Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 రాజులు 25

నెబుకద్నెజరు సిద్కియా పరిపాలనను అంతము చేయుట

25 సిద్కియా తిరుగుబాటు చేసి, బబులోను రాజుకు విధేయుడై వుండటానికి సమ్మతించలేదు.

అందువల్ల, బబులోను రాజైన నెబుకద్నెజరు, అతని మొత్తము సైన్యము యెరూషలేముకు ప్రతికూలముగా యుద్ధము చేయడానికి వచ్చింది. సిద్కియా రాజు యొక్క తొమ్మిదో సంవత్సరాన, 10వ నెలలో 10వ రోజున ఇది సంభవించింది. నెబుకద్నెజరు తన సైన్యాన్ని యెరూషలేము చుట్టు ఉంచి, ప్రజలను నగరం నుండి వెలుపలికిగాని లోపలికిగాని రానీయకుండ చేశాడు. ఆ తర్వాత నగరం చుట్టు అతను ఒక మురికి గోడ నిర్మించాడు. నెబుకద్నెజరు సైన్యము సిద్కియా యూదా రాజుగా వున్న 11వ సంవత్సరము దాకా యెరూషలేము చుట్టూ ఉండెను. నగరంలో కరువు ఘోరంగా తయారయింది. నాలుగవ నెలలో 9వ రోజున నగరంలోని సామాన్యులకు ఆహారము లేకపోయింది.

నెబుకద్నెజరు సైన్యము చివరికి నగర ప్రాకారమును బద్దలు చేసింది. ఆ రాత్రి సిద్కియా రాజు అతని సైనికులు పారిపోయారు. వారు రాజుగారి ఉద్యనవనము ద్వారా రహస్య ద్వారాన్ని ఉపయోగించి జంట గోడలద్వారా వెళ్లారు. విరోధి సైనికులు నగరం చుట్టూ వుండిరి. కాని సిద్కియా అతని మనుష్యులు మార్గము మీదికి తప్పించుకుని ఎడారికి పారిపోయారు. బబులోను సైన్యము సిద్కియా రాజుని వెన్నంటిపోయి అతనిని యెరికో అనే చోట పట్టుకున్నారు. సిద్కియా సైనికులందరు అతనిని విడిచిపెట్టి పారి పోయారు.

బబులోనువారు సిద్కియా రాజుని బబులోను రాజు వద్దకు రిబ్లా అనే చోటికి తీసుకు వెళ్లారు. బబులోనువారు సిద్కియాని శిక్షింప నిశ్చయించారు. వారు సిద్కియా కుమారులను అతని ఎదుటనే చంపివేశారు. ఆ తర్వాత సిద్కియా యొక్క కండ్లు పెరికివేశారు. అతనికి గొలుసులు బిగించి అతనిని బబులోనుకు తీసుకువెళ్లారు.

యెరూషలేమును ధ్వంసం చేయుట

నెబుకద్నెజరు బబులోను రాజుగా వున్న 19 వ సంవత్సరమున, 5 వ నెలలో 7వ తేదీన యెరూషలేముకు వచ్చాడు. నెబూజరదాను నెబుకద్నెజరు అత్యుత్తమ సైనికులకు అధిపతి. నెబూజరదాను యెహోవాయొక్క ఆలయమును దగ్ధం చేశాడు. రాజు భవనాన్ని, యెరూషలేములోని అన్ని ఇళ్లను కూడా దగ్ధం చేశాడు. అతను పెద్ద ఇళ్లను కూడా దగ్ధం చేశాడు.

10 అప్పుడు నెబూజరదానుతో పాటువున్న బబులోను సైన్యము యెరూషలేము పరిసరాలలోవున్న ప్రాకారములను కూలదోసింది. 11 నెబూజరదాను నగరంలో ఇంకా మిగిలివున్న ప్రజలను బంధించాడు. నెబూజరదానుకు లోబడిన వారిని సయితము బందీలుగా తీసుకువెళ్లాడు. 12 సామాన్యులలో అతి పేదవారిని మాత్రం నెబూజరదాను విడిచిపెట్టాడు. ద్రాక్షాలు ఇతర పంటలను చూసే నిమిత్తం వారిని అక్కడే నివసింప జేశాడు.

