M’Cheyne Bible Reading Plan
ఇశ్రాయేలుకి యెహోరాము రాజవుట
3 అహాబు కుమారుడైన యెహోరాము షోమ్రోనులో ఇశ్రాయేలుకు రాజయ్యాడు. యూదా రాజుగా యెహోషాపాతు 18 వ పరిపాలనా సంవత్సరమున అతను పాలించడానికి మొదలు పెట్టాడు. యెహోరాము 12 సంవత్సరములు పరిపాలించాడు. 2 యెహోవా తప్పని చెప్పిన పనులు యెహోరాము చేశాడు. కాని యెహోరాము తన తల్లిదండ్రులవంటి వాడు కాడు. బయలు దేవతను పూజించేందుకు తన తండ్రి నిర్మించిన స్తంభాన్ని అతడు తొలగించాడు. కాని నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలను అతడు చేశాడు. 3 యరొబాము ఇశ్రాయేలువారిని పాపములు చేసేటట్లు చేశాడు. యెహోరాము యరొబాము చేసిన పాపాలను అనుసరించాడు.
ఇశ్రాయేలు నుండి మోయాబు వేరు పడుట
4 మోయాబు రాజు మేషా. మేషావద్ద చాలా మేకలుండెను. మేషా 1,00,000 గొర్రెల ఉన్నిని 1,00,000 గొర్రె పొట్టేలుల ఉన్నిని ఇశ్రాయేలు రాజుకి ఇచ్చాడు. 5 కాని అహాబు మరణించిన తర్వాత, మోయాబు రాజు ఇశ్రాయేలు రాజ్యపరిపాలనకు తిరుగుబాటు చేశాడు.
6 తర్వాత యెహోరాము రాజు షోమ్రోను నుండి వెలుపలికి పోయి ఇశ్రాయేలు మనుష్యులందరిని సమీకరించాడు. 7 యెహోరాము యూదారాజైన యెహోషాపాతు వద్దకు దూతలను పంపాడు. యెహోరాము ఇట్లన్నాడు: “మోయాబు రాజు, నా పరిపాలనపై తిరుగబడ్డాడు. మోయాబుతో యుద్ధము చేయడానికి నీవు నాతో కలసెదవా?”
యెహోషాపాతు, “అలాగే నేను నీతో కలుస్తాను. మనమిద్దరము ఒక సైన్యమవుదాము. నా ప్రజలు నీ ప్రజలవలె వుంటారు. నా గుర్రములు నీ గుర్రములవలె వుంటాయి.” అని చెప్పాడు.
ఆ ముగ్గురు రాజులు ఎలీషా సలహా కోరుట
8 యెహోషాపాతు యెహోరాముతో, “మనము ఏ త్రోవను వెళ్లాలి?” అని అడిగాడు.
“మనము ఎదోము ఎడారిద్వారా వెళ్లాలి” అని యెహోరాము సమాధానమిచ్చాడు.
9 అందువల్ల ఇశ్రాయేలు రాజు, యూదా, ఎదోము రాజులతో కలిసి వెళ్లాడు. ఏడు రోజులపాటు వాళ్లు ప్రయాణం చేశారు. తమ సైన్యనానికి గానీ, జంతువులకు గానీ తగినంత నీరు దొరకలేదు. 10 చివరికి ఇశ్రాయేలు రాజు (యెహోరాము) ఇలా చెప్పాడు, “యెహోవా నిజంగానే మన ముగ్గురిని మోయాబు రాజులను ఓడించటానికే ఒకటిగా చేశాడు.”
11 కాని యెహోషాపాతు, “తప్పక యెహోవా యొక్క ఒక ప్రవక్త అక్కడే వున్నాడు. మనమేమి చేయవలెనో యెహోవాని అడగమని మనము ఆ ప్రవక్తను అడుగుదాము” అనిచెప్పాడు.
ఇశ్రాయేలు రాజు సేవకుడొకడు, “షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడే వున్నాడు. ఎలీషా ఎలీయా యొక్క సేవకుడు” అనిచెప్పాడు.
12 “యెహోవా మాట ఎలీషాతో ఉన్నది” అని యెహోషాపాతు పలికాడు.
అందువల్ల ఇశ్రాయేలు రాజు (యెహోరాము), ఎదోము రాజు మరియు యెహోషాపాతు ఎలీషాని దర్శించటానికి వెళ్లారు.
