M’Cheyne Bible Reading Plan
అదోనీయా రాజుగా ప్రకటించుకొనుట
1 దావీదు రాజు బాగా ముసలివాడయ్యాడు. అందువల్ల అతను చలికి తట్టుకోలేకపోయాడు. తన సేవకులు ఎన్ని దుప్పట్లు కప్పినాగాని, అతను చలికి వణకి పోతూనే వున్నాడు. 2 కావున అతని సేవకులు అతనితో, “నీ ఆలనాపాలనా చూడటానికి వయస్సులో ఉన్న ఒక అమ్మాయిని మేము చూస్తాము. ఆమె నీ పక్కలో పడుకొని నీకు తగిన వెచ్చదనం సమకూర్చుతుంది.” అని అన్నారు. 3 అలా చెప్పి రాజు సేవకులు ఇశ్రాయేలు రాజ్యమంతా ఒక చిన్నదాని కొరకు వెదక నారంభించారు. రాజుకు వెచ్చదనాన్ని ఇవ్వగలిగే రూపం, యవ్వనం ఉన్న స్త్రీ కొరకు వారు వెదకసాగారు. చివరకు అబీషగు అనబడే షూనేమీయురాలిని చూచి, ఆమెను రాజు వద్దకు తీసుకొని వచ్చారు. 4 ఆమె చాలా అందగత్తె, ఆమె రాజుపట్ల శ్రద్ధ తీసుకొని, అతనికి సేవలు చేయనారంభించింది. కాని రాజైన దావీదు ఆమెను కూడలేదు.
5-6 దావీదు కుమారుడు అదోనీయా “నేనే రాజునౌతానని” అనుకొన్నాడు. (అదోనీయా తల్లి పేరు హగ్గీతు) అదోనీయా చాలా అందమైనవాడు. అతడు రాజు కావాలని మిక్కిలి ఉబలాటపడ్డాడు. అందువల్ల తనకు తానే ఒక రథాన్ని, గుర్రాలను సమకూర్చుకున్నాడు. తన ముందు పరుగెత్తుటకు ఏభై మంది మనుష్యులను కూడా నియమించాడు. అతడు అబ్షాలోము తర్వాత పుట్టాడు. దావీదు రాజు ఎప్పుడూ అదోనీయాను మందలించలేదు, విమర్శించలేదు. “ఏమి చేస్తున్నావు?” అని కాని, “అది ఎందుకు చేశావు?” అని కాని అతడు ఎప్పుడూ అడగలేదు.
7 సెరూయా కుమారుడైన యోవాబుతోను, యాజకుడైన అబ్యాతారుతోను అదోనీయా మాట్లాడాడు. అతడు రాజు అయ్యేలాగ వారు సహాయం చేయడానికి అంగీకరించారు. 8 కాని అదోనీయా రాజు కావడానికి ఒప్పుకోని వారిలో యాజకుడైన సాదోకు, యెహోయాదా కుమారుడైన బెనాయా, ప్రవక్తయైన నాతాను, షిమీ, మరియు దావీదు రాజుయొక్క ప్రత్యేక అంగరక్షకుడైన రేయీ వుండిరి. అందువల్ల వీరు అదోనీయాతో కలియలేదు.
9 అదోనీయా కొన్ని జంతు బలులను అర్పించాడు. అతడు కొన్ని గొర్రెలను, ఆవులను, మరియు కొన్ని బలిసిన కోడెదూడలను సమాధాన బలిగా ఇచ్చాడు. అదోనీయా ఈ బలులన్నీ ఏన్‌రోగేలు దగ్గరవున్న జోహెలేతు అను శిలవద్ద సమర్పించాడు. ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి అదోనీయా చాలామందిని ఆహ్వానించాడు. రాజైన దావీదుయొక్క ఇతర కుమారులను, యూదా పాలకులు, నాయకులందరినీ అదోనీయా ఆహ్వానించాడు. 10 కాని అదోనీయా ప్రవక్తయగు నాతానును గాని, బెనాయానును గాని, తన తండ్రియొక్క ప్రత్యేక అంగరక్షకుని గాని, లేక తన సోదరుడు సొలొమోనును గాని ఆహ్వానించలేదు.
నాతాను బత్షెబాకు సలహా ఇచ్చుట
11 ఇదంతా విన్న నాతాను, సొలొమోను తల్లియైన బత్షెబ వద్దకు వెళ్లి ఇలా అన్నాడు, “హగ్గీతు కుమారుడైన అదోనీయా ఏమి చేస్తున్నాడో నీవు విన్నావా? తనకై తాను రాజుగా ప్రకటించుకొన్నాడు. మన యజమానియైన దావీదు కూడ ఈ విషయం ఎరుగడు. 12 నీ జీవితం, నీ కుమారుడైన సొలొమోను జీవితం ప్రమాదంలో పడవచ్చు. మీ ప్రాణాలను కాపాడుకోవాలంటే నీవు ఏమి చేయాలో నేను చెబుతాను. 13 దావీదు రాజు వద్దకు వెళ్లి, ‘నా ప్రభువైన రాజా, నీ తరువాత రాజ్యానికి వారసుడు నా కుమారుడైన సొలొమోను అవుతాడని నీవు ప్రమాణం చేశావు. కాని ఇప్పుడు అదోనీయా ఎందుకు రాజయ్యాడు?’ అని అడుగు. 14 నీవు అలా మాట్లాడుతూ వుండగా నేను లోపలికి వస్తాను. వచ్చి, నీవు అదోనీయా గురించి చెప్పినదంతా నిజమని రాజుతో నేను చెబుతాను.”
