M’Cheyne Bible Reading Plan
దావీదు విషయంలో అహీతోపెలు సలబహా
17 అహీతోపెలు అబ్షాలోముతో ఇంకా యిలా అన్నాడు: “ఇప్పుడు నన్ను పన్నెండు వేలమంది సైనికులను ఎంపిక చేసుకోనీయ్యి. ఈ రాత్రికి నేను దావీదును వెంటాడతాను. 2 అతడు బాగా అలసిపోయి బలహీన పడ్డాక నేనతనిని పట్టుకుంటాను. అతనిని బెదరగొడతాను. దానితో అతనితో ఉన్న వారంతా పారిపోతారు. నేను రాజైన దావీదును మాత్రమే చంపుతాను. 3 తరువాత ప్రజలందరినీ నేను నీ వద్దకు తీసుకొని వస్తాను. నీవు వెదకుతున్న వ్యక్తి (దావీదు) గనుక చనిపోతే, మిగిలిన ప్రజలంతా శాంతంగా తిరిగి వస్తారు.”
4 ఈ పథకం అబ్షాలోముకు, మిగిలిన ఇశ్రాయేలు నాయకులకు మంచిదనిపించింది. 5 అయినా అబ్షాలోము, “అర్కీయుడైన హూషైని పిలవండి. అతడేమి చెపుతాడో కూడా నేను వినదలిచాను” అని అన్నాడు.
అహీతోపెలు సలహాను హూషై వమ్ము చేయటం
6 అబ్షాలోము వద్దకు హూషై వచ్చాడు. అహీతోపెలు సలహాను హూషైకు అబ్షాలోము వివరించాడు. దానిని అనుసరించవచ్చా? లేదా? తెలియజెప్ప మన్నాడు.
7 హూషై ఈ విధంగా చెప్పాడు, “అహీతోపెలు ఇచ్చిన సలహా ఈ సమయంలో మంచిది కాదు.” 8 నీ తండ్రి, అతని మనుష్యులు చాలా గట్టివారని నీకు తెలుసు. పొలాల్లో తన పిల్లల్ని పొగొట్టుకున్న ఎలుగు బంటివలె వారు మహా కోపంతో వున్నారు. నీ తండ్రి బహు నేర్పరియైన యోధుడు. అతను రాత్రంతా తన మనుష్యులతో కలిసి వుండడు. 9 బహుశః ఈ పాటికి ఆయన ఏ గుహలోనో, మరొక చోటనో దాగి వుండవచ్చు. నీ తండ్రి గనుక నా మనుష్యులను ముందుగా ఎదుర్కొంటే, ప్రజలందరికీ ఆ వార్త తెలిసిపోతుంది. అబ్షాలోము అనుచరులు ఓడి పోతున్నారని వారంతా అనుకుంటారు! 10 సింహాల్లా ధైర్యంగా వుండే నీ మనుష్యులు కూడ చెదరిపోయే అవకాశం వుంది. ఎందువల్లననగా ఇశ్రాయేలీయులంతా నీ తండ్రి బలవంతుడైన యోధుడనీ, ఆయన మనుష్యులు మంచి ధైర్యవంతులనీ ఎరుగుదురు!
11 “నేను చెప్పేదేమంటే ఇప్పుడు నీవు దానునుండి బెయేర్షెబా[a] వరకు వున్న ఇశ్రాయేలీయులనందరినీ చేరదియ్యి. సముద్ర తీరాన ఇసుక రేణువుల్లా నీ వద్ద అనేక మంది ప్రజలు వుంటారు. అప్పుడు నీకై నీవే యుద్ధానికి వెళ్ల వచ్చు. 12 అతను దాగివున్న చోటులోనే మనం దావీదును పట్టుకోవచ్చు. భూమి మీదకు మంచు పడినట్లు మనం దావీదు మీద పడవచ్చు. దావీదును, అతని మనుష్యులందరినీ మనం చంపవచ్చు. వారిలో ఏ ఒక్కడూ వదిలిపెట్టబడడు. 13 ఒకవేళ దావీదు నగరంలోకి తప్పించుకుంటే, ఇశ్రాయేలీయులంతా తాళ్లు పట్టుకు వస్తారు. ఆ నగరాన్నంతా మనం లోయలోకి లాగి వేద్దాం ఇక ఆ నగరంలో ఒక్క చిన్న రాయి కూడ మిగలదు!”
