Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 రాజులు 15

యూదాకు అబీయాము రాజగుట

15 నెబాతు కుమారుడు యరొబాము ఇశ్రాయేలును పాలిస్తూ వుండెను. అతని పాలనలో పదునెనిమిదో సంవత్సరం గడుస్తూ వుండగా, అబీయాము యూదాకు రాజు అయ్యాడు. అబీయాము మూడు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు మయకా. ఆమె అబీషాలోము కుమార్తె.

పూర్వం తన తండ్రి చేసిన తప్పులన్నీ అతను కూడా చేశాడు. తన తాత దావీదు తన ప్రభువైన యెహోవాకు యథార్థుడై వున్నట్లు, అబీయాము యెహోవాకు విశ్వాసపాత్రుడై వుండలేదు. యెహోవా దావీదును ప్రేమించాడు. అందువల్ల అబీయాముకు యెరూషలేములో ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. అతనికి ఒక కుమారుని కూడ కలుగజేశాడు. యెహోవా ఇంకా యెరూషలేమును సురక్షితంగా వుండేలా చేశాడు. ఇదంతా యెహోవా దావీదు కొరకు చేశాడు. యెహోవా కోరిన ప్రకారం దావీదు అన్నీ సవ్యమైన పనులు చేశాడు. యెహోవా ఆజ్ఞలను సదా పాటించాడు. హిత్తీయుడైన ఊరియా పట్ల తను చేసిన పాపం ఒక్కటి తప్ప, దావీదు యెహోవాకు సదా విధేయుడైయున్నాడు.

రెహబాము, యరొబాము ఇద్దరూ ఒకరితో ఒకరు ఎల్లప్పుడు యుద్ధం చేస్తూనే వున్నారు.[a] అబీయాము చేసిన ఇతరమైన పనులన్నీ యూదా రాజుల చరిత్రలో వ్రాయబడ్డాయి.

అబీయాము పరిపాలించే సమయంలో అబీయాముకు, యరొబాముకు యుద్ధం జరిగింది. అబీయాము చనిపోయినప్పుడు అతడు దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. అబీయాము కుమారుని పేరు ఆసా. అబీయాము స్థానంలో ఆసా రాజయ్యాడు.

యూదా రాజుగా ఆసా

యరొబాము పాలన మొదలై ఇరవైయవ సంవత్సరం జరుగుతూండగా, ఆసా రాజ్యానికి వచ్చాడు. 10 ఆసా యెరూషలేములో నలుబది యొక్క సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు మయకా. మయకా అబ్షాలోము కుమార్తె.

11 ఆసా తన పూర్వికుడైన దావీదువలె యెహావా దృష్టిలో యథార్థమైన వాటిని చేసాడు. 12 ఆ రోజులలో కూడా లైంగిక వాంఛలకై తమ శరీరాలను ఆరాధనా స్థలాలలో అమ్ముకుని చిల్లర దేవుళ్లను పూజించే పురుషులున్నారు. అటువంటి పురుషగాములను ఆసా దేశంనుండి వెళ్ళగొట్టాడు. మరియు ఆసా తన పూర్వికులు తయారు చేసిన విగ్రహాలన్నిటినీ తీసి వేశాడు. 13 తన తల్లి మయకాను రాణి పదవి నుంచి ఆసా తొలగించాడు. కారణ మేమంటే మయకా ఒక హేయమైన అషేరా దేవతా విగ్రహాన్ని తయారు చేయించింది. ఈ భయంకర విగ్రహాన్ని ముక్కలు చేసి ఆసా వాటిని కిద్రోనులోయలో తగులబెట్టాడు. 14 కాని ఆసా ఉన్నత స్థలాలను నాశనం చేయలేదు. తన జీవిత కాలమంతా ఆసా యెహోవాకు విశ్వాస పాత్రుడుగా ఉన్నాడు. 15 ఆసా తండ్రి కొన్ని వస్తువులను యెహోవాకు సమర్పించాడు. ఆసా కూడ కొన్ని కానుకలను యెహోవాకు సమర్పించాడు. వారు బంగారం, వెండి, తదితర వస్తు సామగ్రిని కానుకలుగా సమర్పించారు. అవన్నీ ఆసా దేవాలయంలో వుంచాడు.

