M’Cheyne Bible Reading Plan
యూదా మీద అజర్యా పరిపాలన
15 ఇశ్రాయేలు రాజుగా యరొబాము పరిపాలన చేసే 27వ సంవత్సరమున యూదాకు రాజైన అమాజ్యా కుమారుడు అజర్యా రాజయ్యాడు. 2 అతను పరిపాలన ప్రారంభించేనాటికి, అజర్యా 16 సంవత్సరముల వయస్సు గలవాడు. యెరూషలేములో 52 సంవత్సరాలు పరిపాలించాడు. అజర్యా తల్లి పేరు యెరూషలేముకు చెందిన యెకొల్యా. 3 తన తండ్రి అమాజ్యావలె, అజర్యా యెహోవా మంచివని చెప్పిన పనులు చేశాడు. అతని తండ్రి అమాజ్యా చేసిన వాటినే అజర్యా అనుసరించాడు. 4 కాని అతను ఉన్నత స్థానాలను పాడు చేయలేదు. ఈ ఉన్నత స్థలాల్లో[a] ప్రజలింకా బలులు అర్పించుచూ, ధూపం వేయుచుండిరి.
5 యెహోవా అజర్యా రాజును కుష్ఠరోగిగా చేశాడు. అతను మరణించేంత వరకు కుష్ఠరోగియే. అజర్యా విడిగా ఒక ఇంట్లో ఉన్నాడు. రాజు కుమారుడైన యోతాము రాజభవన సంరక్షణలో శ్రద్ధ వహించాడు. ప్రజలను న్యాయ విచారణ చేశాడు.
6 అజర్యా చేసిన ఘనకార్యాలన్నీ “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి. 7 అజర్యా మరణించగా, దావీదు నగరంలో అతని పూర్వీకులతో పాటు సమాధి చేయబడ్డాడు. అజర్యా కుమారుడు యెతాము, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.
ఇశ్రాయేలు మీద జెకర్యా కొద్ది కాలపు పరిపాలన
8 యరొబాము కుమారుడైన జెకర్యా ఇశ్రాయేలులోని షోమ్రోనుపై ఆరు నెలలు పరిపాలించాడు. ఇది యూదా రాజుగా అజర్యా పరిపాలనకు వచ్చిన 38వ సంవత్సరమున జరిగింది. 9 యెహోవా తప్పు అని చెప్పిన పనులు జెకర్యా చేశాడు. అతని పూర్వీకులు చేసిన వాటినే అతను చేసాడు. నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలవల్ల ఇశ్రాయేలును పాపమునకు పాల్పడజేసిన ఆ పాపకార్యాలను అతను ఆపలేదు.
10 యాబేషు కుమారుడైన షల్లూము జెకర్యాకు విరోధంగా కుట్రపన్నాడు. షల్లూము జెకర్యాను ప్రజల ముందర చంపివేశాడు. అతని తర్వాత షల్లూము క్రొత్తగా రాజయ్యాడు. 11 జెకర్యా చేసిన ఇతర పనులన్నీ “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడి వున్నవి. 12 ఈ విధంగా యెహోవా చెప్పినవన్నీ నిజమయ్యాయి. యెహూ యొక్క సంతతిలోని నాలుగు తరాల వారు ఇశ్రాయేలు రాజులుగా ఉందురని యెహోవా చెప్పాడు.
ఇశ్రాయేలు మీద షల్లూము కొద్దికాలము అధికారం చేయుట
13 యాబేషు కుమారుడైన షల్లూము ఇశ్రాయేలుకు రాజయ్యాడు. ఇది యూదా రాజుగా ఉజ్జియా పరిపాలన చేసే 39వ సంవత్సరంలో జరిగింది. షోమ్రోనులో షల్లూము ఒక నెల పరిపాలించాడు.
14 గాదీ కుమారుడైన మెనహేము తిర్సానుండి షోమ్రోనుకు వచ్చాడు. మెనహేము యాబేషు కుమారుడైన షల్లూమును చంపివేశాడు. తర్వాత మెనహేము, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.