14 “అర్కీయుడైన హూషై ఇచ్చిన సలహా అహీతోపెలు సలహాకంటె చాలా బాగుందని,” అబ్షాలోము, ఇతర ఇశ్రాయేలీయులంతా అన్నారు. ఇదంతా యెహోవా ఏర్పాటు గావున, వారంతా అలా చెప్పారు. యెహోవా అహీతోపెలు ఇచ్చిన మంచి సలహాను వ్యర్థంచేయ సంకల్పించాడు. ఆ విధంగా అబ్షాలోమును శిక్షింప జూశాడు.
హూషై దావీదుకు హెచ్చరిక పంపటం
15 హూషై ఈ విషయాలన్నీ యాజకులైన సాదోకు మరియు అబ్యాతారుకు చెప్పాడు. అబ్షాలోముకు, ఇశ్రాయేలు నాయకులకు అహీతోపెలు యిచ్చిన సలహాను కూడ హూషై వారికి చెప్పాడు. అంతే గాకుండా తను ఏ సలహా ఇచ్చినది కూడా సాదోకు, అబ్యాతారులకు హూషై వివరించాడు. హూషై ఇలా అన్నాడు: 16 “త్వరగా దావీదుకు ఒక వర్తమానం పంపండి. ప్రజలు ఎక్కడెక్కడైతే ఎడారిలోకి ప్రవేశిస్తారో ఆయా ప్రాంతాలలో దావీదును ఈ రాత్రికి వుండవద్దని చెప్పండి. కాని యొర్దాను నదిని తక్షణమే దాటి వెళ్లమనండి. వారు నదిని గనుక దాటినట్లయితే రాజు, ఆయన అనుచరులు పట్టుబడరు.”
17 యాజకుల కుమారులైన యోనాతాను మరియు అహిమయస్సు కలిసి ఏన్ రోగేలు దగ్గర వేచివున్నారు. వాళ్లు నగరంలోకి వెళ్తున్నట్లు ఎవరూ చూడ కూడదనుకున్నారు. కావున ఒక పనిపిల్ల వారి వద్దకు వచ్చింది. ఆమె వారికి ఒక సమాచారం అందజేసింది. తరువాత యోనాతాను, అహీమయస్సులు ఇరువురూ రాజైన దావీదు వద్దకు వెళ్లి అన్ని విషయాలూ చెప్పారు.
18 అయినా ఒక బాలుడు యోనాతానును, అహిమయస్సును చూశాడు. వాడు అబ్షాలోముకు చెప్పటానికి పరుగున పోయాడు. ఇది గమనించిన యోనాతాను, అహిమయస్సు వెంటనే పారిపోయారు. వారు బహురీములో ఒకని ఇంటికి వెళ్లారు. ఆ ఇంటివాని ఆవరణలో[b] ఒక బావి వున్నది. యోనాతాను, అహిమయస్సు ఆ బావిలోకి దిగారు. 19 ఇంటివాని భార్య బావి మీద ఒక దుప్పటి కప్పి వేసింది. ఆమె మళ్లీ దాని మీద ధాన్యం పోసింది. అప్పుడా బావి ఒక ధాన్యపు రాశిలా కన్పించింది. అందువల్ల యోనాతాను, అహిమయస్సు అందులో దాగి వున్నారని ఎవరూ అనుకోరు. 20 అబ్షాలోము సైనికులు ఆ ఇంటి యజమానురాలి వద్దకు వచ్చి “అహిమయస్సు, యోనాతాను ఎక్కడ వున్నారు?” అని అడిగారు.
