M’Cheyne Bible Reading Plan
దావీదు అనేక యుద్ధాలను గెలవటం
8 తరువాత దావీదు ఫిలిష్తీయులను ఓడించాడు. వారి రాజధాని నగరాన్ని స్వాధీన పర్చుకున్నాడు. 2 దావీదు మోయాబీయులను కూడ ఓడించాడు. పట్టుబడిన వారందరినీ నేల మీద పరుండేలా చేసి, వారి పొడుగు కొలవటానికి ఒక తాడు తీసుకున్నాడు. రెండు కొలతల పొడవున్న వారందరినీ చంపించాడు. ఒక కొలత పొడవున్న వారందరినీ వదిలిపెట్టాడు. దానితో మోయాబీయులంతా దావీదుకు సేవకులయ్యారు. వారంతా ఆయనకు కప్పము[a] చెల్లించారు.
3 సోబారాజు రెహోబు కుమారుడైన హదదెజరును దావీదు ఓడించాడు. యూఫ్రటీసు నదీ తీరానగల తన ఆధిపత్యాన్ని దావీదు తిరిగి చేజిక్కించుకున్నాడు. 4 హదదెజరు నుండి పదిహేడు వందల మంది గుర్రపు దళము వారిని, ఇరవై వేలమంది కాల్బలము వారిని దావీదు పట్టుకున్నాడు. ఒక వంద మంచి గుర్రాలు మినహా మిగిలిన గుర్రాలన్నిటినీ దావీదు కుంటివాటినిగా చేసాడు. ఆ వంద గుర్రాలను రథాలను లాగేందుకు రక్షించాడు.
5 సోబా రాజగు హదదెజరుకు సహయం చేయటానికి దమస్కునుండి సిరియనులు వచ్చిరి. కాని దావీదు ఇరువది రెండువేల మంది సిరియనులను ఓడించాడు. 6 తరువాత దమస్కు అధీనంలోనున్న సిరియా దేశమందు దావీదు రక్షక దళాలను నియమించాడు. సిరియనులు వచ్చి దావీదుకు కప్పము చెల్లించారు. దావీదు ఎక్కడికి వెళితే అక్కడ యెహోవా అతనికి విజయ పరంపర సమకూర్చి పెట్టాడు.
7 హదదెజరు సైనికుల బంగారు డాళ్లను (రక్షకఫలకాలు) దావీదు తీసుకొని యెరూషలేముకు తెచ్చాడు. 8 బెతహు, బేరోతైలనుండి దావీదు లెక్కకు మించి ఇత్తడి సామగ్రి పట్టుకొనిపోయాడు. (బెతహు, బేరోతై అను రెండు నగరాలూ హదదెజరుకు చెందినవి).
9 హదదెజరు సైన్యాన్ని దావీదు ఓడించినట్లు హమాతు రాజైన తోయి విన్నాడు. 10 తోయి తన కుమారుడైన యోరామును దావీదు రాజువద్దకు పంపాడు. యోరాము వచ్చి దావీదును పలకరించి, హదదెజరుతో పోరాడి ఓడించినందుకు అతన్ని అభినందించాడు. (తోయిపై హదదెజరు గతంలో దండెత్తి యుద్ధాలు చేశాడు). యోరాము దావీదు వద్దకు వెండి, బంగారు, ఇత్తడి వస్తువులను కానుకలుగా తెచ్చాడు. 11 దావీదు వాటిని తీసుకొని యెహోవాకి సమర్పించాడు. తాను ఇతర దేశములను ఓడించి తెచ్చి యెహోవాకి సమర్పించిన వెండి బంగారు వస్తువులతో పాటు ఈ సామగ్రిని కూడ ఉంచాడు. 12 తాను జయించిన దేశాలలో సిరియ, మోయాబు, అమ్నోను, ఫిలిష్తీయ, అమాలేకు ఉన్నాయి. సోబా రాజైన రెహోబు కుమారుడు హదదెజరును కూడ దావీదు ఓడించాడు. 13 దావీదు పద్దెనిమిది వేల సిరియనులను ఉప్పులోయలో ఓడించాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి మిక్కిలి కీర్తి గడించాడు. 14 ఎదోములో దావీదు సైన్యాన్ని రక్షణకై నిలిపాడు. ఎదోము రాజ్యమంతటా కాపలా దళాలను నియమించాడు. ఎదోమీయులంతా దావీదుకు సేవకులయ్యారు. దావీదు వెళ్లిన ప్రతిచోటా యెహో వా అతనికి విజయాన్ని సమకూర్చి పెట్టాడు.
దావీదు పరిపాలన
15 ఇశ్రాయేలంతటినీ దావీదు పరిపాలించాడు. దావీదు తీసుకున్న నిర్ణయాలు తన ప్రజలందరికీ నిష్పక్ష పాతంగా వుండి ఆమోదయోగ్యంగా వుండేవి. 16 సెరూయా కుమారుడైన యోవాబు సర్వసైన్యాధ్యక్షుడయ్యాడు. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు చరిత్రకారుడు పత్రలేఖకుడుగా నియమితుడయ్యాడు. 17 అహీటూబు కుమారుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు యాజకులుగా ఉన్నారు. శెరాయా అనునతను ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించాడు. 18 యెహోయాదా కుమారుడు బెనాయా కెరేతీయులకు, పెలేతీయులకు[b] అధిపతి అయ్యాడు. దావీదు కుమారులు రాజకీయ సలహాదారులైన ప్రముఖ వ్యక్తులుగా[c] నియమితులయ్యారు.
