Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 రాజులు 4

ప్రవక్తయొక్క విధవరాలైన భార్య ఎలీషాని సహాయం అడగటం

ప్రవక్తల బృందానికి చెందిన ఒకనికి భార్య ఉన్నది. అతడు మరణించాడు. అతని భార్య ఎలీషాతో, “నాభర్తకూడా నీకు ఒక సేవకుడు. ఇప్పుడు నా భర్త మరణించాడు. అతను యెహోవాని గౌరవించెనని నీకు తెలుసు. కాని అతను ఒక మనిషికి అప్పువుండెను. ఇప్పుడా వ్యక్తి నా ఇద్దరు కొడుకులను తీసుకు వెళ్లి వారిని తన బానిసులుగా చేసుకోవలెనని అనుకున్నాడు” అని విన్నవించింది.

“నేను నీకెలా సహాయం చేయగలను? మీ ఇంట్లో ఏమున్నదో చెప్పుము” అని ఎలీషా అడిగినాడు.

ఆమె, “మా ఇంట్లో ఏమీ లేదు. ఒలీవ నూనెగల ఒక జాడీ వున్నది” అని బదులు చెప్పింది.

అప్పుడు ఎలీషా, “వెళ్లి మీ ఇరుగు పొరుగు వారి వద్ద నుంచి పాత్రలు అడిగి తీసుకొనిరా. అవి ఖాళీగా ఉండాలి. చాలా పాత్రలు అడిగి తీసుకో. తర్వాత మీ ఇంటికి పోయి తలుపులు మూసుకో. నీవు నీ కుమారులు మాత్రం ఇంటిలో వుండాలి. అటు తర్వాత నూనెను ఆ పాత్రలో పోయుము. వాటిని వేరే ఒక చోట ఉంచుము” అని చెప్పాడు.

అందువల్ల ఆ స్త్రీ ఎలీషాని విడిచి తన ఇంటిలోకి వెళ్లి తలుపులు మూసుకొనినది. ఆమెయు తన కొడుకులు మాత్రమే ఇంట్లో వున్నారు. ఆమె కుమారులు పాత్రలు తెచ్చారు. ఆమె వాటిలో నూనె పోసింది. ఆమె చాలా పాత్రలు నింపింది. చివరికి, “మరొక పాత్ర తీసుకొని రమ్ము” అని తన కొడుకుతో చెప్పింది.

కాని అన్ని పాత్రలు నిండిపోయివున్నాయి. ఒక కుమారుడు ఆమెతో, “ఇక పాత్రలులేవు” అని చెప్పాడు. ఆ సమయంలో జాడీలోని నూనె కూడ పూర్తి అయింది.

ఏమి జరిగిందో, అప్పుడు ఆ స్త్రీ ఎలీషాతో చెప్పింది. ఎలీషా ఆమెతో అన్నాడు, “వెళ్లు, నూనెను అమ్మి నీ అప్పు తీర్చి వేయి. నీవు నూనెను అమ్మిన తర్వాత, నీ అప్పును తీర్చిన తర్వాత నీవు నీ కుమారులు మిగిలిన పైకంతో జీవించగలుగుతారు.”

షూనేములోని ఒక స్త్రీ ఎలీషాకి గది ఇచ్చుట

ఒకరోజు ఎలీషా షూనేము వెళ్లాడు. ఒక ముఖ్యమైన స్త్రీ షూనేములో నివసిస్తున్నది. ఈ స్త్రీ తన ఇంట విశ్రమించి భోజనం చేయమని ఎలీషాను కోరింది. కనుక ఆ ప్రదేశం మీదుగా ఎలీషా వెళ్లిన ప్రతిసారి అక్కడ ఆగి భోజనం చేసేవాడు.

ఆ స్త్రీ తన భర్తతో, “ఇదుగో, నాకు ఎలీషా దేవుని పవిత్ర వ్యక్తిగా గోచరిస్తున్నాడు. ఎప్పుడూ అతను మన ఇంటి మీదుగా వెళ్తాడు. 10 ఎలీషా కోసం మనము ఇంటి పై భాగాన ఒక గదిని కట్టిద్దాము. ఆ గదిలో ఒక మంచము కూడా అమర్చుదాము. అక్కడ ఒక మేజాబల్ల, ఒక కుర్చీ, ఒక దీపం ఉంచుదాము. ఎప్పుడైతే అతను మన ఇంటికి వస్తాడో అప్పుడు దీనిని అతను తన గదిగా వాడుకోవచ్చు” అని చెప్పింది.

