Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 రాజులు 10

షోమ్రోను నాయకులకు యెహూ ఉత్తరాలు వ్రాయుట

10 షోమ్రోనులో అహాబుకి డెబ్భైమంది కుమారులుండిరి. యెహూ ఉత్తరాలు రాసి యెజ్రెయేలు రాజులకు నాయకులకు వాటిని షోమ్రోనుకు పంపాడు. అహాబు కుమారులను పెంచిన ప్రజలకు కూడా ఆ ఉత్తరాలు అతడు పంపాడు. ఆ ఉత్తరాలలో యెహూ ఇట్లు చెప్పాడు: 2-3 “మీకీ ఉత్తరం చేరగానే, మీ తండ్రి కుమారులలో సర్వశ్రేష్టుడైన వానిని ఎన్నుకోండి. మీకు రథాలు గుర్రాలు వున్నాయి. మీరు బలిష్టమైన నగరంలో ఉంటున్నారు. మీకు ఆయుధాలు కూడా వున్నాయి. మీరెన్నుకున్న అతని కుమారుని తండ్రి సింహాసనం మీద కుర్చోబెట్టండి. తర్వాత మీ తండ్రి వంశం కోసం పోరాడండి.”

కాని యెజ్రెయేలు పరిపాలకులు, నాయకులు చాలా భయపడిపోయారు. “ఆ రాజులిద్దరు (యెహోరాము మరియు అహజ్యా) యెహూని ఆపలేక పోయారు. కనుక మనము కూడా అతనిని ఆపలేము” అని వారు అనుకున్నారు.

అహాబు గృహ సంరక్షకుడు, నగరాన్ని అదుపులో ఉంచిన వాడు, అహాబు పిల్లలను పెంచిన పెద్దలు ప్రజలు యెహూకి ఒక సందేశం పంపారు. “మేము మీ సేవకులం. మీరేమి చెపితే మేమది చేస్తాము. మేమెవరిని రాజుగా చేసుకోవాలి. మీకు ఏది మంచిదిగా తోస్తే అది మాకు చెయ్యండి” అని తెలియజేసారు.

షోమ్రోను నాయకులు అహాబు పిల్లలను చంపుట

తర్వాత యెహూ రెండవ ఉత్తరం ఆ నాయకులకు రాశాడు. “మీరు కనుక నన్ను సమర్థిస్తే నా మాట పాటిస్తే, ఇప్పుడు అహాబు కుమారుల తలలు నరికి వేయండి. రేపు ఈపాటికి వాటిని యెజ్రెయేలులో నా వద్దకు తీసుకురండి” అని యెహూ చెప్పాడు.

అహాబుకి డెబ్భైమంది కుమారులు. వారు తమను పెంచిన నగర నాయకులతో ఉన్నారు. ఈ లేఖను నగర నాయకులు అందుకోగానే, వారు రాజ కుమారులు డెబ్భైమందిని తీసుకొని వెళ్లి చంపివేశారు. తర్వాత నాయకులు రాజ కుమారుల తలలను బుట్టలలో వేసి యెజ్రెయేలులోని యెహూకి ఆ బుట్టలు పంపారు. దూత యెహూని సమీపించి అతనికిది చెప్పాడు: “వాళ్లు రాజకుమారుల తలలు తెచ్చారు!”

తర్వాత యెహూ, “నగర ద్వారం వద్ద ఉదయం వరకు రెండు వరసలలో ఆ తలలు ఉంచండి” అని చెప్పాడు.

ఉదయాన, యెహూ వెలుపలికి వెళ్లి, ప్రజల యెదుట నిలచి వారితో ఇలా అన్నాడు: “మీరు అమాయకులు. చూడండి. నేను నా యజమానికి విరుద్ధంగా పథకాలు వేశాను. నేనతనిని చంపాను. కాని ఆహాబు పిల్లలందరినీ ఎవరు చంపారు? మీరే చంపారు. 10 యెహోవా చెప్పినదంతా జరుగుతుందని మీరు గ్రహించాలి. మరియు యెహోవా అహాబు వంశానికి సంబంధించిన యీ విషయాలు చెప్పేందుకు ఏలీయాని ఉపయెగించాడు. యెహోవా తాను చేస్తానన్న పనులు చేశాడు.”