13 బబులోను సైనికులు యెహోవా యొక్క ఆలయములోని అన్ని ఇత్తడి వస్తువులను ముక్కలు చేశారు. వారు కంచు స్తంభాలను, కంచు మట్లను, పెద్ద ఇత్తడి చెరువుని ధ్వంసం చేశారు. తర్వాత ఆ కంచునంతా బబులోనుకు తీసుకువెళ్లారు. 14 బబులోనువారు యెహోవా యొక్క ఆలయంలో ఉపయోగింపబడే కుండలు, నిప్పు తీసే గరిటలు, దీపాలు చక్కబరిచే ఉపకరణాలు, చెంచాలు, కంచు పాత్రలు మొదలైనవాటిని తీసుకువెళ్లారు. 15 నెబూజరదాను బానలు, పాత్రలు కూడా తీసుకు వెళ్లాడు. బంగారము కోసము బంగారముతో చేయబడిన వస్తువులను వెండి కోసము వెండితో చేయబడిన వస్తువులను కూడా తీసుకువెళ్లాడు. 16-17 2 కంచు స్తంభాలు (ప్రతి స్తంభం 27 అడుగుల యెత్తు కలవి. స్తంభాల మీది పై పీటలు నాలుగున్నర అడుగుల ఎత్తు కలవి. దానిమ్మ పండు మరియు అల్లిక విన్యాసాలు కంచుతో చేయబడినవి. రెండు స్తంభాల విన్యాసం ఒకే మోస్తరుగా వుంటుంది) విశాలమైన కంచు చెరువు. యెహోవాయొక్క ఆలయానికి సొలొమోను సిద్ధపరిచిన రెండు స్తంభములు. ఆ వస్తువుల నుండి గ్రహించిన కంచు తూకం వేయడానికి అలవి కానిది.

యూదా ప్రజలను బందీలుగా తీసుకుని వెళ్లుట

18 ఆలయము నుండి నెబూజరదాను ప్రధాన యాజకుడైన శెరాయాను పట్టుకున్నాడు. జెఫన్యా అనే రెండవ యాజకుడు, ప్రవేశమును కాచే ఆ ముగ్గురు మనుష్యులను తీసుకెళ్లాడు.

19 నగరంనుండి నెబూజరదాను సైన్యానికి అధికారిగా ఉన్న ఉద్యోగిని, నగరంలో మిగిలివున్న ఐదుగురు రాజుగారి సలహాదారులను తీసుకొన్నాడు. సైన్యాధిపతి యొక్క ఒక కార్యదర్శి. అతను సామాన్య ప్రజలను లెక్కించేవాడు. మరియు అతను వారిలోనుండి కొందరు సైనికులను ఎంచుకునేవాడు. నగరంలో అప్పుడున్న 60 మంది ప్రజలను నెబుకద్నెజరు తీసుకొన్నాడు.

20-21 తరువాత నెబూజరదాను హమాతు ప్రదేశంలోని రిబ్లా దగ్గర ఉన్న బబులోను రాజువద్దకు ప్రజలందరినీ తీసుకువెళ్లాడు. బబులోను రాజు రిబ్లా అనే చోట వారిని చంపివేశాడు. మరియు యూదా ప్రజలను వారి దేశమునుండి బందీలుగా తీసుకొని పోయెను.

యూదా రాజ్య పాలకుడు అయిన గెదల్యా

22 బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశంలో కొందరు ప్రజలను విడచి పెట్టాడు. షాఫాను కుమారుడైన అహీకాం, అతని కుమారుడైన గెదల్యా అనే అతడు ఒకడుండెను. నెబుకద్నెజరు యూదా ప్రజల మీద గెదల్యాను అధిపతిగా నియమించాడు.

