M’Cheyne Bible Reading Plan
ప్రజలు ధర్మశాస్త్రము వినుట
23 యూదా నాయకులందరిని యెరూషలేము నాయకులను తనను కలుసుకోవలసిందిగా యోషీయా రాజు చెప్పాడు. 2 తర్వాత రాజు యెహోవా యొక్క ఆలయము వద్దకు వెళ్లాడు. యూదాలోని మనష్యులందరు మరియు యెరుషలేములో నివసించేవారు. అతనితో పాటు వెళ్లారు. యాజకులు, ప్రవక్తలు, అందరు మనుష్యులు తక్కువ ప్రాముఖ్యము కలవారి నుండి ఎక్కువ ప్రాముఖ్యం కలవారి వరకు అతనితో పాటు వెళ్లారు. తర్వాత అతను ఒడంబడిక పుస్తకము చదివాడు. ఇది యెహోవా యొక్క ఆలయములో కనిపించిన ధర్మశాస్త్ర గ్రంథము. యోషీయా అందరు వినేటట్లుగా పుస్తకము చదివాడు.
3 రాజు స్తంభం ప్రక్కగా నిలబడి యెహోవాతో ఒడంబడిక కుదుర్చుకొన్నాడు. యెహోవా ఆజ్ఞలను, ఒడంబడికను, అతని నిబంధనలను పాటించడానికి అతను సమ్మతించాడు. హృదయపూర్వకంగా అతను వాటికి సమ్మతించాడు. ఆ పుస్తకంలోని ఒడంబడికను పాటించడానికి సమ్మతించాడు. రాజు ఒడంబడికను తాము అంగీకరిస్తున్నట్టుగా ప్రజలందరు నిలబడ్డారు.
4 తర్వాత ప్రధాన యాజకుడు అయిన హిల్కీయా, ఇతర యాజకులు, ద్వారపాలకులు మొదలైన వారికి రాజు ఆజ్ఞాపించాడు, యెహోవా యొక్క ఆలయము నుండి బయలు అషేరాదేవికి, ఆకాశములోని నక్షత్రాలను గౌరవించేందుకు చేయబడిన అన్ని పాత్రలు తీసుకురమ్మని తర్వాత యోషీయా ఆ వస్తువులను యెరూషలేముకు వెలుపల కిద్రోను లోయలో కాల్చివేశాడు. తర్వాత వారు బూడిదను బెతేలుకు తీసుకువెళ్లారు.
5 యూదా రాజులు కొందరు సామాన్యులను యాజకులుగా ఎంపిక చేశారు. ఆ మనుష్యులు అహరోను వంశానికి చెందినవారు కారు. ఆ అబద్ధపు యాజకులు యూదాలోని ప్రతినగరంలో ఉన్నత స్థానాలలోను యెరూషలేముకు చుట్టుప్రక్కలనున్న పట్టణాలలోను ధూపం వెలిగించారు. వారు బయలునకు సూర్య చంద్రులను, నక్షత్రగణాలను, ఆకాశంలోని అన్ని నక్షత్రాలను గౌరవించేందుకు ధూపం వేసారు. కాని యోషీయా ఆ అబద్ధపు యాజకుల చేతలు ఆపివేశాడు.
6 యోషీయా యెహోవాయొక్క ఆలయము నుండి అషేరా స్తంభము తొలగించాడు. అతను అషేరా స్తంభము యెరూషలేము వెలుపలికి తీసుకువెళ్లి కిద్రోను లోయలో కాల్చివేశాడు. తర్వాత ఆ కాల్చిన వస్తువులను ధూళిగా చేసి, ఆ ధూళిని సామాన్యుల సమాధుల మీద చల్లాడు.
7 తర్వాత యోషీయా రాజు యెహోవా ఆలయంలోని పురుష వ్యభిచారుల ఇండ్లను ధ్వంసము చేశాడు. ఆ ఇండ్లను స్త్రీలు కూడా ఉపయోగించి, అబద్ధపు దేవత అషేరా గౌరవార్థం గుడారపు కప్పులు తయారు చేశారు.