సౌలు కుటుంబానికి దావీదు కనికరము చూపటం
9 “సౌలు కుటుంబంలో ఇంకాఎవరైనా మిగిలియున్నారా? యోనాతాను కోసం ఆ వ్యక్తికి నేను కనికరం చూపదల్చుకున్నాను” అని దావీదు చెప్పాడు.
2 సౌలు కుటుంబానికి చెందిన సీబా అనే ఒక సేవకుడు ఉన్నాడు. దావీదు మనుష్యులు సీబాను దావీదు వద్దకు తీసుకొని వచ్చారు. దావీదు రాజు సీబాతో, “నీవు సీబావేనా?” అని అడిగాడు.
“అవును, నీ సేవకుడనైన సీబానే” అని అన్నాడు సీబా.
3 “అయితే సౌలు కుటుంబంలో ఎవరైనా జీవించివున్నారా? వుంటే ఆ వ్యక్తికి దేవుని కృపను చూపాలని అనుకుంటున్నాను” అని దావీదు చెప్పాడు. దావీదు రాజుతో సీబా యిలా అన్నాడు:
“యోనాతాను కుమారుడొకడు ఇంకా జీవించియున్నాడు. అతని రెండు కాళ్లూ అవిటివి.”
4 “ఈ కుమారుడెక్కడున్నాడని” రాజు సీబాను అడిగాడు.
“లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంటిలో వున్నాడని” రాజుకు చెప్పాడు సీబా.
5 అప్పుడు దావీదు రాజు తన సేవకులను లోదెబారుకు పంపాడు. అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంటిలో వున్న యోనాతాను కుమారుని తీసుకొని రమ్మని చెప్పాడు. 6 యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి వంగి నమస్కరించాడు.
“మెఫిబోషెతూ” అని పిలిచాడు దావీదు.
“అవునయ్యా! నేను నీ సేవకుడను మీ ముందు వున్నాను” అని అన్నాడు మెఫీబోషెతు.
7 మెఫీబోషెతుతో దావీదు ఇలా అన్నాడు, “భయపడకు. నేను నీ పట్ల దయగలిగి ఉంటాను. నీ తండ్రియైన యోనాతాను కారణంగా నేను నీకు సహాయం చేస్తాను. నీ తాతయైన సౌలు భూమినంతా నీకు తిరిగి ఇచ్చివేస్తాను. నీవు ఎల్లప్పుడూ నాతో నా బల్ల వద్ద భోజనం చేస్తావు.”
8 మెఫీబోషెతు మరల దావీదుకు వంగి నమస్కరించాడు. మెఫీబోషెతు ఇలా అన్నాడు: “మీరు మీ సేవకుడనైన నా పట్ల చాలా దయగలిగియున్నారు! పైగా నేను చచ్చిన కుక్కకంటె హీనమైన వాడిని!”
9 పిమ్మట దావీదు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలిచి, “సౌలుకు, సౌలు కుటుంబానికి చెందిన ఆస్తి పాస్తులన్నీ నీ యజమాని మనుమడైన మెఫీబోషెతుకు ఇచ్చాను. 10 మెఫీబోషెతు కొరకు ఆ భూమిని నీవు సాగుచేయి. మెఫీబోషెతు కొరకు నీ కుమారులు, సేవకులు కలిసి చేయండి. పంట పండించండి. దానితో నీ యజమాని మనుమడు మెఫిబోషెతుకు పుష్కలంగా ఆహారం దొరుకుతుంది. కాని నీ యజమాని మనుమడు నా బల్లవద్ద తింటూ వుంటాడు.”
సీబాకు పదునైదుగురు కుమారులు, ఇరువైమంది సేవకులు వున్నారు. 11 దావీదు రాజుతో సీబా ఇలా అన్నాడు: “నేను నీ సేవకుడను. రాజైన నా ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా నేను అంతా చేస్తాను.”
ఆ ప్రకారంగానే మెఫీబోషెతు దావీదు బల్లవద్ద రాజ కుమారులలో ఒకనిగా భోజనం చేస్తాడు. 12 మెఫీబోషెతుకు మీకా అనబడే ఒక చిన్న కుమారుడున్నాడు. సీబా కుటుంబంలోని వారంతా మెఫీబోషెతుకు సేవకులయ్యారు. 13 మెఫీబోషెతు రెండు కాళ్లూ కుంటివే. మెఫీబోషెతు యెరూషలేములోనే నివసించాడు. ప్రతిరోజూ మెఫీబోషెతు రాజు భోజనాల బల్ల వద్దనే తినేవాడు.
2 అందువల్ల నేను మళ్ళీ మీ దగ్గరకువచ్చి మిమ్మల్ని దుఃఖపెట్టరాదని నిర్ణయించుకొన్నాను. 2 నేను మిమ్మల్ని దుఃఖపెడితే, దుఃఖపడిన మీరు తప్ప నన్ను సంతోష పెట్టటానికి ఇతరులు ఎవరున్నారు? 3 కనుక మీకా ఉత్తరం వ్రాసాను. నేను వచ్చినప్పుడు నన్ను సంతోషపెట్టాలనుకొన్నవాళ్ళు నాకు దుఃఖం కలిగించరాదని నా ఉద్దేశ్యం. నేను ఆనందంగా ఉంటే మీరు కూడా ఆనందిస్తారని నాకు తెలుసు. 4 దుఃఖంతో కన్నీళ్ళు కారుస్తూ, వేదన పడుతూ మీకా ఉత్తరం వ్రాసాను. మీకు దుఃఖం కలిగించాలని కాదు. మీ పట్ల నాకున్న ప్రేమను మీకు తెలియ చెయ్యాలని అలా వ్రాసాను.
