Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 రాజులు 14

యరొబాము కుమారుని మరణం

14 ఆ సమయంలో యరొబాము కుమారుడు అబీయా తీవ్రంగా జబ్బు పడ్డాడు. యరొబాము తన భార్యతో ఇలా అన్నాడు: “నీవు షిలోహుకు వెళ్లు. అక్కడ ప్రవక్త అహీయాను దర్శించు. నేను ఇశ్రాయేలుకు రాజునవుతానని చెప్పిన వాడే ఈ అహీయా. నీవు నా భార్యవని ప్రజలకు తెలియకుండా మారువేషం వేసుకొని వెళ్లు. ప్రవక్త కొరకు పదిరొట్టెలను, తీపి పదార్థాలను, ఒక జాడీ తేనెను కానుకగా పట్టుకు వెళ్లు. తరువాత మన కుమారునికి ఏమి జరుగుతుందో చెప్పమని ఆయనను అడుగు. ప్రవక్తయైన అహీయా అంతా చెపుతాడు.”

అందువల్ల రాజు భార్య షిలోహుకు వెళ్లింది. ప్రవక్త అహీయా ఇంటికి వెళ్లింది. అహీయా పండు ముసలి వాడయ్యాడు. చూపుపోయింది. కాని ఈ లోపు యెహోవా అహీయాతో, “యరొబాము భార్య నీ వద్దకు వస్తూవుంది. ఆమె కుమారునికి జబ్బు చేయగా, అతనికి ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని వస్తూవుంది” అని తెలియజేశాడు. తరువాత అహీయా ఆమెకు ఏమి చెప్పాలో కూడ యెహోవా వివరించాడు. యరొబాము భార్య అహీయా ఇంటికి వచ్చింది.

ఆమె ఎవరో ప్రజలకు తెలియకుండా వుండాలని ఆమె ప్రయత్నిస్తూ వుంది. ఆమె ద్వారం వద్దకు వచ్చినట్లు అహీయా శబ్దం విన్నాడు. వెంటనే అహీయా ఇలా అన్నాడు: “యరొబాము భార్యా, లోపలికి రా, ప్రజలు నిన్ను ఎవరో అనుకోవాలని నీవు ఎందుకు ప్రయత్నిస్తున్నావు? నీకు ఒక దుర్వార్త చెప్పదలిచాను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యరొబాముకు చెప్పమన్న వర్తమానం తెలియజేయి. యెహోవా ఇలా అంటున్నాడు: ‘యరొబామా, ఇశ్రాయేలీయులందరిలోను నేను నిన్ను ఎంపిక చేశాను. నా ప్రజలకు నిన్ను పాలకునిగా చేశాను. దావీదు వంశం ఇశ్రాయేలును ఏలుతూ వుంది. కాని వారినుండి రాజ్యాన్ని తీసుకుని, దానిని నేను నీకిచ్చాను. నా సేవకుడగు దావీదువలె నీవు ప్రవర్తించలేదు. అతడు నా ఆజ్ఞలను ఎల్లప్పుడు పాటించాడు. పూర్ణ హృదయంతో అతడు నన్ను అనుసరించాడు. నేను అంగీకరించిన వాటినే అతడు చేసేవాడు. కాని నీవు ఘోరమైన పాపాలను చాలా చేశావు. నీ ముందు పాలించిన వారు చేసిన పాపాలకంటె నీవు అతి భయంకరమైన పాపాలు చేశావు. నన్ను వదిలిపెట్టి పెడ మార్గాన పడ్డావు. నీవు విగ్రహాలను, చిల్లర దేవుళ్లను తయారు చేశావు. ఇది నాకు చాలా కోప కారణమయ్యింది. 10 కావున నేను యరొబాము కుటుంబానికి కష్టాలు కలుగజేస్తాను. నీ కుటుంబంలో పురుషులందరినీ చంపివేస్తాను. ఎండిన పేడను అగ్ని దహించి వేయునట్లు నేను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. 11 నగరంలో చనిపోయిన నీ కుటుంబం వారిని కుక్కలు పీక్కుతింటాయి. పొలాల్లో చనిపోయే నీ కుటుంబంవారిని పక్షులు పొడుచుకు తింటాయి.’ ఇదే యెహోవా వాక్కు.”

