M’Cheyne Bible Reading Plan
అంతర్యుద్ధం
12 1-2 నెబాతు కుమారుడైన యరొబాము సొలొమోను నుండి తప్పించుకొని ఈజిప్టుకు పారిపోయాడు. అక్కడే వుండి పోయాడు. అతడు సొలొమోను మరణం గురించి విన్నప్పుడు, ఎఫ్రాయీము కొండలలో వున్న జెరేదా అను తన నగరానికి తిరిగి వచ్చాడు. రాజైన సొలొమోను చనిపోయి, తన పూర్వీకులతో పాటు సమాధి చేయబడిన పిమ్మట అతని కుమారుడు రెహబాము అతని స్థానంలో రాజయ్యాడు. 3 ఇశ్రాయేలు ప్రజలంతా షెకెమునకు వెళ్లారు. వారంతా రెహబామును రాజుగా చేయటానికి వెళ్లారు.
రెహబాము కూడా రాజు కావటానికి షెకెమునకు వెళ్లాడు. 4 ప్రజలు రెహబాముతో, “నీ తండ్రి మమ్మల్ని బలవంతంగా భరింపరాని శరీర కష్టం చేయించాడు. కాని ఇప్పుడు నీవు మాకు శ్రమ తగ్గించాలి. నీ తండ్రి మాకు విధించిన శరీరకష్టం నీవు మాన్పించాలి. అప్పుడు మేము నీకు సేవ చేస్తాము” అని అన్నారు.
5 దానికి సమాధానంగా రెహబాము, “మూడు రోజుల తరువాత నా వద్దకు రండి. అప్పుడు మీకు నేను సమాధానం చెబుతాను” అని అన్నాడు. కావున ప్రజలంతా వెళ్లిపోయారు.
6 సొలొమోను జీవించి వున్నప్పుడు అతనికి పరిపాలనలో సహాయపడిన కొందరు పెద్దలైన సలహాదారులున్నారు. కావున రాజైన రెహబాము ఈ సందర్భంలో, “ఆ ప్రజలకు ఏమి చెప్పాలని మీరను కొంటున్నారు?” అని సలహా అడిగాడు.
7 పెద్దలు ఇలా అన్నారు, “ఈ రోజు నీవు వారి సేవకునిలా మెలగితే, రేపు వారంతా నిన్ను సేవిస్తారు. నీవు వారితో ప్రేమగా కనికరంతో మాట్లాడితే వారంతా నీ కొరకు ఎల్లప్పుడూ పనిచేస్తారు.”
8 కాని రెహబాము వారి సలహాను పెడచెవిని పెట్టాడు. తన స్నేహితులైన యువకులను సలహా అడిగాడు. 9 “నా తండ్రి ఇచ్చిన కఠినమైన పనికంటె తక్కువ పని ఇమ్మని ప్రజలు నన్నడుగుతున్నారు. నేనేమి సమాధానం చెపితే మంచిదని మీరనుకుంటున్నారు? నన్నేమి చెప్పమంటారు?” అని రెహబాము తన స్నేహితులను అడిగాడు.
10 రాజు యొక్క యువ స్నేహితులు, “ఆ ప్రజలు నీ వద్దకు వచ్చి, ‘నీ తండ్రి మమ్మల్ని బండ చాకిరి చేయటానికి బలవంతం చేశాడు. కనుక మా పనిని ఇప్పుడు సులభం చేయుము’ అని అడిగారు కదా! అయితే నీవిప్పుడు కొన్ని డంబాలు పలికి, ‘నా చిటికెనవేలు నా తండ్రి శరీరం కంటె పెద్దదిగా వుంది. 11 నా తండ్రి మిమ్మల్ని బండ చాకిరికి గురిచేశాడు. కాని నేను మిమ్మల్ని ఇంకా కష్టపడేలా చేస్తాను! నా తండ్రి మీచేత పని చేయించటానికి కొరడాలు ఉపయోగించాడు. కాని నేను పదునైన లోహపు ముక్కలతో కూర్చబడిన కొరడాలతో, మిమ్మల్ని చీల్చునట్లుగా కొడతాను’” అని సమాధానం చెప్పమన్నారు.
