స్తుతించుదాం. మన నోటి ద్వారా కలిగే స్తుతిని ఆయనకు బలిగా అర్పించి, ఆయన పేరులో ఉన్న కీర్తిని పంచుకుందాం. 16 ఇతరులకు ఉపకారం చెయ్యండి. మీకున్నదాన్ని యితరులతో పంచుకోండి. ఇలాంటి పనులు దేవునికి చాలా యిష్టం.

17 మీ నాయకుల పట్ల విధేయతగా ఉంటూ, వాళ్ళు చెప్పినట్లు చెయ్యండి. మీ ఆత్మల్ని కాపాడవలసిన పని వాళ్ళది. వాళ్ళు దేవుని ముందు లెక్క చెప్పవలసివుంటుంది. వాళ్ళకు మీరు విధేయులైవుంటే, వాళ్ళు తాము చేయవలసిన పనిని ఆనందంగా చేయగలుగుతారు. అది వాళ్ళకు భారంగా వుండదు. వాళ్ళకు భారం కలగటం మీకు మంచిది కాదు.

18 మా కోసం ప్రార్థించండి. మా అంతరాత్మలు నిర్మలమైనవనే విశ్వాసం మాకు ఉంది. మేము అన్ని విధాలా గౌరవప్రదంగా జీవించాలనుకొంటున్నాము. 19 నేను ముఖ్యంగా వేడుకునేదేమిటంటే, నేను త్వరలోనే మిమ్మల్ని కలుసుకోవాలని దేవుణ్ణి ప్రార్థించండి.

20 శాంతిని స్థాపించే దేవుడు, గొఱ్ఱెల గొప్ప కాపరి అయిన మన యేసు ప్రభువును తిరిగి బ్రతికించాడు. ఈ కార్యాన్ని దేవుడు శాశ్వతమైన ఒడంబడిక రక్తం ద్వారా జరిగించాడు. 21 ఆ దేవుడు మీరు ఆయన యిష్టానుసారం నడుచుకునేటట్లు మీకు కావలసినవి సమకూర్చు గాక! ఆయన మనలో ఉండి, యేసు క్రీస్తు ద్వారా తన యిష్టాన్ని నెరవేర్చుగాక! ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.

22 సోదరులారా! నేనీ లేఖను క్లుప్తంగా వ్రాసాను. ప్రోత్సాహం కలుగ చేసే ఈ సందేశాన్ని సహృదయంతో చదవమని వేడుకుంటున్నాను. 23 మన సోదరుడైన తిమోతిని విడుదల చేసినట్లు మీకు తెలియజేస్తున్నాను. అతడు నా వద్దకు త్వరలో వస్తే అతనితో కలిసి మిమ్మల్ని చూడటానికి వస్తాను.

24 మీలోవున్న పెద్దలకు, దేవుని ప్రజలకు వందనాలు తెలుపండి. ఇటలీ దేశానికి చెందిన విశ్వాసులు మీకు వందనాలు తెలుపుతున్నారు.

25 మీ అందరికి దేవుని ప్రేమానుగ్రహము తోడుగా వుండునుగాక!

ఆమోసు 7

మిడుతలను గూర్చిన దర్శనం

యెహోవా నాకిది చూపించాడు: రెండవ పంట పెరగటం ప్రారంభమైనప్పుడు ఆయన మిడుతలను పుట్టిస్తున్నాడు. రాజు మొదటి పంట కోసాక పెరిగే రెండవ పంట ఇది. మిడుతలు దేశంలో వున్న గడ్డినంతా తినివేశాయి. దాని తరువాత నేనిలా అన్నాను: “నా ప్రభువైన యెహోవా, మమ్మల్ని క్షమించుమని నేను అర్థిస్తున్నాను! యాకోబు బతకలేడు! అతడు చాలా చిన్నవాడు!”

అప్పుడు యెహోవా ఈ విషయంలో తన మనస్సు మార్చుకొని “అది జరగదు” అని అన్నాడు.

అగ్నిని గూర్చిన దర్శనం

నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు నాకు చూపించాడు: దేవుడైన యెహోవా అగ్నిచేత తీర్పు తీర్చటానికి పిలవటం నేను చూశాను. ఆ అగ్ని గొప్ప అగాధ జలాన్ని నశింపజేసింది. ఆ అగ్ని భూమిని తినివేయటం ప్రారంభించింది. కాని నేనిలా అన్నాను, “దేవుడవైన ఓ యెహోవా, ఇది ఆపివేయి. నిన్ను నేను అర్థిస్తున్నాను! యాకోబు బతకలేడు! అతడు మిక్కిలి చిన్నవాడు!”

