Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 రాజులు 6

సొలొమోనుచే దేవాలయ నిర్మాణం

ఆ విధంగా సొలొమోను దేవాలయ నిర్మాణం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టులో నుండి వచ్చిన నాలుగు వందల ఎనభై సంవత్సరాల తరువాత ఇది జరిగింది. అంతేగాకుండా ఇది రాజైన సొలొమోను ఇశ్రాయేలుపై రాజ్యాధిపత్యం వహించిన నాలుగవ సంవత్సరం. ఆ సంవత్సరంలో అది జీవ్ అను రెండవ నెల. దేవాలయం పొడవు తొమ్మిది అడుగులు[a] వెడల్పు ముప్పై అడుగులు[b] దాని ఎత్తు నలుబది ఐదు అడుగులు.[c] దేవాలయపు ముఖమండపం పొడవు ముప్పై అడుగులు; వెడల్పు పదిహేను అడుగులు. ఈ మండపం ప్రధాన దేవాలయానికి ముంగిటనే వున్నది. దీని పొడవు దేవాలయం యొక్క వెడల్పుకు సమానంగా వుంది. దేవాలయంలో ఇరుకైన కిటికీలు వున్నాయి. ఈ కిటికీలు చూడటానికి బయటి నుండి ఇరుకుగాను, లోపలి వైపు విశాలంగాను[d] వున్నాయి. పిమ్మట ప్రధాన దేవాలయం గోడల నానుకొని కొన్ని గదులను సొలొమోను కట్టించాడు. ఈ గదులు ఒకదాని మీద ఒకటిగా నిర్మింపబడ్డాయి. కింది అంతస్తులో ఉన్న గదుల వెడల్పు ఏడున్నర అడుగులు[e] మధ్య అంతస్తులో గదుల వెడల్పు తొమ్మిది అడుగులు[f] దాని పైగదుల వెడల్పు పదిన్నర అడుగులు[g] గదులకు ఒక పక్క గోడగా వున్న దేవాలయం గోడ, కింద గదుల గోడకన్న మందము తక్కవ. గదులన్నీ ఆ గోడకు ఆనుకొని కట్టబడినా, వాటి ముఖ్య దూలాలు గోడలోకి చొచ్చుకొని పోకుండా ఆధార శిలలపై పెట్టబడ్డాయి. ఈ దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లన్నీ అవి తీయబడిన గనుల వద్దనే కావలసిన రీతిలో శిల్పులచే చెక్కబడి, మలచబడినందున నిర్మాణ స్థలంలో సుత్తులు, గొడ్డళ్లు, తదితర పనిముట్లు వాడిన శబ్దం వినరాలేదు.

దేవాలయం పక్కగా కట్టిన కింది గదులకు ప్రవేశ మార్గం దక్షిణ భాగాన వున్నది. రెండవ అంతస్తుకు వెళ్లటానికి, అక్కడి నుండి మూడవ అంతస్తు గదులకు వెళ్లటానికి మెట్ల మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి.

దేవాలయపు పైకప్పును దూలాలతోను, దేవదారు చెక్కలతోను సొలొమోను నిర్మింపజేశాడు. ఆ విధంగా సొలొమోను దేవాలయ నిర్మాణం పూర్తి చేశాడు. 10 దేవాలయం పక్కనున్న కింది అంతస్తు పని కూడా పూర్తి చేశాడు. అది ఏడున్నర అడుగుల ఎత్తు వుంది. అది దేవదారు దూలాలతో దేవాలయానికి జత చేర్చ బడివుంది.

11 సొలొమోనుతో యెహోవా ఇలా అన్నాడు: 12 “నీవు నా న్యాయ సూత్రాలను, ఆజ్ఞలను పాటించి నట్లయితే నీ తండ్రియగు దావీదుకు నీ గురించి నేను చేసిన వాగ్దానం నెరవేర్చుతాను. 13 నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య నీవు నిర్మించే ఈ దేవాలయంలో నేను నివసిస్తాను. నేను ఇశ్రాయేలు ప్రజలను ఎన్నటికి విడనాడను.”

