M’Cheyne Bible Reading Plan
దావీదును యోవాబు మందలించటం
19 ప్రజలు ఈ వార్తను యోవాబుకు అందజేశారు. “చూడు, రాజు దుఃఖిస్తున్నాడు. అబ్షాలోము కొరకు చాలా విచారిస్తున్నాడు” అని వారు యోవాబుకు చెప్పారు. 2 ఆ రోజు దావీదు సైన్యం యుద్ధంలో గెలిచింది. కాని అది వారందరికీ మిక్కిలి సంతాప దినంగా మారింది. విషాదమయ దినమయిన కారణమేమనగా “రాజు తన కుమారుని కొరకు మిక్కిలిగా విచారిస్తున్నాడని” ప్రజలంతా విన్నారు.
3 ప్రజలంతా నిశ్శబ్దంగా నగరంలోకి వచ్చారు. వారంతా యుద్ధంనుండి, పారిపోయి వచ్చిన వారిలా అగుపించారు. 4 రాజు తన ముఖాన్ని కప్పుకున్నాడు. “నా కుమారుడా, అబ్షాలోమా; ఓ అబ్షాలోమా, నా కుమారుడా, నా కుమారుడా!” అని బిగ్గరగా ఏడ్వసాగాడు.
5 యోవాబు రాజు ఇంటికి వచ్చాడు. యోవాబు రాజుతో ఇలా అన్నాడు: “ఈ రోజు నీవు నీ ముఖాన్ని కప్పుకున్నావు. అంతేగాదు, నీవు నీ సేవకుల ముఖాలన్నీ సిగ్గుతో కప్పివేశావు! ఈ రోజు నీ సేవకులు నీ ప్రాణాన్ని కాపాడారు! వారు నీ కుమారుల ప్రాణాలను, కుమార్తెలను, భార్యలను, నీ దాసీలను – అందరినీ కాపాడారు. 6 నీ సేవకులంతా సిగ్గుతో తలవంచుకున్నారు. కారణమేమంటే నిన్ను అసహ్యించుకునే వారిని నీవు ప్రేమిస్తున్నావు. నిన్ను ప్రేమించేవారిని నీవు అసహ్యించుకుంటున్నావు! నీ క్రింది అధికారులన్నా, నీ మనుష్యులన్నా నీకు లెక్కలేదని ఈ రోజు నీవు స్పష్టంచేశావు. నిజానికి అబ్షాలోము బ్రతికి, మేమంతా చచ్చిపోయి వుంటే నీవు చాలా సంతోషపడి వుండేవాడివని ఈ రోజు నాకు విశదమయింది! 7 లెమ్ము. ఇప్పుడు నీ సేవకులందరితో మాట్లాడి, వారిని ప్రోత్సహించు! నేను యెహోవా మీద ఒట్టుపెట్టి చెబుతున్నాను. నీవు గనుక బయటికి వెళ్లి ఈ పని చేయకపోతే, రాత్రయ్యేసరికి నీతో ఒక్కడు కూడా వుండడు! నీ యవ్వనం నుండి ఇప్పటి వరకు నీవనుభవించిన కష్టాలన్నిటికంటె, ఇప్పటి నీ పరిస్థితి చాలా అధ్వాన్నమవుతుంది.”
8 అప్పుడు రాజు నగరద్వారం[a] వద్దకు వెళ్లాడు. రాజు నగర ద్వారం వద్ద వున్నాడన్న వార్త వ్యాపించింది. అందుచే ప్రజలంతా ఆయనను చూసేందుకు వచ్చారు.
దావీదు మరల రాజవటం
అబ్షాలోమును అనుసరించిన ఇశ్రాయేలీయులంతా ఇండ్లకు పారిపోయారు. 9 ఇశ్రాయేలు వంశాల ప్రజలందరూ ఒకరితో ఒకరు చర్చించటం మొదలు పెట్టారు. వారిలా అనుకున్నారు: “రాజైన దావీదు మనల్ని ఫిలిష్తీయులనుండి, తదితర శత్రువులనుండి కాపాడాడు. దావీదు అబ్షాలోముకు దూరంగా పారిపోయాడు. 10 మనల్ని పాలించటానికి అబ్షాలోమును ఎన్నుకున్నాము, కాని అతనిప్పుడు యుద్ధంలో చనిపోయాడు. కావున మనం మళ్లీ దావీదును రాజుగా చేసుకోవాలి.”
