M’Cheyne Bible Reading Plan
గిబియోనీయులు సౌలు కుటుంబాన్ని శిక్షించమని కోరటం
21 దావీదు కాలంలో ఒకసారి కరువు సంభవించింది. ఆ కరువు మూడు సంవత్సరాలు కొనసాగింది. దావీదు యెహోవాను ప్రార్థించాడు. దావీదు ప్రార్థన ఆలకించి యెహోవా ఇలా అన్నాడు: “సౌలు, మరియు అతని హంతకుల కుటుంబం[a] ఈ కరువుకు కారణం. ఇప్పడీ కాటకం (కష్టం) సౌలు గిబియోనీయులను చంపివేసినందుకు వచ్చింది.” 2 (గిబియోనీయులు ఇశ్రాయేలు వారు కాదు. చావగా మిగిలిన అమ్మోరీయులకు చెందిన ఒక గుంపువారు. ఇశ్రాయేలీయులు వారికి కీడు చేయబోమని గిబియోనీయులకు[b] ప్రమాణ పూర్వకంగా చెప్పియున్నారు. కాని సౌలు ఇశ్రాయేలీయుల పట్ల, యూదా వారి పట్ల ప్రేమకలవాడై గిబియోనీయులను చంపబూనాడు)
దావీదు రాజు గిబియోనీయులను పిలిచాడు. అతడు వారితో మాట్లాడాడు. 3 “నేను మీకు ఏమి సహాయం చేయగలను? మీరు యెహోవా ప్రజలను[c] దీవించేలాగున నేను ఇశ్రాయేలు వారి పాపాన్ని పోగొట్టటానికి ఏమి చేయాలి?” అని దావీదు గిబియోనీయులను అడిగాడు.
4 “సౌలు, అతని కుటుంబం వారు చేసిన పాపాలకు పరిహారంగా వెండి బంగారాలు ఇవ్వాలని అడిగే హక్కుగాని, ఇశ్రాయేలులో ఎవ్వరినైనా చంపేహక్కుగాని మాకు లేదు” అని గిబియోనీయులు దావీదుతో అన్నారు.
“అయితే మీకు నేనేమి చేయగలను?” అని దావీదు అడిగాడు.
5 అప్పుడు గిబియోనీయులు దావీదుతో ఇలా అన్నారు, “సౌలు మాకు వ్యతిరేకంగా కుట్రపన్నాడు. ఇశ్రాయేలులో మిగిలివున్న మా ప్రజలందరినీ సర్వనాశనం చేయాలని ప్రయత్నించాడు. 6 సౌలు యోహోవాచే ఎంపిక చేయబడిన రాజు. కావున అతని ఏడుగురు కుమారులను మా వద్దకు తీసుకొని రా. వారిని మేము సౌలు యొక్క గిబియా పర్వతం మీద యెహోవా ఎదుట ఉరితీస్తాము.”
రాజైన దావీదు, “వారిని మీకు నేను అప్పగించెద” నని అన్నాడు. 7 కాని రాజు యోనాతాను కుమారుడైన మెఫిబోషెతుకు రక్షణ కల్పించాడు. (యోనాతాను సౌలు కుమారుడు) ఆ మేరకు దావీదు యెహోవా పేరు మీద యోనాతానుకు ప్రమాణం[d] చేసియున్నాడు. అందువల్ల రాజు వారిని మెఫీబోషెతుకు హాని చేయించలేదు. 8 అయ్యా కుమార్తెయగు రిస్పాకు సౌలువలన పుట్టిన ఇద్దరు కుమారులను రాజు తీసుకున్నాడు. వారిద్దరి పేర్లు అర్మోని మరియు మెఫీబోషెతు[e] రిస్పా కుమారులైన ఈ ఇద్దరినీ, మరియు సౌలు కుమార్తెయగు మెరాబునకు పుట్టిన ఐదుగురు కుమారులను రాజు తీసుకున్నాడు. (మెహూలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రీయేలువలన మెరాబునకు పుట్టిన వారీ ఐదుగురు పుత్రులు) 9 దావీదు ఈ ఏడుగురు కుమారులను గిబియోనీయులకు అప్పగించాడు. అప్పుడు గిబియోనీయులు ఈ ఏడుగురిని గిబియా పర్వతంమీద యెహోవా సాన్నిధ్యంలో ఉరితీశారు. ఈ ఏడుగురు కుమారులు కలిసి చనిపోయారు. యవల ధాన్యంపంట కోత ప్రారంభకాలంలో వారు చంపబడ్డారు.