14 సొలొమోను దేవాలయ నిర్మాణం పూర్తి చేశాడు. 15 దేవాలయపు లోపలి పక్క గోడలకు దేవదారు బల్లలు అమర్చబడ్డాయి. కింది నేల భాగం సరళపు మ్రాను చెక్కలతో కప్పబడింది. 16 ముప్పై అడుగుల పొడవు గల ఒక గది దేవాలయానికి వెనుకగా కట్టబడింది. కింది నుంచి కప్పు వరకు అమర్చబడిన దేవదారు చెక్కల పనితనంతో ఈ గది దేవాలయం నుండి వేరు చేయబడింది. ఈ గదికి అతి పవిత్ర స్థలమని పేరు. 17 ఈ మిక్కిలి పరిశుద్ధ స్థలం ముందున్నగది అరువది అడుగుల పొడవు గలిగివున్నది. 18 ఆ దేవదారు చెక్కలపై వికసించిన పువ్వులు, సొర తీగలు[h] మనోహరంగా చెక్కబడ్డాయి. ఆ గది లోపలి భాగమంతా దేవదారు పలకలతో కప్పబడింది. అందువల్ల ఎవ్వరూ గోడ రాళ్లను చూడలేరు.

19 ఆలయ ప్రాంగణానికి వెనుక వున్న ఈ అతి పరిశుద్ధ స్థలము దేవుని ఒడంబడిక పెట్టె వుంచటానికి నిర్మింపబడింది. 20 ఈ అతి పరిశుద్ధ స్థలము ముప్పై అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పు ముప్పై అడుగుల ఎత్తు కలిగివుంది. 21 సొలొమోను ఈ అతి పరిశుద్ధ స్థలము లోపలి భాగమంతా శుద్ధ బంగారంతో పొదిగించాడు. ఈ గదికి ముందు బంగారంతో పొదగబడిన ఒక బలిపీఠం నిర్మించబడింది. దాని చుట్టూ బంగారు గొలుసులు చుట్టబడ్డాయి. కెరూబులు రెండూ బంగారు రేకులతో కప్పబడ్డాయి. 22 దేవాలయం మొత్తం బంగారంతో పొదగబడింది. అతి పరిశుద్ధ స్థలము వద్దగల పీఠం కూడా బంగారంతో పొదగబడింది.

23 పనివారు కెరూబులను రెక్కలతో తయారు చేశారు. అవి ఒలీవ కర్రతో చేయబడ్డాయి. ఈ కెరూబులను అతి పరిశుద్ధ స్థలములో వుంచారు. ప్రతి ఒక్క దేవదూత పదిహేను అడుగుల పొడవు వున్నది. 24-26 రెండు కెరూబులు ఒకే పరిమాణంలో, ఒకే రకంగా నిర్మించబడ్డాయి. ప్రతి కెరూబుకీ రెండు రెక్కలున్నాయి. ప్రతి రెక్క ఏడున్నర అడుగుల పొడవుంది. ఒక రెక్క చివరి నుండి మరో రెక్క చివరి వరకు గల మధ్య దూరం పదిహేను అడుగులు. ప్రతి కెరూబు పదిహేను అడుగుల పొడవులో మలచబడింది. 27 ఈ కెరూబులు అతి పరిశుద్ధ స్థలములో పక్కపక్కన నిలబెట్టబడ్డాయి. గది మధ్యలో వారి రెక్కలు ఒక దానితో ఒకటి కలిశాయి. మిగిలిన రెండు రెక్కలు ఆ పక్కగోడ నొకటి ఈ పక్క గోడ నొకటి ఆనుకొని వున్నాయి. 28 రెండు కెరూబులు బంగారంతో పొదగబడ్డాయి.

29 అతి పరిశుద్ధ స్థలము చుట్టూవున్న గోడల మీద, లోపల గదుల గొడల మీద కెరూబులు, తమాల వృక్షాలు, పువ్వులు చిత్రీకరింపబడ్డాయి. 30 అతి పరిశుద్ధ స్థలము, దేవాలయ ప్రాంగణ గది నేలలు బంగారు రేకులతో కప్పబడ్డాయి.