8-9 ఆ సమయాన యాజకులు బలులు యెరూషలేముకు తీసుకురాలేదు; ఆలయములో బలిపీఠం మీద వాటిని నివేదించలేదు. యూదా అంతటా నగరాలలో యాజకులు నివసించారు. ఆ నగరాలలో వారు ఉన్నత స్థానాలలో ధూపము వేసేవారు. బలులు సమర్పించేవారు. ఆ ఉన్నత స్థలాలు గెబానుండి బెయేర్షెబా వరకు అన్ని చోట్ల వుండేవి. మరియు యాజకులు ఆ పట్టణాలలో పులియని రొట్టెను సామాన్యులతో కలిసి తింటూ ఉన్నారు. యెరూషలేములో యాజకులకోసం ప్రత్యేకించబడిన స్థలంలో కాదు. కాని యోషీయా రాజు ఆ ఉన్నత స్థానాలను ధ్వంసము చేసి, యెరూషలేముకు ఆ యాజకులను తీసుకువచ్చాడు. యోషీయా యెహోషువ ద్వారానికి ఎడమ నున్న ఉన్నత స్థానాలను కూడా ధ్వంసము చేశాడు. (యెహోషువ ఆ నగరపు పాలకుడు).
10 అబద్ధపు దేవుడైన మొలెకు గౌరవార్థం ప్రజలు తమ పిల్లలను చంపి బలిపీఠం మీద కాల్చివేసేవారు. ఈ పని బెన్‌హిన్నోము లోయలో తోఫెతు అనేచోట జరిగేది. యోషీయా ఆ స్థలాన్ని ప్రజలు దానిని మరల ఉపయోగించుకొనేందుకు వీలులేనంతగా ధ్వంసము చేశాడు. 11 వెనకటి కాలంలో, యూదా రాజులు యెహోవా యొక్క ఆలయ ప్రవేశద్వారం వద్ద కొన్ని గుర్రాలను, ఒక రథాన్ని ఉంచేవారు. నెతన్మెలకు అనే ముఖ్య అధికారి గదికి దగ్గరగా వుండేది. ఆ గుర్రాలూ, రథమూ సూర్యదేవుని గౌరవార్థం నిలపబడేవి. యోషీయా ఆ గుర్రాలను తొలగించి రథాన్ని కాల్చివేశాడు.
12 వెనుకటి రోజుల్లో, యూదా రాజుల అహాబు భవనం కప్పు మీద బలిపీఠాలు అమర్చారు. మనష్షే రాజు కూడా యెహోవా యొక్క ఆలయము రెండు ప్రాంగణాలలో బలిపీఠాలు నిర్మించాడు. యోషీయా ఆ బలిపీఠాలన్నిటినీ నాశనము చేశాడు. విరిగిపోయిన ముక్కలను కిద్రోను లోయలోకి విసిరివేశాడు.
13 వెనుకటి కాలములో, సొలొమోను రాజు యెరూషలేముకు దగ్గరలో “నాశన పర్వతము” మీద కొన్ని ఉన్నత స్థలాలు నిర్మించాడు. ఆ కొండకు దక్షిణంగా ఆ ఉన్నత స్థలాలు ఉండేవి. ఆ ఉన్నతస్థలాలలో ఒకటి అష్ఠారోతు గౌరవార్థము కట్టబడింది. సీదోను ప్రజలు ఆరాధించే హేయమైన విగ్రహమది. మరియు సొలొమోను రాజు మిలోము గౌరవార్థం ఒక ఉన్నత స్థానము నిర్మించాడు. అమ్మోనీయులు కొలిచే హేయమైన విగ్రహమది. కాని యోషీయా రాజు ఆ ఆరాధనా స్థలాలన్నిటినీ ధ్వంసంచేశాడు. 14 యోషీయా రాజు స్మారక శిలలను పగులగొట్టాడు; అషరా స్తంభాలను విరగగొట్టాడు. తర్వాత అతను ఆ స్థలము మీద చచ్చినవారి ఎముకలను వెదజల్లాడు.
