Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 సమూయేలు 13

అమ్నోను తామారును మోహించుట

13 దావీదుకు అబ్షాలోము అను కుమారుడొకడున్నాడు. అబ్షాలోముకు ఒక సోదరివుంది. ఆమె పేరు తామారు. ఆమె బహుసౌందర్యవతి. దావీదు యొక్క మరో కుమారుడైన అమ్నోను[a] తామారును మోహించాడు. తామారు కన్యక. అందువల్ల ఆమెను తన కామవంఛ తీర్చుకోవటానికి అమ్నోను ఆమెను ఏమీ చేయలేకపోయాడు. కాని అమ్నోను ఆమెను మిక్కిలిగా మోహించాడు. ఆమెను పొందలేక ఆమె ధ్యాసతో అమ్నోను విరక్తితో నీరసించిపోయాడు.

అమ్నోనుకు యెహోనాదాబు అనే స్నేహితుడొకడున్నాడు. అతడు షిమ్యా కుమారుడు. షిమ్యా దావీదు సోదరుడు. యెహోనాదాబు యుక్తిగల వాడు. యెహోనాదాబు అమ్నోనుతో, “రోజు రోజుకీ నీవు చిక్కిపోతున్నావు! నీవు రాజ కుమారుడవు! తినటానికి కావలసినంత ఉంది. కాని ఎందుకిలా చిక్కి శల్యమై పోతున్నావు? నాతో చెప్పు” అన్నాడు.

“నేను తామారును ప్రేమిస్తున్నాను. కాని ఆమె నా తమ్ముడైన అబ్షాలోము సహోదరి” అన్నాడు అమ్నోను.

యెహోనాదాబు అమ్నోనుకు ఇలా సలహాయిచ్చాడు: “నీవు పోయి పడుకో, జబ్బు పడిన వానిలా నటించు. అప్పుడు నీ తండ్రి నిన్ను చూసేందుకు వస్తాడు. నీవాయనతో నీ చెల్లెలైన తామారును నీకు ఆహారాన్నిచ్చి సేవ చేయటానికి పంపమను. ఆమె నీ ఎదుట ఆహారం నీవు చూస్తూవుండగా తయారు చేసి ఆమె నీకు పెడుతుందని కూడా చెప్పు.”

ఆ సలహా మేరకు అమ్నోను పక్క మీద పడుకుని జబ్బు పడిన వానిలా నటించాడు. అమ్నోనును చూడటానికి దావీదు రాజు వచ్చాడు. “దయచేసి చెల్లెలు తామారును పంపించు. నేను చూస్తూవుండగా ఆమె రెండు ప్రత్యెకమైన రొట్టెలు చేసి పెడుతుంది. ఆమె చేతిమీదుగా తింటాను” అని దావీదుతో అమ్నోను చెప్పాడు.

దావీదు తామారు ఇంటికి దూతలను పంపాడు. వారు తామారుతో ఆమె సోదరుడు, “అమ్నోను ఇంటికి వెళ్లి అతనికి కొంత ఆహారం చేసిపెట్టమని చెప్పారు.”

తన సోదరుడైన అమ్నోను ఇంటికి తామారు వెళ్లింది. అమ్నోను మంచంపై ఉన్నాడు తామారు కొంత పిండి తీసుకొని, దానిని ఆమె స్వయంగా కలిపింది. అమ్నోను చూస్తూవుండగా ఆమె కొన్ని రొట్టెలు చేసింది. తరువాత ఆమె రొట్టెలను కాల్చింది. తామారు రొట్టెలను కాల్చిన పిమ్మట పెనంలో వాటిని తీసుకొని వెళ్లి అమ్నోను ముందు పళ్లెంలో వేసింది. కాని అమ్నోను తినటానికి అంగీకరించలేదు. అమ్నోను తన సేవకులందరినీ, “అతనిని ఒంటరిగా వదిలి వెళ్లి పొమ్మన్నాడు” అమ్నోను గదినుండి సేవకులంతా బయటికి పోయారు.

అమ్నోను తామారును చెరచుట

10 అమ్నోను తామారుతో, “రొట్టెలను లోపలి గది లోనికి తీసుకొనిరా. అప్పుడు నీ చేతిమీదుగా వాటిని తింటాను” అని అన్నాడు.

తామారు లోపలి గదిలో వున్న తన సోదరుడైన అమ్నోను వద్దకు వెళ్లింది. ఆమె చేసిన రొట్టెలను తీసుకొని వెళ్లింది. 11 తన చేతుల మీదుగా తింటాడని ఆమె అమ్మోను వద్దకు వెళ్లింది. కాని అమ్నోను తామారును పట్టుకున్నాడు. “చెల్లీ, రా! నాతో కలిసి పడుకో!” అని అన్నాడు.

12 అందుకు తామారు అమ్నెనుతో ఇలా ప్రాధేయపడింది: “వద్దు, సోదరా! నన్ను బలవంతం చేయకు! ఇశ్రాయేలులో ఇలా ఎన్నటికీ జరుగకూడదు! ఈ అవమానకరమైన పని చేయకు! 13 నా కళంకాన్ని నేనెన్నడూ మాపుకోలేను. ఇశ్రాయేలీయులలో నీచకార్యాలు చేసే మూర్ఖులలో నీవొకడివై పోతావు. దయచేసి రాజుతో మాట్లాడు. నన్ను వివాహం చేసికోటానికి ఆయన నీకు అనుమతిస్తాడు.”