11 దావీదు రాజు యాజకులైన సాదోకుకు, అబ్యాతారుకు వర్తమానం పంపించాడు. దావీదు వారికిలా చెప్పాడు: “యూదా నాయకులతో మాట్లాడండి. వారితో, ‘రాజును (దావీదును) తిరిగి ఇంటికి తీసుకొని రావటంలో మీరెందుకు వెనుకబడి వున్నారు? చూడండి. ఇశ్రాయేలీయులంతా రాజును తిరిగి ఇంటికి తీసుకొని వచ్చే విషయం మాట్లాడుతున్నారు. 12 మీరంతా నా సోదరులు. మీరు నా కుటుంబం వారు అయినప్పుడు రాజును తిరిగి ఇంటికి తీసుకొని రావటంలో మీరెందుకు చివరివంశం వారవుతున్నారు?’ అని చెప్పండి. 13 అమాశాతో, ‘నీవు నా కుటుంబంలో భాగస్వామివి. నేను నిన్ను యోవాబు స్థానంలో సైన్యాధికారిగా చేయకపోతే దేవుడు నన్ను శిక్షించు గాక!’ అని కూడ చెప్పండి.”
14 దావీదు యూదా ప్రజలందరి హృదయాలను చూర గొన్నాడు. వారంతా ఒకటయ్యేలా చేశాడు. యూదా ప్రజలు దావీదుకు వర్తమానం పంపారు. “నీ సేవకులందరితో కలిసి తిరిగి రమ్ము” అని వారన్నారు.
15 అప్పుడు రాజు (దావీదు) యొర్దాను నది వద్దకు వచ్చాడు యూదా ప్రజలు రాజును కలవటానికి గిల్గాలుకు వచ్చారు. వారు రాజును యొర్దాను నదిని దాటించి తీసుకొని రావటానికి వచ్చారు.
దావీదును షిమీ క్షమాభిక్ష కోరటం
16 గెరా కుమారుడైన షిమీ బెన్యామీను వంశానికి చెందినవాడు. అతడు బహూరీములో నివసిస్తూండేవాడు. దావీదు రాజును కలవటానికి షిమీ వేగంగా ముందుకు వచ్చాడు. యూదా ప్రజలతో కలిసి షిమీ వచ్చాడు. 17 వేయిమంది బెన్యామీనీయులు కూడ షిమీతో వచ్చారు. సౌలు కుటుంబమువారి సేవకుడు సీబా కూడా వచ్చాడు. సీబా తన పదునైదుగురు కుమారులను ఇరవై మంది సేవకులను తనతో తీసుకొని వచ్చాడు. వీరంతా దావీదు రాజును కలవటానికి హుటాహుటిని యొర్దాను నది వద్దకు వెళ్లారు.
18 రాజ కుటుంబాన్ని యూదాకు తిరిగి తీసుకొని రావటంలో సహాయపడటానికి ప్రజలు యొర్దాను నదిని దాటి వెళ్లారు. రాజు ఏది కోరితే వారది చేయసాగారు. రాజు నదిని దాటుతూ వుండగా, గెరా కుమారుడైన షిమీ అతని వద్దకు వచ్చాడు. అతడు రాజు ముందు సాష్టాంగపడ్డాడు. 19 రాజుతో షిమీ ఇలా అన్నాడు, “నా ప్రభువా, నేను చేసిన పొరపాట్లను పట్టించుకోవద్దు! నా ప్రభువైన రాజా, నీవు యెరూషలేము వదిలి వెళ్లేటప్పుడు నేను నీ పట్ల చేసిన అపచారాలను మనసులో పెట్టుకోవద్దు. 20 పాపం చేసినట్లు నేను తెలుసుకున్నాను. అందువల్ల యోసేపు కుటుంబంలో[b] నుండి నేను ముందుగా నిన్ను నా ప్రభువైన రాజును, కలుసుకోవాలని వచ్చాను.”
21 కాని సెరూయా కుమారుడైన అబీషై ఇలా అన్నాడు: “యెహోవాచే అభిషిక్తము చేయబడిన రాజునకు కీడు జరగాలని కోరుకున్నందుకు షిమీని మనం తప్పక చంపివేయాలి.”
22 దావీదు వారిని వారించి, వారితో, “సెరూయా కుమారులారా, మీకును – నాకును ఏమి పొందిక! ఈ రోజు మీరు నాకు వ్యతిరేకులయ్యారు! ఇశ్రాయేలులో ఏ ఒక్కడూ చంపబడడు. నాకు తెలుసు. ఈ రోజు నేను ఇశ్రాయేలుకు రాజును!” అని అన్నాడు.
