M’Cheyne Bible Reading Plan
సొలొమోను రాజ్యం
4 ఇశ్రాయేలు ప్రజలందరి పైన సొలొమోను రాజు పరిపాలన సాగించాడు. 2 తన పరిపాలనలో అతనికి సహాయ పడిన ప్రముఖమైన అధికారుల పేర్లు ఇవి:
సాదోకు కుమారుడైన అజర్యా ప్రధాన యాజకుడు.
3 షీషా కుమారులైన ఎలీహోరెపు మరియు అహీయా న్యాయస్థానాలలో జరిగే వాగ్వాదములు, తీర్పులు మొదలగు వాటిని గ్రంధస్థం చేసే లేఖకులు.
అహీలూదు కుమారుడైన యెహోషాపాతు చరిత్రకారుడు.
4 యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధ్యక్షుడు.
సాదోకు, అబ్యాతారు యాజకులు.
5 నాతాను కుమారుడు అజర్యా మండలాధిపతుల మీద అధికారి.
నాతాను కుమారుడైన జాబూదు అంతఃపుర యాజకుడే గాక రాజైన సొలొమోనుకు సలహాదారుడు.
6 అహీషారు రాజు యొక్క ఇంటి నిర్వహణలో అన్ని జాగ్రత్తలు తీసుకొనేవాడు.
అబ్దా కుమారుడైన అదోనిరాము బానిసలకు అధిపతి.
7 ఇశ్రాయేలురాజ్య పరిపాలనా సౌలభ్యం కొరకు మండలాల పేరుతో పన్నెండు ప్రాంతాలుగా విభజించారు. ప్రతి మండల పాలనకు రాజైన సొలొమోను ఒక పాలకుని ఎంపిక చేశాడు. ఈ పన్నెండుగురు మండలాధిపతులు రాజుకు, రాజ కుటుంబానికి ఆహారధాన్యాలు, తదితర తిను బండారాలు సేకరించి పంపేలా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ పన్నెండుగురు పాలకులలో ఒక్కొక్కడు సంవత్సరంలో ఒక్కొక్క నెల చొప్పున ఆహర పదార్థాలు సేకరించి రాజుకు పంపే బాధ్యత వహిస్తాడు. 8 ఆ పన్నెండుగురు మండలాధిపతుల పేర్లు ఇవి: బెన్-హూరు కొండల ప్రాంతమైన ఎఫ్రాయిమునందు పాలకుడు:
9 బెన్-దెకెరు అనునతను మాకస్సు, షయల్బీము, బేత్షెమెషులోను మరియు ఏలోన్భెధానానులోను;
10 బెన్-హెసెదు అనువాడు అరుబ్భోతు, శోకో మరియు హెపెరులోను;
11 బెన్-అబీనాదాబు నఫోతు దోరులోను (ఇతడు సొలొమోను కుమారైయగు టాపాతును వివాహ మాడాడు);
12 అహీలూదు కుమారుడైన బయనా అనువాడు తానాకు, మెగిద్దో మరియు సారెతాను పక్కనున్న బేత్షెయాను ప్రాంతమంతటికీ; (ఈ ప్రాంతం యెజ్రెయేలు దిగువ బేత్షెయాను మొదలుకొని ఆబేల్మేహోలా వరకు యొక్నెయాముకు అడ్డముగా వ్యాపించి ఉన్నది)
13 బెన్-గెబెరు అనునతను రామోత్గిలాదులోను; (ఇతడు గిలాదులోని మనష్షే కుమారుడైన యాయీరు పట్టణాలు, గ్రామాలపైన పాలకుడు. ఇతనింకా బాషానులో ఉన్న అర్గోబు మండల ప్రాంత మునకు కూడా పాలకుడుగా నియమింపబడ్డాడు. ఈ ప్రాంతంలో చుట్టూ ప్రాకారాలున్న అరువది నగరాలున్నాయి. ఈ నగరాలన్నిటికీ ద్వారాల మీద కంచు కడ్డీలు ఏర్పాటు చేయబడ్డాయి).
