M’Cheyne Bible Reading Plan
దావీదు యుద్ద సన్నాహం
18 దావీదు తన మనుష్యులను లెక్కబెట్టాడు. సహస్ర దళాధిపతులను, శత దళాధిపతులను తన సైన్యాన్ని నడిపేందుకు ఎంపిక చేశాడు. 2 దావీదు తన సైన్యాన్ని మూడు గుంపులుగా విభజించాడు. తరువాత దావీదు వారిని బయలుదేరదీశాడు. మూడోవంతు సైన్యాన్ని యోవాబు నడిపించాడు. యోవాబు సోదరుడైన సెరూయా కుమారుడగు అబీషై రెండవ గుంపును, గాతువాడైన ఇత్తయి మూడవ దళాన్ని నడిపించారు.
“నేను కూడ మీతో వస్తాను” అని రాజైన దావీదు ఆ జనంతో అన్నాడు.
3 కాని ప్రజలు వద్దన్నారు. “వద్దు! నీవు మాతో రాకూడదు! మేము గనుక యుద్ధరంగం నుండి పారిపోతే, అబ్షాలోము మనుష్యులు ఏమీ లెక్క చేయరు. మాలో సగం మంది చనిపోయినా వారు పట్టించుకోరు. కాని నీవు మాలాంటి పదివేల మందికి సమానం. కావున నీవు నగరంలోనే వుండటం మంచిది. మాకు సహాయం కావలసి వచ్చినప్పుడు నీవు మాకు సహాయపడవచ్చు” అని అన్నారు.
4 “సరే, మీరు ఏది మంచిదని తలిస్తే నేనది చేస్తాను” అని రాజు ప్రజలతో అన్నాడు.
తరువాత రాజు నగర ద్వారం ప్రక్కన నిలబడ్డాడు. సైన్యం బయటికి వెళ్లింది. వారంతా వందేసి, వెయ్యేసి మంది జట్లుగా బయటికి వెళ్లారు.
5 యోవాబు, అబీషై మరియు ఇత్తయికి రాజు, “నాకొరకు ఈ పని చేయండి. యువకుడైన అబ్షాలోము పట్ల ఉదారంగా ప్రవర్తించండి!” అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సైన్యాధిపతులకు రాజు యిచ్చిన ఆజ్ఞలను ఆ ప్రజలంతా విన్నారు.
దావీదు సైన్యం అబ్షాలోము సైన్యాన్ని ఓడించటం
6 అబ్షాలోము తరపున వచ్చిన ఇశ్రాయేలీయుల పైకి దావీదు సైన్యం రణరంగంలోకి ప్రవేశించింది. ఎఫ్రాయిము అరణ్యంలో వారు పోరాడారు. 7 దావీదు సైన్యం ఇశ్రాయేలీయులను ఓడించింది. ఆ రోజు ఇరవై వేలమంది చనిపోయారు. 8 యుద్ధం దేశవ్యాప్తంగా జరిగింది. ఆ రోజు కత్తివేటుకు చచ్చిన వారికంటే అడవిలో చిక్కుకొని చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
9 అబ్షాలోము దావీదు సేవకులను కలవటం జరిగింది. అబ్షాలోము తప్పించుకు పోవటానికి ఒక కంచరగాడిదను ఎక్కాడు. ఆ కంచర గాడిద పెద్ద సింధూర వృక్షం కొమ్మల క్రిందుగా వెళ్లింది. కొమ్మలు చిక్కగా అల్లుకొని ఉన్నాయి. అబ్షాలోము తల ఆ కొమ్మల్లో చిక్కుకు పోయింది. తన కంచర గాడిద తన క్రిందనుంచి పారిపోయింది. ఆ విధంగా అబ్షాలోము భూమికి పైగా[a] వేలాడుచున్నాడు.
10 ఇది జరగటం ఒక వ్యక్తి చూశాడు. అతడు పోయి యోవాబుతో, “అబ్షాలోము సింధూర వృక్షం కొమ్మల్లో చిక్కుకొని వేలాడటం నేను చూశాను!” అని చెప్పాడు.
11 “మరి నీవతనిని ఎందుకు చంపిక్రిందపడేలా చేయలేదు? నీకు నేను ఒక నడికట్టును మరియు పది తులముల వెండి ఇచ్చివుండేవాడిని!” అని యోవాబు అన్నాడు.
