Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 సమూయేలు 4-5

సౌలు కుటుంబానికి కష్టాలు రావటం

హెబ్రోనులో అబ్నేరు చనిపోయాడని సౌలు కుమారుడు ఇష్బోషెతు విన్నాడు. ఇష్బోషెతు, అతని ప్రజలు చాలా గాభరా చెందారు. సౌలు సైన్యంలో దళాధిపతులైన ఇరువురు సౌలు కుమారుడైన ఇష్బోషెతు వద్దకు వచ్చారు. ఆ ఇరువురిలో ఒకని పేరు బయనా, మరియొకని పేరు రేకాబు. బయానా, రేకాబులిద్దరూ బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. వారు బెన్యామీను వంశానికి[a] చెందిన వారు. బెయేరోతు పట్టణం బెన్యామీను వంశానికి చెందినది. కాని బెయేరోతు ప్రజలు గిత్తయీముకు పారిపోయి, ఈనాటికీ వారక్కడ నివసిస్తున్నారు.

సౌలు కుమారుడైన యోనాతానుకు కుంటివాడైన ఒక కుమారుడున్నాడు. యెజ్రెయేలు వద్ద సౌలు, అతని కుమారుడు యోనాతాను చనిపోయారన్న వార్త వచ్చే సమయానికి యోనాతాను కుమారుడు ఐదేండ్లవాడు. అప్పుడా పిల్లవాని దాది వాని నెత్తుకొని పారి పోయినది. ఖంగారుగా పారిపోయేటప్పుడు, దాది చేతులలో నుండి యోనాతాను కుమారుడు జారిక్రిందపడ్డాడు. అందువల్ల యోనాతాను కుమారుడు కుంటివాడయ్యాడు. వీని పేరు మెఫీబోషెతు.

రేకాబు, బయనాలిరువురూ బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. వారు ఇష్బోషెతు ఇంటికి మిట్ట మధ్యాహ్న సమయంలో వెళ్లారు. ఎండ తీవ్రంగా ఉన్నందున ఇష్బోషెతు విశ్రాంతి తీసుకొంటున్నాడు. 6-7 రేకాబు, బయనా గోధుమలు తీసుకొని వెళ్లాలనే నెపంతో నట్టింట్లోకి వచ్చారు. ఇష్బోషెతు తన పడకగదిలో పక్కమీద పడుకున్నాడు. రేకాబు, బయనాలిద్దరూ ఇష్బోషెతును పొడిచి చంపారు. వారు అతని తల నరికి దానిని వారితో తీసుకొనిపోయారు. రాత్రంతా ప్రయాణం చేసి, హెబ్రోనుకు వచ్చారు. ఇష్బోషెతు తలను దావీదుకు ఇచ్చారు.

రేకాబు, బయనాలు దావీదు రాజుతో ఇలా అన్నారు: “నీ శత్రువైన సౌలు కుమారుడు ఇష్బోషెతు తల ఇదిగో. అతడు నిన్ను చంప ప్రయత్నం చేశాడు! యెహోవా ఈ రోజు సౌలును, అతని కుటుంబాన్ని శిక్షించాడు!”

రేకాబు, బయనాలకు సమాధానంగా దావీదు ఇలా అన్నాడు: “యెహోవా జీవము తోడుగా, నిజానికి అతను నన్ను అనేక కష్టాల నుంచి రక్షించాడు. 10 ఒకానొకడు నాకేదో మంచివార్త చెప్పాలన్నట్లు వచ్చాడు. వాడు వచ్చి, ‘సౌలు చచ్చిపోయాడు!’ అని చెప్పాడు. ఆ వార్త నాకు అందచేసినందుకు వానికి నేను పారితోషికము ఇస్తాననుకున్నాడు. కాని నేను వానిని పట్టుకొని సిక్లగు వద్ద చంపివేశాను. 11 కావున మీ చావును కూడ నేను కోరుతున్నాను. ఎందుకనగా దుష్టులు ఒక మంచి వ్యక్తిని అతని పక్కమీదే, అతని ఇంటిలోనే హత్య చేశారు!”

12 దావీదు కొందరు యువకులను పిలిచి రేకాబు, బయనాలను చంపమన్నాడు. అప్పుడా యువకులు రేకాబు, బయనాల కాళ్లు, చేతులు నరికి, హెబ్రోను మడుగు వద్ద వేలాడ దీశారు. తరువాత ఇష్బోషెతు తలను తీసుకొని హెబ్రోనులో అబ్నేరు సమాధి వద్ద పాతి పెట్టారు.

ఇశ్రాయేలీయులు దావీదును రాజు చేయటం

అప్పుడు ఇశ్రాయేలు వంశాల వారందరూ హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి ఇలా అన్నారు: “చూడండి; మనమంతా ఒకే కుటుంబం![b] గతంలో సౌలు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల యుద్ధాలలో నీవు మమ్ములను నడిపించావు. మరియు ఇశ్రాయేలును యుద్ధము నుంచి ఇంటికి తిరిగి రప్పించావు. ‘ఇశ్రాయేలీయులైన నా ప్రజలకు నీవు కాపరివవుతావు. ఇశ్రాయేలుకు పాలకుడవవుతావు’ అని యెహోవా నీకు చెప్పాడు.”

