Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 దినవృత్తాంతములు 3-4

దావీదు కుమారులు

హెబ్రోను పట్టణంలో దావీదుకు కొందరు కుమారులు పుట్టారు. ఆ కుమారులు ఎవరనగా:

దావీదు మొదటి కుమారుడు అమ్నోను. అమ్నోను తల్లి పేరు అహీనోయము. ఆమె యెజ్రెయేలుకు చెందిన స్త్రీ,

రెండవ కుమారుని పేరు దానియేలు. అతని తల్లి పేరు అబీగయీలు. ఆమె కర్మేలుకు చెందినది.

మూడవ కుమారుడు అబ్షాలోము. తల్మయి కుమార్తెయగు మయకా అతని తల్లి. తల్మయి గెషూరుకు రాజు.

నాల్గవ కుమారుని పేరు అదోనీయా. అతని తల్లి పేరు హగ్గీతు.

ఐదవ కుమారుడు షెఫట్య. అతని తల్లి పేరు అబీటలు. ఆరవవాడు ఇత్రెయాము. ఇతని తల్లి దావీదు భార్య ఎగ్లా.

దావీదుకు ఈ ఆరుగురు కుమారులు హెబ్రోనులో జన్మించారు.

దావీదు అక్కడ ఏడు సంవత్సరాల ఆరు నెలలపాటు పాలించాడు. దావీదు యెరూషలేములో ముప్పదిమూడు సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. దావీదుకు యెరూషలేములో పుట్టిన సంతానమెవరనగా:

బత్షెబకు నలుగురు సంతానం. వారు షిమ్యా, షోబాబు, నాతాను మరియు సొలొమోను. బత్షెబ అమ్మీయేలు కుమార్తె. 6-8 దావీదు యొక్క మరి తొమ్మండుగురు కుమారులు ఎవరనగా: ఇభారు, ఎలీషామా, ఎలీపేలెటు, నోగహు, నెపెగు, యాఫీయ, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు. వారంతా దావీదు కుమారులు. దావీదుకు ఇంకా దాసీ వలన కూడ కుమారులు కలిగారు. తామారు దావీదు కుమార్తె.

దావీదు తర్వాత యూదా రాజులు

10 సొలొమోను కుమారుడు రెహబాము. రెహబాము కుమారుడు అబీయా. అబీయా కుమారుడు ఆసా. ఆసా కుమారుడు యెహోషాపాతు. 11 యెహోషాపాతు కుమారుడు యెహోరాము. యెహోరాము కుమారుడు అహజ్యా. అహజ్యా కుమారుడు యోవాషు. 12 యోవాషు కుమారుడు అమజ్యా. అమజ్యా కుమారుడు అజర్యా. అజర్యా కుమారుడు యోతాము. 13 యోతాము కుమారుడు ఆహాజు. ఆహాజు కుమారుడు హిజ్కియా. హిజ్కియా కుమారుడు మనష్షే. 14 మనష్షే కుమారుడు ఆమోను. ఆమోను కుమారుడు యోషీయా.

15 యోషీయా కుమారులెవరనగా: యోహానాను మొదటి కుమారుడు. రెండవవాడు యెహోయాకీము. మూడవ కుమారుడు సిద్కియా. నాల్గవవాడు షల్లూము.

16 యెహోయాకీము సంతానంలో అతని కుమారుడు యెకొన్యా, అతని కుమారుడు సిద్కియా వున్నారు.[a]

బబులోను చెఱ తర్వాత దావీదు కుటుంబం

17 యెహోయాకీను[b] బబులోనులో బందీ అయిన పిమ్మట యెకొన్యా సంతానం ఎవరనగా: షయల్తీయేలు, 18 మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా మరియు నెదబ్యా.

19 పెదాయా కుమారులు జెరుబ్బాబెలు, షిమీ. జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము, హనన్యా, షెలోమీతు మరియు వారి సహోదరి. 20 జెరుబ్బాబెలుకు ఐదుగురు కుమారులు. వారి పేర్లు: హషుబా, ఓహెలు, బెరెక్యా, హసద్యా మరియు యూషబెస్హెదు.

21 హనన్యా కుమారులు పెలట్యా, యెషయా, రెఫయా, అర్నాను, ఓబద్యా మరియు షెకన్యా.[c]

22 షెకన్యా సంతతిలో షెమయా ఒకడు. షెమయాకు ఆరుగురు కుమారులు: వారు షెమయా, హట్టూషు, ఇగాలు బారియహు, నెయర్యా, షాపాతు.

