M’Cheyne Bible Reading Plan
నాతాను దావీదుతో మాట్లాడటం
12 యెహోవా నాతాను ప్రవక్తను దావీదు వద్దకు పంపాడు. నాతాను దావీదు వద్దకు వచ్చి ఇలా చెప్పాడు: “ఒక నగరంలో ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకడు ధనవంతుడు. రెండవవాడు దరిద్రుడు. 2 ధనవంతుని వద్ద చాలా గొర్రెలు, పశువులు వున్నాయి. 3 కాని పేదవానివద్ధ తాను కొనుక్కున్న ఒక ఆడ గొర్రెపిల్ల తప్ప మరేమీ లేదు. ఆ గొర్రెపిల్లను పేదవాడు సాకాడు. ఆ పేదవానితో పాటు, అతని పిల్లలతో పాటు ఆ గొర్రెపిల్ల కూడ పెరిగింది. ఆ గొర్రెపిల్ల పేదవాని కంచంలో తిని, వాని గిన్నెలో నీళ్లు తాగింది. ఆ పేదవాని రొమ్ము మీద గొర్రెపిల్ల పడుకొని నిద్రపోయేది. పేదవానికి ఆ గొర్రెపిల్ల ఒక కూతురిలా వుండేది.
4 “ఇదిలా వుండగా ఒక యాత్రికుడు ధనవంతుని చూడటానికి ఆ నగరంలో ఆగాడు. ధనికుడు ఆ యాత్రికునికి ఆహారం ఇవ్వపోయాడు. కాని ఆ యాత్రికునికి ఆహారంగా తనకున్న గొర్రెలలో గాని, పశువులలో గాని దేనినీ చంపటానికి ధనికుడు ఇష్టపడలేదు. దానికి బదులు, ధనికుడు ఆ నగరంలో ఉన్న పేదవాని గొర్రెపిల్లను తీసుకొని, చంపి ఆ యాత్రికునికి ఆహారంగా వండించాడు.”
5 ఇది వింటున్న దావీదుకు ధనికునిపై విపరీతంగా కోపం వచ్చింది. “యెహోవా జీవము తోడుగా ఈ పని చేసిన ఆ వ్యక్తి నిశ్ఛయంగా చావవలసిందే! 6 ఆ గొర్రె పిల్ల విలువకు నాలుగింతలు ధనికుడు చెల్లించాలి. ఎందుకంటే వాడు ఈ భయంకరమైన పని చేశాడు. పైగా వాడు దయలేనివాడు!” అని దావీదు నాతానుతో అన్నాడు.
నాతాను దావీదుతో అతని పాపాన్ని తెలియజెప్పటం
7 “ఆ వ్యక్తివి నీవే అన్నాడు నాతాను దావీదుతో. ఇశ్రాయేలు దేవుడైన యోహోవా నీ విషయంలో ఇలా అంటున్నాడని నాతాను దావీదుతో చెప్పాడు: నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా నేను అభిషిక్తం చేశాను. సౌలునుండి నిన్ను కాపాడాను. 8 అతని కుటుంబాన్ని, భార్యలను నీవు తీసుకొనేలా చేశాను. పైగా ఇశ్రాయేలు పైన, యూదా పైన రాజుగా నియమించాను. ఇవన్నీ చాలవన్నట్లు, నీకు ఇంకా చాలా ఇచ్చాను 9 కావున ఎందువల్ల యెహోవా ఆజ్ఞను తిరస్కరించావు? దేవుడు చెడ్డదని చెప్పిన దానిని ఎందుకు చేశావు? హిత్తీయుడైన ఊరియాను నీవు కత్తితో చంపించావు. అతని భార్యను నీ భార్యగా చేసుకున్నావు. అవును; నీవు ఊరియాను అమ్మోనీయుల కత్తితో చంపావు! 10 కావున, కత్తి నీ కుటుంబాన్ని వదిలిపెట్టదు. హిత్తీయుడు ఊరియా భార్యను నీవు చేపట్టావు. ఈ రకంగా నీవు నన్ను లక్ష్య పెట్టలేదని నిరూపించుకున్నావు.”
