Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 రాజులు 22

మీకాయా అహాబును హెచ్చరించుట

22 తరువాత రెండు సంత్సరాల కాలంలో ఇశ్రాయేలు, అరాము దేశాల మధ్య శాంతి సామరస్యాలు నెలకొన్నాయి. మూడవ సంవత్సరంలో యూదా రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబును చూడటానికి వెళ్లాడు.

అదే సమయంలో అహాబు తన అధికారులతో, “రామోత్గిలాదు పట్టణాన్ని అరాము రాజు మనవద్ద నుండి తీసుకున్న సంగతి నీకు జ్ఞాపకమున్నదా? మనం రామోత్గిలాదును తిరిగి తీసుకొని రావటానికి ఏ రకమైన చర్యనూ ఎందుకు తీసుకోలేదు? అది మన పట్టణమై తీరాలి” అని అన్నాడు. అప్పుడు అహాబు తన వద్దకు వచ్చిన రాజైన యెహోషాపాతును, “రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో పోరాడటానికి నీవు మాతో కలుస్తావా?” అని అడిగాడు.

“అవును, నేను మీతో కలుస్తాను. నీ సైన్యంతో సహకరించటానికి నా సైనికులు, గుర్రాలు సిద్ధంగా వున్నాయి. కాని ముందుగా మనం యెహోవాను మనకు సహాయం చేయమని అడగాలి” అని యెహోషాపాతు అన్నాడు.

అందుచేత అహాబు ప్రవక్తలందరినీ సమావేశపర్చాడు. ఆ సయయంలో అక్కడ సుమారు నాలుగువందల మంది ప్రవక్తలున్నారు. “నేను వెళ్లి అరాము సైన్యంతో రామోత్గిలాదు వద్ద యుద్ధం చేయవచ్చునా? లేక నేనింకా మరో సమయం కొరకు వేచివుండాలా?” అని అహాబు వారినడిగాడు.

“నీవు వెళ్లి ఇప్పుడు యుద్ధం చేయవచ్చు. యెహోవా నీకు విజయం చేకూర్చుతాడు” అని ప్రవక్తలన్నారు.

కాని యెహోషాపాతు, “యెహోవా యొక్క ప్రవక్త మరెవరైనా ఇక్కడ వున్నారా? వుంటే అతడు అహాబు ఏమి చేయాలో దేవుని అడిగి తెలుసుకోవాలి” అని అన్నాడు.

“మరో ప్రవక్త వున్నాడు. అతని పేరు మీకాయా, అతడు ఇమ్లా కుమారుడు. కాని నేనతనిని అనహ్యించుకుంటాను. అతడు యెహోవా తరపున మాట్లాడినప్పుడు, అతడెప్పుడూ నాకు మంచి చెప్పడు. నాకు ఇష్టం లేని విషయాలే అతడెప్పుడూ చెపుతాడు” అని అహాబు అన్నాడు.

“అహాబు రాజా, నీవు అలా అనకూడదు” అని యెహోషాపాతు అన్నాడు.

కావున రాజైన అహాబు తన అధికారులలో ఒకనిని పిలిచి మీకాయా కొరకు వెళ్లి ఎక్కడున్నాడో చూడమన్నాడు.

10 ఆ సమయంలో ఆ రాజులిద్దరూ తమ తమ రాజ దుస్తుల్లో వున్నారు. వారు సింహాసనాల మీద కూర్చుని వున్నారు. అది షోమ్రోను నగర ద్వారం వద్దగల న్యాయస్థానం. ప్రవక్తలందరూ వారి ముందు నిలబడ్డారు. ప్రవక్తలు ప్రత్యేకమైన విషయాలనేకం యెహోవా నుండి తెలుసుకుని ప్రకటిస్తున్నారు. 11 వారిలో కెనయనా కుమారుడు సిద్కియా అను వాడొకడున్నాడు. సిద్కియా కొన్ని ఇనుప కొమ్ములు[a] చేయించి తెచ్చాడు. అతడు అహాబుతో యెహోవా ఇలా అంటున్నాడని చెప్పాడు: “అరాము సైన్యంతో పోరాడటానికి నీవు ఈ ఇనుప కొమ్ములు ఉపయోగిస్తావు. నీవు వారిని ఓడించి, సర్వనాశనం చేస్తావు.” 12 మిగిలిన ప్రవక్తలు కూడ సిద్కియా చెప్పిన దానితో ఏకీభవించారు. ఆ ప్రవక్త ఇంకా ఇలా అన్నాడు: “నీ సైన్యం ఇప్పుడే కదిలి వెళ్లాలి. అరాము సైన్యంతో వారు రామోత్గిలాదు వద్ద పోరు సల్పాలి. నీవా పోరాటంలో గెలుస్తావు. యెహోవా నీవు గెలిచేలా చేస్తాడు.”

13 ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతూ వుండగా ప్రభుత్వాధికారి మీకాయాకొరకు వెళ్లాడు. అతడు మీకాయాను చూసి, “ప్రవక్తలంతా రాజు గెలుస్తాడని చెబుతున్నారు. నేననేదేమంటే నీవు కూడా అదే మాదిరిగా చెపితే నీకు చాలా క్షేమకరం” అని అన్నాడు.

14 “కాదు! యెహోవా ప్రసాదించిన శక్తిచేత యెహోవా నన్ను ఏది చెప్పమని ఆజ్ఞయిస్తే అదే చెబుతానని ప్రమాణం చేసియున్నాను” అని మీకాయా సమాధానం చెప్పాడు.

15 తరువాత మీకాయా వచ్చి రాజైన అహాబు ముందు నిలబడ్డాడు. రాజు అతనిని ఇలా అడిగాడు: “మీకాయా, రాజైన యెహోషాపాతు, నేను మా సైన్యాలను కలుపవచ్చా? ఇప్పుడు మేము వెళ్లి రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో పోరాడవచ్చునా?” “అవును. మీరు వెళ్లి వారితో ఇప్పుడు యుద్ధం చేయవచ్చు. యెహోవా నిన్ను గెలిపిస్తాడు” అని మీకాయా సమాధానం చెప్పాడు.

