M’Cheyne Bible Reading Plan
ఒక యువ ప్రవక్తతో యెహూని అభిషేకించమని ఎలీషా చెప్పుట
9 ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్తల బృందంలో ఒకనిని పిలిచి, అతనితో ఎలీషా, “ఈ చిన్న నూనె సీసాని నీచేతిలో తీసుకుని వెళ్లడానికి నీవు సిద్ధంగా ఉండు. రామోత్గిలాదుకు వెళ్లు. 2 నీవక్కడికి చేరుకోగానే, నింషీ కుమారుడైన యెహోషాపాతు కుమారుడగు యెహూ నీకు కనిపిస్తాడు. అతని సోదరులలోనుండి అతనిని చాటుగా పిలిచి, తర్వాత ఒక గదిలోకి తీసుకు వెళ్లు. 3 చిన్న నూనె సీసా తీసుకుపోయి, యెహూ తలమీద నూనె పోసి ఈరీతిగా చెప్పు. ఇది యెహోవా చెప్పింది. ఇశ్రాయేలీయుల కొత్తరాజుగా నిన్ను అభిషేకించాను. తర్వాత నీవు తలుపు తెరిచి పారిపో. అక్కడ నిలిచి వుండవద్దు” అన్నాడు.
4 అందువల్ల ఈ యువ ప్రవక్త రామోత్గిలాదుకు వెళ్లాడు. 5 ఆ యువకుడు అక్కడకు చేరగానే, అతను సైన్యాధిపతులు అక్కడ కూర్చుని వుండటం చూశాడు. “అధిపతీ! నీకు నేనొక సందేశం తెచ్చాను” అని ఆ యువకుడు చెప్పాడు.
“మేమందరము ఇక్కడున్నాము. ఎవరికి సందేశం?” అని యెహూ అడిగాడు.
“అధిపతీ! నీకే సందేశం” అని యువకుడు చెప్పాడు.
6 యెహూ లేచి ఇంట్లోకి వెళ్లాడు. అప్పుడు యువ ప్రవక్త యెహూను అభిషేకించాడు. ఆ యువ ప్రవక్త యెహూతో ఈ విధంగా చెప్పాడు: “యెహోవా యొక్క ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే కొత్తరాజుగా నిన్ను అభిషేకించానని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పుచున్నాడు. 7 నీ రాజైన అహాబు వంశాన్ని నీవు నాశనం చెయ్యాలి. కాబట్టి నా సేవకులు, ప్రవక్తలు, యెహోవా యొక్క మనుష్యుల మరణానికి కారణమైన యెజెబెలును శిక్షిస్తున్నాను. 8 అందువల్ల అహాబు వంశీయులందరూ మరణిస్తారు. అహాబు వంశంలో మగపిల్లవాడెవ్వడూ బతకనీయకుండా చేస్తాను. ఆ మగబిడ్డ సేవకుడైనా సరే స్వతంత్రుడైనా సరే భేదము లేదు. 9 నెబాతు కుమారుడైన యరొబాము వంశంవలె, అహీయా కుమారుడైన బయెషా వంశంవలె అహాబు వంశాన్ని చేస్తాను. 10 యెజ్రెయేలు ప్రదేశంలో యెజెబెలుని కుక్కలు తింటాయి, యెజెబెలు సమాధి చేయబడదు.”
ఆ తర్వాత యువ ప్రవక్త తలుపు తెరిచి పరుగెత్తుకొని పోయాడు.
యెహూని రాజుగా సేవకులు ప్రకటించుట
11 యెహూ తన రాజ ఉద్యోగుల వద్దకు వెళ్లాడు. ఒక అధికారి యెహూతో, “అంతా మంచిగా వున్నదా? ఈ పిచ్చివాడు నీ వద్దకు ఎందుకు వచ్చాడు?” అని అడిగాడు.
ఆ సేవకులకు యెహూ ఇలా సమాధాన మిచ్చాడు. “ఆ వ్యక్తిని గురించి నీకు తెలుసు. అతను చెప్పే పిచ్చి విషయాలు నీకు తెలుసు.”