16 యూదా రాజుగా ఆసా కొనసాగినంత కాలం, ఇశ్రాయేలు రాజైన బయెషాతో యుద్ధాలు కొనసాగించాడు. 17 బయెషా యూదా వారితో యుద్ధం చేశాడు. ఆసా రాజ్యమైన యూదాకు ప్రజల రాకపోకలను నిలిపివేయమని బయెషా సంకల్పించాడు. అందువల్ల రామానగరాన్ని అతడు చాలా పటిష్ఠపర్చినాడు. 18 దేవాలయం ఖజానా నుండి, రాజభవనం నుండి ఆసా వెండి, బంగారాలను తీశాడు. అతని సేవకులకు వాటినిచ్చి అరాము రాజైన బెన్హదదుకు పంపాడు. (బెన్హదదు తండ్రి పేరు టబ్రిమ్మోను, టబ్రిమ్మోను తండ్రిపేరు హెజ్యోను) అతడు దమస్కు నగరంలో వుంటున్నాడు. 19 అతనికి ఆసా ఇలా వర్తమానం పంపాడు, “నా తండ్రికి, నీ తండ్రికి మధ్య ఒక శాంతి ఒడంబడిక జరిగింది. ఇప్పుడు నీతో నేను కూడ శాంతి ఒడంబడిక నొకదానిని చేసుకోదలిచాను. నీకు వెండి బంగారాలు కానుకలుగా పంపుతున్నాను. ఇశ్రాయేలు రాజైన బయెషాతో నీకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవలసిందిగా కోరుతున్నాను. అప్పుడు బయెషా నా రాజ్యం వదిలిపోతాడు.”

20 రాజైన బెన్హదదు ఆసా రాజు కోరిన దానికి ఒప్పుకున్నాడు. కావున ఇశ్రాయేలు పట్టణాలమీదికి తన సైన్యాలను పంపాడు. ఈయోను, దాను, ఆబేల్బేత్మయకా, కిన్నెరెతు పట్టణాలను ఓడించాడు. కిన్నెరెతు, నఫ్తాలీలను అతడు పూర్తిగా ఓడించాడు. 21 ఈ దండయాత్రలను గురించి బయెషా విన్నాడు. దానితో అతడు రామా నగరాన్ని కట్టు దిట్టం చేయటం మానివేశాడు. అతడు రామా నగరాన్ని వదిలి తిర్సాకు తిరిగి వెళ్లాడు. 22 అప్పుడు రాజైన ఆసా యూదా ప్రజలందరి సహకారాన్ని కోరుతూ ఒక అభ్యర్థన చేశాడు. వారంతా బయెషా రామా నగరాన్ని పటిష్ఠం చేయటానికి వినియోగిస్తున్న రాళ్లను, కలపను తీసుకొనిపోయారు. వాటిని బెన్యామీనీయుల నగరమైన గెబకు, మరియు మిస్పాకు చేరవేశారు. రాజైన ఆసా ఆ రెండు నగరాలను పటిష్టంగా పునర్నిర్మించాడు. 23 ఆసా చేసిన ఇతరమైన అన్ని పనులు, అతని బలం, అతను నిర్మించిన నగరాల విషయం యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఆసా ముసలివాడైనప్పుడు, అతని పాదాలలో జబ్బు ఏర్పడింది. 24 ఆసా చనిపోయినప్పుడు, అతని పూర్వికుడైన దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. తరువాత ఆసా కుమారుడు యెహోషాపాతు అతని స్థానంలో రాజు అయ్యాడు.