16 కాని ఇలా అన్నాడు: “నీవు ఈ మాటలు యెహోవా శక్తితో చెప్పటం లేదు. ఇది నీ ఊహాగానం. అందువల్ల నాకు నిజం చెప్పు! నేనేం చేయాలో యెహోవా శక్తి ఆధారంగా నాకు తెలియజెప్పు! ఎన్నిసార్లు నేను నీకు చెప్పాను!”

17 అందుకు మీకాయా ఇలా అన్నాడు: “ఏమి జరుగుతుందో నేను చూడగలను. ఇశ్రాయేలు సైన్యం కొండల్లో చిందరవందరై పోతుంది. కాపరిలేని గొర్రెల్లా వారు వికలమైపోతారు. ‘ఈ మనుష్యులకు నాయకుడులేడు. పోరుమాని వారు ఇండ్లకు పోతే మంచిది’ అని యెహోవా అంటున్నాడు.”

18 యెహోషాపాతుతో అప్పుడు అహాబు ఇలా అన్నాడు: “చూడు! నేను చెప్పాను గదా! ఈ ప్రవక్త నన్ను గురించి ఎన్నడూ మంచి చెప్పడు. ప్రతిసారీ నేను విననొల్లని మాటలే అతడు చెబుతాడు.”

19 కాని మీకాయా యెహోవా తరపున మాట్లాడటం కొనసాగించాడు. మీకాయా ఇలా అన్నాడు: “వినండి! ఇవి యెహోవా చెప్పిన మాటలు. యెహోవా పరలోకంలో సింహాసనాసీనుడై వున్నట్లు చూశాను. దేవదూతలు ఆయనకు చేరువలో నిలబడియున్నారు. 20 యెహోవా వారితో ఇలా చెప్పినాడు: ‘మీలో ఎవరైనా రాజైన అహాబును మోసగించగలరా? అతడు రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో పోరాడేలా చేయాలని నా వాంఛ. అప్పుడతడు చంపబడతాడు.’ దేవదూతలు తాము చేయవలసిన పనిపై ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయారు. 21 అప్పుడు ఒక దేవదూత యెహోవా ముందుకు వచ్చి, ‘నేనతనిని మాయ జేయగలను!’ అని చెప్పాడు. 22 ‘ఎలామాయలో పడవేయగలవు?’ అని యెహోవా అడిగాడు. ‘అహాబు ప్రవక్తలందరినీ కలవరపెడతాను. రాజైన అహాబుతో అన్నీ అబద్ధాలు చెప్పమని ప్రవక్తలను ప్రోత్సహిస్తాను. ప్రవక్తల సమాచారాలన్నీ అబద్ధాలే’ అని దేవదూత అన్నాడు. అందుకు యెహోవా, ‘మంచిది! వెళ్లి అహాబు రాజును మాయలో పడవేయి; నీకు విజయం చేకూరుతుంది’” అని అన్నాడు.

23 మీకాయా తన కథనం ముగించాడు. అతనిలా అన్నాడు: “ఇదీ ఇక్కడ జరిగిన విషయం. యెహోవా నీ ప్రవక్తలను నీతో అబద్దమాడేలా చేశాడు. యెహోవా తనకు తానే నీకు కష్టనష్టాలు రావాలని కోరి నిశ్చయించాడు.”

24 తరువాత ప్రవక్తయగు సిద్కియా, మీకాయా వద్దకు వెళ్లాడు. సిద్కియా మీకాయాను చెంప మీదకొట్టి, “యెహోవా శక్తి నన్ను వదిలి నీద్వారా మాట్లాడుతున్నదని నీవు నిజంగా నమ్ముతున్నావా?” అని అడిగాడు.

25 “నీవు వెంటనే వెళ్లి ఒక చిన్న గదిలో దాగివుండు. అప్పుడు నేను నిజం చెబుతున్నట్లు నీకు తెలుస్తుంది” అన్నాడు మీకాయా.

26 మీకాయాను బంధించమని అహాబు తన అధికారులకు ఆజ్ఞ ఇచ్చాడు. “ఇతనిని బంధించి నగరపాలకుడగు ఆమోను వద్దకు తీసుకుని వెళ్లండి. రాజకుమారుడైన యెవాషును ఇతనిపై తీర్పు చెప్పనీయండి. 27 మీకాయాను కారాగారంలో వుంచమని అతనికి చెప్పండి. వీనికి కేవలం రొట్టె, నీరు మాత్రం ఇవ్వండి. నేను యుద్ధంనుండి ఇంటికి తిరిగి వచ్చేవరకు ఇతనిని అక్కడే వుంచండి” అని రాజైన అహాబు అన్నాడు.

28 అది విన్న మీకాయా ఇలా ప్రకటించాడు: “సర్వప్రజలారా, నే చెప్పేది సావధానంగా వినండి! అహాబు రాజా, యుద్ధం నుండి నీవు క్షేమంగా ఇంటికి తిరిగివస్తే, యెహోవా నా ద్వారా మాట్లాడి యుండనట్లే.”

రామోతు గిలాదు వద్ద యుద్ధం

29 తరువాత రాజైన అహాబు, మరియు రాజైన యెహోషాపాతు కలిసి రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో యుద్ధం చేయటానికి వెళ్లారు. గిలాదు అనే ప్రాంతంలో ఇది వుంది. 30 అహాబు యెహోషాపాతుతో ఇలా అన్నాడు: “మనం యుద్ధానికి సిద్ధమవుదాం. నేను రాజునని తెలియకుండా వుండేలాగున తగిన దుస్తులు వేసుకుంటాను. కాని నీవు మాత్రం రాజఠీవి ఉట్టిపడే నీ యొక్క ప్రత్యేక దుస్తులు ధరించు.” ఇశ్రాయేలు రాజు మారువేషం వేసుకున్నాడు. యుద్ధం మొదలయింది.