ఇశ్రాయేలు నాయకులంతా హెబ్రోనులో ఉన్న దావీదు రాజు వద్దకు వచ్చారు. దావీదు రాజు హెబ్రోనులో ఆ వచ్చిన నాయకులతో యెహోవా సమక్షంలో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. అప్పుడా నాయకులంతా దావీదును ఇశ్రాయేలు రాజుగా అభిషేకించారు.

పరిపాలన చేపట్టే నాటికి దావీదు ముప్పది సంవత్సరాల వాడు. అతడు నలుబది సంవత్సరాలు పాలించాడు. హెబ్రోనులో వుండి యూదా రాజ్యాన్ని ఏడు సంవత్సరాల, ఆరు నెలలు పాలించాడు. పిమ్మట యెరూషలేము నుంచి ఇశ్రాయేలు, యూదా రాజ్యాలను ముప్పదిమూడు సంవత్సరాలు పాలించాడు.

దావీదు యెరూషలేమును జయించుట

రాజు తన మనుష్యులతో యెబూసీయుల మీదికి దండెత్తి యెరూషలేముకు పోయెను. (యెబూసీయులుదేశంలో నివాసం ఏర్పరచుకొని స్థిరపడిపోయారు). యెబూసీయులు దావీదుతో, “నీవు మా నగరంలోకి రాలేవు.[c] ఒకవేళ వస్తే, కుంటి, గుడ్డివారు సహితం నిన్ను విరోధిస్తారు”[d] అని అన్నారు. కాని దావీదు సీయోను కోటను[e] వశపర్చుకున్నాడు. తరువాత దానినే దావీదు నగరం అని పిలవటం మొదలు పెట్టారు.

ఆ రోజు దావీదు తన మనుష్యులతో, “మీరు యెబూసీయులను ఓడించాలంటే నీటి సొరంగం[f] ద్వారా ఆ ‘కుంటి మరియు గ్రుడ్డి’ శత్రువుల వద్దకు వెళ్లండి” అని అన్నాడు. అందువల్లనే, “కుంటి, గ్రుడ్డివారు ఇంట్లోకి[g] రాలేరని” అంటారు.

దావీదు కోటలో నివసించి, దానిని “దావీదు నగరం” అని పిలిచాడు. మిల్లో[h] నుండి చుట్టు పక్కల అనేక భవనాలను దావీదు కట్టించాడు. సీయోను నగరంలో కూడా అనేక కట్టడాలను చేపట్టి లోపల బాగా అభివృద్ధి చేశాడు. 10 సర్వశక్తిమంతుడైన దేవుడు అతనికి తోడైయున్నందున, దావీదు క్రమంగా బలపడి వర్థిల్లాడు.

11 తూరు రాజైన హీరాము కొందరు దూతలను దావీదు వద్దకు పంపాడు. వారితో పాటు దేవదారు కలపను, వడ్రంగులను, శిల్పులను పంపాడు. వారంతా దావీదుకు ఒక భవనం నిర్మించారు. 12 నిజంగా యెహోవా తనను ఇశ్రాయేలుకు రాజును చేసినట్లు దావీదుకు ఆ సమయంలో అర్థమయ్యింది. యెహోవా ప్రజలైన ఇశ్రాయేలీయులకు తన రాజ్యాన్ని చాలా ముఖ్యమైనదిగా దేవుడు చేసినాడని దావీదు తెలుసుకొన్నాడు.

13 దావీదు యెరూషలేము నుండి పెక్కు మంది దాసీలను, భార్యలను స్వీకరించాడు. హెబ్రోను నుండి యెరూషలేముకు వెళ్లిన పిమ్మట దావీదు ఆ పని చేసాడు. దావీదుకు చాలా మంది కుమారులు, కుమార్తెలు కలిగారు. 14 యెరూషలేములో దావీదుకు కలిగిన కుమారుల పేర్లు: షమ్మూ, యషోబాబు, నాతాను, సొలొమోను, 15 ఇభారు, ఏలీషూవ, నెపెగు, యాఫీయ, 16 ఎలీషామా, ఎల్యాదా మరియు ఎలీపేలెటు.

ఫిలిష్తీయుల పైకి దావీదు యుద్దానికి పోవటం

17 ఇశ్రాయేలీయులు దావీదును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించారని ఫిలిష్తీయులు వినగానే, ఫిలిష్తీయులంతా దావీదును చంపాలని వెదకటం మొదలు పెట్టారు. కాని ఈ వార్త దావీదు విన్నాడు. అతను ఒక కోటలోకి వెళ్లాడు. 18 ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయలో దిగారు.

19 దావీదు ప్రార్థన చేసి, “ఫిలిష్తీయుల మీదికి యుద్దానికి వెళ్లనా? ఫిలిష్తీయులను ఓడించటంలో నాకు సహాయపడతావా?” అని యెహోవాను అడిగాడు.

“వెళ్లు. ఫిలిష్తీయులను ఓడించటంలో నీకు నేను తప్పక సహాయం చేస్తాను” అని యెహోవా చెప్పాడు.