23 నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు కారేహకు కుమారుడైన నెటోఫాతుకు చెందిన తన్హుమెతు కుమారుడైన శెరాయా, మాయాకాతు కుమారుడైన యజన్నా మొదలయిన వారు సైన్యాధిపతులు. ఈ సైన్యాధిపతులు, వారి మనుష్యులు, బబులోను రాజు గెదల్యాను అధిపతిగా చేసినట్లు విన్నారు. అందువల్ల గెదల్యాను కలుసుకోవడానికి వారు మిస్పాకి వెళ్లారు. 24 ఈ అధికారులకు, వారి మనుష్యులకు గెదల్యా వాగ్దానాలు చేశాడు. గెదల్యా వారితో ఇట్లన్నాడు: “బబులోను అధికారులను చూసి మీరు భయపడకండి. ఇక్కడే ఉండి బబులోను రాజుని కొలవండి. ఆ తరువాత, అంతయు మీకు సక్రమముగా ఉంటుంది.”

25 ఎలీషా కుమారుడైన నెతన్యా కుమారుడు ఇష్మాయేలు రాజు కుటుంబము నుండి వచ్చినవాడు. ఏడవ నెలలో ఇష్మాయేలు మరియు పదిమంది అతని మనుష్యులు గెదల్యా మీద దాడిచేసి, మిస్పా వద్ద గెదల్యాతో పాటు ఉన్న కల్దీయులను, యూదులను చంపివేశాడు. 26 అప్పుడు సైన్యాధికారులు అందరు మనుష్యులు ఈజిప్టుకు పారిపోయారు. అతి సామాన్యుడు మొదలుకొని అతి ప్రాముఖ్యము కలవాడి వరకు అందరూ పారి పోయారు. ఎందుకనగా, కల్దీయులనగా వారు భయపడ్డారు.

27 ఆ తర్వాత ఎవీల్మెరోదకు బబులోనుకు రాజయ్యాడు. అతను యూదా రాజైన యెహోయాకీనును చెరసాలనుండి విముక్తి చేసెను. ఇది యెహోయాకీను బంధింపబడిన 37వ సంవత్సరమున సంభవించింది. ఇది ఎవీల్మెరోదకు పరిపాలన ప్రారంభం చేసిన 12వ నెలనుండి 27వ తేదీ వరకు జరిగింది. 28 ఎవీల్మెరోదకు యెహోయాకీను పట్ల దయకలిగి ఉండెను. అతను యెహోయాకీనుకి బబులోనులో తనతో బాటు ఆసీనులయ్యే ఇతర రాజుల కంటె ఎక్కువ ప్రాముఖ్యముగల చోటు ఇచ్చాడు. 29 ఎవీల్మెరోదకు యెహోయాకీను చెరసాల దుస్తులు ధరించడం ఆపివేశాడు. మరియు యెహోయాకీను ఒకే మేజాబల్ల మీద కూర్చుని ఎవీల్మెరోదకుతో కలిసి భుజించాడు. ఇట్లు అతని శేష జీవితము వరకు జరిగింది. 30 అందువల్ల ఎవీల్మెరోదకు రాజు యెహోయాకీనుకు అతని శేష జీవితము వరకూ ప్రతిరోజూ భోజనము పెట్టాడు.

హెబ్రీయులకు 7

మెల్కీసెదెకు

ఈ మెల్కీసెదెకు షాలేము రాజు, మరియు మహోన్నతుడైన దేవుని యాజకుడు. అబ్రాహాము రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు అతన్ని కలుసుకొని ఆశీర్వదించాడు. అబ్రాహాము తాను జయించిన వాటిలో పదవవంతు మెల్కీసెదెకుకు యిచ్చాడు.

మొదటిదిగా “మెల్కీసెదెకు” అనే పదానికి నీతికి రాజు అనే అర్థం. రెండవదిగా “షాలేము రాజు” అను యితని పేరుకు శాంతికి రాజు అనే అర్థం కూడా వుంది. మెల్కీసెదెకు తల్లిదండ్రులెవరో మనకు తెలియదు. అతని పూర్వికులెవరో మనకు తెలియదు. అతని బాల్యాన్ని గురించి కాని, అంతిమ రోజుల్ని గురించి కాని మనకు తెలియదు. దేవుని కుమారునివలె అతడు కూడా చిరకాలం యాజకుడుగా ఉంటాడు.