12 అధికారులు, “కాదు నిజం చెప్పు. అతడు ఏమి చెప్పాడు?” అని అడిగాడు. ఆ యువ ప్రవక్త చెప్పిన విషయాలు యెహూ అధికారులకు, “అతడు చెప్పిన దేమనగా, ‘ఇశ్రాయేలుకు కొత్తరాజుగా నేను నిన్ను అభిషేకించానని యెహోవా చెప్పాడు’ అని అతను నాకు చెప్పాడు.”
13 తర్వాత ప్రతి అధికారి వెంటనే తమ దుస్తులు తీసివేసి, యెహూ ఎదుట మెట్లమీద పరిచారు. ఆ తర్వాత, “యెహూ రాజు” అని బూర ఊది ప్రకటించారు.
యెహూ యెజ్రెయేలుకు వెళ్లుట
14 అందువల్ల యెహోషాపాతు కుమారుడైన యెహూ, యెహోరాముకు విరుద్ధంగా పధక రచన చేసెను. యెహోషాపాతు నింషీ కుమారుడు.
ఆ సమయమున యెహోరాము మరియు ఇశ్రాయేలు వాళ్లు సిరియాకు రాజయిన హజాయేలుకు వ్యతిరేకంగా రామోత్గిలాదును కాపాడటానికి ప్రయత్నించారు. 15 సిరియా రాజయిన హజాయేలుకు ప్రతికూలంగా యెహోరాము రాజు యుద్ధం చేశాడు. కాని సిరియనులు యెహోరాము రాజును గాయపరిచారు. అతను ఆ గాయాల నుంచి బయటపడటానికి యెజ్రేయేలుకు వెళ్లాడు.
అందువల్ల యెహూ అధికారులను ఉద్దేశించి, “నేను కొత్త రాజని మీరు సమ్మతించినట్లయితే, ఇప్పుడు ఎవరినీ నగరం నుంచి తప్పించుకొనకుండా చేయండి. ఎందుకనగా, ఈ విషయం యెజ్రెయేలీయులతో చెప్పకూడదు” అని పలికాడు.
16 యెజ్రెయేలులో యెహోరాము మంచము పట్టి విశ్రాంతి పొందుచున్నాడు. అందువల్ల యెహూ తన రథమెక్కి, యెజ్రెయేలుకు వెళ్లాడు. యూదా రాజయిన అహజ్యా యెహోరామును చూడడానికి యెజ్రెయేలుకు వచ్చాడు.
17 యెజ్రెయేలులోని ఒక గోపురం మీద ఒక కాపలావాడు నిలబడివున్నాడు. యెహూ యొక్క పెద్ద సైన్యం రావడం అతను చూశాడు. “చాలా మంది మనుష్యులు వచ్చుట చూస్తున్నాను.” అని అతను చెప్పాడు.
“వారిని కలుసుకునేందుకు ఎవరినైనా గుర్రం మీద పంపుము. ఆ మనుష్యులు శాంతికోసం వస్తున్నారో లేదో కనుక్కోమని ఈ దూతతో చెప్పుము” అని యెహోరాము చెప్పాడు.
18 అందువల్ల ఆ దూత యెహూని కలుసుకోవడానికి గుర్రమెక్కి వెళ్లాడు. వార్తహరుడు, “మీరు శాంతికోసం వచ్చారా? లేదా అని యెహోరాము, అడుగుతున్నాడు” అని పలికాడు.
“శాంతితో నీకేమీ పని లేదు. రమ్ము, నన్ను అనుసరింపుము” అని యెహూ చెప్పాడు.
“దూత ఆ బృందం వద్దకు వెళ్లాడు. కాని ఇంత వరకూ తిరిగి రాలేదు” అని కాపలాదారుడు యెహోరాముతో చెప్పాడు.
19 తర్వాత యెహోరాము రెండవ దూతను గుర్రంమీద పంపాడు. ఈ వ్యక్తి యెహూ బృందం వారి వద్దకు వచ్చి, “యెహోరాము రాజు శాంతి అని చెప్పుచున్నాడు” అన్నాడు.
“నీకు శాంతితో ఏమీ పనిలేదు. రమ్ము, నన్ను అనుసరింపుము” అని సమాధానమిచ్చాడు.
20 “రెండవ దూత బృందం వద్దకు వెళ్లాడు. కాని అతను కూడా ఇంకా తిరిగి రాలేదు. పిచ్చివానివలె, ఒకడు అతని రథం నడుపుతున్నాడు. నింషీ కుమారుడైన యెహూవలె నడుపుతున్నాడు” అని కాపలాదారుడు యెహోరాముతో అన్నాడు.
