M’Cheyne Bible Reading Plan
షేబ దేశపు రాణి సొలొమోనును దర్శించుట
10 షేబ దేశపు రాణి సొలొమోను ప్రజ్ఞా విశేషాలను గూర్చి విన్నది. జటిలమైన ప్రశ్నలు వేసి అతనిని పరీక్షించాలని ఆమె వచ్చింది. 2 అనేక మంది సేవకులు వెంటరాగా, ఆమె యెరూషలేముకు ప్రయాణమై వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు, బంగారం మొదలైన వాటిని అనేక ఒంటెల మీద ఎక్కించి తనతో తీసుకొని వచ్చింది. ఆమె సొలొమోనును కలిసి, ఆమె ఆలోచించ గలిగినన్ని చిక్కు ప్రశ్నలను వేసింది. 3 సొలొమోను అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పటానికి ఆమె వేసిన ప్రశ్నలలో ఏ ఒక్కటీ అతనికి కష్టమైనదిగా కన్పించలేదు. 4 షేబ దేశపు రాణి సొలొమోను చాలా తెలివైనవాడని తెలుసుకున్నది. అతను నిర్మించిన అతి సుందరమైన రాజభవనాన్ని కూడ ఆమె తిలకించింది. 5 రాజు బల్లవద్ద విలువైన భోజన పదార్థాలను ఆమె చూసింది. రాజు కింది అధికారులు సమావేశమయ్యే తీరు తెన్నులు ఆమె గమనించింది. రాజభవనంలో సేవచేయుటకు, వారు ధరించే మంచి దుస్తులను ఆమె చూసింది. రాజు ఇచ్చే విందులు, ఆయన దేవాలయంలో అర్పించే బలులు కూడా చూసింది. ఇవన్నీ ఆమెకు ఆనందము ఆశ్చర్యము కలుగజేశాయి.
6 కావున రాజుతో రాణి ఇలా అన్నది, “నీవు చేసే పనుల గురించి, నీ ప్రజ్ఞా ప్రభావాల గురించి నేను నా దేశంలో చాలా విన్నాను. నేను విన్నవన్నీ నిజమని తేలింది! 7 నేనిక్కడికి వచ్చి స్వయంగా నా కళ్లతో నేను చూచే వరకు నేను విన్నవన్నీ నిజమని నమ్మలేదు. ఇప్పుడు నేను విన్న దానికంటె ఎక్కువ ఉన్నట్లు చూశాను. నీ తెలివి తేటలు, నీ సిరిసంపదలను గురించి ప్రజలు నాకు చెప్పినదాని కంటె అవి అతిశయించి వున్నాయి. 8 నీ భార్యలు, నీ సేవకులు చాలా అదృష్టవంతులు! వారికి ఎల్లప్పుడూ నిన్ను సేవించే భాగ్యము, నీ తెలివితేటలను వినే అదృష్టము లభించింది! 9 నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక! నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పట్ల నిరంతర ప్రేమగలిగి వున్నాడు. కావుననే ఆయన నిన్ను రాజుగా చేశాడు; నీవు న్యాయమార్గంలో రాజ్యపాలన చేస్తున్నావు.”
10 పిమ్మట షేబ దేశపు రాణి రెండు వందల నలభై మణుగుల[a] బంగారాన్ని, చాలా సుగంధ ద్రవ్యాలను, రత్నాలను రాజుకు కానుకగా సమర్పించింది. ముందెన్నడూ ఎవ్వరూ ఇశ్రాయేలు రాజ్యాలలోకి తేనన్ని సుగంధ ద్రవ్యాలను షేబ దేశపు రాణి సొలొమోనుకు సమర్పించింది.
11 హీరాము యొక్క ఓడలు కూడ ఓఫీరు నుండి బంగారం తీసుకుని వచ్చాయి. ఆ ఓడలు చాలా కలప[b], వజ్రాలు కూడ తీసుకుని వచ్చాయి. 12 ఆ కలపను దేవాలయంలోను, రాజభవనంలోను స్తంభాలు చేయటానికి సొలొమోను ఉపయోగించాడు. గాయకులకు సితారలను, స్వరమండలములను చేయటానికి కూడ ఆ కలపను అతడు ఉపయోగించాడు. ఇశ్రాయేలు లోనికి ఆ రకమైన కలపను ఎవ్వరూ తేలేదు. అప్పటినుండి మళ్లీ ఎవ్వరూ ఆ విధమైన కట్టెను చూడలేదు.
13 సాటి రాజ్యాధినేతకు ఒక రాజు ఎలాంటి కానుకలు ఇస్తాడో, ఆలాగున రాజైన సొలొమోను షేబ దేశపు రాణికి కానుకలు ఇచ్చాడు. పైగా ఆమె అడిగిన ఇతర వస్తువులను కూడా ఆమెకు సమర్పించాడు. ఆ తరువాత రాణి, ఆమె పరివారము తమ దేశానికి వెళ్లి పోయారు.
