M’Cheyne Bible Reading Plan
దావీదు మరణించుట
2 దావీదుకు మరణకాలం సమీపించింది. కావున దావీదు సొలొమోనును పిలిచి ఇలా అన్నాడు: 2 “నాకు మరణకాలం సమీపించింది. నీవు మంచివానిగా, సమర్థవంతమైన నాయకునిగా పేరు తెచ్చుకో. 3 దేవుని ఆజ్ఞలన్నీ శిరసావహించు. నీ దేవుడైన యెహోవా మనకిచ్చిన ఆదేశాలన్నిటినీ పాటించు. ఆయన ధర్మశాస్త్రాలను పాటిస్తూ, ఆయన మనకు చెప్పినవన్నీచేయి. మోషే ధర్మశాస్త్రంలో నిర్దేశించిన సూత్రాలన్నిటినీ పాటించు. ఇవన్నీ నీవు పాటిస్తే, నీవు ఏది చేసినా, నీవు వెళ్లిన ప్రతి చోటా నీకు విజయం చేకూరుతుంది. 4 నీవు యెహోవాకు విధేయుడవయివుంటే, ఆయన నాగురించి చేసిన ప్రమాణం నెరవేర్చుతాడు. యెహోవా నాకు చేసిన వాగ్దానమిది: ‘నీవారు నా ఆదేశ సూత్రాలను అనుసరించి తీరాలి. నేను నిర్దేశించినరీతిగా జీవితం గడపాలి. నీ కుమారులు సంపూర్ణ హృదయంతో, ఆత్మసాక్షిగా నాలో విశ్వాసం కలిగివుండాలి. నీ కుమారులు ఇవన్నీ చేస్తే, నీ కుటుంబంలో ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఇశ్రాయేలు ప్రజలపై పాలకుడుగా వుంటాడు.’”
5 “సెరూయా కుమారుడైన యోవాబు నాకు ఏమి చేసినదీ నీవు గుర్తు పెట్టుకోవాలి కూడ. ఇశ్రాయేలు సైన్యాల ఇద్దరు అధిపతులను అతడు చంపాడు. నేరు కుమారుడైన అబ్నేరును, యెతెరు కుమారుడైన అమాశాను అతడు చంపాడు. అతడు వారిని శాంతి నెలకొన్న రోజులలో చంపిన విషయం నీవు గుర్తుంచు కోవాలి. వారు యుద్ధ సమయంలో ప్రజలను చంపారనే కోపంతో అతడా పని చేశాడు. కాని చంపబడిన ఆ ఇద్దరు సేనాధిపతులు అమాయకులు. కావున నేనతనిని శిక్షించాలి. 6 కాని ఇప్పుడు నీవు రాజువు. నీవు ఏది మిక్కిలి తెలివైన పద్దతి అనుకుంటే దానిద్వారా అతనిని శిక్షించాలి. అంటే అతడు ఖచ్చితంగా చంపబడాలి.”
7 “గిలాదీయుడైన బర్జిల్లయి కుమారుల పట్ల నీవు దయగలిగి వుండాలి. వారిని నీ స్నేహితులుగా స్వీకరించి, వారు నీ బల్లవద్ద విందారగించేలా చూడు. నీ సోదరుడగు అబ్షాలోము నుండి నేను పారిపోయినప్పుడు వారు నాకు సహాయం చేశారు.
8 “గెరా కుమారుడగు షిమీ నీవద్దనే వున్నట్లు నీవు గమనించాలి. ఇతడు బెన్యామీనీయుడు. బహూరీముపురవాసి. నేను మహనయీముకు వెళ్లిన రోజున ఇతడు నాకు వ్యతిరేకంగా చాలా చెడు మాటలు మాట్లాడాడు. ఇతడు మరల యోర్థాను నది వద్ద నన్ను కలవటానికి వచ్చాడు. నేను యెహోవా ముందు ప్రమాణం చేసి షిమీని నేను చంపనని చెప్పాను. 9 కావున నీవు వానిని శిక్షింపకుండా వదలవద్దు. నీవు తెలివిగలవాడవు. వానికి ఏమి చేయాలో నీకు తెలుసు. వాడు వృద్దాప్యంలో ప్రశాంతంగా చనిపోయేలా విడువవద్దు.”
10 ఇవన్నీ చెప్పి దావీదు చనిపోయాడు. దావీదు నగరంలో అతడు సమాధి చేయబడ్డాడు. 11 దావీదు నలభై సంవత్సరాల పాటు ఇశ్రాయేలును పరిపాలించాడు. అతడు హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్పై మూడు సంవత్సరాలు పాలించాడు.
సొలొమోను, అదోనియ
12 ఇప్పుడు సొలొమోను తన తండ్రియగు దావీదు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతడు రాజు అని చెప్పటానికి ఏరకమైన అనుమానం లేదు.[a]
13 ఈ సమయంలో హగ్గీతు కుమారుడైన అదోనీయా సొలొమోను తల్లియగు బత్షెబ వద్దకు వెళ్లాడు.