తప్పు చేసినవాణ్ణి క్షమించటం
5 ఎవరైనా దుఃఖం కలిగించి ఉంటే, అతడు నాకు కాదు, మీకు దుఃఖం కలిగించాడు. అందరికీ కాకున్నా మీలో కొందరికన్నా దుఃఖం కలిగించాడు. అతని పట్ల కఠినంగా ప్రవర్తించటం నాకు యిష్టం లేదు. 6 మీలో చాలా మంది అతణ్ణి శిక్షించారు. అతనికి ఆ శిక్ష చాలు. 7 అతణ్ణి క్షమించి ఓదార్చండి. అలా చెయ్యకపోతే అతడు ఇంకా ఎక్కువ దుఃఖంలో మునిగిపోతాడు. 8 అతని పట్ల మీకున్న ప్రేమను అతనికి తెలియ చెయ్యమని వేడుకొంటున్నాను. 9 మీరు పరీక్షకు నిలువగలరా లేదా అన్నది చూడాలని, దేవుని ఆజ్ఞల్ని అన్నివేళలా పాటిస్తారా లేదా అన్నది గమనించాలని నేను మీకా ఉత్తరం వ్రాసాను. 10 మీరు క్షమించినవాళ్ళను నేనూ క్షమిస్తాను. నేను క్షమించింది, నిజానికి నేను క్షమించవలసింది ఏదైనా ఉండి ఉంటే అది మీకోసం క్రీస్తు అంగీకారంతో క్షమించాను. 11 సాతాను కుట్రలు మనకు తెలియనివి కావు. వాడు మనల్ని మోసం చెయ్యరాదని ఇలా చేసాను.
క్రీస్తు ద్వారా విజయము
12 నేను క్రీస్తు సందేశం ప్రకటించటానికి త్రోయకు వెళ్ళాను. నా కోసం ప్రభువు ఎన్నో అవకాశాలు కలిగించాడు. 13 నా సోదరుడైన తీతు నాకు కనిపించలేదు. కనుక నా మనస్సుకు శాంతి కలుగలేదు. వాళ్ళ నుండి సెలవు తీసుకొని మాసిదోనియకు వెళ్ళాను.
14 దేవుడు, క్రీస్తు ద్వారా అన్ని వేళలా మనకు విజయం కలిగిస్తాడు. అందుకు మనము దేవునికి కృతజ్ఞతతో ఉందాము. క్రీస్తు యొక్క జ్ఞాన పరిమళాన్ని మా ద్వారా అన్ని చోట్లా ఆయన వెదజల్లాడు. 15 రక్షింపబడేవాళ్ళకు, నాశనమవుతున్నవాళ్ళకు మనము క్రీస్తు పరిమళంగా ఉండేటట్లు దేవుడు మనల్ని ఉపయోగించాడు. 16 మన పరిమళము ఒకరికి మరణము కలిగిస్తే మరొకరికి అది జీవాన్నిస్తుంది. ఇది చెయ్యటానికి ఎవరు అర్హులు? 17 అనేకులు దైవసందేశాన్ని సంతలో అమ్మే సరకులా అమ్ముతున్నారు. మేము అలాంటివాళ్ళము కాదు. మేము క్రీస్తు సేవకులము. దేవుని సాక్షిగా చెపుతున్నాము. దేవుడే మమ్మల్ని పంపాడు.
యెరూషలేము యెడల దేవుని ప్రేమ
16 మరో పర్యాయం యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఈ విధంగా చెప్పాడు: 2 “నరపుత్రుడా, యెరూషలేము ప్రజలకు వారు చేసిన భయంకర నేరాల విషయం తెలియజెప్పు. 3 నీవు ఇలా చెప్పాలి, ‘యెరూషలేముకు నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు: నీ చరిత్రవైపు ఒకసారి చూడు. నీవు కనానులో జన్మించావు. నీ తండ్రి అమోరీయుడు. నీ తల్లి హిత్తీయురాలు. 4 యెరూషలేమా, నీవు పుట్టిన రోజన నీ బొడ్డు కోయటానికి ఒక్కరు కూడా లేరు. నిన్ను శుభ్రపర్చటానికి నీ మీద ఎవ్వరూ ఉప్పు పెట్టి స్నానం చేయించలేదు. నీకు ఎవ్వరూ పొత్తిగుడ్డలు చుట్టలేదు. 5 యెరూషలేమా, నీవు అప్పుడు ఒంటరిదానవు. నీ కొరకు ఎవ్వరూ బాధపడలేదు. నిన్ను గూర్చి ఎవ్వరూ శ్రద్ధ తీసుకోలేదు. యెరూషలేమా, నీవు పుట్టిన రోజునే నీ తల్లిదండ్రులు నిన్నుపొలాల్లో పారవేశారు. నీవు అప్పటికి ఇంకా రక్తంతోను, మావితోను కప్పబడి ఉన్నావు.