రిస్పా తన కుమారుల శవాలకు కాపలా వుండటం
10 అయ్యా కుమార్తె రిస్పా విషాద సూచకమైన ఒక వస్త్రం తీసుకొని కొండ[f] మీద పరచింది. ఆ వస్త్రం పంట కోతలు మొదలు పెట్టినపప్పటి నుండి దానిమీద వర్షం పడే వరకు ఆ కొండ మీద పర్చబడివుంది. పగటి వేళ పక్షులు వచ్చి తన కుమారుల శవాలను ముట్టకుండా రిస్పా చూచేది. రాత్రిళ్లు పొలాల్లో నుంచి జంతువులు వచ్చి కుమారుల శవాలను ముట్టకుండగనూ కాపాడేది.
11 అయ్యా కుమార్తెయు, సౌలు దాసి అగు రిస్పా చేస్తున్నదంతా ప్రజలు దావీదుకు చెప్పారు. 12 అప్పుడు దావీదు యాబేష్గిలాదు వారి నుండి సౌలు యొక్కయు, యోనాతాను యొక్కయు ఎముకలను తీసుకున్నాడు. (యాబేషు వారు ఈ ఎముకలను బేత్షానులోని పధ్రాన వీధి నుండి దొంగిలించారు. బేత్షానులోని ఈ వీధిలోనే గతంలో ఫిలిష్తీయులు సౌలు, యోనాతానుల శవాలను వేలాడదీశారు. గిల్బోవ వద్ద సౌలును చంపిన తరువాత ఫిలిష్తీయులు ఆ శవాలను వేలాడదీశారు) 13 దావీదు గిలాదు నుంచి సౌలు యొక్కయు, అతని కుమారుడైన యోనాతాను యొక్కయు ఎముకలను తెచ్చినాడు. తరువాత ప్రజలు ఉరి తీయబడిన సౌలు యొక్క ఏడుగురి కమారుల శవాలను సేకరించారు. 14 బెన్యామీనులోని సేలా అనేచోట సౌలు యొక్క అతని కుమారుడు యోనాతాను యొక్క ఎముకలను వారు పాతి పెట్టారు. శవాలను మాత్రం సౌలు తండ్రి కీషు సమాధియందు వారు పాతిపెట్టారు. రాజు యొక్క ఆజ్ఞాను సారం ప్రజలు ఇవన్నీ చేశారు. రాజ్యంలోని ప్రజల ప్రార్థన దేవుడు ఆలకించాడు.
ఫీలిష్తీయులతో యుద్ధం
15 దావీదుతో ఫిలిష్తీయులు మరల యుద్ధానికి దిగారు. దావీదు తన సైన్యంతో ఫిలిష్తీయులతో యుద్ధం చేయటానికి తరలివెళ్లాడు. కాని దావీదు బాగా అలసిపోయి బలహీనపడిపోయాడు. 16 ఇష్బిబే నోబ అనే రెఫాయీముల సంతతి వాడొకడున్నాడు. ఇష్బిబే నోబ ఈటె మూడు వందల షెకెలుల[g] ఇత్తడి ప్రమాణంలోవుంది. వానికొక కొత్త కత్తి కూడావున్నది. వాడు దావీదును చంపయత్నించాడు. 17 కాని సెరూయా కుమారుడైన అబీషై ఆ ఫిలిష్తీయుని చంపి, దావీదు ప్రాణం కాపాడాడు.
అప్పుడు దావీదు మనుష్యులు అతనికి ఒక ప్రమాణం చేశారు. “ఇకమీదట నీవు యుద్ధాలు చేయటానికి బయటికి వెళ్లరాదు. ఒక వేళ వెళితేమాత్రం నీవు చంపబడతావు. దానితో ఇశ్రాయేలు ఒక మహానాయకుని[h] కోల్పోతుంది,” అని చెప్పారు.