21 “నా రథం తీసుకుని రా” అని యెహోరాము చెప్పాడు.
అందువల్ల సేవకుడు యెహోరాము యొక్క రథమును తీసుకువచ్చాడు. ఇశ్రాయేలు రాజయిన యెహోరాము, యూదా రాజయిన అహజ్య, ఇద్దరూ రథాలలో యెహూని కలుసుకోడానికి వెళ్లారు. వారు యెజ్రెయేలియుడైన నాబోతు పొలం వద్ద యెహూని కలుసుకున్నారు.
22 యెహోరాము యెహూని చూసి, “యెహూ, నీవు శాంతికోసం వచ్చావా?” అని అడిగాడు.
“నీ తల్లి యెజెబెలు వ్యభిచారము, చేతబడితనము ఘోరముగా చేయుచుండగా సమాధానం ఎక్కడనుండి వచ్చును?” అన్నాడు.
23 యెహోరాము గుర్రాలను వెనక్కి పరుగు తీయించాడు. యెహోరాము అహజ్యాను చూసి “అహజ్యా, ఇది ఒక మాయోపాయం” అని చెప్పి, పారిపోవుచు ఉండెను.
24 అప్పుడు యెహూ తన బలంకొద్దీ బాణం లాగి యెహోరాముని వీపుమీద కొట్టగా, ఆ బాణం యెహోరాము గుండెలోనుండి దూసుకొని వెళ్లగా, యెహోరాము తన రథం మీదనే మరణించాడు.
25 యెహూ తన అధిపతియైన బిద్కరుతో, “యెహోరాము దేహాన్ని పైకి ఎత్తి, యెజ్రెయేలులో నాబోతు పొలంలోకి విసిరివేయుము. ఒకసారి జ్ఞాపకం చేసుకో నీవు, నేను యెహోరాము తండ్రి అయిన అహాబుతో కలిసి పయనం చేసినప్పుడు, ఇది అతనికి జరుగునని యెహోవా చెప్పాడు. 26 ‘నిన్న నాబోతు అతని కుమారుల రక్తం నేను చూశాననీ, అందువల్ల ఈ పొలంలో అహాబును శిక్షించెదననీ’ యెహోవా చెప్పెను. కావున, యెహోవా చెప్పినట్లు ఈ కళేబరాన్ని తీసుకొని పొలంలోకి విసరుము అనెను.”
27 యూదా రాజయిన అహజ్యా దీనిని చూసి పారిపోయాడు. అతను ఉద్యానవన గృహంద్వారా తప్పించుకొనడానికి ప్రయత్నించాడు. యెహూ అతనిని అనుసరించాడు. “అహజ్యా తన రథంలోకి వెళ్లినా, అతనిని చంపి వేయుము” అని యెహూ చెప్పాడు.
అందువల్ల యెహూ మనుష్యులు అహజ్యాను ఇబ్లెయాము దగ్గర గూరునకు వెళ్లే బాటమీద కొట్టగా అహజ్యా మెగిద్దోకు పారిపోయి అతను అక్కడ మరణించాడు. 28 అహజ్యా సేవకులు అహజ్యా శరీరాన్ని రథంలో తీసుకొని యెరూషలేముకు వెళ్లారు. వారు అహజ్యాను దావీదు నగరంలో అతని పూర్వికుల సమాధిలో సమాధి చేశారు.
29 ఇశ్రాయేలు రాజుగా యెహోరాము పదకొండవ పరిపాలనా సంవత్సరమున అహజ్యా యూదాకు రాజయ్యాడు.
యెజెబెలు భయంకర మరణం
30 యెహూ యెజ్రెయేలుకు వెళ్లాడు. యెజెబెలు ఆ వార్త విన్నది. కనుక ఆమె తనను సింగారించుకుంది. జుట్టు సరిదిద్దుకుంది, రంగుపూసుకుంది, శిరోభూషణములు ధరించుకున్న తర్వాత ఆమె కిటికీకి ప్రక్కగా నిలిచి వెలుపలికి చూచింది. 31 యెహూ గుమ్మం ద్వారా నగరం ప్రవేశించాడు. ఆమె అతనిని చూసి, “జిమ్రీ వంటివాడా, అతనివలె నీవు నీ యజమానిని చంపివేశావు. సమాధానంగా వచ్చుచున్నావా” అని అడిగింది.
