Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 సమూయేలు 6

దేవుని పవిత్ర పెట్టెను యెరూషలెముకు తరలించుట

దావీదు మరల ప్రత్యేకంగా ఉత్తములైన ముప్పదివేల మంది ఇశ్రాయేలు యోధులను సమకూర్చుకొన్నాడు. దావీదు వారిని తీసుకొని యూదాలో ఉన్న బాలాకు[a] ప్రయాణమై వెళ్లాడు. యూదాలోని బాలాలో ఉన్న దేవుని పవిత్ర పెట్టె తీసుకొని, దానిని యెరూషలేముకు బయలు దేర దీసినారు. ఈ పవిత్ర పెట్టె సైన్యములకు అధిపతియైన యెహోవా పరమ పవిత్ర నామంతో పిలవబడుతూ ఉంది. పవిత్ర పెట్టె పైనున్న కెరూబుల మధ్య ఆయన ఆసీనుడైయున్నాడు. దావీదు మనుష్యులు యెహోవా పవిత్ర పెట్టెను ఒక కొత్త బండిపై ఉంచారు. కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటినుండి వారా పెట్టెను తెచ్చారు. అబీనాదాబు కుమారులైన ఉజ్జా మరియు అహ్యో అనువారు ఆ బండిని తోలారు.

కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటినుండి ఉజ్జా, అహ్యోలిరువురూ ఆ బండిని బయలుదేరదీశారు. బండిపై దేవుని పవిత్ర పెట్టె వున్నది. అహ్యో బండిముందు నడుస్తూ ఉన్నాడు. దావీదు, మరియు ఇశ్రాయేలీయులందరూ యెహోవా ముందు రకరకాల వాద్య విశేషాలు వాయిస్తూ ఉన్నారు. ఈ వాద్య పరికరాలు తమాల వృక్షపు కర్రతో చేయబడ్డాయి. ఆ వాద్య విశేషములలో వీణలు, విచిత్ర వీణలు, మృదంగములు, ఢమరుకములు, తాళములు మొదలగునవి ఉన్నాయి. దావీదు మనుష్యులు నాకోను నూర్పిడి కళ్లం దగ్గరకు రాగానే ఎద్దులు తూలి పడబోయాయి. దానితో బండి మీదవున్న దేవుని ఒడంబడిక పెట్టె ఒరిగి క్రింద పడబోయింది. వెంటనే ఉజ్జా పవిత్ర పెట్టెను పట్టుకున్నాడు. యెహోవాకు ఉజ్జాపై కోపం వచ్చి చంపివేశాడు.[b] దేవుని పవిత్ర పెట్టెను తాకినప్పుడు ఉజ్జా దేవుని గౌరవించినట్లు గాదు. దేవుని పవిత్ర పెట్టెవలన ఉజ్జా చంపబడ్డాడు. ఉజ్జాను యెహోవా చంపినందుకు దావీదు కలత చెందాడు. దావీదు ఆ స్థలానికి “పెరెజ్‌ – ఉజ్జా”[c] అని పేరు పెట్టాడు. ఆ ప్రదేశం ఈనాటికీ పెరెజ్‌ – ఉజ్జా అనే పిలవబడుతూ వుంది.

ఆ రోజు దావీదు యెహోవా అంటే భయపడిపోయాడు. “ఇప్పుడు దేవుని పవిత్ర పెట్టె నా వద్దకు ఎలా వస్తుంది?” అని అడిగాడు. 10 దావీదు పురములోనికి తనకై తాను దేవుని పవిత్ర పెట్టెను దావీదు తీసుకొని పోవుటకు సుముఖత చూపలేదు. గాతువాడైన ఓబేదెదోము[d] ఇంటిలో పవిత్ర పెట్టెను దావీదు వుంచాడు. బాటమీద నుంచి గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటివరకు పవిత్ర పెట్టెను దావీదు మోసాడు. 11 ఓబేదెదోము ఇంటి వద్ద యెహోవా పవిత్ర పెట్టె మూడు నెలలపాటు వుండెను. కాబట్టి ఓబేదెదోమును, అతని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు.

