M’Cheyne Bible Reading Plan
అబ్షాలోము అనేకులను స్నేహితులుగా చేసుకోవటం
15 ఇదంతా ఆయిన పిమ్మట అబ్షాలోము తనకై ప్రత్యేకంగా ఒక రథాన్ని మరియు గుర్రములను సమకూర్చుకున్నాడు. తన రథం సాగుతూ వుండగా ముందు వెళ్లటానికి ఏబది మంది సైనికులను ఏర్పాటు చేసుకున్నాడు. 2 అబ్షాలోము ఉదయం పెందలకడలేచి నగర ద్వారం[a] వద్ద నిలబడేవాడు. అక్కడికి ఎవరైనా ఏదైనా సమస్యపై న్యాయం కోరుతూ దావీదు రాజు కొరకు వస్తే, అబ్షాలోము వారిని పిలిచేవాడు. వారిని “ఏ నగరం నుండి వచ్చినారని” అడిగేవాడు. “ఇశ్రాయేలు వంశాలలో ఒకడినని” ఆ వచ్చినవాడు చెప్పేవాడు. 3 అందుకు అబ్షాలోము “చూడు, నీవు నిజమే చెబుతున్నావు. కాని దావీదు రాజు నీవు చెప్పేది వినడు” అని అనేవాడు.
4 అబ్షాలోము ఇంకా ఇలా అనేవాడు, “ఓహో, ఈ రాజ్యంలో నన్నెవరైనా న్యాయాధిపతిగా చేయాలని నేను ఆశిస్తున్నాను. న్యాయం కోరుతూ ఎవరు ఏ సమస్యతో వచ్చినా వారికి తగిన న్యాయం నేనప్పుడు చేయగలుగుతాను. వచ్చిన వాని సమస్యకు తగిన పరిష్కారం కనుగొని సహాయం చేయగలుగుతాను.”
5 ఎవరైనా అబ్షాలోము వద్దకు వచ్చి ప్రణమిల్లి నమస్కరించబోతే, అతను వాని కొరకు ముందుకు వెళ్లి, అతనిని ఆదరంగా తన వద్దకు తీసుకొనేవాడు. తరువాత ఆ వచ్చిన వానిని అతను స్నేహపూర్వకంగా ముద్దు పెట్టుకొనేవాడు. 6 దావీదు రాజు వద్దకు న్యాయం కోసం ఇశ్రాయేలు నుండి ఎవరు వచ్చినా అబ్షాలోము అలా చేసేవాడు. ఈ రకంగా ఇశ్రాయేలు ప్రజలందరి హృదయాలనూ అబ్షాలోము గెలిచాడు.
దావీదు రాజ్యాన్ని కైవశం చేసుకోవటానికి అబ్షాలోము పథకం
7 నాలుగేండ్ల[b] తరువాత దావీదు రాజుతో అబ్షాలోము ఇలా అన్నాడు: “హెబ్రోనులో నేను వుండగా యెహోవాకి నేను మొక్కుకున్నాను. దయచేసి ఆ మొక్కు చెల్లించటానికి నన్ను వెళ్లనీయండి. 8 గతంలో నేను సిరియ దేశమందలి గెషూరులో వుండగా మొక్కాను. నన్ను యెహోవా మరల యెరూషలేముకు తీసుకొని వస్తే యెహోవాను ఆరాధించెదనని మొక్కుకున్నాను.”
9 “ప్రశాంతంగా వెళ్లిరా!” అని దావీదు రాజు అన్నాడు.
అబ్షాలోము హెబ్రోనుకు వెళ్లాడు. 10 కాని అబ్షాలోము వేగుల వారిని ఇశ్రాయేలు వంశాల వారందరి వద్దకు పంపాడు. వారు వెళ్లి ప్రజలలో, “మీరు బాకా నాదం విన్నప్పుడు అబ్షాలోము హెబ్రోనులో రాజయ్యాడు.!” అని కేకలు పెట్టమన్నాడు.
11 అబ్షాలోము తనతో వెళ్లటానికి రెండువందల మందిని ఆహ్వానించాడు. యెరూషలేము నుండి వారంతా అతనితో వెళ్లారు. కాని అతడు ఏమి యుక్తి పన్నుతున్నాడో వారికి తెలియదు.
12 అహీతోపెలు దావీదు సలహాదారులలో ఒకడు. అహీతోపెలు గీలో పట్టణవాసి, అబ్షాలోము బలులు సమర్పించేటప్పుడు అతడు అహీతోపెలును గీలో పట్టణం నుంచి రమ్మని కబురు పంపాడు. అబ్షాలోము పన్నినయుక్తులన్నీ సక్రమంగా సాగుతున్నాయి. ప్రజలు అబ్షాలోమును అధిక సంఖ్యలో బలపర్చ నారంభించారు.