11 అందువల్ల యెహూ యెజ్రెయేలులో నివసించే అహాబు వంశీయులనందరినీ చంపివేశాడు. యెహూ ముఖ్యులందరినీ, సన్నిహిత మిత్రుల్ని, యాజకులను చంపివేశాడు. అహాబు వంశంలోని వారు ఎవ్వరూ మిగలలేదు.

యెహూ అహజ్యా బంధువులను చంపుట

12 యెహూ యెజ్రెయేలు విడిచి షోమ్రోనుకు వెళ్లాడు. త్రోవలో యెహూ గొర్రెల కాపరులు శిబిరం అనేచోట ఆగాడు. ఆ చోట గొర్రెల కాపరులు గొర్రెల మీద ఉన్నిని కత్తిరిస్తున్నారు. 13 యూదా రాజయిన అహజ్యా యొక్క బంధువులను యెహూ కలుసుకున్నాడు. “ఎవరు మీరు?” అని యెహూ ప్రశ్నించాడు.

వారు, “మేము యూదా రాజయిన అహజ్యా బంధువులము. రాజకుమారులను రాణిగారి పిల్లలను చూసి వెళ్లుదామని వచ్చాము” అని సమాధానం చెప్పారు.

14 తర్వాత యెహూ, “వారిని సజీవులుగా తీసుకువెళ్లండి” అని తన మనుష్యులకు చెప్పాడు.

యెహూ మనుష్యులు అహజ్యా బంధువులను సజీవులుగా పట్టుకున్నారు. వారు నలభై రెండు మంది. బేతెకెదు బావి వద్ద యెహూ వారిని చంపివేశాడు. యెహూ ఒక్కరిని కూడా ప్రాణాలతో వుండనివ్వలేదు.

యెహూ యెహోనాదాబును కలుసుకొనుట

15 అక్కడినుంచి యెహూ వెళ్లిన తర్వాత, అతను రేకాబు కుమారుడైన యెహోనాదాబును కలుసుకున్నాడు. యెహూని కలుసుకోవాలని యెహోనాదాబు వెళ్లుచున్నాడు. యెహూ యెహోనాదాబును అభినందించి, “నేను నీకు నమ్మకస్థుడనైన స్నేహితునివలె, నీవు నాకు నమ్మకస్థుడనైన స్నేహితుడవేనా?” అని అడిగాడు.

“నేను నీకు నమ్మకస్థుడైన స్నేహితుడినే” అని యెహోనాదాబు బదులు చెప్పాడు.

“అలా అయితే, నీ చేయి నాకిమ్ము” అని యెహూ చెప్పాడు.

తర్వాత యెహూ యెహోనాదాబును లాగి తన రథంలోకి ఎక్కించుకున్నాడు.

16 “నాతోపాటురా. యెహోవాపట్ల నా భావాలు ఎంత దృఢంగా ఉన్నాయో చూడవచ్చు” అని యెహూ చెప్పాడు.

అందువల్ల యెహోనాదాబు యెహూ రథంలో వెళ్లాడు. 17 యెహూ షోమ్రోనుకి వచ్చి, అక్కడ ఇంకా సజీవులై వున్న అహాబు వంశీయులందరిని హతమార్చాడు. యెహూవా ఏలీయాతో చెప్పినట్లుగా, యెహూ అన్ని పనులు చేసాడు.

యెహూ బయలును పూజించే వారిని పిలుచుట

18 తర్వాత యెహూ ప్రజలందరినీ సమీకరించాడు. వారితో యెహూ, “అహాబు కొద్దిగా బయలు దేవుని సేవించాడు. కాని యెహూ అనే నేను బయలు దేవునికి ఎక్కువ సేవ చేస్తాను. 19 ఇప్పుడు బయలు దేవుని ప్రవక్తలను యాజకులను అందరినీ పిలవండి. బయలు దేవుని పూజించేవారినందరినీ పిలవండి. ఈ సమావేశానికి అందురూ హాజరు అయ్యేలా చూడండి. బయలు దేవునికి నేనొక గొప్పబలి సమర్పించాలి. ఈ సమావేశానికి రానివారిని నేను చంపుతాను” అని చెప్పాడు.

