M’Cheyne Bible Reading Plan
సీనాయి పర్వతంపై ఏలీయా
19 ఏలీయా చేసిన పనులన్నీ రాజైన అహాబు తన భార్యయగు రాణీ యెజెబెలుకు చెప్పాడు. కత్తి పట్టి ఎలా ప్రవక్తలందరినీ ఏలీయా చంపాడో అహాబు ఆమెకు వివరించాడు. 2 అది విన్న యెజెబెలు ఒక దూతను ఏలీయా వద్దకు పంపింది. ఆమె వర్తమానం ఇలా వుంది: “రేపు ఈ పాటికి నీవు ప్రవక్తలను చంపిన విధంగా నిన్ను నేను చంపుతానని ప్రమాణం చేస్తున్నాను. నేనా పనిలో విజయం సాధించలేని పక్షంలో దేవతలు నన్ను చంపుగాక!”
3 ఇది విన్న ఏలీయా భయపడ్డాడు. తన ప్రాణం కాపాడుకొనేందుకు పారిపోయాడు. అతనితో తన నౌకరును తీసుకుని వెళ్లాడు. వారు యూదాలోని బెయేర్షెబాకు వెళ్లారు. బెయేర్షెబాలో తన నౌకరును ఏలీయా వదిలాడు. 4 తరువాత ఒక రోజంతా ప్రయాణం చేసి ఏలీయా ఎడారిలోకి వెళ్లాడు. ఏలీయా ఒక పొదకింద కూర్చున్నాడు. అతడు చనిపోవాలని కోరుకున్నాడు. ఏలీయా యెహోవానిలా ప్రార్థించాడు: “ప్రభువా, నాకిది చాలు, ఇక నన్ను తీసికొనుము. నా పూర్వికుల కంటె నేను ఉన్నతమైనవాడిని కాను.”
5 ఏలీయా తరువాత చెట్టు కింద పడుకొని నిద్ర పోయాడు. యెహోవా దూత వచ్చి ఏలీయాను తట్టాడు. “నిద్ర లేచి, అహారం తీసుకో!” అన్నాడు దేవదూత. 6 ఏలీయా తన వద్ద నిప్పుల మీద కాల్చిన రొట్టె, ఒక కూజాలో నీరు వున్నట్లు చూశాడు. ఏలీయా ఆ రొట్టెను తిని, నీరు తాగాడు. అతను మరల నిద్రపోయాడు.
7 యెహోవా దేవదూత మళ్లీ అతని వద్దకు వచ్చి, “లేచి ఆహారం తీసుకో, నీవు భోజనం చేయకపోతే నీవు చేయవలసిన వ్రయాణం నీవు నడవలేనంతగా వుంటుంది” అని అన్నాడు. 8 అందుచేత ఏలీయా లేచి అన్న పానాదులు స్వీకరించాడు. ఏలీయా తిన్న ఆహారం అతనికి నలభై రోజులు రాత్రింబగళ్లు నడవగలిగే శక్తి నిచ్చింది. అతడు దేవుని పర్వతం అనబడే హోరేబు పర్వతం వద్దకు వచ్చాడు. 9 అక్కడ ఏలీయా ఒక గుహలోకి వెళ్లి ఆ రాత్రి తలదాచుకున్నాడు.
అక్కడ యెహోవా ఏలీయాతో మాట్లాడి, “ఏలీయా! నీవిక్కడెందుకున్నావు!” అని అడిగాడు.
10 ఏలీయా ఇలా సమాధానం చెప్పాడు: “సర్వశక్తిమంతుడవైన యెహోవా, నేను నిన్ను సదా సేవిస్తూ వచ్చాను. నా శక్తికొలదీ నేను నిన్ను ఆరాధించాను. కాని ఇశ్రాయేలు ప్రజలు నీతో చేసుకున్న ఒడంబడికను భంగపర్చారు. నీ బలిపీఠాలను వారు నాశనం చేశారు. వారు నీ ప్రవక్తలను చంపేశారు. నేనొక్కడినే ప్రవక్తగా ఇంకా జీవించి వున్నాను. ఇప్పుడు వారు నన్నూ చంప జూస్తున్నారు!”