12 యోవాబుతో అతడిలా అన్నాడు: “నీవు వెయ్యితులముల వెండి ఇచ్చినా నేను రాజకుమారుడిని గాయపర్చేవాడినికాను. ఎందుకనగా, రాజు నీకు, అబీషైకి, ఇత్తయికి యిచ్చిన ఆజ్ఞ మేమంతా విన్నాము. ‘చిన్నవాడైన అబ్షాలోమును గాయపర్చకుండా ఉదారంగా ప్రవర్తించండి’ అని రాజు అన్నాడు. 13 నేను గనుక అబ్షాలోమును చంపితే రాజు ఎలాగో తెలుసుకుంటాడు. మళ్లీ నీవే నన్ను శిక్షిస్తావు!”
14 “ఈ విధంగా నేను ఇక్కడ నీతో కాలం వృధాచేయను” అని యోవాబు అన్నాడు.
అబ్షాలోము ఇంకా చెట్టుకు వేలాడుతూ బ్రతికేవున్నాడు. యోవాబు మూడు ఈటెలను తీసుకున్నాడు. ఆ ఈటెలను అబ్షాలోము మీదికి విసిరాడు. ఆ ఈటెలు అబ్షాలోము గుండెను చీల్చుకుంటూ దూసుకు పోయాయి. 15 యోవాబుకు యుద్ధంలో సహాయపడుతూ అతని వెంట పది మంది యువ సైనికులున్నారు. ఆ పదిమంది అబ్షాలోము చుట్టూచేరి అతనిని చంపివేశారు.
16 యోవాబు బూర ఊది, ప్రజలను పిలిచి అబ్షాలోముతో వున్న ఇశ్రాయేలీయులను వెంటాడటం ఆపమన్నాడు. 17 యోవాబు మనుష్యులు అబ్షాలోము శవాన్నీ తీసి అరణ్యంలో ఒక పెద్ద గోతిలో పడవేశారు. ఆ పెద్ద గోతిని రాళ్లు వేసి పూడ్చి వేశారు.
అబ్షాలోము అనుచరులైన ఇశ్రాయేలీయులంతా భయపడి ఇండ్లకు పారిపోయారు.
18 అబ్షాలోము బ్రతికివున్న రోజుల్లో రాజు లోయలో, ఒక స్తంభం నిర్మించాడు. అప్పుడు అబ్షాలోము ఇలా అన్నాడు: “నా పేరు చిరస్థాయిగా నిలవటానికి నాకు కుమారుడు లేడు” అందువల్ల ఆ స్తంభానికి తన పేరే పెట్టుకున్నాడు. ఆ స్తంభం ఈనాటికీ “అబ్షాలోము జ్ఞాపక చిహ్నం” అని పిలవబడుతూవుంది.
యోవాబు దావీదుకు వార్తను పంపటం
19 సాదోకు కుమారుడైన అహిమయస్సు యోవాబుతో, “నన్ను పరుగున పోయి ఈ వార్తను రాజైన దావీదుకు చెప్పనీయండి. నీ కొరకు శత్రువును యెహోవా నాశనం చేశాడు” అని చెపుతానన్నాడు.
20 అహిమయస్సుతో యోవాబు ఇలా అన్నాడు: “వద్దు, దావీదుకు ఈ రోజు ఈ వార్తను తీసుకొని పోవటానికి వీలులేదు. ఇంకొక రోజు ఈ వార్తను చేర వేయవచ్చు. అంతేగాని ఈ రోజు మాత్రం వద్దు. ఎందుకంటావా? రాజు యొక్క కుమారుడు చనిపోయాడు గనుక.”
21 తరువాత కూషీయుడైన ఒకనిని యోవాబు పిలిచి, “అతను చూసిన విషయాలన్నీ రాజు వద్దకు వెళ్లి చెప్పమన్నాడు.”
కూషీయుడు యోవాబుకు నమస్కరించాడు. తరువాత కూషీయుడు దావీదుకు వార్త చెప్పటానికి పరుగెత్తాడు.
22 కాని సాదోకు కుమారుడైన అహిమయస్సు యోవాబుతో, “ఏమి జరిగినా పరవాలేదు. నన్ను కూడా కూషీయుని వెనుక పరుగెత్తుకు వెళ్లనీయండి!” అని ప్రాధేయపడ్డాడు.
“కుమారుడా! నీవెందుకు వార్త మోసుకొని పోవాలనుకుంటున్నావు? నీవు తీసుకొని వెళ్లిన ఈ వార్తకు నీకు ఏ బహుమానమూ లభించదు!” అని యోవాబు అన్నాడు.
