M’Cheyne Bible Reading Plan
నయమాను సమస్య
5 సిరియా రాజు యొక్క సైన్యాధిపతి నయమాను. రాజుకు అతడు అతి ముఖ్యుడు. ఎందుకనగా, యెహోవా అతనిని ఉపయోగించుకొని సిరియా విజయం సాధించేలా చేశాడు. నయమాను మహాశక్తిమంతుడు, గొప్పవాడు. కాని కుష్ఠువ్యాధి వలన అతను బాధ పడుతూ ఉన్నాడు.
2 ఇశ్రాయేలులో యుద్ధం చేయడానికై సిరియను సైన్యం అనేక బృందాల సైనికులను పంపింది. ఇశ్రాయేలీయులను వారి బానిసలుగా గ్రహించారు. ఒక సారి వారు ఇశ్రాయేలునుంచి ఒక అమ్మాయిని తీసుకువచ్చారు. ఆ అమ్మాయి నయమాను భార్యకు సేవకురాలుగా ఉంది. 3 ఆ అమ్మాయి నయమాను భార్యతో ఇలా చెప్పింది: “నా యజమాని (నయమాను) ప్రవక్తయైన ఎలీషాను కలుసుకోవాలని నా కోరిక. ఎలీషా షోమ్రోను నివాసి. ఆ ప్రవక్త నయమాను కుష్ఠువ్యాధిని బాగుచేయగలడు.”
4 నయమాను తన యజమాని (సిరియారాజు) వద్దకు వెళ్లాడు. సిరియా రాజుకు ఆ అమ్మాయి చెప్పిన విషయలు నయమాను తెలిపాడు.
5 అప్పుడు సిరియా రాజు, “అయితే ఇప్పుడే వెళ్లు. నేను ఇశ్రాయేలు రాజుకు ఒక లేఖ పంపుతాను” అన్నాడు.
అందువల్ల నయమాను ఇశ్రాయేలుకు వెళ్లాడు. నయమాను కొన్ని కానుకలు తీసుకు వెళ్లాడు. ఏడువందల పౌనుల వెండి, అరు వేల బంగారం ముక్కలు మరియు పది దుస్తులు నయమాను తీసుకువెళ్ళాడు. 6 సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకి ఇచ్చిన లేఖ కూడా తీసుకు వెళ్లాడు. ఆ లేఖలో ఇలా వుంది: “… నేను ఇప్పుడు నా సేవకుడైన నయమానుని నీ వద్దకు పంపుతున్నాను. అతని కుష్ఠువ్యాధిని నివారించుము.”
7 ఇశ్రాయేలు రాజు ఆ ఉత్తరం చదవగానే, తాను తలక్రిందులై నానని విచారంగా ఉన్నానని తెలిపేందుకు తన దుస్తులు చింపివేశాడు. ఇశ్రాయేలు రాజు, “నేను దేవుడినా? కాదు. జీవ మరణాల మీద నాకు శక్తిలేదు. అందువల్ల సిరియా రాజు కుష్ఠువ్యాధితో బాధపడే ఒకనిని స్వస్థపరుచుటకు నా వద్దకు ఎందుకు పంపినట్లు? దానిని గురించి ఆలోచించుము. అది ఒక మాయోపాయమని తెలియుచున్నది. సిరియా రాజు యద్ధానికి సన్నద్ధుడవుతున్నాడు” అని చెప్పాడు.
8 ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు తెలిసినపుడు ఈ క్రింది సందేశాన్ని రాజు పంపాడు: “నీవు నీ దుస్తులు ఎందుకు చింపివేసుకొన్నావు? నయమానుని నా వద్దకు పంపు. అప్పుడతను ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నట్లు తెలుసుకుంటాడు.”
9 ఈ కారణంగా నయమాను తన గుర్రాలతోను రథాలతోను ఎలీషా ఇంటికి వచ్చాడు. తలుపుకి వెలుపల నుంచున్నాడు. 10 ఎలీషా ఒక దూతను నయమాను వద్దకు పంపాడు. ఆదూత, “వెళ్లి, ఏడు మారులు యోర్దాను నదిలో స్నానం చేయుము. అప్పుడు నీ చర్మం నయమవుతుంది. నీవు శుద్ధుడవు అవుతావు, శుభ్రపడతావు” అన్నాడు.
