Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 సమూయేలు 20

షెబ ఇశ్రాయేలీయులను దావీదుకు వ్యతిరేకంగా చేయటం

20 బిక్రి కుమారుడైన షెబ అనే పనికిమాలిన వాడొకడు అక్కడ వుండటం జరిగింది. షెబ అనేవాడు బెన్యామీను వంశానికి చెందినవాడు. అతడు బూర వూది,

“దావీదులో మనకు భాగం లేదు.
    యెష్షయి కుమారునితో మనకేమీ సంబంధం లేదు!
కావున ఇశ్రాయేలీయులారా, మనమంతా మన గుడారాలకు పోదాం పదండి”

అని చెప్పాడు.

దానితో ఇశ్రాయేలీయులు దావీదును వదిలి, బిక్రి కుమారుడైన షెబను అనుసరించారు. కాని యూదా ప్రజలు మాత్రం యొర్దాను నది వద్ద నుండి యెరూషలేముకు వచ్చేవరకు దారి పొడవునా వారి రాజైన దావీదుతోనే వున్నారు.

దావీదు యెరూషలేములోని తన ఇంటికి వచ్చాడు. గతంలో దావీదు తన ఉపపత్నులను[a] పది మందిని ఇల్లు చక్కదిద్దేందుకై వదిలి వెళ్లాడు. ఇప్పుడు దావీదు ఈ స్త్రీలను ఒక ప్రత్యేకమైన ఇంటిలో వుంచాడు. ఆ ఇంటికి సైనిక కాపలా ఏర్పాటు చేశాడు. ఆ స్త్రీలు తమ జీవితాంతం ఆ ఇంటిలోనే వుండిపోయారు. దావీదు వారికి ఆహారాదులిచ్చాడు గాని, వారితో సాంగత్యం చేయలేదు. వారి మరణ పర్యంతం ఆ స్త్రీలు విధవరాండ్రవలె జీవించారు.

రాజు అమాశాను పిలిచి, “యూదా ప్రజలను మూడు రోజులలో నన్ను కలవమని చెప్పు. నీవు కూడా ఇక్కడ వుండాలి” అని అన్నాడు.

యూదా ప్రజలందరినీ పిలిచి కూడగట్టుకు రావటానికి అమాశా వెళ్లాడు. కాని రాజు పెట్టిన గడువుకంటె అమాశా ఎక్కువ కాలాన్ని తీసుకున్నాడు.

అబీషైతో షెబను చంపమని దావీదు చెప్పటం

దావీదు అబీషైని పిలిచి, “బిక్రి కుమారుడైన షెబ మనకు అబ్షాలోముకంటె ఎక్కువ ప్రమాద కరమైన మనిషి. కావున నా సైనికులను తీసుకొని షెబను వెంటాడు. షెబ ప్రాకారాలున్న నగరాలలోనికి తప్పించుకునే ముందుగానే నీవు త్వరపడాలి. షెబ గనుక ప్రాకారాలున్న నగరాలలోకి వెళ్లినాడంటే ఇక వాడు మననుండి తప్పించుకున్నట్లే,” అని అన్నాడు.

కనుక యోవాబు మనుష్యులు, కెరేతీయులు, పెలేతీయులు, తదితర సైనికులు యెరూషలేము నుండి బయలుదేరి వెళ్లారు. బిక్రి కుమారుడైన షెబను వారు వెంటాడారు.

