Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 సమూయేలు 16

సీబా దావీదును కలవటం

16 ఒలీవల పర్వతం మీద దావీదు కొంతవరకు వెళ్లాడు. అక్కడ మెఫీబోషెతు సేవకుడైన సీబా దావీదును కలిశాడు. సీబా వెంట గంతలు కట్టిన రెండు గాడిదలున్నాయి. గాడిదల మీద రెండు వందల రొట్టెలు, ఒక వంద ఎండు ద్రాక్షాగుత్తులు, ఒక వంద అంజూరపు పండ్లు, ఒక ద్రాక్షారసపు తిత్తివున్నాయి. రాజు (దావీదు) సీబాతో, “ఇవన్నీ ఎందుకు?” అని అన్నాడు.

“ఈ గాడిదలు రాజకుటుంబంవారు ఎక్కటానికి. ఈ రొట్టెలు, పండ్లు సేవకులు తినటానికి. ఎడారిలో ఎవరైనా అలసిపోతే ఈ ద్రాక్షారసం త్రాగి సేద తీర్చుకోవచ్చు” అని సీబా అన్నాడు.

“మెఫీబోషెతు[a] ఎక్కడ? అని రాజు అడిగాడు.

“మెఫీబోషెతు యెరూషలేములోనే వుంటున్నాడు. ఎందువల్లనంటే ఈ రోజు ఇశ్రాయేలీయులు తన తాత[b]! రాజ్యాన్ని అతనికి తిరిగి ఇచ్చి వేస్తారని ఆశిస్తూవున్నాడు!” అని రాజుకు సీబా సమాధానం చెప్పాడు.

“సరే, మంచిది. మెఫీబోషెతుకు చెందినదంతా ఇప్పుడు నేను నీకు ఇస్తాను” అని రాజు సీబాతో చెప్పాడు.

అది విని సీబా, “మీకు నేను నమస్కరిస్తున్నాను. మీకు నేనిలా సదా సంతృప్తిని చేకూర్చగలనని ఆశిస్తున్నాను” అని అన్నాడు.

దావీదును షిమీ శపించటం

దావీదు బహూరీముకు వచ్చాడు. బహూరీమునుండి సౌలు కుటుంబానికి చెందిన వాడొకడు బయటికి వచ్చాడు. వాని పేరు షిమీ. అతను గెరా అనువాని కుమారుడు. దావీదును గురించి చెడు మాటలు మాట్లాడుతూ వాడు బయటికి వచ్చాడు. అతడలా పదే పదే నిందిస్తూ వచ్చాడు.

దావీదు మీదికి, అతని సేవకుల మీదికి రాళ్లు విసరటం మొదలు పెట్టాడు. కాని దావీదుతో వున్న మనుష్యులు, సైనికులు దావీదు చుట్టూ చేరారు. చూట్టూ చేరి రక్షణ కల్పించారు. షిమీ దావీదును తిట్టాడు. “బయటికి పో! బయటికి పో! నీవు మంచివాడవు కావు. హంతకుడవు!”[c] అంటూ తిట్టాడు. “యెహోవా నిన్ను శిక్షిస్తాడు! ఎందువలననగా నీవు సౌలు కుటుంబంలోని మనుష్యులను చంపావు! రాజైన సౌలు స్థానాన్ని నీవు సంగ్రహించావు![d] కాని యెహోవా ఇప్పుడు రాజ్యాన్ని నీ కుమారుడైన అబ్షాలోముకు ఇచ్చాడు! నీవు చేసిన చెడు కార్యాలన్నీ ఇప్పుడు నీకే జరుగుతున్నాయి! ఎందువల్లననగా నీవొక హంతకుడవు!”

సెరూయా కుమారుడైన అబీషై రాజుతో, “నా ప్రభువైన రాజును ఈ చచ్చిన కుక్క ఎందుకు తిట్టాలి? నన్ను వెళ్లి, షిమీ తల నరికివేయనీయండి!” అని అన్నాడు.

10 అందుకు రాజు ఇలా అన్నాడు: “సెరూయా కుమారులారా, నేనేమి చేయగలను! నిజానికి షిమీ నన్ను దూషిస్తున్నాడు! కాని యెహోవా వాని చేత నన్ను శపిస్తున్నాడు!”

