Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 రాజులు 20

బెన్హదదు, అహాబు యుద్ధానికి తలపడుట

20 బెన్హదదు సిరియా రాజు, అతడు తన సైన్యాలన్నిటినీ సమీకరించాడు. తనతో ముప్పై ఇద్దరు రాజులున్నారు. వారికి రథాలు, గుర్రాలు వున్నాయి. వారు సమరియను (షోమ్రోను) ముట్టడించి యుద్ధం చేశారు. ఇశ్రాయేలు రాజైన అహాబు వద్దకు సిరియా రాజు దూతలను పంపాడు. వారు బెన్హదదు మాటగా అహాబుతో ఇలా అన్నారు: “నీవు నీ యొక్క వెండి బంగారాలను నాకు ఇచ్చేయాలి. అంతేగాక నీ భార్యలను, పిల్లలను కూడ తప్పక నాకు ఇచ్చేయాలి.”

ఇశ్రాయేలు రాజు ఇలా అన్నాడు: “నా యజమానియైన ఓ రాజా, నేను నీ వాడనని ఒప్పుకుంటున్నాను. నాకున్నప్రతిదీ నీకు చెందినదే.”

దూతలు మరల అహాబు వద్దకు వచ్చారు. వారు బెన్హదదు తరుపున ఇలా అన్నారు, “నీవు నీ వెండి బంగారాలను, నీ భార్యలను, పిల్లలను నాకు ఇవ్వాలని నేనింతకు ముందే చెప్పాను. నేనిప్పుడు నా మనుష్యులను పంపి నీ భవనాన్ని, నీ కింది పాలకుల ఇండ్లను వెదికించాలనుకుంటున్నాను. నా మనుష్యలకు ఏది నచ్చితే అది తీసుకుని వస్తారు.”

ఇది విని, రాజైన అహాబు తన దేశంలో వున్న పెద్దల (నాయకుల)తో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. వారితో ఇలా అన్నాడు: “చూడండి! బెన్హదదు కయ్యానికి సిద్దమవుతున్నాడు. నా భార్యలను, పిల్లలను, నా వెండి బంగారాలను నేనతనికి ఇవ్వాలని ముందుగా చెప్పాడు. అవన్నీ ఇవ్వటానికి నేను ఒప్పుకున్నాను. కాని ఇప్పుడతను సర్వం తీసుకోవాలని చూస్తున్నాడు.”

ఇది విన్న పెద్దలు (నాయకులు), ఇతర ప్రజలు “బెన్హదదును లెక్క చేయవద్దనీ, అతను చెప్పినట్లు చేయవద్దనీ” అన్నారు.

బెన్హదదుకు తిరుగు సమాధానంలో అహాబు ఇలా అన్నాడు: “నేను నీవు ముందు చెప్పిన విధంగా చేస్తాను. కాని నీవు రెండవసారి ఆజ్ఞ ఇచ్చినట్లుగా నేను చేయజాలను.”

రాజైన బెన్హదదు మనుష్యులు ఈ సమాచారాన్ని అతనికి అందజేశారు. 10 బెన్హదదు నుంచి మరో వర్తమానం తీసుకుని దూతలు మళ్లీ వచ్చారు. ఆ సమాచారం ఇలా వుంది, “నేను షోమ్రోనును పూర్తిగా నాశనం చేస్తాను. ఆ నగరంలో ఏదీ మిగిలి వుండదని నేను ప్రమాణం చేసి చెబుతున్నాను! నా మనుష్యులు గుర్తుగా[a] ఇంటికి తెచ్చుకోవటానికి కూడ అక్కడ ఏమీ మిగలదు. నేనిది చేయకపోతే దేవుడు నన్ను సర్వనాశనం చేయుగాక!”

11 రాజైన అహాబు ప్రత్యుత్తరమిస్తూ “బెన్హదదుకు ఇలా చెప్పండి. కవచాన్ని ధరించువాడు దానిని ధరించి విప్పిన వానివలె గొప్పలు చెప్పరాదు”[b] అని చెప్పమన్నాడు.

12 రాజైన బెన్హదదు ఇతర పాలకులతో కలిసి తన డేరాలో వున్నాడు. ఆ సమయంలో అతని దూతలు తిరిగి వచ్చి రాజైన అహాబు ఇచ్చిన సమాధానాన్ని అతనికి అందజేశారు. రాజైన బెన్హదదు నగరాన్ని ముట్టడించటానికి సన్నద్ధులు కండని తన మనుష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు. కావున వారంతా తమ తమ స్థానాలకు వెళ్లారు.

13 అదే సమయంలో ఒక ప్రవక్త రాజైన అహాబు వద్దకు వెళ్లి యెహోవా ఇలా అంటున్నాడని చెప్పాడు: “ఆ పెద్ద సైన్యాన్ని నీవు చూస్తున్నావు గదా! దేవుడనైన నేను నీవు ఆ మహా సైన్యాన్ని ఈ రోజు ఓడించేలా చేస్తాను. అప్పుడు నేనే నిత్యుడనైన యెహోవానని నీవు గుర్తిస్తావు.”

14 “వారిని ఓడించటానికి నీవు ఎవరిని ఉపయోగిస్తావు?” అని అహాబు అడిగాడు. “యువకులైన ప్రభుత్వాధికారులను” అని యెహోవా సెలవిస్తున్నాడని ప్రవక్త అన్నాడు. “ప్రధాన సైన్యాన్ని ఎవరు నడుపుతారు?” అని రాజు అడిగాడు.

“నీవే” అని ప్రవక్త అన్నాడు.

15 కావున అహాబు యువ ప్రభుత్వాధికారులను సమాయత్తపరచాడు. వారు రెండు వందల ముప్పై రెండుమంది ఉన్నారు. ఇశ్రాయేలు సైన్యాన్నంతటినీ రాజు సమీకరించాడు. వారంతా ఏడు వేల మందివున్నారు.