23 ఆ తరువాత రాజు షిమీతో, “నీవు చంపబడవు” అని అన్నాడు. పైగా తనకై తాను షిమీని చంపనని రాజు అతనికి ప్రమాణం చేసి చెప్పాడు.[c]
దావీదు దర్శనానికి మెఫీబోషెతు వెళ్లటం
24 సౌలు మనుమడైన మెఫీబోషెతు దావీదు రాజును కలియటానికి వచ్చాడు. రాజు యెరూషలేము వదిలి వెళ్లిన నాటినుండి ప్రశాంతంగా తిరిగి వచ్చేవరకు మెఫీబోషెతు కాళ్లు కడగలేదు; గడ్డం తీసుకోలేదు; తన బట్టలు కూడ ఉతుకుకొనలేదు. 25 మెఫీబోషెతు రాజును కలవటానికి యెరూషలేము నుండి వచ్చాడు. రాజు అతనిని చూచి, “మెఫీబోషెతూ, నేను యెరూషలేము నుండి పారిపోయినప్పుడు నీవెందుకు నాతో రాలేదు?” అని అడిగాడు.
26 అందుకు మెఫీబోషెతు ఇలా అన్నాడు: “నా ప్రభువైన రాజా, నా సేవకుడు (సీబా) నన్ను మోసం చేశాడు! నేను అవిటివాడిని గనుక నా సేవకుడైన సీబాను పిలిచి, ‘ఒక గాడిదపై గంత కట్టి సిద్ధం చేయమన్నాను. దానిపై రాజుతో వెళతానన్నాను.’ 27 కాని నా సేవకుడు నన్ను మోసగించాడు. నా గురించి నీకు చెడుగా చెప్పాడు. కాని నా ప్రభువైన రాజు దేవ దూతలాంటివాడు. నీకు ఏది మంచిదనిపించితే అది చేయుము. 28 నా తాత యొక్క కుటుంబాన్నంతటినీ నీవు చంపగలిగియుండే వాడివి. కాని నీవు అలా చేయలేదు. నీ బల్ల వద్ద భోజనం చేసే వారితో కలిసి తినే అర్హత నాకు కలిగించావు. కావున దేనిని గురించీ రాజుకు ఫిర్యాదు చేసే హక్కు నాకు లేదు!”
29 “ఇక నీ సమస్యల గురించి ఏమీ చెప్పకు! ఉన్న భూమిని నీకు, సీబాకు పంచాలని నిర్ణయించాను, అని రాజు మెఫీబోషెతుకు చెప్పాడు.
30 “సీబానే భూమినంతా తీసుకోనిమ్ము! ఎందువల్లనంటే నా ప్రభువైన రాజు శాంతంగా ఇంటికి తిరిగి వచ్చాడు గనుక” అని మెఫీబోషెతు రాజుతో అన్నాడు.
బర్జిల్లయిని తనతో యెరూషలేముకు రమ్మని దావీదు అడగటం
31 గిలాదీయుడగు బర్జిల్లయి రోగెలీ నుండి వచ్చాడు. అతడు రాజుతో యొర్దాను నదివద్దకు వచ్చాడు. రాజును నది దాటించటానికి ఆయనతో కూడ వెళ్లాడు. 32 బర్జిల్లయి పండు ముదుసలి. అతనికి ఎనభై సంవత్సరాలు. మహనయీములో దావీదువుండగా, బర్జిల్లయి ఆయనకు ఆహారాన్ని, తదితర వస్తువులను సమకూర్చాడు. బర్జిల్లయి గొప్ప ధనవంతుడు గనుక ఇవన్నీ చేయగలిగాడు. 33 దావీదు బర్జిల్లయితో ఇలా అన్నాడు, “నాతో నది దాటిరా, నాతో నీవు యెరూషలేములో నివసిస్తే నీ పోషణ బాధ్యత నేను తీసుకుంటాను.”
34 కాని బర్జిల్లయి రాజుతో ఇలా అన్నాడు: “నేను ఎంత వయో వృద్ధుడనో నీకు తెలుసా? నేను నీతో యెరూషలేముకు రాగాలనని నీవనుకుంటున్నావా? 35 నాకు ఎనుబది ఏండ్లు! మంచి చెడుల విచక్షణాజ్ఞానం కూడా తెలియనంత ముసలి వాడినయ్యాను. తినటానికి, తాగటానికి రుచులు కూడ తెలియనంత వయసు మళ్లిన వాడను. గాయనీ గాయకుల స్వరము వినలేనివాడిని. అటువంటి నన్ను గురించి నీవెందుకు చింత చేస్తున్నావు? 36 నీ నుండి నేను బహుమతులు కోరను! నీతో పాటు యోర్దాను నదిని దాటుతాను. 37 తరువాత దయచేసి నన్ను తిరిగి వెళ్లి పోనిమ్ము. అలా నేను నా స్వంత నగరంలో చనిపోయి, నాతల్లిదండ్రుల సమాధిలో వుంచబడతాను. నీ సేవకుడు కింహాము ఇక్కడే వున్నాడు. అతనిని నా ప్రభువైన నీతో తీసుకొని వెళ్లు. అతనితో నీకు ఏ పని కావాలంటే అది చేయించుకో.”