13 ఇశ్రాయేలురాజు (యెహోరాము)తో ఎలీషా, “నా నుండి నీకేమి కావలెను! నీ తల్లిదండ్రులయొక్క ప్రవక్తల వద్దకు పొమ్ము” అన్నాడు.
ఇశ్రాయేలు రాజు ఎలీషాతో, “అలా కాదు. మేము నిన్ను దర్శించుటకే వచ్చాము. మమ్మల్ని మోయాబీయులను ఓడించటానికి మా ముగ్గురి రాజులను దేవుడు ఒకటిగా పిలిచాడు” అని చెప్పాడు.
14 “నేను యూదా రాజయిన యెహోషాపాతును గౌరవిస్తున్నాను. యెహోవా పేరు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. సర్వశక్తిమంతుడైన యెహోవాను నేను సేవిస్తాను. యెహోవా జీవముతోడు యెహోషాపాతు కనుక లేకపోయినచో నేను నిన్ను శ్రద్ధ చేయక నిన్ను పూర్తిగా నిర్లక్ష్యము చేసేవాడిని. 15 కాని ఇప్పుడు వీణ వాయించే వానిని తీసుకొని రమ్ము.” అని ఎలీషా చెప్పాడు.
ఆ వ్యక్తి వీణ వాయించగానే, యెహోవా యొక్క శక్తి ఎలీషా మీదికి వచ్చింది. 16 అప్పుడు ఎలీషా, “యెహోవా చెప్పుచున్నది ఇదే. లోయలో రంధ్రాలు చేయండి. 17 యెహోవా చెప్పుచున్నది ఇదే. నీవు పెనుగాలిని చూడవు. నీవు వానను చూడవు. కాని లోయ నీటితో నిండి ఉంటుంది. అప్పుడు నీవు, నీ ఆవులు, జంతువులు తాగటానికి నీరు లభిస్తుంది. 18 ఇది చేయడం యెహోవాకు సులభం మోయాబీయులను ఓడించేలా యెహోవా చేయగలడు. 19 నీవు ప్రతి దృఢమైన నగరముపై మరియు ప్రతి మంచి నగరముపై దాడి చేస్తావు. నీవు ప్రతి మంచి వృక్షాన్ని నరికి వేస్తావు. అన్ని ఊటలను నీవు నిలిపివేయగలవు. నీవు విసిరివేసే రాళ్లతో ప్రతి మంచి స్థలమును నీవు పాడుచేస్తావు” అని పలికాడు.
20 ఉదయాన దేవునికి బలి జరిగే సమయంలో ఎదోము మార్గము నుండి నీరు ప్రవహించడం ప్రారంభమయ్యింది. లోయ నిండింది.
21 మోయాబు లోని ప్రజలు తమతో యుద్ధం చేయడానికి గాను రాజులు వచ్చిన విషయము విన్నారు. కవచములు ధరించడానికి మనుష్యులందరు ఒక్కటిగా వయసు మళ్లిన వారైయున్నారు. వారు సరిహద్దు వద్ద వేచి ఉన్నారు. వారు యుద్ధానికి సిద్ధమయ్యారు. 22 ఆ రోజు ఉదయం వారు పెందలకడనే మేల్కోన్నారు. లోయలోని నీళ్లలో ప్రభాత సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అది మోయాబు ప్రజలకు నెత్తురువలె కనిపించింది. 23 “నెత్తురు చూడుడి! రాజులు తమలో తాము పోరాడుకొని వుండవచ్చును. ఒకరి నొకరు నాశనము చేసికొని వుండవచ్చు. మృత శరీరముల నుండి విలువగల వస్తువులు తీసుకొనుటకు గాను మనము వెళ్దాము” అని మోయాబు ప్రజలు చెప్పుకున్నారు.