16 మధ్యాహ్నమయ్యింది. రాజైన బెన్హదదు, అతనికి తోడుగా ఉన్న మొప్పైరెండు మంది పాలకులు వారి గుడారాలలో బాగా మద్యపానం చేసి మైకంలో వున్నారు. ఈ సమయంలో రాజైన అహాబు దండయాత్ర మొదలయ్యింది. 17 యువ ప్రభుత్వాధికారులు ముందుగా ఎదుర్కొన్నారు. రాజైన బెన్హదదు మనుష్యులు అతనితో షోమ్రోను నుండి కొందరు సైనికులు బయటికి వచ్చినట్లు చెప్పారు. 18 “అయితే వారు యుద్ధానికి వస్తూ వుండవచ్చు. లేదా వారు సంధి నిమిత్తమై వస్తూ వుండవచ్చు. ఏది ఏమైనా వారిని సజీవంగా పట్టుకోండి” అని బెన్హదదు అన్నాడు.

19 రాజైన అహాబు యొక్క యువసైనికులు దండయాత్రను నడుపుతున్నారు. ఇశ్రాయేలు సైన్యంవారిని అనుసరిస్తూవుంది. 20 ఇశ్రాయేలు అధికారులలో ప్రతియొక్కడూ తనని ఎదుర్కొన్న శత్రువును చంపివేశాడు. కావున అరామునుండి వచ్చినవారు పారిపోయారు. ఇశ్రాయేలు సైన్యం వారిని తరిమికొట్టింది. రాజైన బెన్హదదు ఒక రథాశ్వము నెక్కి తప్పించుకున్నాడు.

21 రాజైన అహాబు తన సైన్యాన్ని నడిపించి అరాము సైనికుల గుర్రాలను, రథాలను స్వాధీన పర్చుకున్నాడు. ఆ విధంగా రాజైన అహాబు చేతిలో సిరియను సైన్యం ఘోర పరాజయం పొందింది.

22 అప్పుడు ప్రవక్త రాజైన అహాబు వద్దకు వెళ్లి ఇలా అన్నాడు, “ఆరాము రాజైన బెన్హదదు రాబోయే వసంతకాలం నాటికి మళ్లీ నీమీదికి యుద్ధానికి వస్తాడు. ఇప్పుడు నీవు నీ నివాసానికి వెళ్లి నీ సైన్యాన్ని బాగా బలపర్చుకో. అతని దండయాత్ర నుంచి నిన్ను నీవు రక్షించుకోవటానికి తగిన వ్యూహాలు సిద్ధం చేయి.”

బెన్హదదు తిరిగి యుద్ధానికి వచ్చుట

23 రాజైన బెన్హదదు సేవకులు కొందరు వచ్చి అతనికి ఇలా సలహా ఇచ్చారు, “ఇశ్రాయేలు దేవతలు కొండ దేవతలు. మనం యుద్ధం పర్వత ప్రాంతంలో నిర్వహించాం. అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. కావున ఈ సారి మనం మైదాన ప్రాంతంలో యుద్ధం నిర్వహించాలి. అప్పుడు మనం గెలుస్తాం. 24 ఇప్పుడు నీవొకటి చేయాలి. ఈ ముప్పది యిద్దరు పాలకులను సైన్యాలను నడిపించేందుకు అనుమతించద్దు. వారి స్థానంలో దళాధిపతులను నియమించు. 25 తర్వాత నీవు పోగొట్టుకున్నటువంటి సైన్యాన్ని మళ్లీ నీవు భర్తీ చేయాలి. పూర్వపు సైన్యంలో వున్నట్లుగా గుర్రాలను, రథాలను మళ్లీ సేకరించు. అప్పుడు ఇశ్రాయేలు సైన్యాన్ని మైదాన ప్రాంతంలో మనం ఎదుర్కొందాం. అప్పుడు విజయం మనదే!” బెన్హదదు వారి సలహా పాటించాడు. వారు చెప్పిందంతా చేశాడు.

26 వసంత కాలం వచ్చే సరికి బెన్హదదు అరాము ప్రజలను సమీకరించాడు. ఇశ్రాయేలుతో యుద్ధం చేయటానికి అతడు ఆఫెకు నగరానికి వెళ్లాడు.

27 ఇశ్రాయేలీయులు కూడా యుద్ధానికి తయారైనారు. ఇశ్రాయేలు ప్రజలు అరాము సైన్యంతో పోరాడటానికి వెళ్లారు. అరాము సైనికులు దిగిన చోటికి ఎదురుగానే ఇశ్రాయేలు సైనికులు మకాంవేశారు. అరామీయులు ఆ ప్రదేశాన్నంతా ఆక్రమించియుండగా, ఇశ్రాయేలీయులు కేవలం రెండు మేకల మందలవలెవున్నారు.

28 ఇశ్రాయేలు రాజు వద్దకు దైవజనుడొకడు వర్తమానాన్ని తెచ్చాడు. యెహోవా ఇలా చెప్పాడు: “అరాము ప్రజలు ప్రభువునైన నన్ను ఒక కొండ దేవతగా చిత్రీకరించారు. నేను లోయలకు కూడ దేవుడనేనని వారు భావించలేదు. కావున నీవు ఈ పెద్ద సైన్యాన్ని ఓడించేలా చేస్తాను. అప్పుడు సర్వత్రా నేనే ప్రభువునని నీవు తెలుసుకుంటావు.”

29 ఇరు సైన్యాలు ఎదురెదురుగా ఏడు రోజుల పాటు మోహరించి వున్నాయి. ఏడవరోజు యుద్ధం మొదలయ్యింది. ఇశ్రాయేలీయులు ఒక్క రోజులో ఒక లక్ష మంది అరాము సైనికులను చంపేశారు. 30 మిగిలిన వారు ఆఫెకు నగరానికి పారిపోయారు. నగర ప్రాకారపు గోడ విరిగి పడగా ఇరవై ఏడువేల మంది సైనికులు చనిపోయారు. బెన్హదదు కూడ నగరానికి పారిపోయాడు. అతడొక గదిలో దాక్కున్నాడు. 31 ఈ లోపు కొందరు సేవకులు అతనితో ఇలా అన్నారు: “ఇశ్రాయేలు రాజులు కనికరం చూపనున్నట్లు మేము విన్నాం. మనం గోనెబట్టలు ధరించి, తాళ్లు తలకు చుట్టుకుని[c] ఇశ్రాయేలు రాజు వద్దకు వెళ్దాం. బహుశః అతడు మనల్ని బ్రతకనివ్వొచ్చు.”