38 “కింహాము నాతోనే వస్తాడు. నీ కొరకు అతని పట్ల నేను దయగలిగి వుంటాను. నీ కొరకు నేనేమైనా చేస్తాను.” అని రాజు సమాధానమిచ్చాడు.
దావీదు ఇంటికి తిరిగి వెళ్లటం
39 రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని ఆశీర్వదించాడు. బర్జిల్లయి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. రాజు, అతని పరివారం నదిని దాటారు.
40 గిల్గాలుకు వెళ్లటానికి రాజు యొర్దాను నదిని దాటినప్పుడు, కింహాము కూడ అతనితో వెళ్లాడు. యూదా ప్రజలంతా, ఇశ్రాయేలు ప్రజలలో సగంమంది, దావీదును నది దాటించారు.
ఇశ్రాయేలీయులు యూదా వారితో వాదించటం
41 ఇశ్రాయేలీయులంతా రాజు వద్దకు వచ్చి, “యూదావారైన మా సోదరులు నిన్ను ఎత్తుకు పోయారు. మళ్లీ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరివారాన్నీ తిరిగి తీసుకొని వచ్చారు! ఎందువలన?” అని ప్రశ్నించారు.
42 యూదా ప్రజలంతా ఇశ్రాయేలీయులకు ఇలా సమాధానం చెప్పారు: “మేము ఆ విధంగా ఎందుకు చేశామంటే రాజు మాకు దగ్గర బంధువు కాబట్టి ఈ విషయంలో మీరు మా పట్ల ఎందుకు కోపంగావున్నారో తెలియటం లేదు. అయినా రాజు చేత ఖర్చు పెట్టించి మేము ఏమి తినలేదు! పైగా రాజు మాకు ఏమీ బహుమానాలు ఇవ్వనూలేదు!”
43 అప్పుడు ఇశ్రాయేలీయులు ఇలా అన్నారు “రాజును ఎంపిక చేసుకోవటంలో మేము అత్యధిక సంఖ్యలో పాల్గొన్నాము. దావీదులో మాకు పది భాగాలున్నాయి.[d] కావున దావీదుతో వ్యవహారానికి మీకంటె మాకే ఎక్కువ హక్కు వుంది! కాని మీరు మమ్మల్ని లక్ష్యపెట్టలేదు! ఎందువల్ల? నిజానికి రాజును తిరిగి తీసుకొని రావాలని మేము ముందుగా అనుకున్నాము!”
కాని యూదా ప్రజలు ఇశ్రాయేలీయులతో బాగా నిందారోపణ చేస్తూ చెడుగా మాట్లాడారు. యూదా వారి మాటలు ఇశ్రాయేలీయులు అన్నవాటికంటె చాలా తీవ్రంగా వున్నాయి.
పౌలుకు దర్శనం, ముల్లు
12 లాభం లేకపోయినా నేను గర్వంగా చెప్పుకొంటూ పోవాలి. ప్రభువు వలన కలిగిన దర్శనాలు, ప్రత్యక్షతలు గురించి చెప్పనివ్వండి. 2 క్రీస్తును విశ్వసించే ఒక వ్యక్తి నాకు తెలుసు. పద్నాలుగు సంవత్సరాల క్రితం దేవుడు అతణ్ణి మూడవ ఆకాశమునకు తీసుకు వెళ్ళాడు. అతణ్ణి శరీరంతో తీసుకొని వెళ్ళాడో లేక అతని ఆత్మను తీసుకొని వెళ్ళాడో, నాకు తెలియదు. అది దేవునికే తెలుసు. 3 నాకు తెలిసిన ఈ వ్యక్తి శరీరంతో వెళ్ళాడో లేక అతని ఆత్మ మాత్రమే వెళ్ళిందో నాకు తెలియదు. దేవునికే తెలుసు. 4 దేవుడు యితణ్ణి పరదైసునకు తీసుకు వెళ్ళాడు. అక్కడ అతడు పవిత్రమయిన విషయాలు విన్నాడు. ఇవి చెప్పటానికి అనుమతి లేదు. 5 నేను అతణ్ణి గురించి గర్వంగా చెపుతున్నాను. కాని నా గురించి నేను గర్వంగా చెప్పుకోను. నా బలహీనతను గురించి మాత్రమే గర్వంగా చెప్పుకొంటాను.
6 ఒకవేళ నేను గర్వంగా మాట్లాడినా, నేను ఎప్పుడూ నిజం చెబుతాను కనుక తెలివిలేనివాణ్ణని అనిపించుకోను. నేను చెప్పినవాటి కన్నా, చేసినవాటి కన్నా నన్ను గురించి మీరు గొప్పగా అనుకోరాదని నా అభిలాష. కనుక నేను నన్ను గురించి గర్వంగా చెప్పుకోకుండా నిగ్రహించుకొంటాను.