18 తరువాత గోబు వద్ద ఫిలిష్తీయులతో మరో యుద్ధం జరిగింది. అందులో హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీముల సంతతివాడగు సపును చంపాడు. సపు భయంకరాకారుడు.
19 ఫిలిష్తీయులతో గోబువద్ద మరో యుద్ధం జరిగింది. అక్కడ ఎల్హానాను అనువాడు గిత్తీయుడైన గొల్యాతును[i] సంహరించాడు. ఎల్హానాను బేత్లెహేము వాడైన యహరేయోరెగీము అనువాని కుమారుడు. గొల్యాతు ఈటె నేతగాని దోనెవలె మందంగా, పొడవుగావుంది.
20 గాతువద్ద మళ్లీ యుద్ధం జరిగింది. అక్కడ మహా కాయుడొకడున్నాడు. వాని కాళ్లకు, చేతులకు ఒక్కొక్కదానికి ఆరేసి వ్రేళ్ల చొప్పున మొత్తము ఇరవై నాలుగువున్నాయి. అతడు రాక్షసాకారులగు రెఫాయీముల సంతతివాడు. 21 ఈ మనుష్యుడు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి కాలుదువ్వాడు. దావీదు సోదరుడైన షిమ్యా కుమారుడు యోనాతాను వానిని చంపివేశాడు.
22 ఈ నలుగురూ గాతుకు చెందిన భీకరులైన రెఫా సంతతివారు. వీరంతా దావీదువలన, అతని సైనికుల వలన చంపబడ్డారు.
1 మనుష్యుని నుండియైనను, మనుష్యుని ద్వారానైనను కాక, యేసు క్రీస్తు ద్వారాను, ఆయనను మరణములో నుండి లేపిన తండ్రియైన దేవుని ద్వారాను అపొస్తలుడనైన పౌలు నుండియు,
2 మరియు నాతో ఉన్న యితర సోదరుల నుండియు గలతీయలో ఉన్న సంఘాలకు:
3 మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మిమ్మల్ని కనికరించి మీకు శాంతి ప్రసాదించుగాక! 4 ప్రస్తుతం మనము అనుభవిస్తున్న చెడుతనం నుండి రక్షించటానికి మన పాపాలకోసం క్రీస్తు బలి అయ్యాడు. తద్వారా మన తండ్రియైన దేవుని యిచ్ఛను పూర్తి చేసాడు. 5 దేవునికి మహిమ చిరకాలం ఉండుగాక! ఆమేన్.
ఒకే ఒక సువార్త
6 తనలో దయ వుండటం వల్ల దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరు ఆయన్ని యింత త్వరలో వదిలివేయటం, మరొక సువార్తవైపు మళ్ళటం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. 7 నిజానికి మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త లేనేలేదు. కొందరు మిమ్మల్ని కలవరపెట్టటానికి క్రీస్తు సువార్తను మార్చటానికి ప్రయత్నం చేస్తున్నారు. 8 నేను గాని, లేక పరలోకం నుండి వచ్చిన దేవదూత గాని మేము ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను ప్రకటిస్తున్నట్లయితే అలాంటి వాడు నిత్యనాశనానికి గురియగుగాక. 9 మేము యిదివరకు చెప్పినదాన్ని యిప్పుడు నేను మళ్ళీ చెపుతున్నాను. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొక సువార్తను ఎవడైనా మీకు భోధిస్తున్నట్లయితే వాడు నిరంతరము శాపగ్రస్తుడవును గాక!
10 నేనిప్పుడు మానవుని మెప్పు పొందటానికి ప్రయత్నిస్తున్నానా లేక దేవుని మెప్పునా? మానవుణ్ణి నేను సంతోషపెట్టాలని చూస్తున్నానా? నేను ఇంకా మానవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నట్లయితే క్రీస్తు సేవకుణ్ణి కాదు.