32 వారు గోనెపట్టలు చుట్టుకుని, తలపై తాళ్లు వేసుకున్నారు. వారు ఇశ్రాయేలు రాజు వద్దకు వచ్చి, “మీ సేవకుడు బెన్హదదు దయచేసి తనను బ్రతకనివ్వమని అడుగుతున్నాడు” అని చెప్పారు.

“అయితే అతడింకా బ్రతికే వున్నాడా? అతడు నా సహోదరుడే!” అన్నాడు అహాబు.

33 బెన్హదదు మనుష్యులు రాజైన అహాబు నిజంగా దయచూపి బెన్హదదును చంపనని నిరూపించే విధంగా ఏదైనా చెప్పాలని కోరుకున్నారు. ఎప్పుడయితే బెన్హదదును నా సహోదరుడని అహాబు అన్నాడో, వచ్చిన మనుష్యులు వెంటనే,

“అవును! బెన్హదదు నీ సోదరుడే!” అని అన్నారు. “అతనిని నా వద్దకు తీసుకుని రండి” అని అహాబు అన్నాడు. తరువాత బెన్హదదు రాజైన అహాబు ముందుకు వచ్చాడు. అహాబు అతనిని తనతో తన రథం ఎక్కమన్నాడు.

34 బెన్హదదు అతనితో ఇలా అన్నాడు: “అహాబూ, నా తండ్రి నీ తండ్రి వద్ద నుండి తీసుకున్న పట్టణాలన్నిటినీ నేను నీకు తిరిగి ఇస్తాను. నా తండ్రి షోమ్రోనులో చేసిన విధంగా, దమస్కులో నీవు కొన్ని వీధులను నిర్మించి, వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు.” అది విన్న అహాబు,

“నీవు ఇందుకు ఒప్పుకుంటే నేను నిన్ను వదిలి పెడతాను” అని అన్నాడు. తరువాత ఆ రాజులిద్దరూ ఒక శాంతి ఒడంబడిక కుదుర్చుకున్నారు. రాజైన అహాబు రాజైన బెన్హదదును స్వేచ్ఛగా వదిలాడు.

ఒక ప్రవక్త అహాబుకు వ్యతిరేకంగా మాట్లాడుట

35 ప్రవక్తలలో ఒకడు మరో ప్రవక్తతో, “నన్ను కొట్టు!” అని అన్నాడు. యెహోవా వలన ప్రేరేపించబడి అతనలా అన్నాడు. కాని ఆ రెండవ ప్రవక్త అతనిని కొట్ట నిరాకరించాడు. 36 అందుచే మొదటి ప్రవక్త ఇలా అన్నాడు; “నీవు యెహోవా ఆజ్ఞను పాటించలేదు. నీవు ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లగానే ఒక సింహం నిన్ను చంపేస్తుంది.” ఆ రెండవ ప్రవక్త ఆ ప్రదేశం వదిలి వెళ్లగానే ఒక సింహం వచ్చి అతనిని చంపేసింది.

37 మొదటి ప్రవక్త మరో వ్యక్తి వద్దకు వెళ్లి, “నన్ను కొట్టు!” అన్నాడు.

ఈ వ్యక్తి వానిని కొట్టాడు. ప్రవక్తకు బాగా దెబ్బతగిలింది.

38 అందుచే ఆ ప్రవక్త ఒక బట్టతో తన ముఖం కప్పుకున్నాడు. దానివల్ల అతనెవరైనదీ ఎవ్వరూ గుర్తు పట్టలేదు. ప్రవక్త వెళ్లి రాజు కొరకు బాటపై నిలబడ్డాడు. 39 రాజు వచ్చినప్పుడు ప్రవక్త అతనితో ఇలా అన్నాడు: “నేను యుద్ధం చేయటానికి వెళ్లాను. మనలో ఒకడు శత్రుసైనికునొకణ్ణి నా వద్దకు తీసుకుని వచ్చాడు. ఆ శత్రు సైనికునికి కాపలా వుండమనీ, వాడు గనుక పారిపోతే అతని స్థానంలో నేను నా ప్రాణాలను ఇవ్వవలసి వుంటుందనీ మన సైనికుడు నాతో చెప్పాడు. లేదా రెండు మణుగుల[d] వెండి చెల్లించవలసి వుంటుందని అన్నాడు. 40 కాని నేను వేరే పనిలో నిమగ్నమై వుండగా ఆ శత్రుసైనికుడు పారిపోయాడు.”

ఇశ్రాయేలు రాజు ఇలా అన్నాడు: “నీవా సైనికుని ఒదిలిపెట్టిన నేరం చేసినట్లు ఒప్పుకున్నావు. దానికి సమాధానం కూడా నీకు తెలుసు. ఆ వ్యక్తి చెప్పినట్లే నీవు చేయాలి.”

41 అప్పుడా ప్రవక్త తన ముఖము మీది బట్టను తీసేశాడు. ఇశ్రాయేలు రాజు వానిని చూచి, అతడు ప్రవక్తలలో ఒకడని తెలుసుకున్నాడు. 42 ప్రవక్త యెహోవా వర్తమానాన్ని రాజుకిలా చెప్పాడు: “చంపబడాలని నేను నిర్దేశించిన వ్యక్తిని నీవు వదిలి పెట్టావు. కావున వాని స్థానంలో నీ ప్రాణం తీసుకోబడుతుంది. అతని ప్రజల స్థానంలో నీ ప్రజలు చనిపోవలసి వుంటుంది.”

43 రాజు షోమ్రోనులో వున్న తన ఇంటికి వెళ్లి పోయాడు. అతని మనస్సు బాగా కలత పడింది. అతడు చింతాక్రాంతుడయ్యాడు.

