Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 రాజులు 8

రాజు మరియు షూనేము స్త్రీ

ఎవరి కొడుకునైతే సజీవునిగా ఎలీషా చేసెనో, ఆ స్త్రీతో ఎలీషా మాటలాడెను. ఎలీషా చెప్పాడు. “నీవు నీ కుటుంబము మరొక దేశానికి వెళ్లాలి. ఎందుకనగా, ఇక్కడ కరువుకాలం ఏర్పడుతుందని యెహోవా నిశ్చయించినాడు. ఈ విధమైన కరువు ఈ దేశంలో ఏడు సంవత్సరముల పాటు ఉంటుంది.”

అందువల్ల ఆ స్త్రీ దేవుని మనిషి చెప్పినట్లుగా చేసింది. తన కుటుంబంతో ఆమె ఫిలిష్తీయుల దేశంలో ఏడేండ్లు ఉండటానికి వెళ్లింది. ఆ ఏడు సంవత్సరములు పూర్తి అయిన తర్వాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశంనుంచి తిరిగి వచ్చింది.

ఆ స్త్రీ రాజుతో మాట్లడడానికి వెళ్లింది. తన ఇల్లు, తన పొలము తనకు చేరునట్లుగా కోరుటకే ఆమె వెళ్లింది.

దేవుని వ్యక్తికి (ఎలీషా) సేవకుడైన గేహజీతో రాజు మాట్లాడుతూ ఉన్నాడు. రాజు ఈ విధంగా అడిగాడు: “దయచేసి ఎలీషా చేసిన గొప్ప కార్యాలను తెలుపు.”

మృతజీవి ఒకనిని సజీవునిగా ఎలీషా చేసెనన్న విషయాన్ని గేహజీ రాజుకి చెప్పుచున్నాడు. ఆ సమయాన తన కొడుకుని ఎలీషా బ్రతికింపజేసిన ఆ స్త్రీ రాజువద్దకు పోయింది. తన పొలమూ, తన యిల్లూ తాను పొందుటకు సహాయం చేయమని రాజుని అడగటానికి ఆమె వెళ్లింది. గేహాజీ, “నా ప్రభువా, రాజా, ఈమెయే ఆ స్త్రీ. ఇతడే ఎలీషా బ్రతికించిన ఆ కుమారుడు” అని చెప్పాడు.

ఏమి కావలెనో చెప్పమని రాజు ఆమెని అడిగాడు. ఆ స్త్రీ రాజుతో చెప్పింది.

తర్వాత ఆ స్త్రీ కి సహాయము చేయడానికై రాజు ఒక అధికారిని ఎన్నుకున్నాడు. “ఆమెకున్నదంతా ఆమెకు వచ్చేలా చేయండి. ఆమె దేశం విడిచిపెట్టిన నాటినుంచీ నేటిదాకా కోతలవల్ల ఆమెకు రావలసినదంతా ఇప్పించండి” అని చెప్పాడు.

బెన్హదదు హజాయేలును ఎలీషా వద్దకు పంపుట

ఎలీషా దమస్కుకు వెళ్లాడు. సిరియా రాజయిన బెన్హదదు జబ్బుతో వున్నాడు. “దేవుని వ్యక్తి ఇచ్చటికి వచ్చాడు.” అని ఒకడు బెన్హదదుకు చెప్పాడు.

అప్పుడు బెన్హదదు హజాయేలుతో ఇట్లన్నాడు: “ఒక కానుక తీసుకొని దేవుని వ్యక్తిని కలుసుకొనుము. నేను నా జబ్బునుండి కోలుకొందునో లేదో అతడు యెహోవాని అడగమని అతనితో చెప్పుము.”