31 అతి పరిశుద్ధ స్థలానికి తలుపులు ఏర్పరచ బడ్డాయి. ఆ తలుపులు ఒలీవ కర్రతో చేయబడ్డాయి. తలుపు ఐదు రకాలుగా[i] తిరిగే విధంగా ఐదు ముఖముల నిలువు కమ్మికి అమర్చబడింది. 32 రెండు తలుపులూ ఒలీవ కర్రతో చేయబడినవే. తలుపుల మీద కెరూబుల, తమల వృక్షాల, పువ్వుల చిత్రాలు మలచబడ్డాయి. తలుపులు బంగారంతో పొదగబడ్డాయి.

33 ప్రధాన గది ద్వారానికి ఒలీవ కర్రతో చేయబడిన చదరపు తలుపు అమర్చబడింది. 34 దాని రెండు తలుపులు సరళపు చెక్కలతో చేయబడ్డాయి. 35 ప్రతి తలుపూ రెండు భాగాలుగా చేయబడింది. దానివల్ల రెండేసి భాగాలు మూయటానికి వీలవుతుంది. తలుపుల మీద కెరూబులు, తమాల వృక్షాలు, పూవులు చెక్క బడ్డాయి. ఈ చెక్కడాలన్నిటి పైన బంగారు పూత వేయబడింది.

36 తరువాత లోపలి ఆవరణం సిద్ధం చేయబడింది. పెరడు చుట్టూ గోడ నిర్మాణం జరిగింది. ఈ గోడలు చెక్కిన మూడు రాళ్ల వరుసతో నిర్మింపబడి, వాటికి ఒక వరుసలో దేవదారు చెక్క అమర్చబడింది.

37 ఆ సంవత్సరంలో దేవాలయ నిర్మాణం పని రెండవ నెలలో ప్రారంభించబడింది. ఆ నెల పేరు జీవ్. అది సొలొమోను ఇశ్రాయేలును పాలించటం మొదలు పెట్టిన పిమ్మట నాలుగవ సంవత్సరం. 38 సొలొమోను పాలన పదకొండు సంవత్సరాలు సాగేనాటికి దేవాలయ నిర్మాణం పూర్తయింది. పూర్తి అయ్యేనాటికి ఆ సంవత్సరంలో బూలు అనే ఎనిమిదవ నెల జరుగుతూ వుంది. దేవాలయ నిర్మాణం పథకం ప్రకారం పూర్తయింది. దేవాలయ నిర్మాణ పరిసమాప్తికి సొలొమోను ఏడు సంత్సరాలు కృషి చేశాడు.

ఎఫెసీయులకు 3

పౌలు యూదులు కానివాళ్ళకు బోధించుట

అందువల్ల యూదులుకాని మీ కోసం పౌలు అను నేను, యేసు క్రీస్తు ఖైదీని అయ్యాను. దేవుడు నన్ను అనుగ్రహించి మీకోసం ఈ పని నాకు అప్పగించినట్లు మీరు తప్పకుండా వినే వుంటారు. ఈ రహస్యం నాకు తెలుపబడినట్లు నేను యిదివరకే క్లుప్తంగా మీకు వ్రాసాను. క్రీస్తును గురించి రహస్య జ్ఞానం నాకు అర్థమైనట్లు నేను వ్రాసింది చదివితే మీకు తెలుస్తుంది. ఈ రహస్య జ్ఞానాన్ని దేవుడు మన పూర్వికులకు ఇవ్వలేదు. ఇప్పుడా రహస్య జ్ఞానాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులైన అపొస్తలులకు, ప్రవక్తలకు తెలియచేసాడు. ఆ రహస్యం ఏమిటంటే, సువార్తవల్ల యూదులు కానివాళ్ళు ఇశ్రాయేలువాళ్ళతో సహా వారసులౌతారు. వాళ్ళు ఒకే శరీరానికి సంబంధించిన అవయవాలు. అంతేకాక దేవుడు యేసు క్రీస్తు ద్వారా చేసిన వాగ్దానానికి వాళ్ళు భాగస్తులు. ఇది సువార్త వల్ల సంభవిస్తోంది.