పిమ్మట యెహోవా ఈ విషయంలో తన మనస్సు మార్చుకొని “అది కూడా జరగదు” అని అన్నాడు!

మట్టపుగుండు దర్శనం

యెహోవా దీనిని నాకు చూపించాడు: మట్టపుగుండు[a] (మట్టపు గోడ నిటారుగా వచ్చేలా సరి చూడబడుతుంది)ను చేతబట్టుకొని యెహోవా ఒక గోడవద్ద నిలబడ్డాడు. “ఆమోసూ, నీవు ఏమి చూస్తున్నావు?” అని యెహోవా నన్ను అడిగాడు.

“ఒక మట్టపు గుండును” అని నేనన్నాను.

అప్పుడు నా ప్రభువు ఇలా అన్నాడు: “చూడు, నా ప్రజలైన ఇశ్రాయేలీయులమధ్య ఒక మట్టపుగుండు పెడతాను. వారి ‘దుష్టత్వాన్ని’ ఇక ఎంత మాత్రం నేను చూసి చూడనట్లు వదలను. (ఆ దుష్ట భాగాలను నేను తొలగిస్తాను). ఇస్సాకు వంశస్థులు ఏర్పాటు చేసిన ఉన్నత ప్రదేశాలు నాశనం చేయబడతాయి. ఇశ్రాయేలు పవిత్ర స్థలాలన్నీ రాళ్ల గుట్టల్లా మార్చబడతాయి. నేను యరొబాము వంశంమీద పడి వారిని కత్తులతో చంపుతాను.”

ఆమోసు ప్రకటనలను అమజ్యా ఆపజూడటం

10 బేతేలులో ఒక యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబాముకు ఈ వర్తమానం పంపాడు: “ఆమోసు నీమీద కుట్ర పన్నుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నీ మీదకు తిరగబడేలా చేయటానికి అతడు ప్రయత్నిస్తున్నాడు. అతడు ఎంతగా మాట్లాడుతున్నాడంటే, ఈ దేశం అతని మాటల్ని సహించలేదు. 11 యరొబాము కత్తిచే చంపబడతాడనీ, ఇశ్రాయేలీయులు తమ దేశంనుండి బందీలుగా కొనిపోబడతారనీ ఆమోసు ప్రచారం చేస్తున్నాడు.”

12 ఆమోసుతో కూడ అమజ్యా ఇలా చెప్పాడు: “ఓ దీర్ఘదర్శీ (ప్రవక్తా), నీవు యూదాకు పారిపోయి అక్కడనే తిను. నీ బోధన అక్కడనే చేయి. 13 అంతేగాని, ఇక్కడ బేతేలులో ఎంతమాత్రమూ నీవు ప్రకటనలు చేయవద్దు. ఇది యరొబాము పవిత్ర స్థలం (రాజధాని). ఇది ఇశ్రాయేలు ఆలయం!”

14 అప్పుడు అమజ్యాకు ఆమోసు ఇలా సమాధానాం చెప్పాడు: “నేను వృత్తిరీత్యా ప్రవక్తను గాను. పైగా నేను ప్రవక్త వంశంనుండి వచ్చినవాడినీ కాను. నేను పశువులను కాస్తూ ఉంటాను. మేడి పండ్ల వృక్షాలను రక్షిస్తూ వుంటాను. 15 నేనొక గొర్రెల కాపరిని. అయితే యెహోవా నన్ను గొర్రెలను అనుసరించనీయకుండా పిలిచాడు. ‘నీవు వెళ్లి, నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ప్రకటనలు చేయి’ అని యెహోవా నాతోచెప్పాడు. 16 కావున యెహోవా వర్త మానాన్ని విను. నీవు, ‘ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ప్రకటించవద్దు. ఇస్సాకు వంశానికి వ్యతిరేకంగా బోధనలు చేయవద్దు’ అని నాకు చెపుతున్నావు. 17 కాని యెహోవా చెప్పేదేమంటే: ‘నీ భార్య నగరంలో వేశ్య అవుతుంది. నీ కుమారులు, కుమార్తెలు కత్తులతో చంపబడతారు. అన్యజనులు నీ రాజ్యాన్ని వ పర్చుకొని, తమలో తాము దానిని పంచుకుంటారు. నీవు పరదేశంలో చనిపోతావు. ఇశ్రాయేలు ప్రజలు నిశ్చయంగా ఈ దేశంనుండి బందీలుగా తీసికొనిపోబడతారు.’”