12 యరొబాము భార్యతో ప్రవక్త అహీయా ఇంకా ఇలా అన్నాడు: “ఇప్పుడు ఇంటికి వెళ్లు. నీవు నగర ద్వారం ప్రవేశించగానే నీ కుమారుడు చనిపోతాడు. 13 ఇశ్రాయేలంతా వాని కొరకు విలపించి, అతనిని సమాధి చేస్తారు. యరొబాము కుటుంబంలో నీ కుమారుడు ఒక్కడే సమాధి చేయబడతాడు. ఎందువల్లననగా యరొబాము కుటుంబంలో అతడొక్కడే ప్రభువైన ఇశ్రాయేలు దేవుని సంతోషపరిచాడు. 14 యెహోవా ఇశ్రాయేలుపై మరో కొత్త రాజును నియమిస్తాడు. ఆ కొత్త రాజు యరొబాము కుటుంబాన్ని నాశనం చేస్తాడు. ఇది శీఘ్రంగా జరుగుతుంది. 15 అప్పుడు యెహోవా ఇశ్రాయేలును శిక్షిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు నీటిలోని ఎత్తైన గడ్డి అల్లాడినట్లు తల్లడిల్లి పోతారు. ఇశ్రాయేలు ప్రజల్ని ఈ మంచి దేశంనుండి యెహోవా లాగివేస్తాడు. ఈ రాజ్యాన్ని వారి పూర్వికులకు ఆయన ఇచ్చాడు. యూఫ్రటీసు నదికావల వీరు చెల్లాచెదరైపోయేలా చేస్తాడు. ఇది జరుగుతుంది. కారణమేమంటే యెహోవా ఆ ప్రజల పట్ల కోపంగా వున్నాడు. ప్రత్యేకమైన స్తంభాలు నిర్మించి అషేరాను ఆరాధించటం మొదలుపెట్టి ప్రజలాయనకు చాలా కోపం కలుగ జేశారు. 16 యరొబాము పాపం చేశాడు. అతడు పాపం చేసి ఇశ్రాయేలు ప్రజలు కూడ పాపం చేయటానికి కారకుడయ్యాడు. కావున ఇశ్రాయేలు ప్రజలు ఓడింపబడేలా యెహోవా చేస్తాడు.”

17 యరొబాము భార్య తిర్సాకు తిరిగి వెళ్లింది. ఆమె ఇంటికి వెళ్లగానే బాలుడు చనిపోయాడు. 18 ఇశ్రాయేలీయులంతా అతని కొరకై విలపించి, అతనిని సమాధిచేశారు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో, అదే విధంగా ఇది జరిగింది. తన సేవకుడైన ప్రవక్త అహీయా ద్వారా ఈ విషయాలన్నీ చెప్పాడు.

19 రాజైన యరొబాము అనేకమైన ఇతర పనులు చేశాడు. అతడు యుద్ధాలు చేశాడు. ప్రజాపాలన కొనసాగించాడు. అతడు చేసిన పనులన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వివరించబడ్డాయి. 20 యరొబాము రాజుగా ఇరువది రెండు సంవత్సరాలు పరిపాలించాడు. తరువాత అతడు చనిపోగా, వానిని అతని పూర్వీకులతో సమాధి చేశారు. అతని కుమారుడు నాదాబు అతని స్థానంలో రాజైనాడు.

యూదా రాజుగా రెహబాము

21 యూదాకు రాజయ్యేనాటికి సొలొమోను కుమారుడు రెహబాము 41 సంవత్సరాలవాడు. యెరూషలేము నగరంలో రెహబాము పదిహేడు సంత్సరాలు పాలించాడు. ఈ నగరంలోనే యెహోవా తాను గౌరవింపబడాలని నిశ్చయించాడు. ఇశ్రాయేలు రాజ్యమంతటిలో ఈ నగరాన్నే ఆయన ఎన్నుకున్నాడు. రెహబాము తల్లి అమ్మోనీయురాలగు నయమా.

22 యూదా ప్రజలు యెహోవా దృష్టిలో పాపకార్యాలు చేయటం కొనసాగించారు. వారంటే కోపగించుకొనేలా ప్రజలు యెహోవా పట్ల అనేక పాప కార్యాలు చేశారు. వారికి ముందు నివసించిన వారి పితరులకంటె ఘోరమైన పాపాలను వారు చేశారు. 23 ఆ ప్రజలు ఉన్నత స్థలాలను,[a] స్మారకశిలను, పవిత్ర కొయ్యగుంజలను నిర్మించారు. వీటన్నిటినీవారు కొండల మీద, పచ్చని చెట్ల కింద ఏర్పాటు చేశారు. 24 దేవుని ఆరాధన పేరుతో నీచమైన లైంగిక కార్యాలకు[b] అమ్ముడు పోయే పురుషులు కూడా అక్కడ వున్నారు. యూదా వారు కూడా చాలా చెడుకార్యలకు పాల్పడ్డారు. వారికి ముందు ఈ రాజ్యంలో నివసించిన జనులు కూడా అదే రకపు చెడుకార్యాలు చేశారు. అందుచే యెహోవా రాజ్యాన్ని వారి నుండి తీసుకుని ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించాడు.