11 ఒక రోజు ఎలీషా ఆమె ఇంటికి వచ్చాడు. అతను ఆ గదికి వెళ్లి, అక్కడ విశ్రమించాడు. 12 ఎలీషా తన సేవకుడైన గేహజీతో, “ఆ షూనేము స్త్రీని పిలువుము” అని చెప్పాడు.

సేవకుడు షూనేము స్త్రీని పిలిచాడు. ఆమె ఎలీషా ఎదుట నిలిచింది. 13 ఎలీషా తన సేవకునితో ఇట్లనెను: “ఇప్పుడీమెకు చెప్పుము. మాకోసం నీవు చేయదగినదంతా చేశావు. నీ కోసం మేమేమి చేయుదుము? మేము నీ పక్షమున రాజుతో గాని, సైన్యం యొక్క నాయకునితో గాని ఏమైనా చెప్పమంటావా?”

ఆ స్త్రీ, “నేను నా ప్రజల మధ్య హాయిగా ఇక్కడ నివసిస్తున్నాను” అని బదులు చెప్పింది.

14 “మనమామెకు ఏమి చేద్దాం?” అని ఎలీషా గేహజీని అడిగాడు.

“ఆమెకు కొడుకు లేడని నాకు తెలియును. ఆమె భర్త ముసలివాడు” అని ప్రత్యుత్తర మిచ్చాడు.

15 అప్పుడు ఎలీషా, “ఆమెను పిలువుము” అన్నాడు.

అందువల్ల గేహజీ ఆమెను పిలుచుకొని వచ్చాడు. ఆమె వచ్చి అతని ఎదుట నిలబడింది. 16 ఎలీషా ఆమెతో, “వచ్చే వసంత కాలంలో, ఈ పాటికి నీవు నీ సొంత మగ బిడ్డను కౌగిలించుకుని ఉందువు” అన్నాడు.

ఆ స్త్రీ, “కాదు దైవజనుడా! నాతో అబద్ధం చెప్పకు” అని చెప్పింది.

షూనేము స్త్రీకి కొడుకు పుట్టుట

17 ఆమె గర్భవతి అయింది. ఎలీషా చెప్పినట్లుగా, తరువాత వసంత ఋతువులో ఆమె ఒక కుమారుని ప్రసవించింది.

18 ఆ పిల్లవాడు పెరిగాడు. ఒకరోజు అతను కంకుల్ని కోస్తున్న తన తండ్రిని పనివారిని చూసేందుకు పొలం లోకి వెళ్లాడు. ఆ పిల్లవాడు 19 తండ్రి చూచి, “అయ్యో, నా తల, నా తల పగిలిపోతున్నది” అన్నాడు.

“అతనిని ఆ తల్లి వద్దకు ఎత్తుకొని వెళ్లండి” అని తండ్రి తన సేవకునికి చెప్పెను.

20 సేవకుడు ఆపిల్లవానిని అతని తల్లి వద్దకు తీసుకు వెళ్లాడు. మధ్యాహ్నం దాకా పిల్లవాడు తల్లి తొడమీద కూర్చొని వున్నాడు. తర్వాత ఆపిల్లవాడు మరణించాడు.

ఎలీషాని చూడటానికి ఆ స్త్రీ వెళ్లటం

21 దైవజనుడైన (ఎలీషా) పడకమీద ఆమె తన పిల్లవానిని ఉంచి ఆమె ఆ గది తలుపు మూసివేసి వెలుపలికి వెళ్లింది. 22 ఆమె తన భర్తను పిలిచి, “ఒక సేవకుని ఒక గాడిదను పంపుము. అప్పుడు నేను దైవజనుని (ఎలీషా) కలుసుకునేందుకు తర్వగా వెళ్లెదను” అని చెప్పింది.

23 ఆమె భర్త, “దైవజనుని (ఎలీషా) వద్దకు నేడెందుకు నీవు వెళ్లుచున్నావు. నేడు అమావాస్య గాని సబ్బాతు రోజుగాని కాదు” అన్నాడు.

“ఫరవాలేదు అంతా సక్రమంగానే వుంటుంది” అని ఆమె చెప్పింది.

24 తర్వాత ఆమె గాడిదకు ఒక గంత పరిచింది. ఆ సేవకునితో, మనము తర్వగా వెళదాము, వేగముగా తోలుము, నేను చెప్పేంత వరుకూ నెమ్మదిగా తోలవద్దని చెప్పింది.

25 ఆ స్త్రీ దైవజనుడను (ఎలీషా) చూసేందుకు కర్మెలు పర్వతానికి వెళ్లింది.