సొలొమోను గొప్ప సంపద
14 ప్రతి సంవత్సరం సొలొమోనుకు సుమారు ఒకవెయ్యి మూడు వందల ముప్పది రెండు మణుగుల[c] బంగారం వచ్చేది. 15 ఇదిగాక తర్షీషునుండి వచ్చే ఓడలు బంగారం తెచ్చేవి. వ్యాపారస్తుల నుండి, అరబీ రాజులనుండి, మరియు రాజ్యంలో ఇతర ప్రాంతీయ పాలకుల నుండి కూడా రాజుకు బంగారం వచ్చేది.
16 రాజైన సొలొమోను పలకలుగా కొట్టబడిన బంగారంతో రెండు వందల పెద్ద తరహా డాళ్లను చేయించాడు. ప్రతిడాలు ఆరు వందల తులాల[d] బంగారం కలిగి వుండేది. 17 అతడింకా మూడు వందల చిన్న తరహా డాళ్లను కూడా రేకులు గొట్టిన బంగారంతో చేయించాడు. ప్రతిడాలు నూట అరువది తులాల బంగారం కలిగివుంది. రాజు వాటిని “లెబానోను అరణ్యంలోని” విశ్రాంతి గృహములో ఉంచినాడు.
18 రాజైన సొలొమోను ఒక పెద్ద దంతపు సింహాసనాన్ని చేయించాడు. దానికి మేలిమి బంగారు పూత పూయించాడు. 19 సింహాసనం ముందు ఆరుమెట్లు వున్నాయి. ఈ సింహాసనపు వెనుక భాగం పైన గుండ్రంగా వుంది. సింహాసనానికి ఇరువైపులా చేతులు వుంచటానికి ఆధారపు కమ్ములు వున్నాయి. సింహాసనపు చేతులు గాక సింహాల విగ్రహాలు కూడ సింహాసనానికి ఇరుప్రక్కల వున్నాయి. 20 ఆరు మెట్లలో ప్రతి మెట్టుకు రెండు పక్కలా రెండు సింహాల బొమ్మలను పెట్టారు. ఏ ఇతర రాజ్యంలోను ఈ రకంగా సింహాలంకరణ చేసి ఉండలేదు.
21 లెబానోను అరణ్యపు భవనంలో గిన్నెలు, పాన పాత్రలు, పనిముట్లు, ఆయుధాలు, అన్నీ శుద్ధ బంగారంతో చేయబడ్డాయి. భవనంలో ఏదీ వెండితో చేయబడలేదు. సొలొమోను కాలంలో బంగారం ఎంత విరివిగా లభించేదనగా ప్రజలు వెండిని విలువైన లోహంగా అసలు పరిగణించనేలేదు!
22 వ్యాపార నిమిత్తం ఇతర దేశాలకు పంపటానికి సొలొమోనుకు చాలా ఓడలున్నాయి. ప్రతి మూడు నెలలకూ ఓడలు తిరిగి వస్తూవుండేవి. ఆ ఓడల నిండా బంగారం, వెండి, దంతం, పశువులు రాజుకొరకు తేబడేవి.
23 ఈ భూమి మీద సొలొమోను మిక్కిలి ప్రఖ్యాతి గాంచిన రాజు. రాజులందరికంటె అతనికి ధనం, తెలివి తేటలు విశేషంగా ఉన్నాయి. 24 ప్రతి చోట ప్రజలు రాజైన సొలొమోనును చూడాలని ఆరాట పడేవారు. యెహోవా అతనికిచ్చిన మహా జ్ఞానాన్ని వారంతావిని తెలుసుకుని ఆనందించాలని కుతూహలపడేవారు. 25 ప్రతి సంవత్సరం రాజును చూడ్డానికి ప్రజలు వచ్చేవారు. వచ్చిన ప్రతివాడూ ఏదో ఒక కానుక పట్టుకు వచ్చేవాడు. వారు వెండి, బంగారు వస్తువులు, దుస్తులు, ఆయుధాలు, సుగంధ ద్రవ్యాలు, గుర్రాలు, కంచర గాడిదలు మొదలగు వాటిని తెచ్చేవారు.
