M’Cheyne Bible Reading Plan
దావీదు తన సైన్యాన్ని లెక్కింప నిర్ణయం
24 యెహోవా మరోసారి ఇశ్రాయేలీయుల పట్ల కోపం చెందాడు. యెహోవా దావీదును ఇశ్రాయేలీయులకు వ్యతిరేకమయ్యేలా చేశాడు. యెహోవా దావీదుతో, “వెళ్లు, ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించు” అని అన్నాడు.
2 దావీదు రాజు సైన్యాధక్షుడైన యోవాబును పిలిచి, “దాను నుండి బెయేర్షెబా వరకు తిరిగి ఇశ్రాయేలీయుల వంశాల వారందరినీ లెక్కించు. దానివల్ల వారెంత మంది వున్నారో నాకు తెలుస్తుంది,” అని అన్నాడు.
3 కాని యోవాబు రాజైన దావీదుతో ఇలా అన్నాడు, “ఇప్పటి జనాభా ఎంతైనా వుండనీ; నీ ప్రభువైన దేవుడు అంతకు వంద రెట్లు ప్రజలను నీకు యిచ్చుగాక! ఇది జరుగగా నీవు చూడాలని కాంక్షిస్తున్నాను. అయినా ఈ పని నీవెందుకు తల పెట్టావు?”
4 రాజు అది విని యోవాబును, సైన్యాధికారులను జనాభా లెక్కలు తీయమని తీవ్రంగా ఆజ్ఞాపించాడు. దానితో యోవాబు, సైన్యాధికారులు ఇశ్రాయేలులో జనాభా లెక్కలు తీయటానికి రాజును విడిచి వెళ్లారు. 5 వారు యోర్దాను నదిదాటారు. అరోయేరు వద్ద గుడారాలు వేశారు. వారి గుడారాలు లోయలోని నగరానికి కుడిప్రక్కగా వున్నవి. (నగరం గాదులోయ మధ్యలో వుంది. యాజేరుకు వెళ్లే మార్గంలోనే నగరంవుంది)
6 వారు గిలాదుకు, తహ్తింహోద్షీ దేశానికి వెళ్లారు. వారింకా దానాయానుకు, సీదోను ప్రాంతానికి వెళ్లారు. 7 వారు తూరు కోటను, మరియు హివ్వీయుల, కనానీయుల యొక్క నగరాలను దర్శించారు. వారు యూదా దేశపు దక్షిణ ప్రాంతాన గల బెయేర్షెబా చేరారు. 8 ఇలా దేశమంతా వారు తొమ్మిది నెలల, ఇరువది రోజుల పాటు తిరిగి చివరికి యెరూషలేముకు వచ్చారు.
9 జనాభా పట్టికను యోవాబు రాజుకు సమర్పించాడు. ఇశ్రాయేలులో కత్తి పట్టగల జనం ఎనిమిది లక్షలవరకు వున్నారు. యూదాలో ఐదులక్షల మంది వున్నారు.
దావీదును యెహోవా శిక్షించటం
10 జనాభా లెక్కలు చూసినందుకు దావీదు సిగ్గుపడ్డాడు. దావీదు యెహోవాకి ఇలా విన్నవించుకున్నాడు, “నేను చేసిన ఈ పనివల్ల నేను చాలా పాపం మూటగట్టుకున్నాను. ప్రభూవా, నా పాపాన్ని క్షమించమని వేడుకుంటున్నాను. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను.”
11 దావీదు ఉదయం నిద్రలేచే సరికి యెహోవా వాక్యం గాదుకు చేరింది. గాదు ప్రవక్త దావీదుకు సన్నిహితుడు. 12 గాదుకు యెహోవా ఇలా చెప్పాడు: “దావీదు వద్దకు వెళ్లి నా మాటగా ఈ విషయం చెప్పు: యెహోవా మూడు విషయాలు నీ ముందు వుంచుతున్నాడు. ఆయన నీకు చేయవలసిన దాని నొకటి నీవు ఎన్నుకో.”
