Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 దినవృత్తాంతములు 5-6

రూబేనీయుల సంతతివారు

1-3 ఇశ్రాయేలు పెద్ద కుమారుని పేరు రూబేను. రూబేను జ్యేష్ఠ కుమారునికి అర్హమైన ప్రత్యేకాధిక్యతలు అందుకోవలసి ఉంది. కాని రూబేను తన తండ్రి భార్యలలో ఒకదానితో శయనించిన కారణంగా, ఆ ప్రత్యేక ఆధిక్యతలు ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడ్డాయి. కావున వారి వంశావళిలో రూబేను పేరు జన్మలో మొదటివాడుగా పేర్కొనబడలేదు. వారి అన్నదమ్ములలో యూదా మిక్కిలి బలపరాక్రమాలు గలవాడు. అందువల్ల నాయకులంతా అతని కుటుంబంలో నుంచే వచ్చారు. కాని యోసేపు కుటుంబానికి జ్యేష్ఠ పుత్రునికి లభించే ప్రత్యేక ఆదరణ, ఆధిపత్యాలు లభించాయి.

రూబేను కుమారులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ అనేవారు.

యోవేలు సంతతి ఈ విధంగా వుంది: షెమయా అనేవాడు యోవేలు కుమారుడు. షెమయా కుమారుడు గోగు. గోగు కుమారుడు షిమీ. షిమీ కుమారుడు మీకా. మీకా కుమారుడు రెవాయా. రెవాయా కుమారుడు బేలు. బేలు కుమారుడు బెయేర. అష్షూరు (అస్సీరియా) రాజైన తిగ్లత్పిలేసెరు బెయేరను ఇల్లు వెడలగొట్టాడు. దానితో బెయేర అష్షూరు రాజుకు బందీ అయ్యాడు. రూబేను వంశానికి బెయేర పెద్ద.

యోవేలు సోదరుల పేర్లు, అతని వంశావళి వారి వంశ చరిత్రలో పొందుపర్చబడినట్లే క్రమ పద్ధతిలో సరిగ్గా వ్రాయబడినాయి. అవి ఏవనగా: యెహీయేలు మొదటివాడు. తరువాత జెకర్యా మరియు బెల. బెల తండ్రి పేరు ఆజాజు. ఆజాజు తండ్రి షెమ. షెమ తండ్రి పేరు యోవేలు. వారంతా అరోయేరు నుండి నెబో వరకు, బయల్మెయోను వరకు గల ప్రాంతంలో నివసించారు. బెల వంశీయులు తూర్పు దిశన యూఫ్రటీసు నది ఒడ్డున అడవి అంచువరకుగల ప్రాంతంలో నివసించారు. గిలాదులో వారికి లెక్కలేనన్ని ఆవుల మందలు వున్నందున వారక్కడ నివసించసాగారు. 10 సౌలు రాజుగా ఉన్న కాలంలో బెల వంశీయులు హగ్రీయీలతో యుద్ధం చేసి వారిని ఓడించారు. తరువాత వారు హగ్రీయులకు చెందిన గుడారాలను ఆక్రమించి వాటిలో నివసించారు. గిలాదుకు తూర్పు ప్రాంతమంతటిలో ఉన్న హగ్రీయుల గుడారాలలో వారు నివసించసాగారు.

గాదు సంతతివారు

11 గాదు వంశం వారు రూబేనీయులకు సమీపంలోనే నివసించారు. గాదీయులు బాషాను ప్రాంతంలోను, సల్కా వరకు గల ప్రదేశంలోను నివసించారు. 12 బాషానులో యోవేలు మొదటి నాయకుడు (పెద్ద). షాపాము రెండవ నాయకుడు. పిమ్మట యహనైషాపాత్ ముఖ్యుడయ్యాడు. 13 వారి కుటుంబాలలో ఏడుగురు అన్నదమ్ములు. వారు మిఖాయేలు, మెషుల్లాము, షేబ, యోరై, యకాను, జీయ మరియు ఏబెరు. 14 వీరు అబీహాయిలు సంతతివారు. అబీహాయిలు అనేవాడు హూరీ కుమారుడు. హూరీ తండ్రి పేరు యారోయ. యారోయ తండ్రి గిలాదు. గిలాదు తండ్రి మిఖాయేలు. మిఖాయేలు తండ్రి యెషీషై, యెషీషై తండ్రి యహదో. యహదో తండ్రి బూజు. 15 అహీ అనువాడు అబ్దీయేలు కుమారుడు. అబ్దీయేలు తండ్రి పేరు గూనీ. అహీ వారి వంశ పెద్ద.

16 గాదీయులు గిలాదు ప్రాంతంలో నివసించారు. వారు బాషానులోను, దాని చుట్టుపట్ల గ్రామాలలోను, షారోను సరిహద్దు వరకు గల పొలాలలోను కూడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.

17 యోతాము, యరోబాముల కాలంలో ఈ ప్రజల పేర్లన్నీ గాదు వంశ చరిత్రలో వ్రాయబడినాయి. యోతాము యూదాకు రాజు. యరోబాము ఇశ్రాయేలుకు రాజు.