24 మోయాబు ప్రజలు ఇశ్రాయేలు గుడారము వద్దకు వచ్చారు. కాని ఇశ్రాయేలు వారు వెలుపలికి వచ్చి మోయాబు సైన్యాన్ని ఎదుర్కొన్నారు. ఇశ్రాయేలు ప్రజల నుండి మోయాబు ప్రజలు పారిపోయారు. ఇశ్రాయేలు వారు మోయాబు దాకా పరుగెత్తుకు పోయి మోయాబు ప్రజలతో యుద్ధం చేశారు. 25 ఇశ్రాయేలు వారు నగరములను ధ్వంసం చేశారు. వారు మోయాబులోని ప్రతి మంచి పట్టణము మీదికి రాళ్లు విసిరివేశారు. నీటి బావులన్నిటినీ పూడ్చి వేసినారు. అన్ని ఊటలను ఆపి వేశారు. అన్ని మంచి చెట్లను నరికివేశారు. కీర్హరెశెతు వరకు వారు యుద్ధం చేస్తూ వెళ్లారు. ఇశ్రాయేలు సైనికులు కీర్హరెశెతు చుట్టు ముట్టి, దాని మీద దాడిచేశారు.
26 మోయాబు రాజు ఆ యుద్ధము తనకు కష్టమైనదిగా చూశాడు. అందువల్ల ఖడ్గములు ధరించిన ఏడువందల మంది మనుష్యుల్ని తీసుకొని సైన్యాన్ని ఛేదించడానికి, ఎదోము రాజుని హతమార్చడానికిగాను వెళ్లాడు. కాని వారు ఎదోము రాజుని ఎదుర్కొనలేక పోయారు. 27 తర్వాత మోయాబు రాజు తన పెద్దకొడుకుని వెంట తీసుకొనిపోయాడు. తన అనంతరము రాజు కావలసిన కుమారుడు అతడే. తన కుమారుని ప్రాకారము మీద దహన బలిగా అర్పించాడు. ఇది చూచిన ఇశ్రాయేలీయులు తల క్రిందులయ్యారు. అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు మోయాబు రాజుని విడిచి తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు.
మా కోసం ప్రార్థించండి
3 సోదరులారా! చివరకు చెప్పేదేమిటంటే మా కోసం ప్రార్థించండి. ప్రభువు సందేశం మీలో వ్యాపించిన విధంగా త్వరలోనే మిగతా వాళ్ళలో కూడా వ్యాపించి కీర్తి చెందాలని ప్రార్థించండి. 2 విశ్వాసం అందరిలో ఉండదు. కనుక దుర్మార్గుల నుండి, దుష్టుల నుండి మేము రక్షింపబడాలని ప్రార్థించండి.
3 కాని ప్రభువు నమ్మతగినవాడు. కనుక ఆయన మిమ్మల్ని సాతాను నుండి రక్షించి మీకు శక్తి కలిగిస్తాడు. 4 మా ఆజ్ఞల్ని పాటిస్తున్నారనీ ఇక ముందుకునూ పాటిస్తారని మాకు నమ్మకం ఉంది. ఈ నమ్మకం మాకు ప్రభువు వల్ల కలిగింది. 5 తండ్రియైన దేవునిలో ఉన్న ప్రేమ, క్రీస్తులో ఉన్న సహనము మీ హృదయాల్లో నింపబడాలని మా అభిలాష.
పని చెయ్యటం మీ కర్తవ్యం
6 సోదరులారా! యేసు క్రీస్తు ప్రభువు పేరిట మేము ఆజ్ఞాపిస్తున్నదేమనగా, మా నుండి విన్న క్రీస్తు సందేశం ప్రకారం జీవించక అక్రమంగా జీవిస్తున్న ప్రతి సోదరునితో సాంగత్యం చెయ్యకండి. 7 మమ్మల్ని అనుసరించాలని మీకు బాగా తెలుసు. మేము మీతో ఉన్నప్పుడు సోమరులంగా ఉండలేదు. 8 అంతేకాక మేము ఎవరి ఇంట్లోనైనా ఊరికే భోజనం చేయలేదు. మీలో ఎవ్వరికీ కష్టం కలిగించరాదని మేము రాత్రింబగళ్ళు కష్టపడి పని చేసాము. 9 మీ నుండి అలాంటి సహాయం కోరే అధికారం మాకు ఉంది. కాని మీకు ఆదర్శంగా ఉండాలని అలా చేసాము. 10 మేము మీతో ఉన్నప్పుడే, “మనిషి పని చేయకపోతే భోజనం చేయకూడదు” అని చెప్పాము.