14 కాని అమ్నోను తామారు చెప్పే దానిని వినటానికి నిరాకరించాడు. అతడు తామారుకంటె బలవంతుడు. అతడామెను బలాత్కరించి సంగమించాడు. 15 దాని తరువాత అమ్నోను తామారును అసహ్యించుకున్నాడు. ముందు అతనామెనెంతగా ప్రేమించాడో, అంతకు మించి ఇప్పుడు అమ్నోను తామారును అసహ్యించుకున్నాడు. అమ్నోను తామారుతో, “మంచం మీది నుంచి లేచి బయటికి పొమ్మన్నాడు.”

16 అందుకు తామారు అమ్నోనుతో, “కాదు! నీవిప్పుడు మునుపటికంటె ఇంకా ఘోరమైన తప్పు చేస్తున్నావు. నీవు నన్ను పంపివేయటానికి ప్రయత్నిస్తున్నావు!” అనిఅన్నది.

కాని అమ్నోను తామారు చెప్పేది వినలేదు. 17 అమ్నోను తన సేవకుణ్ణి లోనికి పిలిచి, “ఇప్పుడే ఈ పిల్లను గదినుండి బయటికి పంపించు! బయటకు నెట్టి తలుపుకు తాళం వేయి” అని చెప్పాడు.

18 అమ్నోను సేవకుడు తామారును బయటికి గెంటి గదికి తాళం పెట్టాడు.

తామారు ఒక రంగురంగుల పొడవైన చేతులు, చాలా వదులుగా వుండే అంగీని వేసుకున్నది. ఆ రకమైన అంగీలను పెండ్లికాని రాజ కుమార్తెలు మాత్రమే వేసుకునేవారు. 19 తామారు కొద్దిగా బూడిద తీసుకొని తన నెత్తి మీద పోసుకున్నది. తన రంగురంగుల అంగీని చింపుకొన్నది. తన చేయి నెత్తిమీద పెట్టుకుని బిగ్గరగా ఏడ్చుకుంటూ పోయింది.[b]

20 తామారు సోదరుడు అబ్షాలోము తామారుతో, “నీ సోదరుడు అమ్నోను నిన్ను చెరిచినాడుగా?”[c] అన్నాడు. “అమ్నోను నీ సోదరుడు. కావున చెల్లీ, ప్రస్తుతానికి నీవు మాట్లాడక వుండు. ఇది నిన్ను విపరీతంగా సంక్షోభపెట్టకుండా[d] చూసుకో!” అది విన్న తామారు ఇక ఏమీ మట్లాడ లేదు. నాశనమైన స్త్రీలా, అమె అబ్షాలోము ఇంటి వద్దనే ఉండసాగింది.

21 ఈ వార్త దావీదు రాజు విన్నాడు. ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. 22 అబ్షాలోము అమ్నోనును అసహ్యించుకున్నాడు. అబ్షాలోము అమ్నోను నుద్దేశించి మంచిగా గాని, చెడ్డగా గాని ఏమీ అనలేదు. తన సోదరి తామారును చెరచినందుకు అమ్నోనును అసహ్యించుకున్నాడు.

అబ్షాలోము పగ తీర్చుకొనటం

23 రెండు సంవత్సరాల తరువాత అబ్షాలోము కొందరు మనుష్యులను తన గొర్రెల నుండి ఉన్ని తీయటానికి బయల్దాసోరుకు రావించాడు. ఈ కార్యక్రమం చూడటానికి రాజకుమారులందరినీ అబ్షాలోము ఆహ్వానించాడు. 24 అబ్షాలోము రాజు వద్దకు వెళ్లి, “నా గొర్రెల నుండి ఉన్ని తీయటానికి మనుష్యులను పిలిచాను. దయచేసి నీ సేవకులతో వచ్చి ఆ కార్యక్రమం తిలకించ” మని అడిగాడు.

25 “వద్దు, కుమారుడా! మేము రాము. మేమంతా వస్తే అది నీకు చాల శ్రమ అవుతుంది” అని దావీదు రాజు అబ్షాలోముతో అన్నాడు.

దావీదును రమ్మని అబ్షాలోము ప్రాధేయపడ్డాడు. దావీదు వెళ్లలేదు గాని, అతని పనిని ఆశీర్వదించాడు.

26 “నీవు రాకుంటే, దయచేసి నా సోదరుడు అమ్నోనును నాతో పంపించు” మని అబ్షాలోము అడిగాడు.

“అతడు నీతో ఎందుకు రావాలి?” అని దావీదు రాజు అడిగాడు.

27 అయినా అబ్షాలోము వినిపించుకోకుండా అదే పనిగా ప్రాధేయపడి అడిగాడు. చివరికి అమ్నోను, మిగిలిన రాజకుమారులు అబ్షాలోముతో వెళ్లటానికి ఒప్పుకున్నారు.

