Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 సమూయేలు 23

దావీదు తుది పలుకులు

23 ఇవి దావీదు చివరి మాటలు,

“యాకోబు దేవునిచే అభిషిక్తము చేయబడిన రాజు,
    ఇశ్రాయేలు మధుర గాయకుడు,
యెష్షయి కుమారుడు అయిన దావీదు పలికిన సందేశం.
    దావీదు ఇలా అన్నాడు:
యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడినది.
    ఆయన పలుకే నా నోటిలో వున్నది.
ఇశ్రాయేలు దేవుడు మాట్లాడాడు,
    ఇశ్రాయేలుకు, ఆశ్రయదుర్గమైన దేవుడు నాతో యిలా అన్నాడు:
‘ఏ వ్యక్తి ప్రజలను న్యాయమార్గాన పరిపాలిస్తాడో,
    ఏ వ్యక్తి దైవ భీతితో పరిపాలన సాగిస్తాడో
ఆ వ్యక్తి అరుణోదయ కాంతిలా ప్రకాశిస్తాడు,
    ఆ వ్యక్తి మబ్బులేని ప్రాతఃకాలంలా ప్రశాంతంగా వుంటాడు,
లేతగడ్డిని చిగురింపజేయు వర్షానంతర సూర్యకాంతిలా
    ఆ వ్యక్తి ప్రకాశిస్తాడు.’

“గతంలో దేవుడు నా కుటుంబాన్ని బలపర్చలేదు.
    తరువాత దేవుడు నాతో ఒక శాశ్వత ఒడంబడిక చేశాడు.
అది సమగ్రమైన నిబంధనగా దేవుడు రూపొందించాడు.
    ఈ ఒడంబడికను దేవుడు బలపర్చాడు.
దానిని ఆయన ఉల్లంఘించడు!
    ఈ ఒడంబడిక నాకు మోక్ష సాధనం; నేను కోరినదల్లా ఈ ఒడంబడికనే; ఖచ్చితంగా యెహోవా దానిని వర్ధిల్లేలాగు చేస్తాడు!

“కాని దుష్టులు ముండ్లవంటి వారు.
    జనులు ముండ్లనుచేతబట్టరు.
    వాటిని తక్షణం విసర్జిస్తారు!
వాటిని ఎవరు తాకినా కర్ర,
    ఇనుము బల్లెములతో గుచ్చివేసినట్లవుతుంది.
దుష్టులు కూడ ముండ్ల వంటి
    వారు వారు అగ్నిలో తోయబడి
    పూర్తిగా దహింపబడతారు.”

ముగ్గురు వీరులు

దావీదు సైన్యంలో ప్రముఖుల పేర్లు ఇలా వున్నాయి:

తక్మోనీయుడగు యోషేబెష్షెబెతు ముగ్గురు యోధుల అధిపతి. ఎస్నీయుడైన అదీనా అని కూడ ఇతడు పిలవబడేవాడు. యోషేబెష్షెబెతు ఒక్క యుద్ధంలోనే ఎనిమిది వందల మందిని చంపివేశాడు.

అహోహీయుడైన దోదో కుమారుడు ఎలియాజరు తరువాత ప్రముఖుడు. దావీదు ఫిలిష్తీయులను ఎదిరించిన కాలంలో అతనితో వున్న ముగ్గురు యోధులలో ఎలియాజరు ఒకడు. ఒక పర్యాయము ఫిలిష్తీయలు గుమిగూడి ఇశ్రాయేలీయుల మీదికి యుద్ధానికి రాగా, ఇశ్రాయేలీయులు పారిపోయారు. 10 అప్పుడు ఎలియాజరు మాత్రము అలసిపోయేవరకు ఫిలిష్తీయులతో ఒంటరిగా పోరాడాడు. తన చెయ్యి కత్తి పిడికి అంటుకుపోయేలా గట్టిగా పట్టుకుని విడవకుండా శత్రుసంహారం చేశాడు. ఆ రోజు యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని సమకూర్చి పెట్టాడు. ఎలియాజరు యుద్ధంలో గెలిచిన తరువాత, జనం తిరిగి వచ్చారు. కాని నిజానికి వారు ఓడిపోయిన శత్రువులను దోచుకోడానికి మాత్రమే వచ్చారు.