15 యోషీయా బేతేలు వద్ద గల బలిపీఠాన్ని ఉన్నత స్థలమును ధ్వంసము చేశాడు. నెబాతు కొడుకైన యరొబాము ఈ బలిపీఠం నిర్మించాడు. యరొబాము ఇశ్రాయేలుని పాపానికి పాల్పడజేశాడు. యోషీయా బలిపీఠపు శిలలను ముక్కలు ముక్కలుగా చేశాడు. యోషీయా బలిపీఠమును ఉన్నత స్థానమును ధ్వంసము చేశాడు. తర్వాత వాటిని ధూళిగా చేశాడు. మరియు అతను అషేరా స్తంభమును కాల్చివేసెను. 16 యోషీయా చుట్టు ప్రక్కలు చూచెను; కొండమీద సమాధులు కనిపించాయి అతను మనుష్యులను పంపాడు. వారు ఆ సమాధులనుండి ఎముకలు తీసుకువాచ్చారు. తర్వాత బలిపీఠం మీద ఆ ఎముకలను కాల్చాడు. ఈ విధంగా యోషీయా బలిపీఠాన్ని అపవిత్రము చేశాడు. దైవజనుడు ప్రకటించెనని యెహోవా యొక్క సందేశం తెలిపినట్లుగా ఇది జరిగింది. యరొబాము బలిపీఠం ప్రక్కగా నిలబడినప్పుడు దైవజనుడు ఇది ప్రకటించాడు.
తర్వాత యోషీయా చుట్టుప్రక్కల చూశాడు. దైవజనుడి సమాధి చూశాడు.
17 “నేను చూస్తున్న సమాధి ఏమిటి?” అని యోషీయా అడిగాడు.
“యూదానుంచి వచ్చిన దైవజనుని సమాధి ఇది. బేతేలులోని బలిపీఠానికి నీవు చేసిన పనులను ఈ దైవజనుడు చెప్పాడు. ఈ విషయాలను అతను చాలా కాలము క్రిందటనే సూచించాడు” అని ఆ నగర ప్రజలు చెప్పారు.
18 “దైవజనుడను ఒంటరిగా విడిచిపెట్టండి, అతని ఎముకలను కదిలించకండి” అని యోషీయా చెప్పాడు. అందువల్ల వారు అతని ఎముకలు విడిచిపెట్టారు. షోమ్రోను నుంచి వచ్చిన దైవజనుని ఎముకలు కూడా విడిచిపెట్టారు.
19 యోషీయా షోమ్రోను నగరాలలోని ఉన్నత స్థలాలలో వున్న అన్ని ఆలయాలను కూడా ధ్వంసము చేశాడు. ఇశ్రాయేలు రాజులు ఆ ఆలయాలను నిర్మించారు. అది యెహోవాను ఆగ్రహాపరిచింది. యోషీయా బేతేలులోని ఆరాధనాస్థలాలను ధ్వంసము చేసినట్లుగా, ఆ ఆలయాలను కూడా ధ్వంసము చేశాడు.
20 యోషీయా షోమ్రోనులోని ఉన్నత స్థలాలకు చెందిన యాజకులందరినీ చంపివేశాడు. ఆ బలిపీఠముల మీద ఆ యాజకులను చంపాడు. బలిపీఠముల మీద మనుష్యుల ఎముకలు కాల్చాడు. ఈ విధంగా అతను ఆ ఆరాధనా స్థలాలను పాడుచేశాడు. తర్వాత అతను యెరుషలేముకు మరలి వెళ్లాడు.
యూదా ప్రజలు పస్కా పండుగను ఆచరించుట
21 తర్వాత యోషీయా రాజు ప్రజలందరకు ఒక ఆజ్ఞ విధించాడు. “మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించండి. ఒడంబడిక పుస్తకంలో వ్రాయబడినట్లుగా జరపండి” అని అతను చెప్పాడు.
22 న్యాయాధిపతులు ఇశ్రాయేలుని పరిపాలించిన నాటినుంచి ప్రజలు ఈ విధంగా ఆ ఉత్సవము జరపలేదు. ఇశ్రాయేలు రాజులుగాని, యూదా రాజులుగాని పస్కా పండుగను అంత బ్రహ్మాండంగా ఆచరించి వుండలేదు. 23 యోషీయా రాజయిన 18వ సంవత్సరాన యెరూషలేములో యెహోవాకు ఈ ఉత్సవము జరిపారు.
24 కర్ణపిశాచి గలవారిని, సొదె చెప్పువారిని, గృహదేవతలను, విగ్రహాలను, యూదా యెరూషలేములోనున్న ప్రజలు పూజించే ఆ భయంకర వస్తువులను యోషీయా నాశనము చేశాడు. హిల్కీయా యాజకుడు యెహోవాయొక్క ఆలయములో కనుగొన్న ధర్మశాస్త్రములోని నియమాలను పాటించేందుకు యోషీయా ఈ విధముగా చేశాడు.