12 రెహబాము ప్రజలను, “మూడు రోజుల తరువాత తన వద్దకు రమ్మని” చెప్పాడు. కావున మూడు రోజుల తరువాత ఇశ్రాయేలీయులంతా రెహబాము వద్దకు వచ్చారు. 13 అప్పుడు రాజైన రెహబాము వారితో చాలా పరుషంగా మాట్లాడాడు. పెద్దలిచ్చిన సలహా రాజు పెడచెవిని పెట్టాడు. 14 తన యువ స్నేహితులు చెప్పినదే చేశాడు. రెహబాము వారితో, “నా తండ్రి మిమ్మల్ని హింసించి శరీర కష్టం చేయించాడు. కాని నేను మీకు ఇంకా కఠినమైన పని ఇస్తాను. నా తండ్రి మిమ్మల్ని కొరడాలతో కొట్టి పని చేయించాడు. కాని నేను మిమ్మల్ని ఎలా కొడతానంటే మీరు తేళ్లు కుట్టినట్లు బాధపడతారు!” అని చెప్పాడు. 15 కావున రాజు తన ప్రజలు కోరిన దానిని చేయలేదు. ఇదంతా యెహోవాయే తన చిత్తప్రకారం జరిపించాడు. తాను నెబాతు కుమారుడైన యరొబాముకు ఇచ్చిన వాగ్దాం నెరవేరేలాగున యెహోవా ఇది ఈ విధంగా జరిగేలా చేశాడు. షిలోహుకు చెందిన ప్రవక్త అహియా ద్వారా ఈ వాగ్దానం చేశాడు.
16 ఇశ్రాయేలీయులంతా కొత్త రాజు తమ అభ్యర్థన వినలేదని గమనించారు. అందువల్ల ప్రజలు ఇలా అన్నారు:
“మనం దావీదు వంశానికి చెందినవారమా?
కాదు, యెష్షయి రాజ్యంలో మనకేమైనా వస్తుందా?
రాదు! కావున ఇశ్రాయేలు సోదరులారా, మనమంతా మన ఇండ్లకు పోదాం పదండి,
దావీదు కుమారుణ్ణి తన ప్రజలను ఏలుకోనీయండి!”
తరువాత ఇశ్రాయేలీయులందరూ తమ తమ ఇండ్లకు వెళ్లపోయారు. 17 అయినా రెహబాము యూదా నగరాలలో ఉన్న ఇశ్రాయేలీయులందరినీ ఏలాడు.
18 కూలిపని చేసే వారిపై అదోరాము అనునతడు అధికారిగా వుండేవాడు. రాజైన రెహబాము అదోరామును ప్రజలతో మాట్లాడేటందుకు పంపాడు. కాని ఇశ్రాయేలీయులు వానిని రాళ్లతో కొట్టి చంపేశారు. అది విని రాజైన రెహబాము తన రథమెక్కి యెరూషలేముకు తప్పించుకుపోయాడు. 19 అలా ఇశ్రాయేలీయులు దావీదు వంశంపై తిరుగుబాటు చేశారు. వారు ఈనాటికీ దావీదు వంశానికి వ్యతిరేకులుగానే వున్నారు.
20 యరొబాము తిరిగి వచ్చినట్లు ఇశ్రాయేలీయులు విన్నారు. కావున వారతనిని ఒక సభకు ఆహ్వానించి, ఇశ్రాయేలంతటికీ రాజుగా చేశారు. యూదాగోత్రం వారొక్కరు మాత్రమే దావీదు కుటుంబాన్ని అనుసరించారు.
21 రెహబాము యెరూషలేముకు తిరిగి వెళ్లాడు. అతడు యూదా గోత్రపువారిని బెన్యామీను గోత్రపు వారిని సమావేశపరిచాడు. వారిని ఒక లక్షా ఎనుబదివేల మందిగల ఒక సైన్యంగా తయారు చేశాడు. రెహబాము ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయ సంకల్పించాడు. తన రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని అతని కోరిక. 22 కాని యెహోవా ఒక దైవజ్ఞుని (ప్రవక్త) తో మాట్లాడాడు. అతని పేరు షెమయా. యెహోవా ఆ ప్రవక్తతో ఇలా అన్నాడు: 23 “నీవు వెళ్లి సొలొమోను కుమారుడు, యూదా రాజు అయిన రెహబాముతోను, మరియు యూదా బెన్యామీను ప్రజలతోను మాట్లాడు. 24 మీ సోదరుల మీదికి మీరు యుద్ధానికి వెళ్లవద్దని నా మాటగా వారికి చెప్పు ‘మీలో ప్రతి ఒక్కడూ ఇంటికి వెళ్లాలి. ఇవన్నీ జరిగేలా నేనే చేశాను.’ ఈ విషయం యెహోవా మీకు తెలియ చేయమన్నాడని చెప్పు.” ప్రవక్త వెళ్లి చెప్పగా రెహబాము సైన్యంలోని వారంతా విని యెహోవా ఆజ్ఞ శిరసాపహించారు. వారు ఇండ్లకు వెళ్లారు.