13 దావీదుతో గాదు ఇలా చెప్పాడు: “నేను చెప్పేవాటిలో ఒక దానిని కోరుకో: ఏడేండ్ల కరువు నీకూ, నీ రాజ్యానికీ రావాలా? లేక నీ శత్రువులు నిన్ను మూడు నెలల పాటు వెన్నంటి తరమాలా? లేక మూడు రోజుల పాటు నీ దేశంలో వ్యాధులు ప్రబలాలా? బాగా ఆలోచన చేసి ఈ మూడింటిలో నీవు దేనిని కోరుకుంటున్నావో చెప్పు. నేను నీ నిర్ణయాన్ని నన్ను పంపిన యెహోవాకి అందజేయాలి.”
14 గాదుతో దావీదు, “నిజంగా నేను చాలా క్లిష్ట పరిస్థితిలో పడ్డాను! యెహోవా దయామయుడు కావున ఆయనే మమ్మల్ని శిక్షించనీ, నాకు శిక్ష ప్రజలనుండి మాత్రం రానీయకు!” అని అన్నాడు.
15 అందువల్ల యెహోవా ఇశ్రాయేలులో వ్యాధులు ప్రబలేలా చేశాడు. ఉదయం మొదలైన వ్యాధులు నిర్ణయించిన గడువు వరకు ప్రబలినాయి. ఉత్తర దేశంలో దానునుండి దక్షిణ ఇశ్రాయేలులోని బెయేర్షెబా వరకు డెబ్బై వేల మంది చనిపోయారు. 16 దేవదూత యెరూషలేమును నాశనం చేసేందుకు చేయి పైకి లేపాడు. కాని జరిగిన విషాద సంఘటనలకు యెహోవా విచారించాడు. ప్రజలను నాశనం చేసిన దేవదూతతో యెహోవా, “ఇది చాలు! నీ చేయిదించు!” అని అన్నాడు. యోహోవాదూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్లం[a] వద్దవున్నాడు.
దావీదు అరౌనా కళ్లము కొనటం
17 ప్రజలను నశింపజేసిన దేవదూతను దావీదు చూశాడు. దావీదు యెహోవాకి యిలా విన్నవించుకున్నాడు, “నేను పాపం చేశాను! నేను తప్పు చేశాను! కాని నా ప్రజలంతా నన్ను గొర్రెలవలె అనుసరించారు! వారు చేసిన తప్పేమీ లేదు! కావున దయచేసి నీ కోపం నామీద, నా తండ్రి కుటుంబం మీద మాత్రమే చూపించు!”
18 ఆరోజు మరల గాదు దావీదు వద్దకు వచ్చి, “యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్లం మీద యెహోవాకి ఒక బలిపీఠం నిర్మించమని చెప్పాడు”.
19 గాదు చెప్పిన రీతి దావీదు అంతా చేశాడు. యెహోవా ఆజ్ఞలను దావీదు శిరసావహించాడు. దావీదు అరౌనాను చూడటానికి వెళ్లాడు. 20 అరౌనా తలెత్తి చూడగా అక్కడ రాజు (దావీదు) వున్నాడు. ఆయన మనుష్యులు తన వైపు రావటం చూశాడు. అరౌనా ఎదురేగి తన శిరస్సు నేలను ఆనే వరకు వంగి రాజుకు నమస్కరించాడు. 21 “నా ప్రభువైన రాజు నావద్దకు ఎందుకు వచ్చినట్లు?” అని అడిగాడు అరౌనా.
అందుకు దావీదు, “నీనుండి నూర్పిడి కళ్లం కొనడానికి. అది కొని దానిపై యెహోవాకు ఒక బలిపీఠం నిర్మిస్తాను, అప్పడు ఈ వ్యాధులన్నీ అరికట్ట బడతాయి,” అని అన్నాడు.
