Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 రాజులు 21

నాబోతు ద్రాక్షతోట

21 రాజైన అహాబు భవనం షోమ్రోను నగరంలోవుంది. రాజభవనం దగ్గర ఒక ద్రాక్ష తోటవుంది. ఒక రోజు నాబోతును పిలిచి అహాబు ఇలా అన్నాడు: “నీ పొలం నాకు ఇచ్చివేయి. నేను దానిని కూరగాయల తోటగా మార్చాలనుకుంటున్నాను. నీ చేను నా భవనానికి దగ్గరగా వుంది. దానికి బదులు దానికంటె మంచి ద్రాక్షతోట నీకు మరొకటి ఇస్తాను. లేదా, నీకు కావాలంటే దాని విలువ డబ్బు రూపంలో చెల్లిస్తాను.”

నాబోతు అది విని, “నా భూమిని నీ కెన్నడూ ఇవ్వను. ఇది నా పిత్రార్జితం” అని అన్నాడు.

అహాబు ఇంటికి వెళ్లాడు. నాబోతు పట్ల కోపంగా వున్నాడు. అతని మనస్సు కలతపడింది. యెజ్రెయేలు వాడైన నాబోతు చెప్పినది అతనికి గిట్టలేదు. (“నా పిత్రార్జితమైన భూమిని నీకివ్వను” అని నాబోతు అన్నాడు.) అహాబు పక్కపై పడుకున్నాడు. ముఖం తిప్పుకుని భోజనం చేయ నిరాకరించాడు.

అహాబు భార్య యెజెబెలు అతని వద్దకు వెళ్లింది. “ఎందుకు నీవు కలత చెంది వున్నావు? నీవెందుకు తినటం లేదు?” అని యెజెబెలు అడిగింది.

అహాబు ఇలా సమాధానం చెప్పాడు: “యెజ్రెయేలువాడైన నాబోతును అతని పొలం నాకిమ్మని అడిగాను. దాని పూర్తి ఖరీదు చెల్లిస్తానన్నాను. లేదా, అతను కావాలంటే వేరే పొలం ఇస్తానన్నాను. కాని నాబోతు అతని పొలం ఇవ్వటానికి నిరాకరించాడు.”

అది విని యెజెబెలు, “అది సరే! ఇశ్రాయేలుకు రాజువు నీవే కదా! పక్క మీది నుండి లేచి ఆహారం తీసుకో. నీకు హాయిగా వుంటుంది. నాబోతు పొలాన్ని నీకు నేనిప్పిస్తాను” అని అన్నది.

తరువాత యెజెబెలు కొన్ని ఉత్తరాలను అహాబు పేరు మీద రాసింది. వాటి మీద అహాబు సంతకం ఆమె చేసింది. అహాబు రాజముద్రను వాటిపై వేసి అంటించింది. ఆమె వాటిని నాబోతు నివసించే నగరంలో వున్న పెద్దలు, నాయకులకు ఇతర ముఖ్యమైన వ్యక్తులకు పంపించింది. ఆమె పంపిన లేఖలో ఇలా వుంది:

“ప్రజలందరికి ఉపవాస దినాన్ని ఒకటి ప్రకటించండి. తరువాత పట్టణంలోని ప్రజలందరినీ ఆ రోజు సమావేశపర్చండి. ఆ సమావేశంలో మనం నాబోతును గురించి మాట్లాడాలి. 10 నాబోతును గురించి ప్రజలకు అబద్ధాలు చెప్పగల కొందరిని సమావేశంలో వుండేలా చూడండి. నాబోతు రాజుకు, దేవునికి వ్యతిరేకంగా దూషణ భాషణ చేయగా తాము విన్నట్లు ప్రజలకు వారు అబద్ధం చెప్పాలి. అప్పుడు నాబోతును నగరం నుండి బయటికి తీసుకొని పోయి రాళ్లతో కొట్టి చంపాలి.”

