M’Cheyne Bible Reading Plan
యూదాలో అహాజు రాజు అగుట
16 యోతాము కుమారుడైన అహాజు యూదాకు రాజయ్యాడు. రెమల్యా కుమారుడైన పెకహు ఇశ్రాయేలుకు రాజుగా వున్న 17వ సంవత్సరమున అది జరిగింది. 2 అహాజు రాజయ్యేనాటికి, అతను 20 యేండ్లవాడు. యోరూషలేములో అహాజు 16 సంవత్సరాలు పరిపాలించాడు. యెహోవా చేయుమని చెప్పిన పనులు అహాజు చేయలేదు. తన పూర్వికుడైన దావీదు దేవునికి విధేయుడు. కానీ తన పూర్వీకులవలె అహాజు యెహోవాకి విధేయత చూపలేదు. 3 అహాజు ఇశ్రాయేలు రాజులవలె నివసించాడు. అతను తన కుమారుని కూడా అగ్నిలో బలిగా అర్పించాడు. ఇశ్రాయేలు వారు వచ్చినప్పుడు యెహోవా విడిచి వెళ్లుటకు కారణమైన ఆ జనాంగములు చేసిన భయంకర పాపాలను అతను అనుసరించాడు. 4 అహాజు బలులు అర్పిస్తూ ఉన్నత స్థలాలలో ధూపం వేసాడు; కొండల మీద ప్రతి పచ్చని చెట్టు క్రిందను వెలిగించాడు.
5 సిరియా రాజయిన రెజీను రెమల్యా కుమారుడు మరియు ఇశ్రాయేలు రాజయిన పెకహు యెరూషలేముకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి వచ్చారు. రెజీను పెకహు కలిసి అహాజుని చుట్టుముట్టారు; కాని ఓడించలేకపోయారు. 6 ఆ సమయంలో సిరియా రాజయిన రెజీను సిరియా కోసం ఏలతును తిరిగి పొందాడు. ఏలతులో నివసించే యూదా వారినందరిని రెజీను తీసుకుపోయాడు. ఏలతులో స్థిరపడిన సిరియనులు నేటికీ అక్కడే నివసిస్తున్నారు.
7 అష్షూరు రాజయిన తిగ్లత్పిలేసెరు వద్దకు అహాజు దూతలను పంపాడు. సందేశం ఏమనగా: “నేను మీ సేవకుడను. నేను మీకు కుమారునివంటి వాడను. సిరియా రాజు, ఇశ్రాయేలు రాజుల నుండి నన్ను మీరు కాపాడవలెను. వారు నాతో యుద్ధం చేయడానికి వచ్చారు.” 8 యెహోవా ఆలయంలోను, రాజభవన నిధులలోను వున్న వెండి బంగారాలను అహాజు తీసుకొని పోయాడు. తర్వాత అహాజు అష్షూరు రాజుకి కానుక పంపాడు. 9 అష్షూరు రాజు అహాజు మాట ఆలకించాడు. అష్షూరు రాజు దమస్కుకు ప్రతికూలంగా యుద్ధానికి పోయాడు. రాజు ఆ నగరాన్ని వశం చేసుకున్నాడు; ప్రజలను బందీలుగా చేసి దమస్కు నుండి కీరుకి తీసుకునిపోయాడు. అతను రెజీనును కూడా చంపివేశాడు.
10 అహాజు రాజు అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరును కలుసుకునేందుకు దమస్కు వెళ్లాడు. దమస్కులో అహాజు బలిపీఠం చూశాడు. అహాజు రాజు దీని నమూనాని పద్దతిని ఊరియా యాజకునికి పంపాడు. 11 తర్వాత యాజకుడయిన ఊరియా దమస్కు నుండి అహాజు రాజు పంపిన నమూనాననుసరించి ఒక బలిపీఠం నిర్మించాడు. దమస్కు నుండి అహాజు రాజు రాకకు పూర్వమే ఊరియా యాజకుడు అదే రకమైన బలిపీఠం నిర్మించాడు.
12 దమస్కు నుండి రాజు రాగానే, అతను బలిపీఠం చూశాడు. ఆ బలిపీఠం వద్ద రాజు బలులు అర్పించాడు. 13 బలిపీఠం మీద అహాజు దహన బలులు ధాన్యార్పణలు అర్పించాడు. అతను పానీయ అర్పణలు, సమాధాన బలులు ఈ బలిపీఠం మీద అర్పించాడు.