20 అప్పుడు దావీదు బయల్పెరాజీముకు వచ్చి, ఫిలిష్తీయులను ఓడించాడు. “ఆనకట్ట తెగి నీళ్లు పరవళ్లు తొక్కుతూ ప్రవహించినట్లు, యెహోవా నా శత్రువులను నాముందు చెల్లాచెదురై పారిపోయేలా చేసాడు,” అని అనుకున్నాడు దావీదు. ఆ కారణం చేత దావీదు ఆ ప్రదేశానికి బయల్పెరాజీము[i] అని పేరుపెట్టాడు. 21 ఫిలిష్తీయులు పారిపోతూ తమ దేవుళ్ల విగ్రహాలను బయల్పెరాజీము వద్ద వదిలిపోయారు. దావీదు, అతని మనుష్యులు ఆ విగ్రహాలన్నిటినీ తీసుకొని వెళ్లారు.

22 ఫిలిష్తీయులు మళ్లీ రెఫాయీము లోయలోకి వచ్చిదిగారు.

23 దావీదు యెహోవాని ప్రార్థించాడు. ఈ సారి యెహోవా దావీదుతో ఇలా అన్నాడు, “తిన్నగా అక్కడికి వెళ్లవద్దు. వాళ్లను చుట్టుముట్టి సైన్యానికి వెనుకగా వెళ్లు. గులిమిడి చెట్లవద్ద వారిని ఎదుర్కో. 24 చెట్ల మీదకు ఎక్కి కూర్చుని, ఫిలిష్తీయులు యుద్ధానికి నడిచివచ్చే శబ్దం వింటావు. అప్పుడు నీవు త్వరపడాలి. ఎందుకంటే యెహోవా అక్కడ ఫిలిష్తీయులను ఓడించటానికి నీ కొరకు ఉన్నట్లు అది సంకేతం.”

25 యెహోవా తనను ఏమి చేయమని ఆజ్ఞ ఇచ్చాడో దావీదు అదంతా చేశాడు. అతను ఫిలిష్తీయులను ఓడించాడు. అతడు వారిని గెబ నుండి గెజెరు వరకు తరుముకుంటూ పోయి చంపాడు.

1 కొరింథీయులకు 15

క్రీస్తు బ్రతికి రావటం

15 సోదరులారా! నేను మీకు ప్రకటించిన సువార్తను విని దాన్ని సంపూర్ణంగా విశ్వసించారు. దాన్ని మీకు మళ్ళీ జ్ఞాపకం చెయ్యాలని నా ఉద్దేశ్యం. నేను బోధించిన సువార్తను మీరు విడవకుండా అనుసరిస్తే అది మీకు రక్షణ కలిగిస్తుంది. లేనట్లయితే మీ విశ్వాసం వృధా అయిపోతుంది.

నేను పొందినదాన్ని మీకు మొదట అందించాను. లేఖనాల్లో వ్రాయబడిన విధంగా క్రీస్తు మన పాపాల నిమిత్తం మరణించాడు. లేఖనాల్లో వ్రాయబడిన విధంగా ఆయన పాతిపెట్టబడి మూడవ రోజున బ్రతికింపబడ్డాడు. పేతురుకు కనిపించాడు. ఆ తదుపరి పన్నెండు మందికి కనిపించాడు. ఒకేసారి ఐదు వందల మందికి కనిపించాడు. వాళ్ళలో చాలా మంది ఇంకా జీవించివున్నారు. కొందరు మాత్రమే చనిపొయ్యారు. ఆ తర్వాత ఆయన యాకోబుకు కనిపించాడు. అపొస్తలులందరికీ కనిపించాడు. చివరకు అయోగ్యుడనైన నాకు కూడా కనిపించాడు.

ఎందుకంటే, అపొస్తలుల్లో నేను అధముణ్ణి. దేవుని సంఘాన్ని హింసించిన వాణ్ణి. కనుక అపొస్తలుడనని అనిపించుకోవటానికి కూడా అర్హుణ్ణి కాను. 10 కాని దేవుని దయవల్ల ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన దయ వృథా కాలేదు. నేను వాళ్ళందరికన్నా కష్టించి పని చేసాను. ఇది నిజానికి నేను చెయ్యలేదు. దేవుని దయ నాతో ఈ పని చేయించింది. 11 నేను బోధించినా లేక వాళ్ళు బోధించినా మేమంతా ఒకటే బోధించాము. మీరు దాన్ని విశ్వసించారు.