31 అరాము రాజుకు ముప్పది యిద్దరు రథాధిపతులున్నారు. ఈ ముప్పది యిద్దరు రథాధిపతులకూ ఇశ్రాయేలు రాజు ఎక్కడ వున్నాడో చూడమని చెప్పాడు. ఇశ్రాయేలు రాజును చంపేయమని అరాము రాజు అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు. 32 యుద్దం సాగుతూవుండగా ఈ అధిపతులు రాజైన యెహోషాపాతును చూశారు. వారు అతనినే ఇశ్రాయేలు రాజుగా భావించారు. అందుచే వారతనిని చంపటానికి వెళ్లారు. యెహోషాపాతు తను రాజు కాదన్నట్లు అరవటం ప్రారంభించాడు. 33 దానితో అతడు రాజైన అహాబుకాదని తెలుసుకున్నారు. అందుచేత వారతనిని చంపలేదు.

34 కాని ఒక సైనికుడు తన బాణాన్ని గాలిలోకి వదిలాడు. అతడు కావాలని దానిని ఎవరిపైకీ గురిచూసి వదలలేదు. కాని ఆ బాణం ఇశ్రాయేలు రాజైన అహాబుకు తగిలింది. రాజు కవచం అతని శరీరాన్ని కప్పని చోట బాణం తగిలింది. రాజైన అహాబు తనసారధితో, “నాకు ఒక బాణం తగిలింది. త్వరగా రథాన్ని ఈ ప్రదేశంనుండి బయటికి నడిపించు. యుద్ధంనుండి మనం వెళ్లిపోవాలి” అని అన్నాడు.

35 సైన్యాలు మాత్రం యుద్ధాన్ని కొనసాగించాయి. రాజైన ఆహాబు తన రథం మీదే వుండిపోయాడు. రథంలో ఒక పక్కగా ఆనుకొని వున్నాడు. అతడు అరాము సైన్యంవైపు చూస్తూ వుండిపోయాడు. అతని గాయం నుండి కారిన రక్తం రథంలో పేరుకుపోయింది. బాగా సాయంత్ర మయ్యేసరికి రాజు చనిపోయాడు. 36 సూర్యాస్తమయసమయంలో ఇశ్రాయేలు సైన్యం తమ స్వదేశానికి, నగరానికి తిరిగి వెళ్లటానికి ఆజ్ఞ ఇవ్వబడింది.

37 రాజైన అహాబు ఆ విధంగా చనిపోయాడు. అతని భౌతిక కాయాన్ని కొందరు షోమ్రోనుకు తీసుకొని వెళ్లారు. వారు దానిని అక్కడ సమాధి చేశారు. 38 అహాబు రథాన్ని సైనికులు షోమ్రోనులో ఒక చెరువు వద్ద కడిగారు. అక్కడ కొన్ని కుక్కలు రథం చుట్టూ చేరి రథంలో పేరుకు పోయిన రాజైన అహాబు రక్తాన్ని నాకాయి. పైగా ఆ నీటిలో వేశ్యలు స్నానం చేశారు. ఇవన్నీ ఎలా జరుగుతాయని యెహోవా చెప్పియున్నాడో అలానే జరిగాయి.

39 రాజైన అహాబు తన పరిపాలనాకాలంలో చేసిన పనులన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో పొందు పర్చబడ్డాయి. రాజు తన భవనాన్ని అందంగా తీర్చిదిద్దటానికి ఉపయోగించిన దంతాన్ని గూర్చి కూడ ఆ గ్రంథం వివరిస్తుంది. అందులో రాజు నిర్మించిన నగరాన్ని గూర్చి కూడా వుంది. 40 అహాబు చనిపోయిన పిమ్మట అతని కుమారుడైన అహజ్యా అతని స్థానంలో రాజు అయ్యాడు.

యూదా రాజుగా యెహోషాపాతు

41 ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబు ఏలుబడి నాలుగవ సంవత్సరంలో యూదాకు రాజయ్యాడు. 42 యెహోషాపాతు రాజు అయ్యే నాటికి ఇతని వయస్సు ముప్పై అయిదు సంవత్సరాలు. యెహోషాపాతు యెరూషలేములో ఇరవై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. యెహోషాపాతు తల్లి షిల్హీ కుమార్తె. అతని తల్లి పేరు అజూబా. 43 యెహోషాపాతు మంచి వ్యక్తి. గతంలో తన తండ్రి నడచిన రీతినే ఇతడు కూడ నడిచాడు. యెహోవా ఆజ్ఞలను శిరసావహించాడు. కాని యెహోషాపాతు ఉన్నత స్థలాలను తీసివేయలేదు. ఆ స్థలాలలో ప్రజలు బలులు సమర్పించటం, ధూపం వేయటం వంటి కార్యక్రమాలు కొనసాగించారు.

44 యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో ఒక శాంతి ఒడంబడికను కుదుర్చుకున్నాడు. 45 యెహోషాపాతు మిక్కిలి ధైర్యవంతుడు. అతడు చాలా యుద్ధాలు చేశాడు. అతడు చేసిన పనులన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.

46 వ్యభిచార విషయంగా తమ శరీరాలను అమ్ముకొనే స్త్రీ పురుషులను ఆరాధనా స్థలాలనుండి యెహోషాపాతు వెళ్లగొట్టాడు. తన తండ్రియగు ఆసా రాజ్యం చేసిన కాలంలో ఆ రకమైన స్త్రీ పురుషులు ఆరాధనా స్థలాలలో సేవచేస్తూ వుండేవారు.

47 ఆ కాలంలో ఎదోము దేశానికి రాజు లేడు. అది ఒక పాలనాధికారి అధీనంలో వుండేది. ఆ అధికారి యూదా రాజుచేత ఎంపిక చేయబడేవాడు.

48 రాజైన యెహోషాపాతు సముద్రయానానికి అనువైన ఓడలను నిర్మించాడు. యెహోషాపాతు ఆ ఓడలను ఓఫీరు దేశానికి పంపాడు. ఓడలు బంగారాన్ని తేవాలని అతని ఆశయం. కాని ఓడలు ఎసోన్గెబెరు వద్ద మునిగిపోయాయి. ఓడలు బంగారాన్ని అసలు తేలేక పోయాయి. 49 ఇశ్రాయేలు రాజైన అహజ్యా యెహోషాపాతుకు సహాయం చేయటానికి వెళ్లాడు. యెహోషాపాతుతో నౌకా నిర్మాణ యానాలలో సమర్థులైన వారిని తీసుకొని వస్తానని అహజ్యా అన్నాడు. కాని యెహోషాపాతు అహజ్యా మనుష్యులను వినియోగించుకోడానికి నిరాకరించాడు.