“నీవు సమాధానంతో వచ్చావా?” అని బత్షెబ అతనిని అడిగింది.
“అవును. ఐక్యత కోసమే ఈ సందర్శనం. 14 నీకు ఒక విషయం నేను చెప్పాలి” అని అదోనీయా సమాధానం చెప్పాడు.
“అయితే మాట్లాడు” అన్నది బత్షెబ.
15 అదోనీయా ఇలా చెప్పాడు: “నీకు గుర్తుండే వుంటుంది, ఈ రాజ్యం ఒకప్పుడు నాది. ఇశ్రాయేలు ప్రజలంతా నేనే వారి రాజుననుకున్నారు. కాని పరిస్థితులు తారుమారైనాయి. ఇప్పుడు నా సోదరుడు రాజైనాడు. దేవుడు అతనిని రాజుగా ఎంపిక చేశాడు. 16 కావున నిన్ను నేనొక విషయం అడగాలనుకుంటున్నాను. దయచేసి దానిని తిరస్కరించవద్దు.”
“నీకేం కావాలి?” అని బత్షెబ అడిగింది.
17 “నాకు తెలుసు, రాజైన సొలొమోను నీవు ఏది చేయమంటే అది చేస్తాడని. అందువల్ల దయచేసి షూనేమీయురాలైన అబీషగును నాకు భార్యగా యివ్వమని అతనిని అడుగు” అని అదోనీయా అన్నాడు.
18 “మంచిది, నీ తరపున నేను రాజుతో మాట్లాడతాను” అని బత్షెబ అన్నది.
19 కావున రాజైన సొలొమోనుతో మాట్లాడ్డానికి బత్షెబ అతని వద్దకు వెళ్లింది. సొలొమోను ఆమెను చూచి కలుసుకొనేందుకు నిలబడ్డాడు. ఆమెకు వందనం చేసి, సింహాసనం మీద కూర్చున్నాడు. తన తల్లి కొరకు సేవకులతో మరో ఉన్నతాసనం తెప్పించాడు. అప్పుడామె అతనికి కుడి ప్రక్కగా కూర్చున్నది.
20 “నిన్నొక చిన్న విషయం అడగాలని వచ్చాను. దయచేసి తిరస్కరించవద్దు” అని బత్షెబ అతనితో అన్నది.
“నీవు ఏది కావాలంటే అది అడగవచ్చునమ్మా! నేనెప్పుడూ తిరస్కరించను” అని రాజు అన్నాడు.
21 “అయితే షూనేమీయురాలగు అబీషగును నీ సోదరుడైన అదోనీయా వివాహమాడుటకు అనుమతి ఇవ్వు” అని బత్షెబ అన్నది.
22 అది విన్న సొలొమోను రాజు, “అబీషగును అతని కిమ్మనే ఎందుకు అడుగుతున్నావు? అతడు నా అన్న గనుక అతను రాజు కావటానికి కూడా అనుమతి ఇమ్మని నన్నెందుకు అడగటం లేదు? యాజకుడైన అబ్యాతారు, యోవాబు కూడా అతనికి మద్దతు ఇస్తారేమో!” అని తన తల్లితో అన్నాడు.
23 అప్పుడు సొలొమోను యెహోవాకు ఒక ప్రమాణం చేశాడు. అతనిలా అన్నాడు: “అదోనీయా నన్నిది అడిగినందుకు తగిన శాస్తి జరిగేలా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను! ఇది వాని ప్రాణానికే ముప్పు తెస్తుందని ప్రమాణ వూర్వకంగా చెబుతున్నాను! 24 ఇశ్రాయేలు రాజు కావటానికి యెహోవా నాకు అనుమతి ఇచ్చాడు. నా తండ్రియైన దావీదు సింహాసనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. రాజ్యాన్ని నాకు, నా ప్రజలకు ఇచ్చి యెహోవా ఆయన మాట నిలబెట్టుకున్నాడు. అదోనీయా ఈ రోజు ఖచ్చితంగా చనిపోతాడని, ఇవన్నీ నెరవేర్చిన నిత్యుడైన యోహోవా ముందు ప్రమాణం చేసి చెబుతున్నాను!”
25 రాజైన సొలొమోను బెనాయాను పిలిచి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. బెనాయా బయటికి వెళ్లి అదోనీయాను చంపేశాడు.