12 ప్రజలు దావీదు వద్దకు వచ్చి, “దేవుని పవిత్ర పెట్టె అక్కడున్న కారణాన యెహోవా ఓబేదెదోము కుటుంబాన్ని, అతని వస్తువాహనాలను ఆశీర్వదించాడు” అని చెప్పారు. దానితో దావీదు ఓబేదెదోము ఇంటి నుండి దేవుని ఒడంబడిక పెట్టెను ఆనందోత్సాహాలతో తేవటానికి వెళ్లాడు. 13 యెహోవా పవిత్ర పెట్టెను మోసేవారు ఆరడుగులు నడిచి ఆగగా, దావీదు ఒక ఎద్దును, ఒక బలిసిన దూడను బలియిచ్చాడు. 14 పిమ్మట యెహోవా ముందు దావీదు నృత్యం చేశాడు. ఏఫోదు అనబడే యాజకుల పవిత్ర వస్త్రాన్ని ధరించాడు.

15 యెహోవా పవిత్ర పెట్టెను నగరంలోకి తెస్తూవుండగా దావీదు, ఇశ్రాయేలీయులంతా సంతోషంతో కేకలు వేశారు. బూరలు ఊదారు. 16 సౌలు కుమార్తె మీకాలు ఒక కిటికీ గుండా చూస్తూ వుంది. యెహోవా పవిత్ర పెట్టె నగరంలోనికి వచ్చినప్పుడు, యెహోవా ముందు దావీదు చిందులేస్తూ, నాట్యం చేస్తూవున్నాడు. ఇదంతా మీకాలు చూసి, దావీదును తన మనసులో అవమానించింది.

17 పవిత్ర పెట్టె కొరకు దావీదు ఒక గుడారం నిర్మింపజేశాడు. ఇశ్రాయేలీయులు యెహోవా పవిత్ర పెట్టెను గుడారంలో దాని స్థానంలో నిలిపారు. దావీదు అప్పుడు దహన బలులు, సమాధాన బలులు యెహోవాకు సమర్పించాడు.

18 దహన బలులు, సమాధాన బలులు సమర్పించాక, సర్వశక్తిమంతుడైన యెహోవా పేరిట దావీదు ప్రజలను ఆశీర్వదించాడు. 19 నైవేద్యంగా ఉంచిన రొట్టె, ఎండిన ద్రాక్ష భక్ష్యములు, ఖర్జూరపు పండువేసి చేసిన రొట్టెలను స్త్రీ పురుషులందరికీ, ఇశ్రాయేలీయులందరికీ ప్రసాదంగా పంచి పెట్టాడు. తరువాత వారంతా తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు.

మీకాలు దావీదును అవమానించటం

20 దావీదు తన ఇంటి వారిని ఆశీర్వదించటానికి వెళ్లాడు. కాని సౌలు కుమార్తె మీకాలు దావీదును కలవటానికి బయటికి వచ్చింది. “ఇశ్రాయేలు రాజు ఈనాడు తనను తాను ఏమాత్రం గౌరవించుకోలేదు. నీ సేవకుల పని గత్తెల ముందు నీవు నీ బట్టలు విప్పివేశావు.[e] సిగ్గు విడిచి బట్టలు విప్పుకునే ఒక మూర్ఖునిలా ప్రవర్తించావు!” అని బాగా అవమానించింది.

21 అందుకు దావీదు మీకాలుతో ఇలా అన్నాడు: “యెహోవా నన్ను ఎంపిక చేశాడు. అంతేగాని నీ తండ్రనీ కాదు, లేక అతని కుటుంబంలో మరెవ్వరినీ కాదు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులందరికీ నాయకునిగా యెహోవా నన్ను ఎంపిక చేశాడు. అందువల్ల యెహోవా ఎదుట నేను ఉత్సవం చేశాను. 22 బహుశః నీ దృష్టిలో నాకు గౌరవం లేకుండా పోవచ్చు. నాకు నేను ఇంకా కించ పర్చుకోవచ్చు. కాని నీవు చెప్పిన ఆ పనిగత్తెలు మాత్రం నన్ను గౌరవిస్తారు!”