15 తరువాత బత్షెబ రాజును చూడటానికి ఆయన పడకగదిలోనికి వెళ్లింది. రాజు ముసలివాడయ్యాడు. షూనేమీయురాలగు అబీషగు అక్కడ ఆయనకు సేవచేస్తూ వున్నది. 16 బత్షెబ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసింది. “నీకు ఏమి కావాలి?” అని రాజు ప్రశ్నించాడు.
17 బత్షెబ ఇలా చెప్పసాగింది, “మహారాజా! ప్రభువైన నీ దేవుని పేరు మీద నీవు నాకు ఒక ప్రమాణం చేశావు. ‘నా తరువాత నీ కుమారుడైన సొలొమోను రాజవుతాడు. నా సింహాసనం మీద సొలొమోను రాజ్య పాలన చేస్తాడు’ అని అన్నావు. 18 కాని ఇప్పుడు అదోనీయా రాజయ్యాడు. అయినా ఆ విషయం నీకు తెలియదు. 19 సమాధానబలి ఇచ్చే నిమిత్తం అదోనీయా చాలా జంతువులను చంపాడు. అతడు ఆవులను, బలిసిన కోడెదూడలను, గొర్రెలను చంపాడు. మరియు నీ కుమారులనందరినీ ఆహ్వానించాడు. యాజకుడైన అబ్యాతారును, సైన్యాధ్యక్షుడు యోవాబును కూడ అతడు ఆహ్వానించాడు. కాని అతడు నిన్ను సేవించే నా కుమారుడైన సొలొమోనును మాత్రం ఆహ్వానించ లేదు. 20 మహారాజా! ఇశ్రాయేలు ప్రజలంతా నిన్ను గమనిస్తూ వున్నారు. నీ తరువాత నీవు ఎవరిని రాజుగా నియమిస్తావో? అని వారు ఎదురు చూస్తూ వున్నారు. 21 నీ మరణానంతరం, నీ పితరులతో నీవు సమాధి చేయబడతావు. ప్రజలు మాత్రం నేను, సొలొమోను నేరస్థులమని భావిస్తారు.”
22 బత్షెబ ఇలా రాజుతో మాట్లాడుతూ వుండగా, ప్రవక్తయగు నాతాను రాజును చూడటానికి వచ్చాడు. 23 “ప్రవక్తయగు నాతాను ఇక్కడికి వచ్చాడు” అని సేవకులు రాజుతో చెప్పారు. నాతాను రాజువద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాడు. 24 నాతాను రాజుతో ఇలా అన్నాడు, “నా ప్రభువా, నీ తరువాత రాజ్య పాలనకు కొత్త రాజుగా అదోనీయాను ప్రకటించావా? నీ తరువాత ప్రజాపాలన చేయటానికి అదోనీయాను నియమించాలని నిర్ణయించావా? 25 ఈ రోజు అతను సమాధాన బలులు అర్పించాడు. అతడు చాలా ఆవులను, బలిసిన కోడెదూడలను, గొర్రెలను చంపాడు. నీ యొక్క ఇతర కుమారులనందరిని, సైన్యాధ్యక్షుడిని, యాజకుడైన అబ్యాతారును అతడు పిలిచాడు. ఈ సమయంలో వారంతా అతనితో కలిసి తాగుతూ, తింటూ వేడుక చేసుకొంటున్నారు. పైగా, ‘రాజైన అదోనీయా వర్ధిల్లు గాక!’ అని వారంతా అంటున్నారు. 26 కాని అతను నన్నుగాని, యాజకుడైన సాదోకును గాని, యెహోయాదా కుమారుడైన బెనాయాను గాని, నీ కుమారుడైన సొలొమోనును గాని పిలువలేదు. 27 ఇదంతా చేసింది నీవేనా? మేము నిన్ను సేవిస్తూ నీకు విధేయులమైయున్నాము కదా, అయినను నీ తరువాత నీ వారసుడుగా ఎవరిని ఎన్నుకున్నదీ మాకు ఎందుకు చెప్పలేదు?”
28 ఇది విన్న రాజు బత్షెబను పిలువనంపాడు. రాజు ముందుకు బత్షెబ వచ్చింది.