11 హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా తరువాత ప్రముఖ సేనాని. ఒక పర్యాయం ఫిలిష్తీయులు వచ్చి నిండుగా పండిన అలసందల చేనువద్ద గుమిగూడారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను చూసి పారి పోయారు. 12 కాని షమ్మా మాత్రం చేను మధ్యలో నిలబడ్డాడు. అతడు చేనును కాపాడుతూ పోరాడాడు. అతడు ఫిలిష్తీయులను హత మార్చాడు. అప్పుడు కూడ యెహావా వారికి ఘన విజయం చేకూర్చాడు.

13 పంట కోతకాలంలో ముప్పై మంది సైనికులలో ఘటికులైన ముగ్గురు ఒక సారి దావీదు వద్దకు వచ్చారు. ఈ ముగ్గురూ అదుల్లాము గుహవద్దకు వచ్చారు. రెఫాయీము లోయలో ఫిలిష్తీయుల సైన్యం గూడారాలు వేసింది.

14 ఆ సమయంలో దావీదు కోటలో వున్నాడు. బేత్లెహేములో కొంత మంది ఫిలిష్తీయుల సైనికులున్నారు. 15 తన స్వగ్రామంలోని నీరు తాగాలనే ప్రగాఢవాంఛ దావీదుకు కలిగింది. “ఓహో, బేత్లెహేము నగర ద్వారం వద్దగల బావి నీరు ఎవరైనా తెచ్చియిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను,” అని దావీదు అన్నాడు. వాస్తవంగా దావీదు దీనిని కోరలేదు; కాని తానలా మట్లాడాడు. 16 కాని ముగ్గురు బలాఢ్యులు మాత్రం ఫిలిష్తీయుల సైనికులను ఛేధించుకుంటూ వెళ్లారు. బేత్లెహేము నగర ద్వారంవద్దగల బావి నుండి నీరు తీసుకున్నారు. దానిని వారు దావీదు వద్దకు తెచ్చారు. కాని దావీదు ఆ నీటిని త్రాగ నిరాకరించాడు. అతడా నీటిని యెహోవా ముందు పారబోశాడు. 17 దావీదు యెహోవాతో, “యెహోవా, నేను దీనిని త్రాగలేను! నా కొరకు తమ ప్రాణాలను లెక్కచేయకుండా వెళ్లిన వారి రక్తం త్రాగినట్లుగా వుంటుంది,” అని అన్నాడు. అందువల్ల దావీదు ఆ నీటిని త్రాగ నిరాకరించాడు. ఈ ముగ్గురు సైనికులు అలా అనేక సాహసకృత్యాలు చేశారు.

ఇతర ధైర్యముగల సైనికులు

18 సెరూయా కుమారుడైన యోవాబు సోదరుడగు అబీషై ఈ ముగ్గురు సైనికులకు నాయకుడు. అబీషై తన ఈటెనుపయోగించి మూడు వందల శత్రుసైనికులను హతమార్చాడు. అతను కూడ ఆ ముగ్గరు సైనికులంత ప్రఖ్యాతి వహించాడు. 19 వారి ముగ్గురు కంటె అబీషై మిక్కిలి ప్రశంసలు పొందాడు. అతడు వారికి నాయకుడయ్యాడు. అంతేగాని వారితో పాటు ఆ కూటమిలో ఒక సభ్యుడు కాదు.

20 యెహోయాదా కుమారుడైన బెనాయా వున్నాడు. అతడు ఒక పరాక్రమశాలి కుమారుడు. అతడు కబ్సెయేలను ఊరివాడు. బెనాయా చాలా సాహసకృత్యాలు చేశాడు. అతడు మోయాబీయుడగు అరీయేలు ఇద్దరు కుమారులను చంపివేశాడు. అంతేకాదు మంచుపడే కాలంలో బెనాయా ఒక గోతిలోదిగి అక్కడ దాగిన ఒక సింహాన్ని చంపాడు. 21 ఈజిప్టుకు చెందిన ఒక బలమైన యోధుణ్ణి చంపాడు. ఆ ఈజిప్టీయుని చేతిలో ఒక ఈటెవుంది. కాని బెనాయా చేతిలో ఒక కర్ర మాత్రమేవుంది. కాని బెనాయా వెళ్లి ఆ ఈజిప్టీయుని చేతిలోని ఈటె లాక్కున్నాడు. తరువాత బెనాయా ఆ ఈటెతోనే ఈజిప్టీయుని పొడిచి చంపాడు. 22 యెహోయాదా కుమారుడైన బెనాయా అటువంటి కార్యాలు చాలా చేశాడు. బెనాయా కూడ ఆ ముగ్గురు యోధులవలె ప్రసిద్ధి గాంచాడు. 23 ముప్పై మంది సైనికులలోను బెనాయాకు ఎక్కువ గౌరవం లభించింది; కాని ఆ ముగ్గురు యోధుల కూటమిలో సభ్యుడు కాలేదు. బెనాయాను దావీదు తన అంగరక్షకులకు నాయకునిగా చేశాడు.