అబ్షాలోము పథకాన్ని దావీదు వినటం
13 ఈ వార్త దావీదుకు చెప్పటానికి ఒక వ్యక్తి వచ్చాడు. “ఇశ్రాయేలు ప్రజలు అబ్షాలోమును అనుసరించటం మొదలు పెట్టారు” అని అతడు చెప్పాడు.
14 అది విని దావీదు యెరూషలేములో తనతో ఉన్న సేవకులను పిలిచి ఇలా చెప్పాడు: “మనం ఇప్పుడు అవశ్యంగా తప్పించుకోవాలి! మనం అలా చేయకపోతే అబ్షాలోము మనల్ని వదిలిపెట్టడు. అబ్షాలోము మనల్ని పట్టుకొనే లోపు మనం త్వరపడాలి. అతడు మనందరినీ నాశనం చేస్తాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను కత్తితో నరికి చంపుతాడు.”
15 “మీరు ఏమి చేయాలని మాకు చెబుతారో మేమది చేస్తాము” అని రాజు యొక్క సేవకులు అన్నారు.
దావీదు, అతని మనుష్యులు తప్పించుకోవటం
16 రాజు (దావీదు) తన ఇంటి వారందరితో కలిసి బయటికి పోయాడు. రాజు తన ఉంపుడుగత్తెలలో పది మందిని ఇంటిని చూస్తూ వుండేటందుకు వదిలి పెట్టాడు. 17 తన ప్రజలందరూ వెంటరాగా రాజు బయలుదేరి వెళ్లాడు. వారు చివరి ఇంటివద్ద ఆగారు. 18 సేవకులంతా రాజు ముందునుంచి వెళ్లారు. కెరేతీయులు, పెలేతీయులు మరియు గిత్తీయులు (ఆరు వందల మంది గాతువారు) అందరూ రాజు ముందు నుంచి నడిచి వెళ్లారు.
19 గిత్తీయుడైన ఇత్తయిని చూచి రాజు, “నీవెందుకు మాతో వస్తున్నావు? తిరిగిపోయి, కొత్త రాజుతో (అబ్షాలోము) వుండిపో. నీవు పరదేశీయుడవు. ఇది నీ స్వదేశం కాదు. 20 నిన్న మాత్రమే నీవు నన్ను కలియటానికి వచ్చావు. ఇప్పుడు నీవు నాతో కలిసి వివిధ ప్రాంతాలు తిరిగే అవసరం వుందా? లేదు. తిరిగి వెళ్లిపో నీ సోదరులను కూడ నీతో తీసుకొని వెళ్లు. దయ, విశ్వాసం నీకు అండగా వుండుగాక!” అని అన్నాడు.
21 కాని ఇత్తయి రాజుకు సమాధానమిస్తూ, “యెహోవా జీవము తోడుగా, నీ జీవము తోడుగా నేను నీతోనే వుంటాను! చావుబ్రతుకుల్లో కూడ నేను నీతోనే వుంటాను!” అని అన్నాడు.
22 “అయితే మనం కిద్రోను వాగు దాటుదాము,” అన్నాడు రాజు ఇత్తయితో.
అప్పుడు గిత్తీయుడైన ఇత్తయి తన వారితోను, వారి పిల్లలతోను కిద్రోను వాగు దాటాడు. 23 ప్రజలంతా[c] బిగ్గరగా ఏడ్వసాగారు. రాజు (దావీదు) కిద్రోనువాగు దాటాడు. అప్పుడు వారంతా ఎడారివైపు ప్రయాణం సాగించారు. 24 సాదోకు, తనతో వున్న తదితర లేవీయులందరూ దేవుని ఒడంబడిక పెట్టెను మోసుకొని వస్తూవున్నారు. వారు దేవుని పెట్టెను దించారు. ప్రజలంతా యెరూషలేము నగరం నుండి వెళ్లిపోయే వరకు అబ్యాతారు ప్రార్థన[d] చేస్తూవున్నాడు.
25 సాదోకుతో రాజు (దావీదు) ఈ విధంగా చెప్పాడు: “దేవుని పవిత్ర పెట్టెను యెరూషలేముకు తిరిగి తీసుకొని వెళ్లు. ఒక వేళ యెహోవా నన్ననుగ్రహించితే, ఆయన నన్ను యెరూషలేముకు తిరిగి తీసుకొని వస్తాడు. యెహోవా మరల నన్ను యెరూషలేమును, ఆయన దేవాలయమును చూసేలా చేస్తాడు. 26 కాని దేవుడు నేనంటే ఇష్టంలేదని చెప్పితే ఆయన నాకు వ్యతిరేకంగా తన ఇష్టం వచ్చినట్లు చేయగలడు.”