29 అప్పుడు రాజు ఒక ప్రమాణం చేశాడు, “నా ప్రభువైన దేవుడు నాకు సంభవించిన ప్రతి ఆపదనుండి నన్ను కాపాడాడు. నా ప్రభువైన దేవుడు నిత్యుడు. ఆ దైవశక్తితో నేను ప్రమాణం చేస్తున్నాను: 30 గతంలో నీకు నేనిచ్చిన మాటను ఈ రోజు నెరవేర్చుతాను. ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవా యొక్క శక్తితో నేనీ ప్రమాణం చేసియున్నాను. నా తరువాత నీ కుమారుడైన సొలొమోను రాజవుతాడని నీకు ప్రమాణం చేశాను. నా తరువాత నా సింహాసనం మీద నా స్థానాన్ని అతడు పొందుతాడని కూడా మాట ఇచ్చాను. నేను నా మాట నిలబెట్టుకుంటాను.”
31 తరువాత బత్షెబ రాజుముందు సాగిలపడి, “రాజైన దావీదు వర్ధిల్లు గాక!” అని అన్నది.
దావీదు సొలొమోనును రాజుగా చేయటం
32 రాజైన దావీదు అప్పుడు “యాజకుడగు సాదోకును, ప్రవక్తయగు నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలువనంపాడు.” వారు ముగ్గురూ రాజు వద్దకు వచ్చారు. 33 “మీరు రాజాధికారులను మీతో తీసుకొని, నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిదపై ఎక్కించి దిగువనున్న గిహోను చలమ[a] దగ్గరకు తీసుకొని వెళ్లండి. 34 అక్కడ యాజకుడైన సాదోకు, ప్రవక్తయగు నాతాను అతనిని ఇశ్రాయేలు రాజుగా అభిషిక్తుని చేయాలి. బూర ఊది ‘ఇదిగో కొత్తరాజు సొలొమోను!’ అని చాటాలి. 35 తరువాత అతనితో కలిసి ఇక్కడకి తిరిగిరండి. అతడు నా సింహాసనం మీద కూర్చుండి, నా స్థానంలో రాజుగా వ్యవహరిస్తాడు. ఇశ్రాయేలు మీద, యూదా మీద రాజుగా వుండటానికి నేనతనిని ఎన్నుకున్నాను,” అని రాజైన దావీదు వారితో అన్నాడు.
36 యెహోయాదా కుమారుడైన బెనాయా రాజుతో, “అది చాలా మంచి పని! నీ దేవుడైన యెహోవా అది జరిగేలా చేయునుగాక! 37 యెహోవా ఎల్లప్పుడు మా యజమాని రాజువైన నీకు సహాయపడుతూ వచ్చాడు. యెహోవా ఇప్పుడు సొలొమోనుకు సహాయపడును గాక! దేవుడు సొలొమోనును కూడా నీకంటె ఘనమైన రాజుగా చేయునుగాక!” అని అన్నాడు.
38 కావున సాదోకు, నాతాను, బెనాయా, రాజు యొక్క సేవకులు రాజాజ్ఞ శిరసావహించారు. సొలొమోనును రాజు యొక్క కంచర గాడిదపై ఎక్కించి వారతనితో గిహోనుకు వెళ్లారు. 39 యాజకుడైన సాదోకు పవిత్ర గుడారము నుండి తనతో నూనె పట్టుకెళ్లాడు. సాదోకు ఆ నూనెను సొలొమోను తలపైపోసి రాజుగా అభిషిక్తుని చేశాడు. వారప్పుడు బాకా వూదగా అక్కడున్న ప్రజలంతా, “సొలొమోను రాజు వర్ధిల్లుగాక!” అని అన్నారు. 40 ఆ ప్రజలంతా సొలొమోనుతో కలిసి నగరానికి వచ్చారు. వారు పిల్లనగ్రోవులను ఊదుతూ, జయజయ ధ్వనులు చేయసాగారు. వారు సంతోషంతో భూమి అదిరేలా కేకలేశారు.
41 ఆ సమయంలో అదోనీయా, మరియు అతనితో ఉన్న అతిథులు భోజనాలు పూర్తి చేస్తున్నారు, వారు బూరనాదం విన్నారు. “నగరంలో ఏమి జరుగుతూ వుంది, మనం వినే శబ్దం ఏమిటి?” అని యోవాబు అడిగాడు.
42 యోవాబు అలా మాట్లాడుతూ వుండగానే యాజకుడైన అబ్యాతారు కుమారుడు యోనాతాను అక్కడికి వచ్చాడు. అదోనీయా అతనిని చూసి “రా, లోనికి రా! నీవు చాలా మంచివాడవు[b] నీవు ఏదైనా మంచివార్తే నాకు తెస్తూ వుండవచ్చు” అని అన్నాడు.