11 దావీదు తన సేవకులతోను, అబీషైతోను ఇంకా ఈ విధంగా అన్నాడు, “చూడండి, నా స్వంత కుమారుడే నన్ను చంపజూస్తున్నాడు! బెన్యామీనీయుడైన ఈ మనుష్యుడు (షిమీ) నన్ను చంపటానికి ఇంకా ఎక్కువ హక్కు కలిగి వున్నాడు! అతనిని అలా వదిలి వేయండి. నన్ను గురించి చెడ్డ మాటలు వానిని చెప్పనీయండి. యెహోవాయే ఇవన్నీ వానిచేత పలికిస్తున్నాడు. 12 బహుశః యెహోవా నాకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా గమనిస్తూ వుండవచ్చు. బహుశః యెహోవాయే నాకు మేలు చేయవచ్చు. ఈ రోజు షిమీ చెప్పే చెడ్డ మాటలన్నిటికీ భిన్నంగా ఏదో ఒక మంచి నాకు జరుగువచ్చు!”

13 కావున దావీదు తన మనుష్యులతో కలిసి తన దారిన వెళ్లిపోయాడు. కాని షిమీ దావీదును అనుసరిస్తూనే ఉన్నాడు. కొండ ప్రక్కగా దారికి ఆవలివైపున నడుస్తూ ఉన్నాడు. దారి పొడవునా షిమీ దావీదును దూషిస్తూనే ఉన్నాడు. అంతేగాకుండా దావీదు మీదకు రాళ్లు రువ్వటం, దుమ్ము జల్లటం కూడ చేస్తూనే వున్నాడు.

14 రాజైన దావీదు, అతని అనుచరులు బహూరీము అను చోటికి చేరారు. వారంతా బాగా అలసిపోయారు. వారు బహూరీము వద్ద విశ్రమించారు.

15 అబ్షాలోము, అహీతోపెలు, తదితర ఇశ్రాయేలీయులు యెరూషలేముకు వచ్చారు. 16 అర్కీయుడు, దావీదు స్నేహితుడు అయిన హూషై అబ్షాలోము వద్దకు వచ్చి “రాజు వర్ధిల్లు గాక! రాజు వర్ధిల్లుగాక!” అని అన్నాడు.

17 “నీ స్నేహితుడు దావీదుపట్ల నీవు ఎందుకు రాజభక్తి కలిగియుండలేదు? నీ స్నేహితునితో కలిసి యెరూషలేమును విడిచి ఎందుకు పోలేదు?” అని అబ్షాలోము అడిగాడు.

18 హూషై ఇలా అన్నాడు: “యెహోవా ఎవరిని ఎన్నుకుంటాడో నేను ఆయన మనిషిని. ఈ మనుష్యులు, ఇశ్రాయేలు ప్రజలు నిన్ను ఎంపికచేశారు. నేను నీతోనేవుంటాను. 19 గతంలో నేను నీ తండ్రికి సేవచేశాను. సరే, ఇప్పుడు నేను ఎవరికి సేవ చేయాలి? దావీదు కుమారునికి! అందువల్ల నేను నీకు సేవ చేస్తాను.”

అబ్షాలోము అహీతోపెలును సలహా అడగటం

20 “దయచేసి ఇప్పుడు మనం ఏమి చేయాలో చెప్పు” అని అబ్షాలోము అహీతోపెలును అడిగాడు.

21 అబ్షాలోముతో అహీతోపెలు ఇలా అన్నాడు: “నీ తండ్రి తన యొక్క దాసీలను కొంత మందిని ఇల్లు చూస్తూ ఉండమని వదిలి వెళ్లాడు. నీవు వెళ్లి వారితో సాంగత్యము చేయి. దానితో ఇశ్రాయేలీయులందరూ నీ తండ్రి నిన్నసహ్యించు టున్నాడని వింటారు. అప్పుడు నీకు మద్దతు యివ్వటానికి నీ ప్రజలందరికీ తగిన ప్రోత్సాహం దొరుకుతుంది.”

22 తరువాత అబ్షాలోము కొరకు మిద్దె మీద ఒకడేరా వేశారు. అక్కడ తన తండ్రి దాసీలతో అబ్షాలోము సంగమించాడు. ఇశ్రాయేలీయులంతా ఇది చూశారు. 23 ఆ కాలంలో అహీతోపెలు సలహా దావీదు, అబ్షాలోము లిరువురూ చాలా ముఖ్యమైనదిగా భావించేవారు. ఒక వ్యక్తికి దేవుని మాట ఎంత ముఖ్యమో, అహీతోపెలు సలహా కూడా అంత విలువగలదిగా ఉండేది.