27 యాజకుడు సాదోకుతో రాజు ఇంకా ఇలా అన్నాడు: “నీవు దీర్ఘదర్శివి.[e] నగరానికి ప్రశాంతంగా వెళ్లు. నీ కుమారుడైన అహిమయస్సును, అబ్యాతారు కుమారుడైన యోనాతానును నీతో తీసుకొని వెళ్లు. 28 ప్రజలు ఎడారిలోకి ప్రవేశించే స్థలంలో నేను మీనుండి మళ్లీ సమాచారం వచ్చేవరకు వేచి వుంటాను.”
29 కావున సాదోకు, అబ్యాతారు దేవుని పవిత్ర పెట్టెను తీసుకొని యెరూషలేముకు తిరిగి వెళ్లి అక్కడ వుండి పోయారు.
అహీతోపెలుకు వ్యతిరేకంగా దావీదు ప్రార్థించుట
30 దావీదు ఒలీవల పర్వతం మీదికి వెళ్లాడు. అతడు ఏడుస్తూవున్నాడు. తలమీద ముసుగు వేసికొని, చెప్పులు కూడ లేకుండా వెళ్లాడు. దావీదుతో వున్న మనుష్యులంతా కూడ తలపై ముసుగు వేసుకున్నారు. వారు ఏడుస్తూ దావీదు వెంట వెళ్లారు.
31 ఒక వ్యక్తి దావీదు వద్దకు వచ్చి, “అబ్షాలోముతో కలిసి పథకం వేసిన వారిలో అహీతోపెలు ఒకడు” అని చెప్పాడు. అది విని దావీదు యెహోవాకు “అహీతోపెలు సలహా నిరుపయోగమయ్యేలా చేయమని నిన్ను వేడుకుంటున్నాను” అని ప్రార్థన చేశాడు. 32 దావీదు పర్వతం పైకి వెళ్లాడు. తరుచూ అతను అక్కడ దేవుని ఆరాధించేవాడు. ఆ సమయంలో అర్కీయుడైన హూషై అనువాడు దావీదు వద్దకు వచ్చాడు. హూషై చొక్కా చిరిగివుంది. వాని తలపై దుమ్ము[f] వుంది.
33 దావీదు హూషైతో ఇలా అన్నాడు: “నీవు నాతో వస్తే నేను శ్రద్ద తీసుకోవలసిన వారిలో నీవొకడివవుతావు. 34 కాని నీవు యెరూషలేము నగరానికి వెళితే, అహీతోపెలు సలహాను ఎందుకూ కొరగానిదిగా నీవు చేయగలవు. అబ్షాలోముతో: ఓ రాజా, నేను నీ సేవకుడను. నేను నీ తండ్రిని సేవించాను. కాని ఇప్పుడు నిన్ను సేవింపవచ్చాను, అని చెప్పు. 35 యాజకులైన సాదోకు, అబ్యాతారు నీకు తోడుగా వుంటారు. రాజ గృహంలో నీవు విన్నదంతా వారికి తప్పక చెప్పాలి. 36 సాదోకు కుమారుడు అహిమయస్సు, అబ్యాతారు కుమారుడు యోనాతాను వారికి తోడుగా వుంటారు. నీవు విన్నదంతా వారికి చెప్పి పంపితే, వారు వచ్చి నాకు తెలియజేస్తారు.”
37 అప్పుడు దావీదు స్నేహితుడు హూషై నగరానికి వెళ్లాడు. అబ్షాలోము కూడ నగరానికి చేరియున్నాడు.
చందాలు సేకరించటం
8 సోదరులారా! మాసిదోనియ దేశంలోని సంఘాల పట్ల దేవుడు చూపిన అనుగ్రహాన్ని గురించి మీకు తెలపాలని మా అభిప్రాయం. 2 వాళ్ళ కష్టాలు వాళ్ళను తీవ్రంగా పరీక్షించాయి. వాళ్ళు చాలా పేదరికం అనుభవించారు. అయినా వాళ్ళలో చాలా ఆనందం కలిగి, వాళ్ళు యివ్వటంలో మిక్కిలి ఔదార్యం చూపారు. 3 వాళ్ళు యివ్వగలిగింది స్వయంగా యిచ్చారు. అంతే కాదు, తాము యివ్వగలిగినదానికన్నా ఇంకా ఎక్కువే యిచ్చారని నేను ఖచ్చితంగా చెప్పగలను. 4 విశ్వాసులైనవారికి చేసే సహాయంలో తాము కూడా చేరుతామని వాళ్ళు మమ్మల్ని ప్రాధేయపడ్డారు. 5 మేము ఆశించినంతగా చేయలేదు. అయినా వాళ్ళు మొదట తమను తాము ప్రభువుకు అర్పించుకొన్నారు. తర్వాత దేవుని చిత్తానుసారంగా మాకును అప్పగించుకున్నారు.