ముప్పై మంది వీరులు

24 యోవాబు సోదరుడగు అశాహేలు ఆ ముప్పై మందిలో ఒకడు. ఆ ముప్పై మందిలో మిగిలిన వారి పేర్లు:

బేత్లేహేమీయుడగు దోదో కుమారుడైన ఎల్హానాను,

25 హరోదీయుడైన షమ్మా,

హరోదీయుడైన ఎలీకా,

26 పల్తీయుడైన హేలెస్సు,

తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడగు ఈరా,

27 అనాతోతీయుడైన అబీయెజరు,

హుషాతీయుడైన మెబున్నయి,

28 అహోహీయుడైన సల్మోను,

నెటోపాతీయుడైన మహర్తె,

29 నెటోపాతీయుడగు బయానా కుమారుడైన హేలెబు,

బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడు ఇత్తయి,

30 పిరాతోనీయుడైన బెనాయా,

గాయషు సెలయేళ్ల ప్రాంతం వాడైన హిద్దయి,

31 అర్బాతీయుడైన అబీయల్బోను,

బర్హుమీయుడైన అజ్మావెతు,

32 షయల్బోనీయుడైన ఎల్యహ్బా,

యాషేను కుమారులలో

33 హరారీయుడైన షమ్మా కుమారుడు యోనాతాను,

హరారీయుడైన షారారు కుమారుడగు అహీయాము,

34 మాయకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడగు ఎలీపేలెటు,

గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడగు ఏలీయాము,

35 కర్మెతీయుడైన హెస్రై,

అర్బీయుడైన పయరై,

36 సోబావాడగు నాతాను కుమారుడైన ఇగాలు,

గాదీయుడైన బానీ,

37 అమ్మోనీయుడైన జెలెకు,

బెయేరోతీయుడైన నహరై, (సెరూయా కుమారుడైన యోవాబునకు ఆయుధాలు మోసే సహాయకులు,)

38 ఇత్రీ యుడగు ఈరా,

ఇత్రీయుడగు గారేబు,

39 మరియు హిత్తీయుడైన ఊరియా.

వీరంతా మొత్తం ముప్పది ఏడుగురు.

గలతీయులకు 3

ధర్మశాస్త్రమా? లేక విశ్వాసమా?

గలతీయ ప్రజలారా! మీరు అవివేకులు. మిమ్ములను ఎవరు మోసగించారు? యేసు క్రీస్తు సిలువకు వేయబడినదానిలో ఉన్న అర్థం మీ కళ్ళ ముందు స్పష్టంగా చిత్రించాము. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. ధర్మశాస్త్రం అనుసరించటం వల్ల మీరు పరిశుద్ధాత్మను పొందారా? లేక సువార్తను విశ్వసించటం వల్ల పొందారా? మీరింత అవివేకులా? పరిశుద్ధాత్మతో ప్రారంభించి ఇప్పుడు మానవ ప్రయత్నం ద్వారా నీతిమంతులు కావాలని చూస్తున్నారా? మీరు ఇన్ని కష్టాలు వ్యర్థంగా అనుభవిస్తున్నారా? అది నేను అంగీకరించను. దేవుడు పరిశుద్ధాత్మను పంపి మీ కోసం మహత్కార్యాలు చేస్తున్నది మీరు ధర్మశాస్త్రం అనుసరించినందుకా? లేక సువార్తను విశ్వసించినందుకా?

అబ్రాహామును పరిశీలించండి. “అతడు దేవుణ్ణి విశ్వసించాడు. కనుక దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు.”(A) కనుక విశ్వాసమున్న వాళ్ళే అబ్రాహాము కుమారులని గ్రహించండి. యూదులు కానివాళ్ళను దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా నిర్ణయిస్తాడని లేఖనాలు వ్రాసినవాళ్ళు దివ్యదృష్టితో చూసి చెప్పారు. ఈ విషయాన్ని దేవుడు అబ్రాహాముతో, “అన్ని జనముల వారు నీ కారణంగా ధన్యులౌతారు!”(B) అని ముందే చెప్పాడు. కనుక అబ్రాహాము విశ్వసించి ధన్యుడయ్యాడు. అదే విధంగా అతని వలె విశ్వసించిన వాళ్ళు కూడా ధన్యులౌతారు.