11 “నేను నీకు ఆపద తీసుకువస్తున్నాను. నీ కుటుంబంలో నుండే ఈ ఆపద వస్తుంది. నీ భార్యలందరినీ నీ నుండి నేను తీసివేసి, నీకు అతి సన్నిహితుడైన వానికొకనికి ఇస్తాను. ఆ వ్యక్తి నీ భార్యలందరితో కలియగా, అది అందరికీ తెలుస్తుంది.[a] 12 నీవు బత్షెబతో రహస్యంగా కూడినావు. కాని నేను చేసే పని ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలుస్తుంది.”[b]
13 నాతానుతో, “యెహోవా పట్ల నేను పాపం చేశాను” అని దావీదు చెప్పాడు.
అప్పుడు నాతాను దావీదుతో ఇలా అన్నాడు, “యెహోవా నీకు పాపవిమోచనం చేశాడు. నీవు చంపబడవు. 14 కాని నీవు చేసిన ఈ పాపకార్యంవల్ల శత్రువులు నీ యెహోవాని అసహ్యించుకునేలా చేశావు. అందువల్ల నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు.”
దావీదు బత్షెబల శిశువు మరణించటం
15 పిమ్మట నాతాను ఇంటికి వెళ్లిపోయాడు. ఊరియాభార్య ద్వారా దావీదుకు పుట్టిన బిడ్డ తీవ్రంగా జబ్బు పడేలా యెహోవా చేశాడు. 16 దావీదు బిడ్డ కొరకు దేవుని ప్రార్థించాడు. దావీదు తినటానికి, తాగటానికి నిరాకరించాడు. అతను తన ఇంట్లోకివెళ్లి లోపలే వుండి పోయాడు. రాత్రంతా నేలమీదే పడుకొని వుండిపోయాడు.
17 దావీదు కుటుంబంలో ముఖ్యులైన వారు వచ్చి దావీదును నేలమీద నుండి లేపటానికి ప్రయత్నించారు. కాని దావీదు లేవ నిరాకరించాడు. వారితో కలిసి భోజనం చేయటానికి కూడ దావీదు నిరాకరించాడు. 18 ఏడవ రోజున శిశువు మరణించింది. శిశువు మరణించిందని దావీదుతో చెప్పటానికి సేవకులు భయపడ్డారు. ఒకరితో ఒకరు వారిలా అనుకోసాగారు, “చూడండి, బిడ్డ బ్రతికివుండగా మనం అతనితో మాట్లాడాలని ప్రయత్నం చేశాము. కాని అతను మన మాట వినలేదు. ఇప్పుడు బిడ్డ మరణం గురించి మనం తెలియ జేస్తే, అతడు తన ప్రాణానికి ముప్పు వాటిల్లే ఏ పనికైనా పాల్పడవచ్చు!”
19 కాని దావీదు తన సేవకులు గుసగుసలాడుకోవటం గమనించి, బిడ్డ మరణించి వుండవచ్చని ఊహించాడు. “బిడ్డ చనిపోయాడా?” అని దావీదు సేవకులను అడిగాడు.
“అవును, చనిపోయాడు” అని సేవకులు అన్నారు.
20 దావీదు నేలమీద నుంచి లేచాడు. కాళ్లు చేతులు కడుక్కొని, బట్టలు మార్చుకొని, యెహోవాని ప్రార్థించటానికి ఆలయానికి వెళ్లాడు. తరువాత ఇంటికి వెళ్లి, తినటానికి ఆహారాన్ని అడిగాడు. సేవకులు కొంత ఆహారాన్ని ఇవ్వగా, అతడు తిన్నాడు.