6 “‘అప్పుడు నేను (దేవుడు) అటుగా వెళ్లుచున్నాను. నీవు రక్తంలో తన్నుకుంటూ అక్కడ పడివుండటం నేను చూశాను. నీవు రక్తంతో కప్పబడివున్నావు. కాని నేను, “నీవు బతుకుగాక!” అని అన్నాను. అవును. నీవు రక్తంతో కప్పబడినావు. కాని, “నీవు బతుకుగాక!” అని నేనన్నాను. 7 పొలంలో మొక్కలా నీవు పెరిగేటందుకు నేను సహాయం చేశాను. నీవు అలా, అలా పెరిగావు. నీవు కన్యకవయ్యావు. నీవు ఋతుమతివయ్యావు. నీ చన్నులు పెరిగాయి. నీ తల వెంట్రుకలు పెరిగాయి. అయినా, నీవు ఇంకా నగ్నంగా దిసమొలతో ఉన్నావు. 8 నేను నిన్ను తేరిపార చూశాను. ప్రేమకు తగిన వయస్సు నీకు వచ్చినట్లు గమనించాను. కావున నా వస్త్రములు నీమీద వేసి, నీ నగ్నత్వాన్ని కప్పివేశాను. నిన్ను వివాహమాడటానికి అభయమిచ్చాను. నాతో ఒక అంగీకారానికి[a] వచ్చాను. అంతే; నీవు నాదానివయ్యావు.’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 9 “‘నేను నిన్ను నీటితో కడిగాను. నీ రక్తాన్ని కడిగాను. నీ వంటికి చమురు రాశాను. 10 [b] నీకు అందమైన బట్టలు, మెత్తని చర్మపు పాదరక్షలు ఇచ్చాను. నేను నీకు నారతో ఒక తలకట్టు, భుజాలమీద వేసుకొనే పట్టు బట్టను ఇచ్చాను. 11 పిమ్మట నీకు కొన్ని ఆభరణాలు ఇచ్చాను. నీ ముంజేతులకు కడియాలు తొడిగాను. నీ మెడలో బంగారు హారం వేశాను. 12 నీకు ముక్కుపుడక, చెవికి దుద్దులు, నీ తలకు కిరీటము అమర్చాను. 13 నీవు ధరించిన వెండి బంగారు ఆభరణాలలోను, నార, పట్టు, కుట్టుపని వస్త్రాలలోను నీవు ఎంతో అందంగా కన్పించావు. నీవు మిక్కిలి విలువైన ఆహారం తిన్నావు. నీవు మహా సౌందర్యవతివయ్యావు. నీవు రాణి వయ్యావు! 14 నీవు అందానికి ప్రసిద్ధి చెందావు. ఎందువల్లనంటే నిన్ను అంత లావణ్యవతిగా తీర్చిదిద్దాను!’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
అవిశ్వాసి వధువు యెరూషలేము
15 దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “కానీ నీవు నీ అందాన్ని నమ్ముకోవటం ప్రారంభించావు. నీకున్న మంచి పేరును నీవు వినియోగించుకుంటూ, నీవు నా పట్ల విశ్వాస ఘాతకురాలుగా వున్నావు. నీ ప్రక్కగా వెళ్లే ప్రతివాని పట్ల నీవొక వేశ్యవలె ప్రవర్తించావు. నీకై నీవు వారందరికీ సమర్పించుకున్నావు! 16 నీ అందమైన వస్త్రాలను తీసుకొని, నీ ఆరాధనా స్థలాలను అలంకరించటానికి నీవు వాటిని వినియోగించావు. ఆ స్థలాలలో నీవొక వేశ్యవలె ప్రవర్తించావు. నీ ప్రక్కగా వచ్చిన ప్రతివానికీ నిన్ను నీవు సమర్పించుకున్నావు. 17 పిమ్మట నేను నీకిచ్చిన విలువైన ఆభరణాలను తీశావు. ఆ వెండి బంగారాలను కరిగించి పురుషుల విగ్రహాలు చేయటానికి వినియోగించావు. పైగా వాటితో నీవు వ్యభిచరించావు కూడ! 18 తరువాత అందమైన వస్త్రాలు తీసుకొని ఆ విగ్రహాలకు దుస్తులు తయారు చేశావు. నేను నీకిచ్చిన అత్తరులు, సాంబ్రాణి తీసుకొని, వాటిని విగ్రహాల ముందు వుంచావు. 19 నేను నీకు రొట్టె, తేనె, నూనె ఇచ్చాను. కాని నేనిచ్చిన ఆహారాన్నంతా నీవు నీ విగ్రహాలకు సమర్పించావు. నీ బూటకపు దేవతల తృప్తికొరకు నీవు వాటిని మనోహరమైన పరిమళంగా సమర్పించావు. ఆ బూటకపు దేవతలతో నీవొక వేశ్యవలె వ్యవహరించావు!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
20 దేవుడు చెప్పటం కొనసాగించాడు, “నీకూ, నాకూ పిల్లలు పుట్టారు. కాని మన పిల్లల్ని నీవు తీసుకొన్నావు. వారిని నీవు చంపి, ఆ బూటకపు దేవుళ్ళకు అర్పించావు! నీవు నన్ను మోసం చేసి, నన్ను వదిలి ఆ బూటకపు దేవుళ్ళ వద్దకు వెళ్లినప్పుడు చేసిన నీచమైన పనులలో ఇది ఒకటి. 21 నీవు నా కుమారులను నరికి, అగ్నిద్వారా వాళ్లను నీ బూటకపు దేవుళ్ళకు అందించావు. 22 నీవు నన్ను వదిలి, ఈ భయంకరమైన పనులన్నిటికీ పాల్పడ్డావు. నీ చిన్నతనాన్ని నీవు ఒక్క సారి కూడా గుర్తుకు తెచ్చుకోలేదు. నేను నిన్ను కనుగొన్నప్పుడు నీవు దిసమొలతో వున్నట్లు, రక్తంలో కొట్టుకుంటున్నట్లు నీకు జ్ఞాపకం లేదు.