22 “నా ప్రభువైన రాజు బలికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. దహనబలికి కొన్ని ఎద్దులున్నాయి. అగ్నిని ప్రజ్వలింప చేయటానికి ధాన్యం రాలగొట్టే బల్లలు, మరియు ఎద్దులపై వేసే కాడికర్రలు వున్నాయి! 23 ఓ రాజా! ఇవన్నీ నీకు నేను ఇస్తాను.” అని అరౌనా దావీదుతో అన్నాడు. “నీ ప్రభువైన దేవుడు నీ పట్ల ప్రీతి చెందుగాక!” అని కూడ అన్నాడు.
24 అప్పుడు అరౌనాతో రాజు ఇలా అన్నాడు: “కాదు! నేను నిజం చెబుతున్నాను. నీకు వెలయిచ్చి నీ నుండి ఈ భూమిని కొంటాను. నాకు వెల లేకుండా వచ్చిన వాటితో నా ప్రభువైన దేవునికి దహనబలులు ఇవ్వను!”
కావున నూర్పిడి కళ్లాన్ని, ఎద్దులను, ఏబైతులాల వెండి వెల ఇచ్చి దావీదు కొన్నాడు. 25 తరువాత యెహోవాకి అక్కడ ఒక బలిపీఠాన్ని దావీదు నిర్మింపజేశాడు. దహనబలులు, సమాధాన బలులు దావీదు అర్పించాడు.
దేశంకొరకు దావీదు చేసిన ప్రార్థనను యెహోవా ఆలకించి, ఇశ్రాయేలులో ప్రబలిన వ్యాధులను ఇంకా వ్యాపించకుండా ఆపాడు.
4 నేను చెప్పేదేమిటంటే వారసుడు చిన్నవానిగా ఉన్నంత కాలం, అతడు ఆస్తికంతా వారసుడైనా అతనికి, బానిసకు వ్యత్యాసం లేదు. 2 అతని తండ్రి నియమించిన కాలం వచ్చేదాకా అతడు సంరక్షకుల ఆధీనంలో ఉండవలసిందే. 3 అదే విధంగా మనము పిల్లలంగా ఉండినప్పుడు ప్రపంచం యొక్క నియమాలకు బానిసలమై జీవించాము. 4 కాని సరైన సమయం రాగానే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆ కుమారుడు ఒక స్త్రీకి జన్మించాడు. ఆయన కూడా ధర్మశాస్త్రం క్రింద జన్మించాడు. 5 మనము దేవుని సంతానం కావాలని ఆయన మనలను ధర్మశాస్త్ర బంధం నుండి విముక్తి కలిగించాడు.
6 మీరు దేవుని కుమారులు గనుక దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయాల్లోకి పంపాడు. ఆ ఆత్మ “అబ్బా![a] తండ్రీ!” అని తన తండ్రిని పిలుస్తూ ఉంటాడు. 7 కనుక మీరు బానిసలు కారు. మీరు దేవుని సంతానం. కనుక దేవుడు మిమ్మల్ని కూడా తనకు వారసులను చేసుకొన్నాడు.
గలతీయుల పట్ల పౌలు శ్రద్ధ
8 ఇదివరలో మీకు నిజమైన దేవుణ్ణి గురించి తెలియదు. కనుక మీరు వట్టి దేవుళ్ళకు బానిసలై జీవించారు. 9 కాని యిప్పుడు మీకు దేవుడెవరో తెలుసు. లేక దేవుడు మిమ్మల్ని తెలుసుకొన్నాడు. అలాంటప్పుడు బానిసలు కావటానికి నిస్సారమైన, నిరర్థకమైన ఆ శక్తుల వైపు మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? 10 మీరు ప్రత్యేకమైన దినాలను, నెలలను, ఋతువులను, సంవత్సరాలను యింకా పాటిస్తున్నారు. 11 మిమ్మల్ని చూస్తే నాకు దిగులు వేస్తోంది. మీకోసం వ్యర్థంగా శ్రమపడ్డానేమోనని అనిపిస్తోంది.