25 రెహబాము రాజ్యానికి వచ్చిన ఐదవ సంవత్సరంలో, ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము పైకిదండెత్తి వచ్చాడు. 26 షీషకు దేవాలయ ఖజానాను, రాజభవనాన్ని కొల్లగొట్టాడు. అరాము రాజైన హదదెజరు సైనికుల నుండి దావీదు తీసుకున్న బంగారు డాళ్లను కూడా అతడు ఎత్తుకొనిపోయాడు. దావీదు ఈ డాళ్లను యెరూషలేముకు తీసుకుని వచ్చాడు. షీషకు బంగారు డాళ్లన్నీ పట్టుకు పోయాడు. 27 అందువల్ల రాజైన రెహబాము వీటికి మారుగా చాలా డాళ్లను చేయించాడు. అయితే ఈ డాళ్లన్నీ బంగారానికి బదులు కంచుతో చేయబడ్డాయి. రాజభవన ద్వార పాలకులకు అతనియొక్క డాళ్లను ఇచ్చాడు. 28 రాజు యెహోవా దేవాలయానికి వెళ్లినప్పుడల్లా తన అంగరక్షకులు వెంట వెళ్లేవారు. వారు డాళ్లను చేతబట్టుకొని వెళ్లేవారు. వారు పని ముగించిన పిమ్మట వాటిని రక్షక భటుల గదిలో గోడకు తగిలించేవారు.

29 రాజైన రెహబాము చేసిన కార్యాలన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంధంలో పొందుపర్చబడ్డాయి. 30 రెహబాము, యరొబాము ఇద్దరూ ఎప్పుడూ ఒకరితో ఒకరు యుద్ధం చేస్తూ వుండేవారు.

31 రెహబాము చనిపోగా అతను తన పూర్వికులతో దావీదు నగరంలో సమాధి చేయబడినాడు. (అతని తల్లి అమ్మోనీయురాలగు నయమా) రెహబాము కుమారుడు అబీయాము అతని స్థానంలో రాజయ్యాడు.

కొలొస్సయులకు 1

దైవేచ్ఛవల్ల యేసు క్రీస్తు ప్రభువుయొక్క అపొస్తలుడైన పౌలు నుండి, మరియు మన సోదరుడైన తిమోతి నుండి,

విశ్వాసంతో పరిశుద్ధతలో సోదరులుగా క్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న కొలొస్సయి పట్టణంలోని పవిత్రులకు, మన తండ్రియైన దేవుడు మీకు శాంతిని, కృపను ప్రసాదించుగాక!

మేము మీ గురించి విన్నందుకు మన యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవునికి సర్వదా కృతజ్ఞులము. మేము మీకోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. క్రీస్తు పట్ల మీకున్న విశ్వాసాన్ని గురించి, విశ్వాసుల పట్ల మీకున్న ప్రేమను గురించి మేము విన్నాము. నిజమైన సందేశాన్ని, అంటే సువార్తను మొదటినుండి మీరు విన్నారు. అది రక్షణ కలుగజేస్తుందన్న ఆశ మీలో కలిగింది. మీ విశ్వాసము, ప్రేమ, మీ ఆశపై ఆధారపడి ఉంటాయి. దేవుడు మీ నిరీక్షణను మీకోసం పరలోకంలో భద్రంగా దాచి ఉంచాడు. దైవసందేశాన్ని విని, దేవుని అనుగ్రహాన్ని గురించి సంపూర్ణంగా అర్థం చేసుకొన్న నాటినుండి మీరు ఫలం పొందారు. అదే విధంగా యిప్పుడు కూడా దేవుడు తన ఆశీస్సులు అందరికీ ప్రసాదిస్తాడు. సువార్త ప్రపంచమంతా వ్యాపిస్తోంది. మీరీ సువార్త “ఎపఫ్రా” ద్వారా విన్నారు. అతడు మాకు ప్రియమైనవాడు. మాతో కలిసి మా పక్షాన విశ్వాసంతో క్రీస్తు సేవ చేస్తున్నవాడు. మీకు పరిశుద్ధాత్మ యిచ్చిన ప్రేమను గురించి అతడు మాకు చెప్పాడు.