11 మీలో కొందరు సోమరులని విన్నాము. వాళ్ళు పని చెయ్యకపోవటమే కాకుండా ఇతరుల విషయంలో జోక్యం కలుగ చేసుకొంటున్నారని విన్నాము. 12 వాళ్ళు ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోరాదని, తాము తినే ఆహారం పనిచేసి సంపాదించాలని యేసు క్రీస్తు పేరిట ఆజ్ఞాపిస్తున్నాము. 13 ఇక మీ విషయమంటారా, మంచి చెయ్యటం మానకండి.
14 ఈ లేఖలో వ్రాసిన మా ఉపదేశం ఎవరైనా పాటించకపోతే అలాంటివాళ్ళను ప్రత్యేకంగా గమనించండి. అలాంటివాణ్ణి సిగ్గుపడేటట్లు చెయ్యటానికి అతనితో సాంగత్యం చేయకండి. 15 అయినా అతణ్ణి శత్రువుగా పరిగణించకుండా సోదరునిగా భావించి అతణ్ణి వారించండి.
చివరి మాట
16 శాంతిని ప్రసాదించే ప్రభువు మీకు అన్ని వేళలా, అన్ని విధాలా శాంతి ప్రసాదించు గాక! పైగా ఆయన మీ అందరికీ తోడై ఉండుగాక!
17 పౌలను నేను, నా స్వహస్తాలతో మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా లేఖలన్నిటిలో నేను ఇదే విధంగా సంతకం చేస్తాను. ఇది నా పద్ధతి.
18 మన యేసు క్రీస్తు అనుగ్రహం మీ అందరికీ లభించుగాక!
నాలుగు మృగాల్ని గూర్చి దానియేలుకు కల
7 బెల్షస్సరు[a] బబులోనుకు రాజుగా ఉన్న మొదటి సంవత్సరంలో, దానియేలు ఒక కలగన్నాడు. దానియేలు ఈ దర్శనాలు చూశాడు. అప్పుడతను తన పడకమీద పడుకునివున్నాడు. తాను కలగన్న విషయాల్ని దానియేలు వ్రాశాడు. 2 దానియేలు ఇలా చెప్పాడు: “నేను రాత్రివేళ ఒక దర్శనం చూశాను. అందులో నాలుగు వైపులనుండి గాలి వీచింది. ఆ గాలులకు సముద్రం అల్లకల్లోలంగా ఉండింది. 3 నేను నాలుగు పెద్ద మృగాల్ని చూశాను. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా వున్నాయి. ఆ నాలుగు మృగాలు సముద్రం నుండి పైకి వచ్చాయి.
4 “మొదటి మృగము సింహంవలె ఉండింది. దానికి గ్రద్ద రెక్కలున్నాయి. ఆ మృగాన్ని గమనిస్తూండగా దాని రెక్కలు విరిచివేయబడ్డాయి. అది నేలనుండి పైకి లేచి, మనిషిలాగ రెండు కాళ్లమీద నిలబడింది. దానికి మానవుని మనస్సువంటి మనస్సు ఇవ్వబడింది.
5 “ఆ తర్వాత నా ఎదుట రెండవ మృగాన్ని చూశాను. ఇది ఎలుగుబంటివలె కనిపించింది. ఒక వైపుకి అది లేవనెత్తబడింది. దాని నోట్లో పళ్ల మధ్య మూడు ప్రక్కటెముకలున్నాయి. పైకి లేచి, నీకు కావలసినంత మాంసం తిను” అని దానికి చెప్పబడింది.
6 “తర్వాత నేను చూడగా నా ఎదుట మూడవ మృగము ఉంది. ఇది చిరుతపులిలాగ ఉంది. దానివీపుమీద నాలుగు పక్షి రెక్కలున్నాయి. దీనికి నాలుగు తలలున్నాయి. పరిపాలించే అధికారం దానికి ఇవ్వబడింది.
7 “ఆ తర్వాత, నా దర్శనాలలో రాత్రివేళ చూస్తూండగా నా ఎదుట నాలుగవ మృగము ఉంది. ఇది చాలా ఘోరంగాను, భయంకరంగాను కనిపించింది. అది మహా బలంగా ఉంది. దానికి ఇనుప పళ్లు ఉన్నాయి. ఈ మృగం సమస్తాన్ని ముక్కలుగా చీల్చి మ్రింగుచూ, మిగిలిన దాన్ని తన కాళ్ల క్రింద త్రొక్కుచుండినది. అంతకు మునుపు నేను చూసిన ఇతర మృగాలకంటె ఈ నాలుగవ మృగం భిన్నంగా ఉంది. దీనికి పది కొమ్ములున్నాయి.