11 అది చదివిన యెజ్రెయేలు నాయకులు (పెద్దలు), ఇతర ప్రముఖులు ఆజ్ఞను శిరసావహించారు. 12 ప్రజలంతా ఉపవాసం చేయాలని ఒక రోజును నిర్ణయించి ప్రకటించారు. ఆ రోజున నియమిత స్థలంలో సమావేశం కావాలని ప్రజలందరికీ పిలుపు ఇచ్చారు. వారు నాబోతును ప్రజల ముందు ఒక ప్రత్యేక స్థానంలో కూర్చుండబెట్టారు. 13 అప్పుడు ఇద్దరు మనుష్యులు లేచి నాబోతు దేవునిని, రాజును గూర్చి దుర్భాషలాడుతూండగా తాము విన్నట్లు ప్రజలకు చెప్పారు. అందువల్ల ప్రజలు నాబోతును నగరం నుండి బయటికి లాక్కొని వెళ్లి, అతనిని రాళ్లతో కొట్టి చంపారు. 14 తరువాత నాబోతు చంపబడ్డాడన్న వర్తమానం నాయకులు యెజెబెలుకు పంపారు.

15 ఈ వార్త విన్న యెజెబెలు వెంటనే అహాబు వద్దకు వెళ్లి, “నాబోతు చనిపోయాడు. ఇప్పుడు నీవు వెళ్లి నీకు కావలసిన పొలాన్ని తీసికో” అని చెప్పింది. 16 కావున అహాబు ద్రాక్షతోటకు వెళ్లి దానిని తన వశం చేసుకున్నాడు.

17 ఇదే సమయంలో యెహోవా ఏలీయాతో మాట్లాడాడు. (ఏలీయా తిష్బీయుడైన ప్రవక్త) యెహోవా ఇలా అన్నాడు: 18 “షోమ్రోనులో వున్న రాజైన అహాబు వద్దకు వెళ్లు. అతడు నాబోతుకు చెందిన ద్రాక్షతోటలో వుంటాడు. ఆ పొలాన్ని తన స్వాధీనం చేసుకొనటానికి అహాబు అక్కడికి వెళ్లాడు. 19 యెహోవా అంటున్నాడని నా మాటగా అతనికి ఈ విధంగా చెప్పు: ‘అహాబూ! నీవు నాబోతు అనే వానిని చంపావు. ఇప్పుడు నీవతని పొలం స్వాధీనం చేసుకుంటున్నావు. అందువల్ల నేను చెప్పేదేమనగా నాబోతు చనిపోయిన స్థలంలోనే నీవు కూడ చనిపోతావు. నాబోతు రక్తాన్ని నాకిన కుక్కలు అదే స్థలంలో నీ రక్తాన్ని కూడ నాకుతాయి!’”

20 తరువాత ఏలీయా అహాబు వద్దకు వెళ్లాడు. ఏలీయాను అహాబు చూసి, “నీవు మళ్లీ నావద్దకు వచ్చావు. నీ వెప్పుడూ నాకు వ్యతిరేకివై శత్రువులా ప్రవర్తిస్తున్నావు” అని అన్నాడు.

ఏలీయా ఇలా సమాధానమిచ్చాడు: “అవును, నేను మళ్లీ నిన్ను కలుసుకున్నాను. జీవితమంతా యెహోవాకు విరుద్ధంగా పాపం చేస్తూనే వచ్చావు. 21 అందువల్ల యెహోవా నీతో ఇలా అంటున్నాడు, నేను నిన్ను నాశనం చేస్తాను. నేను నిన్ను, నీ ఇంటిలోని ప్రతిబాలుణ్ణి, మరియు మగవారినందరినీ చంపేస్తాను. 22 నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబానికి పట్టిన గతే నీ కుటుంబానికి కూడ పడుతుంది. రాజైన బయెషా కుటుంబంవలె నీ కుటుంబం కూడ అయిపోతుంది. ఆ రెండు కుటుంబాలూ సర్వనాశనం చేయబడ్డాయి. అదే విధంగా నీ కుటుంబానికి కూడ చేస్తాను. కారణమేమంటే నీవు నాకు కోపం కల్గించావు. ఇశ్రాయేలు ప్రజలు చెడుకార్యాలు చేసేటందుకు కూడా నీవు కారుకుడవయ్యావు. 23 ఇంకా యెహోవా చెప్పిన దేమనగా నీ భార్యయగు యెజెబెలు శవాన్ని యెజ్రెయేలు నగరంలో కుక్కలు పీక్కు తింటాయి. 24 నీ కుటుంబంలోని వాడెవడు నగరంలో చనిపోయినా వాని శవాన్ని కుక్కలు తింటాయి. వారిలో ఎవడు పొలాల్లో చనిపోయినా వానిని పక్షులు తింటాయి.”