7 దేవుడు కనుపరచిన ఈ గొప్పవిషయాల వల్ల నాకు గర్వం కలుగరాదని నా శరీరంలో ఒక ముల్లు ఉంచబడింది. అది సాతాను దూత. అది నన్ను బాధపెడుతూ ఉంటుంది. 8 ఆ ముల్లు తీసివేయమని ప్రభువుతో మూడు సార్లు మొరపెట్టుకొన్నాను. 9 కాని ప్రభువు నాతో, “నీకు నా అనుగ్రహం చాలు. నా శక్తి నీ బలహీనత ద్వారా పరిపూర్ణత పొందుతుంది” అని అన్నాడు. అందువల్ల క్రీస్తు శక్తి నాలో ఉండాలని నా బలహీనతను గురించి ఇంకా ఎక్కువ ఆనందంతో, గర్వంగా చెప్పుకొంటాను. 10 అందువల్లే క్రీస్తు కోసం నేను బలహీనతల్లో, అవమానాల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, కష్టాల్లో ఆనందం పొందుతూ ఉంటాను. నేను బలహీనంగా ఉన్నప్పుడు బలంగా ఉంటాను.
కొరింథు ప్రజల విషయంలో చింత
11 నేను తెలివిలేని వానిలా ప్రవర్తిస్తున్నాను. కాని దీనికి మీరే కారకులు. నేను ఏమీకాకపోయినా ఆ “గొప్ప అపొస్తలుల” కన్నా తీసిపోను. కనుక మీరు నన్ను మెచ్చుకోవలసింది. 12 అపొస్తలుడని అనిపించుకొనుటకు తగిన రుజువులు, అద్భుతాలు, మహత్కార్యాలు మీ మధ్య నేను పట్టుదలతో చేసాను. అని నేను మీ కోసం పట్టుదలతో చేసాను. 13 నేను మీకు ఎన్నడూ భారంగా ఉండలేదు అన్న విషయంలో తప్ప ఇతర సంఘాలకన్నా మీరు ఏ విషయంలో తీసిపోయారు? దీనికి నన్ను క్షమించండి.
14 ఇక యిప్పుడు మూడవసారి మీ దగ్గరకు రావటానికి సిద్ధంగా ఉన్నాను. ఈసారి కూడా నేను మీకు భారంగా ఉండను. నాకు కావలసింది మీ దగ్గరున్న వస్తువులు కాదు. మీరు నాకు కావాలి. పిల్లలు తల్లిదండ్రుల కోసం ఆస్తిని కూడపెట్టరు. కాని తల్లిదండ్రులే తమ పిల్లల కోసం ఆస్తి కూడబెడ్తారు. 15 అందువల్ల నా దగ్గరున్నదంతా ఆనందంతో మీకోసం వ్యయంచేస్తాను. “నన్ను” మీకోసం ఉపయోగించుకోండి. నేను మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తే నన్ను మీరు తక్కువగా ప్రేమిస్తారా?
16 అది అలా ఉండనివ్వండి, నేను మీకు భారంగా ఉండలేదని తెలుసు కాని, “నేను పన్నాగాలు పన్ని మిమ్మల్ని వలలో వేసుకొన్నానని” కొందరు అనవచ్చు. 17 నేను పంపిన మనుష్యుల్లో ఎవర్నైనా మిమ్మల్ని మోసగించటానికి ఉపయోగించుకొన్నానా? లేదని నాకు తెలుసు. నేను వాళ్ళ ద్వారా మిమ్మల్ని ఉపయోగించుకొన్నానా? 18 నేను తీతును మీ దగ్గరకు వెళ్ళమని వేడుకొన్నాను. మా సోదరుణ్ణి అతని వెంట పంపాను. తీతు మిమ్మల్ని వంచించలేదు కదా? వంచించాడా? లేదు. మేమంతా ఒకే ఆత్మతో, ఒకే మార్గాన్ని అనుసరించామని మీకు తెలుసు.
19 మమ్మల్ని మేము మీ ముందు సమర్థించుకోవాలని మా పక్షాన మేము వాదిస్తున్నామని అనుకొంటున్నారా? లేదు. మేము దేవుని ముందు క్రీస్తులో మాట్లాడుతున్నాము. సోదరులారా! మీ విశ్వాసాన్ని ధృఢపరచాలని మేము యివి చేస్తున్నాము. 20 ఎందుకంటే, మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను అనుకొన్నట్లు మీరు, మీరనుకొన్నట్లు నేను ఉండమేమోనని నాకు భయం వేస్తోంది. కలహాలు, అసూయలు, కోపాలు, కక్షలు, వదంతులు, గుస గుసలు, అహంభావాలు, అల్లర్లు ఉంటాయేమోనని భయపడుతున్నాము. 21 నేను మీ దగ్గరకు మళ్ళీ వచ్చినప్పుడు నా దేవుని ముందు నాకు తలవంపులు కలుగుతాయేమోనని భయం వేస్తోంది. గతంలో కామక్రీడలు, వ్యభిచారం లాంటి అపవిత్రమైన పనులు చేసి ఆ పాపాలకు పశ్చాత్తాపం పొందనివాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటివాళ్ళవల్ల నాకు దుఃఖం కలుగుతుందనే భయం వేస్తోంది.