23 ఈ రీతిగా దావీదును అవమానించినందున సౌలు కుమార్తె మీకాలుకు పిల్లలు కలుగలేదు. ఆమె గొడ్రాలుగానే చనిపోయింది.

1 కొరింథీయులకు 16

పరిశుద్ధుల కోసం చందా

16 పరిశుద్ధుల కోసం సేకరించవలసిన చందాల విషయంలో ఏం చెయ్యాలో, గలతీయలో ఉన్న సంఘాలకు చెప్పాను. మీరు కూడా అదే విధంగా చెయ్యండి. తన సంపాదనను బట్టి ప్రతి ఒక్కడూ కొంత డబ్బు ఆదివారం రోజు దాచాలి. అలా చేస్తే నేను వచ్చిన రోజెల్లా చందానెత్తనవసరం ఉండదు. నేను వచ్చాక మీరెన్నుకొన్నవాళ్ళకు పరిచయ పత్రాలు వ్రాసి వాళ్ళతో మీరు సేకరించిన డబ్బును యెరూషలేము పంపుతాను. నేను కూడా వెళ్ళటం ఉచితమని అనిపిస్తే అంతా కలిసి వెళ్తాం.

పౌలు ప్రణాళికలు

నేను మాసిదోనియ ద్వారా వెళ్ళాలి కనుక అక్కడికి వెళ్ళి, మీ దగ్గరకు వస్తాను. అలా చేస్తే నేను మీతో కొంతకాలం గడపవచ్చు. బహుశా చలికాలమంతా అక్కడే ఉంటానేమో. ఆ తర్వాత నా ముందు ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళటానికి మీరు సహాయపడవచ్చు. అందుకే ప్రస్తుతం మీ దగ్గరకు రావాలని లేదు. అలా చేస్తే, నేను వెళ్తూ మిమ్మల్ని చూసినట్లు మాత్రమే ఔతుంది. అలా కాక, ప్రభువు చిత్తమైతే మీతో కొంతకాలం గడపాలని ఉంది. నేను ఎఫెసులో పెంతుకొస్తు పండుగ దాకా ఉంటాను. అక్కడ ఫలవంతమైన కార్యాలు చెయ్యటానికి నాకొక గొప్ప అవకాశం కలిగింది. కాని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.

10 తిమోతి మీ దగ్గరకు వస్తే అతనికి ధైర్యం చెప్పండి. ఎందుకంటే, నాలాగే అతడు కూడా ప్రభువు కార్యాన్ని చేస్తున్నాడు. 11 ఎవ్వరూ అతణ్ణి నిరాకరించకండి. అతని ప్రయాణం శాంతంగా సాగేటట్లు చూడండి. అతడు యితర సోదరులతో కలిసి నా దగ్గరకు రానున్నాడు. అతని కోసం నేను ఎదురు చూస్తున్నాను.

12 ఇక మన సోదరుడైన అపొల్లోను గురించి: నేను మిగతా సోదరులతో కలిసి మీ దగ్గరకు వెళ్ళమని చాలా వేడుకొన్నాను. అతనికి ప్రస్తుతం వెళ్ళటానికి కొంచెం కూడా యిష్టం లేదు. కాని తనకు మనస్సున్నప్పుడు అతడు వస్తాడు.

పౌలు తన ఉత్తరాన్ని ముగించటం

13 మెలకువగా ఉండండి. సంపూర్ణంగా విశ్వసించండి. ధైర్యంగా ఉండండి. శక్తిని వదులుకోకండి. 14 చేసే కార్యాలు ప్రేమతో చెయ్యండి.

15 అకయ ప్రాంతంలో విశ్వాసులుగా మారినవాళ్ళలో స్తెఫను కుటుంబం మొదటిది. ఇది మీకు తెలుసు. వాళ్ళు తమ జీవితాన్ని విశ్వాసుల సేవకు అంకితం చేసారు. 16 వాళ్ళను అనుసరించుమని మిమ్మల్ని వేడుకొంటున్నాను. వాళ్ళనే కాక వాళ్ళతో కలిసి సేవ చేస్తున్న ప్రతి ఒక్కణ్ణీ మీరు అనుసరించాలి.