43 కాని యోనాతాను ఇలా సమాధాన మిచ్చాడు, “కాదు! ఇది నీకు శుభవార్త కాదు. మన రాజైన దావీదు సొలొమోనును రాజుగా ప్రకటించాడు. 44 రాజైన దావీదు యాజకుడైన సాదోకును, ప్రవక్తయగు నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, మరియు తన సేవకులను అతనితో పంపాడు. వారు సొలొమోనును రాజు యొక్క స్వంత కంచర గాడిదపై కూర్చుండబెట్టారు. 45 తరువాత యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను ఇరువురూ సొలొమోనుకు గిహోను వద్ద పట్టాభిషేకం చేశారు. వారప్పుడు నగరానికి తిరిగి వెళ్లారు. ప్రజలు వారిననుసరించి వెళ్లారు. కావున ఇప్పుడు నగరంలో జనమంతా చాలా సంతోషంగా వున్నారు. ఆ శబ్ధమే మీరిప్పుడు వింటున్నారు. 46 సొలొమోను ఇప్పుడు రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. 47 రాజు యొక్క సేవకులంతా రాజైన దావీదు వద్దకు అతను మంచిపని చేసినట్లు చెప్పటానికి వచ్చారు. వారంతా, ‘దావీదు రాజా, నీవు చాలా గొప్ప రాజువి! కాని నీ దేవుడు సొలొమోనును కూడ ఒక గొప్పరాజుగా చేయాలని ప్రార్థిస్తున్నాము. నీ దేవుడు సొలొమోనును నీకంటె ఖ్యాతిగల రాజుగా చేయును గాక. నీ రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా ఉండునట్లు చేయునుగాక!’ అని అంటున్నారు. యోనాతాను నగరంలో జరుగుతున్న విషయాలు అదోనీయాతో ఇంకా ఇలా చెప్పసాగాడు: తరువాత రాజైన దావీదు దేవుని ప్రార్థించటానికి తన పక్కమీదే సాష్టాంగ పడ్డాడు. 48 ‘ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవాకు జయమగును గాక! యెహోవా నా కుమారులలో ఒకనిని నా సింహాసనం మీద కూర్చుండ జేశాడు. దేవుడు అది నేను చూడగలిగేలా చేశాడు’ అని దావీదు రాజు అన్నాడు.”
49 ఇది విన్న అదోనీయా, అతిథులందరూ భయపడి అక్కడి నుండి త్వరగా వెళ్లిపోయారు. 50 అదోనీయా కూడ సొలొమోనుకు భయపడ్డాడు. కావున అతడు బలిపీఠం వద్దకు వెళ్లి, ఆ పీఠపు కొమ్ములను[c] పట్టుకున్నాడు. 51 ఈ లోపు ఒకడు సొలొమోను వద్దకు వెళ్లి, “అదోనీయా నీవంటే చాలా భయపడిపోతున్నాడు. అతడు బలిపీఠం వద్ద ఉన్నాడు. అతడు బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, అక్కడినుండి పోవటం లేదు. సొలొమోను వద్దకు ఎవరైనా వెళ్లి తనను చంపకుండా వుండేలా ప్రమాణం చేయించమని వేడుకుంటున్నాడు” అని చెప్పాడు.
52 అది విన్న సొలొమోను, “అదోనీయా గనుక బుద్ధిమంతునిలా మెలిగితే, అతని తలమీది ఒక్క వెంట్రుక కూడ రాలదని నేను ప్రమాణం చేస్తున్నాను. కాని అతడేమైనా పొరపాటు చేస్తే, వాడు చావటం ఖాయం” అని అన్నాడు. 53 అప్పుడు సొలొమోను కొంతమందిని పంపి అదోనీయాను తీసుకొని రమ్మన్నాడు. వారు అదోనీయాను రాజైన సొలొమోను వద్దకు తీసుకొచ్చారు. అదోనీయా రాజైన సొలొమోను ముందుకు వచ్చి సాష్టాంగపడ్డాడు. “నీవు ఇంటికి వెళ్లు” అని సొలొమోను అతనితో అన్నాడు.
క్రీస్తు వల్లనే స్వేచ్ఛ
5 మనము స్వతంత్రంగా ఉండాలని క్రీస్తు మనకు స్వేచ్ఛ కలిగించాడు. కనుక పట్టుదలతో ఉండండి. “ధర్మశాస్త్రం” అనే బానిసత్వంలోనికి పోకుండా జాగ్రత్త పడండి. 2 నా మాట వినండి. మీరు సున్నతి చేయించుకోవటానికి అంగీకరిస్తే క్రీస్తు వల్ల మీకు ఏ మాత్రమూ ప్రయోజనంలేదని పౌలను నేను చెపుతున్నాను. 3 సున్నతి చేయించుకోవటానికి అంగీకరించినవాడు ధర్మశాస్త్రాన్నంతా పాటించవలసి వస్తుందని నేను మళ్ళీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చెపుతున్నాను. 4 ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా కావాలనుకొంటున్న మీరు స్వయంగా క్రీస్తులోనుండి విడిపోయారు. తద్వారా దైవానుగ్రహాన్ని పోగొట్టుకొన్నారు. 5 కాని, మనము పరిశుద్ధాత్మ ద్వారా ఆశిస్తున్న నీతి, విశ్వాసం ద్వారా లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించి దానికోసం నిరీక్షిస్తున్నాము. 6 ఎందుకంటే యేసుక్రీస్తు దృష్టిలో సున్నతికి విలువ లేదు. సున్నతి చేసుకొన్నా, చేసుకోకపోయినా ఒకటే. ప్రేమ ద్వారా వ్యక్తమయ్యే విశ్వాసానికి మాత్రమే విలువ ఉంటుంది.