కాని యెహూ వారిపట్ల కుయుక్తి పన్నాడు. బయలు ఆరాధకులను యెహూ నాశనం చేయదలచాడు. 20 “బయలుకు ఒక పవిత్ర సమావేశం ఏర్పాటు చేయండి” అని యెహూ చెప్పాడు. మరియు యాజకులు సమావేశం ప్రకటించారు. 21 తర్వాత యెహూ ఇశ్రాయేలు దేశమంతటా ఒక సందేశం పంపాడు. బయలు ఆరాధకులందరూ వచ్చారు. ఎవ్వరూ ఇంట్లో వుండలేదు. బయలు దేవుని మందిరంలో బయలు ఆరాధకుందరూ వచ్చారు. మందిరం ప్రజలతో నిండిపోయింది.

22 దుస్తులు దగ్గర ఉంచబడిన వ్యక్తితో యెహూ ఇట్లనెను. “బయలు ఆరాధకులందరికి దుస్తులు తీసుకురండి” అని చెప్పగా ఆ వ్యక్తి బయలు ఆరాధకులందరికి దుస్తులు తీసుకు వచ్చాడు.

23 తర్వాత యెహూ, రేకాబు కుమారుడైన యెహూనాదాబు బయలు మందిరంలోనికి పోయారు. బయలు ఆరాధకులను ఉద్దేశించి, “మీ చుట్టు ప్రక్కల చూడండి. మీతో యెహోవా యొక్క సేవకులెవరూ లేరని చూసుకోండి. బయలు ఆరాధకులు మాత్రమే ఇక్కడున్నారని నిర్ధారణ చేసుకోండి” అని యెహూ చెప్పాడు. 24 బయలు ఆరాధకులు గుడిలోకి వెళ్లారు; బలులు మరియు దహన బలులు అర్పించాలనుకున్నారు.

కాని వెలుపల, యెహూ ఎనభై మందితో వేచియున్నాడు. “ఎవ్వరూ తప్పించుకోకుండా చూడండి. ఎవరైనా ఒక్కనినైనా తప్పించినట్లయితే, ఆ వ్యక్తి తన ప్రాణమునే ఫలితంగా పెట్టవలసి వస్తుంది” అని యెహూ చెప్పాడు.

25 త్వరగా యెహూ తన దహన బలుల అర్పణ పూర్తి చేయగా, అతను కాపలాదారులకు, అధిపతులకు ఇలా చెప్పాడు. “లోపలికి వెళ్లి, బయలు ఆరాధకులను చంపండి. ఆలయంలోనుండి ఎవ్వరూ సజీవంగా బయటికి రాకుండా చూడండి” అని చెప్పాడు.

అందువల్ల అధిపతులు ఖడ్గాలు ప్రయోగించి బయలు ఆరాధకులను చంపివేశారు. ఆ తర్వాత కాపలా దార్లు, అధిపతులు బయలు ఆరాధకుల శరీరాలను బయటికి విసిరివేశారు. తర్వాత వారు బయలు దేవత ఆలయంలోని లోపలిగదిలోనికి వెళ్లారు. 26 బయలు ఆలయంలో వున్న జ్ఞాపక శిలలను[a] వారు వెలుపలికి తీసుకువచ్చి, దేవాలయాన్ని దగ్ధం చేశారు. 27 తర్వాత దేవాలయంలోని జ్ఞాపకశిలలను నుగ్గు నుగ్గు చేశారు. బయలు దేవాలయాన్ని కూడా నుగ్గు నుగ్గు చేశారు. వారు బయలు దేవాలయాన్ని ఒక మరుగుదొడ్డిగా మార్చారు. ప్రజలు ఇప్పటికి ఆ ప్రదేశమును బైలు గదిగా (పాయిఖానాగా) వాడతారు.

