Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 రాజులు 7

సొలొమోను రాజగృహం

రాజైన సొలొమోను తనకై ఒక రాజభవనం కట్టించాడు. సొలొమోను రాజభవన నిర్మాణానికి పదమూడు సంవత్సరాలు పట్టింది. అతడింకా “లెబానోను అరణ్యపు విశ్రాంతి గృహాన్ని” కూడ ఒకటి కట్టించాడు. అది నూట ఏభై అడుగుల[a] పొడవు, డెబ్బది ఐదు అడుగుల[b] వెడల్పు, మరియు నలభై ఐదు అడుగుల[c] ఎత్తు కలిగివుంది. దానికి నాలుగు వరుసల దేవదారు స్తంభాలు వున్నాయి. వాటి పైన నగిషీ పని చేసిన దేవదారు స్తంభ శీర్షాలు నిలుపబడ్డాయి. స్తంభముల మీద పైకప్పుగా దేవదారు పలకలు పర్చబడ్డాయి. కప్పు భాగానికి నలభై ఐదు దూలాలను పరిచారు. నాలుగు స్తంభాల వరుసల మధ్యనున్న మూడు భాగాలకు ఒక్కొక్క దానికి పదిహేను కొయ్య కడ్డీలు చొప్పున అమర్చబడ్డాయి. ఈ వరుసల మధ్య కిటికీలున్నాయి. అవి ఒకదానికొకటి ఎదురెదురుగా నిర్మింపబడ్డాయి. తలుపులన్నీ చదరంగా వున్నాయి. ప్రతి వరుస చివరనున్న తలుపులు ఒకదానికొకటి ఎదురెదురుగా వున్నాయి.

సొలొమోను “స్తంభాలతో ఒక మండపం” నిర్మించాడు. దాని పొడవు డెభ్బై అడుగులు; వెడల్పు నలభై అడుగులు, స్తంభాల నాధారంగా చేసుకొని మండపానికి ముందు ఒక వసారా వుంది.

సొలొమోను తమ న్యాయ విచారణ జరుపుటకు సింహాసనమున్న ఒక గదిని కట్టించాడు. దానికి “న్యాయసభాస్థలి” అని పేరు పెట్టాడు. ఆ గదంతా కింది నేలనుండి పైకప్పు దూలాల వరకు దేవదారు చెక్కలతో కప్పబడింది.

సొలొమోను నివసించే ఇల్లు ఈ న్యాయ సభాస్థలానికి బాగా వెనుక భాగంలో వుంది. అదే రకమైన మరియొక ఇంటిని తన భార్యకై నిర్మింపజేశాడు. తన భార్య ఈజిప్టు రాజు కుమారై.

ఈ భవనాలన్నీ చాలా ఖరీదైన రాళ్లతో కట్టబడ్డాయి. ఈ రాళ్లన్నీ కావలసిన పరిమాణంలో చెక్కబడి, ప్రత్యేక రంపాలతో కోయబడ్డాయి. ఈ రాళ్లు ముందు వెనుక కోయబడ్డాయి. ఈ ఖరీదైన రాళ్లు పునాదుల నుండి పైవరుస వరకు వేయబడ్డాయి. ఆవరణ గోడలకు, ఆవరణలోను రాళ్లు వాడబడ్డాయి. 10 పునాదులకు ఖరీదైన పెద్ద బండలు వేయబడ్డాయి. కొన్ని బండలు పదిహేను అడుగుల పొడవు గలవి; మరికొన్ని పన్నెండు అడుగుల పొడవుగలవై వున్నాయి. 11 ఈ బండల మీద ఇతర ఖరీదైన రాళ్లు, దేవదారు కట్టెలు వేశారు. 12 భవనపు ఆవరణ, దేవాలయపు ఆవరణ, దేవాలయ సింహద్వారపు గోడలు మూడు వరుసల చెక్కిన రాళ్లతో నిర్మింపబడి వాటి మీద దేవదారు దూలాలు వేయబడ్డాయి.

13 రాజైన సొలొమోను తూరు పట్టణం నుండి హీరాము అను వానిని తన వద్దకు పిలిపించాడు. 14 హీరాము తల్లి నఫ్తాలి వంశానికి చెందిన స్త్రీ. మరణించిన తన తండ్రి తూరు పట్టణపువాడు. హీరాము కంచు పనిలో బహు నేర్పరి. మంచి అనుభవజ్ఞుడు. రాజైన సొలొమోను అతనిని పిలవగా హీరాము అంగీకరించి వచ్చాడు. రాజైన సొలొమోను కంచు పనులన్నిటికీ అతనిని అధిపతిగా చేశాడు. కంచుతో చేసే పనులన్నీ హీరాము నిర్వహించాడు.