23 “ఈ చెడు కార్యాలన్నిటి తరువాత, … ఓ యెరూషలేమా, అది నీకు చాలా కీడుగా ఉంటుంది!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు తెలియజేశాడు. 24 “ఈ విషయాలన్నీ చేసిన పిమ్మట, ఆ బూటకపు దేవతను ఆరాధించటానికి నీవొక గుట్టను నిర్మించావు. ప్రతి వీధి చివరా బూటకపు దేవతలను ఆరాధించటానికి నీవు స్థలాలు ఏర్పాటు చేశావు. 25 ప్రతి బాట మొదలయ్యిన చోటా నీవు పూజకై గుట్టలు నిర్మించావు. తరువాత నీవు నీ అందాన్ని భ్రష్టపర్చుకున్నావు. అటుపోయే ప్రతి మనుష్యునీ నీ వలలో వేసుకొనేటందుకు దానిని వినియోగించుకున్నావు. వారికి నీ కాళ్ళు కన్పించేలాగు నీ చీర పైకెత్తావు. తరువాత ఆ మనుష్యులతో నీవొక వేశ్యలా ప్రవర్తించావు. 26 పిమ్మట నీవు కామాతురుడైన నీ పొరుగు వాడైన ఈజిప్టు వద్దకు వెళ్లావు. నన్ను ఆగ్రహపర్చేలా నీవు వానితో అనేకసార్లు వ్యభిచరించావు. 27 కావున నేను నిన్ను శిక్షించాను! నీ బత్తెం (భూమి)లో కొంత భాగాన్ని నేను తీసుకొన్నాను. నీ శత్రువులగు ఫిలిష్తీయుల కుమార్తెలను (నగరాలు) నీకు వ్యతిరేకంగా వారికి ఇష్టంవచ్చినట్లు చేయనిచ్చాను. నీవు చేసే చెడ్డ పనులపట్ల చివరికి వారు కూడ విభ్రాంతి చెందారు. 28 పిమ్మట నీ కామవాంఛ తీర్చుకోవటానికి నీవు అష్షూరు వెళ్లావు. అక్కడ నీ వాంఛ తీరలేదు. నీకు అసలు తృప్తి అనేది లేదు. 29 అందువల్ల నీవు కనానువైపు తిరిగావు; అటు తరువాత బబులోను (బాబిలోనియా) కు వెళ్లావు. ఆయినా నీకు కామం తీరలేదు. 30 నీ మనస్సు మిక్కిలి బలహీనమయ్యింది. ఆ మనుష్యులందరు (దేశాలు) నిన్ను పాపం చేయటానికి ప్రోత్సహించేలా నీవు అలుసు ఇచ్చావు. నీవు కేవలం అహంకారపు వేశ్యలా[c] ప్రవర్తించావు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
31 దేవుడు ఇలా చెప్పసాగాడు: “కాని, నీవు అసలైన వేశ్యలా లేవు. ప్రతి బాట మొదట నీవు నీ గుట్టలను ఏర్పాటు చేశావు; ప్రతి వీధి చివర నీ ఆరాధనా స్థలాలు నెలకొల్పావు. ఆ మనుష్యులందరితో నీవు వ్యభిచరించావు. అయినా, నిజంగా ఒక వేశ్య అడిగినట్లు నీవు వారిని డబ్బు అడగలేదు. 32 నీవు వ్యభిచారివి. నీవు నీ భర్తతో గాకుండా, క్రొత్త వారితో సంభోగానికి ఇష్ట పడ్డావు. 33 వేశ్యలలో అధిక సంఖ్యాకులు తమ కోర్కె తీర్చుకొనే పురుషులను డబ్బు ఇమ్మని పీడిస్తారు. కాని నీవు మాత్రం అనేకంగా వున్న నీ విటులకు నీ బహుమానాలను, డబ్బును ఇచ్చావు. నీతో వ్యభిచరించడానికి చుట్టూవున్న పురుషులకు డబ్బిచ్చావు. 34 చాలా మంది వేశ్యలకన్నా నీవు భిన్నంగా వున్నావు. చాలా మంది వేశ్యలు పురుషులను డబ్బు ఇమ్మని బాధిస్తారు. కాని నీవు మాత్రం నిన్ను పొందమని నీ విటులకు డబ్బు ఎదురిస్తున్నావు.”