ఆత్మీయ జ్ఞానము, తనను గురించిన జ్ఞానము, మీకు ప్రసాదించమని మిమ్మల్ని గురించి విన్ననాటి నుండి విడువకుండా మీకోసం దేవుణ్ణి ప్రార్థించాము:

మీకు “దైవేచ్ఛ” ను తెలుసుకొనే జ్ఞానం కలగాలని మా అభిలాష. 10 మీరు ప్రభువు యిచ్ఛానుసారం జీవించాలనీ, అన్ని వేళలా ఆయనకు ఆనందం కలిగించే వాటిని మాత్రమే చేయాలనీ మా అభిలాష. సత్కార్యాలు చేసి ఫలం చూపించండి. దేవుణ్ణి గురించి మీకున్న జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోండి. 11 సర్వశక్తి సంపన్నుడైన దేవుడు మీకు శక్తినిచ్చు గాక! అప్పుడు అన్నిటినీ సంతోషంతో భరించగల సహనము మీలో కలుగుతుంది.

12 దేవుడు తన వెలుగు రాజ్యంలో, అంటే తన విశ్వాసుల కోసం ప్రత్యేకంగా ఉంచిన దానిలో మీకు భాగం లభించేటట్లు చేసాడు. దానికి మీరు తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో ఉండండి. 13 మనల్ని చీకటి రాజ్యం నుండి రక్షించి, తాను ప్రేమించే కుమారుని రాజ్యంలోకి రప్పించాడు. 14 కుమారుడు మన పక్షాన మన పాపాల నిమిత్తం తన ప్రాణం చెల్లించాడు. కనుక ఆయన కారణంగా దేవుడు మనల్ని క్షమించాడు.

క్రీస్తు యొక్క గొప్పతనము

15 క్రీస్తు కనిపించని దేవుని ప్రతిబింబం. ఆయన
    అన్నిటికన్నా పూర్వంనుండి అనగా జగత్తుకు
    పునాది వేయుటకు ముందునుండి ఉన్నవాడు.
16 క్రీస్తు అన్నిటినీ సృష్టించాడు.
    పరలోకంలో ఉన్న వాటిని, భూమ్మీద కనిపించే వాటిని, కనిపించని వాటిని,
    సింహాసనాలను, ప్రభుత్వాలను, పాలకులను, అధికారులను, అన్నిటినీ ఆయనే సృష్టించాడు.
అన్నీ తన కోసం సృష్టించుకొన్నాడు.

17 క్రీస్తు ఆదినుండి ఉన్నాడు.
    ఆయనలో అన్నీ ఐక్యమై ఉన్నాయి.
18 సంఘం ఆయన శరీరం. ఆయన సంఘానికి శిరస్సు.
    ఆయనే అన్నిటికీ మూలం.
    చనిపోయి తిరిగి బ్రతికినవాళ్ళలో ఆయన మొదటివాడు.
అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత ఉండాలని దేవుడు యిలా చేసాడు.

19 దేవుడు తనలో ఉన్న పరిపూర్ణత ఆయనలో ఉండటానికి ఆనందంగా అంగీకరించాడు.
20     దేవుడు అన్నిటినీ, అంటే భూమ్మీద ఉన్నవాటినీ, పరలోకంలో ఉన్నవాటిని,
    కుమారుని ద్వారా తిరిగి తనలో చేర్చుకోవాలనుకొన్నాడు.
తన కుమారుడు సిలువపై చిందించిన రక్తం ద్వారా ఈ సంధి కలగాలని ఆయన ఉద్దేశ్యం.

21 మీ దుష్ప్రవర్తనలవల్ల, మీ మనస్సులో ఉన్న దురాలోచనలవల్ల ఒకప్పుడు మీరు దేవునికి దూరంగా ఉండి, ఆయనకు శత్రువులుగా జీవించారు. 22 కాని ప్రస్తుతం తన కుమారుని భౌతిక మరణం ద్వారా మీతో సంధి చేసి, మిమ్మల్ని పవిత్రం చేసి, మిమ్మల్ని నిష్కళంకులుగా, నిరపరాధులుగా తన ముందు నిలబెట్టుకోవాలని ఆయన ఉద్దేశ్యం.