15 హీరాము రెండు కంచు స్తంభాలు పోత పోశాడు. ఒక్కొక్కటి ఇరువై ఏడు అడుగుల పొడవు, పద్దెనిమిది అడుగుల చుట్టు కొలత (ఉరవు) కలిగి వున్నాయి. అయితే ఈ స్తంభాల లోపలి భాగం బోలుగా వుంది. స్తంభపు అంచు మందం నాలుగు అంగుళాలు.[d] 16 అతడు రెండు స్తంభ శీర్షాలు[e] కూడా తయారు చేశాడు. అవి ఒక్కొక్కటి ఏడున్నర అడుగుల పొడవున వున్నాయి. ఈ స్తంభశీర్షాలను హీరాము తాను పోతపోసిన స్తంభాలపై నిలిపాడు. 17 పిమ్మట గొలుసులతో వలలవంటి అల్లిక తయారు చేసి స్తంభాల మీద నున్న శీర్షాలను కప్పేలా పైనవేశాడు. 18 దానిమ్మకాయల ఆకారంలో వేలాడే బంతులు గల రెండు కంచు గొలుసులను అతడు తయారు చేశాడు. ఈ కంచు దానిమ్మ కాయల వరుసలను స్తంభశీర్షాల మీదనున్న లోహపు వలలమీద చుట్టాడు. 19 ఈ స్తంభశీర్షాలు ఏడున్నర అడుగుల పొడవున వికసించిన పద్మాకారంలో మలచబడ్డాయి. 20 ఈ స్తంభశీర్షాలు కంచు స్తంభాలమీద పెట్టబడ్డాయి. పాత్ర ఆకారంలో ఉన్న వలలపైన అవి పెట్టబడ్డాయి. ఆ ప్రదేశంలో స్తంభశీర్షం చుట్టూ ఇరవై దానిమ్మ కాయలు గల గొలుసు చుట్టబడింది. 21 ఈ రెండు కంచు స్తంభాలను హీరాము దేవాలయపు మండపం వద్ద నిలబెట్టాడు. ఒక స్తంభం దక్షిణ వైపున, మరొక స్తంభం ఉత్తరవైపున నిలుపబడ్డాయి. దక్షిణ స్తంభానికి యాకీను అని, ఉత్తర స్తంభానికి బోయజు అని పేర్లు పెట్టారు. 22 పుష్పాకారంలో వున్న పీటలు కంచుస్తంభాలపై ఉంచబడ్డాయి. ఆ విధంగా స్తంభ నిర్మాణం పని పూర్తయింది.

23 పిమ్మట హీరాము కంచుతో ఒక గుండ్రని కోనేరు తయారు చేశాడు. (దానిని వారు “సముద్రం” అని పిలిచారు) ఆ సముద్రం సుమారు నలభై ఐదు అడుగుల[f] చుట్టు కొలత కలిగివుంది. ఒక అంచునుండి మరొక అంచు వరకు సముద్రం అడ్డుగా పదిహేను అడుగులు వుంది. దాని లోతు ఏడున్నర అడుగులు. 24 దాని చుట్టు బయటి అంచున ఒక కమ్మి ఉన్నది. ఈ కమ్మి కింద రెండు వరుసల కంచు సొరతీగె పొందుపర్చబడింది. అనగా ఈ కంచు సొరతీగ ఒక్క ముక్కగానే చెరువుతో పాటు ఒకే సారి మలచబడింది. 25 ఈ కోనేటిని పన్నెండు కంచు గిత్తల వీపులపై నిలిపారు. ఈ పన్నెండు గిత్తలు చెరువునుండి బయటికి చూస్తున్నాయి. మూడు ఉత్తరానికి, మూడు తూర్పుకు, మూడు దక్షిణానికి, మరి మూడు పడమరకు చూస్తున్నాయి. 26 కంచు చెరువు అంచుమందం నాలుగు అంగుళాలు. చెరువు అంచు గిన్నె అంచులా, విచ్చిన పూరేకులా వున్నది. ఆ చెరువులో సుమారు తొమ్మిది గరిసెల[g] నీరు పడుతుంది.