అందువల్ల హజాయేలు ఎలీషాని కలుసు కొనడానికి వెళ్లాడు. తనతో పాటు హజాయేలు కానుకలు తెచ్చాడు. దమస్కు నుండి అతడు అన్ని రకాల మంచి వస్తువులు తెచ్చాడు. వాటిని మోయడానికి 40 ఒంటెలు కావలసి వచ్చింది. హజాయేలు ఎలీషా వద్దకు పోయాడు. “నీ అనుచరుడైన[a] సిరియా రాజు నన్ను నీ వద్దకు పంపించాడు. అతను జబ్బునుండి కోలుకొనునో లేదో అడగమని, నన్ను పంపెను,” అని హజాయేలు చెప్పాడు.

10 అప్పుడు ఎలీషా, “నీవు బాగుపడెదవని బెన్హదదుతో చెప్పు. కాని నీవు చనిపోదువని నిజముగా యెహోవా నాతో చెప్పాడు.” అన్నాడు.

హజాయేలుకి సంబంధించి ఎలీషా ఒక ప్రవచనము చెప్పుట

11 ఎలీషా పైకి క్రిందికి చూడసాగాడు. హజాయేలు ఇబ్బందిలో పడేంతవరకూ అతను చూసెను. దైవజనుడు ఏడవసాగెను. 12 “అయ్యా, మీరెందుకు ఏడుస్తున్నారు?”

అని హజయేలు అడిగాడు. “ఇశ్రాయేలు వారికి మీరేమి చెడుపనులు చేయగలరో తెలిసి నేను ఏడుస్తున్నాను. మీరు వారి బలమైన నగరాలను దగ్ధం చేస్తారు. ఖడ్గాలతో మీరు ఆ యువకులను చంపుతారు. వారి పసిపిల్లలను కూడా మీరు హతమారుస్తారు. మీరు వారి గర్భవతులను చీల్చి వేస్తారు” అని ఎలీషా సమాధానం చెప్పాడు.

13 హజయేలు “నేను శక్తిమంతుడను కానని చెప్పాడు. ఈ గొప్ప విషయాలు నేను చేయలేను.”

“నీవు సిరియా రాజువి కాగలవని యెహోవా చూపాడు.” అని ఎలీషా సమాధాన మిచ్చాడు.

14 ఆ తర్వాత హజయేలు ఎలీషాని విడిచి తన రాజు వద్దకు వెళ్లాడు. “ఎలీషా నీతో ఏమి చెప్పాడు?” అని బెన్హదదు హజయేలును అడిగాడు.

“నీవు జీవించెదవు అని ఎలీషా చెప్పాడు” అని హజయేలు చెప్పాడు.

హజాయేలు బెన్హదదును హత్య చేయుట

15 కాని ఆ మరునాడే హజాయేలు ఒక ముతక వస్త్రం తీసుకుని దాన్ని నీటిలో తడిపాడు. తర్వాత బెన్హదదు ముఖాన్ని కప్పివేసి, వుక్కిరి బిక్కిరి చేయడంతో అతడు మరణించాడు. హజాయేలు కొత్తగా రాజు అయ్యాడు.

యెహోరాము తన పాలన ప్రారంభించుట

16 ఇశ్రాయేలుకు రాజైన అహాబు కొడుకు యెహోరాము పరిపాలనలోని, అయిదవ సంవత్సరమున, యూదా రాజైన యెహోషాపాతు కొడుకు యెహోరాము యూదాకు రాజయ్యాడు. 17 యెహోరాము పరిపాలించు నాటికి అతను ముఫ్పై రెండు యేండ్ల వాడు. యెరూషలేములో అతను ఎనిమిదేళ్లు పరిపాలించాడు. 18 కాని పూర్వపు ఇశ్రాయేలు రాజుల చెడు మార్గాలను ఇతడు అనుసరించాడు. అహాబు కుటుంబీకులు చేసినట్లుగా యెహోవా దృష్ఠికి తప్పు అని ఎంచబడిన చెడుకార్యాలు చేశాడు. 19 కాని తన సేవకుడైన దావీదుకు వాగ్దానం చేయడంవల్ల యెహోవా యూదాను నాశనం చేయలేదు. అతని వంశానికి చెందిన వారు ఎవరో ఒకరు ఎప్పుడూ రాజుగా వుంటారని దావీదుకు యెహోవా వాగ్దానం చేశాడు.