ఇశ్రాయేలు రాజుగా నాదాబు

25 యూదాకు రాజైన ఆసా పాలన రెండవ సంవత్సరం గడుస్తూ వుండగా యరొబాము కుమారుడు నాదాబు ఇశ్రాయేలుకు రాజయ్యాడు. నాదాబు ఇశ్రాయేలును రెండు సంవత్సరాలు పాలించాడు. 26 యెహోవా దృష్టిలో అతను చాలా తప్పులు చేశాడు. తన తండ్రి యరొబాము చేసిన తప్పులన్నీ ఇతడూ చేశాడు. యరొబాము ఇశ్రాయేలు ప్రజలు కూడ పాపం చేయటానికి కారకుడయ్యాడు.

27 బయెషా అహీయా కుమారుడు. వారు ఇశ్శాఖారు వంశస్థులు. రాజైన నాదాబును చంపి వేయటానికి బయెషా పధకం వేశాడు. అది నాదాబు, ఇశ్రాయేలు వారంతా కలిసి గిబ్బెతోను నగరంపై దాడి జరుపుతున్న సమయం. గిబ్బెతోను ఫిలిష్తీయుల నగరం. అక్కడ నాదాబును బయెషా హత్య చేశాడు. 28 యూదాపై ఆసా పాలన మూడవ సంవత్సరం జరుగుతుండగా ఇది జరిగింది. ఇశ్రాయేలుకు తరువాత బయెషా రాజు అయ్యాడు.

ఇశ్రాయేలు రాజుగా బయెషా

29 బయెషా రాజైన పిమ్మట అతడు యరొబాము కుటుంబాన్ని హతమార్చాడు. యరొబాము కుటుంబంలో ఒక్కడిని కూడా బయెషా ప్రాణంతో వదలలేదు. యెహోవా ఎలా జరుగుతుందని సెలవిచ్చాడో, అదే రీతిలో ఇదంతా జరిగింది. షిలోహులో తన సేవకుడైన అహీయా ద్వారా యెహోవా ఇది పలికాడు. 30 ఇదంతా ఎందుకు జరిగినదనగా రాజైన యరొబాము చాలా పాపకార్యాలు చేశాడు. అంతే కాకుండా, ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపకార్యాలు చేయటానికి యరొబాము కారకుడయ్యాడు. హేయమైన తన పనులతో యరొబాము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మిక్కిలి కోపం కల్గించాడు.

31 నాదాబు చేసిన ఇతర కార్యాలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. 32 బయెషా ఇశ్రాయేలును యేలినంత కాలం యూదా రాజైన ఆసాతో యుద్ధాలు చేస్తూనేవున్నాడు.

33 ఆసా యూదా రాజ్యాన్ని మూడవ సంవత్సరం పాలిస్తూండగా, అహీయా కుమారుడైన బయెషా ఇశ్రాయేలుకు రాజయ్యాడు. బయెషా ఇరువది నాలుగు సంవత్సరాలు తిర్సాలో పరిపాలించాడు. 34 కాని బయెషా యెహోవాకు వ్యతిరేకంగా అనేక దుష్టకార్యాలు చేశాడు. యరొబాము చేసిన పాపాలే ఇతడు కూడ చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేయటానికి యరొబాము కారకుడయ్యాడు.

కొలొస్సయులకు 2

మీకోసం, లవొదికయలో ఉన్నవాళ్ళకోసం, నన్ను ఇంతవరకూ కలుసుకోకుండా ఉన్నవాళ్ళకోసం నేను ఎంత శ్రమిస్తున్నానో మీరు గ్రహించాలని నా కోరిక. మీ హృదయాలు ధైర్యంతో నిండిపోవాలనీ, ప్రేమతో మీరు ఐక్యము కావాలనీ నా అభిలాష. అప్పుడు మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారు. అదే ఒక సంపద. ఈ విధంగా మీరు దేవుణ్ణి గురించి, అంటే క్రీస్తును గురించి రహస్య జ్ఞానం పొందుతారు. క్రీస్తులో వివేకము, జ్ఞానము అనే సంపదలు దాగి ఉన్నాయి.