50 యెహోషాపాతు చనిపోయాడు. అతనిని తన పూర్వికులతో దావీదు నగరంలో సమాధిచేశారు. తరువాత అతని కుమారుడు యెహోరాము రాజయ్యాడు.

ఇశ్రాయేలు రాజుగా అహజ్యా

51 అహాబు కుమారుడు అహజ్యా, యెహోషాపాతు పాలన యూదాలో పదునేడవ సంవత్సరం జరుగుతుండగా అహజ్యా ఇశ్రాయేలుకు రాజైనాడు. అహజ్యా షోమ్రోనులో రెండు సంవత్సరాలు పాలించాడు. 52 అహజ్యా యెహోవా దృష్టిలో పాపం చేశాడు. తన తండ్రి అహాబు, తన తల్లి యెజెబెలు, మరియు నెబాతు కుమారుడైన యరొబాము నడచిన చెడునడతనే అహజ్యా కూడ అనుసరించాడు. ఈ పాలకులంతా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయటానికి కారుకులయ్యారు. 53 అహజ్యా బూటకపు దేవత బయలును ఆరాధించాడు. తనకు ముందున్న తన తండ్రి వలెనే ఆ అసత్య దేవతను కొలిచాడు. తన ఈ చెడు నడవడితో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు చాలా కోపం కలిగించాడు. తనకు ముందున్న తన తండ్రిపట్ల కోపగించినట్లు యెహోవా అహజ్యా పట్ల కూడా కోపంతో వున్నాడు.

1 థెస్సలొనీకయులకు 5

ప్రభువు రాకకు సిద్ధంగా ఉండండి

సోదరులారా! ఇవి ఎప్పుడు జరుగనున్నాయో, వాటి సమయాలను గురించి, కాలాలను గురించి మేము వ్రాయనవసరం లేదు. ప్రభువు రానున్న దినము అకస్మాత్తుగా రాత్రిపూట దొంగ వచ్చినట్లు వస్తుందని మీకు బాగా తెలుసు. ప్రజలు, “మేము శాంతంగా, క్షేమంగా ఉన్నాము” అని అంటున్నప్పుడు గర్భిణీయైన స్త్రీకి అకస్మాత్తుగా నొప్పులు వచ్చినట్లే వాళ్ళు నాశనమౌతారు. తప్పించుకోలేరు.

కాని సోదరులారా! మీరు చీకట్లో లేరు. కనుక ఆ దినం మిమ్మల్ని దొంగల్లా ఆశ్చర్యపరచదు. మనం వెలుగుకు, పగటి వేళకు సంబంధించినవాళ్ళము. రాత్రికి, చీకటివేళకు సంబంధించినవాళ్ళము కాము. మరి అలాంటప్పుడు యితరుల వలె నిద్రపోకుండా, హుషారుగా, ఆత్మ నిగ్రహంతో ఉందాము. ఎందుకంటే, నిద్రపొయ్యే వాళ్ళు రాత్రివేళ నిద్రపోతారు. త్రాగుబోతులు రాత్రివేళ త్రాగుతారు. మనం పగటికి చెందిన వాళ్ళము కనుక ఆత్మ నిగ్రహంతో ఉందాము. విశ్వాసాన్ని, ప్రేమను కవచంగాను, రక్షణ, నిరీక్షణలను శిరస్త్రాణంగాను ధరించుదాము.

ఎందుకంటే దేవుడు కోపాన్ని చూపటానికి మనల్ని ఎన్నుకోలేదు. మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ ఇవ్వటానికి ఎన్నుకొన్నాడు. 10 మనం మరణించినా, లేక బ్రతికి ఉన్నా తాను వచ్చినప్పుడు తనతో కలిసి జీవించాలని క్రీస్తు మనకోసం మరణించాడు. 11 మీరు ఎప్పటిలాగే పరస్పరం ఉత్సాహపరుచుకుంటూ, యితర్ల అభివృద్ధికి తోడ్పడుతూ ఉండండి.

చివరి మాట

12 సోదరులారా! మేము ప్రస్తుతం కోరేదేమిటంటే, కష్టపడి పని చేస్తూ ప్రభువు సేవలో మీకు దారి చూపుతూ మీకు బోధిస్తున్న వాళ్ళను గౌరవించండి. 13 వాళ్ళు మంచి కార్యం చేస్తున్నారు కనుక వాళ్ళను అందరికన్నా ఎక్కువగా ప్రేమించి గౌరవించండి.

శాంతంగా జీవించండి. 14 సోదరులారా! సోమరులను వారించండి. పిరికి వాళ్ళకు ధైర్యం చెప్పండి. అందరి పట్ల శాంతంగా ఉండండి. బలహీనుల్ని బలపర్చండి. ఇది మా విజ్ఞాపన. 15 కీడు చేసిన వాళ్ళకు తిరిగి కీడు చేసే వాళ్ళను గమనిస్తూ వాళ్ళను అలా చేయనీయకుండా జాగ్రత్త పడండి. పరస్పరం దయ కలిగి యితర్ల పట్ల దయచూపుతూ ఉండండి.

16 ఎప్పుడూ ఆనందంగా వుండండి. విడువకుండా ప్రార్థించండి. 17 దైవ నియమాన్ని తప్పక పాటించండి. 18 అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి. యేసు క్రీస్తు వల్ల కలిగిన జీవితంలో మీరు ఈ విధంగా ఉండాలని దేవుని కోరిక.

19 ఆత్మ వెలిగించిన జ్యోతిని ఆర్పివేయకండి. 20 ప్రవక్తలు చెప్పినవాటిని తూలనాడకండి. 21 అన్నిటినీ పరీక్షించండి. మంచిని విడువకండి. 22 చెడుకు దూరంగా ఉండండి.