26 రాజైన సొలొమోను యాజకుడగు అబ్యాతారును పిలిచి, “నేను నిన్ను చంపివుండే వాడిని, కాని అనాతోతులో వున్న నీ ఇంటికి తిరిగి వెళ్లటానికి అనుమతి ఇస్తున్నాను. నిన్ను ఇప్పుడు చంపను. ఎందు వల్లనంటే నా తండ్రి దావీదుతో కలిసి వెళ్లేటప్పుడు నీవు యెహోవా పవిత్ర పెట్టె మోయుటలో సహాయ పడ్డావు. పైగా నీవు నా తండ్రి కష్ట సమయాలలో నీవాయనకు తోడుగా వున్నావని కూడా నాకు తెలుసు.” 27 అయితే ఇక నుంచి యెహోవా యాజకునిగా కొనసాగటానికి వీల్లేదని అబ్యాతారుతో సొలొమోను చెప్పాడు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో ఇప్పుడిది ఆ రకంగా జరిగింది. యెహోవా ఏలీని గురించి, అతని కుటుంబం గురించి షిలోహులో చెప్పిన దానికి అనుగుణంగా ఇప్పుడిది జరిగింది.
28 యోవాబు జరిగినదంతా విని భయపడి పోయాడు. అతడు అదోనీయాకు మద్దతు యిచ్చాడు గాని, అబ్షాలోముకు వ్యతిరేకి అయ్యాడు. యోవాబు దేవుని గుడారంలోకి పారిపోయి బలిపీఠపు కొమ్ములను పట్టుకొన్నాడు. 29 యోవాబు దేవుని గుడారంలో బలి పీఠం వద్ద వున్నాడని ఎవరో పోయి రాజైన సొలొమోనుకు చెప్పారు. సొలొమోను బెనాయాను పిలచి యోవాబును చంపమన్నాడు.
30 బెనాయా యెహోవా గుడారంలోనికెళ్లి యోవాబుతో, “రాజు అతనిని బయటికి రమ్మంటున్నాడని” చెప్పాడు.
“వద్దు, నేనిక్కడే చనిపోతాను” అని యోవాబు అన్నాడు.
కావున బెనాయా తిరిగి వెళ్లి యోవాబు అన్న మాటలు రాజుకు చెప్పాడు. 31 “అయితే అతను చెప్పినట్లే చేయుము! వానిని అక్కడే చంపివేయుము. పిమ్మట వానిని పాతిపెట్టుము. అప్పుడు యోవాబు చేసిన పనుల యొక్క దోషం నా కుటుంబానికి, నాకు తగలకుండ పోతుంది. ఈ దోషమెందుకు వచ్చిందనగా యోవాబు అమాయకులను చంపాడు. 32 తనకంటె చాలా మంచివారిద్దరిని యోవాబు హత్య చేశాడు. వారిద్దరు నేరు కుమారుడైన అబ్నేరు, మరియు యెతెరు కుమారుడైన అమాశా. అబ్నేరు ఇశ్రాయేలు సైన్యాధిపతి. అమాశా యూదావారి సైన్యాధిపతి. అతడు వారిని చంపినట్లు నా తండ్రి దావీదుకు తెలియదు. కావున యెహోవా అతనికి తగిన శాస్తి చేస్తాడు. 33 వాళ్ల చావుకు కారణమయిన అపరాధి అతనే. తన కుటుంబం కూడా శాశ్వతంగా ఈ నేరానికి బాధ్యులు. కాని దావీదుకు, అతని సంతతివారికి, అతని కుటుంబానికి, అతని సింహాసనానికి దేవుడు శాశ్వతంగా శాంతిని చేకూర్చుతాడు.”
34 కావున యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి యోవాబును చంపాడు. యోవాబు శవాన్ని ఎడారిలో అతని ఇంటి సమీపాన పాతిపెట్టారు. 35 తరువాత యోవాబు స్థానంలో యెహోయాదా కుమారుడైన బెనాయాను సైన్యాధ్యక్షునిగా సొలొమోను నియమించాడు. సొలొమోను అబ్యాతారు స్థానంలో సాదోకును కొత్త ప్రధాన యాజకునిగా కూడా నియమించాడు. 36 తరువాత, షిమీని రాజు పిలిచాడు. రాజు షిమీతో, “ఇక్కడ యెరూషలేములో నీ కొరకై ఒక ఇల్లు నిర్మించుకో. నీవు అందులో నివసిస్తూ, నగరం వదిలి వెళ్లవద్దు. 37 నీవు నగరం వదిలి కిద్రోను వాగు దాటి వెళ్లితే గనుక, ఎవరో ఒకరు నిన్ను చంపుతారు. ఆ తప్పుకు నీవే బాధ్యుడవు” అని అన్నాడు.
38 అది విని షిమీ, “నా రాజా, నీవు చెప్పినది చాలా బాగున్నది. నేను నీకు విధేయుడనై వుంటాను” అని అన్నాడు. షిమీ యెరూషలేములో చాలాకాలం నివసించాడు. 39 కాని మూడు సంవత్సరాల తరువాత షిమీ యొక్క ఇద్దరు బానిసలు పారిపోయారు. వారు గాతు రాజు వద్దకు వెళ్లారు. ఆ రాజు పేరు ఆకీషు. అతడు మయకా కుమారుడు. తన బానిసలు గాతులో వున్నట్లు షిమీ విన్నాడు. 40 తన గాడిదపై గంతవేసి, దానిమీద గాతు రాజైన ఆకీషు వద్దకు వెళ్లాడు. అతడు తన బానిసలను వెదుక్కుంటూ వెళ్లాడు. వాళ్లను అక్కడ పట్టుకుని తన ఇంటికి తిరిగి తీసుకొచ్చాడు.