తియ్యటి మాటలతో మిమ్మల్నెవ్వరూ మోసం చెయ్యకుండా ఉండాలని మీకీ విషయాలు చెబుతున్నాను. నేను శరీరంతో అక్కడ మీ దగ్గర లేకపోయినా నా ఆత్మ మీ దగ్గరే ఉంది. మీ క్రమశిక్షణను, క్రీస్తు పట్ల మీకున్న సంపూర్ణ విశ్వాసాన్ని చూసి నా ఆత్మ ఆనందిస్తోంది.

క్రీస్తు వల్ల సంపూర్ణమైన జీవితం

మీరు యేసు క్రీస్తును ప్రభువుగా స్వీకరించినట్లే ఆయనలో ఐక్యమై జీవించండి. మీ వేర్లు ఆయనలో నాటి, ఆయనలో అభివృద్ధి చెందుతూ జీవించండి. మీకు ఉపదేశించిన విధంగా సంపూర్ణమైన విశ్వాసంతో ఉండండి. మీ కృతజ్ఞత పొంగిపోవాలి.

మోసంతో, పనికిరాని తత్వజ్ఞానంతో మిమ్మల్ని ఎవ్వరూ బంధించకుండా జాగ్రత్త పడండి. వాళ్ళ తత్వజ్ఞానానికి మూలం క్రీస్తు కాదు. దానికి మానవుని సాంప్రదాయాలు, అతని నైజంవల్ల కలిగిన నియమాలు కారణం. ఎందుకంటే, దేవుని ప్రకృతి క్రీస్తులో సంపూర్ణంగా మానవ రూపంతో జీవిస్తోంది. 10 మీరు ఆయనలో ఐక్యత పొందారు. కనుక మీకు ఆ సంపూర్ణత లభించింది. క్రీస్తు అన్ని శక్తులకూ, అన్ని అధికారాలకూ అధిపతి.

11 ఆయనతో మీకు కలిగిన ఐక్యతవల్ల మీరు సున్నతి పొందారు. ఈ సున్నతి మానవులు చేసింది కాదు. ఇది క్రీస్తు స్వయంగా చేసిన సున్నతి. పాపాలతో కూడుకొన్న ఈ దేహం నుండి విముక్తి పొందటమే ఈ సున్నతి. 12 మీరు బాప్తిస్మము పొందటంవల్ల క్రీస్తులో సమాధి పొందారు. క్రీస్తును బ్రతికించిన దేవుని శక్తి పట్ల మీకున్న విశ్వాసం వలన మిమ్మల్ని కూడా దేవుడు ఆయనతో సహా బ్రతికించాడు. అంటే బాప్తిస్మము వల్ల యిది కూడా సంభవించింది. 13 మీరు చేసిన పాపాలవల్ల, పాపాలతో కూడుకొన్న ఈ దేహం నుండి స్వేచ్ఛ పొందకుండా మీరు గతంలో ఆత్మీయంగా మరణించారు. కాని దేవుడు మీ పాపాలన్నిటినీ క్షమించి, క్రీస్తుతో సహా మిమ్మల్ని బ్రతికించాడు. 14 ఆ పద్ధతులను గురించి, నియమాలను గురించి మనం వ్రాత మూలంగా అంగీకరించిన పత్రాన్ని, అది మనకు వ్యతిరేకంగా ఉంది కనుక, ఆయన దానిని తీసుకెళ్ళి మేకులతో సిలువకు కొట్టాడు. 15 అధికారాలను, శక్తుల్ని పనికి రాకుండా చేసి వాటిని బహిరంగంగా హేళన చేసి, సిలువతో వాటిపై విజయం సాధించాడు.