20 యెహోరాము కాలంలో యూదా పరిపాలన నుండి ఎదోమీయులు విడిపోయి తమకు ఒక రాజుని ఎన్నుకున్నారు.

21 అప్పుడు యెహోరాము అతని రథములన్నిటినీ తీసుకుని జాయీరుకు వెళ్లెను. రాత్రివేళ ఎదోము సైన్యము వారిని చుట్టుముట్టింది. యెహోరాము అతని అధికారులు వారిని ఎదుర్కొని, తప్పించు కున్నారు. యెహోరాము సైనికులందురు పారిపోయి తమ దేశం చేరుకున్నారు. 22 ఈ కారణంచేత ఎదోము వారు యూదా పరిపాలనకు ఎదురు తిరిగారు. అదే సమయమున లిబ్నా కూడా యూదా పరిపాలనకు ఎదురు తిరిగింది.

23 యెహోరాము చేసిన ఇతర పనులన్నియు “యూదా రాజుల వృత్తాంతము” అనే గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి.

24 తరువాత యెహోరాము మరణించాడు. దావీదు నగరంలో తన పూర్వికులతో పాటు అతను సమాధి చేయబడ్డాడు. యెహోరాము కుమారుడైన అహజ్యా కొత్తగా రాజయ్యాడు.

అహజ్యా తన పరిపాలన ప్రారంభించుట

25 అహాబు కుమారుడైన యెహోరాము ఇశ్రాయేలుకు రాజయిన పన్నెండవ సంవత్సరమున, యెహోరాము కుమారుడైన అహజ్యా యూదా రాజ్యానికి రాజయ్యాడు. 26 అహజ్యా పరిపాలన ప్రారంభించినప్పుడు అతని వయస్సు ఇరవైరెండు సంవత్సరములు. అతను యెరూషలేములో ఒక సంవత్సరం పరిపాలించాడు. అతని తల్లి పేరు అతల్యా. ఆమె ఇశ్రాయేలు రాజయిన ఒమ్రీ కుమార్తె. 27 యెహోవా తప్పని చెప్పిన పనులనే అహజ్యా చేశాడు. అహాబు వంశీయులవలె అహజ్యా అనేక చెడుకార్యాలు చేశాడు. అతని భార్య అహాబు వంశానికి చెందినదగుటచే, అహజ్యా ఈ విధంగా చేశాడు.

హజాయేలుతో జరిగిన యుద్ధంలో యెహోరాము గాయపడుట

28 యెహోరాము అహాబు వంశానికి చెందినవాడు. సిరియా రాజయిన హజయేలుతో రామోత్గిలాదు అనేచోట యుద్ధం చేసేందుకు అహజ్యా యెహోరాముతో కలిసి వెళ్లాడు. సిరియన్లు యెహోరాముని గాయపరచిరి. 29 ఆ గాయముల నుండి బాగు పడుటకు గాను యెహోరాము రాజు ఇశ్రాయేలుకి తిరిగి వెళ్లిపోయాడు. యెహోరాము యెజ్రెయేలు అనే ప్రదేశానికి పోయాడు. యెహోరాము కుమారుడైన అహజ్యా యూదా యొక్క రాజు. అహజ్యా యెహోరాముని చూడటానికి యెజ్రెయేలు వెళ్లాడు.

1 తిమోతికి 5

వృద్ధులతో కఠినంగా మాట్లాడవద్దు. వాళ్ళను తండ్రులుగా భావించి సలహాలు చెప్పు. చిన్నవాళ్ళను నీ తమ్ముళ్ళుగా భావించు. వయస్సు మళ్ళిన స్త్రీని నీ తల్లిగా, చిన్న వయస్సుగల స్త్రీని పవిత్ర హృదయంతో నీ సోదరిగా భావించు.