1 థెస్సలొనీకయులకు 3

మేము మీ దగ్గరకు రావాలని ఎంతో ప్రయత్నించి రాలేకపోయాము. అందుచేత తిమోతిని పంపించి మేము ఏథెన్సులో ఉండిపొయ్యాము. కనుక దేవుని సేవ చేయటంలో మరియు క్రీస్తును గురించి సువార్త ప్రచారం చేయటంలో మాతో కలిసి పనిచేసిన మా సోదరుడు తిమోతిని ప్రోత్సాహ బలం కోసం మీ దగ్గరకు పంపాము. ఈ హింసల కారణంగా మీలో ఎవ్వరూ వెనుకంజ వేయరాదని మా ఉద్దేశ్యము. ఈ హింసలను అనుభవించటం మన విధి అని మీకు బాగా తెలుసు. నిజానికి, మేము మీతో ఉన్నప్పుడే మనము ఈ హింసల్ని అనుభవించవలసి వస్తుందని మీకు చెప్పాము. మేము అన్నట్టుగానే జరిగింది. మీరు గమనించే ఉంటారు. ఆ కారణంగా నేనిక ఓపికతో ఉండలేక మీ విశ్వాసాన్ని గురించి తెలుసుకోవటానికి అతణ్ణి పంపాను. ఏదో ఒక విధంగా సాతాను మిమ్మల్ని శోధిస్తాడని, నా శ్రమ వృధా అయిపోయిందని భయపడ్డాను.

కాని తిమోతి మీ దగ్గర నుండి యిప్పుడే వచ్చాడు. మీ విశ్వాసాన్ని గురించి, మీ ప్రేమను గురించి మంచి వార్త తీసుకొని వచ్చాడు. మమ్మల్ని గురించి అన్ని వేళలా మీరు మంచిగా భావిస్తున్నారని తెలిసింది. మేము మిమ్మల్ని చూడటానికి ఎదురు చూస్తున్నట్లే, మీరు కూడా మమ్మల్ని చూడటానికి ఆశిస్తున్నారని అతడు మాకు చెప్పాడు. సోదరులారా! మేము దుఃఖంతో ఉన్నప్పుడు, హింసలను అనుభవిస్తున్నప్పుడు మీ విశ్వాసం చూసి ఆనందించాము. మీకు ప్రభువు పట్ల ఉన్న విశ్వాసాన్ని మీరు విడువకుండా ఉంటే మా జీవితం సార్థకమౌతుంది. మేము దేవుని సమక్షంలో ఉన్నప్పుడు మీ విషయంలో చాలా కృతజ్ఞులము. మేము ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా అవి తక్కువే! 10 మిమ్మల్ని చూసే అవకాశం కలగాలని, మీ విశ్వాసం దృఢపడాలని, దానికి కావలసినవి దేవుడు ఇవ్వాలని, రాత్రింబగళ్ళు మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాము.

11 మన తండ్రియైన దేవుడు, మన ప్రభువైన యేసు మేము మీ దగ్గరకు రావటానికి మాకు దారి చూపుగాక! 12 మీపై ఉన్న మా ప్రేమ అభివృద్ధి చెందుతున్నట్లే, మీలో పరస్పరం ప్రేమ అభివృద్ధి చెందేటట్లు, యితరుల పట్ల కూడా మీ ప్రేమ అభివృద్ధి చెందేటట్లు ప్రభువు అనుగ్రహించుగాక. 13 మన యేసు ప్రభువు భక్తులతో వచ్చినప్పుడు మన తండ్రియైన దేవుని ముందు మీరు ఏ అపకీర్తి లేకుండా పవిత్రంగా ఉండేటట్లు దేవుడు మీకు శక్తి ననుగ్రహించు గాక!

దానియేలు 2

నెబుకద్నెజరు స్వప్నం

నెబుకద్నెజరు రాజుగావున్న రెండవ సంవత్సరంలో, అతనికి కొన్ని కలలు వచ్చాయి. ఆ కలలు అతన్ని కలతపెట్టాయి, కనుక అతనికి నిద్ర పట్టలేదు. అప్పుడు రాజు తన కలను చెప్పటానికి మాంత్రికులను, గారడీవాళ్లను, శకునం చెప్పేవాళ్లను, కల్దీయులను పిలుపించుమని ఆజ్ఞాపించాడు. వారందరు వచ్చి రాజు ఎదుట నిలబడ్డారు. తాను ఏమి కలగన్నాడో చెప్పమని రాజు వారిని అడిగాడు.

అప్పుడు వారితో రాజు ఇలా అన్నాడు, “ఆ కల నన్ను కలత పెట్టింది. కాబట్టి కల, దాని అర్థం నాకు మీరు చెప్పాలి” తర్వాత కల్దీయులు రాజుతో సిరియా భాషలో[a], “రాజా, వర్థిల్లుము. మేము నీ సేవకులం. దయచేసి నీ కల ఏమిటో చెప్పుము. ఆ తర్వాత దాని అర్థం మేము చెబుతాము” అని అన్నారు.

అప్పుడు నెబుకద్నెజరు వారితో, “ఆ కలను నేను మర్చిపోయాను. కలను, దాని అర్థాన్ని కూడా మీరు చెప్పాలి. మీరు ఇవి చెప్పకపోతే, మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికిస్తాను. మీ ఇళ్లను పాడు దిబ్బలుగా చేయిస్తాను. కాని మీరు నా కలను, దాని అర్థాన్ని వివరించినట్లయితే, అప్పుడు మీకు నేను కానుకలు, బహుమానాలు ఇస్తాను. గొప్పగా గౌరవిస్తాను. అందువల్ల ఆ కలను, దాని భావాన్ని, మీరు నాతో చెప్పండి” అని అన్నాడు.

మళ్లీ ఆ జ్ఞానవంతులు, “రాజా, దయచేసి నీ కలను చెప్పుము, మేము దాని అర్థం చెబుతాము” అని అడిగారు.

అప్పుడు నెబుకద్నెజరు ఇలా అన్నాడు: “మీరింకా వ్యవధి కోరుతున్నారని నాకు తెలుసు. కాని నేనేమి చెప్పానో, అది నా నిర్ధారణ అని మీకు తెలుసు. మీరు నా కలను గురించి చెప్పకపోతే, నేను మిమ్మల్ని శిక్షిస్తానని కూడా మీకు తెలుసు. కాబట్టి మీరంతా నాతో వ్యర్థమైన మాటలు, అబద్ధాలు చెప్పటానికి కాలయాపన చేస్తున్నారు. నేను చెప్పిన మాటలు మరచిపోతానని మీరు భావించవద్దు. ఇప్పుడు నా కలనుగురించి చెప్పండి. మీరు చెప్పితే, అప్పుడు ఆ కలయొక్క అర్థము కూడా మీరు చెప్పగలరని నాకు తెలుస్తుంది.”