14 అహాజు ఆలయం ముందు భాగం నుండి యెహోవా సమక్షంలోవున్న కంచు బలిపీఠం తీసుకున్నాడు. ఈ కంచు బలిపీఠం అహాజు బలిపీఠానికి యెహోవా ఆలయానికి మధ్య వున్నది. తన సొంత బలిపీఠానికి ఉత్తర దిశగా కంచు బలిపీఠం ఉంచాడు. 15 అహాజు ఊరియా యాజకునికి ఆజ్ఞ విధించాడు: “ఉదయపు దహనబలులను, సాయంకాలపు ధాన్యార్పణలను, ఈ దేశంలోని ప్రజల పానీయ అర్పణలకు ఈ పెద్ద బలిపీఠం ఉపయోగించాలి. వండబడిన బలులు దహన బలులు మరి ఇతర బలుల నుండి తీసిన రక్తాన్ని పెద్ద బలిపీఠం మీద చల్లాలి. కాని అవసరము వచ్చినప్పుడల్లా నేను కంచు బలిపీఠం ఉపయోగిస్తాను.” 16 అహాజు రాజు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఊరియా యాజకుడు జరిగించాడు.
17 యాజకులు తమ చేతులు కడుగుకొనేందుకు బళ్ల నిండుగా ఇత్తడి గంగాళాలు, లోతు పళ్లాలు వున్నవి. అహాజు రాజు ఆ గంగాళాలు, లోతు పళ్లెములు తొలగించి బండ్లని ముక్కలు చేశాడు. కంచు స్తంభాల మీద నున్న పెద్ద తొట్టిని తీసివేశాడు. ఆ పెద్ద తొట్టిని చదును చేయబడిన రాయిపై వుంచాడు. 18 ఆలయంలోని ప్రతి భాగంలో సబ్బాతు సమావేశాల కోసం పనివారు మూయబడిన ఒక ప్రదేశం తయారు చేశారు. అహాజు రాజు తన కోసం కప్పియున్న మండపము మరియు వెలుపలి ప్రవేశాన్ని తీసివేశాడు. వాటన్నిటినీ యెహోవా ఆలయంనుంచి అహాజు తీసివేశాడు. అష్షూరు రాజుకోసం అహాజు అవి చేశాడు.
19 అహాజు చేసిన ఆ కార్యాలన్నీ “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. 20 అహాజు మరణించగా అతను దావీదు నగరంలో అతని పూర్వికులతో పాటు సమాధి చేయబడ్డాడు. అహాజు కుమారుడు హిజ్కియా, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.
మంచి బోధ
2 ఉత్తమ సిద్ధాంతాల ప్రకారం సత్యాన్ని అనుసరించమని ప్రజలకు బోధించు. 2 వృద్ధులకు శాంతంగా ఉండమని, గౌరవంగా జీవించుని, ఆత్మనిగ్రహం, సంపూర్ణమైన విశ్వాసం, ప్రేమ, సహనము కలిగి ఉండమని బోధించు.
3 అదే విధంగా వృద్ధ స్త్రీలకు పవిత్రంగా జీవించమని, ఇతర్లను దూషించకూడదని, త్రాగుబోతులు కాకూడదని, మంచిని మాత్రమే ఉపదేశమిమ్మని చెప్పు. 4 అలా చేస్తే వాళ్ళు యౌవన స్త్రీలకు తమ భర్తల్ని, తమ పిల్లల్ని ప్రేమించాలని, 5 ఆత్మనిగ్రహం కలిగి ఉండి పవిత్రంగా జీవించాలని, తమ గృహనిర్వాహక కర్తవ్యాలను పూర్తి చెయ్యాలని, దయను అలవరచుకోవాలని, వారి భర్తలకు విధేయతగా ఉండాలని ఉపదేశించి శిక్షణనిస్తారు. అప్పుడు దైవసందేశాన్ని ఎవ్వరూ విమర్శించరు.
6 అదే విధంగా మనోనిగ్రహం కలిగి ఉండమని యువకులకు బోధించు. 7 నీవు స్వయంగా ఉత్తమ కార్యాలు చేస్తూ వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి. నీవు బోధించేటప్పుడు మనస్పూర్తిగా, గంభీరంగా బోధించు. 8 విమర్శకు గురికాకుండా జాగ్రత్తగా బోధించు. అప్పుడు నీ శత్రువు విమర్శించటానికి ఆస్కారం దొరకక సిగ్గుపడతాడు.
