Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 రాజులు 18

ఏలీయా మరియు బయలు ప్రవక్తలు

18 వర్షాలు లేకుండా పోయి మూడు సంవత్సరాలయ్యింది. అప్పుడు యెహోవా ఏలీయాతో, “నీవు వెళ్లి రాజైన అహాబును కలుసుకో. నేను త్వరలో వర్షం కురిసేలా చేస్తాను” అని చెప్పాడు. కావున ఏలీయా అహాబును కలిసేటందుకు వెళ్లాడు.

అప్పుడు షోమ్రోనులో క్షామం నెలకొన్నది. రాజైన అహాబు ఓబద్యాను పిలిపించాడు. ఓబద్యా రాజభవన నిర్వాహకుడుగా పని చేస్తున్నాడు. (ఓబద్యా యెహోవాకు నిజమైన అనుచరుడు.) ఒకసారి యెజెబెలు యెహోవా ప్రవక్తలందరినీ చంపటం మొదలు పెట్టింది. అప్పుడు ఓబద్యా నూరుమంది ప్రవక్తలను చేరదీసి, వారిని రెండు గుహలలో దాచాడు. ఓబద్యా ఏబది మందిని ఒక గుహలోను, మరో ఏబది మందిని ఒక గుహలోను దాచాడు. ఓబద్యా వారికి ఆహార పానీయాలు ఇచ్చి కాపాడాడు. రాజైన అహాబు ఓబద్యాతో ఇలా అన్నాడు: “నాతో కలిసిరా. మనిద్దరం దేశంలో వున్న నీటి వనరులన్నీ పరిశీలిద్దాము. మన గుర్రాలు, కంచర గాడిదలు బతకటానికి తగిన పచ్చగడ్డి దొరుకుతుందేమో చూద్దాం. అప్పుడు మన పశువులను చంపే అవసరము వుండదు.” నీటి వనరులు వెదకటానికి ఎవరేదిశకు వెళ్లాలో వారు నిర్ణయించుకున్నారు. వారిద్దరూ దేశమంతా తిరగనారంభించారు. అహాబు ఒక దిశలో వెళ్లాడు. ఓబద్యా మరోదిశలో వెళ్లాడు. ఓబద్యా ప్రయాణం చేస్తూండగా అతడు ఏలీయాను కలిశాడు. ఏలీయాను చూడగానే, అతనెవరో ఓబద్యా తెలుసుకున్నాడు. ఓబద్యా ఏలీయాకు సాష్టాంగ నమస్కారం చేసి, “నీవు నా యజమానివైన ఏలీయావే గదా?” అని అడిగాడు.

“అవును నేనే. నీవు వెళ్లి నేనిక్కడ వున్నానని నీ యజమానియగు రాజుకు తెలియజేయి” అని ఏలీయా సమాధానం చెప్పాడు.

అందుకు ఓబద్యా ఇలా అన్నాడు: “నేను అహాబుతో నీవెక్కడ వున్నదీ నాకు తెలుసునని చెప్పితే అతడు నన్ను చంపుతాడు! నీ పట్ల నేనేమీ అపచారం చేయలేదు! నేను చనిపోవాలని నీవెందుకు కోరు కుంటున్నావు? 10 నీ దేవుడైన యెహోవా సాక్షిగా చెబుతున్నాను. రాజు నీ కొరకై ప్రతి చోటా చూస్తూన్నాడు! నిన్ను వెదకమని తన మనుష్యులను అన్ని దేశాలకు పంపాడు. ఏ పాలకుడైనా తన దేశంలో నీవు లేవని చెపితే అహాబు అంతటితో ఆగక నీవతని రాజ్యంలో లేవని ప్రమాణం చేయమని బలవంతపెట్టు తున్నాడు. 11 ఈ పరిస్థితుల్లో నేను వెళ్లి నీవిక్కడ వున్నావని చెప్పమంటున్నావా? 12 ఒకవేళ నేను పోయి రాజైన అహాబుతో నీవిక్కడ వున్నావని చెపితే, ఈ లోపు యెహోవా నిన్ను ఇక్కడ నుంచి మరో చోటికి తీసుకుని పోవచ్చు. రాజైన అహాబు వచ్చి నీవిక్కడ లేకపోవటం చూచి, నన్ను చంపేస్తాడు! నేను నా బాల్యం నుండి యెహోవాను ఆశ్రయించియున్నాను. 13 నేను ఏమి చేశానో నీవు వినే వుంటావు! యెజెబెలు యెహోవా యొక్క ప్రవక్తలందరినీ చంపుతూండగా, నేను వంద మంది ప్రవక్తలను గుహలలో దాచాను. ఏభై మంది ప్రవక్తలను ఒక గుహలోను, మరో ఏభై మందిని వేరొక గుహలోను దాచాను. వారికి అన్న పానాదులిచ్చి ఆదుకున్నాను. 14 ఇప్పుడు నన్ను వెళ్లి నీవిక్కడ వున్నట్లు రాజుతో చెప్పమంటున్నావు. రాజు నన్ను చంపేస్తాడు!”