12 సోదరులారా! నేను మీలా అయ్యాను. కనుక మీరు నాలా కావాలని విన్నవించుకుంటున్నాను. మీరు నా పట్ల ఏ అపరాధమూ చెయ్యలేదు. 13 నాకు అనారోగ్యంగా ఉండటం వల్ల నేను మీ దగ్గరకు వచ్చాను. తద్వారా మీకు మొదట సువార్త ప్రకటించే అవకాశం నాకు కలిగింది. 14 నా అనారోగ్యం మీకు కష్టం కలిగించినా మీరు నన్ను తిరస్కరించలేదు. విసుక్కోలేదు. దానికి మారుగా నేనొక దేవదూతనైనట్లు, నేను యేసు క్రీస్తునైనట్లు నాకు స్వాగతం చెప్పారు. 15 మీ ఆనందం ఏమైంది? మీరు నా సహాయం కోసం మీ కళ్ళు కూడా పీకి నాకిచ్చి ఉండేవాళ్ళు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. 16 నిజం చెప్పటంవల్ల యిప్పుడు నేను మీ శత్రువునయ్యానా?
17 వాళ్ళు మిమ్మల్ని లోబరచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దానివల్ల మీకు మంచి కలుగదు. మానుండి మిమ్మల్ని వేరు చెయ్యాలని వాళ్ళ ప్రయత్నం. మీరు వాళ్ళను మాత్రమే అనుసరించాలని వాళ్ళ ఉద్దేశ్యం. 18 ఉద్దేశ్యం మంచిదైతే పట్టుదలతో ఉండటం మంచిదే. కనుక నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడూ అదే విధంగా ఉండండి. 19 నా ప్రియమైన బిడ్డలారా! క్రీస్తులో మీరు మరలా రూపం దాల్చే వరకూ నేను మీకోసం మళ్ళీ ఈ ప్రసవవేదన పడ్తూ ఉండవలసిందే. 20 మీ విషయంలో నాకు చాలా దిగులుగా ఉంది. కనుక మీతో ప్రత్యక్షంగా మాట్లాడాలని, మరొక విధంగా మీకు చెప్పాలని ఉంది.
హాగరు మరియు శారా
21 ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకోవాలని అనుకొన్న మీకు ధర్మశాస్త్రం ఏమి చెపుతుందో తెలియదా? 22 అబ్రాహాముకు ఇద్దరు పుత్రులని, ఒకడు బానిస స్త్రీకి జన్మించాడని, మరొకడు స్వంత స్త్రీకి జన్మించాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి వుంది. 23 బానిస స్త్రీ వల్ల అతనికి జన్మించిన కుమారుడు ప్రకృతి సిద్ధంగా జన్మించాడు. కాని స్వంత స్త్రీకి జన్మించిన వాడు వాగ్దానం వల్ల జన్మించాడు.
24 ఈ వృత్తాంతం అలంకారికంగా చెప్పబడింది. ఆ యిరువురు స్త్రీలు రెండు ఒడంబడికలతో పోల్చబడ్డారు. సీనాయి పర్వతం మీద నుండి ఒక ఒడంబడిక వచ్చింది. దీని వల్ల జన్మించిన వాళ్ళు బానిసలు కావాలని ఉంది. “హాగరు” ను ఆ మొదటి ఒడంబడికతో పోల్చవచ్చును. 25 అరేబియాలో ఉన్న సీనాయి పర్వతంతో కూడా “హాగరు” ను పోల్చవచ్చు. ఆమెను ప్రస్తుతం యెరూషలేముతో పోల్చవచ్చు. ఎందుకంటే ఆ పట్టణపు ప్రజలు కూడా ఆమె సంతానంలా బానిసలు. 26 కాని పరలోకంలో ఉన్న యెరూషలేము స్వతంత్రమైంది. అది మన తల్లి. 27 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“ఓ గొడ్రాలా! పిల్లల్ని కననిదానా!
ఆనందించు, పురిటి నొప్పులు పడనిదానా!
గట్టిగా కేకలు వేయి!