మానవకల్పిత నియమాలు పాటించకు

16 అందువల్ల అన్నపానాల విషయంలో గాని, మత సంబంధమైన పండుగ విషయాల్లో గాని, అమావాస్య పండుగ విషయంలో గాని, యూదుల విశ్రాంతి రోజు విషయంలో కాని యితరులు మీపై తీర్పు చెప్పకుండా జాగ్రత్తపడండి. 17 ఇవి నీడలా రానున్న వాటిని సూచిస్తున్నాయి. కాని సత్యం క్రీస్తులో ఉంది. 18 కొందరు తాము దివ్యదర్శనం చూసామని, కనుక తాము గొప్ప అని చెప్పుకొంటారు. అతి వినయం చూపుతూ దేవదూతల్ని పూజిస్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని అయోగ్యులుగా పరిగణించకుండా జాగ్రత్తపడండి. వాళ్ళు ప్రాపంచిక దృష్టితో ఆలోచిస్తారు. కనుక, నిష్కారణంగా గర్విస్తూ ఉంటారు. 19 శిరస్సు కారణంగా కీళ్ళు, నరాలు దేహాన్ని ఒకటిగా ఉంచి ఆ దేహానికి శక్తిని కలిగిస్తున్నాయి. శిరస్సు కారణంగా దేవుని ఆదేశానుసారం ఆ దేహం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాంటి శిరస్సుతో వాళ్ళు సంబంధం తెంచుకొన్నారు.

20 మీరు క్రీస్తుతో మరణించినప్పుడే ఈ ప్రపంచం యొక్క ప్రాథమిక నియమాల నుండి స్వేచ్ఛను పొందారు. మరి అలాంటప్పుడు ఈ ప్రపంచానికి చెందినవాళ్ళైనట్లు, ఆ ప్రాథమిక నియమాలను ఎందుకు పాటిస్తున్నారు? 21 “ఇది వాడకు, దాన్ని రుచి చూడకు, ఇది ముట్టుకోకు.” 22 ఈ నియమాలు మానవుల ఆజ్ఞలతో, బోధలతో సృష్టింపబడినవి కనుక అవి వాడుక వల్ల నశించిపోయే వస్తువుల్లాంటివి. 23 ఇలాంటి నియమాలు పైకి తెలివైనవిగా కనిపిస్తాయి. అవి దొంగపూజలకు, దొంగవినయం చూపటానికి, దేహాన్ని అనవసరంగా, కఠినంగా శిక్షించటానికి ఉపయోగపడవచ్చు. కాని శారీరక వాంఛల్ని అదుపులో పెట్టుకోవటానికి పనికి రావు.

యెహెజ్కేలు 45

పవిత్ర కార్యాలకు భూమి విభజన

45 “మీరు చీట్లువేసి భూమిని ఇశ్రాయేలు వంశపు వారి మధ్య విభజించాలి. ఆ సమయంలో ఒక భూమి భాగాన్ని మీరు విడిగా ఉంచాలి. అది యెహోవా యొక్క పవిత్ర భాగం. ఆ భూమి పొడవు ఇరవైఐదువేల మూరలు వెడల్పు ఇరవై వేల మూరలు. ఈ భూమి అంతా పవిత్రమైనది. రెండువేల ఐదు వందల మూరల చదరపు అడుగుల పొడవున్న చతురస్రాకార స్థలాన్ని గుడికి కేటాయించ బడాలి. గుడి చుట్టూ ఐదువందల మూరలు గల ఖాళీస్థలం ఉండాలి. పవిత్ర స్థలంలో ఇరవై ఐదువేల మూరలు పొడవు; పదివేల మూరల వెడల్పు గల స్థలాన్ని కొలవాలి. ఈ ప్రదేశంలోనే గుడి ఉండాలి. గుడి ప్రదేశం అతి పవిత్ర స్థలంగా ఉండాలి.