2 కొరింథీయులకు 9

మీ ఇచ్చుబడి ఆశీర్వాదం

భక్తులకు చేయవలసిన సహాయాన్ని గురించి నేను మీకు వ్రాయవలసిన అవసరం లేదు. సహాయం చెయ్యాలనే ఉత్సాహం మీలో ఉన్నట్లు నాకు తెలుసు. అకయలో ఉన్న మీరు, పోయిన సంవత్సరం నుండి యివ్వటానికి సిద్ధంగా ఉన్నారని మాసిదోనియ ప్రజలకు నేను గర్వంగా చెప్పాను. మీ ఉత్సాహం వాళ్ళలో చాలా మందిని ప్రోత్సాహపరిచింది. వాళ్ళు కార్యనిర్వహణకు పూనుకొన్నారు. ఈ విషయంలో మేము మిమ్మల్ని గురించి పొగుడుతూ చెప్పిన మాటలు వ్యర్థం కాకూడదని నా ఉద్ధేశ్యం. మీరు సహాయం చెయ్యటానికి సిద్ధంగా ఉంటారని నాకు తెలుసు. కనుక సోదరుల్ని పంపుతున్నాను. ఒకవేళ మాసిదోనియవాళ్ళు నాతో వచ్చి మీరు సిద్ధంగా లేరని తెలుసుకొంటే, మీకే కాక, మీపై యింత నమ్మకం ఉన్న మాకు కూడా అవమానం కలుగుతుంది. కనుక సోదరుల్ని ముందే మీ దగ్గరకు పంపటం అవసరం అనిపించింది. వాళ్ళు వచ్చి మీరు ధారాళంగా వాగ్దానం చేసిన విరాళాన్ని ప్రోగుచేస్తారు. అలా చేస్తే మేము వచ్చినప్పుడు ఆ కానుక సిద్ధంగా ఉంటుంది. అప్పుడు ఆ కానుక అయిష్టంగా కాక, ఆనందంగా యిచ్చినట్లు అందరికీ తెలుస్తుంది.

కొంచెముగా విత్తేవాడు కొద్దిపంటను మాత్రమే పొందుతాడు. అదే విధంగా ఎక్కువగా విత్తేవానికి పంటకూడా ఎక్కువగా లభిస్తుంది. మీరిది జ్ఞాపకం ఉంచుకొండి. ఆనందంగా యిచ్చేవాణ్ణి దేవుడు ప్రేమిస్తాడు. కనుక ప్రతి ఒక్కడూ గొణుక్కోకుండా యివ్వాలి. ఒకరి బలవంతంతో కాకుండా తాను స్వయంగా నిర్ణయించుకొని యివ్వాలి. అప్పుడు దేవుడు మీకవసరమున్నదాని కన్నా ఎక్కువే యిస్తాడు, మీకు అవసరమున్నవన్నీ అన్ని వేళలా మీకు లభించేటట్లు చెయ్యటమే కాకుండా సత్కార్యాలు చెయ్యటానికి కావలిసినవి సమృద్ధిగా యిస్తాడు. దీన్ని గురించి లేఖనాల్లో ఇలా వ్రాసారు:

“అతడు పేదలకు ధారాళంగా యిచ్చాడు
    అతని నీతి చిరకాలం ఉంటుంది.”(A)

10 రైతుకు విత్తనాలు, తినటానికి ఆహారము యిచ్చే దేవుడే మీ పంటను సమృద్ధిగా పండించటానికి కావలసిన విత్తనాలు యిస్తాడు. తద్వారా మీ నీతికి ఫలం కలిగిస్తాడు. 11 మీరు అన్ని విషయాల్లో ధారాళంగా ఉండేటట్లు మీకు సకల ఐశ్వర్యాలు యిస్తాడు. మాద్వారా మీరిచ్చిన విరాళాలు తీసుకొని విశ్వాసులు దేవునికి కృతజ్ఞతలు చెపుతారు.

12 మీరు చేసిన సహాయం విశ్వాసుల అవసరాలను తీరుస్తుంది. అంతేకాక, వాళ్ళు దేవుణ్ణి అన్నివేళలా స్తుతించేటట్లు చేస్తుంది. 13 మీరు ఈ సేవ చేసి మీ విశ్వాసాన్ని నిరూపించుకున్నారు. క్రీస్తు సువార్తను అంగీకరించారు. దాన్ని విధేయతతో పాటించారు. మీకున్నదాన్ని వాళ్ళతో మాత్రమే కాక, అందరితో ధారాళంగా పంచుకొన్నారు. ఇది చూసి ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తారు. 14 దేవుడు మీపై యింత కరుణ చూపినందుకు, వాళ్ళు ప్రార్థించినప్పుడు మనసారా మిమ్మల్ని ప్రేమతో తలచుకుంటారు. 15 దేవుడు యిచ్చిన వర్ణనాతీతమైన ఆ కానుకకు మనము ఆయనకు కృతజ్ఞతతో ఉందాము.