చనిపోయిన వాళ్ళు బ్రతికి రావటం

12 కాని మేము క్రీస్తు చావు నుండి బ్రతికి వచ్చాడని బోధించాము కదా! మరి మీలో కొందరు చనిపోయినవాళ్ళు బ్రతికి రారని ఎందుకంటున్నారు? 13 అది నిజమైతే క్రీస్తు కూడా చనిపోయి బ్రతికి రాలేదనే అర్థం వస్తుంది. 14 క్రీస్తు చనిపోయి బ్రతికి రానట్లయితే మా బోధన, మీ విశ్వాసము వృథా అయినట్లే కదా! 15 అంతే కాదు. దేవుడు చనిపోయిన క్రీస్తును బ్రతికించాడని మేము చెప్పాము. అలా కాని పక్షంలో మేము దేవుణ్ణి గురించి తప్పు సాక్ష్యము చెప్పినవాళ్ళమౌతాము. కాని ఒకవేళ దేవుడు చనిపోయినవాళ్ళను నిజంగా బ్రతికించనట్లయితే ఆయన్ని కూడా బ్రతికించలేదు. 16 ఎందుకంటే చనిపోయిన వాళ్ళను బ్రతికించనట్లయితే క్రీస్తును కూడా బ్రతికించలేదు. 17 క్రీస్తును బ్రతికించలేదు అంటే, మీ విశ్వాసం వ్యర్థం. మీకు మీ పాపాలనుండి విముక్తి కలుగలేదన్న మాట. 18 అంటే చనిపోయిన క్రీస్తు విశ్వాసులు కూడా తమ పాపాల నుండి విముక్తి పొందలేదన్నమాట. 19 మనకు క్రీస్తు పట్ల ఉన్న ఆశాభావం ప్రస్తుత జీవితం కోసం మాత్రమే అయినట్లయితే మన స్థితి అందరికన్నా అధ్వాన్నం ఔతుంది.

20 కాని నిజానికి చనిపోయిన క్రీస్తు బ్రతికింపబడ్డాడు. చనిపోయి బ్రతికింపబడ్డవాళ్ళలో ఆయన ప్రథముడు. 21 ఒక మనుష్యుని ద్వారా మరణం వచ్చినట్లు, పునరుత్థానం కూడా ఒక మనుష్యుని ద్వారా వచ్చింది. 22 ఆదాములో ఐక్యత పొందటం వల్ల మానవులు మరణిస్తున్నట్లుగానే క్రీస్తులో ఐక్యత పొందటం వల్ల చనిపోయినవాళ్ళు బ్రతుకుతారు. 23 ప్రతీ ఒక్కడు తన వరుసను బట్టి బ్రతికింపబడతాడు. మొదట క్రీస్తు, ఆయన వచ్చిన తరువాత ఆయనకు సంబంధించినవాళ్ళు బ్రతికింపబడతారు. 24 అన్నీ అంతమయ్యే కాలం వస్తుంది. అప్పుడాయన రాజ్యాలన్నిటినీ, అధికారంలో ఉన్నవాళ్ళందరి శక్తిని నాశనం చేసి తండ్రి అయిన దేవునికి తన రాజ్యం అప్పగిస్తాడు.

25 ఎందుకంటే, దేవుడు శత్రువులందరిని తన పాదాల ముందు పడవేసే దాకా ఆయన రాజ్యం చెయ్యాలి. 26 చివరి శత్రువైన మృత్యువు నాశనము చేయబడుతుంది. 27 ఎందుకంటే లేఖనాల్లో, “అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు” అని వ్రాయబడి ఉంది. “అన్నిటినీ” ఆయన పాదాల క్రింద ఉంచాడు అని అంటే, వీటిలో దేవుడు కూడా ఉన్నాడని కాదు. దేవుడు అన్నిటినీ క్రీస్తు పాదాల క్రింద ఉంచాడు. 28 కాని అన్నీ తన పాదాల క్రింద ఉంచబడగా కుమారుడు తనకు తానే దేవునికి విధేయుడై ఉన్నాడు. ఆ తదుపరి దేవుడు అన్నిటినీ పాలిస్తాడు.

29 పునరుత్థానం లేనట్లయితే, మరి చనిపోయినవాళ్ళ కోసం, బాప్తిస్మము పొందినవాళ్ళ సంగతేమిటి? వాళ్ళు ఏ విధంగా బ్రతికి వస్తారు? చనిపోయినవాళ్ళు బ్రతికి రానట్లయితే ఇంకా బాప్తిస్మము ఎందుకు ఇస్తున్నారు.

30 మరి మేము ప్రతి గడియ మా ప్రాణాలను ఎందుకు ప్రమాదంలో వేసుకొంటున్నాం? 31 సోదరులారా! నేను ప్రతీరోజు మరణాన్ని ఎదుర్కొంటున్నాను. మన క్రీస్తు ప్రభువులో మిమ్మల్ని చూసి గర్విస్తాను. కనుక మీకు ఈ విషయం చెపుతున్నాను. 32 ఒకవేళ నేను ఎఫెసులో క్రూరమృగాలతో పోట్లాడటం, మానవ కారణంగా మాత్రమే అయినట్లయితే నాకొచ్చిన లాభం ఏమిటి? చనిపోయినవాళ్ళు తిరిగి బ్రతకనట్లయితే, “తిని, త్రాగుదాం, ఎలాగో మరణిస్తాంగదా.”(A)

33 మోసపోకండి, “చెడు సహవాసం మంచివాణ్ణి చెడుపుతుంది.” 34 మేలుకోండి. పాపం చెయ్యటం మానుకొండి. మీలో కొందరికి దేవుణ్ణి గురించి తెలియదు. అది సిగ్గుచేటు.