15 అది విన్న ఏలీయా, “సర్వశక్తిమంతుడైన యెహోవా సాక్షిగా ఈ రోజు నేను రాజు ముందు నిలుస్తానని ప్రమాణం చేస్తున్నాను” అని అన్నాడు.

16 అందువల్ల ఓబద్యా రాజైన అహాబు వద్దుకు వెళ్లాడు. ఏలీయా ఎక్కడ వున్నదీ అతనికి చెప్పాడు. రాజైన అహాబు ఏలీయాను చూడటానికి వెళ్లాడు.

17 ఏలీయాను అహాబు చూచి, “నీవేనా? ఇశ్రాయేలులో కల్లోలం సృష్టించే వాడివి నీవే కదా!” అని అన్నాడు.

18 ఏలీయా ఇలా అన్నాడు, “నేను ఇశ్రాయేలులో కల్లోలం సృష్టించటం లేదు. కష్టాలన్నీ నీ మూలంగా, నీ తండ్రి కుటుంబం వారివల్ల వచ్చినవే. యెహోవా ఆజ్ఞలను తిరస్కరిస్తూ, బూటకపు దేవుళ్లను పూజిస్తూ, నీవే ఈ కష్టాలన్నిటికీ కారకుడవయ్యావు. 19 ఇశ్రాయేలీయులందరినీ ఇప్పుడు కర్మెలు పర్వతం వద్ద నన్ను కలవమని సమాచారం పంపు. పైగా నాలుగు వందల ఏభై మంది బయలు దేవత ప్రవక్తలను, నాలుగు వందల మంది బూటకపు దేవత అషేరా ప్రవక్తలను అక్కడికి తీసుకొనిరా. రాణీ యెజెబెలు ఈ ప్రవక్తలందరినీ పోషిస్తూ[a] వున్నది.”

20 పిమ్మట అహాబు ఇశ్రాయేలు వారందరినీ, ఆ ప్రవక్తలను కర్మెలు పర్వతం వద్దకు పిలువనంపాడు. 21 ఆ ప్రజలందరి వద్దకు ఏలీయా వచ్చాడు. అతడు వారినుద్దేశించి, “మీరంతా ఎవరిని అనుసరించాలనేది ఎప్పుడు నిర్ణయిస్తారు? యెహోవా నిజమైన దేవుడైతే మీరాయనను అనుసరించండి. బయలు నిజమైన దేవత అయితే మీరా దేవతను అనుసరించండి” అని అన్నాడు.

ప్రజలు ఏమీ మాట్లాడలేదు. 22 అందువల్ల ఏలీయా ఇలా అన్నాడు: “ఇక్కడ నేనొక్కడినే యెహోవాయొక్క వ్రవక్తను. నేను ఒంటరిగా వున్నాను. కాని నాలుగు వందల ఏభై మంది బయలు ప్రవక్తలున్నారు. 23 కావున మీరు రెండు ఆబోతులను తీసుకునిరండి. వాటిలో ఒక దానిని బయలు ప్రవక్తలను తీసుకోనివ్యండి. వారు దానిని చంపి ముక్కలు చేయనీయండి. ఆ మాంసాన్ని ఒక చితిపై వుంచండి. కాని ఆ చితికి నిప్పు పెట్టవద్దు. నేను కూడ ఆ రెండవ ఆబోతును అలాగే చేస్తాను. నేనూ ఆ చితికి నిప్పు అంటించను. 24 బయలు దేవత ప్రపక్తలారా! మీరు మీ దేవునికి ప్రార్థించండి. నేను నా యెహోవాను ప్రార్థిస్తాను. ఏ దేవుడైతే ప్రార్థనలను ఆలకించి, చితిని రగిలింప చేస్తాడో అతడే నిజమైన దేవుడు.”

ప్రజలంతా ఇది మంచి ఆలోచన అని ఒప్పుకున్నారు.

25 బయలు ప్రవక్తలతో మళ్లీ ఏలీయా ఇలా అన్నాడు: “మీరు చాలా మంది వున్నారు. కనుక పని మీరు ముందు మొదలు పెట్టండి. ఒక ఆబోతును ఎన్నుకుని తయారు చెయ్యండి. కాని నిప్పు మాత్రం రగల్చకండి.”

26 కావున ఆ ప్రవక్తలు తమకివ్వబడిన ఆబోతును తీసుకున్నారు. దానిని తయారు చేశారు. వారు బయలు దేవతకు మధ్యాహ్నం వరకు ప్రార్థనలు చేశారు. “ఓ బయలు దేవతా! మా ప్రార్థనలు ఆలకించు!” అని వేడుకున్నారు. కాని ఎటువంటి చప్పుడూ లేదు. ఎవ్వరూ సమాధాన మియ్యలేదు. వారు నిర్మించిన బలిపీఠం చుట్టూ ప్రవక్తలు నాట్యం చేశారు. కానీ నిప్పు రాజలేదు.