25 అంతకు ముందు యోషీయా వంటి రాజు లేడు. యోషీయా పూర్ణహృదయముతో, పూర్ణ ఆత్మతో శక్తినంతా కూడాగట్టుకుని యెహోవా వైపు నిలిచాడు. యోషీయా వలె మోషే ధర్మశాస్త్రాన్ని ఏ రాజు పాటించి వుండలేదు. ఆ తర్వాత కూడా యోషీయా వంటి మరొక రాజు లేడు.
26 కాని యూదా ప్రజలపట్ల యెహోవా తన ఆగ్రహాన్ని మానలేదు. మనష్షే చేసిన అన్ని పనులకు యెహోవా వారిపట్ల కోపముగా వున్నాడు. 27 “ఇశ్రాయేలు ప్రజలు తమ దేశాన్ని బలవంతంగా వీడునట్లుగా నేను చేశాను. యూదాకు కూడా ఇలాగే చేస్తాను. నా దృష్టినుండి యూదాని మరలిస్తాను. నేను యెరూషలేమును అంగీకరించను. అవును. నేను నగరాన్ని ఏర్పరచుకున్నాను. నేను మాటలాడేటప్పుడు యెరూషలేము గురించి నేను ఇలా అన్నాను: ‘నా పేరు అక్కడ వుంటుంది’ అని. కాని నేను ఆ ప్రదేశంలో వున్న ఆలయాన్ని ధ్వంసము చేస్తాను” అని యెహోవా చెప్పాడు.
28 యోషీయా చేసిన ఇతర పనులు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథములో వ్రాయబడివున్నవి.
యోషీయా మరణం
29 యెషీయా పరిపాలనా కాలంలో ఈజిప్టు రాజైన ఫరోనెకో యూఫ్రటీసు నది వద్ద అష్షూరు రాజుమీదికి దండెత్తి పోయెను. మెగిద్దోలో ఫరో యోషీయాను కలుసుకోడానికి వెళ్లాడు. ఫరో యోషీయాను చూసి, అతనిని చంపాడు. 30 యోషీయా అధికారులు అతని దేహాన్ని రథము మీద వుంచి మెగిద్డోనుంచి యెరూషలేము వరకు మోసుకుపోయారు. వారు యోషీయాను అతని సమాధిలో సమాధి చేశారు.
తర్వాత సామాన్యులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును అభిషేకించారు. వారు యెహోయాహాజును తమ క్రొత్త రాజుగా చేసుకున్నారు.
యెహోయాహాజు యూదా రాజుగా నియమింపబడుట
31 యెహోయాహాజు రాజగు నాటికి, అతను 23 యేండ్లవాడు. యెరూషలేములో అతను మూడు నెలలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. ఆమె లిబ్నాకి చెందిన యిర్మీయా కుమార్తె. 32 యెహోయాహాజు యెహోవా తప్పు అని చెప్పిన పనులు చేశాడు. తన పూర్వీకులు చేసిన ఆ పనులనే యెహోయాహాజు చేశాడు.
33 ఫరోనెకో హమాతు దేశములో రిబ్లా చెరసాలలో యెహోయాహాజును బంధించాడు.
34 అందువల్ల యెహోయాహాజు యెరూషలేములో పరిపాలించలేకపోయాడు. ఫరోనెకో 7,500 తులాల వెండిని, 75 పౌన్ల బంగారమును యూదా కట్టునట్లుగా చేశాడు. ఫరోనెకో యోషీయా కుమారుడైన ఎల్యాకీమును కొత్త రాజుగా చేశాడు. ఫరోనెకో ఎల్యాకీము పేరుని యెహోయాకీము అని మార్చాడు. మరియు ఫరోనెకో ఎల్యాకీము యెహోయాహాజుని ఈజిప్టుకు తీసుకుని పోయాడు. యెహోయాహాజు ఈజిప్టులో మరణించాడు. 35 యెహోయాకీము వెండి బంగారాలు ఫరోనెకోకి ఇచ్చాడు. కాని యెహోయాకీము ప్రజలచేత పన్నులు కట్టింపజేసి, ఆ ధనాన్ని ఫరోనెకోకి ఇచ్చాడు. అందువల్ల ప్రతి వ్యక్తి తనవంతు వెండిని, బంగారాన్ని ఇచ్చాడు. మరియు యెహోయాకీము రాజు ఆ ధనాన్ని ఫరోనెకోకి ఇచ్చాడు.