32 యెహూ కిటికీ పైకి చూశాడు. “దాని ప్రక్కన ఎవరున్నారు? ఎవరు?” అన్నాడు. ఇద్దరో ముగ్గురో నపుంసకులు యెహూని కిటికీ నుండి చూశారు. 33 వారితో యెహూ, “యెజెబెలుని క్రిందికి త్రోసి వేయండి” అన్నాడు.
తర్వాత నపుంసకులు యెజెబెలుని క్రిందికి త్రోసివేశారు. యెజెబెలు రక్తం కొంచెం గోడమీద చిమ్మింది. గుర్రాలమీద కూడా చిమ్మింది. గుర్రాలు యెజెబెలు శరీరం మీదుగా నడిచాయి. 34 యెహూ ఇంట్లోకి వెళ్లి అన్నపానాదులు చేసిన తరువాత, “ఇప్పుడు ఈ శాపగ్రస్తురాలిని చూడండి, ఈమె ఒక రాజు కుమార్తె. అందువల్ల ఆమెను సమాధి చేయండి” అన్నాడు.
35 ఆ మనుష్యులు యెజెబెలుని సమాధి చేయడానికి వెళ్లారు. కాని ఆమె శరీరం వారికి కనబడలేదు. ఆమె కపాలము, ఆమె పాదాలు, ఆమె అరచేతులు మాత్రమే కనిపించాయి. 36 అందువల్ల ఆ మనుష్యులు వెనుదిరిగి వచ్చి యెహూతో చెప్పారు. అప్పుడు యెహూ, “యెజ్రెయేలు ప్రదేశంలో యెజెబెలు శవాన్ని కుక్కలు తింటాయని యెహోవా తన సేవకుడు తిష్బీవాడయిన ఏలీయాతో చెప్పాడు. 37 యెజ్రెయేలు ప్రదేశపు పొలంలో యెజెబెలు శవం పెంటవలె ఉంటుందనీ, ఇది యెజెబెలని ఎవరూ గుర్తు పట్టలేరనీ ఏలీయా చెప్పాడు.”
బానిసలకు ప్రత్యేక నియమాలు
6 బానిసత్వంలో ఉన్నవాళ్ళు తమ యజమానులను పూర్తిగా గౌరవించాలి. అప్పుడే దేవునికి, మా బోధనకు చెడ్డపేరు రాకుండా ఉంటుంది. 2 యజమానులు దేవుని కుటుంబానికి చెందినంత మాత్రాన బానిసలు వారిని గౌరవించటం మానుకోరాదు. అలా కాక వాళ్ళకు యింకా ఎక్కువ సేవ చేయాలి. ఎందుకంటే ఈ సేవ పొందే వాళ్ళు భక్తులు. వీరు ప్రేమ చూపుతున్న వాళ్ళు.
ఈ విధంగా నీవు వీటిని ఉపదేశించి ఆచరణలో పెట్టుమని వాళ్ళకు చెప్పు.
ధన ఆశ
3 మన యేసు క్రీస్తు ప్రభువు బోధించిన చక్కటి ఉపదేశాలను, మన దేవుని సేవకు సంబంధించిన సక్రమ మార్గాలను వదిలి యితర మార్గాలను బోధించువాడు 4 మోసగాడు అన్నమాట. అలాంటి వానికి ఏమీ తెలియదన్నమాట. అలాంటి వానిలో వివాదాస్పదమైన విషయాలను అనవసరంగా తర్కించాలనే అనారోగ్యకరమైన ఆసక్తి ఉంటుంది. అది ద్వేషానికి, పోరాటానికి, దూషణలకు, దుష్టత్వంతో నిండిన అనుమానాలకు దారి తీస్తుంది. 5 అంతేకాక, సత్యాన్ని గ్రహించక దైవభక్తి, ధనార్జనకు ఒక సాధనమని భావించే దుష్టబుద్ధి గలవాళ్ళ మధ్య నిరంతరమైన ఘర్షణలు కలుగుతాయి.