27 మధ్యాహ్నమైనప్పుడు ఏలీయా వారిని హేళన చేయనారంభించాడు: “బయలు నిజంగా దైవమైతే మీరు బిగ్గరగా ప్రార్థన చేయాల్సివుంటుందేమో! బహుశః అతడు ఆలోచిస్తూ ఉండవచ్చు! లేక అతడు చాలా పని ఒత్తిడిలో ఉండవచ్చు. లేక అతను ప్రయాణం చేస్తూ ఉండవచ్చు! అతడు నిద్రపోతూ ఉండవచ్చు! బహుశః మీరతనిని లేపవలసి ఉంటుంది!” అంటూ అపహాస్యం చేశాడు ఏలీయా. 28 అందువల్ల ఆ ప్రవక్తలు బిగ్గరగా ప్రార్థనలు చేయనారంభించారు. వారు కత్తులతోను, ఈటెలతోను శరీరమంతా చీరుకున్నారు. (అది వారి ఆరాధనా తీరు) వారు రక్తం కారేలాగు ఒళ్లు చీరుకున్నారు. 29 మధ్యాహ్న సమయం దాటి పోయింది. అయినా నిప్పు అంటుకోలేదు. సాయంత్రపు బలుల సమయం అయ్యేవరకు ఆ ప్రవక్తలు తమ భయానక చేష్టలు[b] సాగించారు. బయలు వద్దనుండి సమాధానం లేదు. చితికి ఏమీ జరగలేదు.[c]

30 అప్పుడు ఏలీయా ప్రజలతో, “నా వద్దకు రండి” అని అన్నాడు. వారంతా ఏలీయా చుట్టూ చేరారు. బేతేలులో ఉన్న యెహోవా యొక్క బలిపీఠం నాశనం చేయబడింది. ఏలీయా దానిని మళ్లీ నిర్మించాడు. 31 ఏలీయా పన్నెండు రాళ్లను తీసుకున్నాడు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కోక్క రాయి చొప్పున ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు పన్నెండు రాళ్లను తీశాడు. యాకోబు పన్నెండు మంది కుమారుల పేర్లతో ఈ గోత్రాలు పిలవబడుతూ వున్నాయి. యాకోబునే యెహోవా ఇశ్రాయేలని పిలిచాడు. 32 ఏలీయా ఈ రాళ్లను యెహోవా గౌరవార్థం బలిపీఠాన్ని నిర్మించటానికి ఉపయోగించాడు. పీఠం చుట్టూ ఏలీయా చిన్న కందకం తవ్వించాడు. అది రెండు షియాల[d] విత్తనాలు నీటితో సహా పట్టేటంత వెడల్పు, లోతుకలిగివుంది. 33 అప్పుడు ఏలీయా కట్టెనంతా బలిపీఠంపై వుంచాడు. అతడు ఆబోతును ముక్కలుగా నరికి, వాటిని పేర్చిన కట్టెలపై వుంచాడు. 34 తరువాత ఏలీయా ప్రజలను నాలుగు జాడీలతో నీరు తీసుకుని మాంసం మీద, కట్టెల మీద చల్లమన్నాడు. వారిని అదే విధంగా మళ్లీ చేయమన్నాడు. ఆయన వారితో మూడవ సారి కూడా అలానే చేయమన్నాడు. 35 ఆ నీరు బలిపీఠం నుండి జారి చుట్టూవున్న కందకాన్ని నింపేసింది.

36 సాయంకాలపు బలులు ఇచ్చే వేళ అయ్యింది. ప్రవక్తయగు ఏలీయా పీఠం వద్దకు వెళ్లి ఇలా ప్రార్థించాడు: “ఓ ప్రభువా! అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవా! ఇశ్రాయేలీయుల దైవం నీవేనని నిరూపించమని నేనిప్పుడు నిన్నడుగుతున్నాను. నేను నీ సేవకుడనని నిరూపించు. ఈ పనులన్నీ చేయమని నన్ను నీవే ఆదేశించినట్లు కూడ ఈ ప్రజలకు తెలియజేయి. 37 ఓ ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. ప్రభూ! నీవే దేవుడవని ఈ ప్రజలకు నిరూపించు. అప్పుడు ఈ ప్రజలందరినీ మరల నీవు నీ దగ్గరకు చేర్చుకుంటున్నావని వీరు తెలుసుకుంటారు.”

38 అప్పుడు యెహోవా అగ్ని పంపించాడు. బలిమాంసాన్ని, కట్టెలను, రాళ్లను, బలిపీఠం చుట్టూవున్న ప్రదేశాన్ని అగ్ని దహించి వేసింది. కందకంలో వున్న నీరు కూడ అగ్నివల్ల ఇగిరి పోయింది. 39 ప్రజలంతా ఇది చూశారు. వారు భూమి మీద సాగిలపడి. “యెహోవాయే దేవుడు! యెహోవాయే దేవుడు! అని స్తుతించసాగారు.”