యోవాబు అమాశాను చంపటం

గిబియోను గుట్ట వద్దకు యోవాబు తన సైనికులతో వచ్చినప్పుడు అమాశా వారిని కలవటానికి ఎదురేగాడు. యోవాబు తన సైనిక దుస్తుల్లో వున్నాడు నడికట్టు కట్టుకున్నాడు. అతని ఒరలో కత్తి వున్నది. అమాశాను కలవటానికి యోవాబు ముందుకు వెళ్లాడు. ఆ సమయంలో తన ఒరలోని కత్తి జారి క్రిందపడింది. యోవాబు ఆ కత్తిని తీసి చేతితో పట్టుకున్నాడు. “సోదరా, నీవు క్షేమమేనా?” అని యోవాబు అమాశాను అడిగినాడు. యోవాబు తన కుడిచేతితో అమాశాను ముద్దు పెట్టుకునేందుకా అన్నట్టు గడ్డం పట్టుకున్నాడు. 10 యోవాబు చేతిలో వున్న కత్తిని అమాశా గమనించలేదు. యోవాబు తన కత్తితో అమాశా పొట్టలో పొడిచాడు. అమాశా పేగులన్నీ బైటకు వచ్చాయి. యోవాబు మళ్లీ పొడిచే అవసరం లేకుండా పోయింది – అమాశా అప్పుడే చనిపోయాడు.

దావీదు మనుష్యులు ఇంకా షెబను వెదకుట

యోవాబు, అతని సోదరుడు అబీషై కలిసి బిక్రి కుమారుడు షెబను తరమటం కొనసాగించారు. 11 యోవాబు సైనికులలో యువకుడైన వాడొకడు అమాశా శవం వద్ద నిలబడ్డాడు. ఆ యువకుడు మిగిలిన వారి నుద్దేశించి, “మీలో యోవాబును, దావీదును బలపర్చే ప్రతి ఒక్కడూ యోవాబును అనుసరించి వెళ్లాలి. షెబను వెంటాడటంలో అతనికి సహాయం చేయండి!” అని అన్నాడు.

12 మార్గం మధ్యలో అమాశ శవం రక్తపు మడుగులో పడివుంది. జనమంతా శవాన్ని చూసే నిమిత్తం అక్కడ ఆగుతూ ఉన్నారు కావున ఆ యువకుడు అమాశా శవాన్ని ప్రక్కనే వున్న పొలంలోనికి లాగి, దాని మీద ఒక బట్ట కప్పాడు. 13 అమాశా శవం బాట మీద నుంచి తీసివేయబడిన పిమ్మట జనమంతా యోవాబును అనుసరించారు. బిక్రి కుమారుడు షెబను తరిమేందుకు వారు యోవాబుతో కలిసి వెళ్లారు.

ఆబేలు బేత్మయకాకు షెబ తప్పించుకు పోవటం

14 బిక్రి కుమారుడు షెబ ఇశ్రాయేలు వంశపు వారు నివసించే ప్రాంతాల గుండా పోయి ఆబేలు బేత్మయకా నగరాన్ని చేరాడు. బెరీయులందరూ కూడి షెబను అనుసరించారు.

15 యోవాబు, అతని మనుష్యులు ఆబేలు బేత్మయకా వద్దకు వచ్చారు. యోవాబు సైన్యం నగరాన్ని ముట్టడించింది. నగరం చుట్టూవున్న గోడకు వారు ఒక చోట కందకం పూడ్చి బాగా మట్టి పోశారు. అలా మట్టి పోయటంతో వారు గోడ దగ్గరకు వెళ్ల గలిగారు. ఆ గోడను పడగొట్టే ఉద్దేశంతో వారప్పుడు దానిని పగులగొట్టటం మొదలుపెట్టారు.

16 ఇంతలో ఒక వివేకం గల స్త్రీ నగరంలో నుండి కేకలు పెట్టింది. “నే చెప్పేది వినండి. యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పండి. అతనితో నేను మాట్లాడదలిచాను!” అని అరిచింది.

17 ఆ స్త్రీ తో మాట్లాడటానికి యోవాబు దగ్గరగా వచ్చాడు. “యోవాబువు నీవేనా?” అని ఆమె అడిగింది.

“అవును. నేనే” అని యోవాబు సమాధానం చెప్పాడు.

“అయితే నేను చెప్పేది విను!” అని ఆ స్త్రీ యోవాబుతో అన్నది.

“వింటున్నాను” అని యోవాబు అన్నాడు.