“ఆ భూమిలో పవిత్ర భాగం యాజకుల వినియోగార్థమై, ఆలయ సేవకుల నిమిత్తం వాళ్ళు ఎక్కడ యెహోవా దగ్గరకు సేవ చేయటానికి వస్తారో వాళ్ళ కోసం ఉంటుంది. యాజకుల ఇండ్ల నిమిత్తం, ఆలయానికి స్థానంగా అది వినియోగ పడుతుంది. ఐదు లక్షల ఇరవై ఐదువేల మూరల పొడవు, పదివేల మూరల వెడల్పుతో మరొక భూభాగం ఆలయంలో సేవ చేసే లేవీయులకు ప్రత్యేకించబడుతుంది. ఈ భూభాగం లేవీయుల నివాస ప్రాంతంగా కూడా ఉపయోగపడుతుంది.

“మీరు నగరానికి ఐదువేల మూరల వెడల్పు, రెండులక్షల ఏభైవేల మూరల పొడవుగల భూభాగాన్నిస్తారు. ఇది పవిత్ర స్థలం పొడవునా ఉంటుంది. ఇది ఇశ్రాయేలు వంశానికంతటికీ చెంది ఉంటుంది. పాలనాధికారికి పవిత్ర స్థలానికి రెండు ప్రక్కల ఉన్న భూమి, నగరానికి చెందిన భూమిగా ఉంటుంది. ఒక తెగకు (గోత్రం) చెందిన స్థలం ఎంత వెడల్పు ఉంటుందో దీని వెడల్పు కూడ అంతే ఉంటుంది. ఇది పడమటి సరిహద్దు నుండి తూర్పు సరిహద్దు వరకు వ్యాపించి ఉంటుంది. ఈ స్ధలం ఇశ్రాయేలులో పాలనాధికారి యొక్క ఆస్తి. అందువల్ల ఈ అధిపతి నా ప్రజల జీవితాలను ఏ మాత్రం కష్టాలపాలు చేయనవసరం లేదు. కానివారు ఈ స్థలాన్ని ఇశ్రాయేలీయులకు వంశాలవారీగా ఇస్తారు.”

నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు, “ఇశ్రాయేలు పాలకులారా, ఇక చాలు! ప్రజల పట్ల క్రూరంగా ప్రవర్తించటం, వారి సొమ్ము కొల్ల గొట్టటం మానండి! న్యాయవర్తనులై మంచి పనులు చేయండి! నా ప్రజలను వారి ఇండ్ల నుండి వెడల గొట్టటం మానండి!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

10 “మీరు ప్రజలను మోసగించటం మానండి. మీరు ఖచ్చితమైన తూనికలు, కొలతలు వినియోగించండి! 11 ‘ఏఫా’[a] (పందుములో పదవ పాలు) మరియు ‘బత్‌’ (తూము) ఒకే పరిమాణంలో ఉండాలి. రెండూ ‘ఓమెరు’ లో పదవ వంతుకు సరిసమానంగా ఉండాలి. ఆ కొలతలు ‘ఓమెరు’ (పందుము) ను పరిమాణంగా చేసుకొని ఉండాలి. 12 ‘షెకెలు’ (తులం) ఇరవై ‘గెరా’లకు (చిన్నములు) సరి సమానంగా ఉండాలి. ఒక ‘మీనా’ అరవై షెకెలు (తులా)లకు సమానంగా ఉండాలి. అనగా అది ఇరవై తులాలు, ఇరవై ఐదు తులాలు, పదిహేను తులాల కలయికకు సమానం.

13 “మీరు ఇచ్చే ప్రత్యేక (ప్రతిష్ఠిత) అర్పణ ఈలాగున ఉండాలి.

గోధుమలలో తూములో ఆరో భాగం,

యవలగింజలలో తూములో ఆరో భాగం వంతున అర్పించాలి.

14 తైల పదార్థాలు చెల్లించేటప్పుడు ప్రతి నూట ఎనభై పడుల[b] ఒలీవ నూనెలో ఒక

ముప్పాతిక పడుల వంతు నూనెను చెల్లించాలి. ఇది ఒక నిబంధన.

15 ఇశ్రాయేలులో నీటి వనరుగల ప్రాంతాలలో ఉన్న మందలలో

ప్రతి రెండు వందల గొర్రెలకు ఒక మంచి గొర్రె చొప్పున అర్పించాలి.