9 బానిసలు తమ యజమానుల యిష్టానుసారం నడుచుకోవాలని బోధించు. తమ యజమానులకు ఆనందం కలిగేటట్లు మసలుకోవాలనీ, వాళ్ళకు ఎదురు తిరిగి మాట్లాడరాదని వాళ్ళకు బోధించు. 10 తమ యజమానులనుండి దొంగిలించరాదనీ, తమ యజమానులు తమను విశ్వసించేటట్లు నడుచుకోవాలనీ బోధించు. అప్పుడే మన రక్షకుడైన దేవుని గురించి నేర్చుకొన్నవి సార్థకమౌతాయి.
11 ఎందుకంటే, మానవులకు రక్షణ కలిగించే దైవానుగ్రహం అందరికి ప్రత్యక్షమైంది. 12 అది నాస్తికత్వాన్ని, ఐహిక దురాశల్ని మానివేయమని బోధిస్తుంది. మనోనిగ్రహం కలిగి, క్రమశిక్షణతో, ఆత్మీయంగా ఈ ప్రపంచంలో జీవించమని బోధిస్తుంది, 13 మనం ఆశిస్తున్న ఆ గొప్ప రోజు వస్తుందని, ఆ రోజున మన దేవుడునూ మన రక్షకుడునూ అయినటువంటి యేసు క్రీస్తు కనిపిస్తాడని నిరీక్షిస్తూ ఉన్నాము. 14 అన్ని పాపాలనుండి మనకు విముక్తి కలగాలని యేసు క్రీస్తు తనను తాను అర్పించుకొన్నాడు. సత్కార్యాలు చెయ్యాలని ఉత్సాహపడుతున్న ఈ ప్రజలు ఈ యేసు క్రీస్తుకు చెందినవాళ్ళు. ఆయన వాళ్ళను తనకోసం పవిత్రంగా చేసాడు.
15 నీవు ఈ విషయాలను బోధించాలి. సంపూర్ణమైన అధికారంతో ప్రజలను ఉత్సాహపరుస్తూ, ఖండిస్తూ, నిన్ను ఎవ్వరూ ద్వేషించకుండా జాగ్రత్త పడు.
పరదేశపు చెరసాలలో దుఃఖం
9 ఇశ్రాయేలూ, రాజ్యాలు సంబరం చేసుకున్నట్టు నీవు చేసుకోవద్దు. సంతోషంగా ఉండకు! నీవు ఒక వేశ్యలాగ ప్రవర్తించి, నీ దేవుణ్ణి విడిచిపెట్టేశావు. ప్రతి కళ్లం మీద నీవు నీ లైంగిక పాపం చేశావు. 2 కానీ ఆ కళ్లములనుండి వచ్చే ధాన్యం, ఇశ్రాయేలీయులకు సరిపడినంత ఆహారం ఇవ్వదు. ఇశ్రాయేలుకు సరిపడినంత ద్రాక్షారసం ఉండదు.
3 ఇశ్రాయేలీయులు యెహోవా దేశంలో నివసించరు. ఎఫ్రాయిము తిరిగి ఈజిప్టుకు వెళ్తుంది. వారు తినకూడని ఆహారం వారు అష్షూరులో తింటారు. 4 ఇశ్రాయేలీయులు ద్రాక్షారసపు అర్పణలు యెహోవాకు అర్పించరు. వారు ఆయనకు జంతువుల బలులు అర్పించరు. వారి బలులు శవసంస్కారమువద్ద తినే భోజనము లాంటిది. ఎవరైతే దాన్ని తింటారో వారు అపరిశుద్ధులవుతారు. వారి రొట్టెలు యెహోవా ఆలయంలోనికి వెళ్లవు-అవి సరిగ్గా వారు బతికి ఉండేందుకు మాత్రమే సరిపోతాయి. 5 వారు (ఇశ్రాయేలీయులు) యెహోవాకు పండుగలు, పవిత్ర దినాలు ఆచరించలేరు.
6 ఇశ్రాయేలీయులకు కలిగినదంతా శత్రువు తీసుకొన్నందువల్ల ఇశ్రాయేలు వదిలిపెట్టబడింది. కాని ఈజిప్టు ఆ ప్రజలను తీసుకొంటుంది. వారిని మెంఫెసు పట్టణం పాతిపెడ్తుంది. వారి వెండి ఐశ్వర్యాల మీద పిచ్చిమొక్కలు మొలుస్తాయి. ఇశ్రాయేలీయులు నివసించినచోట ముళ్లకంపలు పెరుగుతాయి.