23 “ఏమి జరిగినా పరవాలేదు; నేను వేగంగా వెళతాను,” అన్నాడు అహిమయస్సు.
“అయితే పరుగెత్తు!” అన్నాడు యోవాబు అహిమ యస్సుతో.
అప్పుడు యొర్దాను లోయగుండా అహిమయస్సు పరుగెత్తాడు. అతడు కూషీయుని దాటి వెళ్లాడు.
దావీదు వార్త వినటం
24 నగర రెండు ద్వారాల మధ్య దావీదు కూర్చుని వున్నాడు. కావలివాడు ద్వారం మీద వున్న గోడపైకి వెళ్లి పరిశీలించాడు. దూరాన ఒకడు ఒంటరిగా పరుగెత్తుకు రావటం చూశాడు. 25 ఈ విషయం చెప్పటానికి కావలివాడు రాజును పిలిచాడు.
“ఒక్కడే గనుక వస్తూవుంటే, వాడు ఏదో వార్త తెస్తూ వున్నాడన్నమాట!” అని దావీదు రాజు అన్నాడు.
ఆ వ్యక్తి క్రమేపీ నగరాన్ని సమీపించాడు. 26 కావలివాడు ఇంకొక వ్యక్తి రావటం కూడా చూశాడు. పైనున్న కావలివాడు ద్వారపాలకుని పిలిచి, “చూడు! ఇంకొకడు ఒంటరిగా పరుగెత్తుకు వస్తున్నాడు!” అని చెప్పాడు.
“అయితే వాడు కూడా వార్త తెస్తున్నాడు!” అని అన్నాడు రాజు.
27 “మొదటి వ్యక్తి సాదోకు కుమారుడైన అహిమయస్సులా పరుగెత్తుతున్నాడని నేను అనుకుంటున్నాను” అని కావాలివాడన్నాడు.
“అహిమయస్సు మంచి వ్యక్తి. అతడేదో మంచి వార్త తెస్తూ వుండవచ్చు!” అని రాజు అన్నాడు.
28 అహిమయస్సు రాజును పిలిచి, “అంతా బాగున్నది!” అన్నాడు. అహిమయస్సు సాష్టాంగ నమస్కారం చేసి నిలబడ్డాడు. “నీ ప్రభువైన దేవునికి స్తోత్రము. నా ఏలినవాడవైన రాజుకు వ్యతిరేకంగా వున్న వారిని యెహోవా ఓడించాడు,” అని అహిమయస్సు చెప్పాడు.
29 “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని రాజు అడిగాడు.
“యోవాబు నన్ను పంపినపుడు అక్కడ పెద్ద కోలాహలం నేను చూశాను. కాని అది ఎందుకో నాకు తెలియదు” అని అహిమయస్సు సమాధానమిచ్చాడు.
30 “ఇటు పైకి వచ్చి, ఇక్కడ వుండు” అన్నాడు రాజు. అహిమయస్సు పైకి వెళ్లి ప్రక్కన నిలబడి వేచి వున్నాడు.
31 తరువాత కూషీయుడు వచ్చాడు. “నా ఏలినవాడవైన రాజుకు ఒక వార్త! నీకు వ్యతిరేకులైన ప్రజలను యెహోవా ఈ రోజు శిక్షించాడు” అని చెప్పాడు.
32 “యువకుడైన అబ్షాలోము క్షేమంగా వున్నాడా?” అని రాజు కూషీయుని అడిగాడు.
“నీ శత్రువులు, నిన్ను గాయపర్చాలని నీకు వ్యతిరేకంగా వచ్చే ఇతర మనుష్యులు ఆ యువకునిలా (అబ్షాలోము) అయిపోతారని నేను అనుకుంటున్నాను” అని కూషీయుడు చెప్పాడు.
33 దానితో అబ్షాలోము చనిపోయాడని రాజుకు అర్థమయింది. రాజు మిక్కిలి కలతపడిపోయాడు. నగర ద్వారం మీద వున్న గది వద్దకు వెళ్లాడు. అక్కడ బాగా విలపించాడు. గదిలోకి వెళ్లాడు. గదిలోకి పోతూ, “నా కుమారుడా, అబ్షాలోమా! నా కుమారుడా, అబ్షాలోమా! నీ బదులు నేను చనిపోయి వుండవలసింది. ఓ అబ్షాలోమా! నా కుమారుడా, నా కుమారుడా!” అని దుఃఖించాడు.