వితంతువులను జాగ్రత్తగా చూడు

అవసరంలో ఉన్న వితంతువులకు సహాయం చేయి. వితంతువులకు పిల్లలు గాని, పిల్లల పిల్లలు గాని ఉన్నట్లైతే, వాళ్ళు తమ కుటుంబాన్ని పోషించుకోవటం ముఖ్యంగా నేర్చుకోవాలి. ఆ విధంగా తమ సంఘానికి సంబంధించి కర్తవ్యాలను నిర్వర్తించాలి. అలా చేస్తే తమ తల్లిదండ్రుల రుణం, తాత ముత్తాతల రుణం తీర్చుకొన్నట్లవుతుంది. అది దేవునికి సంతృప్తి కలుగ చేస్తుంది. ఒంటరిగా దీనావస్థలో ఉన్న వితంతువు తన ఆశల్ని దేవునిలో పెట్టుకొని, సహాయం కోసం రాత్రింబగళ్ళు ప్రార్థిస్తుంది. కాని భోగాలకొరకు జీవించే వితంతువు జీవిస్తున్నా మరణించినట్లే. ఈ ఉపదేశాలను ప్రజలకు బోధించు. అప్పుడు వాళ్ళలో ఎవ్వరూ నీలో తప్పు పట్టలేరు. తన స్వంతవారిని ముఖ్యంగా తన కుటుంబాన్ని కాపాడలేనివాడు మనం నమ్మే సత్యాలను విడిచి అవిశ్వాసి అయినవానితో సమానం. అతడు దేవుణ్ణి నమ్మనివానికన్నా అధ్వాన్నం.

ఒకే పురుషుణ్ణి పెండ్లాడి అరవై ఏండ్లు దాటి ఉంటే తప్ప ఆమె పేరు వితంతువుల జాబితాలో చేర్చరాదు. 10 అంతేకాక, సత్కార్యాలు చేసే స్త్రీయని ఆమెకు మంచి పేరుండాలి. పిల్లల్ని సక్రమంగా పెంచటం, అతిథి సత్కారాలు చెయ్యటం, పవిత్రుల కాళ్ళు కడగటం, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చెయ్యటంలాంటి గుణాలు ఆమెలో ఉండాలి. తన జీవితాన్ని యిలాంటి మంచి పనులు చెయ్యటానికి అంకితం చేసిన స్త్రీగా ఉండాలి.

11 చిన్న వయస్సుగల వితంతువుల్ని ఈ జాబితాలో చేర్చవద్దు. వాళ్ళ వాంఛలు క్రీస్తు పట్ల వాళ్ళకున్న భక్తిని మించిపోయినప్పుడు, వాళ్ళు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకొంటారు. 12 తద్వారా తమ మొదటి ప్రమాణాన్ని ఉల్లంఘిస్తారు. ఇలా చెయ్యటంవల్ల వాళ్ళకు శిక్ష లభిస్తుంది. 13 పైగా వాళ్ళు వ్యర్థంగా కాలయాపన చెయ్యటానికి, ఇంటింటికి తిరగటానికి అలవాటు పడిపోతారు. వాళ్ళిలా కాలయాపన చెయ్యటమే కాకుండా, యితర్ల విషయాల్లో జోక్యం కలిగించుకోవటానికి అలవాటుపడ్తారు. వాళ్ళకు మౌనంగా ఉండటం చేతకాదు. 14 అందువల్ల చిన్న వయస్సులో ఉన్న వితంతువులు పెళ్ళి చేసుకొని పిల్లల్ని కని, తమ యిండ్లను చూసుకోవాలి. ఇది నా సలహా. అప్పుడు వాళ్ళను నిందించడానికి యితర్లకు ఆస్కారము ఉండదు. 15 నిజానికి కొందరు సాతాన్ను అనుసరించటానికి యిదివరకే తిరిగి వెళ్ళారు.