23 నెయర్యాకు ముగ్గురు కుమారులు: వారు ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము.

24 ఎల్యోయేనై కుమారులు ఏడుగురు: వారు హోదవయా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయ్యా మరియు అనాని.

ఇతర యూదా కుటుంబ సమూహాలు

యూదా కుమారులు ఎవరనగా:

పెరెసు, హెష్రోను, కర్మీ, హూరు, శోబాలు.

శోబాలు కుమారుడు రెవాయా. రెవాయా కుమారుడు యహతు. యహతు కుమారులు అహూమై, లహదు అనువారు. అహూమై, లహదు వంశీయులే సొరాతీయులు. అబేయేతాము తండ్రియగు హారేపు సంతతివారెవరనగా

అబీయేతాము కుమారులు యెజ్రెయేలు, ఇష్మా, ఇద్బాషు అనేవారు. వారి సోదరి పేరు హజ్జెలెల్పోని.

పెనూయేలు కుమారుడు గెదోరు. ఏజెరు కుమారుడు హూషా. హూరు సంతతి వారెవరనగా:

హూరు అనువాడు ఎఫ్రాతాకు పెద్ద కుమారుడు. ఎఫ్రాతా కుమారుడు బేత్లెహేము.

తెకోవ తండ్రి పేరు అష్షూరు. తెకోవకు హెలా మరియు నయరా అను ఇద్దరు భార్యలు. నయరాకు అహూజాము, హెపెరు, తేమని, హాయహష్తారీ అనేవారు పుట్టారు. వీరంతా అష్షూరుకు నయరావల్ల పుట్టిన కుమారులు. హెలా కుమారులు జెరెతు, సోహరు, ఎత్నాను మరియు కోజు అనువారు. కోజు కుమారులు ఆనూబు, జోబేబా. అహర్హేలు సంతతి వారందరికీ కోజు మూలపురుషుడు. అహర్హేలు అనేవాడు హారుము కుమారుడు.

యబ్బేజు చాలా మంచి వ్యక్తి. అతడు తన సోదరుల కంటె మంచివాడు. “నేనతనికి యబ్బేజు అని నామకరణం చేశాను. ఎందువల్లననగా నేనతనిని ప్రసవించినప్పుడు మిక్కిలి బాధ అనుభవించాను” అని అతని తల్లి చెప్పింది. 10 యబ్బేజు ఇశ్రాయేలు దేవునికి ఇలా ప్రార్థన చేశాడు: “దేవా, నీవు నన్ను తప్పక ఆశీర్వదించాలని వేడుకొంటున్నాను! నీవు నా దేశాన్ని విస్తరింపజేయాలని కోరుకుంటున్నాను. నీవు సదా నాకు తోడుగా ఉండి, నన్నెవ్వరూ బాధించకుండా కాపాడుము. అప్పుడు నాకేరకమైన వేదనా ఉండదు.” యబ్బేజు కోరుకున్నట్లు దేవుడు అతనికి అన్నీ కలుగుజేశాడు.

11 కెలూబు అనువాడు షూవహుకు సోదరుడు. కెలూబు కుమారుని పేరు మెహీరు. మెహీరు కుమారుని పేరు ఎష్తోను. 12 ఎష్తోను కుమారుల పేర్లు బేత్రాఫాను, పాసెయ మరియు తెహిన్నా. తెహిన్నా కుమారుని పేరు ఈర్నాహాషు.[d] వారంతా రేకా నుండి వచ్చిన వారు.

13 కనజు కుమారులు ఇద్దరు: ఒత్నీయేలు, శెరాయా. ఒత్నీయేలుకు హతతు, మెయానొతై అనే ఇద్దరు కుమారులు. 14 మెయానొతై కుమారుని పేరు ఒఫ్రా.

శెరాయా కుమారుని పేరు యోవాబు. యోవాబు కుమారుని పేరు గెహరష్షీము. (దీనినే “పని వారి లోయ” అంటారు). హస్త నైపుణ్యం గల పనివారు నివసించే చోటు గనుక ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.

15 యెపున్నె కుమారుని పేరు కాలేబు. కాలేబు కుమారులు ఈరూ, ఏలా, నయము అనేవారు. ఏలా కుమారుని పేరు కనజు.

16 యెహల్లెలేలు కుమారులు జీపు, జీఫా, తీర్యా, అశర్యేలు అనేవారు.