26 కావున సొలొమోను అనేక రథములను, గుర్రములను కలిగియున్నాడు. అతనికి ఒక వెయ్యి నాలుగు వందల రథములు, పన్నెండు వేల గుర్రములు వున్నాయి. సొలొమోను ప్రత్యేక నగరాలను నిర్మించి ఈ రథాలన్నిటినీ వాటిలో వుంచాడు. కాని రాజైన సొలొమోను కొన్ని రథాలను తనతో యెరూషలేములో వుంచుకున్నాడు. 27 రాజు ఇశ్రాయేలును మిక్కిలి సంపన్న దేశంగా చేశాడు. యెరూషలేము నగరంలో వెండి రాతి గుట్టల్లా, దేవదారు చెక్కల్లా, కొండల్లో, కోనల్లో కాచే మేడి పండ్లలా అతి సామాన్యమై పోయింది. 28 ఈజిప్టు నుంచి, కూషునుంచి సొలొమోను గుర్రములను తెప్పించే వాడు. అతని వర్తకులు వాటిని కూయిలో కొన్ని ఇశ్రాయేలుకు తెచ్చేవారు. 29 ఈజిప్టు నుండి తెచ్చిన రథం ఒక్కటికి ఆరు వందల తులాల వెండి, గుర్రం ఒక్కటికి నూట ఏబది తులాల వెండి చొప్పున చెల్లించేవారు. సొలొమోను గుర్రాలను, రథాలను హిత్తీయుల రాజులకు మరియు అరాము రాజులకు అమ్మెడివాడు.
1 యేసు క్రీస్తు సేవకులైన పౌలు మరియు తిమోతియు, యేసు క్రీస్తులో ఐక్యమై, ఫిలిప్పీ పట్టణంలో నివసిస్తున్న పవిత్రులకు, పెద్దలకు, పరిచారకులకు వ్రాయునది ఏమనగా:
2 మన తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి మీకు అనుగ్రహము, శాంతి లభించును గాక!
కృతజ్ఞత, ప్రార్థన
3 నేను మిమ్మల్ని తలచుకొన్నప్పుడెల్లా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నాను. 4 కనుక మీకోసం ప్రార్థించినప్పుడెల్లా ఆనందంతో ప్రార్థిస్తాను. 5 దైవసందేశం ప్రచారం చెయ్యటానికి మీరు మొదటి రోజు నుండి ఈ రోజుదాకా నాతో కలిసి పని చేసారు. 6 ఈ మంచి కార్యాన్ని మీలో ప్రారంభించినవాడు అది పూర్తి అయ్యేదాకా, అంటే యేసు క్రీస్తు వచ్చేదాకా కొనసాగిస్తాడని నాకు నమ్మకం ఉంది.
7 మీరు నా హృదయంలో ఉన్నారు. కనుక మీ అందర్ని గురించి నేనీవిధంగా ఆలోచించటం సమంజసమే. ఎందుకంటే నేను సంకెళ్ళలో ఉన్నా, లేక సువార్తను ప్రకటిస్తూ దానిలో ఉన్న నిజాన్ని నిరూపిస్తూ, స్వేచ్ఛగా పర్యటన చేస్తున్నా దైవానుగ్రహాన్ని మీరు నాతో కలిసి పంచుకొన్నారు. 8 మీ పట్ల నాకున్న ప్రేమ యేసు క్రీస్తు నుండి వచ్చిందని నేను దైవసాక్షిగా చెపుతున్నాను.
9 ఇదే నా ప్రార్థన:
మీ ప్రేమ అవధులు లేకుండా పెరగాలి, దానితోబాటు మీకు నిజమైన జ్ఞానము, ఆ జ్ఞానంలోని లోతులు తెలుసుకొనే శక్తి కలగాలి. 10 అప్పుడు మీకు మంచి, చెడు విడమరిచే శక్తి కలుగుతుంది. క్రీస్తు వచ్చే వరకు మీరు పవిత్రంగా ఎలాంటి అపవాదులు లేకుండా ఉండగలుగుతారు. 11 మీరు నీతిగా జీవించటంవల్ల ఫలం పొందుతారు. ఆ ఫలం యేసు క్రీస్తు నుండి వచ్చి మీలో నిండిపోతుంది. తద్వారా దేవునికి కీర్తి, స్తుతి కలుగుతుంది.
పౌలు సంకెళ్ళు, సువార్త
12 సోదరులారా! నాకు జరిగిన సంఘటనలు దైవసందేశాన్ని ప్రచారం చేయటానికి తోడ్పడతాయని మీరు గమనించాలి. 13 ఈ సంఘటనలు సంభవించటం వల్ల క్రీస్తు కోసం సంకెళ్ళలో బంధింపబడ్డానని అందరికీ తెలిసిందే. ఇది రాజభవనంలో ఉన్న రక్షకభటులకు కూడా తెలిసిందే. 14 ఈ సంకెళ్ళ మూలంగా, ప్రభువు కారణంగా నా సోదరులైన అనేకులకు దైవసందేశం బోధించటానికి ప్రోత్సాహం కలిగింది. వాళ్ళు ఇంకా ఎక్కువ ధైర్యంతో భయం లేకుండా మాట్లాడగలుగుతున్నారు.