16 క్రీస్తును విశ్వసించే స్త్రీ,[a] తన కుటుంబంలో వితంతువులున్నట్లైతే, వాళ్ళకు సహాయం చేయాలి. సంఘంపై ఆ భారం వేయరాదు. అప్పుడు క్రీస్తు సంఘం నిజంగా ఆసరాలేని వితంతువులకు సహాయం చేయకల్గుతుంది.

పెద్దలూ, తదితర సంగతుల్నిగూర్చి

17 క్రీస్తు సంఘం యొక్క కార్యక్రమాలు నడిపించే పెద్దలు, ముఖ్యంగా ఉపదేశించటానికి, బోధించటానికి కష్టపడి పని చేస్తున్న పెద్దలు రెట్టింపు గౌరవానికి అర్హులు. 18 ఎందుకంటే ధర్మశాస్త్రంలో, “ధాన్యము తొక్కే ఎద్దు మూతి కట్టరాదు” మరియు “పని చేసే వానికి కూలి దొరకాలి” అని వ్రాయబడి ఉంది.

19 ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు ఉంటే తప్ప సంఘం పెద్దల మీద మోపిన నేరాన్ని పరిశీలించవద్దు. 20 తప్పు చేసినవాళ్ళను బహిరంగంగా ఖండించు. అలా చేస్తే అది చూసి మిగతా వాళ్ళు జాగ్రత్త పడతారు.

21 నేను దేవుని సమక్షంలో, యేసు క్రీస్తు సమక్షంలో, దేవుడు ఎన్నుకొన్న దేవదూతల సమక్షంలో ఆజ్ఞాపిస్తున్నాను. ఒకని పక్షం వహించి మరొకని పట్ల వ్యతిరేకంగా ఉండవద్దు. నిష్పక్షపాతంగా ఈ ఆజ్ఞల్ని అమలులో పెట్టు. ఏది పక్షపాతంతో చెయ్యవద్దు.

22 నీవు తొందరపడి ఎవరి మీద హస్తనిక్షేపణ చేయవద్దు. ఇతర్ల పాపాల్లో భాగస్తుడవు కావద్దు. నిన్ను నీవు పవిత్రంగా చూచుకో.

23 నీళ్ళు మాత్రమే త్రాగవద్దు. నీ కడుపు బాగు కావటానికి కొద్దిగా ద్రాక్షారసము త్రాగు. అప్పుడు నీవు ఆరోగ్యంగా ఉంటావు.

24 కొందరు చేసిన పాపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి వాళ్ళకన్నా ముందు తీర్పుకై పరుగెత్తుచున్నాయి. మరి కొందరి పాపాలు ఆలస్యంగా కనిపిస్తాయి. 25 అదే విధంగా మంచి పనులు స్పష్టంగా కనిపిస్తాయి. రహస్యంగానుండే మంచి పనులు కూడా బయలు పరచబడును.

దానియేలు 12

12 “ఆ సమయాన నీ ప్రజలైన యూదుల పక్షం వహించిన గొప్ప రాజు మిఖాయేలు (ప్రధాన దూత) జోక్యం కలిగించుకొంటాడు. నీ ప్రజలు ఒకే దేశంగా కూడిన కాలంనుండి అప్పటి వరకు ముందెన్నడూ సంభవించనంత మహా విపత్తు వారికి కలుగుతుంది. కాని, నీ ప్రజల్లో ఎవరి పేరు గ్రంథమందు వ్రాయబడిందో వారు తప్పించుకొంటారు. సమాధి చేయబడిన పెక్కుమంది మృతులు, మేల్కొంటారు. కొందరు నిత్యజీవానికి, కొందరు సిగ్గుపొందటానికి, శాశ్వతంగా తిరస్కారం పొందటానికి మేల్కొంటారు. జ్ఞానవంతులు ఆకాశమందలి జ్యోతుల్లాగ ప్రకాశిస్తారు, అనేకులను నీతి మార్గానికి నడిపించేవారు నక్షత్రాల్లాగ శాశ్వతంగా వెలుగుతారు