లూకా 2

యేసు జన్మ వృత్తాంతం

(మత్తయి 1:18-25)

ఇది యిలా వుండగా రోమా సామ్రాజ్యమంతటా జనాభా లెక్కలు సేకరించటానికి కైసరు ఔగుస్తు చక్రవర్తి ఒక ప్రకటన జారీ చేశాడు. కురేనియ సిరియ దేశాన్ని పాలిస్తున్న కాలంలో మొదటి సారిగా ఇలాంటి జనాభా లెక్కలు సేకరింపబడ్డాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ జాబితాలో తమ పేర్లు వ్రాయబడటానికి తమ స్వగ్రామాలకు వెళ్ళారు.

యోసేపు దావీదు వంశానికి చెందినవాడు కాబట్టి అతడు గలిలయలోని నజరేతు అనే పట్టణం నుండి యూదయ దేశంలోని దావీదు పట్టణానికి వెళ్ళాడు. దీన్ని బేత్లెహేము అని అనే వాళ్ళు. మరియతో ఇతనికి పెళ్ళి నిశ్చయమై ఉంది. మరియ గర్భంతో ఉంది. అతడు ఆమెను తన వెంట తీసుకొని తమ పేర్లు జాబితాలో వ్రాయించుకోటానికి వెళ్ళాడు. వాళ్ళక్కడ ఉండగా ఆమెకు ప్రసవవేదన వచ్చింది. ఆమె మగ శిశువును ప్రసవించింది. ఈయన ఆమె మొదటి కుమారుడు. వాళ్ళకు సత్రంలో గది దొరకనందువల్ల ఆమె ఆ పసివాణ్ణి పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో ఉంచింది.

గొఱ్ఱెల కాపరులు చూసిన దృశ్యం

ఊరు ప్రక్క పొలాల్లో ఉన్న గొఱ్ఱెల కాపరులు రాత్రివేళ తమ గొఱ్ఱెల్ని కాపలాకాస్తూ ఉన్నారు. ఒక దేవదూత వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ చుట్టూ దివ్యమైన వెలుగు ప్రకాశించింది. వాళ్ళు చాలా భయపడ్డారు. 10 ఆ దేవదూత వాళ్ళతో, “భయపడకండి! మీకే కాక ప్రజలందరికి ఆనందం కలిగించే సువార్త తెచ్చాను. 11 దావీదు పట్టణంలో ఈ రోజు మీకోసం రక్షకుడు జన్మించాడు. ఆయనే మన ప్రభువు. 12 మీకొక గుర్తు చెబుతాను. పశువుల తొట్టిలో, పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఒక పసివాడు మీకు కనిపిస్తాడు” అని అన్నాడు.

13 తక్షణం పరలోకంలోనుండి చాలామంది దేవదూతలు వచ్చి అక్కడున్న దేవదూతతో నిలుచొని దేవుణ్ణి స్తుతిస్తూ ఈ విధంగా అన్నారు:

14 “మహోన్నత లోకంలోవున్న దేవునికి మహా తేజస్సు కలుగుగాక!
    భూమ్మీద ఆయన ప్రేమించే ప్రజలకు శాంతి కలుగుగాక!”

15 దేవదూతలు వాళ్ళను వదిలి పరలోకానికి వెళ్ళి పొయ్యాక గొఱ్ఱెల కాపరులు, “జరిగిన దాన్ని గురించి ప్రభువు మనకు చెప్పాడు. బేత్లెహేము వెళ్ళి ఇది చూసి వద్దాం” అని మాట్లాడుకొన్నారు.