మూల పురుషుడైన అబ్రాహాము కూడా తాను జయించినదానిలో పదవ వంతు అతనికిచ్చాడంటే, అతడు ఎంత గొప్పవాడో గ్రహించండి. ఇశ్రాయేలు ప్రజలు అబ్రాహాము వంశానికి చెందినవాళ్ళు, లేవి జాతికి చెందిన యాజకుల సోదరులు. అయినా ధర్మశాస్త్రంలో ఈ లేవి యాజకులు ప్రజలు ఆర్జించినదానిలో పదవవంతు సేకరించాలని ఉంది. మెల్కీసెదెకు లేవి జాతికి చెందినవాడు కాకపోయినా, అబ్రాహాము నుండి అతని ఆదాయంలో పదవవంతు సేకరించాడు. దేవుని వాగ్దానాలు పొందిన అతణ్ణి ఆశీర్వదించాడు. ఆశీర్వదించేవాడు, ఆశీర్వాదం పొందే వానికన్నా గొప్ప వాడవటంలో అనుమానం లేదు.

ఒకవైపు చనిపోయేవాళ్ళు పదవ వంతు సేకరిస్తున్నారు. మరొక వైపు చిరకాలం జీవిస్తాడని లేఖనాలు ప్రకటించిన మెల్కీసెదెకు పదవ వంతు సేకరిస్తున్నాడు. ఒక విధంగా చూస్తే పదవవంతు సేకరించే లేవి, అబ్రాహాము ద్వారా పదవవంతు చెల్లించాడని చెప్పుకోవచ్చు. 10 ఎందుకంటే, మెల్కీసెదెకు అబ్రాహామును కలుసుకొన్నప్పుడు లేవి యింకా జన్మించ లేదు. అతడు, తన మూల పురుషుడైన అబ్రాహాములోనే ఉన్నాడు.

11 మోషే ధర్మశాస్త్రంలో లేవి జాతికి చెందిన యాజకుల గురించి వ్రాసాడు. ఒకవేళ, ఆ యాజకుల ద్వారా ప్రజలు పరిపూర్ణత పొంద గలిగి ఉంటే అహరోనులాంటి వాడు కాకుండా మెల్కీసెదెకులాంటి యాజకుడు రావలసిన అవసరమెందుకు కలిగింది? 12 దేవుడు మన కోసం క్రొత్త యాజకుణ్ణి నియమించాడు కాబట్టి ఆయనకు తగ్గట్టుగా యాజక ధర్మాన్ని కూడా మార్చాడు, 13 ఈ విషయాలు ఎవర్ని గురించి చెప్పబడ్డాయో, ఆయన వేరొక గోత్రపువాడు. ఆ గోత్రానికి చెందినవాళ్ళెవ్వరూ ఎన్నడూ బలిపీఠం ముందు నిలబడి యాజకునిగా పనిచేయ లేదు. 14 మన ప్రభువు యూదా వంశానికి చెందినవాడనే విషయం మనకు స్పష్టమే! ఈ గోత్రపువాళ్ళు యాజకులౌతారని మోషే అనలేదు.

యేసు మెల్కీసెదెకులాంటి యాజకుడు

15 పైగా మెల్కీసెదెకు లాంటి మన ప్రభువు యాజకుడై ఈ విషయం ఇంకా స్పష్టం చేశాడు. 16 మన ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వంశావళిని అనుసరించి యాజకుడు కాలేదు. ఆయన చిరంజీవి గనుక యాజకుడయ్యాడు. 17 ఎందుకంటే, “నీవు మెల్కీసెదెకు క్రమంలో చిరకాలం యాజకుడవై ఉంటావు”(A) అని లేఖనాలు ప్రకటిస్తున్నాయి.