“వాళ్లు అప్పుడే వాగు దాటి పోయారని” ఆ స్త్రీ అబ్షాలోము మనుష్యులకు చెప్పింది.
అబ్షాలోము మనుష్యులు యోనాతాను, అహిమయస్సులను వెదుక్కుంటూపోయారు. కాని వారిద్దరినీ వారు కనుగొనలేదు. అందుచే అబ్షాలోము సైనికులు యెరూషలేముకు తిరిగి వెళ్లిపోయారు.
21 అబ్షాలోము మనుష్యులు వెళ్లిపోయిన తరువాత యోనాతాను, అహిమయస్సు బావిలో నుండి బయటికి వచ్చారు. జరిగినదంతా రాజైన దావీదుకు వారు చెప్పారు. వారు దావీదుతో, “త్వరపడండి. నదిని దాటి వెళ్లండి! మీకు వ్యతిరేకంగా అహీతోపెలు ఇవన్నీ చేస్తున్నాడు” అని అన్నారు.
22 దావీదు, అతని మనుష్యులు యొర్దాను నదిని దాటి వెళ్లారు. సూర్యోదయానికి ముందే దావీదు, అతని అనుచరులు యొర్దాను నదిని దాటారు.
అహీతోపెలు ఆత్మహత్య చేసుకోవటం
23 ఇశ్రాయేలీయులు తన సలహా పాటించలేదని అహీతోపెలు గమనించాడు. అహీతోపెలు తన గాడిదపై గంతవేసి దానిపై తన నగరానికి వెళ్లాడు. తన కుటుంబపోషణకు తగిన ఏర్పాట్లు చేసి అహీతోపెలు ఉరిపోసుకొని చనిపోయాడు. అహీతోపెలు చనిపోయినాక అతని శవాన్ని అతని తండ్రి సమాధిలో పాతిపెట్టారు.
అబ్షాలోము యొర్దాను నదిని దాటటం
24 దావీదు మహనయీముకు చేరాడు. అబ్షాలోము, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటారు. 25 అబ్షాలోము తన సైన్యాధికారిగా అమాశాను నియమించాడు. అంటే యోవాబు స్థానాన్ని అమాశా ఆక్రమించాడు.[c] ఇత్రా అనేవాని కుమారుడు అమాశా. ఇత్రా ఇష్మాయేలీయుడు[d] అమాశా తల్లి పేరు అబీగయీలు. ఈమె సెరూయా[e] సోదరియగు నాహాషు కుమార్తె. (సెరూయా యోవాబు తల్లి) 26 అబ్షాలోము, ఇశ్రాయేలీయులు గిలాదు రాజ్యంలో గుడారాలు వేసుకున్నారు.
షోబీ, మాకీరు, బర్జిల్లయి
27 దావీదు మహనయీముకు చేరాడు. షోబీ, మాకీరు మరియు బర్జిల్లయి అక్కడ వున్నారు. (నాహాషు కుమారుడైన షోబీ అమ్మోనీయుల రాజధానియగు రబ్బాకు చెందినవాడు. అమ్మీయేలు కుమారుడైన మాకీరు లోదెబారుకు చెందినవాడు. బర్జిల్లయి అనువాడు గిలాదులోని రోగెలీము పట్టణవాసి) 28-29 “ఎడారిలోవున్న ప్రజలు అలసిపోయి ఆకలిదప్పులు గొనియున్నారు” అని వారు చెప్పినారు. అందువల్ల దావీదు, అతని మనుష్యులు తినటానికి వారు అనేక పదార్థాలు పట్టుకువచ్చారు. వారు పరుపులు, పాత్రలు, కుండలు తెచ్చారు. వారింకా గోధుమలు, యవలు, పిండి, వేపిన ధాన్యం, కాయగూరలు, ఎండబెట్టిన గింజలు, తేనె, వెన్న, గొర్రెలు, ఆవుపాల మీగడ మొదలైనవన్నీ తెచ్చారు.