యుద్ధ నైపుణ్యంగల కొందరు సైనికులు

18 మనష్షే వంశంలో సగం మందిలోను, రూబేను, గాదు వంశాలలోను మొత్తం నలుబది నాలుగువేల ఏడు వందల అరవై మంది యుద్ధ వీరులున్నారు. వారు డాళ్లను, కత్తులను చేపట్టగలవారు. వారు బాణవిద్యలో నేర్పరులు. చాకచక్యంతో యుద్ధం చేయగలవారు. 19 వారు హగ్రీయులతోను, యేతూరు, నాపీషు, నోదాబు వారితోను యుద్ధం చేశారు. 20 మనష్షే వంశం వారు, రూబేను, గాదు వంశాల ప్రజలు యుద్ధంలో దేవుని సహాయం అర్థించి ప్రార్థన చేశారు. వారు దేవునియందు విశ్వాసమున్న వారు గనుక తమకు సహాయపడమని దేవుని అర్థించారు. కావున దేవుడు వారి ప్రార్థన ఆలకించి సహాయపడ్డాడు. హగ్రీయులను యుద్ధంలో ఓడించటానికి దేవుడు వారికి సహాయం చేసాడు. హగ్రీయులతో వున్న ఇతరులను కూడ వారు ఓడించారు. 21 హగ్రీయులకు చెందిన పశు సంపదనంతా వారు వశపర్చుకున్నారు. వారు ఏబై వేల ఒంటెలను, రెండు లక్షల ఏబైవేల గొర్రెలను, రెండువేల గాడిదలను, మరియు ఒక లక్ష మంది మనుష్యులను పట్టుకున్నారు. 22 యుద్ధంలో రూబేనీయులకు దేవుని సహాయం ఉన్న కారణంగా హగ్రీయులలో చాలామంది చనిపోయారు. అప్పుడు మనష్షే, రూబేను, గాదు వంశీయులు హగ్రీయుల రాజ్యంలో నివసించసాగారు. వారక్కడ బబులోను (బాబిలోనియా) సైన్యం ఇశ్రాయేలు ప్రజలను బందీలుగా బబులోనుకు పట్టుకుపోయే సమయం వరకు నివసించారు.

23 మనష్షే వంశం వారిలో సగంమంది బాషాను ప్రాంతంలో బెల్‌హెర్మోను వరకు, శెనీరు, హెర్మోను పర్వతం వరకు నివసించారు. వారి ప్రజలు అధిక సంఖ్యలో విస్తరించారు.

24 మనష్షే కుటుంబంలో ఒక సగంమంది కుటుంబ పెద్దలు ఎవరనగా ఏషెరు, ఇషీ, ఎలీయేలు, అజ్రీయేలు, యిర్మీయా, హోదవ్యా మరియు యహదీయేలు. వీరంతా బలపరాక్రమ సంపన్నులు, ప్రసిద్ధి గాంచిన వ్యక్తులు. వారి వారి కుటుంబాలకు వారు పెద్దలు. 25 కాని, వారి పూర్వీకులు ఆరాధించిన దేవుని పట్ల వారు పాపం చేశారు. వారు స్థిరపడినచోట వున్న విగ్రహాలనే వారు ఆరాధించటం మొదలు పెట్టారు. అటువంటి వాళ్లను దేవుడు నాశనము చేశాడు.

26 ఇశ్రాయేలు దేవుడు పూలును యుద్ధానికి పురిగొల్పాడు. పూలు అష్షూరు (అస్సీరియా) రాజు. అతనినే తిగ్లత్పిలేసెరు అని కూడ పిలుస్తారు. అతడు మనష్షే, రూబేను, గాదు వంశీయులతో యుద్ధం చేసాడు. వారిని తమ ఇండ్లు వదిలి వేసేలా బలవంతం చేసి బందీలుగా పట్టుకున్నాడు. తరువాత వారిని హాలహు, హాబోరు, హారా పట్టణాలకు, గోజాను నదీ తీరానికి తీసుకొని వెళ్లాడు. అప్పటినుండి ఈనాటికీ ఆ ఇశ్రాయేలీయుల కుటుంబాల వారు అక్కడ నివసిస్తున్నారు.

లేవీ సంతతివారు

గెర్షోను, కహాతు, మెరారి అనేవారు లేవీ కుమారులు.

కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.

అమ్రాముకు అహరోను, మోషే అనే ఇరువురు కుమారులు, మిర్యాము అనే కుమార్తె ఉన్నారు.

అహరోనుకు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అనేవారు కుమారులు. ఎలియాజరు అనువాడు ఫీనెహాసుకు తండ్రి. ఫీనెహాసు కుమారుడు అబీషువ. అబీషువ కుమారుడు బుక్కీ. బుక్కీ కుమారుడు ఉజ్జీ. ఉజ్జీ కుమారుడు జెరహ్యా. జెరహ్యా కుమారుడు మెరాయోతు. మెరాయోతు కుమారుడు అమర్యా. అమర్యా కుమారుడు అహీటూబు. అహీటూబు కుమారుడు సాదోకు. సాదోకు కుమారుడు అహిమయస్సు. అహిమయస్సు కుమారుడు అజర్యా. అజర్యా కుమారుడు యోహానాను. 10 యోహానాను కుమారుడు అజర్యా. (యెరూషలేములో సొలొమోను కట్టించిన దేవాలయంలో యాజకునిగా పనిచేసిన వ్యక్తే ఈ అజర్యా). 11 అజర్యా కుమారుడు అమర్యా. అమర్యా కుమారుడు అహీటూబు. 12 అహీటూబు కుమారుడు సాదోకు. సాదోకు కుమారుడు షల్లూము. 13 షల్లూము కుమారుడు హిల్కీయా. హిల్కీయా కుమారుడు అజర్యా. 14 అజర్యా కుమారుడు శెరాయా. శెరాయా కుమారుడు యెహోజాదాకు.

15 యెహోవా యూదా వారిని, యెరూషలేము వారిని బయటకు పంపివేసినప్పుడు యెహోజాదాకు కూడ గత్యంతరం లేక వారితో ఇల్లు వదలి పోవలసి వచ్చింది. ఆ ప్రజలు ఒక కొత్త రాజ్యంలో బందీలయ్యారు. యూదా వారిని, యెరూషలేము వారిని బందీలు చేయటానికి యెహోవా నెబకద్నెజరును వినియోగించాడు.