25 అహాబువలె అన్ని తప్పుడు పనులు చేసినవాడు, అంత పాపం మూటగట్టు కున్నవాడు మరొక వ్యక్తి లేడు. అతని భార్య యెజెబెలు అతడా తప్పులు చేయటానికి కారకురాలయింది. 26 కొయ్య బొమ్మలను పూజిస్తూ, అహాబు ఘోరమైన పాపానికి ఒడిగట్టాడు. ఈ రకమైన పనినే అమోరీయులు కూడా చేశారు. అందువల్లనే యెహోవా ఆ రాజ్యాన్ని వారి నుండి తీసుకుని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.

27 ఏలీయా మాట్లాడటం పూర్తి చేసిన తరువాత అహాబు చాలా ఖిన్నుడయాడు. తన విచారానికి సూచనగా తన బట్టలు చింపుకున్నాడు. తరువాత విచారసూచకంగా ప్రత్యేకమైన బట్టలు ధరించాడు. అహాబు భోజనం మానేశాడు. ఆ ప్రత్యేకమైన బట్టలతోనే నిద్రపోయాడు. అహాబు బహు దుఃఖంతో మిక్కిలి కలతచెందాడు.

28 ప్రవక్తయగు ఏలీయాతో యెహోవా ఇలా అన్నాడు: 29 “అహాబు నాముందు తనను తాను తక్కువ చేసుకుని వినమ్రుడైనట్లు నేను చూస్తున్నాను. అందువల్ల అతను బ్రతికియున్నంత కాలం నేనతనికి ఆపదలు కలుగజేయను. అతని కుమారుడు రాజు అయ్యేవరకు ఆగుతాను. అప్పుడు అహాబు కుటుంబానికి కష్టనష్టాలు కలుగజేస్తాను.”

1 థెస్సలొనీకయులకు 4

దేవునికి నచ్చిన జీవితం

సోదరులారా! చివరకు చెప్పేదేమిటంటే దేవుని మెప్పు పొందటానికి ఏ విధంగా జీవించాలో మేము మీకు బోధించాము. మీరు మేము చెప్పినట్లు జీవిస్తున్నారు. కాని మేము ప్రస్తుతం యేసు ప్రభువు పేరిట మిమ్మల్ని అడిగేదేమిటంటే మీరు ఆ జీవితాన్ని యింకా సంపూర్ణంగా జీవించాలి. ఇది మా విజ్ఞప్తి. యేసు ప్రభువు యిచ్చిన అధికారంతో మేము చెప్పిన ఉపదేశాలు మీకు తెలుసు. మీరు పవిత్రంగా ఉంటూ వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి. ఇది దేవుని యిచ్ఛ. మీరు పవిత్రంగా, గౌరవప్రదంగా జీవించాలి. మీ దేహాలను మీరు అదుపులో పెట్టుకోవాలి.[a] పవిత్రులు కానివాళ్ళు లైంగిక వాంఛలతో బ్రతుకుతూ ఉంటారు. ఆ విధంగా మీరు జీవించకూడదు. ఈ విషయంలో ఎవరూ తమ సోదరుల్ని మోసం చేయరాదు. వాళ్ళను తమ లాభానికి ఉపయోగించుకోరాదు. అలాంటి పాపం చేసినవాళ్ళను ప్రభువు శిక్షిస్తాడు. మేము దీన్ని గురించి ముందే చెప్పి వారించాము. దేవుడు మనల్ని పిలిచింది అపవిత్రంగా ఉండేందుకు కాదు. పవిత్రంగా జీవించేందుకు పిలిచాడు. అందువల్ల ఈ ఉపదేశాన్ని తృణీకరించినవాడు మానవుణ్ణి కాదు, తన పరిశుద్ధాత్మనిచ్చిన దేవుణ్ణి తృణీకరించినవాడౌతాడు.