అమ్నోను హత్య చేయబడటం

28 అబ్షాలోము తన సేవకులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. “అమ్నోనును ఒక కంట కనిపెట్టి వుండండి. వాడు బాగా తాగిన పిమ్మట ‘అమ్నోనును చంపండి’ అంటాను. ఆ సమయంలో వానిని చంపండి! భయపడకండి నేను మీకు అజ్ఞ ఇస్తున్నాను! నిబ్బరంగా, ధైర్యంగా వుండండి” అని అబ్షాలోము సేవకులతో అన్నాడు.

29 అబ్షాలోము ఆజ్ఞ మేరకు అతని యువసేవకులు అమ్నోనును చంపివేశారు. కాని దావీదు మిగిలిన కుమారులంతా తప్పించుకున్నారు. వారిలో ప్రతి ఒక్కడూ తన కంచర గాడిదపై ఎక్కి తప్పించుకు పోయాడు.

అమ్నోను మరణవార్తను దావీదు వినటం

30 రాజకుమారులంతా మార్గంమధ్యలో వుండగానే, ఈ వార్త దావీదుకు చేరింది. “అబ్షాలోము రాజ కుమారులందరినీ చంపివేశాడనీ, ఒక్కడు కూడా మిగల లేదనీ” ఆయనకు వర్తమానం వచ్చింది.

31 దావీదు రాజు తన బట్టలు చింపుకొని నేలమీద పడ్డాడు. దావీదు చెంతనున్న తన సేవకులు కూడా విషాదసూచకంగా తమ బట్టలు కూడా చింపుకున్నారు.

32 దావీదు సోదరుడగు షిమ్యా కుమారుడు యెహోనాదాబు దావీదు వద్దకు వచ్చి ఇలా అన్నాడు: “రాజకుమారులంతా చనిపోయారని అనుకోవద్దు. చనిపోయినది అమ్నోను ఒక్కడు మాత్రమే! అబ్షాలోము ఇదంతా జరిపించాడు. 33 కారణమేమనగా అమ్నోను అబ్షాలోము చెల్లెలు తామారును చెరిచాడు. కాబట్టి అమ్నోను మాత్రము చంపబడ్డాడు.”

34 అబ్షాలోము పరారైనాడు.

నగర ప్రహరీ గోడమీద ఒక కావలివాడు నిలబడి వున్నాడు. కొండకు అవతలి ప్రక్కనుండి చాలా మంది రావటం చూశాడు. 35 అది చూసి యెహోనాదాబు దావీదు రాజుతో, “చూడండి, నేను చెప్పింది నిజమైనది. రాజ కుమారులంతా వస్తున్నారు!” అన్నాడు.

36 యెహోనాదాబు ఈ మాటలు అంటూ వుండగానే రాజకుమారులు వచ్చారు. వారు గగ్గోలు పడి ఏడుస్తూవున్నారు. దావీదు, అతని సేవకులందరూ కూడ విలపించసాగారు. వారంతా విపరీతంగా దుఃఖించారు. 37 దావీదు తన కుమారుడైన అమ్నోను కొరకు ప్రతి రోజూ దుఃఖించాడు.

అబ్షాలోము గెషూరుకు తప్పించుకు పోవటం

అబ్షాలోము తల్మయి రాజు[e] వద్దకు పారిపోయాడు. తల్మయి గెషూరుకు రాజు. అతని తండ్రి పేరు అమీహూదు. 38 అబ్షాలోము గెషూరుకు పారిపోయి అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నాడు. 39 అమ్నోను మరణం గూర్చి దావీదురాజు క్రమేపీ ఓడార్చబడ్డాడు. కాని అతడు అబ్షాలోమును గూర్చి మిక్కిలి ఆరాట పడసాగాడు.

2 కొరింథీయులకు 6

దేవునితో సహపనివారంగా మేము, దైవానుగ్రహాన్ని వృథా చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొంటున్నాము. ఎందుకంటే, దేవుడే ఈ విధంగా అన్నాడు:

“నేను సరియైన సమయానికి మీ మనవి విన్నాను.
    రక్షించే రోజున మీకు సహాయం చేసాను.”(A)

నేను చెప్పేదేమిటంటే, దేవుడు అనుగ్రహించే సమయం ఇదే. రక్షించే రోజు ఈ దినమే.

మేము చేసే సేవ చెడుపేరు పొందరాదని, మేము ఎవరి దారికి ఆటంకాలు కలిగించము. దానికి మారుగా మేము అన్ని విషయాలలో దేవుని సేవకులమని రుజువు చేసుకొంటున్నాము. ఆ గొప్ప సహనం మాకు కష్టాలు, దుఃఖాలు, అవసరాలు కలిగినప్పుడు, దెబ్బలు తిన్నప్పుడు, చెరసాలలో పడినప్పుడు, ప్రజలు ఎదురు తిరిగినప్పుడు, నిద్రాహారాలు లేక కష్టపడి పని చేసినప్పుడు, నిష్కల్మషంగా ఉండటంలో, యితర్లను అర్థం చేసుకోవటంలో, సహనం, దయ చూపటంలో, పరిశుద్ధాత్మ విషయంలో, నిజమైన ప్రేమ వ్యక్తం చేయటంలో, సత్యంగా మాట్లాడటంలో, దేవుని శక్తి విషయంలో, కుడి ఎడమ చేతుల్లో ఉన్న నీతి ఆయుధాల విషయంలో, కీర్తి వచ్చినా, అవమానాలు కలిగినా, పొగడ్తలు వచ్చినా, నిందలు కలిగినా, సత్యవంతులన్నా, మోసగాళ్ళన్నా, మేము తెలిసినా మమ్మల్ని తెలియనివాళ్ళుగా చూసినప్పుడు, చనిపోవుచున్నను చనిపోనివారిగా ఉన్నప్పుడు, కొట్టబడినా చంపబడకుండా ఉన్నప్పుడు, 10 దుఃఖంతో ఉన్నా ఆనందంగా ఉన్నప్పుడు, దరిద్రులమైనా యితరులను ధనవంతులుగా చేస్తున్నప్పుడు, మా దగ్గర ఏమీ లేకున్నా అన్నీ ఉన్నాయన్నట్టుగా ఉన్నప్పుడు మేము దేవుని సేవకులంగా రుజువు చేసుకొంటున్నాం.