23 మీరు విన్న సువార్త వలన రక్షణ కలుగుతుందన్న ఆశ మీలో కలిగింది. దాన్ని పోగొట్టుకోకుండా, దృఢంగా, స్థిరంగా ఆయన్ని విశ్వసిస్తూ ఉంటేనే అది సంభవిస్తుంది. మీరు విన్న ఈ సువార్త ఆకాశం క్రింద ఉన్న ప్రతీ జీవికి ప్రకటింపబడింది. నేను ఈ సందేశానికి సేవకుణ్ణి అయ్యాను.

సంఘం కోసం పౌలు పడిన శ్రమ

24 మీ కొరకు నేను కష్టాలు అనుభవించినందుకు యిప్పుడు నాకు ఆనందం కలుగుతోంది. ఎందుకంటే క్రీస్తు సంఘం అనబడే తన శరీరం ద్వారా అనుభవించవలసిన కష్టాలు నా దేహం అనుభవించి పూర్తి చేస్తోంది. 25 తన సందేశాన్ని మీకు సంపూర్ణంగా ఉపదేశించమని దేవుడు నన్ను నియమించాడు. తత్కారణంగా నేను క్రీస్తు సంఘానికి సేవకుణ్ణి అయ్యాను. 26 యుగయుగాలనుండి, తరతరాలనుండి రహస్యంగా దాచబడిన ఈ దైవసందేశం ప్రస్తుతం భక్తులకు చెప్పబడింది. 27 భక్తులకు ఈ రహస్యంలోని గొప్ప మహత్యాన్ని తెలియచేసి, యూదులు కానివాళ్ళకు చూపాలని ఆయన ఉద్దేశ్యం. మీలో ఉన్న “క్రీస్తే” ఆ రహస్యం. ఆయన వల్ల మహిమను తప్పక పొందుతామనే ఆశ మనలో ఉంది. 28 ఆయన్ని గురించి మేము ప్రకటిస్తున్నాము. మాలో ఉన్న జ్ఞానాన్నంతా ఉపయోగించి ప్రతి ఒక్కరికీ బోధిస్తున్నాము. సలహాలిస్తున్నాము. ఈ విధంగా ప్రతి ఒక్కరినీ క్రీస్తు ద్వారా దేవుని ముందు ఆధ్యాత్మికతలో పరిపూర్ణత పొందినవాళ్ళలా నిలబెట్టాలని మా ఉద్దేశ్యము. 29 దీన్ని సాధించటానికి నేను నా శక్తినంతా ఉపయోగించి కష్టపడి పని చేస్తున్నాను. నాలో ఉన్న ఈ బలవత్తరమైన శక్తి క్రీస్తు నాలో ఉండి పని చేయటం వల్ల కలుగుతోంది.

యెహెజ్కేలు 44

వెలుపలి ద్వారం

44 పిమ్మట ఆ మనుష్యుడు నన్ను ఆలయానికి తూర్పున ఉన్న వెలుపలి ద్వారం వద్దకి తిరిగి తీసుకొని వచ్చాడు. వెలుపలి ద్వారం మూసి ఉంది. యెహోవా నాతో ఇలా చెప్పాడు: “ఈ ద్వారం మూయబడి ఉంటుంది. ఇది తెరవబడదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దీనిద్వారా ప్రవేశించాడు గనుక మరెవ్వరూ ఈ ద్వారంగుండా ప్రవేశం చేయరు. అందువల్ల ఇది మూయబడి ఉండాలి. యెహోవాతో సమాధాన బలి అర్పణ తినేటప్పుడు ప్రజాపాలకుడు ఈ ద్వారం వద్ద కూర్చుంటాడు. ద్వారం వద్ద గల మండప మార్గం ద్వారా అతడు వచ్చి వెళతాడు.”