14 ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములోను;
15 అహీమయస్సు అనునతడు నఫ్తాలీములోను, ఇతడు సొలొమోను కుమార్తెయగు బాశెమతును వివాహమాడాడు;
16 హూషై కుమారుడగు బయనా ఆషేరులోను, ఆలోతులోను;
17 పరూయహు కుమారుడగు యెహోషాపాతు ఇశ్శాఖారు ప్రాంతంలోను;
18 ఏలా కుమారుడగు షిమీ బెన్యామీనులోను;
19 ఊరి కుమారుడైన గెబెరు అనునతడు గిలాదులోను అధిపతులుగా నియమింపబడ్డారు. (గిలాదు ప్రాంతంలో అమోరీయులకు రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు నివసించేవారు). కాని ఆ ప్రాంత మంతటికీ గెబెరు ఒక్కడు మాత్రమే పాలకుడుగా నియమితుడయ్యాడు.
20 యూదాలోను, ఇశ్రాయేలులోను జనాభా విపరీతంగా పెరిగింది. సముద్రతీరాన ఇసుక రేణువులా ప్రజానీకం విస్తరించింది. ప్రజలంతా సుఖసంతోషాలతో తింటూ, తాగుతూ, విలాసంగా జీవిస్తూవున్నారు.
21 యూఫ్రటీసు నది మొదలుకొని ఫిలిష్తీయుల రాజ్యం వరకుగల రాజ్యాలన్నిటిపైన సొలొమోను పరిపాలన సాగించాడు. అతని రాజ్యం ఈజిప్టు సరిహద్దుల వరకు వ్యాపించింది. ఈ సామ్రాజ్యాధిపతులంతా సొలొమోను ఆధిపత్యాన్ని అతని జీవితాంతంవరకు అంగీకరించి అతనికి పన్ను చెల్లిస్తూ వచ్చారు.[a]
22-23 సొలొమోను రాజుకు, ఆయన బల్ల వద్ద భోజనం చేసే వారికి సరిపడు దినసరి ఆహార పదార్థాలు ఈ విధంగా వున్నాయి: ఆరువందల తూముల[b] మెత్తని గోధుమ పిండి; పన్నెండు వందల తూముల ముతక పిండి; మంచి మేపులో ఉన్న పది ఆవులు; పొలాల్లో మేసే ఇరువది ఆవులు; వంద గొర్రెలు; మూడురకాల దుప్పులు; ప్రత్యేకంగా ఎంపిక చేసిన బాతులు మొదలగు పక్షిజాతులు.
24 యూఫ్రటీసు నదికి పశ్చిమ ప్రాంతాన గల రాజ్యాలన్నిటినీ సొలొమోను పరిపాలించాడు. ఈ ప్రాంతం తిప్సహు మొదలు గాజా వరకు వ్యాపించి వున్నది. సొలొమోను సామ్రాజ్యంలో నలుమూలలా శాంతి నెలకొన్నది. 25 సొలొమోను జీవించినంత కాలం యూదాలోను, ఇశ్రాయేలులోని దాను నుండి బెయేర్షెబా వరకు ప్రజలంతా శాంతి భద్రతలతో నివసించారు. ప్రజలు తమ తమ అంజూరపు చెట్ల క్రింద, ద్రాక్షాలతల క్రిందను కూర్చుని సుఖశాంతులతో జీవితం గడిపారు.
26 సొలొమోను తన రథాలను లాగే నాలుగు వేల గుర్రాలను ఉంచుటకు తగిన శాలలు ఏర్పాటు చేశాడు. అతనికి పండ్రెండు వేల గుర్రాలు వున్నాయి. తన రథాశ్వములకై సొలొమోను నాలుగు వేల[c] గుర్రపు శాలలు కలిగియున్నాడు. సొలొమోనుకు పండ్రెండు వేల మందిగల గుర్రపు దళం కూడా వున్నది. 27 ప్రతినెల పన్నెండు మంది మండలాధిపతులలో ఒక్కొక్కడు చొప్పున సొలొమోను రాజుకు కావలసిన సరుకులన్నిటినీ సమకూర్చి పెట్టేవాడు. రాజు బల్ల వద్ద తినే వారందరికీ ఇవన్నీ సరిపోయేవి. 28 రాజు యొక్క రథాశ్వములకు, స్వారి గుర్రాలకు తగినంత పచ్చగడ్డిని, యవధాన్యమును మండలాధిపతులు సేకరించి సరఫరా చేసేవారు. ప్రతి ఒక్కడూ ఈ ధాన్యాన్ని నియమిత స్థానాలకు చేరవేసేవాడు.