6 ఈ కార్యాన్ని ప్రారంభించిన తీతును దీన్ని కొనసాగించమని వేడుకొన్నాము. మీరు చేయాలనుకొన్న ఈ సేవాకార్యాన్ని అతడు పూర్తిచేసాడు. 7 మీరు విశ్వాసంలో, మాటలో, జ్ఞానంలో, సంపూర్ణ ఆసక్తిలో, మా పట్ల వ్యక్తపరుస్తున్న ప్రేమలో అందరిని మించిపోయారు. మీ దాతృత్వంలో కూడా అందరిని మించిపోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను.
8 నేను మీకు ఆజ్ఞాపించటం లేదు. ఇతరులు చేస్తున్న సేవతో మీ ప్రేమను పోల్చి చూడాలని ఉంది. మీ ప్రేమ ఎంత నిజమైందో చూడాలని ఉంది. 9 మన యేసు క్రీస్తు ప్రభువు అనుగ్రహం ఎంత గొప్పదో మీకు తెలుసు. ఆయన ఐశ్వర్యవంతుడైనా మీ కొరకు పేదవాడయ్యాడు. ఆయన పేదరికం వల్ల మీరు ఐశ్వర్యవంతులు కావాలని ఆ విధంగా చేసాడు.
10 ఈ విషయంలో మీకు ఏది మంచిదో అది చెబుతాను. పోయిన సంవత్సరం మీరు అందరికన్నా ఎక్కువగా యివ్వటమే కాకుండా అలాంటి ఉద్దేశ్యం ఉన్నవాళ్ళలో మీరే ప్రథములు. 11 కార్యాన్ని మొదలు పెట్టటంలో చూపిన ఆసక్తి దాన్ని పూర్తి చెయ్యటంలో కూడా చూపండి. మీ శక్త్యానుసారం చెయ్యండి. 12 మీకు యివ్వాలనే ఆసక్తి ఉంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. మీ దగ్గర లేనిదాన్ని బట్టి కాకుండా ఉన్నదాన్ని బట్టి మీరిచ్చింది అంగీకరిస్తాడు. 13 మీ మీద భారం మోపి యితరుల భారం తగ్గించాలని కాదు కాని అందరికీ సమానంగా ఉండవలెనని నా ఉద్దేశ్యం. 14 ప్రస్తుతం మీ దగ్గర అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కనుక అవసరమున్నవాళ్ళకు మీరు సహాయం చెయ్యటం సమంజసమే. అలా చేస్తే మీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేస్తారు. అప్పుడు సమంజసంగా ఉంటుంది. 15 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు:
“ఎక్కువ కూడబెట్టిన వాని దగ్గర ఎక్కువ లేదు.
తక్కువ కూడబెట్టిన వాని దగ్గర తక్కువ లేదు.”(A)
తీతును కొరింథుకు పంపటం
16 మీపట్ల నాకున్న చింతనే, దేవుడు తీతు హృదయంలో కూడా పెట్టాడు. అందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి. 17 తీతు మా నివేదన అంగీకరించాడు. అంతేకాక, చాలా ఉత్సాహంతో స్వయంగా మీ దగ్గరకు వస్తున్నాడు. 18 అతని వెంట యింకొక సోదరుణ్ణి పంపుతున్నాము. ఈ సోదరుడు సువార్త ప్రకటించి చేసిన సేవను అన్ని సంఘాలు అభినందిస్తున్నాయి. 19 పైగా, అతడు మా వెంట ఉండి, మాతో సహా ఈ కానుకను తీసుకు వెళ్ళాలని సంఘాలు అతణ్ణి ఎన్నుకొన్నాయి. మేమీకానుక ప్రభువు మహిమ కోసం తీసుకు వెళ్తున్నాము. సహాయం చేయాలన్న మా ఉత్సాహాన్ని చూపాలని మా ఉద్దేశ్యం.
20 ఈ గొప్ప విరాళాలు విమర్శకు గురి కాకుండా జాగ్రత్తగా యిస్తాము. 21 ప్రభువు దృష్టిలోనే కాకుండా ప్రజల దృష్టిలో కూడా ఏది ధర్మమో అది చెయ్యాలని మేము శ్రద్ధతో కష్టపడుతున్నాము.
22 అందువల్ల మా సోదరుణ్ణి కూడా వాళ్ళతో పంపుతున్నాము. ఇతన్ని మేము చాలా సార్లు పరీక్షించాము. సేవ చెయ్యాలనే ఉత్సాహం అతనిలో ఉన్నట్లు గ్రహించాము. ఇక అతనికి మీ పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉండటంవల్ల అతని ఉత్సాహం ఇంకా ఎక్కువైంది.
23 ఇక తీతు విషయమా! అతడు నేను మీకోసం చేస్తున్న సేవలో భాగస్థుడు. నాతో కలిసి పని చేసేవాడు. ఇక మేము పంపిన సోదరులు, సంఘాల ప్రతినిధులు, క్రీస్తుకు గౌరవం కలిగించేవాళ్ళు. 24 అందువల్ల, మీకు ప్రేమ ఉన్నట్లు వాళ్ళకు రుజువు చెయ్యండి. మేము మీ విషయంలో ఎందుకు గర్విస్తున్నామో వాళ్ళకు చూపండి. అలా చెయ్యటం వల్ల సంఘాలన్నీ దీన్ని గమనిస్తాయి.