15 షల్లూము చేసిన అన్ని పనులు జెకర్యాకు విరుద్ధంగా అతని పథకములతో సహా “ఇశ్రయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడ్డాయి.
ఇశ్రాయేలులో మెనహేము పరిపాలన
16 షల్లూము మరణానంతరం, మెనహేము తిప్సహు ఆ పరిసర ప్రాంతాన్ని ఓడించాడు. అతనికై ప్రజలు నగరద్వారాన్ని తెరవడానికి అంగీకరించలేదు. అందువల్ల మెనహేము వారిని ఓడించాడు. నగరంలోని గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చాడు.
17 అజర్యా యూదా రాజుగా వున్న 39వ సంవత్సరమున, గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలుకు రాజయ్యాడు. షోమ్రోనులో మెనహేము పది సంవత్సరాల పాటు పరిపాలించాడు. 18 యెహోవా చెడ్డవని చెప్పిన పనులు మెనహేము చేశాడు. నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలీయులను పాపాలకు గురిచేసిన ఆ పాపాలను మెనహేము ఆపలేదు.
19 అష్షూరు రాజయిన పూలు ఇశ్రాయేలుకు ప్రతి కూలంగా యుద్ధం చేయడానికి వచ్చాడు. మెనహేము పూలుకు 75,000 పౌన్ల వెండి ఇచ్చాడు. పూలు మెనహేముకి సహాయపడుననీ, మెనహేము రాజ్యాన్ని బలిష్ఠం చేయుననీ అనుకుని అతను అలా చేశాడు. 20 ధనవంతులూ, అధికారం గలవారూ పన్నులు చెల్లించునట్లుగా చేసి మెనహేము డబ్బును వసూలు చేశాడు. మెనహేము ప్రతి వ్యక్తికీ 20 తులాల వెండి పన్నుగా విధించాడు. తర్వాత మెనహేము అష్షూరు రాజుకి ఆ డబ్బు ఇచ్చాడు. అందువల్ల అష్షూరు రాజు ఇశ్రాయేలును విడిచి వెళ్లాడు.
21 మెనహేము చేసిన అన్ని గొప్పకార్యాలు “ఇశ్రాయేలు రాజుల చరితగ్రంథంలో” వ్రా యబడినవి. 22 మెనహేము మరణించగా, అతని పూర్వికులతో పాటు, అతడు సమాధి చేయబడ్డాడు. మెనహేము కుమారుడు పెకహ్యా అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.
ఇశ్రాయేలులో పెకహ్యా పరిపాలనఏ
23 అజర్యా యూదా రాజుగా వున్న 50 వ సంవత్సరమున, మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులోని ఇశ్రాయేలుకు రాజయ్యాడు. పెకహ్యా రెండేండ్లు పాలించాడు. 24 యెహోవా తప్పని చెప్పిన కార్యాలను పెకహ్యా చేశాడు. నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలును పాపకార్యాలకు గురిచేసిన ఆ పాపాలను పెకహ్యా ఆపలేదు.
25 పెకహ్యా సైన్యానికి అధిపతి అయిన పెకహు రెమల్యా కుమారుడు. పెకహు రాజైన పెకహ్యాకు విరోధముగా పన్నాగము చేశాడు. అతనిని షోమ్రోనులోని రాజభవనములో అతను చంపాడు. గిలాదునుంచి వచ్చిన 50 మంది మనుష్యులు పెకహ్యాని చంపేటప్పుడు పెకహుతో పాటువున్నారు. అతని తర్వాత పెకహు క్రొత్తగా రాజయ్యాడు.
26 పెకహ్యా చేసిన అన్ని గొప్పకార్యాలు “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడినవి.
ఇశ్రాయేలులో పెకహు పరిపాలన
27 యూదా రాజుగా అజర్యా వున్న 52వ సంవత్సరమున షోమ్రోనులోని ఇశ్రాయేలుని రెమల్యా కొడుకైన పెకహు పరిపాలించసాగాడు. పెకహు 20 సంవత్సరాలు పరిపాలించాడు. 28 యెహోవా చెడ్డవని చెప్పిన పనులు పెకహు చేశాడు. నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలుని పాపానికి గురిచేసిన ఆ పాపాలను పెకహు ఆపలేదు.