దైవజనుడు (ఎలీషా) షూనేము స్త్రీ చాలాదూరంనుండి వస్తుండగా చూశాడు. ఎలీషా తన సేవకుడైన గేహజీతో చెప్పాడు “చూడు ఆమె షూనేము స్త్రీ, 26 ఇప్పుడే పరుగెత్తుకుని వెళ్లు, ఆమెను కలుసుకునేందుకు, ‘ఏమి కష్టం? నీవు సరిగా వున్నావా? నీ భర్త సరిగా వున్నడా? నీ బిడ్డ సరిగావున్నాడా? అని ఆమెను కలుసుకొని అడుగుము.’” గేహజీ ఆ విధంగా ఆ షూనేము స్త్రీని అడిగాడు.

ఆమె, “అంతా క్షేమము” అని చెప్పింది.

27 కాని ఆ షూనేము స్త్రీ దైవజనుని కోసం కొండ మీదికి వెళ్లి, క్రిందికి వంగి, ఎలీషా పాదాలు తాకింది. గేహజీ ఆమెను పక్కకు తొలగించాలని ఆమె దగ్గరికి వచ్చాడు. కాని దైవజనుడు (ఎలీషా) గేహజీని చూచి, “ఆమెను ఉండనీ. ఆమె చాలాబాధగా ఉన్నది. ఆ సంగతి నాకు యెహోవా చెప్పలేదు. యెహోవా ఈ విషయం నాకు చెప్పక దాచాడు.” అని పలికాడు.

28 అప్పుడు షూనేము స్త్రీ, “అయ్యా నాకు కొడుకు కావలయునని నేను చెప్పలేదు గదా. నన్ను మోసం చెయవద్దు” అన్నాను, అని అనగా

29 వెంటనే గేహజీతో, ఎలీషా, “నీవు ఆమెతో వెళ్లడానికి సిద్ధంగా వుండుము. నా చేతికర్ర తీసుకుని వెళ్లుము. ఎవరితోను మాటలాడుటకు ఆగవద్ద. ఎవరినైనా నీవు కలుసుకుంటే, అతనితో నమస్కారము అనికూడా చెప్పకుము. ఒకవేళ ఎవరైన నీకు, ‘నమస్కారము’ అన్నట్లయితే, అతనికి బదులు చెప్పకుము. నా చేతి కర్రను బిడ్డ ముఖమున ఉంచుము” అని చెప్పాడు.

30 కాని ఆబిడ్డ తల్లి, “నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. యెహోవా జీవంతోడు, నీ జీవం తోడు నీవు రాకుండా నేను వెళ్లను” అంది.

అందువల్ల ఎలీషా లేచి, షూనేము స్త్రీని అనుసరించాడు.

31 ఎలీషా మరియు షూనేము స్త్రీ చేరుకునేందుకు ముందుగా, గేహజీ షూనేము స్త్రీ ఇల్లు చేరుకున్నాడు. ఆ బిడ్డ ముఖము మీద ఆ కర్రను ఉంచాడు. కాని బిడ్డ మాటలాడలేదు. ఏమియు వినిపించిన జాడ కూడా తెలియరాలేదు. అప్పుడు గేహజీ ఎలీషాని కలుసు కోవడానికి వెలుపలికి వచ్చాడు. “బిడ్డ లేవలేదు” అని గేహజీ ఎలీషాకి చెప్పాడు.

షూనేము స్త్రీ కుమారుడు మరల బ్రతుకుట

32 ఎలీషా ఇంట్లోకి వెళ్లాడు. తన మంచం మీద ఆ బిడ్డ చనిపోయివున్నాడు. 33 ఎలీషా గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు. ఇప్పుడు ఎలీషా మరియు ఆబిడ్డ మాత్రమే గదిలో వున్నారు. అప్పుడు ఎలీషా యెహోవాని ప్రార్థించాడు. 34 ఎలీషా పడక వద్దకు వెళ్లాడు. బిడ్డ మీద పడుకున్నాడు. ఎలీషా తన నోటిని బిడ్డ నోటిమీద వుంచాడు. ఎలీషా తన కండ్లను బిడ్డ కండ్ల మీద వుంచాడు. తరువాత బిడ్డ దేహం వేడి ఎక్కేంత వరకు బిడ్డమీద ఎలీషా పండుకొన్నాడు.

35 తర్వాత ఎలీషా లేచి ఆ గది చుట్టూ తిరిగాడు. వెనుకకు వెళ్లి, బిడ్డ ఏడు సార్లు తుమ్మేంత వరకూ కళ్లు తెరిచేంతవరకూ బిడ్డ మీద పండుకొన్నాడు.