41 కాని ఎవ్వరో సొలొమోను వద్దకు వెళ్లి షిమీ యెరూషలేము నుండి గాతుకు వెళ్లి వచ్చాడని చెప్పారు.
42 అందువల్ల సొలొమోను షిమీని పిలిపించాడు. సొలొమోను అతనితో ఇలా అన్నాడు, “యెరూషలేము విడిచి వెళ్లితే నీవు చంపబడతావని నీకు తెలిసేలా నేను నీ చేత యెహోవా పేరు మీద ప్రమాణం చేయించాను. నీవు ఇక్కడినుండి ఎక్కడికైనా వెళ్లితే తత్ఫలితంగా సంభవించే నీ మరణానికి నీవే కారకుడవవుతావని కూడా నిన్ను నేను హెచ్చరించాను. నేను చెప్పినదానికి నీవు ఒప్పుకున్నావు. నాకు విధేయుడవై వుంటానని నీవు అన్నావు. 43 మరి నీ మాటను నీవు ఎందుకు నిలబెట్టుకోలేదు? నా ఆజ్ఞను నీవెందుకు శిరసావహించలేదు? 44 నీవు నా తండ్రి దావీదు పట్ల చేసిన అనేక తప్పులు నీకు గుర్తుండే వుంటాయి. ఆ తప్పులన్నిటికీ యెహోవా నిన్నిప్పుడు శిక్షిస్తాడు. 45 కాని యెహోవానన్ను ఆశీర్వదిస్తాడు. దావీదు సింహాసనాన్ని ఆయన ఎప్పుడూ సురక్షితంగా ఉంచుతాడు.”
46 పిమ్మట రాజు షిమీని చంపమని బెనాయాకు ఆజ్ఞ యివ్వగా అతను ఆ పని పూర్తి చేశాడు. అప్పుడు సొలొమోను తన రాజ్యాన్ని పూర్తిగా తన అదుపులోకి తెచ్చెకున్నాడు.
అందరికీ మంచి చెయ్యండి
6 నా సోదరులారా! మీలో ఎవరైనా పాపం చేస్తే, మీలో ఆత్మీయంగా జీవిస్తున్నవాళ్ళు అతన్ని సరిదిద్దాలి. ఇది వినయంగా చెయ్యాలి. కాని మీరు స్వతహాగా ఆ పాపంలో చిక్కుకుపోకుండా జాగ్రత్త పడండి. 2 పరస్పరం కష్టాలు పంచుకోండి. అప్పుడే క్రీస్తు ఆజ్ఞను పాటించినవాళ్ళౌతారు. 3 తనలో ఏ గొప్పతనమూ లేనివాడు, తాను గొప్ప అని అనుకొంటే తనను తాను మోసం చేసుకొన్నవాడౌతాడు. 4 ప్రతి ఒక్కడూ తన నడవడికను స్వయంగా పరీక్షించుకోవాలి. అప్పుడు తాను మరొకరితో పోల్చుకోకుండా తన నడతను గురించి గర్వించవచ్చు. 5 ప్రతి ఒక్కడూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
మంచి చేయుట ఎన్నడూ మానవద్దు
6 దేవుణ్ణి గురించి బోధన పొందినవాడు, బోధించిన వానికి అన్ని విధాల సహాయం చెయ్యాలి.
7 మోసపోకండి, ప్రతి ఒక్కడూ తాను నాటిన చెట్టు ఫలాన్నే పొందుతాడు. ఈ విషయంలో దేవుణ్ణి మోసం చెయ్యలేము. 8 శారీరిక వాంఛలు అనే పొలంలో విత్తనం నాటితే మరణాన్ని ఫలంగా పొందుతాడు. పరిశుద్ధాత్మను మెప్పించే విధంగా నాటితే పరిశుద్ధాత్మ నుండి అనంతజీవితం అనే ఫలం పొందుతాడు. 9 కనుక మనం విశ్రాంతి తీసుకోకుండా మంచి చేద్దాం. మనము విడువకుండా మంచి చేస్తే సరియైన సమయానికి మంచి అనే పంట కోయగలుగుతాము. 10 మనకు మంచి చేసే అవకాశం ఉంది కనుక అందరికీ మంచి చేద్దాం. ముఖ్యంగా విశ్వాసులకు మంచి చేద్దాం.