21 దావీదు సేవకులు అతనితో ఇలా చెప్పారు, “నీవిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? బిడ్డ బ్రతికి వుండగా నీవు తినటానికి నిరాకరించావు. నీవు ఏడ్చావు. కాని బిడ్డ చనిపోగానే, లేచి భోజనం చేశావు.”
22 అందుకు దావీదు ఇలా చెప్పాడు: “బిడ్డ బ్రతికివుండగా నేను తినలేదు. ఏడ్చాను. ఎందువల్లనంటే యెహోవా నన్ను కనికరించి బిడ్డను బ్రతికించవచ్చు! ఎవరికి తెలుసు! అనుకున్నాను. 23 కాని ఇప్పుడు బిడ్డ చనిపోయాడు. కావున ఇప్పుడు నేనెందుకు తినటానికి నిరాకరించాలి? నేను బిడ్డను తిరిగి బతికించుకొనగలనా? లేదు! ఏదో ఒక రోజున నేనే వాని దగ్గరకు వెళతాను. అంతేగాని వాడు నా వద్దకు తిరిగి రాలేడు.”
సొలొమోను జన్మించటం
24 దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చాడు. అతడామెతో కలిసి వుండి సంగమించగా, ఆమె గర్భవతి అయింది. ఆమెకు మరొక కుమారుడు జన్మించాడు. దావీదు వానికి సొలొమోను అని పేరు పెట్టాడు. యెహోవా సొలొమోనును ప్రేమించాడు. 25 ప్రవక్త నాతాను ద్వారా యెహోవా తన సందేశం పంపాడు. నాతాను వచ్చి సొలొమోనుకు యదీద్యా[c] అని నామకరణం చేశాడు. దేవుని ఆజ్ఞానుసారం నాతాను అలా చేశాడు.
దావీదు రబ్బాను పట్టుకొనటం
26 యోవాబు అమ్మోనీయుల నగరంపై యుద్ధం చేశాడు. అతడు రాజధాని నగరాన్ని పట్టుకున్నాడు. 27 యోవాబు దావీదు వద్దకు దూతలను పంపి ఇలా చెప్పమన్నాడు: “నేను రబ్బాపై యుద్ధం నిర్వహించాను. నేను జలనగరాన్ని పట్టుకున్నాను. 28 ఇప్పుడు నీవు మిగిలిన సైన్యాన్ని కూడగట్టుకొని వచ్చి రబ్బానగరాన్ని ముట్టడించు. దానిని నాకై నేను వశపర్చుకునేలోగా నీవు వచ్చి పట్టుకో. నేను గనుక వశపర్చుకుంటే, ఆ నగరం నా పేరు మీదుగా పిలువబడుతుంది!”
29 దావీదు తన సైన్యాన్ని కూడదీసికొని రబ్బా నగరానికి వెళ్లాడు. యుద్ధం చేసి ఆ నగరాన్ని వశపర్చుకున్నాడు. 30 దావీదు ఆ రాజు తలనుండి[d] కిరీటాన్ని తీసుకున్నాడు. అది బంగారు కిరీటం. దాని బరువు సుమారు డెబ్బది అయిదు కాసులు. ఈ కిరీటంలో విలువైన వజ్రాలు పొదగబడ్డాయి. ఆ కిరీటాన్ని సైనికులు దావీదు తలపై వుంచారు. ఆ నగరం నుండి దావీదు అనేక విలువైవ వస్తువులను కొల్లగొట్టుకుపోయాడు.
31 అంతేగాదు, దావీదు రబ్బా నగర వాసులను బయటకు తీసుకొని వచ్చాడు. వారందరినీ రంపములతోను, పలుగులతోను, గొడ్డళ్లతోను పని చేయించాడు. వారందరినీ ఇటుకలతో కట్టడాలను నిర్మించేలా చేశాడు. అమ్మోనీయుల నగరాలన్నిటిలో దావీదు ఇలాగే చేయించాడు. తరువాత దావీదు తన సైన్యంతో యెరూషలేముకు వెళ్లిపోయాడు.