16 వాళ్ళు తక్షణం అక్కడికి వెళ్ళారు. మరియను, యోసేపును, తొట్టిలో పడుకొనివున్న పసివాణ్ణి, చూసారు. 17 ఆ బాలుణ్ణి చూసాక ఆయన్ని గురించి దేవదూత తమతో చెప్పిన విషయం అందరితో చెప్పారు. 18 వాళ్ళు చెప్పింది విని అంతా ఆశ్చర్యపోయారు. 19 కాని, మరియ యివన్నీ మనస్సులో భద్రంగా దాచుకొని వాటిని గురించి ఆలోచించేది. 20 గొఱ్ఱెల కాపరులు తాము విన్నవి, చూసినవి దేవదూత చెప్పినట్లు జరిగినందుకు వాటిని గురించి మాట్లాడుకొంటూ దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన తేజస్సును పొగుడుతూ తిరిగి వెళ్ళిపొయ్యారు.

21 ఎనిమిదవ రోజున సున్నతి చేయించి ఆ బాలునికి యేసు అని నామకరణం చేసారు. మరియ గర్భవతి కాకముందే దేవదూత ఈ పేరు మరియకు చెప్పాడు.

బాలుని దేవాలయానికి తీసుకెళ్ళటం

22 మోషే ధర్మశాస్త్రానుసారం మరియ, యోసేపులు పరిశుభ్రం కావలసిన సమయం వచ్చింది. వాళ్ళు ఆ బాలుణ్ణి ప్రభువుకు అర్పించటానికి యెరూషలేముకు వెళ్ళారు. 23 ప్రభువు యొక్క ధర్మశాస్త్రంలో, “మొదటి మగసంతానాన్ని దేవునికి సమర్పించాలి”[a] అని వ్రాయబడి ఉంది. 24 అంతేకాక, ప్రభువు యొక్క ధర్మశాస్త్రం ఆదేశించిన విధంగా వాళ్ళు వెళ్ళి రెండు పావురాలనైనా లేక రెండు గువ్వలనైనా బలి యివ్వాలనుకొన్నారు.

సుమెయోను యేసును చూడటం

25 ఇక్కడ యెరూషలేములో సుమెయోను అని పిలువబడే ఒక వ్యక్తివున్నాడు. ఇతడు భక్తితో నీతిగా జీవించేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడా అని కాచుకొని ఉండేవాడు. అతడు పవిత్రాత్మ పూర్ణుడు. 26 ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూసే వరకు మరణించడని పవిత్రాత్మ అతనికి బయలుపర్చాడు. 27 పవిత్రాత్మ తన మీదికి రాగా అతడు దేవాలయంలోకి వెళ్ళాడు. అదే సమయానికి ధర్మశాస్త్రం చెప్పిన ఆచారం నెరవేర్చడానికి మరియ, యోసేపు బాలునితో సహా మందిరంలోకి వచ్చారు. 28 సుమెయోను ఆ బాలుణ్ణి తన చేతుల్తో ఎత్తి దేవుణ్ణి ఈ విధంగా స్తుతించడం మొదలు పెట్టాడు:

29 “మహా ప్రభూ! నీ మాట ప్రకారం నీ సేవకుణ్ణి శాంతంగా వెళ్ళనివ్వు.
30 నీవు నియమించిన రక్షకుణ్ణి కళ్ళారా చూసాను.
31     నీవు ఆయన్ని ప్రపంచములోని ప్రజలందరి ముందు ఎన్నుకొన్నావు!
32 యూదులుకాని వాళ్ళకు నీ మార్గాన్ని చూపే వెలుగు ఆయనే.
    నీ ఇశ్రాయేలు ప్రజల కీర్తి చిహ్నం ఆయనే!”

33 యేసు తల్లితండ్రులు అతడు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపడ్డారు. 34 ఆ తర్వాత సుమెయోను వాళ్ళను ఆశీర్వదించి యేసు తల్లియైన మరియతో ఈ విధంగా అన్నాడు: “ఈ బాలుని కారణంగా ఎందరో ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందుతారు! మరెందరో పడిపోతారు! ఈ బాలుడు దేవుని చిహ్నం. ఈ చిహ్నాన్ని చాలా మంది ఎదిరిస్తారు. 35 తద్వారా మనుష్యుల మనస్సుల్లో ఉన్న రహస్యాలు బయట పడ్తాయి. ఒక కత్తి నీ గుండెను దూసుకుపోతుంది.”