17 స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు వచ్చి మీరు తీర్చలేని కొరత తీర్చారు. వాళ్ళు రావటం వల్ల నాకు ఆనందం కలిగింది. 18 వాళ్ళు మీ ఆత్మలకు, నా ఆత్మకు ఆనందం కలిగించారు. వాళ్ళను గౌరవించటం సమంజసం.

19 ఆసియ ప్రాంతంలోని సంఘాలు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. అకుల, ప్రిస్కిల్ల మరియు వాళ్ళింట్లో సమావేశమయ్యే సంఘము మీకు ప్రభువు పేరిట తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 20 ఇక్కడున్న సోదరులందరు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోదరుల ప్రేమతో ఒకళ్ళనొకళ్ళు హృదయాలకు హత్తుకోండి. పవిత్రమైన ముద్దుతో ఒకరికొకరు వందనాలు చెప్పండి.

21 నేను పౌలును. ఈ శుభాకాంక్షలు నా స్వహస్తాలతో వ్రాస్తున్నాను.

22 ప్రభువును ప్రేమించనివాడు శాపగ్రస్థుడు అవుతాడు!

ప్రభువా రమ్ము![a]

23 యేసు ప్రభువు యొక్క అనుగ్రహము మీకందరికి లభించుగాక.

24 యేసు క్రీస్తు పేరిట నా ప్రేమ మీకందరికీ తెలుపుతున్నాను. ఆమేన్.

యెహెజ్కేలు 14

విగ్రహారాధనకు విరోధంగా హెచ్చరికలు

14 ఇశ్రాయేలు పెద్దలలో కొంతమంది నా వద్దకు వచ్చారు. వారు నాతో మాట్లాడాలని నావద్ద కూర్చున్నారు. ఆ సమయంలో యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఈ విధంగా చెప్పాడు. “నరపుత్రుడా, ఈ మనుష్యులు నీతో మాట్లాడాలని వచ్చారు. వారు నా సలహా కోరమని నిన్ను అడగటానికి వచ్చారు. కాని ఈ మనుష్యులు ఇంకా హేయమైన విగ్రహాలను కలిగివున్నారు. వారు పాపం చేయటానికి కారణమైన వస్తువులను వారింకా విడనాడలేదు. ఆ విగ్రహాలను వారింకా పూజిస్తూనే వున్నారు. అందువల్ల వారు నా సలహా కొరకు రావలసిన అవసరం ఏముంది? వారి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలా? అవసరం లేదు! అయినా నేను వారికి ఒక సమాధానం ఇస్తాను. ఆది నేను వారిని శిక్షించటం! ఈ విషయాలు నీవు వారికి చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ఇశ్రాయేలుకు చెందిన వాడెవడైనా ఒక ప్రవక్త వద్దకు వచ్చి నా సలహా కోరితే, ఆ ప్రవక్త వానికి సమాధానం చెప్పడు. నాకై నేనే ఆ వ్యక్తి ప్రశ్నకు సమాధానమిస్తాను. ఆ వ్యక్తి తన హేయమైన విగ్రహాలను కలిగివున్నా, తన పాపాలకు కారణమైన వస్తువులను దాచివుంచినా, అతడా విగ్రహారాధన చేసినా, నేనతనికి సమాధానమిస్తాను. వానివద్ద అపవిత్ర విగ్రహాలున్నా నేనతనితో మాట్లాడతాను. ఎందుకనగా నేను వారి హృదయాలను తాకకోరుచున్నాను. వారి నీచమైన విగ్రహాల కొరకు వారు నన్ను విడిచిపెట్టినా, నేను వారిని ప్రేమిస్తున్నట్లు చూపదలిచాను.’