ఆలయ పవిత్రత

తరువాత ఆ మనుష్యుడు ఉత్తర ద్వారం ద్వారా నన్ను ఆలయం ముందుకు తీసుకొని వచ్చాడు. యెహోవా మహిమ ఆలయాన్ని నింపివేస్తున్నట్లు నేను చూశాను. నేను సాష్టాంగపడి నమస్కరించాను. యెహోవా ఇలా అన్నాడు: “నరపుత్రుడా, జాగ్రత్తగా చూడు! నీ కండ్లను, చెవులను ఉపయోగించు. ఈ వస్తువులను చూడు. నేను యెహోవా ఆలయం యొక్క నియమ నిబంధనలను గురించి చెప్పే ప్రతి విషయాన్ని నీవు శ్రద్ధగా విను. ఆలయ ప్రవేశద్వారాల వైపు, ఆలయం నుండి బయటికి పోయే ద్వారములన్నిటి వైపూ పరిశీలనగా చూడు. తరువాత నాపట్ల తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలు ప్రజలందరికీ ఈ వర్తమానాన్ని అందించు. వారికిలా చెప్పు: ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, ఇశ్రాయేలు వంశీయులారా, మీరు నాపట్ల చేసిన భయంకరమైన పనులు కోకొల్లలు! ఇక చాలు. నా ఆలయం లోకి మీరు అన్యదేశీయులను తీసుకొని వచ్చారు. వారు నిజంగా సున్నతి సంస్కారం లేనివారు. వారు తమను తాము పూర్తిగా నాకు సమర్పించుకోలేదు. ఈ రకంగా మీరు నా ఆలయాన్ని అపవిత్రం చేశారు. మన ఒడంబడికను మీరు భంగపర్చారు. మీరు చెడుకార్యాలు చేశారు. తరువాత మీరు నాకు రొట్టె, కొవ్వు, రక్తం సమర్పించారు. కాని ఇదంతా కేవలం నా ఆలయాన్ని అపవిత్రపర్చింది. మీరు నా వవిత్ర వస్తువుల విషయంలో జాగ్రత్త తీసుకోలేదు. పైగా అన్యదేశీయులు నా పవిత్ర స్థలాన్ని గురించి బాధ్యత వహించేలా చేశారు!’”

నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నిజంగా సున్నతి సంస్కారం పొందని విదేశీయుడెవ్వడూ నా ఆలయంలోకి రాకూడదు. అట్టివాడు శాశ్వతంగా ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తున్న వాడైనా నా ఆలయ ప్రవేశానికి అర్హుడు కాడు. అతడు నా ఆలయ ప్రవేశం చేసే దానికి ముందు సున్నతి సంస్కారం పొంది తనను తాను నాకు పూర్తిగా సమర్పించుకోవాలి. 10 గతంలో ఇశ్రాయేలీయులు నాపై తిరుగుబాటు చేసినప్పుడు లేవీయులు నన్ను వదిలివేశారు. తమ విగ్రహాలను ఆరాధించటానికి ఇశ్రాయేలీయులు నన్ను వదిలిపెట్టారు. లేవీయులు చేసిన పాపానికి వారు శిక్షింపబడతారు. 11 నా పవిత్ర స్థలంలో సేవ చేయటానికి లేవీయులు ఎంపిక చేయబడ్డారు. ఆలయ ద్వారాలకు వారు కాపలా ఉన్నారు. వారు ఆలయంలో సేవ చేశారు. ప్రజల తరఫున బలులు దహన బలులు ఇవ్వటానికి వారు జంతువులను వధించారు. ప్రజలకు సహాయం చేయటానికి, వాళ్ళకు సేవ చేయటానికి వారు ఎంపిక చేయబడ్డారు. 12 కాని ప్రజలు నాపట్ల పాపం చేయటానికే లేవీయులు వారికి సహాయపడ్డారు! ప్రజల విగ్రహారాధనలో లేవీయులు వారికి సహాయపడ్డారు! కనుక నేను వారికి వ్యతిరేకంగా ఇలా ప్రతిజ్ఞ చేస్తున్నాను, ‘వారు తమ పాపానికి శిక్షింపబడతారు.’” నా ప్రభువైన యెహోవా ఇది చెప్పాడు.

13 “కావున యాజకులవలె లేవీయులు నాకు అర్పణలు తీసుకొనిరారు. నా పవిత్ర వస్తువుల వద్దకు గాని, అతి పవిత్రమైనవిగా తలచబడేవాటి దరిదాపులకు గాని వారు రారు. వారు చేసిన నీచమైన పనులకు అవమానాన్ని వారు భరించాలి. 14 అయితే వారిని నా ఆలయం గురించి శ్రద్ధ తీసుకోనిస్తాను. వారు ఆలయంలో పనిచేస్తూ, అక్కడ తప్పక జరగవలసిన కార్యాలన్నీ నెరవేర్చుతారు.

