Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 రాజులు 11

సొలొమోను, అతని భార్యలు

11 రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులు కాని వారైన అనేక మంది స్త్రీలను ప్రేమించాడు. అలాంటి స్త్రీలలో ఫరో కుమార్తె, మోయాబీయులు, అమ్మోనీయులు, ఎదోమీయులు, సీదోనీయులు, హిత్తీయులు వున్నారు. గతంలో ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా దేవుడు ఇలా అన్నాడు: “ఇతర దేశాల వారిని మీరు వివాహం చేసుకోరాదు. ఒక వేళ మీరు అలా చేస్తే ఆ ప్రజలు వాళ్ల దేవుళ్లను మీరు కొలిచేలా చేస్తారు.” కాని సొలొమోను ఈ స్త్రీల వ్యామోహంలో పడ్డాడు. సొలొమోనుకు ఏడు వందల మంది భార్యలున్నారు. (వీరంతా ఇతర దేశాల రాజుల కుమార్తెలే). అతనికి ఇంకను మూడు వందల మంది స్త్రీలు ఉపపత్నులుగ ఉన్నారు. అతని భార్యలు అతనిని తప్పుదారి పట్టించి దేవునికి దూరం చేశారు. సొలొమోను వృద్దుడయ్యే సరికి అతని భార్యలు అతడు ఇతర దేవుళ్లను మొక్కేలా చేశారు. తన తండ్రియగు దావీదు యెహోవా పట్ల చూపిన వినయ విధేయతలు, భక్తి శ్రద్ధలు సొలొమోను చూపలేకపొయాడు. సొలొమోను అష్తారోతును ఆరాధించాడు. ఇది ఒక సీదోనీయుల దేవత. మరియు సొలొమోను మిల్కోమును ఆరాధించాడు. ఇది అమ్మోనీయుల ఒక భయంకర దేవత విగ్రహం. ఈలాగున సొలొమోను యెహోవా పట్ల అపచారం చేశాడు. తన తండ్రి దావీదువలె సొలొమోను సంపూర్ణంగా యెహోవాని అనుసరించలేదు.

కెమోషుకు ఒక ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. కెమోషు మోయాబీయుల ఒక ఘోరమైన దేవత విగ్రహం. యెరూషలేముకు తూర్పుదిశలో ఒక కొండపై ఆ ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. అదే కొండ మీద మొలెకునకు కూడా ఒక ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. మొలెకు అమ్మోనీయులకు చెందిన ఒక భయానక దేవత విగ్రహం. ఇతర దేశాలకు చెందిన తన భార్యలందరి నిమిత్తం సొలొమోను ఈ మాదిరి ఆరాధనా స్థలాలను నిర్మించాడు. అతని భార్యలు వారి వారి దేవుళ్లకు ధూపం వేసి, బలులు సమర్పించేవారు.

ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నుండి సొలొమోను దూరమైనాడు. కావున యెహోవా సొలొమోను పట్ల కోపం వహించాడు. సొలొమోనుకు యెహోవా రెండు సార్లు ప్రత్యక్షమైనాడు. 10 చిల్లర దేవుళ్లను ఆరాధించరాదని యెహోవా సొలొమోనుకు చెప్పాడు: యెహోవా ఆజ్ఞను సొలొమోను పాటించ లేదు. 11 కావున యెహోవా సొలొమోనుతొ ఇలా అన్నాడు, “నాతో నీవు చేసుకొన్న ఒడంబడికను అనుసరించుటకు నీవిష్టపడలేదు. నీవు నా ఆజ్ఞలను శిరసావహించలేదు. కావున నీ రాజ్యాన్ని నీ నుండి వేరు చేస్తానని నిశ్చయంగా చెబుతున్నాను. దానిని నీ సేవకునికి ఇస్తాను. 12 కాని నీ తండ్రి దావీదును నేను మిక్కిలి ప్రేమించియున్నాను. అందువల్ల నీవు బతికియుండగా నీ రాజ్యం నీ నుండి తీసుకొనను. నీ కుమారుడు రాజు అయ్యే వరకు నేను వేచి వుంటాను. అప్పుడు వాని నుండి దానిని నేను తీసుకుంటాను. 13 అప్పుడు కూడ, రాజ్యాన్నంతా నీ కుమారుని వద్ద నుండి తీసుకోను. అతను పరిపాలించటానికి ఒక తెగను అతనికి వదిలి వేస్తాను. ఉన్నతుడైన నా సేవకుడగు దావీదు కొరకు నేనది చేయదలిచాను. నేను ఎంపిక చేసుకున్న యెరూషలేము నగరం కొరకు నేనలా చేస్తాను.”