28 ఈ విధంగా యెహూ ఇశ్రాయేలులో బయలు ఆరాధనను నాశనం చేశాడు. 29 కాని నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలు పూర్తిగా తొలగలేదు; అందువల్ల ఇశ్రాయేలు పాపం చేయవలసి వచ్చింది. బేతేలు, దానులలో బంగారు దూడలను యెహూ నాశనం చెయ్యలేదు.

ఇశ్రాయేలుమీద యెహూ పరిపాలన

30 యెహోవా యెహూని ఉద్దేశించి, “నీవు బాగుగా చేశావు. నేను చెప్పిన సంగతులను నీవు చేశావు. నేను ఆశించిన విధంగా నీవు అహాబు వంశాన్ని నాశనం చేశావు. అందువల్ల నీ సంతతి వారు ఇశ్రాయేలును నాలుగు తరాలవరకూ పరిపాలిస్తారు” అని చెప్పాడు.

31 కాని హృదయపూర్వకంగా యెహూ జాగ్రత్తగా యెహోవా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ నివసించలేదు. ఇశ్రాయేలును పాపానికి గురిచేసిన యరొబాము పాపాలను యెహూ ఆపలేకపోయాడు.

హజాయేలు ఇశ్రాయేలును ఓడించుట

32 ఆ సమయమున, యెహోవా ఇశ్రాయేలును భాగాలుగా ఛేదింపసాగాడు. సిరియా రాజయిన హజాయేలు ఇశ్రాయేలు ప్రతి సరిహద్దుననున్ను ఇశ్రాయేలు వారిని ఓడించాడు. 33 యోర్దాను నదికి తూర్పునవున్న ప్రదేశాన్ని హజాయేలు జయించాడు. గాదీయులకును, రూబేనీయులకును మరియు మనష్షేవంశాలకు చెందిన ప్రాంతాలను, గిలాదుప్రాంతములన్నీ, అర్నోను లోయ ప్రక్కనున్న అరోయేరు ప్రదేశంలోని గిలాదు, బాషాను ప్రాంతాల వరకూ హజాయేలు జయించాడు.

యెహూ మరణం

34 యెహూ కావించిన ఇతర గొప్ప పనులు “ఇశ్రాయేలు రాజుల వృత్తాంతము” అనే గ్రంథంలో వ్రాయబడినవి. 35 యెహూ మరణించగా, అతని పూర్వికులతో పాటుగా సమాధి చేయబడ్డాడు. షోమ్రోనులో ప్రజలు యెహూని సమాధి చేశారు. అతని తర్వాత, యెహూ కుమారుడైన యెహోయాహాజు ఇశ్రాయేలుకు కొత్తగా రాజయ్యాడు. 36 షోమ్రోనులో ఇశ్రాయేలు మీద యెహూ ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు పరిపాలించాడు.

2 తిమోతికి 1

పౌలు నుండి నా ప్రియమైన కుమారుడు తిమోతికి వ్రాయడమేమనగా, మన తండ్రియైన దేవుని నుండి, మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి నీకు కృప, దయ, శాంతి లభించుగాక!

నేను దైవేచ్ఛానుసారం యేసు క్రీస్తుకు అపొస్తలుడనయ్యాను.

దేవుడు వాగ్దానము చేసిన అనంతజీవితము యేసు క్రీస్తు వలన సంభవిస్తుంది. దాని కారణముగా నేను అపొస్తలుడనయ్యాను.