11 నయమాను కోపపడి, వెళ్లిపోయాడు. అతను, “ఎలీషా కనీసం వెలుపలికి వచ్చి నా యెదుట నిలబడి తన దేవుడైన యెహోవాని పిలుస్తాడనుకున్నాను. నా ముందర చేయి ఆడించి మరి నా కుష్ఠువ్యాధి బాగుచేస్తాడని ఆశించాను. 12 దమస్కు నదులైన అబానా, ఫర్పరులు ఇశ్రాయేలులోని అన్ని జలాల కంటె మంచివి. నేనెందుకు దమస్కులోని ఆ నదులలో స్నానం చేసి శుద్ధుణ్ని కాకూడదు!” అని అనుకొని నయమాను మహోగ్రుడయి కోపంతో వెళ్లిపోయాడు.
13 కాని నయమాను సేవకులు అతనిని సమీపించి అతనితో మాట్లాడారు. వారు ఈ విధంగా అన్నారు: “తండ్రీ, ప్రవక్త మిమ్మల్ని ఒక కష్టమైన పని చెయ్యమని చెబితే, ఆ విధంగా చేయవా? అలాగే, నీతో సులభమైన పని చెప్పినా, అది కూడా పాటించాలి. అతను చెప్పిందేమనగా, కడుగుకొనుము, నీవు శుద్ధడవయ్యెదవు.”
14 అందువల్ల దైవజనుడు ఎలీషా చెప్పినట్లుగా నయమాను ఆచరించాడు. నయమాను యోర్దాను నది లోపలికి వెళ్లి ఏడు సార్లు మునిగాడు. వెంటనే నయమాను శుద్ధుడయ్యాడు. నయమాను చర్మం పసిపిల్లవాని చర్మంవలె మృదువుగా వుంది.
15 నయమాను మరియు అతని బృందంవారు దైవజనుడు (ఎలీషా) వద్దకు వచ్చారు. ఎలీషా ఎదుట అతను నిలబడి, “ఇదుగో, ఇశ్రాయేలులో తప్ప యీ ప్రపంచంలో మరెచ్చట కూడా దేవుడు లేడని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇప్పుడు నా కానుకను స్వికరింపుము” అని పలికాడు.
16 కాని ఎలీషా, “నేను యెహోవాను సేవిస్తున్నాను. యెహోవా జీవముతోడు, నేను ఎట్టి కానుకను స్వీకరింపనని వాగ్దానం చేస్తున్నాను” అన్నాడు.
నయమాను కష్టతరంగా అతనిని సముదాయించుటకు ప్రయత్నించాడు. కాని ఎలీషా తిరస్కరించాడు. 17 అప్పుడు నయమాను, “ఈ కానుకను కనుక నీవు స్వీకరించపోతే, కనీసం ఇదైనా నా కోసం చేయుము. నారెండు కంచర గాడిదలు మీది గంపలను ఇశ్రాయేలు దేశపు మన్నులో నింపుటకు అనుమతింపుము. ఎందుకనగా, ఇతర దేవతలకు నేను ఎన్నటికీ ఎటువంటి బలులు సమర్పించను, యెహోవాకి మాత్రమే సమర్పిస్తాను. 18 ఇది చేయడం వల్ల నన్ను యెహోవా క్షమించునట్లు యెహోవాని ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తులో, నా యజమాని (సిరియా రాజు) రిమ్మోను ఆలయంలోకి వెళ్లి అసత్య దేవతలను పూజిస్తాడు. రిమ్మోను ఆరాధన జరుగునప్పుడు నా సహాయము కొరకు రాజు నా మీద ఆధారపడి వుంటాడు. అందువల్ల నేను రిమ్మోను ఆలయంలో మోకరిల్లుతాను. అలా జరిగినప్పుడు నన్ను క్షమింపుమని యెహోవాని వేడుకొనుచున్నాను” అని పలికాడు.