10 అప్పుడు రాజుతో కల్దీయులు ఇలా చెప్పారు: “రాజు ఏమి అడుగుచున్నాడో, అది చెప్పగల ప్యక్తి ఈ భూమిమీదనే లేడు. ఈ విధంగా వివేకవంతుల్నిగాని, ఇంద్రజాలికుల్నిగాని, కల్దీయుల్నిగాని అడిగిన రాజు ఎవ్వరూ లేరు. ఈ విధంగా ఏ గొప్ప రాజుగాని, ఏ మహా శక్తివంతుడైన రాజుగాని అడుగలేదు. 11 చేయటానికి బహు కఠినమైన దానిని రాజు అడుగుచున్నాడు. దేవుళ్లు మాత్రమే రాజైన తమకు వచ్చిన కలనుగాని, ఆ కల అర్థముగాని చెప్పగలుగుతారు. కాని దేవుళ్లు మనుష్యులతో ఉండరు.”

12 ఇది వినగానే, రాజు చాలా ఉగ్రుడై, బబులోనులోని జ్ఞానవంతులందరిని చంపమని ఆజ్ఞాపించాడు. 13 నెబుకద్నెజరు వివేకవంతులందరు చంపబడాలని ఆజ్ఞ ప్రకటించగా రాజు మనుష్యులు దానియేలు మరియు అతని మిత్రుల్ని చంపడానికి వెళ్లారు.

14 అర్యోకు రాజరక్షకభటుల అధిపతి. బబులోనులోని వివేకవంతుల్ని చంపడానికి అతడు బయలు దేరాడు. కాని దానియేలు అతనితో తెలివిగా మాట్లాడాడు. 15 దానియేలు రాజరక్షకభటుల అధిపతియైన అర్యోకుని ఇలా అడిగాడు: “రాజు ఎందుకు ఇంత కఠినమైన శిక్షను విధించాడు?”

అప్పుడు అర్యోకు రాజు కలయొక్క వృత్తాంతము నంతటిని దానియేలుకు వివరించాడు. దానియేలు అది విని, సంగతి తెలుసుకొన్నాడు. 16 అతను నెబుకద్నెజరు రాజు వద్దకు వెళ్లి, తనకు మరికొంత సమయం ఇమ్మని, అప్పుడు తను కలను, కలయొక్క అర్థాన్ని చెప్పగలనని అడిగాడు.

17 దానియేలు తన ఇంటికి వెళ్లి మిత్రులైన హనన్యా, మిషాయేలు, అజర్యాలకు పూర్తి సంగతిని వివరించాడు. 18 తమ పాలిట దేవుడు దయకలిగి ఆ రహస్యమును తెలుపుటకు పరలోకమందున్న దేవుని ప్రార్థించుమని దానియేలు తన మిత్రుల్ని కోరాడు. ఎందుకనగా దానియేలు మరియు అతని మిత్రులు బబులోనులోని యితర వివేకవంతులతో కలిసి నాశనమవ్వకూడదు.

19 ఆ రాత్రి, దేవుడు ఆ రహస్యమును దానియేలుకి దర్శనములో వివరించాడు. అప్పుడు పరలోక మందున్న దేవున్ని దానియేలు స్తుతించాడు.

20 “నిరంతరం దేవుని పేరు కీర్తించబడాలి;
    శక్తియు, వివేకమును ఆయనకే చెందాలని దానియేలు దేవున్ని స్తుతించాడు.
21 దేవుడే కాలాల్ని సమయాల్ని మార్చుతాడు.
    ఆయనే రాజుల్ని వారి అధికారాల్ని మార్చుతాడు.
    ఆయనే మనుష్యులకు వివేకమిస్తాడు.
కనుక, వారు వివేకవంతులౌతారు.
    జ్ఞానమిస్తాడు, కనుక జ్ఞానవంతులవుతారు.
22 గ్రహించటానికి కష్టమైన రహస్యాలు ఆయనకు తెలుసు.
    చీకటిలో మరుగైన సంగతులు ఆయనకు తెలుసు.
    వెలుగు ఆయనలో నివసిస్తుంది.
23 మా పూర్వీకుల దేవా! నీకు కృతజ్ఞుణ్ణి, నిన్ను కీర్తిస్తున్నాను.
    నీవు నాకు వివేకము, బలము ప్రసాదించావు.
నీవు రాజు కన్న కలను, దాని అర్థాన్ని తెలియజేశావు.
    మేమడిగిన విషయాల్ని నీవు మాకు చెప్పావు” అని దానియేలు అన్నాడు.

కలయొక్క అర్థమును దానియేలు చెప్పుట

24 తర్వాత దానియేలు అర్యోకు వద్దకు వెళ్లాడు. బబులోనులోని వివేకవంతుల్ని చంపటానికి రాజు అర్యోకును ఎంపిక చేశాడు. “బబులోనులోని వివేకవంతుల్ని చంపవద్దు. నన్ను రాజు వద్దకు తీసుకొని వెళ్లు. కలను గురించి, దాని అర్థాన్ని గురించి నేను చెప్తాను” అని దానియేలు అన్నాడు.

25 దానియేలును అర్యోకు తక్షణం రాజువద్దకు తీసుకొని వెళ్లాడు. అర్యోకు రాజుతో, “యూదానుంచి బందీలుగా వచ్చిన మనుష్యులలో నేనొక వ్యక్తిని చూశాను. కలయొక్క అర్థాన్ని రాజైన తమకు అతను వివరించగలడు” అని చెప్పాడు.

26 రాజు దానియేలుకు (బెల్తెషాజరుకు) ఒక ప్రశ్న వేశాడు. “నీవు నా కలను గూర్చి, దాని అర్థాన్ని గూర్చి చెప్పగలవా?”