40 అప్పుడు ఏలీయా, “బయలు దేవత ప్రవక్తలందరినీ పట్టుకొనండి. ఒక్కడినీ పారి పోనీయవద్దు!” అని అన్నాడు. ప్రవక్తలందరినీ ప్రజలు పట్టుకున్నారు. ఏలీయా వారందరినీ కీషోను వాగు దగ్గరకు తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆ ప్రవక్తలందరినీ చెంపేశాడు.

తిరిగి వర్షాలు పడటం

41 ఏలీయా రాజైన అహాబుతో, “నీవు ఇప్పుడు వెళ్లి అన్నపానాదులు స్వీకరించు. ఒక భారీ వర్షం పడబోతూ వుంది” అని అన్నాడు. 42 రాజైన అహాబు భోజనానికి వెళ్లాడు. అదే సమయంలో ఏలీయా కర్మెలు పర్వతం మీద అతడు వంగి తన మోకాళ్లమధ్య తలను పెట్టాడు. 43 అప్పుడు ఏలీయా తన సేవకునితో సముద్రం చూడమన్నాడు. సముద్రం కనపడే చోటుకు సేవకుడు వెళ్లాడు.

“నేనేమీ చూడలేడు” అని సేవకుడు తిరిగి వచ్చి చెప్పాడు. మళ్లీ వెళ్లి చూడమని ఏలీయా అన్నాడు. ఈ విధంగా ఏడుసార్లు జరిగింది. 44 ఏడవసారి నౌకరు తిరిగి వచ్చి ఒక పిడికెడంత మబ్బును చూసినట్లు చెప్పాడు. అది సముద్రం మీది నుంచి వస్తున్నదని అన్నాడు.

ఏలీయా తన సేవకునితో, “రాజైన అహాబు వద్దకు వెళ్లి తన రథం సిద్ధం చేసుకొని వెంటనే ఇంటికి వెళ్లమని చెప్పు. అతనిప్పుడు వెళ్లకపోతే వర్షం అతనిని ఆపేస్తుంది” అని అన్నాడు.

45 ఆ తరువాత కొద్ది సేవటికే ఆకాశంలో కారుమేఘాలు కమ్ముకొచ్చాయి. భయంకరంగా గాలి, వాన ప్రారంభమైనాయి. అహాబు తన రథమెక్కి యెజ్రెయేలుకు తిరుగు ప్రయాణం సాగించాడు. 46 యెహోవా శక్తి ఏలీయా మీదికి వచ్చింది. ఏలీయా తన బట్టలను నడుముకు బిగించి కట్టి రాజైన అహాబుకంటె ముందుగా యెజ్రెయేలుకు పరుగెత్తికొని వెళ్లాడు.

1 థెస్సలొనీకయులకు 1

మన తండ్రియైన దేవునికి, యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీక పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు, సిల్వాను మరియు తిమోతి వ్రాయటమేమనగా, మీకు దైవానుగ్రహము, శాంతి లభించుగాక!

దేవునికి కృతజ్ఞతలు

మేము మీకోసం ప్రార్థిస్తూ మీరు మా సోదరులైనందుకు మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతతో ఉన్నాము. విశ్వాసంవల్ల మీరు సాధించిన కార్యాన్ని గురించి, ప్రేమ కోసం మీరు చేసిన కార్యాల్ని గురించి యేసు క్రీస్తు ప్రభువులో మీకున్న దృఢవిశ్వాసం వల్ల మీరు చూపిన సహనాన్ని గురించి విన్నాము. దానికి తండ్రియైన దేవునికి మేము అన్ని వేళలా కృతజ్ఞులము.

సోదరులారా! దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఎన్నుకొన్నాడని మాకు తెలుసు. ఎందుకంటే, మేము సువార్తను మీకు వట్టి మాటలతో బోధించలేదు. శక్తితో, పరిశుద్ధాత్మతో, గట్టి నమ్మకంతో బోధించాము. మేము మీకోసం మీతో కలిసి ఏ విధంగా జీవించామో మీకు తెలుసు. మీరు మమ్మల్ని, ప్రభువును అనుసరించారు. మీకు కష్టం కలిగినా పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆనందంతో సందేశాన్ని అంగీకరించారు.

కనుక మాసిదోనియ, అకయ పట్టణాలలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శులయ్యారు. ఆ పట్టణాలలో మీ ద్వారా ప్రభువు సందేశం ప్రచారమైంది. దేవుని పట్ల మీకున్న విశ్వాసం, ఆ పట్టణాలలోనే కాక, ప్రతి చోటా తెలిసింది. దాన్ని గురించి మేమేమీ చెప్పనవసరం లేదు. మీరు మాకెలాంటి స్వాగతమిచ్చారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. అంతేకాక, సజీవమైన నిజమైన దేవున్ని పూజించటానికి మీరు విగ్రహారాధనను వదిలి నిజమైన దేవుని వైపుకు ఏ విధంగా మళ్ళారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. 10 పరలోకము నుండి రానున్న దేవుని కుమారుడైన యేసు కొరకు మీరు ఏ విధంగా కాచుకొని ఉన్నారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. దేవునిచే సజీవంగా లేపబడిన ఈ యేసు రానున్న ఆగ్రహం నుండి మనల్ని రక్షిస్తాడు.