లేవీ సంతతిలో ఇతరులు

16 లేవీ కుమారులు గెర్షోను, కహాతు, మెరారి అనేవారు.

17 గెర్షోను కుమారులు లిబ్నీ మరియు షిమీ.

18 కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, మెబ్రోను మరియు ఉజ్జీయేలు.

19 మెరారి కుమారులు మహలి, మూషి.

లేవి వంశంలోగల కుటుంబాలు ఈ విధంగా ఉన్నాయి. మొదట వారి తండ్రి పేరుతో జాబితా వ్రాయబడింది.

20 గెర్షోను సంతతివారు గెర్షోను కుమారుడు లిబ్నీ. లిబ్నీ కుమారుడు యహతు. యహతు కుమారుడు జిమ్మా. 21 జిమ్మా కుమారుడు యోవాహు. యోవాహు కుమారుడు ఇద్దో. ఇద్దో కుమారుడు జెరహు. జెరహు కుమారుడు యెయతిరయి.

22 కహతు సంతతి వారు ఎవరనగా కహతు కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు కోరహు. కోరహు కుమారుడు అస్సీరు. 23 అస్సీరు కుమారుడు ఎల్కానా. ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు. ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు. 24 అస్సీరు కుమారుడు తాహతు. తాహతు కుమారుడు ఊరియేలు. ఊరియేలు కుమారుడు ఉజ్జియా. ఉజ్జియా కుమారుడు షావూలు.

25 ఎల్కానా కుమారులు అమాశై, అహీమోతు. 26 ఎల్కానా మరో కుమారుడు జోఫై.[a] జోఫై కుమారుడు నహతు. 27 నహతు కుమారుడు ఏలీయాబు. ఏలీయాబు కుమారుడు యెరోహాము. యెరోహాము కుమారుడు ఎల్కానా. ఎల్కానా కుమారుడు సమూయేలు. 28 సమూయేలు కుమారులలో పెద్దవాడు యోవేలు. రెండవవాడు అబీయా.

29 మెరారి సంతానం వివరాలు ఏవనగా: మెరారి కుమారుడు మహలి. మహలి కుమారుడు లిబ్ని. లిబ్ని కుమారుడు షిమీ. షిమీ కుమారుడు ఉజ్జా. 30 ఉజ్జా కుమారుడు షిమ్యా. షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అశాయా.

ఆలయ సంగీత విద్వాంసులు

31 యెహోవా ఒడంబడిక పెట్టె ఆలయంలో ఉంచిన తరువాత దావీదు కొందరు సంగీత విద్వాంసులను నియమించాడు. 32 వీరు పవిత్ర గుడారంలో దేవునికి స్తుతి గీతాలు ఆలపించేవారు. పవిత్ర గుడారమే సమావేశ గుడారమని పిలవబడేది. సొలొమోను యెరూషలేములో యెహోవాకు ఆలయాన్ని నిర్మించేవరకు ఈ గాయకులు సంగీత సేవ చేసారు. వారికి నిర్దేశించిన నియమావళిని వారు అనుసరించి పని చేసారు.

33 సంగీత సేవ చేసిన వారు, వారి కుమారుల పేర్ల వివరాలు ఇలా వున్నాయి:

కహతీయుల సంతతి వారు: హేమాను గాయకుడు. హేమాను తండ్రి పేరు యోవేలు. యోవేలు తండ్రి పేరు సమూయేలు. 34 సమూయేలు తండ్రి ఎల్కానా. ఎల్కానా తండ్రి యెరోహాము. యెరోహాము తండ్రి ఏలీయేలు. ఏలీయేలు తండ్రి తోయహు. 35 తోయహు తండ్రి సూపు. సూపు తండ్రి ఎల్కానా. ఎల్కానా తండ్రి మహతు. మహతు తండ్రి అమాశై. 36 అమాశై తండ్రి ఎల్కానా. ఎల్కానా తండ్రి యోవేలు. యోవేలు తండ్రి అజర్యా. అజర్యా తండ్రి జెఫన్యా. 37 జెఫన్యా తండ్రి తాహతు. తాహతు తండ్రి అస్సీరు. అస్సీరు తండ్రి ఎబ్యాసాపు. ఎబ్యాసాపు తండ్రి కోరహు. 38 కోరహు తండ్రి ఇస్హారు. ఇస్హారు తండ్రి కహాతు. కహాతు తండ్రి లేవి. లేవి తండ్రి ఇశ్రాయేలు.

39 హేమాను బంధువు ఆసాపు. హేమాను ఆసాపు కుడి ప్రక్కన నిలబడేవాడు. ఆసాపు తండ్రి పేరు బెరక్యా. బెరక్యా తండ్రి షిమ్యా. 40 షిమ్యా తండ్రి మిఖాయేలు. మిఖాయేలు తండ్రి బయశేయా. బయశేయా తండ్రి మల్కీయా. 41 మల్కీయా తండ్రి యెత్నీ. యెత్నీ తండ్రి జెరహు. జెరహు తండ్రి అదాయా. 42 అదాయా తండ్రి ఏతాను. ఏతాను తండ్రి జిమ్మా. జిమ్మా తండ్రి షిమీ. 43 షిమీ తండ్రి యహతు. యహతు తండ్రి గెర్షోను. గెర్షోను తండ్రి లేవి.