27 దానియేలు, “నెబుకద్నెజరు రాజా! వివేకవంతుడుగాని, ఇంద్రజాలికుడుగాని, కల్దీయుడుగాని రాజు అడిగిన రహస్య విషయాలగురించి చెప్పలేడు. 28 కాని పరలోకమందున్న దేవుడు మరుగైన విషయాలగురించి చెప్పగలడు. భవిష్యత్తులో జరగబోయేదాన్ని చూపించడానికి దేవుడు రాజుకు ఒక కలను ఇచ్చాడు. నీవు నీ పడకమీద పడుకొని ఉండగా చూచిన విషయాలు ఇవి. 29 రాజా! నీ పడకమీద పడుకొని భవిష్యత్తులో ఏమి జరుగునో అని తలంచుచూ నీవు నిద్రించావు. గుప్త విషయాల గురించి దేవుడే చెప్పగలడు. భవిష్యత్తులో ఏమి జరుగునో దేవుడే నీకు చూపాడు. 30 దేవుడు ఈ రహస్యం నాకు కూడా తెలిపాడు. ఎందుకంటే, ఇతర వివేకవంతులకంటే నాకు ఎక్కువ వివేకం కలదనే కారణం కాదు. రాజువైన నీవు దాని అర్థమేమిటో గ్రహించాలని తలంచి దేవుడు ఈ రహస్య విషయం నాకు తెలిపాడు. ఆ విధంగా నీ మనుస్సులోని ఆలోచనల్ని నీవు గ్రహించగలవు” అని అన్నాడు.

31 “రాజా, నీవు నీ కలలో ఒక పెద్ద విగ్రహం నీ ముందు నిలిచియుండటం చూశావు. అది తళతళ మెరుస్తూ భయంకరంగా ఉండినది. 32 విగ్రహంయొక్క తల స్వచ్ఛమైన బంగారంతోను, రొమ్ము, చేతులు వెండితోను, పొట్ట, తొడలు కంచుతోను, 33 మోకాళ్ల క్రింది భాగం ఇనుముతోను, పాదాలు మట్టి, ఇనుముతోను కలిసి చేయబడినవి. 34 నీవు ఆ విగ్రహంవైపు చూస్తూ ఉండగా, ఒక రాయి మానవుని చేతితో తీయ బకుండా గాలిలో ఎగిరి, దానంతట అదే వెళ్లి ఇనుముతోను, బంకమట్టితోను చేయబడిన విగ్రహం పాదాలమీద పడి, దానిని పొడిపొడి చేసింది. 35 తర్వాత ఇనుము, బంకమట్టి, కంచు, వెండి, బంగారం పొడిపొడి అయ్యాయి. ఆ పొడి గాలికి కొట్టుకొనిపోయి కనబడకుండా పోయింది. తర్వాత విగ్రహాన్ని పొడి చేసిన ఆ రాయి పెద్ద కొండగా మారిపోయి భూమి అంతటా వ్యాపించింది.

36 “అదే నీ కల. ఇప్పుడు ఆ కలయొక్క అర్థమేమిటో మేము రాజుకు వివరిస్తాము. 37 రాజా, నీవు చాలా ముఖ్యుడవైన రాజువి. పరలోకమందున్న దేవుడు నీకు అధికారం, బలం, రాజ్యం, ప్రఖ్యాతిని, ప్రసాదించాడు. 38 నీవు ప్రజల్ని, భూజంతువుల్ని, ఆకాశ పక్షుల్ని లోబరచుకొని, పరిపాలించే శక్తిని ఆయన నీకు ఇచ్చాడు. వాళ్లందరూ, అవన్నీ ఎక్కడున్నా, దేవుడు నీవు పరిపాలించేటట్లు చేశాడు. ఓ నెబుకద్నెజరు రాజా! ఆ విగ్రహపు బంగారు తల నీవే.

39 “మరో రాజ్యం నీ తర్వాత వస్తుంది. అది వెండి లాంటిది. కాని ఆ రాజ్యం నీ రాజ్యంలా అంత గొప్పగా ఉండదు. ఆ తర్వాత మూడవ రాజ్యం భూమిని పరిపాలిస్తుంది. అది కంచు లాంటిది. 40 తర్వాత నాలుగవ రాజ్యం వస్తుంది. అది ఇనుములా శక్తివంతంగా ఉంటుంది. ఇనుము బ్రద్దలుచేసి ముక్కలు మక్కలుగా విరుగకొడుతుంది. ఆ విధంగానే, ఆ నాలుగవ రాజ్యం ఇతర రాజ్యాల్ని ముక్కలుగా పగులగొడుతుంది.

41 “ఆ విగ్రహం పాదాలు, వ్రేళ్లు కొంత ఇనుముతోను, కొంత బంకమట్టితోను చేయబడినవిగా నీవు చూశావు. అనగా, ఆ రాజ్యం భాగాలైన రాజ్యంగా ఉంటుంది. నీవు ఇనుమూ, బంకమట్టి కలిసినట్టుగా చూశావు గనుక ఆ రాజ్యం కొంతవరకు ఇనుమునకున్నంత బలంగానూ, బంకమట్టిలా బలహీనంగానూ ఉంటుందని అర్థం. 42 ఆ విగ్రహంయొక్క పాదాలు, బొటనవ్రేళ్లు ఇనుము, బంకమట్టితో కలిసి ఉన్నట్లుగా చూశావు. అలాగే ఆ రాజ్యం కొంత ఇనుమువలె బలంగాను, కొంత బంకమట్టివలె బలహీనంగానూ ఉంటుంది. 43 (నీవు ఇనుము బంకమన్నుతో కలిసింది చూశావు.) ఆ విధంగానే, ఆ మనుష్యులు ఒకరితోనొకరు కలసిమెలసి వుండలేరు.

44 “ఆ రాజ్యపు పరిపాలకుల కాలంలో పరలోకమందున్న దేవుడు మరొక రాజ్యం స్థాపిస్తాడు. ఈ రాజ్యం ఎల్లప్పుడూ ఉంటుంది. అది యెన్నటికీ నాశనం కాదు! అది దాన్ని పొందేవాళ్లకి తప్ప వేరే వాళ్లకు చెందదు. ఈ రాజ్యం ఇతర రాజ్యాలన్నిటినీ నాశనం చేసి అంతం చేస్తుంది. కాని ఆ రాజ్యం మాత్రమే సదాకాలం కొనసాగుతూ ఉంటుంది.