27 హీరాము తరువాత పది కంచు తోపుడు బండ్ల వంటివి తయారుచేశాడు. ఒక్కొక్క దాని పొడవు ఆరు అడుగులు (నాలుగు మూరలు), వెడల్పు ఆరు అడుగులు, మరియు ఎత్తు నాలుగున్నర అడుగులు (మూడు మూరలు), 28 వీటి పక్కలు నాలుగు మూలలుగా వున్న కంచు పలకలతో మూయబడ్డాయి. ఆ నాలుగు మూలలుగా వున్న పలకలు చట్రాలతో బిగించబడ్డాయి. 29 ఆ పలకల మీద సింహాలు, గిత్త దూడలు, కెరూబులు చిత్రీకరించబడ్డాయి. ఆ సింహాల, గిత్తల బొమ్మలపై వరుస, కింది వరుసలలో పువ్వుల అలంకరణ కంచులోకి దట్టించి ముద్రించబడింది. 30 ప్రతి బండికి నాలుగు కంచు చక్రాలున్నాయి. చక్రాలకు ఇరుసులున్నాయి. మూలల మీద పెద్ద గిన్నెలు నిలపటానికి కంచు ముక్కల ఆధారం వుంది. ఆ కంచు ఆధారాల మీద పూలు చెక్కబడ్డాయి. 31 ఆ గిన్నెలకు పైన అంచు చుట్టూ చట్రముంది. గిన్నెకు పదునెనిమిది అంగుళాల ఎత్తున అదివుంది. గిన్నె మూతి గుండ్రంగా వున్నది. గిన్నెలోతు ఇరువది ఏడు అంగుళాలు. చట్రం మీద కూడ అలంకరణ చెక్కబడి వున్నది. ఈ చట్రం గుండ్రంగా గాక నాలుగు పలకలుగా వుంది. 32 అడుగు చట్రం కింద నాలుగు చక్రాలున్నాయి. చక్రాలు ఇరవై ఏడు అంగుళాల ఎత్తు వున్నాయి. చక్రాల ఇరుసులు బండితో ఒకే రీతిగా చేయబడ్డాయి. 33 వీటి చక్రాలు రథ చక్రాలను పోలి వున్నాయి. చక్రాలలో ప్రతిదీ వాటి మధ్య కడ్డీలు, అంచులు, చువ్వలు, చక్రపు నడిమి భాగం కంచుతో చేయబడింది.

34 ప్రతి బండికీ నాలుగు మూలలా నాలుగు ఆధారాలున్నాయి. అవన్నీ బండితో పాటు ఒకే రీతిగా చేయబడినవే. 35 ప్రతి బండి చుట్టూ పైభాగాన ఒక బొద్దు వంటి చట్రముంది. అది బండితో కలిసి ఏకంగా చేయబడింది. 36 బండి పక్కన గల కంచు పలకలపై కెరూబుల, సింహాల, తమాల వృక్షాల చిత్రాలు మలచబడ్డాయి. ఎక్కడెక్కడ అవకాశం వున్నదో అక్కడ చిత్రాలు, అలంకరణలు చెక్కబడ్డాయి. చుట్టూ అనేక పుష్పాలు చెక్కబడ్డాయి. 37 ఆ రకంగా హీరాము పది బండ్లను తయారు చేశాడు. ప్రతీదీ కరిగించిన కంచును మూసలో పోత పోశాడు. కావున అన్ని బండ్లు ఒకే పరిమాణంలో, ఒకే ఆకారంలో ఉన్నాయి.

38 హీరాము పిమ్మట పది పెద్ద తొట్లను తయారు చేశాడు. ముందు నిర్మించిన పది బండ్ల మీదికి పది తొట్లను నిర్మించాడు. ప్రతి తొట్టి ఈ అంచు నుండి ఆ అంచు వరకు అడ్డంగా ఆరడుగులు వుంది. ప్రతి తొట్టిలోను ఏడువందల ఇరువది తూముల[h] నీరు పట్టేది. 39 హీరాము ఐదు బండ్లను దేవాలయానికి దక్షిణాన, మిగిలిన ఐదింటిని ఉత్తర భాగాన ఉంచాడు. పెద్ద కోనేటిని దేవాలయానికి ఆగ్నేయ భాగాన నెలకొల్పాడు. 40 హీరాము ఇంకా కొన్ని కుండలను, చిన్నపాటి గరిటెలను, గిన్నెలను తయారు చేశాడు. రాజైన సొలొమోను హీరామును చేయుమని చెప్పిన వన్నీ అతడు పూర్తిచేశాడు. యెహోవా దేవాలయానికై హీరాము చేసిన వస్తువులు ఇవి:

41 రెండు స్తంభాలు;

ఆ రెండు స్తంభాల మీద నున్న స్తంభశీర్షాలకు ఏర్పాటు చేసిన గిన్నెలాంటి పాత్రలు;

స్తంభాల మీది రెండు శీర్షాల కొరకు ఉంచబడిన రెండు గిన్నెలను కప్పటానికి రెండు అల్లికలు;

42 ఆ అల్లికలకు నాలుగు వందల దానిమ్మకాయల బొమ్మలు; రెండు స్తంభాల మీది శీర్షాలకు అమర్చిన గిన్నెలపై గల అల్లికల మీద దానిమ్మకాయల గొలుసును రెండు వరుసల చొప్పున చుట్టారు.

43 పది బండ్లు; వాటిపైన తొట్టెలు;

44 పన్నెండు గిత్తలపై నిల్పిన ఒక పెద్ద కోనేరు;

45 కుండలు, చిన్న పాటి గరిటెలు, గిన్నెలు, యెహోవా దేవాలయానికి కావలసిన తదితర పాత్రలు; మరియు రాజు ఇంటికి నలభై ఎనిమిది స్తంభాలు; రాజైన సొలొమోను కోరినవన్నీ హీరాము తయారు చేసి పెట్టాడు. అవన్నీ మెరుగు దిద్దిన కంచుతో చేయబడ్డాయి.