10 ధర్మశాస్త్రంపై ఆధారపడిన వాళ్ళందరి మీద శాపం ఉంది. “ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని అన్ని వేళలా ఆచరిస్తూ జీవించని వాడు దేవుని శాపానికి గురి ఔతాడు”(C) అని వ్రాయబడి ఉంది. 11 ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఎవ్వరినీ నీతిమంతునిగా చెయ్యడని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే, “విశ్వాసం ద్వారా నీతిమంతుడైనవాడు అనంతజీవితం పొందుతాడు”[a] అని ప్రవచనంలో వ్రాయబడి ఉంది.

12 ధర్మశాస్త్రానికి విశ్వాసం పునాది కాదు. పైగా, “ధర్మశాస్త్రం చెప్పినట్లు అన్నీ చేసినవాడు మాత్రమే అనంత జీవితం పొందుతాడు”[b] అని వ్రాయబడి ఉంది. 13 “చెట్టుకు వ్రేలాడవేయబడిన ప్రతి ఒక్కడూ శాపగ్రస్తుడు!”(D) అని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. కనుక మనకు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విముక్తి కలిగించాలని క్రీస్తు ఆ శాపానికి గురి అయ్యాడు. 14 దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం తన ద్వారా యూదులు కానివాళ్ళకు కూడా లభించాలని క్రీస్తు మనకు విముక్తి కలిగించాడు. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మనకు విశ్వాసం ద్వారా లభించాలని ఆయన ఉద్దేశ్యం.

ధర్మశాస్త్రము, వాగ్దానము

15 సోదరులారా! ఇక మన నిత్యజీవితం నుండి ఒక ఉదాహరణ తీసుకొంటాను. అంగీకరించిన ఒడంబడికను మనం రద్దు చెయ్యలేము, లేక మార్చలేము. ఈ విషయం కూడా అలాంటిదే. 16 అబ్రాహాముకు, అతని వారసునికి దేవుడు వాగ్దానం చేసాడు.[c] కాని ధర్మశాస్త్రంలో, “వారసులకు” అని వ్రాయబడలేదు. కాని “అనేకులు” అని అర్థం రాకుండా “ఒకనికి” అనే అర్థం వచ్చేటట్లు వ్రాయబడి ఉంది. ఆయనే క్రీస్తు. 17 నేను చెప్పేది ఏమిటంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ప్రవేశపెట్టబడిన ధర్మశాస్త్రం గతంలో దేవుడు చేసిన ఒడంబడికను ప్రక్కకు త్రోసి ఆయన చేసిన వాగ్దానాన్ని రద్దు చెయ్యలేదు.

18 అయితే వారసత్వం ధర్మశాస్త్రంపై ఆధారపడలేక అది వాగ్దానంపై ఆధారపడి వుందన్న మాట. ఆ రీతిగా దేవుడు ఆ వారసత్వాన్ని వాగ్దానం ద్వారా అబ్రాహాముకు యిచ్చాడు.

19 మరి అలాగైతే ధర్మశాస్త్రం ఉండటంలో ఉద్దేశ్యమేమిటి? పాపాన్ని ఎత్తి చూపటమే దాని ఉద్దేశ్యం. వాగ్దానం చెయ్యబడిన అబ్రాహాము వంశీయుడు వచ్చే వరకే దాని ఉపయోగం. దేవదూతల ద్వారా ఒక మధ్యవర్తి చేత ధర్మశాస్త్రం మనకు అందజేయబడింది. 20 కాని వాగ్దానం విషయంలో దేవుడు ఒక్కడే కనుక మధ్యవర్తి అవసరం కలుగలేదు. రెండు పక్షాలుంటే కదా మధ్యవర్తి కావాలి.

మోషే ధర్మశాస్త్రం యెక్క ఉద్దేశ్యం

21 మరి అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు విరుద్ధమా? ఎన్నటికీ కాదు. ధర్మశాస్త్రానికి అనంత జీవితాన్నిచ్చే శక్తి ఉండి ఉంటే దాని ద్వారా నీతిమంతులం అయ్యేవాళ్ళం. 22 కాని లేఖనాల్లో, “ప్రపంచం పాపాల్లో చిక్కుకు పోయింది.” అని వ్రాయబడి ఉంది. ఇలా ఎందుకైందంటే యేసుక్రీస్తు పట్ల ఉన్న విశ్వాసం వల్ల వాగ్దానం చెయ్యబడిన వరము విశ్వాసం ఉన్నవాళ్ళకే యివ్వబడుతుంది.