36 ఎలీషా గేహజీని పిలిచి, “ఆ షూనేము స్త్రీని పిలువుము” అని చెప్పాడు.

గేహజీ షూనేము స్త్రీని పిలిచాడు. ఆమె ఎలీషా వద్దకు వచ్చింది. “నీ కొడుకుని ఎత్తుకో” అని ఎలీషా చెప్పాడు.

37 తర్వాత షూనేము స్త్రీ గదిలోకి వెళ్లి, ఎలీషా పాదాలకు మోకరిల్లింది. ఆ తర్వాత తన పిల్లవాడిని ఎత్తుకుని ఆమె వెలుపలికి వెళ్లింది.

ఎలీషా మరియు విషం కలిసిన కూర

38 ఎలీషా మరల గిల్గాలుకు వెళ్లాడు. అప్పుడా ప్రదేశంలో ఆకలి ఎక్కువగా వుంది. ప్రవక్తల బృందం ఎలీషా ముందు కూర్చున్నారు. ఎలీషా తన సేవకునితో, “పెద్ద కుండను నిప్పుమీద ఉంచుము. ప్రవక్తల బృందానికి కూర తయారు చేయి” అని చెప్పాడు.

39 ఒక వ్యక్తి మూలికలు తీసుకు వచ్చేందుకు పొలం వెళ్లాడు. అతను పిచ్చి ద్రాక్ష చూసి దాని కాయలు తీసుకు వచ్చాడు. ఆ కాయలు తన ఒడిలో కట్టుకుని తీసుకుని వచ్చాడు. అతను ఆ కాయలను ముక్కలు చేసి కుండలో వేశాడు. కాని అది ఏరకపు ఫలమో ప్రవక్తల బృందానికి తెలియదు.

40 తర్వాత వారు మనష్యులకు కొంచెం కూర తినడానికి వడ్డించారు. కాని వారు కూర తినడానికి ప్రారంభించగా, ఎలీషాని పిలిచి, “దైవజనుడా! కుండలో విషం ఉన్నది” అని అన్నారు. ఆ కూర విషంలా వుంది. అందువల్ల అది వారు తినలేకపోయారు.

41 అప్పుడు ఎలీషా, “కొంచెం పిండి తీసుకురండి” అన్నాడు. వారు పిండిని ఎలీషా వద్దకు తీసుకు వచ్చారు. దాన్ని అతను కుండలో వేసి. “మనుష్యులకు ఆ కూర వడ్డించండి. వారు భుజిస్తారు” అని ఎలీషా చెప్పాడు.

ఆ కూరలో ఎలాంటి దోషం లేదు.

ప్రవక్తల బృందానికి ఎలీషా ఆహారమిచ్చుట

42 బయల్షాలిషా నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. అతడు మొదటి పంటవల్ల లభించిన ఇరవై యవల రొట్టెలు, క్రొత్త ధాన్యపు కంకులను, కొన్ని పండ్లను దైవజనునికి ఇచ్చాడు. ఎలీషా అప్పుడు, “వీటిని వారికి ఆహారంగా ఇవ్వండి” అన్నాడు.

43 ఎలీషా సేవకుడు, “ఏమిటి? ఇక్కడ వంద మంది ఉన్నారు. నేను వారందరికీ ఈ ఆహారం ఎలా ఇవ్వగలను?” అని అన్నాడు.

కాని ఎలీషా, “వారు తినడానికిగాను అది ఇమ్ము. వారది భుజిస్తారు. ఇంకా కొంచెం ఆహారం మిగులు తుంది అని యెహోవా చెప్పాడు” అన్నాడు.

44 అప్పుడు ఎలీషా సేవకుడు ఆ ఆహారమును ప్రవక్తల ముందుంచాడు. ప్రవక్తల బృందం తినడానికి తగినంత ఆహారం ఉండి, పైగా ఇంకా ఆహారం మిగిలి పోయింది. యెహోవా చెప్పినట్లుగానే ఇది జరిగింది.

1 తిమోతికి 1

విశ్వాసంలో నా కుమారునితో సమానమైన తిమోతికి పౌలు వ్రాయడం ఏమనగా, నేను మన రక్షకుడైన దేవుని ఆజ్ఞానుసారమూ, మనకు రక్షణ లభిస్తున్న ఆశకు మూలకారకుడైన యేసు క్రీస్తు ఆజ్ఞానుసారమూ, యేసు క్రీస్తుకు అపొస్తలుడనయ్యాను.