సొలొమోను జ్ఞానం
29 సొలొమోనుకు దేవుడు మిక్కిలి జ్ఞానాన్ని ప్రసాదించాడు. సొలొమోను అనేక విషయాలను సూక్ష్మంగా గమనించేవాడు. అతని జ్ఞానం ఊహకందనిది.[d] 30 తూర్పుదేశపు మానవులందరి వివేక జ్ఞానాలకంటె, సొలొమోను జ్ఞాన సంపద మిక్కిలి అతిశయించినది. ఈజిప్టులోనున్న వారి తెలివితేటల కంటె అతని శక్తి యుక్తులు మించినవి. 31 ఈ భూమి మీద ప్రజలందరికంటె అతను తెలివైనవాడు. అతడు ఎజ్రాహీయుడైన ఏతాను కంటె, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్ద అనువారి కంటె మిక్కిలి తెలివైనవాడు. రాజైన సొలొమోను కీర్తి ఇశ్రాయేలు, యూదాల చుట్టు పక్కలనున్న దేశాలకు కూడ వ్యాపించింది. 32 తన జీవిత కాలంలో రాజైన సొలొమోను మూడు వేల సామెతలను రాశాడు.[e]
33 సొలొమోను ప్రకృతిని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు. సొలొమోను అనేక వృక్షజాతులను గూర్చి చెప్పాడు. లెబానోనులోని గొప్ప దేవదారు వృక్షములనుండి, గోడలలో పుట్టి పాకే లతజాతుల మొక్కల వరకు అతనికి తెలుసు. రాజైన సొలొమోను జంతువులను గూర్చి, పక్షులను గూర్చి, పాములు తదితర పాకే క్రిమికీటకాదులు, బల్లులు, చేపలు మొదలగు వాటిని గూర్చి కూడా చెప్పాడు. 34 రాజైన సొలొమోను జ్ఞానమును వినటానికి అన్ని దేశాల నుంచి ప్రజలు వచ్చేవారు. ఇతర దేశాల రాజులు తమ తమ పండితులను, శాస్త్రజ్ఞులను రాజైన సొలొమోను చెప్పే విషయాలను వినటానికి పంపేవారు.
సొలొమోను, హీరాము
5 హీరాము అనునతను తూరు దేశానికి రాజు. అతను దావీదుకు చిరకాల స్నేహితుడు. దావీదు స్థానంలో సొలొమోను రాజ్యానికి వచ్చాడని విన్న హీరాము తన సేవకులను సొలొమోను వద్దకు పంపాడు. 2 సొలొమోను వారిద్వారా రాజైన హీరాముకు ఇలా చెప్పి పంపాడు:
3 “నా తండ్రియగు రాజైన దావీదు చుట్టుప్రక్కల రాజ్యాల వారితో అనేక యుద్ధాలు చేసినట్లు నీకు తెలుసు. అందువల్ల యెహోవాయగు తన దేవుని ఘనపరిచేలా ఒక దేవాలయం నిర్మించ లేకపోయాడు. తన శత్రువులందరినీ యెహోవా తాను ఓడించేలా చేసే వరకు రాజైన దావీదు వేచివున్నాడు. 4 కాని ఇప్పుడు యెహోవా దేవుడు నా రాజ్యం నలుమూలలా శాంతి నెలకొనేలా చేశాడు. ప్రస్తుతం నాకు శత్రువులు లేరు. నా ప్రజలు నిర్భయంగా వున్నారు.