11 కొరింథులోని ప్రజలారా! మేము మీతో దాచకుండా మాట్లాడి మిమ్మల్ని హృదయ పూర్వకంగా అంగీకరించాము. 12 మేము మా ప్రేమ దాచకుండా మీకు చూపాము. కాని మీరు మీ ప్రేమ మాకివ్వకుండా దాస్తున్నారు. 13 నేను మిమ్మల్ని నా బిడ్డలుగా భావించి మాట్లాడుతున్నాను. మేము మిమ్మల్ని హృదయ పూర్వకంగా అంగీకరించినట్లే, మమ్మల్ని మీరు హృదయపూర్వకంగా అంగీకరించండి.

అవిశ్వాసులతో కలిసిపోకండి

14 అవిశ్వాసులతో అంటిపెట్టుకోకండి. నీతికి, దుర్మార్గతకు పొత్తు ఏ విధంగా కుదురుతుంది? వెలుగుకూ, చీకటికి ఏమి సహవాసము? 15 క్రీస్తుకు, బెలియాలుకు మధ్య సంబంధము ఎలా ఉంటుంది? విశ్వాసం ఉన్నవానికి, విశ్వాసం లేనివానికి మధ్య స్నేహం ఎలా కుదురుతుంది? 16 దేవుని ఆలయానికి, విగ్రహాలకు ఒడంబడిక ఎలా ఉంటుంది? మనం జీవంతో ఉన్న దేవునికి ఆలయంగా ఉన్నాము. దేవుడు ఈ విధంగా అన్నాడు:

“నేను వాళ్ళ మధ్య నడుస్తూ వాళ్ళతో జీవిస్తాను. వాళ్ళు నా ప్రజగా,
నేను వాళ్ళ దేవునిగా ఉంటాము.”(B)

17 “కాబట్టి వాళ్ళను వదిలి వేరుగా ఉండండి.
అపవిత్రమైన దానికి దూరంగా ఉంటే నిన్ను స్వీకరిస్తాను
    అని ప్రభువు అన్నాడు.”(C)

18 “నేను మీకు తండ్రిగా ఉంటాను.
    మీరు నాకు కుమారులుగా, కుమార్తెలుగా ఉంటారు అని సర్వశక్తిసంపన్నుడైన ప్రభువు అంటున్నాడు.”(D)

యెహెజ్కేలు 20

ఇశ్రాయేలు దేవునినుండి తొలగిపోవుట

20 ఒక రోజు ఇశ్రాయేలు పెద్దలు యెహోవా సలహా తీసుకొనగోరి నా వద్దకు వచ్చారు. ఇది ప్రవాసంలో ఏడవ సంవత్సరం ఐదవ నెల (జులై), పదవ రోజున జరిగింది. పెద్దలు (నాయకులు) నా ముందు కూర్చున్నారు.

అప్పుడు యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడు. వారితో ఇలా చెప్పు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు, మీరంతా నా సలహా తీసుకోదలచి వచ్చారా? అలా వచ్చివుంటే, దానిని మీకు నేను యివ్వను. ఈ విషయాలు నా ప్రభువైన యెహోవా చెప్పియున్నాడు.’ నీవు వారికి తీర్పు తీర్చుతావా? నరపుత్రుడా, నీవు వారికి న్యాయ నిర్ణయం చేస్తావా? వారి తండ్రులు చేసిన భయంకర నేరాలను గూర్చి నీవు వారికి తెలియజెప్పాలి. వారికి నీవిలా చెప్పాలి, నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెబుతున్నాడు, నేను ఇశ్రాయేలును ఎంపిక చేసుకొన్నప్పుడు, యాకోబు వంశం కొరకు నా చేయెత్తి ఈజిప్టు వారికి ఒక వాగ్దానం చేశాను. అక్కడ నన్ను నేను ప్రత్యక్షపరచుకొన్నాను. నా చేయెత్తి ఇలా చేప్పాను: ‘నేను మీ దేవుడనైన యెహోవాను.’ ఆ రోజున మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చి, నేను మీకు ఇవ్వబోతున్న దేశంలోకి నడిపిస్తానని వాగ్దానం చేశాను. ఆది చాలా మంచి వస్తువులున్న దేశం.[a] దేశాలన్నిటిలోకి అది సుందరమైనది!