తండ్రి అయినటువంటి దేవుడు, మన యేసు క్రీస్తు ప్రభువు, నీపై అనుగ్రహం చూపాలనీ, నిన్ను కరుణించాలనీ, నీకు శాంతి చేకూర్చాలనీ ఆశిస్తున్నాను.

దొంగ బోధకుల విషయంలో జాగ్రత్త

నేను మాసిదోనియకు వెళ్ళినప్పుడు నీకు చెప్పిన విధంగా నీవు ఎఫెసులో ఉండుము. అక్కడ కొందరు తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తున్నారు. వాళ్ళతో ఆ విధంగా చెయ్యవద్దని చెప్పు. అంతేకాక, వాళ్ళు కల్పితగాథలు చెప్పకూడదనీ, అంతు పొంతులేని వంశావళులతో సమయం వ్యర్థం చేయవద్దని కూడా ఆజ్ఞాపించు. ఇలాంటివి దైవకార్యానికి తోడ్పడడానికి బదులుగా చీలికలు కల్గిస్తాయి. దైవకార్యం విశ్వాసంతో కూడుకొన్నపని. ఇందులోని ఉద్దేశ్యం ఏమిటంటే, పవిత్ర హృదయం నుండీ, స్వచ్ఛమైన అంతరాత్మ నుండీ, నిజమైన విశ్వాసం నుండీ ఉద్భవించే ప్రేమను కలిగియుండటమే. కొందరు వ్యక్తులు నిజమైన ధ్యేయం మరిచిపోయి, వ్యర్థంగా తిరిగిపోయారు. తాము ధర్మశాస్త్ర పండితులు కావాలనుకొంటారు. కాని వాళ్ళకు వాళ్ళు చెప్పే మాటలే తెలియదు. నమ్మకంతో మాట్లాడుతున్న విషయాలను గురించి వాళ్ళకు తెలియదు.

ధర్మశాస్త్రాన్ని మానవుడు సక్రమంగా ఉపయోగిస్తే మంచిదని మనకు తెలుసు. మంచివాళ్ళ కోసం ధర్మశాస్త్రం వ్రాయబడలేదని మనకు తెలుసు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించేవాళ్ళకోసం, తిరుగుబాటు చేసేవాళ్ళ కోసం, దేవుణ్ణి నమ్మనివాళ్ళకోసం, భక్తిహీనుల కోసం, పాపుల కోసం, అపవిత్రమైనవాళ్ళకోసం, తల్లిదండ్రులను గౌరవపరచనివాళ్ళకోసం, హంతకుల కోసం, 10 వ్యభిచారుల కోసం, కామంతో అసహజంగా ప్రవర్తించేవాళ్ళకోసం, బానిస వ్యాపారం చేసేవాళ్ళకోసం, అసత్యాలాడేవాళ్ళకోసం, దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళ కోసం, నిజమైన బోధనకు వ్యతిరేకంగా నడుచుకొనేవాళ్ళకోసం, అది వ్రాయబడింది. 11 నాకందించిన దివ్యమైన ఆ సువార్తలో ఈ ఉపదేశం ఉంది. దాన్ని తేజోవంతుడైన దేవుడు నాకందించాడు.

దేవుని దయకు నేను కృతజ్ఞుణ్ణి

12 నాకు శక్తినిచ్చి, నన్ను విశ్వాసపాత్రునిగా ఎంచి, ఈ సేవకోసం నన్ను నియమించిన మన యేసు క్రీస్తు ప్రభువుకు నా కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. 13 ఒకనాడు నేను దైవదూషణ చేసినవాణ్ణి, హింసించిన వాణ్ణి, క్రూరుణ్ణి. నేను అమాయకంగా నాలో విశ్వాసం లేకపోవడం వల్ల అలా ప్రవర్తించానని దేవుడు నన్ను కనికరించాడు. 14 మన ప్రభువు తన అనుగ్రహాన్ని నాపై ధారాళంగా కురిపించాడు. ఆ అనుగ్రహంతో పాటు యేసు క్రీస్తులో ఉన్న విశ్వాస గుణాన్ని, ప్రేమను కూడా నాకు ప్రసాదించాడు.