ఎందుకనగా భర్త వున్న స్త్రీకన్నా భర్త
లేని స్త్రీకి పిల్లలు ఎక్కువ.”(A)
28 కనుక సోదరులారా! మీరు ఇస్సాకువలే వాగ్దానపు పిల్లలుగా జన్మించలేదు. 29 ఆనాడు ప్రకృతి సిద్ధంగా జన్మించిన కుమారుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించిన కుమారుణ్ణి హింసించాడు. ఈనాడు కూడా అదే జరుగుతోంది. 30 కాని ధర్మశాస్త్రం ఏమి చెపుతున్నది? “బానిస స్త్రీ కుమారుడు, స్వంత స్త్రీకి జన్మించిన కుమారునితో ఆస్తి పంచుకోలేడు. కనుక ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బయటికి తరిమివేయండి”(B) అని వ్రాయబడి ఉంది. 31 సోదరులారా! మనము స్వంత స్త్రీకి జన్మించిన బిడ్డలం. బానిస స్త్రీకి జన్మించిన బిడ్డలం కాము.
దేవదారు వృక్షంవంటి అష్షూరు
31 చెరకి కొనిపోబడిన పదకొండవ సంవత్సరం మూడవ నెల మొదటి రోజున యెహోవా మాట నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 2 “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోకు మరియు అతని ప్రజలకు ఈ విషయాలు తెలియజేయుము,
“‘గొప్పతనంలో
నీవు ఎవరిలా ఉన్నావు?
3 మిక్కిలి ఉన్నతంగా పెరిగి తన అందమైన కొమ్మలతో దట్టమైన నీడనిస్తూ
లెబానోనులో పెరిగిన కేదారు వృక్షం అష్షూరు రాజ్యమే.
దాని తల మేఘాల్లో ఉంది!
4 మంచి నీటివనరు చెట్టును బాగా పెరిగేలా చేసింది.
లోతైన నది అది ఎత్తుగా పెరగటానికి దోహదమిచ్చింది.
చెట్టు నాటబడిన ప్రాంతంలో నదులు ప్రవహించాయి.
దాని కాలువలే అక్కడి పొలాల్లో ఉన్న చెట్లకు నీటిని అందజేశాయి
5 ఆ వృక్షం అలా మిగిలిన చెట్లన్నిటిలో పొడవుగా పెరిగింది.
దానికి ఎన్నో కొమ్మలు పెరిగాయి.
నీరు పుష్కలంగా ఉంది.
అందువల్ల దాని కొమ్మలు విస్తరించాయి.
6 కావున పక్షులన్నీ దాని
కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి.
ఆ ప్రాంతంలో జంతువులన్నీ దాని
చల్లని నీడలో తమ పిల్లల్ని పెట్టాయి.
గొప్ప రాజ్యాలన్నీ
ఆ చెట్టు నీడలో నివసించాయి!
7 ఆ విధంగా ఆ చెట్టు తన గొప్పతనంలోను,
తన పొడవైన కొమ్మలతోను,
ఎంతో ఆందంగా కన్పించింది.
ఎందువల్ల ననగా దానివేళ్ళు నీరు బాగా అందేవరకు నాటుకున్నాయి!
8 దేవుని ఉద్యానవనంలో ఉన్న కేదారు వృక్షాలు
కూడా ఈ చెట్టంత పెద్దగా లేవు.
దీనికి ఉన్నన్ని కొమ్మలు సరళ వృక్షాలకు కూడా లేవు.
అక్షోట (మేడి) చెట్లకు అసలిటువంటి కొమ్మలే లేవు.
దేవుని ఉద్యానవనంలో
ఇంత అందమైన చెట్టేలేదు.
9 అనేకమైన కొమ్మలతో
ఈ చెట్టును నేను అందమైనదిగా చేశాను.
ఏదెనులో దేవుని ఉద్యానవనంలో ఉన్న చెట్లన్నీ
దీనిపట్ల అసూయ చెందాయి!’”