23 శాంతిని ప్రసాదించే ఆ దేవుడు మిమ్మల్ని పూర్తిగా పవిత్రం చెయ్యనీయండి. మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చేరోజు, మీ అంతరాత్మ, ప్రాణం, దేహం ఏ అపకీర్తి లేకుండా ఉండుగాక! 24 మిమ్మల్ని పిలిచేవాడు విశ్వసింపదగ్గవాడు. ఆయన మేము కోరింది తప్పక చేస్తాడు.

25 సోదరులారా! మా కోసం ప్రార్థించండి. 26 సోదరులందరినీ ప్రేమతో హృదయాలకు హత్తుకోండి. 27 ప్రభువు సమక్షంలో ఈ లేఖను సోదరులందరికీ చదివి వినిపించమని నేను ఆజ్ఞాపిస్తున్నాను. 28 మన యేసు ప్రభువు అనుగ్రహం మీపై ఉండుగాక!

దానియేలు 4

నెబుకద్నెజరు చెట్టు గురించి కలగనుట

రాజైన నెబుకద్నెజరు తన లేఖను ప్రపంచంలో అన్ని జనాంగాలకు, ఇతర భాషలు మాటలాడే దేశాలకు, ప్రజలకు ఇలా వ్రాయించాడు:

మీ అందరికీ సమాధాన మగుగాక!

అత్యున్నతుడైన దేవుడు, నా కోసం చేసిన అద్భుత విషయాలు, అద్భుత సంఘటనల గురించి చెప్పడానికి సంతోషిస్తున్నాను.

దేవుని సూచనలు, అద్భుతాలు
    మహాగొప్పవి, శక్తివంతమైనవి.
దేవుని రాజ్యం శాశ్వతమైనది.
    దేవుని ప్రభుత్వం అన్ని తరాలు కొనసాగుతుంది.

నెబుకద్నెజరు అను నేను నా అంతఃపురాన ఉన్నాను. నేను సుఖంగా సంతోషంగా ఉన్నాను. అప్పుడు నన్ను భయంగొలిపే కల ఒకటి వచ్చింది. నేను నా పడకమీద ఉన్నాను. నా మనస్సులోని ఆలోచనలు నన్ను భయపెట్టాయి. అందువల్ల బబులోనులోని వివేకవంతులందరినీ నావద్దకు తీసుకు రమ్మని ఆజ్ఞ ఇచ్చాను. ఎందుకంటే వారు నా కలయొక్క అర్థం చెప్పగలరని. ఇంద్రజాలికులు, కల్దీయులు వచ్చారు. రాగానే వారితో కల వృత్తాంతం చెప్పాను. కాని దాని అర్థమేమిటో వారు చెప్పలేకపోయారు. చివరికి దానియేలు వచ్చాడు. (నా దేవుని గౌరవించే నిమిత్తం నేను దానియేలుకు బెల్తెషాజరు అని పేరుపెడితిని. పరిశుద్ధ దేవుళ్ళ ఆత్మ[a] అతనిలో వుంది.) నా కల గురించి దానియేలుతో చెప్పాను. నేను ఈ విధంగా చెప్పాను: “బెల్తెషాజరూ! ఇంద్రజాలికులందరిలో నీవు చాలా ముఖ్యుడివి. పరిశుద్ధ దేవుళ్ళ ఆత్మ నీలో ఉన్నట్లు నాకు తెలుసు. ఏ రహస్యమూ తెలుసుకోవడం నీకు కష్టం కాదు. ఇది నేను కన్నకల. దాని అర్థమేమిటో చెప్పు. 10 నేను నా పడక మీద ఉండగా ఈ దర్శనం నేను చూశాను. నా యెదుట భూమి మధ్యలో ఒక వృక్షం ఉంది. అది చాలా ఎత్తైనది. 11 ఆ చెట్టు ఏపుగా దృఢంగా పెరిగింది. ఆ చెట్టు పైభాగం ఆకాశాన్ని అంటిందా అన్నట్లుంది. భూమిమీద ఎక్కడినుంచయినా ఆ చెట్టుని చూడవచ్చు. 12 ఆ చెట్టు ఆకులు చాలా అందమైనవి. దాని మీద చాలా పళ్లు ఉన్నాయి. అవి అందరికీ ఆహారంగా ఉన్నాయి. భూజంతువులకు చెట్టుక్రింద నీడ లభించింది. దాని కొమ్మలలో పక్షులు ఉన్నాయి. ప్రతీ జీవి ఆ చెట్టునుండి పోషించబడింది.

13 “నేను నా పడక మీదనే పడుకొని, నా దర్శనంలో కావలివానివలె పరలోకంనుంచి ఒక పవిత్రుడు క్రిందికి రావడం చూశాను. 14 అతను చాలా బిగ్గరగా మాట్లాడాడు. ‘చెట్టును నరికి వేయండి. చెట్టుకొమ్మల్ని నరికి వేయండి. దాని ఆకుల్ని, దాని పండ్లని త్రుంచి పారవేయండి. చెట్టుకిందవున్న జంతువుల్ని తోలివేయండి. దాని కొమ్మలమీద వున్న పక్షుల్ని ఎగిరి పోనివ్వండి. 15 కాని దాని మొద్దును వేళ్లతోసహా భూమిలోనే ఉండనివ్వండి. దాని చుట్టూ ఇనుము, కంచు కలిసిన ఒక బద్దీ వేయండి. చెట్టుమొద్దు, వ్రేళ్లు పొలంలో పెరిగే గడ్డి మధ్యలో భూమిలోనే ఉండనివ్వండి. మంచుచేత దాన్ని తడవనివ్వండి. 16 ఇక మీదట అతను మనిషిలా ఆలోచించడు. అతనికి జంతువుల బుద్ధి వస్తుంది. ఏడు కాలాలు (సంవత్సరాలు) అలా గడుస్తాయి’ అని అతను చెప్పాడు.

17 “కావలి దూత ద్వారా ఈ ఆజ్ఞ జారీ అయింది. పరిశుద్ధుల ద్వారా నిర్ణయం జరిగింది. ఇది అంతం వరకు ఉంటుంది. మహోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడని భూమిమీద నివసించే మనుష్యులందరు తెలుసుకొనేందుకు వీలవుతుంది. ఆయనకు నచ్చిన ఎవరికైనా దేవుడు ఆ రాజ్యాలను ఇచ్చి వేస్తాడు. ఆ రాజ్యాలను పాలించేందుకు వినయ విధేయతలుగల వారిని దేవుడు ఎన్నుకుంటాడు!