పౌలు తనను సమర్థించుకోవటం
10 క్రీస్తులో ఉన్న సాత్వికం పేరిట, దయ పేరిట మిమ్మల్ని వేడుకొంటున్నాను. కొందరు నేను మీ సమక్షంలో ఉన్నప్పుడు నాలో ధైర్యం ఉండదని, మీకు దూరంగా ఉన్నప్పుడు నాలో ధైర్యముంటుందని అంటున్నారు. 2 నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ధైర్యంగా మాట్లాడవలసిన అవసరం లేదు. మేము లౌకికంగా జీవిస్తున్నామని అనుకొనేవాళ్ళతో కూడా ధైర్యంగా మాట్లాడనవసరం లేదు. 3 మేము ఈ ప్రపంచంలో జీవిస్తున్నా, ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు యుద్ధం చేసినట్లు మేము చెయ్యము. 4 మేము ఉపయోగించే ఆయుధాలు ఈ ప్రపంచంలోనివాళ్ళు ఉపయోగించేవి కావు. కాని శత్రువుల కోటలను పడగొట్టగల దైవికమైన శక్తి మా ఆయుధాల్లో ఉంది. 5 మేము దేవుని జ్ఞానాన్ని ఎదిరించే తర్కాలను, డాంబిక వాదాలను ఓడించి పడగొడతాము. ప్రతి భావాన్ని బంధించి అందరినీ క్రీస్తుకు విధేయులు అయ్యేటట్లు చేస్తాము. 6 మిమ్మల్నందర్నీ విధేయులుగా చేసాక అవిధేయతతో ఉన్న ప్రతి సంఘటనను శిక్షించటానికి సిద్ధంగా ఉంటాము.
7 మీరు పైకి కనిపించే వాటిని మాత్రమే చూస్తున్నారు. తాను క్రీస్తుకు చెందినవాణ్ణని విశ్వసించినవాడు, తాను ఏ విధంగా క్రీస్తుకు చెందాడో మేము అతనిలాగే క్రీస్తుకు చెందినవాళ్ళమని గమనించాలి. 8 మిమ్మల్ని నాశనం చెయ్యటానికి కాకుండా అభివృద్ధి పరచటానికి ప్రభువు మాకు అధికారమిచ్చాడు. దాన్ని గురించి నేను గొప్పలు చెప్పుకోవటానికి సిగ్గుపడను. 9 నా లేఖల ద్వారా మిమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నించటం లేదు. మీరు అలా అనుకోకండి. 10 ఎందుకంటే కొందరు, “అతని లేఖలు బలంగా, ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. కాని మనిషిని ఎదురుగా ఉన్నప్పుడు చూస్తే బలహీనంగా ఉంటాడు. మాటలు నిస్సారంగా ఉంటాయి” అని అంటారు. 11 వాళ్ళు మేము దూరంగా వుండి లేఖల్లో వ్రాసిన విధంగా సమక్షంలో ఉన్నప్పుడు కూడా నడుచుకొంటామని గమనించాలి.
12 ఆ ప్రగల్భాలు పలికే గుంపుతో పోల్చుకొనే ధైర్యం కూడా మాకు లేదు. మేము వాళ్ళతో పోల్చుకోము. తెలివిలేనివాళ్ళు తమ గొప్పతనాన్ని తామే కొల్చుకుంటూ, తమతో తమను పోల్చుకొంటారు.