పౌలు మరియు అబద్ధపు అపొస్తలులు
11 నా తెలివితక్కువతనాన్ని మీరు కొద్దిగా సహిస్తారని ఆశిస్తున్నాను. మీరు సహిస్తున్నారని నాకు తెలుసు. 2 మీ విషయంలో నాకు అసూయగా ఉంది. ఆ అసూయ దేవుని కోసం. మిమ్మల్ని ఒకే భర్తకు అంటే క్రీస్తుకు అప్పగిస్తానని వాగ్దానం చేసాను. మిమ్మల్ని పవిత్ర కన్యగా ఆయనకు బహూకరించాలని అనుకున్నాను. 3 సర్పం కుయుక్తిగా చెప్పిన అబద్ధాలవల్ల “హవ్వ” మోసపోయినట్లే మీరునూ మోసపోతారని, మీ మనస్సులు మలినం అవుతాయని నా భయం. మీకు క్రీస్తుపట్ల ఉన్న భక్తి పవిత్రమైంది. సంపూర్ణమైనది. అది విడిచివేస్తారని నా భయం. 4 ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము యేసును గురించి బోధించినట్లుగాక, వేరే విధంగా బోధిస్తే మీరు దాన్ని ఆనందంగా అంగీకరిస్తారు. మా నుండి పొందిన దైవసందేశానికి, ఆత్మకు వ్యతిరేకంగా దైవసందేశాన్ని, ఆత్మను ఎవరైనా యిస్తే మీరు వాటిని అంగీకరిస్తారు.[a]
5 ఆ “గొప్ప అపొస్తలుల కన్నా” నేను కొంచెం కూడా తక్కువ కానని అంటున్నాను. 6 మాట్లాడటంలో నాకు అనుభవం లేకపోయినా జ్ఞానం ఉంది. దీన్ని గురించి మేము అన్ని విధాలా మీకు స్పష్టంగా తెలియజేసాము.
7 దైవసందేశాన్ని మీకు ఉచితంగా ప్రకటించాను. మీకు ప్రాముఖ్యత యిచ్చి నేను తగ్గించుకొన్నాను. అలా చెయ్యటం పాపమా? 8 ఇతర సంఘాలు నన్ను పోషించాయి. అందువలన మీకు సేవ చేయటానికి వాటిని దోచినట్లయింది. 9 నేను మీతో ఉన్నప్పుడు ఎవ్వరికీ భారంగా ఉండలేదు. మాసిదోనియ నుండి వచ్చిన సోదరులు నాకు కావలసినవన్నీ తెచ్చారు. నేను మీపై ఏ విధమైన భారం మోపలేదు. ఇకముందు కూడా మోపను. 10 దీన్ని గురించి నేను గర్వపడకుండా అకయ ప్రాంతంలో ఉన్నవాడెవ్వడూ నన్ను ఆపలేడు. ఇది నేను క్రీస్తు సత్యంగా చెపుతున్నాను. 11 ఎందుకు, మీ పట్ల నాకు ప్రేమ లేదనా? నేను ప్రేమిస్తున్నానని దేవునికి తెలుసు.
12 వాళ్ళు తమను గురించి గర్వంగా చెప్పుకోవాలని చూస్తారు. తాము మాతో సమానంగా ఉన్నట్లు మీరు గమనించాలని వాళ్ళ ఉద్దేశ్యం. ఆ అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు గర్వించటానికి కారణం లేకుండా చెయ్యటానికి నేను చేస్తున్నది చేస్తూపోతాను. 13 అలాంటివాళ్ళు దొంగ అపొస్తలులు. మోసాలు చేస్తారు. క్రీస్తు అపొస్తలుల వలే నటిస్తారు. 14 దీనిలో ఆశ్చర్యమేలేదు! సాతాను కూడా తాను వెలుగుదూత అయినట్లు నటిస్తాడు. 15 మరి సాతాను సేవకులు నీతిమంతులవలె నటించటంలో ఆశ్చర్యమేలేదు! చివరన వాళ్ళు చేసిన పనుల్ని బట్టి ఫలితం పొందుతారు.