యెహెజ్కేలు 23

23 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, సమరయ, యెరూషలేములను గురించిన ఈ కథ ఆలకించుము. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. వారిద్దరూ ఒక్క తల్లి కడుపునే పుట్టారు. చిన్న వయస్సులో ఉండగనే వారిద్దరూ ఈజిప్టులో వేశ్యలయ్యారు. ఈజిప్టులో వారు మగవాళ్లతో పడుకొన్నారు. మనుష్యులను వారు తమ చనుమొనలు నలిపి, తమ యౌవ్వనపు చన్నులను పట్టుకోనిచ్చారు. పెద్ద కుమార్తె పేరు ఒహొలా.[a] ఆమె చెల్లిలి పేరు ఒహొలీబా.[b] ఆ అక్కా చెల్లెళ్లిద్దరూ నాకు భార్యలయ్యారు. మాకు పిల్లలు కలిగారు. (నిజానికి ఒహొలా సమరయ. ఒహొలీబా యెరూషలేము.)

“అప్పుడు ఒహొలా నా పట్ల విశ్వాసం లేకుండా ప్రవర్తించింది. ఆమె ఒక వేశ్యలా జీవించసాగింది. తన విటులను కోరుకోనారంభించింది. ఊదారంగు బట్టలు వేసుకున్న అష్షూరు సైనికులను ఆమె చూసింది. గుర్రాలపై వెళ్లే ఆ సైనికులంతా కోరుకో తగ్గ యువకులు. వారు నాయకులు, అధికారులు అయివున్నారు. ఆ మనుష్యులందరికి ఒహొలా తనను తాను సమర్పించుకుంది. అష్టూరు సైన్యంలో వారంతా ప్రత్యేకంగా ఎంపిక చేయబడినవారు. వాళ్లందరినీ ఆమె కోరుకొంది! వారి రోత విగ్రహాలతో ఆమె కూడ మలినపర్చబడింది. దానికి తోడు, ఈజిప్టుతో తన ప్రేమ కలాపాలు ఆపలేదు. ఆమె చిన్న వయస్సులో ఉన్నప్పుడే ఈజిప్టు ఆమెతో సంగమించాడు. ఆమె యౌవ్వనపు చన్నులు పట్టుకున్న మొదటి ప్రేమికుడే ఈజిప్టు. ఈజిప్టు తన దొంగ ప్రేమనంతా ఆమెపై ఒలకబోశాడు. అందువల్ల ఆమె విటులను ఆమెను పొందడానికి రానిచ్చాను. ఆమె అష్టూరును కోరుకుంది. ఆందుచే నేనామెను వారికిచ్చాను! 10 వారామెకు మానభంగం[c] కావించారు. వారు ఆమె పిల్లలను ఎత్తుకుపోయారు. తరువాత వారు కత్తితో ఆమెను చంపివేశారు. వారామెను అలా శిక్షించారు. స్త్రీలు ఆమెను గురించి ఇంకా చెప్పుకుంటూనే ఉన్నారు.

11 “తన చిన్న సోదరి ఒహొలీబా ఇవన్నీ జరగటం చూసింది. అయినా తన అక్కకంటె ఒహొలీబా ఎక్కువ పాపాలు చేసింది! ఒహొలాకంటె ఈమె మరీ విశ్వాసంలేని స్త్రీ అయింది. 12 ఈమె అష్షూరు నాయకులను, అధికారులను కోరుకొంది. ఊదా బట్టల్లో గుర్రాలమీద స్వారీచేసే ఆ సైనికులను ఆమె కోరుకొంది. వారంతా ఆశించదగ్గ యువకులు. 13 ఒకే రకమైన తప్పులతో ఆ ఇద్దరు స్త్రీలు తమ జీవితాలను నాశనం చేసుకోబోతున్నట్లు నేను చూశాను.

14 “ఒహొలీబా నాపట్ల విశ్వాసం లేకుండ కొనసాగింది. బబులోను (బాబిలోనియా)లో గోడలమీద చెక్కిన మనుష్యుల బొమ్మలను చూసింది. ఇవి ఎర్రని బట్టలు ధరించిన కల్దీయ మనుష్యుల బొమ్మలు. 15 వారి నడుముల చుట్టు నడికట్లు, తలలపైన పొడుగాటి తలపాగాలు ధరించి వున్నారు. ఆ మనుష్యులందరు రథాధిపతుల వలె వున్నారు. వారంతా బబులోనులో జన్మించిన వారుగనే కన్పించారు. 16 మరి ఒహొలీబా వారందరినీ కావాలనుకొంది. 17 కావున ఆ బబులోను మనుష్యులందరూ ఆమెతో సంభోగించటానికి ఆమె ప్రేమ పాన్పు మీదికి వచ్చారు. ఆమెను విచ్చలవిడిగా వాడుకొని, చివరకు ఆమె వారిని చీదరించుకునేలా ఆమెను అపవిత్రపరచారు.