17-18 ఎజ్రా కుమారుల పేర్లు యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు కుమారులు మిర్యాము, షమ్మయి, ఇష్బాహు అనేవారు. ఇష్బాహు కుమారుడు ఎష్టెమోను. మెరెదు భార్య ఐగుప్తు (ఈజిప్టు) కు చెందిన స్త్రీ. ఆమెకు యెరెదు, హెబెరు, యెకూతీయేలు అను కుమారులు కలిగారు. యెరెదు కుమారుని పేరు గెదోరు. హెబెరు కుమారుని పేరు శోకో. యెకూతీయేలు కుమారుని పేరు జానోహ. బిత్యా వంశావళి ఏదనగా: బిత్యా ఫరో కుమార్తె. ఈమె ఐగుప్తు (ఈజిప్టు) దేశీయురాలు. మెరెదుకు భార్య.

19 మెరెదు మరో భార్య నహము సోదరి. మెరెదు యొక్క ఈ భార్య యూదాకు చెందిన స్త్రీ.[e] మెరెదు భార్యకు పుట్టిన కుమారులు కెయీలా, ఎష్టెమో అనే వారికి తండ్రులయ్యారు. కెయీలా గర్మీయులకు చెందినవాడు. ఎష్టెమో మాయకాతీయులకు చెందినవాడు. 20 షీమోను కుమారులు అమ్నోను, రిన్నా, బెన్హానాను మరియు తీలోను.

ఇషీ కుమారులు జోహేతు మరియు బెన్జోహేతు.

21-22 యూదా కుమారుని పేరు షేలహు. షేలహు కుమారులు ఏరు, లద్దా, యోకీము, కోజేబావారి యోవాషు, శారాపు అనేవారు. ఏరు కుమారుని పేరు లేకా. మారేషా అను వానికి, బేత్ అషీబయలో నారబట్టలు నేయు కుటుంబాల వారికి లద్దా తండ్రి. యోవాషు, శారాపులిద్దరూ మోయాబీయుల స్త్రీలను వివాహమాడారు. పిమ్మట వారు బేత్లెహేముకు తిరిగి వెళ్లారు.[f] ఈ వంశాన్ని గురించిన వ్రాతలన్నీ మిక్కిలి ప్రాచీనమైనవి. 23 షేలహు కుమారులు కుమ్మరి పనివారు. వారంతా నెతాయీములోను, గెదేరాలోను నివసించారు. వారా పట్టణాలలో వుంటూ రాజు కొరకు పనిచేశారు.

షిమ్యోను కుమారులు

24 షిమ్యోను కుమారులు నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షావూలు అనేవారు. 25 షావూలు కుమారుని పేరు షల్లూము. షల్లూము కుమారుడు మిబ్శాము. మిబ్శాము కుమారుడు మిష్మా.

26 మిష్మా కుమారుడు హమ్మూయేలు. హమ్మూయేలు కుమారుడు జక్కూరు. జక్కూరు కుమారుడు షిమీ. 27 షిమీకి పదహారుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు కలిగారు. కాని షిమీ సోదరులకె వరికీ సంతానం లేదు. షిమీ సోదరులకు పెద్ద కుటుంబాలు కూడా లేవు. యూదాలో ఇతర కుటుంబాల మాదిరిగా వారి కుటుంబాలు పెద్దవి కావు.

28 షిమీ సంతానం బెయేర్షెబాలోను, మోలాదాలోను, హజర్షువలులోను, 29 బిల్హాలోను, ఎజెములోను, తోలాదులోను, 30 బెతూయేలులోను, హోర్మాలోను, సిక్లగులోను, 31 బేత్మర్కా బేతులోను, హజర్సూసాలోను, బేత్బీరీలోను, షరాయిములోను నివసించారు. దావీదు రాజయ్యేవరకు వారా పట్టణాలలో నివసించారు. 32 ఆ పట్టణాల పరిసరాల్లో ఉన్న ఐదు గ్రామాలేవనగా ఏతాము, అయీను, రిమ్మోను, తోకెను మరియు ఆషాను. 33 అంతేగాక బయలువరకు అనేక ఇతర గ్రామాలు కూడవున్నాయి. ఈ ప్రదేశాల్లో వారు నివసించారు. పైగా వారు తమ వంశచరిత్రను కూడా రాశారు.