29 అష్షూరు పాలకుడైన తిగ్లత్పిలేసెరు ఇశ్రాయేలుకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి వచ్చాడు. ఇశ్రాయేలు రాజుగా పెకహు వున్న కాలంలో ఇది జరిగింది. తిగ్లత్పిలేసరు, ఈయోను, ఆబేల్బేత్మయకా, హాసోరు, గిలాదు, యానోయహు కెదెషు గలిలయ మరియు నఫ్తాలీ ప్రాంతమంతటినీ స్వాధీనం చేసుకున్నారు. ఈ అన్ని స్థలాలనుండి తిగ్లత్పిలేసరు ప్రజలను బందీలుగా అష్షూరుకు తీసుకు వెళ్లాడు.
30 హోషేయా కొడుకు ఏలా, రెమల్యా కొడుకు పెకహు మీద పన్నాగం పన్నాడు. హోషేయా పెకహును చంపివేశాడు. అప్పుడు హోషేయా పెకహుకు పిదప క్రొత్తగా రాజు అయ్యాడు. ఇది ఉజ్జియా కొడుకు యోతాము యొక్క 20వ సంవత్సరం యూదా పరిపాలనలో జరిగింది.
31 పెకహు చేసిన అన్ని ఘనకార్యములు “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి.
యూదాపై యోతాము పరిపాలన
32 ఉజ్జియా కుమారుడైన యోతాము యూదాకు రాజయ్యాడు. రెమల్యా కొడుకైన పెకహు ఇశ్రాయేలుకు రాజుగా వున్న రెండవ సంవత్సరంలో ఇది జరిగింది. 33 యోతాము రాజయినప్పుడు, అతను 25 యేండ్లవాడు. యోతాము యెరూషలేములో 16 సంవత్సరాలు పాలించాడు. యోతాము తల్లి పేరు యెరూషా. ఆమె సాదోకు కుమార్తె. 34 తన తండ్రి ఉజ్జియావలె, యెహోవా మంచివని చెప్పిన పనులు యోతాము చేశాడు. 35 కాని అతను ఉన్నత స్థలాలను పాడు చేయలేదు. ఈ ఉన్నత స్థలాలలో ప్రజలు నేటికి బలులు అర్పించుచూ ధూపం వేయుచున్నారు. యెహోవా ఆలయానికి గల పై ద్వారమును యోతాము నిర్మించాడు. 36 యోతాము చేసిన అన్ని ఘనకార్యాలు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి.
37 ఆ సమయమున, సిరియా రాజయిన రెజీనును, రెమల్యా కొడుకైన పెకహును యూదాకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి యెహోవా పంపాడు.
38 యోతాము మరణించగా, అతని పూర్వికులతో పాటు అతను అతని పూర్వికుడైన దావీదు పేరు మీదగల నగరంలో సమాధి చేయబడ్డాడు. యోతాము కుమారుడు అహాజు అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.
1 దేవుని సేవకుడును, యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడును అయినటువంటి పౌలు వ్రాయుచున్న పత్రిక. దేవుడు తానెన్నుకున్న ప్రజల విశ్వాసాన్ని దృఢపరచడానికి, వాళ్ళను భక్తి కల్గించే మన సత్యం వైపు మళ్ళించటానికి నన్ను ఎన్నుకొన్నాడు. 2 ఈ సత్యం, అనంత జీవితం లభిస్తుందని విశ్వసించటంపై ఆధారపడి ఉంది. అబద్ధం ఆడని దేవుడు మనకీ జీవితం యిస్తానని కాలానికి ముందే వాగ్దానం చేసాడు. 3 సరియైన సమయానికి దాన్ని తన సందేశం ద్వారా మనకు తెలియచేసాడు. ఈ సందేశం నాకప్పగింపబడింది. మన రక్షకుడైనటువంటి దేవుడు దాన్ని మీకు ప్రకటించమని ఆజ్ఞాపించాడు. కనుక దాన్ని మీకు ప్రకటిస్తున్నాను.