35 ఓ వేశ్యా, యెహోవా నుండి వచ్చిన సందేశం విను. 36 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, “నీ స్వంత డబ్బు ఖర్చు పెట్టి నీ విటులకు, హేయమైన దేవతలకు నీ నగ్నత్వాన్ని చూపించి, వారితో వ్యభిచరించావు. నీ పిల్లల్ని నీవు చంపావు. నీవు వారి రక్తాన్ని వారపోశావు. ఆ బూటకపు దేవుళ్ళకు అది నీ కానుక. 37 అందువల్ల నీ విటులనందరినీ కూడదీస్తున్నాను. నీవు ప్రేమించిన మనుష్యులందరినీ, నీవు అసహ్యించుకున్న మనుష్యులందరినీ తీసుకువస్తాను. వాళ్లందరినీ ఒక్కసారిగా తీసుకొని వచ్చి, వారు నీ నగ్న స్వరూపాన్ని[d] చూసేలా చేస్తాను. నీ పూర్తి దిగంబరత్వాన్ని వారు చూస్తారు. 38 అప్పుడు నేను నిన్ను శిక్షిస్తాను. ఒక హంతకురాలిగా, వ్యభిచారిణిగా నీ పాప నిరూపణ చేసి నిన్ను శిక్షిస్తాను. కోపగించిన, అసూయ చెందిన ఒక భర్త చేతవలె నీవు శిక్షింపబడతావు. 39 నిన్ను నీ ప్రేమికుల చేతుల్లో పడవేస్తాను. వారు నీ గుట్టలన్నీ ధ్వంసం చేస్తారు. వారు నీ ఆరాధనా స్థలాలన్నీ తగలబెడతారు. వారు నీ బట్టలు చించివేస్తారు. వారు నీ అందమైన ఆభరణాలన్నీ తీసుకొంటారు. వారు నిన్ను నిలువు దోపిడీ చేసి, నేను నిన్ను కనుగొన్నప్పుడు వున్నట్లు నగ్నంగా వదులుతారు. 40 వారు ఒక పెద్ద గుంపును తీసుకొని వచ్చి నిన్ను చంపటానికి బండరాళ్ళు విసురుతారు. వారి కత్తులతో నిన్ను ముక్కలుగా నరుకుతారు. 41 వారు నీ ఇంటిని (ఆలయం) తగలబెడతారు. ఇతర స్త్రీలందరూ చూచే విధంగా వారు నిన్ను శిక్షిస్తారు. నీవు వేశ్యా జీవితం గడపకుండా నిన్ను కట్టుదిట్టం చేస్తాను. నీ విటులకు నీవు డబ్బు ఇవ్వకుండా నిన్ను ఆపుతాను. 42 అప్పుడు నేను కోపాన్ని ఆపి, అసూయ చెందకుండా వుంటాను. నేను శాంతిస్తాను. ఆ పిమ్మట నేను మరెన్నడూ కోపగించను. 43 ఈ విషయాలన్నీ ఎందుకు సంభవిస్తాయి? ఎందుకనగా నీవు చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఏమి జరిగినదో నీకు జ్ఞాపకం లేదు గనుక. ఆ చెడ్డ పనులన్నీ నీవు చేసి నాకు కోపం కలిగించావు. ఆ చెడు కార్యాలు చేసినందుకు నిన్ను నేను శిక్షించవలసి ఉంది. అయినా నీవు మరిన్ని భయంకరమైన పనులు చేయటానికి వ్యూహం సిద్ధం చేశావు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
44 “నిన్ను గురించి చెప్పుకునే ప్రజలందరికీ ఇప్పుడు ఇంకొక విషయం తోడవుతుంది. వారంతా, ‘తల్లిలాగనే కూతురు కూడ’ అని అంటారు. 45 అచ్చం నీవు నీ తల్లి కూతురువే. నీవు నీ భర్తను గురించి గాని, నీ పిల్లలను గురించి గాని శ్రద్ధ చేయవు. నీవు ఖచ్చితంగా నీ సోదరిలా వున్నావు. మీ ఇద్దరూ మీ భర్తలను, మీ పిల్లలను అసహ్యించుకున్నారు. మీరు మీ తల్లిదండ్రుల వలెనే ప్రవర్తిస్తున్నారు. నీ తల్లి హిత్తీయురాలు. నీ తండ్రి అమోరీయుడు. 46 నీ పెద్ద సోదరి సమరయ (షోమ్రోను). ఆమె నీకు ఉత్తరంగా తన కుమార్తెలతో (పట్టణాలు) నివసిస్తోంది. నీ చిన్న సోదరి సొదొమ[e] ఆమె నీకు దక్షిణంగా తన కుమార్తెలతో (పట్టణాలు) నివసిస్తూ ఉంది. 47 వారు చేసిన మహా పాపాలన్నీ నీవూ చేశావు. కాని నీవింకా ఘోరమైన తప్పు పనులు చేశావు! 48 నేనే ప్రభువును; యెహోవాను. నేను సజీవుడను. నా జీవ ప్రమాణంగా చెపుతున్నాను. నీవు, నీ కుమార్తెలు చేసినన్ని చెడు కార్యాలు నీ సోదరి సొదొమ, ఆమె కుమార్తెలు ఎన్నడూ చేయలేదు.”
49 దేవుడు ఇలా చెప్పసాగాడు: “నీ సోదరి సొదొమ, ఆమె కుమార్తెలు గర్విష్ఠులు. వారికి తినటానికి పుష్కలంగా ఉంది. వారికి కావలసినంత తీరుబడి సమయం ఉంది. వారు పేదలను గాని, నిస్సహాయులను గాని ఆదుకోలేదు. 50 సొదొమ, ఆమె కుమార్తెలు అతి గర్విష్ఠులయి నా ఎదుటనే భయంకరమైన పాపాలు చేయటం మొదలు పెట్టారు. వారు చెడుకార్యాలు చేయటం నేను చూసి, వారిని శిక్షించాను.”