25 యరొబాము తరువాత షెకెమును చాలా బలమైన నగరంగా తీర్చిదిద్దాడు. ఆ నగరం ఎఫ్రాయీము కొండలలో వుంది. యరొబాము అక్కడ నివసించాడు. అతడు పెనూయేలు అను నగరానికి వెళ్లి దానిని కూడ మంచి పటిష్ఠమైన నగరంగా చేశాడు.
26-27 యరొబాము ఇలా అనుకున్నాడు: “ఇప్పుడు ప్రజలంతా యెరూషలేములో యెహోవా దేవాలయానికి యథాప్రకారంగా వెళుతూ వుంటే, వారు దావీదు వంశం వారిచే పాలింపబడాలని అనుకుంటారు. యూదా రాజైన రెహబామునే వారు మళ్లీ అనుసరించవచ్చు. ఆ తరువాత వారు నన్ను చంపనూవచ్చు.” 28 అందువల్ల తాను ఏమి చేయాలో తెలియజేయమని రాజు తన సలహాదారులను అడిగాడు. వారి సలహామేరకు అతడు రెండు బంగారు కోడెదూడలను చేయించాడు. రాజైన యరొబాము ప్రజలనుద్దేశించి, “మీరు దేవుని ఆరాధించేందుకు యెరూషలేముకు వెళ్లవద్దు. ఇశ్రాయేలీయులారా, ఇవిగో మిమ్మల్ని ఈజిప్టునుండి తీసుకుని వచ్చిన దేవతలు ఇవే” అని అన్నాడు. 29 అలా అని రాజైన యరొబాము ఒక బంగారు కోడెదూడ బొమ్మను బేతేలునందును, రెండవ దానిని దాను నగర మందును ప్రతిష్ఠించాడు. 30 కాని ఇది ఘోరమైన పాపం. ప్రజలు బేతేలు, దాను నగరాలకు ప్రయాణమై కోడెదూడల విగ్రహాలను ఆరాధించటం మొదలు పెట్టారు.
31 గుట్టల మీద, కొండల మీద యరొబాము ఆరాధనా స్థలాలను కట్టించాడు. వివిధ వంశాల నుండి యాజకులను ఎంపిక చేశాడు. (కేవలం లేవీయులనుండి మాత్రమే అతడు యాజకులను ఎంపిక చేయలేదు). 32 రాజైన యరొబాము ఒక కొత్త పండుగరోజు ప్రకటించాడు. ఇది పస్కా పండుగ వంటిది. అది ఎనిమిదవ నెలలో పదునైదవ రోజు. (ఒకటవ నెల పదిహేనవ రోజున కాదు). యూదాలో బేతేలు నగరంలో వున్న పీఠం వద్ద ఆ రోజున రాజు బలులు సమర్పించాడు. తాను తయారు చేయించిన దూడల బొమ్మలకు రాజు బలులు అర్పించేవాడు. తను ఏర్పాటు చేసిన దేవాలయాలలో సేవ చేయటానికి రాజైన యరొబాము యాజకులను బేతేలు నుండి కూడ తీసుకున్నాడు. 33 కావున రాజైన యరొబాము ఇశ్రాయేలీయులకు పండుగ నిమిత్తం తనకు అనుకూలమైన రోజును మాత్రమే నిర్ణయించాడు. అది ఎనిమిదవ నెలలో పదునైదవ రోజు. ఆ సమయంలో అతను నిర్మించిన బలిపీఠాల వద్ద అతడు బలులు సమర్పించి, ధూపం వేసేవాడు. (ఈ కార్యాలు) అతను బేతేలు నగరంలో నిర్వహించేవాడు.
నిజమైన ధర్మము
3 సోదరులారా! చివరి మాట, ప్రభువు మీకు కావలసినంత ఆనందం ప్రసాదించుగాక! వ్రాసిన విషయాలే మళ్ళీ వ్రాయటానికి నేను వెనుకాడను. దాని వల్ల మీకు యింకా ఎక్కువ లాభం కలుగుతుంది.