13 మేము యితర విషయాల్లో గొప్పలు చెప్పుకోము. కాని, దేవుడు మాకప్పగించిన విషయంలో గొప్పలు చెప్పుకోవటం మానము. ఆ విషయాలు మీకు కూడా చెప్పాము. 14 మేము మా హద్దులు మీరి పోవటం లేదు. మీరు ఆ హద్దుల్లో ఉన్నారు కనుక మేము క్రీస్తు సువార్త తీసుకొని మీ దగ్గరకు వచ్చాము. మేము మా హద్దులు మీరలేదు. 15 లేక మేము యితరులు చేసిన కార్యాల్ని గొప్పగా చెప్పి మా హద్దులు దాటిపోలేదు. మీ విశ్వాసం అభివృద్ధి చెందుతుందని మాకు నమ్మకం ఉంది. మేము చేస్తున్న సేవాకార్యం మీ ద్వారా నలువైపులా వ్యాపించాలి. 16 దైవసందేశాన్ని మీ ప్రాంతంలోనే కాక, మీకు ముందున్న ప్రాంతాల్లో కూడా ప్రకటించాలని మా ఉద్దేశం. ఇతరులు తమ ప్రాంతాల్లో యిదివరకే చేసిన కార్యాల్ని గురించి మేము గొప్పలు చెప్పుకోవాలని మాకు లేదు. 17 కాని, “గర్వించాలనుకొన్నవాడు ప్రభువు విషయంలో గర్వించాలి”(A) అని వ్రాయబడింది. 18 ప్రభువు ఎవరిని యోగ్యుడని సమ్మతిస్తాడో వాడే యోగ్యుడౌతాడు. కాని తనకు తాను యోగ్యుడని చెప్పుకొనేవాడు యోగ్యుడు కాడు.
కుండ-మాంసం
24 నా ప్రభువైన యెహోవా మాట నాకు చేరింది. అది చెరలో తొమ్మిదవ సంవత్సరం, పదవనెల పదవ తేదీన జరిగింది. ఆయన ఇలా అన్నాడు, 2 “నరపుత్రుడా, ఈ రోజు తారీఖు వేసి, ఈ చీటీ వ్రాయి, ‘ఈ రోజు బబులోను రాజు సైన్యం యెరూషలేమును చుట్టుముట్టింది.’ 3 విధేయులు కావటానికి తిరస్కరించే ఇశ్రాయేలు తెగవారికి ఈ కథ చెప్పు. వారికి ఈ విషయాలు చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు.
“‘పొయ్యిమీద కుండ పెట్టుము.
కుండ పెట్టి, అందులో నీరు పొయుము.
4 దానిలో మాంసం ముక్కలు వేయాలి.
మంచి ముక్కలు వేయాలి. తొడ మాంసం, జబ్బ మాంసం వేయాలి.
మంచి ఎముకలతో కుండ నింపాలి.
5 వీటి కొరకు మందలో వున్న మంచి జంతువులను (పశువులను) వాడాలి.
కుండ క్రింద బాగా కట్టెలు పేర్చు.
మాంసం ముక్కలను వుడకబెట్టు.
ఎముకలు కూడా వుడికేలా రసాన్ని కాగబెట్టు!
6 “‘నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెప్పుతున్నాడు,
హంతకులున్న
ఈ నగరమునకు కీడు మూడింది.
తుప్పుమరకలున్న కుండలా యెరూషలేము ఉంది.
ఆ మచ్చలు తొలగింప బడవు!
కుండలో నుండి ప్రతి మాంసం ముక్కను బయటకు తీయుము.
ఆ మాంసాన్ని తినవద్దు! పాడైపోయిన ఆ మాంసం నుండి యాజకులను ఏమీ తీసుకోనివ్వద్దు.
7 యెరూషలేము ఆ తుప్పుపట్టిన కుండలా ఉంది.
ఎందువల్లననగా హత్యల రక్తం ఇంకా అక్కడ ఉంది!
రక్తాన్ని ఆమె రాళ్లమీద చిందించింది.
రక్తాన్ని ఆమె నేలపై పోసి దుమ్ముతో కప్పలేదు.[a]
8 నేనామె రక్తాన్ని రాతిబండమీద వుంచాను.
అందువల్ల అది కప్పబడదు.