యెహెజ్కేలు 48

48 1-7 “ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రం నుండి తూర్పుకు సాగి హెత్లోనుకు, హమాతు కనుమ వరకు వెళ్లి, అక్కడ నుండి హసరేనాను వరకు ఉంది. ఇది దమస్కు (డెమాస్కస్)కు, హమాతుకు సరిహద్దు మీద ఉంది. ఆయా వంశాలకు లభించే భూమి తూర్పునుండి పడమటివరకు వెళుతుంది. ఉత్తరాన్నుండి దక్షిణానికి ఈ ప్రదేశంలో గల తెగలు (గోత్రాలు) ఏవనగా: దాను, ఆషేరు, నఫ్తాలి, మనష్షే, ఏఫ్రాయిము, రూబేను మరియు యూదా.

ప్రత్యేక భూభాగం

“మిగిలిన భూభాగం ప్రత్యేక వినియోగాలకు కేటాయించ బడింది. మిగిలిన భాగం యూదా యొక్క భాగానికి దక్షిణాన ఉంది. ఈ ప్రదేశం ఉత్తరాన ఇరవై ఐదువేల మూరల పొడఉంది. మరియు పడమట పది వేల మూరల వెడల్పు, తూర్పున పదివేల మూరల వెడల్పు, దక్షిణాన ఇరవై ఐదువేల మూరల వెడల్పు ఉంటుంది. ఆలయం ఈ విభాగం మధ్యలోవుంటుంది. ఈ భూమిని మీరు దేవునికి అంకితం చేస్తారు. దాని పొడవు ఎనిమిది మైళ్ల ఐదువందల ఇరవై ఎనిమిది గజాలు; దాని వెడల్పు ఆరు మైళ్ల పదివందల ఏబది ఆరు గజాలు. 10 ఈ ప్రత్యేక భూ విభాగం యాజకులు, లేవీయుల మధ్య పంచబడుతుంది.

“ఈ ప్రదేశంలో యాజకులకు ఒక వంతు వస్తుంది. ఈ భూమి ఉత్తర దిశన ఎనిమిది మైళ్ల ఐదు వందల ఇరవై ఎనిమిది గజాల పొడవు ఉంది. పశ్చిమ దిశన మూడు మైళ్ల ఐదువందల ఇరవై ఎనిమిది గజాల వెడల్పు ఉంది; తూర్పున మూడు మైళ్ల ఐదువందల ఇరవై ఎనిమిది గజాలు; దక్షిణ దిశన ఎనిమిది మైళ్ల ఐదువందల ఇరవై ఎనిమిది గజాల పొడఉంది. యెహోవా ఆలయం ఈ ప్రదేశపు మధ్య భాగంలో ఉంటుంది. 11 ఈ భూమి సాదోకు సంతతివారికి ఇవ్వ బడుతుంది. ఈ మనుష్యులు నా పవిత్ర యాజకులుగా ఉండటానికి ఎంపిక చేయబడ్డారు. ఎందువల్లనంటే ఇతర ఇశ్రాయేలీయులు నన్ను వదిలిపెట్టినప్పుడు కూడా వీరు నన్ను భక్తి శ్రద్ధలతో కొలిచారు. లేవీయులు చేసినట్లు సాదోకు సంతతి నన్ను విడిచిపెట్టలేదు. 12 అందుచే ఈ పవిత్ర భూమిలో ఈ ప్రత్యేక విభాగం ఈ యాజకుల కొరకు ప్రత్యేకించబడింది. ఇది లేవీయుల భూమికి ప్రక్కనే ఉంటుంది.

13 “యాజకుల భూమి ప్రక్కన లేవీయులకు భూమిలో భాగం వుంటుంది. దాని పొడవు ఇరవై ఐదువేల మూరలు వెడల్పు పదివేల మూరలు గలది. వాళ్లు ఈ భూమి యొక్క పూర్తి పొడవు వెడల్పుల వరకూ తీసుకొంటారు-అనగా పొడవు ఇరవై ఐదువేల మూరలు, వెడల్పు ఇరవైవేల మూరలు. 14 లేవీయులు ఈ భూమిలో ఏ భాగంతోనూ వ్యాపారం చేయకూడదు. వారీ భూమిలో ఏ భాగాన్నీ అమ్మలేరు. దేశంలో ఈ భాగాన్ని వారు విడగొట్టకూడదు. ఎందువల్లనంటే ఈ భామి యెహోవాకు చెందినది. ఇది చాలా ప్రత్యేకమైనది. ఇది దేశంలో మిక్కిలి మంచి భాగం.