36 యెహోయాకీము రాజగునాటికి, అతను 25 యేండ్లవాడు. అతను యెరూషలేములో 11 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు జెబూదా. ఆమె రూమాకి చెందిన పెదాయా కుమార్తె. 37 యెహోవా తప్పు అని చెప్పిన కార్యములు యెహోయాకీము చేసాడు. తన పూర్వికులు చేసిన పనులే యెహోయాకీము చేశాడు.
5 ఆధ్యాత్మిక విషయాల్లో, తమ పక్షాన పని చెయ్యటానికి ప్రజలు తమ నుండి ప్రధాన యాజకుని ఎన్నుకొంటారు. పాప పరిహారార్థం అర్పించే కానుకల్ని, బలుల్ని దేవునికి యితడు సమర్పిస్తాడు. 2 ఇతనిలో కూడా ఎన్నో రకాల బలహీనతలు ఉంటాయి కనుక, అజ్ఞానంతో తప్పులు చేస్తున్న ప్రజల పట్ల యితడు సానుభూతి కనుబరుస్తాడు. 3 ఈ కారణంగానే, ప్రజల పాపాలకు బలిని అర్పించినట్లే తన పాపాలకు కూడా బలిని అర్పించవలసి వుంటుంది.
4 ప్రధాన యాజకుని స్థానం గౌరవనీయమైంది. ఆ స్థానాన్ని ఎవ్వరూ, స్వయంగా ఆక్రమించలేరు. దేవుడు అహరోనును పిలిచినట్లే ఈ స్థానాన్ని ఆక్రమించటానికి అర్హత గలవాణ్ణి పిలుస్తాడు. 5 క్రీస్తు ప్రధాన యాజకుని యొక్క గౌరవ స్థానాన్ని స్వయంగా ఆక్రమించలేదు. దేవుడాయనతో,
“నీవు నా కుమారుడవు.
నేడు నేను నీకు తండ్రినయ్యాను”(A)
అని చెప్పి మహిమ పరచాడు. 6 మరొక చోట, ఇలా అన్నాడు:
“నీవు మెల్కీసెదెకు వలె చిరకాలం
యాజకుడవై ఉంటావు.”(B)
7 యేసు తాను భూమ్మీద జీవించినప్పుడు తనను చావునుండి రక్షించగల దేవుణ్ణి కళ్ళనిండా నీళ్ళు పెట్టుకొని పెద్ద స్వరంతో ప్రార్థించి వేడుకొన్నాడు. ఆయనలో భక్తి, వినయం ఉండటంవల్ల దేవుడాయన విన్నపం విన్నాడు. 8 యేసు దేవుని కుమారుడైనా, తాననుభవించిన కష్టాల మూలంగా విధేయతతో ఉండటం నేర్చుకొన్నాడు. 9 పరిపూర్ణత పొందాక, తన పట్ల విధేయతగా ఉన్నవాళ్ళందరికీ శాశ్వతమైన రక్షణ ప్రసాదించ గలవాడయ్యాడు. 10 దేవుడు మెల్కీసెదెకు యొక్క క్రమంలో యేసును ప్రధాన యాజకునిగా నియమించాడు.
మీరింకా పసికందులు
11 ఈ విషయాన్ని గురించి మేము చెప్పవలసింది ఎంతో ఉంది. కాని మీలో గ్రహించే శక్తి తక్కువగా ఉండటంవల్ల, విడమర్చి చెప్పటానికి చాలా కష్టమౌతుంది. 12 నిజం చెప్పాలంటే, మీకిదివరకే భోధించి ఉండవలసింది. కాని దైవసందేశంలోని ప్రాథమిక సత్యాలను మీకు మళ్ళీ నేర్పించవలసిన అవసరం కలుగుతోంది. అంటే, మీరు పాలు త్రాగగలరు కాని, ఆహారం తినగల శక్తి మీకింకా కలుగలేదు. 13 పాలతో జీవించేవాళ్ళు యింకా పసికందులే కనుక వాళ్ళకు మంచి చెడులను గురించి తెలియదు. 14 కాని, ఆహారం ఎదిగినవాళ్ళు తినగలుగుతారు. అంటే, వాళ్ళు జీవితానికి అలవాటు పడి మంచి చెడులను గుర్తించటంలో నేర్పు సంపాదించారన్న మాట.