44 మెరారి సంతతి వారు హేమానుకు, ఆసాపుకు బంధువులు. వారు హేమానుకు ఎడమ పక్కన నిలబడి స్తోత్రగీతాలు పాడేవారు. ఏతాను తండ్రి పేరు కీషీ. కీషీ తండ్రి అబ్దీ. అబ్దీ తండ్రి మల్లూకు. 45 మల్లూకు తండ్రి హషబ్యా. హషబ్యా తండ్రి అమజ్యా. అమజ్యా తండ్రి హిల్కీయా. 46 హిల్కీయా తండ్రి అమ్జీ. అమ్జీ తండ్రి బానీ. బానీ తండ్రి షమెరు. 47 షమెరు తండ్రి మహలి. మహలి తండ్రి మూషి. మూషి తండ్రి మెరారి. మెరారి తండ్రి లేవి.

48 హేమాను, ఆసాపుల సోదరులు లేవి వంశంలోని వారే. లేవి సంతతినంతా లేవీయులని పిలుస్తారు. లేవీయులు యెహోవా పవిత్ర గుడారంలో సేవా కార్యక్రమ నిర్వహణకు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన వారు. పవిత్ర గుడారమనగా దేవుని ఇల్లు. 49 కాని అహరోను, అతని సంతతి వారు మాత్రమే బలిపీఠంపై దహనబలులు అర్పించేందుకు అనుమతించబడ్డారు. వారికి ధూపపీఠం మీద ధూపంవేసే హక్కు కూడ వుంది. ఆలయపు అతిపరిశుద్ధ స్థలంలోని పనంతా వారే చేసేవారు. ఇశ్రాయేలు పాపపరిహారార్థం, ప్రజల పాపాలకు విచార సూచకంగా వారు ఆలయంలో ప్రాయశ్చిత్త కార్యాలు నిర్వహించేవారు. మోషే నిర్దేశించిన నియమాలను, నిబంధనలను వారు తప్పక పాటించేవారు. మోషే దేవుని సేవకుడు.

అహరోను సంతతివారు

50 అహరోను కుమారులు ఎవరనగా: అహరోను కుమారుడు ఎలియాజరు. ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు. ఫీనెహాసు కుమారుడు అబీషూవ. 51 అబీషూవ కుమారుడు బుక్కీ. బుక్కీ కుమారుడు ఉజ్జీ. ఉజ్జీ కుమారుడు జెరహ్య. 52 జెరహ్య కుమారుడు మెరాయోతు. మెరాయోతు కుమారుడు అమర్యా. అమర్యా కుమారుడు అహీటూబు. 53 అహీటూబు కుమారుడు సాదోకు. సాదోకు కుమారుడు అహిమయస్సు.

లేవీయుల కుటుంబాలకు నివాసాలు

54 అహరోను సంతతి వారు నివసించిన ప్రదేశాలు: వారికివ్వబడిన భూములలో స్థావరాలు ఏర్పరచుకొని వారు నివసించారు. లేవీయులకియ్యబడిన భూముల్లో కహాతీయులకు మొదటి భాగం ఇవ్వబడింది. 55 వారికి హెబ్రోను పట్టణం, దాని చుట్టు ప్రక్కల భూములు ఇవ్వబడ్డాయి. ఇది యూదా దేశంలో వుంది. 56 కాని పట్టణానికి దూరంగావున్న భూములు, హెబ్రోను పట్టణానికి దగ్గరలో వున్న గ్రామాలు కాలేబుకు ఇవ్వబడ్డాయి. కాలేబు తండ్రి పేరు యెపున్నె. 57 అహరోను సంతతివారికి హెబ్రోను నగరం ఇవ్వబడింది. హెబ్రోను ఆశ్రయపురం[b] వారికింకా లిబ్నా, యత్తీరు, ఎష్టెమో, 58 హీలేను, దెబీరు, 59 ఆషాను, యుట్ట, బేత్షెమెషు నగరాలు కూడ ఇవ్వబడ్డాయి. ఈ నగరాలతో పాటు వాటి సమీపంలోని పచ్చిక బయళ్ళు కూడ వారికియ్యబడ్డాయి. 60 బెన్యామీను సంతతి వారికి గిబియోను, గెబ, అల్లెమెతు, అనాతోతు నగరాలు ఇవ్వబడ్డాయి. ఈ నగరాలతో పాటు ఆ ప్రాంతాలలోని పొలాలు కూడ వారికి ఇవ్వబడ్డాయి.

పదమూడు నగరాలు కహాతీయుల కుటుంబాల వారికియ్యబడ్డాయి.

61 కహాతు సంతతి వారైన వంశాల వారికి మనష్షే వంశం వారి సగంమందికి పది పట్టణాలు ఇవ్వబడ్డాయి.

62 గెర్షోను సంతతి వారైన వంశాల వారికి పదమూడు నగరాలు ఇవ్వబడ్డాయి. వారికి ఈ నగరాలు ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషాను ప్రాంతాలలో నివసించే కొందరికి మనష్షే వారినుండి సంక్రమించాయి.

63 మెరారీ సంతతి వారైన వంశాల వారికి పన్నెండు నగరాలు వచ్చాయి. వారికి ఈ నగరాలు రూబేను, గాదు, జెబూలూను కుటుంబాల వారినుండి వచ్చాయి. వారికి ఆ నగరాలు చీట్లువేసి ఇచ్చారు.

64 ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఆ నగరాలను, పొలాలను లేవీయులకు ఇచ్చారు. 65 పైన పేర్కొనబడిన ఆ నగరాలన్నీ చీట్లువేసి యూదా, షిమ్యోను, బెన్యామీను కుటుంబాల వారినుండి తీసుకొనబడి వారికియ్యబడ్డాయి.