15 కొందరు నాపై అసూయవల్ల పగతో క్రీస్తును గురించి బోధిస్తున్నారు. కాని మరి కొందరు మంచి ఉద్దేశ్యంతో బోధిస్తున్నారు. 16 వీళ్ళు, దైవసందేశాన్ని ప్రకటించటానికి నేనిక్కడ ఉంచబడ్డానని గమనించి ప్రేమతో బోధిస్తున్నారు. 17 మొదట పేర్కొనబడ్డవాళ్ళు స్వార్థంతో, విశ్వాసహీనులై క్రీస్తును గురించి బోధిస్తున్నారు. ఎందుకంటే నేనిక్కడ సంకెళ్ళలో ఉన్నప్పుడు నాకు ఎక్కువ కష్టాలు కలిగించాలని వాళ్ళ ఉద్దేశ్యం. 18 దాని వల్ల కలిగేది ఏమీలేదు. ముఖ్యమైన విషయమేమిటంటే సదుద్దేశాలతో అయితేనేమిటి, దురుద్దేశాలతో అయితేనేమిటి క్రీస్తును గురించి బోధింపబడుతోంది. కనుక నాకు ఆనందంగా ఉంది.
ఔను, నేను యిదే విధంగా ఆనందిస్తూ ఉంటాను. 19 ఎందుకంటే మీ ప్రార్థనవల్ల యేసు క్రీస్తు యొక్క ఆత్మ చేసిన సహాయం వల్ల నేను అనుభవిస్తున్న ఈ కష్టాలే నా విడుదలకు దారితీస్తాయని నాకు తెలుసు. 20 నాకు ఎలాంటి అవమానం కలుగరాదని, నాకు ధైర్యం కలగాలని మనసారా కోరుకొంటున్నాను. ఎప్పటిలాగే యిప్పుడు కూడా క్రీస్తు, నా దేహంలో మహిమ పొందాలని ఆశిస్తున్నాను. ఇది నేను జీవించటంవల్ల సంభవించినా, లేక మరణంవల్ల సంభవించినా నాకు చింత లేదు. 21 ఎందుకంటే, నాకు క్రీస్తే జీవితం. నేను మరణిస్తే, అది కూడా లాభకరమే. 22 నేను ఈ దేహంతో జీవిస్తే దానివల్ల నా శ్రమకు తగిన ఫలం లభిస్తుంది. అయినా నేను ఏది కోరుకోవాలో నాకే తెలియదు. 23 ఈ రెంటి మధ్య నేను నలిగిపోతున్నాను. ఒక విధంగా చూస్తే ఈ దేహాన్ని వదిలి క్రీస్తు సమక్షంలో ఉండాలని అనిపిస్తోంది. ఇది అన్నిటికన్నా ఉత్తమం. 24 కాని యింకొక విధంగా చూస్తే మీ కొరకు నేనీ దేహంతో ఉండటం చాలా అవసరం. 25 ఇది నాకు బాగా తెలుసు. అందువల్ల నేను బ్రతికి ఉండి అందరితో కలిసి విశ్వాసం ద్వారా సంభవిస్తున్న మీ అభివృద్ధి కోసం, ఆనందం కోసం పని చేస్తాను. 26 నేను మళ్ళీ మీతో కలిసి జీవించునప్పుడు మీకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యత కారణంగా యింకా ఎక్కువ గర్విస్తాను.
27 ఏది ఏమైనా క్రీస్తు సువార్తకు తగిన విధంగా జీవించండి. అప్పుడు నేను మిమ్మల్ని చూసినా చూడకపోయినా, మీరు ఒక ఆత్మగా, ఒక మనిషిగా సువార్తవల్ల సంభవించే విశ్వాసంకోసం పని చేస్తున్నారని నేను వినాలి. 28 మీ శత్రువులకు ఏ మాత్రం భయపడకండి. అన్ని వేళలా ధైర్యంగా ఉండండి. అప్పుడు మీరు గెలుస్తారని, తాము ఓడిపోతామని వాళ్ళకు తెలుస్తుంది. ఇది దేవుడు చేసాడు. 29 ఎందుకంటే, క్రీస్తును విశ్వసించే అవకాశమే కాకుండా, ఆయన కోసం కష్టాలు అనుభవించే అవకాశం మీకు కూడా దేవుడు కలిగించాడు. 30 గతంలో నేను సాగించిన పోరాటాన్ని చూసారు. దాన్ని గురించి విన్నారు. మీరు కూడా ఆ పోరాటాన్ని సాగిస్తున్నారు.
నూతన ఆలయం
40 మేము బందీలుగా ఉన్న తరువాత ఇరవై ఐదవ సంవత్సరం ఆదిలో ఆ నెల (అక్టోబరు), పదవ రోజున యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. అంటే ఇది ఆ రోజుకు బబులోను (బాబిలోనియా) వారు యెరూషలేమును వశపర్చుకున్న తరువాత పద్నాలుగు సంవత్సరాలు గడిచాయి. ఒక దర్శనంలో యెహోవా నన్నక్కడికి తీసికొని వెళ్లాడు.