రాబోతున్న యెహోవా దినం
2 సీయోనులో బూర ఊదండి.
నా పవిత్ర పర్వతంమీద హెచ్చరికగా కేకవేయండి.
దేశంలో నివసించే ప్రజలందరూ భయంతో వణుకుదురు గాక.
యెహోవా ప్రత్యేకదినం వస్తుంది.
యెహోవా ప్రత్యేకదినం సమీపంగా ఉంది.
2 అది ఒక చీకటి దుర్దినంగా ఉంటుంది.
అది అంధకారపు మేఘాలు కమ్మిన దినంగా ఉంటుంది.
సూర్యోదయాన సైన్యం పర్వతాలలో నిండి ఉండటం నీవు చూస్తావు.
అది మహాశక్తిగల సైన్యంగా ఉంటుంది.
ఇంతకుముందు ఇలాంటిది ఏదీ, ఎన్నడూ ఉండలేదు.
మరియు ఇలాంటిది ఏదీ, ఎన్నటికీ మరోసారి ఉండదు.
3 మండుచున్న అగ్నిలా సైన్యం దేశాన్ని నాశనం చేస్తుంది.
వారి ఎదుట దేశం ఏదెను వనంలా ఉంది.
వారి వెనుక దేశం ఖాళీ ఎడారిలా ఉంది.
ఏదీ వారినుండి తప్పించుకోలేదు.
4 వారు గుఱ్ఱాల్లా కనబడతారు.
యుద్ధ గుఱ్ఱాల్లావారు పరుగెత్తుతారు.
5 వారి మాట వినండి.
అది పర్వతాలమీద రథాలు
పరుగులెత్తిన ధ్వనిలా ఉంది.
అది పొట్టును కాల్చివేస్తోన్న
అగ్నిజ్వాలల శబ్దంలా ఉంది.
వారు శక్తిగల ఒక జనం.
వారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు.
6 ఈ సైన్యం ఎదుట ప్రజలు భయంతో వణకుతారు.
వారి ముఖాలు భయంతో తెల్లబడి పోతాయి.
7 ఆ సైనికులు వేగంగా పరుగెత్తుతారు.
ఆ సైనికులు గోడలు ఎక్కుతారు.
ప్రతి సైనికుడూ తిన్నగా ముందుకు దూసుకొనిపోతాడు.
వారు వారి మార్గంనుండి తప్పుకోరు.
8 వారు ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాడరు.
ప్రతి సైనికుడూ తన సొంత దారిలో నడుస్తాడు.
ఒక సైనికుడు దెబ్బ తగిలి పడిపోతే మిగిలిన వారు
ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు.
9 వారు పట్టణానికి పరుగెత్తుతారు.
వారు త్వరగా గోడ ఎక్కుతారు.
వారు ఇండ్లలోనికి ఎక్కిపోతారు.
వారు ఒక దొంగలా కిటికీల్లో నుండి ప్రవేశిస్తారు.
10 వారి ఎదుట భూమి, ఆకాశం వణుకుతాయి.
సూర్యుడు, చంద్రుడు చీకటి అవుతాయి. మరియు నక్షత్రాలు ప్రకాశించటం మాని వేస్తాయి.
11 యెహోవా తన సైన్యాన్ని గట్టిగా పిలుస్తాడు.
ఆయన విడిది చాలా విశాలమైంది.
ఆ సైన్యం ఆయన ఆదేశాలకు లోబడుతుంది.
ఆ సైన్యం చాలా శక్తిగలది. యెహోవా ప్రత్యేక దినం ఒక గొప్ప భయంకర దినం. ఏ మనిషీ దానిని ఆపు చేయలేడు.
ప్రజలు మార్పు చెందాలని యెహోవా చెప్పుట
12 ఇది యెహోవా సందేశం:
“ఇప్పుడు మీ పూర్ణహృదయంతో నా దగ్గరకు తిరిగిరండి.
మీరు చెడ్డ పనులు చేసారు.
ఏడువండి, ఏడువండి. భోజనం ఏమీ తినకండి.
13 మీ వస్త్రాలు కాదు
మీ హృదయాలు చింపుకోండి.”
మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి రండి.
ఆయన దయ, జాలిగలవాడు.
ఆయన త్వరగా కోపపడడు.
ఆయనకు ఎంతో ప్రేమఉంది.