8 “ఈ కొమ్ముల విషయం నేను తలస్తూండగా వాటిమధ్యలో ఒక చిన్న కొమ్ము పైకి వచ్చింది. దాని స్థానంలో మొదట ఉన్న మూడు కొమ్ములు కుదురుతో సహా పెరికివేయబడ్డాయి. ఈ చిన్న కొమ్ముమీద మానవ కళ్లలాంటి కళ్లు, డంబాలు పలికేనోరు దానికి ఉన్నాయి.
నాలుగవ మృగం తీర్పు
9 “నేను చూస్తూండగా సింహాసనాలు వేయబడ్డాయి.
మరియు ప్రాచీన రాజు[b] తన సింహాసనమున ఆసీనుడై ఉన్నాడు.
ఆయన వస్త్రాలు మంచులా తెల్లగాను,
ఆయన తల వెంట్రుకలు స్వచ్ఛమైన ఉన్నివలె తెల్లగా ఉండినవి.
ఆయన సింహాసనం అగ్ని జ్వాలలతోను,
ఆ సింహాసనపు చక్రాలు మంటలతోను మండుచున్నవి.
10 ఆయన ఎదుట నుండి
అగ్ని ప్రవాహము బయలు వెళ్లింది.
వేవేల కొలది ఆయనకు సేవ చేస్తూ ఉన్నారు.
కోట్లకొలది ఆయన ఎదుట నిలబడ్డారు.
తీర్పుకై ఆయన న్యాయసభలో
కూర్చుండగా గ్రంథాలు తెరువబడ్డాయి.
11 “చిన్న కొమ్ము గర్వపు మాటలు మాట్లాడుచున్న శబ్దం విని అటు చూశాను. నేను చూస్తుండగా ఆ నాలుగవ మృగం చంపబడింది. దాని శరీరం నాశనం చేయబడింది. అది మండుచున్న మంటల్లోకి త్రోసివేయబడింది. 12 మిగిలిన మృగాల అధికారం వాటినుండి తీసివేయబడింది. కాని కొంతకాలంపాటు అవి నివసించి ఉండడానికి అనుమతి ఇవ్వబడింది.
13 “రాత్రి దర్శనాలలో, మానవ కుమారుని పోలిన ఒక వ్యక్తి రావటం నేను చూశాను. ఆయన ఆకాశంలోని మబ్బులమీద ప్రాచీన రాజు[c] వద్దకు వచ్చి, ఆయన ముందు నిలబడ్డాడు.
14 “మానవ కుమారునివలె కనిపించిన ఆ వ్యక్తికి అధికారం, ప్రభావం, సంపూర్ణ పరిపాలనాధికారం ఇవ్వబడ్డాయి. అందునుబట్టి ప్రజలందరు, అన్ని దేశాలు, ప్రతి భాషకు చెందినవారు ఆయన్ని సేవిస్తారు. ఆయన పరిపాలన ఎప్పటికీ ఉంటుంది. ఆయన రాజ్యం ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. అది ఎన్నటికీ అంతం కానిది.
దానియేలు కల భావము
15 “దానియేలు అను నేను నా ఆత్మలో చింతించాను. నేను చూసిన దర్శనాలు నన్ను కలవర పెట్టాయి. 16 అక్కడ నిలబడిన ఒకనిని నేను సమీపించి ఇదంతా ఏమిటని అతన్ని అడిగాను. 17 అందువల్ల, అతను వాటి అర్థాలేమిటో వివరించి చెప్పాడు, ‘నాలుగు మృగాలు నాలుగు రాజ్యాలు.[d] ఆ నాలుగు రాజ్యాలు భూమిమీద ఉద్భవిస్తాయి. 18 కాని మహోన్నతుడైన దేవుని ప్రత్యేక జనులే ఆ రాజ్యాన్ని పొందుతారు. వారా రాజ్యాన్ని ఎల్లప్పుడూ కలిగియుంటారు.’