దేవుడు తన శక్తిని నాపై ఉపయోగించి తన అనుగ్రహాన్ని నాకు వరంగా ప్రసాదించటం వల్ల నేను ఈ సువార్తకు దాసుణ్ణయ్యాను. దేవుని ప్రజలందరిలో నేను అధముణ్ణి. అయినా దేవుడు నాకీవరం ప్రసాదించాడు. క్రీస్తులో ఉన్న అనంతమైన ఐశ్వర్యాన్ని గురించి యూదులు కానివాళ్ళకు బోధించే అవకాశం నాకిచ్చి నన్ను అనుగ్రహించాడు. అన్నిటినీ సృష్టించిన దేవుడు తరతరాల నుండి తనలో దాచుకొన్న ఈ రహస్య ప్రణాళికను ప్రతి ఒక్కరికీ స్పష్టం చేయమని నాకు అప్పగించాడు. 10 భూమండలంలో ఉన్న పాలకులకు, అధికారులకు సంఘం ద్వారా అన్నిటిలో అతీతుడైన దేవుని జ్ఞానాన్ని తెలియచేయాలని ఆయన ఉద్దేశ్యం. 11 దేవుడు యిలా చెయ్యాలని కాలానికి ముందే అనుకున్నాడు. ఆ అనుకొన్న దాన్ని ఇప్పుడు మన యేసు క్రీస్తు ద్వారా సాధించాడు. 12 క్రీస్తుతో మనకు కలిగిన ఐక్యతవల్ల మరియు ఆయనలో మనకున్న విశ్వాసం వల్ల మనము దేవుని సమక్షంలో ధైర్యంగా సంపూర్ణమైన స్వేచ్ఛతో నిలబడగలుగుతున్నాము. 13 మీ కోసం నేను కష్టాలు అనుభవిస్తున్నందుకు అధైర్యపడకండి. ఇది నా విజ్ఞప్తి. నా కష్టాలవల్ల మీకు గౌరవం లభిస్తుంది.

ఎఫెసీయుల కోసం ప్రార్థన

14 ఈ కారణాన నేను తండ్రి ముందు మోకరిల్లుచున్నాను. 15 కనుక భూలోకంలో, పరలోకంలో ఉన్న విశ్వాసులందరు ఆయన పేరులో ఒకే కుటుంబముగా జీవిస్తున్నారు. 16 ఆయన తన అనంతమైన మహిమతో పరిశుద్ధాత్మ ద్వారా శక్తినిచ్చి ఆత్మీయంగా బలపరచాలని వేడుకొంటున్నాను. 17 అప్పుడు క్రీస్తు మీలో విశ్వాసం ఉండటం వల్ల మీ హృదయాల్లో నివసిస్తాడు. మీ వేర్లు ప్రేమలో నాటుక పోయేటట్లు చేయమనీ, మీ పునాదులు ప్రేమలో ఉండేటట్లు చేయమనీ ప్రార్థిస్తున్నాను. 18 అప్పుడు మీరు పవిత్రులతో సహా క్రీస్తు ప్రేమ ఎంత అనంతమైనదో, ఎంత లోతైనదో అర్థం చేసుకోకలుగుతారు. 19 జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని దేవునిలో ఉన్న పరిపూర్ణత మీలో కలగాలని నా ప్రార్థన.

20 దేవుడు మనమడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువే యివ్వగలడు. ఇది మనలో పని చేస్తున్న ఆయన శక్తి ద్వారా సంభవిస్తోంది. 21 సంఘంలో యేసు క్రీస్తు ద్వారా దేవునికి చిరకాలం శాశ్వతమైన మహిమ కలుగుగాక! ఆమేన్.

యెహెజ్కేలు 36

ఇశ్రాయేలు దేశం పునరుద్ధరించబడుతుంది

36 “నరపుత్రుడా, నా తరపున ఇశ్రాయేలు పర్వతాలతో మాట్లాడు. యెహోవా మాట ఆలకించమని ఇశ్రాయేలు పర్వతాలకు చెప్పు! ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని వారికి తెలియజేయుము. శత్రువు నిన్ను గురించి చెడ్డ విషయాలు ప్రచారం చేశాడు. ‘ఆహా! ఆ పురాతన పర్వతాలు ఇక మనవే!’” అని వారు అనుకొన్నారు.