66 ఎఫ్రాయిము వంశం వారు కూడ కొందరు కహాతీయుల కుటుంబాల వారికి కొన్ని పట్టణాలను ఇచ్చారు. ఈ పట్టణాలను కూడ చీట్లువేసి ఇచ్చారు. 67 వారికి షెకెము నగరం ఇవ్వబడింది. షెకెము కూడ ఒక రక్షణ (ఆశ్రయ) నగరం. వారికి ఇంకను గెజెరు, 68 యొక్మెయాము, బేత్‌హోరోను, 69 అయ్యాలోను, మరియు గత్రిమ్మోను పట్టణాలు కూడ ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాలతో పాటు వారికి పొలాలు కూడ ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాలు ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో వున్నాయి. 70 సగం మనష్షే గోత్రం వారి నుండి ఆనేరు, బిలియాము పట్టణాలను ఇశ్రాయేలు వారు తీసుకొని కహాతీయులకు ఇచ్చారు. పట్టణాలతో పాటు కహాతీయులకు పొలాలు కూడ ఇవ్వబడ్డాయి.

ఇతర లేవీ కుటుంబాలవారు నివాసాలు పొందటం

71 గెర్షోను ప్రజలకు బాషాను ప్రాంతంలోని గోలాను పట్టణం, మనష్షే సగం వంశం వారి నుండి అష్తారోతు పట్టణం ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాలకు దగ్గరలో వున్న పొలాలు కూడ వారికి ఇవ్వబడ్డాయి.

72-73 గెర్షోను కుటుంబాల వారికి ఇశ్శాఖారు వంశం నుంచి కెదెషు, దాబెరతు, రామోతు మరియు ఆనేము అను పట్టణాలు లభించాయి. ఆ పట్టణాల సమీపంలో గల భూములు కూడ వారికివ్వబడ్డాయి.

74-75 గెర్షోను ప్రజలకు ఆషేరు వంశం నుండి మాషాలు, అబ్దోను, హుక్కోకు మరియు రెహాబు పట్టణాలు లభించాయి. ఆ పట్టణాల పరిసరాలలోగల భూములు కూడ వారికివ్వబడ్డాయి.

76 గెర్షోను వారు నఫ్తాలి వంశం నుండి గలిలయలోని కెదెషు, హమ్మోను మరియు కిర్యతాయిము పట్టణాలను పొందారు. ఆ పట్టణాలతో పాటు సమీప పొలాలు కూడ వారికి ఇవ్వబడ్డాయి.

77 మిగిలిన లేవీయులైన మెరారీయులకు జెబూలూను వంశం నుండి యొక్నెయాము, కర్తా, రిమ్మోను మరియు తాబోరు పట్టణాలు లభించాయి. ఆ పట్టణాల దగ్గరలో గల భూములు కూడ వారికి ఇవ్వబడ్డాయి.

78-79 మెరారీయులు రూబేను వంశం నుండి అరణ్య ప్రాంతంలోని బేసెరు, యహజా, కెదేమోతు మరియు మేఫాతు పట్టణాలను పొందారు. రూబేను వంశస్థులు యొర్దాను నదికి తూర్పున, యెరికో నగరానికి తూర్పున నివసించారు. మెరారీయులకు పట్టణాలతో పాటు పరిసర భూములు కూడ ఇవ్వబడ్డాయి.

80-81 మెరారీయులు ఇంకను గాదు వంశం నుండి గిలాదు నందలి రామోతు, మహనయీము, హెష్బోను మరియు యాజెరు పట్టణాలను పొందారు. వారికి పట్టణాలతో పాటు సమీప పొలాలు కూడ ఇవ్వబడ్డాయి.

హెబ్రీయులకు 10

యేసు క్రీస్తు—మనకవసరమైన ఏకైక బలి

10 ధర్మశాస్రం రాబోవు మంచి విషయాల నీడలాంటిది. అది అస్పష్టమైనది. అంటే, ఆ మంచి విషయాలు అప్పటికింకా రాలేదన్నమాట. ధర్మశాస్రం ఆదేశించిన విధంగా ప్రజలు దేవుని దగ్గరకు ప్రతి సంవత్సరం వచ్చి తప్పకుండా ఒకే రకమైన బలులు అర్పించేవాళ్ళు. కాని ధర్మశాస్త్రం వాళ్ళలో పరిపూర్ణత కలిగించలేదు. అలా చేసినట్లైతే, వాళ్ళు ఆ బలులు యివ్వటం మాని ఉండేవాళ్ళు. పాపాలు శాశ్వతంగా పరిహారమై వాళ్ళు పశ్చాత్తాపం చెందవలసిన అవసరం ఉండేది కాదు. కాని దానికి మారుగా ఆ బలులు వాళ్ళు చేసిన పాపాల్ని ప్రతి సంవత్సరం వాళ్ళకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. ఎద్దుల రక్తంతో, మేకల రక్తంతో పాపపరిహారం కలగటమనేది అసంభవం.

ఆ కారణంగానే, క్రీస్తు ఈ ప్రపంచంలోకి వచ్చాక దేవునితో ఈ విధంగా అన్నాడు:

“బలుల్ని, అర్పణల్ని నీవు కోరలేదు
    కాని, నేనుండటానికి ఈ శరీరాన్ని సృష్టించావు.
జంతువుల్ని కాల్చి అర్పించిన ఆహుతులు కాని,
    పాపపరిహారం కోసం యిచ్చిన బలులు కాని,
    నీకు అనందం కలిగించలేదు.
అప్పుడు నేను, ‘ఇదిగో దేవా! ఇక్కడ ఉన్నాను!
    నన్ను గురించి గ్రంథాల్లో వ్రాశారు.
    నేను నీ యిచ్ఛ నెరవేర్చటానికి వచ్చాను’ అని అన్నాను.”(A)