బ్రతికి వచ్చిన దేహం

35 కొందరు, “చనిపోయినవాళ్ళు ఏ విధంగా బ్రతికింపబడతారు? వాళ్ళు ఎలాంటి దేహంతో వస్తారు?” అని అడగవచ్చు. 36 ఎంతటి మూర్ఖులు! నీవు భూమిలో నాటిన విత్తనం చనిపోకపోతే అది మొలకెత్తదు. 37 నీవు ఒక చిన్న విత్తనాన్ని, ఉదాహరణకు ఒక గోధుమ విత్తనాన్ని నాటుతావు, కాని పెరగబోయే మొలకను నాటవు. 38 దేవుడు తాను అనుకొన్న విధంగా ప్రతీ విత్తనానికి దానికి తగిన దేహాన్ని యిస్తాడు. 39 మాంసాలన్నీ ఒకే రకం కావు. మానవుల మాంసం ఒక రకం. జంతువుల మాంసం ఒక రకం. పక్షుల మాంసం ఒక రకం. చేపల మాంసం ఒక రకం. 40 ఆకాశంలో జ్యోతులున్నాయి, భూమ్మీద జ్యోతులున్నాయి, గాని వాటి వాటి ప్రకాశం వేరు. 41 సూర్యుడు ఒక రకంగా, చంద్రుడు ఒక రకంగా, నక్షత్రాలు ఒక రకంగా ప్రకాశిస్తాయి. ఒక నక్షత్రం ప్రకాశించిన విధంగా మరొక నక్షత్రం ప్రకాశించదు.

42 చనిపోయినవాళ్ళు బ్రతికి రావటం కూడా అదే విధంగా ఉంటుంది. నశించిపోయే శరీరాన్ని నాటి, నశించని శరీరాన్ని పొందుతారు. 43 గౌరవం లేని శరీరంగా నాటబడి, మహిమగల శరీరంగా లేపబడుతుంది. బలహీనమైన శరీరంగా నాటబడి, శక్తిగల శరీరముగా లేస్తుంది. 44 భౌతికమైన శరీరాన్ని నాటి, ఆత్మీయమైన శరీరాన్ని పుట్టిస్తాడు.

భౌతికమైన శరీరం ఉంది అంటే, ఆత్మీయ శరీరం కూడా ఉంటుంది. 45 ఈ విధంగా వ్రాయబడింది: “ప్రథమ పురుషుడైన ఆదాము జీవించే నరుడయ్యాడు, చివరి ఆదాము జీవాన్ని ఇచ్చే ఆత్మ అయ్యాడు.” 46 ముందు ఆత్మీయత రాలేదు. ముందు భౌతిక శరీరం వచ్చింది. ఆ తర్వాత ఆత్మీయత వచ్చింది. 47 మొదటి పురుషుడు భూమ్మీద ఉన్న మట్టితో సృష్టింపబడ్డాడు. రెండవ మనుష్యుడు పరలోకంనుండి దిగివచ్చాడు. 48 భూమ్మీద ఉన్నవాళ్ళు మట్టితో సృష్టింపబడినవానివలే ఉన్నారు. పరలోకానికి సంబంధించినవాళ్ళు పరలోకంనుండి వచ్చినవానివలె ఉన్నారు. 49 మట్టితో సృష్టింపబడినవాని పోలికలతో మనము జన్మించినట్లే, పరలోకం నుండి వచ్చినవాని పోలికలను కూడా మనము పొందుతాము.

50 సోదరులారా! నేను చెప్పేదేమిటంటే, రక్త మాంసాలతో ఉన్నవాళ్ళు దేవుని రాజ్యం పొందలేరు. నశించిపోయేది అమరత్వం పొందదు. 51 మీకో రహస్యం చెపుతాను వినండి. మనలో ఎవ్వరూ చనిపోరు. అందరూ మారిపోతారు. 52 చివరి బూర ఊదినప్పుడు, మనమందరము ఒక్క క్షణంలో, కనురెప్ప పాటులో మారిపోతాము. ఆ క్షణంలో చనిపోయినవాళ్ళు బ్రతికి వచ్చి చిరంజీవులైపోతారు. మనలో మార్పు కలుగుతుంది. 53 ఎందుకంటే నశించిపోయే ఈ దేహం నాశనం కాని దేహాన్ని ధరించాలి. చనిపోయే ఈ దేహం అమరత్వం పొందాలి. 54 ఇది జరిగినప్పుడు లేఖనాల్లో వ్రాయబడినట్లు జరుగుతుంది:

“మరణం ఓడిపోయి, సంపూర్ణ విజయం కలిగింది.”(B)

55 “ఓ మరణమా! నీ విజయం ఎక్కడ?
ఓ మరణమా! నీ కాటు వేసే శక్తి ఎక్కడ?”(C)

56 మరణం కాటు వేయగల శక్తిని ధర్మశాస్త్రంనుండి పొందుతుంది. 57 కాని దేవుడు మన యేసు ప్రభువు ద్వారా మనకు విజయం యిస్తాడు. కనుక దేవునికి వందనాలు.

58 కనుక నా ప్రియమైన సోదరులారా! ఏదీ మిమ్మల్ని కదిలించలేనంత స్థిరంగా నిలబడండి. ప్రభువుకోసం పడిన మీ శ్రమ వృథాకాదు. ఇది మీకు తెలుసు. కనుక సదా ప్రభువు సేవలో లీనమై ఉండండి.

