Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 సమూయేలు 10

హానూను దావీదు మనుష్యులను అవమానించటం

10 తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోయాడు. అతని తరువాత అతని కుమారుడు హానూను రాజయ్యాడు. మరణవార్త విన్న దావీదు “నాహాషు నాపట్ల చాలా దయగలిగియుండెను. కాబట్టి అతని కుమారుడు హానూను పట్లకూడ నేను దయగలిగి ఉంటాను,” అని అన్నాడు. ఆ ప్రకారం దావీదు తన అధికారులను తండ్రి మరణంతో విచారంలో ఉన్న హానూనును పలకరించి ఓదార్చే నిమిత్తం పంపాడు.

దావీదు అధికారులు అమ్మోనీయుల దేశానికి వెళ్లారు. కాని అమ్మోనీయుల నాయకులు వారి రాజైన హానూనును కలిసి, “నీ తండ్రి మరణ సందర్భంగా నిన్ను ఓదార్చటానికి తన మనుష్యులను పంపి నీ తండ్రిని గౌరవించటానికి ప్రయత్నిస్తున్నాడని నీవు అనుకుంటున్నావా? కాదు! దావీదు తన మనుష్యులను నీ నగరాన్ని పరిశీలించి రహస్యాలను తెలిసికొనే నిమిత్తం గూఢచారులుగా పంపాడు. వారు నీ మీదకు యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు!” అని చెప్పారు.

కాబట్టి హానూను దావీదు పంపిన అధికారులను పట్టుకొని, వారి గడ్డాలలో సగభాగం గొరిగించాడు. వారి దుస్తులను కూడ సగంనుంచి తొడలవరకు కత్తిరించి వేశాడు. తరువాత వారిని పంపివేశాడు.

ఆ అధికారులు చాలా అవమానం పొందారని విన్న దావీదు కొందరు దూతలను తన అధికారులను కలవటానికి పంపాడు. దూతల ద్వారా, “మీ గడ్డాలు బాగా పెరిగేవరకు మీరు యెరికో పట్టణంలో వుండండి. తరువాత యెరూషలేమునకు తిరిగిరండి,” అని కబురు పంపాడు దావీదు రాజు.

అమ్మోనీయులపై యుద్ధం

అమ్మోనీయులు దావీదు రాజుతో శతృత్వం తెచ్చి పెట్టుకున్నామని తెలుసుకున్నారు. దానితో వారు సైన్యాన్ని సమకూర్చుకొనే ప్రయత్నంలో బేత్రెహోబు, సోబాలలోవున్న సిరియనులను జీతానికి పిలిపించుకొన్నారు. సిరియను కాల్బలము ఇరువది వేల వరకు వుంది. ఒక వెయ్యిమంది సైనికులతో సహా మయకా రాజును, టోబునుండి పన్నెండు వేలమందిని జీతానికి పిలిపించుకొన్నారు.

ఈ విషయం దావీదు విన్నాడు. అతడు యోవాబును, అతని సైన్యంలో వీరులందరిని పంపాడు. అమ్మోనీయులు బయటికి వచ్చి యుద్ధానికి సిద్ధమయ్యారు. వారు నగర ద్వారం దగ్గర మోహరించారు. సోబానుండి రెహోబు నుండి వచ్చిన సిరియనులు, టోబునుండి, మయకానుండి వచ్చిన మనుష్యులందరూ అమ్మోనీయులతో కలిసి రంగంలో నిలబడలేదు.

అమ్మోనీయులు తనకు ముందు, వెనుక కూడ నిలబడి వున్నారని యోవాబు గమనించాడు. అందువల్ల తనతో వచ్చిన ఇశ్రాయేలీయులలో కొందరు నేర్పరులైన వారిని ఎన్నుకుని వారిని సిరియనులతో యుద్ధానికి సిద్ధం చేశాడు. 10 మిగిలిన సైన్యాన్ని అమ్మోనీయుల మీదికి పోవటానికి యోవాబు తన సోదరుడైన అబీషైకి ఇచ్చాడు. 11 యోవాబు అబీషైకి ఇలా చెప్పాడు: “సిరియనులు గనుక బలం పుంజుకొని నన్ను ఓడించేలా వుంటే నీవు వచ్చి నాకు సహాయం చేయము. అమ్మోనీయులు గనుక నీకంటె ఆధిక్యతలో వుంటే నేను వచ్చి నీకు సహాయం చేస్తాను. 12 ధైర్యంగా ఉండు. మన ప్రజలకోసం, మన దేవుని నగరాలకోసం మనమంతా వీరోచితంగా పోరాడదాం! యెహోవా దృష్టికి ఏది మంచిదనిపించుతుందో అది ఆయన చేస్తాడు.”