పౌలు తన కష్టాలలో అతిశయించుట
16 నన్నొక తెలివతక్కువవానిగా పరిగణించవద్దని మళ్ళీ చెపుతున్నాను. మీరు నేను తెలివతక్కువవాణ్ణని అనుకొంటే, తెలివిలేనివాణ్ణి అంగీకరించినట్లు నన్ను అంగీకరించండి. అప్పుడు దానికి నేను కొద్దిగా గర్వపడవచ్చు. 17 నాలో ఉన్న ఆత్మవిశ్వాసం వల్ల గర్వంగా మాట్లాడుతున్నాను. ప్రభువు మాట్లాడమన్నట్లు కాకుండా తెలివిలేనివాడు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాను. 18 అందరూ లౌకికులవలె తమను గురించి గర్వంగా మాట్లాడుకుంటున్నారు. కనుక నేను కూడా గర్వంగా మాట్లాడుతున్నాను. 19 మీరు బుద్ధిమంతులైయుండి తెలివిలేనివాళ్ళ పట్ల మీరు ఆనందంగా సహనం చూపిస్తున్నారు. 20 మిమ్మల్ని బానిసలుగా చేసుకొన్నవాళ్ళపట్ల, దోచుకొనేవాళ్ళపట్ల, మీ వల్ల లాభం పొందేవాళ్ళపట్ల, మిమ్మల్ని అణచి పెట్టేవాళ్ళపట్ల, మీ చెంపమీద కొట్టినవాళ్ళపట్ల, మీరు సహనం చూపుతారు. 21 వాళ్ళలా ప్రవర్తించే ధైర్యం మాకు లేదు. ఇది చెప్పుకోవటానికి నాకు సిగ్గు వేస్తోంది.
ఎవరికైనా గర్వంగా మాట్లాడే ధైర్యం ఉంటే, నేనూ ఒక అవివేకిగా మాట్లాడుతున్నాను, నాకు కూడా గర్వంగా మాట్లాడే ధైర్యం ఉంది. 22 వాళ్ళు హెబ్రీయులా? నేను కూడా హెబ్రీయుణ్ణి, వాళ్ళు ఇశ్రాయేలీయులా? నేను కూడా ఇశ్రాయేలీయుడను. వాళ్ళు అబ్రాహాము వంశీయులా? నేను కూడా అబ్రాహాము వంశీయుణ్ణి. 23 వాళ్ళు క్రీస్తు సేవకులా? ఈ విధంగా మాట్లాడాలంటే నాకు మతిపోతుంది. నేను వాళ్ళకన్నా ఎక్కువ సేవ చేస్తున్నాను. నేను వాళ్ళకన్నా ఎక్కువ కష్టించి పని చేసాను. వాళ్ళకన్నా ఎక్కువ సార్లు కారాగారానికి వెళ్ళాను. వాళ్ళకన్నా తీవ్రమైన కొరడాదెబ్బలు తిన్నాను. ఎన్నోసార్లు చావుకు గురి అయ్యాను.
24 యూదులు నన్ను ఐదు సార్లు ముప్పైతొమ్మిది కొరడాదెబ్బలు కొట్టారు. 25 మూడు సార్లు ఇనుప కడ్డీలతో కొట్టారు; ఒకసారి రాళ్ళతో కొట్టారు. మూడు సార్లు పడవ పగిలి ఒక రాత్రి, ఒక పగలు సముద్రం మీద గడిపాను. 26 విరామం లేకుండా ప్రయాణం చేసాను. ఆ ప్రయాణాల్లో నదులవల్ల ప్రమాదం కలిగింది. బందిపోటు దొంగలవల్ల ప్రమాదం కలిగింది. నా జాతీయులవల్ల ప్రమాదం కలిగింది. యూదులుకానివాళ్ళవల్ల ప్రమాదం కలిగింది. పట్టణాల్లో ప్రమాదం కలిగింది. నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రమాదం కలిగింది. సముద్రం మీద ప్రమాదం కలిగింది. దొంగ సోదరులవల్ల ప్రమాదం కలిగింది.
27 నేను కష్టాలు ఎదుర్కొని, కష్టించి పని చేసాను. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. ఆకలి దప్పులు అంటే ఏమిటో తెలుసుకొన్నాను. ఎన్నోసార్లు ఆహారం లేక గడిపాను. చలిలో వస్త్రాలు లేకుండా గడిపాను. 28 ఇవే కాక, సంఘాల కొరకు నేను ప్రతిరోజూ దిగులు పడుతుంటాను. 29 మీలో ఒకడు బలహీనుడైనప్పుడు, నేనూ బలహీనుడు కాకుండా ఉండగలనా? ఒకడు పాపంలో పడితే, నేను నా అంతరంగంలో మండిపోకుండా ఉండగలనా? పాపం చెయ్యటానికి మీలో ఎవరైనా కారకుడు అయితే అతని పట్ల నాకు కోపం కలగదా?