“కావున ఇశ్రాయేలు పర్వతాలతో నా తరపున మాట్లాడుము. ప్రభువైన యెహోవా ఈ విషయాలు తెలుపుతున్నాడని వాటితో చెప్పుము. శత్రువు నిన్ను నిర్మానుష్యం చేశాడు. అన్ని వైపుల నుండి వారు నిన్ను చితుకదొక్కారు. నిన్ను అన్యదేశాల పాలు చేయటం కొరకే వారా విధంగా చేశారు. పిమ్మట ప్రజలు నీగురించి గుసగుసలు మొదలు పెట్టారు.”

కావున ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా సందేశాన్ని వినండి! ప్రభువైన యెహోవా దీనిని పర్వతాలకు, కొండలకు, నదులకు, లోయలకు, శిథిలాలకు మరియు పాడుబడిన నగరాలకు చెపుతున్నాడు, నీ చుట్టూ ఉన్న దేశాల వారిచే నీవు దోచుకోబడి, ఎగతాళి చేయబడ్డావు. “నా తీవ్రమైన భావాలను ఇప్పుడు నిజంగా వ్యక్తం చేస్తున్నాను! ఎదోము, తదితర దేశాలు నా కోపాన్ని చవి చూసేలా చేస్తాను. ఎదోమీయులు నా భూమిని తమ స్వంతం చేసుకున్నారు. వాళ్ళు బాగా సంతోషంగా అనుభవించారు. వారా విధంగా సంతోషంతో ఉన్నప్పుడు ఈ భూమిని ఎలా అసహ్యించు కొనేవారో తెలిపారు. వారు ఈ భూమిని నాశనం చేసి దాన్ని స్వాధీన పరచుకోదలిచారు.”

కావున నా ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు దేశమును గూర్చి ఈ విషయాలు చెపుతున్నాడు: “నా తరపున ఇశ్రాయేలు దేశ భూభాగంతో మాట్లాడు. పర్వతాలతోను, కొండలతోను, నదులతోను మరియు లోయలతోను మాట్లాడు. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని వారికి తెలియజేయుము. నా తీవ్రమైన భావాలను, కోపాన్ని వ్యక్తం చేస్తాను. నీవు ఆ ప్రజల నుండి అవమానాలను భరించావు గనుక నేను నా కోపాన్ని వ్యక్తం చేస్తాను.”

నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నీ చుట్టూ ఉన్న దేశాలు అవమానాలు భరించ వలసి ఉంటుందని నేను ప్రమాణం చేసి చెపుతున్నాను.

“ఇశ్రాయేలు పర్వతములారా, నా ఇశ్రాయేలు ప్రజల కొరకు మీరు క్రొత్త చెట్లు పెంచి, పండ్లను పండిస్తారు. నా ప్రజలు వెంటనే తిరిగివస్తారు. నేను మీతో ఉన్నాను. నేను మీకు సహాయపడతాను. ప్రజలు నేలను దున్నుతారు. ప్రజలు మీలో విత్తనాలు నాటుతారు. 10 మీమీద అనేకానేక మంది ప్రజలు నివసిస్తారు. ఇశ్రాయేలు వంశమంతా అక్కడ నివసిస్తుంది. నగరాలు మళ్లీ ప్రజలతో కళకళలాడుతాయి. నాశనం చేయబడిన స్థలాలన్నీ నూతనంగా నిర్మింపబడతాయి. 11 అనేక మంది ప్రజలను, జంతువులను నేను మీకిస్తాను. వారికి చాలా మంది పిల్లలు పుడతారు. పూర్వం మాదిరి ఇతరులు మీపై ఆదారపడి నివసించేలా మీకు సదుపాయం కలుగజేస్తాను. ముందుకంటె ఇప్పుడు మీరు ఇంకా బాగుండేటట్లు చేస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. 12 అవును, నా ప్రజలైన, ఇశ్రాయేలీయులను ఈ భూమి వద్దకు నడిపిస్తాను. వారు మిమ్మల్ని వశపర్చుకుంటారు. మీరు వారి సొత్తు అవుతారు. మరెన్నడూ వారికి పిల్లలు లేకుండా మీరు చేయలేరు.”