“బలుల్ని, అర్పణల్ని, జంతువుల్నికాల్చి యిచ్చిన ఆహుతుల్ని, పాప పరిహారం కోసం యిచ్చిన ఆహుతుల్ని నీవు కోరలేదు. అవి నీకు ఆనందం కలిగించలేదు” అని మొదట అన్నాడు. కాని, ధర్మశాస్త్రం ఈ ఆహుతుల్ని యివ్వమని ఆదేశించింది. ఆ తర్వాత క్రీస్తు, “ఇదిగో దేవా! ఇక్కడ ఉన్నాను. నీ యిచ్ఛ నెరవేర్చటానికి వచ్చాను” అని అన్నాడు. ఆయన రెండవదాన్ని నెరవేర్చటానికి మొదటిదాన్ని రద్దుచేశాడు. 10 దైవేచ్ఛ నెరవేర్చటానికి క్రీస్తు తన శరీరాన్ని బలిగా అర్పించి మనల్ని శాశ్వతంగా పవిత్రం చేశాడు. ఆయన యిచ్చిన మొదటి బలి, చివరి బలి యిదే.

11 ప్రతి యాజకుడు మత సంబంధమైన కర్తవ్యాన్ని ప్రతిరోజు నెరవేరుస్తూ ఉంటాడు. ఇచ్చిన బలుల్నే మళ్ళీ మళ్ళీ యిస్తూ ఉంటాడు. ఈ బలులు పాపపరిహారం చెయ్యలేవు. 12 కాని క్రీస్తు మన పాపపరిహారార్థం ఒకే ఒక బలి యిచ్చి దేవుని కుడిచేతి వైపు శాశ్వతంగా కూర్చుండిపొయ్యాడు. 13 అప్పటినుండి, ఆయన శత్రువుల్ని దేవుడు ఆయన పాదపీఠంగా చెయ్యాలని కాచుకొని ఉన్నాడు. 14 ఆయన ఒకే ఒక అర్పణ చేసి పరిశుద్ధులలో శాశ్వతమైన పరిపూర్ణత కలిగించాడు.

15 ఈ విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ మనకు యిలా ప్రకటిస్తున్నాడు:

16 “ఆ తర్వాత నేను వాళ్ళతో ఈ ఒడంబడిక చేస్తాను.
నా నియమాల్ని వాళ్ళ హృదయాల్లో ఉంచుతాను.
    వాటిని వాళ్ళ మనస్సులపై వ్రాస్తాను.”(B)

17 పరిశుద్ధాత్మ ఇంకా యిలా అన్నాడు:

“వాళ్ళ పాపాల్ని,
    దుర్మార్గాల్ని నేను మరిచిపోతాను!”(C)

18 వాళ్ళ పాపాల్ని దేవుడు క్షమించాడు కాబట్టి, పాపం కోసం బలుల్ని అర్పించవలసిన అవసరం తీరిపోయింది.

విశ్వాసాన్ని వదులుకోకండి

19 సోదరులారా! యేసు తన రక్తాన్ని అర్పించాడు. తద్వారా అతి పవిత్ర స్థానానికి వెళ్ళగలమనే విశ్వాసం మనలో కలిగింది. 20 ఆయన శరీరం ఒక తెరగా ఉంది. దాన్ని తొలగించి మనకోసం సజీవమైన నూతన మార్గాన్ని వేశాడు. 21 అంతేకాక, ఆ ప్రధాన యాజకుడు మన దేవాలయంపై అధికారిగా పనిచేస్తున్నాడు. 22 తప్పు చేసి బాధపడ్తున్న మన హృదయాలపై రక్తం ప్రోక్షింపబడింది. స్వచ్ఛమైన నీళ్ళతో మన దేహాలు పరిశుభ్రం చేయబడ్డాయి. ఇప్పుడిక మంచి హృదయాలతో, సంపూర్ణ విశ్వాసంతో దైవ సన్నిధిని చేరుకొందాం. 23 మనకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అందువల్ల మనం బహిరంగంగా ప్రకటిస్తున్న విశ్వాసాన్ని విడవకుండా ధైర్యంతో ఉందాం.

ఒకరికొకరు సహాయం చేసుకొంటూ బలవంతులై యుండండి

24 ప్రేమిస్తూ మంచిపనులు చేస్తూ ఉండమని పరస్పరం ప్రోత్సాహపరుచుకొందాం. 25 సమావేశాలకు రాకుండా ఉండటం కొందరికి అలవాటు. కాని, మనం పరస్పరం కలుసుకొంటూ ఉందాం. ముఖ్యంగా ప్రభువు రానున్నదినం[a] సమీపిస్తోంది గనుక పరస్పరం ప్రోత్సాహపరచుకొంటూ ఉందాం.

దైవకుమారున్నుండి వెళ్ళిపోకండి

26 సత్యాన్ని గురించి జ్ఞానం సంపాదించిన తర్వాత కూడా, మనం కావాలని పాపాలు చేస్తూ ఉంటే, యిక అర్పించటానికి మన దగ్గర బలి ఎక్కడుంది? 27 తీర్పు జరుగుతుందనే భయము, దేవుని శత్రువుల్ని కాల్చివేసే మంటలు రానున్నాయనే భయము మాత్రమే మిగిలిపోతాయి. 28 మోషే నియమాల్ని ఉల్లంఘించినవానిపై యిద్దరు లేక ముగ్గురు చెప్పిన సాక్ష్యాలతో దయ చూపకుండా మరణ శిక్ష విధించేవాళ్ళు. 29 మరి దేవుని కుమారుణ్ణి కాళ్ళ క్రింద త్రొక్కినవాణ్ణి, తనను పవిత్రం చేసిన ఒడంబడిక రక్తాన్ని అపవిత్రంగా పరిగణించేవాణ్ణి, అనుగ్రహించే ఆత్మను అవమాన పరిచేవాణ్ణి, యింకెంత కఠినంగా శిక్షించాలో మీరే ఊహించండి. 30 “పగ తీర్చుకోవలసిన పని నాది, తిరిగి చెల్లించేవాణ్ణి నేను” అని అన్నవాడు, “ప్రభువు తన ప్రజలపై తీర్పు చెపుతాడు”(D) అని అన్నవాడు ఎవరో మనకు తెలుసు. 31 సజీవంగా ఉన్న దేవుని చేతుల్లో పాపాత్ములు చిక్కుకోవటమనేది భయానకమైన విషయము.