19 “నెమ్మదికలిగి వెళ్లుము” అని ఎలీషా నయమానుకు చెప్పాడు.
అందువల్ల నయమాను ఎలీషాని విడిచి కొంతదూరం వెళ్లాడు. 20 కాని దైవజనుడు అయిన ఎలీషా సేవకుడు గేహజీ, “నా యజమాని (ఎలీషా) సిరియనుడయిన నయమానుని వెళ్లనిచ్చాడు. కాని అతడు తెచ్చిన కానుకను స్వీకరించలేదు. యెహోవా జీవము తోడుగా వెనుకనే నేను పరిగెత్తుకుపోయి, అతని వద్దనుంచి ఏదైనా తీసుకువస్తాను” అని అనుకున్నాడు. 21 అందువల్ల గేహజీ నయమాను వద్దకు పరుగెత్తుకు వెళ్లాడు.
తన వెనుక ఎవరో పరిగెత్తుకుని వస్తున్నట్లు నయమాను గ్రహించి. అతను తన రథం దిగి గేహజీని కలుసుకుని, “అంతా సవ్యంగా వుందిగదా” అని నయమాను అడిగాడు.
22 “అవును. అంతా సవ్యంగానే వుంది. నా యజమాని (ఎలీషా) నన్ను పంపాడు. ఇద్దరు యువకులు నావద్దకు వచ్చారనీ, కొండ దేశమైన ఎఫ్రాయిము నుంచి ప్రవక్తల బృందానికి వారు చెందిన వారనీ, వారికి డెభైఐదు పౌన్లు వెండి మరియు రెండురకాల దుస్తులు ఇమ్మని ఆయన చెప్పాడు” అని గేహజీ చెప్పాడు.
23 “అయ్యా, నూట ఏభై పౌన్లు తీసుకోండి” అని నయమాను చెప్పాడు. గేహజీ ఆ వెండిని తీసుకునేందుకు నయమాను అతనిని ఒప్పించాడు. నయమాను నూట ఏభై పౌన్లు వెండిని రెండు సంచులలో వేసి, రెండు రకాల దుస్తులు కూడా తీసుకున్నాడు. తర్వాత ఆ వస్తువుల్ని నయమాను తన సేవకులిద్దిరకి ఇచ్చాడు. గేహజీ కొరకు వారు ఆ వస్తువులను మోసుకు వెళ్లారు. 24 గేహజీ కొండ వద్దకు రాగానే, ఆ వస్తువులను అతని సేవకుల వద్దనుంచి తీసుకుని, ఆ సేవకులను పంపివేశాడు. వారు వెళ్లిపోయారు. తర్వాత గేహజీ ఆ వస్తువులను ఇంట్లో దాచాడు.
25 గేహజీ తన యజమాని అయిన ఎలీషా యెదుట నిలబడ్డాడు. గేహజీతో ఎలీషా, “గేహజీ, నీవు ఎక్కడికి వెళ్లావు?” అని అడిగాడు.
“నేనెక్కడికీ వెళ్లలేదు” అని గేహజీ చెప్పాడు.
26 “ఇది నిజం కాదు నిన్ను కలుసుకునేందుకు నయమాను తన రథంనుంచి క్రిందికి దిగినప్పుడు నా హృదయం నీతో వున్నది. పైకం, వస్త్రాలు, ఒలివలు, ద్రాక్షలు, గొర్రెలు, ఆవులు లేక స్త్రీ పురుష సేవకులు మొదలైనవి తీసుకునేందుకు ఇది సమయం కాదు. 27 ఇప్పుడు నీకు, నీ వంశానికి నయమాను వ్యాధి సంక్రమిస్తుంది. ఎల్లప్పుడూ నీకు కుష్ఠువ్యాధి వుంటుంది” అని ఎలీషా గేహజీతో చెప్పాడు.
ఎలీషాని విడిచి గేహజీ వెళ్లగానే, గేహజీ శరీరం మంచువలె తెల్లగా కనిపించింది. గేహజీకి కుష్ఠువ్యాధి కలిగింది.