“కావున ఇశ్రాయేలు వంశం వారికి ఈ విషయాలు చెప్పు. వారితో ఇలా అనాలి, ‘నా ప్రభువైన యెహోవా ఏమి చెబుతున్నాడనగా: నా వద్దకు తిరిగి రండి. మీ అపవిత్ర విగ్రహాలను వదిలివేయండి. ఆ బూటకపు దేవుళ్ళ నుండి దూరంకండి. ఏ ఇశ్రాయేలీయుడు గాని, ఇశ్రాయేలులో నివసించే పరదేశీయుడుగాని నా వద్దకు సలహా కోరివస్తే, వానికి నేను సమాధానమిస్తాను. అతను అపవిత్ర విగ్రహాలను కలిగియున్నా, తను పాపాలు చేయటానికి కారకమైన వస్తువులను అతను దాచుకున్నా, అతను విగ్రహాలను ఆరాధించినా, అతనికి నేను సమాధానమిస్తాను. నేను వారికిచ్చే సమాధాన మిది: నేనా వ్యక్తికి వ్యతిరేకినవుతాను. నేను వానిని నాశనం చేస్తాను. ఇతర ప్రజలకు అతడొక ఉదాహరణగా మిగులుతాడు. ప్రజలతనిని చూసి నవ్వుతారు. నా ప్రజల మధ్యనుండి అతనిని తొలగిస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకొంటారు! ఏ ప్రవక్తయేగాని మూర్ఖంగా తన స్వంత సమాధానమిస్తే, అతడెంత మూర్ఖుడో నేనతనికి నిరూపిస్తాను! అతనికి వ్యతిరేకంగా నా శక్తిని వినియోగిస్తాను. అతనని నాశనం చేసి, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల నుండి అతనిని తొలగిస్తాను. 10 కావున, సలహా కొరకు వచ్చిన వ్యక్తి, సమాధాన మిచ్చిన ప్రవక్త, ఇద్దరూ ఒకే శిక్షకు గురియవుతారు. 11 ఎందుకంటే, దానివల్ల ఆ ప్రవక్తలు నా ప్రజలను నాకు దూరం చేయకుండా ఆగిపోతారు. తద్వారా, నా ప్రజలు వారి పాపాలలో అపవిత్రము కాకుండా ఆగిపోతారు. అప్పుడు వారు నా ప్రత్యేక ప్రజలవుతారు. నేను వారి దేవుడనవుతాను.’” ఈ విషయాలన్నీ ప్రభువైన యెహోవా చెప్పాడు.

యెరూషలేము శిక్షించబడుతుంది

12 పిమ్మట యెహోవా వాక్కు నాకు తిరిగి వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు, 13 “నరపుత్రుడా, నన్ను వదిలిపెట్టిన, నా పట్ల పాపంచేసిన ఏ దేశాన్నయినా నేను శిక్షిస్తాను. వారికి ఆహార సరఫరాలను నిలిపి వేస్తాను. వారికి కరువు కాలం రప్పించి, ఆ దేశ జనాభాని పశుసంపదను తొలగిస్తాను. 14 ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు నివసిస్తున్నప్పటికీ దానిని నేను శిక్షిస్తాను. ఆ మనుష్యులు వారి మంచితనం చేత వారి ప్రాణాలను కాపాడుకొనగలరు. కాని మొత్తం దేశాన్ని వారు రక్షించలేరు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

15 దేవుడు ఇంకా ఇలా తెలియజెప్పాడు: “లేదా, నేను ఆ రాజ్యానికి క్రూర మృగాలను పంపవచ్చు. ఆ జంతువులు ప్రజలందరినీ చంపివేయవచ్చు. ఈ క్రూర మృగాల కారణంగా ఆ దేశం గుండా ఎవ్వరూ ప్రయాణం చేయరు. 16 ఒకవేళ ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు[a] నివసిస్తూవుంటే ఆ ముగ్గురు మంచి వ్యక్తులనూ నేను రక్షిస్తాను. ఆ ముగ్గురు మనుష్యులూ తమ ప్రాణాలను కాపాడుకోగలరు. నా జీవ ప్రమాణంగా వారు ఇతరుల ప్రాణాలను గాని, కనీసం వారి కుమారులను, కుమార్తెలను గాని రక్షించలేరని నిశ్చయంగా చెబుతున్నాను! ఆ చెడ్డదేశం నాశనం చేయబడుతుంది!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