23 విశ్వాసం లేకముందు మనం ధర్మశాస్త్రం యొక్క ఖైదీలము. విశ్వాసం మనకు బయలు పడేదాకా మనము ఖైదీలుగా ఉన్నాము. 24 మనము విశ్వాసం ద్వారా నీతిమంతులం కావటానికి, మనల్ని క్రీస్తు దగ్గరకు పిలుచుకు వెళ్ళటానికి ఈ ధర్మశాస్త్రం నియమింపబడింది. 25 ఇప్పుడు ఆ విశ్వాసం వచ్చింది. కనుక ధర్మశాస్త్రానికి మనపై ఇక ఏ మాత్రం అధికారం లేదు.

26 యేసుక్రీస్తులో మీకు విశ్వాసం వుండటం వల్ల మీరంతా దేవుని పుత్రులయ్యారు. 27 ఎందుకంటే క్రీస్తులో బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొన్నారు. 28 ఇప్పుడు యేసుక్రీస్తులో యూదుడని, యూదుడుకానివాడని, బానిసని, యజమాని అని, ఆడ అని, మగ అని వ్యత్యాసం లేదు. క్రీస్తు యేసులో మీరందరు సమానం. 29 మీరు క్రీస్తుకు చెందితే అబ్రాహాము సంతానంగా పరిగణింపబడతారు. దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం ప్రకారం దేవుని ఆశీర్వాదాలకు మనం వారసులమౌతాం.

యెహెజ్కేలు 30

బబులోను సైన్యం ఈజిప్టును ఎదుర్కొంటుంది

30 మరొకసారి యెహోవా మాట నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నా తరపున మాట్లాడుతూ ఈ విధంగా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:

“‘నీవు దుఃఖపడి,
    “భయంకరమైన రోజు దరిచేరుతున్నది” అని ప్రకటించుము.
ఆ రోజు దగ్గరలో ఉంది!
    అవును. యెహోవా తీర్పు తీర్చే రోజు దగ్గర పడుతున్నది.
అది మేఘాల రోజు.
    అది రాజ్యాలపై తీర్పు ఇచ్చే సమయం!
ఈజిప్టు మీదకి ఒక కత్తి వస్తుంది!
    ఈజిప్టు పతనమయ్యే సమయాన ఇథియోపియ (కూషు) ప్రజలు భయంతో చెదరిపొతారు.
ఈజిప్టు ప్రజలను బబులోను సైన్యం బందీలుగా పట్టుకుపోతుంది.
    ఈజిప్టు పునాదులు కదిలిపోతాయి!

“‘ఆ అనేక మంది ప్రజలు ఈజిప్టుతో శాంతి ఒప్పందాలు చేసుకున్నారు. కాని ఇథియోపియ (కూషు), పూతు, లూదు, అరేబియా (మిశ్రమ ప్రజలు), లిబ్యా (కూబు), ఇశ్రాయేలు (నా నిబంధన దేశము) ప్రజలు-అందరూ నాశనం చేయబడతారు!

“‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“అవును. ఈజిప్టును బలపర్చిన వారంతా పడిపోతారు!
    దాని బలగర్వం తగ్గి పోతుంది.
మిగ్దోలు నుండి ఆశ్వన్ (సెవేనే) వరకు గల
    ఈజిప్టు ప్రజలంతా చంపబడతారు.”
    నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు!
నాశనం చేయబడిన దేశాలలో ఈజిప్టు కూడా కలిసిపోతుంది.
    శూన్యంగా మిగిలిన రాజ్యాలలో ఈజిప్టు ఒకటి అవుతుంది.
ఈజిప్టులో అగ్ని రగిలిస్తాను.
    దానితో దాని సహాయకులు నాశనమై పోతారు.
అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.

“‘ఆ సమయాన నేను దూతలను పంపుతాను. వారు ఓడలలో పయనించి ఇథియోపియ (కూషు)కు దుర్వార్త తీసుకొని వెళతారు. ఇథియోపియ ఇప్పుడు క్షేమంగా ఉన్నాననుకుంటూ ఉంది. కాని ఈజిప్టు శిక్షించ బడినప్పుడు ఇథియోపియ ప్రజలు భయంతో కంపించిపోతారు. ఆ సమయం వస్తూ ఉంది!’”