చూచిన ప్రజలకు కోపం రావాలని, అమాయక ప్రజలను చంపినందుకు
వారామెను శిక్షించాలని నేనది చేశాను.
9 “‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు,
నరహంతకులతో నిండిన ఈ నగరానికి కీడు మూడింది!
నిప్పు రాజెయ్యటానికి నేను కట్టెలు బాగా పేర్చుతాను.
10 కుండ క్రింద కట్టెలు బాగా పేర్చు.
నిప్పు రాజెయ్యి.
మాంసాన్ని బాగా ఉడకనియ్యి!
మసాల దినుసులు కలుపుము.
ఎముకలు కాలిపోనిమ్ము.
11 పిమ్మట బొగ్గుల మీద ఖాళీ కుండను వుండ నిమ్ము.
దాని మచ్చలు కాలి మెరిసేలా దానిని వేడెక్కనిమ్ము.
దాని మచ్చలు కరిగిపోతాయి.
తుప్పు (కిలుము) రాలిపోతుంది.
12 “‘యెరూషలేము తన మచ్చలు మాపుకోటానికి
బాగా శ్రమించవచ్చు.
అయినా దాని “తుప్పు” పోదు!
కేవలం అగ్ని (శిక్ష) మాత్రమే ఆ తుప్పును పోగొడుతుంది.
13 “‘నీవు నాపట్ల పాపం చేశావు.
దానితో నీ చర్మం మాలిన్యమయ్యింది.
నిన్ను కడిగి శుభ్రపర్చాలను కున్నాను.
కాని నీ వంటిమీది మచ్చలు పోకుండెను
నీపట్ల నా తీవ్రమైన కోపం తీరేవరకు
నిన్ను కడిగే ప్రయత్నం మళ్లీ చేయను!
14 “‘నేనే యెహోవాను. నీకు శిక్ష విధింపబడుతుందని చెప్పాను. ఆది వచ్చేలా నేను చేస్తాను. నేను శిక్షను ఆపను. నిన్ను గురించి నేను విచారించను. నీవు చేసిన చెడు కార్యాలకు నేను నిన్ను శిక్షిస్తాను.’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
యెహెజ్కేలు భార్య మరణం
15 పిమ్మట యెహోవా సందేశం నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 16 “నరపుత్రుడా, నీవు నీ భార్యను మిక్కిలి ప్రేమిస్తున్నావు. కాని ఆమెను నీనుండి నేను తీసుకొనబోతున్నాను. నీ భార్య అకస్మాత్తుగా చనిపోతుంది. అయినా నీవు మాత్రం నీ విచారాన్ని వ్యక్తం చేయకూడదు. నీవు బిగ్గరగా ఏడ్వకూడదు. నీవు కన్నీళ్లు కార్చకూడదు. 17 కాని నీ వెక్కి ఏడ్పు శబ్దాలను బయటకు వినరానీయవద్దు. చనిపోయిన నీ భార్య కొరకు నీవు ఏడ్వవద్దు. నీవు మామూలుగా వేసుకొనే బట్టలనే ధరించాలి. నీ తలపాగా, నీ చెప్పులు ధరించుము. నీ విచారాన్ని వ్యక్తం చేయటానికి నీవు నీ మీసాలను కప్పివుంచవద్దు. సామాన్యంగా వ్యక్తులు మరణించినప్పుడు ప్రజలు తినే ఆహారాన్ని నీవు తినవద్దు.”
18 మరునాటి ఉదయం దేవుడు చెప్పిన విషయాలను నేను ప్రజలకు తెలియజేశాను. ఆ సాయంత్రం నా భార్య చనిపోయింది. ఆ మరునాటి ఉదయం దేవుడు ఆజ్ఞాపించిన విధంగా నేను అన్నీ చేశాను. 19 అప్పుడు ప్రజలు నాతో, “నీవిలా ఎందుకు చేస్తున్నావు? దీని అర్థం ఏమిటి?” అని ప్రశ్నించారు.