18 “ఇదే నెబుకద్నెజరు రాజునైన నేను కన్నకల. ఇప్పుడు, బెల్తెషాజరూ (దానియేలూ)! ఈ కల అర్థం చెప్పు. నా రాజ్యంలోని వివేకవంతు లెవ్వరూ నాకు ఆ కల అర్థం చెప్పలేరు. కాని బెల్తెషాజరూ, నీవు ఆ కల గురించి చెప్పగలవు. ఎందుకంటే నీలో పరిశుద్ధ దేవతల ఆత్మవుంది.”

19 తర్వాత దానియేలు (బెల్తెషాజరు) కొంచెంసేపు చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆలోచిస్తున్న విషయాలు అతన్ని కలత పరచాయి. అందువల్ల రాజు, “బెల్తెషాజరూ (దానియేలూ)! ఆ కలగాని, ఆ కలయొక్క అర్థంగాని, నిన్ను కలత చెందనీయకుండును గాక” అని చెప్పాడు.

తర్వాత బెల్తెషాజరు (దానియేలు) రాజుతో ఇలా అన్నాడు: “నా రాజా! ఆ కల నీ విరోధులకు జరుగునుగాక! నీ శత్రువులకు ఆ కలయొక్క అర్థము నెరవేరును గాక! 20-21 కలలో నీవొక వృక్షాన్ని చూశావు. అది ఏపుగా దృఢంగా పెరిగింది. దాని పైభాగం ఆకాశాన్ని అంటినట్లుగా ఉంది. భూమిమీద ఎక్కడినుంచియైనా దానిని చూడవచ్చు. దాని ఆకులు అందంగా ఉన్నాయి. ఫలసమృద్ధి కూడా ఉంది. ఆ పళ్లు ప్రతివారికీ సమృద్థిగా ఆహారం సమకూర్చాయి. అది అడవి మృగాలకు ఆశ్రయం. దాని కొమ్మలేమో పక్షుల నివాసస్థానం. అలాంటి వృక్షమే నీవు చూసింది. 22 రాజా, నీవే ఆ వృక్షానివి. నీవు మహా శక్తిమంతుడవయ్యావు. ఆకాశాన్ని అంటిన ఉన్నత వృక్షంవంటి వాడవు నీవు. నీ అధికారం భూమిమీద దూర భాగాలకు కూడా వ్యాపించింది.”

23 “రాజా, పరలోకంనుంచి ఒక పవిత్ర కావలి దేవదూత క్రిందికి రావడం నీవు చూశావు. అతడు ఇలా అన్నాడు: ‘చెట్టుని నరికివేయి; నాశనం చేయిము. ఇనుము, కంచు బద్దీతో కట్టబడి, పొలంలోని గడ్డిమధ్య నాటబడిన ఆ మొద్దును వ్రేళ్ళతోసహా భూమిలోనే విడిచిపెట్టు. ఏడు కాలాలు (సంవత్సరాలు) అతను మంచుకు తడుస్తూ మృగంవలె జీవిస్తాడు.’

24 “రాజా, కలయొక్క అర్థం ఇదే. మహోన్నతుడైన దేవుడు ఇవి జరుగుతాయని నా రాజువైన నీకు ఆజ్ఞాపించాడు. 25 నెబుకద్నెజరు రాజా, నీ ప్రజలనుంచి దూరంగా నీవు తరుమబడతావు. భూజంతువుల మధ్య నీవు నివసిస్తావు. ఎద్దువలె నీవు పచ్చిక తింటావు. నీవు మంచుచేత తడుస్తావు. అలా ఏడు కాలాలు (సంవత్సరాలు) గడిచి పోతాయి. అప్పుడు నీవీపాఠం నేర్చుకుంటావు-మహోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడనీ, తనకు నచ్చిన ఎవనికైనా రాజ్యాలను ఇచ్చివేస్తాడనీ నీవు తెలుసుకుంటావు.

26 “చెట్టు మొద్దును, వ్రేళ్లను నేలలోనే ఉంచుము అని ఇవ్వబడిన ఆజ్ఞకు అర్థమిది: మహోన్నతుడైన ఆ దేవుడే మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడన్న విషయం నీవు తెలుసుకున్నప్పుడు, నీ రాజ్యం నీకు ఇవ్వబడుతుంది. 27 అందువల్ల, రాజా, నా సలహాను స్వీకరించుము. పాపం చేయడం ఆపివేయి. సరియైనదేదో అదే జరిగించు. చెడు విషయాలు చేయడం ఆపివేయి. బీదవారిపట్ల దయగలిగి ఉండుము. అప్పుడు నీవు క్రమంగా విజయాన్ని పొందగలవు.”

28 నెబుకద్నెజరు రాజుకు ఆ ఘటనలన్నీ జరిగాయి. 29-30 కల వచ్చిన పన్నెండు నెలల తర్వాత, బబులోనులోని తన అంతఃపురం పైభాగాన నెబుకద్నెజరు నడుల్తూ ఉండగా రాజు బబులోనువైపు చూసి, “ఈ గొప్ప నగరాన్ని, ఈ గొప్ప అంతఃపురాన్ని నా శక్తివల్ల నిర్మించాను. నేనెంత గొప్పవాడనో తెలపటానికి ఈ అంతః పురాన్ని నిర్మించాను” అని తన మనస్సులో చెప్పుకొన్నాడు.

31 అతని మాటలు ఇంకా అతని నోటిలోనే ఉండగా, ఆకాశమునుంచి ఒక స్వరం ఇలా వినిపించింది: “నెబుకద్నెజరు రాజా, ఈ మాటలు నీకోసమే. నీ వద్దనుంచి నీ అధికారం తీసివేయబడింది. 32 ప్రజలనుండి నీవు తరిమి వేయబడతావు. భూజంతువులతో నీవు నివసించాల్సి వస్తుంది. ఎద్దువలె నీవు పచ్చిక మేస్తావు. నీవు గుణపాఠం నేర్చుకునేలోగా ఏడు కాలాలు (సంవత్సరాలు) గడిచి పోతాయి. అప్పుడు మనుష్యుల రాజ్యాలను సర్వోన్నతుడైన దేవుడు పరిపాలిస్తాడనీ, తనకు నచ్చిన వానికి రాజ్యాలు ఇస్తాడనీ నీవు తెలుసుకుంటావు.”