“‘రోత పుట్టించే విగ్రహాలన్నిటినీ పారవేయమని నేను ఇశ్రాయేలు వంశం వారికి చెప్పాను. ఈజిప్టు నుండి తేబడిన హేయమైన విగ్రహాలతో వారు కూడ హేయమైనవారుగా తయారు కావద్దని నేను చెప్పియున్నాను. నేను మీ దేవుడనైన యెహోవాను కాని వారు నాపై తిరుగుబాటు చేసి, నేను చెప్పేది వినలేదు. ఈజిప్టువారి అపవిత్రమైన విగ్రహాలను పారవేయలేదు. వారి అపవిత్ర విగ్రహాలను ఈజిప్టులో వదిలివేయలేదు. కావున నేను (దేవుడు) ఉగ్రమైన నా కోపాన్ని చూపించటానికి ఈజిప్టులోనే వారిని నాశనం చేయదల్చాను. అయినా నేను వారిని సంహరించలేదు. ఈజిప్టు నుండి నా ప్రజలను బయటకు తీసుకొని వస్తానని గతంలోనే వారు నివసిస్తున్న చోటి ప్రజలకు తెలియజేశాను. నా మంచి పేరును నేను పాడుచేయదల్చుకోలేదు. అందువల్ల ఆ అన్యప్రజల ముందు ఇశ్రాయేలును నాశనం చేయలేదు. 10 ఇశ్రాయేలు వంశాన్ని నేను ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చాను. వారిని ఎడారిలోకి నడిపించాను. 11 అక్కడ నేను వారికి నా కట్టడలను తెలియజేశాను. నా నియమ నిబంధనలన్నీ వారికి తెలియజెప్పాను. నా కట్టడలను పాటించిన వ్యక్తి జీవిస్తాడు. 12 ప్రత్యేక విశ్రాంతి రోజులన్నిటి గురించి కూడా నేను వారికి చెప్పాను. నాకు, వారికి మధ్య ఆ సెలవు రోజులు ఒక ప్రత్యేక సంకేతం. అవి నేను యెహోవానని, వారిని నా ప్రత్యేక ప్రజలుగా చేసుకున్నానని తెలియజేస్తాయి.

13 “‘అయినా ఇశ్రాయేలు వంశం ఎడారిలో నా మీద తిరుగుబాటు చేసింది. వారు నా న్యాయాన్ని పాటించలేదు. వారు నా కట్టడలను అనుసరించటానికి నిరాకరించారు. పైగా అవి ఎంతో మంచి నియమాలు. ఏ వ్యక్తి అయినా ఆ నియమాలను పాటిస్తే, అతడు జీవిస్తాడు. నేను నియమించిన ప్రత్యేక విశ్రాంతి రోజులను వారు సామాన్య రోజులుగా పరిగణించారు. అనేకసార్లు వారా విశ్రాంతి రోజులలో పనిచేశారు. నా ఉగ్రమైన కోపాన్ని వారు చవిచూడటానికి నేను వారిని ఎడారిలో నాశనం చేయ సంకల్పించాను. 14 అయినా నేను వారిని సంహరించలేదు. నేను ఇశ్రాయేలును, ఈజిప్టు నుండి వెలికి తీసుకొని రావటం ఇతర దేశాలు చూశాయి. నాకున్న మంచి పేరును నేను పాడుచేసుకోదల్చలేదు. అందువల్ల అన్యప్రజల ముందు నేను ఇశ్రాయేలును సంహరించలేదు. 15 ఎడారిలోని ఆ ప్రజలకు నేను మరొక వాగ్దానం చేశాను. వారికి నేనివ్వబోయే దేశంలోకి వారిని నేను తీసుకొని వెళ్లనని గట్టిగా చెప్పాను. ఆది పాలు, తేనె ప్రవహించే సుభిక్షమైన దేశం. అది దేశాలన్నిటిలోకీ సుందరమైన దేశం!

16 “‘ఇశ్రాయేలు ప్రజలు నా కట్టడలను పాటించ నిరాకరించారు. వారు నా విధులను అనుసరించలేదు. నేను నిర్ణయించిన విశ్రాంతి రోజులను అతి సామాన్యమైనవిగా వారు పరిగణించారు. వారి హృదయాలు ఆ అపవిత్ర విగ్రహాలమీద లగ్నమై వుండుటచేత వారీ పనులన్నీ చేశారు. 17 కాని వారి స్థితిపట్ల నేను విచారం వ్యక్తం చేశాను. వారిని నేను సంహరించలేదు. ఎడారిలో వారిని నేను సర్వనాశనం చేయలేదు. 18 నేను వారి పిల్లలతో ఎడారిలో మాట్లాడాను. నేను వారితో, “మీరు మీ తల్లిదండ్రులవలె ప్రవర్తించవద్దు. అపవిత్ర విగ్రహాల జోలికిపోయి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. వాటి ధర్మాన్ని మీరు అనుసరించవద్దు. వాటి ఆజ్ఞలను మీరు పాటించవద్దు. 19 నేనే యెహోవాను. నేను మీ దేవుణ్ణి. నా ధర్మాన్ని అనుసరించండి. ఆజ్ఞాపాలన గావించండి. నేను చెప్పే పనులు చేయండి. 20 నేను నిర్దేశించిన విశ్రాంతి రోజులు మీకు అతి ముఖ్యమైనవని చూపించండి. అవి నాకును, మీకును మధ్య ఒక ప్రత్యేక సంకేతమని గుర్తు పెట్టుకోండి. నేనే యెహోవాను. నేను మీ దేవుడనని ఆ సెలవు రోజులు మీకు సూచిస్తాయి.”