13 తరువాత యోవాబు, అతని మనుష్యులు సిరియనులను ఎదుర్కొన్నారు. యోవాబు యొక్క, అతని సైన్యం యొక్క ధాటికి తట్టుకోలేక సిరియనులు పారి పోయారు. 14 సిరియనులు పారిపోతున్నట్లు అమ్మోనీయులు చూశారు. దానితో వారుకూడ అబీషైకి భయపడి పారిపోయారు. వారు వారి నగరానికి పోయారు.

యోవాబు అమ్మోనీయులతో యుద్ధానంతరం తిరిగి వచ్చి యెరూషలేముకు వెళ్లాడు.

సిరియనులు మళ్లీ యుద్ధానికి సిద్ధమవటం

15 ఇశ్రాయేలీయులు తమను ఓడించారని సిరియనులు గుర్తించారు. వారంతా మళ్లీ సమకూడి ఒక పెద్ద సైన్యాన్ని సమకూర్చారు. 16 హదదెజరు తనదూతలను యూఫ్రటీసు నది అవతల నివసిస్తూ ఉన్న సిరియనులనందరినీ తీసుకొని రావలసినదిగా పంపాడు. ఈ సిరియనులంతా హేలాముకు వచ్చారు. వారి నాయకుడు షోబకు. ఇతడు హదదెజరు సైన్యాధిపతి.

17 దావీదు ఇదంతా విని ఇశ్రాయేలీయులనందరనీ కూడ దీశాడు. వారు యోర్దాను నదిని దాటి హేలాముకు వెళ్లారు.

అక్కడ సిరియనులు యుద్ధానికి సిద్ధమై వారిని ఎదిరించారు. 18 కాని దావీదు సిరియనులను ఓడించాడు. సిరియనులు ఇశ్రాయేలీయులకు భయపడి పారిపోయారు. దావీదు సిరియను సైన్యంలో ఏడు వందల మంది రథసారధులను, నలుబది వేల మంది గుర్రపు దళం వారిని చంపివేశాడు. అంతేగాదు సిరియను సైన్యాధిపతియైన షోబకును కూడ దావీదు చంపివేశాడు.

19 హదదెజరు సామంత రాజులంతా వారి సైన్యాలను ఇశ్రాయేలీయులు ఓడించినట్లు చూశారు. కావున వారు ఇశ్రాయేలీయులతో సంధి చేసికొని వారిని సేవిస్తూవచ్చారు. మళ్లీ అమ్మోనీయులకు సహాయం చేయటానికి సిరియనులు భయపడి పోయారు.

2 కొరింథీయులకు 3

క్రొత్త నిబంధన యొక్క సేవకులు

ఇలా మాట్లాడటం మమ్మల్ని మేము పొగడుకొంటున్నట్లు అనిపిస్తోందా? మీ నుండి మాకు పరిచయపత్రాలు కావాలా? లేక మీ దగ్గరకు వచ్చినప్పుడు యితరులవలే పరిచయ పత్రాలు తీసుకురావాలా? మీరే మా పరిచయ పత్రం. మిమ్మల్ని గురించి మా హృదయాలపై వ్రాయబడి ఉంది. ఇది అందరికీ తెలుసు. దాన్ని అందరూ చదివారు. మీరు క్రీస్తును గురించి వ్రాసిన పత్రంలా స్పష్టంగా కనిపిస్తున్నారు. ఈ పత్రం సిరాతో కాక, సజీవమైన దేవుని ఆత్మతో వ్రాయబడింది. అది రాతి పలకపై కాక, మానవుల హృదయాలపై వ్రాయబడింది. మీరు మా సేవా ఫలితం.

మేము దేవుణ్ణి క్రీస్తు ద్వారా విశ్వసిస్తున్నాము. కనుక మాకానమ్మకం ఉంది. మేము చేస్తున్న కార్యాలు చేయగల సామర్థ్యం మాలో ఉందని చెప్పటం లేదు. ఆ శక్తి మాకు దేవుడు ప్రసాదించాడు. దేవుడు మేము క్రొత్త నిబంధనకు సేవకులుగా ఉండేటట్లు మాకు శక్తినిచ్చాడు. ఈ నిబంధన వ్రాత రూపంలో లేదు. అది దేవుని ఆత్మ రూపంలో ఉంది. వ్రాత రూపంలో ఉన్న నియమాలు మరణాన్ని కలిగిస్తాయి. కాని దేవుని ఆత్మ జీవాన్నిస్తాడు.