6 కాని సంతృప్తితో ఉండి, భక్తిని అవలంభిస్తే అదే ఒక గొప్ప ధనము. 7 ఈ లోకంలోకి మనమేమీ తీసుకురాలేదు. ఈ లోకంనుండి ఏమీ తీసుకుపోలేము. 8 మనకు తిండి, బట్ట ఉంటే చాలు. దానితో తృప్తి పొందుదాము. 9 కాని ధనవంతులు కావాలనుకొనేవారు, ఆశలకులోనై మూర్ఖత్వంతో హానికరమైన ఆశల్లో చిక్కుకుపోతారు. అవి వాళ్ళను అధోగతి పట్టించి పూర్తిగా నాశనం చేస్తాయి. 10 ధనాశ అన్ని రకాల దుష్టత్వానికి మూలకారణం. కొందరు, ధనాన్ని ప్రేమించి, క్రీస్తు పట్ల ఉన్న విశ్వాసానికి దూరమైపోయారు. తద్వారా దుఃఖాల్లో చిక్కుకుపోయారు.
తిమోతికి చెప్పిన ఉపదేశము
11 కాని నీవు విశ్వాసివి. కనుక వీటికి దూరంగా ఉండు. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, సహనాన్ని, వినయాన్ని అలవరచుకో. 12 నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి బాగా పోరాటం సాగించు. అనంత జీవితాన్ని సంపాదించు. దీని కోసమే దేవుడు నిన్ను పిలిచాడు. నీవు అనేకుల సమక్షంలో ఆ గొప్ప సత్యాన్ని అంగీకరించావు. 13 అన్నిటికీ ప్రాణం పోసే దేవుని పేరిట, పొంతి పిలాతు సమక్షంలో అదే గొప్ప సత్యాన్ని అంగీకరించిన యేసు క్రీస్తు పేరిట నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. 14 మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చేదాక ఈ ఆజ్ఞను పాటించు. దాన్ని పాటించటంలో ఏ మచ్చా రానీయకుండా, ఏ అపకీర్తీ రానివ్వకుండా చూడు. 15 “మన పాలకుడు,” రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునైయున్నాడు. సర్వాధిపతి అయిన దేవుడు తగిన సమయం రాగానే యేసు క్రీస్తును పంపుతాడు. 16 మనం సమీపించలేని వెలుగులో ఉండే అమరుడైన దేవుడాయన. దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు, మరి ఎవ్వరూ చూడలేరు. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆయన శక్తి తరగకుండా ఉండుగాక! అమేన్.
17 ధనవంతులు గర్వించరాదనీ, క్షణికమైన ధనాన్ని నమ్మకూడదనీ, వాళ్ళతో చెప్పుదానికి మారుగా మన ఆనందానికి అన్నీ సమకూర్చే దేవుణ్ణి నమ్ముమని ఆజ్ఞాపించు. 18 సత్కార్యాలు చేస్తూ సత్ ప్రవర్తన కలిగి అవసరమైనవాటిని యితర్లతో ఔదార్యముగా పంచుకుంటూ ఉండుమని ఆజ్ఞాపించు. 19 ఈ విధంగా ఆత్మీయతలో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే అది భవిష్యత్తుకు చక్కటి పునాది వేస్తుంది. తద్వారా నిజమైన జీవితం పొందకల్గుతారు.
20 తిమోతీ, నీకు అప్పగింపబడిన సత్యాన్ని జాగ్రత్తగా కాపాడు. ఆత్మీయతలేని చర్చలకు దూరంగా ఉండు. జ్ఞానంగా చెప్పబడే వ్యతిరేక సిద్ధాంతాలకు దూరంగా ఉండు. 21 కొందరు ఈ వ్యతిరేక సిద్ధాంతాలు బోధించారు. ఇలా చేసిన వాళ్ళు, మనము విశ్వసిస్తున్న సత్యాలను వదిలి తప్పు దారి పట్టారు.
దైవానుగ్రహం మీకు తోడుగా ఉండుగాక!
హోషేయద్వారా యెహోవా దేవుని సందేశం
1 బెయేరి కుమారుడైన హోషేయకు వచ్చిన యెహోవా సందేశం ఇది. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనువారు యూదా దేశపు రాజులుగా ఉన్న కాలంలో ఈ సందేశం వచ్చింది. యెహోవాయాషు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలురాజుగా ఉన్న కాలం అది.