15 పాపులను రక్షించటానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది విశ్వసింపదగిన విషయం. దీన్ని అందరూ అంగీకరించాలి. ఆ పాపుల్లో నేను ప్రథముణ్ణి. 16 నేను ప్రథముణ్ణి కనుకనే యేసు నాపై దయ చూపాడు. ఈ విధంగా తనను విశ్వసించబోయేవాళ్ళకు, తనవల్ల విముక్తి పొందబోయేవాళ్ళకు అనంతమైన తన సహనము ఆదర్శంగా ఉండాలని అంతులేని సహనాన్ని ప్రదర్శించాడు. 17 చిరకాలం రాజుగా ఉండే దేవునికి, కంటికి కనిపించని, చిరంజీవి అయినటువంటి ఆ ఒకే ఒక దేవునికి గౌరవము, మహిమ చిరకాలం కలుగుగాక! ఆమేన్.

18 తిమోతీ, నా కుమారుడా! గతంలో ప్రవక్తలు నీ భవిష్యత్తును గురించి చెప్పారు. దాని ప్రకారం మంచి పోరాటం సాగించి ఆ ప్రవక్తలు చెప్పినవి సార్థకం చేయమని ఆజ్ఞాపిస్తున్నాను. 19 విశ్వాసంతో, మంచి హృదయంతో పోరాటం సాగించు. కొందరు వీటిని వదిలి తమ విశ్వాసాన్ని పోగొట్టుకొన్నారు. 20 హుమెనై, అలెక్సంద్రు ఇలాంటి వాళ్ళు. వీళ్ళు దైవదూషణ చెయ్యకుండా ఉండటం నేర్చుకోవాలని వాళ్ళను సాతానుకు అప్పగించాను.

దానియేలు 8

దానియేలు దర్శనం-పొట్టేలుమరియు మేకపోతు

బెల్షస్సరు రాజుగా ఉన్న మూడవ సంవత్సరంలో, నాకు ఈ దర్శనము కలిగింది. ఇది మొదటి దర్శనానికి తర్వాత వచ్చింది. ఆ దర్శనంలో నేను షూషనులో ఉన్నట్లు చూశాను. ఏలాం రాష్ట్రంలో షూషను ఒక రాజధాని నగరం. నేను ఊలయి నది ప్రక్క నిలబడి ఉన్నాను. నా కన్నులెత్తి ఊలయి నదికి ప్రక్కగా ఒక పొట్టేలు నిలబడి ఉండడం చూశాను. ఆ పొట్టేలుకి రెండు పొడుగాటి కొమ్ములున్నాయి. కాని ఒకటి మరొకదాని కంటె పొడుగైనది. పొడుగాటి కొమ్ము తర్వాత పుట్టింది. ఆ కొమ్ములతో పొట్టేలు పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి పరుగెత్తడం చూశాను. ఏ మృగమూ పొట్టేలుని ఎదిరించలేక పోయింది. మరియు ఎవ్వరూ దీనినుండి ఇతర జంతువుల్ని కాపాడలేక పోయారు. ఆ పొట్టేలు చేయదలచిందంతా చేస్తూంది. అందువల్ల పొట్టేలు చాలా శక్తివంత మయింది.

నేను ఆ పొట్టేలు గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఒక మేకపోతు పడమరనుండి రావడం చూశాను. అది భూమి అంతటా చుట్టి వచ్చింది. దాని కాళ్లు భూమిని కూడా తాకలేదు. ఈ మేకపోతుకు ఒక పెద్ద కొమ్ము దాని కళ్ల మధ్యన ఉంది.

ఆ మేకపోతు ఊలయి నదికి ప్రక్కగా నిలబడివున్న రెండు కొమ్ములు గల పొట్టేలు వద్దకు వచ్చింది. మేకపోతు చాలా కోపంగా ఉంది. మేకపోతు పొట్టేలువైపు పరుగెత్తి చాలా కోపంతో కలబడి పొట్టేలు రెండు కొమ్ముల్ని విరుగ కొట్టింది. మేకపోతును పొట్టేలు ఎదిరించలేకపోయింది. మేకపోతు పొట్టేలుని నేలకు పడవేసి దాన్ని త్రొక్కివేసింది. ఆ మేకపోతునుండి పొట్టేలుని కాపాడగలిగినవారెవ్వరూ లేకపోయిరి.

అందువల్ల మేకపోతు చాలా బలంగా పెరిగింది. కాని అది శక్తివంతంగా వున్నప్పుడు, దాని పెద్ద కొమ్ము విరిగిపోయింది. తర్వాత ఆ పెద్ద కొమ్ము స్థానంలో నాలుగు వేరే కొమ్ములు మొలిచాయి. ఆ నాలుగు కొమ్ములు ఆకాశపు నాలుగు దిక్కులలో పెరిగాయి.