46 సొలొమోను ఈ వస్తు సామగ్రిని చేయటానికి పట్టిన కంచును తూకం వేయలేదు. అది తూచటానికి అలివికానంత ఉంది. అందువల్ల వారు ఎంత కంచు వాడినది తెలియదు. 47 ఈ కంచు సామగ్రి అంతా రాజు ఆజ్ఞ ప్రకారం యొర్దాను నది దగ్గర సుక్కోతుకు, సారెతానుకు మధ్య చేయబడ్డాయి. ఈ వస్తు సామగ్రినంతా కంచు కరగించి బంక మట్టితో చేసిన మూసలలో పోసి వారు తయారుచేశారు.

48 దేవాలయం కొరకు అనేక వస్తువులు బంగారంతో చేయటానికి కూడ సొలొమోను ఆజ్ఞ ఇచ్చాడు. బంగారంతో దేవాలయానికి సొలొమోను చేయించిన వస్తువులు ఈ విధంగా వున్నాయి:

బంగారు బలిపీఠం;

బంగారపు బల్ల (దేవునికి అర్పించు సముఖపు రొట్టెలు ఉంచడానికి).

49 పది దీప స్తంభాలు: (అతి పరిశుద్ధ స్థలము ముందు కుడిపక్కన ఐదు, ఎడమపక్కన ఐదు ఇవి ఉంచబడ్డాయి)

బంగారు పుష్పాలు, ప్రమిదెలు, పటకారులు;

50 గిన్నెలు; దీపాలను కాంతి కొరకై ఎగదోసే పనిముట్లు;

పాత్రలు; పెనాలు; ధూపం వేయటానికి బొగ్గులు వేసే బంగారు ధూపకలశం; దేవాలయం సింహద్వారపు తలుపులు.

51 ఆ రకంగా రాజైన సొలొమోను కోరుకున్న ప్రకారం యెహోవా దేవాలయంయొక్క పని పూర్తి అయింది. అప్పడు రాజైన సొలొమోను తన తండ్రి దావీదు దేవునికి అంకితం చేసిన వస్తువులన్నీ దేవాలయానికి తెచ్చాడు. దేవాలయపు ధనాగారంలో ఆ వెండి బంగారాలు భద్రపరిచాడు.

ఎఫెసీయులకు 4

క్రీస్తు దేహంలో ఐక్యత

ప్రభువు మిమ్మల్ని పిలిచిన పిలుపు సార్థకమయ్యేటట్లు జీవించమని ప్రభువు యొక్క ఖైదీనైన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని వేళలా విధేయతగా, శాంతంగా ఉండండి. వినయంతో, దయతో, సహనంతో జీవించండి. ఇతర్ల తప్పులను ప్రేమతో క్షమించండి. శాంతి కలిగించిన బంధంతో పరిశుద్దాత్మ యిచ్చిన ఐక్యతను పొందటానికి అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే. ఆ ఒకే నిరీక్షణ యందుండుటకే ఆయన మనలను పిలిచాడు. అదే విధముగా ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఆయనే అందరికి తండ్రి. అందరికి ప్రభువు. అందరిలో ఉన్నాడు. అందరి ద్వారా పని చేస్తున్నాడు.

క్రీస్తు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కృప యివ్వబడింది. అందువల్ల లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది:

“ఆయన పైకి వెళ్ళినప్పుడు బంధితుల్ని వరుసగా తనతో తీసుకు వెళ్ళాడు.
    మానవులకు వరాలిచ్చాడు.”(A)

“ఆయన పైకి వెళ్ళాడు” అని అనటంలో అర్థమేమిటి? ఆయన క్రిందికి, అంటే భూమి క్రింది భాగాలకు దిగి నాడనే అర్థం కదా! 10 క్రిందికి దిగినవాడే ఆకాశములను దాటి పైకి వెళ్ళాడు. ఆ విధంగా పైకి వెళ్ళి సమస్తమును నింపి వేసాడు. 11 పవిత్రుల్ని సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ, దాని వల్ల క్రీస్తు శరీరం అభివృద్ధి చెందాలని ఆయన ఉద్దేశ్యం. 12 అప్పుడు మనము విశ్వాసంతో, దేవుని కుమారుణ్ణి గురించిన జ్ఞానంలో ఒకటిగా ఉంటాము. క్రీస్తులో ఉన్న పరిపూర్ణతను పొందేదాకా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాము. 13 కొందరు అపొస్తలులు కావాలని, కొందరు ప్రవక్తలు కావాలని, కొందరు సువార్తికులు కావాలని, కొందరు సంఘ కాపరులు కావాలని, మరి కొందరు బోధకులు కావాలని ఆదేశించి వాళ్ళకు తగిన వరాలిచ్చాడు.