11 అందుకు యెహోవా ఏలీయాతో: “నీవు వెళ్లి పర్వతం మీద నా ముందు నిలబడు. నేను నీ పక్కగా వెళతాను” అని అన్నాడు. యెహోవా అలా చేయగా, ఒక పెనుగాలి వీచింది. ఆ గాలి కొండలను రెండుగా చీల్చివేసింది. యెహోవా ముందు ఆ గాలి పెద్దగుట్టలను పిండి చేసింది. కాని ఆ పెనుగాలి యెహోవా మాత్రం కాదు! గాలి తగ్గిన పిమ్మట ఒక భూకంపం వచ్చింది. ఆ భూకంపం కూడా యెహోవా కాదు. 12 ఆ భూకంపం పోయిన పిమ్మట అగ్ని పుట్టింది. ఆ అగ్నికూడా యెహోవా కాదు. అగ్ని తరువాత ప్రశాంతత నెలకొనగా, ఒక మృదువైన శబ్దం వినవచ్చింది.
13 ఏలీయా ఆ శబ్దాన్ని విన్నప్పుడు తన అంగీతో తన ముఖం కప్పుకున్నాడు. అతను గుహ ద్వారం వద్దకు వెళ్లి నిలబడ్డాడు. ఇంతలో “ఏలీయా, ఇక్కడెందుకున్నావు?” అంటున్న ఒక కంఠ స్వరం విన్నాడు.
14 ఏలీయా ఇలా అన్నాడు: “సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, శక్తి వంచన లేకుండా నేను నిన్ను సదా సేవిస్తూవచ్చాను. కాని ఇశ్రాయేలు ప్రజలు వారు నీతో చేసుకున్న ఒప్పందానికి విఘాతం కలుగజేశారు. నీకై నిర్మించిన బలిపీఠాలను నాశనం చేశారు. నీ ప్రవక్తలను చంపేశారు. జీవించియున్న ప్రవక్తలు మరెవ్వరూ లేరు నేను మినహా. వారిప్పుడు నన్ను చంపజూస్తున్నారు.”
15 యెహోవా ఇలా అన్నాడు: “నీవు వచ్చిన దారిలోనే తిరిగి దమస్కు ఎడారికి వెళ్లు. నగరంలో ప్రవేశించి హజాయేలును అరాము దేశానికి (సిరియా) రాజుగా అభిషేకించు. 16 పిమ్మట నింషీ కుమారుడైన యెహూను ఇశ్రాయేలుపై రాజుగా అభిషిక్తుని చేయి. తరువాత, ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు నీ తర్వాత ప్రవక్తగా అభిషేకంచేయి. 17 హజాయేలు ఖడ్గమునుండి తప్పించుకున్న ప్రతివాడినీ యెహూ సంహరిస్తాడు. యెహూ కత్తి పోటునుంచి తప్పించుకున్న ప్రతివాడినీ హజాయేలు చంపేస్తాడు. 18 ఇశ్రాయేలులో ఏడువేల మందిని నేను వదిలి పెడతాను. ఈ ఏడువేల మంది బయలు ముందు ఎన్నడూవంగి నమస్కరించ లేదు. బయలు విగ్రహాల నెన్నడూ వారు ముద్దు పెట్టుకోలేదు.”