18 “ఒహొలీబా తన అవిశ్వాసాన్ని అందరూ గమనించేలా ప్రవర్తించింది. ఆమె తన నగ్నత్వాన్ని అనేక మంది అనుభవించనిచ్చింది. దానితో నాకు ఆమెపట్ల విసుగు పుట్టి, నేనామె అక్కను చీదరించుకున్నట్లు ఈమెను కూడ అసహ్యించుకున్నాను. 19 పదే పదే ఒహొలీబా నాపట్ల అవిశ్వాసంతో ప్రవర్తించింది. పిమ్మట ఈజిప్టు తను చిన్న పిల్లగా వుండి జరిపిన ప్రేమ కలాపాలు జ్ఞాపకం తెచ్చుకుంది. 20 గాడిద మేఢ్రంవంటి శిశ్నముతో గుర్రంవలె వరదలా రేతస్సును కార్చే తన విటుని ఆమె జ్ఞాపకం చేసుకున్నది.

21 “ఒహొలీబా, నీ ప్రేమికుడు నీ చనుమొనలు ముట్టి, నీ యౌవ్వనపు చన్నులను పట్టిన ఆ రోజులను గురించి నీవిప్పుడు కలలు కంటున్నావు. 22 కావున ఒహొలీబా, నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, ‘నీ ప్రేమికులతో నీవిప్పుడు విసుగుచెందియున్నావు. కాని నీ విటులను నేనిక్కడికి రప్పిస్తాను. వారు నీ చుట్టూ మూగుతారు. 23 వారందరినీ నేను బబులోను (బాబిలోనియా) నుండి రప్పిస్తాను. ముఖ్యంగా కల్దీయులను రప్పిస్తాను. పెకోదు, శోయ, కోయ ప్రాంతాలనుండి నేను పురుషులను రప్పిస్తాను. అష్టూరు నుండి కూడ నేను మనుష్యులను రప్పిస్తాను. తమ నాయకులను, అధికారులను రప్పిస్తాను. వారంతా కోరుకోతగ్గ యువకులు. రథాధిపతులు, ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన గుర్రపు రౌతులు వారిలో వున్నారు. 24 ఆ గుంపంతా నీ వద్దకు వస్తుంది. తమ గుర్రాలమీద, రథాలమీద వారు వస్తారు. అనేకానేకమంది వస్తారు. వారు తమ ఈటెలను, డాళ్లను, శిరస్త్రాణములను ధరించి వస్తారు. వారంతా నీ చూట్టూ గుమిగూడతారు. నీవు నాకు చేసినదంతా వారికి నేను వివరిస్తాను. వారికి ఇష్టమైన రీతిలో వారు నిన్ను శిక్షిస్తారు. 25 నేనెంత రోషంగా వున్నానో నీకు చూపిస్తాను. వారు చాలా కోపగించి నిన్ను బాధిస్తారు. వారు నీ ముక్కూ చెవులు కోసివేస్తారు. వారు కత్తితో నిన్ను చంపుతారు. పిమ్మట వారు నీ పిల్లలను తీసుకుపోతారు. నీవద్ద మిగిలిన ప్రతి దానిని వారు తగులబెడతారు. 26 నీ అందమైన బట్టలను, ఆభరణాలను వారు తీసుకుంటారు. 27 ఈజిప్టులో నీ ప్రేమ కలాపాలను గురించిన నీ కలలను నిలిపివేస్తాను. మళ్లీ నీవెన్నడు వారికొరకు ఎదురు చూడవు. నీవు ఇకముందెన్నడు ఈజిప్టును జ్ఞాపకం చేసుకొనవు!’”

28 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు, “నీవు అసహ్యించుకునే మనుష్యులకు నిన్ను అప్పజెప్పుచున్నాను. నీవు విసుగుచెందిన మనుష్యులకే నిన్ను అప్పజెప్పుచున్నాను. 29 వారు నిన్నెంత అసహ్యించుకుంటున్నారో వారు నీకు చూపిస్తారు. నీవు పనిచేసిందానినంతా వారు నిన్ను నిలువు దోపిడీ చేసి, నగ్నంగా వదులుతారు! ప్రజలు నీ పాపాలను విశదంగా చూస్తారు. నీవు వేశ్యలా ప్రవర్తించావని, నీవు నీచమైన కలలుగన్నావని వారు తెలుసుకుంటారు. 30 అన్యదేశీయులను వెంబడించి పోవటానికి నన్ను వదిలిపెట్టినప్పటి నుండి నీవీ పాపకార్యాలకు ఒడిగట్టావు. వారి రోత విగ్రహాలను ఆరాధించటం మొదలు పెట్టినప్పటి నుండి నీవీ చెడ్డ కార్యాలకు తలపడ్డావు. 31 నీవు నీ అక్కను అనుసరించి, ఆమె గడిపిన జీవితాన్నే నీవూ గడిపావు. నీకు నీవే విషపు పాత్రను అందుకుని, నీ చేతిలో పట్టుకున్నావు. నీకు శిక్ష నీవే విధించుకున్నావు.” 32 ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:

“నీవు నీ అక్క విషపు పాత్రను తీసుకొని తాగుతావు.
    అది ఒక పొడుగాటి, వెడల్పయిన గిన్నె.
ఆ గిన్నెలో విషం (శిక్ష) చాలా పడుతుంది.
    ప్రజలు నిన్ను చూచి నవ్వి, ఎగతాళి చేస్తారు.
33 తాగినవానిలా నీవు తూలిపోతావు.
    నీవు గొప్ప దుఃఖముతో నింపబడతావు.
షోమ్రోను పాత్ర వినాశ ఉపద్రవములతో నిండియున్నది.
    అది నీ అక్క తాగిన విషవు (శిక్ష) పాత్ర లాంటిదే.
34 ఆ పాత్రలోనే నీవు విషం తాగుతావు.
    దానిని నీవు పూర్తిగా తాగుతావు.
పిమ్మట పాత్ర క్రిందకు విసిరివేసి ముక్కలు చేస్తావు.
    బాధతో నీ రొమ్ములు చీరుకుంటావు.
నేను ప్రభువైన యెహోవాను గనుక ఇది సంభవిస్తుంది.
    ఈ విషయాలు నేనే చెప్పాను.

35 “కావున నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, ‘యెరూషలేమా నీవు నన్ను మర్చి పోయావు. నన్ను దూరంగా విసరివేసి, నన్ను వెనుక వదిలావు. నీవు నన్ను వదిలి వేశ్యలా జీవించిన కారణంగా ఇప్పుడు నీవు బాధ అనుభవిస్తావు. నీ అపవిత్రమైన కలలకూ నీ వ్యభిచారానికి నీవు శ్రమననుభవించాలి.’”

ఒహొలా, ఒహొలీబాలకు వ్యతిరేకంగా తీర్పు

36 నా ప్రభువైన యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నరుడా, నీవు ఒహొలా, ఒహొలీబాలకు తీర్పు ఇస్తావా? అయితే వారు చేసిన భయంకర నేరాలను వారికి చెప్పు. 37 వారు వివాహబంధం తెంచుకొని వ్యభిచరించారు. వారిపై హత్యానేరం ఉంది. వారు వేశ్యల్లా ప్రవర్తించారు. వారి అపవిత్ర విగ్రహాలతో వుండటానికి వారు నన్ను వదిలివేశారు. నా పిల్లలు వారితో వున్నారు. కాని వారిని నిప్పులో బలవంతంగా నడిపించింది. తమ అపవిత్ర విగ్రహాలకు నైవేద్యం పెట్టటానికి వారీ పని చేశారు. 38 నేను నిర్దేశించిన ప్రత్యేక విశ్రాంతి దినాలను, నా పవిత్ర స్థలాన్ని వారు సామాన్యమైనవిగా పరిగణించారు. 39 వారి విగ్రహాల కొరకు వారు తమ పిల్లల్ని బలిపెట్టారు. తరువాత వారు నా పవిత్ర స్థలంలోకీ వెళ్లి దానిని కూడ అపవిత్ర పర్చారు! ఇది వారు నా ఆలయం లోపలే చేశారు!

40 “దూర ప్రాంతాల మనుష్యుల కొరకు వారు కబురు పంపారు. ఆ మనుష్యుల కొరకు నీవు (ఒహొలీబా) దూతను పంపావు. వారు నిన్ను చూడటానికి వచ్చారు. వారికొరకు నీవు స్నానం చేసి, కండ్లు అలంకరించు కొని, ఆభరణాలు ధరించావు. 41 ఒక అందమైన పాన్పు మీద నీవు కూర్చుని, దాని ముందు ఒక బల్లవేశావు. ఆ బల్ల మీద నా సుగంధ ధూప ద్రవ్యాన్ని,[d] నూనెను[e] ఉంచావు.