45 “నెబుకద్నెజరు రాజా, ఒక పర్వతంనుండి విరిగిన ఒక రాయిని నీవు చూశావు. అది మనిషి చేతులతో తీయబడింది కాదు. ఆ రాయి ఇనుమును, కంచును, బంకమట్టిని, వెండిని, బంగారాన్ని ముక్కలుగా విరుగగొట్టింది. ఈ విధంగా, దేవుడు భవిష్యత్తులో జరగనున్నదాన్ని నీకు చూపాడు. కల నిజం, దాని అర్థం నమ్మదగినది” అని దానియేలు రాజుతో చెప్పాడు.

46 అప్పుడు రాజైన నెబుకద్నెజరు దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజు దానియేలును గౌరవించాలనుకొన్నాడు. కాబట్టి అతనికి అర్పణాన్ని, ధూపాన్ని సమర్పించాలని ఆజ్ఞాపించాడు. 47 అప్పుడు దానియేలుతో రాజు, “నీవు దేవుడు గొప్పవాడనీ, శక్తిమంతుడనీ నేను నిస్సందేహంగా తెలుసుకున్నాను. ఆయన రాజులకు రాజు, దేవుళ్ళకు దేవుడు. ప్రజలకు తెలియని విషయాలు ఆయన చెపుతాడు. ఈ రహస్య విషయాలన్నిటినీ నీవు నాకు చెప్పావు కాబట్టి, ఇది సత్యమని నేను భావిస్తున్నాను” అని అన్నాడు.

48 అప్పుడు రాజు దానియేలుకు తన రాజ్యంలో అతి ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు. మరియు రాజు ఖరీదైన కానుకలు ఎన్నో అతనికిచ్చాడు. నెబుకద్నెజరు దానియేలును బబులోను రాజ్యమంతటికీ పరిపాలకునిగా చేశాడు. బబులోనులోని వివేకవంతులందరిమీద దానియేలును అధికారిగా నియమించాడు. 49 షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బబులోను రాజ్యంలో ముఖ్యులైన అధికారులుగా నియమింపుమని దానియేలు రాజుని కోరాడు. దానియేలు చెప్పినట్లుగానే, రాజు చేశాడు. మరియు దానియేలు రాజు దగ్గరే ఉండేవాడు.

కీర్తనలు. 106

106 యెహోవాను స్తుతించండి!
యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
    దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
యెహోవా నిజంగా ఎంత గొప్పవాడో ఏ ఒక్కరూ వర్ణించలేరు.
    ఏ ఒక్కరూ సరిపడినంతగా దేవుని స్తుతించలేరు.
దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారు సంతోషంగా ఉంటారు.
    ఆ ప్రజలు ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తూంటారు.

యెహోవా, నీవు నీ ప్రజల యెడల దయ చూపేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
    నన్ను కూడా రక్షించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
యెహోవా, నీ జనులకు నీవు చేసే మంచివాటిలో
    నన్ను పాలుపొందనిమ్ము
నీ ప్రజలతో నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
    నీ జనంతో నన్ను నీ విషయమై అతిశయించనిమ్ము.

మా పూర్వీకుల్లా మేము కూడా పాపం చేసాము.
    మేము తప్పులు చెడుకార్యాలు చేసాము.
యెహోవా, ఈజిప్టులో నీవు చేసిన అద్భుతాలను మా పూర్వీకులు సరిగ్గా అర్థం చేసుకోలేదు.
    నీ అపరిమితమైన ప్రేమను వారు జ్ఞాపకముంచుకోలేదు.
ఎర్రసముద్రం వద్ద మహోన్నతుడైన దేవునికి
    విరోధంగా ఎదురు తిరిగారు.

అయినా ఆయన తన నామము కోసం వారిని రక్షించాడు,
    ఎందుకంటే తన మహాశక్తిని వారికి తెలియజేయాలని.
దేవుడు ఆజ్ఞ ఇవ్వగా ఎర్రసముద్రం ఎండిపోయింది.
    దేవుడు మన పూర్వీకులను లోతైన సముద్రంలో ఎడారివలె ఎండిన నేలను ఏర్పరచి, దానిమీద నడిపించాడు.
10 మా పూర్వీకులను వారి శత్రువుల నుండి దేవుడు రక్షించాడు.
    వారి శత్రువుల బారి నుండి దేవుడు వారిని కాపాడాడు.
11 అప్పుడు దేవుడు వారి శత్రువులను సముద్రంలో ముంచి, కప్పివేసాడు.
    వారి శత్రువులు ఒక్కడూ తప్పించుకోలేదు!

12 అప్పుడు మన పూర్వీకులు దేవుణ్ణి నమ్మారు.
    వారు ఆయనకు స్తుతులు పాడారు.
13 కాని దేవుడు చేసిన వాటిని మన పూర్వీకులు వెంటనే మరచిపోయారు.
    వారు దేవుని సలహా వినలేదు.
14 మన పూర్వీకులు ఎడారిలో ఆకలిగొన్నారు.
    అరణ్యంలో వారు దేవుణ్ణి పరీక్షించారు.
15 కాని మన పూర్వీకులు అడిగిన వాటిని దేవుడు వారికి ఇచ్చాడు.
    అయితే దేవుడు వారికి ఒక భయంకర రోగాన్ని కూడా ఇచ్చాడు.
16 ప్రజలు మోషే మీద అసూయ పడ్డారు.
    యెహోవా పవిత్ర యాజకుడు అహరోను మీద వారు అసూయపడ్డారు.
17 కనుక ఆ అసూయపరులను దేవుడు శిక్షించాడు. భూమి తెరచుకొని దాతానును మింగివేసింది.
    తరువాత భూమి మూసుకొంటూ అబీరాము సహచరులను కప్పేసింది.
18 అప్పుడు ఒక అగ్ని ఆ ప్రజాసమూహాన్ని కాల్చివేసింది.
    ఆ అగ్ని ఆ దుర్మార్గులను కాల్చివేసింది.
19 హోరేబు కొండవద్ద ప్రజలు ఒక బంగారు దూడను చేశారు.
    వారు ఆ విగ్రహాన్ని ఆరాధించారు.
20 ఆ ప్రజలు గడ్డి తినే ఒక ఎద్దు విగ్రహాన్ని
    వారి మహిమ గల దేవునిగా మార్చేశారు.
21 మన పూర్వీకులు వారిని రక్షించిన దేవుణ్ణి గూర్చి మర్చిపోయారు.
    ఈజిప్టులో అద్భుతాలు చేసిన దేవుణ్ణి గూర్చి వారు మర్చిపోయారు.
22 హాము దేశంలొ[a] దేవుడు అద్భుత కార్యాలు చేశాడు.
    దేవుడు ఎర్ర సముద్రం దగ్గర భీకర కార్యాలు చేశాడు.