యెహెజ్కేలు యెరూషలోముకు వ్యతిరేకంగా మాట్లాడటం
22 యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు: 2 “నరపుత్రుడా, నీవు న్యాయనిర్ణయం చేస్తావా? హంతకుల నగరంపై (యెరూషలేము) నీవు తీర్పు తీర్చుతావా? ఆమె చేసిన భయంకరమైన కార్యాలను గూర్చి ఆమెకు తెలియ జేస్తావా? 3 నీవు ఈలా చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు, నగరం హంతకులతో నిండిఉంది. కావున ఆమెకు శిక్షపడే కాలం వస్తుంది! తనకై తాను రోతవిగ్రహాలను చేసింది. ఆ విగ్రహాలే ఆమెను మలినపర్చాయి!
4 “‘యెరూషలేము వాసులారా, మీరనేక మందివి హతమార్చారు. మీరు అసహ్యకరమైన విగ్రహాలను చేశారు. మీరు నేరస్తులు. మిమ్మల్ని శిక్షించే కాలం వచ్చింది. మీకు అంతం సమీపించింది. అన్యదేశాలవారు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. ఆ రాజ్యాల వారు మిమ్మల్ని చూసి నవ్వుతారు. 5 మీకు దగ్గరలోను, దూరంలోను వున్న ప్రజలు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. మీ పేరును మీరే పాడుచేసుకున్నారు. వారి పెద్ద నవ్వును మీరు వినవచ్చు.
6 “‘చూడండి! ఇశ్రాయేలు పాలకులలో ప్రతివాడూ ఇతరులను చంపటానికి యెరూషలేములో తనను తాను బాగా బలపర్చుకున్నాడు. 7 యెరూషలేములో ప్రజలు తమ తల్లిదండ్రులను గౌరవించరు. ఆ నగరంలో వారు అన్యదేశీయులను బాధిస్తారు. ఆ నగరంలో వారు అనాధ పిల్లలను, విధవలను మోసగిస్తున్నారు. 8 మీరంతా నా పవిత్ర వస్తువులను అసహ్యించు కుంటారు. నేను నిర్దేశించిన ప్రత్యేక విశ్రాంతి దినాలను మీరు సామాన్యమైనవిగా భావిస్తారు. 9 యెరూషలేము ప్రజలు ఇతరులను గురించి అబద్ధాలు పలుకుతారు. ఆ అమాయక ప్రజలను చంపటానికే వారు ఆ విధంగా ప్రవర్తిస్తారు. ప్రజలు బూటకపు దేవుళ్లను కొలవటానికి కొండల మీదికి వెళతారు. పిమ్మట యెరూషలేముకు వచ్చి స్నేహ పంక్తి భోజనాలు చేస్తారు.
“‘యెరూషలేములో ప్రజలు కామవాంఛలతో కూడిన పాపాలు చేస్తారు. 10 యెరూషలేములో మనుష్యులు తమ తండ్రి భార్యతోనే వ్యభిచరించి పాపం చేస్తారు. యెరూషలేములో మనుష్యులు స్త్రీలను మానభంగం చేస్తారు. స్త్రీలు బహిష్టు అయినప్పుడు కూడా వారిని చెరబట్టి మానభంగం చేస్తారు. 11 ఒకడు ఆ భయంకర పాపాన్ని తన పొరుగువాని భార్యతోనే చేస్తాడు. మరొకడు తన కోడలితోనే వ్యభిచరించి ఆమెను అపవిత్ర[a] పరుస్తాడు. ఇంకొకడు తన తండ్రి కుమార్తెయగు తన సోదరిని మానభంగం చేస్తాడు. 12 ఓ యెరూషలేము ప్రజలారా, నరహత్య చేయటానికి మీరు డబ్బు తీసుకొంటారు. మీరు డబ్బు అప్పు ఇచ్చి, దానిమీద వడ్డీ తీసుకుంటారు. స్వల్ప లాభం కోసం మీరు మీ పొరుగువారిని మోసగిస్తారు. మీరు నన్ను మర్చిపోయారు.’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
13 దేవుడు ఇలా చెప్పసాగాడు: “‘ఇప్పుడు చూడు! నా చేతిని క్రింద కొట్టి నిన్ను ఆపుతాను! ప్రజలను మోసగించినందుకు, చంపినందుకు నిన్ను నేను శిక్షిస్తాను. 14 అప్పుడు నీవు ధైర్యంగా ఉంటావా? నేను నిన్ను శిక్షించటానికి వచ్చినప్పుడు నీవు శక్తిగలిగివుంటావా? లేదు! ఉండలేవు. నేనే యెహోవాను. మాట్లాడింది నేనే. నేనన్నది చేసి తీరుతాను! 15 మిమ్మల్ని చాలా దేశాలలోనికి చెదరగొడతాను. మీరు అన్యదేశాలకు పారిపోయేలా మీపై ఒత్తిడి తెస్తాను. ఈ నగరంలో ఉన్న ఏహ్యమైన వస్తువులన్నిటినీ నేను సర్వనాశనం చేస్తాను. 16 కాని యెరూషలేమా, నీవు అపవిత్రమవుతావు. పైగా ఇతర దేశాలన్నీ ఈ విషయాలు జరగటం చూస్తాయి. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకొంటావు.’”