“ఆ ప్రత్యేక అర్పణలు ధాన్యార్పణల కొరకు, దహన బలులకు, సమాధాన (శాంతి) బలులకు ఇవ్వ బడతాయి. ఈ అర్పణలన్నీ ప్రజలను పరిశుద్ధులను చేయటానికి ఉద్దేశించబడ్డాయి.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

16 “ఈ అర్పణ ప్రతి పౌరుడు ఇశ్రాయేలు పాలకునికి చెల్లిస్తాడు. 17 కావున పాలకుడు ప్రత్యేక పవిత్ర దినాలకు కావలసిన వస్తువులను తప్పక ఇవ్వాలి. విందు రోజులకు, అమావాస్యలకు, సబ్బాతు రోజులకు ఇశ్రాయేలు వంశం జరిపే ప్రత్యేక విందుల సమయాలకు దహన బలులు. ధాన్యార్పణలు, సానార్పణలు పాలకుడైన వాడు సమకూర్చాలి. ఇశ్రాయేలు వంశాన్ని పవిత్రపర్చే కార్యక్రమంలో ఇచ్చే పాపపరిహార బలులు, ధాన్యపు నైవేద్యాలు, దహన బలులు, సమాధాన బలులు పాలకుడు ఇవ్వాలి.”

18 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “మొదటి నెల మొదటి రోజున ఏ దోషమూ లేని ఒక కోడెదూడను తీసుకోవాలి. ఆలయాన్ని పరిశుద్ధం చేయటానికి మీరు ఆ కోడెదూడను ఉపయోగించాలి. 19 పాప పరిహారార్థమైన బలిరక్తాన్ని కొంత యాజకుడు తీసుకొని ఆలయ గుమ్మాల మీద, బలిపీఠం అంచు నాలుగు మూలల మీద మరియు లోపలి ఆవరణ గుమ్మం కమ్మెలమీద చల్లుతాడు. 20 ఇదే పని ఆ నెలలో ఏడవ రోజున ఎవరైనా పొరపాటునగాని, తెలియక గాని చేసిన పాప పరిహారం నిమిత్తం మీరు చేస్తారు. అలా మీరు ఆలయాన్ని పరిశుద్ధ పర్చాలి.

పస్కా పండుగ అర్పణలు

21 “మొదటి నెల పద్నాలుగవ రోజున మీరు పస్కా పండుగ జరుపుకోవాలి. పులియని రొట్టెల పండుగ ఇదే సమయంలో మొదలవుతుంది. ఆ పండుగ ఏడు రోజులపాటు జరుగుతుంది. 22 ఆ సమయంలో పాలకుడు తన కొరకునూ, ఇశ్రాయేలు ప్రజల కొరకునూ ఒక కోడెదూడను బలి ఇస్తాడు. అది పాపపరిహారార్థ బలి. 23 పండుగ జరిగే ఏడు రోజులు పాలకుడు ఏ దోషములేని ఏడు కోడెదూడలను, ఏడు పొట్టేళ్లను బలి ఇస్తాడు. అవి యెహోవాకు దహన బలులుగా సమర్పింపబడతాయి. పండుగ ఏడు రోజులూ రోజుకు ఒక కోడెదూడ చొప్పున పాలకుడు బలి ఇస్తాడు. ప్రతి రోజూ పాప పరిహారార్థమై అతడు ఒక మేకపోతును అర్పిస్తాడు. 24 ప్రతి కోడెదూడతో పాటు ఒక ఏఫా (సుమారు తొమ్మిది మానికెలు) యవలను ధాన్యపు నైవేద్యంగాను, ఒక ఏఫా యవలను ప్రతి పొట్టేలుతోను అధిపతి చెల్లిస్తాడు. ఇంకా పాలకుడు ప్రతి తొమ్మిది మానికెల ధాన్యంతో పాటు మూడు పడుల (ఒక గాలను) నూనెను సమర్పించాలి. 25 పాలకుడు పర్ణశాలల పండుగ జరిపే ఏడు రోజులలోనూ ఇదే విధంగా తప్పక చేయాలి. ఈ పండుగ ఏడవ నెలలో పదిహేనవ రోజున మొదలవుతుంది. ఇవన్నీ పాపపరిహారార్థ అర్పణలు, దహన బలులు, ధాన్యార్పణలు, నూనె అర్పణలుగా పరిగణింపబడుతాయి.”