సోదర ప్రేమను గురించి మేము వ్రాయవలసిన అవసరం లేదు. ఎందుకంటే పరస్పరం ప్రేమించుకొనమని దేవుడే మీకు బోధించాడు. 10 నిజానికి మాసిదోనియ ప్రాంతంలో ఉన్న సోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు. కాని సోదరులారా! మీరు యింకా ఎక్కువ ప్రేమించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

11 మేమిదివరకే చెప్పిన విధంగా శాంతితో జీవించాలని ఆశించండి. మీ స్వహస్తాలతో పని చేస్తూ యితర్ల జోలికి పోకుండా జీవించండి. 12 అలా చేస్తే మీ నిత్య జీవితాన్ని చూసి యితర్లు మిమ్మల్ని గౌరవిస్తారు. అప్పుడు మీరు యితర్లపై ఆధారపడనవసరం ఉండదు.

ప్రభువు రాకడ

13 సోదరులారా! చనిపోయినవాళ్ళను గురించి మీకు తెలియాలని మా కోరిక. బ్రతుకుపై ఆశలేని వాళ్ళవలే దుఃఖించరాదని మా కోరిక. 14 యేసు చనిపోయి తిరిగి బ్రతికివచ్చాడని మనం నమ్ముతాము. అందుకే యేసును విశ్వసించినవాళ్ళు మరణించినప్పుడు దేవుడు వాళ్ళను ఆయనతో సహా బ్రతికిస్తాడని కూడా మనం విశ్వసిస్తాము.

15 ప్రభువు వచ్చేవరకు మనం బ్రతికి ఉంటే, యింతకు క్రితము చనిపోయినవాళ్ళకంటే ముందు వెళ్ళము. ఇది ప్రభువు స్వయంగా చెప్పాడు. 16 ప్రభువు పరలోకం నుండి దిగివచ్చినప్పుడు ప్రధాన దూతతో అధికార పూర్వకంగా వస్తాడు. అప్పుడు ప్రధాన దూత శబ్దము, దేవుని బూర శబ్దం వినిపిస్తాయి. అప్పుడు క్రీస్తులో చనిపోయినవాళ్ళు మొదటలేస్తారు. 17 ఆ తర్వాత యింకా బ్రతికి ఉన్న మనల్ని ప్రభువు వాళ్ళతో సహా ఆకాశంలో ఉన్న మేఘాల్లోకి తీసుకువెళ్తాడు. అప్పటినుండి మనం ఆయనతో చిరకాలం ఉండిపోతాము. 18 అందువల్ల వీటిని గురించి మాట్లాడుకొని పరస్పరం ధైర్యం చెప్పుకోండి.

దానియేలు 3

బంగారు విగ్రహం-అగ్నిగుండం

నెబుకద్నెజరు ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేయించాడు. ఆ విగ్రహం అరవై మూరల ఎత్తు, ఆరు మూరల వెడల్పు గలది. తర్వాత, బబులోను రాజ్యంలో దూరా అనే మైదాన ప్రదేశంలో ఆ విగ్రహాన్ని అతను ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత అధిపతులను, సేనాధిపతులను, ముఖ్యోద్యోగులను, ఉన్నతాధికారులను, సలహాదారులను, న్యాయాధిపతులను, పాలకులను రాజ్యంలోని ఇతర ముఖ్య అధికారులను రాజు సమావేశపరచాడు. ఆ విగ్రహ ప్రతిష్ఠోత్సవానికి రాజు వారందరిని పిలించాడు.

రాజైన నెబుకద్నెజరు ప్రతిష్ఠించిన ఆ విగ్రహ సమక్షంలో వారందరు నిలిచారు. రాజు తరఫున ప్రకటనలు చేసే వ్యక్తి గొప్ప స్వరంతో, “వివిధ దేశాలనుండి, వివిధ భాషావర్గాలనుండి, వచ్చిన మీరందరూ నా మాటలు ఆలకించండి. ఇది మీరు చేయాలని రాజాజ్ఞ. కొమ్ము బూరలు, పిల్లన గ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తంతివాద్యాలు, తిత్తి బూరల ధ్వనులు వినగానే మీరు బంగారు విగ్రహానికి సాష్టాంగపడి పూజించాలి. ఎవరైనా ఆ బంగారు విగ్రహానికి సాగిలపడి పూజించకపోతే, అప్పుడతనిని వెంటనే మండుచున్న అగ్నిగుండంలోకి తోసివేస్తారు.”