21 “‘కాని ఆ పిల్లలు నాకు వ్యతిరేకులయ్యారు. వారు నా కట్టడలను పాటించలేదు. వారు నా ఆజ్ఞలను లెక్క చేయలేదు. నేను వారికి చెప్పిన పనులు చేయలేదు. అవన్నీ మంచి న్యాయ సూత్రాలు. ఎవ్వరు వాటిని అనుసరించినా, ఆ వ్యక్తి జీవిస్తాడు. నేను నిర్దేశించిన ప్రత్యేక విశ్రాంతి రోజులను ప్రాముఖ్యంలేని వాటినిగా వారు పరిగణించారు. అందువల్ల నేను ఎడారిలో నా ఉగ్రమైన కోపం చూపటానికి వారిని సర్వనాశనం చేద్దామనుకున్నాను. 22 కాని నాకు నేనే ఆగిపోయాను. నేను ఇశ్రాయేలును ఈజిప్టు నుండి బయటకు తీసుకొని రావటం ఇతర రాజ్యాలు చూశాయి. నాకున్న మంచి పేరును నేను పాడు చేసుకోదల్చలేదు. అందువల్ల నేను ఇశ్రాయేలును అన్య జనుల ముందు సంహరించలేదు. 23 అందువల్ల ఎడారిలో వారికి నేను ఇంకొక మాట చెప్పాను. వారిని ఇతర రాజ్యాలలోకి చెదరగొడతాననీ, వారిని అనేక దేశాలకు పంపించి వేస్తాననీ చెప్పాను.

24 “‘ఇశ్రాయేలు ప్రజలు నా ఆజ్ఞలను శిరసావహించలేదు. వారు నా కట్టడలను అనుసరించటానికి నిరాకరించవారు. వారు నేనిచ్చిన ప్రత్యేక విశ్రాంతి రోజులను ముఖ్యమైనవిగా పరిగణించలేదు. వారి తండ్రుల అపవిత్ర విగ్రహాలను వారు పూజించారు. 25 అందువల్ల వారికి నేను చెడ్డ నీతిని ప్రసాదించాను. వారు బతకటానికి ఆధారం కాని ఆజ్ఞలను నేను వారికి ఇచ్చాను. 26 వారి కానుకలతో వారిని వారే మలిన పర్చుకొనేలా వారిని వదిలివేశాను. వారు తమ మొదటి సంతానాన్ని సహితం బలి ఇవ్వటం మొదలు పెట్టారు. ఈ రకంగా ఆ ప్రజలను నేను నాశనం చేస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు.’ 27 కావున, ఓ నరపుత్రుడా, ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వంశంతో మాట్లాడు. వారికిలా చేప్పు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు నాకు వ్యతిరేకంగా చెడుమాటలు పలికారు. నాపై కుట్రపన్నారు. 28 అయినా నేను వారికి ఇస్తానని వాగ్దానం చేసిన రాజ్యానికి వారిని తీసుకొని వచ్చాను. వారు కొండలను, పచ్చని చెట్లను అన్నిటినీ చూసి పూజలు చేయటానికి ఆ ప్రదేశాలకు వెళ్లేవారు. వారు బలులను, కోప కానుకలను[b] ఆ ప్రదేశాలన్నిటికీ తీసుకొని వెళ్లారు. సువాసన వేసే వారి బలులన్నీ వారు అర్పించారు. ఆ స్థలాలలో పానార్పణాలు కూడా వారు అర్పించారు. 29 వారా ఉన్నత స్థలాలకు ఎందుకు వెళ్తున్నారని నేను వారిని అడిగాను. ఆ ఆరాధనా స్థలాలన్నీ ఈనాటికీ ఉన్నత స్థలాలు[c] అనే పిలవబడుతున్నాయి.’”

30 దేవుడు ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలు ఆ చెడు కార్యాలన్నీ చేశారు. అందువల్ల ఇశ్రాయేలు వంశంవారితో మాట్లాడు. వారికి ఈ రకంగా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు. మీ పూర్వీకులు చేసిన పనులనే చేస్తూ మిమ్మును మీరు మలిన పర్చుకుంటున్నారు. మీరు వేశ్య[d] వలె ప్రవర్తిస్తున్నారు. మీ పూర్వీకులు ఆరాధించిన భయంకర దేవుళ్ళను ఆరాధించటానికి మీరు నన్ను వదిలివేశారు. 31 మీరు కూడా అవే రకమైన కానుకలు సమర్పిస్తున్నారు. మీ బూటకపు దేవతలకు కానుకగా మీ పిల్లలను అగ్నిలో పడవేస్తున్నారు. ఈనాడు ఆ రోత విగ్రహాలను ఆశ్రయించి మిమ్మల్ని మీరు మరింత మలిన పర్చుకుంటున్నారు! నేను మిమ్మల్ని నా వద్దకు రానిచ్చి, నా సలహా తీసుకోనివ్వాలని మీరు నిజంగా అనుకుంటున్నారా? నేను ప్రభువును; యెహోవాను. నా జీవ ప్రమాణంగా మీ ప్రశ్నలకు సమాధానమివ్వను. మీకు సలహా ఇవ్వను! 32 ఇతర రాజ్యాల మాదిరిగా ఉండాలని కోరుకుంటున్నట్లు మీరు అంటూ ఉంటారు. కానీ మీ అభిప్రాయాలు, ఆశలూ ఎప్పటికీ నెరవేరవు. ఇతర జనాంగముల ప్రజల మాదిరిగా మీరు నివసిస్తున్నారు. కొయ్యముక్కలను, రాతి ముక్కలను (విగ్రహాలు) మీరు కొలుస్తారు!’”