5 “యెహోవా నా తండ్రియగు దావీదుకు ఒక మాట ఇచ్చాడు. యెహోవా ఇలా అన్నాడు, ‘నీ తరువాత నీ కుమారుని రాజును చేస్తాను. నీ కుమారుడు నా పట్ల గౌరవ సూచకంగా ఒక దేవాలయం నిర్మిస్తాడు.’ కావున ఇప్పుడు నా యెహోవా దేవునికి ఘనంగా ఒక దేవాలయం నిర్మింపజేస్తున్నాను. 6 అందువల్ల ఈ విషయంలో నీ సహాయం కోరుతున్నాను. నీ మనుష్యులను లెబానోనుకు పంపించు. వారక్కడ నా కొరకు దేవదారు వృక్షాలను పడగొట్టాలి. నా పనివాళ్లు నీ పనివారితో కలిసి పని చేస్తారు. నీ పనివాళ్లకు వేతనంగా నీవు ఎంత నిర్ణయిస్తే అది నేను చెల్లిస్తాను. కాని నీ సహాయం మాత్రం నాకు కావాలి. మా వడ్రంగులు[f] సీదోను వడ్రంగులకు సాటిరారు.”
7 సొలొమోను అడిగినదంతా విన్న హీరాము చాలా సంతోషపడ్డాడు. “ఆ మహా సామ్రాజ్యానికి రాజుగా వ్యవహరించటానికి దావీదుకు ప్రజ్ఞాశాలియైన కుమారుని ప్రసాదించినందుకు దేవునికి ఈ రోజు నమస్కరిస్తున్నాను!” అని రాజైన హీరాము అన్నాడు. 8 అప్పుడు హీరాము ఒక సమాచారాన్ని సొలొమోనుకు యిలా పంపాడు:
“నీవు అడిగిన విషయాలన్నీ నేను విన్నాను. నీవు కోరినన్ని దేవదారు వృక్షాలను, సరళపు చెట్లను నీకు యిస్తాను. 9 నా పనివాళ్లు ఆ దూలాలన్నిటినీ లెబానోను నుండి సముద్రతీరానికి చేరవేస్తారు. వాటిని నేను తెప్పలుగా కట్టించి సముద్రంలో వేయించి నీవు కోరిన స్థలానికి చేరేలా చేస్తాను. అక్కడ ఆ దూలాలను విడివిడిగా తీస్తాను. వాటిని నీవు తీసుకోవచ్చు. ఈ సందర్భంగా నీవు నా మాట మన్నించి నా రాజకుటుంబ పోషణకు తగిన ఆహార పదార్థాలను సమకూర్చుతావని ఆశిస్తున్నాను.”
10 ఆ విధంగా హీరాము దేవదారు, సరళపు చెట్ల కలపను సొలొమోనుకు సరఫరా చేయసాగాడు.
11 సొలొమోను కూడ హీరాముకు అతని ఇంటి వారి పోషణకు రెండు లక్షల తూముల గోధుమలు, మూడు వేల ఎనిమిది వందల[g] పడుల స్వచ్ఛమైన ఒలీవ నూనెను ప్రతియేటా పంపాడు.
12 యెహోవా చేసిన వాగ్దానం ప్రకారం ఆయన సొలొమోనుకు గొప్ప జ్ఞానాన్ని కలుగజేశాడు. హీరాము, సొలొమోనుల మధ్య శాంతి, సామరస్యాలు నెలకొన్నాయి. ఆ ఇద్దరు రాజులు ఒక ఒడంబడిక చేసుకున్నారు.
13 రాజైన సొలొమోను ముప్పదివేల మంది ఇశ్రాయేలీయులను ఈ పనిలో సహాయపడటానికి బలవంతంగా కూలిపనికి చేర్చుకున్నాడు. 14 వీరిపై అధికారిగా అదోనీరాము అను వానిని రాజైన సొలొమోను నియమించాడు. సొలొమోను వారిని మూడు జట్లుగా విభజించాడు. ప్రతి జట్టులోను పదివేల మంది వున్నారు. ప్రతి జట్టు లెబానోనులో ఒక నెలపాటు పనిచేసి, రెండు నెలలు ఇంటివద్ద ఉండేవారు. 15 సొలొమోను ఎనుబది వేల మందిని కొండ ప్రాంతంలో పనిచేయటానికి బలవంతపర్చాడు. వీరు రాళ్లు కొట్టి చెక్కాలి. కొట్టిన రాళ్లను చేరవేయటానికి డెబ్బది వేల మంది వున్నారు. 16 ఈ పని చేసే వారిపై పర్యవేక్షణకై మూడు వేల మూడు వందల మంది నియమితులయ్యారు. 17 రాజైన సొలొమోను దేవాలయ పునాదులకు పనికి వచ్చే విలువైన పెద్ద బండలు చెక్కమని పనివారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఈ రాళ్లు అతి నేర్పుగా కొట్టబడేవి. 18 సొలొమోను యొక్క, హీరాము యొక్క శిల్పులు, మరియు బిబ్లోసు[h] నుండి వచ్చన వారును రాళ్లను చెక్కారు. ఈ కట్టడపు పనివారంతా రాళ్లను, దూలాలను, దేవాలయ నిర్మాణానికి తయారు చేశారు.