42 “యెరూషలేములో వినబడే శబ్దం విందులో[f] ప్రజలు చేసే రణగొణ ధ్వనిలా ఉంది. విందుకు అనేక మంది వచ్చారు. ఎడారినుండి వచ్చిన వారు కావటంతో వారు తాగుతూ ఉన్నారు. వారు స్త్రీలకు చేతి గొలుసులు, అందమైన కిరీటాలు యిచ్చారు. 43 కామ క్రీడలతో నీరసించిపోయిన ఆ స్త్రీతో నేను మాట్లాడినాను. వారంతా ఆమెతోను, ఆమె వారితోను వ్యభిచార పాపం చేస్తారా? అని అన్నాను. 44 కాని వారంతా ఒక వేశ్యవద్దకు వెళ్ళుచున్నట్లుగనే ఆమె వద్దకు వెళ్ళుతున్నారు. కామంతో పాపకార్యం చేసే ఒహొలా, ఒహొలీబాల వద్దకు వారు మళ్లీ, మళ్లీ వెళ్లారు.

45 “కాని మంచి మనుష్యులు వారిని నేరస్థులుగా తీర్పు ఇస్తారు. వారా స్త్రీలను వ్యభిచార, హత్యానేరాల క్రింద దోషులుగా నిర్ణయిస్తారు. ఒహొలా మరియు ఒహొలీబాలు వ్యభిచార పాపం చేసినందుకు, వారు చంపిన ప్రజల రక్తం ఇంకా వారి చేతులపై వున్నందున ఇది ఇలా జరుగుతుంది!”

46 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “ప్రజలను ఒక చోట సమీకరించండి. ఆ ప్రజలందరు ఒహొలా, ఒహొలీబాలను శిక్షింపనీయండి. ఈ ప్రజా సమూహం ఈ ఇద్దరు స్త్రీలను శిక్షించి, వారిని ఎగతాళి చేస్తారు. 47 తరువాత ఈ గుంపు వారిద్దరిపై రాళ్ళు విసరి చంపివేస్తారు. వారా ఇద్దరినీ తమ కత్తులతో నరికి ముక్కలు చేస్తారు. వారు ఈ స్త్రీల పిల్లలను చంపి, వారి ఇండ్లను తగలబెడతారు. 48 ఈ రకంగా ఈ దేశాన్నుండి అవమానాన్ని తొలగిస్తాను. మిగిలిన స్త్రీలంతా మీరు చేసినటుంటి సిగ్గు మాలిన పనులు చేయకుండ వుండేలా హెచ్చరింపబడతారు. 49 మీరు చేసిన చెడు కార్యాలకు వారు మిమ్మల్ని శిక్షిస్తారు. హేయమైన మీ విగ్రహాలను ఆరాధించిన నేరానికి మీరు శిక్షింపబడతారు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకొంటారు.”

కీర్తనలు. 70-71

సంగీత నాయకునికి: ప్రజలు జ్ఞాపకం చేసికొనేందుకు సహాయంగా దావీదు కీర్తన.

70 దేవా, నన్ను రక్షించుము.
    దేవా త్వరపడి నాకు సహాయం చేయుము.
మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు.
    వారిని నిరాశపరచుము.
    వారిని అవమానించుము.
మనుష్యులు నాకు చెడు కార్యాలు చేయాలని కోరుతున్నారు.
    వారు పడిపోయి సిగ్గు అనుభవిస్తారని నా నిరీక్షణ.
మనుష్యులు నన్ను హేళన చేసారు.
    వారికి తగినదాన్ని పొందుతారని నా నిరీక్షణ.
నిన్ను ఆరాధించే ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను.
నీ మూలంగా రక్షించబడుటకు ఇష్టపడే మనుష్యులు ఎల్లప్పుడూ నిన్ను స్తుతించగలుగుతారు.

నేను నిరుపేదను, నిస్సహాయుణ్ణి.
    దేవా, త్వరపడి! వచ్చి నన్ను రక్షించుము.
దేవా, నన్ను తప్పించగలవాడవు నీవు ఒక్కడవు మాత్రమే.
    ఆలస్యం చేయవద్దు!