క్రొత్త నిబంధన యొక్క మహిమ

రాతిపలకపై అక్షరాలతో చెక్కబడిన నియమాలను దేవుడు యిచ్చినప్పుడు, మోషే ముఖం మీద మహిమాప్రకాశం కనిపించింది. తదుపరి ఆ మహిమ తగ్గుతూ పోయింది. అయినా ఇశ్రాయేలు ప్రజలు అతని ముఖం చూడలేక పోయారు. చావును కలిగించే పాలనలో మహిమ అంత గొప్పగా ఉంటే, దేవుని ఆత్మనిచ్చే పాలనలో యింకెంత మహిమ ఉంటుందో ఆలోచించండి. శిక్షను కలిగించే పాలనలో అంత మహిమ ఉంటే, నీతిని స్థాపించే పాలనలో యింకెంత మహిమ ఉంటుందో ఆలోచించండి. 10 ఇప్పుడు మనకు లభించిన గొప్ప మహిమతో పోలిస్తే, గతంలో ఉండిన ఆ మహిమకు ప్రకాశం లేదు. 11 నశించిపోతున్న ఆ మహిమకు అంత ప్రకాశం ఉంటే చిరకాలం ఉండే మహిమకు యింకెంత ప్రకాశం ఉంటుందో ఆలోచించండి.

12 మాకు అంత నిరీక్షణ ఉంది కనుకనే మాలో యింత ధైర్యముంది. 13 తగ్గిపోతున్న తన ప్రకాశాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడరాదని మోషే తన ముఖానికి ముసుగు వేసుకొన్నాడు. మేము మోషేలాంటివాళ్ళము కాదు. 14 వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఈ నాటికీ వాళ్ళు పాత నిబంధన గ్రంథం చదివినప్పుడు వాళ్ళకు ముసుగు కనిపిస్తూవుంటుంది. దాన్ని ఎవ్వరూ తీయలేరు. క్రీస్తు మాత్రమే ఆ ముసుగు తీసివేయగలడు. 15 ఈ నాటికీ మోషే గ్రంథాలు చదివినప్పుడు ఆ ముసుగు వాళ్ళ బుద్ధిని కప్పివేస్తుంది. 16 కాని ప్రభువు వైపుకు మళ్ళినవాళ్ళ “ముసుగు తీసివేయబడింది.”(A) 17 ప్రభువే “ఆత్మ”. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వేఛ్చ ఉంటుంది. 18 ముసుగు తీసివేయబడ్డ మా ముఖాల్లో ప్రభువు మహిమ ప్రకాశిస్తోంది. అది ఆత్మ అయినటువంటి ప్రభువు నుండి వచ్చింది. అనంతమైన ఆ మహిమ మమ్మల్ని ప్రభువులా మారుస్తోంది.

యెహెజ్కేలు 17

గ్రద్ద మరియు ద్రాక్ష

17 తరువాత యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు, “నరపుత్రుడా! ఇశ్రాయేలు వంశానికి ఈ కథ వినిపించు. దాని అర్థమేమిటో వారినడుగు. వారికి ఇలా చెప్పు:

“‘పెను రెక్కల గ్రద్ద ఒకటి లెబానోనుకు వచ్చింది.
    మచ్చలుగల ఈకలు ఆ గ్రద్దకు మెండుగా ఉన్నాయి.
ఆ పక్షిరాజు ఆ పెద్ద దేవదారు వృక్షపు (లెబానోను) తల తుంచివేసింది.
    తెంచిన కొమ్మను కనానులోని వ్యాపారస్తుల దేశంలో నాటింది.
కనాను నుండి పిదప కొన్ని విత్తనాల (ప్రజల)ను ఆ గ్రద్ద తీసుకుంది.
    సారవంతమైన భూమిలో వాటిని నాటింది. అది వాటిని మంచి నదీతీరాన నాటింది.
ఆ విత్తనం మొలకెత్తి ద్రాక్షా చెట్టయ్యింది.
    అది మంచి ద్రాక్షాలత.
ఆ మొక్క ఎత్తుగా లేదు.
    అయినా అది ఎక్కువ విస్తీర్ణంలో పాకింది.
అది కొమ్మలు తొడిగింది.
    చిన్న కొమ్మలు చాలా పొడుగ్గా పెరిగాయి.
మరో పెద్ద రెక్కల గ్రద్ద ద్రాక్షా మొక్కను చూసింది.
    ఆ గ్రద్దకు చాలా ఈకలు ఉన్నాయి.
ఈ క్రొత్త గ్రద్ద తనను సంరక్షించాలని ఆ ద్రాక్షాలత కోరింది.
    అందువల్ల తన వేళ్లు గ్రద్ద వైపు పెరిగేలా చేసింది ఆ మొక్క.
దాని కొమ్మలు ఆ గ్రద్ద వైపుకే విస్తరించాయి.
    అది నాటబడిన పొలాన్ని అధిగమించింది.
దాని కొమ్మలు ప్రాకాయి.
    తనకు నీళ్లు పోయమని ద్రాక్షాచెట్టు క్రొత్త గ్రద్దను కోరింది.
సారవంతమైన భూమిలో నాటబడింది ద్రాక్షామొక్క. మంచి నీటివనరు వున్నచోట నాట బడింది.
    దాని కొమ్మలు బాగా పెరిగి, కాపు కాయవలసి ఉంది.
    అది ఎంతో మేలురకం ద్రాక్షాలత అయివుండేది.’”

నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
“మరి ఆ మొక్క విజయం సాధిస్తుందని మీరనుకుంటున్నారా?
    లేదు! ఆ క్రొత్త గ్రద్ద మొక్కను భూమినుండి పెరికివేస్తుంది.
మొక్క వేళ్లను గ్రద్ద నరికివేస్తుంది. వున్న కాయలన్నీ అదే తినేస్తుంది.
    క్రొత్త ఆకులన్నీ ఎండి రాలిపోతాయి.
మొక్క చాలా బలహీనమవుతుంది.
    మొక్కను వేళ్లతో లాగివేయటానికి అది గట్టి ఆయుధాలు పట్టటం గాని, బలమైన సైన్య సహాయాన్ని గాని తీసుకోదు.
10 అది నాటబడిన చోట మొక్క పెరుగుతుందా?
    లేదు! వేడి తూర్పు గాలులు వీస్తాయి. దానితో మొక్క వాడి, చనిపోతుంది.
    అది నాటిన దగ్గరే చనిపోతుంది.”

సిద్కియా రాజు శిక్షింపబడ్డాడు

11 యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 12 “ఇశ్రాయేలు ప్రజలకు ఈ కథ వివరించు. ఇశ్రాయేలీయులు ఎల్లప్పుడూ నాపై తిరుగుబాటు చేస్తూవున్నారు. వారికి ఈ విషయాలు వివరించు. మొదటి పక్షిరాజు నెబుకద్నెజరు. అతడు బబులోను (బాబిలోనియా) రాజు. అతడు యెరూషలేముకు వచ్చి రాజును, ఇతర పెద్దలను తీసుకొని పోయాడు. వారిని బబులోనుకు తీసుకొని వెళ్లాడు. 13 పిమ్మట రాజ కుటుంబంలోని ఒకనితో నెబుకద్నెజరు ఒక ఒడంబడిక చేసుకొన్నాడు. ఒక వాగ్దానం చేయమని అతనిని నెబుకద్నెజరు ఒత్తిడి చేశాడు. అందువల్ల అతడు నెబుకద్నెజరు పట్ల రాజభక్తి కలిగి వుండటానికి మాట ఇచ్చాడు. నెబుకద్నెజరు ఇతనిని యూదాకు రాజుగా నియమించాడు. తరువాత అతడు శక్తియుక్తులున్న మనుష్యులందరినీ యూదా నుండి తీసుకొనిపోయాడు. 14 దానితో యూదా ఒక బలహీన రాజ్యంగా మారిపోయింది. అందువల్ల అది రాజైన నెబుకద్నెజరును ఎదిరించలేక పోయింది. యూదా యొక్క నూతన రాజుతో చేసుకొన్న ఒడంబడికను ఆచరించేలా నెబుకద్నెజరు ప్రజలపై ఒత్తిడి తెచ్చాడు. 15 అయినప్పటికీ ఈ క్రొత్త రాజు నెబుకద్నెజరుపై తిరుగుబాటు ప్రయత్నం చేశాడు! అతడు తన దూతలను ఈజిప్టుకు పంపి సహాయం అర్థించాడు. క్రొత్తరాజు అనేక గుర్రాలను, సైనికులను అడిగాడు. మరి ఈ నూతన యూదా రాజు విజయం సాధిస్తాడని ఇప్పుడు మీరనుకుంటున్నారా? ఒడంబడికను ఉల్లంఘించి, శిక్షనుండి తప్పించుకునేటంత శక్తి ఈ క్రొత్త రాజుకు ఉన్నదని మీరనుకుంటున్నారా?”