4 మనలో ఉన్న విశ్వాసం మూలంగా నా ప్రియ కుమారునిగా భావిస్తున్న తీతుకు వ్రాయటమేమనగా, మన తండ్రియైన దేవుని నుండి, మన రక్షకుడైన యేసు క్రీస్తునుండి నీకు శాంతి, కృప లభించుగాక!
క్రేతులో తీతు చేయవలసిన పని
5 అసంపూర్ణంగా వదిలి వేయబడిన వాటిని పూర్తి చేయటానికి, నేను ఆదేశించిన విధంగా ప్రతి పట్టణంలో పెద్దలను నియమించటానికి నిన్ను క్రేతులో వదిలి వచ్చాను. 6 క్రీస్తు సంఘంలోనున్న అధ్యక్షుడు నిందారహితుడై, ఏకపత్నీవ్రతుడై ఉండాలి. తన పిల్లలు అవిధేయతగా ఉండక, అవినీతిగా ఉండక, చెడ్డపేరు లేకుండా, విశ్వసించిన వాళ్ళుగా ఉండాలి. 7 సంఘాధ్యక్షుడు దైవకార్యాన్ని నడిపించే బాధ్యత కలవాడు కనుక అతడు నిందారహితుడై ఉండాలి. అతనిలో గర్వము ఉండరాదు. ముక్కోపి కాకూడదు. త్రాగుబోతు కాకూడదు. పోట్లాడరాదు. అధర్మంగా లాభాలు సంపాదించ రాదు. 8 అతిథులను పరామర్శించే వాడైయుండాలి. మంచి పనులు చెయ్యాలి. మనో నిగ్రహం, నీతి, పవిత్రత, క్రమశిక్షణ మొదలగు గుణాలు అతనిలో ఉండాలి. 9 తనకు బోధింపబడిన సందేశాన్ని విశ్వాసంతో ఆచరించాలి. అప్పుడే యితరులకు ఈ గొప్ప సత్యాన్ని చెప్పి వాళ్ళను కూడా ప్రోత్సాహపరచగలడు. ఈ సందేశాన్ని అంగీకరించనివాళ్ళకు వాళ్ళు చేస్తున్న తప్పు చూపగలడు.
10 తాము అవిధేయతగా ఉంటూ, అధికంగా మాట్లాడి నమ్మించాలని ప్రయత్నించే మోసగాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సున్నతి అవసరమని వాదించే యూదులు ఈ విధంగా చేస్తున్నారు. 11 అన్యాయంగా లాభం గడించటానికి బోధించరాని విషయాలు బోధించి కుటుంబాల్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళను ఆపటం అవసరం. 12 “క్రేతీయులు అబద్ధాలాడుతున్నారనీ, క్రూర మృగాల్లాంటివాళ్ళనీ, సోమరిపోతులనీ, తిండి పోతులనీ” క్రేతీయులలో ప్రవక్తలలో ఒకడు అన్నాడు. 13 ఈ సాక్ష్యము నిజము. వాళ్ళను గట్టిగా వారించటం అవసరం. అలా చేస్తే, వాళ్ళ విశ్వాసం దృఢమౌతుంది. 14 అప్పుడు వాళ్ళు యూదుల కల్పిత కథలను మరిచిపోయి, మన సత్యాన్ని నిరాకరించే వాళ్ళ బోధలను లెక్క చెయ్యరు.
15 పవిత్రంగా ఉన్నవాళ్ళకు అన్నీ పవిత్రంగా కనిపిస్తాయి. కాని దుష్టులకు, విశ్వాసం లేనివాళ్ళకు ఏదీ పవిత్రంగా కనిపించదు. వాళ్ళ బుద్ధులు, మనస్సులు చెడుతో నిండి ఉంటాయి. 16 వాళ్ళు తమకు దేవుని గురించి తెలుసునంటారు కాని, వాళ్ళ ప్రవర్తన ఆ దేవుణ్ణి నిరాకరిస్తున్నట్లు చూపిస్తుంది. వాళ్ళు ద్వేషంతో, అవిధేయతతో ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు మంచి పని చేయటానికి అంగీకరించరు.