క్రీస్తులో పునర్జీవం
2 ఇక మీ విషయమా! ఇదివరలో మీరు మీ పాపాల్లో, అతిక్రమాల్లో మరణించారు. 2 అప్పుడు మీరు ప్రపంచాన్ని అనుసరించి జీవించారు. వాయుమండలాధికారిని అనుసరించే వాళ్ళు. ఆ వాయుమండలాధికారి ఆత్మ దేవునికి అవిధేయతగా ఉన్నవాళ్ళలో ఇప్పుడూ పని చేస్తుంది. 3 నిజానికి మనం కూడా మన మానవ స్వభావంవల్ల కలిగే వాంఛల్ని, శారీరక వాంచల్ని, మన ఆలోచనల వల్ల కలిగే వాంఛల్ని తృప్తి పరుచుకుంటున్నవాళ్ళలా జీవించాము. కాబట్టి వాళ్ళలా మనము కూడా దేవుని కోపానికి గురి అయ్యాము.
4 కాని దేవుడు కరుణామయుడు. ఆయనకు మనపై అపారమైన ప్రేమ ఉంది. 5 మనము అవిధేయత వల్ల ఆత్మీయ మరణం పొందినా ఆయన మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. ఆయన అనుగ్రహం మిమ్మల్ని రక్షించింది. 6 మనకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యత వల్ల పరలోకంలో తనతో కలిసి రాజ్యం చెయ్యటానికి మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. 7 యేసు క్రీస్తు ద్వారా తన అనుగ్రహాన్ని తెలియజేసి, తన అపారమైన దయ మనపై చిరకాలం ఉంటుందని నిరూపించాడు.
8 మీరు ఆయన అనుగ్రహం వల్ల రక్షింపబడ్డారు. మీలో విశ్వాసం ఉండటంవల్ల మీకా అనుగ్రహం లభించింది. అది మీరు సంపాదించింది కాదు. దాన్ని దేవుడు మీకు ఉచితంగా యిచ్చాడు. 9 అది మీ కృషివల్ల లభించింది కాదు. కనుక గొప్పలు చెప్పుకోవటానికి అవకాశం లేదు. 10 దేవుడు మన సృష్టికర్త. ఆయన యేసు క్రీస్తులో మనలను సత్కార్యాలు చేయటానికి సృష్టించాడు. ఆ సత్కార్యాలు ఏవో ముందే నిర్ణయించాడు.
మనము క్రీస్తులో ఒకటిగా ఉన్నాము
11 మీరు యూదులుగా పుట్టలేదు. కనుక యూదులు మిమ్మల్ని “సున్నతి చేయించుకోనివాళ్ళు” అని అంటారు. తాము సున్నతి పొందినవాళ్ళైనందుకు వాళ్ళు గర్విస్తూవుంటారు. వీళ్ళ సున్నతి శారీరకమైనది. ఆత్మవల్ల పొందింది కాదు. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 12 అంతేకాక ఒకప్పుడు మీరు క్రీస్తుతో కాక విడిగా ఉండేవాళ్ళు. ఇశ్రాయేలు దేశంలో మీకు పౌరసత్వం లేదు. దేవుడు వాగ్దానం చేసిన ఒడంబడికలో మీకు భాగం లేదు. మీరు రక్షణ లభిస్తుందన్న ఆశలేకుండా, ఈ ప్రపంచంలో దేవుడనేవాడు లేకుండా జీవించారు. ఇది కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 13 కాని ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు క్రీస్తు రక్తం వల్ల దేవునికి దగ్గర అయ్యారు.