33 ఆ విషయాలు వెంటనే జరిగాయి. నెబుకద్నెరును ప్రజలు తమ మధ్యనుండి తరిమివేశారు. అతడు ఎద్దువలె పచ్చిక మేయ సాగాడు. ఆకాశ మంచుచేత అతని దేహం తడిసింది. గ్రద్ద ఈకలవలె అతని వెండ్రుకలు పొడుగ్గా పెరిగాయి. పక్షుల గోళ్లవలె అతని గోళ్లు పొడుగ్గా పెరిగాయి.

34 ఆ యేడేళ్ల కాలం పూర్తి కాగానే, నెబుకద్నెజరు అను నేను ఆకాశంవైపు కన్నెత్తి చూశాను. మళ్లీ నాకు మానవబుద్ధి లభించింది. అప్పుడు మహోన్నతుడైన దేవున్ని నేను కీర్తించాను. ఎల్లాకాలము నివసించే ఆయనను గౌరవించి, ఇలా ప్రశంసించాను:

ఆయన పరిపాలన శాశ్వతమైనది,
    తరతరాలకు ఆయన రాజ్యం కొనసాగుతుంది.
35 భూమిమీద మనుష్యులు
    ఆయన ఎదుట లెక్క లేనివారికి సమానము.
దేవుడు పరలోకలమందలి సైన్యాలకు,
    భూమిమీది మనుష్యులకు తనకు ఇష్టము వచ్చినట్లు చేస్తాడు.
ఎవ్వరూ ఆయన శక్తివంతమైన హస్తాన్ని ఆపలేరు.
    ఎవ్వరూ ఆయన చేసే పనుల్ని ప్రశ్నించలేరు.

36 అప్పుడు, ఆ సమయాన, దేవుడు నాకు సరి అయిన బుద్ధిని ప్రసాదించాడు. రాజుగా అధిక గౌరవం, శక్తిని నాకు తిరిగి ఇచ్చాడు. మరల నా సలహాదారులు రాజపురుషులు నా సలహా అడగ సాగారు. నేను మళ్లీ రాజుని అయ్యాను. పూర్వం కంటె ఎక్కువ శక్తి ఎక్కువ గొప్పతనం నాకు వచ్చాయి. 37 ఇప్పుడు, నెబుకద్నెజరు అను నేను పరలోక మందున్న రాజును కీర్తిస్తున్నాను, గౌరవిస్తున్నాను. ఆయన చేసే ప్రతిది సరి అయినదే. ఆయన ఎప్పుడూ న్యాయంగానే ఉంటాడు. గర్విష్ఠులను ఆయన అణగ ద్రొక్కుతాడు.

కీర్తనలు. 108-109

దావీదు స్తుతి కీర్తన

108 దేవా, నా హృదయం, నా ఆత్మ నిశ్చలముగాఉన్నాయి.
    నేను పాడుటకు, స్తుతి కీర్తనలు
వాయించుటకు సిద్ధంగా ఉన్నాను.
    స్వర మండలములారా, సితారలారా,
    మనం సూర్యున్ని[a] మేల్కొలుపుదాం
యెహోవా, ఆయా జనములలో మేము నిన్ను స్తుతిస్తాము.
    ఇతర ప్రజల మధ్య మేము నిన్ను స్తుతిస్తాము.
యెహోవా, నీ ప్రేమ ఆకాశాల కన్న ఉన్నతమైనది. నీ నిజమైన ప్రేమ మహా ఎత్తయిన మేఘాల కన్న ఉన్నతమైనది.
    నీ సత్యం ఆకాశాలవరకు కూడా చేరుకున్నది.
దేవా, ఆకాశాలకు పైగా లెమ్ము!
    సర్వ ప్రపంచం నీ మహిమను చూడనిమ్ము.
దేవా, నీకిష్టులైనవారిని రక్షించుము.
    నా ప్రార్థనకు జవాబు ఇచ్చి నాకు సహాయం చేయుము.

యెహోవా తన ఆలయము నుండి[b] మాట్లాడి యిలా చెప్పాడు,
    “యుద్ధంలో నేను గెలుస్తాను! ఆ గెలుపును బట్టి సంతోషంగా ఉంటాను.
    (ఈ భూమిని నా ప్రజలకు విభాగించి ఇస్తాను)
    నా ప్రజలకు షెకెమును ఇస్తాను.
    వారికి సుక్కోతులోయను ఇస్తాను.
    గిలాదు, మనష్షే నావి.
    ఎఫ్రాయిము నా శిరస్త్రాణం.
    యూదా నా రాజదండం.
    మోయాబు నా పాదాలు కడుగుకొనే పళ్లెం.
    ఎదోము నా చెప్పులు మోసే బానిస.
    ఫిలిష్తీయులను జయించాక నేను విజయంతో కేకలు వేస్తాను.”

10 శత్రు దుర్గములోనికి నన్ను ఎవరు నడిపిస్తారు?
    ఎదోమును జయించటానికి నాకు ఎవరు సహాయం చేస్తారు?
11 దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావని మా సైన్యంతో
    నీవు వెళ్లవు అని అనటం నిజమేనా?
12 దేవా, మా శత్రువును ఓడించుటకు దయచేసి మాకు సహాయం చేయుము
    మనుష్యులు మాకు సహాయం చేయలేరు!
13 దేవుడు మాత్రమే మమ్మల్ని బలపరచగలడు.
    దేవుడు మాత్రమే మా శత్రువులను ఓడించగలడు.