చివరి మాట
11 ఇది మీకు నేను నా స్వహస్తాలతో వ్రాసాను. మీరు గమనించాలని అక్షరాలు ఎంత పెద్దగా వ్రాసానో చూడండి. 12 నలుగురిలో మంచి పేరు పొందాలనుకొన్నవాళ్ళు సున్నతి చేయించుకోమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళీ విధంగా చెయ్యటానికి ఒకే ఒక కారణం ఉంది. అది క్రీస్తు సిలువను గురించి బోధించటం వల్ల కలిగే హింసనుండి తప్పించుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం. 13 సున్నతి చేసుకొన్నవాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని ఆచరించరు. కాని శారీరకంగా వాళ్ళు గర్వించటానికి మిమ్మల్ని సున్నతి చేయించుకోమంటున్నారు.
14 యేసు క్రీస్తు ప్రభువు యొక్క సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించను. ఎందుకనగా క్రీస్తు సిలువ ద్వారా లోకానికి నేను, నాకు లోకం చచ్చియున్నాము. 15 సున్నతి చేయించుకొన్నా, చేయించుకోకపోయినా ఒకటే. క్రొత్త జీవితం పొందటం ముఖ్యం. 16 ఈ నియమాల్ని పాటించేవాళ్ళందరికీ, దేవుని ఇశ్రాయేలు ప్రజలకు శాంతి, అనుగ్రహం లభించును గాక.
17 చివరకు, నా దేహంపై యేసును గురించి పొందిన గుర్తులు ఉన్నాయి. కనుక నాకెవ్వరూ ఆటంకం కలిగించకుండా ఉండండి.
18 సోదరులారా! యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహము మీ ఆత్మకు తోడై ఉండుగాక! ఆమేన్.
ఇశ్రాయేలుకు కావలివానిగా దేవుడు యెహెజ్కేలును ఎంపిక చేయటం
33 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 2 “నరపుత్రుడా, నీ ప్రజలతో మాట్లాడు. వారికి ఈ రకంగా చెప్పు, ‘ఈ దేశం మీదికి నేను శత్రు సైన్యాలను రప్పించవచ్చు. అది జరిగినప్పుడు ప్రజలు ఒకనిని కావలివానిగా ఎంపిక చేస్తారు. 3 ఈ కావలివాడు శత్రుసైన్యాలు రావటం చూచి బూర ఊది ప్రజలను హెచ్చరిస్తాడు. 4 ప్రజలు ఆ హెచ్చరికను విని కూడా జాగ్రత్త పడకపోతే శత్రువు వచ్చి వారిని బందీలుగా పట్టుకుపోతాడు. అటువంటి వ్యక్తి తన మరణానికి తనే బాధ్యుడవుతాడు. 5 అతడు బాకా విన్నాడు. అయినా అతడు హెచ్చరికను లెక్కచేయలేదు. అందువల్ల అతని చావుకు అతనినే నిందించాలి. ఆ హెచ్చరికను గనుక అతడు లక్ష్యపెట్టి ఉంటే అతడు తన ప్రాణాన్ని కాపాడుకొనగలిగేవాడు.
6 “‘ఒకవేళ కావలివాడు శత్రుసైనికులు రావటం గమనించి కూడా బూర ఊదకపోవచ్చు. అనగా కావలివాడు ప్రజలను హెచ్చరించలేదన్నమాట. అప్పుడు శత్రువు వారిని పట్టుకొని బందీలుగా తీసుకుపోతాడు. తన పాపం కారణంగా ఒక వ్యక్తి పట్టుబడతాడు. అయినా కావలివాడు ఆ మనిషి చావుకు బాధ్యుడైవున్నాడు.’
7 “నరపుత్రుడా, ఇప్పుడు నేను ఇశ్రాయేలు వంశానికి నిన్ను కావలివానిగా నియమిస్తున్నాను. నీవు నా నోటి నుండి ఒక వర్తమానం వింటే, నా తరఫున ప్రజలను హెచ్చరించాలి. 8 ‘ఈ దుష్ట వ్యక్తి చనిపోతాడు’ అని నేను నీకు చెప్పవచ్చు. అప్పుడు నా తరపున నీవు వెళ్లి అతనిని హెచ్చరించాలి. నీవు వెళ్లి ఆ దుష్ట వ్యక్తిని హెచ్చరించక, తన జీవిత విధానాన్ని మార్చుకోమని చెప్పకపోతే తన పాప ఫలంగా అతడు చనిపోతాడు. కాని అతని చావుకు నేను నిన్ను బాధ్యుణ్ణి చేస్తాను. 9 ఒక వేళ నీవా దుష్టవ్యక్తిని తన దుర్మార్గపు జీవితాన్ని మార్చుకొని, పాపం చేయటం మానమని చెప్పినావనుకో, అయినా ఆ వ్యక్తి పాపం చేయటం మానక పోతే తన పాపాలకు ఫలితంగా అతడు చనిపోతాడు. కానీ నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు.