సొలొమోను శత్రువులు

14 ఆ సమయంలో ఎదోమీయుడగు హదదు అను వానిని యెహోవా సొలొమోనుకు శత్రువయ్యేలా చేశాడు. అతడు ఎదోము వంశానికి చెందిన వారిలో ఒకడు. 15 అది ఇలా జరిగింది. ఇదివరలో దావీదు ఎదోము రాజ్యాన్ని ఓడించాడు. అప్పుడు దావీదు సైన్యాధిపతిగా యోవాబు వున్నాడు. చనిపోయిన వారిని పాతి పెట్టించేందుకు యోవాబు ఎదోములోకి వెళ్లాడు. కాని అతడు అక్కడవున్న మగవారినందరినీ చంపేశాడు. 16 యోవాబు, ఇశ్రాయేలీయులందరూ ఎదోములో ఆరు నెలలు వున్నారు. ఆ సమయంలోనే వారు ఎదోములో వున్న పురుషులనందరినీ చంపేశారు. 17 కాని అప్పటికి హదదు చాలా చిన్నవాడు. కావున హదదు ఈజిప్టుకు పారిపోయాడు. హదదు తండ్రి యొక్క సేవకులు కొందరు అతనితో కలిసి వెళ్లారు. 18 వారు మిద్యాను దేశము నుండి పారానుకు వెళ్లారు. పారాను దేశంలో వారితో మరి కొందరు కలిశారు. వారంతా కలిసి ఈజిప్టుకు వెళ్లారు. ఈజిప్టు రాజగు ఫరో వద్దకు వెళ్లి సహాయం అర్థించారు. హదదుకు ఒక ఇంటిని, కొంత భూమిని ఫరో ఇచ్చాడు. ఫరో అతనికి అన్ని అండ దండలు ఇచ్చి, ఆహారం కూడా ఏర్పాటు చేశాడు.

19 హదదును ఫరో మిక్కిలి అభిమానించాడు. హదదుకు ఫరో ఒక భార్యను కూడా ఇచ్చాడు. ఆమె ఫరో మరదలే! (ఫరో భార్య పేరు రాణి తహ్పెనేసు) 20 అనగా తహ్పెనేసు యొక్క సోదరి హదదును వివాహమాడింది. వారికి ఒక కుమారుడు పుట్టాడు. వాని పేరు గెనుబతు. రాణి తెహ్పెనేసు గెనుబతును తన పిల్లలతో పాటు ఫరో ఇంటిలోనే పెరగనిచ్చింది.

21 దావీదు చనిపోయినట్లు ఈజిప్టులో వున్న హదదు విన్నాడు. సైన్యాధిపతి యోవాబు కూడ చనిపోయినట్లు అతడు విన్నాడు. అందువల్ల హదదు ఫరో వద్దకు వెళ్లి, “నన్ను నా స్వదేశానికి వెళ్ల నియ్యండి” అని అడిగాడు.

22 “నీకు ఇక్కడ కావలసినవన్నీ సమకూర్చాను! మరి నీవెందుకు నీ స్వదేశానికి వెళ్లిపోవాలను కుంటున్నావు?” అని ఫరో అన్నాడు.

అయితే హదదు మాత్రం, “దయచేసి నన్ను మాత్రం ఇంటికి వెళ్లనీయండి” అని ప్రాధేయపడ్డాడు.

23 సొలొమోనుకు మరొక వ్యక్తి శత్రువయ్యేలా యెహోవా చేశాడు. అతడు ఎల్యాదా కుమారుడైన రెజోను. రెజోను తన యజమాని వద్ద నుండి పారిపోయాడు. సోబా రాజైన హదదెజరు ఇతని యజమాని. 24 దావీదు సోబా సైన్యాన్ని ఓడించిన పిమ్మట రెజోను కొంత మందిని చేరదీసి ఒక చిన్న సైన్యాన్ని తయారు చేశాడు. రెజోను దమస్కుకు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. తరువాత అతను దమస్కుకు రాజు అయ్యాడు. 25 రెజోను అరాము దేశమును పాలించాడు. రెజోను ఇశ్రాయేలును అసహ్యించుకొనేవాడు. కావున సొలొమోను బతికినంత కాలం రెజోను ఇశ్రాయేలుకు శత్రువుగానే వున్నాడు. రెజోను, హదదు ఇశ్రాయేలులో చాలా అలజడిని సృష్టించారు.