18 ఆ స్త్రీ ఇలా అన్నది, “పూర్వం ప్రజలు ‘సలహా కొరకు ఆబేలులో అడగమని అనే వారు. అప్పుడు వారి సమస్య తీరిపోయేది.’ 19 శాంతిని కోరే వారిలో, ఇశ్రాయేలు పట్ల విశ్వాసముగల వారిలో నేనొక దానిని. ఇశ్రాయేలులో ఒక ముఖ్యనగరాన్ని నీవు నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నావు. యెహోవాకి చెందిన దానిని నీవెందుకు నాశనం చేయ సంకల్పించావు?”

20 “లేదు! లేదు! నేను దేనినీ నాశనం చేయదల్చలేదు[b] మీ పట్టణాన్ని నిర్మూలించను. 21 కాని ఎఫ్రాయిము కొండ ప్రాంతపు వాడొకడున్నాడు. వాని పేరు షెబ. అతడు బిక్రి యొక్క కుమారుడు. వాడు దావీదు రాజుపై తిరుగుబాటు చేశాడు. నీవు గనుక వానిని నా కప్పగించితే, నేను నగరాన్ని వదిలి పెడతాను,” అని యోవాబు అన్నాడు.

“అయితే సరే! అతని తల గోడ మీది నుంచి మీకు విసరివేయబడుతుంది” అని ఆస్త్రీ యోవాబుతో అన్నది.

22 తరువాత ఆ స్త్రీ నగర ప్రజలందరితో చాలా యుక్తిగా మాట్లాడింది. అది విని ఆ నగరవాసులు బిక్రి కుమారుడు షెబ తల నరికి దానిని గోడ మీదుగా యోవాబుకు విసరివేశారు.

అప్పుడు యోవాబు బూర వూదగా సైన్యం నగరం వదిలి వెళ్లిపోయింది. ప్రతివాడూ తన గుడారానికి వెళ్లిపోయాడు. యెరూషలేములో వున్న రాజు వద్దకు యోవాబు వెళ్లాడు.

దావీదు కొలువులో ముఖ్యమైన ఉద్యోగులు

23 ఇశ్రాయేలు రాజ్యంలో యోవాబు సర్వ సైన్యాధ్యక్షుడయ్యాడు. కాని కెరేతీయులకును, పెలేతీయులకును యెహోయాదా కుమారుడైన బెనాయా అధిపతి. 24 వెట్టి చాకిరీ వంటి శరీర కష్టం చేసే దండుకు అదోరాము నాయకత్వం వహించాడు. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు చరిత్రకారుడుగా నియమితుడయ్యాడు. 25 షెవా ప్రధాన కార్యదర్శిగాను; సాదోకు, అబ్యాతారు యాజకులుగాను; 26 మరియు యాయీరీయుడగు ఈరా రాజుకు ప్రధానాచార్యుడుగను వున్నారు.

2 కొరింథీయులకు 13

చివరి హెచ్చరికలు

13 మూడవసారి మీ దగ్గరకు వస్తున్నాను. “ప్రతి విషయం యిద్దరు లేక ముగ్గురు సాక్ష్యాలతో రుజువు పరచాలి.”(A) నేను రెండవ సారి వచ్చి మీతో ఉన్నప్పుడు ఈ విషయంలో మిమ్మల్ని యిదివరకే హెచ్చరించాను. నేను యిప్పుడు మీ సమక్షంలో లేను కనుక మళ్ళీ చెపుతున్నాను. కనుక నేను ఈ సారి వచ్చినప్పుడు ఇదివరలో పాపంచేసినవాళ్ళను ఇప్పుడు పాపంచేసినవాళ్ళను శిక్షిస్తాను. క్రీస్తు నా ద్వారా మాట్లాడుతున్నాడన్న దానికి మీరు రుజువు అడుగుతున్నారు. మీ పట్ల క్రీస్తు బలహీనంగా ఉండడు. ఆయన మీ మధ్య శక్తివంతంగా ఉన్నాడు. బలహీనతల్లో ఆయన సిలువ వేయబడ్డాడు. అయినా, దైవశక్తివల్ల జీవిస్తున్నాడు. అదే విధంగా మేము ఆయనలో బలహీనంగా ఉన్నా, దైవశక్తి వల్ల ఆయనతో సహా జీవించి మీ సేవ చేస్తున్నాము.