ఎలీషా ప్రవక్త అవటం
19 కావున ఏలీయా ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లాడు షాపాతు కుమారుడైన ఎలీషాను చూశాడు. ఎలీషా ఎద్దులను కట్టి 12 ఎకరాల పొలం దున్నుతున్నాడు. ఏలీయా వచ్చినప్పుడు ఎలీషా చివరి ఎకరాన్ని దున్నుచుండెను. ఏలీయా సరాసరి ఎలీషా వద్దకు వచ్చాడు. ఏలీయా తన అంగీని తీసి ఎలీషా మీద కప్పాడు. 20 అప్పుడు ఎలీషా పొలంలోవున్న తన ఎద్దులను వదిలి పెట్టాడు. అతడు పరుగెత్తి ఏలీయా వద్దకు వెళ్లి, “నన్ను వెళ్లి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వారి వద్ద వీడ్కోలు తీసుకోనిమ్ము. తరువాత నేను మీతో వస్తాను” అని అన్నాడు.
“అది చాలా మంచిది. వెళ్లు. నిన్ను నేనాపను”[a] అని ఏలీయా అన్నాడు.
21 ఎలీషా వెళ్లి తన ఇంటి వారితో ఒక ప్రత్యేకమైన విందారగించాడు. ఎలీషా వెళ్లి తన ఎద్దులను చంపాడు. ఎడ్లకు కట్టిన కాడి కర్రతో నిప్పుచేసి, ఎడ్ల మాంసాన్ని ఉడకబెట్టాడు. ఆ మాంసాన్ని అందరికీ ఇచ్చాడు. వారంతా ఆ మాంసాన్ని తిన్నారు. ఎలీషా తరువాత ఏలీయాను అనుసరించి వెళ్లాడు. ఎలీషా ఏలీయాకు సహాయకుడయ్యాడు.
థెస్సలొనీకలో పౌలు సేవ
2 సోదరులారా! మేము మీ దగ్గరకు రావటంవల్ల లాభం కలుగకపోలేదు. ఇది మీకు తెలుసు. 2 మేము యిదివరలో కష్టాలు అనుభవించిన విషయము, ఫిలిప్పీలో అవమానాలు భరించిన విషయము మీకు తెలుసు. మాకు అనేక ఆటంకాలు కలిగినా మేము మా దేవుని సహాయంతో యేసు సువార్తను మీకు బోధించటానికి ధైర్యం చేసాము. 3 మేము తప్పుగా బోధించలేదు. లేక దురుద్దేశ్యాలతో బోధించలేదు. మేము మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేయటంలేదు. 4 దేవుడు మా యోగ్యతను గమనించి మాకు సువార్తను అప్పగించాడు. మా హృదయాలను పరీక్షించే దేవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నాము కాని, మానవుల్ని కాదు.
5 మేము పొగడ్తలు ఉపయోగించలేదని మీకు తెలుసు. స్వార్థానికోసం మేము దొంగవేషాలు వేయలేదు. దీనికి దేవుడే సాక్షి. 6 మీ పొగడ్తలు కాని, లేక ఇతర్ల పొగడ్తలు కాని మాకు అవసరం లేదు.
7 క్రీస్తు అపొస్తలులముగా మేము మా భారం మీపై మోపగల్గినా అలా చేయలేదు. తల్లి తన పిల్లల్ని చూసుకొన్నట్టు మిమ్మల్ని చూసుకొని మీ పట్ల దయతో ఉండినాము.[a] 8 మేము మిమ్మల్ని మనసారా ప్రేమించాము. తద్వారా మీరు మాకు సన్నిహితులయ్యారు. దానితో సువార్తే కాకుండా, మా జీవితాలను కూడా మీతో పంచుకొన్నాము. 9 సోదరులారా! మా శ్రమ, కష్టము మీకు తప్పక జ్ఞాపకం ఉండి ఉండవచ్చును. మేము దేవుని సువార్తను మీకు ప్రకటించినప్పుడు మేము మీకు భారంగా ఉండరాదని రాత్రింబగళ్ళు పని చేసాము.