51 దేవుడు ఇంకా ఇలా చెప్పాడు, “నీవు చేసిన చెడుకార్యాలలో సమరయ సగం మాత్రమే చేసింది. సమరయ చేసిన వాటికంటే ఎన్నో ఘోరమైన పనులు నీవు చేశావు! నీ తోబుట్టువుల కంటె నీవు అనేకానేక చెడుకార్యాలు చేశావు. నీతో పోల్చి చూస్తే సొదొమ, సమరయ ఎంతో మెరుగు. 52 కావున నీ సిగ్గు నీవు భరించాలి. నీతో పోల్చినప్పుడు నీ తోబుట్టువులు మంచివాళ్లుగా కన్పించేలా నీవు ప్రవర్తించావు. నీవు ఘోరమైన చెడుకార్యాలు చేశావు. అందుకు నీవు సిగ్గుపడాలి.”
53 దేవుడు ఇలా చెప్పసాగాడు: “నేను సొదొమను, దాని చుట్టూ వున్న పట్టణాలను నాశనం చేశాను. నేనింకా సమరయను, దాని చుట్టూ వున్న పట్టణాలను. నాశనం చేశాను. మరియు, ఓ యెరూషలేమా, నిన్ను నాశనం చేస్తాను. కాని ఆ నగరాలను నేను మళ్లీ నిర్మిస్తాను. ఓ యెరూషలేమా, నిన్ను కూడా నేను తిరిగి నిర్మిస్తాను. 54 నిన్ను ఓదార్చుతాను. అప్పుడు నీవు చేసిన భయంకరమైన పనులు నీకు జ్ఞాపకం వస్తాయి. నీవు సిగ్గుపడతావు. 55 కావున నీవు, నీ తోబుట్టువులు తిరిగి నిర్మింపబడతారు. సొదొమ, దాని చుట్టూ వున్న పట్టణాలు; సమరయ, దాని చుట్టూ వున్న పట్టణాలు మరియు నీవు, నీ చుట్టూ వున్న పట్టణాలు, అన్నీ తిరిగి నిర్మింపబడతాయి.”
56 దేవుడు ఇలా అన్నాడు: “గతంలో నీవు గర్వంగా వున్నావు. నీ సోదరి సొదొమను నీవు ఎగతాళి చేశావు. కాని మళ్లీ నీవు అలా చేయలేవు. 57 నీవు శిక్షింపబడక ముందు, నీ పొరుగువారు నిన్ను చూచి నవ్వక ముందు నీవది చేశావు. ఎదోము (అరాము) కుమార్తెలు (పట్టణాలు), మరియు ఫిలిష్తీయులు ఇప్పుడు నిన్ను చూచి నవ్వుతున్నారు. 58 నీవు చేసిన ఘోర పాపాలకు ఫలితం ఇప్పుడు నీవు తప్పక అనుభవించాలి.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
దేవుడు నమ్మకస్థడుగా నిలుచుట
59 నీ ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “నీవు నీ వివాహ ప్రమాణాన్ని నిలబెట్టుకోలేదు. మన ఒడంబడికను నీవు గౌరవించలేదు. 60 నీవు యౌవ్వన వయస్సులో వున్నప్పుడు మనం చేసుకొన్న నిబంధన నాకు జ్ఞాపకం ఉంది. నేను నీతో సదా కొనసాగే ఒక నిబంధన చేసుకొన్నాను! 61 నీ తోబుట్టువులను నీ వద్దకు చేర్చుతాను. వారిని నీ కుమార్తెలుగా తయారు చేస్తాను. అది మన నిబంధనలో లేకపోయినప్పటికీ, నీకొరకు నేనది చేస్తాను. అప్పుడు నీవు చేసిన భయంకరమైన పనులు జ్ఞాపకం చేసుకొని సిగ్గుతో క్రుంగిపోతావు. 62 నీతో నేను చేసుకొన్న ఒడంబడికను కాపాడుతాను. అప్పుడు నేను యెహోవానని నీవు తెలుసుకొంటావు. 63 నేను నీపట్ల ఉదారంగా ఉంటాను. దానివల్ల నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని, నీవు చేసిన పాపకార్యాలను తలచుకొని సిగ్గుతో కుమిలిపోతావు. నేను నిన్ను పరిశుద్దం చేస్తాను. మళ్లీ నీవు ఎన్నడూ సిగ్గు పడనవసరం లేదు!” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం.
58 న్యాయమూర్తుల్లారా, మీరు మీ నిర్ణయాల్లో న్యాయంగా ఉండటంలేదు.
మీరు ప్రజలకు న్యాయంగా తీర్పు చెప్పటంలేదు.
2 లేదు, మీరు చేయగల కీడును గూర్చి మాత్రమే మీరు తలుస్తారు.
ఈ దేశంలో మీరు బలాత్కారపు నేరాలే చేస్తారు.
3 ఆ దుర్మార్గులు తాము పుట్టగానే తప్పులు చేయటం మొదలు పెట్టారు.
పుట్టినప్పటి నుండి వారు అబద్దికులే.
4 వారు సర్పాలంత ప్రమాదకరమైన వాళ్లు.
వినలేని త్రాచుపాముల్లా, ఆ దుర్మార్గులు సత్యాన్ని వినేందుకు నిరాకరిస్తారు.
5 త్రాచుపాములు సంగీతంగాని, పాములను ఆడించే వాని నాగ స్వరంగాని వినవు.
ఆ దుర్మార్గులు అలా ఉన్నారు.
6 యెహోవా, ఆ మనుష్యులు సింహాల్లా ఉన్నారు.