నగర ఆస్తిలో వాటాలు

15 “యాజకులకు, లేవీయులకు ఇచ్చిన భూమిని ఆనుకొని ఐదువేల మూరల వెడల్పు, ఇరవై ఐదువేల మూరల పొడవు గల ఒక స్థలం ఉంటుంది. ఈ స్థలం నగరానికి, పశువులు తిరిగి మేయటానికి, ఇండ్లు కట్టటానికి ఉపయోగపడుతుంది. సామాన్య ప్రజలు ఈ స్థలాన్ని వినియోగించుకుంటారు. నగరం దీని మధ్యలో వుంటుంది. 16 నగర కొలతలు ఇలా ఉన్నాయి, ఉత్తరాన నాలుగువేల ఐదువందల మూరలు, దక్షిణాన నాలుగువేల ఐదువందల మూరలు, తూర్పున నాలుగువేల ఐదువందల మూరలు, పడమట నాలుగువేల ఐదువందల మూరలు. 17 నగరానికి పచ్చిక బీడులు వుంటాయి. ఈ పచ్చిక బీడులు ఉత్తరాన రెండువందల ఏభై మూరలు, దక్షిణాన రెండువందల ఏభై మూరలు. తూర్పున రెండువందల ఏభై మూరలు, పడమట రెండువందల ఏభై మూరలు కలిగి వుంటాయి. 18 పవిత్ర ప్రదేశం పొడవు ప్రక్కగా వదిలిన స్థలం తూర్పున పదివేల మూరలు, పడమట పదివేల మూరలు. ఈ స్థలం పవిత్ర ప్రదేశం ప్రక్కన పొడవునా ఉంటుంది. నగర కార్మికులకు ఈ స్థలంలో ఆహార ధాన్యాలు పండుతాయి. 19 నగరంలో పనిచేసే కార్మికులు ఈ భూమిని సాగుచేస్తారు. ఇశ్రాయేలు తెగలన్నిటిలో నుండి ఈ పనివారు వస్తారు.

20 “ఈ ప్రత్యేక భూభాగం నలుదిశలా చదరంగా వుంటుంది. దాని పొడవు వెడల్పులు ఒక్కొక్కటి ఇరవై ఐదువేల మూరలు చొప్పున ఉన్నాయి. దాని ప్రత్యేక అవసరాల కొరకే ఈ భూమిని ఉంచాలి. ఒక భాగం యాజకులకు. ఒక భాగం లేవీయులకు. ఒక భాగం నగరానికి చెంది ఉండవలెను.

21-22 “ఆ ప్రత్యేక భూమిలో ఒక భాగం దేశపాలకునికి చెందుతుంది. ఆ ప్రత్యేక భూమి నలుదిశలా చదరంగా ఉంది. దాని పొడవు, వెడల్పులు ఒక్కొక్కటి ఇరవై ఐదువేల మూరల చొప్పున ఉన్నాయి. ఈ ప్రత్యేక భూమిలో ఒక భాగం యాజకులకు, ఒక భాగం లేవీయులకు, మరొక భాగం ఆలయానికి చెందుతాయి. ఆలయం ఈ స్థలంలో మధ్యగా వుంటుంది. మిగిలిన భాగం దేశపాలకునికి చెందుతుంది. బెన్యామీనీయుల సరిహద్దుకు, యూదా వారి సరిహద్దుకు మధ్యగావున్న ప్రాంతం రాజ్యాధిపతికి చెంది ఉంటుంది.

23-27 “ఈ ప్రత్యేక భూమికి దక్షిణంగా వున్న భూమి యొర్దాను నదికి తూర్పున నివసించే తెగల (గోత్రాలు) వారికి చెందుతుంది. తూర్పు సరిహద్దు నుండి మధ్యధరా సముద్రం వరకు ఉన్న భూమిలో ప్రతీ గోత్రం వారికి ఒక భాగం వస్తుంది. ఉత్తరాన్నుండి దక్షిణం వరకు ఈ గోత్రాల వారెవరనగా: బెన్యామీను, షిమ్యోను, ఇశ్శాఖారు, జెబూలూను మరియు గాదు.

28 “గాదు వారి భూమి దక్షిణ సరిహద్దు తామారు నుండి కాదేషులోగల మెరీబా నీటి వనరు వరకూ అక్కడ నుండి ఈజిప్టు వాగు వెంబడి మధ్యధరా సముద్రం వరకు వ్యాపించి ఉంది. 29 ఈ భూమినే మీరు ఇశ్రాయేలు వంశాల మధ్య విభజించుకోవాలి. ప్రతి తెగ వారికి వచ్చేది అదే.” నా ప్రభువైన యెహోవాయే ఈ విషయాలు చెప్పాడు!

నగర ద్వారాలు

30 “ఇవి నగర ద్వారాలు. ఈ ద్వారాలు ఇశ్రాయేలు గోత్రాల పేర్ల మీద పిలవబడతాయి.