అన్నా యేసును చూడటం

36 ఆ మందిరంలో, “అన్న” అనే ఒక ప్రవక్త్రి కూడా ఉండేది. ఈమె పనూయేలు కుమార్తె. ఆషేరు తెగకు చెందింది. ఆమె వయస్సులో చాలా పెద్దది. పెండ్లి అయిన ఏడు సంవత్సరాలకే ఆమె వితంతువు అయింది. 37 అప్పటికి ఆమెకు ఎనభై నాలుగు సంవత్సరాలు. మందిరం విడిచి వెళ్ళేది కాదు. రాత్రింబగళ్ళు ప్రార్థించేది. ఉపవాసాలు చేసేది.

38 మరియ, యోసేపులు అక్కడ ఉండగా ఆమె వాళ్ళ దగ్గరకు వచ్చింది. దేవునికి కృతజ్ఞతలు చెప్పి యెరూషలేములో విముక్తి కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళందరికి ఆ బాలుణ్ణి గురించి చెప్పింది.

యోసేపు, మరియ ఇంటికి తిరిగి రావటం

39 ప్రభువు ధర్మశాస్త్రానుసారం చేయవలసినవన్నీ చేశాక మరియ, యోసేపులు తమ స్వగ్రామమైన గలిలయలోని నజరేతుకు తిరిగి వెళ్ళిపోయారు. 40 యేసు పెరిగి పెద్ద వాడయ్యాడు. బలంతోపాటు తెలివి కూడా ఆయనలో అభివృద్ధి కొనసాగింది. దేవుని అనుగ్రహం ఆయన మీద ఉంది.

పన్నెండు ఏండ్ల తర్వాత

41 ప్రతి సంవత్సరం ఆయన తల్లిదండ్రులు పస్కా పండుగకు యెరూషలేము వెళ్ళేవాళ్ళు. 42 కనుక ఎప్పటిలాగే అలవాటు ప్రకారం యేసుకు పన్నెండు సంవత్సరాలున్నప్పుడు వాళ్ళు పండుగ కోసం యెరూషలేముకు వెళ్ళారు. 43 పండుగ తర్వాత ఆయన తల్లిదండ్రులు తిరిగి తమ ఊరికి వెళ్ళటానికి ప్రమాణమయ్యారు. కాని యేసు యెరూషలేములోనే ఉండిపొయ్యాడు. తల్లిదండ్రులకు ఇది తెలియదు. 44 తమ గుంపులో ఉన్నాడనుకొని వాళ్ళు ఒక రోజంతా ప్రయాణం చేసారు. తమతో లేడని గ్రహించాక వాళ్ళు తమ స్నేహితులతో, బంధువులతో ఉన్నాడనుకొని వాళ్ళలో వెతకసాగారు. 45 ఆయన కనిపించక పోయే సరికి వాళ్ళు ఆయన్ని వెతకటానికి యెరూషలేము తిరిగి వెళ్ళారు.

46 మూడు రోజులు వెతికాక ఆయన వాళ్ళకు మందిరంలో కూర్చొని వాళ్ళు చెప్పినవి వింటూ, వాళ్ళను ప్రశ్నిస్తూ ఉండగా కన్పించాడు. 47 ఆయనలో ఉన్న గ్రహింపు శక్తికి, ఆయన సమాధానాలకు అక్కడవున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. 48 ఆయన తల్లిదండ్రులు కూడా ఆయన్ని చూసి చాలా ఆశ్చర్య పోయారు. యేసు తల్లి ఆయనతో, “ఇలా ఎందుకు చేసావు బాబు? నేను, మీ నాన్న దిగులుపడి అన్ని చోట్లా వెతికాము!” అని అన్నది.

49 యేసు, “నా కోసం ఎందుకు వెతికా రమ్మా! నేను నా తండ్రి పనిలో ఉండాలని మీకు తెలియదా?” అని అన్నాడు. 50 వాళ్ళకు ఆయన అన్న మాటలు అర్థం కాలేదు.

51 ఆ తర్వాత ఆయన వాళ్ళ వెంట నజరేతుకు వెళ్ళాడు. వినయ విధేయతలతో నడుచుకునే వాడు. కాని ఆయన తల్లి జరిగిన ఈ సంఘటనల్ని తన మనస్సులో ఆలోచిస్తూ ఉండేది. 52 యేసు జ్ఞానంలో, బలంలో, అభివృద్ధి చెందుతూ పెరగసాగాడు. దేవుని మెప్పు, ప్రజల మెప్పు సంపాదించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International