14 అప్పుడు మనము పసిపిల్లల వలె ఉండము. అలలకు ఇటు అటు కొట్టుకొనిపోము. గాలిలాంటి ప్రతి బోధనకు కదిలిపోము. కపటంతో, కుయుక్తితో పన్నిన మాయోపాయాలకు మోసపోకుండా ఉంటాము. 15 మనము ప్రేమతో నిజం చెబుతూ అన్ని విధాల అభివృద్ధి చెంది శిరస్సైన క్రీస్తును చేరుకోవాలి. 16 శరీరంలోని అన్ని భాగాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. చక్కగా అమర్చబడిన ఆ భాగాలన్నీ కలిసి శరీరానికి ఆధారమిస్తాయి. ఇలా ప్రతీ భాగం తన పని చెయ్యటంవల్ల శరీరం ప్రేమతో పెరిగి అభివృద్ధి చెందుతుంది.

వెలుగు పిల్లలుగా జీవించటం

17 ప్రభువు పేరిట నేను ఈ విషయం చెప్పి వారిస్తున్నాను. ఇక మీదట యూదులు కానివాళ్ళవలే జీవించకండి. వాళ్ళ ఆలోచనలు నిరుపయోగమైనవి. 18 వాళ్ళు చీకట్లో ఉన్నారు. వాళ్ళలో ఉన్న మూర్ఖత కారణంగా వాళ్ళ హృదయాలు కఠినంగా ఉండటం వల్ల వాళ్ళకు దేవుడిచ్చిన జీవితంలో భాగం లభించలేదు. 19 వాళ్ళు మంచిగా ఉండటం మానుకొన్నారు. అంతులేని ఆశతో శారీరక సుఖాలు అనుభవిస్తూ అన్ని రకాల అపవిత్రమైన సుఖాలకు మరిగారు. 20 కాని మీరు క్రీస్తును గురించి నేర్చుకొన్నది యిది కాదు. 21 మీరు యేసును గురించి విన్నారు. ఆయనలో ఉన్న సత్యాన్ని ఆయన పేరిట నేర్చుకొన్నారు. 22 మీ గత జీవితం మిమ్మల్ని పాడు చేసింది. దాన్ని మరిచిపొండి. మీ మోసపు తలంపులు మిమ్మల్ని తప్పు దారి పట్టించాయి. తద్వారా మీ గత జీవితం మిమ్మల్ని నాశనం చేసింది. 23 మీ బుద్ధులు, మనస్సులు మారి మీలో నూతనత్వం రావాలి. 24 దేవుడు తన పోలికలతో సృష్టించిన క్రొత్త మనిషిగా మీరు మారాలి. ఆ క్రొత్త మనిషిలో నిజమైన నీతి, పవిత్రత ఉన్నాయి.

25 మనమంతా ఒకే శరీరానికి చెందిన వాళ్ళము కనుక అబద్ధం చెప్పటం మానుకోవాలి. సత్యమే మాట్లాడాలి. 26 మీరు మీ కోపంలో పాపం చెయ్యకండి. ఒకవేళ కోప్పడినా సూర్యాస్తమయం కాకముందే మీ కోపం తగ్గిపోవాలి. 27 సాతానుకు అవకాశమివ్వకండి. 28 దొంగలు యికమీదట దొంగతనం చెయ్యరాదు. వాళ్ళు తమ చేతుల్ని మంచి పనులు చెయ్యటానికి ఉపయోగించాలి. అప్పుడు వాళ్ళు పేదవాళ్ళకు సహాయం చెయ్యగలుగుతారు.

29 దుర్భాషలాడకండి. ఇతర్ల అభివృద్ధికి తోడ్పడే విధంగా, వాళ్ళకు అవసరమైన విధంగా మాట్లాడండి. మీ మాటలు విన్నవాళ్ళకు లాభం కలగాలి. 30 మీకు విమోచన కలిగే రోజుదాకా మీలో ముద్రింపబడిన దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. 31 మీలో ఉన్న కక్షను, కోపాన్ని, పోట్లాడే గుణాన్ని, దూషించే గుణాన్ని మీ నుండి తరిమివేయండి. మీలో ఎలాంటి చెడుగుణం ఉండకూడదు. 32 దయాదాక్షిణ్యాలు అలవరచుకోండి. దేవుడు క్రీస్తు ద్వారా మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా యితరులను క్షమించండి.

యెహెజ్కేలు 37

ఎండిన ఎముకల దర్శనం

37 యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. దేవుని ఆత్మ (సుడిగాలి రూపంలో) నన్ను నగరం నుండి ఎత్తుకుపోయి ఒక లోయ మధ్యలో దించింది. ఆ లోయ అంతా మానవ అస్థిపంజరాలతో నిండిఉంది. లోయలో భూమిమీద ఎముకలు లెక్కకు మించి పడివున్నాయి. ఆ ఎముకల మధ్యగా యెహోవా నన్ను నడిపించాడు. ఎముకలు బాగా ఎండిపోయి ఉన్నట్లు నేను చూశాను.