ప్రజా నాశనం చూడటం దేవునికి ఇష్టంకాదు
10 “కావున నరపుత్రుడా, నా తరపున ఇశ్రాయేలు వంశం వారితో మాట్లాడు. అప్పుడు వారు, ‘మేము పాపం చేశాము. ధర్మాన్ని అతిక్రమించాము. మా పాపాలు భరింపరానివి. ఆ పాపాల కారణంగా మేము కుళ్లిపోతున్నాము. మేము జీవించాలంటే ఏమి చేయాలి?’ అని అడుగవచ్చు.
11 “నీవు వారితో ఇలా చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నా జీవం తోడుగా ప్రజలు చనిపోతూ ఉంటే చూడటం నాకు ఇష్టముండదని మీకు మాట ఇస్తున్నాను. దుష్టులు చనిపోవటం కూడా నాకు ఇష్టంలేనిపని. వారు చనిపోవాలని నేను కోరను. ఆ దుష్ట జనులంతా నా వద్దకు తిరిగి రావాలనే నేను కోరుకుంటాను. వారు తమ జీవితాలను మార్చుకొని నిజంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను! అందువల్ల నా వద్దకు తిరిగి రండి! చెడు కార్యాలు చేయటం మానండి! ఓ ఇశ్రాయేలు వంశీయులారా, మీరెందుకు మరణించాలి?’
12 “నరపుత్రుడా, నీ ప్రజలకు ఇలా చెప్పు, ‘ఒక మంచి వ్యక్తి దుష్టుడై పాపం చేయటం మొదలు పెడితే, అతడు గతంలో చేసిన మంచి పనులు అతనిని రక్షించలేవు. ఆ చెడ్డ వ్యక్తి చెడునుండి పరివర్తన చెంది మంచివాడై సత్కార్యాలు చేస్తే, గతంలో అతడు చేసిన పాపపు పనులు అతనిని నాశనం చేయలేవు. కావున ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఒక మంచి వ్యక్తి దుర్మార్గుడై పాపం చేయడం మొదలుపెడితే అతడు గతంలో చేసిన మంచి పనులు అతనిని రక్షించలేవు.’
13 “ఒక మంచి మనిషికి అతడు జీవిస్తాడని నేను చెప్పవచ్చు. తద్వారా ఆ మంచి మనిషి తను పూర్వం చేసిన సత్కార్యాలు అతనిని రక్షించగలవని అనుకోవటం మొదలు పెట్టవచ్చు. ఆ రకమైన భావనతో అతడు చెడు కార్యాలు చేయటానికి పాల్పడవచ్చు. కాని గతంలో అతడు చేసిన మంచి పనులను నేను గుర్తు పెట్టుకోను! తాను చేయ మొదలు పెట్టిన పాప కార్యాల కారణంగా అతడు చనిపోతాడు.
14 “లేదా, ఒక దుర్మార్గునితో అతడు చచ్చిపోతాడని నేను చెప్పవచ్చు. అయితే అతడు తన జీవితాన్ని మార్చుకోవచ్చు. అతడు పాపం చేయటం మాని, సన్మార్గాన్ని అవలంబించవచ్చు. అతడు మంచివాడై న్యాయశీలి కావచ్చు. 15 అతడు అప్పులిచ్చినప్పుడు తాను కుదువపెట్టుకున్న వస్తువులను తిరిగి ఇచ్చి వేయవచ్చు. అతడు దొంగిలించిన వస్తువులకు తగిన పరిహారం చెల్లించవచ్చు. జీవాన్ని ఇచ్చే కట్టడలను అతడు అనుసరించటం మొదలు పెట్టవచ్చు. అతడు చెడు పనులు చేయటం మానవచ్చు. అప్పుడా వ్యక్తి ఖచ్చితంగా జీనిస్తాడు. అతడు మరణించడు. 16 అతడు గతంలో చేసిన చెడ్డ పనులను నేను గుర్తు పెట్టుకోను. ఎందుకంటే అతడిప్పుడు న్యాయవర్తనుడై మంచి మనిషి అయ్యాడు గనుక. అందుచే అతడు జీవిస్తాడు!
17 “కాని నీ ప్రజలు, ‘అది న్యాయం కాదు! మా ప్రభువైన యెహోవా అలా వుండజాలడు!’ అని అంటారు.
“కాని వారే నిజానికి న్యాయవర్తనులు కాకపోతే! మారవలసిన మనుష్యులు వారే! 18 ఒక మంచి వ్యక్తి సత్కార్యాలు చేయటం మానివేసి పాపం చేస్తే, అతని పాప ఫలితంగా అతడు చనిపోతాడు. 19 ఒక దుర్మార్గుడు చెడు పనులు చేయటం మాని, న్యాయవర్తనుడై మంచి జీవితాన్ని ప్రారంభిస్తే అతడు జీనిస్తాడు! 20 అయినా నేను న్యాయంగా లేనని మీరంటారు. కాని నేను మీకు నిజం చెప్పుచున్నాను. ఇశ్రాయేలు వంశమా, ప్రతి ఒక్కడూ తాను చేసిన పనులను బట్టి తీర్పు పొందుతాడు!”