2 ఒక దర్శనంలో దేవుడు నన్ను ఇశ్రాయేలు రాజ్యానికి తీసుకొని వెళ్లాడు. చాలా ఎత్తయిన ఒక పర్వతం దగ్గర ఆయన నన్ను దించాడు. ఆ పర్వతం మీద ఒక నగరంలా కన్పించే ఒక దివ్య భవంతి ఉంది. ఆ నగరం దక్షిణ దిశగా ఉంది. 3 యెహోవా నన్నక్కడికి తీసుకొని వచ్చాడు. అక్కడ ఒక మనిషి ఉన్నాడు. మెరుగుదిద్దిన కంచులా అతడు మెరుస్తున్నాడు. ఆ మనిషి చేతిలో గుడ్డతో చేసిన కొలతతాడు[a] మరియు కొలతబద్ద ఉన్నాయి. అతడు ద్వారం వద్ద నిలబడ్డాడు. 4 ఆ మనిషి నాతో అన్నాడు, “నరపుత్రుడా నీ కళ్లను, చెవులను శ్రద్ధగా ఉపయోగించు. ఈ వస్తువులను చూడు. నేను చెప్పేది విను. నేను చూపించే ప్రతిదాని పట్ల నీవు శ్రద్ధ వహించు. ఎందుకనగా నేను ఇవన్నీ నీకు చూపించే నిమిత్తమే నీవిక్కడకు తేబడ్డావు. నీవు చూసినదంతా ఇశ్రాయేలు వంశం వారికి చెప్పాలి.”
5 ఆలయ ఆవరణ చుట్టూ నేనొక గోడ చూశాను. ఆ మనిషి చేతిలో కొలత బద్ద ఉంది. దాని పొడవు ఆరు మూరలు. ఆ మనిషి గోడ యొక్క మందాన్ని కొలిచాడు. దాని మందం పది అడుగుల ఆరంగుళాలు. తరువాత అతడు గోడ ఎత్తు కొలవగా అది పది అడుగుల ఆరంగుళాలు ఉంది.
6 పిమ్మట ఆ మనిషి తూర్పు ద్వారం వద్దకు వెళ్లాడు. అక్కడ దాని మెట్లెక్కి ద్వారపు గడప వెడల్పు కొలవగా అది పది అడుగుల ఆరంగుళాలు ఉంది. మరియొక గడప వెడల్పు కూడ పది అడుగుల ఆరంగుళాలే ఉంది. 7 అక్కడ ఒక గది ఉంది. దాని పొడవు, వెడల్పులు ఒక్కొక్కటి పది అడుగుల ఆరంగుళాలు. గదుల మధ్య ఖాళీస్థలం ఎనిమిది అడుగుల తొమ్మిది అంగుళాలు ఉంది. లోపలి వైపుకు తిరిగి ఉన్న ముఖ మండపం దిశలో ఉన్న ద్వారం యొక్క గడప వెడల్పు పది అడుగుల ఆరంగుళాలు. 8 ఆలయానికి ప్రక్కనున్న ద్వార ముఖ మంటపాన్ని ఆ మనిషి కొలిచాడు. దాని వెడల్పు పది అడుగుల ఆరంగుళాలు. 9 పిమ్మట అతడు ద్వార మండపాన్ని కొలవగా అది ఎనిమిది మూరలున్నది. ద్వారపు రెండు ప్రక్కలనున్న గోడను కొలిచాడు. ఒక్కొక్క ప్రక్క రెండు మూరల మందం ఉంది. ముఖ మంటపం ద్వారానికి చివర కోవెలదిశగా ఉంది. మండప ద్వారం లోపలి వైపున ఉంది. 10 ద్వారానికి ఇరు వైపుల మూడేసి చిన్న గదులున్నాయి. ఈ మూడు చిన్న గదుల నాలుగు ప్రక్కల గోడలూ ఒకే కొలతలో ఉన్నాయి. ద్వారపు కమ్మెలు రెండు ప్రక్కలా ఒకే కొలతలో ఉన్నాయి. 11 ద్వారపు ప్రవేశ మార్గం పది మూరల వెడల్పు, పదమూడు మూరల నిడివి కలిగి ఉంది. 12 ప్రతి గది ముందు ఒక లోతైన గోడ ఉంది. ఆ గోడ ఎత్తు ఆరు మూరలు. దాని మందం ఆరు మూరలు. గదులు చతురస్రాకారంలో ఉన్నాయి. ప్రతి గోడ ఆరు మూరలపొడుగు కలది.