మీరు నిజమైన “విశ్వాసులా, కాదా” అని తెలుసుకోవాలనుకొంటే మిమ్మల్ని మీరు పరిశోధించుకోవాలి. మీలో యేసు క్రీస్తు ఉన్నట్లు అనిపించటం లేదా? మీరు ఈ పరీక్షల్లో ఓడిపోతే క్రీస్తు మీలో ఉండడు. మేము ఈ పరీక్షల్లో విజయం సాధించిన విషయం మీరు గ్రహిస్తారని నమ్ముతున్నాను. మీరు ఏ తప్పూ చేయకుండా ఉండాలని మేమే దేవుణ్ణి ప్రార్థిస్తాము. మేము పరీక్షల్లో నెగ్గినట్లు ప్రజలు గమనించాలని కాదు కాని, మేము పరీక్షల్లో నెగ్గినట్లు కనపడకపోయినా మీరు మంచి చెయ్యాలని దేవుణ్ణి ప్రార్థిస్తాము. మేము సత్యానికి విరుద్ధంగా ఏదీ చెయ్యలేము. అన్నీ సత్యంకొరకే చేస్తాము. మీరు బలంగా ఉంటే, మేము బలహీనంగా ఉండటానికి సంతోషిస్తాం. మీలో పరిపూర్ణమైన శక్తి కలగాలని మేము ప్రార్థిస్తున్నాము. 10 అందువల్లే నేను మీ సమక్షంలో లేనప్పుడు యివి వ్రాస్తున్నాను. అలా చేస్తే నేను వచ్చినప్పుడు నా అధికారం ఉపయోగించటంలో కాఠిన్యత చూపనవసరం ఉండదు. ఈ అధికారం ప్రభువు మీ విశ్వాసాన్ని వృద్ధిపరచటానికి యిచ్చాడు, కాని నాశనం చేయటానికి కాదు.

11 తుదకు, సోదరులారా! పరిపూర్ణులుగా ఉండటానికి ప్రయత్నించండి. నేను చెప్పేవాటిని చెయ్యండి. ఒకరితో ఒకరు సహకరిస్తూ జీవించండి. ప్రేమను, శాంతినిచ్చే దేవుడు మీతో ఉంటాడు.

12 పవిత్రమైన ముద్దుతో పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇక్కడున్న విశ్వాసులందరు తమ శుభాకాంక్షలు తెలుపమన్నారు.

13 యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహం, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీ అందరితో ఉండుగాక!

యెహెజ్కేలు 27

తూరు—సముద్రాలకు ద్వారం

27 మరొకసారి యెహోవా వాక్కు నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, తూరును గురించి ఈ విషాద గీతం పాడుము. తూరును గురించిన ఈ విషయాలు తెలియజేయుము:

“‘తూరూ, నీవు సముద్రాలకు ద్వారం వంటిదానవు.
    అనేక దేశాలకు నీవు వ్యాపారివి.
    తీరం వెంబడి నీవనేక దేశాలకు ప్రయాణం చేస్తావు.
నిన్ను గూర్చి నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
తూరూ, నీవు చాలా అందమైన దానివని నీవనుకుంటున్నావు.
    నీవు చక్కని సుందరాంగివని తలపోస్తున్నావు!
మధ్యధరా సముద్రం నీ నగరం చుట్టూ సరిహద్దు.
    నిన్ను నిర్మించిన వారు నిన్ను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు!
    నీ నుండి ప్రయాణమై వెళ్లే ఓడలవలె నీవు ఉన్నావు.
నీ నిర్మాణపు పనివారు శెనీరు (హెర్మోను కొండ) నుండి
    తెచ్చిన తమాల వృక్షపు కర్రతో (ఓడ) బల్లలు తయారుచేశారు.
లెబానోను సరళవృక్షపు కర్రతో
    నీ ఓడ స్తంభాలను చేశారు.
బాషాను నుండి తెచ్చిన సింధూర వృక్షపు కర్రతో
    పడవ తెడ్లు చేశారు.
కిత్తీయుల ద్వీపం (సైప్రస్) నుండి తెచ్చిన దేవదారు వృక్షపు కర్రను వినియోగించి
    అడుగు అంతస్థులో గదిని నిర్మించారు.
    ఈ గదిని దంతపు పనితో అలంకరించారు.
ఈజిప్టు నుండి తెచ్చిన రంగు రంగుల నారబట్టలు నీ తెరచాపలుగా ఉపయోగించారు.
    ఆ తెరచాపయే నీ పతాకం.
నీ గది తెరలు నీలం, ఊదా రంగులను కలిగి ఉన్నాయి.
    అవి ఎలిషా (సైప్రస్)[a] ద్వీపంనుండి వచ్చినవి.
సీదోనూ, అర్వదు నివాసులు నీ కొరకు నీ పడవలు నడిపారు.
    తూరూ, నీ వారిలో తెలివి గలవారు నీ ఓడలకు చుక్కాని పట్టారు.
బిబ్లోసు (గెబలు) పెద్దలు, నేర్పరులైన పనివారు ఓడమీద ఉండి
    చెక్కల మధ్య కీలువేసి ఓడను బాగుచేశారు.
సముద్రం మీదనున్న అన్ని ఓడలు, వాటి నావికులు
    నీతో వర్తక వ్యాపారాలు చేయటానికి నీ వద్దకు వచ్చారు.’

10 “పారసీకులు (పర్షియావారు), లూదు వారు, పూతువారు నీ సైన్యంలో ఉన్నారు. వారు నీ యుద్ధ వీరులు. వారు తమ డాళ్లను, శిరస్త్రాణాలను నీ గోడలకు వేలాడదీశారు. వారు నీ నగరానికి ప్రతిష్ఠను తెచ్చి పెట్టారు. 11 నీ నగరం చుట్టూ అర్వదు మనుష్యులు కాపలాదారులుగా నిలబడియున్నారు. బురుజులలో గామదు మనుష్యులు ఉన్నారు. నీ నగరం చుట్టూ వాళ్లు తమ డాళ్లను వ్రేలాడదీసియున్నారు. వాళ్లు నీ సౌందర్యాన్ని సంపూర్ణముగా చేశారు.

12 “తర్షీషు[b] నీకున్న మంచి ఖాతాదారులలో ఒకటి. నీవు అమ్మే అద్భుతమైన వస్తువులకు వారు వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చేవారు. 13 గ్రీకేయులు, టర్కీ (తుబాలువారు) మరియు నల్ల సముద్రపు (మెషెకు) ప్రాంత ప్రజలు నీతో వ్యాపారం చేశారు. నీవు అమ్మే సరుకులకు వారు బానిసలను, కంచును ఇచ్చేవారు. 14 తోగర్మా ప్రజలు నీవు అమ్మిన వస్తువులకు గుర్రాలను, యుద్ధాశ్వాలను, కంచర గాడిదలను ఇచ్చేవారు. 15 దదాను ప్రజలు నీతో వ్యాపారం చేశారు. నీవు నీ సరుకులను అనేకచోట్ల అమ్మావు. నీ సరుకులకు మూల్యంగా వారు ఏనుగు దంతాలు, విలువగల కోవిదారు కలపను ఇచ్చేవారు. 16 నీవద్ద అనేక మంచి వస్తువులు ఉన్న కారణంగా ఆరాము నీతో వ్యాపారం చేసింది. నీవు అమ్మే సరుకులకు ఎదోము ప్రజలు పచ్చమణులు, ఊదారంగు బట్టలు, సున్నితమైన అల్లిక పనిచేసిన వస్త్రాలు, నాజూకైన నారబట్టలు, పగడాలు, కెంపులు ఇచ్చేవారు.