34-38 ఆయా వంశాల వారి నాయకులు ఈ విధంగా ఉన్నారు: మెషోబాబు, యమ్లేకు, అమజ్యా కుమారుడగు యోషా, యావేలు, యోషిబ్యా కుమారుడైన యెహూ (యోషిబ్యా అనేవాడు శెరాయా కుమారుడు: శెరాయా తండ్రి పేరు అశీయేలు); ఎల్యోయేనై, యహకోబా, యెషోహాయా, అశాయా, అదీయేలు, యెశీమీయేలు, బెనాయా మరియు షిపి కుమారుడైన జీజా. షిపి అనేవాడు అల్లోను కుమారుడు. అల్లోను తండ్రి పేరు యెదాయా. యెదాయా తండ్రి పేరు షిమ్రీ. షిమ్రీ తండ్రి పేరు షెమయా.

ఈ మనుష్యుల కుటుంబాలన్నీ బాగా విస్తరించి పెరిగాయి. 39 వారు గెదోరుకు, ఆపై భూభాగాలకు, తూర్పున ఉన్న లోయ వరకు సంచరించారు. వారు తమ గొర్రెల మందలకు, ఆవుల మందలకు మేత బయళ్లు వెదుకుతూ ఆ ప్రాంతాల వరకు సంచరించారు. 40 పచ్చిక మెండుగా ఉన్న మంచి భూములను వారు కనుగొన్నారు. సారవంతమైన పంట భూములను కూడ వారు చూసారు. ఆ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం విలసిల్లింది. గతంలో హాము సంతతివారు అక్కడ నివసించారు. 41 యూదా రాజు హిజ్కియా కాలంలో ఇది జరిగింది. ఆ మనుష్యులంతా గెదోరుకు వచ్చి, హామీయులతో పోరాడి, వారి గుడారాలన్నిటినీ నాశనం చేశారు. వారింకా అక్కడ నివసించే మెయోనీయులతో కూడ యుద్ధం చేసి వారిని నాశనం చేసారు. ఈనాటి వరకు అక్కడ మెయోనీయులు లేరు. తరువాత ఈ మనుష్యులే అక్కడ నివసించసాగారు. అక్కడ వారి గొర్రెలకు పుష్కలంగా మేత దొరకడంతో వారక్కడ స్థిరపడ్డారు.

42 ఐదువందల మంది షిమ్యోనీయులు కొండల ప్రాంతమైన శేయీరుకు వెళ్లారు. ఇషీ కుమారుల నాయకత్వంలో వారు వెళ్లారు. వారి పేర్లు ఏవనగా: పెలట్యా, నెయర్యా, రెఫాయా, ఉజ్జీయేలు. షిమ్యోనీయులు అక్కడి స్థానిక ప్రజలతో యుద్ధం చేసారు. 43 అక్కడ చాలా కొద్దిమంది అమాలేకీయులు మాత్రమే ఉంటున్నారు. షిమ్యోనీయులు వారిని హతమార్చారు. అప్పటి నుండి ఈనాటి వరకు షిమ్యోనీయులు శేయీరులో నివసిస్తున్నారు.

హెబ్రీయులకు 9

భూలోక గుడారములో సేవ

సేవా నియమాలను గురించి, మానవ నిర్మితమైన గుడారమును గురించి మొదటి ఒడంబడికలో వ్రాయబడి ఉంది. గుడారం వేసి మొదటి గదిని సిద్ధం చేసేవాళ్ళు. ఆ గదిలో ఒక దీప స్థంభం, ఒక బల్ల, ప్రతిష్ఠించబడిన రొట్టె ఉంచేవాళ్ళు. ఈ గదిని పవిత్రస్థానమని పిలిచేవాళ్ళు. మరొక తెరవేసి రెండవ గదిని సిద్ధం చేసేవాళ్ళు. దీన్ని అతి పవిత్ర స్థానమని పిలిచేవాళ్ళు. ఇక్కడ బంగారు ధూప వేదిక, మరియు బంగారు రేకుచేత కప్పబడిన ఒడంబడిక మందసము ఉండేవి. ఈ మందసంలో మన్నా[a] ఉంచబడిన బంగారుగిన్నె, చిగురు వేసిన అహరోను చేతికర్ర, ఒడంబడిక పలకలు ఉండేవి. ఈ మందసం మీద కరుణాపీఠం ఉండేది. దానికి యిరువైపులా దేవదూతలు ఉండేవారు. వారి రెక్కలు ఆ కరుణాపీఠాన్ని కప్పి ఉంచేవి. కాని వీటిని గురించి ప్రస్తుతం వివరంగా చర్చించలేము.