26 నెబాతు కుమారుడైన యరొబాము సొలొమోను సేవకులలో ఒకడు. యరొబాము ఎఫ్రాయీము ప్రజలవాడు. అతడు జెరేదా పట్టణానికి చెందినవాడు. యరొబాము తల్లి పేరు జెరూహా. అతని తండ్రి మరణించాడు. అతడు రాజుకు వ్యతిరేకి అయ్యాడు.

27 యరొబాము రాజుకు వ్యతిరేకం కావటానికి ఒక కారణం వుంది. సొలొమోను మిల్లో కట్టించి, తన తండ్రి దావీదు నగర గోడను సరిచేస్తూ వున్నాడు. 28 యరొబాము చాలా బలశాలి. అతడు మంచి పనివాడని సొలొమోను గమనించాడు. అందుచే అతనిని యోసేపు వంశంవారు[a] చేసే అతి కష్టమైన పనుల మీద అధికారిగా నియమించాడు. 29 ఒక రోజు యరొబాము యెరూషలేము నుండి ప్రయాణం చేస్తూ వున్నాడు. షిలోనీయుడైన ప్రవక్త అహీయా దారిలో యరొబామును కలిశాడు. అహీయా నూతన వస్త్రం ధరించియున్నాడు. పొలాల్లో వారిద్దరు తప్ప మరెవ్వరూ లేరు.

30 అహీయా తాను ధరించిన నూతన వస్త్రం తీసి దానిని పన్నెండు ముక్కలుగా చించాడు. 31 అప్పుడు అహీయా యరొబాముతో ఈ విధంగా చెప్పాడు: “ఈ వస్త్రంలో పది ముక్కలు నీవు తీసుకో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏమి చెప్పినాడనగా: ‘ఈ రాజ్యాన్ని సొలొమోను నుండి దూరం చేస్తాను. అప్పుడు నీకు పది గోత్రాలను ఇస్తాను. 32 కాని దావీదు కుటుంబం ఒక గోత్రపువారిని ఏలటానికి అనుమతి ఇస్తాను. ఇది నా సేవకుడైన దావీదు జ్ఞాపకార్థం, యెరూషలేము నగరం కొరకు నేను దీనిని చేస్తాను. ఇశ్రాయేలు వంశాలవారుండే నగరాలన్నింటిలో యెరూషలేమును నేను ఎన్నుకున్నాను. 33 సొలొమోను నన్ననుసరించటం మానివేసినందుకు నేను ఇదంతా చేయదలిచాను. నన్ను విడిచి అతను సీదోనీయుల దేవత అష్తారోతును, మోయాబీయుల దేవత కెమోషును, అమ్మోనీయుల దేవత మిల్కోమును మొక్కుతున్నాడు. ఉత్తమ కార్యాలను, ధర్మ మార్గాన్ని అనుసరించటం సొలొమోను మానివేశాడు. నా న్యాయసూత్రాలను, ఆజ్ఞలను శిరసావహించటం లేదు. తన తండ్రి దావీదు నడచిన మార్గాన అతడు నడుచుట లేదు. 34 కావున అతని నుండి రాజ్యాన్నంతా తీసుకుంటాను. అయినా అతను బతికినంత కాలం తాను రాజుగా వుండేలా చూస్తాను. నా సేవకుడైన దావీదు గౌరవార్థం నేనలా చేస్తాను. నేను దావీదును ఎందుకు ఎన్నుకున్నాననగా అతడు నా ఆజ్ఞలను, నా ధర్మసూత్రాలను అన్నిటినీ పాటించాడు. 35 ఈ రాజ్యాన్ని నేనతని కుమారుని వద్ద నుండి తీసుకుంటాను. మరియు యరొబామా, పది వంశాల వారిని పరిపాలించటానికి నీకు అనుమతి ఇస్తాను. 36 సొలొమోను కుమారుడు ఒక వంశం వారిపై పాలనాధికారం కలిగి వుండేలా చేస్తాను. నా సేవకుడైన దావీదు నా ముందు యెరూషలేములో ఎల్లప్పుడూ రాజ్యం కలిగి వుండేటందుకు ఆ విధంగా చేస్తాను. యెరూషలేమును నా స్వంత నగరంగా నేను ఎన్నుకున్నాను. 37 కాని నీవు కోరినంత మట్టుకు నీవు రాజ్యం చేయగలిగేలా చేస్తాను. ఇశ్రాయేలు నంతటినీ నీవు ఏలుబడి చేస్తావు. 38 నీవు గనుక నా న్యాయ సూత్రాలను, నా ఆజ్ఞలను పాటిస్తూ సన్మార్గంలో నడిస్తే ఇవన్నీ జరిగేలా నేను చేస్తాను. దావీదు నా ధర్మ సూత్రాలను, ఆజ్ఞలను పాటించినట్లు నీవు కూడ పాటిస్తే నేను నీకు తోడైవుంటాను. దావీదుకు చేసినట్లు, నీ వంశం కూడ రాజ వంశమయ్యేలా చేస్తాను. ఇశ్రాయేలును నీకిస్తాను. 39 ఆజ్ఞాపాలన చేయకపోయిన కారణంగా దావీదు సంతానాన్ని నేను శిక్షిస్తాను. కాని వారిని నేను శాశ్వతంగా శిక్షకు గురి చేయను.’”