17 “యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు నీతో వర్తకం చేశారు. వారు నీవద్ద కొనే సరుకులకు గోధుమ, ఒలీవలు, ముందు వచ్చే అత్తిపళ్లు, తేనె, నూనె, గుగ్గిలం యిచ్చేవారు. 18 దమస్కు నీకు మరో మంచి ఖాతాదారు. నీవద్ద ఉన్న అనేక అద్భుత వస్తువులను వారు కొనుగోలు చేశారు. ప్రతిగా వారు హెల్బోను నుండి తెచ్చిన ద్రాక్షారసాన్ని, తెల్ల ఉన్నిని నీకిచ్చేవారు. 19 నీవమ్మే సరుకులకు దమస్కువారు ఉజాల్ నుండి తెచ్చిన ద్రాక్షారసాన్ని నీకిచ్చేవారు. వాటిని ఇనుము, కసింద మూలిక, చెరకును వారు కొన్న వస్తువులకు మారుగా ఇచ్చేవారు. 20 వ్యాపారం ముమ్మరంగా సాగటానికి దదాను దోహద పడింది. వారు గుర్రపు గంతపై వేసే బట్టను, స్వారీ గుర్రాలను నీకిచ్చి సరుకులు కొనేవారు. 21 అరబీయులు (అరేబియావారు) కేదారు నాయకులు నీకు గొర్రె పిల్లలను, పొట్లేళ్లను, మేకలను ఇచ్చి నీవద్ద ఉన్న సరుకులు కొనేవారు. 22 షేబ దేశపు వర్తకులు, రామా ప్రాంత వర్తకులు నీతో వ్యాపారం చేశారు. నీ వస్తువులకు వారు మిక్కిలి శ్రేష్ఠమైన సుగంధ ద్రవ్యాలు, నానారకాల విలువైన రాళ్లు, బంగారం ఇచ్చేవారు. 23 హారాను, కన్నే, ఏదెను, షేబ, అష్షూరు మరియు కిల్మదు దేశాల ప్రజలు, వర్తకులు నీతో వ్యాపారం చేశారు. 24 నీవద్ద కొన్న సరుకులకు వారు నాణ్యమైన వస్త్రాలు, నీలవర్ణపు, అల్లిక పనిచేసిన దుస్తులు, రంగు రంగుల తివాచీలు, బాగా పురిపెట్టి పేనిన తాళ్ళు, దేవదారు కలపతో చేయబడిన అనేక వస్తువులు ఇచ్చేవారు. ఈ వస్తు సామగ్రులతో వారు నీతో వ్యాపారం చేశారు. 25 నీవు అమ్మిన సరుకులు తర్షీషు ఓడలు మోసుకుపోయేవి.

“తూరూ! నీవు సరుకులతో నిండిన ఓడలాంటి దానివి.
    నీవు సముద్రం మీద అనేకమైన విలువగల సరుకులతో ఉన్నదానివి.
26 నీ పడవలను నడిపిన నావికులు నిన్ను మహా సముద్రాల మధ్యగా తీసుకొని వెళ్తారు.
    కాని బలమైన తూర్పు గాలులు నీ ఓడను నడిసముద్రంలో నాశనం చేస్తాయి.
27 నీ ధనమంతా సముద్రం పాలవుతుంది.
    నీ ఐశ్వర్యం, నీ వర్తకం, నీ సరుకు, నీ నావికులు, చుక్కాని పట్టేవారు,
కీలుపెట్టి పడవలు బాగుచేసే పనివారు, నీ అమ్మకపు దారులు, నీ నగరంలో గల సైనికులు, నీ ఓడ సిబ్బంది
    అంతా సముద్రంలో మునిగిపోతారు!
నీవు నాశనమయ్యే రోజున
    ఇదంతా జరుగుతుంది.