ప్రార్థన
2 నేను మిమ్మల్ని వేడుకొనేదేమిటంటే, మొదట విజ్ఞాపనలు, ప్రార్థనలు, కృతజ్ఞతలు ప్రజలందరి పక్షాన చెయ్యండి. 2 ముఖ్యంగా రాజుల పక్షాన, అధికారుల పక్షాన దేవునికి విజ్ఞాపన చెయ్యండి. అప్పుడు మనము నిశ్చింతగా, శాంతంగా సత్ప్రవర్తనతో, ఆత్మీయతతో జీవించగల్గుతాము. 3 ఇలా చెయ్యటం ఉత్తమం. మరియు మన రక్షకుడైన దేవునికి అది సంతృప్తి కలిగిస్తుంది.
4 మానవులందరూ రక్షింపబడాలనీ, సత్యాన్ని గ్రహించాలనీ దేవుని ఇష్టం. 5 ఎందుకంటే ఒకే ఒక దేవుడున్నాడు. దేవునికి, మానవులకు మధ్య సంధి కుదుర్చటానికి ఒకే ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆయనే మానవునిగా జన్మించిన యేసు క్రీస్తు. 6 ఆయన మానవులకు విమోచన కలిగించాలని సరియైన సమయానికి తనను తాను ఒక వెలగా అర్పించుకొన్నాడు. మానవులందరూ రక్షింపబడటమే దేవుని ఉద్దేశ్యమన్నదానికి యిది నిదర్శనము. 7 అందువలన దేవుడు నన్ను ఒక దూతగా, అపొస్తలునిగా నియమించి యూదులు కానివాళ్ళకు నిజమైన విశ్వాసాన్ని బోధించటానికి పంపాడు. ఇది సత్యం. అబద్ధం కాదు.
స్త్రీ పురుషులకు ప్రత్యేక నియమాలు
8 అన్ని స్థలాల్లో పురుషులు ఆగ్రహం చెందకుండా, వాదనలు పెట్టుకోకుండా తమ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలని నా అభిలాష. వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నా ఈ విధంగా ప్రార్థించాలి.
9 స్త్రీలు గౌరవం కలిగించే దుస్తులు ధరించి, వినయంగా, మర్యాదగా ఉండాలి. బంగారు నగలు, ముత్యాలు, ఖరీదైన దుస్తులు, తలవెంట్రుకలతో నానా విధపు ముడులు వేయటం వారికి అలంకారముగా అనుకొనక, 10 దైవభక్తులమని చెప్పుకొనుటకు తగినట్లుగా సత్కార్యములనే ఆభరణాలను అలంకారంగా ధరించాలి.
11 స్త్రీలు నెమ్మదిగా ఉంటూ సంపూర్ణమైన వినయంతో ఉండటం నేర్చుకోవాలి. 12 స్త్రీలు బోధించటంగాని, పురుషులపై అధికారం చెయ్యటంగాని నేను ఒప్పుకోను. వాళ్ళు ఎక్కువగా మాట్లాడకూడదు. 13 దేవుడు ఆదామును మొదట సృష్టించాడు. ఆ తర్వాత హవ్వను సృష్టించాడు. 14 మోసపోయింది ఆదాము కాదు. స్త్రీ మోసపోయి పాపియైనది. 15 దేవుని పట్ల విశ్వాసము, పవిత్రత, ప్రేమ, మర్యాద అనే గుణాలు అలవర్చుకొంటె సంతానం కలుగుట ద్వారా స్త్రీలు రక్షింపబడతారు.
దానియేలు ప్రార్థన
9 మాదీయుడైన అహష్వేరోషు కుమారుడగు దర్యావేషు బబులోను రాజ్యానికి రాజైన మొదటి సంవత్సరంలో జరిగిన సంగతి ఇది. 2 దర్యావేషు రాజుగా ఉండిన మొదటి సంవత్సరంలో, దానియేలు అను నేను, దేవుని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా వ్రాయించిన సంగతిని గ్రహించాను. ఏమనగా యెరూషలేము డెబ్బై సంవత్సరాలు పాడుబడినదిగా ఉండవలసిన సమయము పూర్తి అవుతూందని గ్రహించాను.