7 మీరు పందెంలో బాగా పరుగెత్తుచుంటిరి. ఈ సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆటంకపరిచారు? 8 మిమ్మల్ని పిలిచినవాడు ఆటంక పరచలేదు. 9 “పులుపు కొంచెమైనా, పిండినంతా పులిసేటట్లు చేస్తుంది” అని మనకు తెలుసు. 10 మీరు మరో విధంగా ఆలోచించరని ప్రభువునందు నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. మీ దృఢ విశ్వాసాన్ని కదిలిస్తున్నవాడు, ఎవడైనా సరే వాడు తప్పక శిక్షననుభవిస్తాడు.
11 నా సోదరులారా, సున్నతి చేయించుకోవాలని నేనింకా బోధిస్తున్నట్లైతే, నన్ను వాళ్ళెందుకు ఇంకా హింసిస్తున్నారు? నేను ఆ విధంగా ఉపదేశిస్తున్నట్లయితే నేను సిలువను గురించి బోధించినా ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. 12 మిమ్మల్ని కలవర పెట్టేవాళ్ళు పూర్తిగా అంగచ్ఛేదన జరిగించుకోవటం మంచిది.
13 నా సోదరులారా! మీరు స్వేచ్ఛగా జీవించాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరీ స్వేచ్ఛను మీ శారీరక వాంఛలు తీర్చుకోవటానికి ఉపయోగించకండి. దానికి మారుగా ప్రేమతో పరస్పరం సహాయం చేసుకొంటూ ఉండండి. 14 “నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు”(A) అన్న ఒకే నియమంలో ధర్మశాస్త్రమంతా యిమిడి ఉంది. 15 మీరీ విధంగా కలహములాడుకొంటూ, హింసించుకొంటూ ఉంటే మిమ్మల్ని మీరు నాశనం చేసుకొంటారు. అలా జరగక ముందే జాగ్రత్త పడండి.
పరిశుద్ధాత్మ మరియు మానవ స్వభావం
16 కనుక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జీవించండి. అప్పుడు మీ మానవ స్వభావం వల్ల కలిగే వాంఛల్ని తీర్చుకోకుండా ఉండగలరు. 17 ఎందుకంటే మానవ స్వభావము పరిశుద్ధాత్మ కోరుకొంటున్నదానికి విరుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ కోరేది మన స్వభావం కోరేదానికి విరుద్ధంగా ఉంటుంది. ఇవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. తద్వారా మీరు చెయ్యాలనుకుంటున్నదాన్ని చెయ్యలేకపోతున్నారు. 18 కాని పరిశుద్ధాత్మ చూపిన మార్గాన్ని అనుసరిస్తే ధర్మశాస్త్రం మిమ్మల్ని బంధించదు.
19 మానవ స్వభావం యొక్క పనులు మనకు బాగా తెలుసు. అవేవనగా వ్యభిచారము, అపవిత్రత, కామము, 20 విగ్రహారాధన, మంత్రతంత్రాలు, ద్వేషము, కలహము, ఈర్ష్య, కోపము, స్వార్థము, విరోధము, చీలికలు, 21 అసూయ, త్రాగుబోతుతనము, కామకేళీలు మొదలగునవి. వీటిని గురించి నేనిదివరకే వారించాను. మళ్ళీ వారిస్తున్నాను. ఈ విధంగా జీవించేవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. 22 కాని పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఫలాలు ప్రేమ, ఆనందం, శాంతం, సహనం, దయ, మంచితనం, విశ్వాసం, 23 వినయం, ఆత్మ నిగ్రహం. వీటికి విరుద్ధంగా ఏ చట్టమూ లేదు. 24 యేసుక్రీస్తుకు చెందినవాళ్ళు తమ శరీరాన్ని, దానికి చెందిన మోహాలను, కోరికలను సిలువకు వేసి చంపారు. 25 మనము పరిశుద్ధాత్మ వలన జీవిస్తున్నాము. కనుక ఆయన ప్రకారము నడుచుకొందాము. 26 ఒకరికొకర్ని రేపకుండా, ద్వేషించకుండా, గర్వించకుండా ఉందాం.
ఫరో ఒక సింహమా? ఘటసర్పమా?
32 చెరకి కొనిపోబడిన పన్నెండవ సంవత్సరం, పన్నెండవ నెల (మార్చి) మొదటి రోజున యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 2 “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోను గురించి ఈ విషాద గీతిక ఆలపించు. అతనితో ఇలా చెప్పు:
“‘దేశాల మధ్య గర్వంగా తిరుగాడే బలమైన యువకిశోరం అని నీకు నీవే తలుస్తున్నావు.
కాని, నిజానికి నీవు సముద్రాల్లో తిరుగాడే మహాసర్పానివా.
నీటి కాలువల గుండా నీ దారిని తీసుకొంటున్నావు.
నీ కాళ్లతో కెలికి నీళ్లను మురికి చేస్తున్నావు.