16 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “నా జీవ ప్రమాణంగా ఈ క్రొత్త రాజు బబులోనులో చనిపోతాడని నిశ్చయంగా చెప్పుతున్నాను! ఈ వ్యక్తిని యూదా రాజుగా నెబుకద్నెజరు నియమించాడు. కాని ఇతడు నెబుకద్నెజరుకు ఇచ్చినమాట నిలబెట్టుకోలేదు. ఈ క్రొత్తరాజు ఒడంబడికను నిరాకరించి విడిచి పెట్టాడు. 17 పైగా ఈజిప్టు రాజు యూదా రాజును రక్షించలేడు. అతడు అనేకమంది సైనికులను పంపవచ్చు. కాని ఈజిప్టుకు వున్న మహా బలసంపత్తి యూదాను రక్షించలేదు. నెబుకద్నెజరు సైన్యం నగరాన్ని పట్టుకొనటానికి మట్టిదారులు, మట్టి గోడలు నిర్మిస్తుంది. అనేకమంది చనిపోతారు. 18 అయినా యూదా రాజు తప్పించుకోలేడు. ఎందుకంటే, తన ఒడంబడిక అతడు అలక్ష్యం చేశాడు. అతడు నెబుకద్నెజరుకు ఇచ్చిన మాట తప్పాడు.” 19 నా ప్రభువైన యెహోవా ఈ ప్రమాణం చేస్తున్నాడు: “నా జీవ ప్రమాణంగా యూదా రాజును శిక్షిస్తానని నిశ్చయంగా చెప్పుతున్నాను. ఎందువల్లనంటే, అతడు నా హెచ్చరికలను లెక్కచేయలేదు. అతడు నా ఒడంబడికను ఉల్లంఘించాడు. 20 నేను నావల పన్నుతాను. అతడందులో చిక్కుకొంటాడు. అతనిని నేను బబులోనుకు తీసుకొనివచ్చి అక్కడ శిక్షిస్తాను. అతడు నా పై తిరుగుబాటు చేశాడు గనుక నేనతనిని శిక్షిస్తాను. 21 నేనతని సైన్యాన్ని నాశనం చేస్తాను. గొప్ప యోధులగు అతని సైనికులను చంపివేస్తాను. చావగా మిగిలిన వారిని చెల్లాచెదురు చేస్తాను. నేనే యెహోవాననీ, నీకు ఈ మాటలు చెప్పినది నేనే అనీ, నీవప్పుడు తెలుసుకొంటావు.”

22 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు:

“పిమ్మట ఎత్తైన దేవదారు వృక్షపు కొమ్మనొకటి నేను తీసుకొంటాను.
    వృక్షపు పైభాగాన్నుండి ఒక చిన్న రెమ్మను తీసుకొంటాను.
    నేనే దానిని చాలా ఎత్తైన పర్వతం మీద నాటుతాను.
23 నేనే దానిని ఇశ్రాయేలులోని ఒక ఎత్తైన పర్వతంపై నాటుతాను.
    ఆ కొమ్మ ఒక వృక్షంలా పెరుగుతుంది.
అది బాగా కొమ్మలు వేసి, పండ్లు కాస్తుంది.
    అది ఒక అందమైన దేవదారు వృక్షమవుతుంది.
దాని కొమ్మలపై అనేకమైన పక్షులు కూర్చుంటాయి.
    అనేకమైన పక్షులు దాని కొమ్మల నీడల్లో నివసిస్తాయి.

24 “నేను పొడవైన వృక్షాలన్నిటినీ నేలకు పడేస్తానని ఇతర చెట్లన్నీ అప్పుడు తెలుసుకొంటాయి.
    చిన్న చెట్లను పెరగనిచ్చి మహావృక్షాలను చేస్తానని కూడా అవి తెలుసుకొంటాయి.
పచ్చని చెట్లు ఎండిపోయేలా,
    ఎండిన మోడులు చిగురించేలా చేస్తాను.
నేనే యెహోవాను
    నేనేదైనా చేస్తానని చెప్పితే నేనది తప్పక చేస్తాను!”