విశ్వాసంలో ఉండండి

నేను నిష్కల్మష హృదయంతో నా పూర్వికుల దేవునికి సేవచేస్తూ కృతజ్ఞుడనై యున్నాను. రాత్రింబగళ్ళు నిన్ను జ్ఞాపకము పెట్టుకొని నీ కోసం ప్రార్థిస్తూ ఉంటాను. నీలాంటివాణ్ణి నాకు యిచ్చినందుకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞుణ్ణి. నీ కన్నీళ్ళు జ్ఞాపకం వస్తున్నాయి. నిన్ను చూడాలనిపిస్తుంది. నిన్ను చూసాక నా మనస్సు ఆనందంతో నిండిపోతుంది. నీలో ఉన్న నిజమైన విశ్వాసం నాకు జ్ఞాపకము ఉంది. అటువంటి విశ్వాసం మీ అమ్మమ్మ లోయిలోనూ ఉంది. నీ తల్లి యునీకేలో కూడా ఉంది. నీలో కూడా అలాంటిది ఉందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అందుకోసం, నా చేతులు నీ తలపై ఉంచడం వల్ల నీకు దేవుడు యిచ్చిన వరాన్ని ఉపయోగిస్తూ ఉండమని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, స్వయం క్రమశిక్షణ గల ఆత్మనిచ్చాడు.

కనుక ప్రభువును గురించి చెప్పవలసి వచ్చినప్పుడు గాని, అతని ఖైదీనైన నా విషయము చెప్పవలసి వచ్చినప్పుడు గాని సిగ్గుపడకు. దానికి మారుగా దేవుడు ఇచ్చిన శక్తిని ఉపయోగించి, సువార్త కోసం నాతో కలిసి కష్టాలు అనుభవించు.

దేవుడు మనల్ని రక్షించి తన ప్రజలుగా మాత్రమే ఉండటానికి పిలిచాడు. మనము చేసిన పనులను బట్టి ఆయన ఇలా చేయలేదు. కాని ఇది కేవలం ఆయన అనుగ్రహం వల్ల, ఆయన ఉద్దేశానుసారం చేసాడు. దేవుడు కాలానికి ముందే యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహాన్ని ప్రసాదించాడు. 10 కాని ఇప్పుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు వచ్చి దాన్ని మనకు వ్యక్తము చేసాడు. ఈయన తన సువార్త ద్వారా మరణాన్ని నిర్మూలించి అనంత జీవితాన్ని, అమరత్వాన్ని వెలుగులోకి తెచ్చాడు.

11 ఈ సువార్తను ప్రకటించటానికి నన్ను వార్తాహరునిగానూ, అపొస్తలునిగానూ, ఉపాధ్యాయునిగానూ నియమించాడు. 12 ఆ కారణంగా నేను ప్రస్తుతం కష్టాలు అనుభవిస్తున్నాను. అందుకు నేను సిగ్గుపడను. ఎందుకంటే, నేను విశ్వసించినవాణ్ణి గురించి నాకు బాగా తెలుసు. ఆ రానున్న రోజు దాకా ఆయన నాకు అప్పగించినదాన్ని, కాపాడుతాడని నాకు విశ్వాసం ఉంది.

13 నేను నీకు బోధించిన ఉపదేశాలను ఆదర్శంగా పెట్టుకో. యేసు క్రీస్తులో విశ్వాసంతో, ప్రేమతో వాటిని మార్గదర్శంగా ఉంచుకో. 14 దేవుడు దాచమని నీకు అప్పగించిన గొప్ప సత్యాన్ని, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ సహాయముతో కాపాడు.

15 ఆసియ ప్రాంతములో ఉన్నవాళ్ళంతా నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపొయ్యారని నీకు తెలుసు. “పుగెల్లు” “హెర్మొగెనే” కూడా నన్ను వదిలి వెళ్ళిపొయ్యారు. 16 నా చేతికి సంకెళ్ళు ఉన్నాయని సంకోచించక “ఒనేసిఫోరు” ఎన్నోసార్లు వచ్చాడు. అది నాకు చాలా ఆనందం కలిగించింది. అతని కుటుంబాన్ని దేవుడు కాపాడు గాక! 17 అంతేకాక అతడు రోములో ఉన్నప్పుడు నేను కనిపించేవరకు నా కోసం కష్టపడి వెతికాడు. 18 ఆ “రానున్న రోజున” కనికరము పొందేటట్లు ప్రభువు అతనికి కృప అనుగ్రహించుగాక! నేను ఎఫెసులో ఉన్నప్పుడు అతడు నాకు ఎన్ని విధాల సహాయం చేసాడో నీకు బాగా తెలుసు.