యెరూషలేము వశపర్చుకొనబడింది
21 అది చెరకి కొనిపోబడిన పన్నెండవ సంవత్సరంలో పదవ నెల (జనవరి) ఐదవరోజు. ఆ రోజున ఒక వ్యక్తి యెరూషలేము నుండి నా వద్దకు వచ్చాడు. అతడక్కడ యుద్ధం నుండి తప్పించుకుని వచ్చాడు. అతడు, “ఆ నగరం (యెరూషలేము) వశపర్చుకోబడింది!” అని అన్నాడు.
22 ఆ మనిషి రావడానికి ముందు నా ప్రభువైన యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. నాకు మాట్లాడే శక్తి లేకుండా దేవుడు చేశాడు. ఆ వ్యక్తి నా వద్దకు వచ్చే సమయానికి యెహోవా నా నోరు తెరపించి, నేను మాట్లాడేలాగు చేశాడు. 23 అప్పుడు యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 24 “నరపుత్రుడా, పాడుపడిన ఇశ్రాయేలు నగరాలలో కొందరు ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తున్నారు. వారు ఇలా అంటున్నారు, ‘అబ్రాహాము ఒక్కడే ఒక్కడు. ఆయినా దేవుడు అతనికి ఈ దేశాన్నంతటినీ ఇచ్చినాడు. ఇప్పుడు మేము చాలా మంది ప్రజలమయ్యాము. కావున ఈ దేశం ఖచ్చితంగా మాకు చెందుతుంది. ఇది మా దేశం!’
25 “ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని నీవు వారికి తప్పక తెలియజేయాలి, ఇంకా ‘రక్తం ఉన్న మాంసాన్ని మీరు తింటున్నారు. సహాయం కొరకు మీరు మీ విగ్రహాలవైపు చూస్తున్నారు. మీరు ప్రజలను హత్య చేస్తారు. కావున ఈ దేశాన్ని మీకు నేనెందుకు ఇవ్వాలి? 26 మీరు మీ కత్తిమీద ఆధారపడతారు. మీలో ప్రతి ఒక్కడూ భయంకరమైన పనులు చేస్తాడు. మీలో ప్రతి ఒక్కడూ మీ పొరుగు వాని భార్యతో వ్యభిచరించి పాపం చేస్తాడు. అందువల్ల మీరు ఈ రాజ్యాన్ని పొందలేరు!’
27 “‘ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని నీవు వారికి తెలియజేయుము, “శిథిలమైన ఆ నగరాలలో నివసిస్తున్న ప్రజలు నా కత్తిచేత చనిపోతారని నా ప్రాణము మీద ప్రమాణం చేసి నేను చెపుతున్నాను. ఆ సమయంలో ఎవరైనా బయట పొలాలలోనికి వెళితే జంతువులు వారిని చంపి తినివేసేలా చేస్తాను. కోటలలోను, గుహలలోను ప్రజలు దాగివుంటే వారు రోగాలతో చనిపోతారు. 28 దేశాన్ని నిర్మానుష్యంగా, ఎడారిగా మార్చేస్తాను. వేటిని చూసుకొని ఆ దేశం గర్వపడుతూ వుందో ఆ వస్తువులనన్నిటినీ అది కోల్పోతుంది. ఇశ్రాయేలు పర్వతాలు శూన్యంగా తయారవుతాయి. ఆ ప్రదేశం గుండా ఎవ్వరూ పయనించరు. 29 ఆ ప్రజలు ఎన్నో భయంకరమైన పనులు చేశారు. అందువల్ల ఆ దేశాన్ని శూన్యమైన ఎడారిలా నేను మార్చివేస్తాను. అప్పుడు నేను యెహోవానని ఈ ప్రజలు తెలుసుకుంటారు.”
30 “‘నరపుత్రుడా, ఇప్పుడు నీ విషయంలో నీవు ఒక మాట చెప్పాలి. నీ ప్రజలు గోడలకు ఆనుకొని, వాకిళ్లలో నిలబడి నిన్ను గురించి మాట్లాడుకుంటారు. వారు ఒకరితో ఒకరు, “రండి, యెహోవా ఏమి చెపుతున్నాడో విందాం” అని చెప్పుకుంటారు. 31 కావున వారు నా ప్రజలవలె నీవద్దకు వస్తారు. నా ప్రజలవలె వారు నీ ముందు కూర్చుంటారు. వారు నీ మాటలు వింటారు. కాని నీవు చెప్పినది మాత్రం వారు ఆచరించరు. వారు ఏది మంచిదనుకుంటే దానినే చేస్తారు. వారు ప్రజలను మోసగించి అధిక ధనవంతులు కావాలని కోరుకుంటారు.