నీవు ఈజిప్టు నదులను కెలుకుతున్నావు.’”
3 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“అనేక మంది ప్రజలను నేను ఒక దగ్గరికి చేర్చాను.
నేనిప్పుడు నా వలను నీ మీదికి విసురుతాను.
ఆ ప్రజలంతా అప్పుడు నిన్ను లోపలికి లాగుతారు.
4 పిమ్మట నిన్ను ఎండిన నేలపై నేను పడేస్తాను.
నిన్ను పొలాల్లో విసరివేస్తాను.
నిన్ను తినటానికి పక్షులన్నిటినీ రప్పిస్తాను.
కడుపునిండా నిన్ను తినటానికి అన్నిచోట్ల నుండి అడవి జంతువులను రప్పిస్తాను.
5 నీ కళేబరాన్ని పర్వతాల మీద చిందర వందరగా వేస్తాను.
నీ కళేబరంతో లోయలు నింపుతాను.
6 నీ రక్తాన్ని పర్వతాలపై నేను ఒలక బోస్తాను.
అది భూమిలో ఇంకిపోతుంది.
నదులన్నీ నీతో నిండి ఉంటాయి.
7 నిన్ను మాయం చేస్తాను.
నేను ఆకాశాన్ని కప్పివేసి నక్షత్రాలు కన్పించకుండా చేస్తాను.
ఒక మేఘంతో నేను సూర్యుణ్ణి కప్పివేయగా చంద్రుడు ప్రకాశించడు.
8 ఆకాశంలో మెరిసే జ్యోతులన్నీ నీపై వెలుగును ప్రసరించకుండా చేస్తాను.
నీ దేశమంతటా నేను చీకటిమయం చేస్తాను.
9 “నిన్ను నాశనం చేయటానికి నీ మీదికి నేను శత్రువును తీసుకొని వచ్చినట్లు తెలుసుకొని అనేక మంది ప్రజలు దుఃఖముఖులై, తలక్రిందులౌతారు. నీ వెరుగని దేశాలు కూడా కలవరపాటు చెందుతాయి. 10 నీ విషయంలో చాలా మంది ఆశ్చర్యపోయేలా చేస్తాను. నేను నా కత్తిని వారి ముందు ఝుళిపించడానికి మునుపే వారి రాజులు నీ విషయంలో విపరీతంగా భయపడతారు. నీవు పతనమైన రోజున ప్రతిక్షణం రాజులు భయంతో కంపించి పోతారు. ప్రతీ రాజూ తనభద్రత కొరకు భయపడతాడు.”
11 దానికి తగిన కారణం నా ప్రభువైన యెహోవా ఇలా తెలియజేస్తున్నాడు: “బబులోను రాజు యొక్క కత్తి నీపై యుద్ధానికి వస్తుంది. 12 యుద్ధంలో నీ ప్రజలను చంపటానికి నేను ఆ సైనికులను వినియోగిస్తాను. అన్ని దేశాలలో అతి భయంకరమైన దేశం నుండి ఆ సైనికులు వస్తారు. ఈజిప్టు అతిశయపడే వస్తువులన్నిటినీ వారు ధ్వంసం చేస్తారు. ఈజిప్టు ప్రజలు నాశనం చేయబడతారు. 13 ఈజిప్టు నదీ తీరాలలో అనేకమైన జంతువులున్నాయి. ఆ జంతువులన్నిటినీ కూడ నేను నాశనం చేస్తాను! ప్రజలిక ఎంతమాత్రం తమ కాళ్లతో నీటిని మురికిచేయరు. ఆవుల గిట్టలు ఇక ఎంతమాత్రం నీటిని మురికి చేయవు. 14 ఆ విధంగా ఈజిప్టు నీటిని నేను శాంతపర్చుతాను. వారి నదులు ప్రశాంతంగా ప్రవహించేలా చేస్తాను. అవి నూనెవలె మృదువుగా జాలు వారుతాయి.” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు. 15 “నేను ఈజిప్టు దేశాన్ని ఏమీ లేకుండా చేస్తాను. ఆ రాజ్యం సమస్తాన్ని కోల్పోతుంది. ఈజిప్టులో నివసిస్తున్న ప్రజలందరినీ నేను శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని, ప్రభువునని వారు గుర్తిస్తారు!
16 “ఈజిప్టు కొరకు ప్రజలు పాడే ఒక విషాద గీతిక ఇది. ఇతర దేశాల కుమార్తెలు (నగరాలు) ఈజిప్టును గూర్చి ఈ విలాప గీతం పాడతారు. ఈజిప్టును గురించి, దాని ప్రజల గురించి వారు దీనిని విలాప గీతంగా ఆలపిస్తారు.” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
ఈజిప్టు నాశనమవబోవటం
17 దేశం నుండి వెళ్లగొట్టబడిన పన్నెండవ సంవత్సరంలో, అదే నెలలో పదిహేనవ రోజున యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 18 “నరపుత్రుడా, ఈజిప్టు ప్రజల కొరకు విలపించు. ఈజిప్టును, ఇతర బలమైన దేశాల కుమార్తెలను సమాధికి నడిపించు. పాతాళానికి చేరిన ఇతర జనులతో ఉండటానికి వారిని అధోలోకానికి నడిపించు.