14 మనకు సంధి కలిగించిన వ్యక్తి క్రీస్తు. ఆయన యిద్దరినీ ఒకటిగా చేసి ద్వేషమనే అడ్డుగోడను నిర్మూలించాడు. 15 ధర్మశాస్త్రాన్ని, అందులో చెప్పిన ఆజ్ఞల్ని, నియమాల్ని తన ప్రాణం అర్పించి రద్దు చేసాడు. ఇద్దరినీ కలిపి తనలో ఒక క్రొత్త మనిషిని సృష్టించి శాంతి స్థాపించాలని ఆయన ఉద్దేశ్యం. 16 ఈ విధంగా సిలువ ద్వారా వాళ్ళ మధ్య ఉన్న ద్వేషాన్ని నిర్మూలించి ఒకటిగా ఉన్న ఆ క్రొత్త మనిషికి, దేవునికి సంధి కుదర్చాలని ఆయన ఉద్దేశ్యం. 17 క్రీస్తు వచ్చి దూరంగా ఉన్న మీకు, మరియు దగ్గరగా ఉన్న వాళ్ళకు శాంతి సువార్తను ప్రకటించాడు. 18 ఆయన కారణంగా మన యిద్దరికి, తండ్రి దగ్గరకు ఒక ఆత్మ ద్వారా వెళ్ళే అవకాశం కలిగింది.
19 అందువల్ల మీరిక మీదట పరులు కారు. పరదేశీయులు కారు. పవిత్రులతో కలిసి జీవిస్తున్న తోటి పౌరులు. దేవుని కుటుంబానికి చెందిన సభ్యులు. 20 మీరు కూడా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిపై కట్టబడ్డారు. క్రీస్తు దానికి ప్రధానమైన మూలరాయి. 21 ఆయనవల్ల ఈ ఇల్లు సక్రమంగా నిర్మింపబడి అభివృద్ధి చెందుతుంది. అది ప్రభువు పవిత్ర దేవాలయము. 22 ఆయనలో ఐక్యత పొందిన మిమ్మల్ని కూడా యితర్లతో చేర్చి ఈ ఇల్లు నిర్మింపబడుతుంది. ఈ యింటిలో దేవుని ఆత్మ నివసిస్తాడు.
ఎదోముకు వ్యతిరేకంగా వర్తమానం
35 యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 2 “నరపుత్రుడా, శేయీరు పర్వతం వైపు చూచి నా తరపున దానికి వ్యతిరేకంగా మాట్లాడు. 3 దానితో ఈ విధంగా చెప్పు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు,
“‘శేయీరు పర్వతమా, నేను నీకు విరోధిని!
నేను నిన్ను శిక్షిస్తాను. నిన్నొక పనికిమాలిన బీడు భూమిలా చేస్తాను.
4 నీ నగరాలను నేను నాశనం చేస్తాను.
నీవు నిర్మానుష్యమవుతావు.
అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.
5 “‘ఎందువల్లనంటే నీవు నా ప్రజలకు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉన్నావు. ఇశ్రాయేలు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడూ, వారి శిక్షాకాల అంతిమదశలోనూ నీవు నీ కత్తిని వారిమీద ఉపయోగించావు.’” 6 కావున నా ప్రభువైన యెహోవా చెపుతున్నదేమంటే, “నా జీవ ప్రమాణంగా నేను నిశ్చయంగా చెప్పేదేమంటే, నిన్ను మృత్యువు కబళించివేసేలా చేస్తాను. మృత్యువు నిన్ను వెంటాడుతుంది. రక్తమును నీవు అసహ్యించుకోలేదు. కావున మృత్యువు నిన్ను తరుముకు వెళుతుంది. 7 శేయీరు పర్వతాన్ని పాడైపోయిన శూన్య ప్రదేశంగా చేస్తాను. ఆ నగరం నుండి వచ్చే ప్రతి వానినీ నేను చంపివేస్తాను. ఇంకా ఆ నగరంలోకి వెళ్ల ప్రయత్నించే ప్రతివానిని నేను చంపివేస్తాను. 8 దాని పర్వతాలన్నిటినీ శవాలతో కప్పివేస్తాను. ఆ శవాలు నీ కొండలన్నిటి మీద, నీ లోయలు, కనుమలన్నిటిలోను పడివుంటాయి. 9 నిన్ను శాశ్వతంగా ఏమీలేనివానిగా మార్చివేస్తాను. నీ నగరాలలో ఏ ఒక్కడూ నివసించడు. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.”