5 భూలోక నివాసులమైన మనము నివసిస్తున్న ఈ గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో మనము నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు. 2 పరలోకపు గుడారాన్ని ధరించాలని ఆశిస్తూ మనము ఇంకా మూల్గుతూ ఉన్నాము. 3 మనము ఆ శరీరాన్ని ధరించాక మనకు నగ్నత ఉండదు. 4 ఈ గుడారంలో నివసిస్తున్నంతకాలం మనం పెద్దభారంతో మూల్గుతూ ఉంటాము. ఈ భౌతిక శరీరాన్ని ధరించిన మనము ఈ జీవితం యొక్క అంతంలో పరలోకపు శరీరాన్ని ధరించుకొంటాము. 5 ఆ శరీరాన్ని ధరించటానికి దేవుడు మనల్ని సిద్ధం చేసాడు. దానికి హామీగా తన ఆత్మను మనకు ఇచ్చాడు.
6 అందువల్ల మనము ఈ శరీరంలో నివాసమున్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు ఖండితంగా తెలుసు. 7 మనము దృష్టి ఉండటం వల్ల జీవించటం లేదు. విశ్వాసం ఉండటం వల్ల జీవిస్తున్నాము. 8 మనమీ శరీరానికి దూరమై, ప్రభువుతో నివసించాలని కోరుకొంటున్నాము. మనకు ఆ ధైర్యం ఉంది. 9 అందువల్ల మనమీ శరీరంలో నివసిస్తున్నా లేక దానికి దూరంగా ఉన్నా ఆయన్ని ఆనంద పరచటమే మన ఉద్దేశ్యం. 10 ఎందుకంటే మనమంతా క్రీస్తు సింహాసనం ముందు నిలబడవలసి వస్తుంది. అప్పుడు, ఈ శరీరంలో మనముండగా చేసిన మంచికి, చెడుకు తగిన విధంగా ప్రతి ఒక్కడూ ప్రతిఫలం పొందుతాడు.
దేవునితో సమాధానం
11 కనుక ప్రభువుకు భయపడుట అంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది. కనుక ఆయన సందేశాన్ని అంగీకరించుమని ఇతరులను కూడా ఒత్తిడి చేస్తాము. మా గురించి దేవునికి బాగా తెలుసు. మీ హృదయాలకు కూడా ఈ విషయం తెలుసునని నా విశ్వాసం. 12 మా గురించి మేము చెప్పుకోవాలని లేదు. మా విషయంలో గర్వించటానికి మీకు అవకాశం యిస్తున్నాము. అప్పుడు మీరు మనిషి గుణాన్ని కాక, అతని వేషం చూసి పొగిడేవాళ్ళకు సమాధానం చెప్పగలుగుతారు. 13 మాకు మతి పోయిందా? ఔను, అది దేవుని కోసం పోయింది. మాకు మతి ఉందా? ఔను అది మీకోసం ఉంది. 14 క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తుంది. ఎందుకంటే ప్రజల కోసం ఆయన మరణించాడు. అందువల్ల అందరూ ఆయన మరణంలో భాగం పంచుకొన్నారు. ఇది మనకు తెలుసు. 15 ఆయన అందరి కోసం మరణించాడు. కనుక జీవిస్తున్నవాళ్ళు యిక మీదట తమ కోసం జీవించరాదు. మరణించి ప్రజలకోసం మళ్ళీ బ్రతికింపబడినవాని కోసం జీవించాలి.