2 దుర్మార్గులైన ఆ కుక్కల విషయంలో శరీరాన్ని ముక్కలు చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. 3 మనం దేవుణ్ణి ఆయన ఆత్మ ద్వారా ఆరాధిస్తున్నాము.[a] ఇది నిజమైన సున్నతి. వాళ్ళు పొందిన సున్నతిలాంటిది కాదు. మనము యేసు క్రీస్తులో ఉన్నందుకు గర్విస్తున్నాము. కనుక బాహ్యంగా కనిపించే ఈ ఆచారాలను మనము విశ్వసించము. 4 కాని అలాంటి ఆచారాలను విశ్వసించటానికి నాకు కారణాలు ఉన్నాయి. బాహ్యమైన ఈ ఆచారాలను నమ్మటం ముఖ్యమని యితరులు అనుకొంటున్నట్లయితే వాటిని నమ్మటానికి వాళ్ళకన్నా నాకు ఎక్కువ కారణాలు ఉన్నాయి. 5 నేను పుట్టిన ఎనిమిదవ రోజు నాకు సున్నతి చేసారు. నేను బెన్యామీను తెగకు చెందిన వాణ్ణి. పుట్టుకతో ఇశ్రాయేలు దేశస్థుణ్ణి. హెబ్రీయులకు జన్మించిన హెబ్రీయుణ్ణి. ధర్మశాస్త్రాన్ని అనుసరించే పరిసయ్యుణ్ణి. 6 ఉత్సాహంతో సంఘాన్ని హింసించిన వాణ్ణి. ధర్మశాస్త్రాల్లోని నియమాలను పాటించటంలో నేను ఒక్క తప్పు కూడా చేయలేదు.
7 నేను క్రీస్తు విశ్వాసిని అయినందుకు, ఇదివరలో లాభంగా పరిగణించిన వాటిని నేను ప్రస్తుతం నష్టంగా పరిగణిస్తున్నాను. 8 అంతేకాక, నా ప్రభువైన యేసు క్రీస్తును తెలుసుకోవటం చాలా గొప్ప విషయం. ఆయనతో పోల్చి చూస్తే అన్నీ వృథా అనిపిస్తుంది. ఆయన కొరకు నేను అన్నీ వదిలి వచ్చాను. క్రీస్తును పొందాలని వాటిని చెత్తగా పరిగణిస్తున్నాను. 9 ఆయనలో ఐక్యత పొంది ఉండటమే నా ఉద్దేశ్యము. ధర్మశాస్త్రాన్ని అనుసరించి పొందే నీతి నాకు అనవసరం. క్రీస్తులో విశ్వాసం ఉండటంవల్ల లభించే నీతి నాకు కావాలి. 10 నాకు క్రీస్తును తెలుసుకోవాలని ఉంది. చావునుండి బ్రతికి రాగల శక్తిని గురించి తెలుసుకోవాలని ఉంది. ఆయన పొందిన కష్టాల్లో పాలుపంచుకొని ఆయనతో స్నేహం పొందాలని ఉంది. ఆయనతో మరణించి ఆయనలా అయిపోవాలని ఉంది. 11 ఇవన్నీ చేసి తిరిగి బ్రతికి రావాలని ఉంది. దీన్ని ఏదో ఒక విధంగా సాధించాలని ఉంది.
గమ్యం వైపు పరుగెత్తటం
12 వీటన్నిటిని నేను యింకా సాధించలేదు. నాలో పరిపూర్ణత యింకా కలుగలేదు. కాని క్రీస్తు దేనికోసం నన్ను ఎన్నుకొన్నాడో దాన్ని నేను చేజిక్కించుకోవాలని పట్టుదలతో సాగిపోతున్నాను. 13 సోదరులారా! అది నాకు చిక్కిందని నేను అనుకోవటం లేదు. కాని ఒకటి మాత్రం నేను చేస్తున్నాను. గతాన్ని మరచిపోయి భవిష్యత్తులో ఉన్న దానికోసం కష్టపడుతున్నాను. 14 గమ్యాన్ని చేరుకొని బహుమతి పొందాలని ముందుకు పరుగెత్తుతున్నాను. దేవుడు నేను ఈ గమ్యాన్ని చేరుకోవాలని యేసు క్రీస్తు ద్వారా నన్ను పరలోకం కొరకు పిలిచాడు.