28 “నీ వ్యాపారులను నీవు బహుదూర ప్రాంతాలకు పంపిస్తావు.
    అయితే నీ ఓడ చుక్కాని పట్టేవాని రోదన విన్నప్పుడు ఆ ప్రాంతాలు భయంతో వణకిపోతాయి!
29 నీ ఓడ సిబ్బంది అంతా ఓడ నుండి దుముకుతారు.
    నీ నావికులు, చుక్కాని పట్టేవారు ఓడ నుండి దుమికి ఒడ్డుకు ఈదుతారు.
30 వారు నిన్ను గురించి చాలా బాధపడతారు.
    వారు రోదిస్తారు. వారు తమ తలలపై దుమ్ము పోసుకుంటారు. వారు బూడిదలో పొర్లాడుతారు.
31 నీ కొరకు వారు తమ తలలు గొరిగించుకుంటారు.
    వారు విషాద సూచక దుస్తులు ధరిస్తారు.
వారు నీకొరకు దుఃఖిస్తారు.
    మృతుడైన వ్యక్తి కొరకు ఏడ్చేవానిలా వారు శోకిస్తారు.

32 “వారి భయంకర రోదనలో, ఈ విషాద గీతం వారు ఆలపిస్తూ నీకొరకు విలపిస్తారు,

“‘తూరు వంటిది మరొక్కటి లేదు!
    నడి సముద్రంలో తూరు నాశనమయ్యింది!
33 నీ వ్యాపారులు సముద్రాల మీద పయనించారు.
    నీ మహా సంపదతోను, నీవు అమ్మిన సరుకులతోను నీవనేక మందిని తృప్తిపర్చావు.
    ఈ భూమిపై గల రాజులను నీవు ఐశ్వర్యవంతులుగా చేశావు!
34 కాని నీవు నడిసముద్రంలో,
    అగాధంలో ముక్కలై పోయావు.
నీవు అమ్మే వస్తువులతో పాటు
    నీ మనుష్యులందరూ కూలిపోయారు!
35 తీరవాసులంతా నీ విషయంలో అదిరిపోయారు.
    వారి రాజులు తీవ్రంగా భయపడ్డారు.
వారి రాజులు తీవ్రంగా భయపడ్డారు.
    వారి ముఖాలు చిన్నబోయాయి.
36 ఇతర రాజ్యాల వర్తకులు నిన్ను చూసి చులకనగా మాట్లాడారు.
నీకు జరిగిన సంఘటనలు ప్రజలను భయభ్రాంతులను చేశాయి.
    ఎందువల్లనంటే నీవు సర్వనాశనమయ్యావు.
    నీవిక లేవు.’”

కీర్తనలు. 75-76

సంగీత నాయకునికి: “నాశనం చేయకు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.

75 దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాము.
    మేము నీ నామాన్ని స్తుతిస్తున్నాము.
    నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మేము చెబుతున్నాము.

దేవుడు ఇలా చెబుతున్నాడు; “తీర్పు సమయాన్ని నేను నిర్ణయిస్తాను.
    న్యాయంగా నేను తీర్పు తీరుస్తాను.
భూమి, దాని మీద ఉన్న సమస్తం కంపిస్తూ ఉన్నప్పుడు
    దాని పునాది స్తంభాలను స్థిర పరచేవాడను నేనే.”

4-5 “కొందరు మనుష్యులు చాలా గర్విష్ఠులు. తాము శక్తిగలవారమని, ప్రముఖులమని తలుస్తారు.
    కాని ‘అతిశయ పడవద్దు’ ‘అంతగా గర్వపడవద్దు.’ అని నేను ఆ మనుష్యులతో చెబుతాను.”