యెహెజ్కేలు 13

అబధ్ధ ప్రవక్తలకు విరోధంగా హెచ్చరికలు

13 మరొకసారి యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఈ విధంగా చెప్పాడు: “నరపుత్రుడా, నీవు నా తరపున ఇశ్రాయేలు ప్రవక్తలతో మాట్లాడాలి. ఆ ప్రవక్తలు వాస్తవానికి నా తరపున మాట్లాడటం లేదు. ఆ ప్రవక్తలు తాము చెప్పదలచుకొన్న విషయాలే చెప్పుచున్నారు. కావున నీవు వారితో మాట్లాడవలెను. వారికి ఈ విషయాలు చెప్పు: ‘యెహోవా నుండి వచ్చిన వర్తమానం వినండి! నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెబుతున్నాడు. దుష్ట ప్రవక్తలగు మీకు కీడు మూడుతుంది. మీరు మీ ఆత్మల్నే అనుసరిస్తున్నారు. మీరు స్వప్న దర్శనాలలో చూసిన వాస్తవాలను ప్రజలకు చెప్పుటలేదు.

“‘ఓ ఇశ్రాయేలూ! నీ ప్రవక్తలు, పాడుబడిన ఇండ్లల్లో పరుగెత్తే గుంట నక్కలా వుంటారు. బీటలు వారిన నగర గోడల వద్ద నీవు సైనికులను కాపలా వుంచలేదు. ఇశ్రాయేలు వంశాన్ని కాపాడటానికి నీవు గోడలను నిర్మించలేదు. కావున యెహోవాకు మిమ్మల్ని శిక్షించే రోజు వచ్చినప్పుడు, నీవు యుద్ధంలో పరాజయం పొందుతావు!

“‘దొంగ ప్రవక్తలు తమకు దర్శనాలు కలిగాయని అన్నారు. కొన్ని తంత్రాలు చేసి వారు చెప్పిన విషయాలు జరుగుతాయని అన్నారు. కాని వారు అబద్ధమాడారు. వారిని యెహోవాయే పంపినట్లు వారు చెప్పారు. అదికూడా అబద్ధమే. వారి అబద్ధాలు నిజమవ్వాలని వారింకా ఎదురు చూస్తూనే వున్నారు.

“‘దొంగ ప్రవక్తలారా, మీరు చూసిన దర్శనాలు నిజం కావు. మీరు తంత్రాలు జరిపి, అనేక విషయాలు జరుగుతాయని చెప్పారు. కాని మీరు చెప్పింది అబద్ధం! యెహోవా ఆ విషయాలు చెప్పాడని మీరు ప్రకటించారు. కాని నేను మీతో మాట్లాడలేదు.’”

కాపున ఇప్పుడు నా ప్రభువైన యెహోవా నిజంగా మాట్లాడతాడు! ఆయన చెప్పినదేమంటే, “మీరు అబద్ధమాడారు. సత్యదూరమైన దర్శనాలను మీరు చూశారు. కావున ఇప్పుడు నేను (దేవుడు) మీకు వ్యతిరేకినయ్యాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. యెహోవా ఇంకా ఇలా చెప్పాడు, “అబద్ధపు దర్శనాలను చూచి, అబద్ధాలు చెప్పిన ప్రవక్తలను నేను శిక్షిస్తాను. వారిని నా ప్రజల మధ్యనుండి తొలగిస్తాను. వారి వేర్లు ఇశ్రాయేలు వంశావళిలో ఉండవు. వారు మరెన్నటికీ ఇశ్రాయేలు రాజ్యానికి తిరిగిరారు. అప్పుడు మీ ప్రభువగు యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు!

10 “ఆ బూటకపు ప్రవక్తలు పదే పదే నా ప్రజలకు అబద్ధాలు చెప్పారు. శాంతి విలసిల్లుతుందని ఆ ప్రవక్తలు చెప్పారు. కాని శాంతి లేదు. గోడలు కట్టుదిట్టం చేసి, ప్రజలు యుద్ధానికి సిద్ధపడవలసి ఉంది. అయితే వారు పగిలిన గోడలమీద పలుచని పూత మాత్రం పూస్తున్నారు. పగుళ్లకు బంకమట్టి వ్రాస్తున్నారు. 11 నేను వారి మీదికి తీవ్రమైన వడగండ్ల వాన (శత్రు సైన్యం) పంపుతానని నీవు వారికి చెప్పు. పెనుగాలి వీస్తుంది. తుఫాను వస్తుంది. అప్పుడు ఆ గోడ కూలిపోతుంది. 12 గోడ కూలినప్పుడు ప్రజలు ప్రవక్తలను, ‘మీరు గోడలకు పూసిన బంకమట్టి ఏమయ్యింది?’” అని అడుగుతారు. 13 నా ప్రభువైన యెహోవా ఇలా చెబుతున్నాడు, “నేను కోపంగా వున్నాను. మీ మీదికి నేనొక తుఫాను పంపుతాను. నేను కోపగించివున్నాను. మీ మీదికి జడివాన పంపుతాను. నేను కోపంగావున్నాను. ఆకాశాన్నుండి వడగండ్లు పడేలా చేసి మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను! 14 గోడమీద మీరు పలుచనైన బంకమట్టి పులిమారు. కాని నేను మొత్తం గోడనే నాశనం చేస్తాను. దానిని కూలగొడతాను. ఆ గోడ మీ మీద పడుతుంది. అప్పుడు నేనే యెహోవానని మీరు గుర్తిస్తారు. 15 గోడమీద, ఆ గోడకు పూత పూసిన వారిమీద నా కోపం చూపటం పూర్తిచేస్తాను. అప్పుడు, ‘గోడా లేదు, గోడకు పూతపూసే పని వాళ్ళూ లేరు’ అని నేనంటాను.