దేవుని పిలుపు
11 సోదరులారా! నేను ప్రకటించిన సువార్త మానవుడు కల్పించింది కాదు. అది మీరు గమనించాలి. 12 నేను ఆ సువార్తను మానవుని ద్వారా పొందలేదు. దాన్ని నాకెవరూ బోధించనూ లేదు. దాన్ని నాకు యేసు క్రీస్తు తెలియచేసాడు.
13 నేను యూదునిగా ఎట్లా జీవించానో మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించిన విషయం మీకు తెలుసు. దాన్ని ఏ విధంగా నాశనం చెయ్యాలని చూసానో మీకు తెలుసు. 14 నేను యూదునిగా నా వయస్సులో ఉన్న వాళ్ళందరికన్నా చురుకైనవాడను. నా పూర్వికుల సాంప్రదాయాల విషయంలో నాకు చాలా పట్టుదల ఉంది.
15 కాని దేవుడు తన దయతో నేను పుట్టినప్పుడే నన్ను ప్రత్యేకంగా ఉంచాడు. నన్ను పిలిచి తన కుమారుణ్ణి తెలియ చెయ్యటానికి నిశ్చయించుకొన్నాడు. 16 నేను యూదులు కానివాళ్ళకు తన కుమారుని గూర్చిన సువార్తను బోధించాలని ఆయన ఉద్దేశ్యం. నేనీ విషయంలో మరొక వ్యక్తిని సంప్రదించ లేదు. 17 నాకన్నా ముందునుండి అపొస్తలులుగా ఉన్నవాళ్ళను చూడటానికి నేను యెరూషలేము కూడా వెళ్ళలేదు. దానికి మారుగా నేను వెంటనే అరేబియా దేశానికి వెళ్ళి ఆ తర్వాత డెమాస్కసుకు తిరిగి వచ్చాను.
18 మూడు సంవత్సరాలు గడిచాక పేతురును పరిచయం చేసుకోవటానికి యెరూషలేము వెళ్ళాను. అతనితో పదిహేను రోజులు గడిపాను. 19 ఆ సమయంలో ప్రభువు సోదరుడైన యాకోబు తప్ప మిగతా అపొస్తలులెవరూ నాకు కనిపించలేదు. 20 నేను అబద్ధం వ్రాయటంలేదని దేవునిపై ప్రమాణం చేసి చెపుతున్నాను. 21 ఆ తర్వాత నేను సిరియ, కిలికియ దేశాలకు వెళ్ళాను.
22 యూదయ ప్రాంతంలోని క్రీస్తు సంఘాలు నన్ను ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. 23 “ఇదివరలో మనవాళ్ళను హింసించిన వ్యక్తి యిప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ఒకప్పుడు అతడు సువార్తను నాశనం చెయ్యాలని చూసాడు” అని యితర్లు అనగా వాళ్ళు విన్నారు. 24 మరియు నా గురించి వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు.
తూరు తనను తాను దేవునిగా భావించుకోవటం
28 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు: 2 “నరపుత్రుడా, తూరు పాలకునికి ఇలా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా నీకు చెప్పునదేమనగా:
“‘నీవు గర్విష్ఠివి!
“నేనే దేవుడను!
సముద్ర మధ్యంలో దైవ స్థానంలో కూర్చున్నాను”
అని నీవంటున్నావు.
“‘కాని నీవు మానవ మాత్రుడవు. దేవుడవు, మాత్రం కాదు.
నీవు దేవుడవని నీకై నీవే అనుకుంటున్నావు.
3 నీవు దానియేలు[a] కంటె తెలివిగలవాడవని తల పోస్తున్నావు!
రహస్యాలన్నిటినీ తెలుసుకొనగలవని నీవనుకుంటున్నావు.!
4 నీ తెలివితేటల ద్వారా, నీ వ్యాపారం ద్వారా నీవు ధనధాన్యాలు విస్తారంగా సేకరించావు.
నీ ధనాగారాలలో వెండి బంగారాలు నిలువజేశావు.
5 గొప్పదైన నీ జ్ఞానంచేత, వ్యాపారం ద్యారా నీ సంపదను పెంచావు.