హోషేయ 2

“అప్పుడు మీరు మీ సోదరులతో ‘మీరు నా ప్రజలు’ అనియు, మీ స్వంతవారితో ‘ఆయన మీ యెడల కరుణ చూపించాడు’ అని చెబుతారు.

“మీ తల్లితో గట్టిగా వాదించండి, ఎందుకంటే ఆమె నా భార్య కాదు! నేను ఆమె భర్తను కాను! వేశ్యలాగ ఉండటం మానుకోమని ఆమెతో చెప్పండి. ఆమె స్తనాల మధ్య నుండి ఆమె విటులను తొలగించి వేయమని ఆమెతో చెప్పండి. ఆమె తన వ్యభిచారం మానుకోవటానికి నిరాకరిస్తే నేను ఆమె వస్త్రాలు తీసివేసి దిగంబరిగా చేస్తాను. ఆమెను, ఆమె పుట్టిన రోజున ఉన్నట్టుగానే చేస్తాను. నేను ఆమె ప్రజలను తొలగించివేస్తాను. ఆమె ఎండిపోయిన ఖాళీ ఎడారిలాగ ఉంటుంది. దాహంతో నేను ఆమెను చంపివేస్తాను. ఆమె పిల్లల మీద నేను జాలిపడను. ఎందుకంటే వారు వ్యభిచార సంతానం కనుక. వారి తల్లి ఒక వేశ్యలాగ ప్రవర్తించింది. వారి తల్లి, ఆమె చేసిన పనుల విషయంలో సిగ్గుపడాలి. ఆమె, ‘నేను నా విటుల దగ్గరకు వెళ్తాను, నా విటులు నాకు భోజనపానాలు ఇస్తారు. వారు ఉన్ని మరియు మేలు రకపు సన్నని వస్త్రాలు ఇస్తారు. ద్రాక్షామద్యం, ఒలీవనూనె వారు నాకు ఇస్తారు’ అని చెప్పింది.

“అందుచేత, యెహోవానైన నేను మీ (ఇశ్రాయేలు) మార్గాన్ని ముళ్లతో అడ్డువేస్తాను. నేను ఒక గోడ కట్టిస్తాను. అప్పుడు తన దారులను ఆమె తెలుసుకోలేక పోతుంది. ఆమె తన విటుల వెనుక పరుగులెత్తుతుంది కానీ ఆమె వారిని కలుసుకోలేక పోతుంది. ఆమె తన విటుల కోసం వెదుకుతుంది. కాని ఆమె వారిని కనుగొనలేక పోతుంది. అప్పుడు ఆమె, ‘నేను నా మొదటి భర్త (దేవుడు) దగ్గరకు వెళ్తాను. నేను ఆయనతో ఉన్నప్పుడు నా జీవితం బాగా ఉండింది. ఇప్పటికంటే నా జీవితం అప్పుడే మేలు’ అని అంటుంది. “ధాన్యం, ద్రాక్షారసం, నూనె ఇచ్చేవాడను నేనే అని ఆమె (ఇశ్రాయేలు)కు తెలియదు. నేను ఆమెకు వెండి బంగారాలు ఇంకా ఇంకా ఎక్కువగా ఇస్తూ పోయాను. కాని బయలు విగ్రహాలు చేయుటకు ఇశ్రాయేలీయులు ఈ వెండి బంగారాలు ఉపయోగించారు. కనుక నేను (యెహోవాను) తిరిగి వస్తాను. నా ధాన్యం కోతకు సిద్ధంగా ఉన్నప్పుడు నేను దానిని తీసివేసుకొంటాను. ద్రాక్షలు సిద్ధంగా ఉన్న సమయంలో నా ద్రాక్షారసం నేను తీసివేసుకొంటాను. నా ఉన్ని, మేలురకపు వస్త్రాలు నేను తీసివేసుకొంటాను. ఆమె తన నగ్న శరీరాన్ని కప్పుకునేందుకు వీటిని నేను ఆమెకు ఇచ్చాను. 10 కాని ఇప్పుడు నేను ఆమెను నగ్నంగా చేస్తాను. ఆమె ప్రేమికులు ఆమె నగ్నత్వాన్ని చూస్తారు. నా శక్తినుండి ఆమెను ఎవ్వరూ తప్పించలేరు. 11 నేను (దేవుడు) ఆమె సరదానంతా తీసివేస్తాను. ఆమె పండుగ రోజులను, ఆమె అమావాస్య విందులను, ఆమె విశ్రాంతి దినాలను, ప్రత్యేక విందులను నేను నిలిపి వేస్తాను. 12 ఆమె ద్రాక్షావల్లులను, అంజూరపు చెట్లను నేను నాశనం చేస్తాను. ‘నా విటులు వీటిని నాకు ఇచ్చారు’ అని ఆమె చెప్పింది. కాని ఆమె తోటలను నేను మార్చివేస్తాను. అవి భయంకరమైన అడవులుగా మారిపోతాయి. అడవి మృగాలు వచ్చి ఆ మొక్కలను తింటాయి.