అన్నీ ఈ విధంగా అమర్చబడిన తర్వాత, యాజకులు నియమానుసారం ముందున్న గదిలోకి ప్రవేశించి సేవ చేసేవాళ్ళు. కాని ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి అతిపరిశుద్ధ స్థలంలోకి రక్తంతో ప్రవేశించేవాడు. తన పక్షాన, అజ్ఞానంతో పాపాలు చేసిన ప్రజల పక్షాన తప్పకుండా రక్తాన్ని తెచ్చి దేవునికి అర్పించేవాడు.

అంటే మొదటి గది ఉన్నంతకాలం అతి పవిత్ర స్థానానికి ప్రవేశం కలుగదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఇది ప్రస్తుత కాలాన్ని సూచిస్తోంది. అంటే కానుకలు, బలులు అర్పించటం వల్ల యాజకుని అంతరాత్మ పరిశుద్ధం కాదని పరిశుద్ధాత్మ సూచిస్తున్నాడు. 10 ఇవి కేవలం అన్నపానాలకు పలురకాల పరిశుద్ద స్నానాలకు సంబంధించిన ఆచారాలు. క్రొత్త క్రమం వచ్చేదాకా ఈ బాహ్య నియమాలు వర్తిస్తాయి.

యేసు రక్తం

11 దేవుడు చేసిన మంచి పనులు సాగించటానికి క్రీస్తు ప్రధాన యాజకుడై పరలోకంలోని గుడారానికి వెళ్ళాడు. ఆ గుడారం చాలా పెద్దది. శ్రేష్ఠమైనది. అది మానవుడు నిర్మించింది కాదు. 12 ఆయన మేకల రక్తం ద్వారా, దూడల రక్తం ద్వారా ఆ గుడారంలోకి వెళ్ళలేదు. తన స్వంత రక్తంతో అతి పవిత్రమైన ఆ స్థలాన్ని శాశ్వతంగా ప్రవేశించి, మనకు శాశ్వతమైన రక్షణ కలిగించాడు.

13 మేకల రక్తాన్ని, ఎద్దుల రక్తాన్ని, దూడలను కాల్చిన బూడిదను, అపవిత్రంగా ఉన్నవాళ్ళపై ప్రోక్షించి, వాళ్ళను పవిత్రం చేసేవాళ్ళు. ఇలా చేయటం వల్ల వాళ్ళు బాహ్యంగా మాత్రమే పవిత్రులౌతారు. 14 కాని, నిష్కళంకుడైన యేసు శాశ్వతమైన తన ఆత్మను దేవునికి అర్పించుకొన్నాడు. తద్వారా క్రీస్తు రక్తం మన చెడు అంతరాత్మల్ని కూడా పరిశుద్ధం చేస్తోంది. మనము సజీవుడైన దేవుణ్ణి ఆరాధించాలని ఆయనీవిధంగా చేసాడు.

15 ఈ కారణంగా క్రీస్తు క్రొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయ్యాడు. ఈయన దేవుడు పిలిచినవాళ్ళకు దేవుడు వాగ్దానం చేసిన శాశ్వత వారసత్వం లభించేటట్లు చేస్తాడు. మొదటి ఒడంబడిక చెలామణిలో ఉండగా ప్రజలు చేసిన పాపాలకు తన ప్రాణాన్ని వెలగా చెల్లించి వాళ్ళకు స్వేచ్ఛ కలిగించాడు.

16 వీలునామా చెలామణిలోకి రావాలంటే, దాన్ని వ్రాసిన వ్యక్తి యొక్క మరణాన్ని నిరూపించటం అవసరం. 17 ఎందుకంటే, వ్రాసిన వాడు మరణిస్తే వీలునామా చెలామణిలోకి వస్తుంది. వీలునామా వ్రాసినవాడు జీవిస్తుంటే, అది ఎలా చెలామణిలోకి వస్తుంది? 18 ఈ కారణంగానే, మొదటి ఒడంబడిక కూడా రక్తాన్ని ఉపయోగించకుండా చెలామణి కాలేకపోయింది. 19 ధర్మశాస్త్రంలో ఉన్న నియమాల్ని మోషే ప్రజలకు ప్రకటించిన తర్వాత దూడల రక్తాన్ని నీళ్ళలో కలిపి, ఆ మిశ్రమాన్ని హిస్సోపు చెట్ల కొమ్మలతో, సింధూర వర్ణముగల గొఱ్ఱె బొచ్చుతో ధర్మశాస్త్ర గ్రంథం మీద, ప్రజల మీద చల్లాడు. 20 ఆ తర్వాత మోషే వాళ్ళతో, “దేవుడు తన ఒడంబడికను ఆచరించమని ఆజ్ఞాపించి ఈ ఒడంబడిక రక్తాన్ని మీకిచ్చాడు” అని అన్నాడు. 21 అదే విధంగా అతడు గుడారం మీద, సేవా సామగ్రి మీద ఆ రక్తాన్ని ప్రోక్షించాడు. 22 నిజానికి, యించుమించు అన్ని వస్తువుల్ని రక్తంతో పరిశుద్ధం చెయ్యాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది. రక్తం చిందించకపోతే పాపపరిహారం కలగదు.