19 “ఈజిప్టూ, నీవు ఇతరులెవరికంటెను గొప్ప దానివి కాదు! మృత్యు స్థానానికి వెళ్లు! వెళ్లి, అక్కడ అన్యజనులతో పడివుండు.
20 “యుద్ధంలో హతులైన వారందరితో కలిసి ఉండటానికి ఈజిప్టు వెళుతుంది. శత్రువు ఆమెను, ఆమె జనులను దూరంగా లాగి పడవేసినాడు.
21 “బలవంతులు, పరాక్రమశాలులు యుద్ధంలో చంపబడ్డారు. ఆ పరాయి వారంతా మృత్యు స్థలానికి దిగి వెళ్లారు. ఆ ప్రదేశం నుండి చనిపోయిన మనుష్యులు ఈజిప్టుతోను, దాని సహాయకులతోను మాట్లాడతారు వారు కూడ యుద్ధంలో చంపబడతారు.
22-23 “అష్షూరు, దాని సర్వ సైన్యము మృత్యులోకంలో ఉన్నాయి. వారి సమాధులు అడుగున ఆ రంధ్రంలో ఉన్నాయి. అష్షూరు సైనికులంతా యుద్ధంలో హతులయ్యారు. అష్షూరు సైన్యం దాని సమాధి చుట్టూ మూగింది. బతికి ఉన్నప్పుడు వారు ప్రజలను భయపెట్టారు. కాని వారంతా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. వారంతా యుద్ధంలో చంపబడ్డారు.
24 “ఏలాము అక్కడ ఉన్నది. దాని సైన్యమంతా దాని సమాధి చుట్టూ ఉంది. వారంతా యుద్ధంలో చనిపోయారు. ఆ విదేశీయులు భూమిలోకి లోతుగాపోయారు. బతికి ఉన్నప్పుడు వారు ప్రజలను భయపెట్టారు. వారి అవమానాన్ని వారు పాతాళానికి తమ తోనే తీసుకొని పోయారు. 25 ఏలాముకు, యుద్ధంలో చనిపోయిన సైనికులందరికీ వారు పడక ఏర్పాటు చేశారు. ఏలాము సైన్యమంతా దాని సమాధి చుట్టూ చేరింది. ఆ విదేశీయులందరూ యుద్ధంలో హతులయ్యారు. వారు జీవించి ఉన్నప్పుడు వారు ప్రజలను భయపెట్టారు. కాని వారి అవమానాన్ని వారు తమతో పాతాళానికి తీసుకొని పోయారు. చనిపోయిన వారందరితోపాటు వారు ఉంచబడ్డారు.
26 “మెషెకు, తుబాలు మరియు వాటి సైన్యాలు అక్కడ ఉన్నాయి. వాటి సమాధులు వాటిచుట్టూ ఉన్నాయి. విదేశీయులు యుద్ధంలో చంపబడ్డారు. వారు జీవించి ఉన్న సమయంలో వారు ప్రజలను భయపెట్టారు. 27 కాని ఏనాడో చనిపోయిన పరాక్రమశాలుల ప్రక్కన వారిప్పుడు పడుకొని ఉన్నారు! వారు తమ యుద్ధాయుధాలతో సమాధి చేయబడ్డారు. వారి కత్తులు వారి తలల క్రింద ఉంచబడతాయి. కాని వారి పాపాలు మాత్రం వారి ఎముకల మీద ఉన్నాయి. ఎందువల్లనంటే వారు జీవించి వున్న కాలంలో వారు ప్రజలను భయపెట్టారు.
28 “ఈజిప్టూ, నీవు కూడా నాశనం చేయబడతావు. సున్నతి సంస్కారం లేని విదేశీయులు నిన్ను పడుకోబెడతారు. యుద్ధంలో చనిపోయిన ఇతర సైనికులతో పాటు నీవు కూడా ఉంటావు.
29 “ఎదోము కూడా అక్కడ ఉన్నాడు. అతని రాజులు, ఇతర నాయకులు అతనితో అక్కడ ఉన్నారు. వారు శూరులైన సైనికులు కూడా. అయినా వారు యుద్ధంలో చనిపోయిన విదేశీయులతో పడివున్నారు. వారంతా అక్కడ పరాయి వారితో పడివున్నారు. బాగా లోతైన రంధ్రంలో ప్రజలతో వారు అక్కడ ఉన్నారు.
30 “ఉత్తరదేశ రాజులంతా అక్కడ ఉన్నారు! సీదోనుకు చెందిన సైనికులంతా అక్కడ ఉన్నారు. వారి బలం ప్రజలను భయపెట్టింది. కాని వారు ఇబ్బంది పడ్డారు. ఆ విదేశీయులు కూడా యుద్ధంలో చనిపోయిన ఇతరులతో పండుకొని ఉన్నారు. వారితో పాటు తమ అవమానాన్ని కూడా పాతాళానికి తీసుకొని పోయారు.