పనికిరాని చెత్తవంటి ఇశ్రాయేలు
17 యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు, 18 “నరపుత్రుడా, వెండితో పోల్చినప్పుడు కంచు, ఇనుము, సీసము, తగరము మొదలైనవి చాలా విలువతక్కువ లోహాలు. పనివారు వెండిని శుద్ధి చేయటానికి అగ్నిలో వేస్తారు. కరిగిన వెండి నుంచి పనివారు అలా మైలను వేరు చేస్తారు. ఇశ్రాయేలు దేశం అలా వేరు చేయబడిన మలిన పదార్థంలా తయారయ్యింది. 19 కావున ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, ‘మీ ప్రజలంతా పనికిరాని చెత్తలా తయారయ్యారు. అందువల్ల మిమ్మల్నందరినీ యెరూషలేముకు చేర్చుతాను. 20 పనివారు వెండిని, కంచును, ఇనుమును, సీసాన్ని, తగరాన్ని నిప్పులో వేసి, నిప్పురగిలేలా కొలిమి వూదుతారు. లోహాలు కరగటం మొదలు పెడతాయి. అదేమాదిరి, మిమ్మల్ని నా అగ్నిలో వేసి కరగబెడతాను. నా రగిలే కోపమే ఆ నిప్పు. 21 ఆ నిప్పులో మిమ్మల్ని వేస్తాను. నా కోపాగ్నిని బాగా రగిలేలా చేస్తాను. అప్పుడు మీరు కరగటం మొదలు పెడతారు. 22 వెండి నిప్పులో కరుగుతుంది. పనివారు శుద్ధ వెండిని వేరుచేసి దానిని భద్రపరుస్తారు. అదేమాదిరి మీరు నగరంలో కరుగుతారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు. నా కోపాన్ని మీమీద క్రుమ్మరించానని మీరు తెలుసుకొంటారు.’”
యెహెజ్కేలు యెరూషలేముకు వ్యతిరేకంగా మాట్లాడుట
23 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు, 24 “నరపుత్రుడా, ఇశ్రాయేలుతో మాట్లాడుము. ఆమె పవిత్రురాలు కాదని నీవామెతో చెప్పుము. నేను ఆ రాజ్యాల మీద కోపంగావున్నాను. అందువల్ల ఆ రాజ్యంలో వానలు పడవు. 25 యెరూషలేములోని ప్రవక్తలు కుట్రలు పన్నుతున్నారు. తను తినదల్చిన జంతువును పట్టుకున్నప్పుడు గర్జించు సింహంలా వారున్నారు. ఆ ప్రవక్తలు ఎన్నో జీవితాలను నాశనం చేశారు. వారెన్నో విలువైన వస్తువులను తీసుకున్నారు. యెరూషలేములో ఎందరో స్త్రీలు విధవలు కావటానికి వారు కారకులయ్యారు.
26 “యాజకులు నా ధర్మ బోధనలను నిజంగా గాయపర్చారు. వారు నా పవిత్ర వస్తువులను మైల చేశారు. వారు వాటిని ముఖ్యమైనవిగా పరిగణించరు. పవిత్ర వస్తువులను అతి సామాన్యమైనవిగా చూస్తారు. శుభ్రమైన వస్తువులను వారు మురికైనవిగా చూస్తారు. ఈ విషయాలను గూర్చి వారు ప్రజలకు బోధించరు. నేను నిర్దేశించిన ప్రత్యేక విశ్రాంతి రోజులను వారు గౌరవించి పాటించరు. నేను వారివల్ల తృణీకరించబడ్డాను.
27 “తాను పట్టిన జంతువును తీంటున్న తోడేలులా ఇశ్రాయేలు నాయకులు వున్నారు. వారు ధనవంతులు కావాలనే కోర్కెతో ఆ నాయకులు ప్రజలను చంపివేస్తారు.