13 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఇశ్రాయేలు దేశమా! ప్రజలు నీవు చెడ్డపనులు చేశావని అంటారు. నీ ప్రజలను నీవే నాశనం చేశావని వారంటారు. నీవు పిల్లలను ఎత్తుకు పోయావని వారు చెపుతారు. 14 కాని నీవు ప్రజలను ఇక ఎంతమాత్రం నాశనం చేయవు. వారి పిల్లలను ఎంతమాత్రం నీవు తీసుకొనవు.” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు. 15 “అన్యదేశాలు ఇక ఎంతమాత్రం నిన్ను అవమానపర్చనివ్వను. వారిచే ఇక నీవు బాధించబడవు. నీవు నీ పిల్లలను ఇకమీదట పోగొట్టుకోవు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

యెహోవా తన పేరును కాపాడుకోవటం

16 పిమ్మట యెహోవా వాక్కు నావద్దకు వచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 17 “నరపుత్రుడా, ఇశ్రాయేలు వంశం వారు తమ స్వంత భూమిలో నివసించారు. కాని వారు చేసిన చెడు పనులతో ఆ దేశాన్ని వారు మలినపర్చారు. వారు నా దృష్టిలో నెలసరి వచ్చే మైల రక్తంతో అపరిశుభ్రంగా ఉన్న స్త్రీలవలె ఉన్నారు. 18 ఆ రాజ్యంలో వారు ప్రజలను హత్యచేసి భూమిమీద రక్తం చిందించారు. వారి విగ్రహాలతో దేశాన్ని వారు మలినపర్చారు. అందుచే నేనెంత కోపంగా ఉన్నానో నేను వారికి చూపించాను. 19 నేను వారిని వివిధ ప్రజల మధ్యకు చెదరగొట్టి అన్ని భూభాగాలలోకి పంపిన కారణంగా వారు ఆయా దేశాలలో ఉండి పోయారు. వారి వారి చెడు కార్యాలను అనుసరించి నేను వారిని శిక్షించాను. 20 వారు అన్యదేశాలకు వెళ్లారు. ఆయా దేశాలలో కూడ వారు నా మంచి పేరును పాడుచేశారు. ఎలాగనగా, ఆ దేశస్థులు కూడ వీరిని గురించి మాట్లాడారు. ‘యెహోవా ఎటువంటి దేవుడు? వీరు యెహోవా ప్రజలు. అయినా వీరు తమ దేశాన్ని వదిలి వచ్చారు’ అని వారన్నారు.

21 “ఇశ్రాయేలు ప్రజలు నా పవిత్ర నామాన్ని పాడు చేశారు. నా పేరు విషయంలో నేను బాధపడ్డాను. 22 కావున ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని ఇశ్రాయేలు వంశానికి చెప్పు, ‘ఇశ్రాయేలు వంశీయులారా, మీరు వెళ్లిన ప్రతిచోటా నా పవిత్ర నామాన్ని పాడుచేశారు. దీనిని ఆపటానికి నేనేదైనా చేయదలిచాను. ఇశ్రాయేలూ, అది నేను నీ కొరకు మాత్రం చేయను. నా పవిత్ర నామం కొరకు నేను ఆ పని చేస్తాను. 23 గొప్పదైన నా పేరు నిజంగా పవిత్రమైనదని నేను ఆ ప్రజలకు నిరూపిస్తాను. మీరు నా పేరును గౌరవించేటట్లు చేస్తాను. నా మంచి పేరును ఆ దేశాలలో మీరు పాడుచేశారు! కాని నేను పవిత్రుడనని మీకు నిరూపిస్తాను. అప్పుడు ఆ ప్రజలంతా నేనే యెహోవానని తెలుసుకుంటారు.’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