మీకు కలిగిన ధైర్యసహనాల్ని కాపాడుకోండి

32 మీరు వెలిగింపబడిన రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ రోజుల్లో మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు. అయినా మీరు వాటిని సహించారు. 33 కొన్నిసార్లు మీరు అవమానాన్ని, హింసను బహిరంగంగా అనుభవించారు. మరికొన్నిసార్లు అవమానాన్ని, హింసను అనుభవించేవాళ్ళ ప్రక్కన నిలుచున్నారు. 34 అంతేకాక, చెరసాలల్లో ఉన్నవాళ్ళ పట్ల మీరు సానుభూతి చూపించారు. పైగా “మీ ఆస్తుల్ని” దోచుకొంటుంటే ఆనందంగా అంగీకరించారు. ఎందుకంటే, మీరు పొందిన ఆస్తి మీరు పోగొట్టుకొన్న ఆస్తికన్నా ఉత్తమమైనదని మీకు తెలుసు. అది శాశ్వతమైనదని కూడా మీకు తెలుసు.

35 అందువల్ల మీ విశ్వాసాన్ని వదులుకోకండి. దానికి మంచి ప్రతిఫలం లభిస్తుంది. 36 మీరు పట్టుదలతో ఉండాలి. దైవేచ్ఛ ప్రకారం నడుచుకోవాలి. ఆ తర్వాత దేవుడు, తాను వాగ్దానం చేసినదాన్ని ప్రసాదిస్తాడు. 37 ఎందుకంటే,

“త్వరలోనే వస్తున్నాడు, వస్తాడు,
    ఆలస్యం చెయ్యడు!
38 నీతిమంతులైన నా ప్రజలు
    నన్ను విశ్వసిస్తూ జీవిస్తారు.
కాని వాళ్ళలో ఎవరైనా వెనుకంజ వేస్తే
    నా ఆత్మకు ఆనందం కలుగదు.”(E)

39 కాని, మనం వెనుకంజ వేసి నశించిపోయేవాళ్ళలాంటి వారం కాదు. గాని విశ్వాసం ద్వారా రక్షంచబడేవాళ్ళ లాంటివారం.

ఆమోసు 4

విలాసవంతులైన స్త్రీలు

సమరయ (షోమ్రోను) కొండమీదగల బాషాను ఆవుల్లారా[a] నేను చెప్పేది వినండి. మీరు పేద ప్రజలను గాయపరుస్తారు. ఆ పేద ప్రజానీకాన్ని మీరు అణగదొక్కుతారు. “మేము తాగటానికి ఏదైనా తీసికొని రండి!” అని మీరు మీ భర్తలకు చెపుతారు.

నా ప్రభువైన యెహోవా ఒక వాగ్దానం చేసాడు. మీకు కష్టాలు వస్తాయని ఆయన తన పవిత్రత సాక్షిగా చెప్పాడు. శత్రు ప్రజలు మీకు కొంకెలు తగిలించి లాగుతారు. మీ పిల్లను లాక్కుపోవటానికి చేపలు పట్టే గాలాలను ఉపయోగిస్తారు. మీ నగరం నాశనం చేయబడుతుంది. మీ స్త్రీలలో ప్రతి ఒక్కరూ గోడ కంతలగుండా నగరంనుండి బయటకు పోతారు. చనిపోయిన మీ పిల్లలను గుట్టమీదికి విసరివేస్తారు.

యెహోవా ఇది చెపుతున్నాడు: “బేతేలుకు వెళ్లి పాపం చేయండి! గిల్గాలుకు వెళ్లి మరింత పాపం చేయండి. మీ బలులను ఉదయ వేళల్లో ఇవ్వండి. మీ పంటలో పదవవంతు మూడు రోజులకొకసారి తీసికొని రండి. పులియబెట్టిన పదార్థాన్ని స్తోత్రార్పణగా ఇవ్వండి. స్వేచ్ఛార్పణల విషయం అందరికీ చెప్పండి. ఇశ్రాయేలూ, నీవు ఈ పనులు చేయటానికి ఇష్టపడతావు. కావున నీవు వెళ్ళి వాటిని చేయి. యెహోవా చెప్పేది ఇదే.

“నిన్ను నా వద్దకు వచ్చేలా చేయటానికి నేను చాలా పనులు చేశాను. నేను, మీరు తినటానికి ఏమీ ఆహారం ఇవ్వలేదు. మీ నగరాలలో దేనిలోనూ ఆహారం ఇవ్వలేదు. అయినా నీవు నా వద్దకు తిరిగి రాలేదు. యెహోవా చెప్పేది ఇదే.

“నేను వర్షాన్ని కూడా నిలుపు చేశాను. పైగా అది పంట కోతకు మూడు నెలల ముందు సమయం. అందువల్ల పంటలు పండలేదు. పిమ్మట ఒక నగరంలో వర్షం కురిపించి, మరో నగరంలో వర్షం లేకుండా చేశాను. దేశంలో ఒక భాగంలో వర్షం పడింది. కాని దేశంలో మరొక ప్రాంతం వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయింది. కావున రెండు మూడు నగరాల ప్రజలు తడబడుతూ నీళ్లకోసం మరొక నగరానికి వెళ్లారు. కాని అక్కడ ప్రతి ఒక్కరికీ సరిపోయేటంత నీరు లేదు. అయినా మీరు సహాయం కొరకు నా వద్దకు రాలేదు. యెహోవా చెప్పేది ఇదే.