“కాని, దానియేలూ, నీవు, ఈ సందేశాన్ని రహస్యంగా ఉంచు. ఈ పుస్తకాన్ని నీవు అంత్యకాలం వరకు మూసి ఉంచు. చాలా మంది అటు ఇటు భూసంచారం చేయటంవల్ల తెలివి పెరుగుతుంది” అని గాబ్రియేలు నాతో చెప్పాడు.

అప్పుడు దానియేలు అను నేను చూస్తూండగా ఇద్దరు మనుష్యులు కనబడ్డారు. నది ఈ ఒడ్డున ఒకడు నది ఆ ఒడ్డున మరియొకడు నిలబడి ఉన్నారు. నార బట్టలు ధరించిన వ్యక్తి నదీజలాలమీద ఉన్నాడు. ఆ ఇరువురిలో ఒకడు, “ఈ ఆశ్చర్య సంగతులు నెరవేరటానికి ఎంతకాలము పడుతుంది?” అని నార బట్టలు ధరించినవాన్ని అడిగాడు.

నార బట్టలు ధరించి నదీజలాలమీదనున్న వ్యక్తి ఆకాశం వైపుగా తన కుడి, ఎడమ చేతులు ఎత్తి, సజీవుడైన దేవుని నామం మీద ప్రమాణం చేయటం నేను విన్నాను. ఏమనగా “ఒక కాలము, కాలములు, అర్ధకాలము (మూడున్నర సంవత్సరాలు) పడతాయి. పరిశుద్ధ ప్రజల బలం నాశనం చేయబడటం అంతం కాగానే ఈ సంగతులన్నీ నెరవేరుతాయి.”

నేను విన్నాను, కాని అర్థము చేసుకోలేకపోయాను. అందువల్ల, “అయ్యా, ఈ సంగతులు జరిగిన తర్వాత ఏమవుతుంది?” అని అడిగాను.

అందుకతడు, “దానియేలూ! నీవు దాటిపో. ఈ మాటలు అంత్యకాలం వరకు ముద్ర వేయబడి రహస్యంగా ఉంటాయి. 10 చాలామంది తమ్మును తాము పరిశుద్ధులుగా చేసుకొంటారు. తమ్మును తాము తెలుపుగాను, శుద్ధులుగాను చేసుకొంటారు. కాని చెడ్డవాళ్లు చెడ్డవాళ్లగానే ఉంటారు. ఆ దుర్జనులు ఈ విషయాలు అర్థం చేసుకోలేరు. కాని జ్ఞానవంతులు అర్థం చేసుకొంటారు.

11-12 “అనుదిన బలులు నిలిపివేసిన కాలం మొదలుకొని నాశనకరమైన అసహ్య వస్తువు నిలబెట్టబడిన కాలం వరకు ఒక వెయ్యి మూడువందల ముప్పైయైదు రోజులు వేచియుండి, ఆ దినముల అంతము వరకు ఉండువాడు ధన్యుడు.

13 “నీవు నీ జీవిత అంతం వరకు బ్రతికి, నీ విశ్రాంతిలో ప్రవేశించు. దినాల అంతమందు నీవు లేపబడి నీ స్థానములో నీవు నిలుస్తావు.”