ఇప్పుడా ఐశ్వర్యాన్ని చూచు కొని నీవు గర్వపడుతున్నావు.
6 “‘అందువల్ల నా ప్రభువైన యెహోవా చెపుతున్న దేమంటే,
నీవొక దేవుడిలా ఉన్నావని తలంచావు.
7 అన్య జనులను నేను నీ మీదికి రప్పిస్తాను.
వారు దేశాలన్నిటిలో అతి భయంకరులు!
వారు తమ కత్తులను దూస్తారు.
నీ తెలివితేటలు సముపార్జించి పెట్టిన అందమైన వస్తువుల మీద వాటిని ఉపయోగిస్తారు.
వారు నీ కీర్తిని నాశనం చేస్తారు.
8 వారు నిన్ను సమాధిలోకి దించుతారు.
నడి సముద్రంలో చనిపోయిన నావికునిలా నీవుంటావు.
9 నిన్నొక వ్యక్తి చంపివేస్తాడు.
అప్పుడు “నేను దేవుణ్ణి” అని నీవు చెప్పుకోగలవా?
ఆ సమయంలో అతడు నిన్ను తన అధీనంలో ఉంచుతాడు.
దానితో నీవొక మానవ మాత్రుడవనీ, దేవుడవు కావనీ నీవు తెలుసుకుంటావు!
10 క్రొత్తవాళ్లు నిన్ను విదేశీయునిగా చూసి చంపివేస్తారు.
నేను ఇచ్చిన ఆజ్ఞ కారణంగా ఆ పనులు జరుగుతాయి!’”
నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
11 యెహోవా వాక్కు నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు: 12 “నరపుత్రుడా, తూరు రాజును గురించి ఈ విషాద గీతం ఆలపించు. అతనికి ఈ విధంగా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“‘నీవు ఆదర్శ పురుషుడవు.
నీకు జ్ఞానసంపద మెండు. నీ అందం పరిపూర్ణమైనది.
13 దేవుని ఉద్యానవనమైన ఏదెనులో నీవున్నావు.
నీవద్ద ప్రతి విలువైన రత్నం ఉంది.
కెంపులు, గోమేధికము, ఇతర రత్నాలు;
గరుడ పచ్చలు, సులిమానురాయి, పచ్చరాయి;
నీల మణులు, వైడూర్యము, మరకత పచ్చలు.
వీటిలో ప్రతిరాయీ బంగారంలో పొదగబడింది.
నీవు సృష్టింపబడిన రోజుననే దేవుడు నిన్ను బలవంతుడిగా చేశాడు.
14 నీవు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన కెరూబులలొ[b] ఒకడవై యున్నావు.
నీ రెక్కలు నా సింహాసనం మీదికి చాపబడ్డాయి.
దేవుని పవిత్ర పర్వతం మీద నిన్ను ఉంచాను.
అగ్నిలా మెరిసే ఆభరణాల గుండా నీవు నడిచావు.
15 నేను నిన్ను సృష్టించినప్పుడు నీవు మంచివాడివి, యోగ్యుడిగా ఉన్నావు.
కాని ఆ తరువాత నీవు దుష్టుడవయ్యావు.
16 నీ వ్యాపారం నీకు చాలా ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టింది.
ధనంతో పాటు నీలో మదం (గర్వం) పెరిగింది. దానితో నీవు పాపం చేశావు.
అందువల్ల నిన్నొక అపరిశుభ్రమైన వస్తువుగా నేను పరిగణించాను.
దేవుని పవిత్ర పర్వతం నుండి నిన్ను తోసివేశాను.
నీవు ప్రత్యేక కెరూబులలో ఒకడవు.
నీ రెక్కలు నా సింహాసనం పైకి చాప బడ్డాయి.
కాని అగ్నిలా మెరిసే ఆభరణాలను
వదిలిపెట్టి పోయేలా నిన్ను ఒత్తిడి చేశాను.
17 నీ అందాన్ని చూచుకొని నీవు గర్వపడ్డావు.