28 “ప్రవక్తలు ప్రజలను హెచ్చరించరు. వారు నిజాన్ని దాచివేస్తారు. వారు గోడ నిర్మాణం చేయకుండా, పగుళ్లపై బంకమట్టి పూసే పనివారిలావుంటారు. వారి కండ్లకు కేవలం అబద్ధాలే కన్పిస్తాయి. భవిష్యత్తును తెలుసుకొనటానికి వారు మంత్ర తంత్రాలను వినియోగిస్తారు. అయినా వారు అబద్ధాలు మాత్రమే చెపుతారు. వారు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు’ అని అంటారు. కాని వారు అబద్ధ మాడుచున్నారు. యెహోవా వారితో మాట్లాడలేదు!
29 “సామాన్య ప్రజలు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటారు. ఒకరి నొకరు మోసపుచ్చుకుని, ఒకరి సొమ్ము నొకరు దొంగిలించుకుంటారు. వారు పేదలను, ఆసరాగా పెట్టుకొని ధనవంతులవుతారు. వారితో నివసిస్తున్న పరదేశీయులను మోసగిస్తారు. వాళ్లకు ఎప్పుడూ న్యాయంగా ఉండరు.
30 “తమ జీవిత విధానాన్ని మార్చుకొని, తమ దేశాన్ని రక్షించుకోమని నేను ప్రజలకు హితవు చెప్పాను. గోడలను పటిష్ట పర్చమని నేను ప్రజలకు చెప్పాను. బీటలు వారిన గోడలవద్ద నిలబడి, తమ నగర పరిరక్షణకు పోరాడమని చెప్పాను. కాని ఏ ఒక్కడు సహాయపడటానికి ముందుకు రాలేదు! 31 కావున వారికి నా కోపాన్ని చూపిస్తాను. వారిని సర్వనాశనం చేస్తాను! వారు చేసిన చెడుకార్యాలకు వారిని నేను శిక్షిస్తాను. ఇదంతా వారి స్వయంకృత అపరాధమే!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
సంగీత నాయకునికి: “పుష్పాల రాగం.” దావీదు కీర్తన.
69 దేవా, నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించుము.
నా నోటి వరకు నీళ్లు లేచాయి.
2 నిలబడి ఉండుటకు ఏదీ లేదు.
నేను మునిగిపోతున్నాను. క్రింద బురదలోకి దిగజారిపోతున్నాను.
లోతైనజలాల్లో నేనున్నాను.
అలలు నా చుట్టూ కొట్టుకొంటున్నాయి. నేను మునిగిపోబోతున్నాను.
3 సహాయం కోసం పిలిచి పిలిచి నేను బలహీనుడనౌతున్నాను.
నా గొంతు నొప్పిగా ఉంది.
నా కళ్లకు నొప్పి కలిగినంతవరకు
నేను నీ సహాయం కోసం కనిపెట్టి చూశాను.
4 నా తలపైగల వెంట్రుకల కంటె ఎక్కువ మంది శత్రువులు నాకున్నారు.
ఏ కారణం లేకుండానే వారు నన్ను ద్వేషిస్తున్నారు.
వారు నన్ను నాశనం చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
నా శత్రువులు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
వారు అబద్ధమాడి నేను వస్తువులు దొంగిలించానని చెప్పారు.
ఆ తరువాత నేను దొంగిలించని వాటికి నా చేత బలవంతంగా డబ్బు కట్టించారు.
5 దేవా, నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు.
నా పాపము నీ నుండి దాచి పెట్టబడలేదు.
6 నా దేవా, సర్వశక్తిమంతుడవైన యెహోవా, నా మూలంగా నీ అనుచరులను సిగ్గుపడనియ్యకుము.
ఇశ్రాయేలీయుల దేవా, నా మూలంగా నీ ఆరాధకులను ఇబ్బంది పడనీయకుము.
7 నా ముఖం సిగ్గుతో నిండి ఉంది.
నీ కోసం ఈ సిగ్గును నేను భరిస్తాను.
8 నా సోదరులు నన్ను పరాయి వానిలా చూస్తారు.
నా తల్లి కుమారులు నన్నొక విదేశీయునిలా చూస్తారు.
9 నీ ఆలయాన్ని గూర్చిన నా ఉత్సాహము నన్ను దహించుచున్నది.
నిన్ను ఎగతాళి చేసే మనుష్యుల అవమానాలను నేను పొందుతున్నాను.
10 నేను ఉపవాసం ఉండి ఏడుస్తున్నాను.
అందు నిమిత్తం వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు.
11 నా విచారాన్ని చూపించేందుకు నేను దుఃఖ బట్టలు ధరిస్తున్నాను.
ప్రజలు నన్ను గూర్చి పరిహాసాలు చెప్పుకొంటున్నారు.
12 బహిరంగ స్థలాల్లో వారు నన్ను గూర్చి మాట్లాడుకొంటున్నారు.
త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుతున్నారు.
13 నా మట్టుకైతే యెహోవా, ఇదే నీకు నా ప్రార్థన.