సొలొమోను మరణం

40 సొలొమోను యరొబామును చంప ప్రయత్నించాడు. కాని యరొబాము ఈజిప్టుకు పారిపోయాడు. ఈజిప్టు రాజగు షీషకు వద్దకు అతను వెళ్లాడు. సొలొమోను చనిపోయేవరకు యరొబాము అక్కడేవున్నాడు.

41 తన పరిపాలనా కాలంలో సొలొమోను అనేకమైన ప్రజ్ఞాప్రాభవాలతో కూడిన పనులను చేశాడు. ఈ విషయాలన్నీ సొలొమోను చరిత్ర గ్రంథంలో పొందు పర్చబడ్డాయి. 42 యెరూషలేము నుండి ఇశ్రాయేలంతటిపైన సొలొమోను నలుబది సంవత్సరాలు పరిపాలన చేశాడు. 43 తరువాత సొలొమోను చనిపోయాడు. అతడు తన పూర్వీకులతో సమాధి చేయబడ్డాడు[b] అతడు తన తండ్రియగు దావీదు పురములో సమాధి చేయబడ్డాడు.

ఫిలిప్పీయులకు 2

క్రీస్తు వినయంను అనుకరించుట

క్రీస్తులో ఐక్యత పొందటం వలన మీకు శక్తి కలిగింది కదా! ఆయన ప్రేమ మీకు ఆనందం యిస్తుంది కదా! ఆయన ఆత్మతో మీకు స్నేహం కలిగింది గదా! మీలో దయాదాక్షిణ్యాలు అభివృద్ధి చెందుతున్నాయి కదా! అలాగైతే ఒకే మనస్సుతో, ఒకే ప్రేమలో పాలుపంచుకొంటూ, ఒకే ఆత్మతో, ఒకే ఉద్దేశంతో ఉండి నన్ను పూర్తిగా ఆనందపరచండి. స్వలాభం కోసంగాని, స్వాభిమానం కోసంగాని ఏదీ చేయకండి. వినయంగా ఉండండి. మీరు యితరులకన్నా గొప్ప అని భావించకండి. మీ స్వార్థం కోసం మాత్రమే చూసుకోకుండా యితరుల అవసరాలను కూడా గమనించండి.

నిస్వార్థంగా నుండుటకు క్రీస్తునుండి నేర్చుకొనండి

యేసు క్రీస్తులో ఉన్న మనస్సును పెంచుకోండి.