33 నా ప్రభువైన యెహోవా ఇలా చెప్పుతున్నాడు, “నా జీవ ప్రమాణంగా, రాజునై మిమ్మల్ని పరిపాలిస్తానని వాగ్దానం చేస్తున్నాను. కాని నా శక్తివంతమైన హస్తాన్ని ఎత్తి మిమ్మల్ని శిక్షిస్తాను. మీపట్ల నా కోపాన్ని చూపిస్తాను! 34 మిమ్మల్నందరినీ ఈ అన్యదేశాల నుండి వెలికి తెస్తాను. ఈ రాజ్యాలకు నేను మిమ్మల్ని చెదర గొట్టాను. కాని మిమ్మల్నందరినీ కూడదీసి, ఈ రాజ్యాల నుండి తిరిగి తీసుకొని వస్తాను. అయినా నా బలమైన హస్తాన్ని ఎత్తి మిమ్మల్ని శిక్షిస్తాను. మీమీద నాకు గల కోపాన్ని వెల్లడిస్తాను! 35 నేను గతంలో చేసినట్లు మిమ్మల్ని ఒక ఎడారికి నడిపిస్తాను. కాని ఇది అన్యదేశీయులు నివసించే ఒక స్థలం. అక్కడ నేను ముఖాముఖిగా మీతో వ్యాజ్యెమాడుతాను. 36 గతంలో ఈజిప్టు వద్దగల ఎడారిలో నేను మీ పూర్వికులకు తీర్పు తీర్చినట్లు, ఇప్పుడిక్కడ మీకు న్యాయ నిర్ణయం చేస్తాను.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

37 “మీరు నేరస్థులని తీర్పు ఇచ్చి, ఒడంబడిక[e] ప్రకారం మిమ్మల్ని శిక్షిస్తాను. 38 నాపై తిరుగుబాటు చేసి, నాపట్ల పాపం చేసిన ప్రజలందరినీ నేను తొలగిస్తాను. మీ స్వదేశాన్నుండి వారందరినీ తొలగిస్తాను. వారు మరెన్నడూ ఇశ్రాయేలు రాజ్యానికి తిరిగిరారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు.”

39 ఓ ఇశ్రాయేలు వంశములారా, నా ప్రభువైన యెహోవా ఇప్పుడు ఈ విషయాలు చెప్పుతున్నాడు, “ఏ వ్యక్తి అయినా తన రోత విగ్రహాలను పూజింపగోరితే, అతనిని వెళ్లి వాటిని పూజించనీయండి. కాని, తరువాత నానుండి ఏదైనా సలహా మీకు వస్తుందని మాత్రం మీరు అనుకోవద్దు! మీరు నా పేరు ఇక ఏ మాత్రం పాడుచేయలేరు! ముఖ్యంగా మీరు మీ నీచ విగ్రహాలకు కానుకలను సమర్పించినా అది జరగదు.”

40 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “ప్రజలు నన్ను సేవించటానికి ఇశ్రాయేలులో ఎత్తైన పర్వతంగా పేరొందిన నా పవిత్ర పర్వతం వద్దకు రావాలి! ఇశ్రాయేలు వంశంవారంతా తమ స్వంత భూమి మీదికి వస్తారు. వారు తమ దేశంలో ఉంటారు. మీరు నా సలహా కోరి రావలసిన స్థలం అదే. మీరు ఆ స్థలానికి నాకు అర్పణలు ఇవ్వటానికి రావాలి. ఆ స్థలంలో మీ పంటలో తొలి భాగాన్ని నా కొరకు తేవాలి. ఆ స్థలంలో మీ పవిత్ర కానుకలు నాకు సమర్పించాలి. 41 అప్పుడు మీరు సమర్పించే బలుల సువాసనలతో నేను సంతృప్తి చెందుతాను. ఇదంతా నేను మిమ్మల్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు జరుగుతుంది. నేను మిమ్మల్ని అనేక దేశాలకు చెదరగొట్టాను. అయినా నేను మిమ్మల్నందరినీ కూడగట్టి, మళ్లీ నా ప్రత్యేక ప్రజగా స్వీకరిస్తాను. పైగా ఆయా దేశాలన్నీ ఇదంతా చూస్తాయి. 42 అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు. నేను మిమ్మల్ని ఇశ్రాయేలు రాజ్యానికి తీసుకొని వచ్చినప్పుడు ఇది మీరు తెలుసుకొంటారు. అది నేను మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన రాజ్యం. 43 ఆ రాజ్యంలో మిమ్మల్ని మలినపర్చిన వస్తువులను, మీరు చేసిన చెడుకార్యాలను మీరు గుర్తుకు తెచ్చుకుని సిగ్గుపడతారు. 44 ఇశ్రాయేలు వంశములారా, మీరు ఎన్నో అకృత్యాలు చేశారు. ఆ చెడుకార్యాలకు ఫలితంగా మీరు నాశనం చేయబడాలి. కాని నాకున్న మంచి పేరు కాపాడుకోవటానికి, మీకు నిజంగా అర్హమైన శిక్ష విధించవలసి వుండి కూడా నేను విధించను. నేనే యెహోవానని పిమ్మట మీరు తెలుసుకొంటారు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