19 “తర్వాత ఆ నాలుగవ మృగంయొక్క అర్థం తెలుసుకోదలచాను. మిగిలిన మృగాలకంటె నాలుగవ మృగం భిన్నమైంది, మహా భయంకరంగా ఉండింది. దానికి ఇనుప పళ్లు, కంచు గోళ్లు ఉన్నాయి. అది తన బలి పశువుల్ని అన్నింటిని చీల్చి తిని, మిగిలినదాన్ని కాళ్ల క్రింద త్రొక్కి వేసింది. 20 నాలుగవ మృగం తలమీదవున్న పది కొమ్ముల గురించి తెలుసు కోవాలను కున్నాను. అక్కడ పెరిగిన చిన్న కొమ్ము గురించి తెలుసుకోదలిచాను. వాటిలో మూడు కొమ్ముల్ని చిన్న కొమ్ము పెరికివేసింది. ఇతర కొమ్ముల కంటె చిన్న కొమ్ము గొప్పదిగా, నీచంగా కనిపించింది. అది మానవ కన్నులవంటి కన్నులు కలిగియుండినది. అది డంబములు పలుకుతూనే ఉండినది. 21 నేనది గమనిస్తూండగా, ఈ చిన్న కొమ్ము దేవుని ప్రత్యేక జనుల్ని ఎదిరించి వారితో యుద్ధం చేయసాగింది. 22 మరియు ఆ కొమ్ము వారిని చంపుతూ ఉండెను. ప్రాచీన రాజు వచ్చి, న్యాయవిచారణ చేసేంతవరకు అది దేవుని ప్రత్యేక జనుల్ని చంపుచుండెను. ప్రాచీన రాజు చిన్న కొమ్మును గురించి తీర్పు ప్రకటించాడు. ఆ తీర్పు దేవుని ప్రత్యేక జనులకు సహాయము చేసింది. మరియు వారు రాజ్యమును స్వీకరించే సమయము వచ్చింది.
23 “అతను నాకిది వివరించాడు: ‘భూమిమీద అవతరించే నాలుగవ రాజ్యమే ఆ నాలుగవ మృగం. అది యితర రాజ్యాలకు భిన్నంగా వుంటుంది. ఆ నాలుగవ రాజ్యం ప్రపంచమంతట వుండే ప్రజల్ని తన వశం చేసుకొంటుంది. ప్రపంచంలో వుండే రాజ్యాలను అణచివేస్తుంది. 24 ఈ నాలుగవ రాజ్యం నుండి వచ్చే పదిమంది రాజులే పది కొమ్ములు. ఆ పదిమంది రాజులు పోయిన తర్వాత, మరొక రాజు వస్తాడు. తనకు పూర్వం పరిపాలించిన రాజులకంటె ఈ రాజు భిన్నంగా ఉంటాడు. ఇతర ముగ్గురు రాజుల్ని అతను జయిస్తాడు. 25 ఈ ప్రత్యేక రాజు సర్వోన్నతుడైన ఆ దేవునికి విరుద్ధంగా మాట్లాడుతాడు. ఆ రాజు దేవుని ప్రత్యేక జనుల్ని గాయపరచి చంపివేస్తాడు. అంతకు పూర్వమే వున్న సమయాలను, చట్టాలను మార్చివేయడానికి అతను ప్రయత్నిస్తాడు. దేవుని ప్రత్యేక జనులు ఆ రాజు ఆధిపత్యంలో మూడున్నర సంవత్సరాలుంటారు.
26 “‘కాని ఏమి జరగవలెనో, (దేవుని) న్యాయ స్థానమే నిర్ణయిస్తుంది. మరియు ఆ రాజుయొక్క అధికారము తీసివేయ బడుతుంది. వాని రాజ్యం సమూలంగా నాశనమవుతుంది. 27 తర్వాత దేవుని ప్రత్యేక జనులు రాజ్యాన్ని పరిపాలిస్తారు. వారు భూమిమీద సర్వరాజ్యాలను పాలిస్తారు. ఈ రాజ్యం ఎన్నటికీ ఉంటుంది. ఇతర రాజ్యాలకు చెందిన ప్రజలు వారిని గౌరవిస్తారు, సేవిస్తారు.’
28 “ఇదే కలయొక్క ముగింపు. దానియేలు అను నేను చాలా భయపడ్డాను. ఆ భయంవల్ల నా ముఖం పాలిపోయింది. మరియు నేను చూసిన, విన్న విషయాలను నా మనస్సులో ఉంచుకొన్నాను.”