తర్వాత ఆ నాలుగు కొమ్ములలో ఒకదానినుండి ఒక చిన్న కొమ్ము పెరిగి బాగా పెద్దదయింది. అది దక్షిణ దిక్కుగా, తూర్పు దిక్కుగా, సుందర దేశం దిక్కుగా పెరిగింది. 10 ఆ చిన్నకొమ్ము బాగా పెద్దదయి ఆకాశాన్ని అంటేంత వరకు పెరిగింది. అది నక్షత్రాల్ని కూడా క్రిందికి త్రోసి కాళ్ల క్రింద త్రొక్కి వేసింది. 11 ఆ చిన్న కొమ్ము బాగా గర్వించి ఆ నక్షత్రాల సైన్యాధిపతికి ఎదురు తిరిగింది. అది పరిపాలకుని అనుదిన బల్యర్పణాన్ని ఆపివేసి. ఆయన ఆలయాన్ని పడగొట్టింది. 12 తిరుగుబాటు జరిగినందున (పరిశుద్ధుల) సైన్యం మరియు అనుదిన బలి దాని వశం చేయ బడ్డాయి. సత్యం నేలకు అణచి వేయబడింది. చేసిన ప్రతి దానిలో అది బాగా అభివృద్ధి చెందింది.

13 అంతట ఒక పరిశుద్ధుడు మాట్లాడటం విన్నాను. ఇంకొక పరిశుద్ధుడు మొదటి వానిని ఇలా అడిగాడు: “ఈ దర్శనం నెరవేరటానికి ఎంత కాలం పడుతుంది? అనుదిన బలిని గూర్చిన దర్శనం, నాశనం కలిగించు తిరుగుబాటు, పరిశుద్ధ స్థలం మరియు పరిశుద్ధుల సైన్యం కాళ్ల క్రింద త్రొక్కబడటం ఇవన్నియు నెరవేరటానికి ఎంతకాలము పడుతుంది?”

14 అతడు నాతో ఇలా అన్నాడు: “దానికి రెండువేల మూడువందల రోజులు పడతాయి. అప్పుడు పవిత్ర స్థలం తిరిగి పరిశుద్ధం చేయబడుతుంది.”

దానియేలుకి దర్శనం వివరించబడింది

15 దానియేలు అను నేను ఈ దర్శనం చూశాను. అది యేమిటో తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తూండగా మానవునివంటి ఒకతను నా ఎదుట నిలిచాడు. 16 తర్వాత ఒక మనిషి స్వరం ఊలయి నదిమీదినుంచి ఇలా వినవచ్చింది, “గాబ్రియేలూ, ఈ దర్శనమును ఈ వ్యక్తికి వివరింపుము.”

17 నేను నిలుచుండిన స్థలానికి గాబ్రియేలు రాగా నేను భయభ్రాంతుడనై నేలమీద సాష్టాంగపడ్డాను. గాబ్రియేలు దూత నాతో, “మానవపుత్రుడా!, ఈ దర్శనం అంత్యకాలానికి సంబంధించిందని తెలుసుకో” అని చెప్పాడు.

18 గాబ్రియేలు దూత నాతో మాటలాడుతూ ఉండగా, నేను నేలమీద సాష్టాంగపడి, గాఢనిద్ర పోయాను. అప్పుడు అతను నన్ను తాకి పైకి లేవనెత్తాడు. 19 గాబ్రియేలు దూత ఇలా చెప్పాడు: “శ్రమకాలంపు చివరిలో ఏమి జరుగుతుందో నీకు ఇప్పుడు చెపుతాను. ఈ దర్శనం నియమించబడిన అంత్యకాలానికి సంబంధించింది” అని అన్నాడు.

20 “రెండు కొమ్ములు గల పొట్టేలును నీవు చూశావు. ఆ కొమ్ములు మాదీయ, పారసీక దేశాలు. 21 బొచ్చుగల మేకపోతు గ్రీకు రాజు, దాని కళ్ల మధ్యవున్న పెద్ద కొమ్ము మొదటి రాజు. 22 ఆ కొమ్ము విరిగి పోయింది. ఆ స్థానంలో నాలుగు కొమ్ములు మొలిచాయి. ఆ కొమ్ములు మొదటి రాజు సామ్రాజ్యంనుంచి చీలిన నాలుగు రాజ్యాలు. కాని ఆ నాలుగు రాజ్యాలు మొదటి రాజువలె బలిష్ఠంగా ఉండవు.