10 విశ్వాసులైన మీ మధ్య మేము ఎంతో పవిత్రంగా, నీతిగా, అపకీర్తి లేకుండా జీవించాము. దీనికి మీరే సాక్షులు. దేవుడు కూడా దీనికి సాక్షి. 11 మేము మీ అందరితో, తండ్రి తన పిల్లలతో ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉన్నాము. 12 మీకు ఆధ్యాత్మిక శక్తినిస్తూ, మిమ్మల్ని ఓదారుస్తూ, తన రాజ్యంలోకి ఆహ్వానించి, తన మహిమలో మీకు భాగం యిచ్చే దేవుని మెప్పు పొందేటట్లు మిమ్మల్ని జీవించమని చెప్పాము.
13 దైవసందేశాన్ని మీరు మా నుండి విని, దాన్ని మానవుల సందేశంలా కాకుండా, దైవసందేశంలా అంగీకరించారు. ఇలా జరిగినందుకు మేము దేవునికి సర్వదా కృతజ్ఞులము. అది నిజంగా దైవసందేశము. అది భక్తులైన మీలో పని చేస్తోంది. 14 సోదరులారా! యేసు క్రీస్తులో ఐక్యత పొందిన యూదయలోని దేవుని సంఘాలవలే మీరు కూడా కష్టాలు అనుభవించారు. యూదుల వల్ల ఆ సంఘాలు అనుభవించిన కష్టాలే మీరు మీ ప్రజలవల్ల అనుభవించారు. 15 ఆ యూదులు యేసు ప్రభువును, ప్రవక్తలను చంపారు. మిమ్మల్ని తరిమివేసారు. వాళ్ళు దేవుణ్ణి దుఃఖపెట్టారు. మానవులందరికి శత్రువులై జీవించారు. 16 రక్షణ కలిగించే సందేశాన్ని యూదులు కానివాళ్ళకు చెప్పనీయకుండా మమ్మల్ని అడ్డగించారు. ఈ విధంగా చేసి తమ పాపాలను అంతులేకుండా పెంచుకొంటూ పోయారు. చివరకు దేవునికి వాళ్ళ మీద కోపం వచ్చింది.
థెస్సలొనీకయులను మళ్ళీ చూడాలని పౌలు వాంఛించటం
17 సోదరులారా! కొద్దికాలం మేము మీ నుండి దూరంగా ఉండవలసి వచ్చింది. మా శరీరాలు మాత్రమే మీ నుండి దూరంగా ఉన్నాయి. కాని మా మనసులు కాదు. మిమ్మల్ని చూడాలని మా మనస్సుల్లో చాలా ఉంది. కనుక మేము ఎన్నో విధాల ప్రయత్నించాము. 18 మాకు మీ దగ్గరకు రావాలని ఉంది. పౌలునైన నేను ఎన్నోసార్లు రావటానికి ప్రయత్నం చేసాను. కాని సాతాను మమ్మల్ని అడ్డగించాడు. 19 ఎందుకంటే మా ఆశలు మీ మీద పెట్టుకున్నాము. మా ఆనందం మీరే. మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆయన సమక్షంలో గర్వించటానికి కిరీటం మీరే కదా! 20 మాకు కీర్తి లభించటానికి నిజంగా మీరే కారణం. మీరే మా ఆనందం.
దానియేలు బబులోనుకు తీసుకొని పోబడుట
1 బబులోనురాజైన, నెబుకద్నెజరు తన సైన్యంతో యెరూషలేముకు వచ్చి దానిని చుట్టుముట్టాడు. ఇది యెహోయాకీము యూదాకు రాజుగానున్న మూడవ సంవత్సరం[a]లో జరిగింది. 2 ప్రభువు యూదారాజైన యెహోయాకీమును ఓడించడానికి, దేవుని ఆలయంనుంచి అన్ని వస్తువులను తీసుకొని వెళ్ళడానికి నెబుకద్నెజరును అనుమతించాడు. అతడు ఆ వస్తువులను తన విగ్రహ దేవతలున్న ఆలయములో ఉంచాడు.