15 ఆత్మీయంగా పరిపూర్ణత పొందిన మనమంతా అన్ని విషయాల్లో యిలాంటి దృక్పథం ఉంచుకోవాలి. ఒకవేళ మీలో ఎవరికైనా దేని మీదనన్నా వేరు అభిప్రాయం ఉంటే దేవుడు దాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాడు. 16 మనం మాత్రం, మనమిదివరలో సాధించిన వాటికి అనుగుణంగా నడుచుకొందాము.
17 సోదరులారా! నావలె జీవించండి. మేము బోధించిన విధానాన్ని అనుసరిస్తున్నవాళ్ళను గమనించండి. 18 నేనిదివరకే ఎన్నో సార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ కన్నీళ్ళతో చెబుతున్నాను. క్రీస్తు సిలువ పట్ల శత్రుత్వంతో జీవిస్తున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. 19 వినాశనమే వాళ్ళ గమ్యం. వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. అవమానమే వాళ్ళ కీర్తి. వాళ్ళ మనస్సులు ఐహికమైన వాటిపై ఉంటాయి. 20 కాని మన నివాసం పరలోకంలో ఉంది. మనల్ని రక్షించటానికి పరలోకము నుండి రానున్న క్రీస్తు ప్రభువు కోసం మనం ఆశతో ఎదురు చూస్తున్నాము. 21 అన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకోగల శక్తి ఆయనలో ఉంది. ఆ శక్తితో ఆయన మన నీచమైన శరీరాలను తన తేజోవంతమైన శరీరంలా ఉండేటట్లు చేస్తాడు.
యాజకుని గది
42 పిమ్మట ఆ మనిషి ఉత్తరపు గుమ్మంనుండి బయటి ఆవరణకు తీసుకొని వెళ్లాడు. ఉత్తర నియమిత స్థలంలో అనేక గదులతో కూడుకున్న భవనానికి నన్ను నడిపించాడు. 2 ఉత్తర దిశన ఉన్న భవనం పొడవు నూరు మూరలు; వెడల్పు ఏభైమూరలు ఉంది. 3 ఈ కట్టడాల గోడల మీద మూడంతస్థుల్లో వసారాలు ఉన్నాయి. భవనానికి, ఆలయానికి మధ్య లోపలి ఆవరణం ఇరవై మూరలుంది. దాని ప్రక్కన గదులు బయట ఆవరణం యొక్క చదునుబాటను చూస్తూ ఉంది. 4 ఆ గదుల ముందు ఒక చావడి ఉంది. దాని వెడల్పు పది మూరలు, పొడవు నూరు మూరలు (ఇది భవనానికి తూర్పుదిశగా ఉంది). వాటి తలుపులు ఉత్తరానికి ఉన్నాయి. 5 భవనం మూడంతస్థుల ఎత్తు ఉండడం వల్లనూ, వాటి బయటి ఆవరణకు స్థంభాలు లేకపొవడంవల్లను పై అంతస్థుల్లో ఉన్న గదులు, మధ్యన మరియు క్రింది గదులకన్నా చాలా వెనుకనున్నాయి. 6 పై అంతస్థులో వసారాలు ఎక్కువ స్థలం తీసుకోవటంతో పై అంతస్థులు మధ్య అంతస్థుకన్నా ఇరుకుగా ఉంది. మధ్య అంతస్థు క్రింది అంతస్థుకన్నా ఇరుకుగా ఉంది. 7 బయట ఒక గోడ ఉంది. అది గదులకు సమాంతరంగా ఉంది. అది గదులకు ముందు ఏభై మూరల వరకు వెళ్తుంది. 8 ఆ భవనం మొత్తం ఆలయం వైపుగా నూరు మూరల పొడవు వున్నా, బయట ఆవరణంలో అది ఏభై మూరల పొడవు ఉంది. 9 ఈ గదుల ద్వారం భవనపు తూర్పు దిక్కుకు దిగువన ఉంది. కానీ ప్రజలు బయటి ఆవరణం నుండి ప్రవేశించవచ్చు. 10 ఆవరణం ప్రక్కనున్న గోడ మొదట్లో ఉంది.