“నగర ఉత్తర భాగం ఒక మైలు ఎనిమిది వందల ఎనభై గజాల పొడవుంది. 31 అక్కడ మూడు ద్వారాలు వుంటాయి: అవి రూబేను ద్వారం, యూదా ద్వారం, మరియు లేవీ ద్వారం.

32 “నగర తూర్పు భాగం నాలుగువేల ఐదువందల మూరల పొడవు. అక్కడ మూడు ద్వారాలు ఉన్నాయి: ఆవి యోసేపు ద్వారం, బెన్యామీను ద్వారం మరియు దాను ద్వారం.

33 “నగర దక్షిణ భాగం నాలుగువేల ఐదు వందల మూరల పొడవుంది. అక్కడ మూడు ద్వారాలు ఉన్నాయి: అవి షిమ్యోను ద్వారం, ఇశ్శాఖారు ద్వారం మరియు జెబూలూను ద్వారం.

34 “నగర పశ్చిమ భాగం నాలుగు వేల ఐదువేల మూరల పొడవుంది. అక్కడ మూడు ద్వారాలున్నాయి: అవి గాదు ద్వారం, ఆషేరు ద్వారం మరియు నఫ్తాలి ద్వారం.

35 “నగరం చుట్టుకొలత ఆరుమైళ్లు. ఇప్పటి నుండి ఈ నగరం యెహోవా ఇక్కడ ఉన్నాడు అని పిలువబడుతుంది.”

కీర్తనలు. 104

104 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!
    యెహోవా, నా దేవా, నీవు ఎంతో గొప్పవాడవు.
మహిమ, ఘనత నీవు వస్త్రాలుగా ధరించావు.
    ఒక వ్యక్తి నిలువుపాటి అంగీ ధరించినట్లుగా నీవు వెలుగును ధరిస్తావు.
ఆకాశాలను నీవు తెరగా పరుస్తావు.
    దేవా, వాటికి పైగా నీవు నీ ఇంటిని నిర్మించావు.
దట్టమైన మేఘాలను నీవు నీ రథంగా ఉపయోగిస్తావు.
    గాలి రెక్కల మీద నీవు ఆకాశంలో ప్రయాణం చేస్తావు.
దేవా, నీ దూతలను నీవు గాలిలా చేశావు.
    నీ సేవకులను అగ్నిలా చేశావు.
దేవా, భూమిని దాని పునాదులపై నీవు నిర్మించావు.
    కనుక అది ఎప్పటికీ నాశనం చేయబడదు.
దుప్పటి కప్పినట్టుగా నీవు భూమిని నీళ్లతో కప్పివేశావు.
    నీళ్లు పర్వతాలను కప్పివేశాయి.
కాని నీవు ఆజ్ఞ ఇవ్వగానే, నీళ్లు వేగంగా వెళ్లిపోయాయి.
    దేవా, నీవు నీళ్లతో చెప్పగానే నీళ్లు వెంటనే వెళ్లిపోయాయి.
పర్వతాలనుండి లోయల్లోనికి, ఆ తరువాత
    నీవు వాటికోసం చేసిన స్థలాల్లోకి నీళ్లు ప్రవహించాయి.
సముద్రానికి నీవు హద్దులు నియమించావు.
    నీళ్లు భూమిని కప్పివేసేట్టుగా మరల ఎన్నటికీ ఉప్పొంగవు.

10 దేవా, నీటి ఊటలనుండి నీటి కాలువలలోనికి నీవే నీళ్లను ప్రవహింప చేస్తావు.
    పర్వతాల జలధారల ద్వారా నీవు నీటిని క్రిందికి కాలువలా ప్రవహింపజేసావు.
11 నీటి ప్రవాహాలు అడవి జంతువులన్నిటికీ నీళ్లను ఇస్తాయి.
    అక్కడ నీళ్లు త్రాగటానికి అడవి గాడిదలు కూడ వస్తాయి.
12 నీటి మడుగుల చెంత నివసించుటకు అడవి పక్షులు వస్తాయి.
    సమీపంలో ఉన్న చెట్ల కొమ్మల మీద నుండి అవి పాడుతాయి.
13 దేవుడు పర్వతాల మీదికి వర్షం పంపిస్తాడు.
    దేవుడు చేసిన పనులు భూమికి అవసరమైన ప్రతి దాన్నీ ఇస్తాయి.
14 దేవా, పశువులకు ఆహారంగా గడ్డి ఎదిగేలా నీవు చేస్తావు.
మేము పెంచుటకు ప్రయాసపడే మొక్కల్ని నీవు మాకిస్తావు. ఆ మొక్కలే ఈ భూమి మీద నుండి మాకు లభించే ఆహారం.
15 దేవా, మమ్మల్ని సంతోషపెట్టే ద్రాక్షారసం నీవు మాకు ఇస్తావు.
    మా చర్మాన్ని నునుపు చేసే[a] తైలాన్ని నీవు మాకిస్తావు.
    మమ్మల్ని బలంగలవారిగా చేయుటకు నీవు మాకు భోజనం ఇస్తావు.