ఒక వేళ ఆయన తలపెట్టిన చెడ్డ శిక్ష విషయంలో
ఆయన తన మనస్సు మార్చుకొంటాడేమో.
14 ఒకవేళ యెహోవా తన మనస్సు మార్చుకొంటాడేమో ఎవరికి తెలుసు.
మరియు ఒకవేళ ఆయన తన వెనుక నీ కోసం ఒక ఆశీర్వాదం విడిచి పెడతాడేమో.
అప్పుడు నీవు నీ యెహోవా దేవునికి
ధాన్యార్పణం, పానీయార్పణం అర్పించవచ్చు.
యెహోవాను ప్రార్థించు
15 సీయోనులో బూర ఊదండి.
ఒక ప్రత్యేక ఉపవాస సమయం ఏర్పాటు చేయండి.
16 ప్రజలను సమావేశం చేయండి.
ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి.
పెద్దవాళ్లను సమావేశపరచండి.
చిన్న పిల్లలను, తల్లుల స్తనములను ఇంకా కుడిచే చిన్న శిశువులను సహితం సమావేశపరచండి.
పెండ్లికుమార్తెను, ఆమె పెండ్లికుమారున్ని
వారి పడకగదినుండి బయటకు రప్పించండి.
17 యాజకులను, యెహోవా సేవకులను
మండపానికి బలిపీఠానికి మధ్య విలపించనివ్వండి
ఆ ప్రజలందరూ ఈ విషయాలు చెప్పాలి: “యెహోవా, నీ ప్రజలను కరుణించు.
నీ ప్రజలను సిగ్గుపడనియ్యకు.
నీ ప్రజలనుగూర్చి ఇతరలను హేళన చేయనియ్యకు.
ఇతర దేశాల్లోని ప్రజలు నవ్వుతూ
‘వారిదేవుడు ఎక్కడ?’ అని చెప్పనియ్యకు.”
యెహోవా దేశాన్ని మరల ఇచ్చివేస్తాడు
18 అప్పుడు యెహోవా ఈ దేశాన్నిగూర్చి ఉద్వేగపడ్డాడు.
తన ప్రజల విషయం ఆయన విచార పడ్డాడు.
19 యెహోవా తన ప్రజలతో మాట్లాడాడు.
ఆయన చెప్పాడు, “నేను మీకు ధాన్యం, ద్రాక్షారసం, నూనె పంపిస్తాను.
అవి మీకు సమృద్ధిగా ఉంటాయి.
రాజ్యాల మధ్య నేను మిమ్మిల్ని ఇంకెంత మాత్రం అవమానించను.
20 లేదు. ఆ ఉత్తరపు ప్రజలను మీ దేశంనుండి వెళ్ళగొడతాను.
ఎండిపోయిన ఖాళీ దేశానికి వారు వెళ్ళేటట్టు నేను చేస్తాను.
వారిలో కొందరు తూర్పు సముద్రానికి వెళ్తారు.
మరి కొందరు పడమటి సముద్రానికి వెళ్తారు.
ఆ ప్రజలు అంత భయంకరమైన పనులు చేశారు.
కాని వారు చచ్చి కుళ్ళిపోతున్న దానిలా ఉంటారు.
అక్కడ భయంకరమైన కంపు కొడుతుంది!”
దేశం మరల కొత్తదిగా చేయబడుతుంది
21 దేశమా, భయపడకు.
సంతోషించి ఆనందంతోనిండి ఉండు.
ఎందుకంటే యెహోవా గొప్పకార్యాలు చేస్తాడు.
22 పొలంలోని పశువులారా, భయపడవద్దు.
అరణ్యపు బీళ్ళు మరలా గడ్డి మొలిపిస్తాయి.
చెట్లు ఫలాలు ఫలిస్తాయి.
అంజూరపు చెట్లు, మరియు ద్రాక్షావల్లులు మరిన్ని ఫలాలు ఫలిస్తాయి.
23 కనుక, సీయోను ప్రజలారా, సంతోషించండి.
మీ యెహోవా దేవునియందు ఆనందంగా ఉండండి.
ఎందుకంటే ఆయన తన మంచితనాన్ని చూపి వర్షం కురిపిస్తాడు.
ఇదివరకటివలె ఆయన మీకు తొలకరి వర్షాలు, కడపటి వర్షాలు కురిపిస్తాడు.
24 మరియు కళ్లాలు గోధుమలతో నిండిపోయి ఉంటాయి.