నా ప్రభువైన యెహోవా నన్ను, “నరపుత్రుడా, ఈ ఎముకలు తిరిగి ప్రాణం పోసుకోగలవా?” అని అడిగాడు.

“నా ప్రభువైన యెహోవా, ఈ ప్రశ్నకు సమాధానం నీకే తెలుసు” అని నేనన్నాను.

అందుకు నా ప్రభువైన యెహోవా ఇలా అన్నాడు: “ఆ ఎముకలతో నా తరపున మాట్లాడు. వాటికి ఈ విధంగా చెప్పు, ‘ఎండిన ఎముకల్లారా, యెహోవా మాట వినండి! నా ప్రభువైన యెహోవా మీకు ఈ విషయాలు చెపుతున్నాడు: మీలోకి ఊపిరి వచ్చేలా చెస్తాను. మీరు ప్రాణం పోసుకుంటారు! మీమీద మళ్లీ నరాలు, కండరాలు కలుగజేస్తాను. మిమ్మల్ని చర్మంతో కప్పుతాను. పిమ్మట మీలో ఊపిరి పోస్తాను. మీరు బతుకుతారు! అప్పుడు ప్రభువును, యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.’”

ఆయన చెప్పిన రీతిలో నేను యెహోవా తరపున ఎముకలతో మాట్లాడాను. నేను ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఒక పెద్ద శబ్దం విన్నాను. ఎముకలలో గలగల శబ్దం వినవచ్చింది. ఒక ఎముకతో మరొక ఎముక కలవటం మొదలు పెట్టింది! తరువాత నా కళ్ల ముందే వాటిమీద నరాలు, కండరాలు ఏర్పడటం జరిగింది. వాటిమీద చర్మం కప్పివేయటం మొదలయింది. కాని శరీరాలు మాత్రం కదలలేదు. వాటిలో ఊపిరి లేదు.

పిమ్మట నా ప్రభువైన యెహోవా నాతో ఇలా అన్నాడు: “వాయువుతో మాట్లాడు. ఓ నరపుత్రుడా, ఊపిరితో మాట్లాడు. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని ఊపిరితో చెప్పు: ‘ఊపిరి, అన్ని దిశలనుండి నీవు వీచి ఈ శవాలలో జీవంపోయుము! వాటికి ఊపిరి పోయుము; అవి తిరిగి బ్రతుకుతాయి!’”

10 ఆయన చెప్పిన విధంగా నేను యెహోవా తరపున ఆత్మతో మాట్లాడాను. వెంటనే శవాలలోకి ఊపిరి వచ్చింది. వాటికి ప్రాణం వచ్చి లేచి నుంచున్నాయి. అక్కడ ఎంతో మంది మనుష్యులున్నారు. వారంతా ఒక పెద్ద సైన్యం!

11 తరువాత నా ప్రభువైన యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఈ ఎముకలు మొత్తం ఇశ్రాయేలు వంశంలా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు, ‘మా ఎముకలు ఎండిపోయాయి. మా ఆశలు అడుగంటాయి. మేము సర్వనాశనమయ్యాము!’ అని అంటున్నారు. 12 కావున నీవు నా తరపున వారితో మాట్లాడి ప్రభువైన యెహోవా ఈ రకంగా చెపుతున్నాడని తెలుపు, ‘నా ప్రజలారా నేను మీ సమాధులను తెరచి, మిమ్మల్ని బయటికి తెస్తాను! పిమ్మట మిమ్మల్ని ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వస్తాను. 13 నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి, మిమ్మల్ని వాటినుండి బయటకు తెస్తాను! అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. 14 నా ఆత్మను మీలో పెడతాను. దానితో మీరు మళ్లీ జీవిస్తారు. అప్పుడు మిమ్మల్ని మీ స్వదేశానికి తిరిగి నడిపిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. ఈ విషయాలు నేనే చెప్పానని, వాటిని జరిగేలా చేశానని మీరు తెలుసుకుంటారు!’” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.

యూదా, ఇశ్రాయేలు ఏకమవటం

15 యెహోవా వాక్కు నాకు మళ్నీ వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 16 “నరపుత్రుడా, ఒక కట్టెపుల్లను తెచ్చి ఈ వర్తమానం దానిమీద వ్రాయి, ‘ఈ పుల్ల యూదాకు, దాని స్నేహితులైన (తోటివారు) ఇశ్రాయేలీయులకు చెందింది.’ తరువాత మరో పుల్లను తీసుకొని దాని మీద; ‘ఈ ఎఫ్రాయిము పుల్ల యోసేపుకు, అతని స్నేహితులైన (తోటివారు) ఇశ్రాయేలీయులకు చెందింది,’ అని వ్రాయుము. 17 పిమ్మట ఆ రెండు పుల్లలను కలుపుము. నీ చేతిలో ఆ రెండూ ఒక్క పుల్లలా ఉంటాయి.