71 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను.
    కనుక నేను ఎన్నటికీ నిరాశ చెందను.
నీ మంచితనాన్ని బట్టి నీవు నన్ను రక్షిస్తావు. నీవు నన్ను తప్పిస్తావు.
    నా మాట వినుము. నన్ను రక్షించుము.
భద్రత కోసం నేను పరుగెత్తి చేరగల గృహంగా, నా కోటగా ఉండుము.
    నన్ను రక్షించుటకు ఆజ్ఞ ఇమ్ము.
నీవు నా బండవు కనుక నా క్షేమస్థానమై ఉన్నావు.
నా దేవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
    కృ-రమైన దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
నా ప్రభువా, నీవే నా నిరీక్షణ.
    నేను నా యౌవనకాలంనుండి నిన్ను నమ్ముకొన్నాను.
నేను పుట్టినప్పటినుండి నీమీదనే ఆధారపడ్డాను.
    నా తల్లి గర్భమునుండి నీవు నన్ను జన్మింపజేశావు.
    నేను ఎల్లప్పుడూ నిన్నే ప్రార్థించాను.
ఇతరులకు నేను మాదిరిగా ఉన్నాను.
    ఎందుకంటే నీవే నా బలానికి ఆధారం.
నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతున్నాను.
కనుక నేను ముసలివాడినని నన్ను త్రోసివేయకుము.
    నా బలము క్షీణిస్తూండగా నన్ను విడిచి పెట్టకుము.
10 నా శత్రువులు నిజంగా నాకు విరోధంగా పథకాలు వేసారు.
    ఆ మనుష్యులు నిజంగా కలుసుకొని నన్ను చంపుటకు పథకం వేసారు.
11 “దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు, వెళ్లి అతన్ని పట్టుకోండి.
    అతనికి ఎవరూ సహాయం చేయరు” అని నా శత్రువులు అంటున్నారు.
12 దేవా, నన్ను విడిచిపెట్టకుము.
    దేవా, త్వరపడుము! వచ్చి నన్ను రక్షించుము.
13 నా శత్రువులను ఓడించుము.
    వారిని పూర్తిగా నాశనం చేయుము.
వారు నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్నారు.
    వారు సిగ్గు, అవమానం అనుభవిస్తారని నా నిరీక్షణ.
14 అప్పుడు నేను నిన్నే ఎల్లప్పుడూ నమ్ముకొంటాను.
    నేను నిన్ను ఇంకా ఇంకా ఎక్కువగా స్తుతిస్తాను.
15 నీవు ఎంత మంచివాడవో దానిని నేను ప్రజలకు చెబుతాను.
    నీవు నన్ను రక్షించిన సమయాలను గూర్చి నేను ప్రజలతో చెబుతాను.
    లెక్కించేందుకు అవి ఎన్నెన్నో సమయాలు.
16 యెహోవా, నా ప్రభూ, నీ గొప్పతనాన్ని గూర్చి నేను చెబుతాను.
    నిన్ను గూర్చి నీ మంచితనం గూర్చి మాత్రమే నేను మాట్లాడుతాను.
17 దేవా, నేను చిన్నవానిగా ఉన్నప్పటి నుండి నీవు నాకు నేర్పించావు.
    నీవు చేసే అద్భుత విషయాలను గూర్చి ఈనాటివరకు నేను చెబుతూనే ఉన్నాను.
18 దేవా, నేను తల నెరసిన వృద్ధుడుగా ఉన్నప్పుడు కూడా నన్ను విడిచిపెట్టవని నాకు తెలుసు.
    నీ శక్తి, గొప్పదనాలను గూర్చి ప్రతి క్రొత్త తరానికీ నేను చెబుతాను.
19 దేవా, నీ మంచితనం ఆకాశాల కంటే ఎంతో ఉన్నతమైనది.
    దేవా, నీవంటి దేవుడు మరొకడు లేడు.
    నీవు ఆశ్చర్యకర కార్యాలు చేశావు.
20 నన్ను నీవు అనేక కష్టాలను, ప్రయాసములను చూడనిచ్చావు.
    కాని వాటిలో ప్రతి ఒక్క దాని నుండి నీవు నన్ను రక్షించావు. మరియు బ్రతికించి ఉంచావు.
    భూమి లోతులనుండి కూడా నీవు నన్ను తిరిగి పైకి తీస్తావు.
21 ఇదివరకటి కంటె గొప్ప కార్యాలు చేయుటకు నాకు సహాయం చేయుము.
    నన్ను ఆదరిస్తూనే ఉండుము.
22     స్వరమండలంతో నేను నిన్ను స్తుతిస్తాను.
    నా దేవా, నీవు నమ్మదగిన వాడవని నేను పాడుతాను.
    ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునికి నా సితారాతో నేను పాటలు పాడుతాను.
23 నీవు నా ఆత్మను రక్షించావు. నా ఆత్మ సంతోషంగా ఉంటుంది.
    నేను నా పెదవులతో స్తుతి కీర్తనలు పాడుతాను.
24 అన్ని వేళలా నా నాలుక నీ మంచితనమును గూర్చి పాడుతుంది.
    నన్ను చంపాలని కోరే ప్రజలు ఓడించబడి అవమానం పొందుతారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International