తూరును గూర్చిన సందేశం
26 దేశ బహిష్కరణలో (చెర) పదకొండవ సంవత్సరపు మొదటి నెల మొదటి రోజున యెహోవా వాక్కు నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు: 2 “నరపుత్రుడా, యెరూషలేమును గురించి తూరు చెడ్డ విషయాలు చెప్పింది, ‘ఆహా! ప్రజలను రక్షిస్తున్న నగర ద్వారం నాశనం చేయబడింది! నా కొరకు నగర ద్వారం తెరవబడింది. యెరూషలేము నగరం నాశనం చేయబడింది. అందులో నాకు విలువైన వస్తువులు ఎన్నో లభిస్తాయి!’”
3 కావున నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “తూరూ, నీకు నేను వ్యతిరేకిని! నీపై యుద్ధం చేయటానికి అనేక దేశాల వారిని తీసుకొని వస్తాను. తీరం మీదికి వచ్చిపడే సముద్రపు అలల్లా, వారు నీ మీదికి మాటి మాటికీ వస్తారు.”
4 దేవుడు ఇలా అంటున్నాడు: “శత్రు సైనికులు తూరు గోడలను నాశనం చేస్తారు. దాని బురుజులను కూలగొడతారు. ఆమె రాజ్యంలో గల భూమి యొక్కపైభాగవు నేలను చెరిపివేస్తాను. తూరును ఒక బండరాయిగా మార్చివేస్తాను. 5 సముద్ర తీరాన కేవలం చేపలు పట్టే వలలు ఆరబెట్టటానికి పనికి వచ్చే స్థలంవలె తూరు అయిపోతుంది. ఇదే నా మాట!” నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “యుద్ధంలో సైనికులు తీసుకొనే విలువైన వస్తువుల వలె తూరు అయిపోతుంది. 6 దాని ముఖ్య భూమిలో గల ఆమె కుమార్తెలు (చిన్న పట్టణాలు) యుద్ధంలో చంపబడతారు. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు.”
నెబుకద్నెజరు తూరును ఎదుర్కొంటాడు
7 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “తూరు మీదికి ఉత్తర దిశనుండి ఒక శత్రువును రప్పిస్తాను. బబులోను మహారాజైన నెబుకద్నెజరే ఆ శత్రువు! అతడు చాలా పెద్ద సైన్యంతో వస్తాడు. ఆ సైన్యంలో గుర్రాలు, రథాలు, రౌతులు ఇంకా అనేకమంది ఇతర సైనికులు ఉంటారు! ఆ సైనికులలో చాలా దేశాల వారుంటారు. 8 ముఖ్య భూమిలో నీ కుమార్తెలను (చిన్న పట్టణాలు) నెబుకద్నెజరు చంపివేస్తాడు. నీ నగరాన్ని ఎదుర్కోవటానికి అతడు బురుజులను నిర్మిస్తాడు. నీ నగరం చుట్టూ అతడు మట్టిబాట నిర్మిస్తాడు. గోడల వరకు ఒక మట్టిదారి వేస్తాడు. 9 నీ గోడలు పగులగొట్టటానికి అతడు దూలాలు తెస్తాడు. నీ బురుజులు కూలగొట్టటానికి అతడు వాడిగల పనిముట్లను ఉపయోగిస్తాడు. 10 లెక్కకుమించి వున్న అతని గుర్రాలు రేపే దుమ్ముతో నీవు కప్పబడతావు. బబులోను రాజు నగర ద్వారాల గుండా నగర ప్రవేశం చేసినప్పుడు గుర్రాల చప్పుడుకు, బండ్లు, రథాలు చేసే ధ్వనికి నీ గోడలు క్రిందికి తోయబడుతాయి. అవును, నీ గోడలు పెరికివేయటానికి వారు నీ నగరంలోకి వస్తారు. 11 బబులోను రాజు గుర్రం మీద నీ నగరం గుండా వస్తాడు. అతని గుర్రాల డెక్కలు నీ వీధులన్నిటినీ పిండిగొట్టినట్లు దట్టిస్తాయి. నీ ప్రజలను అతడు కత్తులతో చంపివేస్తాడు. నీ నగరంలోని బలమైన స్తంభాలు నేలకూలుతాయి. 