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

109 దేవా, నా ప్రార్థనలను పెడచెవిని పెట్టవద్దు.
దుర్మార్గులు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
    నిజం కాని సంగతులు ఆ అబద్ధికులు చెబుతున్నారు.
ప్రజలు నన్ను గూర్చి ద్వేషపూరిత విషయాలు చెబుతున్నారు.
    ఏ కారణం లేకుండానే ప్రజలు నా మీద దాడి చేస్తున్నారు.
నేను వారిని ప్రేమిస్తున్నాను. కాని వారు నన్ను ద్వేషిస్తున్నారు.
    కనుక దేవా, ఇప్పుడు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
ఆ ప్రజలకు నేను మంచి పనులు చేశాను.
    కాని వారు నాకు చెడ్డపనులు చేస్తున్నారు.
నేను వారిని ప్రేమించాను.
    కాని వారు నన్ను ద్వేషించారు.

నా శత్రువు చేసిన చెడు కార్యాల కోసం అతనిని శిక్షించుము.
    వానిదే తప్పు అని రుజువు చేయగల ఒక మనిషిని చూడుము.
నా శత్రువు తప్పు చేసిన దోషి అని న్యాయవాదిని తీర్పు చెప్పనీయుము.
    నా శత్రువు చెప్పే ప్రతి సంగతీ వానికి చెడుగావుండేటట్టు చేయుము.
నా శత్రువును త్వరగా చావనిమ్ము.
    నా శత్రువు ఉద్యోగం మరొకరు తీసికొనును గాక!
నా శత్రువు పిల్లలను అనాథలు కానిమ్ము, వాని భార్య విధవరాలు అగుగాక!
10 వాళ్లు వారి ఇల్లు పోగొట్టుకొని భిక్షగాళ్లు అగుదురు గాక!
11 నా శత్రువు ఎవరికైతే పైకం బాకీ ఉన్నాడో వాళ్లు అతనికి ఉన్నదంతా తీసుకోనివ్వుము.
    అతని కష్టార్జితం అంతా తెలియని వాళ్లెవరినో తీసికోనివ్వుము.
12 నా శత్రువుకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ.
    అతని పిల్లలకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ.
13 నా శత్రువును పూర్తిగా నాశనం చేయుము.
    తర్వాత తరంవారు అన్నిటిలోనుండి అతని పేరు తొలగించి వేయుదురు గాక.
14 నా శత్రువు తండ్రి పాపాలను, తల్లి పాపాలను
    యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ.
15 ఆ పాపాలను యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ.
    ప్రజలు నా శత్రువును పూర్తిగా మరచిపోయేటట్టు యెహోవా వారిని బలవంతం చేస్తాడని నా ఆశ.
16 ఎందుకంటే, ఆ దుర్మార్గుడు ఎన్నడూ ఏ మంచీ చేయలేదు.
    అతడు ఎన్నడూ ఎవరిని ప్రేమించలేదు.
    అతడు నిరుపేద, నిస్సహాయ ప్రజలకు జీవితం ఎంతో కష్టతరం చేసాడు.
17 ప్రజలకు సంభవించే చెడు సంగతులు, శాపము చూడటానికి ఆ దుర్మార్గునికి ఎంతో ఇష్టం.
    కనుక ఆ చెడు సంగతులు అతనికే సంభవించనిమ్ము.
ప్రజల కోసం మంచి సంగతులు జరగాలని ఆ దుర్మార్గుడు ఎన్నడూ అడుగలేదు.
    కనుక అతనికి మంచి సంగతులేవీ జరుగనివ్వకుము.
18 శాపాలే వానికి వస్త్రాలుగా ఉండనిమ్ము.
దుర్మార్గులు త్రాగేందుకు శాపాలే నీళ్లుగా ఉండనిమ్ము
    శాపాలే వాని శరీరం మీద తైలంగా ఉండనిమ్ము.
19 శాపాలే ఆ దుర్మార్గునికి చుట్టే వస్త్రాలుగా ఉండనిమ్ము.
    శాపాలే వాని నడుం చుట్టూ దట్టిగా ఉండనిమ్ము.

20 నా శత్రువుకు వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
    నన్ను చంపాలని చూస్తున్న మనుష్యులందరికీ వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
21 యెహోవా, నీవే నాకు ప్రభువు. కనుక నీ నామానికి గౌరవం కలిగే విధంగా నన్ను పరామర్శించు.
    నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది. కనుక నన్ను రక్షించుము.
22 నేను కేవలం నిరుపేద, నిస్సహాయ మనిషిని,
    నేను నిజంగా దుఃఖంగా ఉన్నాను, నా హృదయం పగిలిపోయింది.
23 దినాంతంలో దీర్ఘ ఛాయలవలె నా జీవితం అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది.
    ఎవరో నలిపివేసిన నల్లిలా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది.
24 నేను ఉపవాసం ఉండుటవలన నా మోకాళ్లు బలహీనంగా ఉన్నాయి.
    నా బరువు తగ్గిపోయి నేను సన్నబడుతున్నాను.
25 చెడ్డవాళ్లు నన్ను అవమానిస్తారు.
    వారు నన్ను చూచి వారి తలలు ఊపుతారు.
26 దేవా, యెహోవా! నాకు సహాయం చేయుము!
    నీ నిజమైన ప్రేమను చూపించి నన్ను రక్షించుము.
27 అప్పుడు నీవు నాకు సహాయం చేశావని ఆ ప్రజలు తెలుసుకొంటారు.
    నాకు కలిగిన సహాయం నీ శక్తివల్ల అని వారు తెలుసుకొంటారు.
28 ఆ దుర్మార్గులు నాకు శాపనార్థాలు పెడతారు; కాని యెహోవా, నీవు నన్ను ఆశీర్వదించగలవు.
    వారు నా మీద దాడి చేశారు కనుక వారిని ఓడించుము.
    అప్పుడు నీ సేవకుడనైన నేను సంతోషిస్తాను.
29 నా శత్రువులను ఇబ్బంది పెట్టుము!
    వారు వారి సిగ్గును వారి అంగీలా ధరించనిమ్ము.
30 యెహోవాకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
    అనేక మంది ప్రజల ఎదుట నేను ఆయనను స్తుతిస్తాను.
31 ఎందుకంటే, నిస్సహాయ ప్రజల పక్షంగా యెహోవా నిలిచి ఉన్నాడు.
    వారిని మరణానికి అప్పగించాలని ప్రయత్నించే వారి నుండి దేవుడు వారిని రక్షిస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International