16 ఇకనుండి మేము ఎవ్వరినీ లౌకికంగా పరిగణించము. ఒకప్పుడు మనం క్రీస్తును లౌకికంగా పరిగణించాము, గాని ఇప్పుడు అలా కాదు. ఆయన్ని గురించి మా అభిప్రాయం మారిపోయింది. 17 క్రీస్తులో ఐక్యత పొందినవాడు క్రొత్త జీవితం పొందుతాడు. పాత జీవితం పోయి క్రొత్త జీవితం వస్తుంది. 18 ఇదంతా దేవుడు చేసాడు. శత్రువులుగా ఉన్న మనల్ని క్రీస్తు ద్వారా తన మిత్రులుగా చేసుకొన్నాడు. ఇతరులను కూడా తన మిత్రులుగా చేసే బాధ్యత మనపై ఉంచాడు. 19 క్రీస్తు ద్వారా దేవుడు అందరినీ తన మిత్రులుగా చేసుకొనుచున్నాడన్నదే మా సందేశం. దేవుడు ప్రజలు చేసిన పాపాలను క్షమిస్తాడు. వాళ్ళను తన మిత్రులుగా ఏ విధంగా చేసుకొంటాడన్న సందేశం చెప్పాడు. 20 మేము క్రీస్తు రాయబారులం. దేవుడే మా ద్వారా ఈ విజ్ఞప్తి చేస్తున్న విషయం గ్రహించండి. క్రీస్తు పక్షాన దేవునితో సమాధానపడమని మిమ్మల్ని వేడుకొంటున్నాము. 21 క్రీస్తు పాపం చెయ్యలేదు. కాని మనకోసం దేవుడు ఆయన్ని పాపంగా చేసాడు. మనం క్రీస్తులో ఐక్యత పొంది దేవుని దృష్టిలో నీతిమంతులంగా ఉండాలని ఇలా చేసాడు.
ఇశ్రాయేలును గూర్చి విషాద గీతం
19 దేవుడు నాకు ఈ విధంగా చెప్పాడు: “ఇశ్రాయేలు నాయకులను గురించి నీవు ఈ విషాద గీతం ఆలపించాలి:
2 “‘నీ తల్లి ఆడసింహంలా,
మగసింహాల మధ్య పడుకొని ఉంది.
ఆమె యౌవ్వనంలో ఉన్న మగ సింహాలతో పడుకొని ఉంది.
దానికి చాలా మంది పిల్లలున్నారు.
3 ఆ సింహపు పిల్లల్లో ఒకటి లేచింది.
అది బలమైన యువసింహంలా తయారయ్యింది.
అది తన ఆహారాన్ని వేటాడటం నేర్చుకుంది.
అది ఒక మనుష్యుని తినేసింది.
4 “‘అది గర్జించటం ప్రజలు విన్నారు.
తాము పన్నిన బోనులో దానిని పట్టుకున్నారు!
దాని నోటికి గాలం తగిలించారు.
వారా కొదమ సింహాన్ని ఈజిప్టుకు తీసుకొని వెళ్లారు.
5 “‘తల్లి తన యువసింహం నాయకత్వం వహిస్తుందనుకుంది.
కాని ఆమె ఆశలు అడియాశలయ్యాయి.
అందువల్ల ఆమె తన పిల్లల్లో మరో దానిని తీసుకుంది.
దానిని యువ సింహంలా తీర్చిదిద్దింది.
6 అది పెద్ద సింహాలతో కలిసి వేటకెళ్లింది.
అది భయంకర సింహంలా తయారయ్యింది.
అది తన ఆహారం వేటాడ నేర్చుకుంది.
అది ఒక మనుష్యుని చంపి తినివేసింది.
7 ఆది రాజభవనాల మీద దాడి చేసింది. అది నగరాలను నాశనం చేసింది.
దాని గర్జన విన్న ప్రతివాడూ నోట మాట లేక నివ్వెరపోయాడు.
8 అప్పుడు తనచుట్టూ నివసిస్తున్నవారు దానికై వలపన్నారు.
అది వారి వలలో చిక్కిపోయింది.
9 వారు దానికి కొక్కీలు వేసి బంధించారు.
వారు దానిని తమ బోనులో ఇరికించారు.
వారు దానిని బబులోను రాజు వద్దకు తీసుకొని పోయారు.
అందువల్ల ఇశ్రాయేలు పర్వతాలలో
ఇప్పుడు మీరు గర్జన వినలేరు.