10 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“బబులోను రాజైన నెబుకద్నెజరును
    నేను వినియోగించి ఈజిప్టు ప్రజలను నాశనం చేస్తాను.
11 నెబుకద్నెజరు, అతని మనుష్యులు
    జాతులన్నిటిలోనూ అతి భయంకరులు.
    ఈజిప్టును నాశనం చేయటానికి వారిని తీసుకొనివస్తాను.
ఈజిప్టు మీద వారు తమ కత్తులు దూస్తారు.
    వారు దేశాన్ని శవాలతో నింపివేస్తారు.
12 నైలునది ఎండిపోయేలా నేను చేస్తాను.
    అలా ఎండిన భూభూగాన్ని దుష్ట జనులకు అమ్మి వేస్తాను.
ఆ భూమిని నిర్మానుష్యం చేయటానికి నేను అన్యజనులను వినియోగిస్తాను.
    యెహోవానైన నేను ఈ విషయాలు చెపుతున్నాను!”

ఈజిప్టు విగ్రహాలు నాశనం చేయబడుతాయి

13 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“ఈజిప్టులో ఉన్న విగ్రహాలను కూడా నేను నాశనం చేస్తాను.
    మెంఫిస్ (నొపు)లో ఉన్న విగ్రహాలన్నిటినీ తొలగిస్తాను.
ఈజిప్టులో ఇక ఎంత మాత్రం నాయకుడెవడు ఉండడు.
    ఈజిప్టు రాజ్యంలో భయాన్ని పుట్టిస్తాను.
14 పత్రోసును శూన్య రాజ్యంగా మార్చివేస్తాను.
    సోయనులో అగ్ని రగుల్చుతాను.
    ‘నో’ నగరాన్ని శిక్షిస్తాను.
15 ఈజిప్టుకు కోటవలె అండగా నిల్చిన సీను మీద నా కోపాన్ని కుమ్మరిస్తాను!
    ‘నో’ నగర వాసులను నేను నాశనం చేస్తాను.
16 ఈజిప్టులో నేను అగ్ని ముట్టిస్తాను.
    సీను అనబడే ప్రాంతం భయానికి గురియవుతుంది.
‘నో’ నగరంలోకి సైనికులు విరుచుకుపడ్తారు.
    శత్రువులు దాన్ని పగటిపూట ఎదుర్కొంటారు.
17 ఓను, పిబేసెతు పట్టణాల యువకులు యుద్ధంలో చనిపోతారు.
    స్త్రీలు బందీలుగా పట్టుకుపోబడతారు.
18 ఈజిప్టు ఆధిపత్యాన్ని (కాడిని) తహపనేసులో నేను విరిచినప్పుడు అక్కడ అంధకారం ఏర్పడుతుంది.
    ఈజిప్టు యొక్క బలగర్వం అంతమవుతుంది!
ఈజిప్టును ఒక మేఘం ఆవరిస్తుంది.
    ఆమె కుమార్తెలు చెరపట్టబడి తీసుకుపోబడతారు.
19 ఆ విధంగా నేను ఈజిప్టును శిక్షిస్తాను.
    అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు!”

ఈజిప్టు శాశ్వతంగా బలహీనమవుతుంది

20 చెరకి కొనిపోబడిన పదకొండవ సంవత్సరం మొదటి నెల (ఏప్రిల్) ఏడవ రోజున యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 21 “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరో చేతిని (శక్తిని) నేను విరిచివేశాను. ఆ చేతికి ఎవ్వరూ కట్టు కట్టలేరు. అది నయం కాదు. ఆ చేయి మళ్లీ కత్తి పట్టే బలాన్ని పుంజుకోలేదు.”

22 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నేను ఈజిప్టు రాజైన ఫరోకు విరోధిని. అతని మంచి చేతిని, గతంలో విరిగిన అవిటి చేతిని, రెండింటినీ నేను విరుగగొడతాను. అతని చేతి నుండి కత్తి జారి క్రిందపడేలా చేస్తాను. 23 ఈజిప్టువారిని వివిధ దేశాలకు చెదరగొడతాను. 24 బబులోను రాజు చేతులను నేను బలపర్చుతాను. నా కత్తిని అతని చేతిలో ఉంచుతాను. కాని ఫరో చేతులను నేను విరుగ గొడతాను. అప్పుడు ఫరో మరణించుతాడు. వేదన పడేలా బాధపడతాడు. 25 ఆ విధంగా బబులోను రాజు చేతులను బలపర్చి, ఫరో రాజు చేతులను నేను బలహీన పర్చుతాను. నేనే యెహోవానని వారప్పుడు తెలుసుకుంటారు.