45 మళ్లీ యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఈ విధంగా చెప్పాడు: 46 “నరపుత్రుడా, యూదా రాజ్యం దక్షిణాన వున్న నెగెవు వైపు చూడు. నెగెవు అరణ్యానికి[f] వ్యతిరేకంగా మాట్లాడు. 47 నెగెవు అరణ్యానికి ఇలా చెప్పు, ‘యెహోవా వాక్కు విను. నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. చూడు, నీ అరణ్యంలో అగ్ని రగల్చటానికి నేను సిద్దంగా ఉన్నాను. ప్రతి పచ్చని చెట్టునూ, ప్రతి ఎండిన చెట్టునూ అగ్ని దహించి వేస్తుంది. అలా కాల్చివేసే ఆ నిప్పు ఆర్పబడదు. దక్షణం నుండి ఉత్తరం వరకు గల ప్రదేశమంతా కాల్చివేయ బడుతుంది. 48 అప్పుడు ప్రజలంతా యెహోవానైన నేనే ఈ అగ్నిని ప్రజ్వలింపచేసినట్లు తెలుసుకుంటారు. ఆ నిప్పు ఆర్పివేయబడదు.’”

49 పిమ్మట నేను (యెహెజ్కేలు) ఇలా అన్నాను: “ఓ నా ప్రభువైన యెహోవా! నేనా విషయాలు ప్రజలకు చెప్తే నేనేవో కాకమ్మ కథలు వారికి చెబుతున్నానని అనుకుంటారు. అది నిజంగా సంభవిస్తుందని వారను కోరు!”

కీర్తనలు. 66-67

సంగీత నాయకునికి: ఒక స్తుతి కీర్తన.

66 భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము!
మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి.
    స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి:
    దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.
సర్వలోకం నిన్ను ఆరాధించుగాక.
    నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక.

దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి.
    అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
సముద్రాన్ని[a] ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు.
    ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు.[b]
    అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.
దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు.
    సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు.
    ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు.

ప్రజలారా, మా దేవుని స్తుతించండి.
    స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు.
    దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.
10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.
11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు.
    భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.
12 మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు.
    అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు.
    కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.
13-14 కనుక నేను నీ ఆలయానికి బలులు తీసుకొస్తాను.
నేను కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నేను సహాయం కోసం అడిగాను.
    నేను నీకు చాల వాగ్దానాలు చేసాను.
ఇప్పుడు, నేను వాగ్దానం చేసినవాటిని నీకు ఇస్తున్నాను.
15     నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను.
    నేను నీకు పొట్టేళ్లతో ధూపం[c] ఇస్తున్నాను.
    నేను నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను.

16 దేవుని ఆరాధించే ప్రజలారా, మీరంతా రండి.
    దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో చెబుతాను.
17 నేను ఆయన్ని ప్రార్థించాను.
    నేను ఆయన్ని స్తుతించాను.
18 నా హృదయం పవిత్రంగా ఉంది.
    కనుక నా యెహోవా నా మాట విన్నాడు.
19 దేవుడు నా మొరను విన్నాడు.
    దేవుడు నా ప్రార్థన విన్నాడు.
20 దేవుని స్తుతించండి!
    దేవుడు నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు.
    దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు!

సంగీత నాయకునికి: వాయిద్యాలతో స్తుతి కీర్తన.

67 దేవా, మమ్ములను కనికరించి, మమ్ములను ఆశీర్వదించుము.
    దయచేసి మమ్ములను స్వీకరించుము.

దేవా, భూమి మీద ప్రతి మనిషినీ నిన్ను గూర్చి తెలుసుకోనిమ్ము.
    నీవు మనుష్యులను ఎలా రక్షిస్తావో ప్రతి దేశం నేర్చుకోనిమ్ము.
దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక!
    మనుష్యులంతా నిన్ను స్తుతించెదరుగాక!
దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక!
    ఎందుకంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు
    మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు.
దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరు గాక!
    మనుష్యులంతా నిన్ను స్తుతించెదరు గాక!
దేవా, మా దేవా, మమ్మల్ని దీవించుము.
    మా భూమి మాకు గొప్ప పంట ఇచ్చేటట్టుగా చేయుము.
దేవుడు మమ్మల్ని దీవించుగాక.
    భూమిమీద వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International