10 “‘మీ తల్లి నీటి ప్రక్క
నాటిన ద్రాక్షాలతలాంటిది.
దానికి నీరు పుష్కలంగా ఉంది.
అది చాలా ఫలభరితమైన దళమైన ద్రాక్షా తీగలతో పెరిగింది.
11 ఆ పిమ్మట దానికి కొన్ని పెద్ద కొమ్మలు పెరిగాయి.
అవి కొన్ని చేతికర్రల్లా ఉన్నాయి.
ఆ కొమ్మలు రాజదండాల్లా ఉన్నాయి.
ఆ ద్రాక్షాలత అలా, అలా పొడుగ్గా,
చాలా కొమ్మలతో మేఘాలను అంటేలా పెరిగింది.
12 కాని ఆ ద్రాక్షా చెట్టు వేర్లతో పెరికివేయబడి,
నేలమీద కూల్చి వేయబడింది.
తూర్పుదిక్కు వేడిగాడ్పులు వీయగా దాని పండ్లు ఎండి పోయాయి.
దాని పెద్ద కొమ్మలు విరిగి పోయాయి. అవి అగ్నిలో వేయబడ్డాయి.
13 “‘ఇప్పుడా ద్రాక్ష మొక్క ఎడారిలో నాటబడింది.
అది నీరులేక, దాహం పుట్టించే ప్రాంతం.
14 దాని పెద్ద కొమ్మ నుండి నిప్పు చెలరేగింది.
నిప్పు దాని రెమ్మలను, పండ్లను నాశనం చేసింది.
అందుచే బలమైన చేతికర్రగా లేదు;
రాజదండముగా లేదు’
ఇది ఒక విషాద గీతం. అది వినాశనాన్ని గూర్చి పాడబడింది.”
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
64 దేవా, నా ప్రార్థన ఆలకించుము.
నా శత్రువులను గూర్చి నేను భయపడుతున్నాను. నా ప్రాణమును కాపాడుము.
2 నా శత్రువుల రహస్య పన్నాగాల నుండి నన్ను కాపాడుము.
ఆ దుర్మార్గుల బారి నుండి నన్ను దాచి పెట్టుము.
3 వారు నన్ను గూర్చి ఎన్నో చెడ్డ అబద్ధాలు చెప్పారు.
వారి నాలుకలు వాడిగల కత్తులవలె ఉన్నాయి, వారి కక్ష మాటలు బాణాల్లా ఉన్నాయి.
4 వారు దాక్కొని ఆ తరువాత తమ బాణాలను సామాన్యమైన ఒక నిజాయితీపరుని మీద వేస్తారు.
అతడు దానిని గమనించకముందే అతడు గాయ పరచబడతాడు.
5 అతన్ని ఓడించుటకు వారు చెడ్డ పనులు చేస్తారు.
వారు వారి ఉరులను పెడతారు. “వారిని ఎవరూ పట్టుకోరని, చూడరని” వారనుకొంటారు.
6 మనుష్యులు చాలా యుక్తిగా ఉండగలరు.
మనుష్యులు ఏమి తలస్తున్నారో గ్రహించటం ఎంతో కష్టం.
7 కాని దేవుడు తన “బాణాలను” వారిమీద వేయగలడు.
అది వారు గమనించకముందే దుర్మార్గులు గాయపరచబడతారు.
8 దుర్మార్గులు ఇతరులకు కీడు చేయుటకు పథకం వేస్తారు.
కాని దేవుడు వారి పథకాలను పాడుచేయగలడు.
ఆ కీడు వారికే సంభవించేలా ఆయన చేయగలడు.
అప్పుడు వారిని చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో వారి తలలు ఊపుతారు.
9 దేవుడు చేసిన వాటిని మనుష్యులు చూస్తారు.
వారు దేవుని క్రియలను ప్రకటిస్తారు.