16 “ఈ విషయాలన్నీ ఇశ్రాయేలులో వున్న దొంగ ప్రవక్తలకు సంభవిస్తాయి. ఆ ప్రవక్తలు యెరూషలేము ప్రజలతో మాట్లాడుతూ, శాంతి నెలకొంటుందని అంటారు. కాని శాంతి లేదు.” ఈ విషయాలన్నీ నా ప్రభువైన యెహోవా చెప్పాడు.

17 దేవుడు ఈ విధంగా చెప్పాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలులో స్త్రీ ప్రవక్తల విషయం చూడు. ఈ ఆడ ప్రవక్తలు నా తరపున మాట్లాడరు. వారు చెప్పదలచుకొన్నవే వారు చెప్పుతారు. కావున నీవు నా పక్షాన వారికి వ్యతిరేకంగా మాట్లాడాలి. వారికి నీవు ఈ విషయాలు చెప్పాలి. 18 నా ప్రభువైన యెహోవా ఈ రకంగా చెపుతున్నాడు, ఓ స్త్రీలారా, మీకు కీడు జరుగుతుంది. ప్రజలు వారి చేతులమీద ధరించటానికి మీరు గుడ్డలతో కంకణాలు కుడతారు. ప్రజలకు కావలసిన రకరకాల తలముసుగులు ప్రత్యేకంగా తయారు చేస్తారు. అవన్నీ ప్రజల జీవితాలను కట్టుబాట్లలో వుంచే మహిమగల వస్తువులని మీరు చెబుతున్నారు. మీ బ్రతుకుదెరువు కోసం ప్రజలను మీ వలలలో వేసుకొంటున్నారు! 19 నేను ముఖ్యుడను కానని ప్రజలు నమ్మేలా వారిని మీరు మభ్యపెడుతున్నారు. గుప్పెడు గింజల కోసం, పట్టెడు అన్నం కోసం మీరీ పనులన్నీ చేస్తూ ప్రజలను నాకు వ్యతిరేకులుగా చేస్తున్నారు. నా ప్రజలకు మీరు అబద్ధాలు చెబుతున్నారు. ప్రజలు కూడా అబద్ధాలు వినటానికే ఇష్టపడుతున్నారు. బ్రతక వలసిన ప్రజలను మీరు చంపుతున్నారు. చావవలసిన మనుష్యులను మీరు జీవించేలా చేస్తున్నారు. 20 కావున ప్రభువైన యెహోవా ఈలాగు చెబుతున్నాడు, మీరు బట్టతో కంకణాలు కట్టి ప్రజలను చిక్కించుకుంటున్నారు. కాని నేనా ప్రజలను విడుదల చేస్తాను. ఆ కంకణాలు మీ చేతుల నుండి లాగి పారవేస్తాను. అప్పుడు ప్రజలు మీ నుండి విముక్తి పోందుతారు. పంజరంలో నుండి ఎగిరిపోయే పక్షుల్లా వారు వుంటారు! 21 నేను వారి ముసుగులను చించివేస్తాను. మీ దుష్టశక్తి నుండి నా ప్రజలను కాపాడతాను. మీ బోను నుండి ఆ ప్రజలు తప్పించుకుంటారు. నేనే యెహోవానని అప్పుడు మీరు తెలుసుకుంటారు.

22 “‘ప్రవక్తలైన మీరు అసత్యాలు చెబుతున్నారు. మీ అబద్ధాలు మంచి వ్యక్తులకు బాధ కలుగజేస్తాయి. మంచి ప్రజలను బాధించటం నాకు ఇష్టంలేని పని, దుష్ట జనాన్ని మీరు బలపర్చి, వారిని ప్రోత్సహిస్తారు. వారి నడవడికను మార్చుకోమని మీరు వారికి చెప్పరు. మీరు వారి ప్రాణాలను రక్షించటానికి ప్రయత్నించరు, 23 కావున ఇక మీదట మీరు పనికిరాని దర్శనాలను చూడరు. మీరిక ఎంతమాత్రం గారడీలు చేయరు. మీ శక్తుల నుండి నా ప్రజలను నేను రక్షిస్తాను. అప్పుడు మీరు నన్ను యెహోవా అని తెలుసుకొంటారు.’”

కీర్తనలు. 52-54

సంగీత నాయకునికి: దావీదు దైవధ్యానాల్లో ఒకటి. ఎదోము వాడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటిలో ఉన్నాడని చెప్పినప్పటిది.

52 పెద్ద మనిషీ, దైవజనులకు విరోధంగా చేసే చెడ్డ పనులను గూర్చి నీవెందుకు అతిశయిస్తున్నావు?
వంకర పనులు చేయాలనే నీవు పథకం వేస్తుంటావు.
    నీ నాలుక పదునుగల కత్తిలా ఉంది. ఎందుకంటే నీ నాలుక అబద్ధాలు పలుకుతుంది.
మంచి కంటె కీడునే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు.
    సత్యం పలుకుటకంటె ఎక్కువగా అబద్ధాలు చెప్పటం నీకు ఇష్టం.