18 “దీని భావమేమిటని నీ ప్రజలు నిన్నడుగుతారు. 19 ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని వారికి చెప్పు. ‘ఎఫ్రాయిము చేతిలో ఉన్న యోసేపు పుల్లను మరియు అతని స్నేహితులగు ఇశ్రాయేలీయులను నేను తీసుకుంటాను. దానిని యూదా యొక్క పుల్లతో కలిపి ఒక్క పుల్లగా చేస్తాను. నా చేతిలో అవి ఒక్క కట్టె పుల్ల అవుతాయి!’

20 “నీకు ముందుగా వారి కండ్ల ఎదుట ఆ కర్రలను నీ చేతిలో ఎత్తి పట్టుకొనుము. ఆ పేర్లను ఆ కట్టెపుల్లల మీద నీవు వ్రాశావు. 21 నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెపుతున్నాడని అనుము, ‘వారు చెదరిపోయిన దేశాల నుండి ఇశ్రాయేలు ప్రజలను నేను తీసుకొంటాను. అన్ని చోట్ల నుండి వారిని సమావేశపర్చి, వారి స్వంత దేశానికి తిరిగి తిసుకొని వస్తాను. 22 ఇశ్రాయేలు పర్వతం మీద వారిని ఒక్క దేశంగా చేస్తాను. వారందరికి ఒక్కడే రాజు ఉంటాడు. వారు రెండు రాజ్యాలుగా కొనసాగరు. వారిక ఎంతమాత్రం రెండు రాజ్యాలుగా విడిపోరు. 23 వారి విగ్రహాలతోను, భయంకర శిల్పాలతోను, తదితర ఘోరమైన నేరాలతోను వారు తమను తాము మలినపర్చుకోవటం కొనసాగించరు. వారెక్కడున్నా వారి భయంకర పాపాలన్నిటి నుండి వారిని నేను కాపాడుతాను. నేను వారిని కడిగి పవిత్ర పర్చుతాను. వారు నా ప్రజలవుతారు. నేను వారికి దేవుడనై యుంటాను.

24 “‘నా సేవకుడైన దావీదు వారికి రాజుగా ఉంటాడు. వారంతా ఒకే ఒక్క కాపరిని కలిగి ఉంటారు. వారు నా నీతికి, న్యాయానికి బద్ధులై జీవిస్తారు. నేను చెప్పినవన్నీ వారు చేస్తారు. 25 నేను నా సేవకుడైన యాకోబుకు ఇచ్చిన భూమి మీద వారు నివసిస్తారు. నీ పూర్వీకులు ఆ ప్రదేశంలో నివసించారు. నా ప్రజలూ అక్కడే నివసిస్తారు. వారు, వారి పిల్లలు మరియు వారి మనుమలు అక్కడే శాశ్వతంగా నివసిస్తారు. మరియు నా సేవకుడైన దావీదు సదా వారికి రాజై ఉంటాడు. 26 నేను వారితో శాంతి ఒడంబడిక ఒకటి చేసుకుంటాను. ఈ ఒడంబడిక ఎల్లకాలం కొనసాగుతుంది. వారి దేశాన్ని వారికి ఇవ్వటానికి నేను అంగీకరించాను. వారి సంతానం విస్తారమవడానికి నేను అంగీకరించాను. పైగా నా పవిత్ర స్థలాన్ని అక్కడ శాశ్వతంగా వారితో ఉంచటానికి నేను అంగీకరించాను. 27 నా పవిత్ర గుడారం వారి మధ్య అక్కడ ఉంటుంది. అవును, నేను వారి దైవంగా, వారు నా ప్రజలుగా ఉంటాము. 28 మరియు ఇతర దేశాలు కూడ నేను యెహోవానని తెలుసుకుంటాయి. నా పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉంచటం ద్వారా నేను ఇశ్రాయేలీయులను నా ప్రత్యేక జనులుగా చేశానని కూడ వారు తెలుసుకుంటారు.’”

కీర్తనలు. 87-88

కోరహు కుమారుల స్తుతి కీర్తన.

87 యెరూషలేము కొండల మీద దేవుడు తన ఆలయం నిర్మించాడు.
    ఇశ్రాయేలులో ఏ ఇతర స్థలాల కంటె సీయోను ద్వారాలు యెహోవాకు ఎక్కువ ఇష్టం.
దేవుని పట్టణమా, ప్రజలు నిన్ను గూర్చి ఆశ్చర్యకరమైన సంగతులు చెబుతారు.