15 “యాజకులందరూ లేవీ వంశపువారే. కాని ఇశ్రాయేలు ప్రజలు నాపై తిరుగుబాటు చేసినప్పుడు సాదోకు సంతతి యాజకులు మాత్రమే నా పవిత్ర స్థలాన్ని గురించి జాగ్రత్త తీసుకున్నారు. కావున సాదోకు సంతతి వారే నాకు అర్పణలు తెస్తారు. వారు బలి యిచ్చే జంతువుల కొవ్వును, రక్తాన్ని నాకు అర్పించేందుకు వారు నా ముందు నిలబడతారు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు! 16 “వారు నా పవిత్ర స్థలంలో ప్రవేశిస్తారు. నేను వారి కిచ్చిన వస్తువుల పట్ల జాగ్రత్త తీసుకుంటారు. 17 వారు లోపలి ఆవరణ ద్వారాలలో ప్రవేశించినప్పుడు వారు నారబట్టలు ధరిస్తారు. లోపలి ఆవరణ గుమ్మాల వద్ద, ఆలయంలోను సేవ చేసేటప్పుడు వారు ఉన్ని బట్టలు ధరించరు. 18 వారు నార పాగాలను తమ తలలపై ధరిస్తారు. నడుముకు చుట్టుకొనేటందుకు కూడ వారు నారబట్టలే ఉపయోగిస్తారు. వారికి చెమట పుట్టించే బట్టలేవీ వారు ధరించరు. 19 బయటి ఆవరణలో ప్రజల వద్దకు వారు వెళ్లేముందు, నాకు సేవ చేసేటప్పుడు ధరించే వస్త్రాలను వారు విడుస్తారు. వారు వేరే బట్టలు వేసుకొంటారు. ఈ విధంగా వారు పవిత్ర వస్త్రాలను ప్రజలు ముట్టకుండ చూస్తారు.

20 “ఈ యాజకులు తమ తలలు గొరిగించరు. కాని జుట్టు బారుగా పెరగకుండా మాత్రం జాగ్రత్త పడతారు. (తలలు గొరిగించడం విచారానికి దుఃఖానికి సూచన. యాజకులు కేవలం యెహోవా సేవలోనే ఆనందిస్తారు.) యాజకులు తమ తల వెంట్రుకలను తగు మాత్రమే కత్తిరిస్తారు. 21 లోపలి ఆవరణలోనికి వెళ్లేటప్పుడు యాజకులెవ్వరూ ద్రాక్షారసం తాగరాదు. 22 యాజకులు విధవరాండ్రను, విడాకులిచ్చిన స్త్రీలను వివాహమాడరాదు. వారు కేవలం ఇశ్రాయేలు వంశంలో నుండి కన్యలను మాత్రమే వివాహమాడాలి. లేదా చనిపోయిన భర్త యాజకుడైతే, ఆ విధవస్త్రీని వారు పెండ్లి చేసుకోవచ్చు.

23 “పవిత్ర వస్తువులకు, పవిత్ర వస్తువులు కాని వాటికి మధ్య వ్యత్యాసాన్ని గురించి కూడా నా ప్రజలకు యాజకులు తెలియజేస్తారు. శుభ్రమైన పదార్థాలు ఏవో, అపరిశుభ్రమైనవి ఏవో నా ప్రజలు తెలుసుకొనేటందుకు వారు సహాయపడతారు. 24 న్యాయస్థానంలో యాజకులు న్యాయాధీశులుగా వ్యవహరిస్తారు. ప్రజలకు తీర్పు తీర్చేటప్పుడు వారు నా కట్టడలను అనుసరిస్తారు. నా ప్రత్యేక విందుల (సమావేశాల) సమయంలో వారు నా నియమ నిబంధనలను పాటిస్తారు. వారు నేను ఏర్పాటు చేసిన ప్రత్యేక విశ్రాంతి రోజులను గౌరవించి, వాటిని పవిత్రంగా ఉంచుతారు. 25 వారు శవాలను తాకి వారిని వారు అపవిత్ర పర్చుకోరు. కాని ఆ చనిపోయిన వ్యక్తి గనుక తండ్రి గాని, తల్లి గాని, కుమారుడు, కుమార్తె, సోదరుడు గాని లేక వివాహితకాని సోదరిగాని అయితే వారు శవాలను ముట్టి తమను తాము అపవిత్రం చేసుకొంటారు. 26 ఇది యాజకుని అపరిశుద్ధుణ్ణి చేస్తుంది. యాజకుడు పరిశుద్ధుడయిన తరువాత అతడు ఏడు రోజులు ఆగాలి. 27 అప్పుడతడు తిరిగి పవిత్ర స్థలానికి వెళ్లవచ్చు. పవిత్ర స్థలంలో సేవ నిమిత్తం అతడు లోపలి ఆవరణలోకి వెళ్లే రోజున తన నిమిత్తం ఒక పాప పరిహారపు బలిని ఇచ్చుకోవాలి.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