12 నెబుకద్నెజరు మనుష్యులు నీ ధనాన్ని దోచుకుంటారు. నీవు అమ్మ దలచిన వస్తువులను వారు ఎత్తుకుపోతారు. వారు నీ ప్రాకారాలను పడగొడతారు. నీ సుందర భవంతులను వారు నాశనం చేస్తారు. నీ రాళ్లను, కలప ఇండ్లను చెత్త వలె, సముద్రంలో పారవేస్తారు. 13 అలా మీ ఆనంద గీతికల శబ్దాన్ని ఆపివేస్తాను. ప్రజలు మీ వీణావాదనలు మరి వినరు. 14 నిన్నొక బండరాయిలా మార్చివేస్తాను. సముద్రపు ఒడ్డున చేపలు పట్టే వలలు ఆరబెట్టటానికి పనికివచ్చే స్థలంగా మారిపోతావు! నీవు తిరిగి నిర్మింపబడవు. ఎందువల్లననగా యెహోవానైన నేను ఈ విషయం చెపుతున్నాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
తూరు కొరకు ఇతర దేశాలు విలపిస్తాయి
15 నా ప్రభువైన యెహోనా ఈ విషయం తూరుకు చెపుతున్నాడు: “మధ్యధరా సముద్ర తీరానగల దేశాలు నీ పతనంవల్ల కలిగిన శబ్దానికి తుళ్లిపడతాయి. నీ ప్రజలు హింసించబడి, చంపబడినప్పుడు అది జరుగుతుంది. 16 సముద్రతీర దేశరాజులంతా తమ సింహాసనాలు దిగి తమ సంతాపాన్ని వెలిబుచ్చుతారు. వారు తమ ప్రత్యేక రాజదుస్తులు తీసివేస్తారు. వారు తమ అందమైన బట్టలు విసర్జిస్తారు. పిమ్మట వారు ‘భయసూచక దుస్తులు’ ధరిస్తారు. వారు నేలమీద కూర్చుని, భయంతో వణుకుతారు. ఎంత త్వరగా నీవు నాశనం చేయబడ్డావో చూచి వారు విస్మయం చెందుతారు. 17 నిన్ను గురించి వారు ఈ విషాద గీతిక పాడుతారు:
“‘ఒహో తూరూ, నీవొక ప్రసిద్ధ నగరానివి.
నీలో నివసించాలని ప్రజలు సముద్రాలు దాటి వచ్చారు.
నీవు చాలా ప్రఖ్యాతి చెందిన దానివి.
కాని నీవు లేకుండా పోయావు!
సముద్రంలో నీవు బలమైనదానవు.
నీలాగే నీలో నివసించిన ప్రజలు కూడా బలిష్ఠులు.
నీ ముఖ్య భూమిలో నివసించే ప్రజలు
నీవంటే భయపడేలా చేశావు.
18 మరి నీవు పతనమయ్యే రోజున తీర దేశాలు
భయంతో కంపించిపోతాయి.
తీరం వెంబడి నీవెన్నో వాడలు ఏర్పాటు చేశావు.
నీవు పోగానే ఆ ప్రజలు భయభ్రాంతులవుతారు!’”
19 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “తూరూ, నిన్ను నాశనం చేస్తాను. నీవొక పురాతన పాడుబడ్డ నగరంలా మారతావు. అక్కడ ఎవ్వరూ నివసించరు. సముద్రం పొంగి నీ మీదికి వచ్చేలా చేస్తాను. ఆ గొప్ప సముద్రం నిన్ను ఆవరిస్తుంది. 20 చనిపోయిన వాళ్లు పోయే పాతాళం లోకి నిన్ను పంపుతాను. ఎన్నడో చనిపోయిన వారిని నీవు కలుసుకొంటావు. పాడుబడిన ఇతర పురాతన నగరాలవలె నిన్ను కూడా క్రింది లోకానికి పంపివేస్తాను. సమాధికి పోయిన ఇతరులతో నీవు కూడా ఉండిపోతావు. అప్పుడు నీలో మరెవ్వరూ నివసించరు. మరెన్నటికీ నీవు నివసించటానికి అనువుకాకుండా పోతావు! 21 నీకు జరిగిన దానిని చూసి ప్రజలు భయపడిపోతారు. నీవు నాశనమవుతావు! ప్రజలు నీకొరకు చూస్తారు; కాని వారు నిన్ను ఇక కనుగొనలేరు!” నా ప్రభువైన యెహోవా చెప్పిన విషయం ఇది.
ఆసాపు ధ్యాన గీతం.
74 దేవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశావా?
నీవు నీ ప్రజల మీద ఇంకా కోపంగా ఉన్నావా?
2 చాలా కాలం క్రిందట నీవు కొన్న ప్రజలను జ్ఞాపకం చేసుకో.
నీవు మమ్మల్ని రక్షించావు. మేము నీకు చెందినవాళ్లం.