31 “మృత్యు లోకంలోకి పోయిన ప్రజలను ఫరో చూస్తాడు. అతడు, అతనితో ఉన్న అతని మనుష్యులందరూ అప్పుడు ఊరట చెందుతారు. అవును, ఫరో మరియు అతని సర్వ సైన్యం యుద్ధంలో చంపబడతారు.” ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
32 “ఫరో జీవించి ఉన్న కాలంలో అతనంటే ప్రజలు భయపడేలా నేను చేశాను. కాని ఇప్పుడతడు విదేశీయులతో పడి ఉంటాడు. ఫరో, అతని సైన్యం యుద్ధంలో చనిపోయిన ఇతర సైనికులతో పాటు పడివుంటారు.” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
సంగీత నాయకునికి: “ఒప్పందం పుష్పాలు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.
80 ఇశ్రాయేలీయుల కాపరీ, నా మాట వినుము.
యోసేపు గొర్రెలను (ప్రజలను) నీవు నడిపించుము.
కెరూబులపై నీవు రాజుగా కూర్చున్నావు. ప్రకాశించుము.
2 ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేలకు నీ మహాత్యం చూపించుము.
వచ్చి మమ్మల్ని రక్షించుము.
3 దేవా, మరల మమ్మల్ని స్వీకరించుము.
మేము రక్షించబడునట్లు నీ ముఖాన్ని మా మీద ప్రకాశింపచేయుము.
4 సర్వశక్తిగల యెహోవా దేవా, నీవు మా మీద ఎప్పటికి కోపంగానే ఉంటావా?
మా ప్రార్థనలు నీవు ఎప్పుడు వింటావు?
5 నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు.
నీ ప్రజల కన్నీళ్లతో నిండిన పాత్రలే నీవు నీ ప్రజలకు ఇచ్చావు. అవే వారు తాగుటకు నీళ్లు.
6 మా పొరుగువారు పోరాడుటకు నీవు మమ్మల్ని హేతువుగా ఉండనిచ్చావు.
మా శత్రువులు మమ్మల్ని చూచి నవ్వుచున్నారు.
7 సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము.
నీ ముఖము మామీద ప్రకాశించునట్లు మమ్మల్ని రక్షించుము.
8 గతకాలంలో నీవు మమ్మల్ని ప్రాముఖ్యమైన మొక్కలా చూశావు.
ఈజిప్టు నుండి నీవు నీ “ద్రాక్షాలత” తీసుకొని వచ్చావు.
ఇతర ప్రజలను ఈ దేశం నుండి నీవు వెళ్లగొట్టావు.
నీ “ద్రాక్షావల్లిని” నీవు నాటుకొన్నావు.
9 “ద్రాక్షావల్లి” ఎదుగుటకు నేలను నీవు సిద్ధం చేశావు.
దాని వేర్లు బలంగా ఎదుగుటకు నీవు సహాయం చేశావు త్వరలోనే “ద్రాక్షావల్లి” దేశం అంతా వ్యాపించింది.
10 అది పర్వతాలను కప్పివేసింది.
దాని ఆకులు మహాదేవదారు వృక్షాలను సహా కప్పివేసాయి.
11 దాని తీగెలు మధ్యధరా సముద్రం వరకు విస్తరించాయి. దాని కొమ్మలు యూఫ్రటీసు నది వరకూ విస్తరించాయి.
12 దేవా, నీ “ద్రాక్షావల్లిని” కాపాడుతున్న గోడను నీవెందుకు పడగొట్టావు?
ఇప్పుడు దారిన పోయే ప్రతిమనిషీ దాని ద్రాక్షాపండ్లను కోసుకొంటున్నాడు.
13 అడవి పందులు వచ్చి నీ “ద్రాక్షావల్లి” మీద నడుస్తాయి.
అడవి మృగాలు వచ్చి ఆకులు తింటాయి.
14 సర్వశక్తిగల దేవా, తిరిగి రమ్ము.
పరలోకం నుండి నీ “ద్రాక్షావల్లిని” చూడుము. దానిని కాపాడుము.
15 దేవా, నీ స్వంత చేతులతో నీవు నాటుకొన్న నీ “ద్రాక్షావల్లిని” చూడుము.
నీవు పెంచిన ఆ లేత మొక్కలను[a] చూడుము.
16 అగ్నితో నీ “ద్రాక్షావల్లి” కాల్చివేయబడింది.
నీవు దానిమీద కోపగించి నీవు దాన్ని నాశనం చేశావు.
17 దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని ఆదుకొనుము.
నీవు పెంచిన నీ కుమారుని ఆదుకొనుము.
18 అతడు మరల నిన్ను విడువడు.
అతన్ని బ్రదుక నీయుము. అతడు నీ నామాన్ని ఆరాధిస్తాడు.
19 సర్వశక్తిమంతుడవైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము.
నీ ముఖ మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము.
© 1997 Bible League International