17 దేవుడు ఈ విధంగా చెప్పాడు: “లేదా, నేను శత్రుసైన్యాన్ని ఆ దేశం మీదికి పంపవచ్చు. ఆ సైనికులు ఆ రాజ్యాన్ని నాశనం చేస్తారు. దేశంలో వున్న మనుష్యులను, జంతువులను తొలగించి వేస్తాను. 18 నోవహు, దానియేలు, యోబు అక్కడ వుంటే, ఆ ముగ్గురు మంచి వ్యక్తులను నేను రక్షిస్తాను. ఆ ముగ్గురు మునుష్యులూ వారి ప్రాణాలను కాపాడుకోగలుగుతారు. కాని, నా జీవ ప్రమాణంగా ఇతర ప్రజల ప్రాణాలను గాని, తమ స్వంత కుమారుల, కుమార్తెల ప్రాణాలను గాని కాపాడలేరని చెబుతున్నాను. ఆ చెడ్డదేశం నాశనం చేయబడుతుంది!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

19 దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “లేదా, ఆ దేశం మీద ఒక వ్యాధి ప్రబలేలా నేను చేయవచ్చు. ఆ ప్రజల మీద నా కోపం కుమ్మరిస్తాను. ఆ రాజ్యంనుండి ప్రజలందరినీ, పశువులన్నిటినీ నేను తొలగించి వేస్తాను. 20 ఒకవేళ నొవహు, దానియేలు, యోబు అక్కడ నివసిస్తే, ఆ ముగ్గురు మనుష్యులను నేను రక్షిస్తాను. ఎందువల్లనంటే వారు మంచి వ్యక్తులు. ఆ ముగ్గురూ తమ ప్రాణాలను కాపాడుకోగలరు. కాని, నా ఆత్మ సాక్షిగా వారు ఇతర ప్రజలను గాని, వారి స్వంత కొడుకులను, కుమార్తెలను గాని రక్షించలేరు!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

21 మళ్లీ నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెప్పాడు: “కావున యెరూషలేము పరిస్థితి ఎంత దారుణంగా వుంటుందో ఆలోచించు. ఆ నాలుగు రకాల శిక్షలనూ ఆ నగరం మీదికి పంపుతాను! ఆ నగరం మీదికి శత్రుసైన్యాలను. క్షామాన్ని, రోగాలను, క్రూర మృగాలను పంపుతాను. ఆ రాజ్యం నుండి ప్రజలను, పశువులను అందరినీ తొలగిస్తాను! 22 కొంతమంది ప్రజలు ఆ దేశంనుండి తప్పించు కుంటారు. వారు తమ కుమారులను, కుమార్తెలను తీసుకొని నీ సహాయం కొరకు వస్తారు. నిజంగా వారెంత చెడ్డవారో నీవప్పుడు తెలుసుకొంటావు. నేను యెరూషలేము మీదకి రప్పించే కష్టాలను గూర్చి నీవప్పుడు యోచించి అవి వారికి తగినవేనని నీవనుకుంటావు. 23 నీవు వారి జీవన విధానాన్ని, వారు చేసే చెడుకార్యాలను చూస్తావు. నేనా ప్రజలను శిక్షించటానికి తగిన కారణమున్నట్లు నీవు అప్పుడు తెలుసుకుంటావు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

కీర్తనలు. 55

సంగీత నాయకునికి: వాయిద్యాలతోపాడునది. దావీదు ప్రార్థన.

55 దేవా, నా ప్రార్థన వినుము.
    దయచేసి నాకు విముఖుడవు కావద్దు.
దేవా, దయతో నా ప్రార్థన విని నాకు జవాబు అనుగ్రహించుము.
    నా ఇబ్బందులు నీతో చెప్పుకోనిమ్ము.
నా శత్రువులు నాకు విరోధముగా చెప్పినదాన్నిబట్టి, మరియు దుష్టుల అణచివేతనుబట్టి నేను కలవరం చెందాను.
    నా శత్రువులు కోపముతో నా మీద దాడి చేశారు.
    వారు నా మీదకు కష్టాలు విరుచుకు పడేటట్టు చేసారు.
నాలో నా గుండె అదురుతోంది.
    నాకు చచ్చిపోయేటంత భయంగా ఉంది.
నాకు భయము మరియు వణకుగా ఉంది.
    నేను భయపడిపోయాను.
ఆహా, నాకు పావురమువలె రెక్కలు ఉంటే ఎంత బాగుంటుంది.
    నేను ఎగిరిపోయి విశ్రాంతి స్థలం వెతుక్కుందును కదా.
    నేను చాలా దూరంగా అరణ్యంలోనికి వెళ్లిపోదును.