“నేను నా కత్తిని బబులోను రాజు చేతిలో ఉంచుతాను. అతడా కత్తిని ఈజిప్టు రాజ్యం మీదికి విసురుతాడు. 26 నేను ఈజిప్టువారిని వివిధ దేశాలకు తరిమివేస్తాను. అప్పడు నేను యెహోవానని వారు తెలుసుకొంటారు.”

కీర్తనలు. 78:38-72

38 కాని దేవుడు దయకలిగినవాడు.
    వారి పాపాల విషయంలో ఆయన వారిని క్షమించాడు. ఆయన వారిని నాశనం చేయలేదు.
అనేకసార్లు దేవుడు తన కోపాన్ని అణచుకొన్నాడు.
    దేవుడు తనకు మరీ ఎక్కువ కోపాన్ని రానీయలేదు.
39 వారు కేవలం మనుష్య మాత్రులే అని దేవుడు జ్ఞాపకం చేసుకొన్నాడు.
    మనుష్యులు అప్పుడే వీచి, అంతలోనే మాయమై పోయే గాలి వంటివారు.
40 అయ్యో, ఎడారిలో ఆ ప్రజలు దేవునికి అనేక తొందరలు కలిగించారు.
    ఆ ఎడారి దేశంలో వారు ఆయన్ని ఎంతో దుఃఖ పెట్టారు.
41 ఆ ప్రజలు దేవుని సహనాన్ని మరలా మరలా పరీక్షించారు.
    ఇశ్రాయేలీయుల పరిశుద్ధునికి నిజంగా వారు ఎంతో బాధ కలిగించారు.
42 ఆ ప్రజలు దేవుని శక్తిని గూర్చి మరచిపోయారు.
    శత్రువు బారినుండి దేవుడు తమని అనేకసార్లు రక్షించిన విషయం వారు మరచిపోయారు.
43 ఈజిప్టులో ఆయన చేసిన అద్భుతాలను వారు మరచిపోయారు.
    సోయను పొలాలలో జరిగిన అద్భుతాలను వారు మరచిపోయారు.
44 నదులను దేవుడు రక్తంగా మార్చాడు!
    ఈజిప్టువారు నీళ్లు త్రాగలేకపోయారు.
45 ఈజిప్టు ప్రజలను కుట్టిన జోరీగల దండులను దేవుడు పంపించాడు.
    ఈజిప్టువారి బ్రతుకులను పాడు చేయగలిగిన కప్పలను దేవుడు పంపించాడు.
46 దేవుడు వారి పంటలను చీడ పురుగులకు అప్పగించాడు.
    వారి ఇతర మొక్కలను మిడతలకు అప్పగించాడు.
47 ఈజిప్టువారి ద్రాక్షాతీగెలను నాశనం చేయటానికి దేవుడు వడగండ్లను వాడుకొన్నాడు.
    వారి చెట్లను నాశనం చేయుటకు ఆయన హిమమును వాడుకొన్నాడు.
48 దేవుడు వారి జంతువులను వడగండ్ల చేతను
    వారి పశువులను పిడుగుల చేతను చంపేశాడు.
49 దేవుడు తన భయంకరమైన కోపాన్ని ఈజిప్టువారికి చూపించాడు.
    నాశనం చేసే తన దేవదూతలను వారికి విరోధంగా ఉండుటకు ఆయన పంపించాడు.
50 దేవుడు తన కోపాన్ని చూపించుటకు ఒక మార్గం కనుగొన్నాడు.
    ఆ ప్రజలలో ఎవరినీ ఆయన బతకనివ్వలేదు.
    వారినందరినీ ఓ భయంకర రోగంతో ఆయన చావనిచ్చాడు.
51 ఈజిప్టులో ప్రథమ సంతానాన్ని దేవుడు చంపివేసాడు.
    హాము[a] సంతానంలో ప్రతి మొదటి బిడ్డనీ ఆయన చంపివేసాడు.
52 తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులను గొర్రెల కాపరిలా నడిపించాడు.
    ఆయన తన ప్రజలను అరణ్యం లోనికి గొర్రెలను నడిపించినట్లుగా నడిపించాడు.
53 ఆయన తన ప్రజలను క్షేమంగా నడిపించాడు.
    దేవుని ప్రజలు భయపడాల్సింది. ఏమీ లేదు.
    వారి శత్రువులను దేవుడు ఎర్ర సముద్రంలో ముంచి వేసాడు.
54 దేవుడు తన ప్రజలను తన పవిత్ర దేశానికి నడిపించాడు.
    తన స్వంత శక్తితో సీయోను పర్వతానికి ఆయన నడిపించాడు.