18 పాత నియమం సత్తువ లేనిది, నిరుపయోగమైనది. కనుక, అది రద్దు చేయబడింది. 19 ఆ ధర్మశాస్త్రం ఎవనిలోనూ పరిపూర్ణత కలిగించలేక పోయింది. అందువల్ల దేవుడు మనలో క్రొత్త నిరీక్షణను ప్రవేశపెట్టాడు. ఈ నిరీక్షణ మనల్ని ఆయనకు దగ్గర చేస్తుంది.

20 దీని విషయంలో దేవుడు ప్రమాణం కూడా చేశాడు. మిగతావాళ్ళు యాజకులైనప్పుడు ఎవ్వరూ ప్రమాణం చెయ్యలేదు. 21 కాని యేసు ప్రమాణం ద్వారా యాజకుడైనాడు. ఈయన విషయంలో దేవుడాయనతో ఇలా అన్నాడు:

“ప్రభువు ప్రమాణం చేశాడు.
    తన మనస్సును మార్చుకోడు.
‘నీవు చిరకాలం యాజకుడుగావుంటావు.’”(B)

22 ఈ ప్రమాణం ద్వారా యేసు శ్రేష్ఠమైన క్రొత్త ఒడంబడికకు బాధ్యుడయ్యాడు.

23 ఎందరో యాజకులయ్యారు కాని, చావు వాళ్ళని యాజకులుగా పనిచేయకుండా అడ్డగించింది. 24 కాని యేసు చిరంజీవి గనుక చిరకాలం యాజకుడుగా ఉంటాడు. 25 అందువలన తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళను ఆయన ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ఆయన వాళ్ళ పక్షాన దేవుణ్ణి వేడుకోటానికి చిరకాలం జీవిస్తూ ఉంటాడు.

26 పవిత్రమైన వాడు, ఏ కళంకం లేనివాడు, పరిశుద్ధమైన వాడు, పాపుల గుంపుకు చెందనివాడు, పరలోకంలో ఉన్నత స్థానాన్ని పొందినవాడు, ఇలాంటి ప్రధానయాజకుడై అవసరాన్ని తీరుస్తున్నాడు. 27 ఆయన, ఇతర ప్రధానయాజకులవలె తన పాపాల కొరకు గానీ, ప్రజల పాపాల కొరకు గానీ ప్రతి రోజు బలుల్ని అర్పించవలసిన అవసరం లేదు. ఆయన తనను తానే బలిగా అర్పించుకున్నాడు. అంటే మొదటి బలి, చివరి బలి ఆయనే! 28 ధర్మశాస్త్రం బలహీనులైనవాళ్ళను యాజకులుగా నియమించింది: కాని, ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణం కుమారుణ్ణి ప్రధానయాజకునిగా నియమించింది. అంతేకాక, ఆయన చిరకాలం పరిపూర్ణునిగా చేయబడ్డాడు.

ఆమోసు 1

ఉపోద్ఘాతం

ఇది ఆమోసు వర్తమానం. ఆమోసు తెకోవ నగరానికి చెందిన ఒక పశువుల కాపరి. ఉజ్జియా యూదాకు రాజుగాను, యెహోయాషు కుమారుడు యరొబాము ఇశ్రాయేలుకు రాజుగాను ఉన్న కాలంలో ఆమోసు ఇశ్రాయేలునుగూర్చి దర్శనాలు చూశాడు. ఇది భూకంపం రావటానికి రెండు సంవత్సరాల ముందటి విషయం.

సిరియాకు శిక్ష

ఆమోసు ఇలా అన్నాడు:
“యెహోవా సీయోనులో సింహంలా గర్జిస్తాడు.
    ఆయన గంభీర స్వరం యెరూషలేమునుండి గర్జిస్తుంది.
గొర్రెల కాపరుల పచ్చిక బయళ్లు ఎండిపోతాయి.
    కర్మెలు పర్వతం[a] సహితం ఎండిపోతుంది.”

యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “దమస్కు[b] ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, వారు గిలాదును[c] ధాన్యం రాలగొట్టే ఇనుప కడ్డీలతో నలుగగొట్టారు. కావున హజాయేలు[d] ఇంటిలో (సిరియా) నేను అగ్నిని పుట్టిస్తాను. ఆ అగ్ని బెన్హదదు[e] ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది.

“దమస్కు ద్వారాలమీద ఉన్న బలమైన కడ్డీలను విరుగగొడతాను. ఆవెను లోయలో సింహాసనంపై కూర్చున్నవానిని నేను నాశనం చేస్తాను. బెతేదేనులో రాజదండం పట్టిన రాజును నేను నాశనం చేస్తాను. సిరియా ప్రజలు ఓడింపబడతారు. ప్రజలు వారిని కీరు దేశానికి తీసుకుపోతారు అని యెహోవా చెపుతున్నాడు.”

ఫిలిష్తీయులకు శిక్ష

యెహోవా ఇది చెపుతున్నాడు: “గాజా[f] ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు ఒక దేశ ప్రజలందరినీ చెరబట్టి, వారినిఎదోముకు[g] బానిసలుగా పంపారు. కావున గాజా ప్రాకారం మీదికి నేను అగ్నిని పంపుతాను. గాజాలోని ఉన్నత బురుజులను అగ్ని దహించివేస్తుంది. మరియు నేను అష్టోదులో[h] సింహాసనంపై కూర్చున్నవానిని నాశనం చేస్తాను. అష్కెలోనులో[i] రాజదండం ధరించిన రాజును నేను నాశనం చేస్తాను. నేను ఎక్రోను[j] ప్రజలను నాశనం చేస్తాను. ఇంకా బతికివున్న ఫిలిష్తీయులు అప్పుడు మరణిస్తారు అని దేవుడైన యెహోవా చెపుతున్నాడు.”

ఫెనీషియా (ఫెనీకే)కు శిక్ష

యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “తూరు[k] ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు ఒక దేశ ప్రజలనందరినీ చెరబట్టి, వారిని బానిసలుగా ఎదోముకు పంపారు. తమ సోదరులతో (ఇశ్రాయేలుతో) చేసుకొన్న ఒడంబడికను వారు గుర్తు పెట్టుకోలేదు. 10 అందువల్ల తూరు గోడల మీద నేను అగ్నిని రగుల్చుతాను. తూరులో ఎత్తయిన బురుజులను ఆ అగ్ని నాశనం చేస్తుంది.”

ఎదోమీయులకు శిక్ష

11 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఎదోము ప్రజలు చేసిన అనేక నేరాలకు వారిని నేను నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే ఎదోము కత్తి పట్టి, తన సోదరుని (ఇశ్రాయేలును) వెంటాడాడు. ఎదోము దయ చూపలేదు. ఎదోము కోపం శాశ్వతంగా కొనసాగింది. అతడు ఒక క్రూర జంతువులా ఇశ్రాయేలును చీల్చి చెండాడాడు. 12 కావున తేమానులో[l] నేను అగ్నిని రగుల్చుతాను. ఆ అగ్ని బొస్రాలో[m] ఉన్నతమైన బురుజులను నాశనం చేస్తుంది.”

అమ్మోనీయులకు శిక్ష

13 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “అమ్మోను ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు గిలాదులో గర్భిణీ స్త్రీలను చంపారు. ఆ ప్రాంతాన్ని కలుపుకొని తమ రాజ్యాన్ని విస్తరింపజేయటానికి అమ్మోను ప్రజలు ఈ పని చేశారు. 14 కావున రబ్బా[n] గోడమీద నేను అగ్ని రగుల్చుతాను. అది రబ్బాలోని ఉన్నతమైన బురుజులను నాశనం చేస్తుంది. వారి దేశంలోకి సుడిగాలి వచ్చినట్లు వారికి కష్టాలు వస్తాయి. 15 అప్పుడు వారి రాజులు, నాయకులు పట్టుబడతారు. వారంతా కలిసి చెరపట్టబడతారు అని యెహోవా చెపుతున్నాడు.”