విగ్రహారాధన నాశనానికి నడుపుతుంది
8 “బూర నీ నోట పెట్టుకొని, హెచ్చరిక చేయి. పక్షిరాజు వ్రాలినట్చు శత్రువు యెహోవా మందిరానికి వస్తాడని ప్రకటించు. ఇశ్రాయేలీయులు నా ఒడంబడికను ఉల్లంఘించారు. వారు నా న్యాయ చట్టానికి విధేయులు కాలేదు. 2 ‘నా దేవా, ఇశ్రాయేలులో ఉన్న మాకు నీవు తెలుసు’ అని వారు అరచి నాకు చెపుతారు. 3 కానీ ఇశ్రాయేలు మంచివాటిని తిరస్కరించింది. అందుచేత శత్రువు అతన్ని తరుముతున్నాడు. 4 ఇశ్రాయేలీయులు తమ రాజులను ఏర్పరచుకొన్నారు. కాని, సలహా కోసం వారు నా దగ్గరకు రాలేదు. ఇశ్రాయేలీయులు నాయకులను ఏర్పరచుకున్నారు. కానీ నేను ఎరిగిన మనుష్యులను వారు ఎన్నుకోలేదు. ఇశ్రాయేలీయులు తమ వెండి, బంగారం ఉపయోగించి వారికోసం విగ్రహాలు చేసుకొన్నారు. కనుక వారు నాశనం చేయబడతారు. 5 షోమ్రోనూ, నీ దూడను (విగ్రహాన్ని) యెహోవా నిరాకరించాడు. ఇశ్రాయేలీయుల మీద నేను చాలా కోపంగా ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు వారి పాపం విషయంలో శిక్షించబడతారు. 6 ఆ విగ్రహాలను ఒక పనివాడు చేశాడు. అవి దేవుళ్లు కావు. సమరయ దూడ ముక్కలుగా విరుగగొట్టబడుతుంది. 7 ఇశ్రాయేలీయులు ఒక మూర్ఖమైన పని చేశారు అది గాలిని నాటుటకు ప్రయత్నించినట్టు ఉంది. కాని వారికి కష్టాలు మాత్రమే కలుగుతాయి. వారు సుడిగాలిని పంటగా కోస్తారు. పొలంలో ధాన్యం పండుతుంది. కానీ అది ఆహారాన్ని ఇవ్వదు. ఒకవేళ దానిలో ఏమైనా పండినా పరాయివాళ్లు దాన్ని తినేస్తారు.
8 “ఇశ్రాయేలు మింగివేయబడింది (నాశనం చేయబడింది).
ఇశ్రాయేలు ఎవరికీ పనికిరాని ఒక పనిముట్టులాగ తయారయ్యింది.
ఇశ్రాయేలు విసిరి వేయబడింది. వారు యితర రాజ్యాలలో చెదరగొట్టబడ్డారు.
9 ఎఫ్రాయిము తన విటుల దగ్గరకు వెళ్లాడు.
అడవి గాడిదలా అతడు తిరుగుతూ అష్షూరు వెళ్లాడు.
10 ఆయా రాజ్యాలలోని తన విటుల దగ్గరకు ఇశ్రాయేలు వెళ్లింది.
కానీ ఇప్పుడు నేను ఇశ్రాయేలీయులను సమకూరుస్తాను.
ఆ మహాశక్తిగల రాజు వారి మీద భారాన్ని వేస్తాడు.
మరియు వాళ్లు ఆ భారంవల్ల కొద్దిగా బాధపడాలి.
ఇశ్రాయేలు దేవున్ని మరచి విగ్రహాలను పూజించుట
11 “ఎఫ్రాయిము ఎన్నెన్నో బలిపీఠాలు కట్టింది.
అవి అతను పాపాలు చేయడానికి ఆధారమయ్యాయి
12 ఎఫ్రాయిము కోసం నేను నా న్యాయచట్టాలు సంపూర్ణంగా వ్రాసినా
అవి ఎవరో పరాయి వాడికోసం అన్నట్టు అతడు వాటిని గూర్చి అనుకొంటాడు.
13 బలులు అంటే ఇశ్రాయేలీయులకు ఇష్టం.