యేసు క్రీస్తు మన పాపాలకు బలి

23 అందువల్ల పరలోకంలో ఉన్న వస్తువుల ప్రతిరూపాలను బలి యిచ్చి పరిశుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడింది. కాని, పరలోకంలో ఉన్న వాటిని పవిత్రం చెయ్యటానికి యింకా మంచిరకమైన బలులు కావాలి. 24 భూమ్నీదవున్న ఈ పవిత్ర స్థానం నిజమైన దానికి ప్రతిరూపం మాత్రమే. క్రీస్తు మానవుడు నిర్మించిన ఈ పవిత్ర స్థానాన్ని కాదు ప్రవేశించింది. ఆయన మనకోసం పరలోకంలో ఉన్న దేవుని యొద్దకు వెళ్ళాడు.

25 ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం పశువుల రక్తంతో అతి పవిత్ర స్థానాన్ని ప్రవేశించినట్లు, ఆయన తనను తాను పదే పదే బలిగా సమర్పించుకోవటానికి పరలోకానికి వెళ్ళలేదు. 26 అలా అర్పించి ఉంటే ప్రపంచం సృష్టింప బడినప్పటి నుండి క్రీస్తు ఎన్నోసార్లు మరణించ వలసి వచ్చేది. కాని, ప్రస్తుతం యుగాల అంతంలో తనను తాను ఒకే ఒకసారి బలిగా అర్పించుకుని పాపపరిహారం చెయ్యాలని ప్రత్యక్ష్యమయ్యాడు.

27 ప్రతి ఒక్కడూ, ఒక్కసారే మరణించాలి. తర్వాత దేవుని తీర్పుకు గురి అవ్వాలి. వాళ్ళపై తీర్పు చెబుతాడు. 28 అందువల్ల, అనేకుల పాపపరిహారం కోసం క్రీస్తు ఒకసారి మాత్రమే తనను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆయన రెండవసారి ప్రత్యక్ష్యమౌతాడు. పాపం మోయటానికి కాదు తనకోసం కాచుకొని ఉన్నవాళ్లకు రక్షణ కలిగించటానికి ప్రత్యక్ష్యమౌతాడు.

ఆమోసు 3

ఇశ్రాయేలుకు హెచ్చరిక

ఇశ్రాయేలు ప్రజలారా, ఈ వర్తమానం వినండి! ఇశ్రాయేలూ, నిన్ను గురించి యెహోవా ఈ విషయాలు చెప్పాడు. ఈజిప్టునుండి ఆయన తీసుకొని వచ్చిన ఇశ్రాయేలు వంశాల వారందరిని గూర్చినదే ఈ వర్తమానం. “భూమిమీద అనేక వంశాలున్నాయి. కాని మిమ్మల్ని మాత్రమే నేను ఎంపికచేసి ప్రత్యేకంగా ఎరిగియున్నాను. అయితే, మీరు నాపై తిరుగుబాటు చేశారు. కావున మీ పాపాలన్నిటికీ నేను మిమ్మల్ని శిక్షిస్తాను.”

ఇశ్రాయేలు శిక్షకు కారణం

అంగీకారం లేకుండా
    ఇద్దరు వ్యక్తులు కలిసి నడవలేరు.
అడవిలో ఉన్న సింహం ఒక జంతువును
    పట్టుకున్న తరువాతనే గర్జిస్తుంది.
తన గుహలో వున్న ఒక యువ కిశోరం గర్జిస్తూ ఉందంటే,
    అది ఏదో ఒక దానిని పట్టుకున్నదని అర్థం.
బోనులో ఆహారం లేకపోతే ఒక పక్షి ఆ బోనులోకి ఎగిరిరాదు.
    బోను మూసుకుపోతే, అది అందులో చిక్కుతుంది.
హెచ్చరిక చేసే బూరనాదం వినబడితే
    ప్రజలు భయంతో వణుకుతారు.
ఒక నగరానికి ఏదైనా ముప్పు వాటిల్లిందంటే,
    దానిని యెహోవాయే కలుగ జేసినట్లు.