23 “ఆ రాజ్యాలకు అంతం సమిపించే సమయాన, వారి దుష్టత్వం నిండినప్పుడు, మొండితనపు ముఖముగలిగి జిత్తులమారి అయిన ఒక రాజు లేస్తాడు. ఈ రాజు తన శక్తి వల్ల కాకుండానే మహా శక్తిమంతుడవుతాడు. 24 ఇతడు భయంకరమైన నాశనాన్ని తెస్తాడు. ఇతడు చేసే ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది. అతను శక్తిమంతులైన మనుష్యుల్ని, చివరికి దేవుని ప్రత్యేక జనుల్ని కూడా నాశనం చేస్తాడు.

25 “ఈ రాజు చాలా మోసగాడు, జిత్తులమారి అయివుండి, తన యుక్తి ఉపయోగించి, వంచనతో గెలుపొందుతాడు. తాను అతి ముఖ్యుడనని భావిస్తాడు. ప్రజలు క్షేమంగా ఉన్నామని తలస్తూన్నప్పుడు ఇతడు చాలా మందిని, రాజాధిరాజును సహితం ఎదిరిస్తాడు. అయినా ఇతడు నాశనం చేయబడతాడు, కాని మానవ శక్తివల్ల కాదు.

26 “ఆ కాలాన్ని గురించి నీకివ్వబడిన దర్శనం నిజమైంది. కాని ఆ దర్శనానికి ముద్ర వేయి. ఎందుకనగా అది అంత్యకాల సంబంధమైనది.”

27 దానియేలు అను నేను అలసిపోయి చాలా రోజలు జబ్బు పడ్డాను. రాజుకు పనిచేసే నిమిత్తం నేను మరల లేచి వెళ్ళాను. కాని నేను ఆ దర్శనాన్ని తలంచుకుని కలతచెందాను. కాని దాని అర్థమేమిటో నాకు తెలియలేదు.

కీర్తనలు. 116

116 యెహోవా నా ప్రార్థనలు విన్నప్పుడు
    నాకు ఎంతో సంతోషం.
సహాయంకోసం నేను ఆయనకు చేసిన మొర
    ఆయన విన్నప్పుడు నాకు ఇష్టం.
నేను దాదాపు చనిపోయాను. మరణ పాశాలు నన్ను చుట్టుకొన్నాయి.
    సమాధి నా చుట్టూరా మూసికొంటుంది.
    నేను భయపడి చింతపడ్డాను.
అప్పుడు నేను యెహోవా నామం స్మరించి,
    “యెహోవా, నన్ను రక్షించుము.” అని అన్నాను.
యెహోవా మంచివాడు, జాలిగలవాడు.
    యెహోవా దయగలవాడు.
నిస్సహాయ ప్రజలను గూర్చి యెహోవా శ్రద్ధ తీసుకొంటాడు.
    నేను సహాయం లేకుండా ఉన్నాను, యెహోవా నన్ను రక్షించాడు.
నా ఆత్మా, విశ్రమించు!
    యెహోవా నిన్ను గూర్చి శ్రద్ధ తీసుకొంటాడు.
దేవా, నా ఆత్మను నీవు మరణం నుండి రక్షించావు.
    నా కన్నీళ్లను నీవు నిలిపివేశావు.
    నేను పడిపోకుండా నీవు నన్ను పట్టుకొన్నావు.
సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను.

10 “నేను నాశనమయ్యాను!”
    అని నేను చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొనే ఉన్నాను.
11 నేను భయపడి “మనుష్యులంతా అబద్ధీకులే”
    అని చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొంటూనే ఉన్నాను.

12 యెహోవాకు నేను ఏమివ్వగలను?
    నాకు ఉన్నదంతా యెహోవాయే నాకిచ్చాడు.
13 నన్ను రక్షించినందుకు
    నేను ఆయనకు పానార్పణం యిస్తాను.
    యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను.
14 నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను.
    ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి యెదుటికి వెళ్తాను.

15 యెహోవా అనుచరులలో ఎవరి మరణమైనా ఆయనకు ఎంతో దుఃఖకరము.
    యెహోవా, నేను నీ సేవకుల్లో ఒకడ్ని.
16 నేను నీ సేవకుడను. నీ సేవకులలో ఒకరి కుమారుడ్ని నేను.
    యెహోవా, నీవే నా మొదటి గురువు.
17 నేను నీకు కృతజ్ఞత అర్పణ యిస్తాను.
    యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను.
18 నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను.
    ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి ఎదుటికి వెళ్తాను.
19 యెరూషలేములో ఆయన ఆలయానికి నేను వెళ్తాను.
    యెహోవాను స్తుతించండి!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International