13 ఆ మనిషి ద్వారపు కొలతలను ఒక గది పైకప్పునుండి ఎదురుగానున్న మరి యొక గది పైకప్పు వరకు కొలిచాడు. అది ఇరవై ఐదు మూరలుంది. 14 అతడు ప్రక్కనున్న గోడల ముందు భాగంతో బాటు, మంటపం ముందున్న ప్రక్క గోడలతో సహా కొలిచాడు. దాని పొడవు మొత్తం అరవై మూరలు. దాని వెడల్పు ముప్పయి అడుగులు. మండపం చుట్టూ ఆవరణ ఉంది. 15 మండపం బయటి ద్వారం నుండి లోపలి ద్వారం వరకు ఏభై మూరలు ఉన్నాయి. 16 కాపలా గదులకు పైన, ప్రక్క గోడల పైన, మంటపం మీద చిన్న కిటికీలు ఉన్నాయి. ఆ కిటికీల పెద్ద భాగాలు ద్వారాన్ని చూస్తున్నాయి. ద్వారానికి ఇరువైపుల ఉన్న గోడల మీద ఖర్జూరచెట్లు చెక్కబడి ఉన్నాయి.
బయటి ప్రాంగణం
17 పిమ్మట ఆ మనుష్యుడు నన్ను బయటి ఆవరణలోకి తీసుకొని వచ్చాడు. అక్కడ గదులు, బాటలు రాళ్ళతో చేయబడ్డ వాటిని చూశాను. గోడలనానుకొని ఉన్న ఆ గదులు బాటకు ఎదురుగా ఉన్నాయి. అవి ఆవరణ చుట్టూ ఉన్నాయి. ముందు భాగంలో చదును చేసిన బాట మీద ముప్పయి గదులున్నాయి. 18 ద్వారం ఎంత పొడవుగా ఉందో చదును బాట కూడ అంత పొడవుంది. ఆ దారి ద్వారపు లోపలికొస వరకు చేరివుంది. ఇది దిగువ చదునుబాట. 19 పిమ్మట ఆ మనుష్యుడు క్రింది ద్వారం నుండి లోపలి ఆవరణ వరకు గల దూరాన్ని కొలిచాడు. అది తూర్పున, ఉత్తరాన నూరు మూరలు ఉంది.
20 ఉత్తర దిశకు ఉన్న వెలుపలి ఆవరణ ద్వారం యొక్క పొడవు వెడల్పులను ఆ మనిషి కొలిచాడు. 21 ఈ ద్వారం దాని రెండు ప్రక్కల ఉండే మూడేసి గదులు దాని ఆవరణ, మొదటి ద్వారం ప్రక్కనే ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై ఐదు మూరలు ఉంది. 22 దాని కిటికీలు, దాని మండపం, ఖర్జూరపు చెట్ల చెక్కడాలు, తూర్పు ద్వారపు కొలతల పనితనం వలెనే ఉన్నాయి. ద్వారం వరకు ఏడు మెట్లున్నాయి. ద్వార మండపం లోపలికి ఉంది. 23 లోపలి ఆవరణలో అడ్డంగా ఉత్తర ద్వారానికి ఎదురుగా ఒక ద్వారం ఉంది. అది తూర్పు ద్వారం వలెనే ఉంది. ఆ మనిషి ఈ లోపలి ద్వారం నుంచి ఆ వెలుపలి ద్వారం వరకు కొలవగా అది ద్వార ద్వారానికి నూరు మూరల వెడల్పు ఉంది.
24 పిమ్మట ఆ మనిషి నన్ను దక్షిణానికి తీసుకొని వెళ్లాడు. అక్కడ నేను దక్షిణ ద్వారం చూశాను. అతడు ద్వారపు కమ్మీలను, మండపాన్ని కొలిచాడు. ఈ కొలతలు ఇతర ద్వారాల కొలతల మాదిరిగానే ఉన్నాయి. 25 ద్వారానికి, మండపానికి చుట్టూ మిగతా వాటి మాదిరే కిటికీలున్నాయి. ద్వారం ఏభై మూరల పొడవు, ఇరవై ఐదు మూరల వెడల్పు ఉంది. 26 ద్వారం వరకు ఏడు మెట్లున్నాయి. దాని మండప ద్వారం లోపల చివర వరకూ ఉంది. ద్వారానికి అటూ ఇటూ ఖర్జూరపు చెట్ల చెక్కడపు పనితనం ఉంది. 27 లోపలి ఆవరణ యొక్క దక్షిణ దిశన ఒక గుమ్మం ఉంది. ఒక ద్వారానికి, మరొక ద్వారానికి మధ్య దూరాన్ని ఆ మనిషి కొలిచాడు. దాని వెడల్పు నూట డెబ్బై ఐదు అడుగులు.