దేవుడు తన ప్రజలందరిని గూర్చి ఒక జాబితా ఉంచుతున్నాడు. దేవుని ప్రజలు కొందరు ఈజిప్టులోను బబులోనులోను జీవిస్తున్నారు.
    ఆయన ప్రజలు కొందరు ఫిలిష్తీయలో, తూరులో, చివరికి ఇతియోపియాలో జన్మించినట్లు ఆ జాబితా తెలియజేస్తుంది.
సీయోనుగడ్డ మీద జన్మించిన
    ప్రతి ఒక్క వ్యక్తినీ దేవుడు ఎరుగును.
    సర్వోన్నతుడైన దేవుడు ఆ పట్టణాన్ని నిర్మించాడు.
దేవుడు తన ప్రజలు అందరిని గూర్చి ఒక జాబితా ఉంచుతాడు.
    ఒక్కో వ్యక్తి ఎక్కడ జన్మించింది దేవునికి తెలుసు.

దేవుని ప్రజలు ప్రత్యేక పండుగలు ఆచరించుటకు యెరూషలేము వెళ్తారు.
దేవుని ప్రజలు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు.
    “మంచివన్నీ యెరూషలేము నుండి వస్తాయి.” అని వారు అంటారు.

కోరహు కుమారుల స్తుతి కీర్తన. సంగీత నాయకునికి: బాధాకరమైన ఒక వ్యాధిని గూర్చి ఎజ్రాహివాడైన హేమాను ధ్యాన గీతం.

88 యెహోవా దేవా, నీవు నా రక్షకుడవు.
    రాత్రింబగళ్లు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
దయచేసి నా ప్రార్థనలను గమనించుము.
    కరుణకోసం నేను చేస్తున్న ప్రార్థనలు ఆలకించుము.
నా కష్టాలు అన్నింటితో నేను విసిగిపోయాను.
    మరణించుటకు నేను సిద్ధంగా ఉన్నాను.
జీవించుటకు బహు బలహీనుడివలె, చనిపోయిన మనిషివలె
    ప్రజలు నాతో వ్యవహరిస్తున్నారు.
మరణించుటకు నేను ఒంటరిగా విడువబడ్డాను.
    నేను సమాధిలో ఉన్న శవంలా ఉన్నాను.
నీనుండీ, నీ కాపుదలనుండి నీవు వేరుచేసిన మృతులలో ఒకనివలె నేనున్నాను.
    మనుష్యులు వారిని పూర్తిగా మరచిపోతారు.
యెహోవా, నీవు నన్ను భూమి క్రింద సమాధిలో ఉంచావు.
    నీవు నన్ను ఆ చీకటి స్థలంలో ఉంచావు.
నీవు నా మీద కోపగించావు.
    నీవు నన్ను శిక్షించావు.

నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు.
    అంటరాని మనిషిలా వారంతా నన్ను తప్పించి వేస్తారు.
నేను యింటిలో బంధించబడ్డాను, నేను బయటకు వెళ్లలేను.
    నా బాధ అంతటిని గూర్చి ఏడ్చి నా కళ్లు నొప్పిగా ఉన్నాయి.
యెహోవా, నేను ఎడతెగకుండా నిన్ను ప్రార్థిస్తున్నాను.
    ప్రార్థనలో నేను నీకు నా చేతులు జోడిస్తున్నాను.
10 యెహోవా, చనిపోయినవారి కోసం నీవు అద్భుతాలు చేస్తావా? లేదు!
    దురాత్మలు లేచి నిన్ను స్తుతిస్తాయా? లేదు!

11 చనిపోయినవాళ్లు వారి సమాధుల్లో నీ ప్రేమను గూర్చి మాట్లాడలేరు.
    చనిపోయినవారు మృతుల లోకంలో ఉండి నీ నమ్మకత్వం గూర్చి మాట్లాడలేరు.
12 చీకటిలో పడివున్న మృతులు నీవు చేసే అద్భుత కార్యాలు చూడలేరు.
    మరచిపోయిన వారి లోకంలో ఉన్న మృతులు నీ మంచితనం గూర్చి మాట్లాడలేరు.
13 యెహోవా, నాకు సహాయం చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను.
    ప్రతి వేకువ జామునా నేను నిన్ను ప్రార్థిస్తాను.
14 యెహోవా, నీవెందుకు నన్ను విడిచిపెట్టేశావు?
    నానుండి నీ ముఖాన్ని ఎందుకు దాచుకొంటున్నావు?
15 నేను బాలుడిగా ఉన్నప్పటినుండి నేను బలహీనుడను, రోగిని.
    నేను నీ కోపాన్ని అనుభవించాను, నేను నిస్సహాయుడను.
16 యెహోవా, నీవు నా మీద చాలా కోపగించావు.
    శిక్ష నన్ను చంపేస్తుంది.
17 నాకు నొప్పులు, బాధలు ఎల్లప్పుడూ ఉన్నాయి.
    నా నొప్పులు, బాధల్లో నేను మునిగిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది.
18 మరియు యెహోవా, నా స్నేహితులు, నా ప్రియులు అంతా నన్ను విడిచిపెట్టివేసేటట్టుగా నీవు చేశావు.
    చీకటి మాత్రమే నాకు మిగిలింది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International