వారు మాంసం అర్పించి, దాన్ని తినేస్తారు.
యెహోవా వారి బలులు స్వీకరించడు.
ఆయనకు వారి పాపాలు జ్ఞాపకమే.
ఆయన వారిని శిక్షిస్తాడు.
వారు ఈజిప్టుకు బందీలుగా కొనిపోబడతారు.
14 ఇశ్రాయేలీయులు నివాసాలు నిర్మించారు.
కానీ వారు తమను చేసిన సృష్టికర్తను మరచిపోయారు. ఇప్పుడు యూదా కోటలు కట్టింది.
కానీ యూదా పట్టణాల మీదికి నేను అగ్నిని పంపిస్తాను.
ఆ అగ్ని దాని రాజభవనాలను నాశనం చేస్తుంది.”
యాత్ర కీర్తన.
123 దేవా, నేను నీవైపు చూచి ప్రార్థిస్తున్నాను.
నీవు పరలోకంలో రాజుగా కూర్చుని ఉన్నావు.
2 బానిసలు వారి అవసరాల కోసం వారి యజమానుల మీద ఆధారపడతారు.
బానిస స్త్రీలు వారి యజమానురాండ్ర మీద ఆధారపడతారు.
అదే విధంగా మేము మా దేవుడైన యెహోవా మీద ఆధారపడతాము.
దేవుడు మా మీద దయ చూపించాలని మేము ఎదురుచూస్తాము.
3 యెహోవా, మా మీద దయ చూపించుము.
మేము చాలాకాలంగా అవమానించబడ్డాము. కనుక దయ చూపించుము.
4 ఆ గర్విష్ఠుల ఎగతాళితో మా ప్రాణం అధిక భారాన్ని పొందింది.
మా హింసకుల తిరస్కారంతో వారు సుఖంగా వున్నారు.
దావీదు యాత్ర కీర్తన.
124 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో?
ఇశ్రాయేలూ, నాకు జవాబు చెప్పుము.
2 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో?
ప్రజలు మనమీద దాడి చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో?
3 అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా
వాళ్లు మనల్ని సజీవంగా మింగేసి ఉండేవాళ్లు.
4 అప్పుడు మన శత్రుసైన్యాలు మనల్ని కొట్టుకుపోయే ప్రవాహంలా,
మనల్ని ముంచివేసే నదిలా ఉండేవి.
5 అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ
మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు.
6 యెహోవాను స్తుతించండి. మన శత్రువులు
మనల్ని పట్టి చంపకుండునట్లు యెహోవా చేశాడు.
7 మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న పక్షిలా ఉన్నాము.
వల తెగిపోయింది. మనం తప్పించుకొన్నాము.
8 మనకు సహాయం యెహోవా దగ్గర నుండే వచ్చింది.
భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
యాత్ర కీర్తన.
125 యెహోవాను నమ్ముకొనేవారు సీయోనుకొండలా ఉంటారు.
వారు ఎన్నటికీ కదలరు.
వారు శాశ్వతంగా కొనసాగుతారు.
2 యెరూషలేము చుట్టూరా పర్వతాలు ఉన్నాయి.
అదే విధంగా యెహోవా తన ప్రజల చుట్టూరా ఉన్నాడు. యెహోవా తన ప్రజలను నిరంతరం కాపాడుతాడు.
3 దుర్మార్గులు మంచి ప్రజల దేశాన్ని శాశ్వతంగా వశం చేసుకోరు.
దుర్మార్గులు అలా చేస్తే అప్పుడు మంచి మనుష్యులు కూడా చెడ్డ పనులు చేయటం మొదలుపెడతారేమో.
4 యెహోవా, మంచి మనుష్యులకు మంచివాడవుగా ఉండుము.
పవిత్ర హృదయాలు గల మనుష్యులకు మంచివాడవుగా ఉండుము.
5 యెహోవా, దుర్మార్గులను నీవు శిక్షించుము.
వాళ్లు వక్రమైన పనులు చేస్తారు.
ఇశ్రాయేలులో శాంతి ఉండనిమ్ము.
© 1997 Bible League International