లోపలి ఆవరణం
28 తరువాత నన్నతడు దక్షిణ ద్వారం గుండా లోపలి ఆవరణలోకి తీసుకొని వచ్చాడు. ఇతర గుమ్మాల మాదిరిగానే దక్షిణ ద్వారం కొలతలు కూడ ఉన్నాయి. 29 దక్షిణ ద్వారపు గదులు, దాని ద్వారపు కమ్మీలు, దాని మండపం కొలతలు కూడ ఇతర గుమ్మాల కొలతలవలెనే ఉన్నాయి. ద్వారానికి, మండపానికి చుట్టూ కిటికీలున్నాయి. ద్వారం పొడవు ఏభై మూరలు, వెడల్పు ఇరవై ఐదు మూరలు ఉన్నాయి. లోపలి ఆవరణ చుట్టూ మండపాలున్నాయి. 30 మండపం పొడవు ఇరవై ఐదు మూరలు, వెడల్పు ఐదు మూరలు కలిగి ఉంది. 31 మరియు దాని మండప ద్వారం వెలుపలి ఆవరణ తరువాత ఉంది. దాని ద్వారానికి ఇరు ప్రక్కలనున్న గోడల మీద ఖర్జూరపు చెట్ల చెక్కడపు పనితనం ఉంది. దానిని ఎక్కటానికి ఎనిమిది మెట్లున్నాయి.
32 ఆ మనిషి నన్ను తూర్పు దిశన ఉన్న లోపలి ఆవరణలోనికి తీసుకొని వచ్చాడు. అతడు గుమ్మాన్ని కొలిచాడు. అది ఇతర గుమ్మాల మాదిరే కొలతలు కలిగిఉంది. 33 తూర్పు ద్వారపు గదులు, ప్రక్కగోడలు, మండపం ఇతర ద్వారాల మాదిరే కొలతలు కలిగి ఉన్నాయి. ద్వారానికి, మండపానికి చుట్టూ కిటికీలున్నాయి. ద్వారం పొడవు ఏభై మూరలు, వెడల్పు ఇరవై ఐదు మూరలు కలిగి ఉంది. 34 దాని మండపం ద్వారానికి చివర వెలుపలి ఆవరణ వైపుకు ఉంది. దాని ఇరు ప్రక్కల ఉన్న గోడల మీద ఖర్జూరపు చెట్లు చెక్కబడి ఉన్నాయి. దానికి ఎనిమిది మెట్లున్నాయి.
35 పిమ్మట ఆ మనిషి నన్ను ఉత్తర ద్వారం వద్దకు తీసుకొని వచ్చాడు. అతడు దానిని కొలిచాడు. దీని కొలతలు కూడా ఇతర ద్వారాలవలె ఉన్నాయి. 36 ఇతర ద్వారాల, గదుల, మండపాల కొలతల మేరకే అది కూడా ఉంది. ద్వారం మరియు మండపం చుట్టూ కిటికీలున్నాయి. అది యాభై మూరల పొడవు, ఇరవై ఐదు మూరలు వెడల్పు కలిగి ఉంది. 37 దాని మండపం ద్వారానికి చివర వెలుపలి ఆవరణ వైపున ఉంది. ఆ రెండు గొడల మీద ఖర్జూరపు చెట్లు చెక్కబడ్డాయి. దానికి ఎనిమిది మెట్లున్నాయి.
బలులను సిద్ధపరిచే గదులు
38 ద్వారం వద్ద తలుపువున్న ఒక గది మండపానికి చేరువగా ఉంది. యాజకులు దహన బలులు ఇవ్వటానికి బలి పశువులను కడిగే చోటు ఇదే. 39 ద్వార మండపంలో ప్రతి ప్రక్క రెండు బల్లలున్నాయి. అపరాధ పరిహారార్థ బలులు ఇవ్వటానికి తగిన జంతువులను ఈ బల్లల మీదనే వధిస్తారు. 40 మరియు ద్వార మండపానికి అవతలి ప్రక్కన కూడా రెండు బల్లలున్నాయి. 41 గోడల లోపల నాలుగు బల్లలున్నాయి. గోడల బయట నాలుగు బల్లలున్నాయి. మొత్తం అక్కడ ఎనిమిది బల్లలున్నాయి. ఈ బల్లల మీదనే యాజకులు బలి పశువులను వధిస్తారు. 42 దహన బలుల నిమిత్తం నాలుగు చెక్కిన రాతి బల్లలు ఉన్నాయి. ఈ బల్లలు ఒక్కొక్కటి రెండడుగుల ఏడున్నర అంగుళాల పొడవు; రెండడుగుల ఏడున్నర అంగుళాల వెడల్పు; ఒక అడుగు తొమ్మిది అంగుళాల ఎత్తు కలిగి ఉన్నాయి. దహన బలులకు, ఇతర బలులకు వినియోగించే జంతువులను చంపటానికి తగిన పనిముట్లను యాజకులు ఈ బల్లల మీదనే ఉంచుతారు. 43 మూడంగుళాల మాంసపు కొక్కెములు ఆలయమంతటా ఉంచ బడ్డాయి. అర్పణకు ప్రత్యేకించిన మాంసాన్ని బల్లల మీద ఉంచుతారు.