3 తర్వాత నేను గోనెపట్ట ధరించి, బూడిదలో కూర్చొని ఉపవాసముండి నా ప్రభువైన దేవునికి నా మనవిని ప్రార్థన విజ్ఞాపన ద్వారా తెలియపర్చుకొన్నాను. 4 నా దేవుడైన యెహోవాకు ప్రార్థించి నా పాపములన్నిటినీ ఒప్పుకొన్నాను.
“ప్రభువా! నీవు భయంకరుడవైన మహా దేవుడవు. నిన్ను ప్రేమించి, నీ ఆజ్ఞలకు లోబడే ప్రజలపట్ల నీ ఒడంబడికను నెరవేరుస్తావు.
5 “ప్రభువా! మేము పాపాలు చేశాము. మేము చెడ్డ పనులు చేసి నీకు విరుద్ధంగా ప్రవర్తించాము. మేము నీ ఆజ్ఞలకు, నీ విధులకు అవిధేయులమయ్యాం. 6 ప్రవక్తలు నీ తరపున మా రాజులతోను, నాయకులతోను, మా తండ్రులతోను, దేశంలోని ప్రజలందరితోను మాట్లాడారు. మేము నీ సేవకులైన ప్రవక్తల మాటలు వినలేదు.
7 “ప్రభువా, నవు నీతిమంతుడవు. మేము అనగా యూదా, యెరూషలేము ప్రజలు, మా పితరులు నీకు ద్రోహము చేసిన కారణాన దూర, సమీప దేశాలకు చెదరగొట్టబడిన ఇశ్రాయేలువారమైన మేము ఈ దినాన సిగ్గు పడవలసినవారమై యున్నాము.
8 “ప్రభువా! మా రాజులు, నాయకులు, మా పూర్వీకులు నీకు విరోధంగా పాపం చేసినందువల్ల మేము సిగ్గు పడవలసినవారమైతిమి.
9 “ప్రభువు దయామయుడు, క్షమాపణా స్వభావం గలవాడు. అయినను మేము నిజంగానే నీకు విరుద్ధంగా పాపం చేశాము. 10 మేము మా దేవుడైన యెహోవా మాటలు పాటించలేదు. తన సేవకులైన ప్రవక్తలద్వారా యెహోవా మాకు ప్రసాదించిన ఆ చట్టాలను అతిక్రమించాము. 11 ఇశ్రాయేలు ప్రజలు నీ బోధనలకు విధేయులు కాకుండా వారందరూ నీకు విముఖులయ్యారు. దేవుని సేవకుడైన మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన శాపాలు, ప్రమాణాలు మా మీద క్రుమ్మరించ బడ్డాయి. ఎందుకంటే, మేము నీ యెడల పాపం చేశాము
12 “దేవుడు మాకును, రాజులకును విరోధంగా పలికిన మాటలు మా యెడల జరిగేటట్లు చేశాడు. ఎలాగనగా ఆకాశం క్రింద ముందెన్నడూ జరుగని మహా విపత్తును యెరూషలేము యెడల జరిగించుట ద్వారా మాపై ఈ శిక్షను విధించాడు. 13 ఆ భయంకర విషయాలన్నీ మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లుగానే మాకు జరిగాయి. మేము మా పాపాలు మాని, ఆయన సత్యాన్ననుసరించి నడుచుకొని, ప్రభువు దయను పొందేటట్లు ప్రయత్నించలేదు. 14 ప్రభువు మా మీదికి నాశనాన్ని రప్పించటానికి వెనుకాడలేదు. ఎందుకంటే మా దేవుడైన ప్రభువు ఈ కార్యాలన్నిటిలో నీతిమంతుడు. కాని మేము ఆయనకు విధేయులం కాలేదు.