24 దేవుడు ఇలా అన్నాడు, “ఆయా రాజ్యాలనుండి మిమ్మల్ని బయటకు తీసి, ఒక్క చోటికి సమీకరించి మీ స్వంత దేశానికి తీసుకొనివస్తాను. 25 పిమ్మట మీ మీద పరిశుద్ధ జలాన్ని చల్లి మిమ్మల్ని పవిత్రులనుగా చేస్తాను. మీ మురికినంతటిని కడిగివేస్తాను. ఆ విగ్రహాలనుండి వచ్చిన మురికిని నేను కడిగివేస్తాను.” 26 దేవుడు ఇలా అన్నాడు: “మీలో సరిక్రొత్త ఆత్మను పెడతాను. మీ ఆలోచనా సరళి మార్చుతాను. మీ శరీరం నుండి రాతి గుండెను తొలగించి సున్నితమైన మానవ హృదయాన్ని ఇస్తాను. 27 మీలో నా ఆత్మను ప్రవేశపెడతాను. మీరు నా కట్టడులను పాటించేలా మిమ్మల్ని నేను మార్చుతాను. మీరు నా ఆజ్ఞలను జాగ్రత్తగా పాటిస్తారు. 28 పిమ్మట మీ పూర్వీకులకు నేనిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజలవుతారు. నేను మీ దేవుడనవుతాను.” 29 దేవుడు ఇలా చెప్పాడు: “నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీరు మలినపడకుండా ఉంచుతాను. ధాన్యం (సమృద్ధిగా) పండేలా నేను ఆజ్ఞ ఇస్తాను. మీ మీదికి కరువును రప్పించను. 30 మీ చెట్ల నుండి ఫలసంపద పుష్కలంగా వచ్చేలా చేస్తాను. మీ పొలాలను బహుగా పండిస్తాను. అన్య దేశాలలో మరెన్నడూ మీరు ఆకలి బాధల అవమానాన్ని అనుభవించరు. 31 మీరు చేసిన చెడు కార్యాలను మీరు గుర్తుకు తెచ్చుకుంటారు. మీరు చేసినవి మంచి పనులు కావని తెలుసుకునే జ్ఞానం మీకు కలుగుతుంది. మీరు చేసిన పాపాలకు, మీరు పాల్పడిన భయంకర కృత్యాలకు మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు.”

32 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను, మీ మంచి కొరకు నేనీ పనులేవీ చేయటం లేదు! నా మంచి పేరు నిలుపుకోటానికే వాటిని నేను చేస్తున్నాను! కావున ఇశ్రాయేలు వంశమా, మీరు జీవించిన తీరుకు మీరు సిగ్గుపడి, కలత చెందాలి!”

33 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “నేను మీ పాపాలను కడిగివేసే రోజున ప్రజలను మీ నగరాలకు తీసుకొని వస్తాను. పాడుబడ్డ నగరాలు తిరిగి నిర్మించబడతాయి. 34 బీడు భూములు సాగుచేయబడతాయి. అది దారిన పోయే వారికి కేవలం శిథిలాల గుట్టలా కన్పించదు. 35 ‘గతంలో ఈ దేశం నాశనమయింది. అది ఇప్పుడు ఏదెను ఉద్యానవనంలా రూపు దిద్దుకున్నది. నగరాలు నాశనం చేయబడ్డాయి. అవి పాడుబడి నిర్మానుష్యమైనాయి. కాని ఇప్పుడవి రక్షిత నగరాలైనవి. వాటిలో ప్రజలు ఇప్పుడు నివసిస్తున్నారు అని వారు చెప్పుకుంటారు.’”

36 దేవుడు ఇలా చెప్పాడు: “నీ చుట్టూ ఉన్న దేశాలు నేను యెహోవాననీ, ఆ పాడైపోయిన ప్రాంతాలను పునరుద్ధరించాననీ తెలుసుకుంటాయి. ఖాళీగా ఉన్న ఈ నేలలో నేను మొక్కలు నాటాను. నేనే యెహోవాను. నేనే ఈ విషయాలను చెప్పాను. అవి జరిగేలా చేస్తాను.”