యాజకుల గదులు
44 లోపలి ఆవరణలోకి వెళ్లే ద్వారం బయట రెండు గదులున్నాయి. ఒకటి ఉత్తర ద్వారం వద్ద ఉంది. అది దక్షిణానికి చూస్తూ ఉంది. రెండవ గది దక్షిణ ద్వారం వద్ద ఉంది. అది ఉత్తరానికి చూస్తూంది. 45 ఆ మనిషి నాతో ఇలా అన్నాడు: “దక్షిణానికి చూసే ఈ గది దేవాలయ సేవలో ఉంటూ పనిమీద ఉన్న యాజకులు ఉండటానికి ప్రత్యేకించబడింది. 46 కాని ఉత్తరానికి చూస్తూవున్న గదిని విధులకు వచ్చి బలిపీఠం వద్ద పనిచేసే యాజకులు ఉండటానికి ఇవ్వబడింది. ఈ యాజకులంతా సాదోకు సంతతివారు. లేవీయులలో సాదోకు సంతతివారు మాత్రమే యెహోవాకు బలులు తెచ్చి సేవచేయటానికి అర్హులు.”
47 ఆ మనుష్యుడు లోపలి ఆవరణను కొలవగా అది ఖచ్చితమైన సమ చదరంగా ఉంది. దాని పొడవు, వెడల్పులు ప్రతి ఒక్కటి నూట డెబ్బై ఐదు అడుగులు ఉంది. బలిపీఠం ఆలయానికి ముందున్నది.
ఆలయ మండపం
48 ఆ మనుష్యుడు నన్ను ఆలయ మండపానికి తీసుకొనివచ్చాడు. అతడు మండపం యొక్క రెండు ప్రక్కలనున్న గోడలను కొలిచాడు. ప్రతి ప్రక్క గోడలు ఐదు మూరల దళం, మూడు మూరల వెడల్పు కలిగి ఉన్నాయి. వాటి మధ్య పద్నాలుగు మూరల స్ధలం ఉంది. 49 మండపం పొడవు పన్నెండు మూరలు, వెడల్పు ఇరవై మూరలు, మండపం చేరటానికి పది మెట్లు ఉన్నాయి. గోడలకు ప్రక్కగా అటు ఒకటి, ఇటు ఒకటి రెండు స్తంభాలున్నాయి.
91 మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు
సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు.
2 “నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.”
అని నేను యెహోవాకు చెబుతాను.
3 దాగి ఉన్న అపాయాలన్నింటి నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
ప్రమాదకరమైన రోగాలన్నింటినుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
4 కాపుదలకోసం నీవు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు.
పక్షి తన రెక్కలతో దాని పిల్లలను కప్పునట్లు ఆయన నిన్ను కాపాడుతాడు.
దేవుడు కేడెంగా, నిన్ను కాపాడే గోడలా ఉంటాడు.
5 రాత్రివేళ నీవు దేనికి భయపడవు.
పగటివేళ శత్రువు బాణాలకు నీవు భయపడవు.
6 చీకటిలో దాపురించే రోగాలకు గాని
మధ్యాహ్నం వేళ దాపురించే వ్యాధులకుగాని నీవు భయపడవు.
7 నీ ప్రక్కన వేయిమంది,
నీ కుడి ప్రక్కన పది వేలమంది శత్రుసైనికులను ఓడిస్తావు.
నీ శత్రువులు నిన్ను కనీసం తాకలేరు.
8 ఊరికే చూడు, ఆ దుర్మార్గులు శిక్షించబడినట్లుగా
నీకు కనబడుతుంది.
9 ఎందుకంటే నీవు యెహోవాను నమ్ముకొన్నావు గనుక.
సర్వోన్నతుడైన దేవుణ్ణి నీ క్షేమ స్థానంగా చేసుకొన్నావు గనుక.
10 కీడు ఏమీ నీకు జరగదు.
నీ ఇంట ఎలాంటి వ్యాధి ఉండదు.
11 ఎందుకంటే నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఎక్కడికి వెళ్లినా వారు నిన్ను కాపాడుతారు.
12 నీ పాదం రాయికి తగులకుండా
దేవదూతలు వారి చేతులతో నిన్ను పైకి ఎత్తుతారు.
13 సింహాల మీద, విషసర్పాల మీద
నడిచే శక్తి నీకు ఉంటుంది.
14 యెహోవా చెబుతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను.
నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.
15 నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు.
నేను వారికి జవాబు ఇస్తాను.
వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.
16 నా అనుచరులకు నేను దీర్ఘాయుష్షు యిస్తాను.
నేను వాళ్లను రక్షిస్తాను.”
© 1997 Bible League International