13 “ఆమె బయలు[a] దేవతలను సేవించింది. కనుక ఆమెను నేను శిక్షిస్తాను. బయలు దేవతలకు ఆమె ధూపం వేసింది. ఆమె వస్త్రాలు ధరించి, నగలు, ముక్కుకమ్మి పెట్టుకొంది. అప్పుడు ఆమె తన విటుల దగ్గరకు వెళ్లి, నన్ను మరచిపోయింది. యెహోవా ఇలాగున చెపుతున్నాడు.

14 “కనుక నేను (యెహోవా) ఆమెతో ప్రేమగా మాట్లాడతాను. ఆమెను ఎడారిలోకి నడిపించి, ఆమెతో నేను మృదువుగా మాట్లాడతాను. 15 అక్కడ ద్రాక్షాతోటలను ఆమెకు ఇస్తాను. ఆకోరు (శ్రమగల)లోయను ఒక నిరీక్షణ ద్వారంగా చేస్తాను. అప్పుడు తన యౌవన దశలో ఈజిప్టు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు చెప్పినట్టుగా ఆమె జవాబు చెపుతుంది. 16 యెహోవా ఇలాగున చెపుతున్నాడు.

“ఆ సమయంలో ‘నా భర్తవు’ అని నీవు నన్ను పిలుస్తావు. ‘నా బయలు’ అని నీవు నన్ను పిలవవు. 17 ఆమె నోటినుండి బయలు దేవత పేర్లను నేను తొలగించివేస్తాను. అప్పుడు ఆ బయలు దేవతల పేర్లను ప్రజలు మరల ఉపయోగించరు.

18 “ఆ సమయంలో పొలంలోని పశువులతోను, ఆకాశంలోని పక్షులతోను, నేలమీద ప్రాకే ప్రాణులతోను ఇశ్రాయేలీయులకోసం నేను ఒక ఒడంబడిక చేస్తాను. విల్లు, ఖడ్గం, యుద్ధ ఆయుధాలు నేను విరుగగొడతాను. ఆ దేశంలో ఆయుధాలు ఏవీ మిగలవు. ఇశ్రాయేలు ప్రజలు ప్రశాంతంగా పడుకోగల్గునట్లు నేను దేశాన్ని క్షేమంగా ఉంచుతాను. 19 మరియు నేను (యెహోవా) నిన్ను శాశ్వతంగా నా వధువుగా చేసుకొంటాను. మంచితనం, న్యాయం, ప్రేమ, కరుణలతో నిన్ను నేను నా వధువుగా చేసుకొంటాను. 20 నిన్ను నాకు నమ్మకమైన వధువుగా చేసుకొంటాను. అప్పుడు నీవు నిజంగా యెహోవాను తెలుసుకొంటావు. 21 ఆ సమయంలో నేను నీకు జవాబు ఇస్తాను. యెహోవా ఇలాగున చెపుతున్నాడు.