20 అందుకు వారితో నేనిలా అన్నాను: “యెహోవా మాట నాకు విన్పించింది. 21 ఇశ్రాయేలు వంశంవారితో మాట్లడమని ఆయన నాకు చెప్పాడు. నా ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు: ‘చూడండి, నేను నా పవిత్ర స్థలాన్ని నాశనం చేస్తాను. మీరా స్థలాన్ని చూచి గర్వపడుతున్నారు. దానిని శ్లాఘిస్తూ పాటలు పాడుతున్నారు. ఆ స్థలాన్ని చూడాలని మీరు ఉబలాట పడుతూ వుంటారు. మీరు నిజంగా ఆ స్థలమంటే ఇష్టపడుతూ వున్నారు. కాని నేనాస్థలాన్ని నాశనం చేస్తాను. మీరు మీ వెనుక వదిలిపెట్టిన మీ పిల్లలంతా యుద్ధంలో చంపబడతారు. 22 నేను చనిపోయిన నా భార్య విషయంలో ఏమి చేశానో, మీరు కూడా అలానే చేస్తారు. మీ దుఃఖాన్ని సూచించటానికి మీరు మీసాలను కప్పుకొనరు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు సామాన్యంగా ప్రజలు తినే ఆహారాన్ని మీరు తినరు. 23 మీరు మీ తలపాగాలు, చెప్పులు ధరిస్తారు. మీరు మీ విచారాన్ని వ్యక్తం చేయరు. మీరు ఏడ్వరు. మీ పాపాల కారణంగా మీరు నశించిపోతారు. మీ దుఃఖాన్ని మీరు ఒకరికొకరు నిశ్శబ్దంగా తెలియజేసుకుంటారు. 24 కావున యెహెజ్కేలు మీకు ఒక ఉదాహరణ. అతడు చేసినవన్నీ అలానే మీరూ చేస్తారు. ఆ శిక్షా కాలం సమీపిస్తున్నది. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’”
25-26 “నరపుత్రుడా, ప్రజల నుండి ఆ సురక్షిత ప్రాంతాన్ని (యెరూషలేమును) నేను తీసుకుంటాను. ఆ అందమైన స్థలం వారిని సంతోషపెడుతూ ఉంది. వారు దానిని చూడాలని కుతూహల పడుతూ వుంటారు. వారు నిజంగా ఆ స్థలమంటే బాగా ఇష్టపడుతున్నారు. ఆ నగరాన్ని, వారి పిల్లలను నేను వారినుండి తీసుకొంటాను. ఆ సమయంలో చావగా మిగిలిన వారిలో ఒకడు యెరూషలేమును గూర్చిన ఒక చెడువార్తను తీసుకొని వస్తాడు. 27 అప్పుడు నీవతనితో మాట్లాడ గలుగుతావు. ఇక నీవెంత మాత్రమూ మౌనంగా వుండవు. ఈ రకంగా నీవు వారికి ఒక ఉదాహరణగా ఉంటావు. నేను యెహోవానని అప్పుడు వారు తెలుసుకుంటారు.”
సొలొమోను కీర్తన.
72 దేవా, రాజు నీవలె జ్ఞానముగల తీర్మానాలు చేయుటకు సహాయం చేయుము.
రాజకుమారుడు నీ మంచితనం గూర్చి నేర్చుకొనేందుకు సహాయం చేయుము.
2 నీ ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేందుకు రాజుకు సహాయం చేయుము.
నీ పేద ప్రజలకు ఏది మంచిదో దానిని చేయుటకు అతనికి సహాయం చేయుము.
3 దేశం అంతటా శాంతి, న్యాయం ఉండనీయుము.
4 పేద ప్రజలకు రాజు న్యాయంగా ఉండునుగాక.
నిస్సహాయులకు అతణ్ణి సహాయం చేయనిమ్ము. వారిని బాధించే ప్రజలను అతణ్ణి శిక్షించనిమ్ము.