నిజమైన ప్రవక్తలను ఇశ్రాయేలు తిరస్కరించుట
7 “ఇశ్రాయేలూ, ఈ విషయాలు తెలుసుకో. శిక్షా సమయం వచ్చింది. నీవు చేసిన చెడుకార్యాలకు నీవు ప్రతిఫలం చెల్లించాల్సిన సమయం వచ్చింది” అని ప్రవక్త చెపుతున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు, “ప్రవక్త బుద్ధిలేనివాడు. దేవుని ఆత్మగల ఈ మనిషి వెర్రివాడు” అని అంటున్నారు. “మీ చెడు పాపాల విషయంలో మీరు శిక్షించబడతారు. మీద్వేషం మూలంగా మీరు శిక్షించబడుతారు” అని ప్రవక్త చెపుతున్నాడు. 8 దేవుడు మరియు ప్రవక్త ఎఫ్రాయిముకు కాపలా కాస్తున్న కావలివంటివారు. కాని మార్గం పొడవునా ఎన్నో ఉచ్చులు ఉన్నాయి. మరియు ప్రజలు ప్రవక్తను అతని దేవుని మందిరంలో కూడ అసహ్యించుకొంటున్నారు.
9 గిబియా కాలంలో వలె, ఇశ్రాయేలీయులు నాశనం లోనికి లోతుగా దిగిపోయారు. ఇశ్రాయేలీయుల పాపాలను యెహోవా జ్ఞాపకం ఉంచుకొంటాడు. వారి పాపాలను ఆయన శిక్షిస్తాడు.
ఇశ్రాయేలు విగ్రహాలను పూజించి పాడవుట
10 “నా మట్టుకైతే ఇశ్రాయేలును చూస్తుంటే, ఎడారిలో ద్రాక్షాపళ్లు చూచినట్టు ఉంది. కాలం మొదట్లో అంజూరపు చెట్లమీద మొదటి పండ్లవంటివారు మీ పూర్వీకులు. అయితే వారు బయల్పెయోరుకు వచ్చారు. వారు మారిపోయారు-వారు ఏదో కుళ్ళిపోయినదానిలా ఉండిరి. వారు తాము ప్రేమించిన దారుణ విషయాల్లాగే (అబద్ధపు దేవుళ్లు) వారూ తయారయ్యారు.
ఇశ్రాయేలీయులకు పిల్లలు లేకుండుట
11 “ఒక పిట్టలాగ ఎఫ్రాయిము మహిమ ఎగిరి పోతుంది. ఇక గర్భములు దాల్చుట ఉండదు. పుట్టుకలు ఇక ఉండవు. పిల్లలు ఇక ఉండరు. 12 కానీ ఒకవేళ ఇశ్రాయేలీయులు పిల్లలను పెంచినా, అది సహాయ పడదు. పిల్లలను వారి దగ్గర్నుండి నేను తీసివేస్తాను. నేను వారిని విడిచిపెట్టేస్తాను. వారికి కష్టాలు తప్ప మరేవీ ఉండవు.” 13 ఎఫ్రాయిము తన పిల్లలను బోను లోనికి నడిపిస్తూ ఉండటం నేను చూడగలను. ఎఫ్రాయిము తన పిల్లలను హంతకుని దగ్గరకు తీసికొని వస్తాడు. 14 యెహోవా, నీ ఇష్టం వచ్చినదాన్ని వారికి చేయి. గర్భస్రావాలు అయ్యే గర్భం వారికి ఇవ్వు, పాలు ఇవ్వలేని స్తనాలు వారికి ఇవ్వు.
15 వారి దుర్మార్గం అంతా గిల్గాలులో ఉంది.
అక్కడే నేను వారిని అసహ్యించుకోవటం మొదలు బెట్టాను.
వారు చేసే దుర్మార్గపు పనుల మూలంగా వారిని నా ఇంటినుండి నేను వెళ్ల గొట్టేస్తాను.
ఇంకెంతమాత్రం నేను వారిని ప్రేమించను.
వారి నాయకులు తిరుగుబాటుదారులు.
వారు నాకు విరోధంగా తిరిగారు.
16 ఎఫ్రాయిము శిక్షించబడుతుంది.
వారి వేరు చస్తుంది.
వారికి ఇక పిల్లలు ఉండరు.
వారు పిల్లల్ని కనవచ్చు.
కానీ వారి శరీరాలనుండి పుట్టే ఆ ప్రశస్త శిశువులను నేను చంపేస్తాను.
17 ఆ ప్రజలు నా దేవుని మాట వినలేదు.
కనుక ఆయన వారిని నిరాకరించాడు.