3 తర్వాత నెబుకద్నెజరు అష్పెనజుకు (అష్పెనజు రాజు కొలువులోని నపుంసకులలో ప్రముఖుడు), “కొందరు యూదులను తన ఇంటికి తీసుకు రమ్మని” చెప్పాడు. కొన్ని ప్రసిద్ధ కుటుంబాలనుంచి, ఇశ్రాయేలీయుల రాజకుటుంబంనుంచి ఆరోగ్యవంతులైన యౌవన యూదులను తీసుకు రమ్మని ఆజ్ఞాపించాడు. 4 ఎలాంటి లోపము తమ దేహాలమీద లేనివారు, అందమైన, చురుకైనవారు, తేలికగా విషయాలు నేర్చుకునేవారు, రాజగృహములో సేవ చేయ సామర్థ్యముగల యువకులను ఎన్నుకోమన్నాడు. ఆ ఇశ్రాయేలు యువకులకు కల్దీయుల భాషను, వ్రాతలను నేర్పుమని రాజు అష్పెనజుకు ఆజ్ఞాపించాడు.
5 నెబుకద్నెజరు ఆ యువకులకు ప్రతిరోజు రాజు తిని, త్రాగే ఆహారము, ద్రాక్షామద్యం ఇప్పించాడు. ఇశ్రాయేలుకు చెందిన ఆ యువకులు మూడేళ్లపాటు తర్ఫీదు పొందాలని రాజు ఆదేశించాడు. మూడేళ్ల తర్వాత, వారు బబులోను రాజ నగరులో ప్రవీణులుగా ఉంటారు. 6 ఆ యువకులలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు యూదా దేశానికి చెందినవారు. 7 తర్వాత అష్పెనజు యూదానుంచి వచ్చిన ఆ యువకులకు బబులోనీయుల పేర్లు పెట్టాడు. దానియేలుకు బెల్తెషాజరు, మిషాయేలుకు మేషాకు, అజర్యాకు అబేద్నెగో, హనన్యాకు షద్రకు అని పేర్లు పెట్టాడు.
8 రాజు భుజించే విలువైన ఆహారం, ద్రాక్షామద్యం తీసుకోడానికి వారు ఇష్టపడలేదు. ఆ ఆహారం, మత్తు ద్రాక్షామద్యంతో తమను తాము అపవిత్రం చేసుకోవటం దానియేలుకు ఇష్టము లేక దానిని తప్పించమని అష్పెనజు అనుమతి కోరాడు.
9 దానియేలుపట్ల అష్పెనజు మంచిగాను, దయతోను ఉండేటట్లు దేవుడు చేశాడు. 10 కాని అష్పెనజు దానియేలుతో, “రాజైన నా యజమానికి భయపడుతున్నాను. ఈ ఆహారము, ద్రాక్షామద్యం మీ కిమ్మని రాజు నాకాజ్ఞాపించాడు. మీరు ఈ ఆహారం భుజించకపోతే, జబ్బుగాను బలహీనంగాను కనబడతారు. మీ వయసువారైన ఇతర యువకులతో పోల్చితే మీరు తక్కువగా కనిపిస్తారు. రాజు ఇది చూచి నా మీద కోపగిస్తాడు. ఒకవేళ నా తలను కూడా తీసివేస్తాడు” అని అన్నాడు.
11 దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలపై అష్పెనజుచే నియమించబడిన సంరక్షకునితో దానియేలు ఇలా అన్నాడు: 12 “పది రోజులపాటు మాకు ఈ పరీక్ష విధించు. తినడానికి కాయగూరలు, త్రాగడానికి మంచినీళ్లు తప్ప మరేమీ ఇవ్వవద్దు. 13 పది రోజుల తర్వాత, రాజు నియమించిన ఆహారంతిన్న ఇతర యువకులతో మమ్మల్ని పోల్చి చూడు. ఎవరు ఆరోగ్యంగా ఉన్నారో నీవే ఆలోచించి నీ సేవకులమైన మాకు ఏమి చేయాలని నీ నిర్ణయమో అలాగే చెయ్యి” అని అన్నాడు.