నీ గొప్పతనం యొక్క గర్వం నీ జ్ఞానాన్ని పాడు చేసింది.
అందువల్ల నిన్ను క్రిందికి పడదోశాను.
ఇప్పుడు ఇతర రాజులు నీవంక తేరిపార జూస్తున్నారు.
18 నీవు చాలా పాపాలు చేశావు.
నీవు చాలా కుటిలమైన వర్తకుడవు.
ఈ రకంగా పవిత్ర స్థలాలను నీవు అపవిత్ర పర్చావు.
కావున నీలో నేను అగ్ని పుట్టించాను.
అది నిన్ను దహించి వేసింది!
నీవు నేలమీద బూడిదవయ్యావు.
ఇప్పుడు ప్రతి ఒక్కడు నీ అవమానాన్ని చూడ గలడు.
19 ఇతర దేశాల ప్రజలు నీకు సంభవించిన దాన్ని
చూచి ఆశ్చర్యపోయారు.
నీకు వచ్చిన ఆపద ప్రతి ఒక్కరిని భయపెడుతుంది.
నీవు సర్వనాశనమయ్యావు.’”
సీదోనుకు వ్యతిరేకంగా వర్తమానం
20 యెహోవా మాట నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 21 “నరపుత్రుడా, సీదోను పట్టణం వైపు చూడు. నా తరపున ఆ ప్రదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుము. 22 ఈ రకంగా చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“‘సీదోనూ, నేను నీకు వ్యతిరేకిని!
నీ ప్రజలు నన్ను గౌరవించటం నేర్చుకుంటారు!
నేను సీదోనును శిక్షిస్తాను.
ప్రజలు నేనే యెహోవానని అప్పుడు తెలుసుకుంటారు.
నేను పవిత్రుడనని వారు నేర్చుకుని
నన్ను ఆ విధంగా చూసుకుంటారు.
23 రోగాలను, మరణాన్ని నేను సీదోనుకు పంపిస్తాను.
ఖడ్గం (శత్రు సైన్యం) నగరం వెలుపల చాలా మందిని చంపుతుంది.
వారప్పుడు నేనే యెహోవానని తెలుసుకుంటారు!’”
ఇతర రాజ్యాలు ఇశ్రాయేలును పరిహసించటం మానుట
24 “‘గతంలో ఇశ్రాయేలు చుట్టూ ఉన్న దేశాలు దానిని అసహ్యించుకున్నాయి. కాని ఆయా దేశాలకు కీడు జరుగుతుంది. ఇశ్రాయేలు వంశాన్ని బాధించే ముండ్లు గాని, వదలక అంటుకునే ముండ్ల పొదలు గాని ఇక ఎంత మాత్రం ఉండవు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని వారు తెలుసుకుంటారు.’”
25 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “నేను ఇశ్రాయేలు ప్రజలను ఇతర దేశాలకు చెదరగొట్టాను. కాని, ఇశ్రాయేలు వంశాన్ని నేను మళ్లీ ఒక్క చోటికి చేర్చుతాను. అప్పుడా రాజ్యాలన్నీ నేను పవిత్రుడనని తెలుసుకుంటాయి. అవి నన్ను ఆ విధంగా గౌరవిస్తాయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తమ రాజ్యంలో నివసిస్తారు. ఆ రాజ్యాన్ని నేను నా సేవకుడైన యాకోబుకు ఇచ్చాను. 26 వారు ఆ రాజ్యంలో క్షేమంగా ఉంటారు. వారు ఇండ్లు కట్టుకొని, ద్రాక్షాతోటలు పెంచుకుంటారు. నేను వారి చుట్టూ ఉండి, వారిని అసహ్యించుకున్న దేశాల వారిని శిక్షిస్తాను. తరువాత ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా జీవిస్తారు. అప్పుడు నేనే వారి దేవుడనైన యెహోవానని వారు తెలుసుకొంటారు.”
సంగీత నాయకునికి: యెదూతూను రాగం. ఆసాపు కీర్తన.
77 సహాయం కోసం నేను దేవునికి గట్టిగా మొరపెడతాను.