ఆయన దేవునితో సమానము.
    అయినా ఆయన ఆ స్థానాన్ని పట్టుకొని కూర్చోవాలనుకోలేదు.
ఆయన అంతా వదులుకొన్నాడు.
    మానవ రూపం దాల్చి సేవకునివలే ఉండటానికి వచ్చాడు.
    మానవుని వలే కనిపిస్తూ, వినయంగా వుంటూ,
    మరణాన్ని కూడా విధేయతగా అంగీకరించి, సిలువపై మరణించాడు.
అందువల్ల దేవుడాయనకు ఉన్నత స్థానం ఇచ్చి
    అన్ని పేర్లకన్నా ఉత్తమమైన పేరు యిచ్చాడు.
10 యేసు పేరు విన్నప్పుడు పరలోకంలో, భూలోకంలో, పాతాళలోకంలో
    ఉన్నవాళ్ళంతా ఆయన ముందు మోకరిల్లాలని ఈ విధంగా చేసాడు.
11 ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని అంగీకరించాలని ఈ విధంగా చేసాడు.
    తండ్రియైన దేవునికి మహిమ కలుగుగాక!

నక్షత్రాలవలె ప్రకాశించటం

12 నా ప్రియ మిత్రులారా! నేను మీతో ఉన్నప్పుడు మీరు దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించలేదు. ప్రస్తుతం నేను మీతో లేను కనుక యిప్పుడు మీరు దేవుని ఆజ్ఞల్ని పాటించుచూ మీ స్వంత రక్షణను భయముతోను, వణకుతోనూ, కార్యసాధకము చేయండి. 13 దేవుడు మీలో ఉండి తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవటానికి కావలసిన ఉత్సాహము, శక్తి మీకు యిస్తాడు.

14 మీరు చేస్తున్న పని గొణగకుండా, వాదించకుండా చెయ్యండి. 15 అప్పుడు మీరు నిష్కళంకులై మంచి వాళ్ళుగా ఉంటారు. దుర్మార్గులై, నీతి లేకుండా జీవిస్తున్న వీళ్ళ మధ్య ఏ అపరాధమూ చెయ్యని దేవుని బిడ్డల్లా ఉంటారు. మీరు వాళ్ళ మధ్య ఆకాశంలోని నక్షత్రాల్లా ప్రకాశిస్తారు. 16 మీరు జీవంగల దైవసందేశాన్ని ప్రకటిస్తున్నారు. కనుక క్రీస్తు వచ్చిన రోజున మీ విషయంలో గర్వించటానికి నాకు ఆస్కారం ఉంటుంది. నా కృషి, సాధన వ్యర్థం కాలేదని రుజువౌతుంది.

17 మీ విశ్వాసం వల్ల అర్పిస్తున్న బలికి తోడుగా నా రక్తాన్ని బలిగా ధార పోయవలసివస్తే నేను వెనుకాడను. చాలా ఆనందిస్తాను. నా ఆనందాన్ని మీతో పంచుకోవాలని నా కోరిక. 18 అందువల్ల మీరు కూడా ఆనందించి, మీ ఆనందాన్ని నాతో పంచుకొండి.

తిమోతిని పంపటం

19 మిమ్మల్ని గురించి తెలిస్తే నాకు కూడా ఆనందం కలుగుతుంది. కనుక తిమోతిని మీ దగ్గరకు పంపే అవకాశం యేసు ప్రభువు త్వరలో కలిగిస్తాడని నిరీక్షిస్తాను. 20 మీ క్షేమం విషయంలో నిజంగా శ్రద్ధ వహించే వ్యక్తి అతను తప్ప నా దగ్గర మరొకడు లేడు. 21 ప్రతి ఒక్కడూ తన స్వార్థం కోసం ఆలోచిస్తాడే కాని యేసు క్రీస్తును గురించి ఆలోచించడు. 22 సువార్త ప్రచారం చెయ్యటానికి అతడు నా కుమారునిలా పని చేసాడు. అలా చేసి తన యోగ్యతను రుజువు చేసుకొన్నాడని మీకు తెలుసు. 23 నా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియగానే అతణ్ణి మీ దగ్గరకు పంపటానికి ఎదురు చూస్తున్నాను. 24 నన్ను కూడా త్వరలో మీ దగ్గరకు పంపుతాడనే నమ్మకం నాకు ప్రభువుపట్ల ఉంది.