23 దేవుడు ఆ ప్రజలను నాశనం చేయాలని కోరాడు.
    కాని దేవుడు ఏర్పరచుకొన్న సేవకుడు మోషే ఆయనను నివారించాడు.
దేవునికి చాలా కోపం వచ్చింది.
    కాని దేవుడు ఆ ప్రజలను నాశనం చేయకుండా మోషే అడ్డుపడ్డాడు.

24 అంతట ఆ ప్రజలు ఆనందకరమైన కనాను దేశంలోనికి వెళ్లేందుకు నిరాకరించారు.
    ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలను ఓడించుటకు దేవుడు వారికి సహాయం చేస్తాడని ఆ ప్రజలు నమ్మలేదు.
25 మన పూర్వీకులు దేవునికి విధేయులవుటకు నిరాకరించారు.
26 అందుచేత వారు అరణ్యంలోనే మరణిస్తారని దేవుడు ప్రమాణం చేసాడు.
27 వారి సంతతివారిని ఇతర ప్రజలు ఓడించేలా చేస్తానని దేవుడు ప్రమాణం చేసాడు.
    మన పూర్వీకులను రాజ్యాలలో చెదరగొడతానని దేవుడు ప్రమాణం చేసాడు.

28 దేవుని ప్రజలు బయల్పెయోరు అనే బయలు దేవత పూజలో పాల్గొన్నారు.
    చచ్చినవారికి, విగ్రహానికి బలియిచ్చిన మాంసాన్ని దేవుని ప్రజలు తిన్నారు.
29 దేవుడు తన ప్రజల మీద చాలా కోపగించాడు. మరియు దేవుడు వారిని రోగులనుగా చేసాడు.
30 కాని ఫీనెహాసు దేవుని ప్రార్థించాడు.
    దేవుడు రోగాన్ని ఆపుచేసాడు.
31 ఫీనెహాసు చాలా మంచి పని చేసాడు అని దేవునికి తెలుసు.
    మరియు శాశ్వతంగా ఎప్పటికి దేవుడు దీనిని జ్ఞాపకం చేసుకొంటాడు.

32 మెరీబా వద్ద ప్రజలకు కోపం వచ్చింది.
    మోషేతో ఏదో చెడు కార్యము వారు చేయించారు.
33 ఆ ప్రజలు మోషేను చాలా కలవర పెట్టారు.
    అందుచేత మోషే అనాలోచితంగా మాటలు అనేశాడు.

34 కనానులో నివసిస్తున్న ఇతర ప్రజలను నాశనం చేయమని యెహోవా ప్రజలకు చెప్పాడు.
    కాని ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులు కాలేదు.
35 ఇశ్రాయేలు ప్రజలు ఇతర ప్రజలతో కలిసి పోయారు.
    ఇతర ప్రజలు చేస్తున్న వాటినే వీరు కూడా చేశారు.
36 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలకు ఉచ్చుగా తయారయ్యారు.
    ఆ ఇతర ప్రజలు పూజిస్తున్న దేవుళ్లను దేవుని ప్రజలు పూజించటం మొదలు పెట్టారు.
37 దేవుని ప్రజలు తమ స్వంత బిడ్డలను సహితం చంపి
    ఆ బిడ్డలను ఆ దయ్యాలకు బలియిచ్చారు.
38 దేవుని ప్రజలు నిర్దోషులను చంపివేసారు.
    వారు తమ స్వంత బిడ్డలనే చంపి ఆ బూటకపు దేవుళ్లకు అర్పించారు.
39 కనుక ఆ ఇతర ప్రజల పాపాలతో దేవుని ప్రజలు మైలపడ్డారు.
    దేవుని ప్రజలు తమ దేవునికి అపనమ్మకస్తులై ఆ ఇతర ప్రజలు చేసిన పనులనే చేసారు.
40 దేవునికి తన ప్రజల మీద కోపం వచ్చింది.
    దేవుడు వారితో విసిగిపోయాడు!
41 దేవుడు తన ప్రజలను ఇతర రాజ్యాలకు అప్పగించాడు.
    వారి శత్రువులు వారిని పాలించేటట్టుగా దేవుడు చేసాడు.
42 దేవుని ప్రజలను శత్రువులు తమ అదుపులో పెట్టుకొని
    వారికి జీవితాన్నే కష్టతరం చేసారు.
43 దేవుడు తన ప్రజలను అనేకసార్లు రక్షించాడు.
    కాని వారు దేవునికి విరోధంగా తిరిగి వారు కోరిన వాటినే చేశారు.
    దేవుని ప్రజలు ఎన్నెన్నో చెడ్డపనులు చేసారు.
44 కాని దేవుని ప్రజలు ఎప్పుడు కష్టంలో ఉన్నా వారు సహాయం కోసం ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టారు.
    ప్రతిసారి దేవుడు వారి ప్రార్థనలు విన్నాడు.
45 దేవుడు తన ఒడంబడికను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొన్నాడు.
    దేవుడు ఎల్లప్పుడూ తన గొప్ప ప్రేమతో వారిని ఆదరించాడు.
46 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలను ఖైదీలుగా పట్టుకొన్నారు.
    అయితే దేవుడు తన ప్రజల యెడల ఆ మనుష్యులు దయ చూపునట్లు చేశాడు.
47 మా దేవుడవైన యెహోవా, మమ్ములను రక్షించు.
    నీ పవిత్ర నామాన్ని స్తుతించగలిగేలా
ఈ జనముల మధ్యనుండి మమ్మల్ని సమీకరించుము.
    అప్పుడు నీకు మేము స్తుతులు పాడగలం.
48 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి.
    దేవుడు ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు, ఆయన శాశ్వతంగా జీవిస్తాడు.
మరియు ప్రజలందరూ, “ఆమేన్! యెహోవాను స్తుతించండి!” అని చెప్పారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International