కనుక యెహోవా, వారి పళ్లు విరుగగొట్టుము.
7 ఖాళీ అవుతున్న నీళ్లలా ఆ మనుష్యులు మాయమవుదురుగాక.
బాటలోని కలుపు మొక్కల్లా వారు అణగదొక్కబడుదురు గాక.
8 మట్టిలో దూరిపోయే నత్తల్లా వారు ఉందురుగాక.
చచ్చి పుట్టి, పగటి వెలుగు ఎన్నడూ చూడని శిశువులా వారు ఉందురు గాక.
9 కుండక్రింద ఉన్న నిప్పువేడిలో అతిత్వరగా
కాలిపోయే ముళ్లకంపలా వారు వెంటనే నాశనం చేయబడుదురు గాక.
10 మనుష్యులు తమకు చేసిన చెడు పనుల నిమిత్తం
వారికి శిక్ష విధించబడినప్పుడు మంచివాడు సంతోషిస్తాడు.
ఆ దుర్మార్గుల రక్తంలో అతడు తన పాదాలు కడుగుకొంటాడు.
11 అది జరిగినప్పుడు, ప్రజలు ఇలా అంటారు: “మంచి మనుష్యులకు నిజంగా ప్రతిఫలం కలిగింది.
లోకానికి తీర్పు తీర్చే దేవుడు నిజంగానే ఉన్నాడు.”
సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం. దావీదును చంపేందుకు అతని యింటిని చూచి రమ్మని సౌలు తన మనుష్యులను పంపిన సందర్భం.
59 దేవా, నా శత్రువుల నుండి నన్ను రక్షించుము
నాతో పోరాడేందుకు నా మీదికి వచ్చే మనుష్యులను జయించేందుకు నాకు సహాయం చేయుము.
2 కీడు చేసే మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
ఆ నరహంతకుల నుండి నన్ను రక్షించుము.
3 చూడు, బలాఢ్యులు నా కోసం కనిపెట్టి ఉన్నారు.
నన్ను చంపేందుకు వారు కనిపెట్టుకున్నారు.
నేను పాపం చేసినందువలన లేక ఏదో నేరం చేసినందువలన కాదు.
4 వారు నన్ను తరుముతున్నారు. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు.
యెహోవా, వచ్చి నీ మట్టుకు నీవే చూడు!
5 నీవు సర్వశక్తిమంతుడవైన దేవుడవు, ఇశ్రాయేలీయుల దేవుడవు.
లేచి జనాంగములన్నిటినీ శిక్షించుము.
ఆ దుర్మార్గపు ద్రోహులకు ఎలాంటి దయా చూపించకుము.
6 ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణములోకి వస్తారు.
వారు మొరిగే కుక్కల్లా పట్టణమంతా తిరుగుతారు.
7 వారి బెదరింపులు, అవమానపు మాటలు వినుము.
వారు అలాంటి క్రూరమైన సంగతులు చెబుతారు.
వాటిని వింటున్నది ఎవరో వారికి అనవసరం.
8 యెహోవా, వారిని చూసి నవ్వుము.
ఆ జనాలను గూర్చి ఎగతాళి చేయుము.
9 దేవా, నీవే నా బలం, నేను నీకోసం కనిపెట్టుకొన్నాను.
దేవా, నీవే పర్వతాలలో ఎత్తయిన నా క్షేమస్థానం.
10 దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. జయించుటకు ఆయనే నాకు సహాయం చేస్తాడు.
నా శత్రువులను జయించుటకు ఆయనే నాకు సహాయం చేస్తాడు.
11 దేవా, వారిని ఊరకనే చంపివేయకు. లేదా నా ప్రజలు మరచిపోవచ్చును.
నా ప్రభువా, నా సంరక్షకుడా, నీ బలంతో వారిని చెదరగొట్టి, వారిని ఓడించుము.
12 ఆ దుర్మార్గులు శపించి అబద్ధాలు చెబుతారు.
వారు చెప్పిన విషయాలను బట్టి వారిని శిక్షించుము.
వారి గర్వం వారిని పట్టుకొనేలా చేయుము.
13 నీ కోపంతో వారిని నాశనం చేయుము.
వారిని పూర్తిగా నాశనం చేయుము.
అప్పుడు యాకోబు ప్రజలనూ, సర్వప్రపంచాన్నీ
దేవుడు పాలిస్తున్నాడని మనుష్యులు తెలుసుకొంటారు.
14 ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణంలోకి వచ్చి
మొరుగుతూ పట్టణం అంతా తిరుగే కుక్కల్లాంటివారు.
15 వారు తినుటకు ఏమైనా దొరుకుతుందని వెదకుతూ పోతారు.
వారికి ఆహారం దొరకదు. నిద్రించుటకంత స్థలం దొరకదు.
16 మరి నేనైతే,,,,,,,,,, నీకు స్తుతి గీతాలు పాడుతాను.
ఉదయాలలో నీ ప్రేమయందు ఆనందిస్తాను.
ఎందుకంటే ఎత్తయిన పర్వతాలలో నీవే నా క్షేమ స్థానం,
కష్టాలు వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు పరుగెత్తగలను.
17 నేను నీకు నా స్తుతిగీతాలు పాడుతాను.
ఎందుకంటే ఎత్తయిన పర్వతాలలో నీవే నా క్షేమస్థానం.
నీవు నన్ను ప్రేమించే దేవుడవు.
© 1997 Bible League International