నీవు నన్ను స్వీకరించాలని కోరుతున్నాను.
దేవా, ప్రేమతో నీవు నాకు జవాబు ఇవ్వాలని కోరుతున్నాను.
14 బురదలో నుండి నన్ను పైకి లాగుము.
బురదలోకి నన్ను మునిగిపోనియ్యకు.
నన్ను ద్వేషించే మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
లోతైన ఈ జలాల నుండి నన్ను రక్షించుము.
15 అలలు నన్ను ముంచివేయనీయకుము.
లోతైన అగాధం నన్ను మ్రింగివేయనీయకుము.
సమాధి తన నోరును నా మీద మూసికొననీయకుము
16 యెహోవా, నీ ప్రేమ మంచిది. నీ ప్రేమ అంతటితో నాకు జవాబు ఇమ్ము.
నీ పూర్ణ దయతో నాకు సహాయం చేయుటకు మళ్లుకొనుము.
17 నీ సేవకునికి విముఖుడవు కావద్దు.
నేను కష్టంలో ఉన్నాను. త్వరపడి నాకు సహాయం చేయుము.
18 వచ్చి నా ఆత్మను రక్షించుము.
నా శత్రువులనుండి నన్ను తప్పించుము.
19 నా అవమానం నీకు తెలుసు.
నా శత్రువులు నన్ను అవమానపరిచారని నీకు తెలుసు.
వారు నన్ను కించపరచటం నీవు చూసావు.
20 సిగ్గు నన్ను కృంగదీసింది.
అవమానం చేత నేను చావబోతున్నాను.
సానుభూతి కోసం నేను ఎదురు చూశాను.
కాని ఏమీ దొరకలేదు.
ఎవరైనా నన్ను ఆదరిస్తారని నేను ఎదురుచూశాను.
కాని ఎవరూ రాలేదు.
21 వారు నాకు భోజనం కాదు విషం పెట్టారు.
ద్రాక్షారసానికి బదులుగా చిరకను వారు నాకు ఇచ్చారు.
22 వారి బల్లల మీద భోజన పానాలు పుష్కలంగా ఉన్నాయి.
విందులు జరుగుతుంటాయి. వారి భోజనాలే వారికి ఎక్కువ అగును గాక.
23 వారి కన్నులకు చీకటి కలిగి చూడలేక పోదురు గాక! వారి నడుములు ఎడతెగకుండా వణుకునట్లు చేయుము.
24 నీ కోపమును వారిపై కుమ్మరించుము.
నీ భయంకర కోపమును వారు సహించనిమ్ము.
25 వారి కుటుంబాలు, ఇండ్లు
పూర్తిగా నాశనం చేయబడునుగాక.
26 నీవు వారిని శిక్షించుము. వారు పారిపోతారు.
అప్పుడు బాధను గూర్చి వారు మాట్లాడుకుంటారు.
27 వారు చేసిన చెడ్డ పనులకు గాను వారిని శిక్షించుము.
నీవు ఎంత మంచివాడవుగా ఉండగలవో వారికి చూపించవద్దు.
28 జీవ గ్రంథంలో నుండి వారి పేర్లు తుడిచివేయుము.
మంచి మనుష్యుల పేర్లతో పాటు వారి పేర్లను గ్రంథంలో వ్రాయవద్దు.
29 నేను విచారంగాను, బాధతోను ఉన్నాను.
దేవా, నన్ను లేవనెత్తుము. నన్ను రక్షించుము.
30 దేవుని నామమును కీర్తనతో నేను స్తుతిస్తాను.
కృతజ్ఞతా గీతంతో నేను ఆయన్ని స్తుతిస్తాను.
31 ఆబోతును వధించుట, జంతువునంతటిని బలి అర్పించుటకంటె ఇది ఉత్తమము.
ఇది దేవుణ్ణి సంతోషింపజేస్తుంది.
32 పేద ప్రజలారా, మీరు దేవుని ఆరాధించుటకు వచ్చారు.
పేద ప్రజలారా, ఈ సంగతులను తెలుసుకొనేందుకు మీరు సంతోషిస్తారు.
33 నిరుపేదల, నిస్సహాయ ప్రజల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు.
యెహోవా కారాగారంలో ఉన్న తన వారిని విసర్జించడు.
34 ఆకాశమా, భూమీ, సముద్రమా,
దానిలోని సమస్తమా, యెహోవాను స్తుతించండి.
35 యెహోవా సీయోనును రక్షిస్తాడు.
యూదా పట్టణాలను యెహోవా తిరిగి నిర్మిస్తాడు.
ఆ భూమి స్వంతదారులు మరల అక్కడ నివసిస్తారు.
36 ఆయన సేవకుల సంతతివారు ఆ దేశాన్ని పొందుతారు.
ఆయన నామాన్ని ప్రేమించే ప్రజలు అక్కడ నివసిస్తారు.
© 1997 Bible League International