నా ప్రభువైన యెహోవా ఏదైనా చేయటానికి నిర్ణయించవచ్చు. కాని ఆయన ఏదైనా చేసేముందు ఆయన తన పథకాలను తన, సేవకులైన ప్రవక్తలకు తెలియజేస్తాడు. ఒక సింహం గర్జిస్తే ప్రజలు భయపడతారు. యెహోవా మాట్లాడితే, ప్రవక్తలు దానిని ప్రవచిస్తారు.

9-10 అష్డోదు, ఈజిప్టులలో ఉన్న ఎత్తయిన బురుజులు ఎక్కి ఈ వర్తమానం ప్రకటించండి: “మీరు సమరయ (షోమ్రోను) పర్వతాల మీదికి రండి. అక్కడ మీరు ఒక పెద్ద గందరగోళ పరిస్థితిని చూస్తారు. ఎందుకంటే, సవ్యమైన జీవితం ఎలా గడపాలో ఆ ప్రజలకు తెలియదు. సాటి ప్రజలపట్ల వారు క్రూరంగా వ్యవహరించారు. అన్యజనులనుండి వారు వస్తువులను తీసుకొని వాటిని ఎత్తయిన బురుజులలో దాచివేశారు. యుద్ధంలో తీసుకున్న వస్తువులతో వారి ఖజానాలు నిండివున్నాయి.”

11 కావున యెహోవా చెపుతున్నదేమంటే: “దేశంమీదికి ఒక శత్రువు వస్తాడు. ఆ శత్రువు మీ బలాన్ని హరిస్తాడు. మీ ఎత్తయిన బురుజులలో దాచిన వస్తువులన్నీ అతడు తీసుకుంటాడు.”

12 యెహోవా ఇది చెపుతున్నాడు:

“ఒక సింహం ఒక గొర్రెపిల్ల మీద పడవచ్చు.
    ఆ గొర్రెపిల్లలో కొంత భాగాన్నే కాపరి రక్షించగలడు.
సింహం నోటినుండి అతడు రెండు కాళ్లను గాని,
    చెవిలో కొంత భాగాన్నిగాని బయటకు లాగవచ్చు.
అదే మాదిరి, ఇశ్రాయేలు ప్రజలలో ఎక్కువ మంది రక్షింపబడరు.
    సమరయ (షోమ్రోను)లో నివసిస్తున్న ప్రజలు మంచంలో కేవలం ఒక మూలనుగాని,
    లేక తమ పాన్పులో ఒక గుడ్డముక్కనుగాని రక్షించుకుంటారు.”

13 నా ప్రభువును, దేవుడును, సర్వశక్తిమంతుడును అయిన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “యాకోబు వంశాన్ని (ఇశ్రాయేలు) ఈ విషయాలను గూర్చి హెచ్చరించు. 14 ఇశ్రాయేలు పాపం చేసింది. వారి పాపాలకు నేను వారిని శిక్షిస్తాను. బేతేలులోవున్న బలిపీఠాలనుకూడా నేను నాశనం చేస్తాను. బలిపీఠపు కొమ్ములు నరికివేయబడతాయి. అవి కింద పడతాయి. 15 శీతాకాలపు విడిదిని, వేసవి విడిదిని కలిపి నేను నాశనం చేస్తాను. దంతపు ఇండ్లు నాశనం చేయబడతాయి. అనేక ఇండ్లు నాశనం చేయబడతాయి” అని యెహోవా చెపుతున్నాడు.