క్రొత్త ద్రాక్షారసం మరియు ఒలీవ నూనె సీసాలలో పొర్లిపోతూంటాయి.
25 “నేనే యెహోవాను, నా సైన్యాన్ని మీకు విరోధంగా పంపించాను.
ఆ దండు మిడుతలు, ఆ దూకుడు మిడుతలు, ఆ వినాశ మిడుతలు
మరియు ఆ కోత మిడుతలు మీ పంటను తినివేశాయి.
కాని నేనే యెహోవాను, ఆ కష్టకాల సంవత్సరాలన్నింటికీ
తిరిగి మీకు నేను చెల్లిస్తాను.
26 అప్పుడు మీకు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది.
మీరు తృప్తిగా ఉంటారు.
మీ యెహోవా దేవుని నామం మీరు స్తుతిస్తారు.
మీకోసం అయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
నా ప్రజలు తిరిగి ఎన్నటికి సిగ్గుపరచబడరు.
27 ఇశ్రాయేలు ప్రజలకు నేను తోడుగా ఉన్నానని మీరు తెలుసుకొంటారు.
మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొంటారు.
మరో దేవుడు ఎవ్వరూ లేరు.
నా ప్రజలు తిరిగి ఎన్నడూ సిగ్గుపడరు.”
యెహోవా ప్రజలందరికీ తన ఆత్మను ఇస్తాడు
28 “దీని తరువాత
ప్రజలందరిమీద నా ఆత్మను కుమ్మరిస్తాను (ఇస్తాను).
మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు.
మీ ముసలివాళ్ళు కలలు కంటారు.
మీ యువకులు దర్శనాలు చూస్తా రు.
29 ఆ సమయంలో నా సేవకులమీద,
సేవకురాండ్రమీద కూడ నా ఆత్మను కుమ్మరిస్తాను (ఇస్తాను).
30 ఆకాశంలోను, భూమిమీదను ఆశ్చర్యకార్యాలు నేను చూపిస్తాను.
రక్తం, అగ్ని, దట్టమైన పొగ ఉంటాయి.
31 సూర్యుడు చీకటిగా మార్చబడతాడు.
చంద్రుడు రక్తంగా మార్చబడతాడు.
అప్పుడు యెహోవాయొక్క
మహా భయంకర దినం వస్తుంది!
32 అప్పుడు యెహోవా నామాన్ని స్మరించే ఏ వ్యక్తి అయినా సరే రక్షింపబడతాడు.
సీయోను కొండమీద యెరూషలేములో రక్షింపబడిన మనుష్యులు ఉంటారు.
ఇది సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరుగుతుంది.
మిగిలిన వారిలో
యెహోవా పిలిచినవారు ఉంటారు.
దావీదు ధ్యాన గీతం. అతడు గుహలో ఉన్నప్పటి ప్రార్థన.
142 సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడతాను.
యెహోవాను నేను ప్రార్థిస్తాను.
2 నా సమస్యలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
నా కష్టాలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
3 నా శత్రువులు నా కోసం ఉచ్చు పెట్టారు.
నా ప్రాణం నాలో మునిగిపోయింది.
అయితే నాకు ఏమి జరుగుతుందో యెహోవాకు తెలుసు.
4 నేను చుట్టూరా చూస్తే నా స్నేహితులు ఎవ్వరూ కనిపించలేదు.
పారిపోవుటకు నాకు స్థలం లేదు.
నన్ను రక్షించటానికి ఏ మనిషీ ప్రయత్నం చేయటం లేదు.
5 కనుక సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడుతున్నాను.
యెహోవా, నీవే నా క్షేమ స్థానం.
యెహోవా, నీవు నన్ను జీవింపనియ్యగలవు.
6 యెహోవా, నా ప్రార్థన విను.
నీవు నాకు ఎంతో అవసరం.
నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
నాకంటే ఆ మనుష్యులు చాలా బలంగల వాళ్లు.
7 ఈ ఉచ్చు తప్పించుకొనేందుకు నాకు సహాయం చేయుము.
యెహోవా, అప్పుడు నేను నీ నామాన్ని స్తుతిస్తాను.
నీవు నన్ను రక్షిస్తే మంచి మనుష్యులు సమావేశమై,
నిన్ను స్తుతిస్తారని నేను ప్రమాణం చేస్తాను.
© 1997 Bible League International