దేవా, నేను నిన్ను ప్రార్థిస్తాను. నా ప్రార్థన వినుము.
2 నా దేవా, నాకు కష్టం వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను.
రాత్రి అంతా నీకోసం నా చేయి చాపి ఉన్నాను.
నా ఆత్మ ఆదరణ పొందుటకు నిరాకరించింది.
3 నేను దేవుని గూర్చి తలుస్తాను. నేనాయనతో మాట్లాడుటకు,
నాకు ఎలా అనిపిస్తుందో ఆయనతో చెప్పుటకు ప్రయత్నిస్తాను. కాని నేనలా చేయలేను.
4 నీవు నన్ను నిద్రపోనియ్యవు.
నేనేదో చెప్పాలని ప్రయత్నించాను. కాని నేను చాలా కలవరపడి పోయాను.
5 గతాన్ని గూర్చి నేను తలపోస్తూ ఉండిపోయాను.
చాలా కాలం క్రిందట సంభవించిన సంగతులను గూర్చి నేను ఆలోచిస్తూ ఉండిపోయాను.
6 రాత్రివేళ నా పాటలను గూర్చి ఆలోచించుటకు నేను ప్రయత్నిస్తాను.
నాలో నేను మాట్లాడుకొని గ్రహించుటకు ప్రయత్నిస్తాను.
7 “మా ప్రభువు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశాడా?
ఆయన ఎన్నడైనా తిరిగి మమ్మల్ని కోరుకొంటాడా?
8 దేవుని ప్రేమ శాశ్వతంగా పోయిందా?
ఆయన మరల ఎన్నడైనా మాతో మాట్లాడుతాడా?
9 కనికరం అంటే ఏమిటో దేవుడు మరచి పోయాడా?
ఆయన జాలి కోపంగా మార్చబడిందా” అని నాకు అనిపిస్తుంది.
10 అప్పుడు నేను, “సర్వోన్నతుడైన దేవుడు తన శక్తిని పోగొట్టుకున్నాడా?
అనే విషయం నిజంగా నన్ను బాధిస్తుంది” అని తలచాను.
11 యెహోవా చేసిన శక్తిగల కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
దేవా, చాలా కాలం క్రిందట నీవు చేసిన అద్భుత కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
12 నీవు చేసిన సంగతులన్నింటిని గూర్చి నేను ఆలోచించాను.
ఆ విషయాలను గూర్చి నేను మాట్లాడాను.
13 దేవా, నీ మార్గాలు పవిత్రం.
దేవా, ఏ ఒక్కరూ నీ అంతటి గొప్పవారు కాలేరు.
14 నీవు అద్భుత కార్యాలు చేసిన దేవుడివి.
నీవు నీ మహా శక్తిని ప్రజలకు చూపెట్టావు.
15 నీవు నీ శక్తిని బట్టి నీ ప్రజలను రక్షించావు.
యాకోబు, యోసేపు సంతతివారిని నీవు రక్షించావు.
16 దేవా, నీళ్లు నిన్ను చూచి భయపడ్డాయి.
లోతైన జలాలు భయంతో కంపించాయి.
17 దట్టమైన మేఘాలు వాటి నీళ్లను కురిపించాయి.
ఎత్తైన మేఘాలలో పెద్ద ఉరుములు వినబడ్డాయి.
అప్పుడు నీ మెరుపు బాణాలు ఆ మేఘాలలో ప్రజ్వరిల్లాయి.
18 పెద్ద ఉరుముల శబ్దాలు కలిగాయి.
మెరుపు ప్రపంచాన్ని వెలిగించింది.
భూమి కంపించి వణికింది.
19 దేవా, నీవు లోతైన జలాలలో నడుస్తావు. లోతైన సముద్రాన్ని నీవు దాటి వెళ్లావు.
కాని నీ అడుగుల ముద్రలు ఏవీ నీవు ఉంచలేదు.
20 అదే విధంగా నీ ప్రజలను గొర్రెల వలె నడిపించేందుకు
మోషేను, అహరోనును నీవు వాడుకొన్నావు.
© 1997 Bible League International