30 నేను గర్వంగా చెప్పుకోవాలి అంటే బలహీనతను చూపే వాటిని గురించి గర్వంగా చెప్పుకొంటాను. 31 యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవునికి, సర్వదా స్తుతింపతగిన దేవునికి, నేను అసత్యం ఆడటం లేదని తెలుసు. 32 నేను డెమాస్కసులో ఉన్నప్పుడు అరెత అను రాజు పరిపాలనలో ఉన్న రాజ్యాధికారి, నన్ను బంధించాలని ఊరి చుట్టూ కాపలా ఉంచాడు. 33 కాని కొందరు నన్ను గంపలో ఉంచి గోడ మీదనుండి క్రిందికి దింపారు. నేను చిక్కకుండా తప్పించుకొని పారిపోయాను.
అమ్మోనుకు వ్యతిరేకంగా ప్రవచనం
25 యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 2 “నరపుత్రుడా, నీవు అమ్మోనీయులనుద్దేశించి వారికి వ్యతిరేకంగా నా తరపున మాట్లాడు. 3 అమ్మోను ప్రజలకు ఇలా చెప్పు: ‘నా ప్రభువైన యెహోవా మాటను ఆలకించండి! నా ప్రభువైన యెహోవా ఈ విషయం చెపుతున్నాడు, నా పవిత్ర స్థలం నాశనం చేయబడినప్పుడు మీరు సంతోషించారు. ఇశ్రాయేలు కాలుష్యం చెందినప్పుడు మీరు దానికి వ్యతిరేకులయ్యారు. యూదా ప్రజలు బందీలుగా పట్టుకు పోబడినప్పుడు మీరు యూదా వంశానికి వ్యతిరేకులయ్యారు. 4 కావున తూర్పు నుండి వచ్చే ప్రజలకు మిమ్మల్ని అప్పగిస్తాను. వారు మీ రాజ్యాన్ని ఆక్రమిస్తారు. మీ దేశంలో వారి సైన్యాలు స్థావరాలు ఏర్పాటు చేస్తాయి. వారు మీ మధ్య నివసిస్తారు. వారు మీ పంటను తింటూ, మీ పాలు త్రాగుతారు.
5 “‘రబ్బా నగరాన్ని ఒంటెలు మేసే పచ్చిక బయలుగా చేస్తాను. అమ్మోను దేశాన్ని గొర్రెల దొడ్డిగా చేజేస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. 6 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: యెరూషలేము నాశనమైనప్పుడు మీరు సంతోషపడ్డారు. మీరు మీ చేతులు చరిచి, కాళ్లు దట్టించారు. ఇశ్రాయేలు రాజ్యాన్ని అవమానపరుస్తూ మీరు వేడుక చేసుకున్నారు. 7 కావున నేను మిమ్మల్ని శిక్షిస్తాను. సైనికులు యుద్ధంలో తీసుకొనే విలువైన వస్తువుల్లా[a] మీరు ఉంటారు. ఇతర దేశాలతో మీరు వేరుగా అయిపోతారు. దూర దేశాల్లో మీరు చనిపోతారు. నేను మీ దేశాన్ని నాశనం చేస్తాను! అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.’”
మోయాబు, శేయీరులకు వ్యతిరేకంగా ప్రవచనం
8 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, “మోయాబు, శేయీరు (ఎదోము) ప్రజలు, ‘యూదా వంశం కేవలం ఇతర రాజ్యాల జనుల మాదిరే ఉంది’ అని అంటారు. 9 నేను మోయాబు భుజంలోకి నరుకుతాను. సరిహద్దుల్లో వున్న దాని నగరాలన్నిటినీ, ఆ భూమి గొప్పదనాన్ని తీసుకుంటాను. రాజ్యానికి తలమానికమైన బేత్యేషీమోతు, బయల్మెయోను, కిర్యతాయిములను తీసుకుంటాను. 10 తరువాత ఈ నగరాలను తూర్పు నుండి వచ్చిన ప్రజలకు ఇస్తాను. వారు నీ రాజ్యాన్ని చేజిక్కించుకుంటారు. తూర్పు రాజ్యాల ప్రజలు అమ్మోను ప్రజలను నాశనం చేయనిస్తాను. దానితో అసలు అమ్మోను ప్రజలు ఒక దేశంగా వుండేవారనే సత్యాన్ని ప్రజలు మర్చిపోతారు. 11 అలాగే మోయాబును నేను శిక్షిస్తాను. అప్పుడు వారంతా నేను యెహోవానని తెలుసు కుంటారు.”