14 అందువల్ల దానియేలును, హనన్యాను, మిషాయేలును, అజర్యాను పదిరోజులు పరీక్షించడానికి ఆ సంరక్షకుడు సమ్మతించాడు. 15 పదిరోజుల తర్వాత, దానియేలు మరియు అతని మిత్రులు రాజు ఆహారంతిన్న ఇతర యువకులకంటె ఆరోగ్యంగా కనిపించారు. 16 అందువల్ల రాజు నియమించిన ప్రత్యేక ఆహారానికి బదులుగా, కాయగూరలు, మంచినీళ్లు దానియేలుకు, హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు ఆ సంరక్షకుడు ఇస్తూ వచ్చాడు.
17 దానియేలుకు, హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు వివేకం, పలు విధాలైన వ్రాతలు, శాస్త్రాలు నేర్చుకునే జ్ఞానము, సామర్థ్యము దేవుడు ప్రసాదించాడు. అన్ని విధాలైన దర్శనాలు, స్వప్నాలు దానియేలు గ్రహించుకోగలిగాడు.
18 ఆ యువకులందరూ మూడేళ్లపాటు మంచి శిక్షణ పొందాలని రాజు ఆదేశించాడు. ఆ గడువు తీరిన తర్వాత, అష్పెనజు ఆ యువకుల్ని రాజైన నెబుకద్నెజరు వద్దకు తీసుకువెళ్లాడు. 19 రాజు వారితో మాట్లాడాడు. దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలకంటె ఇతర యువకులెవ్వరూ గొప్పగా లేకపోవడాన్ని రాజు కనుగొన్నాడు. అందువల్ల ఈ నలుగురు యువకులు రాజు ఆస్థానంలో నిలువగలిగారు. 20 ప్రతిసారి రాజు వారిని యేదో ఒక ముఖ్య విషయం అడగగానే, వారు మంచి గ్రహింపు, వివేకం ప్రదర్శించేవారు. తన రాజ్యంలో ఉన్న జ్ఞానవంతులందరికంటెను, ఇంద్ర జాలకులందరికంటెను, వారు నలుగురు పదిరెట్లు ఎక్కువగా ఉన్నారని రాజు గ్రహించాడు. 21 అందువల్ల దానియేలు, కోరెషు రాజయిన మొదటి సంవత్సరం[b] వరకు రాజు ఆస్థానంలో కొనసాగాడు.
105 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుము. ఆయన నామాన్ని ఆరాధించుము.
ఆయన చేసే అద్భుత కార్యాలను గూర్చి జనాలతో చెప్పు.
2 యెహోవాను గూర్చి పాడుము. ఆయనకు స్తుతులు పాడుము.
ఆయన చేసే అద్భుతకార్యాలు అన్నింటిని గూర్చి చెప్పు.
3 యెహోవా పవిత్ర నామాన్ని గూర్చి అతిశయించు.
యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరంతా సంతోషించండి.
4 బలంకోసం యెహోవా దగ్గరకు వెళ్లండి.
సహాయంకోసం ఎల్లప్పుడూ ఆయన దగ్గరకు వెళ్లండి.
5 యెహోవా చేసే ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
ఆయన అద్భుతాలను, జ్ఞానంగల నిర్ణయాలను జ్ఞాపకం చేసుకోండి.
6 దేవుని సేవకుడైన అబ్రాహాము సంతతివారు మీరు.
దేవుడు ఏర్పరచుకొన్న యాకోబు సంతతివారు మీరు.
7 యెహోవా మన దేవుడు.
యెహోవా సర్వలోకాన్ని పాలిస్తాడు.[a]
8 దేవుని ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం చేసికోండి.