కీర్తనలు. 144

దావీదు కీర్తన.

144 యెహోవా నా దుర్గం.[a] యెహోవాను స్తుతించండి.
    యెహోవా నన్ను యుద్ధానికి సిద్ధం చేస్తాడు.
యెహోవా నన్ను పోరాటానికి సిద్ధం చేస్తాడు.
యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు.
    పర్వతం మీద ఎత్తయిన స్థలంలో యెహోవా నా క్షేమ స్థానం.
యెహోవా నన్ను రక్షిస్తాడు,
    యెహోవా నా కేడెం.
నేను ఆయనను నమ్ముతాను.
    నేను నా ప్రజలను పాలించుటకు యెహోవా నాకు సహాయం చేస్తాడు.
యెహోవా, మనుష్యులు ఎందుకు నీకు ముఖ్యం?
    నీవు మనుష్యకుమారులను ఎందుకు గమనిస్తావు?
మనిషి జీవితం గాలి బుడగలాంటిది.
    వాని జీవితం దాటిపోతున్న నీడలాంటిది.

యెహోవా, ఆకాశం తెరచి దిగి రమ్ము.
    పర్వతాలను తాకు, వాటినుండి పొగ వస్తుంది.
యెహోవా, మెరుపును పంపించి, నా శత్రువులు పారిపోవునట్లు చేయుము.
    నీ బాణాలు వేసి, వారు పారిపోవులట్లు చేయుము.
యెహోవా, ఆకాశంనుండి నీ చేయి చాపి నన్ను రక్షించుము.
    ఈ శత్రు సముద్రంలో నన్ను మునిగి పోనీయకుము.
    ఇతరుల నుండి నన్ను రక్షించుము.
ఈ శత్రువులు అబద్ధీకులు.
    వారు అసత్య విషయాలు చెబుతారు.

యెహోవా, నీవు చేసే ఆశ్చర్యకార్యాలను గూర్చి నేను క్రొత్త కీర్తన పాడగలిగేలా నన్ను రక్షించుము.
    పది తంతుల సితారాతో నిన్ను నేను స్తుతిస్తాను.
10 రాజులు యుద్ధాల్లో జయించుటకు యెహోవా సహాయం చేస్తాడు.
    యెహోవా సేవకుడు దావీదును అతని శత్రువు ఖడ్గాలనుండి ఆయన రక్షించాడు.
11 ఇతరుల చేతినుండి నన్ను రక్షించుము.
    ఈ శత్రువులు అబద్ధీకులు.
    వారు అసత్యాలు చెబుతారు.

12 మన యువ కుమారులు బలమైన పెద్ద వృక్షాల్లా ఉంటారని నేను ఆశిస్తున్నాను.
    మన కుమార్తెలు రాజభవన నిర్మాణానికి చెక్కబడిన మూల స్థంభాలవలె ఉంటారు.
13 మన ధాన్యపు కొట్టాలు అన్ని రకాల పంటలతో
    నిండి ఉంటాయని నేను ఆశిస్తున్నాను.
మన పొలాల్లోని గొర్రెలు వేలకు వేలుగా
    పిల్లల్ని పెడతాయని నేను ఆశిస్తున్నాను.
14     మన బలమైన పశువులు భారమైన బరువులను లాగగలవని నేను ఆశిస్తున్నాను.
శత్రువులు ఎవరూ మన మీద దాడి చేయటానికి రారని నేను ఆశిస్తున్నాను.
    మనం ఎన్నటికీ యుద్ధానికి వెళ్లం అని నేను ఆశిస్తున్నాను.
మన వీధుల్లో ప్రమాదాల కేకలు ఏమీ ఉండవని నేను ఆశిస్తున్నాను.

15 ఆ సంగతులు జరిగినప్పుడు ప్రజలు చాలా సంతోషిస్తారు.
    యెహోవా ఎవరికి దేవుడో ఆ మనుష్యులు చాలా సంతోషిస్తారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International