ఈ గదుల ముందు దక్షిణ దిక్కున నియమిత స్థలంలో గదులు ఉన్నాయి. 11 ఒక చావడి కూడా ఉంది. అవి ఉత్తర దిశన వున్న గదులమాదిరే ఉన్నాయి. దక్షిణవైపు తలుపుల పొడవు వెడల్పులు ఉత్తర దిక్కున వున్నవాటి లెక్కనే ఉన్నాయి. ఉత్తర దిశ తలుపులకు వున్న కొలతలు, గుమ్మాల మాదిరే దక్షిణ తలుపులకు కూడ ఉన్నాయి. 12 క్రింది గదులకు ప్రవేశం భవనం తూర్పు దిక్కు చివరన ఉంది కాబట్టి ప్రజలు గోడ బయటి మార్గం గుండా ప్రవేశించవచ్చు.
13 ఆ మనిషి నాతో ఇలా అన్నాడు: “నియమిత స్థలానికి అడ్డంగా ఉన్న ఉత్తర గదులు, దక్షిణ గదులు పవిత్రమైనవి. యెహోవాకు బలులు సమర్పించే యాజకులకు ఈ గదులు కేటాయించబడ్డాయి. ఆ యాజకులు అతి పవిత్ర అర్పణలను ఈ గదులలోనే తింటారు. అతి పవిత్ర అర్పణలను వారక్కడ ఉంచుతారు. ఎందుకంటే, ఈ స్థలం పవిత్రమైనది. అతి పవిత్ర అర్పణలు ఏమంటే: ధాన్యపు నైవేద్యాలు, తప్పులను పరిహరించు బలులు మరియు అపరాధ పరిహారార్థ బలులు. 14 యాజకులు పవిత్ర ప్రదేశంలో ప్రవేశిస్తారు. కాని వారు బయటి ఆవరణంలోకి వెళ్లే ముందు, వారు సేవ చేసేటప్పుడు ధరించే బట్టలను పవిత్ర స్థలంలో వదిలి వేస్తారు. అవి అతి పవిత్రమైన బట్టలు గనుక వారలా చేస్తారు. ఒక యాజకుడు ఆలయంలో సామాన్య ప్రజలు వుండే చోటికి వెళ్లదలచినప్పుడు అతడు వేరే బట్టలు ధరించి వెళ్లవలసి ఉంటుంది.”
ఆలయపు బయటి ఆవరణ
15 ఆలయపు లోపలి భాగాన్ని ఆ మనిషి కొలవటం పూర్తి చేసిన పిమ్మట, తూర్పు ద్వారం గుండా అతడు నన్ను బయటకు తీసుకొని వచ్చాడు. గుడి బయటి భాగాన్నంతా అతడు కొలిచాడు. 16 ఆ మనుష్యుడు కొలకర్రతో తూర్పు భాగాన్నంతా కొలిచాడు. అది ఐదువందల మూరల పొడవుంది. 17 అతడు ఉత్తర భాగాన్ని కొలవగా అది ఐదువందల మూరల పొడవుంది. 18 అతడు దక్షిణ భాగాన్ని కొలవగా అది ఐదువందల మూరల పొడవుంది. 19 అతడు తిరిగి వెళ్లి పశ్చిమ దిశను కొలవగా అది ఐదువందల మూరల పొడవుంనుంది. 20 ఆ విధంగా అతడు ఆలయం యొక్క నాలుగు ప్రక్కలు కొలిచాడు. ఆలయం చుట్టూ గోడ కట్టబడింది. ఆ గోడ పొడవు ఐదువందల మూరలు, వెడల్పు ఐదువందల మూరలు ఉంది. అది మామూలు ప్రదేశాన్ని, పవిత్ర స్థలం నుండి వేరుచేసింది.
94 యెహోవా, నీవు మనుష్యులను శిక్షించే దేవుడవు.
నీవు వచ్చి మనుష్యులకు శిక్ష తెచ్చే దేవుడవు.
2 నీవు భూలోకమంతటికీ న్యాయమూర్తివి.
గర్విష్ఠులకు రావలసిన శిక్షతో వారిని శిక్షించుము.
3 యెహోవా, దుర్మార్గులు ఎన్నాళ్లవరకు తమ సరదా అనుభవిస్తారు?
యెహోవా, ఇంకెన్నాళ్లు?
4 ఆ నేరస్థులు వారు చేసిన చెడు విషయాలను గూర్చి
ఇంకెన్నాళ్లు అతిశయిస్తారు?
5 యెహోవా, ఆ మనుష్యులు నీ ప్రజలను బాధించారు.
నీ ప్రజలు శ్రమపడునట్లు వారు చేసారు.
6 మా దేశంలో నివసించే విధవరాండ్రను, పరదేశస్థులను ఆ దుర్మార్గులు చంపుతారు.