114 ఇశ్రాయేలు ఈజిప్టు విడిచిపెట్టాడు.
యాకోబు (ఇశ్రాయేలు) ఆ విదేశాన్ని విడిచిపెట్టాడు.
2 ఆ కాలంలో యూదా దేవుని ప్రత్యేక ప్రజలయ్యారు.
ఇశ్రాయేలు ఆయన రాజ్యం అయింది.
3 ఎర్ర సముద్రం యిది చూచి పారిపోయింది.
యొర్దాను నది వెనుదిరిగి పరుగెత్తింది.
4 పర్వతాలు పొట్టేళ్లలా నాట్యం చేశాయి.
కొండలు గొర్రెపిల్లల్లా నాట్యం చేశాయి.
5 ఎర్ర సముద్రమా, ఎందుకు పారిపోయావు?
యొర్దాను నదీ, నీవెందుకు వెనుదిరిగి పరిగెత్తావు?
6 పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా నాట్యం చేశారు?
కొండలూ, మీరెందుకు గొర్రె పిల్లల్లా నాట్యం చేశారు?
7 యాకోబు దేవుడైన యెహోవా యెదుట భూమి కంపించింది.
8 బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేసినవాడు యెహోవాయే.
ఆ కఠిన శిల నుండి నీటి ఊట ప్రవహించునట్లు దేవుడే చేసాడు.
115 యెహోవా, ఏ ఘనతా మేము స్వీకరించకూడదు. ఘనత నీకే చెందుతుంది.
నీ ప్రేమ, నమ్మకం మూలంగా ఘనత నీదే.
2 మా దేవుడు ఎక్కడ అని జనాంగాలు ఎందుకు ఆశ్చర్యపడాలి?
3 దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన కోరింది చేస్తాడు.
4 ఆ జనాంగాల “దేవుళ్లు” వెండి బంగారాలతో చేయబడ్డ విగ్రహాలే.
ఎవరో ఒక మనిషి చేతులతో చేసిన విగ్రహాలే అవి.
5 ఆ విగ్రహాలకు నోళ్లున్నాయి కాని అవి మాట్లాడలేవు.
వాటికి కళ్లున్నాయి కాని అవి చూడలేవు.
6 వాటికి చెవులున్నాయి కాని అవి వినలేవు.
వాటికి ముక్కులున్నాయి కాని అవి వాసన చూడలేవు.
7 వాటికి చేతులు ఉన్నాయి కాని అవి తాకలేవు.
వాటికి కాళ్లు ఉన్నాయి కాని అవి నడవలేవు.
వాటికి గొంతుల్లోనుంచి ఏ శబ్దాలూ రావు.
8 ఆ విగ్రహాలను చేసేవారు. వాటిని నమ్ముకొనే వారు కూడ సరిగ్గా వాటివలె అవుతారు.
9 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ము.
యెహోవా వారి బలము, ఆయన వారి డాలు.
10 అహరోను వంశస్థులు యెహోవాను నమ్ముతారు.
యెహోవా వారి బలము, డాలు అయివున్నాడు.
11 యెహోవా అనుచరులు యెహోవాను నమ్ముకొంటారు.
యెహోవా తన అనుచరులకు సహాయం చేసి కాపాడుతాడు.
12 యెహోవా మమ్మల్ని జ్ఞాపకం చేసికొంటాడు.
యెహోవా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
యెహోవా ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు.
యెహోవా అహరోను వంశాన్ని ఆశీర్వదిస్తాడు.
13 యెహోవా పెద్దవారైనా, చిన్నవారైనా తన అనుచరులను ఆశీర్వదిస్తాడు.
14 యెహోవా మీ కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఆయన మీ పిల్లల కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
15 యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు.
ఆకాశాన్ని, భూమిని యెహోవా చేశాడు.
16 ఆకాశం యెహోవాకు చెందుతుంది.
కాని భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చాడు.
17 చనిపోయినవాళ్లు యెహోవాను స్తుతించరు.
కింద సమాధిలో ఉన్న మనుష్యులు యెహోవాను స్తుతించరు.
18 అయితే మనం యెహోవాను స్తుతిస్తాం.
మనం యిప్పటినుండి ఎప్పటికీ ఆయనను స్తుతిస్తాము!
యెహోవాను స్తుతించండి!
© 1997 Bible League International