5 సూర్యుడు ప్రకాశించునంత వరకు ఆకాశంలో చంద్రుడు ఉన్నంత వరకు
ప్రజలు రాజుకు భయపడి గౌరవిస్తారని ఆశిస్తున్నాను.
ప్రజలు అతనికి శాశ్వతంగా భయపడి గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను.
6 పొలాల మీద కురిసే వర్షంలా రాజు ఉండునట్లు అతనికి సహాయం చేయుము.
నేలమీద పడే జల్లులా ఉండుటకు అతనికి సహాయం చేయుము.
7 అతడు రాజుగా ఉండగా మంచితనం వికసించనిమ్ము.
చంద్రుడున్నంతవరకు శాంతిని కొనసాగనిమ్ము.
8 సముద్రం నుండి సముద్రానికి, నది నుండి భూమి మీద దూర స్థలాలకు
అతని రాజ్యాన్ని విస్తరింపనిమ్ము.
9 అరణ్యంలో నివసించే ప్రజలను అతనికి సాగిలపడనిమ్ము
అతని శత్రువులందరూ ధూళిలో వారి ముఖాలు పెట్టుకొని అతని యెదుట సాగిలపడనిమ్ము.
10 తర్షీషు రాజులు మరియు దూర తీరాల రాజులు అతనికి కానుకలు సమర్పించుదురు గాక.
షేబ మరియు సెబా రాజులు అతనికి కప్పం చెల్లించెదరు గాక.
11 రాజులందరూ మన రాజుకు సాగిలపడుదురు గాక.
రాజ్యాలన్నీ అతన్ని సేవించెదరు గాక.
12 మన రాజు సహాయం లేని వారికి సహాయం చేస్తాడు.
మన రాజు పేదలకు, నిస్సహాయులకు సహాయం చేస్తాడు.
13 పేదలు, నిస్సహాయులు ఆయన మీద ఆధారపడతారు.
రాజు వారిని బ్రతికించి ఉంచుతాడు.
14 వారిని బాధించుటకు ప్రయత్నించే కృ-రుల బారినుండి రాజు వారిని రక్షిస్తాడు.
ఆ పేద ప్రజల ప్రాణాలు రాజుకు చాలా ముఖ్యం.
15 రాజు దీర్ఘాయుష్మంతుడగును గాక.
షేబ నుండి బంగారం అతడు తీసుకొనును గాక.
రాజుకోసం ఎల్లప్పుడూ ప్రార్థించండి.
ప్రతిరోజూ అతణ్ణి దీవించండి.
16 పొలాలు పుష్కలంగా ధాన్యం పండించునుగాక.
కొండలు పంటలతో నిండిపోవునుగాక.
పొలాలు లెబానోనులోని పొలాలవలె సారవంతంగా ఉండును గాక.
పొలాలు గడ్డితో నిండిపోయినట్లు పట్టణాలు ప్రజలతో నిండిపోవును గాక.
17 రాజు శాశ్వతంగా ప్రసిద్ధినొందునుగాక.
సూర్యుడు ప్రకాశించునంతవరకు ప్రజలు అతని పేరును జ్ఞాపకం చేసికొందురు గాక.
అతని మూలంగా ప్రజలందరూ ఆశీర్వదించబడుదురు గాక.
మరియు వారందరూ అతన్ని దీవించెదరుగాక.
18 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి.
అలాంటి అద్భుతకార్యాలు చేయగలవాడు దేవుడు ఒక్కడే.
19 ఆయన మహిమగల నామాన్ని శాశ్వతంగా స్తుతించండి.
ఆయన మహిమ ప్రపంచమంతా వ్యాపించును గాక.
ఆమేన్, ఆమేన్!
20 యెష్షయి కుమారుడు దావీదు ప్రార్థనలు ఇంతటితో సమాప్తం.
© 1997 Bible League International