2 ఇది హోషేయకు యెహోవా ఇచ్చిన మొదటి సందేశం. “వెళ్లి, ఒక వేశ్యను పెండ్లి చేసుకొని, ఆ వేశ్య ద్వారా పిల్లల్ని కను.[a] ఎందుకంటే ఈ దేశంలో ప్రజలు వేశ్యల్లా ప్రవర్తించారు-వారు యెహోవాకు అపనమ్మకంగా జీవించారు” అని యెహోవా చెప్పాడు.
యెజ్రెయేలు పుట్టుక
3 కనుక దిబ్లయీము కుమార్తెయైన గోమెరును హోషేయ పెండ్లి చేసుకొన్నాడు. గోమెరు గర్భవతియై, హోషేయకు ఒక కుమారుని కన్నది. 4 యెహోవా హోషేయతో, “అతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టు. ఎందుచేతనంటే యెహూ యెజ్రెయేలు లోయలో రక్తం చిందించిన కారణంగా నేను యెహూ కుటుంబాన్ని నాశనం చేస్తాను. ఆ తర్వాత ఇశ్రాయేలు రాజ్యాన్ని నేను నాశనం చేస్తాను. 5 ఆ సమయంలో యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు విల్లును నేను విరుగగొడ్తాను” అని చెప్పాడు.
లో-రూహామా పుట్టుక
6 మరల గోమెరు గర్భవతియై ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. యెహోవా హోషేయతో ఇలా చెప్పాడు: “ఆమెకు లో-రూహామా అని పేరు పెట్టు. ఎందుకంటే ఇశ్రాయేలు రాజ్యానికి నేను ఇక ఎంతమాత్రం కరుణ చూపించను. నేను వారిని క్షమించను. 7 కాని యూదా రాజ్యానికి నేను కరుణ చూపిస్తాను. యూదా రాజ్యాన్ని నేను రక్షిస్తాను. వారిని రక్షించేందుకు విల్లుగాని, ఖడ్గంగాని నేను ఉపయోగించను. వారిని రక్షించేందుకు యుద్ధ గుర్రాలనుగాని, సైనికులనుగాని నేను ఉపయోగించను. నేను నా స్వంత శక్తిచేతనే వారిని రక్షిస్తాను.”
లో-అమ్మీ పుట్టుక
8 గోమెరు లో-రూహామాకు చనుబాలు ఇవ్వటం చాలించగానే ఆమె మరల గర్భవతి అయ్యింది. ఆమె మరొక కుమారుని కన్నది. 9 అప్పుడు, “అతనికి లో-అమ్మీ అని పేరు పెట్టు. ఎందుచేతనంటే మీరు నా ప్రజలు కారు, నేను మీ దేవుణ్ణి కాను” అని యెహోవా చెప్పాడు.
ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు మాట్లాడుట
10 “రాబోయే కాలంలో ఇశ్రాయేలు ప్రజల సంఖ్య సముద్రపు ఇసుక రేణువుల్లా ఉంటుంది. ఇసుకను నీవు కొలవలేవు. లెక్కించ లేవు. ఏ స్థలంలోనైతే ‘మీరు నా ప్రజలు కారు’ అని వారితో చెప్పబడిందో అక్కడే ‘మీరు జీవంగల దేవుని పిల్లలు’ అని వారితో చెప్పడం జరుగుతుంది.
11 “అప్పుడు యూదా ప్రజలు మరియు ఇశ్రాయేలు ప్రజలు సమావేశపరచబడతారు. వారు ఒక పాలకుని తమకోసం ఏర్పాటు చేసుకొంటారు. మరియు వారి రాజ్యం ఆ దేశం పట్టజాలనంత పెద్దదిగా ఉంటుంది! యెజ్రెయేలు దినం నిజంగా గొప్పగా ఉంటుంది.
యోద్
73 యెహోవా, నీవు నన్ను చేశావు, నీ చేతులతో నన్ను నిలబెడుతావు.
నీ ఆదేశాలు నేర్చుకొని గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
74 యెహోవా, నీ అనుచరులు నన్ను చూచి సంతోషిస్తారు.
నీవు చెప్పే విషయాలను నేను నమ్ముతాను. కనుక వారికి చాలా సంతోషం.