వెయ్యి తరాలవరకు ఆయన ఆదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి.
9 దేవుడు అబ్రాహాముతో ఒక ఒడంబడిక చేసాడు.
ఇస్సాకుకు దేవుడు వాగ్దానం చేశాడు.
10 యాకోబుకు (ఇశ్రాయేలు) దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు.
ఇశ్రాయేలుతో దేవుడు తన శాశ్వత ఒడంబడిక చేసాడు.
11 “నేను నీకు కనాను దేశాన్ని ఇస్తాను, ఆ దేశం నీకు చెందుతుంది.”
అని దేవుడు చెప్పాడు.
12 అబ్రాహాము కుటుంబం చిన్నదిగా ఉన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం చేశాడు.
మరియు వారు కనానులో నివసిస్తున్న యాత్రికులు మాత్రమే.
13 దేశం నుండి దేశానికి, రాజ్యం నుండి రాజ్యానికి
వారు ప్రయాణం చేసారు.
14 కాని యితర మనుష్యులు ఆ కుటుంబాన్ని బాధించనియ్యకుండా దేవుడు చేసాడు.
వారిని బాధించవద్దని దేవుడు రాజులను హెచ్చరించాడు.
15 “నేను ఏర్పాటు చేసుకొన్న నా ప్రజలను బాధించవద్దు.
నా ప్రవక్తలకు ఎలాంటి కీడూ చేయవద్దు.” అని దేవుడు చెప్పాడు.
16 దేవుడు ఆ దేశంలో ఒక కరువు వచ్చేటట్టు చేశాడు.
ప్రజలకు తినుటకు సరిపడినంత ఆహారం లేదు.
17 అయితే దేవుడు వారికి ముందుగా వెళ్లుటకు యోసేపు అనే మనిషిని పంపించాడు.
యోసేపు ఒక బానిసవలె అమ్మబడ్డాడు.
18 యోసేపు కాళ్లను తాళ్లతో వారు కట్టివేశారు.
అతని మెడకు వారు ఒక ఇనుప కంటె వేశారు.
19 యోసేపు చెప్పిన సంగతులు నిజంగా జరిగేంతవరకు
అతడు (యోసేపు) బానిసగా చెప్పింది సరియైనది అని యెహోవా సందేశం రుజువు చేసింది.
20 కనుక యోసేపును విడుదల చేయమని ఈజిప్టు రాజు ఆదేశించాడు.
అనేక మందికి అధికారిగా ఉన్న అతనిని కారాగారం నుండి వెళ్లనిచ్చాడు.
21 అతడు యోసేపును తన ఇంటికి యజమానిగా నియమించాడు.
రాజ్యంలో అన్ని విషయాలను గూర్చి యోసేపు జాగ్రత్త తీసుకొన్నాడు.
22 యోసేపు యితర నాయకులకు హెచ్చరిక ఇచ్చాడు.
పెద్ద మనుష్యులకు యోసేపు నేర్పించాడు.
23 తరువాత ఇశ్రాయేలు ఈజిప్టుకు వచ్చాడు.
యాకోబు హాము దేశంలో[b] నివసించాడు.
24 యాకోబు కుటుంబం చాలా పెద్దది అయింది.
వారు వారి శత్రువులకంటే శక్తిగలవారయ్యారు.
25 కనుక ఈజిప్టు ప్రజలు యాకోబు వంశాన్ని ద్వేషించటం మొదలు పెట్టారు.
ఈజిప్టువారు బానిసలకు విరోధంగా పథకాలు వేయటం ప్రారంభించారు.
26 కనుక దేవుడు తన సేవకుడైన మోషేను,
తాను ఏర్పాటు చేసుకొన్న యాజకుడు అహరోనును పంపించాడు.
27 హాము దేశంలో అనేక అద్భుతాలు చేయటానికి
దేవుడు మోషే, అహరోనులను వాడుకొన్నాడు.