నీవూ, నీ అబద్ధాల నాలుక మనుష్యులను బాధించటానికే ఇష్టపడుతుంది.
అందుచేత దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు.
    ఆయన నిన్ను పట్టి నీ గుడారము నుండి బయటకు లాగివేస్తాడు. సజీవుల దేశంలోనుండి ఆయన నిన్ను వేళ్లతో పెళ్లగిస్తాడు.

మంచి వాళ్లు ఇది చూచి,
    దేవునిని గౌరవిస్తారు.
వారు నిన్ను చూచి నవ్వి ఇలా అంటారు,
    “దేవుని మీద ఆధారపడని ఆ మనిషికి ఏమి సంభవించిందో చూడండి.
    ఆ మనిషి తనకు సహాయం చేసేందుకు ఐశ్వర్యాన్ని, తనకున్న దానిని మూర్ఖంగా నమ్ముకున్నాడు.”

అయితే దేవుని ఆలయంలో నేను పచ్చని ఒలీవ మొక్కలా ఉన్నాను.
    నేను శాశ్వతంగా ఎప్పటికీ దేవుని ప్రేమనే నమ్ముకొన్నాను.
దేవా, నీవు చేసిన వాటి మూలంగా నేను నిన్ను శాశ్వతంగా స్తుతిస్తాను.
    నీ అనుచరుల సముఖములో నీవు మంచివాడవని నేను ప్రకటిస్తాను.

సంగీత నాయకునికి: మాహలతు రాగంలో పాడదగిన దావీదు ధ్యానం.

53 తెలివి తక్కువ వాడు మాత్రమే దేవుడు లేడని తలుస్తాడు.
    అలాంటి మనుష్యులు చెడిపోయిన వారు, చెడు విషయాలను చేస్తారు.
    సరియైనదాన్ని చేసేవాడు ఒక్కడూ లేడు.
నిజంగా దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు.
    దేవునికొరకు చూసే జ్ఞానంగలవాళ్లు ఎవరైనా ఉన్నారేమో అని
    కనుగొనేందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు.
కాని ప్రతి మనిషీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి పోయాడు.
    ప్రతి మనిషీ చెడ్డవాడే.
మంచి చేసేవాడు లేడు.
    ఒక్కడూ లేడు.

దేవుడు చెబుతున్నాడు, “ఆ దుర్మార్గులకు సత్యం బాగా తెలుసు.
    కాని వారు నన్ను ప్రార్థించరు.
    ఆ దుర్మార్గులు వారి భోజనం తినటానికి ఎంత సిద్ధంగా ఉంటారో నా ప్రజలను నాశనం చేయటానికి కూడ అంత సిద్ధంగా ఉంటారు.”

కాని ఆ దుర్మార్గులు ఇంతకు ముందెన్నడూ
    భయపడనంతగా భయపడిపోతారు.
ఆ దుర్మార్గులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. దేవుడు ఆ దుర్మార్గులను నిరాకరించాడు.
    కనుక మీరు వారిని ఓడిస్తారు.
దేవుడు మీ శత్రువుల ఎముకలను చెదరగొట్టేస్తాడు.

ఇశ్రాయేలు ప్రజలారా,
    సీయోనుకు విజయాన్ని ఎవరిస్తారు?
దేవుడు తన ప్రజలను తిరిగి వర్ధిల్లజేసేటప్పుడు
    యాకోబు సంతోషిస్తాడు.
    ఇశ్రాయేలు బహుగా ఆనందిస్తాడు.

సంగీత నాయకునికి: వాయిద్యాలతో పాడునది. దావీదు ధ్యానము. జిఫీయులు సౌలు దగ్గరకు వెళ్లి “దావీదు మా ప్రజల వద్ద దాక్కొన్నాడని తలస్తున్నాము” అని అతనితో చెప్పినప్పటిది.

54 దేవా, నీ నామం ద్వారా నన్ను రక్షించుము.
    నన్ను విడుదల చేయుటకు నీ శక్తి ఉపయోగించుము.
దేవా, నా ప్రార్థనను,
    నేను చెప్పే సంగతులను ఆలకించుము.
పరదేశీయులు నాకు విరోధంగా తిరిగారు.
    బలాఢ్యులైన మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. దేవా, ఆ మనుష్యులు నిన్ను కనీసం ఆరాధించరు.

చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు.
    నా ప్రభువు నన్ను బలపరుస్తాడు.
తమ స్వంత దుష్టత్వముతో నాపై గూఢచారత్వము చేసే జనులను దేవుడు శిక్షిస్తాడు.
    దేవా, నీవు నాకు నమ్మకస్థుడవై ఉండుటనుబట్టి ఆ జనులను నాశనం చేయుము.

దేవా, నేను నీకు స్వేచ్ఛార్పణలు ఇస్తాను.
    యెహోవా, నేను నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే నీవు మంచివాడవు.
నీవు నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించావు.
    మరియు నా శత్రువులు ఓడిపోవటం నేను చూసాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International