ఎదోముకు వ్యతిరేకంగా ప్రవచనం
12 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, “ఎదోము ప్రజలు యూదా వంశంపై తిరుగుబాటు చేసి, చివరికి దానిని చేజిక్కించుకోవాలని కూడ ప్రయత్నించారు. ఎదోము ప్రజలు నేరస్థులు.” 13 కావున నా ప్రభువైన యెహోవా చెబుతున్నదేమనగా, “నేనే ఎదోమును శిక్షిస్తాను. ఎదోములో వున్న ప్రజలను, జంతువులను నాశనం చేస్తాను. తేమాను నుండి దదాను వరకు గల మొత్తం ఎదోము, దేశాన్ని నేను నాశనం చేస్తాను. ఎదోమీయులు యుద్ధంలో చనిపోతారు. 14 నా ప్రజలైన ఇశ్రాయేలీయులను వినియోగించి ఎదోముకు వ్యతిరేకమవుతాను. ఈ రకంగా ఇశ్రాయేలు కూడా ప్రజలు ఎదోముపై నాకు గల కోపాన్ని చూపిస్తారు. అప్పుడు నేనే వారిని శిక్షించినట్లు ఎదోము ప్రజలు తెలుసుకుంటారు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా ప్రవచనం
15 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఫిలిష్తీయులు ప్రయత్నించారు. పగతీర్చుకొనుచున్నారు. వారు అతిక్రూరులు. తమ కోపం తమలోనే ఎక్కువ కాలం వుంచుకొని తమని తాము దహింపజేసుకొన్నారు!” 16 కావున నా ప్రభువైన యెహోవా చెప్పినదేమంటే, “నేను ఫిలిష్తీయులను శిక్షిస్తాను. కెరేతీయులను నేను నాశనం చేస్తాను. సముద్ర తీరాన నివసిస్తున్న ప్రజలను నేను సర్వనాశనం చేస్తాను. 17 నేనా ప్రజలను శిక్షిస్తాను. వారిపై పగ సాధిస్తాను. నా కోపంతో వారికి ఒక గుణపాఠం నేర్పిస్తాను. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు!”
మూడవ భాగం
(కీర్తనలు 73–89)
ఆసాపు స్తుతి కీర్తన.
73 దేవుడు నిజంగా ఇశ్రాయేలీయుల యెడల మంచివాడు.
పవిత్ర హృదయాలు గల ప్రజలకు దేవుడు మంచివాడు.
2 నేను దాదాపుగా జారిపోయి,
పాపం చేయటం మొదలు పెట్టాను.
3 దుర్మార్గులు సఫలమవటం నేను చూసాను.
ఆ గర్విష్ఠులైన ప్రజలను గూర్చి నేను అసూయ పడ్డాను.
4 ఆ మనుష్యులు ఆరోగ్యంగా ఉన్నారు.
వారు జీవించుటకు శ్రమపడరు.[a]
5 మేము కష్టాలు అనుభవిస్తున్నట్టు ఆ గర్విష్ఠులు కష్టాలు పడరు.
ఇతర మనుష్యుల్లా వారికి కష్టాలు లేవు.
6 కనుక వారు చాలా గర్విష్ఠులు, ద్వేష స్వభావులు.
వారు ధరించే అందమైన బట్టలు, నగలు ఎంత తేటగా ఉన్నాయో ఈ విషయం కూడ అంత తేటతెల్లం.
7 ఆ మనుష్యులకు కనబడింది ఏదైనా వారికి నచ్చితే వారు వెళ్లి దాన్ని తీసుకొంటారు.
వారు కోరుకొన్న పనులు వారు చేస్తారు.
8 ఇతరులను గూర్చి కృ-రమైన చెడ్డ మాటలు వారు చెబుతారు. వారు ఇతరులను ఎగతాళి చేస్తారు.
వారు గర్విష్ఠులు, మొండివారు. ఇతరులను వారు ఉపయోగించుకోటానికి ప్రయత్నిస్తారు.