16 లెబానోను మహా దేవదారు వృక్షాలను దేవుడు నాటాడు.
    ఆ మహా వృక్షాలు ఎదుగుటకు వాటికి సమృద్ధిగా నీళ్లున్నాయి.
17 పక్షులు ఆ వృక్షాలపై గూళ్లు పెడతాయి.
    పెద్ద కొంగలు దేవదారు వృక్షాలలో నివాసం చేస్తాయి.
18 పెద్ద కొండలు అడవి మేకలకు నివాసం,
    పెద్ద బండలు కుందేళ్లు దాక్కొనే చోట్లు.

19 దేవా, కాల సూచికగా ఉండుటకు నీవు మాకు చంద్రుణ్ణిచ్చావు. దాని మూలంగా పండుగ రోజులను తెలుసుకోగలుగుతాము.
    ఎక్కడ అస్తమించాలో సూర్యునికి ఎల్లప్పుడూ తెలుసు.
20 చీకటిని నీవు రాత్రిగా చేశావు.
    ఆ సమయాన అడవి జంతువులు బయటికి వచ్చి చుట్టూరా సంచరిస్తాయి.
21 సింహాలు దాడి చేసేటప్పుడు గర్జిస్తాయి.
    అవి దేవుడు వాటికిచ్చే ఆహారంకోసం ఆయనను అడుగుతున్నట్టు ఉంటుంది.
22 మరల సూర్యుడు ఉదయించినప్పుడు
    ఆ జంతువులు తిరిగి వాటి నివాసాలకు వెళ్లి విశ్రమిస్తాయి.
23 అప్పుడు ప్రజలు వారి పనుల కోసం బయటకు వెళ్తారు.
    సాయంత్రం వరకు వారు పని చేస్తారు.

24 యెహోవా, నీవు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశావు.
    భూమి నీ కార్యాలతో నిండిపోయింది.
    నీవు చేసే ప్రతి పనిలో నీవు నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తావు.
25 మహా సముద్రాన్ని చూడు. అది ఎంతో పెద్దది.
    మహా సముద్రంలో రకరకాల ప్రాణులు నివసిస్తాయి. వాటిలో కొన్ని ప్రాణులు పెద్దవి, కొన్ని చిన్నవి.
    మహా సముద్రంలో ఉండే వాటిని లెక్కించుటకు అవి చాలా విస్తారంగా ఉన్నాయి.
26 మహా సముద్రంలో ఓడలు ప్రయాణం చేస్తాయి.
    నీవు చేసిన సముద్ర ప్రాణి మకరం[b] ఆ సముద్రంలో ఆడుకుంటుంది.

27 దేవా, ఆ ప్రాణులన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి.
    దేవా, వాటికి సరియైన సమయంలో నీవు ఆహారం ఇస్తావు.
28 దేవా, జీవించే ప్రాణులన్నీ తినే ఆహారం నీవే వాటికి ఇస్తావు.
    మంచి భోజనంతో నిండిన నీ గుప్పిళ్లు నీవు విప్పగా అవి కడుపు నిండేంత వరకు భోజనము చేస్తాయి.
29 నీవు వాటి నుండి తిరిగిపోయినప్పుడు
    అవి భయపడిపోతాయి.
వాటి ప్రాణం వాటిని విడిచినప్పుడు అవి బలహీనమై చస్తాయి.
    మరియు అవి మరల మట్టి అయిపోతాయి.
30 కాని యెహోవా, నీ ఆత్మను పంపినప్పుడు, అవి మరల ఆరోగ్యంగా ఉంటాయి.
    భూమి మరల క్రొత్తదిగా అవుతుంది.

31 యెహోవా మహిమ శాశ్వతంగా కొనసాగును గాక.
    యెహోవా చేసిన వాటిని చూచి ఆయన ఆనందించునుగాక.
32 యెహోవా భూమివైపు చూసేటప్పుడు
    అది వణకుతుంది.
ఆయన పర్వతాలను ముట్టేటప్పుడు
    వాటినుండి పొగ లేవటానికి ప్రారంభిస్తుంది.

33 నా జీవితకాలం అంతా నేను యెహోవాకు పాడుతాను.
    నేను బ్రతికి ఉండగా యెహోవాకు స్తుతులు పాడుతాను.
34 నేను చెప్పిన విషయాలు ఆయనను సంతోషపెడతాయని నేను ఆశిస్తున్నాను.
    యెహోవా విషయమై నేను సంతోషిస్తున్నాను.
35 భూమి మీద నుండి పాపం కనబడకుండా పోవును గాక.
    దుర్మార్గులు శాశ్వతంగా తొలగిపోవుదురు గాక.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!

యెహోవాను స్తుతించు!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International