“ఎండ వేడిమివల్ల, తెగుళ్లవల్ల మీ పంటలు పాడైపోయేలా చేశాను. మీ ఉద్యానవనాలను, ద్రాక్షా తోటలను నేను నాశనం చేశాను. మీ అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను మిడుతలు తినివేశాయి. కాని మీరు మాత్రం సహాయం కొరకు నా వద్దకు రాలేదు. యెహోవా చెప్పేది ఇదే.

10 “ఈజిప్టు విషయంలో చేసినట్లు నేను మీ మీదికి రోగాలను పంపించాను. మీ యువకులను నేను కత్తులతో సంహరించాను. మీ గుర్రాలను నేను తీసుకున్నాను. మీ స్థావరం కుళ్లిన శవాలతో దుర్గంధ పూరితమయ్యేలా చేశాను. కాని, మీరు సహాయం కొరకు నావద్దకు తిరిగి రాలేదు.” యెహోవా ఆ విషయాలు చెప్పాడు.

11 “సొదొమ, గొమొర్రా నగరాలను నేను నాశనం చేసినట్లు నేను నిన్ను నాశనం చేశాను. ఆ నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పొయ్యిలో నుండి లాగబడి కాలిన కట్టెలా మీరున్నారు. కాని, మీరు సహాయంకొరకు నా వద్దకు రాలేదు” అని యెహోవా చెపుతున్నాడు.

12 “కావున ఇశ్రాయేలూ, మీకు నేనీ విషయాలు కలుగజేస్తాను. ఇది మీకు నేను చేస్తాను. ఇశ్రాయేలూ, మీ దేవుని కలుసుకోటానికి సిద్ధమవ్వు.”

13 నేనెవరిని? పర్వతాలను ఏర్పాటు చేసింది నేనే.
    మీ మనస్సులను[b] సృష్టించింది నేనే.
    ఎలా మాట్లాడాలో ప్రజలకు నేర్పింది నేనే.
సంధ్యవేళను చీకటిగా మార్చేదీ నేనే. భూమిపైగల పర్వతాలపై నేను నడుస్తాను.
    ఇట్టి నేను ఎవరిని?
    సర్వశక్తిమంతుడగు దేవుడను. నా పేరు యెహోవా.

కీర్తనలు. 148-150

148 యెహోవాను స్తుతించండి!
పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
సకల దూతలారా, యెహోవాను స్తుతించండి!
    ఆయన సర్వ సైనికులారా,[a] ఆయనను స్తుతించండి!
సూర్యచంద్రులారా, యెహోవాను స్తుతించండి.
    ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి!
మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి.
    ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి.
యెహోవా నామాన్ని స్తుతించండి.
    ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు.
    ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు!
    మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి.
అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి,
    తుఫాను, గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు.
పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను,
    దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు.
10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు.
    నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు.
12 యువతీ యువకులను దేవుడు చేశాడు.
    వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు.
13 యెహోవా నామాన్ని స్తుతించండి!
    ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి!
భూమిపైన, ఆకాశంలోను ఉన్న
    సమస్తం ఆయనను స్తుతించండి!
14 దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు.
    దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు.
ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!

149 యెహోవాను స్తుతించండి.
యెహోవా చేసిన కొత్త సంగతులను గూర్చి ఒక కొత్త కీర్తన పాడండి!
    ఆయన అనుచరులు కూడుకొనే సమావేశంలో ఆయనకు స్తుతి పాడండి.
ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలిసి ఆనందించనివ్వండి.
    సీయోను మీది ప్రజలను వారి రాజుతో కూడా ఆనందించనివ్వండి.
ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు వాయిస్తూ
    నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించనివ్వండి.
యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు.
    దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత క్రియ చేశాడు.
    ఆయన వారిని రక్షించాడు!
దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందించండి.
    పడకలు ఎక్కిన తరువాత కూడ సంతోషించండి.

ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక.
    ప్రజలు తమ చేతులలో వారి ఖడ్గాలు పట్టుకొని
వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక.
    వారు వెళ్లి యితర ప్రజలను శిక్షించెదరుగాక.
ఆ రాజులకు, ప్రముఖులకు
    దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు.
దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రువులను శిక్షిస్తారు.
    దేవుని అనుచరులకు ఆయన ఆశ్చర్యకరుడు.

యెహోవాను స్తుతించండి!

150 యెహోవాను స్తుతించండి!
దేవుని ఆలయంలో ఆయనను స్తుతించండి!
    ఆకాశంలో ఆయన శక్తిని బట్టి ఆయనను స్తుతించండి!
ఆయన గొప్ప కార్యములను బట్టి ఆయనను స్తుతించండి!
    ఆయన గొప్పతనమంతటి కోసం ఆయనను స్తుతించండి!
బూరలతో, కొమ్ములతో ఆయనను స్తుతించండి!
    స్వరమండలాలతో, సితారాలతో ఆయనను స్తుతించండి!
తంబురలతో, నాట్యంతో దేవుని స్తుతించండి!
    తీగల వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి!
పెద్ద తాళాలతో దేవుణ్ణి స్తుతించండి!
    పెద్దగా శబ్దం చేసే తాళాలతో ఆయనను స్తుతించండి!

సజీవంగా ఉన్న ప్రతీది యెహోవాను స్తుతించాలి!

యెహోవాను స్తుతించండి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International