25 నాకు సహాయం చెయ్యటానికి మీరు ఎపఫ్రొదితును పంపారు. అతడు మీరు పంపిన దూత. అతణ్ణి తిరిగి మీ దగ్గరకు పంపటం అవసరమని భావిస్తున్నాను. ఎపఫ్రొదితు నాతో కలిసి నా సోదరునివలే పోరాడి, పని చేసాడు. 26 మిమ్మల్ని చూడాలని, మీ దగ్గరకు రావాలని అతడు ఎదురు చూస్తున్నాడు. అతడు జబ్బుతో ఉన్నాడన్న విషయం మీరు విన్నట్లు అతనికి తెలిసి అతడు చాలా చింతిస్తున్నాడు. 27 అతనికి నిజంగా చనిపోయేటంత జబ్బు చేసింది. కాని దేవుని దయ అతనిపై ఉంది. కనుక అతను బ్రతికాడు. దేవుడు అతనికే కాకుండా, నాకు మరొకసారి దుఃఖం కలుగరాదని నాపై కూడా దయచూపాడు. 28 అందువల్ల అతణ్ణి మీ దగ్గరకు పంపాలని ఎదురు చూస్తున్నాను. అతణ్ణి చూసి మీరు ఆనందించాలని నా ఉద్దేశ్యం. అప్పుడు నాకు నిశ్చింతగా ఉంటుంది. 29 కనుక ప్రభువు పేరిట ఆనందంతో అతనికి స్వాగతం చెప్పండి. అలాంటి వాళ్ళను మీరు గౌరవించాలి. 30 మీరు చేయలేని సహాయం తాను చేయాలని అతడు తన ప్రాణానికి తెగించాడు. క్రీస్తు అప్పగించిన పని పూర్తిచేయటం కొరకు మరణించటానికి కూడా అతడు సిద్ధమయ్యాడు.

యెహెజ్కేలు 41

ఆలయ పవిత్ర స్థలం

41 ఆ మనిషి నన్ను మధ్య గదికి (పవిత్ర స్థలం) తీసుకొని వచ్చాడు. అతడు దానికి రెండు ప్రక్కలనున్న గోడలను కొలిచాడు. అవి ప్రతి ప్రక్క పది అడుగుల ఆరంగుళాల మందాన ఉన్నాయి. తలుపు పది మూరల వెడల్పు ఉంది. ద్వారపు ప్రక్క భాగాలు ప్రతి ప్రక్కా ఐదు మూరలు ఉన్నాయి. ఆ మనిషి గదిని కొలిచాడు. అది నలభై మూరల పొడవు, ఇరవై మూరల వెడల్పు ఉంది.

ఆలయ అతి పవిత్ర స్థలం

పిమ్మట ఆ మనిషి లోపలి చివరి గదికి వెళ్లి ద్వారం ప్రక్క గోడలను కొలిచాడు. ప్రతిగోడా రెండు మూరల మందం, ఏడు మూరల వెడల్పు ఉంది. తలుపు మధ్య ఆరు మూరల ప్రవేశ స్థలం ఉంది. తరువాత ఆ మనిషి గది యొక్క పొడవు కొలిచాడు. అది మధ్య గదిలో ప్రవేశించే ఇరవై మూరల పొడవు, ఇరవై మూరల వెడల్పు కలిగి ఉంది. అతను నాతో, “ఇది అతి పవిత్ర స్థలం” అని చెప్పాడు.

ఆలయం చుట్టూవున్న వేరే గదులు

పిమ్మట అతడు ఆలయపు గోడను కొలిచాడు. అది ఆరు మూరల మందం కలిగి ఉంది. ప్రక్క గదులు ఆలయం చుట్టూ ఉన్నాయి. అవి నాలుగు మూరల వెడల్పు. ప్రక్క గదులు మూడు వివిధ అంతస్థులపై ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి అవి ఉన్నాయి. ప్రతి అంతస్థులోను ముప్పయి గదులున్నాయి. ఆలయపు గోడలు రాళ్ళ తిప్పలతో కట్టబడ్డాయి. ప్రక్క గదులకు చుట్టూ గోడ ఆధారం ఉంది. కానీ కేవలం ఆలయం యొక్క గోడే గదులకు ఆధారం కాలేదు. ఆలయం చుట్టూ ఉన్న గదుల ప్రతి అంతస్ధూ దానిక్రింది భాగం కంటె వెడల్పుగా ఉంది. ఆలయం చుట్టూ ఉన్న గదుల గోడలు పైకి పోను పోనూ ఇరుకు కావడం వల్ల పై అంతస్థుల గదులు విశాలంగా ఉన్నాయి. క్రింది అంతస్థు నుండి పై అంతస్థు వరకు మధ్య అంతస్తుగుండా మెట్లదారి ఉంది.