కీర్తనలు. 99-101

99 యెహోవాయే రాజు.
    కనుక రాజ్యాలు భయంతో వణకాలి.
కెరూబు[a] దూతలకు పైగా దేవుడు రాజుగా కూర్చున్నాడు.
    అందుచేత ప్రపంచం భయంతో కదలిపోతుంది.
సీయోనులో యెహోవా గొప్పవాడు.
    ప్రజలందరి మీద ఆయన గొప్ప నాయకుడు.
ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక.
    దేవుని నామం భీకరం. దేవుడు పరిశుద్ధుడు.
శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు.
    దేవా, నీతిని నీవు చేశావు.
    యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు.
మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
    ఆయన పవిత్ర పాదపీఠాన్ని[b] ఆరాధించండి.
మోషే, అహరోను దేవుని యాజకులలో కొందరు,
    మరియు దేవుని ఆరాధకులలో సమూయేలు ఒకడు.
వారు యెహోవాను ప్రార్థించారు.
    దేవుడు వారికి జవాబు యిచ్చాడు.
ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు.
    వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు.
    దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు.
మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు.
    నీవు క్షమించే దేవుడవని, చెడు కార్యాలు చేసినందుకు
    ప్రజలను నీవు శిక్షిస్తావని వారికి చూపించావు.
మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
    ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి.
    మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు.

కృతజ్ఞత కీర్తన.

100 భూమీ, యెహోవాను గూర్చి పాడుము!
నీవు యెహోవాను సేవిస్తూ సంతోషంగా ఉండు!
    ఆనంద గీతాలతో యెహోవా ఎదుటికి రమ్ము.
యెహోవా దేవుడని తెలుసుకొనుము.
    ఆయనే మనలను సృజించాడు.
    మనం ఆయన ప్రజలము. మనము ఆయన గొర్రెలము.
కృతజ్ఞతా కీర్తనలతో యెహోవా పట్టణంలోనికి రండి.
    స్తుతి కీర్తనలతో ఆయన ఆలయంలోనికి రండి.
    ఆయనను గౌరవించండి. ఆయన నామాన్ని స్తుతించండి.
యెహోవా మంచివాడు.
    ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది.
    ఆయన్ని శాశ్వతంగా నమ్ము కోవచ్చు.

దావీదు కీర్తన.

101 ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను.
    యెహోవా, నేను నీకు భజన చేస్తాను.
నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
    నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
    యెహోవా, నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు?
నా యెదుట ఏ విగ్రహాలు[c] ఉంచుకోను.
    అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను.
    నేను అలా చేయను!
నేను నిజాయితీగా ఉంటాను.
    నేను దుర్మార్గపు పనులు చేయను.
ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే
    అలా చేయకుండా అతన్ని నేను ఆపివేస్తాను.
మనుష్యులు ఇతరులకంటే తామే మంచివారమని తలుస్తూ
    అతిశయించడం నేను జరుగనివ్వను.

నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను.
    ఆ మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను.
    యదార్థ జీవితాలు జీవించేవాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు.
అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను.
    అబద్ధీకులను నేను నా దగ్గర ఉండనివ్వను.
ఈ దేశంలో నివసించే దుర్మార్గులను నేను ఎల్లప్పుడూ నాశనం చేస్తాను.
    దుర్మార్గులను యెహోవా పట్టణం నుండి బలవంతంగా వెళ్లగొడతాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International