కీర్తనలు. 119:49-72

జాయిన్

49 యెహోవా, నాకు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకొనుము.
    ఆ వాగ్దానం నాకు ఆశనిస్తుంది.
50 నేను శ్రమ పడుతున్నప్పుడు నీవు నన్ను ఆదరించావు
    నీ మాటలు నన్ను మరల బ్రతికించాయి.
51 నా కంటే తామే మంచివాళ్లు అనుకొన్న మనుష్యులు ఎడతెగక నన్ను అవమానించారు.
    కాని యెహోవా, నీ ఉపదేశాలను అనుసరించటం నేను మానుకోలేదు.
52 జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాను.
    యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాలు నన్ను ఆదరిస్తాయి.
53 నీ ఉపదేశాలను అనుసరించటం మానివేసిన దుర్మార్గులను చూస్తే
    నాకు చాలా కోపం వస్తుంది.
54 నీ న్యాయ చట్టాలు
    నా ఇంటివద్ద పాడుకొనే పాటలు.
55 యెహోవా, రాత్రివేళ నేను నీ నామం జ్ఞాపకం చేసుకొంటాను.
    నీ ఉపదేశాలను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నీ న్యాయ చట్టాన్ని నేను అనుసరిస్తాను.
56 నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను
    కనుక నాకు ఈలాగు జరుగుతుంది.

హేత్

57 యెహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా విధి అని నేను తీర్మానించుకొన్నాను.
58 యెహోవా, నేను పూర్తిగా నీమీద ఆధారపడుతున్నాను.
    నీ వాగ్దానం ప్రకారం నాకు దయచూపించుము.
59 నేను నా జీవితాన్ని గూర్చి చాలా జాగ్రత్తగా ఆలోచించాను.
    మళ్లీ నీ ఒడంబడికను అనుసరించటానికే వచ్చాను.
60 ఆలస్యం లేకుండా నీ ఆజ్ఞలకు విధేయత చూపాలని నేను త్వరగా మళ్లుకొన్నాను.
61 దుర్మార్గులు కొందరు నన్ను చుట్టుముట్టారు.
    అయితే యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
62 నీ మంచి నిర్ణయాల కోసం నీకు కృతజ్ఞత చెల్లించటానికి
    అర్ధరాత్రి వేళ నేను మేల్కొంటాను.
63 నిన్ను ఆరాధించే ప్రతి మనిషికీ నేను స్నేహితుడను.
    నీ ఆజ్ఞలకు విధేయత చూపే ప్రతి మనిషికి నేను స్నేహితుడను.
64 యెహోవా, నీ నిజమైన ప్రేమ భూమిని నింపుతుంది.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.

తేత్

65 యెహోవా, నీ సేవకుడనైన నాకోసం నీవు మంచి వాటిని జరిగించావు.
    నీవు చేస్తానని వాగ్దానం చేసిన వాటినే సరిగా నీవు చేశావు.
66 యెహోవా, నేను జ్ఞానంగల నిర్ణయాలు చేయడానికి నాకు గ్రహింపును ప్రసాదించు.
    నేను నీ ఆజ్ఞలను నమ్ముకొంటున్నాను.
67 నేను శ్రమపడక ముందు అనేక తప్పులు చేశాను.
    కాని ఇప్పుడు నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడనవుతున్నాను.
68 దేవా, నీవు మంచివాడవు, నీవు మంచి వాటినే చేస్తావు.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
69 నాకంటే తామే మంచి వాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి చెడుగా అబద్ధాలు చెబుతారు.
    కాని యెహోవా, నేను నా హృదయపూర్తిగా నీ ఆజ్ఞలకు లోబడుతూ, అలాగే కొనసాగుతున్నాను.
70 ఆ మనుష్యులు చాల తెలివితక్కువ వాళ్లు.
    నీ ఉపదేశాలు ధ్యానించటం నాకు ఆనందం.
71 శ్రమపడటం నాకు మంచిది.
    నేను నీ న్యాయ చట్టాలు నేర్చుకొన్నాను.
72 యెహోవా, నీ ఉపదేశాలు నాకు మంచివి.
    వెయ్యి వెండి, బంగారు నాణెముల కంటే నీ ఉపదేశాలు మంచివి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International