అప్పుడు ప్రతి ఒక్కరూ దేవుని గూర్చి ఎక్కువగా తెలిసికొంటారు.
ఆయనకు భయపడి గౌరవించడం వారు నేర్చుకొంటారు.
10 మంచివాళ్లు యెహోవాయందు సంతోషంగా ఉండాలి.
వారు ఆయన్ని నమ్ముకోవాలి.
మంచి మనుష్యుల్లారా, మీరంతా యెహోవాను స్తుతించండి.
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
65 సీయోను మీద ఉన్న దేవా, నేను నిన్ను స్తుతిస్తాను.
నేను వాగ్దానం చేసిన వాటిని నేను నీకు ఇస్తాను.
2 నీవు చేసిన వాటిని గూర్చి మేము చెబుతాము మరియు నీవు మా ప్రార్థనలు వింటావు.
నీ దగ్గరకు వచ్చే ప్రతి మనిషి యొక్క ప్రార్థనలూ నీవు వింటావు.
3 మా పాపాలు మేము భరించలేనంత భారమైనప్పుడు,
ఆ పాపాలను నీవు తీసివేస్తావు.
4 దేవా, నీ ప్రజలను నీవు ఏర్పరచుకొన్నావు.
నీ ఆలయానికి వచ్చి నిన్ను ఆరాధించుటకు నీవు మమ్మల్ని ఏర్పాటు చేసికొన్నావు.
మాకు చాలా సంతోషంగా ఉంది!
నీ ఆలయంలో నీ పరిశుద్ధ ఇంటిలో మాకన్నీ అద్భుత విషయాలే ఉన్నాయి.
5 దేవా, నీవు మమ్మల్ని రక్షించుము. మంచి మనుష్యులు నిన్ను ప్రార్థిస్తారు.
నీవు వారి ప్రార్థనలకు జవాబిస్తావు.
వారి కోసం నీవు ఆశ్చర్య కార్యాలు చేస్తావు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నిన్ను నమ్ముకొంటారు.
6 దేవుడు తన మహాశక్తిని ఉపయోగించి పర్వతాలను చేశాడు.
మనచుట్టూరా ఆయన శక్తిని చూడగలము.
7 ఘోషించే సముద్రాలను దేవుడు నిమ్మళింప చేస్తాడు.
మరియు ప్రపంచంలో ఉన్న మనుష్యులందరినీ దేవుడు సంతోషంతో స్తుతింప చేస్తాడు.
8 దేవుడు చేసే శక్తివంతమైన విషయాలకు భూమిమీద ప్రతి మనిషీ భయపడతాడు.
దేవా, నీవు సూర్యుని ఉదయింపజేసే, అస్తమింపజేసే ప్రతి చోటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
9 నీవు భూమిని గూర్చి శ్రద్ధ తీసుకొంటావు.
నీవు దానికి నీరు పోస్తావు, అది దాని పంటలు పండించేలా నీవు చేస్తావు.
దేవా, నీవు కాలువలను ఎల్లప్పుడూ నీళ్లతో నింపుతావు.
నీవు ఇలా చేసి పంటలు పండింపచేస్తావు.
10 దున్నబడిన భూమి మీద వర్షం కురిసేటట్టు నీవు చేస్తావు.
భూములను నీవు నీళ్లతో నానబెడతావు.
నేలను నీవు వర్షంతో మెత్తపరుస్తావు.
అప్పుడు నీవు మొలకలను ఎదిగింపచేస్తావు.
11 కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు ప్రారంభింప చేస్తావు.
బండ్లను నీవు అనేక పంటలతో నింపుతావు.
12 అరణ్యము, కొండలు పచ్చగడ్డితో నిండిపోయాయి.
13 పచ్చిక బయళ్లు గొర్రెలతో నిండిపోయాయి.
లోయలు ధాన్యంతో నిండిపోయాయి.
పచ్చిక బయళ్లు, లోయలు సంతోషంతో పాడుతున్నట్లున్నాయి.
© 1997 Bible League International