అందువల్ల, కొమ్ము బూరలు, పిల్లన గ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తంతివాద్యాలు, తిత్తిబూరలు మొదలైన సంగీత వాద్యాల ధ్యనులు వినగానే రాజు ప్రతిష్ఠించిన ఆ బంగారు విగ్రహానికి అందరు, అన్ని దేశాలవాళ్లు, అన్ని భాషలవాళ్లు సాష్టాంగపడి పూజించారు.

తర్వాత కల్దీయులలో కొందరు రాజు వద్దకు వచ్చి, యూదులకు విరుద్ధంగా మాటలాడసాగారు. వాళ్లు నెబుకద్నెజరుతో ఇలా అన్నారు: “రాజు ఎల్లప్పుడూ వర్ధిల్లు గాక! 10 రాజా! నీవొక ఆజ్ఞ విధించావు. కొమ్ము బూరలు, పిల్లనగ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తిత్తి బూరలు, మొదలైన వివిధ సంగీత వాద్యాల ధ్వనులు వినగానే అందరూ సాగిలపడి, బంగారు విగ్రహాన్ని పూజించాలని నీవు చెప్పావు. 11 ఎవరైనా బంగారు విగ్రహానికి బోర్లగాపడి నమస్కరించకపోతే, అతడు మండుచున్న కొలిమిలోకి త్రోయబడతాడని నీవు చెప్పావు. 12 రాజా, నీ ఆజ్ఞ ప్రకారం నడవని యూదులు కొందరున్నారు. బబులోను రాజ్యంలో ఆ యూదులను నీవు ముఖ్యోద్యోగులుగా నియమించావు. వారు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు. వారు నీ దేవుళ్లను పూజించరు. నీవు ప్రతిష్ఠించిన ఆ బంగారు విగ్రాహాన్ని తలవంచి వారు పూజించలేదు.”

13 నెబుకద్నెజరు చాలా ఉగ్రుడైనాడు. అతడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను పిలిపించాడు. 14 అందువల్ల వారిని అతని సమక్షానికి తీసుకు వచ్చారు. నెబుకద్నెజరు వారిని చూచి, “షద్రకు, మేషాకు, అబెద్నెగో! మీరు నా దేవుళ్లని పూజించని మాట నిజమేనా? పైగా నేను ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని పూజించని మాటకూడా నిజమేనా? 15 కొమ్ముబూరలు, పిల్లనగ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తిత్తి బూరలు మొదలైన వాద్య ధ్వనులు వినగానే మీరు బోర్లగాపడి, బంగారు విగ్రహాన్ని పూజించాలి. నేను ప్రతిష్ఠించిన ఆ విగ్రహాన్ని మీరు పూజించేందుకు సిద్ధపడితే, అది మంచిది. మీరు పూజించకపోతే, మిమ్మును వెంటనే మండుచున్న కొలిమిలోకి తోసివేస్తారు. అప్పుడు ఏ దేవుడు కూడా నా అధికారంనుంచి మిమ్మును కాపాడలేడు!”

16 షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుకు ఇలా ప్రత్యుత్తరమిచ్చారు: “నెబుకద్నెజరూ, ఈ విషయాలు మీకు మేము వివరించనవసరం లేదు. 17 మీరు మమ్మును మండుచున్న కొలిమిలోకి తోసివేస్తే, మేము నమ్ముకొన్న మా దేవుడే మమ్ములను రక్షిస్తాడు. మరియు ఆయనకు ఇష్టం కలిగితే, మీ అధికారంనుంచి మమ్ములను కాపాడుతాడు. 18 మా దేవుడు మమ్ములను రక్షించని పక్షంలో కూడా, రాజా, మేము నీ దేవుళ్లను కొలవమనే సంగతి నీవు తెలుసుకోవాలి. నీవు ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని మేము పూజించము.”

19 అప్పుడు నెబుకద్నెజరు చాలా ఉగ్రుడయ్యాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోల వంక అతను చాలా కోపంగా చూశాడు. కొలిమి మామూలుకంటె ఏడు రెట్లు వేడిగా ఉండాలని అతను ఆజ్ఞాపించాడు. 20 తర్వాత నెబుకద్నెజరు తన సైన్యంలోని మహా బలాఢ్యులైన కొందరికి షద్రకు, మేషాకు, అబేద్నెగోలని బంధించి, వేడి కొలిమిలోకి తోసివేయుమని ఆజ్ఞాపించాడు.