10 “ఈ రెండు జనాభాలు, వారి దేశాలు (ఇశ్రాయేలు, యూదా) నావే. మేము వాటిని శాశ్వతంగా మా స్వంతం చేసుకుంటాము” అని నీవు అన్నావు.
కాని యెహోవా ఇలా అన్నాడు! 11 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “నీవు నా ప్రజల పట్ల అసూయచెంది ఉన్నావు. నీవు వారిపట్ల కోపంతో ఉన్నావు. నీవు వారిని అసహ్యించుకున్నావు. నీవు వారిని బాధించిన విధంగా నేను నిన్ను శిక్షిస్తానని నామీద ప్రమాణం చేసి చెపుతున్నాను! నేను నిన్ను శిక్షించి, నేను నా ప్రజలతోనే ఉన్నానని వారు తెలుసుకొనేలా చేస్తాను. 12 నీ అవమానాలన్నిటి గురించి నేను విన్నానని నీవు కూడ తెలుసుకుంటావు. ఇశ్రాయేలు పర్వతానికి వ్యతిరేకంగా నీవు అనేక చెడ్డ విషయాలు ప్రచారం చేశావు.
“‘ఇశ్రాయేలు నాశనం చేయబడింది! వాళ్లను మేము ఆహారం నమిలినట్లు నమిలి వేస్తాము!’ అని అంటూ నీవు ప్రచారం మొదలు పెట్టావు. 13 నీవు గర్వించి, నాకు వ్యతిరేకంగా అనేక విషయాలు చెప్పావు. నీవు చాలాసార్లు అలా మాట్లాడినావు. కాని నీవు మాట్లాడిన ప్రతి మాటా నేను విన్నాను! అవును. నీవన్నది నేను విన్నాను.”
14 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నేను నిన్ను నాశనం చేసినప్పుడు ఈ భూమి యావత్తూ సంతోషిస్తుంది. 15 ఇశ్రాయేలు దేశం నాశనమయినప్పుడు నీవు సంతోషించావు. అదే రీతిని నిన్ను నేను చూస్తాను. శేయీరు పర్వతం, ఎదోము దేశం మొత్తం నాశనం చేయబడతాయి. నేనే యెహోవానని మీరప్పుడు తెలుసుకుంటారు.”
సంగీత నాయకునికి: కోరహు కుమారుల స్తుతి కీర్తన
85 యెహోవా, నీ దేశం మీద దయ చూపించుము.
యాకోబు ప్రజలు విదేశంలో ఖైదీలుగా ఉన్నారు. ఖైదీలను తిరిగి వారి దేశానికి తీసుకొని రమ్ము.
2 యెహోవా, నీ ప్రజలను క్షమించుము!
వారి పాపాలు తుడిచివేయుము.
3 యెహోవా, కోపంగాను,
ఆవేశంగాను ఉండవద్దు.
4 మా దేవా, రక్షకా, మా మీద కోపగించటం మానివేసి,
మమ్మల్ని మరల స్వీకరించు.
5 నీవు మామీద శాశ్వతంగా కోపగిస్తావా?
6 దయచేసి మమ్మల్ని మరల బ్రతికించుము!
నీ ప్రజలను సంతోషింపజేయుము.
7 యెహోవా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా మాకు చూపించుము.
మమ్మల్ని రక్షించుము.
8 దేవుడు చెప్పేది నేను వింటున్నాను.
తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబుతున్నాడు.
ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.
9 దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు.
మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతాము.
10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది.
మంచితనం, శాంతి ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.
11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా ఉంటారు.
పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.
12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు.
భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.
13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ
ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.
© 1997 Bible League International