ఆలయానికి చుట్టూ చదును చేసి బండలు పరచిన ఎత్తయిన పునాది ఉన్నట్లు నేను చూశాను. ప్రక్క గదుల పునాదులు పది అడుగుల ఆరంగుళాల ఎత్తున ఉన్నాయి. ప్రక్క గదుల బయటి గోడ ఎనిమిది అడుగుల తొమ్మిది అంగుళాల మందం ఉంది. ఆలయం ప్రక్క గదులకు, యాజకుల గదులకు మధ్య మరియు 10 ఆలయం చుట్టూ ఖాళీ స్థలం ముప్పయి ఐదు అడుగులు. 11 ప్రక్క గదుల వాకిళ్ళు ఎత్తయిన పునాది స్థలం వరకూ ఉన్నాయి. ఒక వాకిలి ఉత్తర దిశగా ఉంటే, మరొకటి దక్షిణ దిశగా ఉంది.

12 ఆలయానికి పడమట నియమిత స్థలంలో ఒక భవనం ఉంది. అది డెభ్బై మూరల వెడల్పు, తొంభై మూరల పొడవు కలిగి ఉంది. ఆ భవనపుగోడ ఆన్ని వైపులా ఐదు మూరల మందం ఉంది. 13 పిమ్మట ఆ మనుష్యుడు ఆలయాన్ని కొలిచాడు. ఆలయం నూరు మూరల పొడవుంది. భవనం, నియమిత స్థలం, దాని గోడలతో కలిసి పొడవు నూరు మూరలున్నాయి. 14 ఆలయం ముందు తూర్పు భాగపు నియమిత స్థలం నూరు మూరల పొడవుంది.

15 ఆలయపు చివరి నియమిత స్థలంలో ఉన్న భవనం పొడవును ఆ మనిషి కొలిచాడు. ఒక గోడకు మరొక గోడకు నూరు మూరలున్నవి.

అతి పవిత్ర స్థలానికి, పవిత్ర స్థలానికి, మండపానికి ఎదురుగా ఉన్న ఆవరణ చుట్టూ మూడింటి గోడలకు నగిషీ పనులు చేసిన కొయ్యపలకలు అన్ని కిటికీలకు, తలుపులకు కొయ్యతో నగిషీలు చెయబడ్డాయి. 16 ఆలయపు గుమ్మం వద్ద క్రింది నుండి కిటికీల వరకు చుట్టూ బల్ల కూర్పువేయబడింది.

17 ఆలయపు లోపలి, బయటి గదుల గోడలలో నగిషీలు చేయబడ్డాయి. ఆలయం యొక్క లోపలి గది గోడల మీద, బయట గది గోడల మీద 18 కెరూబుల, ఖర్జూరపు చెట్ల చిత్రాలు చెక్కబడ్డాయి. కెరూబుల మధ్య ఒక ఖర్జూరపు చెట్టు చొప్పున ఉన్నాయి. ప్రతీ కెరూబునకు రెండు ముఖాలు ఉన్నాయి. 19 ఒకటి మానవ ముఖం ఆకారంలో ఉండి ఒక ప్రక్క నున్న ఖర్జూరపు చెట్టు వైపు చూస్తూ ఉంటుంది. రెండవది సింహపు ముఖం. అది రెండవ ప్రక్కనున్న ఖర్జూరపు చెట్టును చూస్తూ ఉంటుంది. అవి ఆలయం మీద అన్ని చోట్లా చెక్కబడ్డాయి. 20 నేలనుండి తలుపు మీది వరకూ గల పవిత్ర స్థల గోడల మీద కెరూబుల, ఖర్జూరపు చెట్ల చిత్రాలు చెక్కబడ్డాయి.

21 ఆలయపు పవిత్ర స్థలం ఇరు ప్రక్కలనున్న గోడలు చదరంగా ఉన్నాయి. అతి పవిత్ర స్థలం ముందు 22 కొయ్యతో చేయబడిన బలిపీఠం వంటిది ఒకటుంది. అది మూడు మూరల ఎత్తు, రెండు మూరల పొడవు కలిగి ఉంది. దాని మూలలు, దాని అడుగు, దాని ప్రక్కలు అన్నీ కొయ్యతోనే చేయబడ్డాయి. “ఇది యెహోవా ఎదుట ఉండే బల్ల” అని ఆ మనుష్యుడు నాతో ఇలా చెప్పాడు.