నేను పరుగెత్తి పోదును.
    నేను తప్పించుకొని పారిపోదును. ఈ కష్టాల తుఫాను నుండి నేను పారిపోదును.
నా ప్రభువా, వారి అబద్ధపు మాటలను తారుమారు చేయుము.
    ఈ పట్టణంలో చాలా బలాత్కారం పోట్లాటలను నేను చూస్తున్నాను.
10 పట్టణం చుట్టూ దాని గోడల మీద రాత్రింబగళ్లు బలాత్కారము, యుద్ధము నడుస్తున్నాయి.
    ఈ పట్టణంలో దారుణమైన సంగతులు జరుగుతున్నాయి.
11 వీధుల్లో చాలా నేరం ప్రబలుతుంది.
    ఎక్కడ చూచినా మనుష్యులు అబద్ధాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.

12 ఒకవేళ శత్రువు నన్ను అవమానించటమే అయితే
    దానిని నేను భరించగలను.
ఒకవేళ నా శత్రువులు నాపై దాడిచేస్తే
    నేను దాక్కోగలను.
13 కాని, అది చేస్తున్నది నీవే.
    నీవు, నాకు తగినవాడవు, నా సహవాసివి, నా దగ్గర స్నేహితుడివి. నీవే నాకు కష్టాలు కలిగిస్తున్నావు.
14 మనం కలిసి మధుర సంభాషణ చేసేవాళ్లము.
    దేవుని ఆలయంలో మనము కలిసి సహవాసంలో నడిచాము.

15 నా శత్రువులు వారి సమయం రాకముందే మరణిస్తారనుకొంటాను.
    వారు సజీవంగానే సమాధి చేయబడ్తారని ఆశిస్తాను.
    ఎందుచేతనంటే వారు తమ ఇండ్లలో అలాంటి దారుణ విషయాలకు పథకాలు వేస్తారు.

16 నేను సహాయం కోసం దేవునికి మొరపెడతాను.
    యెహోవా నాకు జవాబు ఇస్తాడు.
17 సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం నా ఆరోపణలు దేవునికి నేను చెబుతాను.
    ఆయన నా మాట వింటాడు.
18 నేను చాలా యుద్ధాలు చేశాను.
    కాని దేవుడు నన్ను రక్షించాడు. ప్రతి యుద్ధం నుండి క్షేమంగా ఆయన నన్ను తిరిగి తీసుకొని వచ్చాడు.
19 దేవుడు అనాది కాలంనుండి సింహాసనాసీనుడు.
    నా మొర వింటాడు. ఆయన నా శత్రువులను ఓడిస్తాడు.

నా శత్రువులు వారి బ్రతుకులు మార్చుకోరు.
    వారు దేవునికి భయపడరు, గౌరవించరు.
20 నా స్నేహితుడు తన స్నేహితుల మీద దాడి చేసాడు.
    అతడు తన ఒప్పందాన్ని నిలబెట్టుకోలేదు.
21 అతడు వెన్నవలె మెత్తగా మాట్లాడుతాడు.
    కాని నిజానికి వాడు యుద్ధం తలపెడతాడు.
వాని మాటలు నూనె అంత నునుపుగా ఉంటాయి
    కాని ఆ మాటలు కత్తిలా కోస్తాయి.

22 నీ చింతలన్నిటినీ యెహోవాకు అప్పగించు
    ఆయన నీ విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడు.
    మంచి మనుష్యులను ఎన్నడూ ఓడిపోనివ్వడు.
23 కాని దేవా! దుష్టులను సమాధి అనే గుంటలోనికి అణచివేస్తావు.
    రక్తం చిందించే మనుష్యులు, విశ్వాసఘాతకులు అర్ధకాలమైనా జీవించరు.
కాని నేనైతే నీయందే విశ్వసిస్తాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International