21 అందువల్ల షద్రకు, మేషాకు, అబేద్నెగోలని బంధించి, వారిని వేడి కొలిమిలోకి తోసివేశారు. వాళ్లను మంటలోకి విసిరివేసినప్పుడు వారు తమ అంగీలు, పైవస్త్రాలు, తలపాగాలు మరియు ఇతర దుస్తులు ధరించారు. 22 రాజు చాలా ఉగ్రుడై ఉండటంవల్ల వారు కొలిమిని త్వరగా చాలా వేడి చేశారు. ఆ మంటలు ఎంత వేడిగా ఉన్నాయంటే, ఆ ముగ్గురిని మంటలో విసిరివేయడానికి మంట దగ్గరికి వెళ్లిన సైనికులు ఆ మంటలచేత వెంటనే కాలి చచ్చారు. 23 షద్రకు, మేషాకు, అబేద్నెగోలను గట్టిగా బంధించి అగ్నిగుండంలోకి త్రోసేశారు.

24 అప్పుడు జరిగింది చూసి నెబుకద్నెజరు ఆశ్చర్యపడ్డాడు. తన సలహాదారుల్ని పిలిచి, “మనం ముగ్గురినే బంధించి మంటల్లోకి త్రోసివేశాముగదా!” అని అడిగాడు.

“చిత్తం ప్రభూ” అని సలహాదారులు బదులు చెప్పారు.

25 “చూడండి! మంటల్లో నలుగురు నడుస్తున్నట్టు నేను చూస్తున్నాను. వారు బంధించబడినట్లుగాగాని, కాలిపోయినట్టుగాగాని లేరు. నాలుగవ వ్యక్తి దైవ కుమారునిగా కనిపిస్తున్నాడు” అని రాజు అన్నాడు.

26 తర్వాత నెబుకద్నెజరు వేడి కొలిమి వద్దకు వెళ్ళి, “అత్యున్నతుడైన దేవుని సేవకులైన షద్రకు, మేషాకు, అబేద్నెగోల్లారా! బయటికి రండి” అని పిలిచాడు.

అప్పుడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు మంటలనుండి వెలుపలికి వచ్చారు. 27 వారు వెలుపలికి రాగానే, పాలనాధికారులు, ఉన్నతాధికారులు, రాజుగారి సలహాదారులు వారిని చుట్టుముట్టారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలని మంటలు కాల్చలేదని, వారి దేహాలు ఏమీ కాలిపోలేదని, వారి వెంట్రుకలు కాలిపోలేదని, వారి బట్టలు కాలిపోలేదని, వాళ్ళమీద మంటల వాసనైనా లేదని వారు తెలుసుకొన్నారు.

28 తర్వాత నెబుకద్నెజరు ఇలా అన్నాడు: “నేను షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుణ్ణి కీర్తిస్తున్నాను. వాళ్ల దేవుడు తన దూతను పంపించి తన సేవకుల్ని మంటలనుండి రక్షించాడు. ఈ వ్యక్తులు ముగ్గురు తమ దేవుని విశ్వసించారు. వారు నా ఆజ్ఞను ధిక్కరించి చనిపోవటానికిష్టపడ్డారు కాని, మరొక దేవుని కొలవడానికిగాని, పూజించుటకుగాని ఇష్టపడలేదు. 29 అందువల్ల నేనిప్పుడు ఈ ఆజ్ఞను ఇస్తున్నాను: ఏ దేశానికి చెందిన మనుష్యులుగాని, ఏ భాషకు చెందినవారుగాని, షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవునికి విరుద్ధంగా ఏమైనా చెప్పితే వారు ముక్కలుగా నరకబడతారు. ఆ వ్యక్తుల ఇళ్ళు పాడుదిబ్బలుగా నాశానం చేయబడతాయి. ఈ విధంగా ఏ ఇతర దేవుడుగాని తన మనుష్యులను రక్షించలేడు.” 30 ఆ తర్వాత షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు రాజు బబులోను దేశంలో ఇంకా ముఖ్యమైన అధికారాలిచ్చాడు.