28 దేవుడు కటిక చీకటిని పంపించాడు.
కాని ఈజిప్టు వాళ్లు ఆయన మాట వినలేదు.
29 కనుక దేవుడు నీళ్లను రక్తంగా మార్చాడు.
వాళ్ల చేపలన్నీ చచ్చాయి.
30 ఆ దేశం కప్పలతో నింపివేయబడింది.
రాజు గదులలోకి కూడ కప్పలు వచ్చాయి.
31 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా జోరీగలు,
దోమలు వచ్చాయి.
అన్నిచోట్లా అవే ఉన్నాయి.
32 దేవుడు వర్షాన్ని వడగండ్లుగా చేశాడు.
ఈజిప్టువారి దేశంలో అన్ని చోట్లా అగ్ని మెరుపులు కలిగాయి.
33 ఈజిప్టువారి ద్రాక్షా తోటలను, అంజూరపు చెట్లను దేవుడు నాశనం చేశాడు.
వారి దేశంలో ప్రతి చెట్టునూ దేవుడు నాశనం చేసాడు.
34 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా మిడుతలు వచ్చాయి.
అవి లెక్కింపజాలనంత విస్తారంగా ఉన్నాయి.
35 మిడుతలు దేశంలోని మొక్కలన్నింటినీ తినివేశాయి.
నేల మీద పంటలన్నింటినీ అవి తినివేశాయి.
36 అప్పుడు ఈజిప్టు దేశంలో ప్రతి మొదటి సంతానాన్ని దేవుడు చంపేశాడు.
వారి జ్యేష్ఠ కుమారులను దేవుడు చంపివేశాడు.
37 అప్పుడు దేవుడు ఈజిప్టు నుండి తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చాడు.
వారు వెండి బంగారాలు వారి వెంట తెచ్చారు.
దేవుని ప్రజలు ఎవ్వరూ తొట్రిల్లి పడిపోలేదు.
38 దేవుని ప్రజలు వెళ్లిపోవటం చూచి ఈజిప్టు సంతోషించింది.
ఎందుకంటే దేవుని ప్రజలను గూర్చి వారు భయపడ్డారు.
39 దేవుడు తన మేఘాన్ని ఒక దుప్పటిలా పరిచాడు.
రాత్రివేళ తన ప్రజలకు వెలుగు ఇచ్చుటకు దేవుడు తన అగ్నిస్తంభాన్ని ఉపయోగించాడు.
40 ప్రజలు మాంసం కోసం ఆడిగినప్పుడు దేవుడు వారికి పూరేళ్లను రప్పించాడు.
దేవుడు వారికి ఆకాశం నుండి సమృద్ధిగా ఆహారాన్ని యిచ్చాడు.
41 దేవుడు బండను చీల్చగా నీళ్లు ఉబుకుతూ వచ్చాయి.
ఎడారిలో ఒక నది ప్రవహించడం మొదలైంది.
42 దేవుడు తన పవిత్ర వాగ్దానం జ్ఞాపకం చేసికొన్నాడు.
దేవుడు తన సేవకుడు ఆబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసికొన్నాడు.
43 దేవుడు తన ప్రజలను ఈజిప్టునుండి బయటకు రప్పించాడు.
ప్రజలు వారి సంతోష గీతాలు పాడుతూ ఆనందంగా బయటకు వచ్చారు.
44 అప్పుడు యితరులు నివసిస్తున్న దేశాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు.
ఇతరుల కష్టార్జితాన్ని దేవుని ప్రజలు పొందారు.
45 దేవుడు తన ప్రజలు తన న్యాయ చట్టాలకు విధేయులవుతారని ఇలా చేసాడు.
వారు ఆయన ఉపదేశములకు జాగ్రత్తగా విధేయులు కావాలని దేవుడు ఇలా చేసాడు.
యెహోవాను స్తుతించండి.
© 1997 Bible League International