37 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “ఇశ్రాయేలు వంశం వారు ఇలా జరిగేలా చేయమని నన్ను అడిగేలా కూడ చేస్తాను. వారి సంతానాన్ని బహుగా అభివృద్ధి చేస్తాను. వారు గొర్రెల మందల్లా విస్తరిస్తారు. 38 యెరూషలేములో ప్రత్యేక పండుగల సందర్భంగా తేబడే గొర్రెల, మేకల మందల్లా ఆ ప్రజలు విస్తారంగా ఉంటారు. నగరాలు, పాడుబడిన ప్రాంతాలు తిరిగి జనసందోహాలతో కిటకిటలాడుతాయి. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.”

కీర్తనలు. 86

దావీదు ప్రార్థన.

86 నేను నిరుపేదను, నిస్సహాయుణ్ణి.
    యెహోవా, దయతో నా మాట విని నా ప్రార్థనకు జవాబు ఇమ్ము.
యెహోవా, నేను నీ అనుచరుడను. దయతో నన్ను కాపాడు.
    నేను నీ సేవకుడను. నీవు నా దేవుడవు.
    నేను నిన్ను నమ్ముకొన్నాను. కనుక నన్ను రక్షించుము.
నా ప్రభువా, నా మీద దయ చూపించుము.
    రోజంతా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను.
ప్రభువా, నా జీవితాన్ని నేను నీ చేతుల్లో పెడుతున్నాను.
    నన్ను సంతోషపెట్టుము, నేను నీ సేవకుడను.
ప్రభువా, నీవు మంచివాడవు, దయగలవాడవు.
    సహాయం కోసం నిన్ను వేడుకొనే నీ ప్రజలను నీవు నిజంగా ప్రేమిస్తావు.
యెహోవా, దయకోసం నేను మొరపెట్టుకునే
    నా ప్రార్థనలు ఆలకించుము.
యెహోవా, నా కష్టకాలంలో నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
    నీవు నాకు జవాబు యిస్తావని నాకు తెలుసు.
దేవా, నీవంటివారు మరొకరు లేరు.
    నీవు చేసిన వాటిని ఎవ్వరూ చేయలేరు.
ప్రభువా, నీవే అందరినీ సృష్టించావు.
    వారందరూ నిన్ను ఆరాధించెదరు గాక. వాళ్లంతా నీ నామాన్ని ఘనపరిచెదరు గాక.
10 దేవా, నీవు గొప్పవాడవు! నీవు అద్భుత కార్యాలు చేస్తావు.
    నీవు మాత్రమే దేవుడవు.
11 యెహోవా, నీ మార్గాలు నాకు నేర్పించు
    నేను నీ సత్యాలకు లోబడి జీవిస్తాను.
నిన్నారాధించుటయే నా జీవితంలోకెల్లా
    అతి ముఖ్యాంశంగా చేయుము.
12 దేవా, నా ప్రభువా, నేను నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తాను.
    నీ నామాన్ని నేను శాశ్వతంగా కీర్తిస్తాను.
13 దేవా, నా యెడల నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది.
    మరణపు అగాథ స్థలం నుండి నీవు నన్ను రక్షిస్తావు.
14 దేవా, గర్విష్ఠులు నాపై పడుతున్నారు.
    కృ-రులైన మనుష్యుల గుంపు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు.
    ఆ మనుష్యులు నిన్ను గౌరవించటం లేదు.
15 ప్రభూ, నీవు దయ, కరుణగల దేవుడవు.
    నీవు సహనం, నమ్మకత్వం, ప్రేమతో నిండి ఉన్నావు.
16 దేవా, నీవు నా మాట వింటావని నా యెడల దయగా ఉంటావని చూపించుము.
    నాకు బలాన్ని అనుగ్రహించుము. నేను నీ సేవకుడను.
    నన్ను రక్షించుము. నేను నీ సేవకుడను.
17 దేవా, నీవు నాకు సహాయం చేస్తావని రుజువు చేయుటకు ఏదైనా చేయుము.
    అప్పుడు నా శత్రువులు నిరాశ చెందుతారు.
    ఎందుకంటే ప్రభూ, నీవు నా యెడల దయ చూపించావని, నాకు సహాయం చేశావని అది తెలియచేస్తుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International