9 ఆ గర్విష్ఠులు వారే దేవుళ్లని అనుకుంటారు.
వారు భూమిని పాలించేవారని తలుస్తారు.
10 కనుక దేవుని ప్రజలు సహితం ఆ దుర్మార్గుల వైపు తిరిగి
వారు చెప్పే సంగతులు నమ్ముతారు.
11 “మేము చేసే సంగతులు దేవునికి తెలియవు.
సర్వోన్నతుడైన దేవునికి తెలియదు అని ఆ దుర్మార్గులు చెబుతారు.”
12 ఆ గర్విష్ఠులు దుర్మార్గులు, ధనికులు.
మరియు వారు ఎల్లప్పుడూ మరింత ధనికులౌతున్నారు.
13 కనుక నేనెందుకు ఇంకా నా హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి?
నేనెందుకు ఎల్లప్పుడూ నా చేతులను పవిత్రం చేసుకోవాలి?
14 దేవా, రోజంతా నేను శ్రమ పడుతున్నాను.
నీవేమో ప్రతి ఉదయం నన్ను శిక్షిస్తున్నావు.
15 ఈ సంగతులు నేను ఇతరులతో చెప్పాలని అనుకొన్నాను.
కాని దేవా, నేను నీ ప్రజలను ద్రోహంగా అప్పగిస్తానని నాకు తెలిసియుండినది.
16 ఈ సంగతులను నా మనస్సునందు గ్రహించుటకు నేను ప్రయత్నించాను.
కాని నేను నీ ఆలయానికి వెళ్లేదాకా దానిని గ్రహించడం ఎంతో కష్టతరమైనది.
17 నేను దేవుని ఆలయానికి వెళ్లాను,
వారి చివరి గమ్యాన్ని నేను గ్రహించాను.
18 దేవా, ఆ మనుష్యులను నీవు నిజంగా అపాయకరమైన పరిస్థితిలో పెట్టావు.
వారు పడిపోయి నాశనం అవడం ఎంతో సులభం.
19 కష్టం అకస్మాత్తుగా రావచ్చును.
అప్పుడు ఆ దుర్మార్గులు నాశనం అవుతారు.
భయంకరమైన సంగతులు వారికి సంభవించవచ్చు.
అప్పుడు వారు అంతమైపోతారు.
20 యెహోవా, మేము మేల్కొన్నప్పుడు
మరచిపోయే కలవంటి వారు ఆ మనుష్యులు.
మా కలలో కనిపించే రాక్షసుల్లా ఆ మనుష్యులను
నీవు కనబడకుండా చేస్తావు.
21-22 నేను చాలా తెలివి తక్కువ వాడను.
ధనికులను, దుర్మార్గులను గూర్చి నేను తలంచి చాలా తల్లడిల్లి పోయాను.
దేవా, నేను నీ మీద కోపంగించి తల్లడిల్లి పోయాను.
తెలివితక్కువగాను, బుద్ధిలేని పశువుగాను నేను ప్రవర్తించాను.
23 నాకు కావలసిందంతా నాకు ఉంది. నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను.
దేవా, నీవు నా చేయి పట్టుకొనుము.
24 దేవా, నీవు నన్ను నడిపించి నాకు మంచి సలహా ఇమ్ము.
ఆ తరువాత మహిమలో నేను నీతో ఉండుటకు నీవు నన్ను తీసుకొని వెళ్తావు.
25 దేవా, పరలోకంలో నాకు నీవు ఉన్నావు.
మరియు నేను నీతో ఉన్నప్పుడు భూమిమీద నాకు ఏమికావాలి?
26 ఒకవేళ నా మనస్సు,[b] నా శరీరం నాశనం చేయబడతాయేమో.
కాని నేను ప్రేమించే బండ[c] నాకు ఉంది.
నాకు శాశ్వతంగా దేవుడు ఉన్నాడు.
27 దేవా, నిన్ను విడిచిపెట్టే ప్రజలు తప్పిపోతారు.
నీకు నమ్మకంగా ఉండని మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
28 కాని నేను దేవునికి సన్నిహితంగా ఉన్నాను.
దేవుడు నా యెడల దయ చూపించాడు.
నా యెహోవా నా కోసం శ్రద్ధ తీసుకొంటాడు. నా ప్రభువైన యెహోవా నా క్షేమస్థానం.
దేవా, నీవు చేసిన వాటన్నిటిని గూర్చి నేను చెబుతాను.
© 1997 Bible League International