తల్లిదండ్రులు లేని పిల్లలను వారు చంపుతారు.
7 వారు ఆ చెడు కార్యాలు చేయటం యెహోవా చూడటం లేదని వారు చెబతారు.
జరుగుతున్న విషయాలను ఇశ్రాయేలీయుల దేవుడు గ్రహించడం లేదని వారు చెబుతారు.
8 దుర్మార్గులారా, మీరు బుద్ధిలేనివారు.
మీరు మీ పాఠం ఇంకెప్పుడు నేర్చుకొంటారు?
దుర్మార్గులారా, మీరు అవివేకులు
మీరు గ్రహించుటకు ప్రయత్నం చేయాలి.
9 దేవుడు మన చెవులను చేశాడు.
కనుక తప్పని సరిగా ఆయనకు చెవులు ఉంటాయి. జరిగే విషయాలను ఆయన వినగలడు.
దేవుడు మన కళ్లను చేశాడు. కనుక తప్పనిసరిగా ఆయనకు కళ్లు ఉంటాయి.
జరుగుతున్న సంగతులను ఆయన చూడగలడు.
10 ఆ ప్రజలను దేవుడే క్రమశిక్షణలో ఉంచుతాడు.
ప్రజలు చేయవలసిన వాటిని దేవుడే వారికి నేర్పిస్తాడు.
11 ప్రజలు తలచే విషయాలు దేవునికి తెలుసు.
ప్రజలు గాలి వీచినట్లుగా ఉంటారని దేవునికి తెలుసు.
12 యెహోవా శిక్షించినవాడు సంతోషంగా ఉంటాడు.
సరియైన జీవిత విధానాన్ని దేవుడు అతనికి నేర్పిస్తాడు.
13 దేవా, ఆ మనిషికి కష్టాలు వచ్చినప్పుడు అతడు మౌనంగా ఉండుటకు నీవు సహాయం చేస్తావు.
దుర్మార్గులు వారి సమాధిలో పాతిపెట్టబడేంత వరకు అతడు నెమ్మదిగా ఉండుటకు నీవు అతనికి సహాయం చేస్తావు.
14 యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు.
సహాయం చేయకుండా ఆయన తన ప్రజలను విడిచిపెట్టడు.
15 న్యాయాన్ని తోడుకొని ధర్మం తిరిగి వస్తుంది.
అప్పుడు మనుష్యులు మంచివాళ్లుగా, నిజాయితీగల వాళ్లుగా ఉంటారు.
16 దుర్మార్గులకు విరోధంగా పోరాడుటకు ఏ మనిషి నాకు సహాయం చేయలేదు.
చెడు కార్యాలు చేసే వారికి విరోధంగా పోరాడుటకు నాతో ఎవ్వరూ నిలువలేదు.
17 యెహోవా నాకు సహాయం చేసి ఉండకపోతే
నేను వెంటనే మరణ నిశ్శబ్దంలో నివసించే వాడిని.
18 నేను పడిపోవుటకు సిద్ధంగా ఉన్నట్టు నాకు తెలుసు.
కాని యెహోవా తన అనుచరుని బలపరిచాడు.
19 నేను చాలా చింతించి తల్లడిల్లిపోయాను.
కాని యెహోవా, నీవు నన్ను ఆదరించి సంతోషింప చేశావు.
20 దేవా, వక్ర న్యాయవాదులకు నీవు సహాయం చేయవు.
ఆ చెడ్డ న్యాయవాదులు ప్రజల జీవితాలను దుర్భరం చేయటానికే న్నాయచట్టాన్ని ఉపయోగిస్తారు.
21 ఆ న్యాయమూర్తులు మంచి మనుష్యులపై పడుతున్నారు.
అమాయక ప్రజలు దోషులని చెప్పి వారిని చంపుతారు.
22 అయితే పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం యెహోవాయే.
నా దుర్గమైన దేవుడు నా క్షేమస్థానం.
23 ఆ దుర్మార్గపు న్యాయవాదులు చేసిన చెడు పనులకోసం దేవుడు వారిని శిక్షిస్తాడు.
వారు పాపం చేశారు గనుక దేవుడు వారిని నాశనం చేస్తాడు.
మన యెహోవా దేవుడు ఆ దుర్మార్గపు న్యాయవాదులను నాశనం చేస్తాడు.
© 1997 Bible League International