నీ నివాస స్థానమైన సీయోను పర్వతాన్ని జ్ఞాపకముంచుకొనుము.
3 దేవా, నీవు వచ్చి ఈ పురాతన శిథిలాల మధ్య నడువుము.
శత్రువు నాశనం చేసిన పవిత్ర స్థలానికి మరలా రమ్ము.
4 శత్రువులు ఆలయంలో యుద్ధపు కేకలు వేసారు.
యుద్ధంలో తాము గెలిచినట్లు చూపించుటకు వారు జెండాలను ఆలయంలో ఉంచారు.
5 శత్రుసైనికులు గొడ్డలితో కలుపు మొక్కలను
నరికే మనుష్యుల్లా ఉన్నారు.
6 ఈ సైనికులు తమ గొడ్డళ్లను సమ్మెటలను ప్రయోగించి దేవా,
నీ ఆలయంలోని నగిషీ గల చెక్క పనిని నరికివేశారు.
7 దేవా, ఆ సైనికులు నీ పవిత్ర స్థలాన్ని కాల్చివేశారు.
వారు నీ ఆలయాన్ని నేలమట్టంగా కూల్చివేశారు.
ఆ ఆలయం నీ నామ ఘనత కోసం నిర్మించబడింది.
8 శత్రువు మమ్మల్ని పూర్తిగా చితుకగొట్టాలని నిర్ణయించాడు.
దేశంలోని ప్రతి ఆరాధనా స్థలాన్నీ వారు కాల్చివేసారు.
9 మా సొంత గుర్తులు ఏవీ మేము చూడలేక పోయాము.
ఇంకా ప్రవక్తలు ఎవరూ లేరు.
ఏమి చేయాలో ఎవ్వరికీ తెలియదు.
10 దేవా, ఇకెంత కాలం శత్రువు మమ్మల్ని ఎగతాళి చేస్తాడు?
నీ శత్రువు నీ నామమును శాశ్వతంగా అవమానించనిస్తావా?
11 దేవా, నీవెందుకు మమ్మల్ని అంత కఠినంగా శిక్షించావు?
నీవు నీ మహా శక్తిని ప్రయోగించి మమ్మల్ని పూర్తిగా నాశనం చేశావు.
12 దేవా, చాల కాలంగా నీవే మా రాజువు.
నీవు ఎల్లప్పుడూ మమ్ములను విడుదలచేసి నీవు భూమిమీద రక్షణ తెస్తావు.
13 దేవా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేందుకు నీవు నీ మహా శక్తిని ప్రయోగించావు.
14 మకరపు తలను నీవు చితుకగొట్టావు.
దాని శరీరాన్ని అడవి జంతువులు తినివేయుటకు విడిచిపెట్టావు.
15 జల ఊటలను, భూగర్భ జలాన్ని నీవు తెరచి ప్రపంచాన్ని వరదపాలు చేశావు.
మరియు నదులు ఎండిపోవునట్లు నీవు చేశావు.
16 దేవా, పగటిని నీవు ఏలుతున్నావు. మరియు రాత్రిని నీవు ఏలుతున్నావు.
సూర్యుని, చంద్రుని నీవే చేశావు.
17 భూమి మీద ఉన్న సమస్తానికీ నీవే హద్దులు నియమించావు.
వేసవికాలం, చలికాలం నీవే సృష్టించావు.
18 దేవా, ఈ సంగతులు జ్ఞాపకం చేసుకో. మరియు శత్రువు నిన్ను అవమానించాడని జ్ఞాపకం చేసుకో.
ఆ తెలివితక్కువ ప్రజలు నీ నామాన్ని ద్వేషిస్తారు.
19 దేవా, ఆ అడవి మృగాలను నీ పావురాన్ని[a] తీసుకోనివ్వకుము.
నీ పేద ప్రజలను శాశ్వతంగా మరచిపోకుము.
20 నీ ఒడంబడికను జ్ఞాపకం చేసుకొనుము.
ఈ దేశంలోని ప్రతి చీకటి స్థలంలోనూ బలాత్కారమే ఉంది.
21 దేవా, నీ ప్రజలకు అవమానం కలిగింది.
వారిని ఇంకెంత మాత్రం బాధపడనివ్వకుము.
నిస్సహాయులైన నీ పేద ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
22 దేవా, లేచి పోరాడుము.
ఆ తెలివితక్కువ ప్రజలు ఎల్లప్పుడూ నిన్ను అవమానించారని జ్ఞాపకం చేసుకొనుము.
23 ప్రతి రోజూ నీ శత్రువులు నిన్ను గూర్చి చెప్పిన చెడు సంగతులు మరచిపోకుము.
ఎడతెగక నీ శత్రువులు చేసే గర్జనను మరువవద్దు.
© 1997 Bible League International