కీర్తనలు. 107

అయిదవ భాగం

(కీర్తనలు 107–150)

107 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
    ఆయన ప్రేమ శాశ్వతం.
యెహోవా రక్షించిన ప్రతి మనిషి ఆ మాటలు చెప్పాలి.
    వారి శత్రువుల నుండి యెహోవా రక్షించిన ప్రతి మనిషీ ఆయనను స్తుతించాలి.
అనేక దేశాల నుండి యెహోవా తన ప్రజలను ఒక్కచోట సమావేశపర్చాడు.
    తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణాల[a] నుండి ఆయన వారిని తీసుకొని వచ్చాడు.

ప్రజల్లో కొందరు ఎండిన ఎడారిలో సంచరించారు.
    వారు నివసించుటకు ఒక పట్టణంకోసం ఆ ప్రజలు వెదకుచుండిరి.
    కాని వారికి ఒక్కపట్టణం కూడా దొరకలేదు.
ఆ ప్రజలు ఆకలితో, దాహంతో ఉండి
    బలహీనం అయ్యారు.
అప్పుడు వారు సహాయం కోసం ఏడ్చి, యెహోవాకు మొరపెట్టి వేడుకొన్నారు.
    యెహోవా ఆ ప్రజలను వారి కష్టాలన్నింటి నుండి రక్షించాడు.
ఆ ప్రజలు ఏ పట్టణంలో నివసించాలో సరిగ్గా ఆ పట్టణానికే దేవుడు ఆ ప్రజలను నడిపించాడు.
యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెప్పండి!
    ప్రజల కోసం, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
దాహంతో ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు.
    ఆకలితో ఉన్న ప్రాణాన్ని మంచి పదార్థాలతో దేవుడు నింపుతాడు.
10 దేవుని ప్రజల్లో కొందరు కటిక చీకటి కారాగారాల్లో
    బంధింపబడి ఖైదీలుగా ఉన్నారు.
11 ఎందుకంటే దేవుడు చెప్పిన విషయాలకు ఆ ప్రజలు విరోధంగా పోరాడారు.
    సర్వోన్నతుడైన దేవుని సలహా వినుటకు వారు నిరాకరించారు.
12 ఆ ప్రజలు చేసిన పనుల మూలంగా
    దేవుడు వారికి జీవితాన్ని కష్టతరం చేశాడు.
వారు తొట్రిల్లి, పడిపోయారు.
    మరి వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ లేకపోయారు.
13 ఆ ప్రజలు కష్టంలో ఉన్నారు; కనుక వారు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నారు.
    వారి కష్టాలనుండి యెహోవా వారిని రక్షించాడు.
14 దేవుడు వాళ్లను వారి కటిక చీకటి కారాగారాలనుండి బయటకు రప్పించాడు.
    మరియు వారు బంధించబడిన తాళ్లను దేవుడు తెంచివేసాడు.
15 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
    ప్రజలకోసం ఆయన చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
16 దేవా, మా శత్రువులను ఓడించుటకు మాకు సహాయం చేయుము.
వారి ఇత్తడి తలుపులను దేవుడు పగులగొట్టగలడు.
    వారి ద్వారాల మీది ఇనుప గడియలను దేవుడు చితకగొట్టగలడు.

17 కొందరు ప్రజలు తమ తిరుగుబాటు మార్గాల ద్వారా తెలివితక్కువ వాళ్లయ్యారు.
    మరియు వారి పాపాలవల్ల కష్టాన్ని అనుభవించారు.
18 ఆ మనుష్యులు తినటానికి నిరాకరించారు,
    వారు చావుకు సమీపించారు.
19 వారు కష్టంలో ఉన్నారు, అందుచేత సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు.
    యెహోవా వారిని వారి కష్టాల నుండి రక్షించాడు.
20 దేవుడు ఆజ్ఞ ఇచ్చి, ప్రజలను స్వస్థపర్చాడు.
    కనుక ఆ ప్రజలు సమాధి నుండి రక్షించబడ్డారు.
21 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
    ప్రజలకోసం యెహోవా చేసే ఆశ్చర్యకార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
22 యెహోవా చేసిన వాటన్నింటికీ కృతజ్ఞతగా ఆయనకు బలులు అర్పించండి.
    యెహోవా చేసిన పనులను గూర్చి సంతోషంగా చెప్పండి.