32 “‘వారికి నీవు కేవలం ప్రేమ గీతాలు పాడే ఒక గాయకుడివి మాత్రమే. నీకు మధురమైన కంఠం ఉంది. నీవు సొంపుగా వాద్యం వాయిస్తావు. నీ మాటలు వారు వింటారు గాని, వాటిని ఆచరించరు. 33 అయినా నీవు పాడే విషయాలు తప్పక జరిగి తీరుతాయి. అప్పుడు ప్రజలు తమలో నిజంగా ఒక ప్రవక్త నివసించాడని తెలుసుకుంటారు!’”
సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. ఆసాపు కీర్తన.
81 సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి.
ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో కేకలు వేయండి.
2 సంగీతం ప్రారంభించండి.
గిలక తప్పెట వాయించండి.
స్వరమండలం, సితారాలను శ్రావ్యంగా వాయించండి.
3 నెలవంకనాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి.
పౌర్ణమినాడు[a] గొర్రెపోతు కొమ్ము ఊదండి. ఆనాడే మన పండుగ ఆరంభం.
4 అది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయచట్టం.
ఆ ఆదేశాన్ని యాకోబుకు దేవుడు ఇచ్చాడు.
5 ఈజిప్టునుండి యోసేపును[b] దేవుడు తీసుకొనిపోయిన సమయంలో
దేవుడు వారితో ఈ ఒడంబడిక చేసాడు.
ఈజిప్టులో నేను గ్రహించని భాష విన్నాను.
6 దేవుడు ఇలా చెబుతున్నాడు: “మీ భుజంమీద నుండి బరువు నేను దింపాను.
నేను మీ మోతగంప పడవేయనిచ్చాను.
7 మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం వేడుకొన్నారు. నేను మిమ్మల్ని స్వతంత్రుల్ని చేశాను.
తుఫాను మేఘాలలో దాగుకొని నేను మీకు జవాబు ఇచ్చాను.
నీళ్ల వద్ద నేను మిమ్మల్ని పరీక్షించాను.”
8 “నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడంబడిక[c] నేను మీకు యిస్తాను.
ఇశ్రాయేలూ, నీవు దయచేసి నా మాట వినాలి!
9 విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను
ఎవరినీ ఆరాధించవద్దు.
10 నేను యెహోవాను, నేనే మీ దేవుడను.
మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడను నేనే.
ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు,
నేను దానిని నింపుతాను.
11 “కాని నా ప్రజలు నా మాట వినలేదు.
ఇశ్రాయేలు నాకు విధేయత చూపలేదు.
12 కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయనిచ్చాను.
ఇశ్రాయేలీయులు వారి ఇష్టం వచ్చిందల్లా చేసారు.
13 ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే,
14 అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడిస్తాను.
ఇశ్రాయేలీయులకు కష్టాలు కలిగించే ప్రజలను నేను శిక్షిస్తాను.
15 యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు,
అందుచేత వారు శిక్షించబడతారు.
16 దేవుడు తన ప్రజలకు శ్రేష్ఠమైన గోధుమలు ఇస్తాడు.
తన ప్రజలకు తృప్తి కలిగేంతవరకు వారికి ఆ కొండ తేనె ఇస్తాడు.”
ఆసాపు స్తుతి కీర్తన.
82 దైవ సమాజంలో దేవుడు తన స్థానాన్ని తీసుకొన్నాడు. సమాజంలో దేవుడు నిలుచున్నాడు.
ఆ దేవుళ్ళ సమాజంలో ఆయన తీర్పునిస్తాడు.
2 ప్రజలారా, “ఎంతకాలం మీరు అన్యాయపు తీర్పు తీరుస్తారు?
దుర్మార్గులు శిక్షించబడకుండా ఎన్నాళ్లు తప్పించుకోనిస్తారు?” అని దేవుడు అంటున్నాడు.
3 “అనాధలను, పేద ప్రజలను కాపాడండి.
న్యాయం జరగని పేద ప్రజల, అనాధుల హక్కులను కాపాడండి.
4 పేదలకు, నిస్సహాయ ప్రజలకు సహాయం చేయండి.
దుర్మార్గుల బారినుండి వారిని రక్షించండి.
5 “ఏమి జరుగుతుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు.
వారు గ్రహించరు.
వారు చేస్తున్నది ఏమిటో వారికి తెలియదు.
వారి ప్రపంచం వారి చుట్టూరా కూలిపోతుంది.”
6 నేను (దేవుడు) మీతో చెప్పాను,
“మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు.
7 కాని మనుష్యులందరూ మరణించినట్టుగానే మీరు కూడా మరణిస్తారు.
ఇతర నాయకులందరి వలెనే మీరు కూడా మరణిస్తారు.”
8 దేవా, లెమ్ము. నీవే న్యాయమూర్తివిగా ఉండుము!
దేవా, రాజ్యములన్నీ నీకు చెందినవే.
© 1997 Bible League International