10 కావున నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “ఈ చెట్టు విస్తరించి పొడవుగా పెరిగింది. దాని తలని మబ్బుల్లో పెట్టుకుంది. దాని ఎత్తు చూసుకొని అది గర్వపడింది. 11 అందువల్ల ఒక పరాక్రమశాలియగు రాజు ఆ చెట్టును ఉంచుకొనేలా చేస్తాను. అది చేసిన చెడ్డ పనులకు ఆ పాలకుడు దానిని శిక్షిస్తాడు. అతని చెడు తనంవల్ల నేను ఆ చెట్టును నాతోటనుండి తీసుకొంటిని. 12 దేశాలన్నిటిలో క్రొత్తవాళ్లు, చాలా క్రూరులయిన వాళ్లు దానిని నరికి పడవేశారు. ఆ చెట్టు కొమ్మలు కొండల మీదను, లోయలలోను చెల్లా చెదరుగా పడవేశారు. ఆ దేశం గుండా ప్రవహించే నదులలో విరిగిన కొమ్మలు కొట్టుకు పోయాయి. ఆ చెట్టు క్రింద నీడ ఇక ఏ మాత్రం లేకపోవటంతో వివిధ దేశాల ప్రజలంతా దానిని వదిలిపెట్టారు. 13 ఇప్పుడు పక్షులు పడిపోయిన ఆ చెట్టు మీదే నివసిస్తాయి. దాని పడిపోయిన కొమ్మలమీద ఆడవి జంతువులన్నీ నడుస్తాయి.
14 “ఆ నీటి ప్రక్కనున్న ఏ చెట్టూ ఇక మీదట గర్వపడదు. అవి ఆకాశాన్నంటుకోవాలని తాపత్రయ పడవు. ఆ నీరును పీల్చే బలమైన చెట్లలో ఏ ఒక్కటీ పొడవుగా ఉన్నానని గొప్పలు చెప్పుకోదు. ఎందువల్లనంటే అవన్నీ చనిపోవటం ఖాయం. అవన్నీ పాతాళ లోకంలోకి పోతాయి. అవి (వారు) మృతి చెందిన వారితో పాతాళంలో కలవటం తధ్యం.”
15 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “ఆ చెట్టు పాతాళానికి వెళ్లిన రోజున ప్రజలంతా సంతాపం పొందేలా చేశాను. అగాధమైన సముద్రంలో దాన్ని కప్పివేశాను. దాని నదులన్నిటినీ నిలుపు జేశాను. నీరంతా ప్రవహించటం ఆగిపోయింది. లెబానోను దాని కొరకు దుఃఖించేలా చేశాను. ఆ మహావృక్షం కొరకు ఆ ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ విచారంతో క్రుంగిపోయాయి. 16 ఆ చెట్టు పడిపోయేలా నేను చేశాను. అది పతనమయినప్పుడు వచ్చిన శబ్దంతో దేశాలు భయంతో వణికిపోయాయి. ఆ వృక్షం మృతుల స్థానానికి వెళ్లేలా చేశాను. అది మృతులతో కలిసి ఉండటానికి పాతాళానికి చేరింది. గతంలో ఏదెనులో ఉన్న అన్ని చెట్లు, లెబానోనులో ఉన్న శ్రేష్ఠమైన చెట్లు ఆ నీటిని పీల్చాయి. ఆ చెట్లు పాతాళ లోకంలో ఓదార్చబడ్డాయి. 17 అవును. మృతుల స్థానానికి మహా వృక్షంతో పాటు మిగిలిన చెట్లు కూడ పోయాయి. యుద్ధంలో హతులైన ప్రజలను అవి కలిశాయి. ఆ మహా వృక్షం మిగిలిన చెట్లను బలపర్చింది. దేశాల మధ్య ఆ మహా వృక్షం యొక్క నీడలో ఆ చెట్లు నివసించాయి.