15 “మా దేవుడవైన యెహోవా, నీవు నీ మహాశక్తివల్ల నీ ప్రజల్ని ఈజిప్టునుండి వెలుపలికి తెచ్చావు. అందువలననే నీవీనాటికినీ నీ నామాన్ని గొప్పదిగా చేశావు. కాని మేము చెడుగా ప్రవర్తించి పాపం చేశాము. 16 దేవా, నీ నీతి క్రియలను దృష్టిలో ఉంచుకొని, పరిశుద్ధ పట్టణంపట్ల, యెరూషలేంపట్ల నీ కోపాన్ని మానుము. మా పాపాలవల్ల, మా పూర్వీకుల అపరాధాలవల్ల యెరూషలేము, నీ ప్రజలు మా పొరుగువారి మధ్యలో అవమానం పాలైరి.
17 “కాబట్టి మా దేవా! ఇప్పుడు, నీ సేవకుడనైన నా ప్రార్థన, మనవి ఆలకించుము. నీ నామం కొరకు, ప్రభువా! నీ ముఖకాంతి పాడుబడిన నీ పరిశుద్ధ స్థలంమీద ప్రకాశించుగాక! 18 నా దేవా, నీ చెవి వంచి నా ప్రార్థన వినుము! నీ కన్నులు తెరిచి, పాడుబడిన, నీ పేరు పెట్టబడిన ఈ నగరముపైన నీ దృష్టినుంచుము. మేము నీతిమంతులమని కాదుగాని, నీవు కృపామయుడవని నీకు మొర పెట్టుచున్నాము. 19 ప్రభువా! నా మొర ఆలకించు. ప్రభువా! మమ్ము మన్నించుము. ప్రభువా, మా ప్రార్థన విని, సహాయం చేయి. నా దేవా! ఆలస్యం చేయవద్దు. నా దేవా, నీ నామ మహిమ కొరకు నీ పట్టణం, నీ ప్రజలు నీ పేరును ధరించియున్నారు.”
డెబ్బై వారాల దర్శనం
20 నేనింకా మాట్లాడుచూ, ప్రార్థిస్తూ, నా పాపాన్ని గురించి, ఇశ్రాయేలు పాపాలను గురించి ఒప్పుకుంటూ ఉంటిని. నా దేవుని పరిశుద్ధ పర్వతాన్ని గురించి ప్రభువైన నా దేవునికి ప్రార్థిస్తూ ఉంటిని. 21 నేను ప్రార్థన చేస్తూ ఉండగా నా దర్శనంలో ఇంతకు ముందు నేను చూసిన గాబ్రియేలు దూత త్వరగా సాయంకాలపు బలియర్పణ సమయాన వచ్చాడు. 22 అతడు వచ్చి, నాతో ఇలా చెప్పాడు: “దానియేలూ, నేను నీకు వివేకము, గ్రహింపు ఇవ్వడానికి వచ్చాను. 23 నీవు ప్రార్థన చేయడానికి మొదలు పెట్టినప్పుడు దాని సమాధానం నాకు యివ్వబడింది. దాన్ని నేను నీకు చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే నీవు దేవునికి ప్రియమైన వాడవు. కాబట్టి నా మాట విని దర్శనాన్ని అర్థం చేసుకో.
24 “నీ ప్రజలకు, నీ పవిత్ర నగరానికి డెబ్బై వారాల గడువు ఇవ్వబడింది: అనగా అతిక్రమాన్ని ముగించటానికి, పాపాన్ని అంతం చేయటానికి, అపరాధాన్ని ప్రాయశ్చిత్తం చేయటానికి, నీతిని శాశ్వతంగా తేవటానికి, దర్శనాన్ని, ప్రవచనాన్ని ముద్రించటానికి మరియు పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించటానికి డెబ్బై వారాలు పడుతుంది.
25 “కాబట్టి ఈ విషయం తెలుసుకొని గ్రహించుకో. యెరూషలేమును తిరిగి కట్టమని సందేశం బయలు వెళ్లిన సమయంనుండి, అభిషేకింపబడిన రాజు వరకు ఏడు వారాలు మరియు అరవైరెండు వారాలు. యెరూషలేము రాజవీధులతోను, కందకములతోను మరల కట్టబడుతుంది, కాని కష్ట సమయాల్లో అది కట్టబడుతుంది. 26 అరవై రెండు వారాల తర్వాత అభిషేకింపబడిన రాజు[a] చంపబడతాడు. అప్పుడు రాబోయే రాజుయొక్క ప్రజలు నగరాన్ని, పరిశుద్ధ స్థలాన్ని నాశనం చేస్తారు. దాని అంతం ఒక ప్రళయంతో వస్తుంది. అంతం వరకు యుద్ధం కొనసాగుతుంది. నాశనాలు జరగటానికి ఆజ్ఞాపించబడ్డాయి.