28 “లేవీయులకు సంబంధించిన భూమి విషయమేదంటే, వారి ఆస్తిని నేనే. ఇశ్రాయేలులో లేవీయులకు మీరేమీ ఆస్తిని (భూమిని) ఇవ్వవద్దు. ఇశ్రాయేలులో నేనే వారి భాగం. 29 ధాన్యార్పణలు, పాప పరిహారార్థ బలిమాంసం, అపరాధ పరిహారార్థ బలి సమర్పణ వారికి ఆహారంగా ఇవ్వబడతాయి. ఇశ్రాయేలులో ప్రజలు యెహోవాకు సమర్పించేదంతా వారికి చెందుతుంది. 30 కోత కాలంలో ప్రతి పంటలోను మొదటి భాగం యాజకులకు కేటాయించాలి. కలిపిన రొట్టెల పిండి ముద్దలో మొదటి భాగం యాజకులకు ఇవ్వాలి. ఇది మీ కుటుంబాలకు మంచి ఆశీస్సులనిస్తుంది. 31 సహజంగా చనిపోయిన పక్షినిగాని, జంతువునుగాని, లేదా ఏదైనా అడవి జంతువుచే చీల్చబడిన దానినిగాని యాజకులు తినరాదు.

కీర్తనలు. 97-98

97 యెహోవా ఏలుతున్నాడు, భూమి సంతోషిస్తోంది.
    దూర దేశాలన్నీ సంతోషిస్తున్నాయి.
దట్టమైన చీకటి మేఘాలు యెహోవాను ఆవరించాయి.
    నీతి న్యాయాలు ఆయన రాజ్యాన్ని బలపరుస్తాయి.
యెహోవా ముందర అగ్ని బయలువెళ్తూ
    ఆయన శత్రువులను నాశనం చేస్తుంది.
ఆయన మెరుపు ఆకాశంలో తళుక్కుమంటుంది.
    ప్రజలు దాన్ని చూచి భయపడతారు.
యెహోవా ఎదుట పర్వతాలు మైనంలా కరగిపోతాయి.
    భూలోక ప్రభువు ఎదుట అవి కరిగిపోతాయి.
ఆకాశములారా, ఆయన మంచితనం గూర్చి చెప్పండి.
    ప్రతి మనిషీ దేవుని మహిమను చూచును గాక!

మనుష్యులు వారి విగ్రహాలను పూజిస్తారు.
    వారు వారి “దేవుళ్లను” గూర్చి అతిశయిస్తారు.
కాని ఆ ప్రజలు యిబ్బంది పడతారు.
    వారి “దేవుళ్లు” యెహోవాకు సాగిలపడి ఆయనను ఆరాధిస్తారు.
సీయోనూ, విని సంతోషించుము!
    యూదా పట్టణములారా, సంతోషించండి!
    ఎందుకంటే యెహోవా జ్ఞానముగల నిర్ణయాలు చేస్తాడు.
సర్వోన్నతుడవైన యెహోవా, నిజంగా నీవే భూమిని పాలించేవాడవు.
    ఇతర “దేవుళ్ల” కంటే నీవు చాలా మంచివాడవు.
10 యెహోవాను ప్రేమించే ప్రజలు దుర్మార్గాన్ని ద్వేషిస్తారు.
    కనుక దేవుడు తన అనుచరులను రక్షిస్తాడు. దేవుడు దుర్మార్గులనుండి తన ఆనుచరులను రక్షిస్తాడు.
11 మంచి మనుష్యుల మీద వెలుగు, సంతోషం ప్రకాశిస్తాయి.
12 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
    ఆయన పవిత్ర నామాన్ని ఘనపరచండి.

స్తుతి కీర్తన.

98 యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు
    గనుక ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆయన పవిత్ర కుడి హస్తం
    ఆయనకు విజయం తెచ్చింది.
యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు.
    యెహోవా తన నీతిని వారికి చూపించాడు.
ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు.
    రక్షించగల మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు.
భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
    త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి.
స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి.
    స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము.
బూరలు, కొమ్ములు ఊదండి.
    మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
భూమి, సముద్రం, వాటిలో ఉన్న
    సమస్త జీవుల్లారా, బిగ్గరగా పాడండి.
నదులారా, చప్పట్లు కొట్టండి.
    పర్వతములారా, ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి.
యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు
    గనుక ఆయన ఎదుట పాడండి.
ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు.
    నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International