వారు ఇల్లులేని వారుగా, రాజ్యాలలో సంచారం చేస్తారు.
యాత్ర కీర్తన.
126 యెహోవా మమ్మల్ని దేశ బహిష్కరణ నుండి
తిరిగి వెనుకకు తీసుకొని వచ్చినప్పుడు అది ఒక కలలా ఉంది!
2 మేము నవ్వుకుంటున్నాము.
మరియు మేము అకస్మాత్తుగా సంతోషగానాలు పాడటం మొదలుపెట్టేవాళ్లము.
“దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేశాడు.”
3 ఇతర రాజ్యాల ప్రజలు దాన్ని గూర్చి చెప్పుకొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా మాకు ఆశ్చర్యకరమైన పనులు చేశాడు” అని ఆ ప్రజలు చెప్పారు. మేము చాలా ఆనందంగా ఉన్నాము!
4 యెహోవా మేము ఖైదీలముగా ఉన్నాము.
ఇప్పుడు ఎడారిని వికసింప చేసే నీటి ప్రవాహంలా మమ్మల్ని తిరిగి స్వతంత్రులుగా చేయుము.
5 విత్తనాలు నాటేటప్పుడు ఒకడు దుఃఖముగా ఉండవచ్చు,
కాని పంట కూర్చుకొనేటప్పుడు సంతోషంగా ఉంటాడు.
6 అతడు బయట పొలాల్లోనికి విత్తనం మోసికొని పోవునప్పుడు ఏడ్వవచ్చు,
కాని పంటను ఇంటికి తెచ్చునప్పుడు అతడు సంతోషిస్తాడు.
సొలొమోను యాత్ర కీర్తన.
127 ఇల్లు కట్టేవాడు యెహోవా కాకపోయినట్లయితే
కట్టేవాడు తన పనిని వ్యర్థంగా చేస్తున్నట్టు.
పట్టణాన్ని కాపలా కాసేవాడు యెహోవా కాకపోతే
కాపలావాళ్లు వారి సమయం వృధా చేసుకొంటున్నట్టే.
2 నీవు వేకువనే లేవటం, చాలా ఆలస్యంగా పనిచేయటం కేవలం నీవు తినే ఆహారం కోసమే అయితే
నీవు నీ సమయం వృధా చేనుకొంటున్నట్టే.
దేవుడు తనకు ప్రియమైనవాళ్ల విషయం శ్రద్ధ తీసుకొంటాడు.
వారు నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన శ్రద్ధ తీసుకొంటాడు.
3 పిల్లలు యెహోవానుండి లభించే కానుక.
వారు తల్లి గర్భమునుండి వచ్చే బహుమానం.
4 యువకుని కుమారులు, సైనికుని బాణాల సంచిలోని బాణాల్లాంటివారు.
5 తన బాణాల సంచిని కుమారులతో నింపుకొనే వాడు చాలా సంతోషంగా ఉంటాడు.
ఆ మనిషి ఎన్నటికీ ఓడించబడడు. బహిరంగ స్థలాల్లో[a] అతని కుమారులు అతని శత్రువులనుండి అతణ్ణి కాపాడుతారు.
యాత్ర కీర్తన.
128 యెహోవా అనుచరులందరూ సంతోషంగా ఉంటారు.
ఆ ప్రజలు యెహోవా కోరిన విధంగా జీవిస్తారు.
2 నీవు వేటికోసం పని చేస్తావో వాటిలో ఆనందిస్తావు.
ఎవ్వరూ వాటిని నీ వద్దనుండి తీసుకోలేరు. నీవు సంతోషంగా ఉంటావు. మంచి విషయాలు నీకు సంభవిస్తాయి.
3 ఇంట్లో నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిలా ఉంటుంది.
బల్లచుట్టూరా నీ పిల్లలు, నీవు నాటిన ఒలీవ మొక్కల్లా ఉంటారు.
4 యెహోవా తన అనుచరులను నిజంగా ఈ విధంగా ఆశీర్వదిస్తాడు.
5 యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదిస్తాడని నేను ఆశిస్తున్నాను.
నీవు నీ జీవిత కాలమంతా యెరూషలేములో ఆశీర్వాదాలు అనుభవిస్తావని నేను ఆశిస్తున్నాను.
6 నీవు నీ మనుమలను, మనుమరాండ్రను చూచేంతవరకు జీవిస్తావని నేను ఆశిస్తాను.
ఇశ్రాయేలులో శాంతి ఉండునుగాక.
© 1997 Bible League International