75 యెహోవా, నీ నిర్ణయాలు న్యాయంగా ఉంటాయని నాకు తెలుసు.
నీవు నన్ను శిక్షించటం నీకు సరియైనదే.
76 ఇప్పుడు నిజమైన నీ ప్రేమతో నన్ను ఆదరించుము.
నీ వాగ్దాన ప్రకారం నన్ను ఆదరించుము.
77 యెహోవా, నన్ను ఆదరించి, నన్ను బ్రతుకనిమ్ము.
నీ ఉపదేశములలో నిజంగా నేను ఆనందిస్తాను.
78 నాకంటే తామే మంచివాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి అబద్ధం చెప్పారు కనుక వారిని సిగ్గుపరచు.
యెహోవా, నేను నీ ఆజ్ఞలను అధ్యయనం చేస్తాను.
79 నీ అనుచరులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము.
నీ ఒడంబడిక తెలిసిన మనుష్యులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము.
80 యెహోవా, నన్ను నీ ఆజ్ఞలకు పరిపూర్ణంగా విధేయుడను కానిమ్ము.
అందుచేత నేను అవమానించబడను.
కఫ్
81 నీవు నన్ను రక్షిస్తావని నిరీక్షిస్తూ నేను చనిపోబోతున్నాను.
కాని యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నమ్ముతాను.
82 నీవు వాగ్దానం చేసిన వాటికోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. కాని నా కళ్లు అలసిపోతున్నాయి.
యెహోవా, నీవు నన్ను ఎప్పుడు ఆదరిస్తావు?
83 నేను చెత్తకుప్పలో ఎండిపోయిన ద్రాక్ష తొక్కలా ఉన్నప్పుడు కూడా
నీ న్యాయ చట్టాలను నేను మరచిపోలేదు.
84 నేను ఎంత కాలం జీవిస్తాను?
యెహోవా, నన్ను హింసించే మనుష్యులకు ఎప్పుడు తీర్పు తీరుస్తావు?
85 కొందరు గర్విష్ఠులు వారి అబద్ధాలతో నన్ను పొడిచారు.
మరి అది నీ ఉపదేశాలకు విరుద్ధం.
86 యెహోవా, మనుష్యులు నీ ఆజ్ఞలన్నింటిని నమ్మగలరు.
అబద్ధికులు నన్ను హింసిస్తారు. నాకు సహాయం చేయుము!
87 ఆ అబద్ధికులు నన్ను దాదాపుగా నాశనం చేశారు.
నేను మాత్రం నీ ఆదేశాలను అనుసరించటం మానలేదు.
88 యెహోవా, నిజమైన నీ ప్రేమ చూపించి నన్ను జీవించనిమ్ము.
నీవు చెప్పే వాటిని నేను చేస్తాను.
లామెద్
89 యెహోవా, నీ మాట శాశ్వతంగా కొనసాగుతుంది. నీ మాట పరలోకంలో శాశ్వతంగా కొనసాగుతుంది.
90 నీవు ఎప్పటికీ నమ్మదగిన వాడవు.
యెహోవా, భూమిని నీవు చేశావు, అది ఇంకా నిలిచి ఉంది.
91 నీ ఆజ్ఞ మూలంగా, ఇంకా అన్నీ కొనసాగుతాయి.
యెహోవా, అన్నీ నీ సేవకుల్లా నీ ఆజ్ఞకు లోబడుతాయి.
92 నీ ఉపదేశాలు నాకు స్నేహితుల్లా ఉండకపోతే,
నా శ్రమ నన్ను నాశనం చేసి ఉండేది.
93 యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను జీవింపజేస్తాయి
కనుక నేను ఎన్నటికీ వాటిని మరచిపోను.
94 యెహోవా, నేను నీ వాడను. నన్ను రక్షించుము.
ఎందుకంటే, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు కష్టపడి ప్రయత్నిస్తాను.
95 దుష్టులు నన్ను నాశనం చేయాలని ప్రయత్నించారు.
అయితే నీ ఒడంబడిక నాకు తెలివినిచ్చింది.
96 నీ ధర్మశాస్త్రానికి తప్ప
ప్రతిదానికీ ఒక హద్దు ఉంది.
© 1997 Bible League International