27 “ఒక వారంపాటు రాబోయే రాజు చాలామందితో ఒక స్థిరమైన ఒప్పందం చేస్తాడు. అర్ధవారంకు బలి అర్పణలు నిలుపు చేస్తాడు. అసహ్య కార్యాలు జరిగించే (దేవాలయములో) నాశనకారుడు ఒకడు వస్తాడు. ఆజ్ఞా పించబడిన అంతము ఈ నాశనకారుని మీద క్రుమ్మరించబడేవరకు ఈ విధముగా జరుగుతుంది”
117 సర్వ దేశములారా, యెహోవాను స్తుతించండి.
సర్వ ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
2 దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు.
దేవుడు శాశ్వతంగా మన పట్ల నమ్మకంగా ఉంటాడు.
యెహోవాను స్తుతించండి!
118 యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.
2 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము.
3 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
అని యాజకులారా, మీరు చెప్పండి.
4 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
అని యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరు చెప్పండి.
5 నేను కష్టంలో ఉన్నాను. గనుక సహాయం కోసం నేను యెహోవాకు మొర పెట్టాను,
యెహోవా నాకు జవాబిచ్చి, నన్ను విముక్తుని చేశాడు.
6 యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయపడను.
నన్ను బాధించుటకు మనుష్యులు ఏమీ చేయలేరు.
7 యెహోవా నా సహాయకుడు;
నా శత్రువులు ఓడించబడటం నేను చూస్తాను.
8 మనుష్యులను నమ్ముకొనుటకంటే
యెహోవాను నమ్ముట మేలు.
9 మీ నాయకులను నమ్ముకొనుట కంటే
యెహోవాను నమ్ముకొనుట మేలు.
10 అనేకమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
యెహోవా శక్తితో నేను నా శత్రువులను ఓడించాను.
11 శత్రువులు మరల మరల నన్ను చుట్టుముట్టారు.
యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.
12 తేనెటీగల దండులా శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
కాని వేగంగా కాలిపోతున్న పొదలా వారు అంతం చేయబడ్డారు.
యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.
13 నా శత్రువు నా మీద దాడి చేసి దాదాపుగా నన్ను నాశనం చేశాడు.
కాని యెహోవా నాకు సహాయం చేశాడు.
14 యెహోవా నా బలం, నా విజయ గీతం!
యెహోవా నన్ను రక్షిస్తాడు!
15 మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు.
యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
16 యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి.
యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
17 నేను జీవిస్తాను! కాని మరణించను.
మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబుతాను.
18 యెహోవా నన్ను శిక్షించాడు,
కాని ఆయన నన్ను చావనియ్య లేదు.
19 మంచి గుమ్మములారా, నా కోసం తెరచుకోండి,
నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను.
20 అవి యెహోవా గుమ్మాలు.
ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు.
21 యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
22 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి
మూలరాయి అయ్యింది.
23 ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు.
అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము.
24 ఈ వేళ యెహోవా చేసిన రోజు.
ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!
25 ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి.
దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా, దయచేసి మమ్మల్ని వర్ధిల్లజేయుము.
26 యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం చెప్పండి.”
యాజకులు ఇలా జవాబు ఇచ్చారు, “యెహోవా ఆలయానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము!
27 యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీకరిస్తాడు.
బలి కోసం గొర్రెపిల్లను కట్టివేయండి. బలిపీఠపు కొమ్ముల[a] వద్దకు గొర్రెపిల్లను మోసికొని రండి.”
28 యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
నేను నిన్ను స్తుతిస్తున్నాను.
29 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
© 1997 Bible League International