కీర్తనలు. 146-147

146 యెహోవాను స్తుతించండి!
    నా ప్రాణమా! యెహోవాను స్తుతించు!
నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను.
    నా జీవిత కాలమంతా నేను ఆయనకు స్తుతులు పాడుతాను.
సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు.
    మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు.
మనుష్యులు చనిపోయి, పాతిపెట్టబడతారు.
    అప్పుడు నీకు సహాయం చేసేందుకు వారు వేసిన పథకాలన్నీ పోయినట్టే.
సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతోషంగా ఉంటారు.
    ఆ మనుష్యులు వారి దేవుడైన యెహోవా మీద ఆధారపడతారు.
భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
    సముద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా చేశాడు.
యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడుతాడు.
అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన సహాయం చేస్తాడు.
    ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తాడు.
చెరలోవున్న ప్రజలను యెహోవా విడుదల చేస్తాడు.
    గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు.
కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
    మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు.
    విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు.
    అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు.
10 యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
    సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
యెహోవాను స్తుతించండి!

147 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
    మన దేవునికి స్తుతులు పాడండి.
    ఆయనను స్తుతించుట మంచిది, అది ఎంతో ఆనందం.
యెహోవా యెరూషలేమును నిర్మించాడు.
    బందీలుగా తీసికొనిపోబడిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వెనుకకు తీసికొనివచ్చాడు.
పగిలిన వారి హృదయాలను దేవుడు స్వస్థపరచి,
    వారి గాయాలకు కట్లు కడతాడు.
దేవుడు నక్షత్రాలను లెక్కిస్తాడు.
    వాటి పేర్లనుబట్టి వాటన్నిటినీ ఆయన పిలుస్తాడు.
మన ప్రభువు చాలా గొప్పవాడు. ఆయన చాలా శక్తిగలవాడు.
    ఆయన పరిజ్ఞానానికి పరిమితి లేదు.
పేదలను యెహోవా బలపరుస్తాడు.
    కాని చెడ్డ ప్రజలను ఆయన ఇబ్బంది పెడతాడు.
యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి.
    స్వరమండలాలతో మన దేవుణ్ణి స్తుతించండి.
దేవుడు ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు.
    భూమి కోసం దేవుడు వర్షాన్ని సృష్టిస్తాడు.
పర్వతాల మీద దేవుడు గడ్డిని మొలిపిస్తాడు.
జంతువులకు దేవుడు ఆహారం యిస్తాడు.
    పక్షి పిల్లల్ని దేవుడు పోషిస్తాడు.
10 యుద్ధాశ్వాలు, బలంగల సైనికులు ఆయనకు ఇష్టం లేదు.
11 యెహోవాను ఆరాధించే ప్రజలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తారు.
    ఆయన నిజమైన ప్రేమను నమ్ముకొనే ప్రజలు యెహోవాకు సంతోషం కలిగిస్తారు.
12 యెరూషలేమా, యెహోవాను స్తుతించుము.
    సీయోనూ, నీ దేవుని స్తుతించుము!
13 యెరూషలేమా, దేవుడు నీద్వారబంధాలను బలపరుస్తాడు.
    నీ పట్టణంలోని ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు.
14 నీ దేశానికి దేవుడు శాంతి కలిగించాడు. కనుక యుద్ధంలో నీ శత్రువులు నీ ధాన్యం తీసుకొని పోలేదు.
    ఆహారం కోసం నీకు ధాన్యం సమృద్ధిగా ఉంది.
15 దేవుడు భూమికి ఒక ఆజ్ఞ ఇస్తాడు.
    దానికి వెంటనే అది లోబడుతుంది.
16 నేల ఉన్నిలా తెల్లగా అయ్యేంతవరకు మంచు కురిసేటట్టు దేవుడు చేస్తాడు.
    ధూళిలా గాలిలో మంచు విసిరేటట్టు చేస్తాడు.
17 దేవుడు ఆకాశం నుండి బండలవలె వడగండ్లు పడేలా చేస్తాడు.
    ఆయన పంపే చలికి ఎవడూ నిలువ జాలడు.
18 అప్పుడు, దేవుడు మరో ఆజ్ఞ ఇస్తాడు. వెచ్చటి గాలి మరల వీస్తుంది.
    మంచు కరిగిపోతుంది. నీళ్లు ప్రవహించటం మొదలవుతుంది.

19 దేవుడు యాకోబుకు (ఇశ్రాయేలు) తన ఆజ్ఞ ఇచ్చాడు.
    దేవుడు ఇశ్రాయేలుకు తన న్యాయచట్టాలు, ఆదేశాలు ఇచ్చాడు.
20 దేవుడు యిలా మరి ఏ దేశానికీ చెయ్యలేదు.
    ఇతర మనుష్యులకు దేవుడు తన న్యాయ చట్టం ఉపదేశించలేదు.

యెహోవాను స్తుతించండి!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International