తూర్పునుండిగాని పడమరనుండిగాని
    ఎడారినుండి గాని వచ్చే ఎవరూ ఒక మనిషిని గొప్ప చేయలేరు.
దేవుడే న్యాయమూర్తి, ఏ మనిషి ప్రముఖుడో దేవుడే నిర్ణయిస్తాడు.
    దేవుడు ఒక వ్యక్తిని ప్రముఖ స్థానానికి హెచ్చిస్తాడు.
    ఆయనే మరొక వ్యక్తిని తక్కువ స్థానానికి దించివేస్తాడు.
దుర్మార్గులను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది.
    అది ద్రాక్షారసంలో కలిసిన విషపూరితమైన మూలికలతో నిండివుంది.
ఆయన ఈ ద్రాక్షారసాన్ని (శిక్ష) కుమ్మరిస్తాడు.
    దుర్మార్గులు చివరి బొట్టు వరకు దాన్ని తాగుతారు.
ఈ సంగతులను గూర్చి నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెబుతాను.
    ఇశ్రాయేలీయుల దేవునికి నేను స్తుతి పాడుతాను.
10 దుర్మార్గుల నుండి శక్తిని నేను తీసివేస్తాను.
    మంచి మనుష్యులకు నేను శక్తినిస్తాను.

సంగీత నాయకునికి: వాయిద్యాలతో. ఆసాపు స్తుతి కీర్తన.

76 యూదాలో ప్రజలు దేవుని ఎరుగుదురు.
    దేవుని నామం నిజంగా గొప్పదని ఇశ్రాయేలుకు తెలుసు.
దేవుని ఆలయం షాలేములో[a] ఉంది.
    దేవుని గృహం సీయోను కొండ మీద ఉంది.
అక్కడ విల్లులను, బాణాలను కేడెములను,
    కత్తులను ఇతర యుద్ధ ఆయుధాలను దేవుడు విరుగగొట్టాడు.

దేవా, నీవు నీ శత్రువులను ఓడించిన ఆ కొండల నుండి
    తిరిగి వస్తూండగా నీవు ఎంతో మహిమతో ఉన్నావు.
ఆ సైనికులు చాలా బలం కలవారని తలంచారు. కాని యిప్పుడు వారు చచ్చి పొలాల్లో పడి ఉన్నారు.
    వారికి ఉన్నదంతా వారి శరీరాల నుండి దోచుకోబడింది.
    బలవంతులైన ఆ సైనికులలో ఒక్కరు కూడా వారిని కాపాడుకోలేకపోయారు.
యాకోబు దేవుడు ఆ సైనికులను గద్దించాడు.
    రథాలు, గుర్రాలుగల ఆ సైన్యం చచ్చిపడింది.
దేవా, నీవు భీకరుడవు.
    నీవు కోపంగా ఉన్నప్పుడు ఏ మనిషీ నీకు విరోధంగా నిలువలేడు.
8-9 యెహోవా న్యాయమూర్తిగా నిలిచి తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
    దేశంలోని దీన ప్రజలను దేవుడు రక్షించాడు.
పరలోకం నుండి ఆయన తీర్మానం ఇచ్చాడు.
    భూమి అంతా భయంతో నిశ్శబ్దం ఆయ్యింది.
10 దేవా, నీవు దుర్మార్గులను శిక్షించినప్పుడు ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
    నీవు నీ కోపం చూపిస్తావు. బ్రతికి ఉన్నవారు మరింత బలంగలవారు అవుతారు.

11 ప్రజలారా! మీ దేవుడైన యెహోవాకు మీరు వాగ్దానాలు చేశారు.
    ఇప్పుడు మీరు వాగ్దానం చేసినదాన్ని ఆయనకు ఇవ్వండి.
అన్ని చోట్లనుండీ ప్రజలు
    తాము భయపడే దేవునికి కానుకలు తెస్తారు.
12 దేవుడు మహా నాయకులను ఓడిస్తాడు.
    భూలోక రాజులందరూ ఆయనకు భయపడుతారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International