55 ఇతర రాజ్యాలు ఆ దేశాన్ని విడిచిపెట్టేటట్టు దేవుడు వారిని బలవంతం చేసాడు.
    దేవుడు తన ప్రజలకు వారి వంతు దేశాన్ని ఇచ్చాడు.
    అందుచేత ఇశ్రాయేలీయులు వారి స్వంత గృహాలలో నివసించారు.
56 కాని ఇశ్రాయేలు ప్రజలు సర్వోన్నతుడైన దేవున్ని ఇంకను పరీక్షించి ఆయన్ని దుఃఖ పెట్టారు.
    ఆ ప్రజలు దేవుని ఆదేశాలకు విధేయులు కాలేదు.
57 ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి మళ్లుకొన్నారు. వారు వారి తండ్రుల్లాగే ద్రోహులుగాను, అపనమ్మకస్తులుగాను ఉన్నారు.
    వారు మోసకరమైన విల్లులా వంకర తిరిగారు.
58 ఇశ్రాయేలు ప్రజలు ఎత్తయిన గోపురాలు నిర్మించి దేవునికి కోపం పుట్టించారు.
    దేవతల విగ్రహాలను వారు తయారు చేసి దేవునికి రోషం పుట్టించారు.
59 దేవుడు ఇది విని చాలా కోపగించాడు.
    మరియు ఇశ్రాయేలీయులను దేవుడు పూర్తిగా తిరస్కరించాడు.
60 షిలోహులో పవిత్ర గుడారాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు.
    ఇది ప్రజల మధ్య నివసించిన దేవుని గుడారం.
61 అప్పుడు దేవుడు ఇతర రాజ్యాలు తన ప్రజలను బంధీలుగా చేయనిచ్చాడు.
    దేవుని “అందమైన ఆభరణాన్ని” శత్రువులు తీసుకొన్నారు.
62 తన ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు తన కోపం చూపించాడు.
    ఆయన వారిని యుద్ధంలో చంపబడనిచ్చాడు.
63 యువకులు చనిపోయేవరకు కాల్చబడ్డారు.
    పెళ్లి కావాల్సిన యువతులు పెళ్లిపాటలు ఏమి పాడలేదు.
64 యాజకులు చంపివేయబడ్డారు.
    కాని విధవలు వారి కోసం ఏడ్వలేదు.
65 త్రాగి కేకలువేసే బలాఢ్యుడైన మనిషివలె,
    నిద్రనుండి మేల్కొన్న మనిషివలె ప్రభువు లేచాడు.
66 దేవుడు తన శత్రువును వెనుకకు తరిమి వారిని ఓడించాడు.
    దేవుడు తన శత్రువులను ఓడించి, శాశ్వతంగా వారిని అవమానించాడు.
67 కాని యోసేపు కుటుంబాన్ని దేవుడు నిరాకరించాడు.
    ఎఫ్రాయిము కుటుంబాన్ని దేవుడు కోరుకోలేదు.
68 దేవుడు యూదావారిని ఎంచుకొన్నాడు.
    మరియు దేవుడు తనకు ప్రియమైన సీయోను పర్వతాన్ని కోరుకొన్నాడు.
69 ఆ పర్వతం మీద ఎత్తుగా దేవుడు తన పవిత్ర ఆలయాన్ని నిర్మించాడు.
    భూమిలాగే, తన పవిత్ర ఆలయం శాశ్వతంగా ఉండేటట్టు దేవుడు నిర్మించాడు.
70 తర్వాత తన ప్రత్యేక సేవకునిగా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొన్నాడు.
    దావీదు గొర్రెలను కాస్తూ ఉన్నాడు. కాని దేవుడు అతన్ని ఆ పని నుండి తీసివేసాడు.
71 గొర్రెలను కాపాడే పని నుండి దేవుడు దావీదును తొలగించి,
    తన ప్రజలను, యాకోబు ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను, దేవుని సొత్తును కాపాడే పని దావీదుకు యిచ్చాడు.
72 మరియు దావీదు పవిత్ర హృదయంతో ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు.
    అతడు చాలా జ్ఞానంతో వారిని నడిపించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International