23 కొందరు ఓడలో సముద్రం మీద ప్రయాణం చేశారు.
    వారు సముద్రాల మీద వ్యాపారం చేశారు.
24 ఆ ప్రజలు యెహోవా చేయగలిగిన సంగతులను చూశారు.
    సముద్రం మీద యెహోవా చేసిన ఆశ్చర్యకార్యాలను వారు చూశారు.
25 దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, బలమైన గాలి వీచటం మొదలయింది.
    అలలు అంతకంతకు పెద్దవయ్యాయి.
26 అలలు ఆకాశమంత ఎత్తు లేస్తున్నాయి.
తుఫాను మహా ప్రమాదకరంగా ఉండటంచేత మనుష్యులు ధైర్యాన్ని కోల్పోయారు.
27     ఆ మనుష్యులు తూలిపోతూ, తాగుబోతుల్లా పడిపోతున్నారు.
    నావికులుగా వారి నైపుణ్యం నిష్ప్రయోజనం.
28 వారు చిక్కులో పడ్డారు. అందుచేత సహాయం కోసం వారు యెహోవాకు మొర పెట్టారు.
    మరియు యెహోవా వారిని వారి కష్టాల్లోనుంచి రక్షించాడు.
29 దేవుడు తుఫానును ఆపివేసి,
    అలలను నెమ్మది పర్చాడు.
30 సముద్రం నిమ్మళించినందుకు నావికులు సంతోషించారు.
    వారు వెళ్లాల్సిన స్థలానికి దేవుడు వారిని క్షేమంగా నడిపించాడు.
31 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
    ప్రజలకోసం యెహోవా చేసే ఆశ్చర్యకార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
32 మహా సమాజంలో యెహోవాను స్తుతించండి.
    పెద్దలు సమావేశమైనప్పుడు ఆయనను స్తుతించండి.

33 దేవుడు నదులను ఎడారిగా మార్చాడు.
    నీటి ఊటలు ప్రవహించకుండా ఆయన నిలిపివేశాడు.
34 సారవంతమైన భూమిని పనికిమాలిన ఉప్పు భూమిగా దేవుడు మార్చాడు.
    ఎందుకంటే, అక్కడ నివసిస్తున్న ప్రజలు చేసిన చెడ్డపనులవల్లనే.
35 దేవుడు ఎడారిని సరస్సులుగల దేశంగా మార్చాడు.
    ఎండిన భూమి నుండి నీటి ఊటలు ప్రవహించేలా చేశాడు.
36 దేవుడు ఆకలితో ఉన్న ప్రజలను ఆ మంచి దేశానికి నడిపించాడు.
    ఆ ప్రజలు నివాసం ఉండుటకు ఒక పట్టణాన్ని నిర్మించాడు.
37 ఆ ప్రజలు వారి పొలాల్లో విత్తనాలు చల్లారు. పొలంలో ద్రాక్షలు వారు నాటారు.
    వారికి మంచి పంట వచ్చింది.
38 దేవుడు ఆ ప్రజలను ఆశీర్వదించాడు. వారి కుటుంబాలు పెద్దవయ్యాయి.
    వారికి ఎన్నెన్నో పశువులు ఉన్నాయి.
39 విపత్తు, కష్టాల మూలంగా వారి కుటుంబాలు
    చిన్నవిగా బలహీనంగా ఉన్నాయి.
40 దేవుడు వారి నాయకులను ఇబ్బంది పెట్టి అవమానించాడు.
    బాటలు లేని ఎడారిలో దేవుడు వారిని తిరుగులాడనిచ్చాడు.
41 అయితే, అప్పుడు దేవుడు ఆ పేద ప్రజలను వారి దౌర్భాగ్యం నుండి తప్పించాడు.
    ఇప్పుడు వారి కుటుంబాలు గొర్రెల మందల్లా పెద్దవిగా ఉన్నాయి.
42 మంచి మనుష్యులు యిది చూచి సంతోషిస్తారు.
    కాని దుర్మార్గులు యిది చూచి ఏమి చెప్పాలో తెలియక ఉంటారు.
43 ఒక వ్యక్తి తెలివిగలవాడైతే ఈ సంగతులను జ్ఞాపకం ఉంచుకొంటాడు.
    ఒక వ్యక్తి తెలివిగలవాడైతే నిజంగా దేవుని ప్రేమ అంటే ఏమిటో గ్రహిస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International