18 “కావున ఈజిప్టూ, ఏదెనులో నిన్ను ఏ చెట్టుతో పోల్చను? ఆ చెట్లన్నీ పెద్దవీ, బలిష్ఠమయినవీ. ఏదెనులోని చెట్లతో పాటు నీవు అధోలోకానికి పోతావు. విదేశీయులతోను[a] యుద్ధంలో మరణించిన వారితోను కలిసి నీవు మృత్యుస్థానంలో పడివుంటావు.
“ఫరోకు మరియు అతని ప్రజలందరికీ ఇది సంభవిస్తుంది!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
ఆసాపు స్తుతి కీర్తన.
79 దేవా, కొందరు మనుష్యులు నీ ప్రజలతో యుద్ధం చేసేందుకు వచ్చారు.
ఆ మనుష్యులు నీ పవిత్ర ఆలయాన్ని అపవిత్రపరచి నాశనం చేసారు.
యెరూషలేమును వారు శిథిలాలుగా విడిచి పెట్టారు.
2 అడవి పక్షులు తినేందుకుగాను నీ సేవకుల దేహాలను శత్రువు విడిచిపెట్టాడు.
అడవి మృగాలు తినేందుకు నీ అనుచరుల దేహాలను వారు విడిచిపెట్టారు.
3 దేవా, నీ ప్రజల రక్తం నీళ్లలా యెరూషలేమంతటి చుట్టూ ప్రవహించేంతవరకు శత్రువు వారిని చంపాడు.
మృత దేహాలను పాతి పెట్టేందుకు ఏ ఒక్కరూ విడువబడ లేదు.
4 మా పొరుగు రాజ్యాలు మమ్మల్ని అవమానించాయి.
మా చుట్టూరా ఉన్న ప్రజలంతా మమ్మల్ని చూచి నవ్వుతూ, ఎగతాళి చేస్తున్నారు.
5 దేవా, నీవు మా మీద ఎప్పటికీ కోపంగానే ఉంటావా?
బలమైన నీ భావాలు అగ్నిలా మండుతూనే ఉంటాయా?
6 దేవా, నిన్ను ఎరుగని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
నీ నామాన్ని ఆరాధించని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
7 ఎందుకంటే ఆ రాజ్యాలు యాకోబును నాశనం చేశాయి.
వారు యాకోబు దేశాన్ని నాశనం చేశారు.
8 దేవా, మా పూర్వీకుల పాపాలకోసం దయచేసి మమ్మల్ని శిక్షించకుము.
త్వరపడి. నీ దయ మాకు చూపించుము.
నీవు మాకు ఎంతో అవసరం.
9 మా దేవా! రక్షకా, మాకు సహాయం చేయుము.
నీ స్వంత నామానికి మహిమ తెచ్చునట్లుగా మాకు సహాయం చేయుము.
మమ్మల్ని రక్షించుము.
నీ నామ క్షేమం కోసం మా పాపాలు తుడిచివేయుము.
10 “మీ దేవుడు ఎక్కడ? ఆయన మీకు సహాయం చేయలేడా?”
అని ఇతర రాజ్యాలవారు మాతో అననీయకు.
దేవా, మేము చూడగలుగునట్లుగా ఆ ప్రజలను శిక్షించుము.
నీ సేవకులను చంపినందుకు వారిని శిక్షించుము.
11 దయచేసి, ఖైదీల మూల్గులు వినుము!
దేవా, మరణించుటకు ఏర్పరచబడిన ఈ ప్రజలను నీ మహా శక్తివలన రక్షించుము.
12 దేవా, మా చుట్టూరా ఉన్న ప్రజలు మాకు చేసిన వాటిని బట్టి ఏడు మార్లు వారిని శిక్షించుము.
ఆ ప్రజలు నిన్ను అవమానించిన సమయాలనుబట్టి వారిని శిక్షించుము.
13 మేము నీ ప్రజలం, మేము నీ మందలోని గొర్రెలం.
మేము శాశ్వతంగా నిన్ను స్తుతిస్తాము.
దేవా, శాశ్వతంగా, సదాకాలం మేము నిన్ను స్తుతిస్తాము.
© 1997 Bible League International