23 పవిత్ర స్థలం మరియు అతి పవిత్ర స్థలం రెండింటికీ రెండు తలుపులున్నాయి. 24 తలుపులలో ప్రతి ఒక్కటి రెండు చిన్న తలుపులతో చేయబడింది. ప్రతి తలుపుకి నిజానికి రెండు మడత తలుపులున్నాయి. 25 పవిత్రమైన గది తలుపుల మీద కూడ కెరూబుల, ఖర్జూరపు చెట్ల చిత్రాలు చెక్కబడ్డాయి. అవి గోడల మీద చెక్కిన చిత్రాల మాదిరిగానే ఉన్నాయి. మండపానికి ముందు భాగం చెక్కలతో కప్పబడి ఉంది. 26 మండపం చుట్టూ దాని మేడ మీద గదులలో కొయ్యతో చేయబడ్డ చట్రపు కిటికీలు, మండపానికి ఇరు ప్రక్కల ఖర్జూరపు చెట్లు ఉన్నాయి.

కీర్తనలు. 92-93

సబ్బాతుకోసం స్తుతి కీర్తన.

92 యెహోవాను స్తుతించుట మంచిది.
    సర్వోన్నతుడైన దేవా, నీ నామాన్ని కీర్తించుట మంచిది.
ఉదయం నీ ప్రేమను గూర్చి పాడటం,
    రాత్రివేళ నీ నమ్మకత్వాన్ని గూర్చి పాడటం మంచిది.
దేవా, పదితంత్రుల వాయిద్యాలను స్వరమండల ములను నీ కోసం వాయించటం మంచిది.
    సితారా మీద నీ కోసం సంగీతనాదం చేయటం మంచిది.
యెహోవా, నీవు చేసిన పనుల మూలంగా నిజంగా నీవు మమ్మల్ని సంతోషింపచేస్తావు.
    నీవు చేసిన వాటిని గూర్చి మేము సంతోషంగా పాడుకొంటాం.
యెహోవా, నీవు గొప్ప కార్యాలు చేశావు.
    నీ తలంపులు మేము గ్రహించటం మాకు ఎంతో కష్టతరం.
నీతో పోల్చినట్లయితే మనుష్యులు బుద్ధిలేని జంతువుల్లాంటి వారు.
    మేము ఏదీ గ్రహించలేని బుద్ధిలేని వాళ్లలా ఉన్నాము.
దుర్మార్గులు గడ్డిలా మొలిచినా,
    చెడ్డవాళ్లు అభివృద్ధి చెందినా వారు శాశ్వతంగా నాశనం అవుతారు.
కాని యెహోవా, నీవు శాశ్వతంగా గౌరవించబడతావు.
యెహోవా, నీ శత్రువులు అందరూ నాశనం చేయబడతారు.
    చెడు కార్యాలు చేసే ప్రజలందరూ నాశనం చేయబడతారు.
10 కాని నీవు నన్ను బలపరుస్తావు. బలమైన కొమ్ములుగల పొట్టేలువలె నీవు నన్ను చేస్తావు.
    సేదదీర్చే నీ తైలాన్ని నీవు నా మీద పోశావు.
11 నా శత్రువుల పతనాన్ని నా కండ్లారా చూచాను.
    నా శత్రువుల నాశనాన్ని నా చెవులారా విన్నాను.

12 నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందుతారు.
    వారు లెబానోనులోని దేవదారు వృక్షంలా పెరుగుతారు.
13 మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాటబడిన మొక్కలవలె బలంగా ఉంటారు.
    వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు.
14 వారు వృద్ధులైన తరువాత కూడా ఫలిస్తూనే ఉంటారు.
    వారు ఆరోగ్యంగా ఉన్న పచ్చని మొక్కల్లా వుంటారు.
15 యెహోవా మంచివాడని నేను చెబుతున్నాను.
ఆయనే నా బండ.
    ఆయనలో అవినీతి లేదు.

93 యెహోవాయే రాజు!
    ప్రభావము, బలము ఆయన వస్త్రములవలె ధరించాడు.
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి.
యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది.
    ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి,
పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి.
    కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు.
యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి.
    నీ పవిత్ర ఆలయం ఎల్లకాలం నిలిచి ఉంటుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International