“నేను ఆకాశాలతో మాట్లాడుతాను.
    అవి భూమికి వర్షాన్ని ఇస్తాయి.
22 ధాన్యం, ద్రాక్షా మద్యం, నూనెలను భూమి ఇస్తుంది.
    అవి యెజ్రెయేలు అవసరాలను తీరుస్తాయి.
23 భూమిమీద ఆమెను నేను నాటుతాను.
    లో-రూహామాకు నేను దయచూపిస్తాను.
లో-అమ్మీకీ ‘నీవు నా ప్రజ’ అని నేను చెపుతాను.
    ‘నీవు మా దేవుడవు’అని వారు నాతో చెపుతారు.”

కీర్తనలు. 119:97-120

మేమ్

97 నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో!
    దినమంతా అదే నా ధ్యానం.
98 నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే
    జ్ఞానవంతునిగా చేస్తుంది.
99 నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది.
    ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి.
100 ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను.
    కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను.
101 నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి
    ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను.
102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు
    కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను.
103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.
104 నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాణ్ణి చేస్తాయి,
    అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.

నూన్

105 యెహోవా, నీ వాక్యాలు
    నా బాటను వెలిగించే దీపాల్లా ఉన్నాయి.
106 నీ న్యాయ చట్టాలు మంచివి.
    నేను వాటికి విధేయుడనవుతానని వాగ్దానం చేస్తున్నాను. మరియు నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను.
107 యెహోవా, నేను చాలాకాలం శ్రమ అనుభవించాను.
    దయచేసి ఆజ్ఞయిచ్చి, నన్ను మరల జీవించనిమ్ము!
108 యెహోవా, నా స్తుతి అంగీకరించు.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
109 నా జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలోనే ఉంది.
    కాని యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
110 దుర్మార్గులు నన్ను ఉచ్చులో పట్టాలని ప్రయత్నించారు
    కాని నేను నీ ఆజ్ఞలకు అవిధేయుడను కాలేదు.
111 యెహోవా, శాశ్వతంగా నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను.
    అది నన్ను ఎంతో సంతోషింపజేస్తుంది.
112 నీ ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడనగుటకు
    నేను ఎల్లప్పుడూ కష్టపడి ప్రయత్నిస్తాను.

సామెహ్

113 స్థిరమైన మనస్సు లేనివాళ్లంటే నాకు అసహ్యం.
    నేను నీ ఉపదేశాలను ప్రేమిస్తున్నాను.
114 నన్ను దాచిపెట్టి, కాపాడుము.
    యెహోవా, నీవు చెప్పే ప్రతిదీ నేను నమ్ముతాను.
115 యెహోవా, దుర్మార్గపు ప్రజలను నా దగ్గరకు రానీయకుము.
    నేను మాత్రం నా దేవుని ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
116 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నాకు చేయూత నిమ్ము.
    నేను జీవిస్తాను. నేను నిన్ను నమ్ముకొన్నాను, నన్ను నిరాశపరచకు.
117 యెహోవా, నాకు సహాయం చేయుము. నేను రక్షించబడతాను.
    నీ ఆజ్ఞలను నేను నిరంతరం అధ్యయనం చేస్తాను.
118 యెహోవా, నీ ఆజ్ఞలను ఉల్లంఘించే ప్రతి మనిషినీ నీవు తిప్పికొడతావు.
    ఎందుకంటే ఆ మనుష్యులు నిన్ను అనుసరిస్తామని ఒడంబడిక చేసుకున్నప్పుడు అబద్ధం చెప్పారు.
119 యెహోవా, భూమి మీద దుష్టులను నీవు చెత్తలా చూస్తావు.
    కనుక నేను శాశ్వతంగా నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను.
120 యెహోవా, నీవంటే నాకు భయం,
    నీ చట్టాలకు నేను భయపడి వాటిని గౌరవిస్తాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International