కీర్తనలు. 60-61

సంగీత నాయకునికి: “ఒప్పందపు లిల్లి పుష్పం” రాగం. దావీదు అనుపదగీతం. ఉపదేశించదగినది. దావీదు అరమ్నహరాయీమీయులతోను, అరమోజబాయీలతోను యుద్ధం చేయగా యోవాబు ఉప్పు లోయలో 12,000 మంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పటిది.

60 దేవా, నీవు మమ్మల్ని విడిచి పెట్టేశావు.
    నీవు మమ్మల్ని ఓడించావు. మా మీద నీవు కోపగించావు.
    దయచేసి మమ్ములను ఉద్ధరించుము.
భూమి కంపించి పగిలి తెరచుకొనేలా నీవు చేశావు.
    మా ప్రపంచం పగిలిపోతోంది.
    దయచేసి దాన్ని బాగు చేయుము.
నీ ప్రజలకు నీవు చాలాకష్టాలు కలిగించావు.
    త్రాగుబోతు మనుష్యుల్లా మేము తూలి పడిపోతున్నాము.
నీకు భయపడే వారికి నీ సత్యమైన వాగ్దానాలను
    స్థిరపరచుటకు ఒక ధ్వజమునెత్తావు.

నీ మహాశక్తిని ప్రయోగించి మమ్మల్ని రక్షించు,
    నా ప్రార్థనకు జవాబు యిచ్చి, నీవు ప్రేమించే ప్రజలను రక్షించుము.

దేవుడు తన ఆలయంలో నుండి[a] మాట్లాడుతున్నాడు.
    “నేను గెలుస్తాను, ఆ విజయం గూర్చి సంతోషిస్తాను.
    నా ప్రజలతో కలిసి ఈ దేశాన్ని నేను పంచుకొంటాను.
    షెకెము, సుక్కోతు లోయలను నేను విభజిస్తాను.
    గిలాదు, మనష్షేనాది. ఎఫ్రాయిము నా శిరస్త్రాణము.
    యూదా నా రాజదండము.
    మోయాబును నా పాదాలు కడుక్కొనే పళ్లెంగా నేను చేస్తాను.
    ఎదోము నా చెప్పులు మోసే బానిసగా ఉంటుంది. ఫిలిష్తీ ప్రజలను నేను ఓడిస్తాను.”

బలమైన భద్రతగల పట్టణానికి నన్ను ఎవరు తీసుకొని వస్తారు?
    ఎదోముతో యుద్ధం చేయుటకు నన్ను ఎవరు నడిపిస్తారు?
10 దేవా, వీటిని చేసేందుకు నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవు.
    కాని నీవు మమ్మల్ని విడిచిపెట్టేసావు. దేవుడు మాతోను, మా సైన్యాలతోను వెళ్లడు.
11 దేవా, మా శత్రువులను ఓడించుటకు సహాయం చేయుము.
    మనుష్యులు మాకు సహాయం చేయలేరు.
12 కాని దేవుని సహాయంతో మేము జయించగలం.
    దేవుడు మా శత్రువులను ఓడించగలడు.

సంగీత నాయకునికి: తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన.

61 దేవా, నా ప్రార్థనా గీతం వినుము.
    నా ప్రార్థన ఆలకించుము.
నేను ఎక్కడ ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా,
    సహాయం కోసం నీకు మొరపెడతాను.
ఎత్తయిన క్షేమస్థలానికి
    నన్ను మోసికొనిపొమ్ము.
నీవే నా క్షేమ స్థానం.
    నా శత్రువుల నుండి నన్ను కాపాడే బలమైన గోపురం నీవే.
నీ గుడారంలో[b] నేను శాశ్వతంగా నివసిస్తాను.
    నీవు నన్ను ఎక్కడ కాపాడగలవో అక్కడ దాక్కుంటాను.

దేవా, నేను నీకిస్తానని చేసిన ప్రమాణం నీవు విన్నావు.
    కాని నిన్ను ఆరాధించేవారికి ఉన్న సమస్తం నీవద్ద నుండే వస్తుంది.
రాజుకు దీర్ఘాయుష్షు దయచేయుము.
    అతన్ని శాశ్వతంగా జీవించనిమ్ము.
అతన్ని దేవుని ఎదుట శాశ్వతంగా జీవించనిమ్ము.
    నీ నిజమైన ప్రేమతో మరియు విశ్వాసంతో అతనిని కాపాడుము.
నేను నీ నామాన్ని శాశ్వతంగా స్తుతిస్తాను.
    నేను ప్రమాణం చేసినవాటిని ప్రతి రోజూ చేస్తాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International